headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-06 | Issue-08 | July 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

2. ఆధునిక తెలుగు నవల : పర్యావరణ స్పృహ

(“A Study of Ecological Perceptions in Modern Telugu Literature (2014-2024)”
A Research Project under the PM - USHA Scheme, Govt. of India.)

DOI

డా. వై. సుభాషిణి

అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు అధ్యయనశాఖ,
ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, PM - USHA రీసెర్చ్ ప్రాజెక్ట్
శ్రీ పద్మావతి మహిళావిశ్వవిద్యాలయం, తిరుపతి-2, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9000102394, Email: ysubha@spmvv.ac.in

కె. అశ్విని

లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, స్కూల్ ఆప్ ఇంజనీరింగ్ & టెక్నాలజి,
కో - ఇన్వెస్టిగేటర్, PM - USHA రీసెర్చ్ ప్రాజెక్ట్
శ్రీ పద్మావతి మహిళావిశ్వవిద్యాలయం, తిరుపతి - 2, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9703403881, Email: aswini.knani@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S):  19.06.2025        ఎంపిక (D.O.A): 29.06.2025        ప్రచురణ (D.O.P): 01.07.2025


వ్యాససంగ్రహం:

“ఒంటరి” , “మూగవాని పిల్లన గ్రోవి”, “అడవి బతుకులు”— మూడు నవలలు పర్యావరణ చైతన్యానికి వేదికగా నిలుస్తాయి. పర్యావరణ సమతుల్యతను, స్థిరమైన జీవనవిధానాన్ని స్థాపించే సందేశాల్ని ఒంటరినవల అందించింది. వర్షాలపై ఆధారపడి రైతులు జీవితం నడిపే విధానాన్ని చైతన్యవంతంగా ప్రతిబింబిస్తుంది మూగవాని పిల్లనగ్రోవి నవల. ఆదివాసీ జీవనవిధానంలో సహజ వనరుల పరిరక్షణనీ, అభివృద్ధి పేరుతో జరిగిన అడవుల ధ్వంసం, యురేనియం తవ్వకాలవల్ల జరిగే ప్రమాదాన్ని ప్రబలంగా విమర్శిస్తుంది “అడవి బతుకులు”నవల. ఈ మూడు నవలలు అభివృద్ధి పేరుతో సమాజంలో, ప్రకృతిలో, మానవసంబంధాల్లో జరిగిన మార్పులను ప్రతిబింబించడంతోపాటు, పర్యావరణ పరిరక్షణకు విజ్ఞాపనగా నిలుస్తాయి. ఆధునిక తెలుగు నవలల్లో పర్యావరణ సంబంధిత అంశాలను విశ్లేషించి, సమకాలీన సాహిత్యంలో ప్రకృతి, భూమి, నీటి మూలాల పట్ల రచయితల అభిగమనాన్ని గుర్తించడం; పర్యావరణ నాశనానికి వ్యతిరేకంగా వచ్చిన సాహిత్య స్పందనను, జీవవైవిధ్యం, నీటి కొరత, భూసంపత్తుల దుర్వినియోగం వంటి అంశాలను పాఠకుల దృష్టికి తీసుకురావడం వ్యాసరచన ముఖ్య ఉద్దేశం. ఆధునిక తెలుగు నవలలు సామాజిక బాధ్యతను భుజాలపై వేసుకొని పర్యావరణ సమస్యలపై చైతన్యాన్ని కలిగించగలవు. సాహిత్యం ప్రకృతి పరిరక్షణకు కేవలం ప్రతిబింబం మాత్రమే కాదు, మార్గదర్శక సాధనమయ్యే శక్తి కలిగి ఉంది. గ్రామీణ జీవితం, ఆదివాసీ సమాజం, రైతు పరిస్థితుల చిత్రణద్వారా రచయితలు పర్యావరణ మార్పులపై తీవ్ర వ్యతిరేకతను వివరించడం ఈ వ్యాసరచనకు ఊహా ప్రణాళిక. పై మూడు నవలల పూర్తి పాఠ్యాన్ని విశ్లేషించడం., సాహిత్య విమర్శాపద్ధతులు- నవలల్లో కనిపించే పర్యావరణబింబాలు, రూపకాలు, వర్ణనలు, పాత్రల అభివృద్ధి మొదలైన అంశాలను పర్యావరణ దృక్పథంతో పరిశీలించడం; తులనాత్మక విశ్లేషణ- మూడు నవలలలోని పర్యావరణ భావనలను పరస్పరం పోల్చి తేడాలు, సామ్యాలను గుర్తించడం ఈ వ్యాస రచనకు అనుసరించిన పరిశోధనా పద్ధతి. పత్రికావ్యాసాలు, పునఃసమీక్షలు, రచయితల స్వీయవ్యాఖ్యలు మొదలైనవి ఈ పరిశోధనకు ద్వితీయ ఆకరాలు. ఈ వ్యాసం ద్వారా పాఠకులు, పరిశోధకులు పర్యావరణంపట్ల తెలుగుసాహిత్యం ఎలా స్పందించిందో, ఎలాంటి మార్గాలు సూచించిందో గ్రహించగలరు. సాహిత్యం ఒక సామాజిక ఆయుధంగా ఎలా పనిచేస్తుందో స్పష్టమవుతుంది. నవలలద్వారా ప్రకృతి పరిరక్షణకు చైతన్యం ఎలా వెలువడుతుందో తెలుసుకోవచ్చు. పర్యావరణ నాశనంవల్ల గ్రామీణ జీవనవిధానం, ఆదివాసీ సంస్కృతి, వ్యవసాయం ఎలా ప్రభావితమవుతున్నదీ మనకు తెలుస్తుంది. ఈ అధ్యయనం ఆధునిక తెలుగు నవలలు ప్రకృతిపట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నాయో, వాటిలో వ్యక్తమైన చింతన, ప్రతిస్పందన, విమర్శ ఎంత సమగ్రంగా ఉందో తెలియజేస్తుంది.

Keywords: పర్యావరణం, తెలుగు నవల, ఒంటరి, మూగవాని పిల్లనగ్రోవి, అడవి బతుకులు, ప్రకృతి దృక్పథం, జీవవైవిధ్యం, భూమి దుర్వినియోగం, సామాజిక బాధ్యత, పర్యావరణ చైతన్యం, ఆదివాసీ జీవనశైలి, పర్యావరణ నాశనం, ప్రకృతి పరిరక్షణ

1. ప్రవేశిక

ఆధునిక ప్రపంచంలో అనేకరంగాల్లో మార్పులు వచ్చినట్లుగానే పర్యావరణంలోనూ ఎన్నో మార్పులు సంభవించాయి. యాంత్రికత పెరిగిపోయి ప్రకృతి కలుషితమవుతోంది. మనిషి మితిమీరిన స్వార్థంతో ప్రకృతిని వికృతిగా చేస్తూ, సృష్టిలోని సమతుల్యతను వినాశనం చేస్తున్నాడు. సహజవనరులను విచక్షణారహితంగా ఉపయోగించుకొంటూ పర్యావరణ కాలుష్యానికి కారకుడవుతున్నాడు. దీనికి స్పందించిన ఎందరో రచయితలు సమకాలీన సాహిత్యంలో పర్యావరణ సమస్యలను ముఖ్యాంశాలుగా మార్చుకొన్నారు. అందులో ఆధునిక తెలుగు నవల ఈ సామాజిక బాధ్యతను అనుసరించి ప్రకృతి పరిరక్షణ, అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రకృతి నాశనాన్ని విమర్శించడంలో విశిష్టంగా నిలుస్తోంది.

2. ఆధునిక తెలుగు నవల : పర్యావరణ స్పృహ

ఈ కోణంలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, డా. కేశవరెడ్డి, డా. దిలావర్ గార్లు రచించిన "ఒంటరి", మూగవాని పిల్లనగ్రోవి, అడవి బతుకులు నవలలు ప్రధానంగా నిలుస్తాయి. ఇవి మూడూ ఒక ప్రత్యేకమైన శైలిలో పర్యావరణ చైతన్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అంతరించిపోతున్న తృణధాన్యాలను, రైతును కళ్ళకు కట్టించడమే కాదు, వాటిని కాపాడుకోవాలనే విషయాన్ని సమపాళ్లలో చాటిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల "ఒంటరి" కాగా, వర్షాలులేక పంటలు పండక బీడుగా మారిపోతున్న పొలాలని తిరిగి సాగులోకి తేవాలని ఒక రైతుపడే ఆవేదనను తెలిపే నవల డా. కేశవరెడ్డి రాసిన "మూగవాని పిల్లన గ్రోవి". యురేనియం నిల్వల తవ్వకాల వలన భూమి ధ్వంసమయ్యే పరిస్థితులను వివరిస్తూ డాక్టర్ దిలావర్ "అడవి బతుకులు" (ఆదివాసీ నవల) రాశారు. ఈ మూడు నవలలు మూడుకోణాల్లో పర్యావరణ చైతన్యాన్ని ఆశిస్తున్నాయి.

2.1 "ఒంటరి" నవల - పర్యావరణ స్పృహ

ఒంటరి - రాఘవ అనే వ్యక్తి పేరు గడించిన హృద్రోగ నిపుణుడు. ఇతనికి షుగర్ వ్యాధి వచ్చింది. అందరి లాగానే రాఘవ కూడా ఆధ్యాత్మిక చింతనలో భాగంగా బ్రహ్మంగారి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ దైవదర్శనం అయ్యాక, ఒక సాధువును కలిశాడు. తన వ్యాధికి విరుగుడు ఆరికల భోజనం, ప్రకృతిలో స్వచ్ఛమైన జీవనం అవసరమని చెప్పాడు సాధువు, ఈ ఆరికల పంటను ఎవరూ పండించక పోవటం వలన అవి కనుమరుగై పోయాయి. అయితే నర్సయ్య అనే రైతు తృణ ధాన్యాలన్నింటినీ ముందుతరాలకి అందించాలనే ఆశయంతో, ప్రకృతితో మమేకమై జీవనం సాగిస్తున్నాడని తెలుసుకొన్నాడు. రాఘవ అతని దగ్గరికి వెళ్ళి, ఆరికల గురించి అడిగాడు. నర్సయ్య ఇంట్లో పైన అటకమీద ఆరికలను తీసి చూపాడు. వాటిని పొలంలో చల్లి పండించి ఇస్తానన్నాడు. ఇది ఆరునెలల పంట. ఈ ఆరునెలలు రాఘవ, నర్సయ్య కుటుంబంలో ఒకడిగా జీవనం సాగించాడు. ఈ వ్యవధిలో అతడికి నర్సయ్య ప్రకృతి పాఠకుడిగా, రాఘవ అభ్యాసకుడిగా చెట్లు, పక్షుల రకాలను, పండ్ల రకాలను తెలుసుకున్నాడు. డబ్బుతో కొనలేనివి కూడా ఉంటాయని తెలుసుకున్నాడు. ఆరికలు బాగా పెరిగి, పంటకు వచ్చింది. కోసే సమయానికి గొర్లమంద పొలంలో పడి కోత కోసినట్లుగా మేసి ధ్వంసం చేశాయి. దాంతో రాఘవ నిరాశ చెందాడు. తర్వాత వర్షం రావడంతో నర్సయ్య యూరియా మందును ఆరికకు పెడితే తిరిగి మొక్క పెరిగి పంట వస్తుందని వేశాడు. అది నిజంగానే పెరిగి ఆరిక పంట అయింది. పంటను తీసుకొని రాఘవ తిరిగి వెళ్లాలి. కానీ తాను ఆ ఊరితో పెంచుకున్న అనుబంధంతో వెళ్లలేకపోయాడు. ఒంటికొట్టంలో ఆర్థిక ఇబ్బందుల వలన ఊరిజనాలు చెట్లను అమ్ముకుంటుంటారు. ఈ ప్రక్రియను ఆపడానికి రాఘవ తానే డబ్బులిచ్చి ఆ చెట్లను కొన్నాడు. “The greatest threat to the environment is the thought of people that someone else will save it” (ప్రకృతిని రక్షించుకుందాం, పుట. 8 డా. తూములూరి రాజేంద్రప్రసాద్). అదే చేశారు రాఘవ. ప్రకృతి మాహాత్మ్యాన్ని గ్రహించిన ఈ ఆరు నెలలజీవనం అతని ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే నవల ఇతివృత్తం.

2.1.1 పర్యావరణంపై మానవుని పరివర్తన యాత్ర

ఒక వ్యక్తి జీవిత ప్రయాణం "ఒంటరి" నవల. నాగరికుడు, రైతు ఇద్దరివీ వేర్వేరు జీవితాలు. ప్రకృతినే సమూహంగా మార్చుకొన్నవారు ఒకరైతే, డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవన పోరాటంచేసి షుగర్ వ్యాధితో అంతరించిపోతున్న ఆరికల ధాన్యాన్ని వెదుక్కుంటూ తన స్వలాభంకోసం వచ్చి ప్రకృతిని అర్థం చేసుకొని అందులో భాగస్వామి అయిన వారు మరొకరు. డబ్బు, హోదా, పలుకుబడి ఇవ్వని ఆరోగ్యం ప్రకృతి అందించింది. ఇది గ్రహించలేని మానవుడు ఎన్ని పరుగులు తీసినా చివరికి ప్రకృతిలోనే తనకు కావాల్సినవి అందుకోగలడనే ఒక సత్యాన్ని, ఒక హెచ్చరికను చేసిన నవల “ఒంటరి”.
మధ్యలో ప్రకృతి, గ్రామీణ జీవన విధానం, అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం వంటి అంశాలను లోతుగా అన్వేషించింది. ఇందులో ఊరి చెట్లు, పల్లె భూములు మాత్రమే కాదు, అవి మానవ జీవితంతో కలిసిపోయిన జీవనస్రవంతిగా కనిపిస్తాయి. నాగరికత ముసుగులో మానవుడు శారీరక శ్రమను మర్చిపోతున్నాడు. నాగరిక పంటలపై మొగ్గు చూపుతున్నాడు. ఈ పంటలవల్ల రైతుకు అప్పులు, ప్రజలకు రోగాలు అనివార్యం అయిపోతున్నాయి తప్ప ఎలాంటి ప్రయోజనంలేదు. తృణధాన్య పంటలు చాలా పురాతనమైనవి. వాటివల్ల మానవుని ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది. ఇది తెలియని నేటి ప్రజలు వాటిని దూరం చేసుకొంటున్నారనే ఆవేదన రచయితలో వ్యక్తమవుతుంది.

2.1.2 ఆరికల పంట - పునరుత్థానం

నర్సయ్య ఆరికల పంట వేయడానికి పూనుకోగా, ఆ పంటకు అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానన్నాడు రాఘవ. దానికి నిరాకరించిన నర్సయ్య "పెట్టుబడిని పెద్దగా ఆశించే పైరు గాదులే సారూ ఇది, "ఫాస్పేట్ బెయ్యాల్సిన పన్లే..... పురుగు మందులు కొట్టాల్సిన పన్లే..... విత్తే దానికి పదనయితే సాలు..... పెరిగే దానికి ఒక వాన...... పండే దానికి ఇంగో వాన..... అంతే..... (పుట. 44) అన్న మాటలద్వారా తృణధాన్యాల పంటకు ఖర్చులేదు ఎలాంటి మందులు వాడాల్సిన అవసరమూ లేదన్న మాటలో అవి విషరహిత ఆహారమన్నది స్పష్టంచేశారు రచయిత.

నిజానికి రైతు ఈ పంటలను కేవలం తన స్వలాభంకోసమే పండించడు. ఈ పంటలు బరక నేలల్లో పండుతాయి. పంట కోతకు వచ్చే సమయానికి పంట మధ్య పొదల్లో కుందేళ్లు పిల్లలు చేసుకొంటాయి. పిట్టలు గూడు కట్టుకుంటాయి. వాటి గూళ్ళ వరకు పంటను వదిలేస్తారన్నారు రచయిత. ఇలా వదిలేయటం వలన పక్షులు, జంతువులు అంతరించిపోవు, అలాగే ధాన్యం అంతరించిపోదు. కాని నేడు పంటలో ఒక్క గింజను కూడా ఏజీవి తినడానికి అంగీకరించడు రైతు. దానికోసం పక్షుల్ని, జంతువుల్ని హతమారుస్తున్నాడు. దాంతో పక్షులు, జంతు జాతులు అంతరించి పోతున్నాయి.

అందుకోసం "పైరు సాగుజేస్తే యాదృచ్ఛికంగా కుందేళ్లు, జింకలు, పక్షులు అందులోకి వస్తున్నాయా లేక వాటి కోసమే పైరును సాగుజేస్తున్నాడా" (పుట. 44) అని రచయిత రాఘవ చేత పలికించిన మాటలు, రైతు వ్యవసాయం చేసేటప్పుడు పక్షులు, జంతువులతో సహవాసం చేస్తూ వాటిని కాపాడితే పర్యావరణ సమతుల్యత దెబ్బతినదనే ఒక ప్రధాన విషయం అవగతమవుతుంది. 

“ప్రకృతిలో మనం జీవించాలంటే దాన్నించి మనం పొందటమేకాదు మననుంచి దానికోసం కోల్పోవటం కూడా. ఎన్నో జీవనవనరులను ఉపయోగించుకొని జీవనపోరాటాన్ని సులభతరం చేసుకొన్నాం. అంత పొందినప్పుడు కాస్తయినా వాటిని కాపాడితేనే కదా మన ముందుతరాలకు అందించగలం?” (ఒంటరి సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల, పుస్తకం.నెట్) అంటారు శ్రీలత శ్రీరామ్. ఇది ప్రతిఒక్కరూ గ్రహిస్తే పర్యావరణ సమతుల్యతను మనం కాపాడుకోగలం లేదంటే భవిష్యత్తు ప్రమాదపుటంచుల్లోకి నెట్టిన వాళ్ళమవుతాం.

రైతు నిస్వార్థజీవి. తన జీవితం మొత్తాన్ని పరోపకారార్థమే వెచ్చించే ఏకైకజీవి రైతు మాత్రమే. కాని నేడు ఆరైతు కూడా ఆధునిక జీవనానికి అలవాటుపడి వ్యవసాయానికి దూరమవుతున్నాడు. దీనికి సకాలవర్షాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. మరోవైపు ప్రైవేటుకంపెనీలు నూతన వంగడాలంటూ విత్తనాల సాంప్రదాయికతను ధ్వంసం చేస్తున్నాయి. దాంతో స్వచ్ఛమైన తృణధాన్యాలు మృగ్యమై పోతున్నాయి.

"ఇచ్చేదే..... కానీ...... ఆరికపంట పండించేది నీకోసం మాత్రం కాదు...... ఆరికల కోసం..... వాటి జాతిని భూమ్మీద నిలబెట్టడం కోసం..... పంట పండించి ఆరికల వంశం నాశనంకాకుండా చూడాల్ల...." (పుట. 64)

ఈ మాటల్లో తృణధాన్యాలు అంతరించి పోతున్న దయనీయస్థితి తెలియడమే కాకుండా, వాటిని పండించాలంటే కష్టించే రైతు తప్పనిసరి అని తెలుస్తుంది. ఈ తృణధాన్యాల సాగువలన పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎందుకంటే వీటికి పురుగుమందులు అవసరం లేదు కాబట్టి కాలుష్యం ఉండదు. అలాగే ఆహారంకూడా కలుషితంకాదు. దాంతో మనిషి ఆరోగ్యమూ బాగుంటుంది. వీటిని తిరిగి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిమీద ఉంది.

మానవులకు, జంతువులకు మధ్య ఉన్న సంబంధాన్ని చాలా చక్కగా చిత్రించాడు రచయిత. భార్యాభర్తలు గొడవపడి, భార్య తలనొప్పి కారణంచేత భర్తకు అన్నం పెట్టదు. కానీ బర్రెలు, గొర్రెలకు అన్ని పనులు చేస్తుంది. భర్తకు అన్నం పెట్టడానికి తలనొప్పి, పశువులకు మేతవేసి సేవ చేయడానికి తలనొప్పి లేదా అని నర్సయ్య ఆమెను ప్రశ్నించగా, "ఉంటది తాతా! అవి నోరులేని జీవాలు గదా! నా నొప్పి వాటికేమి తెలుస్చాది? ఆకలయితే అరవడం తప్ప. గాటికి కట్టేసి నాంక మన పానం కుదువబెట్టి అయినా వాటికు మేపేసి సాకాల గదా! ఆయనకేమీ? పెట్టుకొని తిన్లేడా? పసరాలతో పోటీ ఎందుకంట? వాటిను సూసినట్టే అయ్యప్పనూ సూడాలంటనా?" (పుట. 101) అని ఆమె చెప్పిన సమాధానం జంతువులను కాపాడి, బతికించాల్సిన బాధ్యత మానవునిదే అని తెలుస్తుంది. మూగజీవాలను సంరక్షించుకోవాలనే సూచన ఈ మాటల్లో ధ్వనిస్తుంది.

2.1.3 నాగరిక పోకడలు

నర్సయ్య అతని భార్య, కూతురు రోజంతా పొలంలో పని చేస్తుండటం చూసి వారికోసం ప్రతిరోజు తినడానికి ఏదో ఒక పండు ఇచ్చేవాడు రాఘవ. నాలుగు రోజులు తిన్న తర్వాత నాకింక పండు ఇయ్యద్దు అంటాడు నర్సయ్య. "బుద్ధి బో సెడ్డది సారూ! నాలుగు రోజులు అలవాటు సెసినామనుకో...... ఐదో రోజు కావాలని మంకుబడ్తాది, ఏడుస్తాది..... గొడ్డుకు రెండు పూటల తౌడేసి నీల్లు దాపితే మూడో పూట ఉత్త నీల్లు పెట్టి చూడు. మూతి బెట్టదు. తౌడు కోసం మోర సాపి కుసిలిస్తది" (పుట. 90) అనడంలో నాగరికతకు, విలాసాలకూ అలవాటు పడితే మనిషి వెనకటి మూలాల వైపు తిరిగి చూడడనే విషయమే కాదు, ఇంకా నాగరికతవైపు మొగ్గుచూపని పల్లెలు, రైతులు ఉన్నారనే విషయాన్ని రచయిత చెప్పకనే చెప్తున్నారు.

కాలాలు సక్రమంగా వస్తే చిత్తకార్తె చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. చాలా అందమైన, ప్రకృతి దృశ్యాలన్నింటినీ సొంతం చేసుకున్నది చిత్తకార్తె. ప్రకృతిలో ఉన్న వింతలన్నింటినీ చూపిస్తుంది ఈ కార్తె. అన్ని కార్తెలకు వానాకాలం మూలం. వానలు సక్రమంగా కురిస్తేనే కార్తెలు సంపూర్ణంగా విలసిల్లుతాయి. ఇప్పుడు వానలు పడటం కష్టంగా మారింది. చెట్లను నరకటం, అడవులను ధ్వంసం చేయటం వల్ల భూమి వేడెక్కి వర్షాలు పడటంలేదు. దీనిమూలంగా ప్రకృతి గతి తప్పుతోంది. "సముద్రంలో తుఫానులు లేస్తే వానలు కురవాల్సిందే, ఋతువుల్లో వచ్చే వానలు దూరమైనయి" (పుట. 162) అన్న నర్సయ్య మాటలకు కారణం పెరిగి పోతున్న కాలుష్య కోరలే. నాటి ప్రకృతి అందాల్ని నేటితరం చూడలేక పోతుందంటే మూలం మానవుని విపరీత వింత పోకడలేనన్నది స్పష్టమవుతుంది.

2.1.4 ప్రకృతి రక్షణ – వ్యక్తిగత బాధ్యత

ఒంటి కొట్టం చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలులేక పశువులకు, జంతువులకు మేతలేక ఒక పెద్ద గొర్లమంద ఆరికపైరునంతా తినేసి నాశనం చేసింది. "వేలెడు అడ్డేలెడు వంతున మొదళ్ళు మాత్రం మిగిల్చి..... కొడవలితో కోసినట్లుగా పైరంతా గొర్రెలు తినేసి..... ఏముంది అక్కడ? రెండు వందలు పైగా గొర్లు అంతులేని ఆకలితో, కరువంత ఆకలితో..... కరువే గొర్రెల మంద రూపంలో వచ్చి సర్వనాశనం జేసె..... ఏముంది అక్కడ?..... కంప పొదల్లో ఉన్న పైరును కూడా పోనీకుండా.... ఆరు నెలల ఆశల్ని మూడు నెలలకే మట్టిలో కలిపేసె..... ఏముంది అక్కడ? (పుట. 167) కరువు మేసేసింది అన్నమాటలో ఉన్న తత్త్వం ఎంతో లోతైనది.

కరువు తీవ్రత ఎంత బాధాకరమో వ్యక్తమవుతూ ఉంది. A tree can make a forest అన్నట్లు ఒక మొక్కకు సువిశాలమైన దట్టమైన అడవిని చేయగలిగే శక్తి ఉంది కాని ఒంటికొట్టంలోని ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో చెట్లను అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు రాఘవ తానే వారికి డబ్బులు ఇచ్చి, వారిని చెట్లను నరకకుండా చేసి, చెట్లను తాను దత్తత తీసుకోవడం ఎంతో అభివృద్ధిదాయకమైన ఆలోచన. ఇది పలువురికి ఆదర్శం కాగలదనే భావన రచయితది. ఎక్కడ పడితే అక్కడ చెట్లు నరికేసి, కొండలు చదునుచేసేసి ప్రకృతికి హాని కల్గిస్తున్న నేటి సమాజానికి ఈనవల ఒక మేలుకొలుపు.

"ఒంటరి" నవల ద్వారా రచయిత మన సమాజంలోని ప్రకృతి పట్ల నిర్లక్ష్యాన్ని, అభివృద్ధి దుర్వినియోగాన్ని తార్కికంగా ప్రశ్నించాడు. ఇది ఒక సాంఘికప్రశ్నగా మాత్రమేకాక, మానవ సంబంధాల క్షీణతనుకూడా పర్యావరణ క్షీణతతో అనుసంధానిస్తుంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో పర్యావరణ దృక్పథాన్ని విశ్లేషించే సందర్భంగా ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన గొప్ప నవల.

2.2. "మూగవాని పిల్లనగ్రోవి" నవల - పర్యావరణ స్పృహ

ఒక రైతు మరణ పునరుత్థానాల గాథ. పొలం కోల్పోయిన రైతు ఆవేదన. పర్యావరణ సమస్యల దృష్టిలో రైతు జీవితాన్ని కూర్చిన రచన. వర్షాభావంవల్ల వ్యవసాయ భూమి కోల్పోయిన రైతు ఆత్మగౌరవం ఎలా కల్లోలంగా మారుతుందో రచయిత అక్షరబద్ధం చేసిన నవల. ఒంటిల్లు అనే ఊరికి నాలుగుదిక్కులా ఉన్న ప్రకృతిని రచయిత హృద్యంగా చిత్రించాడు. తూర్పున పర్వతపంక్తి, దక్షిణాన రాతిగుండు, ఉత్తరాన చెరువు కట్టమీద అమ్మవారి గుడి, పడమరన 14 ఎకరాల చిట్టడవి. ఇది ఊరి సమగ్ర జీవనవేదిక. ప్రకృతి-మనిషి సంబంధాన్ని సజీవంగా చూపించేందుకు రచయిత ఈ విస్తృత భౌగోళిక ప్రస్తావనను ఉపయోగించారు.

2.2.1 రైతు జీవితం – ఆత్మగౌరవపు పతనం

బక్కిరెడ్డి అనే రైతు 16వ యేట నుండి 50వ ఏటవరకు తన భూమికి జీవితం అంకితం చేశాడు. వర్షాలుపడక, బావులు పొడిబారిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాలు అతడిని ఆస్తి కోల్పోయేస్థితికి నెట్టాయి. తండ్రి ప్రాణంలా కాపాడుకున్న భూమిని తన చేతులారా అమ్ముకోవాల్సి వచ్చిందన్న బాధ అతడి మనోవేదనను తిరుగులేని స్థాయికి తీసుకెళ్లింది.

వర్షాలు లేకపోవడమేకాక, నీటి వనరులకోసం బావులు తవ్వించాలన్న ఆశతో బక్కిరెడ్డి తన భూమినే తాకట్టు పెట్టి చివరకు నష్టపోయాడు. ఈ నవలలో వర్షం ఒక ముఖ్య చిహ్నంగా కనిపిస్తుంది – అది ప్రకృతి అనుగ్రహమేకాక, రైతుకు బతుకుబండికీ ప్రాణధార. వర్షం పడినా తన దగ్గర భూమి లేకపోవడమన్నది వ్యవసాయంపై అతడికి ఉన్న బహుళస్థాయిలో ప్రేమను, పౌరుషాన్ని తెలియజేస్తుంది.

"నేనిప్పుడు రైతు కాను", "నేను భూమిని అమ్ముకున్నాను", "నేను బికారిని" అన్న బక్కిరెడ్డి మాటలు వ్యవసాయ భూమి రైతుకు కేవలం ఆస్తి కాదని, అది అతని ఆత్మగౌరవమనీ, ఊరి గౌరవమనీ తెలియజేస్తాయి. అతడు నాగళ్లను తడవనున్న వాననుచూసి మళ్లీ జాగృతమయ్యే ప్రయత్నం చేసినా – భూమిలేకపోవడం అతడిని నిలువరించింది. ఇది ప్రకృతి అవకాశమిస్తే రైతు సమర్పణ కోసం ఎల్లప్పుడూ సిద్ధమే అన్న సంకేతం.

“మూగవాని పిల్లన గ్రోవి” నవలలో బక్కిరెడ్డి కథ ఒక రైతుపట్ల ప్రకృతి చేస్తున్న అన్యాయానికి ప్రతినిధిగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత గాథకాదు – ఇది వర్షాధారిత వ్యవసాయ వ్యవస్థలో రైతుల గాథ. వాతావరణ మార్పులు, నీటి వనరుల దుర్వినియోగం, అనేక మానవ తప్పిదాలవల్ల వచ్చే విపత్తులను రచయిత అత్యంత మృదువుగా, ఆత్మవేదనతో అక్షరబద్ధం చేశారు.

2.3 అడవి బతుకులు నవల - పర్యావరణ స్పృహ

పరిసరాల పరిరక్షణ, జీవవైవిధ్యం, వనరుల వినియోగం వంటి అంశాలు నేడు అత్యంత కీలకమైనవిగా మారాయి. అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో సాహిత్యం కూడా ఆ తాలూకు బాధను పంచుకుంటోంది. డా. దిలావర్ రచించిన "అడవి బతుకులు" అనే నవల. ఆధునిక అభివృద్ధి వలయంలో బలయ్యే ఆదివాసీ జీవితం, అడవుల నాశనం, యురేనియం తవ్వకాలు, పర్యావరణానికి ముప్పు వంటి అనేక అంశాలను చర్చిస్తూ మానవతా విలువల ఆవశ్యకతను పాఠకుల హృదయాలకు చేరుస్తుంది.

2.3.1 ప్రకృతి విధ్వంసం

పచ్చని అడవిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిది. కానీ అభివృద్ధి పేరుతో అడవిని నరికి, అక్కడి మూలవాసుల బతుకులు తుడిచేసే చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. "అడవి బతుకులు" నవల ఇలాంటి విపరీత పరిణామాలపై మానవతాదృష్టితో రచించబడిన ప్రబలమైన వాఖ్య. ఈ నవలలో కేంద్రంగా ఉన్న వర్గం – చెంచులు. వీరి జీవనశైలి ప్రకృతితో ఏకమై ఉంది. చెంచుల జీవితానికి ఆధారం అడవి. వారు పోడు వ్యవసాయం ఆచార సంప్రదాయాలతో సాగు చేస్తారు. ప్రకృతిని తల్లిలా ఆదరిస్తారు, అవసరమైనంత మాత్రమే అడవిని ఉపయోగిస్తారు. కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికలు – ముఖ్యంగా యురేనియం తవ్వకాలు – ఈ సహజ జీవనవిధానాన్ని ఛిద్రం చేశాయి.

నవలలో రమణారావు అనే పాత్రద్వారా రచయిత చెంచుల జీవనరీతిని, వారి సమస్యలను పరిశీలించి సమాజానికి పరిచయం చేశారు. నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణం, చెంచు గూడేల ధ్వంసం, వనరులు మాయమవటం – ఇవన్నీ ఈ నవలలో కళ్లకు కట్టినట్టు చిత్రీకరించబడ్డాయి. చెంచులు సాగుచేసే భూములను ప్రభుత్వం వ్యర్థాల కుప్పలుగా మలచడం, పోడు వ్యవసాయంచేసే హక్కును దూరం చేయడం, అంతేకాకుండా విలువైన అటవీ వనరులను అధికారులే అక్రమంగా విక్రయించడం – ఇవన్నీ ప్రభుత్వాల అవినీతిపట్ల రచయిత ఆవేదనను వ్యక్తం చేస్తాయి.

నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో వందలకొద్దీ చెంచులు మరణించారన్నది వాస్తవం. అడవికూడా పెద్ద మొత్తంలో నాశనం అయ్యింది. అడవి, అందులోని చెంచులు పతనానికి ప్రభుత్వం మూలకారణమైంది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని ప్రసంగించటాన్ని "నాగార్జునసాగర్ డ్యాం లక్ష్యమేంటి? లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చేయటం. ఎవరికున్నాయి లక్షల ఎకరాలు? నీకున్నాయా ? నాకున్నాయా? కూలీనాలీ చేసుకొని పొట్ట పోసుకొనే దరిద్ర నారాయణులకున్నాయా? అంటే కాకుల్ని కొట్టి గద్దలకేయడమే కదా......" (పుట.28) అని రమణారావు అనడంలో ఇలాంటి డ్యామ్ల వలన లబ్ధి పొందేది అధికారులు, కాంట్రాక్టర్లు, నష్టపోయేది చెంచులు, అడవులు అని అర్థమవుతుంది.

అడవులు నరకడం వలన కేవలం చెట్లే కాదు, వాటి ఆసరాగా బతుకుతున్న ఎన్నోరకాల పక్షులు, జంతువులు నశించిపోతాయి. దానివల్ల జీవవైవిద్యం దెబ్బతింటుంది. “భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో 48A ప్రకరణంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వన్యప్రాణులను సంరక్షించాలని పేర్కొంది. ఆర్టికల్ 51(A) ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ విధి” (www.indiakanoon.org). 

కాని "పచ్చదనమంతా హరించుకొని పోతున్నది. నీడ కరువైన వన్యమృగాలు చెల్లాచెదరవుతున్నాయి. వర్షాభావంతో భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి. నీళ్లులేని మడుగుల దగ్గర, కాసారాలదగ్గర జంతువుల కళేబరాలు గుట్టలుగా పోగుపడుతున్నాయి. కొన్ని జనావాసాలలోకి వెళ్లి కాటుగలిసి విందుల్లో పలావులుగా మారుతున్నాయి. పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వ్యవసాయ బావుల్లో శవాలై తేలుతున్నాయి..... కోతులు ఎప్పుడో వలస మార్గం పట్టాయి......" (పుట. 84-85) అని రచయిత పలికించిన మాటలు అడవులను, వాటిని ఆసరా చేసుకొని బతికే కోటానుకోట్ల జీవరాశుల దైన్యాన్ని, మానవ భవిష్య వినాశనాన్ని సూచిస్తున్నాయి. 

ఇటువంటి ఉపద్రవాలు అడవి జంతువులకేకాదు, అడవిబిడ్డల బతుకుల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. అటవీ ఉత్పత్తులైన తేనె, జిగురునిచ్చే చెట్లు, వెదురు.... ఇవన్నీ మృగ్యమైపోతున్నాయి. కోడిపిల్లల్ని కాచినట్టే, అడవి తనబిడ్డల్ని కాచుకొని రక్షణ కల్పిస్తుంది. అటువంటి అడవితల్లికే రక్షణలేదని రచయిత దిలావర్ అంటున్న మాటలు ఎంతో శోచనీయంగా ఉన్నాయి.

అడవులను నరికినా వాటి బదులు మొక్కలను నాటి అడవులను పెంచితే బాగుండు కానీ అటువంటి చర్యలు లేవు. నినాదాలు పలకటమే కానీ వాటిని పాటించే ప్రభుత్వాలు లేవు. అంతా అవినీతిమయమే. అడవులు ధ్వంసం కాబడి వాగులు, వంకలు ఎండిపోయి, తాగడానికి నీరులేక, తినడానికి తిండిలేక చెంచులుపడే కష్టాలను కళ్ళకు కట్టించారు రచయిత.

2.3.2 యురేనియం తవ్వకాలు – పర్యావరణ ముప్పు

ఈ నవలలో ప్రత్యేకంగా చెప్పిన అంశం – యురేనియం తవ్వకాలు. నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలు జరపడానికి, చెంచులను అడవులు ఖాళీ చేయించారు అధికారులు. ఈ యురేనియం చాలా ప్రమాదకరమైన లోహం. దీని రేడియేషన్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దీనితోనే అణుబాంబులు తయారు చేస్తారు. ఈ నవలలో రమణారావు అతని ఉపాధ్యాయ మిత్రబృందంలోని సైన్సు ఉపాధ్యాయునిచేత యురేనియం తయారీ గురించి, దాని పరిణామాల గురించి వివరించిన తీరు ఎంతో నైపుణ్యంగా ఉంది.

"యురేనియం వ్యర్థపదార్థాల నుంచి వెలువడే అణుధార్మికత వేలసంవత్సరాలపాటు పర్యావరణంలో కలిసిపోయి ఉంటుంది. దీనివల్ల జన్యుపరమైన మార్పులు కలుగుతాయి. ఈ దుష్ప్రభావాలు మనుషుల్లో, జంతువుల్లో, పక్షుల్లో, వృక్షాల్లో, నీళ్లల్లో, మట్టిలో కూడా కనిపిస్తాయి. పంటల్లో, నీళ్లల్లో, భూమిలో ఈ విష పదార్థాలుచేరి పంటలు విషపూరితంకావడం లేదా అసలు పండకపోవడం జరుగుతుంది" (పుట. 101).

నేడు మనమదే చూస్తున్నాం. ఒకవేళ పంట వచ్చినా దానిలో పురుగులు ఎక్కువై కనీసం తినడనికి వీల్లేని పరిస్థితి ఈ యురేనియం తవ్వకాలు జరపడానికి డ్రిల్లింగులు వాడతారు. వీటికి భూమి దద్దరిల్లి భూకంపాలు, సునామీలులాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి భూమి నాశనమవుతుందనే విషయాలను కూడా రచయిత వివరించారు. ఇది కేవలం భూమికి నష్టం కలిగించడమే కాకుండా, శరీరాన్ని, జన్యువులను, నీటిని, నేలని విషపూరితం చేయగల ముప్పు ఉంది. దీనివలన ఏర్పడే జెనెటిక్ మార్పులు, పొలాల విషపూరణ, నీటి కాలుష్యం – ఇవన్నీ రచయిత శాస్త్రబద్ధంగా వివరించారు. రేడియేషన్ వల్ల కొన్ని శతాబ్దాలపాటు భూమి విషపూరితంగా ఉండే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. వందేళ్ళ క్రితమే అర్హీనియస్ పరిశోధకులు గాలిలో పెరిగే కర్భనంతో భూతాపం పెరుగుతుందని హెచ్చరించారు. 1988లో జేమ్స్ హాన్సెన్ భూతాపం పెరుగుతుందని వివరించినా 1990లో మొదటి IPCC నివేదిక భూతాపాన్ని ఖరారు చేసినా, ఐ.రా.స. ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నా ఫలితం శూన్యం. గాలిలో కర్భనశాతం ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది (ప్రకృతిని రక్షించుకుందాం, పుట.19) అన్న డా. తూములూరి రాజేంద్రప్రసాద్ మాటలు అక్షరసత్యం. “ఆరోగ్యమే మహాభాగ్యం” అన్న విషయం మరచిపోతున్న ప్రజలకిది ఒక ఉపదేశమవుతుంది.

2.3.3 అభివృద్ధి తత్త్వంపై ప్రశ్న

అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయి. దీని కారణంగా లాభపడేవారు డబ్బున్నవాళ్లే. పేదవాళ్లు దాని విపరీత ప్రభావాలకు లోనుకావలసి ఉంటుంది. చెంచులు పోడు వ్యవసాయం చేయడానికి గొడ్డళ్ల, కొడవళ్లతో కొండచరియల్లోని చిన్నచిన్న చెట్లను నరకడం, నరికేసిన మొదళ్లకు నిప్పు పెట్టడం, కాలి బూడిదగా మారినదే వీరి పంటకు ఎరువుగా వాడుతారు. వీరు ఎటువంటి రసాయనికమందులు వాడరు. చాలా సహజసిద్ధంగా పంటలను పండిస్తారు. తద్వారా భూమి సుభిక్షంగా ఉండటమే కాకుండా మానవుని ఆరోగ్యం కూడా దెబ్బతినదు. కానీ ప్రభుత్వ అధికారులు అడవి మొత్తాన్ని దోచుకోవడానికి చెంచుల పోడు వ్యవసాయాన్ని ధ్వంసం చేశారు. అడవులను కాపాడాల్సిన ప్రభుత్వాలే స్మగ్లింగ్ చేయిస్తూ అనేక సుగంధద్రవ్యాల చెట్లను నాశనం చేస్తుంటే మరెవరు కాపాడుతారనేది ప్రశ్న.

"అడవిలో వందలాది ఎకరాలు మోళ్ళుగా మారుతున్నాయి. యాసిడ్ దాడికి గురైన అమ్మాయి ముఖంలా వికృతంగా మారిపోతున్నది అడవి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తునిలా క్షీణించి పోతున్నది. శ్వాసకోశాలు పాడైపోతున్న టీ.బీ. పేషంటులా శుష్కించి పోతున్నది అడవి......" (పుట. 84) అని రమణారావు అన్న ఈ మాటల్లో అడవి ఏవిధంగా విధ్వంసానికి గురయిందో స్పష్టంగా అవగతమవుతూ ఉంది. అడవిలోని ప్రాణుల బతుకును మనిషి హృదయానికి అద్దంలా చూపగలుగుతున్నాడు. ఇది కేవలం ప్రకృతిమీద కథనం కాదు, మనుగడమీద ప్రశ్న కూడా.

ఈ నవల చివర్లో రచయిత మన సమకాలీన అభివృద్ధి తత్వాన్ని ప్రశ్నిస్తారు. అభివృద్ధి పేరుతో అడవులను నాశనం చేయడంవల్ల పర్యావరణం మాత్రమే కాదు, మానవుడు తననుతానే నాశనం చేసుకుంటున్నాడనే సందేశం వినిపిస్తుంది. చెంచుల పోడువ్యవసాయాన్ని నిలిపివేయడం, వారి జీవనవిధానాన్ని బలవంతంగా మార్చడం – ఇవన్నీ ప్రభుత్వ విధానాల తీరుపై తీవ్రవిమర్శ. ఈ నవలద్వారా రచయిత చెంచు జీవితం మాత్రమేకాదు, అందరి జీవనాధారమైన ప్రకృతిని పరిరక్షించాలనే సంకల్పాన్ని బలంగా వ్యక్తీకరించాడు. అభివృద్ధి పేరుతో అధికారుల అవినీతి, వనరులదోపిడీ, జనజీవితనాశనం వంటి పలుఅంశాలపై ఆయన విమర్శ తన్మయతతో ఉంది. “అడవి బతుకులు” నవల ఆధునిక తెలుగు పర్యావరణ సాహిత్యంలో ఒక ప్రామాణిక రచనగా నిలుస్తుంది.

3. ఉపసంహారం

  • వ్యక్తిగత పరివర్తనమార్గంలో పర్యావరణమార్పును “ఒంటరి” నవల వ్యక్తీకరిస్తే, “మూగవాని పిల్లనగ్రోవి” వ్యవసాయ ఆధారిత సందర్భంలో వర్షాభావంవల్ల పర్యావరణంపై పడే మార్పులకు మానవజీవితం, ఆత్మగౌరవం ఎలా ముడిపడుతుందో చూపిస్తుంది. 
  • అడవులను నాశనం చేసే అధికార, విధ్వంస ప్రణాళికలకు ఎదురుదాడిచేసే తీవ్రశాస్త్రీయ విమర్శయే “అడవిబతుకులు” నవల. 
  • అభివృద్ధి పేరుతో జరిగే మానవసంబంధాల పతనం, ప్రకృతి ధ్వంసం, సాంస్కృతిక విలువల హరణం వంటి అంశాలను తమదైన శైలిలో వెలికితీశాయి ఈ మూడు నవలలు. ఇవి మూడు వేర్వేరు భాష్యాలుగా కన్పించినా, సామూహికంగా ఒకే ప్రశ్నను వేస్తున్నాయి – “అభివృద్ధి ఎవరికి? ఏ విలువల ఖాతాలో?” సాహిత్యం కేవలం కథలు చెప్పడానికేకాదు, సమాజానికి దారితీసే మార్గం చూపించాల్సినది. ఈ మూడు నవలలూ అదే పనిని ఘనంగా నిర్వర్తిస్తున్నాయి.
  • వచనసాహిత్యంలో సామాజిక బాధ్యతను మోస్తున్న ఈ రచనలు, పాఠకులలో చైతన్యాన్ని కలిగించడంలో మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. 

Acknowledgements:

PM - USHA Research Project “A Study of Ecological Perceptions in Modern Telugu Literature” (2014-2024) అనే పరిశోధనాంశంలో భాగంగా సమర్పించిన వ్యాసం ఇది. ఈ ప్రాజెక్టు కాల పరిమితి ఒక సంవత్సరం.

4. సూచికలు

  1. ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, పుట. 44, 64, 90, 101, 162, 167
  2. అడవి బతుకులు – డా. దిలావర్, పుట. 28, 84, 85, 101
  3. పుస్తకం.నెట్ – శ్రీలతా శ్రీరామ్
  4. www.indiakanoon.org
  5. ప్రకృతిని రక్షించుకుందాం – డా. తూములూరి రాజేంద్రప్రసాద్, పుట. 8, 19

5. ఉపయుక్తగ్రంథసూచి

  1. కార్ల్ కౌట్కీ, వ్యవసాయ సమస్య, మొదటిభాగం, సి.ఎఫ్. ఐ.ఆర్. ప్రచురణలు, 2023
  2. కేశవరెడ్డి, మూగవాని పిల్లనగ్రోవి, నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 2023
  3. దిలావర్, అడవి బతుకులు, సమతాప్రచురణలు, పాల్వంచ, 2023
  4. పతంజలి, కె.ఎన్.వై. గెలుపు సరే… బతకడం ఎలా?, సాహితీమిత్రులు, విజయవాడ, 2017
  5. మోహన్, కెంగార. చెమటచెక్కిన వాక్యం, మనస్విని ప్రచురణలు, కర్నూలు, 2024
  6. రాజేంద్రప్రసాద్, తూములూరి. ప్రకృతిని రక్షించుకుందాం!, పట్టాభి కళాపీఠం, గుంటూరు, 2023
  7. పైదే. పర్యావరణాన్ని కాపాడుకుందాం…ప్రకృతి పబ్లికేషన్స్, విజయవాడ, 2010
  8. పైదే. ప్రకృతి పర్యావరణ పరిరక్షణ, విజయసాయి పబ్లికేషన్స్, విజయవాడ, 2009
  9. రామచంద్ర గుహ, తెలుగుసేత – చంద్రశేఖర్ రెడ్డి, దుర్గెంపూడి. ప్రకృతితో సంభాషణ భారతీయ పర్యావరణవాద మూలాలు, ఎమెస్కో, 2025
  10. వెంకటరామిరెడ్డి, సన్నపురెడ్డి. ఒంటరి, తానా ప్రచురణలు, 2017
  11. వేణుగోపాల్, నాగసూరి. పర్యావరణం సమాజం, ఎన్.కె. పబ్లికేషన్స్ విజయనగరం, 2008
  12. శివశంకర్, పాపినేని. అన్వేషణ, సాహితీమిత్రులు, విజయవాడ, 2019

 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]