AUCHITHYAM | Volume-06 | Issue-08 | July 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
1. నందిరాజు చలపతిరావు స్త్రీల పాటలు : వస్తువైవిధ్యం
డా. దాసర విజయకుమారి
సహాయ ఆచార్యులు, తెలుగుశాఖ
మానవీయ విభాగం, హైదరాబాదు విశ్వవిద్యాలయం,
రంగారెడ్డి, తెలంగాణ.
సెల్: +91 9491877705, Email: dasara.vijayakumari@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.06.2025 ఎంపిక (D.O.A): 28.06.2025 ప్రచురణ (D.O.P): 01.07.2025
వ్యాససంగ్రహం:
నందిరాజు చలపతిరావు సేకరించిన స్త్రీల పాటలను విమర్శనాత్మకంగా అధ్యయనం చేయడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. చలపతిరావు మూడు సంపుటాలుగా స్త్రీల గేయసాహిత్యాన్ని సేకరించి ముద్రించినా, కాలక్రమేణా అవి లభ్యం కాకపోవడంతో, తంగిరాల వెంకట సుబ్బారావు ఆ మూడు సంపుటాలను సమగ్ర సంపుటంగా 2024 అక్టోబరులో వెలువరించారు. ఈ సంపుటికి వారే స్వయంగా 150 పుటలలో ప్రామాణికమైన పీఠికను రాయగా, ‘నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు’ అనే పేరుతో అజో-విభొ-కందాళం ఫౌండేషన్ దీనిని ప్రచురించింది. విషయనిష్ఠ, వస్తువైవిధ్యంతో స్త్రీల పాటలను వర్గీకరించడం, విశ్లేషించడం ఈ వ్యాసరచనలో అనుసరించిన పరిశోధనపద్ధతి. ఇందులో భాగంగా పాటల వస్తువైవిధ్యం, శైలి, కథనరీతి, భావనల ప్రభావం, జానపద సాహిత్య లక్షణాలు మొదలైన అంశాలను పరిశీలించి, మూలకథల పరిణామాన్ని అధ్యయనం చేయడమైనది. మొదట నందిరాజు చలపతిరావు గేయసంపుటాల ప్రామాణికతను నిర్ధారించడం, ఆపై వాటిని తంగిరాల సంపుటితో పోల్చి, వివిధ కేటగిరీలకు అనుగుణంగా వర్గీకరించడం, తరం మారిన క్రమంలో పాటల మార్పులు, అన్వయాల విశ్లేషణను చేయడం, వివిధ తాత్విక, సాంస్కృతిక కోణాల్లో పరిశీలించడం ఈ పరిశోధన ప్రణాళిక. విషయసేకరణకు ముఖ్యంగా తంగిరాల వెలువరించిన సంపుటి, కొలకలూరి ఇనాక్ రచించిన జానపదుల సాహిత్యవిమర్శ, ఇతర జానపద సాహిత్యగ్రంథాలు, విమర్శావ్యాసాలు, పురాణ సంబంధిత మూలాలు ఆధారం. పాటలలోని భావాత్మకత, కథాత్మకత, పురాణాల ఆధారిత / అనుభవాత్మక భావాలు, జానపదుల స్వతంత్ర సృజనశక్తి, సామాజిక దృక్పథం మొదలైన అంశాల ఆధారంగా ఈ గేయాలను R.S. Boggs వర్గీకరణ విధానంలో విశ్లేషించి, తెలుగు జానపద సాహిత్యాన్ని అంతర్జాతీయప్రమాణాలలో నిలబెట్టే విధంగా ఒక సమగ్రావగాహన కల్పించడం ఈ పరిశోధన వ్యాస పరమావధి.
Keywords: జానపద సాహిత్య విమర్శ, oral literary criticism - మౌఖిక సాహిత్య విమర్శ, సాహిత్య విమర్శ కథలు’ R.S.Boggs వర్గీకరణ, B200 – పురాణం. B400- ఐతిహ్యం. B600 – కథ, భావాత్మకములైన స్త్రీలపాటలు, కథాత్మకములైన స్త్రీలపాటలు, కథలేని స్త్రీలపాటలు, కథతో కూడిన స్త్రీలపాటలు, నవ్యఆవిష్కరణ
1. ప్రవేశిక
నందిరాజు చలపతిరావు తాను సేకరించిన స్త్రీల పాటలను మూడు సంపుటాలుగా ముద్రించి తెలుగు పాఠకులకు అందించారు. కాని కాలక్రమేణా ఆ పాటల సంపుటాలు మనకు లభించటం లేదు. ఈ కొరతను తంగిరాలవారి విశేష కృషి తీర్చింది. తనకు లభించిన నందిరాజు చలపతిరావు స్త్రీల పాటలు మూడు సంపుటాలను కలిపి 2024 అక్టోబరులో సమగ్ర సంపుటంగా తీసుకొచ్చారు. ఆయన చేసిన ఈ కృషిని నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు అనే పేరుతో అజో - విభొ – కందాళం ఫౌండేషన్ వారు ప్రచురించారు. ఈ పుస్తకానికి తంగిరాల వెంకట సుబ్బారావు దాదాపు 150 పుటలతో సుదీర్ఘమైన పీఠికను రాశారు.
ఈ గేయాలు రామాయణ, భారత, భాగవత మూలకథలను ఆధారంగా చేసుకుని కొంతమంది రాశారు. జానపద కవులు కొన్ని మూలంలో లేని అంశాలు కూడ చేర్చారు. కొన్ని గేయాలలోని పాత్రలచేత ఉపాఖ్యానాలను చెప్పించడం, కొన్నిచోట్ల జానపదులు భావోద్వేగానికి గురై అసందర్భ, అనౌచిత్య ప్రకటనలు కూడ చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలను విమర్శనాత్మకంగా పరిశీలించడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.
R.S. BOGGS జానపద విజ్ఞానాన్ని ఇంగ్లీషులోని పెద్ద అక్షరాలతో సూచించారు. వాటిని కొన్ని వర్గాలుగా విభజించారు. ఉదాహరణకి B200 – పురాణం. B400- ఐతిహ్యం. B600 – కథ (సుందరం, ఆర్వీ.యస్. 2004. 6)
పై వర్గీకరణను ఆధారంగా చేసుకుని పరిశీలిస్తే స్త్రీలపాటలు పౌరాణిక, ఐతిహాసిక, సాంఘిక కథలతో కూడి ఉన్నాయి. కాబట్టి వీటిని ఆయా విభాగంలో చేర్చి పరిశీలన చేసినట్లైతే ప్రపంచస్థాయిలో గుర్తింపు కలుగుతుందని చెప్పవచ్చు.
ఆచార్య కొలకలూరి ఇనాక్ జానపద పరిశోధకులు అంగీకరించిన R.S.BOGGS వర్గీకరణలో మౌఖిక జానపద కథలను చేర్చాలని, జానపదుల సాహిత్యం లాగే జానపదుల సాహిత్య విమర్శ కూడ మౌఖికమేనని పేర్కొన్నారు. ఆధునిక విమర్శ లక్షణాలతో పోలిస్తే దానిలోని విమర్శ స్థాయి ప్రాథమికంగా ఉంటుందని, విశ్లేషణ, సమన్వయం గుర్తించదగినంతగా ఉంటాయని తెలియజేశారు. మార్గ సాహిత్య విమర్శలో కనిపించే లక్షణ స్థిరీకరణ భాషా ప్రామాణికత్వం లాంటివి లేకపోయినా వారు ఆలోచనా శక్తిలో ఏమాత్రం తక్కువ కాదని ఆచార్య ఇనాక్ తన “జానపదుల సాహిత్య విమర్శ” అనే గ్రంథంలో పేర్కొన్నారు. కొందరు కవుల గురించి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కథల రూపంలో ప్రచారంలో ఉంటాయి. వాటిని సాహిత్య చరిత్రలో పేర్కొనరు కాని, కొన్ని గ్రంథాలలో కనిపిస్తాయి. వాటిని ‘సాహిత్య విమర్శ కథలు’ అనే కొత్తదైన సాహిత్య సిద్ధాంత ప్రతిపాదన చేశారు. జన వ్యవహారంలో ఉన్న సాహిత్య సంబంధమైన కథలను కూడ గ్రహించి, వీటిని జానపదుల సాహిత్య విమర్శ కథలు గా ప్రకటించారు. జానపద పరిశోధనలో ఇదొక కొత్త ఆలోచన. దీని ఆధారంగా ప్రపంచ జానపద కథల వర్గీకరణలో సాహిత్య విమర్శ కథకు ఒక గుర్తింపు వస్తుంది. ఆచార్య ఇనాక్ చేసిన ఈ ప్రతిపాదన జానపద సాహిత్యానికి నవ్య ఆవిష్కరణగా చెప్పవచ్చు. ఈ దిశగా జానపద సాహిత్యంలో పరిశోధనలు జరగాల్సి ఉంది.
జానపద సాహిత్యాన్ని అమెరికా జానపద విజ్ఞానవేత్త Alan Dundes ప్రతిపాదించిన oral literary criticism - మౌఖిక సాహిత్య విమర్శ విధానంలో మౌఖిక సాహిత్యం పై జానపదుల విమర్శను పరిశీలించాలని ఆచార్య రావి ప్రేమలత తెలుగు సాహిత్య విమర్శ దర్శనం విజ్ఞాన సర్వస్వం. సంపుటం.11 నందు జానపద సాహిత్య విమర్శ అనే వ్యాసంలో పేర్కొన్నారు. (ఔచిత్యమ్, మే, 2024. పుటలు. 10, 11).
2. జానపదంలో స్త్రీలపాటలు - వర్గీకరణ:
జానపద సాహిత్యంలో స్త్రీలపాటలు ఒక ప్రత్యేకమైన శాఖగా విరాజిల్లుతున్నాయి.
- ఇవి కథలేని పాటలు, కథతో కూడిన పాటలు అని రెండురకాలు.
- వీటిని నందిరాజు చలపతిరావు చిన్నపాటలు, పెద్దపాటలు అని, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి స్త్రీలపాటలు, స్త్రీల కథలపాటలు అని అన్నారు.
- తంగిరాల వారు వీటిని భావాత్మకములైన స్త్రీలపాటలు, కథాత్మకములైన స్త్రీలపాటలు అని పేర్కొన్నారు. లాలిపాటలు, జోలపాటలు, వరసపాటలు, పెండ్లిపాటలు, నలుగుపాటలు, తలుపు దగ్గరపాటలు, గంధము పాటలు, అలకపాటలు, అప్పగింతల పాటలు, మంగళహారతులు మొదలైనవి.
- కథలేని స్త్రీలపాటలకు, ఊర్మిళాదేవినిద్ర, లక్ష్మణదేవరనవ్వు, సీతగడియ, కుశలవకుచ్చలకథ, ధర్మరాజుజూదము, సుభద్రసారె, పారుజాతపల్లవి, శ్రీకృష్ణుని చల్దులు మొదలైనవి కథతో కూడిన స్త్రీలపాటలు. మూలకథలు, అమూలాంశాలను గుర్తించి, జానపద కవుల స్వానుభవాలు, సమకాలీన సామాజిక ప్రభావం మొదలైన వాటిని పరిశీలించవచ్చు.
2.1 కథలేని స్త్రీలపాటలు
కథలేని స్త్రీలపాటలు నందిరాజు చలపతిరావు సేకరించి ముద్రించిన స్త్రీలపాటలు మూడు సంపుటాలలో ఉన్న కథారహిత గేయాలు. మూడో భాగంలో కథలేని పాటలు 11 మాత్రమే ఉన్నాయి. మిగిలినవి పెద్దపాటలు. పుస్తకం చివర వచనంలో 34 నోములకథలు, వాటి తర్వాత శ్రీరామనామ రామాయణము, శ్రీవేంకటేశ్వర వ్రతకథ ఫలము, శ్రీవేంకటేశ్వర దీపారాధనము ఉన్నాయి.
నందిరాజు చలపతిరావు మూడు స్త్రీల పాటల సంపుటాల్లోనూ ఉన్న దైవప్రార్థనలు ఉన్నాయి. మొదటి భాగంలో ఆరుపాటలున్నాయి. వాటిలో ఉదాహరణకి మహిషాసుర మర్థిని పార్థన బిల్హరి రాగం- చంపుతాళము, సంస్కృతంలో ఉంది. రెండవ భాగంలో తొమ్మిది దేవతా స్తవములు ఉన్నాయి. ఉదాహరణకి శివస్తవము సంస్కృతంలో ‘కరణి’ ఛందస్సులో ఉందని, దానిలో ప్రతిపాదంలో ‘స-న-జ-న-భ-స’ అనే ఆరు గణాలు, 6-11-16 అక్షరాలు యతిస్థానాలని తంగిరాలవారు పేర్కొన్నారు. ఇదంతా వీరి ఛందో పరిజ్ఞానానికి తార్కాణం. మూడవభాగంలో దైవప్రార్థనలకు చెందిన 11 పాటలున్నాయి. ఉదాహరణకి జంఝూటి రాగము – ఆదితాళములో ఉంది. సంగీత పరిజ్ఞానం ఉన్నవారు ఈ అంశాలను పరిశీలించవచ్చు.
నందిరాజు చలపతిరావు శిశువులను నిద్రపుచ్చటానికి పాడే లాలిపాటలు, జోలపాటలతో పాటు నిద్దురపాటలను మరో వర్గాన్ని ఇచ్చారు. కృష్ణశ్రీ సేకరించిన కుశలవుల తొట్టె అనే నిద్దురపాటను ఈ పుస్తకంలో అనుబంధంగా ఇచ్చారు. ఇక పెండ్లి పాటలు గురించి చెబుతూ స్త్రీల పాటలు మొదటిభాగంలో పెండ్లి పాటలు పేరుతో ఎనిమిది పాటలున్నాయి. వీటితో పాటు నందిరాజు చలపతిరావు నలుగుపాటలు, వరుసపాటలు, తలుపుదగ్గర పాటలు, చెండ్లపాటలు, అలకపాటలు, గంధము పూసెడి పాటలు, కామేశ్వరి పాటలు, శోభనపు పాటలు, అప్పగింతలపాటలు, మంగళహారతులు అనే మరో పది వర్గాల పాటలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఐదురోజుల పెళ్ళిళ్ళలో చేసే వేడుకలలో పాడే పాటలే కాబట్టి ఇవి కూడా పెండ్లి పాటలలోని అంతశ్శాఖలే. స్త్రీల పాటలు మూడు సంపుటాల్లోనూ ఏ ఏ పాటలు ఎన్నెన్ని ఉన్నాయనే విషయాన్ని సుబ్బారావు వివరించారు. చెండ్లపాటలను బంతుల పాటలు అని కూడా వ్యవహరిస్తారని, చెండ్లు అంటే పూలచెండ్లు అని, బంతులు అంటే పూలబంతులు అనే అర్థాలను చెప్పారు. పెండ్లిలో వధూవరులచేత పూలబంతులు ఆడిస్తారు. ఆ సమయంలో పాడే పాటలే చెండ్లపాటలు.
కామేశ్వరి పాటలు గురించి చెపుతూ “కొన్ని బ్రాహ్మణ కుటుంబాలలో కామేశ్వరీదేవి ఇలవేల్పుగా ఉంటుంది. వారి యిండ్లల్లో పెండ్లి జరిగినప్పుడు తప్పకుండా కామేశ్వరి కొలుపు కొలుస్తారు. ఆ సందర్భంలో కామేశ్వరి దేవి పాటలు పాడుతారు. స్త్రీల పాటలు మొదటి భాగంలో కామేశ్వరికి సంబంధించిన ఏడు చిన్న పాటలు, రెండో భాగంలో ‘అక్కలపాట’ అనే పేరుతోనూ, మూడో భాగంలో కామేశ్వరి పాట అనే పేరుతోనూ ‘మన వాడు పాలకొలను’ అనే పల్లవితో రెండు పెద్ద పాటలున్నాయి. ఈ గేయాలలోని కథా వ్యత్యాసాన్ని చర్చించవచ్చు.
స్త్రీలపాటలు మొదటి భాగంలో ఒకటి, రెండో భాగంలో ఐదు మొత్తం ఆరు శోభనం పాటలున్నాయని తెలుపుతూ రెండో భాగంలో ఉన్న ఒక శోభనంపాటలో దొర్లిన ఘోరమైన అనౌచిత్యాన్ని తంగిరాల గుర్తించారు. ఆ పాటలో “శ్రీజగన్నాథునకు చెలియ సుభద్రామణికి – శోభనము! శోభనము!” అని ఉంది. పూరీజగన్నాథ క్షేత్రంలో బలరామకృష్ణులు తమ గారాల చెల్లెలైన సుభద్రతో కలిసి వెలిశారు. వీరు అన్నాచెల్లెలు అవుతారు కానీ భార్యాభర్తలు కారు. కాబట్టి ఇలా అన్నాచెల్లెళ్ళ పేర్లు శోభనం పాటలో చేర్చడం క్షమించరాని నేరం. కాబట్టి ఆ పాదాన్ని తంగిరాల వారు విడిచి పెట్టారు. కేవలం గేయాలను పునర్ముద్రించడమే కాకుండా, ఆ పాటల్లోని ఉచితానుచితాలను కూడా గ్రహించి పరిష్కరించడం, ఆయన పరిశోధనాత్మక దృష్టికి నిదర్శనం. తొమ్మిది పదుల వయస్సులో కూడా వీరు చేసిన ఈ కృషి మిక్కిలి ప్రసంశనీయం. మనందరికీ అత్యంత ఆదర్శనీయం.
అప్పగింతల పాటలలో “గుండెలను పిండివేసే కరుణరసభరితమైన ఈ అప్పగింతల పాటలో ప్రతిపాదంలోను హృదయాన్ని పట్టివేసే చక్కటి చిక్కటి కవిత్వం తొణికిసలాడుతుంది” జానపదులు అలవోకపాడిన ఈ పాటల్లో ఉన్న కవిత్వ ధోరణి, కవి హృదయం వెల్లడి అవుతుంది. జానపదగేయాలలో ఇవి గుర్తించదగిన అంశాలు.
మంగళహారతులు గురించి చెపుతూ అవి రాముడు, ఆండాళ్, గోపాలబాలుడు, హరుడు, శివుడు, పార్థసారథి, సీతారాములు, లక్ష్మీ, వేదాంతం, పార్వతి, శంకరి, శివలింగం, కస్తూరి రంగడు, శ్రీశైల మల్లికార్జునుడు, శ్రీశైల భ్రమరాంబ, కృష్ణుడు మొదలైన దేవతలను గురించి ఉన్నాయి. అంతేకాక ఈ మంగళహారతులలో ఎక్కువభాగం గొప్ప శబ్దాలంకారాలతో కూడి ఉండి, నన్నయ అక్షరరమ్యతను గుర్తుచేస్తాయి అని సుబ్బారావు పేర్కొన్నారు. ఈ విధంగా మంగళహారతులలో అక్షరరమ్యతను గుర్తించడం ఆయన నిశిత పరిశీలనకు తార్కాణం. పార్వతీపరమేశ్వరులను గురించిన మంగళహారతి గురించి చెప్తూ ఆ పాట పార్వతీదేవికీ ఆమె చెలికత్తెకు జరిగిన సంవాదరూపంలో ఉందని చెప్పారు. అంతేకాక అతి ప్రసిద్ధములైన మంగళహారతులు ఈ పాటల పుస్తకంలో ఉన్నాయని, వాటిలో ఒకదానికి భద్రాచల రామదాసు ముద్ర, మరోదానికి త్యాగరాజస్వామి ముద్ర ఉన్నట్లు సుబ్బారావు గుర్తించారు.
కృష్ణలీలలకు సంబంధించిన పాటలను పేర్కొంటూ నందిరాజు చలపతిరావు స్త్రీల పాటలు మొదటి భాగంలో 19 పాటలున్నాయి. వాటిలో ఒకటి త్యాగరాజ కీర్తన కాగా మిగిలిన వాటిలో దాదాపు 10 పాటలు ‘అక్కెనప్రగడ శ్రీహరిదాసు’ రచించినట్టు పాటల చివర ముద్ర కనపడుతుందని, ఈ స్త్రీలపాటలు రెండవ భాగంలో చివర ‘నోములకథలు’ పేరుతో గద్యరూపంలో ఆరు కథలు ఉన్నాయి. చివరిగా కథలేని ఈ స్త్రీల చిన్నపాటలలో కొన్నింటిలో పాటచివర కవిపేరు కనబడుతుంది.
2.2 కథతో కూడిన స్త్రీలపాటలు
నందిరాజు చలపతిరావు ముద్రించిన స్త్రీలపాటలు మూడు భాగాల్లోనూ కథతో కూడిన స్త్రీలపాటలు అనేకం ఉన్నాయి. కానీ వీటినన్నిటిని ఎలాంటి వర్గీకరణ లేకుండా కలగాపులగంగా అన్నిటినీ కలిపి ఇచ్చేశారు. ప్రస్తుతం తంగిరాల వెంకట సుబ్బారావు ఆచార్య బిరుదురాజు రామరాజు తన సిద్ధాంతగ్రంథం “తెలుగు జానపద గేయసాహిత్యము”లో నాలుగు రకాలుగా చేసిన స్త్రీలకథాగేయాల వర్గీకరణను (1.రామాయణ సంబంధములు, 2.భారత సంబంధములు, 3.భాగవత సంబంధములు, 4.ఇతరములు) అనుసరించి నందిరాజు చలపతిరావు సేకరించిన స్త్రీలకథల పాటలను విభజించుకొని మనకు పరిచయం చేశారు. వీరు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకునే వారని వెల్లడి అవుతుంది. సాహిత్య కారుల మధ్య ఇటువంటి సాంగత్యం వల్ల మంచి సాహిత్యం వెలువడి, సమాజానికి మేలుజరుగుతుంది. అది జానపద సాహిత్యంలో సాధ్యపడిందని చెప్పవచ్చు. ఆచార్య బి. రామరాజు, ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు నేదునూరి గంగాధరం, ఆచార్య నాయని. కృష్ణకుమారి మొదలైన వారందరు పరస్పర సహకారంతో కృషిచేశారని విధితమవుతుంది.
2.2.1 రామాయణ సంబంధములు
నందిరాజు చలపతిరావు స్త్రీలపాటల్లో సీతాకళ్యాణం, సీత వసంతము, సీత అలక, సీత గడియ, ఋషుల ఆశ్రమము, లంకాయాగము మొదలైనవి కథాగేయాలు ఉన్నాయని తెలియజేసి, ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు, సీత గడియ, సీత దాగుడుమూతలు, లంకాయాగము, గుహభరతుల అగ్నిప్రవేశము, శ్రీ రామపట్టాభిషేకము, సీత సురటి, కుశలవ కుచ్చల కథ అనే తొమ్మిది స్త్రీల కథాగేయాల గురించి తంగిరాల సుబ్బారావు విమర్శనాత్మక దృష్టితో పరిశీలించారు. ఈ గేయాలను అధ్యయనం చేసి, విమర్శనాత్మక పరిశోధన చేయవలసి ఉంది.
a) ఊర్మిళాదేవి నిద్ర
వాల్మీకి మొదలు వివిధ భాషల్లో రామాయణాలు రాసిన కవులందరూ మహాసాధ్వి అయిన ఊర్మిళాదేవిని మరిచిపోయారు. కానీ తెలుగు స్త్రీలు మాత్రం ఆమెను మర్చిపోలేదు. జానపదులు తాము పాడుకొనే రామాయణ సంబంధిత గేయాల్లో లక్ష్మణుడిని అతని ఇల్లాలు ఊర్మిళాదేవిని మిక్కిలి త్యాగమూర్తులుగా కొనియాడారు.
ఈ ఊర్మిళాదేవి నిద్ర అనే స్త్రీలపాటను తంగిరాల వారు ఆంధ్రుల ప్రత్యేకధనమని కొనియాడారు. అంతేకాకుండా ఈ పాటను గురించి బిరుదురాజు రామరాజు తమ సిద్ధాంత గ్రంథంలో చర్చించారని చెపుతూనే, వారికన్నా ముందే బందా కనకలింగేశ్వరరావు, అడిదము రామారావు, ఇల్లిందల సరస్వతీదేవి వంటి విమర్శకులు దీనిని గురించి రాశారని విమర్శించారు. ఈ పాటను గురించి దేవేంద్ర సత్యార్థి ఆంగ్లంలో రాసి భారతదేశానికంతటికీ చాటిచెప్పి, ఆంధ్రుల ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పిన విషయాన్ని మరోసారి గుర్తుచేశారు.
ఊర్మిళాదేవి నిద్రకు గల కారణాన్ని చెప్పి, అన్న సేవలో మునిగిపోయి భార్యను మరచిన లక్ష్మణుడిని జానపద స్త్రీలు తీవ్రంగా విమర్శించారు. ఇక్కడ జానపద కవులు స్త్రీ పట్ల వివక్షను చూపించడం సహించలేక పోవడంవల్ల విమర్శనాత్మక దృష్టితో చూశారు. అలాగే ఈ గేయంలో ఉన్న చక్కటి సాంఘికాచారాన్ని తెలియజేస్తూ ఇలా పేర్కొన్నారు. “మన యిండ్లలో పూర్వం స్త్రీలు బావ పేరును, భర్త పేరును నోటితో ఉచ్చరించకూడదు. ఆ ఆచారాన్ని పాటిస్తూ ఊర్మిళ బావగారైన రాముని ‘మాయక్కబావ’ అనీ, తన భర్తయైన లక్ష్మణుని ‘మాయక్కమరిది’ అనీ సంబోధించింది”. దీనితో పాటు జానపద స్త్రీలు పాడుకొనే ఈ పాటలో దొర్లిన అనౌచిత్యాలను పేర్కొన్నారు.
నిద్రపోతున్న ఊర్మిళ లక్ష్మణుని పరపురుషునిగా భావించి అతనితో ఇలా అంటుంది.
“ఒకడాలి కోరికాదా ఇంద్రునికి ఒకలెల్ల హీనమాయె
పరసతిని కోరిగాదా రావణుడు మూలముతో హతమాయెను
ఒకడాలి కోరిగాదా కీచకుడు ప్రాణములు కోలుపోయె
ఇట్టి ద్రోహములు మీరూ యెరుగుండి యింత ద్రోహము కొస్తిరా?
ఆడతోడున బుట్టరా? మా వంటి తల్లి లేదా మీకునూ?”
(నందిరాజు చలపతి రావు స్త్రీలపాటలు.2024.287.)
ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలుగా గాఢ నిద్రలో ఉన్న ఊర్మిళకు రాముడు రావణుని చంపిన సంగతి, తర్వాత యుగంలో జరగబోయే కీచకవధ గురించి ఎలా తెలిసాయి. ఇవి రెండూ ఈ పాటలో దొర్లిన అనౌచిత్యాలు. ఊర్మిళ మాటలకు తమ మాటలు కొన్ని చేర్చి ఈ విషయాన్ని తెలుగు స్త్రీలు బలపరిచినారని భావించాలి అని పేర్కొన్నారు. దీనికి తంగిరాల వారు మరొక కారణాన్ని కూడా తెలియజేశారు. “యోగులకు భూత భవిష్యద్వర్తమానములు కరతలామలకములు కనుక విరహ యోగినియైన ఊర్మిళా మహాసాధ్వి భవిష్యద్వర్తమానమును ఇందు జోడించెనని భావించాలి” అని పేర్కొన్నారు. ఇక్కడ ఊర్మిళ గాఢనిద్రలో లేదని, యోగనిద్ర లో ఉండడంవల్ల భవిష్యద్దర్శనం చేయగలిగిందని కూడ చెప్పవచ్చు. జానపదులు తమ అభిప్రాయాలను పాటలలో జోడించి, ఆయా పాత్రలచేత భవిష్యద్దర్శనం చేయిస్తారని ఈ సన్నివేశం ద్వారా అవుతుంది.
b) లక్ష్మణదేవర నవ్వు
ఊర్మిళాదేవి నిద్ర పాటతో దగ్గర సంబంధం కలిగిన పాట “లక్ష్మణదేవర నవ్వు”. ఊర్మిళాదేవి పద్నాలుగేండ్ల నిద్రకు, లక్ష్మణుని పద్నాలుగేండ్ల నిద్రాహార రహితమైన సోదర సేవకు జానపదులు ఒక చక్కటి కథాకల్పన చేశారు. అంతేకాక ఈ పాటకు గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం, సంస్కృతంలో భవభూతి రచించిన ఉత్తరరామ చరిత్ర నాటకంలోని చిత్రపటదర్శనం వంటి సంఘటనతో పోలికలను చూపించారు. లక్ష్మణదేవర నవ్వు పాటను ఆయా గేయ పంక్తులను ఉదాహరిస్తూ పాట సారాన్నంతటిని సూక్ష్మంగా తెలియజేశారు. లక్ష్మణుడు తమను చూసే నవ్వాడని అక్కడి వారంతా భుజములు తడుముకోవడం కనిపిస్తుంది.
గేయం: “శంకరుడు తనలోను తలచి యిట్లనెను – జాలారివీథులా నీలకన్యకను
జడలెత్తి శిరసునా ధరియిస్తి నన్నే – తలచి లక్ష్మణ నేడు తానవ్వెననుచు
శంకరుడు కొలువులో తలవంచుకొనెను”
“అంగదుడు తనలోను తలచి యిట్లనెను – సాహసమ్మున తండ్రి తలచినరాజూ
తలచి వేడుకకూడు కుడిచె వీడనుచూ – తలచి లక్ష్మణ నేడు తానవ్వెననుచు
అంగదుడుకొలువులో తలవంచుకొనెను – సుగ్రీవుడు తనలోను తలచి యిట్లనెను
తనవెనుక తనఅన్న ఆవాలి జంపి – చంపి తనవొదినెను సతిజేసుకోనీ
కానకయున్నాడు కపీంద్రుడనుచు – కిష్కిందరాజ్యమ్ము యేలె వీడనుచు
తలచి లక్ష్మణ నేడు తానవ్వెననుచు – సుగ్రీవుడు కొలువులో తలవంచుకొనెను”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు, 2024.270)
లక్ష్మణుడి నవ్వుతో రాముడికి కోపం వచ్చి కత్తి దూయడం, తర్వాత కారణాన్ని తెలుసుకొని రాముడు పశ్చాత్తాపపడడం కూడా ఈ పాటలో కనిపిస్తాయి. కుటుంబ జీవనంలో ఇటువంటి సంఘటనలు అక్కడక్కడా తారసపడుతూనే ఉంటాయి. కొన్ని సందర్బాలలో తొందరపడడం, తరువాత వాస్తవం తెలుసుకుని బాధపడడం సర్వసాధారణం. వాటినే కవి ఈ సన్నివేశంలో ప్రవేశపెట్టాడని చెప్పవచ్చు.
c) సీతగడియ
మధ్యతరగతి కుటుంబాల్లో సహజంగా కనిపించే సంఘటనలను జానపద స్త్రీలు సీతారాములకు అన్వయించి పాటలు పాడడం సర్వసాధారణం. అటువంటి అందమైన పాటే సీతగడియ. తంగిరాల వారు ఈ పాటలో సీత అలంకరణ ఎంత రమణీయంగా వర్ణింపబడిందో తెలియజేసి, సీతారాముల సంభోగ శృంగారాన్ని జానపద కవయిత్రి అనౌచిత్యానికి ఏ మాత్రమూ తావులేకుండా ఎంతో ధ్వన్యాత్మకంగా వర్ణించిందని తెలియజేశారు.
గేయం: “సిగ్గుతో శ్రీలక్ష్మి విభుని సన్నిధికి – చేరగానే దివ్వె కలకలా నవ్వె
ఆకులవాసనా పానుపు మీద – పోకలవాసనా పానుపుమీద
పువ్వులవాసనా పానుపుమీద – బుక్కాయివాసనా పానుపుమీద
కస్తూరివాసనా పానుపుమీద”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు.2024.207)
d) సీత దాగుడుమూతలు
ఇది 36 పాదాల చిన్నపాట. ఈ పాట ద్విపద నడకలో నడిచింది.
గేయం: “సీత దాగుడుమూతలనగ సృష్టిలోపల
భక్తితోడ పాట పద్మాక్షి పాడెను”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు.2024.399)
అనే చివరి పాదాలను బట్టి ఈ పాటను రాసిన స్త్రీ పేరు పద్మాక్షి అని మనం ఊహించవచ్చు. ఇక్కడ పద్మాక్షి అనేది స్త్రీ నామం కాక ఆమెకు వాడిన విశేషణం అనే అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు. అంతేకాక ఈ పాటలో సీత ముత్యాల చవికెకు కదిలి వచ్చింది అనీ, రాముడు రత్నాల చవికెకు వచ్చాడు అని ఉంది. ఇక్కడ చవికె అంటే నలుచదరపు చావిడి అని మనం అర్థం చేసుకోవాలి.
e) లంకాయాగము
ఇది మొత్తం 26 పుటలలో 739 పాదాలలో ఉన్న పెద్ద పాట. కైకయి కోరిక పై సీతారామలక్ష్మణులు అరణ్యవాసానికి బయలుదేరడం దగ్గర నుండి రావణసంహారం చేసి రాముడు అయోధ్యకు తిరిగివచ్చి పట్టాభిషిక్తుడు కావడం వరకు గల రామాయణ కథంతా ఇందులో ఉంటుంది.ఈ పాటలోని జానపదుల అద్భుత కల్పనలు అనేకం కనిపిస్తాయి. అంతేకాక రావణుడు పాతాళహోమం చేయడం వంటి అవాల్మీకాంశములు కూడా ఉన్నాయి.
f) గుహ – భరతుల అగ్నిప్రవేశము
రామాయణగాథలో చిన్న ఘట్టమైనా “గుహ భరతుల అగ్నిప్రవేశము” అనే గేయంలో రాముడు వనవాసానికి వెళ్ళే సమయంలో భరతుడు రాముడు పద్నాలుగేండ్లు తర్వాత తిరిగి అయోధ్యకు రావటం ఒక్కరోజు ఆలస్యమైన తాను అగ్ని ప్రవేశం చేస్తానని చెప్తాడు. రామాదులను నది దాటించిన గుహుడు కూడా వారి రాకకోసం ఎదురు చూసి పద్నాలుగేండ్ల తర్వాత పంచమి నాడు అగ్ని ప్రవేశం చేస్తానని అంటాడు. రావణ సంహారం అనంతరం రాముడు అయోధ్యకు బయలుదేరటానికి ముందు హనుమంతుణ్ణి పిలిచి తాము వస్తున్న విషయం భరతునికి తెలియజేయమని చెప్తాడు. సీతాదేవి గుహుని విషయం కూడా గుర్తుచేస్తుంది.
“రావయ్య హనుమంత పోవయ్య వేగా – ఆలస్యమవకుండ అయోధ్యపురికి
మనరాక మనవీటి మహితులకు జెప్పు – కౌసల్య కెరిగించు కార్యమంతాను
సుమిత్ర కెరిగించు సుగుణామంతాను – వేషమ్ము భరతుడూ లోకమ్ములనినా
భావించి హర్షమున భాషించిరమ్మి”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు, 2024. 249)
అప్పుడు ఆంజనేయుడు శృంగిబెరపురంలో అగ్నిప్రవేశానికి సిద్ధపడుతున్న గుహునికి రామాగమన శుభవార్త చెప్పి అతన్ని నివారిస్తాడు. అదే విధంగా నందిగ్రామానికి వెళ్ళి అక్కడ అగ్నిప్రవేశానికి సిద్ధంగా ఉన్న భరతుని వారించి శుభవార్త అందిస్తాడు. ఈ పాటలో రామాదుల అయోధ్యానగర ప్రవేశం, అయోధ్యాప్రజల ఉత్సాహానందాలు, గుహుని భక్తి చక్కగా చిత్రించబడ్డాయి.
ఇదే విషయం రంగనాథ రామాయణంలోనూ, కంబ రామాయణంలోనూ కూడా ఉందనే విషయాన్ని తంగిరాల సుబ్బారావు పేర్కొన్నారు.
g) శ్రీరామపట్టాభిషేకము
రామాయణ సంబంధమైన ఈ ఘట్టం చిన్నదైనా పాట మాత్రం పెద్దది. ఈ పాట దాదాపు 10 పుటలలో సుమారు 600 మంజరీద్విపద పాదాలలో సాగుతుంది. ద్విపద+ద్విపద కలిస్తే మంజరీద్విపద అవుతుంది. ఈ పాటలో రామపట్టాభిషేక ఘట్టమంతా కడు రమణీయంగా వర్ణింపబడింది. ఈ గేయంలో కులగురువు వశిష్టుడు రాముని సింహాసనాన్ని అత్యద్భుతంగా వర్ణించాడు.
గేయం: “సహస్రమణులా మణుల జగమెల్ల వెలుగా – శేషువమీద భమిడికూర్మమమరిందీ
సర్వేశ్వరుల గద్దె చెలగి మ్రోయగనూ – అష్టదిగ్గజములాతోడగల ఆది
సింహములచేత శృంగారములచేతా – సిరివెలుగుచుండు శ్రీరాఘవుల గద్దే”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024.511)
అంతేకాకుండా పట్టాభిషేక సమయంలో బంధుమిత్రులంతా సీతారాములకు రకరకాల కట్నాలు చదివించినట్లు వర్ణించబడింది. సుగ్రీవుడు ఇచ్చిన కంఠహారాన్ని సీతమ్మ ఆంజనేయునికి వేసినట్లు ఈ పాటలో ఉంది. ఈ కట్నాల చదివింపులు జానపదుల కల్పనగా చెప్పవచ్చు. సమాజపు కట్టుబాట్లు, ఆచారాలు మొదలైనవి మౌఖిక సాహిత్యంలో చోటుకుంటాయనడానికి ఇదే సరైన ఉదాహరణ.
గేయం: “నాయాత్మ బంధుండ జీవరక్షకుడా – మాయన్న హనుమంత రమ్మనుచు బిలిచే
తనచేత కంఠమాల హనుమంతుకేసె”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024.515)
ఈ విషయం రంగనాథ రామాయణంలో కూడా ఉన్నదనీ, దీనికి మూలం అధ్యాత్మరామాయణం అని తంగిరాలవారు ఈ పుస్తకానికి రాసిన పీఠికలో పేర్కొన్నారు.
h) సీతసురటి
సురటి అంటే వింజామర అని అర్థము. శ్రీరామపట్టాభిషేక సమయంలో దేవతలంతా విచ్చేశారు. అప్పుడు దేవేంద్రుని భార్య శచీదేవి సీతకు ఒక సురటిని బహుమానంగా ఇచ్చింది. అదే ఈ పాటకు శీర్షికగా స్థిరమైంది. ఈ పాటను గురించి రాస్తూ తంగిరాల సుబ్బారావు ఇలా పేర్కొన్నారు. “రాముని రాక్షససంహారానికి సీతయే మూలకారణమని నిరూపించే పాట యిది. ఈ పాటలో కథ తక్కువ; వర్ణనలు ఎక్కువ. కాని ఆ వర్ణనలు లోకోత్తరంగా ఉన్నాయి. ఇంత గొప్ప వర్ణనలు నాకు ఇతరములైన స్త్రీలపాటలలో ఎక్కడా కనిపించలేదు”.
ఈ పాటలో ఉన్న వర్ణనలలో కవిహృదయం వెల్లడి అవుతుంది. అంతేగాక రామపట్టాభిషేకానంతరం అందరూ కలిసి రకరకాల వంటకాలతో భోజనం చేసినట్టు వర్ణించబడింది. ఆనాటి తెలుగువారి వంటకాలు, ఆహారపు అలవాట్లు, భోజనానంతరం అందరూ వేడినీళ్ళతో చేతులు కడుక్కోవడం, మొదలైన విషయాల పాటలో ప్రస్తావన కూడఈ పాటలో ఉంది. ఇక్కడ రాజవంశీకులు ఆహారంలో నెయ్యి, నూనెలను ఎక్కువగా స్వీకరిస్తారనే విషయాన్ని కూడ జానపదకవి తెలియజెప్పే ప్రయత్నం చేశాడు.
ఈ పాటలో శచీదేవి సీత జనన వృత్తాంతాన్ని చెప్పినట్టు వర్ణించబడింది. సీతాదేవి యొక్క అపురూప సౌందర్య లావణ్యం ఈ గేయంలో జనకుని చేత వర్ణితమైంది.
గేయం: “రమ్మి ముద్దులగుమ్మ! రమ్మిమాయమ్మ! – రావమ్మ జానకి! రాజ్యరత్నమా!
తొలకరిమెరపు! రా! తోయజగంధి! – కమలదళనేత్రి! రా! కలహంసగమన!
వెలలేని సౌపాణిముత్యమా! రావె! – ఇందుముఖి! రావమ్మ! కుందనపుబొమ్మా!
కాముని రతికన్న కడురూపవతివి – బాలలబోలు సౌభాగ్యవతీ! రావె!”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024.526)
ఇలా జనకుడు సీతను స్వయంవరానికి పిలిచే పిలుపంతా 80 మంజరీ ద్విపద పాదాలలో సాగింది. ఈ పిలుపు చివర సీత దశావతారాలు ఎత్తిన విష్ణుమూర్తి ఇల్లాలని జనకుడు చెపుతాడు. ఈ గేయం రాక్షస సంహారం చేసింది రాముడు కాదు, సీత అని నిరూపిస్తుంది అని తంగిరాల వారు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీన్నిబట్టి ఈ పాటను ఎవరో స్త్రీయే రచించి ఉండవచ్చు. ఈ పాటలోని జానపదుని భావనాశక్తిని తెలియజేస్తూ “సీత అనే కాలసర్పం రాక్షసులు అనే కప్పలను మ్రింగి, బం మేడ అనే పుట్టలో మెలగుతూ ఉన్నదట. ఈ కాలసర్పం రాముడు అనే మంత్రగానికి చిక్కిందట” అని పేర్కొన్నారు.
ఈ స్త్రీలపాటలలో స్త్రీలమనస్తత్త్వం, వారి సుకుమారమైన భావాలు, అభ్యంజనస్నానాలు, పువ్వులు, నగలు, అలంకరణ విధానం మొదలైనవి సూక్ష్మాతి సూక్ష్మంగా వర్ణించబడ్డాయి. ఇక్కడ జానపద రచయిత్రుల హృదయం వెల్లడి అవుతుంది. వారి స్వతంత్రభావాల, పురుషుని ఆధిక్యతను తోసిపుచ్చడం స్పష్టమవుతుంది. స్త్రీలు తమ మనోభావాలను ఈ పాటల రూపంలో వ్యక్తపరిచారని తెలుస్తుంది.
i) కుశలవ కుచ్చల కథ
ఇక్కడ కుచ్చల శబ్దానికి రవిక, కంచెల అనే అర్థాలు నిఘంటువులో ఉన్నాయని చెప్పి, ఆ అర్థాలు ఇక్కడ సరిపోవని ఆ శబ్దానికి తనకు కృష్ణశ్రీ చెప్పిన బాల్యము అనే అర్థాన్ని చెప్పుకోవాలని తెలియజేశారు.
కుశలవ కుచ్చల కథ, కుశలవుల యుద్ధము, ధర్మరాజు జూదము అనే మూడు పాటలలోనూ నేటి స్త్రీవాదం కనపడుతుంది అని చెప్పి ఈ మూడు పాటలు ఒకే స్త్రీ రాసి ఉంటుంది. రావణ వధానంతరం సీతను రాముడు అనుమానించడం అంతా ఈ పాటలో ఉంది. అంతేకాక అడవిలో ఆమెను చంపివేసి రమ్మని లక్ష్మణుడికి చెప్పాడని ఈ పాటలో ఉంది. ధర్మరాజుజూదం అనే పాటలో కూడా ద్రౌపది దుశ్శాసనాదులు చేత ఘోరంగా అవమానించబడినట్లు వర్ణించబడింది. ఈ రెండు సంఘటనలు జానపద స్త్రీల మనస్సును తీవ్రంగా కలచివేశాయి. అందువల్ల స్త్రీలు పాడుకునే పాటల్లో కుశలవుల చేత రాముణ్ణి, ద్రౌపది పాత్రద్వారా దుర్యోధనుణ్ణి తీవ్రంగా విమర్శించారు. ఇక్కడ స్త్రీలు సమాజంలో తాము ఎదుర్కొన్న వివక్షను, పురుషుడిపట్ల వారికి ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరిచినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో కొన్నికొన్ని సార్లు ఘోరమైన అనౌచిత్యాలకు కూడా పాల్పడ్డారు. మనిషి తీవ్రమైన క్రోదానిక గురైనప్పుడు కొంత తడబడడం, మరచిపోవడం వంటివి జరుగుతాయి. ఇక్కడ స్త్రీలుకూడ ఈ గేయాలను పాడేటప్పుడు అటువంటి స్థితికి లోనయ్యారని చెప్పవచ్చు.
ఇదే పాటలో దంపతుల అనురాగం, అన్నాదమ్ముల అనుబంధం, వదినె మరదళ్ళ దెప్పిపొడుపులు మొదలైనవి కనిపిస్తాయి. ఈ పాటలో స్త్రీలు రాముడు చేసిన సీతాపరిత్యాగానికి చాకలివాని నింద కథకన్నా ఎంతో బలవత్తరమైన కారణాన్ని కల్పించారు. అదేంటంటే అడవిలో రామలక్ష్మణుల్ని మోహించి, ముక్కు చెవులు కోల్పోయిన చుప్పనాతి శూర్పణఖ సీతారాముల్ని విడగొట్టడానికి పెద్ద పన్నాగం పన్నుతుంది. యతివేషాన్ని ధరించి అడవిలో వేటాడుతున్న రాముడు దగ్గరకు వెళుతుంది. తన మహిమలను గురించి రామునితో చెప్పి తన విద్యలను చూడమంటుంది. ఆ దొంగ సన్యాసిని మాటలను నమ్మిన రాముడు అంగదుడిని పిలిచి ఈ యోగినిని అంతఃపురానికి తీసుకు వెళ్ళమంటాడు. ఆ మాయా యోగిని చేతను అనేక కష్టాలు పెడుతుంది. అంతఃపుర స్త్రీలు ఆ యతికి రత్నాలు, మాణిక్యాలు, కనకపు చీరలు, సొమ్ములు బహుమానంగా ఇస్తారు. అప్పుడు శూర్పణఖ ఇవన్నీ యతినైనా నాకెందుకు? రావణుడి పటం గీసిస్తే వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు శాంత సీతతో రావణుని పటం వ్రాయమంటుంది. సీత తానెన్నడు రావణుడి ముఖం చూడలేదని కేవలం కాలి బొటనవేలు మాత్రమే వ్రాసిస్తుంది. అప్పుడు ఆ మాయాయతి మిగిలిన చిత్రపటాన్ని పూర్తి చేసి బ్రహ్మదేవుని దగ్గరకు తీసుకువెళ్లి అతన్ని బతిమాలి రావణుని చిత్రపటానికి ప్రాణం పోయిస్తుంది. తర్వాత ఆ పటాన్ని తెచ్చి అయోధ్యలో వదిలిపెట్టి ఆకాశమార్గాన మాయమైపోతుంది. ఆ రావణ పటం సీతకు ఎదురుగా వచ్చి నిలబడి రావే సీతా! లంకకు పోదాం! అని పీడించడం మొదలు పెడుతుంది. అంతఃపుర స్త్రీలందరూ భయపడి ఆ పటాన్ని పెద్దపెద్ద రాళ్లు వేసి కప్పిపెట్టారు. నూతిలో పడేశారు. కానీ ఆ మాయాపటం ముందు అవేమి నిలవలేకపోయాయి. సీత మిక్కిలి దుఃఖించింది. చివరకు ఆ చిత్రపటాన్ని రాముని హంసతూలికాతల్పం కింద దాచిపెట్టారు. వేట నుండి తిరిగివచ్చిన రాముడు సీతతో సరససల్లాపాలలో ఉండగా, తల్పంక్రింద ఉన్న రావణపటం మంచంమీద నుండి రాముణ్ణి నేల మీదకి పడగొడుతుంది. రాముడు ఆశ్చర్యంతో సీత మోటుసరసం ఆడింది అనుకుంటాడు. వెంటనే రాముడు పైకి లేచి పట్టెమంచంపై కూర్చునే సరికి రావణ పటం వచ్చి ముందు నిలబడుతుంది. దానితో రాముడు సీతశీలాన్ని శంకించాడు. సీతను అడవికి తీసుకొని పోయి ఆమె శిరస్సును ఖండించమని లక్ష్మణుడిని ఆజ్ఞాపించాడని స్త్రీలు అద్భుతమైన కథను కల్పించారు. సీత శిరస్సును ఖండించమని రాముడు అనేసరికి కౌసల్య సుమిత్ర కైకేయిలు, శాంత, రాముని మరదళ్ళు మాండవి, ఊర్మిళ, శ్రుతకీర్తి సీత తప్పులేదని వాదించారు. అయినా రాముడు వినకపోయేసరికి వీరంతా తిరుగుబాటు ధోరణిలో మాట్లాడతారు. వీరందరి కంటే చిన్నదైన శ్రుతకీర్తి ముందుకొచ్చి రామునితో ధైర్యంగా వాదిస్తుంది. ఈమె మాటల్లో గొప్ప స్త్రీవాది కనిపిస్తుందని తంగిరాల వారు పేర్కొన్నారు. లక్ష్మణుడు సీతను అడవిలోకి తీసుకొని పోయి శిరస్సును ఖండించకుండా వాల్మీకి ఆశ్రమంలో దాచిపెడతాడు. ఒక పరిగెత్తే కుందేలును చంపి, ఆ రక్తాన్ని తన కత్తికి పూసి అయోధ్యకు వెళ్లి సీతను నరికివేశానని అబద్ధం చెప్తాడు. రాముడు సీత నిజంగానే మరణించిందని నమ్మి ఆమెకు తిలోదకాలు విడిచిపెడతాడు. కొంతకాలానికి వాల్మీకి ఆశ్రమంలో సీత పండంటి మగ బిడ్డకు జన్మనిస్తుంది. ముని కాంతలు బాలింతరాలికి చేయవలసిన విధులన్నీ సక్రమంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అంతా మిక్కిలి సూక్ష్మాంశాలతో సహా వర్ణించబడింది. తెలుగుదేశంలోని మధ్య తరగతి కుటుంబాలలో బాలింతరాలికి నిర్వహించే అంశాలన్నింటిని ఈ గేయంలో సూక్ష్మాతి సూక్ష్మంగా వర్ణించబడ్డాయి. సీతకు పుట్టిన బాలునికి వాల్మీకి కుశుడు అని నామకరణం చేస్తాడు. ఒకరోజు సీత తన బిడ్డ పడుకున్న తొట్టెకు పువ్వుల బంతులు కట్టాలని అడవికి వెళుతూ బాలుని జాగ్రత్తగా చూస్తూ ఉండమని తపస్సు చేసుకుంటున్న మునులకు చెప్పి అడవిలోకి వెళ్ళింది. కానీ కొంతసేపటికి తిరిగి వచ్చి తొట్టెలోని బాలుని తీసుకుని వెళ్ళింది. తపస్సులో ఉన్న మునులు అది గమనించలేదు. తపస్సానంతరం కళ్ళు తెరిచి చూసేసరికి బాలుడు కనిపించలేదు. దాంతో సీత వచ్చి తమను శపిస్తుందనే భయంతో మునులు కుశదర్భకు జీవంపోసి, ఒక బాలుని సృష్టించి ఆ తొట్టెలో పెట్టారు. అడవి నుంచి తిరిగి వచ్చిన సీత తొట్టిలో ఉన్న బిడ్డను చూచి ఆశ్చర్యపోయింది. ఏం జరిగిందని మునులను అడిగితే నీవు ఇద్దరు బిడ్డల్ని కన్నావని, ఆ ఇద్దరూ అయోధ్యకు ఏలుతారని ఆశీర్వదించారు. ఆ రెండో బాలుడే లవుడు. క్రమంగా కుశలవులిద్దరూ వాల్మీకి మహర్షి దగ్గర సమస్త విద్యలు నేర్చుకున్నారు.
గేయం: “అస్త్రశస్త్ర విద్యలు అన్నీ – ఆరు శాస్త్రములు, నాల్గువేదములు
పరగగ పదునెనిమిది పురాణములు – చతురార్థమ్ములు పంచకావ్యములు
వనములలో వాల్మీకుడు నేర్పె”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024.597)
కుశలవులు తమ తండ్రి ఎవరో తెలుసుకొని తల్లిదండ్రులు ఇద్దరినీ కలపాలని నిశ్చయించుకుంటారు.
రాముడు అశ్వమేధ యాగం చేసి విడిచిపెట్టిన గుర్రాన్ని వాల్మీకి ఆశ్రమం దగ్గర లవుడు బంధిస్తాడు. ఎదిరించిన శత్రఘ్నుని సైన్యాన్ని చంపివేస్తాడు. తర్వాత శత్రుఘ్నుడు రావడం, లవుడికి శత్రుఘ్నుడికి జరిగిన యుద్ధంలో లవుడు మూర్ఛ పోతాడు. విషయం తెలుసుకున్న కుశుడు అయోధ్యకు వెళ్లి తమ్ముడిని విడిపిస్తాడు. ఇద్దరూ కలిసి మంథరను చంపివేసి, అశ్వాన్ని తీసుకుని ఋషిపల్లెకు వస్తారు. ఆ తర్వాత కుశలవులకు, రాముడు, అతని తమ్ములకు యుద్ధం జరుగుతుంది. ఆ క్రమంలో బాలురిద్దరూ చిన్నంతరం పెద్దంతరం లేకుండా రాముడిని అతని తమ్ములను బెదిరిస్తారు. ఆ క్రమంలో ఈ పాటలో అనేక అనౌచిత్యాలు దొర్లాయి.
“మీ తల్లుల మొగులము మేమిక్కడనూ
పెరుగుతు నుంటిమి యెరుగరు యింకా
మీ కౌసల్యతిశూరుల కంటే
మా జానకి కడుచోరుల గనెనా?”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 603)
ఇక్కడ కుశలవులు రాముని సోదరులతో మీ తల్లులకు మొగుళ్ళము అనడం ఈ పాటలోని ఘోరమైన అనౌచిత్యం.
2.2.2 మహాభారత సంబంధములు
నందిరాజు చలపతి రావు సేకరించిన స్త్రీల పాటలలో మహాభారత సంబంధమైన కథాగేయాలు 1 సముద్రమథనం. 2. సర్పయాగం 3.శకుంతల సీమంతం 4. ధర్మరాజు జూదం 5. కీచకవథ- స్త్రీలపాట 6.సుభద్రసారె 7. శశిరేఖ పెండ్లిపాట మొదలైనవి ఉన్నాయి.
a) సముద్రమథనం
ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం ద్వితీయాశ్వాసంలో సముద్రమథన వృత్తాంతం చెప్పబడింది. ఈ కథను జానపద స్త్రీలు కథాగేయంగా మలుచుకున్నారు. ఈ కథాగేయంలో ఒక్కొక్క పాదంలో ఆరు మాత్రాగణాలున్నాయని, 1-3-5 గణాద్యక్షరాలకు యతిమైత్రి చెల్లుతుందని, 1-5 గణాలకు మాత్రమే యతి కనబడుతుందని తంగిరాల వారు పేర్కొన్నారు. ఈ కథ మొత్తం 40 పాదాలలో సాగింది.
సముద్రమథన వృత్తాంతం నన్నయ భారతంలో ఉన్నట్టుగా ఈ పాటలో లేదు. భారతంలో మొదట గరళం పుడుతుంది. ఈ పాటలో మాత్రం ప్రారంభంలోనే అమృతం పుట్టినట్టుగా చెప్పబడింది. మూలంలో గరళము తర్వాత జేష్ఠ్యాదేవి, చంద్రుడు, లక్ష్మి, తెల్లనిగుర్రం, కౌస్తుభమణి, ఐరావతము, అమృతంతో నిండిన తెల్లని కమండలాన్ని ధరించిన ధన్వంతరి అనే దేవవైద్యుడు మొదలగువారు పుట్టారు. స్త్రీల కథాగేయంలో మాత్రం అమృతం, లక్ష్మి, తెల్లనిగుర్రం, కౌస్తుభమణి, ధన్వంతరి, గరళము మొదలైనవి పుట్టినట్టుగా ఉంది. మూలంలో విష్ణువు కృత్రిమ నారీరూపంతో రాక్షసులను మోసగించి అమృతాన్ని దేవతలకు ఇచ్చినట్టు ఉంది. స్త్రీల పాటలో మాత్రం జగన్మోహిని రూపంతో మోసగించినట్టుగా ఉంది.
దేవతల వరుసలో కూర్చుని అమృతాన్ని తాగుతున్న కేతువును చూసి సూర్యచంద్రులు విష్ణువుకు చెప్పారు. అతడు వెంటనే కేతువు శిరస్సును చక్రంతో ఖండించాడు. కానీ అమృతం త్రాగినందువలన కేతువు శిరస్సు నాశనం లేకుండా సూర్యచంద్రులతో విరోధం పెట్టుకుంది. ఇది మహాభారతంలో ఉన్న కథ. స్త్రీల పాటలో మాత్రం విష్ణువు కేతువు తలనరకగా, తల కేతువు అనే పేరుతో సూర్యునికి, మొండెము రాహువు అనే పేరుతో చంద్రునికి వైరులుగా మారాయని ఉంది. ఇది జానపద స్త్రీల అద్భుత కల్పన. ఇలాంటి కల్పనలు ఈ పాటలో కనిపిస్తాయి. మూలంలోని కొన్ని అంశాలు ఈ పాటలో కనిపించవు. అన్ని స్త్రీల పాటల వలెనే ఈ పాటలో కూడా చివర ఫలశ్రుతి ఉంది. అంతేకాక “సముద్రమున జనియించి వెలుగు” అనే పాదం ఈ పాటలో ఐదుసార్లు పునరుక్తమయింది. ఇది జానపద కవితాలక్షణం. దీనిని అభివర్ధిత పునరుక్తి అంటారు. పాటలలో పై విషయాలన్ని పరిశీలించదగిన అంశాలు.
b) సర్పయాగము
ఈ కథ కూడా మహాభారతం ఆదిపర్వం ద్వితీయాశ్వాసంలోనే వస్తుంది. పరీక్షిత్తు శాప వృత్తాంతం అంతా మంత్రులు చెప్పగా విన్న జనమేజయుడు తక్షకుడు మీద కోపోద్రిక్తుడై బ్రాహ్మణులను పిలిపించి సర్పయాగం ప్రారంభిస్తాడు. వేలాది పాములు వచ్చి హోమగుండంలో పడి భస్మం అయిపోతూ ఉంటాయి. తక్షకుడు భయంతో దేవేంద్రుడిని వేడుకుంటాడు. ఇంద్రుడు అభయమిస్తాడు కానీ ఋత్విక్కులు మంత్రాలు చదవగానే తక్షకుడు దేవేంద్రుడు దగ్గర నుండి విడిపోయి హోమగుండం పైన ఆకాశంలో గిరగిరా తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో వాసుకి మేనల్లుడైన ఆస్తికుడు వచ్చి, జనమేజయుని ప్రశంసించి, సర్పయాగం మాన్పిస్తాడు. అగ్నిలో పడబోతున్న తక్షకుడిని వెనక్కి వెళ్ళిపొమ్మంటాడు. ఈ కథ అంతా కూడా స్త్రీలకథాగేయంలో 124 మంజరీద్విపద పాదాలతో సంక్షిప్తంగా ఉన్నదని తంగిరాల వారు తెలియజేశారు. అంతేకాక మూలానికి జానపద స్త్రీల కథాగేయానికి ఉన్న భేదాలను కూడా చూపించారు.
మూలంలో ఉదంకుడు తక్షకుడి మీద కోపంతో జనమేజయుని సర్పయాగం చేయమని ప్రోత్సహించినట్టు ఉండగా స్త్రీల పాటలో ఈ విషయం లేదు. మూలంలో పరీక్షిత్తును శమీకుని కుమారుడు శృంగి శపించాడు. కానీ స్త్రీల పాటలో శమీకుడే శపించినట్లుగా ఉంది. ఇది అనౌచిత్యమని, మూలంలో పరీక్షిత్తు దాక్కున్న నేలమీద ఉన్న ఒంటిస్తంభం మేడ కాస్త స్త్రీలపాటలో సముద్రం మధ్యలో ఉన్న ఏకస్తంభం మేడగా మారింది. ఇలాంటి ఆమూలకాంశాలను స్త్రీల పాటలలో జానపదకవి మనోభావాలను వ్యక్తపరిచారు.
మూలంలో సర్పయాగంలో అగ్నిగుండంలో పడిన వేలాది పాముల జాతుల పేర్లు కోటీశ, మానసపూర్ణ శలపాల, హలీమక, పిచ్చిల, గౌణప మొదలైన సంస్కృత నామాలుగా ఉన్నాయి. ఇవి ఐదు ప్రధానవంశాలకు చెందిన వాసుకి, తక్షక, ఐరావత, కౌరవ్య, ధృతరాష్ట్ర కులసంభవులైన సర్పాలు. స్త్రీల పాటలో మాత్రం ఈ పేర్లు ఏవి కనిపించవు. ఆ పేర్లు ఏవి జానపదుల అనుభవంలో లేనివి కావటం చేత తమకు తెలిసిన లేక తాము నిత్యం చూసే పాముల పేర్లను ఈ పాటలో చేర్చుకుని పాడడం కనిపిస్తుంది. ఆ సందర్భంలో ఏ ఏ చోట్ల నుండి ఎటువంటి పాములు వచ్చాయో చెబుతు, అద్భుతమైన శబ్దాలంకారాలను పాటించిన జానపద కవయిత్రికి గల శాస్త్రనైపుణ్యం తెలుస్తుంది.
గేయం: “తెల్లత్రాచులును, నల్లని త్రాచుల్ – కొండచిలువలును గోసంగులును
పసిరిక పాములు, పలుజాతులును – నూనిపరువుడులు నూరులకొలది
పొడలును, పిచికపొడలును, వాన – కట్టెలును, మరి పుట్టదిట్టలును
యెక్కుపాములును నెన్నగలేని – కట్లపాములును కడువడి తోడ”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 443)
ఈ పాటలో కవయిత్రి తెల్లత్రాచు, నల్లత్రాచు, కొండచిలువ, గోసంగి, పసిరిక, నూనెపరువుడులు, పొడలు, పిచికపొడలు, కట్లపాములు మొదలైన సర్పజాతులను పేర్కొనడం కనిపిస్తుంది.
c) శకుంతల సీమంతము
ఈ పాట నందిరాజు చలపతిరావు సేకరించిన స్త్రీల పాటలు మూడవ సంపుటంలో ఉంది. ఇది తరువోజ, మధ్యాక్కర వంటి ఛందస్సులలో ఉంది. ఈ పాటలో శకుంతల దుష్యంతుడు, కణ్వుడు, గౌతమి అని నాలుగు పేర్లు కనిపిస్తాయి. వివాహితులైన యువతులు తొలిసారి గర్భం దాల్చినప్పుడు వేవిళ్ళతో ఎలా బాధపడతారో ఆ లక్షణాలన్నిటిని శకుంతలకు ఆపాదించి జానపద కవయిత్రి ఈ కథాగేయాన్ని రచించింది. గర్భవతిగా ఉన్న శకుంతల ఏయే సూడిదలను కోరిందో కవయిత్రి చక్కగా తెలియజేసింది. మన కుటుంబాల్లో గర్భిణీస్త్రీలకు సీమంతపు వేడుకను ఎలా చేస్తారో అలాగే శకుంతలకు కూడా సీమంతాన్ని జరిపించినట్లుగా గేయంలో వర్ణించబడింది.
d) ధర్మరాజు జూదము
నన్నయ భారతం సభాపర్వం ద్వితీయాశ్వాసంలో ద్యూతక్రీడ వస్తుంది. ఈ రంగానికి నాయకుడు ధర్మరాజు. అతని భార్య ద్రౌపది దుర్యోధనుని వలన ఘోరమైన అవమానాన్ని పొందుతుంది. కౌరవసభలో ఆమెకు జరుగుతున్న అవమానం నుండి శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. దీనిని దృష్టిలో పెట్టుకొని జానపద స్త్రీలు ధర్మరాజు జూదము అనే పేరుతో పాటను సృష్టించుకున్నారు. ఈ పాటను రచించిన స్త్రీ భారతంలో ఉన్న కథకు ఎన్నో మార్పుచేర్పులు చేసి ద్రౌపదిని నాయకురాలిగా తీర్చిదిద్ది దుర్యోధనుని మీద తనకున్న అక్కసునంతా వెలిగ్రక్కింది. ఈ పాటను ఒక గొప్ప స్త్రీవాద రచన అని చెప్పవచ్చు. ఈ పాట మొత్తం 426 మంజరీ ద్విపద పాదాలలో సాగింది.
ఈ పాటలో చావు పుట్టుకలు తెలిసిన సహదేవుడు ఒకరోజు ధర్మరాజు దగ్గరకు వచ్చి దుర్యోధనునితో జూదం ఆడవద్దని, దానివలన అనేక అనర్ధాలు జరుగుతాయని, ద్రౌపది అవమానాల పాలు అవుతుందని హెచ్చరిస్తాడు. అప్పుడు ధర్మరాజు సహదేవునితో నీవు చిన్నవాడవు నీకేం తెలుసు అని అతని పలుకులు చెవిన పెట్టడు. మొత్తం పరివారంతో హస్తినాపురానికి బయలుదేరుతాడు. జూదమాడినప్పుడు ధర్మరాజు తన పరివారాన్నంతటిని కోల్పోయాడని ఈ పాటలో కవయిత్రి వరుసగా వర్ణించింది. స్త్రీలు పాడుకునే ఈ పాటలో ధర్మరాజు శకునితో కాకుండా దుర్యోధనునితోనే జూదమాడినట్టు వర్ణించబడింది. మొదటి ఆటలో ధర్మరాజు గెలుస్తాడు. దుర్యోధనుడు ఓడిపోతూ ఉంటే ఆటను మధ్యలో ఆపి పాచికలు శకుని చేతికిచ్చి, ఇంటి లోపలికి వెళ్ళి జ్యేష్టాదేవిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆమె రాజసూయయాగంలో భీముడు తనను అవమానించాడని, మగవారితో కలిసి పంక్తిలో కూర్చున్న తనను లేచిపొమ్మన్నాడని, అందువల్ల తన చెల్లెలు లక్ష్మీదేవితో చెప్పి ధర్మరాజు నుండి తొలగిపొమ్మంటానని అంటుంది. నేరుగా క్షీరసముద్రం దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవితో జరిగిన విషయాన్ని చెబుతుంది. లక్ష్మీదేవి దారిద్ర్యం సంభవించే పనులు ధర్మరాజు ఏమీ చేయటం లేదని, సుగుణవంతుడైన ధర్మరాజును విడిచి పెట్టడానికి ఇష్టపడదు. ఈ సందర్భంగా జానపద స్త్రీల నమ్మకాలు కొన్ని వరుసగా చెప్పబడ్డాయి.
- అలికి విడిచిన గడప దాటడం
- దివ్వెలేని గృహాన్ని చూడటం
- వాల్చిన రోకలిని దాటటం
- ఇంట్లో ముగ్గుపెట్టకుండా నడవడం
- నీరాడులేని ఇంట్లో నిలవడం
- కుర్రాడులేని ఇంట్లో కుడవడం ( అంటే మగసంతానం లేని ఇంట్లో భోజనం చేయడం)
- ఆడమిగిలిన జలకం ఆడటం ( అంటే ఒకరు స్నానం చేయగా మిగిలిన నీటితో తాను స్నానం చేయడం)
- కట్టి విడిచిన వస్త్రం కట్టడం
- సాన మీది చందనం అలదుకోవడం ( అరగదీసిన గంధాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని దానిని రాసుకోవాలి. అలా కాకుండా సానమీద నుండి నేరుగా గంధాన్ని తీసుకొని రాసుకోకూడదు)
- సభలో పక్షపాతంతో పలకడం
- పాళ్ళు పంచేటప్పుడు భేదంతో పంచడం
- జట్టీ పెండ్లిండ్లు చేయడం
- మునిమాపు ముంజూరు దుయ్యడం ( మునిమాపు అంటే ప్రదోష కాలం అని నిఘంటువు ఇస్తున్న అర్థం)
- ముత్తైదువులను ముండ అని తిట్టడం
- వడిలోకి పుష్పములు కోయడం
- ముడివడ్లు ముని పళ్ళతో కొరకడం
ఇలా 16 రకాల దారిద్ర్య సంకేతమైన పనులను జానపద స్త్రీ ఏకరువు పెట్టి వర్ణించింది. వీటిలో కొన్నింటిని నేటికీ ఆచరించడం మనం గమనించవచ్చు. ఈ పనులేవి ధర్మరాజు చేయడం లేదు కాబట్టి లక్ష్మీదేవి అతనిని వదలలేనంటుంది. ఆ పాట ఎలా ఉంది. ఈ సన్నివేశంలో జానపద స్త్రీలు ధర్మరాజు గొప్పతనాన్ని లోకానికి చాటే ప్రయత్నం చేశారు. సమాజం నాగరికంగా ఎంత అభివృద్ధిని సాధించినప్పటికి, కొన్ని నమ్మకాలు, ఆచారాలు త్యజించలేదని స్పష్టంగా వెల్లడి అవుతుంది.
గేయం: “అలికి విడిచిన గడప దాటడే రాజు – నే ధర్మనందనుని ఎడబాయలేనె
దివ్వెలేనీ గృహము చూడడే రాజు – నే ధర్మనందనుని ఎడబాయలేనె
వాల్చిన రోకలి దాటడే రాజు – నే ధర్మనందనుని ఎడబాయలేనె”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 671)
ఈ పనులేవి ధర్మరాజు చేయడు కానీ దుర్యోధనుడు చేస్తున్నాడు. కాబట్టి ఆ పాపకర్ముని నేను పొందలేను అని లక్ష్మీదేవి అంటుంది. దాంతో జేష్టాదేవి కోపిస్తుంది. అప్పుడు లక్ష్మిదేవి ధర్మరాజుని విడిచి వెళ్ళిపోతుంది. చివరికి ధర్మరాజు వరుసగా అన్నిటినీ కోల్పోయి ఓడిపోతాడు. ఈ పాటలో మొదట “సింహాసనం మీద ధర్మరాజుండె – లోహాసనంమీద రాజు కూర్చుండె” అంటుంది కవయిత్రి. క్రమంగా ధర్మరాజు ఓడిపోవడం ప్రారంభమైన తర్వాత “సింహాసనం మీద రాజు కూర్చుండి – లోహాసనముమీద ధర్మరాజుండి” జూదమాడారని చెబుతుంది. చివరకు ధర్మరాజు తన తమ్ముళ్లను, తనను, ద్రౌపదిని కూడా పణంగా పెట్టి జూదంలో ఓడిపోయాడు. ధర్మరాజుజూదం అనే ఈ స్త్రీల పాటలో మూలంలో ఉన్న కొన్ని విషయాలు లేవు.
ద్రౌపదిని సభకు తీసుకురావడం కోసం నన్నయ్య భారతంలో దుర్యోధనుడు మొదట ప్రాతికామిని, తర్వాత దుశ్శాసనుని పంపిస్తాడు. కానీ స్త్రీలపాటలో మొదట గాంధారిని, కర్ణుని, చందాను ఆజ్ఞాపిస్తాడు. వారు ఇటువంటి పనులు తాము చేయలేమంటారు. అప్పుడు దుర్యోధనుడు కోపంతో తన తమ్ముడైన గాంధార కుమారుడు వికర్ణుని పంపుతాడు. ద్రౌపది అతనితో తాను అంటులో ఉన్నానని చెబుతుంది.
నన్నయ భారతంలో ధర్మరాజు ద్రౌపదిని సభకు ఈడ్చుకొని రమ్మని దుశ్శాసనుని పంపినప్పుడు ద్రౌపది దుశ్శాసనునితో నేను ఏకవస్త్రనై ఉన్నాను నన్ను ముట్టకు అంటుంది. అప్పుడు దుశ్శాసనుడు నీవు ఏకవస్త్రవైతేనేమి? విగత వస్త్రవైతేనేమి? ఎలా అయినా నిన్ను తీసుకుని పోతాను అని బలాత్కారంగా ఈడ్చుకుపోతాడు. ఈ పాటలో మాత్రం ద్రౌపది దుశ్శాసనునితో తనను తాకవద్దని చెప్పినప్పుడు, దుస్సాసనుడు ఆమెపై నీళ్లు పోసి, ఆ తర్వాత శిఖపట్టి ఈడ్చుకుని పోయినట్లు వర్ణించబడింది. ఇది జానపద స్త్రీల నూతనమైన కల్పన.
మూలంలో దుర్యోధనుడు ద్రౌపదిని తన తొడ మీద కూర్చోమని సైగ చేసినట్లు చెప్పబడింది. ఈ పాటలో మాత్రం “మేడలు మహలులు మల్లె సావిళ్ళు – సరిసమత యెక్కవే సఖియ నాతోడ!” అంటాడు. దానికి ద్రౌపది కోపించి దుర్యోధనునితో “నీ తొడమీద నీ భార్య ఎక్కుతుంది. నీ సరిమంచం మీద నీ తల్లి గాంధారి నెక్కించుకో!” అని ఘాటుగా సమాధానం ఇస్తుంది. “కుక్కలాంటి నీవు రాజ్యమేలుతున్నావా? ఎన్ని చేసినా నీవు ధర్మరాజుతో సమానం కాదు” అని చక్కటి ఉపమానాలతో దుర్యోధనుని, ధర్మరాజును తులనాత్మకంగా పోల్చి చెబుతుంది. ఈ సందర్భంలో జానపద స్త్రీ ద్రౌపది నోట ఇలా పలికించింది.
గేయం: “గాజు మెరిసితేను కనకంబు యవున? – పూస మెరిసితేను పుష్యరాగమవున?
మాణిక్యము నలుపైన మసికుండ యగున? – గాడిద యెంతయిన గజమౌనటోరి?
కాలువలెన్నయిన కలిసి పారినను – గంగానదీతోటి సాటియగునట్ర?
ఏరులు యెన్నయిన యెత్తి పొంగినను – సముద్రముతో సరియోనచవిటి బుట్టలు?
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 673)
ఈ గేయ పంక్తులన్నీ జానపద స్త్రీల ఉపమాలంకార పోషణకు నిలువెత్తు నిదర్శనం.
ద్రౌపది శ్రీకృష్ణుడిని వేడుకని తనకు సహాయం చేయమని అడుగుతుంది. క్షీరసముద్రంలో సిరిపానుపు పైన లక్ష్మీదేవితో జూదమాడేటి విష్ణువు అక్షయమ్మని పాచికలు వేశాడట. వెంటనే ఇక్కడ ద్రౌపదికి అక్షయంగా చీరలు వచ్చాయి. దుశ్శాసనుడు చీరలు లాగుతూ ఉంటే ద్రౌపది కట్టుకున్న చీరల వంటి చీరలే ఆమె కటిస్థలం మీద వచ్చాయని మూలంలో చెప్పబడింది. కానీ ఈ స్త్రీల పాటలో మాత్రం రంగురంగుల అందమైన చీరలు వచ్చాయని వర్ణించబడింది. ఆ చీరలు కొండ ఎత్తున పడ్డాయని నన్నయ్య చెబితే, “తూర్పుదిక్కున తొంభైవేల కోట్లు, పడమర పదివేల కోట్లు, ఉత్తరంలో ఊళ్ళంత పొడవు, దక్షిణంలో తాళ్ళంత పొడవు” పడ్డాయని జానపద కవయిత్రి వర్ణించింది. ఇదేకాక జానపద కవయిత్రి మరొక అద్భుతమైన కల్పన చేసింది. నన్నయ్య భారతంలో భీముడు చేసిన రెండు ప్రతిజ్ఞలు స్త్రీల పాటలు ద్రౌపది చేసినట్లుగా చెప్పబడింది. ఇక్కడ జానపద స్త్రీ పురుషుడు ఆధిపత్యాన్ని సహించలేదని, ఆమె స్వేచ్ఛగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటు, తన సమస్యలను తనే పరిష్కరించుకోగల సామర్థ్యం ఉన్న వ్యక్తిత్త్వాన్ని పెంపొందించుకుందని తెలుస్తుంది.
ద్రౌపది దుర్యోధనునితో తనతో జూదమాడమని సవాలు చేస్తుంది. దానికి దుర్యోధనుడు అంగీకరిస్తాడు.
గేయం: “సింహాసనముమీద రాజు కూర్చుండె – కుర్మాసనముమీద పాంచాలియుండె
పాపకర్ముని ముఖము తా జూడ ననుచు – నడుమను వేయించె గండభారమ్ము
రారాజు తన చేత వేసే పాచికలు – పాంచాలి తన కాళ్ళ త్రోసె పాచికలు”.
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 674, 675)
ఇది జానపద స్త్రీ చేసిన అత్యద్భుతమైన కల్పన. “ఈ పాటలో కవయిత్రి ద్రౌపది పాత్రను నభూతో నభవిష్యతిగా తీర్చిదిద్దింది. ఆమె వ్యక్తిత్వాన్ని గౌరీ శంకర శిఖరమంత ఎత్తున నిలిపింది!” అని తంగిరాల వారు జానపద స్త్రీ యొక్క అద్భుత కల్పనను శిఖరంతో పోల్చారు.
ద్రౌపది దుర్యోధనుడిని చిత్తుచిత్తుగా ఓడించి ధర్మరాజు కోల్పోయిన వస్తువులన్నీ గెలుస్తుంది. ఇంతలో మాయాశకుని వచ్చి స్త్రీలు మాయావులు, వారితో జూదం ఆడవద్దు అని దుర్యోధనుడిని అడ్డుకుంటాడు. దాంతో దుర్యోధనుడు జూదం ఆపేస్తాడు. ఇంతలో ధృతరాష్ట్రుడు వచ్చి, దుర్యోధనుడిని మందలించి, ద్రౌపదిని వరాలు కోరుకోమంటాడు. పాండవుల రాజ్యం వారికి ఇవ్వాలనుకుంటాడు. నన్నయ భారతంలో ధృతరాష్ట్రుడు వరాలుగా ద్రౌపదికిచ్చిన రాజ్యాన్ని, సిరిసంపదలను తీసుకొని పాండవులు ఇంద్రప్రస్థానికి వెళుతూ ఉంటారు. ఈలోగా దుర్యోధనుడు మాయాద్యూతంలో గెలిచిన పాండవుల రాజ్యం తన తండ్రి ధృతరాష్ట్రుడివల్ల చేజారి పోవడంతో, తిరిగి తండ్రిపై ఒత్తిడి తెచ్చి, పాండవులను మరల ద్యూతానికి పిలిపించి, వారిని మళ్లీ ఓడించి అడవులకు పంపినట్లు ఉంది. కాని స్త్రీలపాటలో ధృతరాష్ట్రుడు ద్రౌపదికిచ్చిన రాజ్యాన్ని కాదని, యుద్ధంలో గెలిచి తమ రాజ్యాన్ని తిరిగి పొందుతామని పాండవులు వనవాసానికి వెళ్లిపోయినట్లు వర్ణించబడింది. ఈ పాటలో నన్నయ భారతంలో వలె రెండవసారి ద్యూత ప్రసక్తి లేదు. ఇవి పరిశీలించదగిన అంశాలు.
e) కీచకవధ – స్త్రీల పాట
నందిరాజు చలపతిరావు 1922లో ప్రచురించిన స్త్రీల పాటలు మూడో భాగంలో ఈ పాట ఉంది. దీనికి సంబంధించిన కథ అంతా 646 మంజరీ ద్విపద పాదాలలో నడిచింది. ఈ కీచకవధ ఘట్టం తిక్కన భారతంలో విరాటపర్వం ద్వితీయాశ్వాసంలో వస్తుంది. మూలంలో ఉన్న కథకు మధ్యమధ్యలో కొన్ని నూతనమైన కల్పనలు చేస్తూ జానపద స్త్రీ ఈ కథాగేయాన్ని రచించింది. ఈ పాట, ధర్మరాజు జూదం అనే పాటల ప్రారంభాన్ని బట్టి ఈ రెండు పాటలను ఒకే కవయిత్రి రచించి ఉండవచ్చు.
అజ్ఞాతవాస సమయంలో ద్రౌపది, విరాటరాజు భార్య సుదేష్ణ దగ్గర ‘మాలిని’ అనే పేరుతో ఆమెను అలంకరించే సైరంధ్రిగా చేరుతుంది. ఒకరోజు సుదేష్ణ తమ్ముడైన (సింహబలుడు) కీచకుడు తన అక్కకు నమస్కరించి వెళ్దామని వచ్చి, అక్కడున్న సైరంధ్రి అందాన్ని చూసి మోహానికి గురవుతాడు. ద్రౌపది అందాన్నంతా తన అక్క దగ్గర పొగుడుతాడు. ఆ సందర్భంలో అనేక ఉపమానాలను ప్రయోగిస్తాడు.
“హంసనడకలు దాని అడుగులను బోలు – పద్మదళములు దాని పాదముల బోలు
చెరుకుకోలలు దాని చేతుల బోలు – తమలపాకుల బోలు దాని హస్తములు
శంఖచక్రములు భుజములం బోలు”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 677)
భారతంలో తిక్కన కూడా పతివ్రతా శిరోమణియైన ద్రౌపదిని, నీచుడు, మూర్ఖుడు, ప్రతినాయకుడైన కీచకుడి చేత హద్దులమీరి వర్ణింప చేశారు.
మూలంలో ద్రౌపది రూపసౌందర్యమనే ఉచ్చులో చిక్కి ఆ కీచకుడు హృదయమనే జింక మన్మధుడనే బలిష్టుడైన వేటగాడి పన్నుగడలో పడిపోవటం వలన ఆ సింహబలుడు చలించాడు అని ఉంది. స్త్రీలపాటలో మాత్రం వేటగాడు, జింక కాకుండా సముద్రము, మొసలి అనే ఉపమానాలు ప్రయోగించబడ్డాయి.
తే. ద్రౌపదీరూపమను నురిదగిలి తనదు
హృదయమను మృగమత్తరి నుదిలగొనుచు
గాముడను బల్లిదపువేటకాని బారి
బడుట కెంతయు నా సింహబలుడు తలరి. (విరాటపర్వం ద్వితీయాశ్వాసం 24వ పద్యం)
పై పద్యంలో కీచకుడి అవస్థను కవి చెబుతున్నాడు. కానీ స్త్రీలపాటలో కీచకుడే అక్క సుదేష్ణతో స్వయంగా చెబుతున్నాడు.
“అతివ యాకారమను జలధిలో మునిగి – అంశుకంబైనట్టి ఆ మొసలిచేత
పట్టుబడి యున్నాను బ్రతుకు తెరవేమి?”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 677)
కీచకుడి మాటలు విన్న అక్క సుదేష్ణ అతన్ని అనేక విధాలుగా వారిస్తుంది. ఆమె పలుకులు కీచకుడు చెవిన పెట్టడు. తనకు సైరంధ్రి ఎలా అయినా కావాలని అక్క పాదాలమీద పడతాడు. దాంతో సుదేష్ణ మెత్తబడి సైరంధ్రిని కీచకుడి ఇంటికి పంపుతానని అంగీకరిస్తుంది. కీచకుడు మహా సంతోషంతో ఇంటికి వెళ్లి సుందరంగా తయారవుతాడు. తన మందిరంలోని పాన్పుని అందంగా అలంకరిస్తాడు. కీచకుని స్నానవర్ణన, అలంకరణ, పాన్పుసవరణ మూలంలో లేవు. ఇది జానపద స్త్రీల కల్పన. ఈ పాటలో కీచకుడు నర్తనశాలకు వెళ్లేటప్పుడు కూడా మళ్లీ అతని స్నానవర్ణన, అలంకరణ వర్ణన వస్తాయి. పాన్పుసవరణకు బదులు అతని భోజన, తాంబూల సేవనము వర్ణించబడ్డాయి. ఇవేమీ మూలంలో లేవు.
తిక్కన భారతంలో సైరంధ్రి సురకోసం భయపడుతూ కీచకుని ఇంటికి వెళ్తూ సూర్యుడిని ప్రార్థించినట్లు, సూర్యుడు ఆమెకు రక్షణగా ఒక రాక్షసుని పంపినట్టు ఉంది. కాని స్త్రీల పాటలో సైరంధ్రి ఆకాశాన్ని, అంతరిక్షాన్ని, భూదేవిని, శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. సూర్యుడు ఆమెకు రక్షణగా ఒక రాక్షసుడిని పంపిస్తాడు. కీచకుడు ద్రౌపదిని తరుముకొని వెళ్లేటప్పుడు రాక్షసుడు కీచకుని ఒక్క తన్నుతన్నినట్లుగా ఉంది.
మూలంలో కీచకుడు ద్రౌపదిని తన్నుతాడు. అది ఈ స్త్రీల పాటలో లేదు. మూలంలో ఉన్న నర్తనశాల సంకేతం ఈ పాటలో లేదు. ద్రౌపది కీచుకునితో సవాలుగా చేసిన ప్రతిజ్ఞయే నర్తనశాలకు సంకేతంగా మనం ఊహించుకోవాలని తంగిరాల వారు పేర్కొన్నారు. రాత్రి నర్తనశాలకు వెళ్లేముందు కీచకుడు ముస్తాబైన విధానాన్ని తిక్కన ఒక్క మాటలో చెప్పారు.
“సింహబలుడు పరిచారికా ప్రార్థనంజేసి మజ్జనభోజనంబు లొకభంగి నడిపినవాడై”
భీముడు ద్రౌపది చేయి పట్టుకుని దట్టమైన చీకటిలో ఉన్న నర్తనశాలకు ప్రవేశించి, ఉత్తర పవళించే మెత్తని పాన్పును పరిశీలించి తెలుసుకొని, దానికి సమీపాన ద్రౌపదిని కనపడకుండా దాచిపెట్టి, ద్రౌపదిలా ఆడవేషంలో ఉన్న భీముడు ఆ పాన్పు పై కూర్చున్నాడు. కీచకుడు మద్యం సేవించి, మదనోద్రేకంతో నర్తనశాలలో ప్రవేశించాడు. కానీ స్త్రీల పాటలో నర్తనశాలలో దీపాలు వెలుగుతున్నట్లుగాను, వాటిని ఆడవేషంలో ఉన్న భీముడు ఆర్పి వేసినట్లు గాను ఉంది. మూలంలో ఉన్నఇతర వర్ణనలు పాటలో లేవు. ఆడవేషంలో ఉన్న భీముడు కీచుకునితో సరస సల్లాపాలాడుతూ మంచం మీద కూర్చునే సరికి ఆ మంచం విరిగిపోతుంది. ఇది మూలంలో లేని అంశం.
తిక్కన భారతంలో భీమకీచకుల మధ్య జరిగిన మల్లయుద్ధం 18 గద్యపద్యాలలో విపులంగా వర్ణించబడింది. తిక్కన మల్లవిద్యలోని విశేషాలన్నీ సూక్ష్మాతి సూక్ష్మంగా పేర్కొన్నారు. స్త్రీలపాటలో ఇది సంక్షిప్తంగా మంజరీ ద్విపదలో పది పాదాలలో ఉంది. స్త్రీల పాటలోని భీముడు ద్రౌపదితో “ఉవిదా! వీడి నెత్తురు బొట్టు పెట్టుకో!” అనడం మాత్రం మూలంలో లేని అంశం. ఇక్కడ జానపదస్ర్తీలకు కీచకుడిపట్ల ఉన్న వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
మూలంలో ద్రౌపది కీచకవధానంతరం కావలి వారిని పిలిచి,“గంధర్వులైన నా భర్తలు పాపాత్ముడైన సింహబలుడిని చంపారు. మీరు వెళ్లి చూడండి!” అని చెబుతుంది. అప్పుడు వారు నర్తనశాలలో ప్రవేశించి కీచుకుని శవాన్ని చూస్తారు. పాటలో మాత్రం ద్రౌపది కీచకుల వీథిలోకి వెళ్లి కేకవేసినట్లు వర్ణించబడింది.
“మీ కీచకుని జంప గంధర్వులొచ్రి
యేరాజు జంపెనో చూతామురారె!
రారె! చూతాము రాచవారెల్లా!”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 682)
ద్రౌపది కీచకుని చంపడానికి గంధర్వరాజులు వచ్చి చంపారే చూద్దాము రండని అందరినీ పిలుస్తుంది.. ఇది కూడా మూలంలో లేని స్త్రీల కల్పనే.
కీచకుని మరణవార్తను విరాట మహారాజు ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు కంకుభట్టు పేరుతో ఉన్న ధర్మరాజు “ ఈ మాట రారాజు విన్నాను యపుడు మనపట్నము గెలుచుకొని పోయెదరు సుమ్మా!” అని భయపెట్టి ఎవరికీ తెలియకుండా శవాన్ని పంపించమని చెప్పినట్టు ఈ పాటలో వర్ణించబడింది. ఇది కూడా అమూలకాంశమే.
కీచకుని తమ్ములైన ఉపకీచకులు సైరంధ్రిని బంధించి కీచకుని శవంతో కలిపి కట్టివేసి, శ్మశానానికి తీసుకుని పోతుంటే, ఆమె రోదిస్తూ పాండవులు ఐదుగురిని వారి గుప్తనామాలతో పిలిచిందనేది తిక్కన భారతంలోని కథ. జానపద స్త్రీల పాటలో మాత్రం ద్రౌపది ధర్మరాజు పేరు, తనపేరు చెబుతూ పిలిచినట్టుగా ఉంది. సహదేవున్ని మాత్రం సంకేతనామంతో పిలిచింది.
అప్పుడు భీముడు వచ్చి ఉపకీచకుల్ని చంపి, ద్రౌపదిని రక్షించడం మూలంలో వలనే ఉంది. పాట చివరలో దక్షిణగోగ్రహణం, ఉత్తరగోగ్రహణం సూచనప్రాయంగా చెప్పబడ్డాయి. పాండవులు తమను తాము విరాటరాజుకు పరిచయం చేసుకుని, అజ్ఞాతవాసం నుండి బయటపడడంతో ఈ పాట ముగుస్తుంది.
“తిక్కన విరాటపర్వం రచించేటప్పుడు వ్యాసభారతాన్ని చాలా వరకు పెంచి రాశారు. ఈ పాటలో తిక్కన భారతంలోని కీచకవధ కథ చాలావరకు ( 1/3 వంతు ) సంక్షిప్తం చేయబడింది” అని తంగిరాల సుబ్బారావు వివరించారు.
f) సుభద్రసారె
జానపద స్త్రీలు తమ దాంపత్య జీవితంలోని చిన్నచిన్న సంఘర్షణలను పురాణపాత్రలకు ఆపాదించి, చిత్ర విచిత్రమైన కథాగేయాలను అల్లుతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం, భార్యకు కోపంవచ్చి అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం, భర్త వెళ్లి ఆమెను బతిమాలి తీసుకురావడం జానపదులలో సహజం. దీన్ని సుభద్రార్జునులకు ఆపాదించి “సుభద్రసారె” అనే పాటను సృష్టించారు. “నిజానికి ఇటువంటి సమస్యలు పెద్దపెద్ద రాజకుటుంబాలలో ఉండవు. కాని స్త్రీలు పురాణపురుషుల్ని కూడా తమవంటి మధ్యతరగతి జీవులగానే ఊహించుకుంటారు” అని తంగిరాల వారు పేర్కొన్నారు. కాని నేడు ధనవంతుల కుటుంబాలలో స్ర్తీలు చిన్న విషయాలకే భర్తనుండి విడిపోతున్నారు. బహుశా ఆర్థిక పరిస్థితులు కారణం కావచ్చు. మధ్య తరగతి కుటుంబాలలో స్త్రీలు తిరిగి భర్త దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది. అందుకే జానపదస్త్రీలు తమ భావాలను గేయంలో పొందుపరిచారు.
ఇక కథలోకి వెళ్తే అర్జునుడు పడకటింట్లో మంచం మీద పడుకున్నాడు. సుభద్రను తాంబూలం చుట్టి ఇమ్మన్నాడు. ఆమె తిరస్కరించింది. దాంతో పార్థుడు నవ్వుతూ సుభద్ర పుట్టింటి వారిని దెప్పిపొడుస్తాడు. స్త్రీలు తమను ఏమన్నా సహిస్తారు కానీ పుట్టింటి వారిని ఏమైనా అంటే మాత్రం కించిత్తు కూడా సహించలేరు. అలాగే సుభద్ర కూడా అర్జునుడు తన పుట్టింటి వారిని దెప్పిపొడిచేసరికి సహించలేకపోయింది.
గేయం: “మా వాళ్లు పేదవాళ్ళు మాకేమి గలదు – పెట్టగల పెద్దింట పెండ్లాడితేను
అచ్చటలు ముచ్చటలు అన్నియును జరుగు”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 804)
ధనవంతుల బిడ్డను పెళ్ళాడితే అన్ని ముచ్చటలు తీరేవని సుభద్ర అంటుంది. అప్పుడు అర్జునుడు కోపించి తన పాంకోళ్ళతో సుభద్రను తన్ని పక్కున నవ్వాడు. దాంతో సుభద్ర ఘొల్లుమని దుఃఖించింది. తన ఒంటిమీద ఉన్న నగలన్నీ తీసి భరిణిలో పెట్టింది. మాసిన చీర కట్టుకుని, చంటిపిల్లాడిని చంకన వేసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. వాకిట్లో శయనిస్తున్న శ్రీకృష్ణుడు చెల్లెల్ని చూసి ఏమి కష్టమొచ్చిందని అడిగాడు. సుభద్ర భర్త అన్న మాటలన్నీ చెప్పి, పాంకోళ్ళతో తన్నాడని ఏడ్చింది. వెంటనే శ్రీకృష్ణుడు చెల్లెల్ని ఓదార్చి భారీగా ఆమెకు అరణాన్ని (సారెను) ప్రకటించి, తన భార్యల దగ్గరకు పంపించాడు. సుభద్ర ఒక్కొక్క వదినె దగ్గరకు వెళ్లి పోయివచ్చెదెను అంటుంది. అందరూ ఆమెను దీవిస్తారు. కాని ఆరవ వదినె మాత్రం ఆడపడుచు పుట్టిల్లంతా దోచుకుని వెళ్లడంతో మండిపడింది. కడుపు మంటతో సుభద్రను వ్యంగ్యంగా దెప్పిపొడిచింది.
గేయం: “యిల్లు విరుచుకు పొమ్ము యో ముద్దుగుమ్మ! – యింటి వాసాలన్ని బండిపై వేసేము
చూరువాసాలన్ని ముట్టించి పొమ్మీ! – కాళ్ళ మట్టెలజోడు దీసికొని పొమ్మీ!
కట్టుకొను బట్టయిన ఒకటి యుంచకుము!”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 805)
సుభద్రకు తన భర్త తన్నిన దానికన్నా వదినె అన్న మాటలు మనసు నొప్పించాయి. ఆమె భోరున ఏడుస్తూ తిరిగి అన్న దగ్గరకు వెళ్లి వదినె అన్న మాటలను చెప్పింది. శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చి అరణంతోపాటు సాగనంపి వచ్చాడు. వివాహిత అయిన స్త్రీ ఎలాంటి అవమానమైన భరిస్తుంది గాని, వదినలు అంటే భరించదు. ఇక్కడ జానపదస్త్రీ తన మనోభాలకు అనుగుణంగా గేయాన్ని మలచింది. వారు స్త్రీకి పుట్టింటి పై సర్వాధికారాలు ఉంటాయని, కోడలు ఇంటి ఆడపడుచుని ఎప్పుడు గౌరవించాలని, ఆమె ఏది అడిగినా లేదనకుండా సమకూర్చి పంపాలని భావిస్తారు. జానపదస్త్రీలు వారి కుటుంబజీవనాన్ని, ఆచార, సంప్రదాయాలను ఈ పాటలో ప్రతిబింబింపజేశారు. సుభద్రలో కూడ సామాన్యస్త్రీ లక్షణాలు ఉన్నట్లు నిరూపించారు.
గేయం: “కొన్నబానిస అంటే కొదువేమి మనకు? – మన అమ్మ కొన్నది మాయమంథరను
పదవేమె సుభద్ర పంపివత్తూను – పల్లకి యెక్కించి పరమాత్ముడపుడు” అంటాడు.
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 805)
ఈ పాటలో “కొన్నబానిస అంటే కొదువేమి మనకు?” అన్న శ్రీకృష్ణుని మాటలనుబట్టి, ఈ పాట కన్యాశుల్కం బాగా వ్యాప్తిలో ఉన్న రోజుల్లో అంటే 19వ శతాబ్ది నాలుగో పాదంలో లేక 20వ శతాబ్ది మొదటి పాదంలో రాయబడి ఉంటుందని తంగిరాల వారి అభిప్రాయం. ఈ పాటలో అర్జునుడు సుభద్రను పాంకోళ్ళతో తన్నడం వంటి అనౌచిత్యాలు కూడా చోటుచేసుకున్నాయి. ప్రతి పాటలో ఉన్నట్టుగానే ఈ పాట కూడా ఫలశ్రుతితోనే ముగుస్తుంది. ఈ గేయంలో అనౌచిత్యాలు జానపదులు కల్పించినవి.
g) శశిరేఖ పెండ్లిపాట
ఒకరోజు దుర్యోధనుని భార్య భానుమతి శశిరేఖను తమ పుత్రుడు లక్ష్మణకుమారునికిచ్చి పెండ్లి చేస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది. దానికి దుర్యోధనుడు బలరాముడు అంతా అంగీకరిస్తారు. మంచి ముహూర్తం చూసి పెండ్లి చేయాలనుకుంటారు. పెండ్లి రాయబారానికి వచ్చిన భీష్మ, ద్రోణులు వెళ్ళిపోగానే బలరాముని భార్య రేవతి ఇంట్లో మేనల్లుడు అభిమన్యుడు ఉండగా లక్ష్మణునకివ్వడం మంచిగా తోస్తుందా అని భర్తను నిలదీస్తుంది. ఆ తరువాత బలరాముడు ఈ విధంగా అంటాడు.
గేయం: “అర్జునుడడవుల నంటుక పోయె – జానెడు పొట్టకు చేరె సుభద్ర
కుడువగ నన్నము తొడుగగ గుడ్డ – లేనివారికి లేమనొసంగి
పొల్లు చూడవలె పాపము గాదా? – కన్నబిడ్డలను ఘనులకు నీయ
సుఖముగ నుండిన జూడగలేవే? – ఇట్టి కూతలను నెన్నటి కయిన
ప్రేలకు నాకడ ప్రియములు గావు!” అని మండిపడతాడు.
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 747)
చిన్నతనంనుండి అభిమన్యుని ప్రేమిస్తున్న శశిరేఖ తండ్రి మాటలు విని చాలా బాధపడుతూ చెలికత్తెలతో కలిసి కేళీవనంలోకి వెళ్ళింది. ఇంతలో అభిమన్యుడు అక్కడికి వచ్చి, జరిగిన విషయం తెలుసుకుని మేనమామ మీద కోపంతో తల్లిని తీసుకుని అరణ్యంలో ఉన్న తండ్రి దగ్గరకు బయలుదేరుతాడు. మార్గమధ్యంలో ఘటోత్కచుడనే రాక్షసుడుతో అభిమన్యుడు యుద్ధం చేస్తాడు. ఇంతలో నారదడు అక్కడికి వచ్చి మీరిద్దరూ అన్నదమ్ములు అవుతారని చెప్పి యుద్ధాన్ని విరమింప చేస్తాడు. వారిద్దరూ పశ్చాత్తాప పడి ఆశ్రమానికి వెళతారు.
శశిరేఖను దుర్యోధనుని కుమారుడు లక్ష్మణునకు ఇచ్చి పెండ్లి చేయబోతున్నారని తెలిసి ఘటోత్కచుడు కోపంతో ద్వారకకు వెళ్లి మంచం తో సహా శశిరేఖను ఎత్తుకొని వస్తాడు. తాను మాయా శశిరేఖగా మారి తిరిగి అక్కడికి వెళతాడు. ద్వారకలో పెళ్లి తంతు నడుస్తూ ఉంటుంది. మాయా శశిరేఖను చూసి లక్ష్మణుడు భయంతో కేకలు పెడతాడు. నాకీ పెళ్లి వద్దని పారిపోబోతాడు. దానితో ఘటోత్కచుడు ఎక్కడికి పోతావు? ఇదిగో నా దెబ్బ! అని వీపు మీద చరుస్తాడు. బలరాముని నిందిస్తాడు. పెళ్లి చూద్దామనుకున్న వారందరినీ తన ఆశ్రమానికి రమ్మని అక్కడ శశిరేఖాభిమన్యుల వివాహాన్ని వైభవంగా జరిపిస్తాడు. దాంతో అందరూ సంతోషిస్తారు. రేవతి తన కూతురు శశిరేఖను సుభద్ర చేతిలో పెట్టి అప్పగిస్తుంది. సుభద్ర శశిరేఖచేత తల్లిదండ్రులకు మ్రొక్కిస్తుంది. చివరికి అందరూ సుఖంగా వారి వారి స్వస్థలాలకు వెళ్లినట్లు ఈ పాటలో ఉన్న కథ.
2.2.3 భాగవత సంబంధములు
నందిరాజు చలపతిరావు స్త్రీల పాటలలో భాగవత సంబంధములైన 1.వామనచరిత్ర పాట, 2. శ్రీకృష్ణుని జననము, 3.గుమ్మడుపాట, 4.శ్రీకృష్ణుని చల్దులు,5. పారుజాతప్రసవము, 6. సత్యభామ సరసము, 7.రుక్మిణీదేవి ముచ్చట మొదలైన కథాగేయాలు ఉన్నాయి.
a) వామనచరిత్ర పాట
బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి మనమడు. ప్రహ్లాదుని కొడుకు వైరోచనుడు. అతని కొడుకు బలి చక్రవర్తి. కాని ఈ పాటలో కవయిత్రి బలిచక్రవర్తి మనుమడు ప్రహ్లాదుడు అని రెండు మూడు చోట్ల ప్రయోగించింది. ఇది పొరపాటు. దీనిని తంగిరాల వారు సవరించి ఈ పాటను విశ్లేషించారు.
బలిచక్రవర్తి గొప్ప వీరుడు. రాక్షసరాజు, ముల్లోకాలను జయించినవాడు. స్వర్గాన్ని జయించి ఇంద్రాది దేవతలను అక్కడినుండి తరిమికొట్టాడు. అయినప్పటికీ అతడు మహా దానగుణం కలిగిన వాడు. దాంతో దేవతల తల్లి అదితి తన పుత్రుల అవస్థకు బాధపడింది. భర్త కశ్యప మహర్షి సలహా మేరకు ద్వాదశివ్రతం చేసింది. వ్రతం చేస్తూ ఉండగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అదితి కోరిక మేరకు విష్ణుమూర్తి ఆమె గర్భంలో ప్రవేశిస్తాడు. ఆమె నవమాసాలు నిండిన తర్వాత వామనమూర్తికి జన్మనిస్తుంది. దేవతలు పుష్పవర్షం కురిపిస్తారు. జన్మించిన బాలుడికి వామనుడు అని నామకరణం చేశారు. వామనుడు దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు. అతనికి అక్షరాభ్యాసం చేశారు. 8 ఏళ్ల వయసులో ఉపనయనం చేశారు. తండ్రి అతనికి వేదశాస్త్రాలు 66 విద్యను నేర్పించాడు. దేవతలంతా ఆశీర్వదించారు. ఇంతలో బలిచక్రవర్తి అమరావతిలో పెద్దఎత్తున యజ్ఞం చేస్తున్నాడని తెలిసి వామనుడు తండ్రి అనుమతితో అక్కడికి బయలుదేరాడు. బలిచక్రవర్తిని మూడడుగుల నేల దానమడుగమని తండ్రి వామనుడితో చెప్పాడు. సమస్త దేవతలంతా బలిచక్రవర్తి కొలువులో ఉన్నారు. వారందరూ వామనుని చూసి నమస్కరించి ఆసనం ఇచ్చారు. అతనికి పూజలు చేశారు. వామనుడు బలికి మంత్రాక్షతలు ఇచ్చి అతన్ని దీవించాడు. ఓ రాజా! నీవు పరమ ధార్మికుడవని విని నిన్ను దానం అడగటానికి వచ్చాను అని బలిచక్రవర్తితో అన్నాడు. దాంతో బలి ఆ బాలునితో నీవు ఎవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? నిజం చెప్పమని అడిగాడు. దానికి వామనుడు నవ్వి తన మహిమలను ఇలా ధన్యాత్మకంగా చెబుతాడు.
గేయం: “పెక్కు దేశంబులు ఒక్క లోకంబు – నిక్కముగ నేనుందు నిర్మలభూమి
భూమి ఆకాశంబు నాకు తలిదండ్రి – చుట్టాలు బంధువులు పృథ్విలో లేరు”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 783)
బలి చక్రవర్తి వామనుడిని దానమడగమన్నాడు. వెంటనే వామనుడు “పృథివి మూడడుగులు దానమ్ము యిమ్ము! – తడవు సేయగవలదు, త్వరగాను పంపు” అని అడిగాడు. వామనుడు అడిగిన దానికి బలి ఆశ్చర్యపోయి అతని ముఖంలోకి చూసి ఇలా అన్నాడు.
గేయం: “యిన్ని సంపదలు ఇంట నిండియును – కోరితి ఒక వెర్రిదానంబు యిపుడు
మూడడుగులా భూమి నీకేమి చాలు – సభవారు నవ్వరా ఓ విప్రవరుడ?”
బలిచక్రవర్తి మాటలకు వామనుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా సమాధానం ఇస్తాడు.
గేయం: “అధికదానంబడుగ ఇలపాడి గాదు – భూములు పురములు మేలందలములు
నవరత్న సొమ్ములు ధాన్యరాసులును – నాకేమి కొరగావు ఓయి సురరాజ!
నేనడిగినది చాలు నాకనుచు నపుడు – పృథివి మూడడుగులు దానం ఇమ్మి” అంటాడు.
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 783)
ఇంతలో శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి వామనుడు చేయబోతున్న మోసాన్ని గ్రహించి బలిచక్రవర్తిని దానం ఇవ్వవద్దని వారించాడు. కానీ ఆడిన మాట తప్పని బలిచక్రవర్తి గురువు మాటలు తిరస్కరించాడు. బలిచక్రవర్తి బం పళ్లెంలో వామనుని పాదాలు కడిగి, మూడు అడుగుల భూమి దానం చేశాడు. అప్పుడు వామనుడు ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆకాశమంత ఎత్తు పెరిగి, ఆకాశంలో ఒక అడుగు, భూమి మీద ఒక అడుగు పెట్టి “మూడో అడుగుకి చోటియ్యి రాజా!” అన్నాడు. ఆ సమయంలో గరుడ గంధర్వులు అంతా తత్తర పడ్డారు. ఇంతలో బలిచక్రవర్తి తాత ప్రహ్లాదుడు వచ్చి, విష్ణుమూర్తికి నమస్కరించి ( వామనుడికి) బలిచక్రవర్తి వల్ల తప్పులేదని అతన్ని రక్షించమని ప్రార్థించాడు. ప్రహ్లాదుని మాటలకు పరమాత్మ ఇలా సమాధానం ఇచ్చాడు.
“పుడమి మూడడుగులు దానంబొసంగి – ఒక్కడుగుకూ చోటు ఇవ్వకున్నాడు
విడువక బంధింతు విశ్వంబులోన – తడయుట తగదింక ధర్మంబుగాదు!”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 785)
అప్పుడు బలిచక్రవర్తి వామనునితో “నా తప్పు క్షమించి నన్ను రక్షించి – నా తలనుంచిమీ నలినాయతాక్ష!” అన్నాడు. వెంటనే వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కి వేసి, స్వర్గ సింహాసనాన్ని ఇంద్రునికిచ్చి రక్షించాడు. విష్ణుమూర్తి ప్రహ్లాదుని పిలిచి “మీ మనుమడు బలియు నా స్వర్గలోకమునకు – యేడాది కొకతూరి వచ్చి మూడు దినములు – మా సన్నిధిని యుండ సెలవిస్తిమయ్య!” అని ప్రహ్లాదునితో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. బలిచక్రవర్తిని మోసం చేసిన వామనుడిని ధర్మం తెలిసిన వారెవరూ సమర్థించరు. తంగిరాల వారు దీనిని చాలా అన్యాయమైన కథ అని చెప్పి, ఇది రామావతారంలో చెట్టుచాటు నుండి వాలిని కొట్టినట్టుగా ఉందని పోల్చి చెప్పారు.
b) శ్రీకృష్ణుని జననము
ఇది శ్రీకృష్ణ జనన వృత్తాంతాన్ని తెలియజేసే స్త్రీల పాట. ఈ పాట మొత్తం 148 పాదాలలో సాగింది. శ్రీకృష్ణుడు దేవకీ గర్భంలో జన్మించాడు. ఎదురుకాళ్ళతో పుట్టి ఏడుగురు దాదులను చంపాడు. అంతేకాక పుట్టడంతోనే “నన్నేల యెత్తుకొనవే – నా తల్లి దేవకీ వందనంబు” అని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవకేదేవి నేను మలినంగా ఉన్నాను ఒక్క నిమిషం ఆగు అని బిడ్డను ఓదార్చి, గంగను ప్రార్థించగా ఉప్పొంగి వచ్చిన గంగలో స్నానం చేసి కామధేనువును ప్రార్థించి పాలవానలో తడిసి బాలునికి పాలతో స్నానం చేయించింది. ఇవి ఈ పాటలోని అద్భుతాంశాలు. జన్మించిన వెంటనే శిశువు మాట్లాడినట్టుగా వర్ణించడం వలన ఆ బాలుడు మహిమగల భగవంతుడు అనే విషయాన్ని కవయిత్రి శ్రోతలకు తెలియజేస్తుంది. బాలకృష్ణుని వర్ణన ఈ పాటలో అత్యద్భుతంగా సాగింది.
గేయం: “వసుదేవ పుత్రుడమ్మా! - యీ బిడ్డ – వైకుంఠ వాసుడమ్మా!
నవనీతచోరుడమ్మా! – యీ బిడ్డ – నందగోపాలుడమ్మా!
సీతాకళత్రుడమ్మా! – యీ బిడ్డ – శ్రీరామచంద్రుడమ్మా!
సిరమునా చింతామణి – నా తండ్రి – నాలుకను నక్షత్రము
పండ్లనూ పరుసవేది – భుజమందు – శంఖుచక్రములు గలవు
వీపునా వింజామర – నా తండ్రి – బొడ్డునా పారుజాతం
అరికాళ్ళ తామరములు – అన్నియూ – నున్నవీ కన్నతండ్రి”
(నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. 2024. 742)
దేవకి దేవి ప్రసవించిన విషయాన్ని కంసుడు తెలుసుకోవడం, అంతకంటే ముందే వసుదేవుడు కృష్ణుని రేపల్లెలో యశోద దగ్గర పెట్టి, ఆమెకు పుట్టిన ఆడ శిశువును తెచ్చి దేవకి దగ్గర పెట్టడం, కంసుడు ఆ ఆడ శిశువును చంపడానికి పైకి ఎగరవేయడం, ఆ శిశువు ఆకాశానికి ఎగిరి కంసుణ్ణి హెచ్చరించి మాయమవడం అంతా ఈ పాటలో వర్ణించబడింది. వీటితోపాటు శ్రీకృష్ణుని బాల్యక్రీడలు కూడా వర్ణించబడ్డాయి.
c) గుమ్మడు పాట
ఈ పాట జానపద సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధమైనది. గురజాడ అప్పారావు సృష్టించిన ముత్యాలసరాలు అనే ఛందస్సు ఈ పాట శైలికి అనుకరణమే.
గేయం: “గుమ్మడేడే గోపిదేవి! – గుమ్మడేడే కన్నతల్లీ!
గుమ్మణ్ణి జూపగదవే! – మాయమ్మ గోపెమ్మా!” అనేది ఈ పాటలోని పల్లవి.
గుమ్మడు అంటే సొగసుకాడని నిఘంటువులిస్తున్న అర్థం. ఈ సొగసుకాడు కృష్ణుడో లేక పామో!.ఇది ధ్వన్యునుకరణ శబ్దమని బిరుదురాజు రామరాజు అభిప్రాయం. యశోద పెరుగు చిలుకుతూ ఉండగా కృష్ణుడు వెన్నకోసం పేచీ పెట్టడంతో పెరుగు కడవలో గుమ్మడున్నాడు, కరుస్తాడు గుమ్ముగుమ్మని శబ్దం వస్తుంది వినమని ఆమె శ్రీకృష్ణుని భయపెడుతుంది. కృష్ణుడు భయపడకుండా తల్లితో తాను ఎత్తిన దశావతారాలలో గుమ్మడిని ఎప్పుడూ చూడలేదని, ఎక్కడా వినలేదని తల్లిని గుమ్మడిని చూపించమన్నాడు. దశావతారాలను వర్ణించేటప్పుడు శ్రీకృష్ణునితో కవయత్రి ఇలా పలికించింది.
గేయం: “మత్స్యమయి సోమకుని జంపితి – మగుడ చదువులు బ్రహ్మకిస్తిని
అక్షరాంబుధిలోని గుమ్మడి – అతని నేనెరుగ అమ్మా! గుమ్మడేడే?”
“ గిరికి యెదురుగ కూర్మమయితిని – క్రిందిలోకములెల్ల మెచ్చగ
తరచగా నొక మానిసయినా నరసి నేగానా అమ్మా! గుమ్మడేడే?”
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 362)
శ్రీకృష్ణుడు తన అవతారాలన్నిటి గురించి చెప్పినట్టుగా ఈ పాటలో ఉంది. బాలకృష్ణుడు చివరకు గుమ్మడు తన నోటిలో ఉన్నాడేమో చూడమని నోరుతెరవగా సమస్త చరాచరప్రపంచాన్ని చూసి యశోద ఆశ్చర్య పోతుంది.
d) శ్రీకృష్ణుని చల్దులు
భాగవతంలో గోపకుమారులతో చద్ది ఆరగించడానికి బుద్ధిపుట్టి కృష్ణుడే వారిని పిలిచినట్టు ఉంది. స్త్రీల పాటలో మాత్రం గోపకుమారులకే అటువంటి బుద్ధిపుట్టి శ్రీకృష్ణుని కోసం తెల్లవారుగానే లేచి యశోద దగ్గరకు వచ్చి విన్నపం చేసినట్టు ఉంది. యశోద బాలకృష్ణుని మహిమలను పొగుడుతూ, దశావతారాలను స్తుతిస్తూ శ్రీకృష్ణుని మేల్కొల్పుతుంది.
గేయం: “తరుబోనము దెరచీ – చల్లారబోసెను చల్ది
దధిచాలా శొంఠివేసీ – మృదువుగా కలిపెను చల్ది
......................................................
మృదువైనా పచ్చళ్ళన్నీ – చల్లపైయుంచెను తల్లి
వాకాయా వర్దీకాయా – ఒప్పైన మారెడుగాయ –
ఊరినా యల్లముతోటీ – ఉసిరీకాయోప్పుగ నుంచ్రీ”
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 502)
గోవులను కాయడానికి వెళ్తున్న కృష్ణుడికి యశోద పై విధంగా చద్దిని సిద్ధం చేస్తుంది. బాలుని బాగా సింగారించి ముస్తాబు చేసి పంపిస్తుంది. కృష్ణుడు గోపబాలులతో కలిసి చద్దిని తిని, కల్పవృక్షము నీడలో వేణుగానం చేసి అందరిని అబ్బుర పరిచినట్టు ఈ గేయంలో వర్ణించబడింది.
గేయం: “కల్పవృక్షముల నీడను – కడు తిన్నగమళ్ళీ జూచి
కమలనాభులు వేణువు బట్టెను – కాంతల చిత్తమలర
మలహరి – ఘూర్జరి – పురమందున నో చిలుకా!
పలికిన మాధవుండు – హేసాక్షి భోజనగమున
సావేరి – భూపాలమున – సరసిజ శ్రీరాగా
సర్వంబు నాదము బుట్టెను – సనకాదులు అంజలిబట్ట.”
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 505)
ఈ గేయంలోని సావేరి, భూపాలము, శ్రీరాగము మొదలైనవి రాగాలలోని రకములు. వీటన్నిటిని శ్రీకృష్ణుడు తన వేణువుతో గానం చేసినట్టు ఈ పాటలో చెప్పబడింది.
e) పారుజాతప్రసవము (పారిజాతపల్లవి)
ఈ గేయాన్ని రచించిన కవయిత్రి హరివంశంలోని కథను, నంది తిమ్మన పారిజాతాపహరణ కథను అనుసరించి కొంత కల్పనలతో రచించింది. స్త్రీల మనోభావాలన్నీ ఈ గేయంలో కనిపిస్తాయి. నారదుని కలహ ప్రియత్వం వల్ల శ్రీకృష్ణుని ఇంటిలో జగడాలు చెలరేగాయి. దాంతో శ్రీకృష్ణుడు స్వర్గం నుండి పారిజాతవృక్షాన్ని భూలోకానికి తీసుకొచ్చి సత్యభామ పెరట్లో నాటుతాడు.
ముక్కు తిమ్మన సత్యభామ అంతఃపురంలోని కోపగ్రహంలో చీకట్లో మంచం మీద అలిగి పడుకున్నట్లుగా వర్ణించబడింది. జానపదుల సత్యభామ మాత్రం పూరింటిలో నులకమంచం మీద చీరపరుచుకుని పడుకున్నట్లుగా వర్ణించబడింది.
“పూరింటిలో నొక్క కీలడుగు మంచముపై – చీరొక్కటి పరుచుకు పవళించెను శ్రీహరులను దలచీ”
ఈ వర్ణన జానపదుల చిత్తవృత్తికి సహజమైనదని తంగిరాల వారు పేర్కొన్నారు. నంది తిమ్మన సత్యభామ శ్రీకృష్ణుని శిరస్సును వామపాదంతో (ఎడమకాలితో) తన్నినట్లు వర్ణించాడు. ఈ పాటలో మాత్రం భర్త నమస్కరించగానే సత్యభామ కోపం పోయింది.
f) సత్యభామ సరసము
సత్యభామ శ్రీకృష్ణునిపై విరహంతో బాధపడుతూ, అతని రాకకోసం ఎదురుచూస్తూ చెలికత్తెలను ఇల్లంతా అలంకరించమని చెప్తుంది. చెలికత్తెలు సత్యభామ చెప్పినట్టు శయ్యాగృహాన్ని అలంకరించి, ఆమెను కూడా అలంకరిస్తారు.
“పచ్చిపసుపు పన్నీరు జలకంబులాడి – పచ్చపట్టుచీరె బాగుగా గట్టి
నల్లపట్టూరవికె నాతి తా తొడిగి – అన్ని అలంకారాలు అతివకు బెట్టి”
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 704)
చెలికత్తెల చేత అలంకరింపబడ్డ సత్యభామ శ్రీకృష్ణుని రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కృష్ణుడు ఎంతటికీ రాకపోయేసరికి చెలికత్తెలను పంపివేస్తుంది. కొంతసేపటికి శ్రీకృష్ణుడి రాకను గమనించి తలుపు గడియ పెట్టింది. ఆ సందర్భంలో ఈ పాటలో సత్యభామ శ్రీకృష్ణుల మధ్య సంవాదం తలుపుదగ్గర పాటల పద్ధతిలో జరుగుతుంది.
గేయం: “తలపు మేడలమీద యెవ్వరోగాని – పేరు చెప్పక మీరు రారాదు అనెను
పేరులమీద నీకు ప్రేమాయోనేమొ – వనితరో గోపికా వల్లభుడ నేను
గోపకూడనైతేను వ్రేపల్లెనుండు – ముద్దురాళ్ళాకడప ప్రొద్దున్న పొమ్మి
జలధరుండందురే చెలియ నా పేరు – జలధరుడు అయితేను జలముల మునిగేవా?”
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 704)
ఇలా కొంతసేపు వీరిద్దరి మధ్య సంవాదం నడిచిన తర్వాత సత్యభామ తలుపుతీస్తుంది. కృష్ణుని శరీరం మీద ఉన్న శృంగారచిహ్నాలు చూసి ప్రశ్నిస్తుంది. శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు చెప్పి తప్పించుకుంటాడు.
గేయం: “పరమాత్మ! నీ పెదవి పగిలున్నదేమో – దోరమామిడితేనె లారగించగనె పెదవి పగిలింది
పక్షులారగించేవి పతులారగింతురా – పరమాత్మ! నీవునికి బట్టబయలాయె”
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 704)
వీరిద్దరి మధ్య సంవాదం ఇలా నడుస్తుంది. ఆఖరికి సత్యభామ పశ్చాత్తాపపడి భర్త పాదాలమీద వాలిపోవడంతో ఈ పాట ముగుస్తుంది.
g) రుక్మిణీదేవి ముచ్చట
ఒకరోజు రుక్మిణీదేవి భర్త శ్రీకృష్ణునితో కలిసి ఆనందంగా గడుపుతూ ఉంటుంది. ఇంతలో రాధ వచ్చి శ్రీకృష్ణుని తనతో తీసుకుని వెళ్ళిపోతుంది. దాంతో మనసు నొచ్చుకున్న రుక్మిణి తన సంవేదనను ఒక చెలికత్తెతో ముచ్చటిస్తుంది. కాబట్టి దీనికి రుక్మిణీదేవి ముచ్చట అనే పేరు వచ్చింది. రుక్మిణి చెలికత్తెతో చెప్పిన ముచ్చటలన్నీ ఈ గేయంలో వర్ణించబడ్డాయి. రుక్మిణి చెలికత్తెతో ఇలా అంటుంది.
గేయం: “వానిదరికేగి నీవు నెలతరో! వర్ణించి నాకష్టము
విభుని మనము ద్రిప్పుచు – వేడ్కతో నాథుదోడ్కొని వేగమె
వచ్చి నాప్రేమలంది - గైకొమ్మి వనితరో సౌఖ్యములను”
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 720)
రుక్మిణి శ్రీకృష్ణుని తీసుకుని రమ్మని తన చెలికత్తెతో చెబుతుంది. ఆమె కష్టాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పి, నాప్రేమను గైకొనుటకు వేగమే తోడ్కొని రా! అని రుక్మిణి చెలికత్తెతో తన బాధను వ్యక్తపరుస్తుంది.
2.2.4 ఇతరములు
నందిరాజు చలపతి రావు స్త్రీల పాటలలో రామాయణ, భారత, భాగవత సంబంధములైన పాటలే కాక 1.సారంగధర చరిత్ర పాట, 2. గోవుపాట, 3.గంగా - గౌరీ సంవాదము - సవతుల కయ్యము, 4. ధర్మాంగదచరిత్ర – పాముపాట అనే పాటలు కూడా ఉన్నాయి.
a) సారంగధర చరిత్ర
రాజరాజనరేంద్రుని పట్టపురాణి అయిన రత్నాంగి పర్వతాల మల్లన్న వంటి కుమారుడు కావాలని, ఆయనను ప్రార్థిస్తుంది. మల్లన్న ప్రసన్నుడై ఆమెకు వరమిస్తాడు. రత్నాంగి గర్భవతి అయ్యి ఒక కుమారుడికి జన్మనిస్తుంది. ఆ బాలుడికి సారంగధరుడు అని పేరు పెట్టాడు. అతడు పెరిగి పెద్దవాడయిన తరువాత గురువుల దగ్గర సకల విద్యలు నేర్పిస్తారు. ఒకరోజు సారంగధరుడు స్నేహితులతో కలసి పావురాలాటలు ఆడతాడు. అప్పుడు ‘అతని బం రెక్కల పచ్చని పావురం’ వీధులన్ని తిరిగి రాజు చిన్న భార్య అయిన చిత్రాంగి మేడ మీదికి వెడుతుంది. ఆమె దానిని బందిస్తుంది. అతడు సేవకులతో ఆ పావురాన్ని వెతికిస్తాడు. చివరికి ఆపావురం చిత్రాంగి మేడలో ఉన్నట్లు తెలుసుకుని, వారిని పంపిస్తాడు. కాని ఆమె వారితో రాజునే రమ్మనమని చెబుతుంది. అతడు ఆమె మేడకు వెళ్ళడానికి సిద్ధపడతాడు. కాని మంత్రి కుమారుడయిన సుబుద్ధి సారంగధరుణ్ణి వెళ్ళవద్దని వారిస్తాడు. అతడు స్నేహితుని మాటలు లెక్కచేయకుండ వెళతాడు. చిత్రాంగి అతనికి హారతులిచ్చి పన్నీరు, అత్తరు, ఫలములు కానుకగా ఇస్తుంది. వాటిని అతడు తిరస్కరించి. తన పక్షినిమ్మని అడుగుతాడు. ఆమె అతణ్ణి వరించిన విషయం చెబుతుంది.
గేయం: “చక్కనీ ఓబాల చేత చిక్కితివనుచు రెక్కలా తలుపు వేసె
లేడి ఉన్నాచోట వెన్నకరుగవలెను వన్నెకాడా! వింటివా!
రాజులేని వేళ రమ్య హర్మ్యముకేగి రతికేగి రతికేళి తేలుదాము!”
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 470)
పై గేయంలో చిత్రాంగి సారంగధరుణ్ణి మోహించి, అతనితో ఏకాంతంగా గడపాలన్న తన కోరికను వ్యక్తం చేస్తుంది. ఆమె మాటలు అతనికి ములుకులువలె తగులుతాయి. అపుడు సారంగుడు “గుడి మ్రింగ దలచిన వాడికి గుడిలింగమడ్డువస్తుందా! కడుపాపి ఆడజాతి అలనాడు వాలి రావణుడు కీచకుడు సతులకోసం చనిపోలేదా! ఆ విధంగానే నేను నీచేతికి చిక్కాను” అంటాడు. అతడు కప్పుకున్న బం శాలువా ! చేతికి చిక్కింది. దానిని చించుకుని అతడు వెళ్లిపోతాడు. అపుడు చిత్రాంగి సారంగుడు తనను బలాత్కరించాడని రాజుకి లేఖరాస్తుంది. గేయం: “కాముడా! నీవింత కఠినము జేస్తివి కాంతునకు నే దెల్పెదా!
కట్టిస్తు కొట్టిస్తు కాల్పిస్తు నిన్నయిన కండలే గోయింతును!
చీరలూ చించుకొని రవికలూ చించుకొని రవ్వలూ తా జేసెను
గుబ్బల్లు గీరుకొని గాజులు కొట్టుకొనీ గరిత రవ్వలు జేసెనూ!”
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 470)
రాజు కంగా పల్లకీ ఎక్కి చిత్రాంగి మేడకు వస్తాడు. అప్పటికి ఆమె చీరలు, రవికలు చింపుకొని, గాజులు పగలకొటుకొని, గుబ్బలు గీరుకొని రాజుని నీవు నాకు మామవి అవుతావని అంటుంది. సారంగుడు తనను బలాత్కరించాడని చెబుతుంది. అప్పుడు రాజరాజు ధర్మశాస్త్రాలు తెలిసిన పండితులను పిలిపించి వారితో చర్చిస్తాడు. రాజు సారంగుడిని పిలిచి శిక్షించబోతున్నాడని చెలికత్తెలు రత్నాంగికి చెబుతారు. ఆమె తొందరపడి కొడుకుని శిక్షింపవద్దని, రాజుకి రెండు కథలు చెబుతుంది.
కాశీదేశంలో కాంపిల్య నగరంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండే వారని, వారు ఒక ముంగిసను పెంచుకుంటారు. తరువాత వారికి ఒక కొడుకు పుడతాడు. ఆ తల్లి బాలుణ్ణి ఉయ్యాలలో పడుకోబెట్టి, ఆ ముంగిసను కాపలా ఉంచి, నీళ్ళకు వెళుతుంది. ఇంతలో ఒక పాము ఆ ఉయ్యాల పైకి వస్తుంది. ఆ ముంగిస దానిని చంపి, రక్తపు నోటితో తన యజమానురాలికి ఎదురుగా వెళుతుంది. దానిని చూచి, అది తమ బాలుని చంపిందని భర్తతో చెబుతుంది. అతడు ఆ ముంగిసను చంపుతాడు. తరువాత నిజం తెలిసి ఎంతో బాధపడతాడు. అలాగే తొందరపడి సారంగుని చంపవద్దని రత్నాంగి రాజుతో చెబుతుంది. ఆమె మరొక కథను కూడ తన భర్తకు చెబుతుంది. చోళదేశంలో నిచుళాపురంలో చిత్రకేతుడనే రాజు ఒక చిలుకను ప్రేమగా పెంచుతాడు. ఒకరోజు పక్షిజాతులన్ని కలిసి, దేవతా వనాలకు వెళుతూ చిలుకను కూడ తమతో రమ్మని పిలిచాయి. చిత్రకేతు మహారాజు దగ్గర అనుమతి తీసుకుని, ఈ చిలుక కూడా వెళుతుంది. నదులు, సాగరాలు దాటి నందన వనానికి చేరింది. అక్కడ పక్షులతో చాలా కాలం ఆనందంగా గడుపుతుంది. అది తన యజమానికి ఇచ్చిన మాట ప్రకారం తిరిగి చోళదేశానికి వస్తుంది. ఆ చిలుక వస్తూ ఒక మామిడిపండుని తెచ్చి, చిత్రకేతు మహారాజుకి ఇస్తుంది. అతడు ఆ పండుని ఒకచోట పాతిస్తాడు. కొంత కాలానికి అది చెట్టుగా పెరిగి ఒక పండు కాస్తుంది. ఆ రాజు ఆ పండుని ఒక బ్రాహ్మణునికి ఇస్తాడు. అతడు ఆపండు తిని చనిపోతాడు. ఆ రాజు కి బ్రహ్మహత్యా పాపం వచ్చిందని, వెంటనే వాడియైన కత్తితో ఆ చిలుకను చంపుతాడు. కొన్ని రోజుల తరువాత ఆ నగరంలోని ఒక వృద్ధవేశ్య, తన కూతురితో గొడవపడి ఆ మామిడిచెట్టు కింద కూర్చుంటుంది. అక్కడ పడి ఉన్న మామిడి పండు తిని పన్నెండేళ్ళ బాలా కుమారిగా మారిపోతుంది. ఆ తరువాత రాజు ఆ విషయం తెలుసుకుని తన పెంపుడు చిలుకను చంపినందుకు ఎంతో పశ్చాత్తాపపడతాడు. ఈ విధంగా రత్నాంగి చెప్పిన ఉపాఖ్యానాలు రాజుకి నచ్చక, ఆమెను మెడపట్టి సభనుండి బయటకు పంపిస్తాడు. ఆ తరువాత కొడుకుని తలవరులకు అప్పగిస్తాడు. వారు సారంగధరుణ్ణి చంపలేక నీకట్లు విప్పి వదిలేస్తాం ఎక్కడికైనా పారిపోయి జీవనం సాగించమని చెబుతారు. కాని సారంగుడు అందుకు అంగీకరించడు చేసేది లేక ఆ తలారులు ఈ కింది విధంగా చేస్తారు.
గేయం : పరుపుకొండలమీద రుద్రవృక్షం - క్రింద బాలుని పడవేసిరీ
కత్తులు నూరియూ కాళ్ళు చేతులు గోసి – కండలు తెగగొట్టిరీ
దిక్కులూ కదలెనను చుక్కలు రాలెనను సురలెల్ల ఘోషలిడిరీ
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 470)
తలారులు సాగంగధరుణ్ణి పరుపు కొండలపైకి తీసికెళ్ళి, అతని కాళ్లు చేతులు ఖండించి, ఒక కాలు, చేతిని రాజరాజ నరేంద్రునికి తీసికెళ్ళి ఆనవాలుగా చూపిస్తారు. ఆ రాజు వాటిని చిత్రాంగి వద్దకు పంపిస్తాడు. సారంగుడు ఆ బాధను భరించలేక ఆకాశవాణిని దేవతలందరినీ పేరుపేరునా ప్రార్థిస్తాడు. అతని రోదనను విన్న ఋషులు, సిద్ధులు అందరూ అక్కడికి వచ్చి జరిగినది తెలుసుకంటారు. అంతలో ఆకాశవాణి వచ్చి జరిగిన సత్యాన్ని చెబుతుంది. వారందరూ కలసి బ్రహ్మదేవుని ప్రార్థించి, అతనికి కాళ్ళు చేతులు తిరిగి వచ్చేలా చేస్తారు. అతడు ఆ చంద్రార్కమూ సిద్దులతో కలసి జీవిస్తాడు. చిత్రాంగి అడవిలో పలికిన ఆకాశవాణి రాజు దగ్గరకు వచ్చి చెప్పరాదా అంటుంది. ఆమె మాటలు విన్న ఆకాశవాణి రాజు సభకు వచ్చి, ఈ విధంగా పలుకుతుంది.
గేయం : మండలా పతివయ్య మహనీయగుణధైర్య మహరాజ లేవయ్యా
ప్రహ్లాదునీవంటి పరమభక్తుడు వీడు పాతకంబనక గొట్టా
చిన్నిబాలుని జంప చేతులెటువచ్చెను జాలియింతయులేకను
స్త్రీబుద్ధి ప్రళయమని శ్రుతులు బల్కుచునుండ స్త్రీలచెయి జిక్కితివిర
కాలసర్పము వంటి కాంతచేతిలో చిక్కి కొడుకును చంపితివిర
చిన్న భార్యవలన యెన్నలేని దోషంబుకనగాను గలిగె నీకు
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 476)
కాల సర్పము వంటి స్త్రీ చేతిలో చిక్కి జాలి లేకుండ కుమారుని ఎలా చంపావని అని ఆకాశవాణి రాజుని ప్రశ్నిస్తుంది. ఆ మాటలు విన్న అతను చిత్రాంగిని చంపిస్తాడు. ఈ సందర్భంలో ఆకాశవాణి “స్త్రీ బుద్ధి ప్రళయమని శ్రుతులు బల్కుచునుండ స్త్రీలచెయి జిక్కితివిర” అనే వాక్య ప్రయోగం ఉంది. స్త్రీల రామాయణపు పాటలలో కూడ ‘స్త్రీ బుద్ధి ప్రళయాంతకం” అనే వాక్యం ఉంది. సమాజంలో చెడు స్వభావం గల పురుషులున్నట్లే అక్కడక్కడ స్త్రీలు కూడ ఉంటారని వ్యక్తమవుతుంది. ఈ గేయాలను స్త్రీలు పాడినప్పటికి, వారు తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నంచేయలేదు. వాస్తవికతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారని తెలుస్తుంది. బాటసారుల ద్వారా సారంగుడు జీవించి ఉన్నాడని తెలుసుకొన్న రాజరాజు రత్నాంగితో కలిసి పర్వతానికి వెళ్ళి సారంగుని కలిసి ఇంటికి రమ్మని బ్రతిమాలుతారు. అతడు తండ్రి పిలుపుని తిరస్కరించి, సిద్ధుల సహాయంతో చిత్రాంగిని బతికిస్తాడు. రాజు రాణులిద్దరినీ తీసుకొని రాజ్యానికి వెళతాడు, సారంగుడు సిద్ధులతో కలసి శివపూజ చేస్తు కొండమీదనే ఉంటాడు. (నవనాథులు అనే తొమ్మిది మంది శివయోగసిద్ధులు ఉన్నారు. వారిలో సారంగధరుడు ఒకడని చెబుతారని, అతడే శంభుదాసుడని నందిరాజు చలపతిరాజు స్త్రీలపాటలలో చెప్పబడింది.)
b) గోవుపాట
క్రీ.శ 1435 కాలానికి చెందిన అనంతామాత్యుడు అనే కవి భోజరాజీయం అనే కావ్యంలో గోవ్యాఘ్ర సంవాదము పేరుతో ఈ కథను రచించాడు. ఇది అనేక ఉపకథలతో కూడి రసవంతంగా ఉంటుంది. ఈ పాటను రచించిన కవి సంక్షిప్తం చేసి రాశాడు. ఇది మిశ్రగతిలో ఉంది. భోజరాజీయంలో ఈగోవు ఒక బ్రాహ్మణునిదని ఉంది. ఈ పాటలో శ్రీకృష్ణుని గోవు అని ఉంది. కన్నడంలో ఈపాట చాలా ప్రసిద్ధి చెందిందని తంగిరాలవారు తెలిపారు. శ్రీకృష్ణుడు గోవులను పిలిచి బందంవేసి, పాలుపితికి వాటిని వదిలి తాను చెట్టెక్కి వేణుగానలోలుడై ఉంటాడు. ఆవులన్ని వేర్వేరు దిక్కులకు వెళ్ళి గడ్డి మేస్తుంటాయి. తూర్పు దిక్కుకు వెళ్ళిన ఆవులే వద్దకు ఒక పెద్దపులి వచ్చి ఈ విధంగా అంటుంది.
గేయం: “నిలిచి నాదూ పొలము పాడూ – సేయగ నేడు వచ్చిన యావులారా
పోకు పోకుడు మేతమానీ – చిక్కినారుగ చేతికిపుడూ
వారమొక్కా జీరమూనూ – గొంతువిరిచీ రక్తమెల్లా
గ్రోలి పొట్టానించి వెగమే - కొవ్వుతీసీ యారగిస్తును”
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 754)
ఒక పులి గడ్డి మేస్తున్న ఆవుల వద్దకు వచ్చి వాటిని ఆహారంగా గొంతు విరిచి చంపి, రక్తమాంసాలను ఆహారంగా స్వీకరిస్తానంటుంది. ఒక ఆవు ముందుకు వచ్చి, మూడురోజుల క్రితం నాకు కవలదూడలు పుట్టాయి. అవి నాకోసం ఆకలితో ఎదురుచూస్తూ ఉంటాయి. నేను ఇంటికి వెళ్ళి, వాటికి పాలిచ్చి, మరల వచ్చి నీ ఆకలి తీరుస్తాను అని పులితో అంటుంది. ఆ పులి ఆవుని నమ్మనంటుంది. ఆ ఆవు అనేక ఆనలు పెడుతుంది. సత్యవాక్యము తప్పితే స్వామిద్రోహము చేసినదానిని, పుట్టింటి వారికి కీర్తిసంపద బోతుందని, తాను చెప్పేది అసత్యంకాదు నమ్మమని చెబుతుంది. పులికి జాలివేసి ఆవుకి ఇంటికి వెళ్ళడానికి అనుమతినిస్తుంది. ఆవు ఆనందంగా ఇంటికి వచ్చి ఆ లేగదూడలకు కడుపునిండా పాలిచ్చి, తాను పులికి ఆహారంగా వెళ్ళాలని చెప్పి, తన బిడ్డలకు అనేక బుద్ధులు చెబుతుంది. తన తోటి ఆవులను పిలిచి తన బిడ్డలను కాపాడమని చెబుతుంది. ఆ తరువాత ఆ ఆవు తుంగాభద్రానదిలో స్నానంచేసి, దేవుడికి పూజచేసి, అడవిలోకి వెళ్ళి పులిని పిలిచి తనను తినమంటుంది. అపుడు పులి వచ్చి ఆ ఆవు కాళ్ళమీదపడి మొక్కి ఈ విధంగా అంటుంది.
గేయం: “తల్లి నీవూ లక్ష్నిదేవీ – అన్నమాటను దాటనేరవు
నిన్ను మించిన వారు భువిలో – నీతిపరులుగా గానలేనూ
నీదు చర్యలు విన్నవారలు – చదువు వారలు వ్రాయు వారలు
యెంత మూర్ఖాద్రోహులైనా – పుణ్యమబ్బీ మోక్షమందేరు.
ఓ జనులారా తప్పక చదువుచుండుడీ”
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 756)
నిన్ను మించిన నీతిపరులు ఈ భువిలో లేరు. నీకథను విన్నవారు, చదివిన వారు ఎంత మూర్ఖులైనా పుణ్యంపొంది, మోక్షం సాధిస్తారు. అని చెప్పి ఆపులి ప్రాణం విడుస్తుంది. అప్పుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు మొదలైన దేవతలు ప్రత్యక్షమై నిన్ను మించిన నీతిపరులు ముల్లోకాలలో లేరు, నీవున్న చోట నెలకు మూడు వర్షాలుపడి, పంటలు బాగా పండుతాయని, నీ చరిత్ర చదివిన వారు విన్నవారు కైలాసంచేరి సుఖంగా ఉంటారు. అని చెప్పి ఆ దేవతలు వారి లోకాలకు వెళ్ళిపోతారు. ఆ తరువాత ఆ ఆవు తన బిడ్డలను చేరి సుఖంగా ఉంటుంది. ఈ కథను జానపద కవి తనకు నచ్చిన విధంగా మార్చి రాశాడు. ఇక్కడ అతని మనఃప్రవృత్తి వ్యక్తమవుతుంది.
b) గంగా – గౌరీ సంవాదము సవతుల కయ్యము
హరిహరీనారాయణాదినారాయణా – కరుణించి మమ్మేలు కమలలోచనుడ అనే వరుసలోనే గంగా వివాహము అనే పెద్దపాట ఉందని, దీనిని విజయనగర సంస్థానంలోని మరువాడ గ్రామానికి చెందిన పసగాడ సన్యాసి అనే కవి స్కాందపురాణం ఆధారంగా క్రీ.శ 1856 లో రచించాడు. ఈ గేయాన్ని ఆధారంగా చేసుకుని, 1. గంగా – గౌరీ సంవాదము అనే గేయం 250 మంజరీ ద్విపద పాదాలతో కూడినది. 2. సవతుల కయ్యము 21 పాదాలుగల గేయము నందిరాజు చలపతిరావు స్త్రీల పాటలలో ఉన్నాయి.
ఒకరోజు గౌరిదేవి చెట్టుపువ్వులు కోసి, తాను పెట్టుకోగా మిగిలిన పూలు గంగకు పంపుతుంది. వాటిని చూసి “గంగ వాడిన పువ్వులు పంపిన ఆ వనితయెవ్వరు? ఆమె కోసిన పూలలో సగం పూలు నాకు రావాలి!” అని అంటుంది. “సరికొల్లలాడను సరిదానవటవే?” అని గౌరి అంటుంది. అప్పుడు గంగ ఈ విధంగా అంటుంది.
గేయం: “సరిదాన్ని కాకపోతే శివుడేల దెచ్చు
శివుడేల దెచ్చును జగమేల మెచ్చును”
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 826)
శివుడికి చిన్నాలిని నీకు చెల్లెలను అని అంటుంది. గంగా ఆ విధంగా అనగానే గౌరికి కోపం వచ్చి ఆమె గుండెలు పగిలేలా తన్నిందని, అప్పుడు గంగ ఆమె కాలినుండి రాలిన మన్నుతో సందులు, గొందులు కట్టిస్తానంటుంది. కొడుకు వీరభద్రుడుకి మేడ కట్టిస్తానంటుంది. బసవన్న పవళించడానికి పంచటరుగు కట్టిస్తానంటుంది. శివుడుకి శివపూజకోసం గద్దె కట్టిస్తానంటుంది. అంతే గాక గంగకి, గౌరికికూడ సరిగద్దె కట్టిస్తానంటుంది. గౌరికి కోపం వచ్చి సరిగద్దె కట్టను సరిదానవటవే అని గంగను నిలదీస్తుంది. ఆమె మరల “సరిదాన్ని కాకుంటె శివుడేల దెచ్చు” అంటుంది. గౌరికోపంతో ఆమెను మరల కాలితో తన్నుతుంది. ఆ తరువాత గంగ ఆమె పై పగతీర్చుకోడానికి నీటిని బంధిస్తుంది.
ఈ గేయంలో గౌరి గంగను కాలితో తన్నడమనేది. జానపదకవి కల్పన. జానపదకుటుంబాలలో ప్రతిచిన్న విషయానికి స్త్రీపురుషులిరువురు ఒకరిపై ఒకరు శారీరకంగా దాడిచేసుకోవడం సర్వసాధారణం. ఆ అంశాలనే గంగ, గౌరి సంవాద సన్నివేశంలో కూడ చొప్పించి రాయడం, పాడుకోవడం జరిగిందని చెప్పవచ్చు. కొంతమంది జానపద స్త్రీల జీవితంలో సవతిపోరు ఉంటుంది. వారి నిజజీవితంలో ఆ స్త్రీపట్ల ఉన్న తీవ్రమైన వ్యతిరేకతను ఈ గేయంలోని సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని, వారి మనోభావాలను వ్యక్తంచేసి ఉంటారని చెప్పవచ్చు.
ఆ తరువాత గౌరీదేవికి ఎక్కడ నీరుకనబడదు. కొడుకు వీరభద్రుడిని పిలిచి నీటిజాడ తెలుకురమ్మని పంపుతుంది. అతడు కొలనులు, చిలక సముద్రం, పాల సముద్రం, మల్లన్నగుండం, సవతుల గుండం మొదలైనవన్నీ వెతుకుతాడు. ఎక్కడా నీరుండదు. వీరభద్రుడు తల్లికి జరిగినది చెబుతాడు. గౌరిదేవి వీరభద్రుడుని దక్షుడి వద్దకు వెళ్ళి ఐదు దినములనుండి స్నానములేదు, శివపూజలేదు, నీరులేదని చెప్పమంటుంది. అప్పుడు దక్షుడు పదివేల పాలకావిళ్ళు, పదివేల నేతి కావిళ్ళు గౌరీదేవికి పంపిస్తాడు. ఆమె పాలతో స్నానం చేసి, నేతితో శివుని పూజిస్తుంది. అప్పుడామెను చీమలు, దోమలు కుడుతుంటాయి. గౌరీదేవి వీరభద్రుణ్ణి శివుని వద్దకు పంపుతుంది. అతడు శివుడు వద్దకు వెళ్ళి తల్లికి ఐదురోజుల నుండి స్నానానికి నీరులేదని, శివపూజ చేయలేదని చెబుతాడు. మీ అమ్మ తక్కువ నేను ఎక్కువకాదు. ప్రాణిపుట్టుక, చావులకు శివుడు కర్త, బ్రహ్మ ఆయుష్షు పోసేవాడు. విష్ణువు రక్షించేవాడు. నీటికి కర్త గంగ. కావున గంగతో ఎప్పుడు వాదము, కయ్యము పెట్టుకోవద్దని గౌరితో చెప్పమని అంటాడు. వీరభద్రుడు తండ్రి చెప్పిన మాటలను తల్లితో చెబుతాడు.
ఇక్కడ జానపద కవి స్త్రీపురుషుల సమానత్వాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేశాడు. శివపార్వతులిద్దరూ లయకారకులు అనే విషయం చెబుతూ, బ్రహ్మ, విష్ణువు, గంగ వారుచేసే పనులకు వారే కర్తలని, ఏది కావాలంటే వారినే పూజించాలనే విషయాన్ని స్పష్టంగా వివరించాడు.
వీరభద్రుడు చెప్పిన మాటలు విని, గౌరీ దేవి కంటతడి పెట్టుకుని, గంగవద్దకు తాను వెళ్ళనని, జాలరి దానితో మనకు పొత్తేల అంటుంది. వీరభద్రుడిని వెళ్ళి నీరు అడగమంటుంది. అతడు గంగ దగ్గరకు వెళ్ళి నీటిని అడుగుతాడు. ఆమె నీటి గురించి తెలియదని అంటుంది. అప్పుడు వీరభద్రుడు ఆమె తల పగల గొట్టి చంపి, యమభటులకు అప్పగిస్తానంటాడు. అతని బెదిరింపులకు గంగ ఏమాత్రం భయపడదు. నాతో వాదులాడకు వెళ్ళిపొమ్మంటుంది. అతడు వచ్చి ఆ విషయం తల్లికి చెబుతాడు. అది విన్న గౌరీదేవి ముందు వీరన్న వెనుక గణపతి, తాను మధ్యలో నడుస్తూ గంగ మేడకు బయలుదేరుతుంది. ఆ విషయం తెలుసుకున్న గంగ పచ్చిచేపలతో పందిళ్ళు వేయించి, ఎండుచేపలతో తోరణాలు గుచ్చి, పెద్దచేపలతో పెద్దటరుగులు గట్టి, కప్పచచ్చిన నీటితో కళ్ళాపి చల్లుతుంది. చేప చచ్చిన నీటితో చేతులు కడుగుకుంటుంది.
గేయం: నాఒక్క శివుని నీకిస్తుగాని – వుదకాల జాడలు చెప్పవే గంగా
యిప్పుడన్నామాట తప్పకుమీ అక్కా – యీ మాటకూ సాక్షి యెవరనీ బలికె
భూమి ఆకాశము అని రండు సాక్షి – మద్దులూ మారేళ్ళూ అవి రెండు సాక్షి
సకల దేవతలు వారెల్ల సాక్షి- అనగ సంతోషించి గంగప్పతాను
గుప్పునగుప్పున గంగ వుప్పొంగుచూచు – యేరులన్నీ చాల యేకమయి నిండ
గౌరిస్నానముజేసి శివపూజజేసి – శివుడొచ్చురాలు గౌరి తాజూచి
ఘడియ గ్రక్కున బెట్టె గవరమ్మతాను (నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 829)
గౌరి గంగ వద్దకు వచ్చి, అయిదు రోజులనుండి స్నానంలేదు, శివపూజలేదు నీటి జాడచెప్పమని అడుగుతుంది. అప్పుడు గంగ ఉదకాల జాడ నేనెరుగనంటుంది. గౌరి కొడుకును, కోడలిని, చీరలు నగలు గంగకు ఇస్తానంటుంది. అయినా గంగ నీటి జాడ తెలియదంటుంది. చివరకు గౌరిదేవి శివుణ్ణి ఇస్తానంటుంది. అప్పుడు గంగ సంతోషించి, ఈ మాట మీద నిలబడు దీనికి సాక్షులెవరు అంటుంది. గౌరి భూమి, ఆకాశం, సకలదేవతలు సాక్షులని చెబుతుంది. గంగ మిక్కిలి సంతోషించి ఏరులన్నీ ప్రవహింపజేస్తుంది. గౌరి స్నానం చేసి, శివపూజ చేసి, శివుని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. శివుడు వస్తుంటే గౌరి తలుపేస్తుంది. దేవతలందరి సాక్షిగా గౌరి శివుణ్ణి తనకు ఇచ్చివేసిందని గంగ పరమేశ్వరునితో చెబుతుంది. వారిరువురిని కలసి ఉండమని ఈశ్వరుడు చెబుతాడు. వారిరువురు సఖ్యంగా ఉంటారు.
సవతుల కయ్యము గంగా గౌరి సంవాదము అనే గేయం సవతుల కయ్యము అనే పేరుతో 21 పాదాలు గల చిన్నపాట ప్రచారంలో ఉంది.
గేయం: “వడ్లు దంచిన బియ్యం నీవు పుచ్చుకుంటే – వుత్తవూకాకేల ఈ వాదులాట
చల్లచేసిన వెన్న నీవుంచుకుంటె – చల్లనీళ్ళాకేల ఈవాదులాట
వీడెము వేసిన తమ్మి నీవుంచుకంటె వార్థక్యమునకా యీవాదులాట
పప్పెరుగు గదవమ్మ ఉప్పొక్కరుచియు- యీలాగు వాదమ్ము సవతులు జేయ
యిద్దరిని వోదార్చలేకనే శివుడు – శిరస్సున జాలారి గంగనే వుంచి
తొడలపై పార్వతీ దేవినే వుంచి వెళ్ళెను ఆ శివుడు కైలాసగిరికి”
(నందిరాజుచలపతిరావు స్త్రీలపాటలు. 2024. 829)
పై గేయంలో జానపదులు చక్కని ప్రతీకలతో పాడుకుంటారు. గౌరి శివుని వయస్సులో ఉండగా వివాహం చేసుకుంటుంది. కాని గంగ శివుని ముసలితనంలో వివాహమాడుతుంది. రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుపుతూ వాదులాడకూడదనే వాస్తవాన్ని తెలిపే, జానపదుల అనుభవాలతో కూడిన పాట.
c) ధర్మాంగద చరిత్ర – పాముపాట
ఈ పాటను శ్రీ బొమ్మకంటి నరసింహుడు అనే కవి ప్రబంధధోరణిలో నిర్దుష్టమైన ద్విపద ఛందస్సులో రాశాడని తంగిరాల వారు పీఠికలో చర్చించారు. కాశ్మీర దేశంలో కనకాపురం అనే పట్టణంలో ధర్మాంగదుడు అనే రాజుకి సంతానం లేక బాధపడుతూ ఉంటాడు. కొన్నాళ్ళకు అతని భార్య గర్భవతి అవుతుంది. తొమ్మిది నెలలతర్వాత ఆమె ఒక పాము జన్మిస్తుంది. రాజు నిరుత్సాహపడి, పాము పుట్టిందంటే శత్రురాజులు దండెత్తి వస్తారని భయపడి, తన మంత్రుల సలహాప్రకారం కొడుకు పుట్టాడని ప్రకటిస్తాడు. అతనికి యుక్తవయసు వచ్చిన తరువాత కుమారునికి పెళ్ళి చేయాలనుకుంటాడు. పెళ్ళికుమార్తెను వెతకడానికి బ్రాహ్మణులను దేశాల మీదికి పంపుతాడు. అనేక దేశాలు చూసిన తరువాత సౌరాష్ట్రదేశంలోని మాణిక్య పురంలో రత్నాంగదుడనే రాజు కుమార్తె అయిన శశిముఖిని నిశ్చయిస్తారు. ఆమె త్రిలోక సౌందర్యవతి. వారు దర్మాంగదుడికి ఆ సౌందర్యాన్ని వర్ణించి చెబుతారు. శశిముఖి జాతకాన్ని పరిశీలించి, పెళ్ళికి నిశ్చయించి వస్తారు. వారు పెళ్ళికొడుకుని చూడడానికి వస్తారు. అపుడు ధర్మాంగదుడు చాలా భయపడతాడు. మంత్రి రాజుకి ధైర్యం చెప్పి, వారికి తన కుమారుని చూపిస్తాడు. మారాజు వారి కుమారుణ్ణి వేరేదేశాలకు పంపడు వారికత్తిని పంపిస్తాము. అదిమా కులాచారం దానికి బాసికం కట్టి వివాహం చేయాలని మంత్రి చెబుతాడు. రత్నాంగదుడు బంధువులు అందుకు అంగీకరించి వెళ్ళిపోతారు. ఒక శుభముహూర్తంలో కత్తికి బాసికం కట్టి శశిముఖికి పెళ్ళిచేస్తారు. తల్లిదండ్రులు ఆమెను మెట్టినింటికి పంపిస్తారు. ఆమె కు యుక్తవయసు వచ్చిన తరువాత తన భర్త గురించి చెలికత్తెను అడుగుతుంది. ఆమె భర్త నాగశేషు అని చెప్పి, మీ అత్తని అడగమని చెబుతుంది. అప్పుడు శశిముఖి అత్తని భర్త ఎవరని అడుగుతుంది. ఆమె శేషుడే నీభర్త అని చెబుతుంది. ఆ మాటలు విన్న శశిముఖి కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తుంది. ఆ తరువాత ఆమె ఆపాముని తీసుకుని కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతుంది. పుణ్యనదులన్నింటిలో స్నానం చేస్తుంది. ఆ తరువాత నైమిశారణ్యంలో ప్రవేశిస్తుంది. అక్కడ కౌండిన్య, శౌనక, గార్గేయ, జహ్ను, మాండవ్య, వాల్మీకి మొదలైన మునులను కలిసి, తన కష్టాన్ని చెబుతుంది. వారు ఆమెను ఓదార్చి, అతని పూర్వజన్మ గురించి చెప్పి, త్వరలో అతడు మానవరూపాన్ని పొందుతాడని చెబుతారు. ఆమె కాశి విశ్వేశ్వరుని పూజించి ఆ తరువాత అన్ని పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంది. ఆమె ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా భర్తరూపం మారదు. చివరికి తెలంగాణలో ఉన్న ధర్మపురిక్షేత్రానికి చేరి, అక్కడ బ్రహ్మగుండంలో దూకి ఆత్మహత్యచేసుకోబోతుంది. అప్పుడు ఆకాశవాణి ఆమెను వారించి శేషుణ్ణి కంఠానికి చుట్టుకుని బ్రహ్మగుండంలో మునిగితే అతనికి మానవరూపం వస్తుందని చెబుతుంది. ఆమె ఆకాశవాణి చెప్పినట్లు చేస్తుంది. అతడు అందమైన రాజకుమారుడుగా మారతాడు. అతడు ఆమెను నీవు ఎవరో నాకు తెలియదు అంటాడు. అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతమంతా చెబుతుంది. వారిరువురూ పదిరాత్రులు ఆ పుణ్యక్షేత్రంలో గడిపి, ఆ తరువాత పుట్టింటికి వెళ్ళి తన తండ్రికి జరిగిన వృత్తాంతమంతా చెబుతుంది. అతడు ధర్మాంగదుడు చేసిన మోసానికి రగిలిపోతూ, అతనిపై పగతీర్చుకోడానికి వెళతాడు. రత్నాంగదుణ్ణి చూసి ధర్మాంగదుడు చాలా భయపడతాడు. అతడు తన కూతురుని చూడడానికి వచ్చాను. మాయింటికి తీసికెళతానంటాడు. అప్పుడు ధర్మాంగదుడు తన మంత్రి చేసిన మోసాన్ని చెప్పి క్షమించమని అడుగుతాడు. శశిముఖి పామురూపంలో ఉన్న భర్తను తీసుకుని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, ఇంకా తిరిగి రాలేదని చెబుతాడు. రత్నాంగదుడు ధర్మాంగదుని గట్టిగా మందలించి, అతనికి జరిగిన వృత్తాంతం చెప్పి, శశిముఖిని, రాజకుమారుణ్ణి చూపిస్తాడు. ఆ రాజు నమ్మడు. అప్పుడు శశిముఖి ఆకాశవాణితో నిజం పలికిస్తుంది. ధర్మాంగదుడు కొడుకుని, కోడలిని సాధరంగా ఆహ్వానించి, కొడుకుకి పట్టాభిషేకం చేస్తాడు. ప్రజలు శశిముఖిని ఎంతో మెచ్చుకుంటారు. నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలలో ఉన్న ధర్మాంగదచరిత్ర.
ఆచార్య బిరుదురాజు రామరాజు తన తెలుగు జానపద గేయసాహిత్యమునందు అద్భుతరస గేయవిభాగంలో చేర్చారు. ఈ పాట సార్వజనీనమైనదని ఒకటి పూరి నారాయణరాజు రచించినది పెద్దపాట. ఇది ఎప్పుడు ముద్రించబడిందో తెలియదని సెలవిచ్చారు. ఆయనకు రెండు ప్రతులు లభించాయని, ఒకటి వెస్టువార్డు కంపెనీవారు 1929 లో ప్రకటించగా, దీనినే యస్. వి. గోపాల్ అండ్ కోవారు 1935 లో ముద్రించారని ఈ రెండూ నారాయణరాజు కృతులే అని పేర్కొన్నారు. ఇది ఒక చిన్న ప్రబంధమంత ఉంటుంది. రెండవది గుండు జగన్నాథం 1932 లో ప్రకటించిన చిన్నపాట. ఇది సరళంగా ఔచితీమంతముగా ఉందని, ఒకస్త్రీ ఈ గేయాన్ని రాసి ఉండవచ్చని రామరాజు అభిప్రాయం. అంతేగాక బొమ్మకంటి నరసింహకవి అనునతడు ధర్మాంగద చరిత్ర అనే పేరుతో ఈ కథను ద్విపదలో రాశాడని, అది తాళపత్ర గ్రంథమని వారు వివరించారు.
నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలలో ధర్మాంగద చరిత్ర, తెలుగు జానపద గేయసాహిత్యంలో గల ధర్మాంగద చరిత్ర రాసిన కవి నామములలో వ్యత్యాసము ఉంది. అంతేగాక నారాయణరాజు విజయనగర విజయరామగజపతి మహారాజుకి సమకాలికుడనికూడ రామరాజు వివరించారు.
ధర్మపురిలో గల సత్యవతి దేవాలయం గురించి ఒక ప్రత్యేక కథప్రచారంలో ఉంది. ధర్మాంగద చరిత్రలో పాముని వివాహమాడిన స్త్రీ పేరు సత్యవతిఅని, ఆమె తన భర్తతో కలసి ధర్మపురి క్షేత్రంలోని గుండంలో స్నానం చేయగా, ఆపాముకి విముక్తి కలిగి అందమైన రాకుమారుడుగా మారతాడు. ఆమె తనభర్తతో కలిసి వీధిలో నడుకుంటూ వెళుతున్నప్పుడు ప్రజలందరూ ఆమెని అనుమానిస్తారు. అప్పుడామె తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోడానికి నదిలే స్నానంచేసి ఇసుకను తెచ్చి పైకి విసురుతుంది. ఆ ఇసుక ఎంతఎత్తు ఎగురుతుందో అంత ఎత్తు లో ఇసుక స్థంభం ఏర్పడుతుందని, ఇంకొంత మంది ఆమె మూడుదోసిళ్ళ ఇసుకను తెచ్చి ఒడ్డున వేసి, తాను పతివ్రతనైతే అది స్థంభంగా మారాలని కోరుకున్నదని, ఆ ఇసుక స్థంభంగా మారిందనిచెబుతారు. ఆ తరువాత ఆమె దేవతగా మారిందని, ఆ దేవాలయాన్ని సత్యవతి దేవాలయమని పిలుస్తారు. అక్కడే పదిఅడుగుల ఎత్తుగల ఇసుక స్థంభం నేటికీ ఉంది. ధర్మాంగదుడు ధర్మపురి నరసింహ స్వామిగా వెలశాడని కథనం నేటికి ప్రచారంలో ఉంది. ఆమె స్నానం చేసిన గుండానికి సత్యవతి గుండమని పిలుస్తారు. ఈ కథ గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ పాట రాసిన కవులు, కాలం, ప్రజల కథనాలు మొదలైన వాటిని సేకరించి, నిశిత పరిశీలన చేయవలసిన ఆవశ్యకత ఉంది.
3. ఉపసంహారం
- జానపద సాహిత్యంలో పరిశోధనలు చేసిన ఆచార్య. బిరుదురాజు రామరాజు, తూమాటిదోణప్ప, తంగిరాల వెంకట సుబ్బారావు, నాయని కృష్ణకుమారి మొదలైన వారు ఒకరి అభిప్రాయాలను వేరొకరు గౌరవించుకుంటు, సమర్ధిస్తూ సమైక్యంగా కృషిచేశారు. కాబట్టే జానపద సాహిత్యం, సాహిత్యలోకంలో పరిపూర్ణమైన ఉన్నత స్థానాన్ని పొందిందని చెప్పవచ్చు. నేటి తరం పరిశోధకులు కూడ ఆ మార్గంలో పయనిస్తూ ఈ సాహిత్యాన్ని భవిష్యత్తరాలవారికి అందించే ప్రయత్నం చేయాలి.
- నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలలో పౌరాణిక కథలతో పాటు జానపదుల మనోభావాలు, వారి ఆలోచనలు కూడ చోటు చేసుకున్నాయి. వీటిలో రామాయణ, భారత, భాగవత కథలతోబాటు, జనవ్యవహారంలో ఉన్న కథలతో కూడిన గేయాలు కూడ ఉన్నాయి. ఈ గేయాలలో కొన్ని అమూలాంశాలు, మరికొన్ని ఔచితీమంతమైన వర్ణనలు, కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలు, భాషాప్రయోగాలు మొదలైనవి జానపద కవి ప్రయోగాలుగా భావించి, జానపద సాహిత్య విమర్శ చేయవచ్చు. ఉదాహరణకి సాగంధర చరిత్రలో రాజరాజనరేంద్రుడు, సారంగధరుడికి శిక్ష విధించాలని నిర్ణం తీసుకున్నపుడు, మహారాణి రత్నాంగి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి రెండు కథలు చెబుతుంది. ఇవి జానపదులు చెప్పిన కథలు. వారు తొందరపాటు నిర్ణయాలవల్ల జరిగే అనర్థాలను ఈ కథద్వారా సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అంతేగాక గంగా, గౌరీ సంవాదం గేయంలో జాలరుల జీవన విధానం, ఆచారాలు స్పష్టంగా వ్యక్తమవుతాయి. సమాజంలో ఒక వర్గంవారు ఎదుర్కొంటున్న వివక్షను ఈ గేయం ద్వారా జానపద కవి వెల్లడించారని చెప్పవచ్చు. ధర్మాంగద చరిత్ర పాము పాటలో కూడ పెళ్ళిచూపులలో మంత్రికుమారుని చూపించడం, కత్తికి బాసిగం కట్టడం, జానపదుల ఆలోచనా సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. “Alan Dundes” ప్రతిపాదించిన “Oral Literary Criticism” – మౌఖిక సాహిత్య విమర్శ విధానంలో భాగంగా నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలను పరిశీలించవచ్చు. వీటిలో అనేక అమూలకాంశాలు చోటుచేసుకున్నాయి. కొన్ని సంస్కృత గేయాలు. అష్టకాలు, దండకాలు మొదలైన ఎన్నో పరిశీలించదగిన అంశాలున్నాయి. వీటన్నింటినీ వేరు వేరు కోణాలలో పరిశీలన చేయవచ్చు.
- ఈ పాటలలో చాలా వరకు జానపదకవులు ఉద్దేశపూర్వకంగా రాశారని తెలుస్తుంది.
- మూలకథలకు, జానపదులు పాటలలో అనేక మూలాంశాలు, కల్పనలు, వారి మనోభావాలు, సామాజికాంశాలు మొదలైనవి ఉన్నాయి.
- ఈ పాటలలో కొన్ని సంస్కృతంలో సంస్కృత ఛందస్సులో ఉన్నాయి. అంటే వీటిని సంస్కతంలో పాండిత్యం గలవారు రాశారని చెప్పవచ్చు. ఈ విధంగా రచించినవి, జానపదులు పాడినపాటలు, వారి ఆలోచనా శక్తిని, సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయి.
- కొలకలూరి ఇనాక్ తన జానపదుల సాహిత్య విమర్శ అనే గ్రంథంలో మౌఖికంగా కథలరూపంలో ప్రచారంలో ఉన్న అంశాలను సాహిత్య విమర్శ కథలు పేరుతోను, జన వ్యవహారంలో ఉన్న సాహిత్య సంబంధమైన కథలను జానపదుల సాహిత్య విమర్శ గా పరిశీలించవచ్చు అని ప్రకటించారు.
- ఈ స్త్రీలపాటలలో పైన చెప్పిన రెండురకాలు ఉన్నాయి.
- R.S.Boggs వర్గీకరణ ప్రకారం ఈపాటలను విభజంచి పరిశీలిస్తే ప్రపంచస్థాయిలో జానపద సాహిత్యానికి గుర్తింపు వస్తుంది.
4. సూచికలు
- సుబ్బారావు, తంగిరాల.2024. చలపతి రావు స్త్రీలపాటలు
5. ఉపయుక్త గ్రంథసూచి
- అనసూయాదేవి, అవసరాల. 2010. జానపదగేయాలు, పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం, హైదరాబాదు.
- అనురాధా, పంగులూరి. 2008. జానపద సామూహిక నృత్యగేయాలు, శాస్త్రీయ గానధోరణులు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
- ఇనాక్, కొలకలూరి. 2010. జానపదుల సాహిత్య విమర్శ. జ్యోతి గ్రంథమాల, అనంతపురం, హైదరాబాదు, తిరుపతి.
- కృష్ణశ్రీ. స్త్రీల రామాయణపు పాటలు, పద్మావతీ ఆర్ట్ ఫ్రింటర్స్, హైదరాబాదు.
- కృష్ణకుమారి, నాయని. 2017. తెలుగు జానపదగేయగాథలు. తెలుగు అకాడమీ, హైదరాబాదు.
- మోహన్, జి,యస్. 2010. జానపద విజ్ఞానాధ్యయనం. ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.
- రామరాజు,బి. జానపద గేయసాహిత్యము. జానపదవిజ్ఞాన ప్రచురణలు, హైదరాబాదు.
- విజయకుమారి, డి. 2019. జానపద సాహిత్య వ్యాసతోరణం. సూర్యపబ్లికేషన్స్, హైదరాబాదు.
- విజయకుమారి, దాసర.2024. శ్రామికగేయాలు వస్తుసంస్కృతి. (వ్యాసం) ఔచిత్యం, మే, 2024.
- సుందరం, ఆర్.వి.యస్. 2014. ఆంధ్రుల జానపదవిజ్ఞానం. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
- స్త్రీలపాటలు. 1970. ఎన్,వి. గోపాల్ అండ్ కో. 63, కృష్ణప్ప నాయకగుంటవీధి, గుంటూరు.
- సుబ్బారావు, తంగిరాల. 2024. నందిరాజు చలపతిరావు స్త్రీలపాటలు. అజో-విభో- కందాళం ఫౌండేషన్, హైదరాబాదు.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

