headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-06 | Issue-08 | July 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

4. ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’ వచనకావ్యం : పర్యావరణ ఆవిష్కరణ

DOI

డా. జరుపుల రమేష్

అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ,
కాకతీయ ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి),
హన్మకొండ, తెలంగాణ.
సెల్: +91 9618944654, Email: ramesh.jarupula@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 07.06.2025        ఎంపిక (D.O.A): 30.06.2025        ప్రచురణ (D.O.P): 01.07.2025


వ్యాససంగ్రహం:

శక్తివంతమైన వచనకావ్యాలు రచించిన కవి, రచయిత సుద్దాల అశోక్‌ తేజ. మానవుడు సుఖజీవి. అంటే సుఖాన్ని ఆశించి జీవితం గడిపేవాడు. ఈ సుఖాకాంక్ష విపరీతంగా పెరగడంతో స్వార్థజీవిగా ఎండమావి వెంట పరుగెత్తుతున్నట్లు పరుగెత్తుతున్నాడు. ఆ క్రమంలో పర్యావరణ విధ్వంసం కొనసాగిస్తున్నాడు. అశోక్‌ తేజ తన కావ్యాలకు ఎన్నుకునే వస్తువు విభిన్నమైనది. ప్రత్యామ్నాయ ఆలోచనలను రేకెత్తిస్తుంది. ప్రత్యామ్నాయ వ్యవస్థలను ప్రతిపాదిస్తుంది. ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’ పర్యావరణ కావ్యం. ఇప్పుడు అడవుల పరిస్థితి ఏమిటి? అడవి తన కష్టసుఖాలు చెప్పుకుంటే ఎలా ఉంటుంది? నిజానికి అడవి సమృద్ధిగా ఉంటే మనిషి కూడా సమృద్ధిగా ఉంటాడు. అడవి ఎండగడితే మనిషీ ఎండిపోక తప్పదు. ఆ రహస్యం తెలుసుకొమ్మని అడవి మనకు ఉద్భోదిస్తున్నది. వాటిని పరిశీలించడమే ఈ పత్రం ఉద్దేశం. అశోక్ తేజ తాను రాసిన వచన కవిత్వంలో ప్రకృతి పర్యావరణాన్ని ఎలా ఆవిష్కరించగలగాడో విమర్శనాత్మకమైన విశ్లేషణ పద్ధతిని అనుసరించింది. కవిత్వం విషయం ఆధారంగా విశ్లేషణ కొనసాగింది. ఇంతకుముందు అశోక్ తేజ రచనలపై పరిమిత స్థాయిలో పరిశోధనలు వచ్చాయి. అశోక్ తేజ రచనలపై విమర్శ వ్యాసాలు వెలవడినప్పటికీ ఈ వ్యాసం నిమిత్తం ఎంపిక చేసిన వచన కవితలను చర్చించి సమగ్రతతో ఆయా రచనల ప్రాముఖ్యతను విశదీకరించేందుకు ప్రయత్నం చేసింది. ఈ పరిశోధన పత్రం కొరకు సుద్దాల అశోక్ తేజ రచనలు సేకరణ ప్రాథమిక ఆధారాలు. అశోక్ తేజ రచనల సేకరణ, కవి నేపథ్యం, అడవిలో ప్రయాణం చేద్దాం రండి, పరిశోధన ఫలితాల సమీకరణ వంటివి ఈ వ్యాసరచన ప్రణాళిక. ఈ పరిశోధన పత్రం ద్వారా అశోక్ తేజ పర్యావరణ ఆవిష్కరణ ఎంత ఘనంగా ఆవిష్కరింప చేస్తాడో నిరూపించబడింది. తేజ ‘అవని పై గల ఆధిపత్య వర్గాల పైనే కాదు, వర్ణాలపై సైతం ధిక్కారం ప్రకటిస్తూ ప్రకృతిని కాపాడాలనే సందేశం స్పష్టంగా దర్శించబడ్డాయి. అందుకే ఒక హృదయం కోసం అడవిని పోషించే ప్రభుత్వం కోసం కవి ఎదురు చూస్తుంటాడు అనే స్పష్టమైన భావజాలాన్ని సూచించే విధంగా ఉన్నాయని ఈ వ్యాసం నిరూపిస్తుంది.

Keywords: అశోక్ తేజ, కవిత్వం, తెలుగు, పర్యావరణం, గిరిజనవాదం, సామాజికచైతన్యం

1. ప్రవేశిక:

అశోక్‌ తేజ 1960 మే 16 న యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో హనుమంతు, జానకమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించాడు. హనుమంతు తెలంగాణా విముక్తి పోరాటంలో, నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించాడు.హనుమంతు స్వంత ఊరు ‘సుద్దాల’. కాబట్టి ఈయనకు ‘సుద్దాల’ పేరుతో పిలిచేవారు. తర్వాత ఆ పేరే  వారికి ఇంటిపేరు అయింది. అశోక్‌ తేజ సిని గేయ రచయితగా ఎంతో ప్రసిద్ది పొందాడు. స్మృతిగీతం, వెలుగురాకలు, ఆకుపచ్చ చందమామ, బతుకుపాటలు, వీరతెలంగాణ యక్షగానం, నేలమ్మ నేలమ్మ, నెమలికన్నోడు, శ్రమకావ్యం, నా పాటలు, శ్రీ శూద్రంగంగ, నేను అడవిని మాట్లాడుతున్నాను మొదలైనవి.

‘‘ప్రపంచమంతా వెనక్కి తిరిగి
ప్రకృతిలోకి వెళ్ళమనీ
తాత్త్విక రూసో సందేశం
బ్యాక్‌ టూ నేచర్‌’’ (అశోక్‌ తేజ, సుద్దాల. నేను అడవిని మాట్లాడుతున్నాను. పుట:136).

మన జీవితం దేనికోసమో తెలియని, తెలుసుకోలేని కాలంలో ఉన్నాం మనం! ఈ రోజు ఎన్నడూ లేనంత అధ్భుతంగా సమాచార సంబంధాలు పెరిగాయి. కానీ మానవులుగా ‘మనతో మనకు’ మరియు తోటి వారితో సంబంధాలు క్షీణించిపోయాయి. అందుకే తిరిగి ప్రకృతిలోకి మాట్లాడడానికి రండి.

‘‘మీ జీవితంలో ఎప్పుడైనా ఒక ప్రయాణం ప్రారంభించవచ్చు. అది ఇంతకు ముందెన్నడూ చేయని ఒక సుదీర్ఘ ప్రయాణమే అయినట్లయితే అది ఖచ్చితంగా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి చేసే ప్రయాణమే’’ (వేణు భగవాన్.ది ఫైర్. పుట: 08 అని క్యాథరిన్‌ షార్ప్‌ అంటారు.

అన్నట్లు అశోక్‌ తేజతో కలిసి అడవితో మాట్లాడడానికి ప్రకృతిలో లీనమై, చెట్టు, గాలి, నీరు, కొండ, ఆకాశం, సూర్యచంద్రులను కలవడానికి ప్రయాణం చేద్దాం రండి. తలో చేయి వేయండి. లేకపోతే ఈ జర్ని మళ్ళీ సాగకపోవచ్చు. త్వరపడండి, రండి కలిసి ఈ అడవితో మాట్లాడడానికి.

2. పర్యావరణ ఆవిష్కరణ

‘‘కడుపులోపలి కాలేయ విలవిలార్భటి
గడప అవతల కరోనా ఫెళ ఫెళార్భటి
హృదయంలో అరణ్య ఘలంఘలల కావ్య వధూటి
నేను అడవిని మాట్లాడుతున్నాను’’ 

అంటూ ఈ కావ్య నేపథ్యాన్ని కవి ‘భూమిక’లో చెప్పుకున్నాడు.

అట్లాగే ప్రకృతిని చుట్టూ ఉన్న పరిసరాలను పర్యావరణాన్ని వీలయినంత విధ్యుక్త కావ్యంగా విధ్వంసం చేస్తున్న ఈ కాలం మనిషిని ప్రతి నాయకుడిగా భావించి గురిచేసి సంధించిన ఈ కావ్యాస్త్రం’ అంటూ వివరణ ఇచ్చాడు.

అశోక్‌ తేజ తన కావ్యాలకు ఎన్నుకునే వస్తువు ఈ తరం కవులకు, రచయితలకు నూతనమైన ఆలోచలను రేకెత్తిస్తుంది. ప్రత్యామ్నాయ వ్యవస్థలను ప్రతిపాదిస్తుంది. ‘‘ప్రపంచానికి ఏది అవసరమో అడగవద్దు. నీకు జీవనశక్తినిస్తూ నిన్ను జీవింపచేసే పని ఏమిటో తెలుసుకో! ఆ కర్తవ్యాన్ని నిర్వహించు! ఎందుకంటే ప్రపంచానికి అలా జీవించే మనుషులు మాత్రమే అవసరం’’ (వేణు భగవాన్.ది ఫైర్. పుట:36) హరోల్డ్‌ వైట్‌మేన్‌ అన్న అక్షరాలు సరిపోతాయి.

ఈ కావ్యంలో ప్రధానంగా కనిపించే వస్తువు ప్రకృతికీ, మానవ ప్రకృతికీ ఉన్న యుగయుగాల అనుబంధం. అందుకే ‘ఆటవీయత, నది, వాగు, వంక, చెట్టు, పుట్ట, ఆకాసం అన్ని మాట్లాడుతాయి. ఎంతో ఆత్మీయంగా పలకరిస్తాయి.

‘‘నేను అడవిని మాట్లాడుతున్నాను! మేనిపచ్చల పుడమిని మాట్లాడుతున్నాను’ అంటూ ‘విశ్వమానవ జాతికి/ జీవకోటికి సుదీర్ఘ సుకృతిని/ మాట్లాడుతున్నాను/ నేను నిథిని, ఖనిజ పెన్నిధిని/ చేదు నిజాల పొదని/ పర్యావరణ ప్రత్యేక ప్రతినిదిని/ మాట్లాడుతున్నాను’’ అంటూ ప్రకృతికి ప్రతినిధిగా అంటూ చెప్పుకున్నాడు.

‘మనిషి’ ప్రధానంగా నిరంతరం ప్రయాణం చేసేది ‘ప్రకృతి’ లోకే ఈ మానవ మనుగడ ప్రకృతి పైన ఆధారపడి వుంది. కోట్ల సంవత్సరాల వయస్నున్న భూమి పైన లక్షల సంవత్సరాల వయసున్న మనిషి ఏమి ఆవిష్కరించాడు. ఏమి సాధించాడు? అనే ప్రశ్న వేసుకుంటే శూన్యమే. అందుకే కవి ఒక అడుగు ముందుకు వేసి ‘పర్యావరణ ప్రత్యేక ప్రతినిధిని’ అంటున్నాడు.

‘ఆ నింగి ఎదపొంగి’ కవితలో-

‘‘అనాగరికత కాదు/ అరణ్యకతనాది/ ఆటవికత కాదు/ అటవీయత నాది/ మానభంగం చేసే మగజంతువే లేని/ ఆరణ్యకలు నాది ఆటవీయత నాది/ సాటి మనుషుల పైన తోటి మనిషికి ఉంటే / ఒకే ఒక మమకారమే మీ మానవీయత అయితే/ సాటి వృక్షముల పైనే కాదు/ సాటి పక్షుల పైన సాటి జంతువుల పైన/ సాటి జలముల పైన సాటి మనుషుల పైన/ బాధ్యతను చూపించే ఆత్మీయత అనే / అరణ్యకత నాది అటవీయత నాది’’ (అశోక్‌ తేజ, సుద్దాల.నేను అడవిని మాట్లాడుతున్నాను.పుట:20) అంటూ ఈ తరం మానవుడు సాధించిన ఘనతను వివరిస్తాడు.

ప్రపంచీకరణ ముసుగులో ఎగిరి గంతులెస్తున్న ‘మనిషి’ తన ఉనికినే మరుస్తున్నాడు. తోటి మనిషి పట్ల సహోదర తత్త్వం చూపించలేక హత్యలు చేస్తున్నాడు. ‘ఏ పక్షి, ఏ చెట్టు ఏ ఆరణ్యకత’ తనకు పాఠాలు బోధించినవో వాటిని కూల్చేస్తున్నాడు.

‘మానవులను దేహి’ అనే కవితలో-

‘‘మానవులను దేహి అని/ వరాలడుకున్న దేవుళ్ళు/ తెలుసు నాకు...నా ఉనికి చంపుకొని/ నా బతుకు తెంపుకొని/ మీ ఆనకట్టలకు/ మీ అడవితొవ్వలకు/ వేవేల చెరువులకు నీటి కాల్వలకు/ వేల ఎకరాల నేలను/ ఇచ్చుడే తప్ప తీసుకొనుడే/ తెలియని భూ/ తల దేవతను/ దేవతారణ్యాని/ నేలవేర్లనుండి కొమ్మతలకొసదాక/ దాతృత్వమే ధన్యలుగా జీవించే/ బాధ్యతను నేను/ బాధ్యతారణ్యాన్ని నేను’’ (అశోక్‌ తేజ, సుద్దాల.నేను అడవిని మాట్లాడుతున్నాను. పుట:24) అంటాడు.

మానవీయత కన్న గొప్పది ‘ఆటవీయత’. మనిషి నాగరికత కన్నా గొప్పది అరణ్యకత. మనిషితనం ఎక్కడ చూపిస్తున్నట్టు? వేరు నుండి, కొమ్మనుండి, ఫలము నుండి తన చర్మం దాకా అన్ని ప్రయోజనాలు కలిగిస్తున్న ప్రకృతి పట్ల మానవుడు’ ఎలా ఉంటున్నాడు అనే ప్రశ్నను లేవనెత్తుతాడు కవి. ఈ రోజు వేదాల నుండి పురాణం దాకా, ప్రాచీనం నుండి ఆధునికం దాకా వున్న మనిషి ‘దేహి’ అని అడగాల్సింది ప్రకృతినే, కాపాడవలసింది ప్రకృతినే.

‘శరద్రుతువులో’ అనే కవితలో-

‘‘ఇదిగో చూడిటువేపు / ఒక్కొక్క ‘జలపాయ’ ఒక్కో నయాగర/ ఒక్కొక్క జలపాతం ఒక జలంధర’ అంటూ నీటి చిత్రణను తెలుపుతూనే ‘‘ రూప సౌందర్యాన్ని శబ్ద సౌందర్యాన్ని/ వేగ సౌందర్యాన్ని ఊహించుకోబడ్డ/ నాది అడవిగడ్డ’’ (అశోక్‌ తేజ, సుద్దాల.నేను అడవిని మాట్లాడుతున్నాను. పుట:27) అని జలపాతాన్ని ఆవిష్కరించాడు.

పర్యావరణ కోసం ప్రపంచంలో ఎంతో మంది రచయితలు తమ వంతుగా కృషి చేశారు.రాబిన్‌సన్‌ జెఫర్‌స్‌, మేరీ ఆలివర్‌, డబ్లూ. యస్‌. మెర్విన్‌, వెండెల్‌ బ్రెరీ, లిండా హలోగన్‌, వందనాశివ లాంటి పలువురు పర్యావరణ కవులు, కవయిత్రులు, తమ కలాలే ఆయుధాలుగా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించారు. మనదేశంలో సుందర్‌లాల్‌ బహుగుణ,రోములస్‌ వైటేకర్‌, మేధాపాట్కర్‌, రాజేంద్రసింహ, పల్ల వెంకన్న, సత్యనారాయణ, అలోక్‌ నాథుడు, వన్యజీవి రామయ్య మొదలైన వాళ్ళు తమ జీవితాలను పర్యావరణం కోసం అంకితం చేశారు. వారి యొక్క వారసత్వాన్ని రచనల్లో తీసుకున్న అశోక్‌ తేజ-

‘‘నిండు పున్నమినాడు/ పండు వెన్నెల్లో చంద్రకాంతి/ పరావర్తనం చెందినప్పుడు/ ఆవిష్కరించబడే/ శరచ్చంద్ర ధనస్సు/ తెలసునా మీకు/ మీకు తెలిసింది ఇంధ్ర ధనస్సు/ నాకు ఇంద్ర ధనస్సుతో పాటు/ చంద్ర ధనస్సు తెలుసు/ మీకు రెయినోబో తెలుసు/ నాకు మూన్‌బో కూడా తెలుసు’’ (అశోక్‌ తేజ, సుద్దాల.నేను అడవిని మాట్లాడుతున్నాను.పుట:28) అంటూ అడవితల్లి గొప్ప ఆవిష్కరణ హృదయాన్ని వివరించాడు.

‘బిటా’ ప్రపంచంలో అడుగుపెట్టిన మనం, మూగభాషలను అర్థం చేసుకునే స్థాయికి చేరుకున్నామా? లేక మనుషులు కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉండడం తెలుసుకున్నామా? అదిగో మనిషి నీ కండ్ల ముంగిటే ఈ ప్రపంచాన్ని, అక్షరాన్ని, జ్ఞానాన్ని నేర్పిన ప్రకృతి ఎంత ఒదిగి ఉందో ఆలోచించే తరుణం దగ్గర్లోనే ఉందని గమనించాలి అంటాడు ఈ కవి.

‘ఊటగా ఊరినపుడు’ కవితలో-

మనకు ‘ఏట్రింత పిట్టలు, వానకోయిలలు, గువ్వలు, డేగ  తునీగలు, చిలుక కోకిలలు మొదలైన వాటితో పలకరింప చేస్తాడు కవి. అడవి అంటే చెట్లు, కొమ్మలే కాదు...ఈ మానవళికి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిన పై పక్షులు కూడా ఉన్నాయి. ‘మనిషి మరిచావా’ అని హెచ్చరిక చేస్తాడు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికోసం, ఎన్నో కోట్ల రూపాయిల వెచ్చించి పరిశోధనలు చేస్తున్నాయి. అలాగే ‘స్వచ్ఛమైన గాలి’ కోసం ఈ పరిశోధన చేయాల్సిన అవసరం ఎంతో దూరంలో లేదని గుర్తు చేస్తాడు. ఢిల్లీలో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ కోసం క్లబ్బులు ఏర్పాటు చేశారు. అంటే మనిషి ఏ స్థాయికి ఎదిగాడో, దిగజారాడో ఆలోచించకోవల్సిన అవసరం ఉంది.

కవిని తనను తాను గిరిజనుడుగా ఆవిష్కరించుకున్నాడు. అందుకే ‘‘మీరనే గిరిజనులు/ అడవి బిడ్డలు కూడా/ అచ్చు నాలాగే వుంటారు సుమా’’ (అశోక్‌ తేజ, సుద్దాల.నేను అడవిని మాట్లాడుతున్నాను. పుట:40) ఈ అడవికి తొలి వారసులు, నేటి వారసత్వం కొనసాగిస్తున్నవారు గిరిజనులు. ఈ ప్రపంచం ఎంతో విలువైన జ్ఞాన సంపదను వారి నుండి నేర్చుకున్నదనే  సత్యాన్ని ఈ కవితల ద్వారా ఆవిష్కరింప చేస్తాడు.

అశోక్‌ తేజ సినిమా పాట రచయితగా మనకందరికి సుపరిచితులే. అందుకే ‘‘పాట బతుకై, బతుకు పాటైనవాళ్ళు/ ఆట బతుకై, బతుకు ఆటైనవాళ్ళు/ వేట బతుకై, బతుకు వేటైనవాళ్ళు/ ఆట పాట వేట/ బతుకు బాటైన వాళ్ళు’’ (అశోక్‌ తేజ, సుద్దాల.నేను అడవిని మాట్లాడుతున్నాను. పుట:41) అంటూ అడవి దేవత ‘ఆట పాటకు’ మార్గదర్శకమైందని, మనల్ని వాటి వెంబడి వెళ్ళి పాటను, ఆటను అనుసరించమంటాడు.

భారతీయ ఆదివాసీల జీవిత లోతులు తెలిసిన ఈ కవికి గాఢమైన అవగాహన ఉంది. ఆదివాసీలు తమ అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు నిరంతరం పోరాటం చేయాల్సి వుంటుంది. ఆ పోరాటంలో ప్రాణాలు సైతం కోల్పోవలసి ఉంటుంది. అందుకే వాళ్ళు ‘ప్రకృతితో పోరాటం, జంతువులతో పోరాటం, గిరిజనేతర మనుషులతో పోరాటం’ చేస్తుంటారు. ఈ నవీన నాగరికత, నవీన వలస వాదంలో ఎన్నో మార్పులు,ఎన్నో సౌకర్యాలు వచ్చిన వారు మాత్రం వాళ్ళ జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు. అదే వాళ్ళకు ఆత్మస్థైర్యం, భరోసాను ఇస్తుంది. అందుకే కవి...

‘ఎవడురా నా బిడ్డలు’ కవితలో-

‘‘ఎవడురా నా బిడ్డలు శుద్ధ/ బద్ధకస్తులని అరిచేది/ ఎవడురా నా వారసులు / సోమరులు అని మొరిగేది/ సవసవమని/బీజవృక్షాలు నరికితే/ జవజవ కారే రససావాలు అచ్చం/ మనిషి రక్తంలా ఎర్రగా కనిపించే/ మనసు కరిగిస్తవన్న ఎరుక నా బిడ్డలది అసలు/ కోయ కోయ/ కోయి/ కోయతారంటే/ గోండు భాషలో ‘మనిషి’ అని/ ఎవడురా నా బిడ్డలు అడవి జంతువులని / ఓండ్ర పెట్టేది/ ఆకలిగొన్న వేళ / వలసనంత ఆహారమగుపడ్డా/ గుంపు కలిసే దాక ఆగి / పంక్తిగా కూచుని పంచుకుతినే / సామూహిక జీవనపు/ మంచితనానికి ప్రతీక నా అడవి బిడ్డ’’ (అశోక్‌ తేజ, సుద్దాల.నేను అడవిని మాట్లాడుతున్నాను. పుట:44,45) అడవి బిడ్డను చాలా హృద్యంగా ఆవిష్కరించాడు. ఈ కావ్యంలో అద్భుతమైన కవిత ఇది. చాలా గొప్పగా రాశారు. ఈ రోజుల్లో వనభోజనాలు, కుల భోజనాలు అని మనం చూస్తూనే ఉన్నాము. ఆ భోజనాలు ప్రకృతి ఒడిలోకి వెళ్ళి తింటుంటాము. కానీ సహాపంక్తి భోజనాలు చేయాలనే ఆలోచన ఇచ్చిందే అడవి తల్లి బిడ్డలు ‘ఆదిమవాసులు’ అని కవి అంతర్లీనంగా చెపుతున్నాడు.

‘ఆధునికత మొదలైన తరువాత ప్రకృతిని ఒక వనరుగా చూడటం, ఆ వనరుని వీలైనంతగా ఉపయోగపెట్టుకునే ప్రకృతి పట్ల పెరుగుతూ వచ్చింది. ఈ దృష్టి ఈ మధ్యకాలంలో మరింత పెరిగింది. ఫలితంగా ఇవ్వాళ గతంలో ఎప్పుడు లేనంతగా పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాం’’ (అశోక్‌ తేజ, సుద్దాల.నేను అడవిని మాట్లాడుతున్నాను. పుట:147) అంటూ ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ప్రొ. తిరుపతి రావు పేర్కొన్నారు.

‘‘నే నడవినే కాని/ బండ తరపున కొండ తరపున/పర్వాతాల గుండె తరుపున భూమీ/ ఆకాశాలు, అగ్ని, గాలితరపున/నదుల సెలయేళ్ళు కొలనుల/ నీళ్ళ తరపున/ పక్షి, జంతు, కీటక/ హృదయాల తరపున/ ప్రకృతి పంపిన రాయబారిగా/ పాలకులను మందలిస్తున్న/ మనిషితనం మీలో ఇంకా/ బతికివుందని విశ్వసిస్తున్న అయినా ఒకసారి విప్పి చూపనా/ మీ దౌర్జన్యాల చిట్ట/ పగుల గొట్టనా మీ పాపాల పుట్ట’’ అంటూ మనిషికి ప్రకృతికి మధ్య వుండాల్సిన గాఢమైన సంబంధాన్ని ఈ కవితలో పలవరిస్తాడు.

‘మనుషుల మానవత్వం’ అనే మాటను అక్షరికరిస్తున్నాడు. ‘మానవత్వం’ లేని రోజు కవి చెప్పినట్లు ‘పాపాలగుట్ట’ విప్పబడుతుంది. కొన్ని సందర్భాల్లో అవి విప్పడానికి మనుషులే కానరారు అనే సంకేతాన్ని కూడా తెలుపుతున్నాడు. ప్రకృతి వినాశం ఆపకపోతే చివరికి ఈ భూమ్మీద మానవ సంతతి అనేది మిగలదని హెచ్చరిస్తున్నాడు.

అరణ్యకత నుండి ఆటవీయుల నుండి/ అడవి ధార్మికత నుండి/ అడవి మార్మికత నుండి/ దూరంగా జరిగి/ మైదానం చేరి `జారి/ నీస్వార్ధాలంబనగ ఎప్పుడైతే నీ / నాగరి ‘కత’ మార్చావో/ అపుడే అరణ్య నేత్రాల కందనంత/ లోలోతుల పాతాళానికి పడిపోయావు/ నా నుండి ఎదిగేందుకే / విడిపోయావనుకుంటే/ చెడిపోయావు కదరా/ ఏం మనిషివిరా నువ్వు/...అంటూనే ‘ఏం ..మ..నిషివి రా నువు’’ వ్యంగ్యంగా చిత్రీకరిస్తాడు. ఈ రోజు మనిషి మారడం అనేది పక్కన బెడితే చెడిపోవడానికి ముందుడగు వేస్తున్నాడు. అనేక హత్యలు, లైంగిక వేధింపులు, దొంగతనాలు మొదలైన వాటి ద్వారా మరింత దిగజారుతున్నాడు. మారాల్సింది ప్రకృతిని వదిలి కాదు, మారాల్సింది తన జీవన చక్రం. ఆలోచన సరళి. తాను బతుకుతూ పదిమందిని బతికించాలనే పాత సామెత కాకుండా తను బతుకుతూ ప్రకృతిని కాపాడాలనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.

‘నెలత తనే’ కవితలో-

‘‘నెలత తనే/ నెల తప్పిన సతితానే/ గర్భవతి తానే కాబోయే తల్లీతానే/ ఒంటరిగా అడవిలో తన పురుడు తానే పోసుకునే/ మంత్రసాని కూడా తానే నా అడవి బిడ్డ...చెవితో/ ముక్కతోనే కాదు/ మనుసుతో/ శుభాశుభగమనాలు పసిగట్టగల/ ఆరవజ్ఞాన  సంపన్నురాలెమో...అడవిదుంపలు తిని/ అడవి నీరు దాగి/ కొండగాలి పీల్చి తలయెత్తి/ స్వర్గానగల దేవతలతో/ మా యంత సుఖమున్నదా మీకు/ అని ప్రశ్నించే/ మన జీవనతాత్త్వికురాలెమె....కొండల పై/ రాబందుల తోనూ/ మేఖ బంధులతోనూ/ కలిసి జీవించే వీరాధివీర జాతి/ నా అడవి బడుగు జాతి’’ (అశోక్‌ తేజ, సుద్దాల.నేను అడవిని మాట్లాడుతున్నాను. పుట:53,54) అని చిత్రిస్తాడు.

అడవి బిడ్డ తనకు తానే పొరుడుపోసుకునే ఘట్టాన్ని..అడవి బిడ్డల ప్రాకృతికి జ్ఞానాన్ని, జీవన స్థితిగతులను వర్ణించిన తీరు ఆమోఘం. ఈ రోజులలో ఎన్నో చదువులు చదివి సాధారణ కాన్పు చేయలేక, డబ్బులకు ఆశపడి నిలువున ఆడ్డంగా కోస్తున్నారు. కానీ గిరిజన వనిత మాత్రం ఏమీ చదువుకోకుండానే ఒంటరిగా పురుడు పోసుకుంటుంది. ఎంతో నేర్చుకోవలసిన అవసరం ఉంది. తెలిసిన జీవితాల గురించి రాయవచ్చు, కానీ అశోక్‌ తేజ మాత్రం తనకు తెలియని గిరిజన జీవితం గురించి చాలా హృద్యంగా ఆవిష్కరింపజేశాడు.

‘ప్రజాస్వామ్యం మంటేనే’ కవితలో ‘‘నగరీకరణంటే అడవిని నరికేయమనా/ ప్రపంచీకరణంటే మానవేతర/ ప్రపంచాన్ని నాశనం చేయమనా/ ఆర్ధిక సులభీకరణంటే అడవి గర్భ/ యూరేనియం నిట్ట నిలువు/ పట్టపగలు దోపిడా/ ఖనిజ సంపదలను/ కార్పోరేట్లుకు అప్పగించుడా/నేను సమర్ధంగా..సహృదయంగా / నా బాధ్యత చేస్తున్న ఆనాది నుండి/ నీ బాధ్యతలో ఎందుకు స్వార్ధం నిండిరది/ ప్రకృతికే కాదు నీకు నివ్వు’’ (పుట:84,85) అంటూ నేడు మనిషి అడవిలో వుండే విలువైన సహజ వనరుల గురించి, సహజ సంపదను ధ్వంసం చేస్తున్నాడు.

అందుకే తన వినాశం తనే కొని తెచ్చుకుంటున్నాడు. ‘తప్పు మీద తప్పు చేస్తూ/ పోయే నికృష్టపు మనిషే/ నిజమైన వైరస్‌’’ ‘ప్రకృతిని రక్షించే జ్ఞానమున్న/ ప్రదేశాలకు వైరస్సు రాదు/ వచ్చినా మనలేదు మనినా/ ఏమనలేదు’’ (అశోక్‌ తేజ, సుద్దాల.నేను అడవిని మాట్లాడుతున్నాను. పుట:112)

ఇంతకు ముందే చెప్పుకున్నట్లు మనిషికి, ప్రకృతికి వీడదీయరాని సంబంధాన్ని కలిగేవుండేవి. మనిషి ఆలోచనల్లో విభిన్నమైన ఆవిష్కరణ జరిగిన తర్వాత అడవిని చూసే కోణం మారిపోయింది. ‘అమ్మ’గా భావించే అడవిని ‘అమ్మేవస్తువు’గా చూసేకోణం దాకా మనిషి వచ్చాడు. అందుకే పై కవితలో కవి, ‘సునామీ, కలరా, ప్లేగు, డెంగ్యూ, కరోనా’ లు మనుషులకు ఎంతో విలువైన జ్ఞానాన్ని అందించాయి. అయినా మనిషి తాను ఏర్పాటు చేసుకున్న ప్రకృతి లాంటి ‘ఆనందం’ కోసం వెళ్ళిపోతున్నాడు. కవి మాత్రం కరోనా తర్వాత మరో ‘మరోనాలు’ అంటూ ఆవిష్కరింపచేశాడు. ఇంకా ప్రకృతిని ధ్వంసం చేస్తే చివరికి ‘మరణమే శరణ్యం’ అని భావించాలని ప్రపంచానికి సంకేతాన్ని పంపిస్తున్నాడు.

‘ప్రకృతి ఒకకోర్టు’లో ‘‘ప్రకృతి ఒక కోర్టు మన్ను/ మిన్నులను - దిగ్దిగంతాను/ తేరిపాంగ చూడగలదు/ ప్రకృతి ఒక సత్యపేఠిక/ ప్రకృతి ఒక సుదూర దర్శి....మరి/ ప్రకృతి న్యాయాలయం ముందు/ ఎవడురా ముద్దాయి/ ఎవడు దోషి ఎవడు శిక్షార్హుడు/ నరుడు కద ప్రకృతీ విశ్వాసఘూతకుడుఉ నరుడే కద పర్యావరణ విద్రోషి’’(అశోక్‌ తేజ, సుద్దాల.నేను అడవిని మాట్లాడుతున్నాను. పుట:89,90) ఈ పర్యావరణ నాశనం కావడానికి కారకులను కోర్టులముందు హాజరుస్తానని చెప్పి, ‘హంతుకులు మీరే/ హతులు మీరే’’ అంటూ పర్యావరణ విద్రోహం వల్ల కలిగే నష్టాన్ని విశదీకరిస్తున్నాడు.

‘‘పెట్టుబడికి ప్రకృతిని తాకట్టుగా పెడితే ఎలా/ పెట్టుబడికి రాజ్యం కట్టుబానిసైతే ఎలా/ దోపిడిపద్ధతి మార్చిన/ పెట్టుబడి సూత్రమొకటి/ కొనిపించు..కొనిపించు..కొనిపించనేమంత్రం/ సంపన్న వర్గం జాబితాలో ఉన్నతస్థానం/ సాధించు సాధించు..సాధించుమనే కుతంత్రం/ ప్రకృతి విధ్వసానికి మూలం’’ (అశోక్‌ తేజ, సుద్దాల. నేను అడవిని మాట్లాడుతున్నాను. పుట:100) నేటి కుతంత్రపు రాజకీయాలను అంతర్లీనంగా వివరించాడు.

‘చర్యకు ప్రతిచర్య / హింసకు ప్రతిహింస/ అనివార్యం అది/ ప్రకృతి ప్రాణసూత్రం/ చేజేతులా మీ/ చేతల వల్ల/ జరుగుతున్న పాతకాలకు, ఘాతుకాలకు/ ప్రతిఘాత తీవ్రత/ ఏ స్థాయిలో ఉంటుందంటే/మీ ఊహకు అందదు/ అందినప్పుడు మీరుండరు’’ (అశోక్‌ తేజ, సుద్దాల.నేను అడవిని మాట్లాడుతున్నాను. పుట:107)

ఇదే ఈ భూమ్మీద మానవుడు సంపాదించే ప్రధాన ఆస్తి. అన్నింటి నుండి మనిషి తన పరిజ్ఞానం వల్ల తప్పించుకోవచ్చు కానీ, ప్రకృతి నుండి, ప్రకృతికి తను చేసిన హింసాత్మకత నుండి మాత్రం తప్పించుకోలేడు.

వర్తమానంలో ప్రకృతి మనిషి సంబంధాన్ని గురించి లోతయిన అవగాహన ఈ కవికి వుందనటానికి ఈ కవితలో అనేక సందర్భాలు సాక్ష్యం. అడవిని మెటఫర్‌ చేసుకొని ఈ కవి వర్తమాన సమాజాన్ని అనేక రూపాల్లో ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నల వెనుక మనిషికి ప్రకృతికి విడదీయరాని సంబంధం వుండేదని, అది ఇవ్వాళ విచ్ఛిన్నమయిందని, ఈ విచ్ఛిన్నతకు కారణం మనిషేననే స్పృహ అంతర్లీనంగా వుంది. అలాగే ఏది జ్ఞానం అనే విషయంలో కూడా స్పష్టత వుంది. వర్తమానంలో పర్యావరణాన్ని గురించి జరుగుతున్న చర్చల సారాన్ని కొంతవరకు ఈ కవి తన కవిత్వంలో భాగం చేశారు. మనిషి తనకు ప్రకృతికి మధ్య సృష్టించిన ధ్వంసం అంతిమంగా ప్రకృతిని ధ్వంసం చేయటమే కాకుండా మనిషికున్న సహజ స్వభావాన్ని కూడా ధ్వంసం చేసింది.

3. ఉపసంహారం

  • అంతా అడవి నుంచే తీసుకున్న మనిషి తిరిగి చెల్లించింది ఎంత? ప్రకృతి వినాశనం అవుతుంది అందుకే కవి...‘చెట్టు చెట్టుకో/ ఆధార్‌ కార్డ్‌/ అడవి అడవికి ఒక/ ఆరోగ్య శ్రీ అని/ మీ చట్టసభలో పెట్టరేంటి’’ అని ఈ సభ్య సమాజాన్ని నిలదీస్తున్నాడు. ‘ఒక హృదయం కోసం/ అడవిని పోషించే ప్రభుత్వం కోసం’ కవి ఎదురు చూస్తుంటాడు. ‘ఏ పరిశోధనైనా/ ఏ పురోగమనమైనా/ అరణ్యం అంగీకరించే/ పర్యావరణం పరవశించే’’ విధంగా ఆవిష్కరింపబడాలి. 
  • ప్రకృతికి మనిషికి మధ్య సంబంధాలు ఎలా బలహీనపడుతున్నాయో చర్చించడమే ప్రధాన ఉద్దేశం.
  • కవి రచనల్లో గిరిజన తత్వం, గిరిజన స్పృహ కనిపిస్తుంది.
  • పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని కవి కోరుకుంటాడు.
  • వీటిని ఆధారంగా చేసుకొని అశోక్‌ తేజ అడవితో మాట్లడడానికి ఒంటరిగా బయలుదేరి, నికర్సయిన మానవతా వాదాన్ని ప్రకటించుకున్నాడు. వీరి రచల పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పల్లె బతుకు చిత్రణ, తెలంగాణ గిరిజనులు సామజిక దృష్టి కోణం, శ్రామిక కావ్యం - కవితా సౌదర్యం అనే దృక్పధంతో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందనేది నా భావన. 
  • మానవాళికి నిత్య నూతనమైన పర్యావరణ కావాలని ఈ సమాజానికి ఒక సమాచారాన్ని ఇద్దాం. అడవితో మాట్లాడడానికి వెళ్ళిన మీరు..తిరిగి రండి..ఈ అడవిని, ఈ ప్రపంచ ప్రకృతి సంపదను కపాడుదాం.మానవత్వం తెలిసిన మనుషులుగా ఆనందంగా జీవిద్దాం.

4. ఉపయుక్తగ్రంథసూచి

  1. అయిలయ్య, బన్న. ధార. వరంగల్: నానీ ప్రచురణలు, 2020.
  2. అరుణ కుమారి, జి. తెలుగు కవిత్వం భవిష్యద్దర్శనం. హైదరాబాద్‌:యునివర్సిటి ఆఫ్ హైదరాబాద్‌, 2009.
  3. అశోక్‌ తేజ, సుద్దాల. నేను అడవిని మాట్లాడుతున్నాను. హైదరాబాద్‌: ఎమెస్కో  ప్రచురణ, 2021.
  4. కాత్యాయని, విద్మహే. సాహిత్య ఆకాశంలో సగం. వరంగల్: స్త్రీ జనాభ్యు దయ అధ్యయన సంస్థ,  2010.
  5. నారాయణ రెడ్డి, సి. ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలు. హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లిక్ హౌస్, 1977.
  6. రమేష్, జరుపుల. అతడు అడవిని కలగన్నాడు. ఖమ్మం: ఆదిత్య ప్రచురణ, 2014.
  7. లక్ష్మణ చక్రవర్తి, సిహెచ్. సంపమారాచార్య, కోవెల. (సం) తెలుగు సాహిత్య విమర్శ దర్శనం. హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2016.
  8. లక్ష్మీకాంతం, పింగళి.  సాహిత్య శిల్ప సమీక్ష. హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లిక్ హౌస్, 1966.
  9. వెంకటేశ్వరరావు, దార్ల. వీచిక (సాహిత్య విమర్శ వ్యాసాలు). హైదరాబాద్‌: ప్రజాశక్తి ప్రింటింగ్ ప్రెస్, 2009.
  10. వేణు, భగవాన్. ది ఫైర్. విజయవాడ: క్లాసిక్ బుక్స్, 2019.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]