headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-02 | February 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed

11. వరవరరావు కవిత్వం: మానవతావాదధోరణులు

భాస్కర్ పంతంగి

పరిశోధకులు, తెలుగుశాఖ,
డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రికవిశ్వవిద్యాలయం,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9492114479, Email: panthangibhaskar@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 18.01.2025        ఎంపిక (D.O.A): 28.01.2025        ప్రచురణ (D.O.P): 01.02.2025


వ్యాససంగ్రహం:

వరవరరావు ఆరు దశాబ్దాలగా కవిత్వం రాస్తున్నారు. విస్తృతమైన సామాజికస్పృహ కలిగిన రచయిత. ప్రపంచరాజకీయ, ఆర్థిక, సామాజిక, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక విషయాలపై పట్టున్న కవి. స్త్రీ, పురుషసమానత్వాన్ని కాంక్షించే వ్యక్తి. సమసమాజ స్వాప్నికుడు, పీడితులకోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ద్వేషించవలసిన ప్రతిదీ ద్వేషించే,ప్రేమించవలసిన ప్రపంచాన్నంతా మనకందించే కవిత్వం కావాలని కోరుకున్న కవితాతాత్వికుడు, నిత్యచైతన్యశీలి, విశ్వమానవయాత్రికుడు వరవరరావు. వరవరరావు కవిత్వ రచన 1957 లో సోషలిస్టు చంద్రుడు అనే కవిత ద్వారా ప్రారంభమై నేటి వరకు కవిత్వం రాస్తున్నప్పటికి, వరవరరావు కవిత్వం మీద ఇంతకు ముందు చెప్పుకోతగ్గ పరిశోధనలు జరగలేదు.వరవరరావు కవిత్వంలోని మానవతావాద ధోరణిని పరిశీలనాత్మక పద్ధతిని అనుసరించి చేస్తున్న పరిశోధన ఇది. వరవరరావు విస్తృత సామాజిక స్పృహతో తన కవిత్వంలో వెలిబుచ్చిన మానవతా వాద అంశాల ద్వారా పాఠకులలో మార్పుని సాధించి అన్ని రకాల పీడనలు దోపిడీ నుండి మనిషి రక్షించబడి, మనిషి మనిషిగా గౌరవింపబడేలా చేయాలనే వారి లక్ష్యాలను పాఠకలోకానికి తెలియజేయాలన్నది ఈ వ్యాస ఉద్దేశం. వారి కవిత్వం లోని మానవతా వాదధోరణిని విశ్లేషించడం ఈ వ్యాసపరిధి. ఈ పరిశోధనకు సహకరించే విమర్శ, పరిశోధన గ్రంథాలను సేకరించే క్రమంలో ప్రసిద్ధమైన గ్రంథాలయాలను సందర్శించాను. ప్రధానమైన రచనలను రచయిత వద్ద నుండి సేకరించాను. అలాగే సాహితీవేత్తల ఇంటి గ్రంథాలయాలను (Home Libraries) కూడా సందర్శించి పరిశోధన వ్యాసరచనకు సహకరించే గ్రంథాలను సేకరించాను. సేకరించిన సమాచారం (ఆచార్య వెలుదండ నిత్యానందరావు విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన అనే గ్రంథం ఆధారంగా) మేరకు, రచయిత చెప్పిన విషయం ప్రకారం ఇప్పటివరకూ వరవరరావుకవిత్వం మీద విశ్వవిద్యాలయాలలో గానీ, మరే ఇతర సంస్థలలో గానీ ఎటువంటి పరిశోధన జరగలేదు. “వరవరరావు కవిత్వం - సామాజిక స్పృహ”లో భాగంగా ఉన్న అధ్యాయం “వరవరరావు కవిత్వం - మానవతా వాద ధోరణి” నే మొదటి పరిశోధన.

Keywords: మానవతావాదం, సమసమాజస్థాపన, దోపిడీరహితసమాజం, మానవహక్కులు, యుద్ధవిముఖత, ప్రజాస్వామ్యం, మానవవిముక్తి, స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాత్రం, వసుధైకకుటుంబం.

1. ఉపోద్ఘాతం:

మానవుడే అన్నింటికీ మూలం అనే భావన నుండి ఆవిర్భవించిన విశాలమైన భావన మానవతావాద ధోరణి. ఇది ప్రపంచంలో సృజించిన వివిధ సాహిత్యాలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానూ కనిపిస్తుంది. మానవత అనే తాత్వికాంశం లేని సృజనాత్మక సాహిత్యం లేదు. ఇది మానవుల తమ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి కావాల్సిన హక్కులను, విలువలను మెరుగుపరిచే ప్రక్రియగా అభివర్ణించబడుతుంది. దీన్ని మరింత విస్తృతంగా పరిశీలిస్తే, కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చించవచ్చు. మనిషి ఇతరుల ముందు, ఇతరులకు లోబడి, ఇతరుల ఆధీనంలో ఉండి బతకడం కాకుండా, మనిషి మనిషిగా బతకాలి. ప్రతి మనిషి, మనిషిగా బ్రతికే అవకాశం రావాలని అప్పుడే అందరూ కలిసి ఉండగలుగుతారు. నేను, నాది అనే స్వార్థం లేకుండా, మనుషులు మనుషులుగా బతకాలన్నదే తత్వం వరవరరావు గారిది. స్వచ్ఛమైన మనుషులుగా ఉంటూ ఇతరులతో ప్రేమగా, గౌరవభావంతో కలిసి బతికే సమాజాన్ని కవి కాంక్షించారు.

2. మానవతావాదం - లక్షణాలు:

’మానవుడే అన్నిటికి ప్రమాణం' అనే సూత్రంతో ప్రారంభమైన మానవతావాదం కాలానుగుణంగా రూపుదిద్దుకుంటూ నేడు ఒక సిద్ధాంతంగా, ఒకతత్త్వంగా మార్పు చెందిందని చెప్పవచ్చును. మానవతావాద మౌలికలక్షణాలుగా ఈ క్రింది వాటిని డా. జి. అరుణ కుమారి “ఆధునిక తెలుగుకవిత్వంలో మానవతావాదం విభిన్నధోరణులు” అనే సిద్ధాంతగ్రంధంలో పేర్కొన్నారు.  అవి: మానవుడే అన్నింటికీ ప్రమాణం, మానవుడి సుఖశాంతులు ఈ  ప్రపంచంలోనే ఇమిడి ఉన్నాయి, మానవ శ్రేయస్సు అందరి అభిమతం, జీవకోటిలో అత్యుత్తమ జీవి మానవుడు, మానవ ప్రేమే మానవ ఆదర్శం, ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్న, వసుధైక కుటుంబ నిర్మాణమే మానవతావాదం యొక్క లక్ష్యం, మానవతావాదం సాంప్రదాయక మత సిద్ధాంతాలకు, అతి ప్రాకృతిక దృగ్విషయాలకు విరుద్ధమైనది, మానవతావాదం పరిణామ సూత్రంగా అన్ని అవరోధాలను అధిగమిస్తుంది, మానవ పరిపూర్ణత, సమైక్యతలు మానవత్వ సిద్ధికి దోహదాలు.

3. వరవరరావు కవిత్వం  మానవతావాద ధోరణులు:

వరవరరావు కవిత్వంలో మానవతావాదప్రధాన లక్షణాలన్నీ ఆవిష్కరించబడ్డాయి. వీటితో పాటు యుద్ధవిముఖత, ప్రపంచంలోని వివిధ దేశాల్లో మానవ విముక్తి కోసం జరిగిన పోరాటాలకు మద్దతు లాంటి కొన్ని ఇతర అంశాలను కూడా వరవరరావు కవిత్వీకరించారు. వీటన్నింటిని కింది శీర్షికల ద్వారా ఈ వ్యాసంలో ఒక క్రమ పద్దతిలో పరిశీలించడమైనది.

సమసమాజస్థాపన, దోపిడీరహిత సమాజం, మానవహక్కులు, యుద్ధవిముఖత, మానవ విముక్తి, వసుధైకకుటుంబం, స్వేచ్చ, సమానత్వం , సౌభ్రాత్రం, ప్రజాస్వామ్య ఆకాంక్ష.

2.1 సమ సమాజ స్థాపన:

సమ సమాజం అనగా సమాజంలోని పేద, ధనిక వర్గాల మధ్య , అగ్ర, నిమ్న అనే కులపరమైన అసమానతలు లేకుండా అందరినీ సమానంగా చూసే సమాజం.తెలుగు సాహిత్యంలో నవీన కవితారీతి మొదలైన నాటి నుండి నేటి వరకు అనేక అంశాలు కవితా వస్తువులుగా స్వీకరించబడి విస్తరించింది. అనేకమంది కవులు సమాజంలో చైతన్యాన్ని, సంఘసంస్కరణ దృక్పధాన్ని తీసుకొచ్చి, నైతిక విలువల్ని, సమాజ పోకడల్ని, సమాజంలో జీవిస్తున్న అనేకమంది మనుషుల మనస్తత్వాన్ని, ఎన్నో సంఘటనల్ని కవితలుగా మార్చి తమదైన ఒక ప్రత్యేక ముద్రను సంపాదించుకోగలిగారు.

“ఇంకా పొద్దు కాస్త పోవాలి.
సద్దుమణిగిన ఆర్తుల హాహారావాలు
వణుకుడు కంఠం చీల్చుకొని
అచ్చమైన గొంతుకతో అరవగలగాలి
చలికోర్చి శ్రమకు బలికావడమయితే నేర్చిన
సామాన్యుడు
చలిలా వణికించే పెద్దల చాకిరిదెబ్బల నెదిర్చి
'కలికాలపు' చలి తెరలను చీల్చివేయాలి.
ఇంకా పొద్దు కాస్త పోవాలి.
సూర్యుడు మిట్టమింటికి రావాలి.
ఈ చలి తెరలు, ఆకలి చారలు
కాలంగీరల కిందబడి నలిగిపోవాలి” (చలినెగల్లు - శిశిరోషస్సు)

కవి వరవరరావు మంచితనాన్ని కలిగిన వ్యక్తి మాటలు, ఆలోచనలు విశ్వవ్యాప్తం కావాలని, వ్యక్తుల ఆలోచన శైలిలో మార్పు రావాలని, ప్రేమ, దయ, మంచి మనసు వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నారు.

కవి ఆశయాన్ని చూస్తే, మంచి వ్యక్తుల కష్టాలను గుర్తించడమే కాదు, వారి ద్వారా సమాజానికి మంచి మార్పులు రావాలని కోరుకుంటున్నారు.

“మల్లెలపయి మంచు కరిగి
ఉల్లములందు మంచితనం పెరిగి
మంచివాని కంఠం కంచయి మ్రోగాలి.
మంచివాని కష్టం కనకమయి పండాలి.”   (చలినెగల్లు - శిశిరోషస్సు)

సమసమాజంలో ప్రతీ ఒక్కరికీ అవకాశాలు ఉంటాయి, అవకాశాలు అందరికీ అందుబాటులో ఉండడం అనేది మానవుడు ఎదగడానికి అత్యంత కీలకమైనది, దీన్ని కవితాత్మకంగా వరవరరావు కింది విధంగా వర్ణించారు.

“ఈ దేశం ఆ దేశం
నా దేశం
ఆ దేశం ఆక్రోశం ఏది లేని.
ఒకే ఒక్క సందేశం
ప్రతి ఒక్కని సంతోషం
ప్రతి ఒక్క ఆకాశం
ప్రతి ఒక్కని కవకాశం” (అసంతృప్తి గీతాలు పూర్తి-  జీవనాడి)

మానవతావాదం మత సంప్రదాయాలకన్నా, సాంఘికనియమాల కన్నా మానవ సౌఖ్యాన్ని, శ్రేయస్సును, ఐకమత్యాన్ని కోరుకున్నట్లు గ్రీకు తాత్త్వికుల భావాల్లో కనిపిస్తోంది. వరవరరావు కవిత్వంలో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది.

“మానుకో, ఇన్నాళ్లు దేవుళ్ల కోసం బతికావు
మానవజాతి కొరకు చచ్చినా - బతుకుతావు
ఇటురా.
భవిష్యత్తు కొరకు నేను రాస్తున్న
పాట
బాట బాధలేని, బానిసత్వం లేని ప్రపంచంలోకి” (భవిష్యత్తు కొరకు నేను రాయనున్న పాట - జీవ నాడి)

2.2 దోపిడీ రహిత సమాజం:

దోపిడి రహిత సమాజం అంటే ఒకరి నొకరు దోచుకోని సమాజం. ప్రతి ఒక్కరికి వారి హక్కులు సమానంగా అందించబడే ఒక  వ్యవస్థ. దోపిడి రహిత సమాజం మానవ హక్కులను సమానంగా అందించే సమాజానికి పునాది వేస్తుంది, ఇది మానవతా వాదం యొక్క లక్ష్యం. దోపిడి లేని సమాజం ఏర్పడితే, ప్రతి వ్యక్తి మానవతా విలువలను అవలంబించి, పరస్పర గౌరవంతో, స్వేచ్ఛా జీవనాన్ని కొనసాగించగలడు. ధనికులు ఇంకా ధనవంతులు అవుతుండడం, పేదలు ఇంకా బలహీనస్థితిలో ఉండడం వంటి పరిస్థితులు దోపిడి వలస వాదానికి ఉదాహరణ.  దోపిడి స్వభావాన్ని కవి వివరిస్తూ కవి, ఎక్కడైతే దోపిడీ ఉంటుందో అక్కడ తిరుగుబాటు తథ్యం అని కింది విధంగా వివరిస్తున్నారు.

“దోపిడీకి మతంలేదు, దోపిడీకి కులంలేదు
దోపిడీకి భాషలేదు, దోపిడీకి జాతిలేదు.
దోపిడీకి దేశంలేదు
తిరుగుబాటుకూ, విప్లవానికీ
సరిహద్దులు లేవు” (సామ్య వాదం రంకె - ఊరేగింపు)

కవి తన కవితలో ప్రపంచంలో ఎక్కడా కూడా అశ్రువులు లేకుండా,  తుడిచి కన్నీళ్లు లేని ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి కవి తన కలాన్ని ఉపయోగిస్తున్నారు.

“ఎక్కడా అశ్రువులు లేకుండా తుడిచి
ఎక్కడా పల్లాలు లేకుండా పూడ్చి
అంతటా అరమరలు లేకుండా భయం విడచి
అరలు విడిచి అథోలోకాలు గడిచి
అచ్చమయిన వెలుగులోకి నడిచి.....
ఎన్నడింక నన్ను నేను చీల్చుకొని వస్తాను
వెలుగులోకి వస్తాను
లో వెలుగులు తెస్తాను” (అసంతృప్తి గీతాలు పూర్తి-  జీవనాడి)

ప్రజల హక్కులను, భూములను, వనరులను దోచుకునే శక్తులను ఉద్దేశిస్తూ కవి, అవినీతి, దోపిడీ, అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తానని కవితాత్మకంగా వివరించారు.

“ఎవరి భద్రతను భంగపరిచాను నేను
దోపిడీ హస్తాలు ప్రజల భూముల్లో దొరికిన
సీతలను ఎత్తుకపోతుంటే అరిచాను తప్ప”  (కేటాలిస్ట్ -ఊరేగింపు)

సామాజిక వివక్ష, నిరుపేదల దుస్థితిని వివరిస్తూ కవి, వారి అస్తిత్వం జాతి పురోగతికి పని చేసినా ప్రభుత్వాలు పుట్టుకలు, మరణాలు జనాభా లెక్కలకు మాత్రమే వారిని పరిమితం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.

“అయినా మా చావు పుట్టుకలు
జనాభా లెక్కలకు తప్ప
జాతి పురోగతికేం పనికొస్తాయి
దరిద్రం బాధకి తట్టుకోలేక పుట్టేవాళ్లం
దరిద్రం బాధకి తట్టుకోలేక గిట్టేవాళ్లం” (ముక్త కంఠం - డాజావు)

అమాయకులైన పీడిత ప్రజానీకానికి చెందిన నిమ్న వర్గాలను, తమ కపట తెలివితేటలతో ఉన్నత వర్గాలు దోచుకుంటున్నాయని అమాయకులైన సామాన్య ప్రజల ధన, మాన, ప్రాణాలను ధనిక వర్గం దోచుకునే తీరు వరవరరావు తన కవితల్లో కళ్ళకు కట్టినట్లు అక్షరీకరించారు. ప్రభుత్వాలు కూడా ఈ బూర్జువా, భూస్వామ్య వర్గాల పక్షాన నిలబడి ఈ దోపిడిని ప్రోత్సహించటం జరుగుతుందని, సామాజికంగా, శారీరకంగా, ఆర్థికంగా దోపిడికి గురౌతున్న పక్షాన నిలబడ్డారు. వీరు ఏ విధంగా దోపిడికి గురౌతున్నారో తమ కవితల ద్వారా సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేసారు.  దోపిడీ పీడన లేని మానవీయ సమాజం కోసం వరవరరావు కవితలను రచించారు.

ఈ దోపిడీదుర్గం కింద ఎందరో మృతవీరులు 

తమ ప్రాణాలను డైనమైట్లుగా కూర్చారు

 ఈ కోటలోని ప్రతిరాయిలో యింకిపోయిన 

కష్టజీవుల కన్నీళ్లలో 

రగులుతున్న అగ్ని ప్రవహిస్తున్నది 

చరిత్ర ప్రసవిస్తున్నది 

విప్లవం ఈ యుగ శిశువు”. ( ఆహ్వానం - స్వేచ్ఛ)

2.3 మానవహక్కులు:

మానవహక్కులు అనేవి ప్రతి వ్యక్తికి జన్మనిచ్చిన సమాన హక్కులుగా పరిగణించబడతాయి. ఇవి కుల, మత, జాతి, లింగ, వర్ణభేదాలకు అతీతంగా అందరికీ సమానంగా వర్తిస్తాయి.

హక్కులు అనేవి గౌరవప్రదమైన మానవ జీవితానికి అత్యంత ఆవశ్యకం, ఈ దృగ్విషయాన్ని కవి వరవరరావు కింది కవితలో వివరించారు.

“స్వభావానికీ, భావాలకూ

సరిహద్దులు లేనపుడు 

జీవనానికి కత్తెర్లు వేసేది ధనస్వామ్యం 

హక్కులకు వేసినవి.

ఉక్కు గొలుసులయినా

అధ్యతన బావిలో అవి విరిగిపోక తప్పదు” (వెల్తురు కోసం నెత్తురు- జీవనాడి)

డిసెంబర్ 10, 1948 రోజు ఐక్య రాజ్య సమితి ప్రపంచ మానవ హక్కులు ప్రకటన చేసింది. ఈ మానవ హక్కుల్లో జీవించే స్వేచ్ఛ అంతర్భాగం, జీవించడం అంటే మానవ గౌరవంతో జీవించడం అని, మానవుడు గౌరవాన్ని జీవించి ఉన్నప్పుడే కాకుండా మరణం తర్వాత కూడా పొందాలని కవి కింది కవితలో వివరించారు.

మనిషి శరీరం శవమయ్యే కాదు

ఖననమయ్యీ దహనమయ్యీ శ్మశానమయ్యా

మానవ గౌరవాన్ని పొందుతూనే వుండాలి

మనిషి చావు కుక్కచావు కాగూడదు

చచ్చాక అందరూ సమానమంటారు గదా

ప్రైవేట్ ఆస్తికీ పెళ్లికీ విడాకులకూ 

పర్సనల్ చట్టాలు ఒప్పుకుంటుంది గానీ ప్రభుత్వం 

ధిక్కార భావాలున్న మనిషి 

చచ్చి శవమైనా స్వేచ్ఛ ఇవ్వదు”  (అదృశ్యం - ముక్తకంఠం)

వరవరరావు భవిష్యత్తుకోసం కలలుగనే వ్యక్తిగా బాధలు లేని ప్రపంచం కోసం హక్కుల పరిరక్షణ కోసం కవిత్వం రాస్తానని అంటున్నారు

2.4 యుద్ధ విముఖత:

యుద్ధ విముఖత్వం అనేది యుద్ధానికి వ్యతిరేకంగా ఉండే ఆలోచనా విధానం. ఇది శాంతియుత మార్గాల్లో సమస్యలను పరిష్కరించడానికి, మానవ హక్కులను కాపాడడానికి, ప్రపంచ శాంతిని సాధించడానికి ఉపయోగ పడేఅంశం. ప్రపంచ చరిత్రలో యుద్ధాలు, అనేక విధ్వంసాలు సృష్టించి మనిషికి తీరని దుఃఖాలను, నష్టాలను మిగిల్చాయి. ఈ నేపథ్యం ప్రకారం యుద్ధ విముఖత, మానవతా వాదాన్ని మరియు అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించే అవసరం పెరిగింది.

యుద్ధానికి వ్యతిరేకంగా ఉండటం అంటే కేవలం శాంతిని కోరుకోవడమే కాదు,మానవుని పట్ల సానుభూతితో వ్యవహరించడంగా యుద్ధ విముఖత కనిపిస్తుంది. "జ్ఞానం బలవంతమైనా, శాంతి గొప్పది" అని మహాత్మా గాంధీ అన్నారు. వరవరరావు యుద్ధం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం యుద్ధ నేరం అంటూ మౌనం ఒక యుద్ధ నేరం కవితలో కవి యుద్దం పిపాసితను మానవాళి విడనాడాలని, యుద్దం మానవ జీవ సారాన్ని కబళించే విపణి గా అభివర్ణిస్తూ  ఈ కవితలో కవి యుద్ధానికి వ్యతిరేకంగా, శాంతి కోసం మనస్ఫూర్తిగా తన భావాలను వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం మనిషి జీవనానికి, నాగరికతకు వ్యతిరేకంగా ఒక రణగొణ ధ్వనిగా, మృత్యు శబ్దంగా అభివర్ణింపబడింది. కవి యుద్ధాన్ని కేవలం దేశాల మధ్య జరిగే ఘర్షణగా కాకుండా, మానవాళికి అమితనష్టం కలిగించే సంఘటనగా చిత్రిస్తున్నారు.

“యుద్ధం మౌనంగా రాదు 

అది ఒక రణగొణ ధ్వని

 జీవసారాన్ని హరించే విపణి

మనం మాట్లాడాలి

అన్ని అవయవాల్నీ కూడదీసుకుని కొట్లాడాలి. 

యుద్ధానికి జవాబు 

ఇంక నేల ఈనినట్లు వీథుల్లోకి వచ్చి

 యుద్ధం వద్దనడమే

వెయ్యికోట్ల శాంతిపతాకాల చేతులు 

వినువీధుల్లో ఎగరాలి

మృత్యువుకు ఊపిరాడనంతగా

తలలే శిరస్త్రాణలై

ప్రపంచమంతటా

ప్రాణవాయువుల్ని పరచాలి” (ఇవ్వాళ మౌనం ఒక యుధ్ధనేరం - అంతః సూత్రం)

కవి వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై గ్లోబలైజేషన్, ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్య నియంత్రణ సంస్థలు (IMF) వంటి సంస్థల ప్రభావాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ సంస్థలు తమ ఆర్థిక విధానాలు మరియు పెట్టుబడుల ద్వారా దేశాలపై నియంత్రణ కలిగించుకుంటున్నాయని, కానీ తాము నిజమైన దేశభక్తిని ప్రదర్శిస్తున్నట్లు నాటకీయంగా చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రజల హక్కులను, స్వాతంత్ర్యాన్ని అణచివేసే విధానాలను ఆమోదించే పాలకులు, తమ దేశ భక్తిని అప్పు తెచ్చుకున్నట్లు నటిస్తూ, స్వేచ్ఛ కోసం పోరాటం చేసే వారిని దేశద్రోహులుగా ముద్రిస్తారన్న భావనను కవి వ్యక్తం చేస్తున్నారు.

"ఇంటర్నేషనల్ మానెటరీ ఫండమెంటలిజం నుంచి

దేశభక్తిని అప్పు తెచ్చుకుంటున్న మన పాలకులు

వాడినొక టెర్రరిస్టుగా

దేశద్రోహిగా మనముందు నిలబెడుతున్నారు.

వాడి ఆక్రోశంలో పాల్రాబ్సన్ సంగీతం లేదా

ఉరికంబమెక్కిన రోజెన్బర్గ్ దంపతుల ఉసురులేదా

హిరోషిమా నాగసాకీ పేలిన హృదయాల చిట్లిన నరాల

విషాద విహ్వల వైకల్య వారసత్వ విలాపాలు లేవా?” (మర్చంట్ ఆఫ్ వెనిస్ - అంతః సూత్రం)

వరవరరావు ప్రపంచంలో జరుగుతున్న అసమానతలను, అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, దేశభక్తి అని చెప్పుకుంటూ, పాశ్చాత్య దేశాల దోపిడీ తీరును విమర్శిస్తున్నారు.

కవి సామ్రాజ్య వాద, వలస వాద విధానాలను విమర్శిస్తూ, ప్రపంచ దేశాల్లోని ప్రజలు తమ స్వేచ్ఛ, స్వాభిమానం కోసం చేసే పోరాటాన్ని తన కవిత్వంలో వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వంటి శక్తివంతమైన దేశాలు చిన్న దేశాలను ఎగద్రిక్కి, వారి వనరులను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాయని. "స్వేచ్ఛా పతంగులు" ఎగరడం అనే ప్రతీకతో ప్రజల నిరసన ద్వారా దాన్ని ఎదుర్కొంటారని కవి సూచిస్తున్నారు.

“మా నేల మీద ఎక్కడా నువ్వు దిగడానికే భయపడివి

గద్దలా నువ్వు మా స్వేదాన్ని ముక్కున కరిచి దోచుకపోవాలని

చుక్కల అంతస్తుల దొంతరలో దిగితే

మేం భూగోళమంతా వ్యాపించి

మాతం, ధూలాల, త్యాగాల, అమరత్వాలతో పేనిన

మాంజా సంకల్పంతో

స్వేచ్ఛా పతంగులు ఎగరేస్తాం నిన్ను తరమడానికి” (యుద్దోన్మాధికి - అంతసూత్రం)

వరవరరావు ప్రపంచంలో ఏమూల మానవతకు ఆటంకం కలిగినా నేనున్నానంటూ ముందుకొస్తాడు. ప్రపంచ సామాజిక సమస్యలపై ఆయనలోని తొణికిసలాడే మానవతాగుణం నిరంతరం స్పందిస్తూనే ఉంటుంది. ఈ స్పందన ఆయన 1957లో రాసిన సోషలిస్టు చంద్రుడు నుండి 2014 లో రాసిన బీజాభూమి కవితా సంపుటిలో కూడా కనిపిస్తుంది. వరవరరావు కుల, మత, వర్గాల కతీతంగా సర్వమానవ శ్రేయస్సును కోరే విశ్వకవి.

2.5 మానవ విముక్తి:

 ప్రపంచంలోని అనేక దేశాలు పాశ్చాత్య దేశాల వలస పాలనలో బందీ అయ్యాయి. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి పలు దేశాలు యూరోపియన్ దేశాల నుంచి విముక్తి కోసం పోరాడాయి. ఉదాహరణకు, అల్జీరియా ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘ స్వాతంత్ర్య సమరాన్ని సాగించింది. అలాగే వియత్నాం, ఇరాక్ , పాలస్తీనా, చిలీ లాంటి దేశాల పోరాటం వరవరరావు కవిత్వంలో వ్యక్తమైంది.1960వ దశకంలో, పలు దేశాలు స్వాతంత్ర్యం పొందడం ప్రారంభమైంది. ఈ స్వాతంత్ర పోరాటాలకు సంఘీ భావంగా కవి  అనేక విషయాలను తన కవిత్వం లో వ్యక్తం చేశారు.

ఈ విముక్తి పోరాటాలు మనుషుల ఆత్మగౌరవం, స్వేచ్ఛ మరియు సమానత్వం కోసం సమష్టిగా అనుసరించిన ఉద్యమాల యొక్క పరాకాష్ఠగా నిలుస్తాయి. ప్రతి దేశం తన ప్రత్యేక పోరాట మార్గాన్ని,  ప్రత్యేక పద్ధతులను అనుసరించింది. ఆకలితో తీరని కోర్కెలతో మిగిలిపోయిన అభాగ్యులకు ఆశను నేను అని కవి, కవితాత్మకంగా వివరిస్తూ, మానవ విముక్తి పోరాటాలకు బాసటగా నిలిచారు.

“నీగ్రో సోదరుని ఉద్యమం లోనేగాని 

ఇంకా జీవితంలో ఉదయించని సూర్యుడు 

నా హృదయంలో మండుతున్నాడు. 

ఆసియాలో ఆఫ్రికాలో

యూరప్లో అమెరికాలో

విశ్వాంతరాళం పై ఏ గోళం లోనూ

విధ్వంసం కాదు విక్రాంతి  కోరుతున్న

 మానవుడు నా వారసుడు. 

ఆకలితో, తీరని కోర్కెలతో 

ఆరిపోయిన అభాగ్యులకు 

ఈ లోకంలో మిగిలిపోయిన ఆశను నేను” (జీవ నాడి - జీవ నాడి )

జీవకోటిలో మానవుడే అత్యుత్తమ జీవి, ఇతర జీవరాశులతో పోల్చడానికి వీలులేనంత ఉన్నతంగా ఎదిగిపోయాడు మానవుడు, అటువంటి మానవుని మరణం మనిషిని  అమితంగా ప్రేమించే సున్నిత మనస్కుడైన కవి వరవరరావును కలవర పెడుతుందని కవితను ప్రారంభించాడు. మరణం లేని వాడని ఆకాశతారయ్యాడని మనం ఎన్ని మాటలు చెప్పినా మన హృదయాంతరంలో మనిషి మరణం ప్రతి మనిషిని కలవరపెడుతుంది.

కవి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లి “ఒక మనిషి చావడమంటే మానవత్వం ఊపిరి బిగబట్టడమే” అని గొప్ప సూత్రీకరణ చేశారు, ఇది కవికున్న మానవతా దృష్టికి తార్కాణం., మనిషిని ఒంటరి కాదంటాడు కవి, మనిషంటే ఒక సామాజిక ఖండమని, మనిషి ఊపిరి దీపం ఆరిపోయిందంటే మనసు చీకటి అవుతుందని, మనకు పరిచయం లేకపోయినా, మనం పేరు వినకపోయినా, అతడు మనిషి అని తెలిసాక మనసుకు కావలసిన వాడు కాకుండా ఎట్లా ఉంటాడని ప్రశ్నించి, మనిషి మరణం గురించి గొప్పగా వర్ణించారు కవి.

ఈ కవితా పంక్తులు కవికి గల ఒక  లోతైన  తాత్త్విక ఆలోచనకు  అద్దంపడుతుంది .  

“మనిషి మరణం నన్ను కలవర పెడుతుంది  

అమరుడయ్యాడనూ  

ఆకాశతార అవుతాడను

ఒక మనిషి చావడమంటే

మానవత్వం ఊపిరి బిగబట్టడమే

మనిషంటే ఒంటరి కాదు గదా

ఒక సామాజిక ఖండం” (మనిషి మరణం - ముక్తకంఠం)

వరవరరావు కవిత్వంలో శ్రమ జీవుల జీవితాలను దోచుకునే వారిని, సమాజంలో జరిగే అన్యాయాలను ఉద్దేశపూర్వకంగా వెలుగులోకి తెస్తూ, సమాజంలో మార్పు అవసరాన్ని తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. కవిత శిల్పం, భావన, సందేశం చర్చించినపుడు, ఈ పంక్తులలో ముఖ్యమైన  “శ్రమను పీల్చి క్షమను నేర్పి” శ్రమజీవుల శక్తిని చీల్చిపారుస్తూ, వారికి నిరంతరం "క్షమించు, మౌనంగా ఉండి తట్టుకో" అనే ఆదేశాలు ఇచ్చే వ్యవస్థను ఇది సూచిస్తోంది.ఇది పీడిత వర్గాలను అణగదొక్కే దోపిడీ వ్యవస్థను సూటిగా విమర్శిస్తోంది.శ్రమజీవులు వారి సహనాన్ని కోల్పోకుండా పోరాడాల్సిన అవసరాన్ని కవి తెలియజేస్తున్నారు.

“బలుస్తున్న జలగలను పీకందే శాంతి లేదు”

సమాజాన్ని దోచుకుంటున్న శక్తులను ("జలగలు") దూరం చేయకుండా శాంతి సాధ్యం కాదని కవి అంటున్నారు. మానవతా వాదం అన్ని రకాల పీడనల నుండి మనిషి విముక్తి కావాలని కోరుకుంటుంది.

“శ్రమను పీల్చి క్షమను నేర్పి 

బలుస్తున్న జలగలను

 పీకందే శాంతి లేదు 

కూల్చందే క్రాంతి రాదు” (ధర్మశాల -  స్వేచ్ఛ)

2.6 వసుధైక కుటుంబం:

మానవజాతి అంతా ఒకటేనని మానవజాతి సమైక్యతను పూజింపజేసేది వసుధైక కుటుంబ భావం. ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా మానవుడు మానవుడే. మానవుడిలోని చైతన్య భావ సంకల్పం అతడు ఏ దేశంలో ఉన్న ఒకే విధంగా ఉంటుంది. ఆకాంక్ష, కృషి ఈ రెండు మానవుడిని తీర్చిదిద్దే సాధనాలు. 

“భళ్లున తెల్లవారునింక భయం లేదు” కవితలో  రేపటి వసుదైక శాంతి వెల్లడిలా ఉండడం కోసం ప్రపంచమంతా శాంతి మయం కావడం కోసం ప్రపంచంలోని ప్రతి వాని ముఖంలోకి పరకాయించి చూసి పాపాలను కోపాలను ముఖం మీదనే అనేస్తానని, కళ్ళకు మాటలు దాగిన కుళ్లను భళ్లున కక్కిస్తానని విశ్వ మానవ శ్రేయస్సు ను కోరుకున్నారు.భళ్లున తెల్లవారు నింక భయం లేదు తెల్ల వారడంతో వెలుగు లోకాల నేలుతుందని, నిద్రాణమయిన జగత్తు, యావత్తూ, మేలుకుంటుందని ఈ ఖండికలో సూచిస్తున్నారు.

“ఒక్కసూర్యుని కళ్ళల్లోకే కాదు 

రేపు ప్రపంచంలోని ప్రతివాని మొగంలోకి

పరకాయించి చూస్తాను. ...

రేపు వసుధైక శాంతి ఎల్లెడల నిండుతుంది” (“భళ్లున తెల్లవారునింక భయంలేదు” కవిత)

2.7. స్వేచ్చ, సమానత్వం  సౌభ్రాతృత్వం:

మానవతావాదం ప్రకారం, స్వేచ్ఛ, సమానత్వం, మరియు సౌభ్రాతృత్వం వంటి విలువలు ఒక సమాజాన్ని సమగ్రంగా, సహృదయంగా, మరియు న్యాయపూర్వకంగా నిలిపేందుకు చాలా ముఖ్యమైనవి. ఈ మూడు విలువలు ఉన్నప్పుడు మాత్రమే ఒక సమాజంలో ప్రతి వ్యక్తికి తన వ్యక్తిత్వం వికసించే అవకాశం కలుగుతుంది.

కవిత్వంలో ప్రజాస్వామ్య ఆకాంక్ష అనేది వ్యక్తిగత మరియు సామాజిక అభిరుచులను వ్యక్తం చేసే ఒక ముఖ్యమైన అంశం. ఇది ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి భావాల్ని కవిత్వ రూపంలో ప్రతిబింబిస్తుంది.

వరవరరావు కవిత్వం ప్రజాస్వామ్య ఆకాంక్షలను గొంతుక అందించి సమాజంలో మార్పు తీసుకురావడానికి సహకరిస్తుంది.

మానవుడు సంపూర్ణంగా జీవించడానికి తప్పనిసరిగా కావాల్సినవి స్వేచ్ఛ. ఇది మనుషులందరూ సమానం అనే భావన. భారతదేశంలోని కుల వ్యవస్థ మనిషి స్వేచ్ఛకు  సంకెళ్లు వేస్త్తుంది. వరవరరావు “మరో కోటేశ్ మృతి” అనే కవితలో దేశంలోని కుల చట్రంలో అట్టడుగు స్థానంలో ఉన్న దళితులు పడుతున్న బాధలను వివరిస్తూ, ఈ సామాజిక, ఆర్థిక నిర్మాణంలో వారి పాత్రను కొనియాడుతూ, ఈ మధ్య యుగ ఫ్యూడల్ వ్యవస్థ నశించాలంటే చైతన్యం కావాలని కోరుకుంటున్నారు కవి.

దొరల పెత్తందార్ల పాదాలకు మట్టి అంటకుండా 

తమచర్మం వొలిచి చెప్పులు కుట్టి యిచ్చినవాళ్లూ 

నెత్తురు చెమటగా సంపన్నుల పొలాలకు నీళ్లు పెట్టే తొండాలుగా 

తమ కండరాలను మలచినవాళ్లూ...

కోటేశులు కోట్లాదిమంది ఈ దేశచరిత్ర నిండా” (మరో కోటేశుమృతి- స్వేచ్ఛకవితా సంపుటి)

2.8.ప్రజాస్వామ్య ఆకాంక్ష

ప్రజాస్వామ్యం అనేది ప్రజలచే, ప్రజల కోసం, ప్రజల ద్వారా నడిపించబడు ఒక రాజకీయ వ్యవస్థ. పాలనా ప్రక్రియలో ప్రజల చురుకైన భాగస్వామ్యం ను ప్రజాస్వామ్యం కోరుకుంటుంది.ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు ప్రజల తరపున పాలన చేయడం కానీ, ప్రజలు ప్రత్యక్షంగా పాలనా నిర్ణయాలలో పాల్గొనడం కానీ జరుగుతుంది.

వరవరరావు కవిత్వం ప్రజాస్వామ్య ఆకాంక్షలను గొంతుక అందించి సమాజంలో మార్పు తీసుకురావడానికి సహకరిస్తుంది.

"అతడు కార్మికుడు అతడు కవి

ఆ లోకాన జైళ్లు లేవు కోర్టులు లేవు

బయళ్ళూ ప్రజాకోర్టులే తప్ప

సిపాయిలు లేరు

చిగురించిన ప్రజాస్వామిక విలువలు తప్ప"  (పారిస్ కమ్యూన్ - స్వేచ్ఛ)

ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ప్రజస్వామిక ఆకాంక్షను, వారి పోరాట స్ఫూర్తిని మరియు స్వరాష్ట్ర సాధనలో ఉడికిన ఆవేశాన్ని హృదయానికి హత్తుకునే రీతిలో కవి వరవరరావు వ్యక్తపరిచారు. 

తెలంగాణలో ఉన్న మధ్య యుగ భూస్వామ్య వ్యవస్థను పోలిన   సామాజిక చట్రంను సామాన్యులు అంతా కలిసి బద్దలు కొట్టిన  సిరిసిల్ల,జగిత్యాల రైతు కూలీల పోరాటాన్ని  వరవర రావు తన కవిత్వంలో అక్షరీకరించారు.

"ఆవలించి ఆదిలాబాద్

కళ్లు తెరచి కరీంనగర్

ఒళ్లు విరిచి నిలిచినపుడు

కాళ్ల కింద మట్టి ఎగసి - దొరల

కళ్లల్లో చిల్లింది.

మరో ఝంఝ మహా ఝంఝ

తెలంగాణ గుండెల్లో కెరలింది" (మరో ఝంఝ - స్వేచ్ఛ) 

ఇక్కడ కవి తెలంగాణ గుండెల్లో జ్వాలలాంటి ఉద్యమం ప్రారంభమైందని చెబుతున్నారు. "ఝంఝ" అనే పదం ఒక తీవ్రత, ఒక ప్రకంపనం, ఆవేశం, మరియు నిరసనలకు ప్రతీకగా వాడారు. ఇది ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల గుండెల్లో వెలుగుతున్న అలజడిని సూచిస్తుంది.

"సుళ్లు తిరిగి గోదావరి

ఊళ్లు పొరలి గోదావరి

అదే మట్టి బతుకువెట్టి

తుది ముట్టగ తరలింది

నేలబారు మనుషులె

చీమల బారుగ కదలనేర్చి

మట్టి తమది చెట్టు తమది

పాములున్న పుట్ట తమదె

అని గట్టిగ ప్రకటించిరి

కల్లోలం సృష్టించిరి” (మరో ఝంఝ - స్వేచ్ఛ)

3. ముగింపు:

  • వరవరరావు కవిత్వం అంతా సమకాలీన సంఘటనల, అనుభవాల సమహారం.
  • వరవరరావు 1957 లో తన కవిత్వ రచన ప్రారంభించారు. ప్రారంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నిర్మూలన కోసం తన కలాన్ని ఎక్కుపెట్టిన రచయిత.
  • వసుధైక కుటుంబం కోసం కలలు కన్న మానవ ప్రేమికుడి వరవరరావు
  • సమాజాన్ని, సామాజిక దృష్టి కోణాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన పరిపూర్ణ జ్ఞానాన్ని వరవరరావు కవిత్వం ద్వారా అందించారు
  • వర్తమాన సమస్యలను బలమైన అభివ్యక్తితో కవితాత్మకంగా వ్యక్తీకరించడం వరవరరావు ప్రత్యేకత. ఈ వ్యాసంలో ఒక క్రమ పద్ధతిలో మానవతావాద ధోరణులు చర్చించడం జరిగింది
  • వరవరరావు కవిగా నూతన మానవీయ సమాజ స్వాప్నికుడు, “మనిషి ఒక నూతన ప్రపంచం కోసం స్వప్నించడమే మానవత్వం” అంటారు.
  • “నిజాయితీ మానవుడి దేవుడు కావాలని, మానవసంక్షేమం అతని మతం కావాలని ఆకాంక్షించిన కవి.
  • వరవరరావు కవిత్వంలో మానవతావాదం లేవనెత్తిన ప్రధాన అంశాలను ఈ వ్యాసంలో చర్చించడం జరిగింది.

4. సూచికలు:

  1. ఆధునిక తెలుగు కవిత్వంలో మానవతావాదం - విభిన్న ధోరణులు - జి అరుణ కుమారి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సమర్పించిన సిద్దాంత వ్యాసం - 1985
  2. గుగి వా థియాంగో  - ‘డిటైనెడ్ ఏ రైటర్స్‌ ప్రిజన్‌ డైరీ’ పియర్సన్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ - 1981

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అరుణ కుమారి, జి. ఆధునిక తెలుగు కవిత్వంలో మానవతావాదం - విభిన్న ధోరణులు -   హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సమర్పించిన సిద్దాంత వ్యాసం - 1985
  2. ఆనందరామం, సి. సమాజ సాహిత్యాలు. మచిలీపట్నం. ఎం.శేషాచలం అండ్ కంపెనీ.1987.
  3. ఆరుద్ర. సమగ్ర ఆంధ్ర సాహిత్యం (సంపుటి.4). హైదరాబాద్: తెలుగు అకాడమీ.2012.
  4. కృష్ణమూర్తి, భద్రిరాజు. భాష-సమాజం- సంస్కృతి. హైదరాబాద్: నీల్ కమల్ పబ్లికేషన్స్.2010.
  5. పాణి. " వ్యక్తిత్వమే కవిత్వం” వరవరరావు కవిత్వ విశ్లేషణ మలుపు బుక్స్ . 2019 
  6. యాదగిరి, కె.. తెలుగులో కవిత్వోద్యమాలు తెలుగు అకాడమీ ప్రచురణ, హైదరాబాద్ 2020
  7. రజని, ఎన్. తెలంగాణ అస్తిత్వ సృజన (ఇతర వ్యాసాలు). హైదరాబాద్: రజని పబ్లికేషన్స్. 2020
  8. రామారావు, ఎస్.వి. తెలుగులో సాహిత్య విమర్శ అవతరణ, వికాసాలు. పసిడి ప్రచురణలు, సికింద్రాబాద్-1989
  9. వరవరరావు కవిత్వం (1957-2017) Vol I &II, స్వేచ్ఛా సాహితీ ,హైదరాబాద్- 2017
  10. వెంకటేశ్వరరావు, దార్ల.. బహుజన సాహిత్య దృక్పథం. హైదరాబాద్: సొసైటీ అండ్ ఎడ్యుకేషన్.2012.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]