AUCHITHYAM | Volume-06 | Issue-08 | July 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
3. నంది వనపర్తి దేవాలయాలు : చారిత్రకాంశాలు
డా. సి. వి. పవన్ కుమార్
సహయ ఆచార్యులు, కళాశాల విద్య,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇబ్రహీంపట్నం,
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
సెల్: +91 9912356769, Email: drcvpavan@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 06.06.2025 ఎంపిక (D.O.A): 30.06.2025 ప్రచురణ (D.O.P): 01.07.2025
వ్యాససంగ్రహం:
రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో ఒక గ్రామమే నంది వనపర్తి. గ్రామంలో పురాతన దేవాలయాలయాలైన సిద్దేశ్వరాలయం, నందిశ్వరాలయంతో పాటుగా, జ్ఞాన సరస్వతి దేవి ఆలయం, చెన్నకేశవ ఆలయం, పోచమ్మ ఆలయాలు కొలువుతీరి అందరిని ఆకట్టుకొంటూ ఒక ప్రత్యెక ఆకర్షణగా ఉన్నాయి. సిద్దేశ్వరాలయ నిర్మాణశైలి చాళుక్యుల కాలం నాటిదిగా గుర్తించవచ్చు. ఈ గ్రామంలోని కోనేరులు, ఏకవీర శిల్పాలు దాని చారిత్రకతను తెలియచేస్తున్నాయి. అయినప్పటికి అవి తగిన ప్రాచుర్యానికి నోచుకోలేదు. వీటిపైన ఇప్పటివరకు ఎలాంటి సమగ్ర పరిశోదనలు జరుగలేదు. పూర్వపరిశోదనలు పెద్దగా జరగనందున తగిన సాహిత్యం కూడా వెలువడలేదు. దేవాలయాల వాస్తు నిర్మాణాలను, వాటి పుట్టుపూర్వోత్తరాలను వెలికితీయడమే ఈ పరిశోధనపత్రం ముఖ్యోద్దేశం. క్షేత్ర స్థాయి పర్యటన ద్వారా దేవాలయ పూజారి, ఇతర గ్రామస్థుల నుంచి సేకరించిన ప్రాధమిక సమాచారం ఆధారంగా ఈ పరిశోధక పత్రాన్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా అక్కడి ఆలయ వాస్తు కళావైభవాన్ని వివరిస్తూ, ఈ గ్రామాన్ని మంచి పర్యాటకకేంద్రంగా తీర్చి దిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించడం ద్వారా వాటికి ప్రాచుర్యం వచ్చేలా చేయడం మనం ఆశించగల ఫలితం.
Keywords: నంది వనపర్తి, దేవాలయాలు, సంస్కృతి, చాళుక్య శైలి
1. ప్రవేశిక
తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాకు చారిత్రకంగా, సంస్కృతి పరంగా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ జిల్లాలో చారిత్రక ఆనవాళ్లు నేటికీ బయటపడుతూనే ఉన్నాయి. అనాది నుంచి నేటి వరకు ఎంతో ఘన చరిత్రను తనలో ఇముడ్చుకొని ఒక ప్రత్యేకతను సంతరించుకొంది రంగారెడ్డి జిల్లా. చారిత్రక ప్రదేశాలతో పాటు ఆధ్యాత్మికతను, ఆహ్లాదాన్ని పంచే ఎన్నో పర్యాటక ప్రదేశాలకు నెలవుగా, తెలంగాణా చరిత్రకు, సంస్కృతులకు నిలయంగా ఉంది. ఈ జిల్లాలోని యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో ఎన్నో చారిత్రక అవశేషాలు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఉంటూ తెలంగాణా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆ గ్రామంలో నెలకొని ఉన్నా పురాతన దేవాలయాల గురించి చర్చించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.
2. నంది వనపర్తి విశేషాలు
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఒక గ్రామమే నంది వనపర్తి. హైదరాబాదుకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోనూ, ఇబ్రహీం పట్నంకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే హైదరాబాదు నుంచి నాగార్జున సాగర్ హైవే మార్గంలో వచ్చే యాచారం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామములో 101 నందులు కొలువుతీరి నందున గ్రామానికి ఆ పేరు వచ్చిందని స్థానిక కథనం. వాస్తవానికి అన్ని నందులు మనకి ప్రత్యక్షంగా కనిపించకపోయినా, పంట పొలాల్లో అక్కడక్కడా కనిపిస్తున్ననంది విగ్రహాలు, గ్రామంలో గృహ నిర్మాణ పునాదుల సమయంలో అక్కడక్కడా బయల్పడుతున్న నంది విగ్రహ శిథిలాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. నంది వనపర్తి గ్రామంలో నందీశ్వరాలయం, ఓంకారేశ్వరాలయం, సిద్ధేశ్వరాలయం, జ్ఞాన సరస్వతి దేవి ఆలయం, చెన్నకేశవ ఆలయం, పోచమ్మ దేవాలయాలతో పాటుగా రెండు కోనేరులు కొలువు తీరి ఉన్నాయి. అలాగే చారిత్రక ఆనవాళ్ళకు నిదర్శనంగా నిలిచే వీరగల్లు విగ్రహాలు కూడా ఈ గ్రామంలో ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి నందీశ్వర దేవాలయం పేరు మీదుగానే గ్రామ ఈ గ్రామానికి నంది వనపర్తి అనే పేరు సార్ధకమైంది.
3. దేవాలయాల ప్రాముఖ్యం
భారత దేశ చరిత్రలో దేవాలయాల పాత్ర
అనిర్వచనీయం. ఇవి భూ స్వామిగా, యజమానిగా, సరుకులు-సేవల వినియోగదారునిగా, బ్యాంకుగా, పాఠశాలగా, వస్తు
ప్రదర్శనశాలగా, రంగస్థలంగా ఒక్క మాటలో చెప్పాలంటే అత్యుత్తమమైన కళలు` నాగరికతకు సంబంధించిన
కేంద్రబిందువులుగా, ధర్మబద్ధమైన మానవతా విలువలకు ప్రతీకగా, వాటిని నియంత్రించే సాధనాలని ఉటంకించిన
ప్రముఖ చరిత్రకారులు నీలకంఠశాస్త్రి వ్యాఖ్యలు అక్షర సత్యాలు.1 ఈ
నేపథ్యంలో తెలంగాణా చరిత్రలో కూడా దేవాలయాలకు ఒక ప్రత్యేక స్థానం వుంది. ప్రాచీన కాలం నుండి ఎన్నో
అద్భుత దేవాలయాలకు తెలంగాణా వేదిక అయింది. ముఖ్యంగా కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు నిర్మించిన ఎన్నో
దేవాలయాలు వారి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నేటికీ నిలిచి ఉన్నాయి.
4. నంది వనపర్తిలోని ప్రధాన దేవాలయాల సంక్షిప్తచరిత్ర
నంది వనపర్తి గ్రామంలో అనేక దేవాలయాలు కొలువై
ఉన్నాయి. వాటిలోనందీశ్వరాలయం, ఓంకారేశ్వరాలయం, సిద్ధేశ్వరాలయం, జ్ఞాన సరస్వతి దేవి ఆలయాలు ముఖ్యమైనవి.
గ్రామా దేవతగా భావించే పోచమ్మ దేవాలయం కూడా వుంది. ఆలయాల విశేషాల గురించి సంక్షిప్తoగా
తెలుసుకొందాము.
4.1 నందీశ్వరాలయం
నంది వనపర్తి పేరుకు సార్థకంగా నిలిచే
దేవాలయమే నందీశ్వరాలయం. ఈ గుడి కాకతీయుల కాలం నాటిదని గ్రామస్తుల విశ్వాసం. ఈ దేవాలయం ఆవిర్భావం
వెనుకఉన్న ఐతిహ్యం ప్రకారం పూర్వం ఓ గోవు ప్రతిదినమూ ఒక రైతు పొలంలో చేను మేస్తుండేదని, దీంతో
ఆగ్రహానికి గురైన రైతు కర్రతో దాన్ని బలంగా చితకబాదితే, కాలుకి తీవ్ర గాయమై గెంటుతూ వచ్చి ప్రస్తుత
దేవాలయం ఉన్న ప్రదేశంలోనే శిలగా మారిందట. అలా నందీశ్వరుడు స్వయంభువుగా వెలిశాడని గ్రామస్తుల
నమ్మకం.2 కాల గమనంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని 1967లో అప్పటి
తహశీల్దార్ పల్లా నాగేందర్ చూసి ఆశ్చరపోయాడట. అక్కడ లభించిన సుందరమైన, కళాత్మకమైన శిల్ప కళా
వైభవాన్ని, నంది విగ్రహాన్ని చూసి దేవాలయ పునరుద్ధరణకు పూనుకున్నారు.3 ఆలయం వెలుపల వైపు
ఆంజనేయ స్వామి, వినాయకుడు, కార్తికేయుడు లాంటి విగ్రహాలను ఉంచారు. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి
శివరాత్రికి ఇక్కడా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆలయ నిర్వహణ బాధ్యతల్ని పల్లా
నాగేందర్ వంశీయులే పర్యవేక్షిస్తున్నారు.4
ఆలయ వాస్తు విశేషాలు
నందీశ్వరాలయంలో లభించిన ఆధారాల పరంగా ఇది కాకతీయుల పూర్వకాలానికి అంటే చాళుక్యుల కాలంలో నిర్మితమై, కాకతీయుల కాలంలో మార్పులకు గురైనట్లు తెలుస్తోంది. గుడి ప్రధాన ద్వారం మెట్ల దగ్గర కనిపించే శిథిల శిల్పాలు, నాలుగు దళాల పద్మాలు ఖచ్చితంగా చాళుక్య యుగానికి చెందినవిగా గుర్తించవచ్చు.
ఈ నందీశ్వరాలయం 12 స్తంభాలతో పునర్నిర్మితమయింది. కాలగమనంలో భద్రత దృష్ట్యా ఈ స్తంభాలకు ఇనుపచువ్వలతో కంచెను ఏర్పాటు చేశారు. ఇక్కడి నందికి ఎదురుగా ఎతైన అధిష్టానంపై ఒక పెద్ద శివలింగం కొలువు తీరి ఉంది. దీని వెనక భాగంలో ఏర్పాటు చేసిన గర్భగుడిలో అమ్మవారు దర్శనమిస్తారు. బహుశా పురాతన దేవాలయ గర్భగృహం పూర్తిగా శిథిలమైపోయి, వాటి ఆనవాళ్లు లభించక దీనిని మామూలు చతురస్రాకారంలో నిర్మించినట్లు అర్ధం చేసుకోవచ్చు. దీనికి విమానం లాంటి నిర్మాణం ఏమీలేదు.
నందీశ్వరాలయంలో కొలువు తీరిన నంది విగ్రహం
చాలా కళాత్మకంగా మలచబడి ఉంది. కాకతీయుల, చాళుక్యుల కాలంలో విరివిగా మలచబడిన భారీ నందుల విగ్రహాలో
పోలిస్తే పరిమాణంలో ఇది చిన్నగా ఉండటంతో చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. సుమారు రెండు అడుగుల ఎత్తు
ఉన్న అధిష్టానపీఠంపై నాలుగడుగల నందిని మనం గమనించ వచ్చు. నంది విగ్రహంపై చెక్కిన గొలుసులు, గంటలు,
ఆభరణాలు అత్యంత రమణీయంగా ఉన్నాయి. ముందరవైపు ఒక కాలు ఎత్తి, దూకడానికి సిద్ధంగా ఉండే విధంగా మలిచిన
కాకతీయుల నంది విగ్రహాల లాగే ఇది కూడా ఉంది. ప్రతి శివరాత్రికి ఇక్కడ ప్రత్యెక ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఈ సందర్భంలో ఇక్కడ జరిగే జాతర బాగా ప్రసిద్ది చెందినది.
4.2 సిద్ధేశ్వరాలయం
నంది వనపర్తి గ్రామంలో అత్యంత పురాతనమై ఆలయం సిద్ధేశ్వరాలయం. నిర్మాణశైలి ఆధారంగా అది కళ్యాణిచాళుక్యుల కాలంలో ప్రారంభమై తర్వాత కాకతీయుల కాలంలో మార్పులకు లోనైనట్లు కనిపిస్తోంది. ఒకే ముఖ మండపానికి రెండు లేదా అంతకన్నా ఎక్కువ గర్భ గృహాలను నిర్మించడం ఖచ్చితంగా చాళుక్య శైలిలో కన్పించే ఒకానొక ప్రధాన లక్షణం. మండపాలు చిన్న పరిమాణంలో ఉండటం (స్తంభాల సంఖ్య ఆధారంగా) కూడా వారి లక్షణమే.5 ఈ దేవాలయంలో మనకి రెండు విమానాలు స్పష్టంగా కనిపించడాన్ని బట్టి రెండు దేవతామూర్తులు కొలువైనట్లు భావించవచ్చు. సిద్ధలింగేశ్వరుడు కొలువుతీరిన గర్భగృహంలో శివలింగం భూమికి ఆనుకొని (శ్రీశైలం లాగా) ఉంటుంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఎత్తైన పానవట్టం గల శివలింగాలకు ఇదిభిన్నంగా ఉంది. గర్భగుడిలో ఒక మూల చిన్న తొట్టి ఉంది. దీనిపై సర్పం ప్రతిమను గమనించ వచ్చు. బహుశా ఇది అభిషేకం జలంను నిల్వచేసుకోవడానికి వినియోగించినట్లు అర్థమవుతోంది. ఒక దేవతా మూర్తి విగ్రహంను గర్భగుడిలో ఒకపక్కగా నిలబెట్టారు. మూలవిరాట్ పై కప్పు ఆకర్షణీయంగా మలచబడి ఉంది.
ఈ దేవాలయ ప్రధాన దేవతా మూరైన సిద్ధలింగేశ్వర స్వామి స్వయంభువు. ఈ దేవతా మూర్తి కొలువు తీరిన గర్భగుడి ప్రధాన ద్వారాలపై శైవ ద్వార పాలకులు కొలువుతీరి ఉన్నారు. వీరితో పాటుగా వింజామరలు వీస్తున్న ఛామధారిణిల ప్రతిమలను కూడా గమనించవచ్చు. ఇక్కడే మలచబడిన పూర్ణకుంభం ప్రతిమ దేవాలయంలోకి పరిపూర్ణ స్వాగతం పలుకుతున్న అర్థంలో చెక్కి ఉండవచ్చు. చాళుక్య శిల్ప కళా రీతిలో సర్వ సాధారణముగా కన్పించే సంగీత వాద్యాలు, కళాకారుల ప్రతిములు, అలంకరణలు ఇక్కడ కనిపించలేదు.
ఈ ఆలయంల 24 స్తంభాలు గల ముఖమంటపము ఉంది. మూడు గర్భగుడులు తూర్పు ముఖంగానూ, నాల్గవది (ఇది నూతనంగా నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తోంది) దక్షిణ ముఖంగానూ ఉంది. సిద్ధ లింగేశ్వర గర్భ గుడికి కుడి వైపున, అమ్మవారిదిగా భావించే మరో గర్భగుడి ఉంది. దీనిలో కేవలం అధిష్టాన పీఠం మాత్రమే ఉండి, ఎలాంటి దేవతా విగ్రహాలు లేవు. ప్రధానమైన ఈ రెండు గర్భ గుడులకు ఎదురుగా కొంచెం ఎతైన రెండు వేదికలు కలవు(రంగ మంటపం లాంటివి). బహుశా వీటిని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు వినియోగించి ఉండవచ్చు. దీనికి ఆనుబంధంగా ఉన్న మరో గర్భగుడి లాంటి నిర్మాణం పూజాసామాగ్రి దాచుకొనేందుకో, లేక వంట గదిగానో వినియోగించినట్లు తెలుస్తోంది. ముఖ మంట పాన్ని ఆనుకొని దక్షిణ దిశ ద్వారంగా నిర్మితమైన నాల్గవ గర్బగుడిని (బాణ లింగం6) తరువాతి కాలంలో నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కుతుబ్‌షాహీల కాలంలో అక్కన్న, మాదన్నలు ఈ దేవాలయాన్ని కొంత మేర అభివృద్ధి చేశారని దేవాలయ వంశపారం పర్య పూజారి శ్రీ సురేందర్ గారు తెలిపారు. తనను తొమ్మిదో తరం వాడిగా చెప్పుకొన్నాడు.6 సిద్ధలింగేశ్వర లింగం ప్రతి ఏట దాని పరిమాణంలో కొంచెం పెరుగుతుందని ఆయన చెప్పారు.7 ఆలయం ఆవరణలో వెనుక వైపు వైవిధ్యభరితమైననాగ శిలల విగ్రహాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి మహిళా కృతిని, కొన్నింటికి పురుషాకృతిని జోడిరచి శిల్పాలుగా మలిచారు. సంతానం కోరే భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, తమ కోరికలు తీరిన తరువాత శిలా ప్రతిష్ఠలు చేపడుతారని ఆయన తెలిపారు.
దేవాలయ ముఖ మంటపం ముందర వైపు,
శిలాధ్వజస్తంభానికి చేరువలో ఒక శిలాశాసనం కలదు. ఈ శిల కొంత భాగం విరిగిపోయింది. ఈ లిపి పరిష్కరింప
బడనప్పటికీ ఇది క్రీ.శ 11 నుంచి 13 శతాబ్దాల మధ్య లిపిగా గుర్తించడం జరిగింది. ఈ దేవాలయానికి ముందర ఉన్న
కోనేరు అపరిశుభ్రముగా, పూర్తిగా నిర్లక్ష్యంకు గురైనట్లు కనబడుతోంది.
4.3 ఓంకారేశ్వరాలయం
నంది వనపర్తి గ్రామం మధ్యలో ఉన్న ఆలయమే
ఓంకారేశ్వర ఆలయం. ఇది కూడా దాదాపు వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. తపస్వి స్వామి యోగానంద
సూచనలతో పప్పు వెంకయ్య ఈ దేవాలయం నిర్మాణానికి పూనుకొని, నిధులు సేకరణకు శ్రమించారట. గతంలో ఇక్కడ 100
స్తంభాల గుడి ఉండేదని గ్రామస్తుల కథనం. అయితే ఈ దేవాలయంను పునరుద్ధరించే క్రమంలో పురాతన ఆనవాళ్లు దాదాపు
కనుమరుగయ్యాయి. ఈ దేవాలయానికి 1471 ఎకరాల దేవాలయ భూములు ఉండటం
చాలావిశేషం.8 ఆలయంలో శివపార్వతులు, సీతారామంజనేయులు కొలువు
తీరియున్నారు. ఈ దేవాలయం ఎదురుగా నాలుగు కాళ్ల మంటపం, పురాతన కాలభైరవ విగ్రహం, శిథిలమైన కోనేరు
ఉన్నాయి. కోనేరును తక్షణమే శుభ్రపరిచి దానిని వినియోగంలోకి తీసుకురావాలి.
4.4 జ్ఞాన సరస్వతి ఆలయం
నంది వనపర్తిలో నూతనంగా నిర్మించిన దేవాలయమే
జ్ఞానసరస్వతి ఆలయం. ఈ దేవాలయంలోని సరస్వతి మూల విరాట్‌ను హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య
భారతీ స్వామి వారు ప్రతిష్ఠించారు. ఏటా వసంతపంచమి రోజు సామూహిక అక్షరాభ్యాసాలను ఎంతో ఘనంగా నిర్వహించడం
ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయం ఓంకారేశ్వర ఆలయం పక్కనే, గ్రామం మధ్యలో కొలువు తీరి ఉంది.
4.5 పోచమ్మ దేవాలయం
సిద్ధలింగేశ్వర దేవాలయానికి చేరువలో గ్రామ
దేవతగా భావించే పోచమ్మ ఆలయంకూడా ఉంది. దీనికి ఎలాంటి పక్కా నిర్మాణాలులేవు. కొన్ని వర్గాల ప్రజలు
వివాహానంతర మొక్కలు ఇక్కడ తీర్చుకొంటారని గ్రామస్థులు తెలిపారు. వీటి ముందర చెట్ల పొదల్లో వీరగల్లు
శిల్పాలు ఉన్నాయి. ఈ గ్రామంలో చెన్నకేశవ ఆలయం కూడా ఉండటం విశేషం. ఇవే కాకుండా ఈ గ్రామంలో శిధిలమైన
గడిలు, పురాతన చెరువులు లాంటి చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు ఇప్పటికి సజీవ సాక్ష్యాలుగా
ఉన్నాయి.
5. ఉపసంహారం
- పై పరిశోధన ద్వారా నంది వనపర్తిలోని పురాతన దేవాలయాలను, వాటి చరిత్రను పునర్నిర్మించే ప్రయత్నం జరిగింది.
- ముఖ్యంగా నందీశ్వరక్షేత్రం, సిద్దేశ్వరాలయంలు చాళుక్యుల కాలంలో నిర్మింపబడి, కాకతీయుల కాలంలో మార్పులకు లోనైనట్లు తెలుస్తోంది.
- సిద్దేశ్వరాలయానికి అక్కన్న మాదన్నల కాలంనుంచి మరింత తోడ్పాటు లభించిందని ఆ దేవాలయ ; పూజారి ఉపేందర్ తెలిపారు.
- నంది వనపర్తిలో కొలువు తీరి ఉన్న రెండు కోనేరులు పూర్తి నిర్ల్యక్షానికి గురై అపరిశుబ్రంగా ఉన్నాయి. వీటిని తక్షణమే బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- అలాగే నంది వనపర్తి దేవాలయంలో లభ్యమవుతున్న శిలాశాసనంలోని లిపిని పరిష్కరించినట్లయితే మనకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఈ దిశగా భావి పరిశోధనలు జరగాలి.
- తెలంగాణా సంస్కృతీ, సంప్రదాయల వారసత్వంగా నేటికీ కొనసాగుతున్న నందివనపర్తిలోని చారిత్రక సంపదను జాగ్రత్తగా కాపాడుకుంటూ వాటిని మరింత అభివృద్ధి పరచి, ప్రాచుర్యంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు స్థానిక పెద్దలతో సంప్రదించి తగిన కార్యాచరణ రూపొందించాలి.
6. సూచికలు
- నీలకంఠశాస్త్రి, కె.ఎ., ది చోళాస్, మద్రాసు విశ్వవిద్యాలయం,1955, పుట 654.
- సిద్దేశ్వరాలయ పూజారి సురేందర్ కథనం
- నందీశ్వర క్షేత్ర దేవాలయ వద్ద నున్న సమాచారం
- నందీశ్వర క్షేత్ర దేవాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం
- భారతీయ వాస్తు శిల్పం, తెలుగు అకాడెమీ ప్రచురణలు, హైదరాబాద్, 1990, పుట 140
- బాణలింగం సహజంగా ఏర్పడే ఒక రకమైన రాయి, బాణ లింగాలు ఎక్కువగా నర్మదా నది
- పరీవాహక ప్రాంతంలో దొరుకుతాయి
- సిద్దేశ్వరాలయ పూజారి సురేందర్ కథనం
- నంది వనపర్తి గ్రామపరిపాలనా అధికారి ధ్రువీకరించిన సమాచారం
7. ఉపయుక్తగ్రంథసూచి
- తెలంగాణా చరిత్ర, సంస్కృతి, తెలుగు అకాడమీ, హైదరాబాద్, 2015
- పరబ్రహ్మ శాస్త్రి, పి.వి. కాకతీయులు. (తెలుగు అనువాదం, జి.వి.రాజం, కె.చక్రపాణి, పి. చంద్ర శేఖర్ రెడ్డి)
- ప్రతాపరెడ్డి, సురవరం. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఓరియంట్ లాంగ్మెన్, హైదరాబాద్, 1992
- ప్రసాదరావు, పి.వి.కె. సమగ్రాంధ్రప్రదేశ్ చరిత్ర. ఎమెస్కో బుక్స్, హైదరాబాద్,1999
- భారతీయ వాస్తు శిల్పం. తెలుగు అకాడెమీ ప్రచురణలు, హైదరాబాద్, 1990
- రఘునాధరావు, పి. హిస్టరీ అండ్ కల్చర్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్. స్టెర్లింగ్ పబ్లికేషన్స్, 2021
- రామకృష్ణ, వకుళాభరణం. తెలంగాణా చరిత్ర. ఎమెస్కో బుక్స్, హైదరాబాద్, 2016
- శాస్త్రి, బి.ఎన్. ఆంధ్ర దేశచరిత్ర- సంస్కృతి (క్రీ.శ.1578- 1990 వరకు). మూడవ భాగం, మూసి పబ్లికేషన్స్, హైదరాబాద్.
- శివనాగి రెడ్డి, ఈమని. తెలుగు వారి వారసత్వం, ప్రజా శక్తి బుక్ హౌస్, విజయవాడ, 2016
- సత్యనారాయణ, ద్యావనపల్లి. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు. తెలంగాణా రిసోర్స్ సెంటర్, హైదరాబాద్, 2015
- సుబ్రమణ్యం, బండారు. తెలుగు నేల పై పురావస్తు పరిశోధనలు. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2012
- సైదులు, బి. దేవాలయం. రామకృష్ణ మఠం, హైదరాబాద్, 2017
- సోమసుందరరావు, సి. ఆంధ్రప్రదేశ్ సమగ్రచరిత్ర. సంస్కృతి, వాల్యూమ్4, మధ్యయుగం ఆంధ్రదేశం(క్రీ.శ 1000-1324) విశాలాంధ్ర, హైదరాబాద్, 2012
- సోమారెడ్డి, ఆర్. మధ్య యుగ ఆంధ్ర దేశంలో మత సంస్థలు. సుమతి పబ్లికేషన్స్, హైదరాబాద్, 2013
- హనుమంతరావు, బి.ఎస్.ఎల్. ఆంధ్రుల చరిత్ర, విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2012
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

