AUCHITHYAM | Volume-06 | Issue-08 | July 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
5. కన్నడ శాసనాలలో ఫలశ్రుతులు
డా. టి.డి. రాజన్న తగ్గి
అసోసియేట్ ప్రొఫెసర్, కన్నడ శాఖ,
కర్నాటక కేంద్రీయ విశ్వవిద్యాలయము,
కడగంచి, కలబురగి, కర్నాటక.
సెల్: +91 8904446344, Email: tdrajannathaggi@cuk.ac.in
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.06.2025 ఎంపిక (D.O.A): 30.06.2025 ప్రచురణ (D.O.P): 01.07.2025
వ్యాససంగ్రహం:
శాసనాలు గత కాలపు చారిత్రిక కురుహులు అంటే అతిశయోక్తి కానే కాదు. ప్రతి రాష్ట్రంలో ఉన్న సంస్కృతిని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే మనకు లభించే అధికృత ఆధారాలే ఈ శాసనాలు. ఈ శాసనాలే సంస్కృతి ఉత్పన్నాలు మరియు చారిత్రికాధారాలు. ఈ శాసనాల ద్వారా ఆయా రాష్ట్రమున సాంఘిక పరిసరం, సాంస్కృతిక జీవితం, మతపర పరిస్థితులు, అక్కడి రాజకీయ పరిపాలనపు రీతి-రివాజులను తెలుసుకునందుకు ఆస్కారం వుంది. అలాగే ఆ రాష్ట్రపు రాజుల ఔదార్య గుణాలను, దానధర్మ వివరాలను, ధైర్య-సాహసాల సంగతులను తెలుసుకునేందుకు అవకాశముంటుంది. ప్రాచీన కాలంలో రాజులు తమ ఔదార్యగుణంతో ఆ వీరుడికి, బ్రాహ్ములకి, పండితులుకి, దేవాలయాలకి, విద్యాకేంద్రాలకి దానాన్ని ఇస్తుండేవారు. ఇలా చేసిన దానం ఆచంద్రార్క తారాంబరంగా ఉండాలని ఆశిస్తుండేవారు. కానీ కాలం గడిచేకొద్ది దానాలు దురాశాపరవాదుల వశం అయినందువలన ఆ దానాన్ని రక్షించడానికి దానపు వివరాలతో పాటు శాసనపు చివరి భాగంలో అపహరించేవాళ్ళకి కీడు లభిస్తుందనే ఫలశ్రుతులను చేర్చించడానికి మొదలుపెట్టారు. ఇలాంటి ఫలశ్రుతులను ʼదానచ్చేదోపవర్ణనʼ లేక ʼశాపనార్తాలుʼ అని కూడా పిలుస్తారు. ఈ శాపనార్థాల ఉద్దేశాన్ని తార్కికంగా విశ్లేషించడమే ఈ వ్యాసోద్దేశం. ఈ వ్యాస రచనకి ఎపిగ్రాఫియా కర్నాటిక సంపుటాలను ఆధారంగా తీసుకుని, ఈ వ్యాసంలో శాపనార్తాల అర్థ వివరణ, దానశాసనాలు, ఏకవాక్య శాపనార్థాలు, సంస్కృత శాపనార్థాలు, మతపర శాపనార్థాలు, బూతు శాపనార్థాలు, పుణ్యాశయాలు అనే ఉపశీర్షికలతో విభజించుకుని విశ్లేషించడం జరిగింది.
Keywords: శాపనార్థాలు, పుణ్యాశయము, ఫలశ్రుతులు, దానశాసనము, సంస్కృతి, ఔదార్యం, దానం
1. ప్రవేశిక
శాసనాల చివరి భాగంలో కనిపించే ఫలశ్రుతులు లేదా శాపనార్థాల గురించి అధ్యయనం చేయడం అనేది ఆయా రాష్ట్రపు సాంస్కృతిక అధ్యయనమే అవుతుంది. ఈ శాసనాలు మరియు శాపనార్థాల నుండి ఆ నాటి సాంఘిక పరిస్థితితో పాటు రాజుల ఔదార్య గుణగణాల్ని, వీరుల పరాక్రమాన్ని, మనిషిలో వున్న పారమార్థిక నమ్మకాన్ని మరియు అతని దురాశా స్వభావాన్ని తెలుసుకోవచ్చును.
ఇలాంటి శాసనాలు, శాపనార్థాలు వస్తు విషయంలో
వైవిధ్యంగా వుంటూ, వివిధ రకాలుగా కనిపిస్తాయి. శాసనాలు చాలా రకాలుగా కనిపించినా కూడా శాపనార్థాలు
కనిపించేది మాత్రం కేవలం దానశాసనాలలో, వీర శాసనంలో మాత్రమే.
2. దానశాసనాలు
ప్రాచీన కాలపు రాజులు కదనంలో గెలిచిన లేదా వీరమరణం పొందిన వీరుడి శౌర్య పరాక్రమాన్ని మెచ్చుకుని ఔదార్యగుణంతో ఆ వీరుడికి లేదా అతని కుటుంబానికి భూముల్ని దానంగా ఇస్తుండేవారు. ఈ దానం కేవలం వీరులకే మాత్రమే కాక, రాజుల ఆస్థానంలో పాండిత్యాన్ని ప్రదర్శించిన పండితులకి, బ్రాహ్ములకి, గ్రామ క్షేమాభివృద్ధికి, దేవాలయాల నిర్మాణానికి, అంగభోగ రంగభోగాలకి, విద్యాకేంద్రాలకి దాన దత్తులను ఇస్తుండేవారు. ఇలా ఇచ్చిన దానపు సంగతులను శాశ్వతంగా నిలిచె వస్తువుల మీద (రాయి, రాగి రేకుల పై) చెక్కించి నాలుగు రోడ్లు కలిసే చోట నాటేవాళ్ళు. ఈ దానపు గురించి అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఇలా నాటేవాళ్ళు. వీటినే దానశాసనాలు అంటారు.
రాజులు తాము ఇచ్చిన దానం ʼఆచంద్రార్కతారాంబరంʼలా శాశ్వతంగా ఉండాలని మరియు దానం స్వీకరించినవాళ్ళే వాటి ఫలాన్ని అనుభవించాలి అనేది రాజుల ఆశయం. అందువలన తాము ఇచ్చిన దానపు సంపూర్ణ వివరాలను రాయి మీద చక్కించి సార్వజనీన స్థలంలో పెట్టించేవాళ్ళు. కాలం గడిచేకొద్ది ఇలా రాజులు ఇచ్చిన దానం శాశ్వతంగా ఉండలేకపోయినందుకు, ఇచ్చిన దానాలను దురాశాపరవాదులు తమ వశవర్తి చేసుకునేది ఎక్కువైనందుకు ఆ దానాన్ని రక్షించడానికి దానపు వివరాలతో పాటు శాసనపు చివరి భాగంలో అపహరించినవాళ్ళకి కీడు లభిస్తుందనే ఫలశ్రుతులను చేర్చించడానికి మొదలుపెట్టారు. ఇలాంటి ఫలశ్రుతులే శాపనార్థాలుగా పిలవబడుతాయి.
3. శాపం - అర్థవివరణ
ʼశాపంʼ అంటె చేసిన దానాన్ని ఎవరైనా అపహరించే ప్రయత్నం చేస్తే అలాంటి పాపులకు కీడు జరగాలని కోరేది అని అర్థం. అంటే ఏదైనా అన్యాయంగానీ అపరాధంగానీ చేసినవాడికి, అన్యాయానికి గురైన వ్యక్తులు కోపంతో ఏదైనా కీడుని ఆరోపించడమే శాపం. ఈ శాపపు పరిణామమే కీడు. ఏదో ఒక నిర్ధిష్ట సందర్బంలో చేయరానిది చేస్తే వాళ్ళకు కీడు జరగాలని కోరేదే ఈ శాపం. ఇది సరళ అర్థం అయినా దాని ద్వారా అపహరించే వాళ్ళలో పాపభీతిని కలిగించడం మరియు అలాంటి ప్రవృత్తులను నివారించడమే దీని ప్రధాన ఉద్దేశం.
ప్రతియొక్క సమాజమూ చాలా విలువైనా విలువలను ఆదర్శాలను దాచుకుని ఉంటుంది. వాటి రక్షణకోసం కొన్ని నీతి నియమాలను ఏర్పాటు చేసుంటుంది. వీటిని అధిగమించినవాళ్ళకు కీడు సంభవిస్తుందని మతశాస్త్రాలు, సాహిత్య కృతులు మరియు శాసనాలు చెప్తూ వచ్చాయి. రాజులు చేసిన దానం వృథా పోకూడదు, సమాజంలో వున్న ఏ వ్యక్తి కూడా నైతికంగా అధఃపతనం కాకూడదనే ఉద్దేశంతో ఆ మనిషుల్ని మానసికంగా భయపెట్టడానికి ఫలశ్రుతులు జన్మించాయని చెప్పొచ్చు.
మనిషిలో స్వార్ధం, దురాశ, చోరబుద్ధులు అతిగా ఉండి, వాటినుంచీ సామాజిక అన్యాయాలు జరిగినప్పుడు శిక్షగా ఈ ఫలశ్రుతులను వేసేది అనివార్యమైంది. సరి-తప్పు, మంచి-చెడు ఇవి ఒకే నాణ్యపు రెండు ముఖాలున్నట్టు. మనిషి ఇలాంటి చెడు ప్రవర్తనాలలో మితిమీరినప్పుడు సమాజం నైతిక సమతోలన చేకూర్చడానికి మరియు సమాజంలో శాంతి భద్రత ఉండాలనే కోరికతో పుట్టినవే ఈ శాపాలు. ఇలా మనిషిలో వుండే చెడు ప్రవర్తనాలను నివారించడానికి శాపాశయాలు ప్రస్తావించే ప్రయత్నంవలన దానాలను అపహరించే సందర్భాలు తగ్గాయి అనుకోవచ్చు, కానీ తగ్గలేదు.
4. ఏకవాక్య శాపనార్థాలు
ఇలాంటి శాపాలు కన్నడంలో మొదటి శాసనం అనే పిలవబడే ʼహల్మిడి శాసనంʼలో కనబడుతాయి. అందులో ʼకళ్దోన్ మహాపాతకన్ʼ(దొంగలించినవాడు మహాపాతకుడు) ʼఅదానళివొన్గె మహాపాతకంʼ (దాన్ని నాశనం చేసినవాడికి మహాపాతకం లభిస్తుంది) అనబడే కేవలం ఒకటి రెండు వాక్యాలలో రాసిన శాపాలు ఉండేవి. కానీ ʼకాకి శాపానికి ఆవు చనిపోదనేʼ సామేతంలా శాసనాలలో కనబడుతున్న శాపాలు ఏ రక్షణనూ కలిగించకపోవడం వలన, కాలం గడిచేకొద్ది ముందు కాలంలో వచ్చిన రాజులుగానీ, ఆ గ్రామ పెద్దలుగానీ కాపాడలేక పోయినందువలన ఒకే వాక్యంలో కనిపిస్తున్న శాపాలుతో పాటు క్రమంగా కొన్ని నిందనాత్మక అంశాలు చోటు చేసుకున్నాయి. క్రమంగా అవి సాధారణంగా కనబడే పారమార్థిక నమ్మకాలను మించి కఠోరంగా మరియు అశ్లీలంగా మలపు తీసుకున్నాయి.
5. సంస్కృత శాపనార్థాలు
ఇలా ఎన్ని జాగ్రతలను తీసుకున్నా దానాల మీద జరుగుతున్న అపహరణం మాత్రం నిలువకుండా నిరంతరంగా సాగి పోయింది. ఈ కారణంవలనే కొద్ది శాపాలలో సంస్కృత శ్లోకాలను చేర్పించడాని ప్రారంభించారు. సంస్కృతం అంటే అది దైవ భాష. దైవభాషలో చెప్పింది చెప్పినట్టే జరుగుతొంది అనే నమ్మకం మన సంప్రదాయంలో చాలా భద్రంగా ఊరిపోయింది. కాబట్టి సంస్కృత పదాలను వాడితే అపహరించే వాళ్ళు భయపడతారనే ఉద్దేశంతో శాపాశయలలో సంస్కృత శ్లోకాలు కనిపించసాగాయి.
ʼస్వదత్తాం పరదత్తాం వాయో హరేతి
వసుందరాం
షష్ఠివర్ష సహస్రాణి విష్టయాం జాయతే
క్రిమిఃʼ (ఎపిగ్రాఫియా కర్నాటిక)
అని చేర్పించిన సంస్కృత శ్లోకాలలో మనిషి నమ్మే పారమార్థిక బ్రతుకుకు దెబ్బ కలిగించే, ఘోర పాతకానికి లోబడే, మరియు వారి మోక్షపు ఫలం అతి హీనంగా ఉంటుందని చెప్పే అంశాలను అందులో భాగంగా చేర్పించడానికి మొదలుపెట్టారు. ఇలా సంస్కృత శ్లోకాలను ఉద్ధరించే పద్ధతి క్రి.శ. ఆరవ శతాబ్దనుంచి మొదలయింది.
శాపాలలో సంస్కృత శ్లోకాలను చేర్పించే ప్రధాన ఉద్దేశం ఏంటంటే శాపాలకు పుష్ఠి ఇవ్వడానికి, ఇంకా పరిణామకరంగా చేయడానికి వాడారు. ఇలాంటి సంస్కృత శ్లోకాలను ʼఇవి మను వాక్యాలని, మనుస్మృతులో ఉన్న మాటలనిʼ చెబుతూ వాటిలొ ʼఆత్రా మను గీతాʼ మరియు ʼమనువాక్యంగళుం పేళ్గుంʼ లాంటి వాక్యాలను చేర్పిస్తూ వచ్చారు.
హిందూ సంప్రదాయంలో వేదం, స్మృతి, పురాణాలకు చాలా ముఖ్యమైనా మరియు పూజ్య భావం కనిపిస్తుంది. అందులో మనుస్మృతికి కాస్త ఎక్కువ ప్రాశస్త్యం. ఇలాంటి స్మృతిని అనుసరించేవాళ్ళు ʼమనుమార్గశ్రేష్ఠన్ʼ అని శాసనాలలో పొగడ్తూ రాసినది కనబడుతుంది. అందువలన రాజులు మను పేరుతో కూడా తాము ఇచ్చిన దానాలను రక్షించే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
6. మతపర శాపనార్థాలు
తరువాత ఇలాంటి సంస్కృత శ్లోకాలు గానీ మను చెప్పిన మాటలు గానీ ప్రయోజనానికి రాక పోయినందువలన ధార్మిక(మతాలకు సంబంధించిన) వివరాలతో కూడిన శాపాలు దూసుకొచ్చాయి. భారతీయుల జీవితంలో మతం అనేది తీసి పారేయడానికి వీలులేకుండా చాలా లోతుగా పాకి పోయింది. అందువలన ఇలాంటి మతాలు వాటి పరిధిలో ఆయా మతపు మనిషిని నిగ్రహించడానికి ప్రయత్నిస్తొంది అనేది దానం ఇచ్చేవాడి నమ్మకం అయింది. మనిషి తన జీవిత కాలంలో దేవుడు, ధర్మ (మత) మొదలైనవాటిని నమ్మేంత వేరే ఇంకేమిటినీ నమ్మటంలేదు. అలాగే వాటికి భయపడినంత ఎక్కువగా ఇంకేదానికీ కూడా భయపడటంలేదు. కాబట్టి ఈ మతపు ద్వారానే మనిషిని కంట్రోల్ చేసి, తద్వారా అపహరణ చేసేవాడిని నియంత్రణంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. తత్కారణంగా అన్నీ మతాల సంగతులు శాపాశయంలో చోటు చేసుకోవడానికి మొదలయ్యాయి.
ఈ శాపాల ప్రధాన ఆశయమేమిటంటే దానాన్ని ఎవరిచ్చినా సరే అన్నీ మతాలవారు దాన్ని రక్షించాలి. రక్షించకపోతే ఆయా మతాల నమ్మకానికి అనుగుణంగా వారివారి పుణ్యక్షేత్రాలలో పాపపు చర్యలు చేసిన పాపానికి లోనవుతారనేది దీని ఆశయం. పాపపు కార్యం చేసినవాడు ఏ మతానికి చందినవాడో ఆ మతంలో ఉండే పాప కూపంలో పడిపోతాడు మరియు నరకానికి పోతాడు అనేది వీటి ప్రధాన ఆశయంగా మారింది.
దీనికి బలంగా భారతీయ ప్రధాన మతాలుగా పేరు, ప్రసిద్ధి గాంచిన వైదిక, శైవ, జైన, ఇస్లాం మతాల పేరుతో కూడా శాపాశయాలు కనిపించ సాగాయి. వైదికులైతే : బదరి, కేదార, కురుక్షేత్రము, ప్రయాగ.. మొదలగు పవిత్ర క్షేత్రాలలో గోహత్య, బ్రాహ్మణ హత్యలాంటి పాపాలు చేసిన కీడు ఫలం లభిస్తుందని; శైవులైతే : కైలాస పర్వత, గోకర్ణ, వారణాసి, కాశీక్షేత్రము, రామేశ్వరము… మొదలగు పవిత్ర క్షేత్రాలలో జంగములని చంపిన మరియు కోటి లింగాలను పగలుగొట్టి శివద్రోహం, శివాచార ద్రోహపు ఘోర పాపమును చేసిన కీడు ఫలం లభిస్తొందని; జైనులైతే: వేణూరు, కార్కళ, సమ్మేద పర్వత, కొపణాచలం, శ్రవణబెళగొళం, ఉజ్జంతగిరి… మొదలగు పుణ్యక్షేత్రములలో బసది లేక జినమూర్తులను పగలుగొట్టి, చైత్యాలయాలను నాశనం చేసి, జైన మునులను వధించిన పాపానికి గురైనట్టు కీడు ఫలాలు లభిస్తాయని; ఇస్లాం మతాలవాళ్ళయితే : మెక్కా, మదీనా… మొదలగు ఇస్లాం పుణ్యక్షేత్రములలో పాప కార్యము చేసినట్టు అలాగే ఇస్లాం మతం సంపూర్ణంగా నిషేధించిన ఆహారం అయిన ʼపంది మాంసాʼన్ని భుజించినట్టు అని శాపాలలో ప్రస్తావించి తద్వారా ప్రతియొక్క మతాలవారిని మానసికంగా నియంత్రించి, రాజులు చేసిన దానాన్నీ కాపాడుకునే ప్రయత్నం చేశారు.
7. బూతు శాపనార్థాలు
ఆరంభ దశలో చెక్కించిన శాసనాలలో రాజులు ఇచ్చిన దానాన్ని రాబోయే తరాల రాజులు లేక అధికారులు రక్షించి, పరిపాలించి, పోషించాలని చాలా సౌమ్య భావంతో, మృదు పదాలతో ప్రాధేయపడుతున్నట్టు శాపాశయాలలో విన్నపాలు కనిపించేవి. కానీ క్రమంగా మనిషి తన స్వార్థ మరియు దురాశా స్వభావాలు అధికం చేసుకున్న కారణంగా దానపు అపహరణ రాను రాను పెరిగి పోయాయి. దానం తీసుకున్నవాళ్ళకన్న అపహరించే చోరులే దాని ఫలాన్ని పొందడం ఎక్కువైంది. అందువలన రాజులు మొదట్లో వాడుతున్న సౌమ్యభావాన్ని పక్కన పెట్టి, కఠిణంగా వారించే విధంగా తిట్టులను మరియు బూతు మాటలను చేర్పించడానకి ప్రారంభించారు.
తిట్లు లేని భాష లేదు. తిట్లు, అపనింద, దుర్భాష ఇవి మనిషియొక్క ఆక్రమణ ప్రవృత్తుల వికృత రూపాలు. ఇలాంటి తిట్లు మరియు బూతు మాటలు మొదట్లో తమ కోపం మరియు ఆక్రోశాన్ని ప్రదర్శించడానికి మాత్రమే వాడేవాళ్ళు. తరువాత దానాన్నీ అపహరించే వాళ్ళను అవమానపరచాలని, వారి మనస్సుని గాయపరచాలని వాడుకలోకి వచ్చాయి. మొదట్లో ఈ తిట్లు ʼనిషిద్ధ జంతు లేక అసహ్యకర జంతులను భుజించినట్టుʼ (కుళ్ళిపోయిన కుక్కను మరియు కుళ్ళి దుర్నాతం కొడుతున్న గాడిదను తిన్నట్టు) అననబడే మాటలను చేర్పించారు. క్రమంగా ʼఆ జంతువుల మర్మాంగాలను తిన్నట్టుʼ అనే మాటలు చేర్పించారు. అయినా మనిషి మారలేకపోయినందుకు ʼఅలాంటి కనిష్ఠ జంతువులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్టుʼ, దాన శాసనాలో చెక్కిన ʼశిల్పాన్ని పూజించకుండ దాని లాభం పొందితే కుక్కతో పడుకున్న పాపం లభించునుʼ (శాసన సంగ్రహం, ఆతకూరు శాసన) అనే అసహ్యం పుట్టించే పదాలను వాడడానికి ప్రారంభిచారు. తరువాత క్రమంగా దానాన్ని దుర్వినియోగం చేసినవాడిని తిట్టడానికి ʼమాల-మాదిగʼ అనే కులసూచక పదాలను ప్రస్తావించసాగారు. అలాగే తరువాతి కాలఘట్టంలో అపహరణ కొనసాగిన కారణంగా అపహరణకారులను మానసికంగా నియంత్రణానికి తీసుకోవడానికి వాళ్ళ అక్క, చెల్లి, తల్లి మరియు కూతురుతో లైంగిక సంబంధం (ʼమాతృగమన చేసిన పాపానికి పోవుటʼ, ʼతోడబుట్టుతో ప్రణయ సంబంధం పెట్టుకున్న పాపానికి చెందుతారుʼ, ʼకూతురిని మంచానికి పిలిచిన నరకానికి పోతారుʼ) పెట్టుకున్నట్టు అనే మాటలను శాపాశయలలో ప్రస్తావించసాగారు.
క్రిశ 14-15వ శతాబ్దంలో విజయనగరాన్ని ఏలిన రాజుల శాసనాలలో ఇలాంటి తిట్లు, బూతు మాటలు అధికంగా కనించినాయి. ఇలాంటి బూతు మాటలను గమనిస్తే ఆ కాలానికి మనిషిలో వున్న నైతిక విలువలు ఎంతవరకు దిగజారినాయి అనేది చూపిస్తుంది. మనిషి క్రమంగా అర్వాచీన కాలానికి రాను రాను ఎక్కువ నైతిక అధఃపతనానికి గురైయ్యాడు అనేదానికి ఈ అశ్లీల బూతు మాటలే జ్వలంతా నిదర్శనం.
8. పుణ్యాశయాలు
మొదట్నుంచీ దానాన్ని రక్షించడానికి వాడిన సౌమ్య పదాలు, పారమార్థిక సంగతులు, మతాల అంశాలు, బూతు మాటలు ఏవీ ప్రయోజననానికి రాలేకపోయాయి. ఇలా శాపనార్థాలు అపజయం పొందినందువలన ఎలాగైనా సరే దానాన్నీ రక్షించుకోవాలన్న పట్టుదలతో రాజులు చివరి అస్త్రంగా వాడిన ప్రయత్నం పుణ్యాశయాలు. ఈ ఆశయం ద్వారా దానాన్నీ అపహరించే వాళ్ళను పొగడ్తలతో ముంచి, వారి ముందు ఆమిషాలాను పెట్టే ప్రయత్నం చేయడానికి మొదలుపెట్టారు. దానాన్నీ అపహరిస్తే కీడు జరుగుతోంది అనే శాపాలతోటే రాజులు ఇచ్చిన దానాలను రక్షిస్తే లేదా వాటిని సద్వినియోగానికి పురికొలిపితే వారికి మంచిది జరుగుతొందనే శుభసూచక పదాలను పలశ్రుతులలో వాడడానికి మొదలుపెట్టారు. వీటిననే ʼపుణ్యాశయాలుʼ అని పిలుస్తారు.
ʼదానవాం పాలనయోర్మధ్య దానశ్రేయోను
పాలనుం
దానత్వర్గమావోమ్నతే పాలనాదచ్యుతం పదంʼ (ఎపిగ్రాఫియా కర్నాటిక)
ఏ వ్యక్తియైనా సరే తను చేసిన దానాలవలన స్వర్గం లభిస్తే, కేవలం ఇంకెవరో చేసిన దానాన్ని రక్షిస్తే లేదా పరిపాలిస్తే చాలు దానివలన అచ్యుత పదవి లభిస్తొంది అనే ఆమిషాలను వాడడానికి మొదలుపెట్టారు. ఇలాంటి ఆమిషాలలో కనిపించే ప్రధాన అంశాలంటే పుణ్యక్షేత్రాలలో సహస్ర గోదానము ఇచ్చినట్టు, బ్రాహ్ములకు కోటి కవిలె (ఆవు) దానము ఇచ్చినట్టు, మహామునులకి అన్నదానము చేసినట్టు, కన్యదానము చేసినట్టు, ఉభయముఖి గోదానము ఇచ్చినట్టు… ఇలాంటి మరెన్నో ఆమిషాలను వాడడానికి మొదలుపెట్టారు.
పుణ్యాశయాలూ కూడా శాపాశయాల మాదిరిగానే ఆరంభ దశలో కొన్ని పదాలతో లేక ఒకటి రెండు వాక్యాలతో ఉండేవి. కానీ ఇవి క్రమంగా శాసనంలో అధిక భాగంగా, కొన్ని సమయాలలో అర్ధభాగంవరకూ మారుతు వచ్చింది. ఇలా మారినదాన్ని గమనిస్తే మనిషియొక్క దురాశా స్వభావం ఎలాంటిది మరియు దాన్ని దేన్నుంచీ కూడ తొలగించలేం అని వేద్యమవుతుంది.
దానికోసమే కాలకాలానికి భయంగొలిపే, దిగులు పుట్టించే, మోక్ష ఫలాలను తెలిపే, ఆమిషాలను చూపించే, వివిధ రకాల ప్రయోగాలను చేసుకుంటూ వచ్చారు.
అపహరణకారుడు తను దానం చేయకపోయినా, ఔదార్యులు ఎవరైనా చేసినా దానాన్ని రక్షిస్తే చాలు రెట్టింపు శ్రేయం మరియు పుణ్యం లభిస్తుందనే అంశాలు కూడా చోటు చేసుకున్నాయి.
ʼస్వదత్తాం ద్విగుణం పుణ్యం
పరదత్తానుపాలనుం
పరదత్తాపహరేణ స్వదత్తం నిష్పలం
భవేత్ʼ (ఎపిగ్రాఫియా కర్నాటిక)
అని చెబుతూ మరొకరు చేసిన దానాన్ని రక్షిస్తే స్వయంగా తాను చేసిన దానపు పుణ్యం ఫలంకన్నా శ్రేష్ఠమైనది. మరియు ఆ పని రెట్టింపు పుణ్యాన్ని సంపాదిస్తొంది. ఇలా చెబుతూనే మరొకరు చేసిన దానాన్ని అపహరిస్తే మాత్రం తను చేసిన దానపు పుణ్యం కూడా నాశనం అవుతొంది అనే మాటలనూ చేర్పించారు.
ఇలాంటి పుణ్యాశయలను చేర్పించే సందర్భంలో మనిషి తను నమ్ముతూ వచ్చిన చాలా పుణ్యక్షేత్రములను వాడుకుంటూ, ఎవరు దానాన్ని రక్షిస్తారో వారికి ఇలాంటి ʼపుణ్యక్షేత్రములలో పుణ్యకార్యము చేసిన ఫలము లభిస్తొంది. మరియు సహస్ర సంఖ్యలో గోవుల్ని దానం చేసిన పుణ్యం లభిస్తొందిʼ అనే అంశాలను చేర్పించారు. దీనికి నిదర్శనంగా ఈ కింది పుణ్యాశయాన్ని గమనించవచ్చును.
ʼఇలా దాన ధర్మములను కాపాడి ప్రతిపాలించినవారికి గంగ వారణాసి కురుక్షేత్ర ప్రయాగ యర్ఘ్య తీర్థక్షేత్రములలో గ్రహణ సంక్రాన్తి వ్యతిపాతమనే తీర్థాలలో చతుర్వేద పారంగరతప్ప ద్విజోత్తములకు తపోధనులకు ఒక కోటి కవిలెయుమం కోమ్ము కళసమును సువర్ణములలో చేపించి దానము చేసిన ఫళమక్కుంʼ (ఎపిగ్రాఫియా కర్నాటిక)
మన హిందూ సంప్రదాయంలో చాలా నమ్మకాలకనుగుణంగా వివిధ పుణ్యక్షేత్రాలున్నాయి. అవి మన పాపాలను పరిహారం చేసి మనకు పుణ్యాన్ని ప్రసాదించే స్థలాలు లేక పవిత్ర క్షేత్రాలు. ఇలాంటి పాపనివారణ లేక పుణ్యదాయకమైన స్థలాలైన గంగ, వారణాసి, కురుక్షేత్రము, ప్రయాగ… మొదలగు క్షేత్రాలను దర్శిస్తే చాలు మనం చేసిన ఏడు జన్మాల పాపాలు పరిహారమవుతొంది అనే నమ్మకం అందరిలోనూ వుంది. అలాంటి పుణ్యస్థలాలలో దానం చేయడం అంటేనే అత్యంత శ్రేష్ఠ పుణ్యం ఆర్జించినట్టే. అంతే కాక ద్విజోత్తములైన బ్రాహ్ములకు గో దానం చేయడం చాలా పుణ్యకార్యము కూడా. అందులో సువర్ణ దానం, గోదానం అనేవి అతి పవిత్రమనవి. మన సంప్రదాయంలో కోట్ల సంఖ్యలో గోవులను దానం చేయడం అంటే సామాన్యం కాదు. అది చాలా శ్రేయస్కరమైన పని అని భావించబడుతుంది. ఇలాంటి పుణ్యం కేవలం ఇంతకు ముందు ఔదార్యపరుడైన ఎవరో ఒక రాజు చేసిన దానాన్ని రక్షిస్తే లేదా దాన్ని పరిపాలిస్తేనే లభిస్తుందనే అభిప్రాయాన్ని పుణ్యాశయాలలో వాడుతూ వచ్చారు.
అలాగే మరొక శాసనంలో ఈ పై చెప్పిన విధంగానే మరొక పుణ్యాశయాన్ని చూడవచ్చును.
ʼఇలా దానాలను ప్రతిపాలించినవాళ్ళు శ్రీ వారణాసి,
ప్రయాగ, కురుక్షేత్ర, అర్ఘ్య, తీర్థ
శ్రీ పర్వతాది
పుణ్యక్షేత్రమున ఒడ్డున సహస్ర కవిలె (గోవు)లను సువర్ణములో చేయించిన
కొమ్ముకళశలతో సహస్రవేద పారంగతులైన సుబ్రాహ్ములకు సూర్యగ్రహణము
సోమగ్రహణము
వ్యతిపాతి సంక్రమణాది పుణ్యకాలములలో విధ్యుక్తంగా
దానము చేసిన ఫలాలను పొందగలరుʼ
(ఎపిగ్రాఫియా కర్నాటిక)
ఈ పై చెప్పిన విధంగానే మరొకరు ఇచ్చిన దానాన్ని రక్షిస్తేనే గంగ, వారణాసి, కురుక్షేత్రాది పుణ్యక్షేములలో సహస్ర (వేయి) గోవులను దానము చేసిన పుణ్యము లభించును. అంతే గాక ఆ గోవులకు బంగారంతో కొమ్ము కళసం చేయించి భూసురలైన సహస్రవేద పారంగులైన బ్రాహ్ములకు సంక్రమణ కాలంలో విధియుక్తంగా దానం చేసిన ఫలము లభించును అనే అంశాలను చేర్పించిన సంగతులను చూడవచ్చును.
ఈ పుణ్యాశాయలలో పుణ్యక్షేత్రము, గోవు, బ్రాహ్ములు ఈ మూడు సంగతులను ముఖ్యంగా గమనించగలరు. పుణ్యక్షేత్రం అనేది అన్నీ పాపాలను తొలగించే పవిత్ర స్థలం అనే నమ్మకం. గోవు అనేది మన నమ్మకంలో ఒక భాగం. అంటే మన సంప్రదాయంలో దేవుళ్ళను భిన్న రూపంగా పూజిస్తూ వస్తున్నాం. అందులొ గోవు కూడా పూజనీయ అంశంగా భావిస్తూ వస్తున్నాం. అలానే బ్రాహ్ములను కూడా భూసురలు అనే పిలుస్తాం. ఇలాంటి దైవ స్వరూపులైన వస్తువులను, దైవ స్వరూపులైనవాళ్ళకి దానంగా పుణ్యక్షేత్రములలో ఇవ్వడం అంటే అత్యంత శ్రేయస్కర పని అయినట్టే. ఇలాంటి ఫలాలు లభించాలంటే కేవలం ఇంకొకరు చేసిన దానాన్ని రక్షస్తేనే చాలు అనే పుణ్యాంశలను శాసనాలలో వేయడానికి ప్రారంభించారు. ఇవన్నీ ప్రయత్నాలు కేవలం రాజులు చేసిన దాన ధర్మాలు దుర్వినియోగానికి గురికాకుండా సద్వినియోగం కావలనే ఆశయంతో చేసిన ప్రయత్నాలు అని భావించవచ్చును.
అలాగే దానం చేయడానికి కొన్ని మంచి కాలాలుంటాయి
తిథి నక్షత్రం మంచిగా ఉండాలి అందులో సోమోపరాగ, సూరియోపరాగ మహాపుణ్యకాలములు అనేవి ముఖ్యమైనవి. ఈ సమయాలలో
దానాలు చేస్తే దానికి వచ్చే ప్రతిఫలం కూడా అంతే విలువైనదిగా ఉంటుంది. చేసిన దానాన్ని రక్షిస్తే ఇలాంటి
కాలంలో పుణ్యక్షేత్రములలో దానం చేసిన పుణ్యం లభిస్తుందని చెబుతూ వచ్చారు.
9. ఉపసంహారం
- శాపనార్థాలు మన హిందూ సంప్రదాయం నమ్మే నమ్మకాల మీద వెలుగు చూపిస్తాయి.
- ఇవి ప్రాచీన కాలపు రాజుల ఔదార్యగుణాలను చెబుతాయి.
- వీరులు యుద్ధంలో తమ ప్రాణాన్ని ఫణంగా పెట్టి పోరాడి విజయం సాధించే సంగతుల్ని, లేదా వీర మరణం పొందే సంగతులను తెలుపుతోంది.
- రాజులు వీరుల పరాక్రమాన్ని, పండితుల పాండిత్యాన్ని మెచ్చుకుని దానాన్ని ఇస్తున్నది మాత్రమే కాక దానాన్ని రక్షించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేసినది తెలుస్తుంది.
- మనిషిలో మంచితనం వున్నట్టే చెడు కూడ దాగి ఉంటుంది అనేది ఇందులో కనబడుతోంది.
- మనిషిని సన్మార్గానికి తీసుకు రావడానికి మంచి మాటలతో పాటు నిందనా మాటలనూ వాడినది తెలుస్తోంది.
10. ఉపయుక్తగ్రంథసూచి
- చిదానందమూర్తి, ఎం.(1967). కన్నడ శాసనగళ సాంస్కృతిక అధ్యయన, మైసూరు విశ్వవిద్యాలయం, మైసూరు
- జయదేవ్, హు.క, (1998). శాసన మరియు గద్య, కన్నడ సాహిత్య పరిషత్తు, బెంగళూరు
- పంచముఖి ఆర్ ఎస్., (1940). బాంబే కర్నాటక ఇన్స్క్రిప్షన్స్, ప్రభుత్వ ముద్రణ, మద్రాసు
- రైస్, బి.ఎల్. (1905, 1972). ఎపిగ్రాఫియా కర్నాటిక, 12 సంపుటాలు, మైసూరు ప్రభుత్వ ముద్రణ, మైసూరు
- శేషశాస్త్రి, (1995). శాసన పరిచయము, కన్నడ సాహిత్య పరిషత్తు, బెంగళూరు
- శేషశాస్త్రి, అణ్ణిగేరి ఎం.ఎం., (1995). శాసన సంగ్రహం, కన్నడ సాహిత్య పరిషత్తు, బెంగళూరు
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

