AUCHITHYAM | Volume-06 | Issue-02 | February 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed
10. ఆధునిక తెలుగు కథాసాహిత్యం: పర్యావరణవాద చైతన్యం

డా. శ్రీపతి మారుతి
పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెల్లో, తెలుగుశాఖ,
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9154238058, Email: maruthi.sripathi1@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 19.01.2025 ఎంపిక (D.O.A): 28.01.2025 ప్రచురణ (D.O.P): 01.02.2025
వ్యాససంగ్రహం:
సాహిత్యంలో పర్యావరణవాదం ఇటీవల బలంగా ముందుకు వచ్చిన ఆలోచన. ఇంతకు ముందు సాహిత్యంలో పర్యావరణ స్పృహ లేదా అంటే ఉంది కానీ, పర్యావరణ వాదం వేరు. పర్యావరణ స్పృహ వేరు. పర్యావరణ వాదం ప్రకృతికి మనిషికి ఉండాల్సిన సంబంధం గురించి వివరించడం దగ్గర ఆగిపోదు. ప్రకృతి విధ్వంసానికి కారణమైన మూలాల్లోకి వెళ్లి చూస్తుంది. మనిషి ప్రకృతిని అదుపులోకి తీసుకోవటం ద్వారా ఎంత విధ్వంసం సంభవిస్తుందో తెలుసుకోవడం, తెలియజెప్పడం ఈ వాదం ముఖ్య ఉద్దేశ్యం. ప్రకృతి విధ్వంసం ద్వారా జీవావరణ అసమతుల్యతకు కారణమౌతున్న ప్రతి చోటా ప్రతి సందర్భంలో ప్రకృతి పరిరక్షణ కోసం జరిగే అనివార్య సంఘర్షణలో పర్యావరణ వాదం పీడితుల గొంతు వినిపిస్తుంది. వారికి అండగా నిలబడుతుంది. న్యాయం కోసం పోరాడుతుంది. ప్రకృతిని సంరక్షించే బాధ్యత మనిషిదే. అందుకే ఈ ధోరణిలో వచ్చిన కొన్ని ఆధునిక కథలను వివిధ పర్యావరణ అంశాల ఆధారంగా వర్గీకరణ చేసుకుని, పర్యావరణ విమర్శలోని వివిధ రకాల తాత్త్విక కోణాలైన పర్యావరణవాదం (Environmentalism) క్లైమేట్ ఫిక్షన్ (Climatic fiction) మానవ కేంద్రీకరణ (Anthropocentrism) పర్యావరణ కేంద్రీకరణ (Eco-Centrism), గుప్త పర్యావరణ అధ్యయనం (Deep Ecology) పర్యావరణ అక్షరాస్యత (Eco–Literacy) వలసవాదనంతర పర్యావరణ విమర్శ(Postcolonial Ecocriticism) పర్యావరణ స్త్రీవాదం (Eco-feminism), పర్యావరణ ప్రాంతీయవాదం (Environmental Regionalism) వంటి కొన్ని అంశాలను ఆధునిక తెలుగు కథకులు సృశించిన తీరును పరిశీలించడం జరుగుతుంది. దీనికోసం ఇంతకముందు ‘ప్రకృతి వైపరీత్య కథలు-పరిశీలన’ పేరుతో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సుధాకర్ కురువ చేసిన సిద్ధాంత గ్రంథం అలాగే ఆర్.సీతారాంగారు చేసిన ‘ప్రజా వాగ్గేయ సాహిత్యం పర్యావరణ తత్త్వం’(యూజిసి మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్) ప్రాథమిక ఆధారాలు చేసుకుని ద్వీతీయ ఆధారాలుగా ఆధునిక తెలుగు కథకులు రాసిన కొన్ని కథలను విషయ ఆధారంగా ఈ వ్యాసంలో ఉపయోగించాను. ఈ వ్యాసం ద్వారా ఆధునిక తెలుగు కథకులు పర్యావరణ పరిరక్షణ కోణాన్ని తమ కథల్లో ఏ విధంగా చిత్రిస్తున్నారు? ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? పర్యావరణ సమస్యలను ఎటువంటి పరిష్కార మార్గాలను వారు ఎన్నుకుంటున్నారు? అనే విషయాలను విశ్లేషించడమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్యం. ఈ వ్యాసం కేవలం పర్యావరణ వాదం తీసుకువచ్చిన కొన్ని పర్యావరణ విమర్శలోని పైన పేర్కొన్న వివిధ రకాల తాత్త్విక అంశాల ఆధారంగా మాత్రమే విశ్లేషించడం జరిగింది.
Keywords: పర్యావరణవాదం, పర్యావరణ కథలు, క్లైమేట్ ఫిక్షన్, మానవ కేంద్రీకరణ, పర్యావరణ కేంద్రీకరణ, పర్యావరణ విమర్శ, తెలుగు కథలు.
1. ఉపోద్ఘాతం:
ఆధునిక ప్రపంచంలో అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్లుగానే పర్యావరణంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచం యాంత్రిక యుగంగా ఎప్పుడైతే మారిందో అప్పుడే పర్యావరణం కూడా కలుషితం కావడం ప్రారంభమైంది. ఈ సృష్టిలోని ప్రాణులన్నింటిలో బుద్ధిజీవి మానవుడు. కానీ, బుద్ధిగలిగిన మనిషే నేడు మితిమీరిన స్వార్థంతో ప్రకృతి, సృష్టిలోని సమతౌల్యం దెబ్బతినడానికి కారణమవుతున్నాడు. ప్రకృతిశక్తులను విచక్షణారహితంగా వాడుతూ పర్యావరణ కాలుష్యానికి దోహదపడుతున్నాడు. అందువల్ల నేటి సామాజిక సమస్యలలో అతి ప్రధానమైనది పర్యావరణ కాలుష్యం. ఈ సమస్యను గుర్తించిన ఎందరో రచయితలు తమ రచనలద్వారా పర్యావరణ స్పృహను తీసుకొస్తున్నారు. నేడు సాహిత్యంలో అత్యంత విలువైన వస్తువు పర్యావరణం కావడంవల్ల తమ రచనలద్వారా పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చైతన్యం కలిగిస్తున్నారు. ప్రజలను జాగృతం చేస్తున్నారు. దీనిలో భాగంగా వచ్చిందే పర్యావరణ వాదం. ప్రకృతి విధ్వంసం ద్వారా జీవావరణ అసమతుల్యతకు కారణమౌతున్న ప్రతి చోటా ప్రతి సందర్భంలో పాంచభౌతికమైన ప్రకృతి పరిరక్షణ కోసం జరిగే అనివార్య సంఘర్షణలో పర్యావరణ వాదం పీడితుల గొంతు వినిపిస్తుంది. వారికి అండగా నిలబడుతుంది. న్యాయం కోసం పోరాడుతుంది. ప్రకృతిని సంరక్షించే బాధ్యత మనిషిదే. అందుకే ఈ ధోరణిలో వచ్చిన కొన్ని కథలను వివిధ పర్యావరణ వాద అంశాల ఆధారంగా వర్గీకరణ చేసుకుని, పర్యావరణ విమర్శలోని వివిధ రకాల తాత్త్విక కోణాలైన వంటి వాటిని తెలుగు కథకులు సృశించిన తీరును పరిశీలిస్తూ, అలాగే తెలుగు కథకులు పర్యావరణ పరిరక్షణ కోణాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? పర్యావరణ సమస్యలను ఎటువంటి పరిష్కార మార్గాలను వారు ఎన్నుకున్నారు? అనే విషయాలను విశ్లేషించడమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్యం.
2. పర్యావరణవాదం (Environmentalism):
పర్యావరణవాదం మౌలికంగా పర్యావరణ పరిరక్షణపై మాత్రమే కాక, ప్రకృతి విధ్వంసానికి దారితీసే మానవ కార్యకలాపాలను నిరసించడం, ప్రకృతిని సంరక్షించేందుకు పరిష్కార మార్గాలను సూచించడం వంటి అంశాలను ప్రాధాన్యతనిస్తుంది. ఇది ప్రకృతి విధ్వంసానికి బాధితులైన సముదాయాల గొంతుకగా నిలుస్తుంది. “పర్యావరణవాదం ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రకృతి పరిరక్షణను ప్రోత్సహించే భావన. ఇది ప్రాణ నష్టం, జీవావరణ అసమతుల్యత, మరియు మానవతాపరమైన ఆవశ్యకతలపై దృష్టి పెడుతుంది” (Glotfelty & Fromm,1996). ఈ సిద్ధాంతం ప్రకృతి పరిరక్షణను మానవ బాధ్యతగా పేర్కొంటుంది. ఈ సిద్ధాంతానికి అనుగుణంగా పాలగుమ్మి పద్మరాజు రాసిన “గాలివాన” కథలో తుఫాన్ వల్ల చిన్న రైల్వేస్టేషన్‌లో చిక్కుకున్న రామ గారి పరిస్థితిని రచయిత క్లిష్టంగా చిత్రించారు. ధనవంతుడైన రామ గారు తాను అసహ్యించుకున్న బిచ్చగత్తె ప్రాణత్యాగం వల్లే బతికి బయటపడతారు. ఈ కథ ప్రకృతి వైపరీత్యాలు మనిషి ప్రవర్తన, నైతికత, సమాజ ఆచారాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలిపే ఒక ఉదాహరణ. మరొక వైపు వడలి రాధాకృష్ణ రాసిన “మరో ఉప్పెన” కథ. సునామీ తరువాత అనాథగా మారిన పిల్లవాడి దుస్థితిని ప్రతిబింబిస్తుంది. ఇతనే ఉప్పెన పైన “మలయమారుతం”, ‘సంభవామి’ వంటి కథలు కూడా రాశాడు. ఇలాంటి కథలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే మానవీయ సంక్షోభాలను వివరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే ఈ కథలు పర్యావరణవాద సిద్ధాంతానికి అనుగుణంగా ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యతను తెలియజేశాయి.
3. వాతావరణ కల్పన (Climatic fiction):
క్లైమేట్ ఫిక్షన్ ఊహాజనిత కల్పన అనేది వాతావరణ సమస్యలను, సమీప భవిష్యత్తులో వాతావరణ మార్పుల ద్వారా ఎదుర్కోవలసిన పరిణామాలను తమ కాల్పనిక రచనల ద్వారా ముందుగానే చూపించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్, ప్రకృతి వైపరీత్య సంఘటనలు మరియు పర్యావరణ పతనం వంటి మానవ ప్రేరిత పర్యావరణ మార్పుల వల్ల జరిగే వినాశకరమైన ప్రభావాలను క్లైమేట్ ఫిక్షన్ అన్వేషిస్తుంది. క్లైమేట్ ఫిక్షన్ ఒక ప్రత్యేకమైన సాహిత్య ప్రక్రియగా 21వ శతాబ్దం ప్రారంభంలో గుర్తింపు పొందింది, అయినప్పటికీ దాని మూలాలను అప్పటికే వున్న సాహిత్యంలో కొంత గుర్తించవచ్చు. “క్లై-ఫై” అనే పదాన్ని మొదట 2000ల చివరలో ‘డాన్ బ్లూమ్’ అనే అమెరికన్ పర్యావరణ రచయిత ప్రాచుర్యంలోకి తెచ్చారు. వాతావరణ మార్పులు, భూగ్రహంపై దాని విపత్కర ప్రభావాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే కల్పనను వర్గీకరించడానికి బ్లూమ్ ఈ పదాన్ని రుపోదించాడు. బ్లూమ్ ప్రకారం “క్లైమేట్ ఫిక్షన్ పాఠకులను భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల గురించి చైతన్యవంతం చేస్తుంది”(Bloom, D.(2015) సైన్స్-ఫిక్షన్ అంతరిక్ష అన్వేషణ మరియు సాంకేతిక పురోగతిపై ప్రజల అవగాహనలను రూపొందించడానికి ఎలా సహాయపడిందో, పర్యావరణ సమస్యల గురించి అవగాహన దానికి చేపట్టవల్సిన చర్యలు రెండింటినీ ప్రేరేపించే రచనలపై దృష్టి పెట్టడమే క్లైమేట్ ఫిక్షన్ ప్రధాన లక్ష్యంగా గుర్తించవచ్చు. ఈ ధోరణిలో తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత చిత్తర్వు మధు పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ లాంటి ముఖ్య విషయాల మీద పరిశోధించి రాసిన కథ “రెండు డిగ్రీలు”(2022). ఇది భూ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరగడం వల్ల రాబోయే తరాలు ఎలాంటి భవిష్యత్తును ఎదుర్కోబోతున్నారో, అవి మనతో పాటు సమస్త ప్రాణులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోందో తెలియజేసే కథ.
ఈ కథలో-
"నువ్వు ఎల్లిపో లక్ష్మీ, నీకు టికెట్ కొన్నాను. రెండు టికెట్ల డబ్బు కావాలి. కానీ ఐదు టికెట్ల డబ్బు... జీవితంలో దాచిందంతా వాళ్ళకి ఇచ్చేశాను. ఎల్లిపో! నా పని మాత్రం అయిపోయింది. నేను వచ్చినా బతకను అక్కడ! రావడం ఎందుకు? అంతరిక్ష నౌక టిక్కెట్టు తీసుకున్నాను, నీకు మాత్రం. ఈ విమానం నిన్ను అమెరికా తీసుకెళ్తాది. అక్కడ్నించి రెండు రోజుల్లో వేరే నౌకలో ఎక్కిస్తారు. వేరే గ్రహానికి ఎల్లిపోతావ్!"
అని చెబుతూ పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్ లో మానవులు చూడాల్సిన అనర్థాలను ఈ కథ రూపంలో చూపించారు.
అందుకే ప్రకృతిపై సరైన అవగాహనను పెంచుకుని మన పర్యావరణాన్ని సమస్త జీవకోటి కాపాడే ప్రయత్నం చేయాలన్న సందేశాన్ని ఈ కథ ద్వారా కల్పించారు. అలాగే మైనంపాటి భాస్కర్ రాసిన కథ “డీప్ ఫ్రీజ్”(1983) ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకొని 2050వ సంవత్సరం నాటి మానవ సమాజాన్ని సాంకేతిక పురోభివృద్ధిని ఊహించి రాసిన కథ. అలాగే మనిషి జీవితంలో రోబోలు ఎంతటి స్థాయికి చేరతాయి అని చెప్పే కథ ఇది. భారతదేశ జనాభా 2050వ సంవత్సరంనాటికి 3000 కోట్లు అవుతుందని అంచనా వేసి రాసిన కథ. ఇది జనాభా పెరగటంతో విపరీతమైన కాలుష్యంతో వ్యాధి నిరోధక దుస్తులు, ఆక్సిజన్ మాస్క్, చెవులకు ఫిల్టర్లు లేకుండా బయటకు రాలేని దుస్థితి మనుషులకు రాబోతుందని రాసిన కథ. చివరికి ఆరుబయట ఒక్క చెట్టు కూడా కనిపించదని కథలో ఎంతో ముందు చూపుతో రచయిత ఊహించి పాఠకులకు ఒక స్పృహను అందించాలనే ఉద్దేశ్యంతో రాసిన కథ. ఇలాంటి కథలు పర్యావరణ వాదంలోని క్లైమేట్ ఫిక్షన్ సాహిత్యానికి ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.
3.1 పాశ్చాత్య సాహిత్యంలో-వాతావరణ కల్పన:
పాశ్చాత్య సాహిత్యంలో ప్రకృతి వైపరీత్యాల ఆధారంగా చేసుకుని రాసిన క్లైమేట్ ఫిక్షన్ సాహిత్యం ఎంతో వచ్చింది. ముఖ్యంగా లావాలపైన, కార్చిచ్చులపైనా, ఉపగ్రహాల ఉపద్రవాలపైనా మరెన్నో చలన చిత్రాలు వచ్చాయి. వీటిలో 1951లో John Wyndham రాసిన ప్రసిద్ధమైన నవల ‘The day of the Triffids’ లో ఒక పెద్దతోక చుక్క భూమికి అతిదగ్గరగా రావడంతో దాని కాంతి ప్రభావానికి మనుషులందరికీ చూపుపోయి లోకం గుడ్డిదైపోతుంది. ఈ గుడ్డి సమాజంలో మనుషులు తమకు దొరికిన సాటి మనుషుల్నే చంపి భక్షించి, మానవజాతి నశించిపోతుంది. ఇలాంటి ఇతివృత్తమే కలిగిన కథను 1996లో Jose Saramago రాశాడు. ఆ కథ పేరు Blindness. ఒక వింత వ్యాధి వచ్చి అందరూ గుడ్డి వాళ్ళయి పోతే ఎలా వుంటుందో చెప్పే కథ ఇది. EM Forster రాసిన ప్రసిద్ధమైన నవల ‘The Mechine Stops'లో ఆధునిక టెక్నాలజీ వైఫల్యం మూలాన భూ ఉపరితలంమంతా జీవరాశి జీవనానికి పనికి రాకుండాపోతే మనుషులు భూమిలోపల నివాసాలేర్పాటు చేసుకుని నివశించే కథ వుంటుంది. అలాగే H.G Wells అనే రచయిత “Time Machine” అనే నవల రాశాడు. ఇందులో కాలాన్ని ఎనిమిది లక్షల సంవత్సరాల తర్వాత భవిష్యత్తులోకి తీసుకెళ్ళి అప్పుడు లోకం ఎలా ఉంటుందో చిత్రించాడు. ఇందులో ఆ కాలానికి మనుషులు రెండు రకాల పరిణామానికి గురై ఉంటారని చెబుతాడు రచయిత. అలాగే ఏలియన్స్ సృష్టించిన వైపరీత్యాల గురించి కూడా చాలా నవలలు, కథలు వచ్చాయి. ప్రాచీన బాబిలోనియన్ (Bobylonmen) సాహిత్యంలో క్రీ.పూ. 1500 నాటి ‘The Epic of Gilgamesh' లో భూలోంకపైన కోపగించుకున్న దేవతలు మనుషుల్ని చంపడానికి భూమిపైన వరదల్ని సృష్టించి బీభత్సానికి గురి చేస్తారు. అలాగే Aliens పైన వచ్చిన నవల “The screw fly solution (1997)” ‘Nebula’ పురస్కారం కూడా లభించింది. 1995లో జపాన్లోనే వచ్చిన భూకంపంపైన ‘Haruki murakami’ (హరూకీ మురకామి) 'After the Quake' పేరుతో ఆరు కథలను జపనీస్ భాషలో ముద్రించగా దీన్ని 'J Rubin' ఆంగ్లంలోకి అనువదించాడు. ఇలా పాశ్చాత్య సాహిత్యంలో ప్రకృతి వైపరీత్యాలపైన ఇలా వివిధ సాహిత్య ప్రక్రియ రూపాల్లో వచ్చింది. కానీ, భారతీయ సాహిత్యంలో ఈ తరహ రచనలు చాలా తక్కువే అయితే ఆంగ్ల సాహిత్యంలో ఈ వైపరీత్యాలు సైన్స్-ఫిక్షన్ రూపంలోనే ఎక్కవగా చిత్రింపబడ్డాయి. ప్రఖ్యాత పరిశోధక రచయిత అయిన రాహుల్ సాంకృత్యాయన్ మంచుయుగాన్ని గురించి తన ‘ఋగ్వేదార్యుల’'లోనూ ఆ యుగంలో మంచుకు తట్టుకొని జీవించిన మనుషుల జీవిత విధానం గురించి, మనుగడ కోసం వారు సాగించిన పోరాటాల గురించి ‘ఓల్గా నుంచి గంగకు’ అన్న పేరుతో కథల రూపంలోను మనకు అందించాడు.
4. మానవ కేంద్రీకరణ (Anthropocentrism)
మానవ కేంద్రీకరణ ప్రకృతి అంతా మానవ అవసరాల కోసం ఉందన్న భావనను ప్రోత్సహిస్తుంది. ఇది ప్రకృతి ఆధిపత్యాన్ని మానవులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి మాత్రమే అనే ధోరణిని ప్రతిబింబిస్తుంది. మానవ కేంద్రీకరణ ప్రకృతి వనరులను స్వార్థపరంగా వినియోగించే మానవ ఆలోచనను ప్రశ్నిస్తుంది. “మనిషి ప్రకృతిని వినియోగానికి మాత్రమే పరిమితం చేయడం, అది ప్రకృతి విధ్వంసానికి దారితీస్తుంది. ఇది మానవ ధోరణిని ప్రశ్నిస్తాయి” (Sankaran, 2021) అని చెబుతుంది. ముఖ్యంగా ఇది ఇతర జీవుల హక్కులను ఉల్లంఘించే మనుషుల ప్రవర్తనపై దృష్టి సారిస్తుంది. విదేశీ పంటలను ఆహ్వానించి వాటిద్వారా మననేల, నీరు, గాలివంటి వాటన్నింటినీ కలుషితం చేసుకుంటూ మనపైన మనకే హక్కులేని పరిస్థితిని మన ప్రభుత్వం కలిగించింది. ఈ నేపథ్యంతో పెద్దింటి అశోక్ కుమార్ “కీలుబొమ్మలు(2002)” అనే కథను రాశారు. సిరిసిల్ల ప్రాంతం సర్వాయి పల్లెలో గులాబీ పూలసాగును చేపట్టి వాటికి రసాయనిక మందులు స్ప్రే చేయడంవల్ల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిన తీరుని చూపించారు.
పెద్దింటి రాసిన ఈ కథలో "పల్లెలో పండిన ఏ పంటయినా పట్నాలకు పోతుంది. మన పంట మనకే నాగరికతను పులుముకుని అందమైన పాకెట్లలో ఎక్కువ రేటుకు తిరిగి వస్తుంది. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తదో తెలియదు" అని విదేశీ పంటల ఆధిక్యం వల్ల భారతీయ రైతులు ఎదుర్కొన్న పర్యావరణ సమస్యలను ప్రస్తావించారు.
విత్తనాల్లో రసాయనిక పదార్థాల వినియోగం భూమి ఉత్పాదకతను దెబ్బతీస్తూ ప్రకృతి వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించే తీరును చిత్రించారు. కస్తూరి మురళీకృష్ణ “మనిషి–మామిడి చెట్టు” కథలో మానవులు చెట్లను వనరులుగా మాత్రమే చూసి, వాటి పట్ల ప్రేమ లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారో వివరించారు. మనిషికీ చెట్టుకూ ఉన్న చక్కని అనుబంధాన్ని చెట్టునుండి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను బోధించారు. ఇలా మనిషి భూమిని తన స్వార్థ ప్రయోజనాలు, సుఖభోగాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. మన దేశంలో ప్రతి రోజూ 15 వేల టన్నుల కంటే ఎక్కువగా చెత్త ఉత్పత్తి అవుతోంది. వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు కొన్ని వందల సంవత్సరాల వరకు భూమిలో నాశనం కాకుండా నిల్వ ఉండి భూమి ఉత్పాదక శక్తిని తగ్గిస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) నివేదిక ప్రకారం “ఇండియాలో ఏటా యాభై ఆరు లక్షల టన్నుల చెత్త పోగు పడుతోంది” ఇలా 2020 నాటికి పేరుకునే 12-బిలియన్ టన్నుల చెత్తని శుభ్రపరచడానికి వందల సంవత్సరాలు పట్టవచ్చు. వీటన్నిటిని తెలుగు కథకులు గమనిస్తూ, తమ కథ రచనల్లో కాలుష్యం ద్వారా ఏర్పడే ద్రుశ్ప్రభావాలను వాటికి కోసం మనం మార్చుకోవాల్సిన ఆలోచన విధానాన్ని కథను ఒక వారధిగా చేసుకుని తెలియజేశారు.
5. పర్యావరణ కేంద్రీకరణ (Eco-centrism):
ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడటానికి ప్రతి జీవికీ సమాన ప్రాధాన్యత ఉండాలనేది దీని మౌలిక భావన. ఈ సిద్ధాంతం ప్రకృతిలో ప్రతి జీవి సమానమైన ప్రాధాన్యాన్ని పొందాలని భావిస్తుంది. “ప్రకృతి సమతౌల్యానికి ప్రతి జీవికి సమానమైన హక్కులు అవసరం. ప్రతి జీవి మన వ్యవస్థలో ముఖ్య భాగం” (Glotfelty & Fromm, 1996). ఇది మానవులు ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడే ప్రయత్నాలు చేయాలని ఉద్ఘాటీస్తుంది. ఇదే విషయాన్ని పరిశుభ్రత పేరిట, నాగరికత పేరిట పిచ్చుకలు పెట్టే గూళ్ళను ఊడబీకడం ఎంత కారుణ్యరాహిత్యమో తెలియజేస్తూ రాసిన మరోకథ సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి “పిట్టపాట”(2008). ఈ కథలో పిట్టలు తమ గూళ్ళను నిర్మించడంలో ఎదుర్కొంటున్న సమస్యలను రచయిత హృద్యంగా వివరించారు.
“ప్రభుత్వ గృహాల పుణ్యమా అని వూరంతా స్లాబు మిద్దెలయ్యాయి. మాలాంటి నాలుగైదు పాత దంతెల మిద్దెలుతప్ప ఒక్క బోదకొట్టం కూడా పిచ్చుకలకు మిగల్లేదని” చెబుతూ మానవుల నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రకృతి జీవరాశులు తమ సంరక్షణ కోల్పోతున్నాయని ఈ కథలో తెలియజేశారు.
ప్రకృతిలో జీవుల మధ్య సమతౌల్యం నెలకొని ఉంది. అలాగే నేడు మానవతప్పిదాలవల్ల ప్రకృతి వైపరీత్యాలవల్ల జీవులన్నీ నశించి సమతూకం చెడిపోతూ ఉంది. భూతాపం పెరిగిపోయి జీవులకు నీటి కొరత, మరోవైపు ఆహారం దొరకక అవి నివసించడానికి తగిన వసతులులేక అంతరించిపోతున్నాయి. ప్రకృతికి అందాన్నిచ్చే రంగురంగుల పిట్టలు, వన్యప్రాణులు, గర్జించే మృగరాజులు, కనులకు విందుచేసే నెమలి నాట్యాలు, లేళ్ల గంతులు, పచ్చిక బయళ్ళు ఇవన్నీ చూస్తుండగానే కనుమరుగైపోతున్నాయి. దీనికి మానవ తప్పిదాలు ఒక కారణంకాగా భూతాపం మరోకారణమై నీటికొరతతో, అడవుల నాశనంతో వన్యప్రాణులన్నీ మాయమవుతున్నాయంటూ పాపినేని శివశంకర్ “చివరి పిచ్చిక” కథలో పరిశుభ్రత పేరుతో పిచ్చుకల గూళ్ళను తొలగించడం వల్ల పిట్టల జీవన పరిస్థితులు ఎలా దెబ్బతిన్నాయో వివరించారు. ఈ కథలో పిచ్చుకలు కనుమరుగవడం వల్ల ప్రకృతిలో సమతౌల్యం ఎలా దెబ్బతింటుందో వివరించి పర్యావరణ కేంద్రీకరణ ఎలా అవసరమో తెలియజేశారు.
6. గుప్త పర్యావరణ అధ్యయనం (Deep Ecology):
మానవుడు ప్రకృతిపై ఆధిపత్యం చూపకుండా ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడాలి అన్న భావన దీనిలో ప్రధానంగా కనిపిస్తుంది. ప్రకృతిని మానవ అవసరాలకు మాత్రమే పరిమితం చేయకుండా, దానిని సంరక్షించడం మానవుల ప్రాథమిక బాధ్యత అనేది దీనిలో ఒక భాగం. “ప్రకృతిలో మానవ కార్యకలాపాలు తగ్గితేనే భూమి మనుగడ నిలుస్తుంది” అని చెప్పడం దీనిలో ముఖ్యమైన అంశం. ఈ అంశాన్ని తెలియజేస్తూ డా.కాలువ మల్లయ్య రాసిన “గ్లోబలైజేషన్”(2003) కథలో గ్లోబలైజేషన్ ప్రకృతికి ఎంతటి నష్టం చేస్తుందో ప్రస్తావించారు. పశువులు ప్లాస్టిక్ తినడం ద్వారా వాటి కలిగే ప్రాణ నష్టాలను ఈ కథలో వివరించారు. ప్రధానంగా పాలిథిన్ వాడకంపై ఉండే మోజును వాటి వల్ల జరిగే నష్టాన్ని తెలియజేస్తూ రాసిన కథ ఇది. గ్లోబలైజేషన్ ద్వారా సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ఆమార్పుల వల్ల స్నేహితుడి పెళ్లిలో వాడిన పాలిథిన్ కవర్లు, గ్లాసులు, విస్తర్లు, కాగితాలు వంటి చెత్తాచెదారాన్ని ఆవు తినడం చూసిన అర్జున్ అదిలించడం, ఇవి తినడం వల్ల పశువులు మరణిస్తున్నాయనే ఆవేదన చెందటం, ఇది చూసిన స్నేహితుడు తింటే ఏమవుతుందని ప్రశ్నించడం, దానికి కడుపులోకి వెళ్ళిన ప్లాస్టిక్ తిరిగి బయటకురాదని దీనితో అటు పశువులకు ఇటు భూమికి కాలుష్యం పెరిగిపోతుందని చెప్పడమే ఒక భాద్యతగా చెప్పిన కథ. వాహనాల వలన వాయుకాలుష్యంతో పాటు ధ్వనికాలుష్యం కూడా పెరుగుతూ ఉంది. దీనివల్ల ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నారు. దీనినే తెలుగు కథకులు తమ కథల ద్వారా ప్రజలకు కనువిప్పు కలుగజేస్తున్నారు. వాహనాలు ఎడతెరిపి లేకుండా ప్రయాణించడం వల్ల వాటిద్వారా వచ్చే దుమ్ముతో శబ్దాలతో ప్రజలు పడే కష్టాలను తెలియజేస్తూ సలీం “రూపాయి చెట్టు” కథను రాశారు. ఈ కథలో మానవులు చెట్లను కాపాడే బదులు, వాటిని నిర్లక్ష్యంతో నాశనం చేయడం వల్ల ఏర్పడే పర్యావరణ దుష్ప్రభావాలను ప్రస్తావించారు. కథలో మానవ చర్యల వల్ల ప్రకృతి సమతౌల్యం ఎలా ప్రభావితమవుతుందో చెబుతూ ప్రకృతి అనేది కేవలం మానవ అవసరాలకు మాత్రమే పరిమితం కాదనే సందేశాన్ని ఇచ్చే వాటికి ఉదాహరణలు ఈ కథలు.
7. పర్యావరణ అక్షరాస్యత (Eco-literacy):
పర్యావరణ అక్షరాస్యత అనేది భూమిపై సుస్థిరమైన జీవితాన్ని సాధ్యమయ్యే పర్యావరణ వ్యవస్థలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. పర్యావరణానికి సంబంధించిన అంశాలను అర్థం చేసుకుని అవగాహన పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దీనినే మానవ జీవితానికి నీరే ఆధారం. నీటిచుట్టే నాగరికతలు వెల్లివిరిశాయి. నీళ్ళు కావాలి. నీళ్ళ గురించే కథలు, వాటి చుట్టూ అల్లుకున్న కలలు. వాటిని కథలు కథలుగా వివరించే తల్లావజ్ఝల పతంజలిశాస్త్రిగారి “కతలవ్వ” (2006) కథలో కరువు గురించి చెప్పిన ఓదార్పు పిల్లలకు రంగుల స్వప్నంలా వుంటుంది. కానీ, "బాగా ఎండలు గాస్తే మంచి వానలు పడేది. ఇప్పుడు ఎండలు తప్ప వానల్లేవు” అనే నిజం అంతకంటే భయంకరంగా ఉంటుంది. అలాంటిదే “కదిరమ్మ పేరంటాలు”(2006) కథలోని కదిరమ్మ పాత్ర కూడా. కరువుతో అప్పులు తీర్చలేక భర్త ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పు లేకుండా చేస్తామని నమ్మించి కొందరు కదిరమ్మ శీలంతో ఆడుకుని ఆమెను మోసం చేస్తారు. గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకున్న కదిరమ్మ చనిపోయి పేరంటాలు అవుతుంది. కదిరమ్మ బతికి వున్నప్పుడు అమ్మవారికి మొక్కుకుని వానలు కురిపించమనేది.
“కదిరమ్మ ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలు అద్దేరు. గుమ్మం ముందు రోజు ఎవరో ఒకరు తుడిచి ముగ్గులు పెడుతున్నారు. కదిరమ్మ కోరిపట్టుగా ప్రతీఏడాదీ గ్రామం కోసం, వర్షంకోసం, వివాహితుల మాంగల్యంకోసం కందిరమ్మ పేరంటాల సంబరాలు చేస్తున్నారు” ఇప్పుడు కదిరమ్మ పేరంటాలు అయిన
తర్వాత ప్రజలు వాన కురిపించమని ఆమెకు మొక్కుకుంటున్నారు. ఆమె శాంతిస్తేనే వానలు కురుస్తాయని వారి నమ్మకం. ఇలా కరువును, వర్షాభావాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే, ప్రజలు ఇలాంటి నమ్మకాలలోనే పెరుగుతాయని అవి అక్కడి ప్రజల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో వివరిస్తూ, కరువు పరిస్థితులు ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో తన కథల ద్వారా వివరించారు పతంజలిశాస్త్రిగారు.
పెరుగుతున్న జనాభావల్ల పారిశుద్ధ్యం లోపించి నీరు కలుషితమవుతూ నీటి కొరతకు కారణమవుతూ ఉంది. నీటివనరులైన చెరువులు, నదులు, సముద్రాలు వంటివి పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమవుతూ ఉన్నాయి. దానితో ఎన్నో సముద్రజీవులను కోల్పోతున్నాం. నీటిలో ఫ్లోరిన్ మోతాదు పెరిగి తాగునీటి కొరత ఏర్పడుతూ ఉంది. నీటికాలుష్యం వల్ల నీటి వ్యాపారం బాగా పెరిగిపోయింది. ఈ స్థితికి చలించిన కథకులు ప్రజల్లో అవగాహన పెంపొదించడానికి ఎన్నో కథలను రాశారు. అందులో ఒకటి ఒమ్మి రమేష్ బాబు రాసినకథ ‘మురికి’. నగరాలలో పారిశుద్ధ్యం లోపంవల్ల ప్రజలు పడే ఇబ్బందులను గురించి రాసిన కథ. రాజమండ్రి ఆర్టీసీ బస్టాండ్ లోపల ఒక హోటల్ పక్కనే నాలుగు కాకా హోటళ్ళు. ఈ హోటల్ నుండి పారబోసే వ్యర్థాలవల్ల అక్కడ ఉన్న స్థలం అసహ్యంగా అపరిశుభ్రతతో ఉంది. కాలువల్లో మురికితో నిండిన నీళ్లు. ఆ నీటిలో పొర్లుతున్న పందులు, కుక్కలు. హోటల్స్ నుండి వచ్చి చేరే మురికినీళ్లు. ఇంకోవైపు వ్యర్థ పదార్థాలతో కూడిన పారిశుద్ధ్యలోపంతో పాటు బండి రాముడు హోటల్ వల్ల ఏర్పడిన పెంటకుప్ప. మరోవైపు ఆ హోటల్లో మంచినీళ్ల బానకి పేరుకున్న నాచు. ఇది అక్కడి మంచినీటి పరిస్థితి. జనసంచారం ఉన్న ఇలాంటి చోట్ల అపరిశుభ్రతతో పాటు కాకాహోటల్స్ వల్ల మరింత పారిశుద్ధ్యంలోపం పెరుగుతూ ఉన్న స్థితిని రచయిత కళ్ళకు కట్టించారు. అక్కడి ప్రజల జీవనం ఎంత దుర్భరంగా ఉందో అయన కథలో వ్యక్తీకరించారు. జల కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం, జీవన విధానంపై చూపే ప్రభావాలను వివరించారు.
మన సంస్కృతిలో నదులను మాతగా పూజిస్తారు. కానీ, తల్లిగా భావించే గంగ, యమున, గోదావరి వంటి నదుల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా ఉంది. నివాస ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు, చెత్త చెదారం, పరిశ్రమల నుండి వచ్చే విషతుల్య రసాయనాలు నదులలో కలుస్తున్నాయి. దీని పర్యవసానంగా దేశంలో ఉన్న ప్రముఖ నదులన్నీ పెద్ద మురికి కాలువలుగా మారిపోయాయి. అందుకే నదులను కాపాడుకోవడానికి మనమంతా సంకల్పించాలి. ముఖ్యంగా నీటి కాలుష్యాన్ని అరి కట్టాలి. నీటి వినియోగాన్ని చిన్నతనం నుండే ఎలాంటి దృక్పథంతో చూడాలి అనే తెలివిడిని కథకులు తమ కథల ద్వారా పర్యావరణ వ్యవస్థలను అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నారు.
8. వలసవాదానంతర పర్యావరణ విమర్శ (Postcolonial Ecocriticism):
వలసపాలన, ఆధునిక జీవనశైలులు పర్యావరణంపై చూపే ప్రతికూల ప్రభావాలను విశ్లేషిస్తుంది. “వలసవాద జీవనశైలి ప్రకృతిని విధ్వంసానికి గురిచేశాయి”(James, George Alfred:2013) అనే భావనను ఇది ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తుంది. దీన్నే పెద్దింటి అశోక్ కుమార్ “కీలుబొమ్మలు” కథలో విదేశీ పంటల వల్ల స్థానిక ప్రకృతి ఎలా ప్రభావితమవుతుందో వివరించారు. విదేశీ పంటలను ఆహ్వానించి వాటిద్వారా మననేల, నీరు, గాలివంటి వాటన్నింటినీ కలుషితం చేసుకుంటూ మనపైన మనకే హక్కులేని పరిస్థితిని మన ప్రభుత్వం కలిగించింది. ఈ నేపథ్యంతో పెద్దింటి అశోక్ కుమార్ “కీలుబొమ్మలు” అనే కథను రాశారు. సిరిసిల్ల ప్రాంతం సర్వాయి పల్లెలో గులాబీ పూలసాగును చేపట్టి వాటికి రసాయనిక మందులు స్ప్రే చేయడంవల్ల ప్రజలు ఉక్రిబిక్కిరి అయిన తీరుని చిత్రించిన కథ ఇది. పెద్దింటి రాసిన ఈ కథలో విదేశీ పంటల ఆధిక్యం వల్ల భారతీయ రైతులు ఎదుర్కొన్న పర్యావరణ సమస్యలను ప్రస్తావించారు. విత్తనాల్లో రసాయనిక పదార్థాల వినియోగం భూమి ఉత్పాదకతను దెబ్బతీస్తూ ప్రకృతి వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించే తీరును చిత్రించారు. దీన్నే సుందర్ లాల్ బహుగుణ “ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ (నాశనంకాని జీవావరణ వ్యవస్థల సముదాయమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ)” అని అంటారు. ఇదే దృక్పథం శింగమాల సుబ్రహ్మణ్యంగారి ‘వెలుగుపూలు’ కథలలో మనకు కన్పిస్తాయి. ఈ కథా సంపుటిలో 16 కథలున్నాయి. ఈ కథలు మనకు ఒక కొత్త అనుభవాన్ని అందిస్తాయి. ఈ సంపుటిలోని ‘పర్యావరణ స్పృహ’ కథ ఈ కథలలో పైచేయిగా కనబడుతుంది. ప్రకృతి విధ్వంసానికి కారణమయ్యే ‘కెమికల్’ కంపెనీల కాలుష్యం, సహజ వనరుల కోసం సముద్ర తీరప్రాంతాలను ఆక్రమించుకుంటున్న వ్యాపార ధోరణిపై శక్తివంతమైన నిరసన వీరి కథల్లో చూస్తాం.
9. పర్యావరణ స్త్రీవాదం (Eco-feminism):
ప్రకృతిలో జరిగే విధ్వంసం మరియు మహిళల జీవనంపై దాని ప్రభావం మధ్య ఉన్న అనుబంధం తెలియజేసే ధోరణి. “మహిళల జీవితంలో ప్రకృతి విధ్వంసం తీవ్రమైన మార్పులు తేవడాన్ని ఇది సజీవంగా ప్రతిబింబిస్తుంది” (Glotfelty, 1996, పుట:54). తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి “కతలవ్వ” కథలో కరువు కారణంగా మహిళలు ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక సమస్యలు వివరించబడ్డాయి. తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి గారి “కతలవ్వ”(2006) కథలో కరువు గురించి చెప్పిన ఓదార్పు పిల్లలకు రంగుల స్వప్నంలా వుంటుంది. కానీ, నిజం అంతకంటే భయంకరంగా వుంటుంది. అలాంటిదే “కదిరమ్మ పేరంటాలు”(2006) కథలోని కదిరమ్మ పాత్ర కూడా. కరువుతో అప్పులు తీర్చలేక భర్త ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పు లేకుండా చేస్తామని నమ్మించి కొందరు కదిరమ్మ శీలంతో ఆడుకుని ఆమెను మోసం చేస్తారు. గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకున్న కదిరమ్మ చనిపోయి పేరంటాలు అవుతుంది. కదిరమ్మ బతికి వున్నప్పుడు అమ్మవారికి మొక్కుకుని వానలు కురిపించమనేది. ఇప్పుడు కదిరమ్మ పేరంటాలు అయిన తర్వాత ప్రజలు వాన కురిపించమని ఆమెకు మొక్కుకుంటున్నారు. ఆమె శాంతిస్తేనే వానలు కురుస్తాయని వారి నమ్మకం. కరువును, వర్షాభావాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే, ప్రజలు ఇలాంటి నమ్మకాలలోనే పెరుగుతాయని అవి అక్కడి ప్రజల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తన కథలో కదిరమ్మ పాత్ర ద్వారా పతంజలిశాస్త్రి చిత్రీకరించారు. అలాగే సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి “ఆకుపచ్చని మాయ”(2009) కథలో ప్రకృతి విధ్వంసం పేదరికంపై చూపే ప్రభావాన్ని చూపించింది.అదే కాకుండా ఇది ప్రపంచీకరణ ఫలితంగా మనిషి డబ్బు మాయలోపడి ప్రైవేట్ స్కూల్స్ లో చదివించాలనే తపనతో పిల్లలకి ఫీజులు కట్టలేక చెట్లని అమ్మాలనుకున్న కొడుకు ఆధారంగా రాసిన కథ. “ఇయ్యాల వాడు చెట్లమ్ముతడు. రేపు పొలాలమ్ముతడు. మొన్నాడు పిల్లోల్లిద్దరికీ చెరొక బొచ్చె చేతికిచ్చి అడుక్కోపొమ్మంటడు” అని పేదరికం ప్రభావంతో మద్యానికి బానిస అయిన భర్తతో రామయ్య కోడలు అనుభవించిన మనో వేదనను దీనిలో చిత్రీకరించాడు రచయిత. ఇవి ప్రకృతిలో జరిగే విధ్వంసం అది మహిళల జీవనంపై దాని ప్రభావాన్ని బలంగా తెలియపరిచే కథలు.
10. బయోఫిలియా (Biophilia):
పర్యావరణ విమర్శకు తెలుగు సాహిత్యం చేసిన ముఖ్యమైన కృషి మానవులకు, జంతువులకు మధ్య ఉన్న సంబంధాన్ని చిత్రించడం. ఇలా ఇతర జీవజాతుల పట్ల మనిషికి సహజంగా ఉండే కుతూహలాన్ని శాస్త్రంలో ‘బయోఫిలియా’(Biophilia) అంటారు. బయోఫిలియా అనే పదం గ్రీకు నుండి ఉద్భవించింది, ‘ఫిలియా’ అంటే ‘ప్రేమ’. ఇది అక్షరాలా జీవితం లేదా జీవుల పట్ల ప్రేమ అని అర్థం. మానవులు ప్రకృతి పట్ల లోతైన ప్రేమను కలిగి ఉంటారు. ఇది మానవుల DNAలో అంతర్గతంగా కలిగే ఉండే ఒక సహజమైన ప్రక్రియ. ప్రకృతిలో జీవుల మధ్య సమతౌల్యం నెలకొని ఉంది. కానీ, నేడు మానవతప్పిదాలవల్ల, ప్రకృతి వైపరీత్యాలవల్ల జీవులన్నీ నశించి సమతూకం చెడిపోతూ ఉంది. భూతాపం పెరిగిపోయి జీవులకు నీటి కొరత, మరోవైపు ఆహారం దొరకక అవి నివసించడానికి తగిన వసతులులేక అంతరించిపోతున్నాయి. ప్రకృతికి అందాన్నిచ్చే రంగురంగుల పిట్టలు, వన్యప్రాణులు, గర్జించే మృగరాజులు, కనులకు విందుచేసే నెమలి నాట్యాలు, లేళ్ల గంతులు, పచ్చిక బయళ్ళు ఇవన్నీ చూస్తుండగానే కనుమరుగైపోతున్నాయి.
ఈ బయోఫిలియా నేపథ్యంలో జంతుజాలంతో కలిసి మనిషి సాగించిన మనుగడను ఆధారంగా చేసుకుని ప్రముఖ కథకులు ఖదీర్ బాబుగారి “తెలుగు లోగిళ్ల పశుపక్షాదుల సమజీవన కథలు”(ఖదీర్ బాబు:2022) సంపాదకత్వంలో వచ్చిన కథల్లో గమనించవచ్చు. ఈ సంపాదకత్వంలోని కథలు, మానవులు మరియు జంతువుల మధ్య ఉన్న సంబంధాలను ఆధారంగా చేసుకుని రాసినవే. ప్రతి కథలో జంతువులు, పక్షులు లేదా మూగజీవులు ఒక పాత్రగా, వారి ప్రవర్తన, మనుషులతో వాటి సంబంధాలు, అవగాహన, ఆత్మీయత వంటి అంశాలను వాస్తవంగా చిత్రీకరించాయి. కొడవటిగంటి కుటుంబరావు రాసిన “పిల్లి కథ”లో ఒక ఇంటి యజమానికి పిల్లి పట్ల పెద్దగా ఇష్టం ఉండదు. కానీ, పిల్లి గుణాలు తెలిసిన తర్వాత, దానితో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడకపోయినా, సర్దుబాటు చేసుకుంటాడు. అలాగే, కె.ఎన్.వై. పతంజలి రచించిన “సీతమ్మ ఇల్లు”కథలో ఇష్టంగా పెంచుకున్న అడవి పందిని మిగతావారు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లనే దాని జీవితం ఓ విషాదకావ్యంగా ముగుస్తుంది. జంతువుల జీవన శైలిని మనిషి సంస్కృతితో అనుసంధానిస్తూ పి.రామకృష్ణారెడ్డి “మనిషీ పశువు” కథలో రాయలసీమలో పశువులు, గొర్రెలు ఇంట్లోనే పెంచుకునే ఆచారం సరైనదేనా అన్నదానిపై చర్చ జరుగుతుంది. అదే విధంగా కురబల జీవన విధానం గురించి ‘రప్పాలు’ అనే కథ మనకు నాటి జీవితాన్ని, నేటి పరిస్థితులను వివరిస్తుంది.
వేంపల్లి గంగాధర్ రచించిన “యామయ్యసామి గుర్రం”కథలో యామయ్యసామి అనే వ్యక్తి గుర్రంపై చేసే సాహసాల వెనుక, చివరికి గుర్రం ఒంటరిగా మిగిలే విషాదం వ్యక్తమవుతుంది. ఇదే తరహాలో, ఎండ్లూరి సుధాకర్ ‘నవాబు గుర్రాన్ని నాట్యమాడించిన దరువు’ కథలో గుర్రం, డప్పు దరువు ద్వారా ఒక కొత్త చైతన్యం సృష్టించిన తీరు వ్యక్తమవుతుంది. త్రిపురనేని గోపిచంద్ “అర్రు కడిగిన ఎద్దు”, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు “మా ఆవు వంటిదే మా అమ్మ”, పెద్దింటి అశోక్ కుమార్ “మాయిముంత”, కాట్రగడ్డ దయానంద్ “బాతులమ్మి”, చక్రవేణు “కసాయి కరువు”, ఖదీర్బాబు “సుకీ” వంటి కథలు మనిషి, జంతువుల అనుబంధాన్ని వివిధ కోణాల్లో వ్యక్తపరిచే ప్రయత్నం చేసి మనషులు వాటిని కూడా మనతో పాటే సమానంగా చూడాల్సిన ఆవశ్యకతను తెలియజేశాయి. ఈ భూప్రపంచం దాని మీద పుట్టిన ప్రతి ఒక్క జీవికి తనదైన బతుకును బతికే స్వేచ్ఛను ఇచ్చింది. ఈ భూప్రపంచం ప్రతి ఒక్కజీవిని మరొకజీవి ఉనికి పట్ల ఎరుకను కలిగి ఉండమని చెబుతున్నది. విభేదం ఉన్నా అంగీకారంతో మెలిగే అవకాశం తప్ప ఈ భూప్రపంచంలో జీవించే పద్ధతి మరొకటి లేదు. కానీ, ఇలా మనిషి తన స్వార్థంకోసం ప్రతీదాన్ని కలుషితం చేస్తూ జీవులను నాశనంచేస్తూ ప్రకృతి సమతౌల్యాన్ని చెడగొడుతున్నాడు. ప్రకృతి విలయతాండవం చేయడానికి కారణమవుతున్నాడు. తన మనుగడకే ముప్పు తెచ్చుకుంటున్నాడు కనుక స్వార్థాన్ని వదలి పర్యావరణాన్ని పరిరక్షించాలి. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, ఆచరిస్తేనే ఈ భూమి, భూమిపై మనిషి మనుగడ స్థిరమవుతుందని బయోఫిలియా నేపథ్యంగా వచ్చిన కథలు సూచిస్తున్నాయి.
11. పర్యావరణ ప్రాంతీయవాదం (Environmental Regionalism):
పర్యావరణ ప్రాంతీయవాదం అనేది ఒక భౌగోళిక ప్రాంతంలోని దేశాలు భాగస్వామ్య పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి కలిసి పనిచేసే సహకార విధానాన్ని సూచిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన ఆ ప్రాంతంలోని కాలుష్యం, జీవవైవిధ్య నష్టం మరియు వాతావరణ మార్పుల వంటి సమస్యలను పరిష్కరించడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తుంది. తెలుగులో ప్రాంతీయ స్పృహతో ముఖ్యంగా రాయలసీమ నుంచి చాలా కరువు కథలు వచ్చాయి. జి. రామకృష్ణ 'గంజి కేంద్రం', కె.సథ ‘పాతాళగంగ’, కేతువిశ్వనాథరెడ్డి ‘నమ్ముకున్న నేల’, సింగమనేని ‘అదుసు’, స్వామి ‘నీళ్ళు’, శాంతినారాయణ ‘కల్లమైపాయ’, రాసాని ‘బతుకాట’ నవల ‘జలజూదం’ నాటిక కరువు గురించిన రచనలే, కర్నూలుకు చెందిన పోతన్న, అజీజ్, జి. వెంకటక్రిష్ణ, సుభాషిణీ, హరికిషన్, ఉమామహేశ్వర్, ఇనాయతుల్లా, సన్నపరెడ్డి వెంకట్రామిరెడ్డి ‘కొత్తదుప్పటి’ రాసాని ‘పాలగొడ్డు’ తాలుగింజలు, చక్రవేణు ‘కసాయి కరువు’, రామచంద్రమౌళి ‘భూమిదుఃఖం’ వంటి కథలు, కొలకలూరి ఇనాక్, ‘సర్కారు గడ్డి నవల’ పాణి, కె. ఎన్. ఎస్. రాజు లాంటివారు ఆ మధ్యన కర్నూలును ముంచి వేసిన అకాల వరద నేపథ్యంతో కథలు వ్రాశారు. వీటిలో కొన్ని కథల్ని తీసుకొని కె.ఎన్.ఎస్. రాజు ‘ఉగ్రతుంగభద్ర’ పేరుతో సంకలనంగా కూడా తెచ్చారు. ఈ కథల్లో వరద గురించే తెలియని కర్నూలు ప్రజలు అకాల వరదల్లో చిక్కిపడిన కష్టాలు వర్ణించబడ్డాయి. బెళ్ళూరి శ్రీనివాసమూర్తి ‘తపోవనం’ విద్వాన్విశ్వం ‘పెన్నేటిపాట’ కరువుపైన వచ్చిన కొన్ని రచనలు ఉన్నాయి. తెలుగులో ఈ కథలన్ని ప్రకృతి వైపరీత్యాల గురించి ముఖ్యంగా మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడే పర్యావరణ సంక్షోభం ద్వారా ఏర్పడే వివిధ పరిణామాలను ఆధారం చేసుకుని ముఖ్యంగా ఒక ప్రాంతీయ పరమైన పర్యావరణ సమస్యలను కేంద్రంగా చేసుకుని వచ్చినవి.
12. ముగింపు:
పర్యావరణవాదం అనేది పర్యావరణానికి హాని కలిగించే మానవ కార్యకలాపాలలో మార్పుల ద్వారా సహజ పర్యావరణపు నాణ్యతను మెరుగుపరచడానికి లేదా రక్షించడానికి ప్రయత్నించే రాజకీయ మరియు నైతిక ఉద్యమం. మానవులు పర్యావరణాన్ని అనుకూలమైనవిగా భావించే రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థ రూపాలను స్వీకరించడం అలాగే ప్రకృతితో మానవాళికి ఉన్న సంబంధాన్ని పునఃసమీక్షించడం. ఇవే కాకుండా రాజకీయ, ఆర్థిక, సామాజిక విధానాల నైతికత గురించి తర్కించడం ద్వారా మానవులే కాకుండా ఇతర జీవులు, మొత్తంగా సహజ పర్యావరణం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ పర్యావరణవాదం తెలియజేస్తుంది. తెలుగు కథకుల కథల ఆధారంగా పై వ్యాసంలో ఈ విషయాలన్ని ప్రాథమికంగా వ్యక్తం అయినట్లు మనం గమనించవచ్చు. అలాగే-
- తెలుగు కథకులు ఆధారంగా రాసిన ఈ వ్యాసం ద్వారా కథకులు పర్యావరణ సంబంధిత రచనలను వారు పర్యావరణ వాదనికి అవసరమైన ఎరుకను కలిగి ఉన్నారా? లేదా వారు కేవలం పర్యావరణ స్పృహ అనే దాన్ని మాత్రమే కలిగి ఉన్నారా? అనే మౌలికమైన భావనను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది.
- తెలుగు రచయితలు తెలిసో, తెలియకో పర్యావరణ వాదంలోని తాత్త్వికపరమైన అంశాలను తమ రచనల్లో అంతర్గతంగా ఇమిడించే, పర్యావరణ పరమైన రచనలు చేస్తున్నట్లు ఈ వ్యాసం ద్వారా అర్థమవుతుంది.
- పర్యావరణ వాదంలోని తాత్త్వికపరమైన అంశాలను, తెలుగు కథ సాహిత్యంతో కొత్తగా అన్వయించడానికి అవకాశం ఉందని చెప్పడానికి ఈ వ్యాసం వీలు కల్పిస్తుంది.
- తెలుగు కథకులు తమ కథల ద్వారా పర్యావరణ అక్షరాస్యత పెంపోదిస్తూ ప్రకృతితో మానవాళికి గల సంబంధాన్ని మరింత మెరుగు పరచడంలో కృషి చేస్తున్నారనే విషయం ఈ వ్యాసం ద్వారా వ్యక్తమవుతుంది.
- తెలుగు కథకులు ఆధునిక పర్యావరణవాద తాత్త్విక ధోరణులను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ వ్యాసం బహిర్గతం చేస్తుంది.
- కవి లేదా రచయిత ఉన్న ప్రాంతం లేదా స్థలం వారి పర్యావరణ రచనకు అవసరమైన ప్రాపంచిక దృక్పథం రూపుదిద్దుకోవడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని తెలుస్తుంది.
- పర్యావరణ వాదం రచయిత ఏ పరిసరాల్లో పెరిగాడు, ఏయేచోట్ల ఆ రచయిత ప్రయాణించాడు? ఏ స్థలం, ప్రాంతంనుండి రాశాడు అనేది కూడా పరిగణన తీసుకుంటుంది.
13. సూచికలు:
- Dan Bloom (2015, July 27) Can “Cli-Fi” Help Keep Our Planet Livable?
- మధు చిత్తర్వు (2022, April 01). రెండు డీగ్రీలు.
- భాస్కర్ మైనంపాటి.(1983, May 11). డీప్ ఫ్రీజ్.
- అశోక్ కుమార్, పెద్దింటి. (2002,Nov01). కీలుబొమ్మలు.
- World Econoic Forum. (2016, Jan 6). What are the hottest new consumer gadgets?.
- వెంకటరామిరెడ్డి, సన్నపురెడ్డి.(2008, April 1). పిట్టపాట.
- పతంజలిశాస్త్రి, తల్లావజ్ఝల. (2006, Aug 1). కతలవ్వ.
- Glotfelty, 1996, పుట:64.
- పతంజలిశాస్త్రి, తల్లావజ్ఝల. (2006, Aug 1). కదిరమ్మ పేరంటాలు.
- వెంకటరామిరెడ్డి, సన్నపురెడ్డి.(2009, Sep 01). ఆకుపచ్చని మాయ.
- James, George Alfred:2013
- James, 2013, పుట.89.
14. ఉపయుక్తగ్రంథసూచి:
- ఖదీర్ బాబు మహమ్మద్(2022) తెలుగు లోగిళ్ల పశుపక్షాదుల సమజీవన కథలు. హైదరాబాద్: కావలి ప్రచురణలు.
- సీతారాం, ఆర్. ప్రజా వాగ్గేయ సాహిత్యం పర్యావరణ తత్త్వం (యూజిసి మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్)- అముద్రితం.
- సుధాకర్ కురువ.(2020). ప్రకృతి వైపరీత్య కథలు-పరిశీలన. (అముద్రిత సిద్ధాంత గ్రంథం). శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి.
- Bloom, D. “Can ‘Cli-Fi’ Help Keep OurPlanet Livable?” @Clificentral Blog, 2015, Link
- Cheryll Glotfelty, Harold Fromm. (1996). The Ecocriticism Reader: Landmarks in Literary Ecology: University of Georgia Press.
- Lovelock J (2014). A Rough Ride to the Future. Penguin UK
- Rangarajan swarnalatha. Edited by Scott Slovic. (2018). Eco criticism-Big ideas and practical strategies. Hyderabad: Orient Blackswan.
- Sankaran, C. (2021). Women, Subalterns, and Ecologies in South and Southeast Asian Women's Fiction. Greece: University of Georgia Press.
- James, G. A. (2013). Ecology Is Permanent Economy: The Activism and Environmental Philosophy of Sunderlal Bahuguna. United States: State University of New York Press.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.