AUCHITHYAM | Volume-06 | Issue-02 | February 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed
13. ‘కొండగాలి’ నవల: పోరాటాల నేపథ్యచిత్రణ
గొంటి బాబ్జి
పరిశోధకులు, తెలుగుశాఖ,
ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం,
విశాఖపట్నం, ఆంధ్రపదేశ్.
సెల్: +91 8688061477, Email: babjitelugu76@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.01.2025 ఎంపిక (D.O.A): 28.01.2025 ప్రచురణ (D.O.P): 01.02.2025
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్యానికి గిరిజన సమస్యలని మొట్టమొదటగా పరిచయం చేసిన ‘కొండగాలి’ భూషణం రాసిన నవల. ఈ వ్యాసంలో శ్రీకాకుళం ఉద్యమనేపథ్యంలో భూషణం మాస్టారి రచనల ప్రాముఖ్యతను వివరించబడింది. ముఖ్యంగా ‘కొండగాలి’ సామాజికచైతన్యాన్ని కలిగించే అంశాలను ప్రస్తావిస్తూ, ఉద్యమస్ఫూర్తిని ఉద్దీపన చేసే విధంగా రచించబడింది. భూషణం మాస్టారి రచనలు శోషిత వర్గాల గొంతుకగా నిలిచి, సమాజంలో న్యాయం కోసం పోరాడే భావజాలాన్ని ప్రతిబింబించాయి. ఈ వ్యాసంలో భూషణం మాస్టారి రచనల్లోని సామాజిక చైతన్యం, ఉద్యమ స్ఫూర్తి, ప్రజా సమస్యలపై ఆయన ప్రభావాన్ని విశ్లేషించడం జరిగింది. రచయిత కథాసంపుటాలు, వివిధ పత్రికల్లో, గ్రంథాల్లో వచ్చిన వ్యాసాలు ఈ పరిశోధనకు ఆకరాలు. భూషణంగారి సాహిత్యప్రస్థానాన్ని పరిచయం చేస్తూ, ’కొండగాలి’ ఉత్తరాంధ్ర గిరిజన పోరాటాల చరిత్రమీద కొత్తవెలుగును ప్రసరింపచేసిన వైనాన్ని ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.
Keywords: శ్రీకాకుళం ఉద్యమం, భూషణం మాస్టారి రచనలు, కొండగాలి నవల, సామాజిక చైతన్యం, ఉద్యమ స్ఫూర్తి
1. ఉపోద్ఘాతం:
శ్రీకాకుళం ఉద్యమం ఎలా పుట్టి, పెరిగిందో గొప్పగా చెప్పిన కథ. పాతవ్యవస్థలు జీర్ణమై అందులోంచీ కొత్త వ్యవస్థలు పుట్టే తరుణంలో ముందుగా చిన్నచిన్న సర్దుబాట్లకోసం సంస్కరణోద్యమాలు ఆరంభమవుతాయి, వాటి వైఫల్యాలలోంచీ, పెరిగిపోతున్న అశాంతిలోంచీ రాజకీయోధ్యమాలు పుడతాయి. అణచివేత పెరిగినకొద్దీ ఆ ఉద్యమాలు చిన్నా పెద్దా పోరాటాలుగా పర్యవసిస్తాయి. దమనకాండను తట్టుకోవడానికి ఆ పోరాటాలు సాయుధాలవుతాయి. అటువంటిదే శ్రీకాకుళ సాయుధ పోరాటం, ఆ పోరాటం వల్ల ప్రభావితమై ఆ పోరాటాన్ని ప్రభావితంచేస్తూ ఆ పోరాటానికి బాసటగా నిలుస్తూ కలం పట్టిన రచయిత భూషణం. సిక్కోలు సాయుధసమరాన్ని తొలిగా అక్షర బద్ధం చేసి ‘కొండగాలి’ భూషణంగా ప్రసిద్ధిచెందారు.
2. భూషణం మాస్టారి రచనల్లో ఉద్యమస్ఫూర్తి:
బాధామయ జీవులు మూలకారణాలు తెలుసుకుంటారనీ, సమాజాన్ని మారుస్తారనీ ఆశ పెట్టుకున్న భూషణం ఆ ఆశ నెరవేర్చే ఆశయ బాటను వెతుక్కున్నారు. వెలుగుబాటలో నడిచేరు. నమ్మిన ఆ బాటనుంచే ఆశయ సాధన కోసం అక్షర బావుటాలను ఎగరేశారు.
వ్యంగ్యమూ, వెటకారమూ, చుర్రున తగిలే మాటలూ ఉత్తరాంధ్ర రచయితల ప్రత్యేకత. కేవలం రచయితలదే కాదు, అది అక్కడి సామాన్య ప్రజల జీవన విధానం. రావిశాస్త్రి, పతంజలి రచనల గురించి అందరికీ తెలుసు. రాజ్యం, పోలీసులు, ప్రభుత్వం, నాయస్థానాలు… ఈ చట్రంలో ఇరుక్కున్న, నలిగిపోతున్న ప్రజల గురించి, ఛిద్రమైపోతున్న బతుకుల గురించి పదునైన వ్యంగ్యంతో, కొరడాదెబ్బల వెటకారంతో వాళ్ళు రాసిన రచనలు మనలో చాలా మందికి పరిచయమే.
కానీ తక్కువగా రాసినా గొప్ప సాహిత్యం సృష్టించిన భూషణం మాస్టారి గురించి ఇప్పటి తరం చదువరులకు పెద్దగా తెలీదు. నిజానికి ఆయన గురించి సరైన అంచనా రావలిసే వుంది. 1975-2000 ప్రాంతంలో చదవడం మొదలుపెట్టిన సాహిత్యాభిమానులకు భూషణం మాస్టారి రచనలు పరిచయం. ఎక్కువ పరిచయం ఉంటే తప్ప ఎక్కువ మాట్లాడని భూషణం గారు మిగతా ఉత్తరాంధ్ర రచయితల్లాగే హాస్యప్రియులు. మాట్లాడితే వ్యంగ్యం, వెటకారం ప్రతిధ్వనించేవి. ఆయన రచనల్లో కూడా.
ఆయన రచనలు ఆయనలాగే unassuming. నిరాడంబరంగా ఉండేవి కానీ ఆయన శైలి వడిగా ఉండేది. చిన్న చిన్న వాక్యాలతో, విరుపులతో, ఆయన రచనలు సాధారణంగా కనిపించినా అద్భుతమైన వర్ణనలతో, సునిశితమైన observationsతో మొదలుపెడితే ఆపలేని ఆకర్షణతో ఉండేవి.
3. కొండగాలి నవల: ఉద్యమాన్ని ప్రతిబింబించే సాహిత్యం:
భూషణం మాస్టారి ‘కొండగాలి’ నవల ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే రచన. ఈ నవల ద్వారా సమాజంలోని సామాజిక మరియు ఆర్థిక అసమానతలను చక్కగా వివరించారు. శోషిత వర్గాల సమస్యలను కథా వస్తువుగా తీసుకుని, విప్లవ మార్గాన్ని సూచించే విధంగా రచించబడింది.
శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం ఏజెన్సీలో ఉన్న కొండలు అక్కడ విస్తరించిన అడవులు అడవి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు అక్కడ నివసించే గిరిజనులు వారిని దోపిడి చేసే మైదాన వాసులు, ఫారెస్ట్ అధికారులు, పోలీసులు, కాంట్రాక్టర్లు ఇందు మూలంగా జరిగిన ఘర్షణ పర్యవసానాల ఫలితమే కొండగాలి.కారుమబ్బుల్నీ అన్యాపదేశంగా చెప్తారు భూషణం మాస్టారు.
తమ బతుకుని బుగ్గిచేస్తున్నదెవరో, తమ అడవిని తమకు కాకుండా చేస్తున్న వారెవరో అర్ధం చేసుకున్న, తమ శ్రమఫలితాన్ని తమకు దక్కనియ్యకుండా చేస్తున్న, తమ సంపదని దోచుకుంటున్న వారెవరో ఎరిగిన ఆదివాసులు, ఇంకా అడవిని అనుకుని వున్న మైదాన ప్రాంత రైతులు, రైతు కూలీలు, ఇతర వృత్తుల వారు తిరగబడ్డారు. ప్రజలు తిరగబడితే ఆపగలవారెవ్వరు? ఆదివాసుల సంపదని పీల్చుకుని, పోలీసులకు కళ్ళూ చెవులైన సావుకారు సాంబన్న అంతమవుతాడు. గదబవలసలో సాంబన్నని అంతం చేశాక, ఆదెమ్మ నాయుడువలస పెద్దలపై తిరుగుబాటు ప్రకటిస్తుంది. “నాతోని ఎవులొత్తారో బయలెల్లండి,” అని పిలుపునిస్తుంది.
ఇక్కడ చూడొచ్చు భూషణం మాస్టారి అతి సాధారణ, అతి వేగవంతమైన శైలి.
“ఆదెమ్మ లేచింది. సోమయ్య లేచాడు. పసికందుని వీపుకు కట్టుకొని ముత్తేలు లేచింది. కొండలూ, కోనలూ, గట్టులు, పుట్టలూ, చేమలూ, వాగులూ, వంకలూ నడిచాయి. కొండలు కదిలాయి. కొండగాలి దేశం నలుమూలలా పెను ప్రళయంగా వీచింది.” — అని నవలను ముగిస్తారు.
శ్రీకాకుళ పోరాటం గురించి వెలువడ్డ ఏకైక నవల కొండగాలి. శ్రీకాకుళ పోరాట ప్రాణవాయువులే కొండ గాలికి ఊపిరీ ఉత్తేజం. రాజకీయ పోరాటం ప్రేరణతో, రాజకీయ ఉద్యమాల స్వరూప స్వభావాల్ని భూషణం బాగా అర్ధం చేసుకున్నాడు.
ఒక రచయిత తన రచనలలో సమాజాన్ని ప్రతిఫలించడం ఆ రచయితకి సమాజానికున్న సజీవ సంబంధం మీద అతని కళాత్మక ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. భూషణం పోరాటం జరిగిన ప్రాంతంలో జీవించినవాడు. ఉపాధ్యాయ ఉద్యమంతో రక్తసంబంధం ఉన్నవాడు. పోరాడే ఉద్యమ నాయకులతో సన్నిహిత సంబంధం ఉన్నవాడు. విరసం సభ్యుడిగా, విప్లవ రాజకీయాలతో సంబంధం ఉన్నవాడు.
అందుకే శ్రీకాకుళ గిరిజన ఉద్యమాన్ని కథనం చేయడానికి అక్షరాల అర్హుడు భూషణం. సూటిగా గిరిజన చిత్రణ చేసి ఉద్యమం గిరిజన జీవితంలో ఎట్లా అంతర్భాగం అయ్యిందోచెప్పింది. కొండగాలి. అందుకే ఒక రచనను మదింపు చేసినప్పుడు దాని స్థలకాలాలు పరిగణనలోకి తీసుకోవడం అనివార్యం.
రచనను ఒక చారిత్రక అవశేషంగా భావించి దాన్ని ఆధారం చేసుకొని ఆ రచన చిత్రించే కాలంలో ప్రజలు జీవితానికి సంబంధించి అమూల్యమైన అంశాలను తెలుసుకోవచ్చు. చరిత్రను, చారిత్రక ఘటనలను సాహిత్య రూపంలోకి అనువదించడం నిజానికి క్లిష్టమైనపని. అందుకు ఆ చరిత్రతో దగ్గరి సంబంధం ఆ చరిత్ర సారంపట్ల మానవ ఆవేశాల మీద ఆయా చారిత్రక ఘటన చూపిన ప్రభావం పట్ల గుర్తింపు ఆ గతచరిత్రకు వర్తమానంలో ఉన్న సంబంధం రచయిత దృష్టిలో ఉండాలి. చరిత్ర అంటే గత వర్తమానాల మధ్య సంభాషణ అని ఇ. హెచ్. కార్ అన్నట్లు ఆ సంభాషణను అర్ధం చేసుకోగల మేధా హృదయం చరిత్రకారుడి కన్నా ఎక్కువగా ఆ చరిత్రను సాహిత్య రూపంలోకి మార్చదలచుకొన్న రచయితకు అవసరం.
4. కొండగాలి నవల - పోరాట సంబంధించిన నేపథ్యాంశాలు:
ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకొన్న రచయిత భూషణం. అతడు రచించిన ‘కొండగాలి’ నవలలో నాటి పోరాటానికి సంబంధించిన ఏ ఏ అంశాలు చర్చనీయాంశాలుగా పెట్టారో చూద్దాం.
కొండగాలి నవల ‘ఆడివంటుకుంది’ కథకు కొనసాగింపే. కొండగాలికి పూర్వరంగమంతా ‘అడివంటుకుంది’ లోనే కనిపిస్తుంది. ఈ కథలోని పరిస్థితుల అనివార్యత రచయిత చేత కొండగాలి సృష్టించింది. ‘అడివంటుకుంది’ కథలో మైదానం నుంచి వ్యాపారం చేసుకోవడానికి కొండ మీద కొచ్చిన షావుకారి సత్తియ్య, తమ ధన, మాన, ప్రాణాలు దోచుకుంటున్నాడని గ్రహించి చివరకు తిరుగుబాటుకు సిద్ధమవుతారు గిరిజనులు. ‘అడివంటుకుంది’ లో తిరుగుబాటు కొండగాలిలో సాయుధమవుతుంది. అంటుకున్న అడవికి కొండగాలి తోడైతే ఇక చెప్పేది ఏముంది?
సత్తియ్య చేయించిన దాడిలో మంగులు మరణిస్తే శవాన్ని భుజాన్న వేసుకొని, అతని తండ్రి సిద్ధంగాడు లేచి “ఒరే షావుకారా.. మా భూములు, పుట్టలు, చెట్లు, చేమలు, సెమటంతా దోసేసేవు. నీ ఇంట్లో పోగేసుకున్నావు. నీ పాపాన నువ్వు పోగుండా ఏటీ అన్నేయం అని అడిగేసరికి మా అడబిడ్డలు మానం చెరిపేసి నా బిడ్డ ప్రాణం తీసేసావు. నా రగతం కళ్ళ చూసావు. కాసుకోరా... నీ జాతిని దుంప నాశనం చేస్తేగాని మాకు బతుకు లేదు” అని గూడెం వైపు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నడిచాడు. వెనక కొడవల్లు, బాకులు, బాణాలు అనుసరించాయి, “అడివంటుకుంది. చిటచిట, భగభగ, పెళపెళలతో అడివంటుకుంది. అంటుకున్న మంటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. అన్ని దిశలా అలముకున్నాయి”. ఇలా ముగిసిన కథ ‘కొండగాలి’లో విజృభించింది. నవలలో ప్రభుత్వ ఆటవీ విధానం ద్వారా గిరిజనులు పడ్డ కష్టాలు, వెట్టిచాకిరి గిరిజనులకు అప్పులిచ్చి భూములకు ఆక్రమించే మైదానవాసుల దుర్బుద్ధి అటవీ అధికారుల జులుం, గిరిజన స్త్రీలపై అత్యాచారాలు, ఇవన్నీ పోరాట నేపథ్యానికి ఎలా భూమికగా నిలిచాయో ఈ నవల చర్చకి పెట్టింది.
భారతదేశంలో ప్రవేశించిన సామ్రాజ్యవాదులకి అడవులు ఆదాయ మార్గాన్నిచ్చే బ్రహ్మాండమైన వనరుగా తోచింది. అక్కడ్నుంచి బ్రిటీష్ ప్రభుత్వం చేసిన చట్టాలు కూడా గిరిజనుల బతుకులకు గొడ్డలి పెట్టుగా మారాయి. చట్టం అనే పదం మాటున అడవులలో యజమానులుగా వర్ధిల్లుతున్న ఆదివాసులు రాత్రికి రాత్రే దొంగలుగా ఆక్రమణదారులుగా ముద్రవేయబడ్డారు.
అడవిలో పుట్టిన గిరిజనులు అడవిని సహజమైన ఆస్తిగా భావించి ఆజన్మాంతం అనుభవిస్తుంటే బ్రిటీష్ ప్రభుత్వం రిజర్వు ఫారెస్టు పేరుతో అడవికి సరిహద్దులు ఏర్పరిచి గిరిజనులు జన్మహక్కును కాలరాసింది. ఈ చట్టంలతో అడవిలో గిరిజనులు అడవిని అనుకొని కర్ర కంపలు కోసం అడవిమీద ఆధారపడి జీవిస్తున్న మైదాన శ్రమజీవులు ఈ రెండు వర్గాలు జీవన్మరణ సమస్యలో పడ్డారు.
తల్లిచేత కన్న బిడ్డ నోరు కట్టేసి పరాయి బిడ్డలకు బలవంతంగా పాలు ఇప్పించే విధంగా అడవి బిడ్డలను ఆకులు అలములు ముట్టుకోనివ్వకుండా కాంట్రాక్టర్లుకు లైసెన్స్ లిచ్చి అడవితల్లికి గుండెకోత మిగిల్చింది ప్రభుత్వం.
స్వాతంత్ర్యానికి ముందు ఆ తర్వాత గిరిజనుల బతుకుల్లో పెద్దగా మార్చేమి లేదు. చట్టాలు ఎన్ని మారినా గిరిజనుల బతుకు మాత్రం క్రమంగా మోడు వారిన చెట్టులా మారింది. గిరిపుత్రులకు హక్కు లేకుండా ఉద్యోగులకు సర్వ హక్కులూ కల్పించింది. అడవిలో వీళ్లకు ఎదురులేకుండా పోయింది. అందుకే నవలలో ఫారెస్టర్ రాజు అడవిలో కట్టెల కోసం వచ్చిన వాళ్లనుద్దేశించి “మీ తాత లెవరో ఉచ్చపోసి ఈ అడివంతా నాటినట్టు, మీరంతా రోజూ దీని మీద పడి కర్రలు నరుక్కు పోతున్నారు. కాని మేం తలచుకుంటే గంటకో కేసు, గడియకో పన్ను ఏస్సి, రసీదులు కోస్సి మీ పీకలు తీసేయగలం. మీలో ఒక్క వెధవ కూడా ఈ అడవి పక్క తొంగి చూడ్డానికి కూడా భయపడినట్టు చేసిగలం” అని బెదిరిస్తాడు.
అడవులను అనుకొని వున్న గ్రామాల ప్రజానీకం సహజమైన తమ అవసరాల కోసం అడవుల పైన ఆధార పడుతున్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఎట్టి పరిస్థితిలోనుఅటువంటి వాడకాన్ని ప్రభుత్వం అనుమతించదు యాదృచ్ఛికంగా ఆడవులను అనుకొని వాళ్ల గ్రామాలు వున్నంత మాత్రన ఆయా గ్రామాల ప్రజానీకానికి జాతీయ సంపదలపై సొఠ్కులున్నాయనికొనే భావం చెల్లదు. అడవులను శాస్త్రీయ పద్ధతులలో రక్షించుకోవాలంటే ఈ ప్రజానీకపు హక్కులపై నియంత్రణ ఉండాల్సిందే”. అన్న చట్టం మాటే రాజు నోటంట వెలువడింది.
ఎవరిచేత పని చేయించుకున్నా తగిన కూలి ఇవ్వాలి. అసలు చేసిన శ్రమకు సరైన ప్రతిఫలం ఇవ్వకపోవడమే కదా శ్రమదోపిడి. ఈ శ్రమ దోపిడికి మొదటి మూలం వెట్టి చాకిరి. ఇందులో శ్రమ దోపిడితో పాటు అధికార జులుం, అజమాయిషి, దండన మొదలైనవన్నీ చోటు చేసుకుంటాయి.
అడవిలో కట్టెలు కొట్టుకుంటున్న వాళ్లని బలవంతాన తీసుకెళ్లి వెట్టి చేయించడం చట్టరీత్యా నేరం, కాని ఫారెస్టర్ రాజు, గార్డ్ అప్పారావు ఇద్దరూ ఇదే పని చేస్తారు. ఆ రోజంతా అలా పని చేయించడమే కాకుండా మరుచటిరోజు మళ్లీ రావాలని, రాకపోతే మరి అడవితో సంబంధం ఉండదని చెప్పి బెదిరిస్తాడు. గడ్డి సెట్టి వెళ్లలేకపోతాడు కాని తరువాత రోజు గడ్డి సెట్టి అడవిలో కట్టెలు కొడుతుండగా గార్డు వెట్టికి ఏం రాలేదని అతని గొడ్డలి లాక్కొని తీసుకుపోతాడు. తరువాత గట్టిసెట్టి పారెస్ట్ ఆఫీసుకెళ్లి ఐదురూపాయలు సమర్పించుకొని గొడ్డలి తెచ్చుకుంటాడు. భారత రాజ్యాంగంలోని 23వ అధికరణం క్రింద వెట్టిచాకిరి నిషేదించబడింది కాని ఇప్పటికీ గ్రామాల్లోను పట్టణాలలోను కొనసాగుతుంది.
నవలలో కమ్యూనిస్టు నాయకుడు (గురువు) సమావేశంలో “కామ్రేడ్స్ ఫారెస్ట్ డిపార్టెమెంట్ మీ మీద అక్రమంగా జరుపుతున్న జులుం తెలిసింది. ప్లాయిటేషన్ కు అడవిలో మొక్కా మోడూ మీ చేత నరికించినప్పుడు మీకు రోజూ కూలి గవర్నమెంటు రూలు ప్రకారం ఇవ్వాలి..... ఇవ్వకుండా మీ చేత నిర్బంధంగా పెట్టి చేయించుకోవడం పద్ధతికి విరుద్ధం. దీని మీద ముఖ్యంగా మనం ఒక నిర్ణయంకి రావాలి”, అని చెప్పి వాళ్లన వెట్టికి వెళ్లొద్దని మును ముందు కార్యాచరణ గురించి వివరిస్తాడు.
5. సామాజిక చైతన్యానికి భూషణం మాస్టారి రచనల ప్రభావం:
భూషణం మాస్టారి రచనల ప్రభావం ప్రజలపై ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఉద్యమకాలంలో ఆయన రచనలు ఒక మార్గదర్శకంగా నిలిచాయి. రైతాంగం, కర్షకులు, సామాన్య ప్రజలు ఆయన రచనల ద్వారా నూతన స్పూర్తిని పొందారు. ఆయన రచనలు ప్రజా పోరాటాలకు సహాయంగా నిలిచినవని చెప్పవచ్చు.
ఏభై ఏళ్ల క్రితం ఎక్కడో మారుమూల జరిగిన ఈ దేశపు మూలవాసులు చేసిన గొప్ప ఉద్యమం శ్రీకాకుళ ఉద్యమం. స్వతంత్రం వచ్చి ఇరవై ఏళ్లయినా జీవితాల్లో ఎటువంటి మార్పూ లేకపోవడమే కాదు, అదివరకటి పీడన కంటే పెరిగిన పీడనని తట్టుకోలేని ప్రజలు ఎక్కడో నక్సల్బరీలో రైతులు ఇచ్చిన చైతన్యాన్ని ఇముడ్చుకుని చేసిన గొప్ప తిరుగుబాటు. అప్పటికి కేవలం వర్గశత్రు నిర్మూలనగా మాత్రమే కనిపించవచ్చు. కానీ అప్పటికది చారిత్రిక అవసరం. ఆ తర్వాత ఉద్యమాలు అక్కడ నేర్చుకున్న పాఠాల నుంచి నేర్చుకుని పోరాట పరిధిని విస్తృతం చేశాయి.
విల్లంబులు పట్టుకుని, నాటు ఆయుధాలు చేతబూని ఆదివాసులు చేసిన పోరాటం ప్రజా పోరాటాలకు నిరంతర స్ఫూర్తి. ఇది ప్రధాన స్రవంతి చరిత్రలో, సామజిక విశ్లేషణలో, సాహిత్యంలో ఏక్కడా మనకు కనిపించదు. ఆ రక్తసిక్త చరిత్రను పట్టుకుని చెప్పాల్సిన బాధ్యత ప్రజా కవులదే, ప్రజా రచయితలదే. ఆ బాధ్యతని భూషణం మాస్టారు అద్భుతంగా నిర్వహించారు. ఇది చదువుతుంటే మనం అప్పటి ఆ గడ్డు రోజుల్లోకి, ఆ గడ్డురోజుల్లో బతుకు ఈడుస్తున్న ప్రజల జీవితాల్లోకి, వాళ్ళు చేసిన పోరాటంలోకి వెళ్ళిపోతాం. అప్పటి స్థలకాలాలు ఇప్పటి స్థలకాలకు గుణం లో ఏమాత్రం తేడాలేదని గమనిస్తాం. వాళ్ళు అనుభవించిన ఆ ఉద్వేగభరితమైన నడకను చూసి సహానుభూతి చెందుతాం.
“హింస భరించరానిదైనప్పుడే పీడితులు ప్రతిహింసకు పూనుకుంటారు. సాయుధులవుతారు. ప్రభువులు గుర్తించని ఈ కారణాలను ప్రజలైనా గుర్తించాలనే కవులూ, రచయితలూ ఘర్షణలను గురించి పదేపదే రాస్తారు. వారి రచనలను నిషేధించినా వారిని జైళ్లలో వేసినా వారు తమ ప్రయత్నాలను మానరు. భూషణంగారు ఈ కోవకు చెందినవారే కాదు వారి కథలు కూడా ఈ కోవకు చెందినవే. అవి శ్రీకాకుళానికీ, అప్పటి కాలానికీ పరిమితాలు కావు. అన్ని చోట్లకూ అన్ని కాలాలకూ చెందినవి,” అని భూషణం మిత్రులూ, మరో గొప్ప కథకుడూ అయిన కాళీపట్నం రామారావు అంటారు.
6. ముగింపు:
- శ్రీకాకుళం ఉద్యమం ఒక సామాజిక పరిమళాన్ని సృష్టించింది.
- భూషణం మాస్టారి రచనలు ఆ ఉద్యమ స్ఫూర్తిని పదునెక్కించాయి. ప్రత్యేకంగా ‘కొండగాలి’ నవల ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఓ ముఖ్యమైన రచన.
- భూషణం మాస్టారి రచనలు కేవలం సాహిత్య పరిమితి కాకుండా, సామాజిక స్పృహ కలిగించే సాధనంగా నిలిచాయి.
- ఈ వ్యాసంలో ఆయన రచనల ప్రాముఖ్యతను విశ్లేషించాం.
- ఆయన రచనలు సమాజ మార్పుకు దోహదపడినవని తేలింది.
7. ఉపయుక్తగ్రంథసూచి:
- కుటుంబరావు, బి.వి., ఆంధ్ర నవలాపరిణామం. గాయత్రీప్రచురణము, హైదరాబదు, 1971.
- నాగభూషణ శర్మ, మొదలి. తెలుగు నవల. ఆంధ్ర సారస్వత పరిషత్తు: హైద్రాబాద్. 1979.
- నాగభూషణరావు, బోనం. కొండగాలి నవల.
- భూషణం. భూషణం కథలు. అనల్ప పబ్లికేషన్స్.
- రంగనాథాచార్యులు, కే.కే., ఆధునిక సాహిత్యంలో విభిన్న ధోరణలు. ఆంధ్రసారస్వతపరిషత్, హైదరాబాద్. 1982
- రమాపతి రావు, అక్కిరాజు. తెలుగు నవల. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ హైదరాబాద్, 1975.
- రామకోటి శాస్త్రి, కేతవరపు. నవలాలోకనం.
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. నవలాశిల్పం. రెండవ ముద్రణ, విశాలాంధ్ర పబ్లికేషన్ హౌస్, 2000.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

