headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-02 | February 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed

15. భారత పాఠశాలల్లో బోధనా భాష(లు): బహుభాషాత్మకత

DOI

డా. వి. ఎం. సుబ్రమణ్య శర్మ

సహాయ ఆచార్యులు, భాషాశాస్త్రశాఖ,
ఢిల్లీ విశ్వ విద్యాలయం, ఢిల్లీ.
సెల్: +91 9866707774
Email: vmssharma@gmail.com

పూర్ణేందు బికాశ్ దెబ్ నాథ్

అకాడెమిక్ కన్సల్టెంట్, భారతీయభాషాసమితి
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ.
సెల్: +91 8527754903
Email: purnendueflu@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 10.01.2025        ఎంపిక (D.O.A): 31.01.2025        ప్రచురణ (D.O.P): 01.02.2025


వ్యాససంగ్రహం:

నూతన జాతీయవిద్యావిధానం (NEP) 2020 ప్రధానంగా మాతృభాష లేదా ప్రాంతీయభాషలో విద్య అందించడాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఎవరిపైనూ దీన్ని బలవంతంగా అమలు చేయడానికి ఉద్దేశించబడలేదు. “సాధ్యమైనచోట” విద్యార్థులకు వారి మాతృభాష లేదా ఇంటిలో మాట్లాడే భాష లేదా ప్రాంతీయ భాషలో విద్యా బోధన చేయాలని నూతన విద్యా విధానం పేర్కొంది. ఈ నూతన విధానంలో భారతీయ పాఠశాల విద్యా వ్యవస్థలో ద్విభాషా/బహుభాషా బోధనకు అవకాశాన్నిఇస్తుంది. మాతృభాషలో విద్యాబోధన అందిన విద్యార్థులు ఎక్కువ ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో ఉంటారనే అంశాన్ని పలు పరిశోధనలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ఐతే మాతృభాష ఆధారిత బోధనను స్థూలంగా అమలు చేయడం పాలసీ విధానాల కారణంగా, ధృఢమైన విద్యా విధానం లేని కారణంగా మాతృభాషలో విద్యాబోధన జరగలేదు. కొత్త విద్యా విధానాన్ని వ్యూహాత్మకంగా అమలు చేస్తే గిరిజన, గిరిజనేతర విద్యార్థులు మానసికంగా, విద్యా విషయకంగా అభివృద్ధిచెందుతారు అనే అంశాన్ని ఈ పత్రంలో చర్చించడం జరిగింది. మాతృభాషలో విద్య అందించడం వల్ల విద్యార్థుల్లో మెరుగైన మేధో వికాసంతో పాటు, రెండో లేదా మూడో భాషలను ప్రావీణ్యంగా నేర్చుకునే సామర్ధ్యం పెరుగుతుంది. అలాగే మాతృభాషను అధిక ప్రాధాన్యంతో బోధించే బహుభాషాత్మక విద్య (Mother tongue based multi lingual/ bilingual education (MTBMLE)) పాఠశాల స్థాయిలో ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని ఈ వ్యాసంలో వివరించబడింది.

Keywords: మాతృభాష, జాతీయవిద్యావిధానం2020, మాతృభాష ఆధారిత బోధన, బహుభాషాత్మకత, ద్విభాషాత్మకత, MTB MLE.

1. ఉపోద్ఘాతం:

మన పాఠశాలల్లో బోధనాభాష విషయంలో జరుగుతున్న చర్చ ఒక గొప్ప జాతీయ విద్యా విధానానికి దోహదపడింది. మాతృభాష ఆధారిత బోధనపై జాతీయ విద్యా విధానం 2020, ఈ చర్చను మరింత ముందుకు తీసుకువెళ్లింది. మాతృభాషలో విద్యా బోధనపై స్పష్టమైన మద్దతు పలుకుతూ, ఉన్నత ప్రయోజనాలను ప్రస్తావిస్తూ అటు విద్యావేత్తలు, ఇటు భాషావేత్తలు కొందరు ప్రశంసిస్తున్నారు. అయితే దీని అమలుపై పలు రకాలైన ఆలోచనలు వ్యక్తమవుతున్నాయి.

1813 చార్టర్‌పై విమర్శిస్తూ మెకాలే తన ప్రసిద్ధ మినిట్లో ఇలా వ్రాశాడు1: “ప్రజలను వారి మాతృభాష ద్వారా నేర్పడం ఈ సమయంలో సాధ్యం కాదు. కనుక మేము వారిని ఏదో ఒక విదేశీ భాషలో నేర్పాలి. పాశ్చాత్య భాషల్లో మా స్వంత ఇంగ్లీష్ భాష అత్యంత ముఖ్యమైనదని మేము భావిస్తున్నాం.” (మెకాలే, 1835)

మెకాలే రాతల్లో భారతీయ భాషల్లో విద్యను పూర్తిగా వదిలేశారు. అయితే 1854లో చార్లెస్ వుడ్ భారతీయ విద్యా విధానంపై సమాచారాన్నితయారుచేశాడు. అప్పటి గవర్నర్-జనరల్ లార్డ్ డల్హౌసీకి వూడ్ పంపిన లేఖలో ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లో భారతీయ భాషల్లో బోధనను జరపడం, ఉన్నత పాఠశాలల్లో ఆంగ్లో-వెర్నాక్యులర్ బోధన, కళాశాల స్థాయిలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహించడం వంటి సిఫార్సులు చేశారు. అందువల్ల దీనిని భారత్ లో ఇంగ్లీష్ విద్యకు సంబంధించిన “మాగ్నా కార్టా (Magna Carta)”గా పరిగణిస్తారు. భారతీయ విద్యా వ్యవస్థలో మాతృభాష బోధన అవసరాన్ని స్వాతంత్య్రానంతరం కూడా పలు కమిషన్లు, విధాన పత్రాలు పునర్వ్యక్తం చేశాయి. అటువంటి సందర్భంలో రాధాకృష్ణన్ కమిషన్ (1948-49) గానీ, తరువాత వచ్చిన మాధ్యమిక విద్య కమిషన్ (1952-53) గానీ, అధికారిక భాషా కమిషన్ (1956) లలోనూ మాతృభాష, హిందీ, ఇంగ్లీష్ భాషలు రెండో, మూడో భాషలుగా బోధించాలన్న అంశాలు పునరుద్ఘాటించబడ్డాయి.

త్రిభాషా సూత్రం (Three Language Formula) 1957లో జరిగిన సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ (CABE) సమావేశంలో ఈ త్రిభాషా సూత్రంపై చర్చలు ప్రారంభమయ్యాయి. 1964–66లో CABE లో మరింత ఆధునిక రూపు సంతరించుకుని, 1968లో భారత పార్లమెంటు దీనిని ఆమోదించింది. దీని ప్రకారం విద్యార్థి మొదట తాను మాట్లాడే ప్రాంతీయ భాష లేదా మాతృభాష (L1) నేర్చుకోవాలి. తర్వాత అధికారిక లేదా సహాధికారిక భాషను రెండో భాష (L2)గా నేర్చుకోవాలి. మూడో భాష (L3)గా మరో భారతీయ ఆధునిక భాషనో, విదేశీ భాషనో నేర్చుకోవచ్చు. గిరిజన ప్రాంతాల్లో అయితే మొదటి రెండేళ్ళపాటు గిరిజన భాషలో బోధన, మూడవ సంవత్సరం నుంచి ప్రాంతీయ భాషకు మారడం వంటి సూచనలు చేశారు.

కోఠారి కమిషన్ (1966) మాతృభాష విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది2.

ప్రత్యేకంగా హిందీ అభివృద్ధిని ప్రోత్సహించడం చాలా కీలకం. ….ప్రాథమిక, మాధ్యమిక స్థాయిల్లో ఇప్పటికే ఉన్న ప్రాంతీయ భాషలను ఉన్నత స్థాయిలోనూ బోధన భాషగా మార్చాలి. మాధ్యమిక స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అనుసరించి అమలు చేయాలి. అంతర్జాతీయ భాషలైన ఇంగ్లీష్ తదితర భాషలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి” అని పేర్కొంది.

ఇదే 1968 జాతీయ విద్యా విధానం  (NPE 1968), ప్రోగ్రాం ఆఫ్ యాక్షన్ (1992) తదితరాల్లోనూ పునరుద్ఘాటించబడింది. జాతీయ అడ్వైజరీ బోర్డు (CAB) సూచనలు 2005లో వచ్చిన నేషనల్ కరికులర్ ఫ్రేమ్ వర్క్ (జాతీయ పాఠ్య రూపకల్పన) (NCF 2005) కూడా త్రిభాషా సూత్రాన్ని కొనసాగించాలని సూచించింది. దీని మూలంగా తల్లిదండ్రుల భాషను (గిరిజన భాషలను సహా) ప్రధాన బోధనా భాషగా వాడాల‌ని, అలాగే ప్రాథమిక తరగతుల్లో చదవడాన్ని ప్రోత్సహించాల‌ని పేర్కొంది. విద్యార్థులు తమ మాతృభాషతో పాటు ఇతర భాషలను నేర్చుకోవడాన్ని ప్రోత్సహించాల‌ని ఉద్దేశించింది. భారతీయ పాఠశాలల్లో మాతృభాష బోధనపై గత దశాబ్ద కాలంలో పలు ప్రయోగాత్మక అధ్యయనాలు జరిగాయి. వాటి ఫలితాల్లోని ముఖ్యమైనది, మాతృభాషా బోధనలో  చదువుకున్న విద్యార్థుల పనితీరులో మెరుగైన ఫలితాలు సాధించారనే విషయం ఈ వ్యాసంలో కొన్ని దృష్టాంతాల ద్వారా చూపించబడుతుంది.

2. జాతీయ విద్యా విధానం 2020 (National Education Policy 2020):

జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం3, చిన్నపిల్లలు తమ మాతృభాష లేదా ఇంట్లో మాట్లాడే భాషలోనే విషయాలను త్వరగా నేర్చుకుంటారు. సాధ్యమైనచో, కనీసం అయిదో తరగతి వరకు అయినా మాతృభాష/హోం లాంగ్వేజి/ప్రాంతీయ భాషలో బోధించాలి, వీలైతే ఎనిమిదో తరగతి వరకూ కొనసాగించాలి. దాని తరువాత కూడా మాతృభాష లేదా ప్రాంతీయ భాషను ఒక అంశంగా కొనసాగించాలి. ఇది ప్రభుత్వ పాఠశాలల్లోనే కాదు, ప్రైవేటు పాఠశాలల్లోనూ వర్తిస్తుందని విధానం స్పష్టం చేసింది.

బహుభాషాత్మకతను ప్రోత్సహించేందుకు దేశవాప్తంగా త్రిభాషా సూత్రాన్ని కొనసాగిస్తామని NEP 2020 పేర్కొంది. అయితే ఏ రాష్ట్రానికైనా ఒకే ఒక భాషను నిర్భందించే ఉద్దేశం లేదు. పిల్లలు నేర్చుకునే మూడంచెల భాషల్లో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. ఆపై 6-8 తరగతుల మధ్య “ఏక్ భారత్ శ్రేష్ట భారత్” పేరుతో ప్రతివిద్యార్థిని “భారతీయ భాషలకు” సంబంధించిన ఉత్సాహభరితమైన ప్రాజెక్టు/ యాక్టివిటీ (కార్యాచరణ)లో పాల్గొనేలా ప్రోత్సహించనున్నారు. ఇది భారతీయ భాషల వైవిధ్యాన్ని, ఐక్యతను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. మాతృభాషలో విద్య బోధనను బలవంతంగా ఎవరిపైనూ రుద్దరు. విద్య అనేది సమకాలీన (concurrent) అంశమనే దృష్ట్యా, “సాధ్యమైనచో” అని పాలసిలోచట్టబద్ధంగా పేర్కొంది. ఈ విధానం ద్విభాషా/బహుభాషాత్మక విద్యకు మార్గనిర్దేశం చేస్తోంది. ఇంతకు ముందు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 350Aలో కూడా ఈ విషయం చెప్పబడిఉంది: లింగ్విస్టిక్ మైనారిటీకి చెందిన చిన్నపిల్లలకి ప్రాథమిక స్థాయిలో మాతృభాష బోధన కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పింది.

3. మాతృభాషలో నేర్చుకుంటే పిల్లలు మెరుగ్గా ముందుకు సాగుతారు (Children Learn Better in Mother Tongue):

మాతృభాషలో నేర్చుకోవడం ప్రతి విద్యార్థి మౌలిక భాషా హక్కుగా పరిశోధకులు పేర్కొంటున్నారు (May, 2012; Skutnabb_Kangas & Phillipson, 1994). ముఖ్యంగా అభివృద్ధిశీల దేశాల్లోని విద్య మీద దృష్టిపెట్టిన పలు పరిశోధనలు, బాల్యంలో మాతృభాష ఆధారంగా బోధన జరపడం చాలా ఫలవంతంగా ఉంటుందని సూచించాయి. UNESCO ఇప్పటికే 1953 నుంచి మాతృభాష బోధనపై దృష్టిపెడుతోంది. మాతృభాషలోనే గణనీయమైన అవగాహన ఏర్పడుతుందని, పిల్లలు ఎక్కువగా స్కూల్‌కు వచ్చేందుకు అనుకూలంగా ఉంటుందని 2005 అధ్యయనంలోనూ పేర్కొంది (UNESCO, 2005). ఇంకా మాతృభాషతో పాటు బహుభాషల్లో బోధన (multilingual education) అందుకున్న పిల్లల్లో సాధారణంగా మెరుగైన తెలుసుకునే నైపుణ్యాలు ఉంటాయని  అధ్యయనాలు నిరూపించాయి (Bialystok, 2001; Cummins, 2000; King & Mackey, 2007).

పిల్లలకు స్కూల్‌లో ఉపయోగించే భాష మాతృభాష కాకపోతే, వారు స్కూల్ నుంచి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి మొదటి భాషను బలపరిచే విధంగా బోధన జరిగితే వారు చదువులో కూడా ముందుకు సాగతారు.4 (UNESCO, 2007).

యునెస్కో వారి ప్రచురణలో స్ట్రెంత్స్ అండ్ ఛాలెంజస్ ఆఫ్ మదర్ టంగ్ ఎడ్యుకేషన్ ఇన్  మాలి,పపువా,న్యూగునీయ, పెరు కి సంబంధించిన case స్టడీస్ని కూడా పేర్కొన్నారు.   అలాగే (Goldenberg, 2008) అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నేషనల్ లిటరసీ ప్యానల్ పరిశోధనలను సమీక్షించి, ముఖ్యంగా తొలి(primary language) భాషలోనే చదవటం నేర్పించడం సముచితం అని పేర్కొన్నాడు. పిల్లలు మొదటి భాషలో పట్టు సాధించగలిగితే రెండో భాషలోనూ తద్వారా మెరుగైన ప్రాతిపదిక ఏర్పడుతుందని వివరించాడు.

(Zafeirakou, 2015) కూడా ఇదే దృష్టాంతాన్ని ప్రస్తావిస్తూ “మాతృభాషలోనే ప్రాథమిక నైపుణ్యాలను (early literacy and numeracy) బోధించడం, ప్రసంగ నైపుణ్యాలు నేర్పించడం, విమర్శనాత్మక ఆలోచనను నేర్పించడం — ఇవన్నీ చిన్న పిల్లల్లో పాఠశాల వైఫల్యాన్ని(school failure and drop out) తగ్గించగలవు” అంటూ చెప్పింది.

భారత్లో గిరిజన పిల్లల్లో స్కూల్‌కు దూరమయ్యే సమస్యను అధిగమించడానికి కూడా మాతృభాష ఆధారిత బహుభాషా విద్య (MTB MLE) ఒక సమర్థవంతమైన మోడల్‌గా పలు అధ్యయనాలు సూచించాయి (Panda & Mohanty, 2009; Mohanty & Saikia, 2008). మాతృభాష ఆధారిత బోధన పిల్లలకు ఇంటి సంస్కృతి నుంచి పాఠశాల సంస్కృతికి ఆనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది. తద్వారా వారు రెండో భాషను మెరుగ్గా నేర్చుకోవచ్చు. జిమ్ కమ్మిన్స్ (Cummins, 2001) ఈ విషయాన్ని మరింత బలంగా చెప్పాడు: “పిల్లల  మాతృభాషను స్కూల్‌లో అంగీకరించకపోవడం అంటే ఆ పిల్లలను ఇంటిపట్టున వదిలినట్లే.” మాతృభాషలో బోధన నేరుగా cognitive development (మెదడుకు సంబంధించిన అభివృద్ధి)పై ప్రభావం చూపుతుంది. మొదటి భాషలో మంచి అవగాహన ఉన్నపుడు, రెండో లేదా మూడో భాషనూ అలవోకగా నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఒక చిన్నారికి మాతృభాష మానసికంగా, భావోద్వేగపరంగా వెన్నుతట్టుగా నిలుస్తుంది. కెనడాలో కొన్ని పరిశోధనల్లో కనుగొన్నదేమిటంటే, చిన్నతనంలో తన  భాషను వినడానికి, మాట్లాడడానికి అలవాటు పడిన వారికి, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భాష పూర్తిగా మర్చిపోయినా, అది ఇతర భాషలను నేర్చుకోవడంలో సహకరిస్తుందని నిర్ధారించబడింది.

4. ద్విభాషాత్మక/ బహుభాషాత్మక విద్యాకార్యక్రమం (Bilingual/ Multilingual Education Programme):

(Skutnabb-Kangas, 2000) చెప్పినట్లు, పిల్లలు ఉపయోగించని భాషలో బోధించడం అంటే వారు ఈ అజ్ఞాత భాష సముద్రంలో మునిగిపోయినట్టు ఉంటారని పోలుస్తారు. ద్విభాషాత్మక చదువులో (Bilingual Education) పిల్లల మాతృభాష (L1)నే మొదట చదవడం, రాయడం, ప్రాథమికంగా బోధించేందుకు ఉపయోగిస్తారు. రెండో భాష (L2)ని పద్దతి ప్రకారం , స్థిరంగా నెమ్మదిగా  బోధిస్తారు. ఈ రెండు భాషల  మధ్య నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా మార్గనిర్దేశం చేస్తారు. పిల్లలు మొదటి భాషలో బలమైన ఆధారాన్ని ఏర్పరచుకుని, తరువాత రెండో భాషకు మారతారు. ఇది మోనోలింగ్యువల్ (ఒకే భాష) బోధనతో పోలిస్తే పలు విద్యా ప్రయోజనాలను కల్పిస్తుంది. L1లోనే ప్రాథమికంగా చదవడం, రాయడం నేర్చుకోవడం వల్ల వారు కొత్త కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు. అటుపై L2కి మారే సమయంలో (Cummins, 1991) సిద్ధాంతాల ప్రకారం ఒక భాషలో అభివృద్ధిచేసుకున్న భాషా పఠన నైపుణ్యాలను రెండో భాషలోనూ ఉపయోగించుకోగలిగే స్థితి వస్తుంది.

5. UNESCO కూడా బహుభాషాత్మక విద్యను ప్రోత్సహిస్తోంది. (UNESCO, 2003; 2005) ప్రకారం మాతృభాష ఆధారిత బహుభాషా బోధనను నాలుగు దశల్లో పరిచయం చేయవచ్చని పేర్కొంది:

1. దశ I: పూర్తిగా ఇంట్లో మాట్లాడే భాషలోనే బోధన
2. దశ II: మాతృభాషలో వాక్ప్రవహాన్ని(fluency) పెంచడం, రెండో భాషను (L2) మౌఖికంగా పరిచయం చేయడం
3. దశ III: రెండో భాషలో మౌఖిక పటుత్వాన్ని పెంచడం, అదే సమయంలో L2లో చదవడం, రాయడం మొదలుపెట్టడం
4. దశ IV: మాతృభాష (L1)తో పాటు రెండో భాష (L2)ను శాశ్వతంగా ఉపయోగించడం.
పిల్లలు మాతృభాష నుంచి కొత్త భాషకు వెళ్లేటప్పుడు ఆ రెండిటి మధ్య అవగాహన, అనుసంధానాన్ని ఏర్పాటు చేసుకుంటారనేది ప్రధాన సిద్ధాంతం.

6. కార్యక్రమాన్ని ఎలా ప్రవేశపెట్టాలి? (Induction of the Programme):

మాతృభాష ఆధారిత ద్విభాషా/బహుభాషా విద్యా కార్యక్రమాన్ని అమలు చేసే ముందు పలు వ్యూహాత్మక పనులను చేయాల్సి ఉంటుంది. (Benson, 2004) ప్రకారం బహుభాషా కార్యక్రమాల‌కు కొన్ని ముఖ్యమైన సోపానాలను(parameters) దృష్టిలో ఉంచుకోవాలి:

• చిన్నస్థాయి ప్రయోగాల నుంచి పెద్దస్థాయి అమలు:

మొదట కొన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులుగా అమలు చేసి, అక్కడి ప్రయోజనాలను, వనరుల విషయాలను అధ్యయనం చేసిన తరువాత పెద్ద ఎత్తున అమలు చేయవచ్చు.

• పట్టణ స్థాయి నుంచి పల్లెల వరకు రాజ్యాంగ పరంగా అమలు:

కొన్నిసార్లు ప్రభుత్వం నేరుగా చట్టాల ద్వారా దేశవ్యాప్తంగా మాతృభాష బోధనను అమలు చేయమని చెప్పవచ్చు. అయితే అటువంటి పరిస్థితుల్లో అన్నీ సిద్ధంగా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది.

• స్వచ్ఛంద సంస్థలు, సమాజ నిర్మాణాల ద్వారా అమలు:

కొన్నిసార్లు స్థానిక వనరులతో, సామాజిక సేవా సంఘాలతో కలిసి మాతృభాష బోధనని అమలు చేయవచ్చు.

• మానవ వనరుల అభివృద్ధి:

ఉపాధ్యాయులు, విద్యావేత్తలు బహుభాషా బోధనలో ప్రావీణ్యం పొందేలా సరైన శిక్షణ అందించాలి.

భాషా, బోధన సామాగ్రి అభివృద్ధి:

మాతృభాషలో బోధనకి పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయులకి వనరులు, ఇతర సూచికలు తయారు చేయాల్సి ఉంటుంది. వ్రాత రూపంలో లేని భాషలకు  కొత్త పదచిత్రాలు, లిపుల తయారీకి  సహకరించాలి.

స్థానిక సంస్కృతిని అర్థం చేసుకుని పాఠ్యాల  రూపకల్పన:

విద్యార్థులకు ఆసక్తికరంగా ఉండే విధంగా, వారి దైనందిన జీవన పరిస్థితుల నుంచి ఉదాహరణలను తీసుకుని బోధనను రూపుదిద్దాలి.

రెండో లేదా మూడో భాషల్లో కూడా ప్రావీణ్యం  సాధించేందుకు గ్లోబల్ పరిశోధన ఆధారంగా మాతృభాష నుంచి రెండో భాషకు “సాఫీగా మారే” విధానాన్ని అనుసరించాలి. మాతృభాషలో నైపుణ్యం అనూహ్యంగా ఉన్నప్పుడే  రెండో భాషను నేర్చుకోవడం సులభతరం అవుతుంది.

కింది చార్టులో (Pamela, 2009 ఆధారంగా) ఒక విద్యార్థి మాతృభాష (L1) నుంచి రెండో భాష (L2), మూడో భాష (L3) వైపు ఎలా ప్రమాణపరుచుకుంటాడో దశలవారీగా చూపించబడింది:

దశ

మాతృభాష (L1) లోని చర్యలు

రెండో భాష (L2) లోని చర్యలు

మూడో భాష (L3) లోని చర్యలు

దశ 1

చిన్నారుల్లో మాతృభాషపై మౌఖిక ప్రావీణ్యం పెంచడం

-

-

దశ 2

మాతృభాషలో పఠనం, రచనను ప్రారంభించడం

-

-

దశ 3

మాతృభాషను ప్రధాన బోధన భాషగా ఉపయోగిస్తూ, కొనసాగించడం

మౌఖికంగా (L2) పరిచయం

-

దశ 4

మాతృభాష & రచనలో పటుత్వాన్ని మెరుగుపరచడం

మౌఖిక ప్రావీణ్యం (L2)ను అభివృద్ధి చేయడం

-

దశ 5

L1 & L2లను వినియోగిస్తూ కొత్త కాన్సెప్ట్ల‌ను నేర్పడం

L2లో చదవడం, రాయడం ప్రారంభించడం

మౌఖికంగా (L3) పరిచయం

దశ 6

మాతృభాషతో పాటు L2లో కూడా రాయడం, చదవడం కొనసాగించడం

రెండు భాషల్లోనూ ప్రావీణ్యం పెంచడం

L3 మౌఖిక ప్రావీణ్యం పెంచడం

దశ 7

అన్ని భాషల్లో నైపుణ్యాలను పెంచుకోవడం

-

L3లో కూడా చదవడం, రాయడం ప్రారంభించడం

మన దేశంలో  భాషావైవిధ్యం ఎంతో విస్తృతంగా ఉండటంతో, ఒక తరగతిలోనే పలు భాషలు మాట్లాడే విద్యార్థులు ఉంటారు. ఇది మాతృభాష బోధన అమలులో ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. అంతేకాక ఉపాధ్యాయులు మల్టీలాంగ్వేజి బోధనలో శిక్షణ పొందినవారి కొరత కూడా మరో పెద్ద సమస్య. గిరిజన భాషలకు బలమైన లిపి వంటివి లేకపోవడం, లేక వాటికి సరైన ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడం వల్ల పదేళ్లుగా ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించినప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితంలేదు. గిరిజన భాషల్లో ఎంతోమంది పిల్లలు మాతృభాషలో పాఠాలు అందుకోలేకపోతున్నారు. మన గిరిజన భాషల్లో చాలా భాషలు ఇప్పటికే అంతరించిపోయే దశలో ఉన్నాయని పండితులు హెచ్చరిస్తున్నారు. అటువంటి భాషల్లో బోధన కొనసాగించాలంటే ముందు వాటికి లిపి తయారు చేయాలి, అక్షరనిర్మాణ వ్యవస్థను ఒక కొలిక్కి తెచ్చుకోవాలి. కొన్ని భాషలు  రోమన్ లిపిని కూడా వాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎంతో శ్రమతో కూడినపనులు.

అయినప్పటికీ NEP 2020 ద్వారా రాష్ట్రాలూ, కేంద్ర ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా మాతృభాష బోధనకు ముందుకు వస్తే ఆ కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయవచ్చు. అలా చేయగలిగితే పిల్లల్లో ఊహాశక్తి, బోధన పట్ల ఆసక్తి, మానసిక పురోగతి పెరుగుతాయి. మాతృభాష అనూహ్యంగా బలపడితే ఇతర  భాషల మీద పట్టు కూడా బలపడుతుంది. (MacKenzie, 2009) వంటి రచనలు భారతీయ గిరిజన ప్రాంతాల్లో మాతృభాష ఆధారిత విద్య అమలుకు ఎలాంటి అవరోధాలు ఉన్నాయో విపులంగా చర్చించాయి. కేంద్రీయ భారతీయ భాషల సంస్థ (CIIL), జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (NCERT) లాంటి సంస్థలు అందుకు తోడ్పాటునిచ్చే ప్రయత్నాలు కొన్ని సంవత్సరాలుగా ప్రారంభించాయి.

(Malone, 2004) మరియు (Pamela, 2009) సూచనల ప్రకారం, మాతృభాష బహుభాషా విద్యను విజయవంతంగా అమలుచేయాలంటే ఈ కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు.

1. భాషలపై సర్వేలు చేయడం
2. సామాజిక చైతన్యాన్ని కల్పించడం
3. లిపి అభివృద్ధిపై కార్య శాలలను నిర్వహించడం
4. పాఠ్యక్రమణికలను రూపొందించుటకు కార్య శాలలను నిర్వహించడం
5. బోధన సామగ్రి తయారు చేయడం
6. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడం
7. పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ & మార్పులు చేర్పులు చేయడం
NEP 2020 “అందరికీ విద్య” అనే దృష్టికోణంతో రూపొందింది. అంతా కలిసికట్టుగా పని చేసినప్పుడు మాత్రమే మాతృభాష బోధనను బలపరచవచ్చు. బహుభాషాత్మక విద్య గనుక తన లక్ష్యాన్ని సక్రమంగా చేరుకుంటే, పిల్లల్లో ఎన్నో నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు సమాజంలో ఒక స్థిరవృద్ధికి దోహదపడుతుంది.

ముగింపు:

  • మాతృభాష ఆధారిత బహుభాషాత్మక విద్య ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రాథమిక స్థాయిలో ప్రారంభించబడింది.
  • తొలి అమలు దశలోనే మంచి విజయాన్ని సాధించడం గాక, పిల్లల్లో చక్కటి భాషాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు దోహదపడుతోంది.
  • ముఖ్యంగా గిరిజన పిల్లలకు మాతృభాషలో విద్యను అందించడం ద్వారా వారు ఇతర చిన్నారుల్లాగానే చదువులో ముందుకు వెళ్లే అవకాశాలను పొందుతున్నారు. ఈ విధానంతో దేశంలో భిన్న సంస్కృతులు, భాషలకు పరిరక్షణ లభించడమే కాకుండా, విద్యార్థుల్లో మాతృభాష పట్ల మమకారానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నది.
  • మాతృభాష బోధన బలమైన మేథో వికాసానికి దోహదపడుతుందని  స్పష్టం చేస్తుంది. ఈ విధమైన పునాదితో ఉన్నపిల్లలు రెండో, మూడో భాషలను కూడా మెరుగ్గా నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది.
  • అలా బహుభాషాత్మక పరిజ్ఞానంతో భావితరాల వారు మరింత విశాల దృక్కోణాన్ని సంపాదించడమే కాక, భవిష్యత్తులో విద్య, ఉద్యోగ అవకాశాల్లో ముందంజ వేస్తారని ఆశిద్దాం.

సూచికలు:

  1. “We have to educate a people who cannot at present be educated by means of their mother-tongue. We must teach them some foreign language. The claims of our own language it is hardly necessary to recapitulate. It stands preeminent even among the languages of the West. (Macaulay, 1835).”
  2. “Every effort should be made to promote the development of Hindi. ….The regional languages already in use as media of instruction at primary and secondary levels should also be adopted as the media of education at university stage….. At the secondary stage, the State Governments should adopt, and vigorously implement, the three-language formula… Special emphasis needs to be laid on the study of English and other international languages (Kothari, 1966).”
  3. "that young children learn and grasp nontrivial concepts more quickly in their home language/mother tongue. Home language is usually the same language as the mother tongue or that which is spoken by local communities. However, at times in multi-lingual families, there can be a home language spoken by other family members who may sometimes be different from mother tongue or local language. Wherever possible, the medium of instruction until at least Grade 5, but preferably till Grade 8 and beyond, will be the home language/mother tongue/local language/regional language. Thereafter, the home/local language shall continue to be taught as a language wherever possible. This will be followed by both public and private schools. (National Education Policy, 2020, p. 13)
  4. “Children whose primary language is not the language of instruction in school are more likely to drop out of school or fail in early grades. Research has shown that children’s first language is the optimal language for literacy and learning throughout primary school (UNESCO, 2007)”.

ఉపయుక్తగ్రంథసూచి:

  1. Abbott, M., Brecht, R. D., Davidson, D. E., Fenstermacher, H., Fischer, D., Rivers, W. P., Slater, R., Weinberg, A., & Wiley, T. (2014). The language enterprise: Languages for all? Final report.
  2. August, D., & Shanahan, T. (Eds.). (2006). Developing literacy in second-language learners. Mahwah, NJ: Lawrence Erlbaum Associates.
  3. Benson, C. (2004a). Bilingual schooling in Mozambique and Bolivia: From experimentation to implementation. Language Policy, 3(1), 47–66.
  4. https://doi.org/10.1023/B:LPOL.0000017720.06252.94
  5. Bialystok, E. (2001). Bilingualism in development: Language, literacy and cognition. New York, NY: Cambridge University Press.
  6. Cummins, J. (1991). Interdependence of first- and second-language proficiency in bilingual children. In E. Bialystok (Ed.), Language processing in bilingual children (pp. 70–89). Cambridge, UK: Cambridge University Press.
  7. Cummins, J. (1999). Alternative paradigms in bilingual education research: Does theory have a place? Educational Researcher, 28(7), 26–32.
  8. Cummins, J. (2000). Language, power, and pedagogy. Clevedon, UK: Multilingual Matters.
  9. Cummins, J. (2001). Bilingual children’s mother tongue: Why is it important for education. Sprogforum.
  10. Goldenberg, C. (2008). Teaching English language learners: What the research does—and does not—say. American Educator, 32(2), 8–42.
  11. Government of India, Ministry of Education. (n.d.). Kothari Commission (1964–1966), Vol. 1 (pp. 1–287). Retrieved from http://dise.in/Downloads/KothariCommissionVol.1pp.1-287.pdf
  12. Ministry of Human Resource Development (MHRD). (n.d.). Autonomy for higher education institutions. Retrieved from http://mhrd.gov.in/sites/upload_files/mhrd/files/document reports/AutonomyHEI.pdf
  13. National Council of Educational Research and Training (NCERT). (2005). National curriculum framework 2005. Retrieved from https://ncert.nic.in/pdf/nc-framework/nf2005-english.pdf
  14. Ministry of Human Resource Development (MHRD). (2020). National education policy 2020. Retrieved from https://www.mhrd.gov.in/sites/upload_files/mhrd/files/NEP_Final_English_0.pdf
  15. King, K. A., & Mackey, A. (2007). The bilingual edge: How, when and why to teach your child a second language. New York, NY: HarperCollins.
  16. May, S. (2012). Language and minority rights: Ethnicity, nationalism, and the politics of language (2nd ed.). New York, NY: Routledge.
  17. Mohanty, A. K., & Saikia, J. (2008). Bilingualism and intergroup relationship in tribal and non-tribal contact situations. In G. Zheng, K. Leung, & J. G. Adair (Eds.), Perspectives and progress in contemporary cross-cultural psychology: Proceedings from the 17th International Congress of the International Association for Cross-Cultural Psychology.
  18. Moore, R. (1965). The composition of ‘Wood’s Education Despatch.’ The English Historical Review, 80(314), 70–85.
  19. Panda, M., & Mohanty, A. (2009). MLE plus: Culture to classroom. In A. Mohanty, M. Panda, R. Phillipson, & T. Skutnabb-Kangas (Eds.), Multilingual education for social justice: Globalising the local. New Delhi, India: Orient BlackSwan.
  20. Skutnabb-Kangas, T. (2000). Linguistic genocide in education—or worldwide diversity and human rights? Mahwah, NJ: Lawrence Erlbaum Associates.
  21. Skutnabb-Kangas, T., & Phillipson, R. (1994). Linguistic human rights: Overcoming linguistic discrimination. Berlin, Germany: Mouton de Gruyter.
  22. UNESCO. (2003). Education in a multilingual world. Paris, France: UNESCO.
  23. UNESCO. (2005). First language first: Community-based literacy programmes for minority language contexts in Asia. Paris, France: UNESCO.
  24. University Education Commission. (1948–1949). University Education Commission 1948–49 in India.
  25. Zafeirakou, A. (2015, February 20). The power of mother tongue and multilingual education: Students who learn to read in their mother tongue transfer these skills to a second language.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]