headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-06 | Issue-02 | February 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed

9. సవరకుడ్యచిత్రాలు: సంస్కృతి - కళాత్మకత

(Ethnolinguistics Portrayal: A Comparative Study of Savara and Gondi Tribal Paintings - ICSSR ప్రాజెక్టు)

DOI

వేదాంతం మురళీధర్

ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ఐ.సి.ఎస్.ఎస్.ఆర్. ప్రాజెక్టు,
భాషాశాస్త్రశాఖ, ఉస్మానియావిశ్వవిద్యాలయం,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9704068780,
Email: vmdhar78@gmail.com

డా. కొర్రా బాలు నాయక్

అసిస్టెంట్ ప్రొఫెసర్ & కో-ఆర్డినేటర్, ఐ.సి.ఎస్.ఎస్.ఆర్ ప్రాజెక్టు,
భాషాశాస్త్రశాఖ, ఉస్మానియావిశ్వవిద్యాలయం,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9704359006,
Email: balunaik1984@gmail.com

డా. కల్లోజి సుశీల్ కుమార్

అసిస్టెంట్ ప్రొఫెసర్ & కో-కో-ఆర్డినేటర్, ఐ.సి.ఎస్.ఎస్.ఆర్ ప్రాజెక్టు
భాషాశాస్త్రశాఖ, ఉస్మానియావిశ్వవిద్యాలయం,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9297307307,
Email: kallojisusheelkumar@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 09.07.2024        ఎంపిక (D.O.A): 28.01.2025        ప్రచురణ (D.O.P): 01.02.2025


వ్యాససంగ్రహం:

సవరలు వాళ్ళ పితృదేవతల జ్ఞాపకార్థం ఇంటిలోపలి గోడల మీద చిత్రించే చిత్రకళ ఇడిసింగ్ గురించి వివరించడం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని సవర గ్రామాల్లో ఈ చిత్రాలను సేకరించి వాటిని వర్ణనాత్మక పద్ధతిలో వివరించడం జరిగింది. ఈ చిత్రకళలో ప్రతిబింబించే సాంస్కృతిక, సామాజిక, పర్యావరణ అంశాలను వివరించడం జరిగింది. వీటి తయారీలో వాడే రంగులను, ఆ రంగులను తయారు చేసే విధానంతో పాటు, వాటిలో ప్రతిబింబించే వారి పండుగలు, దేవతలు, వారికి తారసపడే జీవులు, వస్తువులను, వాటి ప్రాధాన్యతను వివరించడం జరిగింది. ఆధునిక సమాజప్రభావం ఈ కళపై ఎలా ఉందనే అంశాన్ని ప్రస్తావించడంతో పాటు, అంతరించిపోతున్న ఈ కళను కాపాడుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలని తెలియచేయడం జరిగింది. ఈ కళ కలగా అంతరించిపోకుండా ముందుతరాలకు, బయటి సమాజానికి సవర సంస్కృతిని గుర్తు చేయడానికి ఈపత్రం దోహదపడుతుంది.

Keywords: సవర భాష, ఇడిసింగ్, కుడ్య చిత్రాలు, సంస్కృతి-సంకేతాధ్యయనం

1. ఉపోద్ఘాతం:

సవర భాష ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన సవర గిరిజనులకు చెందిన భాష. ఇది ఆస్ట్రో ఆషియాటిక్ కుటుంబానికి చెందిన ముండా కుటుంబంలోని దక్షిణ ఉప కుటుంబానికి చెందినది. వీరి బాషని సవర, సోర, సబర అని పిలుస్తారు. వీరు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒరిస్సా, మధ్యప్రదేశ్ లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా విస్తరించి ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో వారి జనాభా 1,39,424. అందులో స్త్రీలు 70,992 పురుషులు 68,432 (1) . రామాయణం, మహాభారతాల్లో సవరల ప్రస్తావన మనకు కనబడుతుంది(2). స్కంద పురాణం-కాశీ ఖండంలో సవరలు అరణ్యాలలో నివసిస్తూ చెట్లను కొట్టి జీవించే వారీగా ప్రస్తావన ఉంది(3 ). 

భారతదేశం గిరిజన సంస్కృతుల యొక్క గొప్ప చిత్రయవనిక. ప్రతి గిరిజన సమూహానికి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఒక ప్రత్యేక కళ ఉంటుంది. గిరిజన సాహిత్యంలో ఈ కింది రకాల సాహిత్యం అందుబాటులో ఉన్నది.

మౌఖిక సాహిత్యం:

దీనిలో పురాణాలు, కథలు, ఇతిహాసాలు, పొడుపు కథలు, సామెతలు, పాటలు పద్యాలు మొదలైనవి ఉంటాయి. 

జానపద నృత్యం మరియు సంగీతం:

వీటిలో జానపద నృత్యం, సంగీతం, పాటలు, సంగీత వాయిద్యాలు ఉంటాయి. 

సాంప్రదాయ కళాకృతి, హస్తకళలు:

వీటిలో జానపద కళ, చిత్రలేఖనం, బొమ్మలు చెక్కడం, లోహ ఆభరణాల, వస్తువుల తయారీ, దుస్తులు అలంకరణ, కలప వస్తువులు ఉంటాయి.
భారతదేశంలోని గిరిజన జాతులలో చిత్రలేఖనం ప్రత్యేక గుర్తింపు పొందింది. వాటిని ఈ కింద వివరించడం జరిగింది. (4)

వార్లీ తెగ:

మహారాష్ట్ర లోని వార్లీ తెగ వారి సరళమైన వార్లీ పెయింటింగ్ శైలికి ప్రసిద్ధి చెందింది. సాంప్రదాయకంగా, వార్లీ కళను మట్టితో ఆలికిన గోడలపై చిత్రిస్తారు. ఈ చిత్రాలలో వారి జీవన విధానం జీవితం, ప్రకృతి మరియు పురాణాలకు చెందిన ప్రతిబింబిస్తాయి. మట్టితో ఆలికిన గోడలపై వీటని చిత్రిస్తారు. దీనికోసం నీరు కలిపిన బియ్యం పిండిని రంగులుగా ఉపయోగిస్తారు.

గోండ్ తెగ:

వీరు ముఖ్యంగా తెలంగాణ, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్‌ భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నారు. వీరికి చిత్రకళ చాలా ప్రసిద్ధి పొందినది. ఈ చిత్రాలలో దేవతలు, పండుగలు, జంతువులు, పక్షులు మరియు ప్రకృతి సంబంధిత అంశాలు ఉంటాయి. ఈ చిత్రాలను సాధారణంగా అన్నీ సహజ రంగులను బొగ్గు, మొక్కల రసం వంటి వాడి తయారు చేస్తారు.

మధుబని తెగ:

బీహార్‌లోని మిథిలా ప్రాంతానికి చెందిన మధుబని తెగ వారు మధుబని పెయింటింగ్ యొక్క సాంప్రదాయక కళారూపాన్ని అభ్యసిస్తారు. ఈ పెయింటింగ్‌లు సంక్లిష్టమైన నమూనాలు మరియు స్పష్టమైన రంగులతో వర్గీకరించబడ్డాయి, తరచుగా హిందూ పురాణాలు, ప్రకృతి మరియు రోజువారీ జీవిత దృశ్యాలను చిత్రీకరిస్తాయి. సహజ రంగులు మరియు వర్ణద్రవ్యాలు సాధారణంగా వివిధ ఉపరితలాలపై మధుబని కళను సృష్టించేందుకు ఉపయోగిస్తారు.

భిల్ తెగ:

మధ్య మరియు పశ్చిమ భారతదేశం అంతటా వ్యాపించి ఉన్న భిల్ తెగ భిల్ చిత్రకళ అని పిలువబడే గొప్ప కళాత్మక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ పెయింటింగ్‌లు గిరిజన జానపద కథలు, ఇతిహాసాలు, ఆచారాల ద్వారా ప్రేరేపించబడిన చిత్రాలను కలిగి ఉంటుంది. ప్రదర్శిస్తాయి. భిల్ కళ మట్టి టోన్లు మరియు బోల్డ్ లైన్లతో వర్గీకరించబడుతుంది. వీటిలో వాడే రంగులు మొక్కలు, ఖనిజాల నుండి సేకరించిన సహజ రంగులను ఉపయోగించి గోడలు, కాగితంపై చిత్రిస్తారు.

పిథోర తెగ:

గుజరాత్ మరియు రాజస్థాన్‌లలో కనుగొనబడిన పిథోర తెగ దాని పవిత్రమైన పితోరా పెయింటింగ్ సంప్రదాయానికి గుర్తింపు పొందింది. ఈ చిత్రాలు దేవతలు, జంతువులు, చిహ్నాల శైలీకృత వర్ణనలను కలిగి ఉంటాయి. వీటిని పండుగలు, పబ్బాలలో చిత్రిస్తారు. ఈ కళను వారు పవిత్రమైనదిగా భావిస్తారు.

సవర తెగ:

సవరలు చిత్రాలను ఇడీసింగ్ అని పిలుస్తారు. వీటిలో మానవ బొమ్మలు, జంతువులు, మొక్కలు, ప్రకృతి, ఆధ్యాత్మికత, దైనందినకార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి. సవర చిత్రాలు గోడలు, గుడ్డ లేదా కాగితం పై సహజ రంగులను వర్ణద్రవ్యం ఉపయోగించి సృష్టించబడతాయి. ఈ పత్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోని సవర గ్రామాల నుండి సేకరించిన ఇడిసింగ్ చిత్రాల వివరణాత్మక విశ్లేషణ చేయడం జరిగింది. 

2. పూర్వ పరిశోధన: 

The Sauras and Their Panoramic Paintings (2005) అనే పత్రంలో పటేల్ ఈ చిత్రాలను ఇడితల్, ఇకాన్ అని పేర్కొన్నారు. వీటిలో జోడీసుమ్, జునాగ్ల సుమ్ అనే రెండు పండుగల గురించి వివరించడం జరిగింది. 

ఎల్విన్ రాసిన The Tribal Art of Middle India (1951) పుస్తకంలో The Saora Pictographs అనే అధ్యాయంలో వీటిని ఇత్తాల్ అని పేర్కొన్నారు. వారు గంజాం, కోరాపుట్ జిల్లాల నుండి చిత్రాలను సేకరించి వాటి విశేషాలను సవివరంగా తెలిపారు. పై అధ్యయనాల్లో ఒరిస్సా ప్రాంతంలోని సవరచిత్రాల విశ్లేషణ జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లోని సవర చిత్రాల అధ్యయనం ఈ దశాబ్ద కాలంలో జరగలేదనే చెప్పవచ్చు. దీనవల్ల, ఈ పత్రంలో ఆంధ్రప్రదేశ్లోని సవరచిత్రాల సాంస్కృతిక వారసత్వ కొనసాగింపు, మార్పులపై పరిశోధన చేయడానికి ఊతం దొరికింది. 

3. విషయ సేకరణ:

విజయనగరం జిల్లా వబ్బంగి, గెడ్డగూడ గ్రామాలు, శ్రీకాకుళం జిల్లా ముత్యాలు, కుడ్డపల్లి గ్రామాలనుండి ఈ చిత్రాలను సేకరించడం జరిగింది. సోనీ డిజిటల్ కెమెరా ద్వారా చిత్రాలను సేకరించడం జరిగింది. ఆ చిత్రాల తయారీ విధానాన్ని వ్యవహర్తల నుండి తెలుసుకోవడం జరిగింది. ఆ చిత్రాల విశిష్టతను, అందులోని సాంస్కృతిక అంశాలను విభాగాల వారీగా సవర చిత్రకారులను అడిగి రాయడం జరిగింది. వారితో పాటు సవర వ్యవహర్తల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఈ పత్రంలో సవర జాతికి చెందిన చిత్రాల మీద విశ్లేషణ చేయడం జరిగింది.

4. సవర చిత్రాలు:

ఇతర భారతీయ జాతులలాగానే సవరలు కూడా పండుగలు, ఇతర వేడుకల వేళలలో తమ ఇంటి లోపలి గోడలను అందమైన చిత్రాలతో, ఆకృతులతో అలంకరించే ప్రాచీన సంప్రదాయాన్ని ఇంకా పాటిస్తున్నారు. ఇడిసుంగ్ చిత్రాలు సవర సంస్కృతి సంప్రదాయాలలో రక్షణలో ప్రధానమైన భూమిక పోషిస్తున్నవి. ఇడిసుంగ్ అని అనబడే ఈ చిత్రాలలో పూర్వజుల, అనారోగ్యాలను దూరం చేయడం, సంతానోత్పత్తిని ప్రోత్సహించడం మరియు పండుగలను జరుపుకోవడం వంటి లోతైన సాంకేత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. స్త్రీ పురుషులు, గుర్రాలు, కుక్కలలాంటి పెంపుడు జంతువులు, కోతులు, ఏనుగులు, దుప్పులలాంటి అడవి జంతువులు, ఆకాశ సంబంధమైన సూర్యుడు, చంద్రుడు, జీలుగు, మామిడి లాంటి రకరకాల చెట్లు, పండుగల, దేవతల, ఇతర సాంస్కృతిక వస్తువులు ఈ చిత్రాలలో ఉంటాయి. సవర సంస్కృతిని సంరక్షించడానికి, సవర సమాజపు గుర్తింపును పెంపొందించడానికి వీటిలో ఉండే అందమైన బొమ్మలు దోహదపడతాయి. అవి ప్రకృతిపరమైన, నైమిత్తిక కార్యక్రమాలు, సాంస్కృతిక ఆచారాలు మరియు పురాణ కథల నుండి దృశ్యాలను వర్ణిస్తాయి. ప్రతి సంవత్సరం కొత్త పంటలు ఇంటికి వచ్చే సమయంలో ఈ చిత్రాలను ప్రతిసారీ చిత్రిస్తారు. ఈ పండుగ సమయంలో వేసే ఈ చిత్రాలు, వారికి పితృదేవతల ఆశీస్సులు అందించడానికి, సమస్యల నుండి దూరం చేయడానికి ముఖ్యపాత్ర పోషిస్తాయి. తరతరాలుగా వస్తున్న ఈ చిత్రకళ సవరల సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేలా, సంప్రదాయ జ్ఞానం యొక్క భాండాగారంగా పనిచేస్తాయి. దేవతలను, పూర్వజుల ఆత్మలను సంతృప్తి పరచి, బతికున్న వారికి ఆపదలు రాకుండా ఉండడానికి ఇడిసుంగుని గీస్తారు.

4.1 చిత్రించే విధానం:

సవర కళాకారులు ఈ చిత్రాలను ఎర్ర లేదా నల్ల మట్టితో అలికిన గోడలపై చిత్రిస్తారు. చిన్న వెదురుకొమ్మలను కుంచెగా వాడతారు. నీటిలో కలిపిన బూడిద, మసి, సామపిండి, బియ్యపుపిండిని రంగులుగా వాడతారు. సాధారణంగా తెల్ల రంగుతో గీస్తారు. అలాగే చింత గింజల పొడిని, పూలు, ఆకుల పొడిని ఇతర రంగులుగా వాడతారు. ప్రతి చిత్రం గీసే ముందు ఆ చిత్రానికి సరిహద్దు గీసి దానిలోపల పైభాగంనుండి మొదలు పెడతారు. కూడాన్(పూజారి) లేదా దీసారి (పూజారి) మాత్రమే ఈ చిత్రాలను వేస్తారు. వారుకూడా స్నానంచేసి తలుపులు మూసివేసి ఇంటిలోపలి గోడపై వీటిని వేస్తారు. చిత్రం పూర్తయిన తర్వాత ఆ ఇంటి వాళ్ళు వారికి వస్తురూపేణ దక్షిణ సమర్పిస్తారు. ఇతరులకు ఈ కళ వచ్చినప్పటికీ ఇంటి గోడల మీద వేయడానికి అనుమతించరు. ఈ ప్రక్రియ సవర చిత్రకళ సంప్రదాయాలతో ముడిపడి ఉన్న లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు కళాత్మకనైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కాలంలో దొరికే బ్రష్లు, ఆధునిక రంగులను యువచిత్రకారులు వాడుతున్నారు.

4.2 చిత్రాలలో ఉండే అంశాలు:

మానవ శరీర మొండెం భాగం సాధారణంగా త్రిభుజాకారంలో ఉంటుంది. చేతులు, కాళ్ళు మాత్రం స్పష్టంగా గుర్తించవచ్చు. కన్ను, ముక్కు, వేళ్లు లాంటి వాటి పూర్తి చిత్రీకరణ కనబడదు. సవరల కుడ్య చిత్రాలలో ఉండే మనుష్యుల బొమ్మలు వార్లీ గిరిజనుల చిత్రాలవలే ఉన్నప్పటికీ, కింది త్రిభుజం పూర్తిగా రంగుతో నింపి ఉండవు. వార్లీ చిత్రాలు రెండు త్రిభుజాలతో మనిషిని చిత్రిస్తారు.
ఇడిసింగ్ చిత్రం పైన, కింది అంచులమీద మనుష్యుల చిత్రాలు అలంకరిస్తారు. రెండు పక్కల త్రిభుజాకారంలో గీసిన అంచుమీద కోతుల బొమ్మలు గీస్తారు. ప్రస్తుత చిత్రాల్లో అంచులు లేదా సరిహద్దులపై మనుష్యుల, కోతుల బొమ్మల బదులు చిత్రం: 1 లో లాగా వివిధ నూతన అకృతులను గీయడం గమనించవచ్చు.

4.2.1 ప్రకృతి:

సవరలు నిత్య మమేకమయ్యే అడవి, కొండలు, నదులు, జంతువుల నమూనాలు ఈ చిత్రాలలో ఉంటాయి. 

చిత్రం: 1 సూర్యుడు

4.2.2 వేట:

అడవిలో ఏ ఏ జంతువులను ఎలా వేటాడుతారో విధానం, జంతువులను కావడి ద్వారా మోసుకొచ్చే పద్దతి, వాటిని కోసిన తర్వాత గ్రామస్తులకు పంచే పద్ధతిని కూడా చిత్రిస్తారు. సామూహికంగా వండుకునే చిత్రాలు కూడా కనిపిస్తాయి. 

చిత్రం 2: వేటాడిన జంతువును మోసుకొని రావడం

4.2.3 వ్యవసాయం:

ఈ చిత్రాలు వారు పాటించే వ్యవసాయ పద్ధతులు. గింజలు విత్తె విధానం, ఎంగ్స (నాగలి), రంగోమ్(కావడి), కొనిబొరేగ (కుంటకర్ర) లాంటి వ్యవసాయ పనిముట్లు ఈ చిత్రాలలో కనిపిస్తాయి. సవరలు అడవిలో పండించే సామలు, కొర్రలు మొక్కల బొమ్మలు, వాటిని కోయడం, నూర్పడం, ధాన్యాన్ని గంపలు, కావడీల ద్వారా ఇంటికి చేర్చే విధానం, ధాన్యాన్ని దంచడం, చెరగడం, ఎండ పెట్టడం లాంటి రోజువారీ కార్యక్రమాలను ఈ చిత్రాలలో చూడవచ్చు. 

చిత్రం 3:  కొర్రల పంట, విత్తనాలు నాటడం

4.2.4 నృత్యం:

పండుగల సందర్భంగా వారు నర్తించే విధానం చిత్రిస్తారు. ఆడవాళ్ళు జంటలుగా గొడుగు పట్టుకొని నర్తించే విధానం స్పష్టంగా కనబడుతుంది. అలాగా మగవారు వాయించే వాయిద్యాలు గోగోడ్ రాజన్, పిరుడ్ రాజన్, మేమేడ్ రాజన్, కూడర్ రాజన్, తార్సరాజన్, తుడుం, పనే, డగడు, మురిమ్ గన్, డేరోంగ్, బొంగ్ పెడన్, కడింగ్ ఈ చిత్రాలలో కనిపిస్తాయి. 

చిత్రం 4: సవరల నృత్యం

4.2.5 పండుగలు:

ఇంటివరకు జరుపుకునే పండుగలు, గ్రామం మొత్తం జరుపుకునే పండుగలు, సామూహిక పండుగలు వీటిలో చిత్రిస్తారు. ఊరి మధ్యలో ఉండే గుసాడా, ఇతర నమూనాలని చిత్రిస్తారు.

గుఆర్, లతర, కినా పూర్, మామిడి కొత్త పండగ, టెంక కొత్త పండగ, కొండెమ్ కొత్త పండగ, కంది కొత్త పండగ, కొర్ర కొత్త పండగ లాంటి పండగలు వివరంగా చిత్రిస్తారు. 

చిత్రం 5 : మామిడి పండగ చిత్రం

4.2.6 వృత్తి:

సారాయి తయారుచేసే విధానం, జిలుగు, ఈత చెట్లు ఎక్కి కల్లు గీసే పద్దతిని కూడా చిత్రిస్తారు. బియ్యంతో సారాయి తయారు చేసే విధానం కూడా చిత్రిస్తారు.

4.2.7 జంతువులు:

ఏనుగులు, పులులు, జింకలు లాంటి అడవి జంతువులు, కుక్క, పిల్లి, లాంటి పెంపుది జంతువుల చిత్రాలు ఉంటాయి. తేళ్ళు, పాములు, ఉడుముల లాంటి సరీసృపాలు, నెమళ్ళు, చిలుకల లాంటి పక్షులు ఈ చిత్రాలలో కనబడతాయి. వీటితో పాటు బయటి ప్రదేశపు ఒంటెలు కూడా కనిపిస్తాయి.

4.2.8 నిత్య అవసరాలు:

వాగుల నుండి కావడితో, నెత్తిమీద కుండలతో నీరు మోసుకొచ్చే విధానం, వంట చేసే విధానం కూడా చిత్రిస్తారు.

4.2.9 ఆధునిక వస్తువులు:

కార్లు, విమానాలు, ఫోన్, టీవి లాంటివి కూడా ప్రస్తుత చిత్రాలలో కనిపిస్తున్నాయి.

5. ముగింపు:

ఈ ఇడిసింగ్ చిత్రాలు ప్రకృతి మాత ఒడిలో సేదతీరే గిరిజనులను, వారి కళలలో ఇమిడి ఉన్న సమస్త ప్రకృతిని బయటి ప్రపంచానికి అద్దంలా చూపించడానికి పనిచేస్తాయి. వీరు ఉండే ప్రాంతం, చేసే పని, ఆనందించే క్షణాలు, ఆస్వాదించే అనుభూతులు, అభిలషించే ఆశలు, ఆచరించే సాంప్రదాయాలు, మాట్లాడే మాట, పాడే పాట, ఆడే ఆట, జీవించే జీవితం వారి వెదురు కుంచెల ద్వారా ముందు తరాలకి, బయటి ప్రపంచానికి, అతి పురాతన సంస్కృతిని,  నిత్యనూతనంగా చిత్ర రూపాలలో పెట్టి అందచేయడానికి ఈ చిత్రాలు దోహద పడుతున్నాయి. గిరిజన సాంస్కృతిక శాఖ, ITDA ల కృషివల్ల సవరలు వస్తువులు, దుస్తులమీద, హైదరాబాద్ లాంటి నగరాల్లో శిల్పారామంలో గోడలమీద అలంకరణకు ఈ చిత్రాలని చిత్రించడం వల్ల వాటికి బహుళ వ్యాప్తి, ప్రచారం కలిగింది. 

ఈ చిత్రాలలో -

  • గిరిజన వ్యవసాయ పరికరాలు, పద్ధతులతో పాటు ఆధునికమైనవి కూడా ఉన్నాయి.
  • ఆధునిక రవాణా సౌకర్యాల చిత్రాలు ఉన్నాయి.
  • సహజమైన రంగులతో పాటు ఆధునిక రంగులను ఉపయోగించడం జరుగుతున్నది.
  • ఈ చిత్రాలు సవర ఇంటి గోడల మీదే కాకుండా నగరాల్లో గోడలు, వస్తువులు, దుస్తుల  మీద కనబడుతున్నాయి.
  • పితృదేవతలను సంతృప్తిపరచడానికి ఈ చిత్రాలను గీస్తారు. 
  • ఇతర సాంస్కృతిక ప్రభావం కనబడుతుంది.
  • ఈ విధంగా, ఈ కళారూపాలను అధ్యయనం చేయడం అవి అంతరించకుండా, సంరక్షించడానికి ఉపయోగపడుతుంది. 
  • అలాగే సవర సంస్కృతిని సంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా ప్రపంచానికి గిరిజన కళలపై విస్తృత అవగాహన, ఆసక్తిని కల్పిస్తుంది. 
  • ఒరిస్సాతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్న సవరాల కుడ్య చిత్రాలను తులనాత్మక అధ్యయనం చేయడంతో పాటు, ఇతర గిరిజన జాతుల్లో ఉన్న చిత్ర కళలను, వాటి సాంస్కృతిక అంశాలను అధ్యయనం చేయడం, తులనాత్మక పరిశోధన చేయడానికి ఈ పత్రం ఉపయోగపడుతుంది. 

(*ఈ పరిశోధనాపత్రం ఉస్మానియావిశ్వవిద్యాలయంలోని భాషాశాస్త్రవిభాగం నిర్వహిస్తున్న "“Ethnolinguistics Portrayal:  A Comparative Study of Savara and Gondi Tribal Paintings" ICSSR ప్రాజెక్టులో ఒక భాగంగా సమర్పించడం జరిగింది) 

6. సూచికలు:

  1. https://censusindia.gov.in/nada/index.php/catalog/12560/download/15673/ST-28-00-15-DDW-2011.XLSX
  2. Pratap, D. R. Savaras, a Monograph. Tribal Cultural Research and Training Institute, Tribal Welfare Dept., Andhra Pradesh, 1972. Page no 2. 
  3. స్కంధ పురాణం-కాశీఖండం అధ్యాయం 48- 35 శ్లోకం
  4. www.holidify.com/pages/tribal-art-of-india-4497.html accessed on 01-10-2023
  5. Patel, C. B. (2005). The Sauras and their panoramic paintings పేజీ నెం.56 

7. ఉపయుక్తగ్రంథసూచి:

తెలుగు:

  1. వేదాంతం మురళీధర్. సవర ధ్వనిశాస్త్రం- ఒక పరిశీలన. మూసీ మాసపత్రిక, సంపుటి-27, సంచిక-6 2024, pp. 33-39. ISSN No: 2457-0796. Musi Monthly Magazine.

English:

  1. Elwin, V. (1951). The Tribal Art of Middle India. London: Oxford University Press.
  2. Muralidhar, V. (2012). Sorang Sompeng: A linguistic analysis. Osmania Papers in Linguistics, 38. Osmania University, Hyderabad. ISSN 0970-0277.
  3. Muralidhar, V. (2013). Personal pronouns in Savara. Osmania Papers in Linguistics, 39. Osmania University, Hyderabad. ISSN 0970-0277.
  4. Muralidhar, V. (2015). Savara. In Ushadevi, A., & Chandra Shekhara Reddy, D. (Eds.), Languages of Andhra Pradesh and Telangana Vol.3 - Part I (pp. 349-374). Hyderabad: Emesco Publication. ISBN: 978-93-85231-05-6.
  5. Patel, C. B. (2005). The Sauras and their panoramic paintings. Orissa Review, January, 2005
  6. Pratap, D. R. (1972). Savaras, a monograph. Tribal Cultural Research and Training Institute, Tribal Welfare Dept., Andhra Pradesh.
  7. Ramamurti, G. V. (1931). A manual of the So:ra (or Savara) language. Madras: Government Press.
  8. Ramamurti, G. V. (1938). Sora - English dictionary. New Delhi: Mittal.
  9. Ramamurti, G. V. Telugu Savara dictionary. Director of Public Instruction.
  10. Sankara Reddy, M. (1993). Savara language learning book. Goyidi, Srikakulam: Janachetana.
  11. Sankara Reddy, M., et al. (1997). Savara life educative book. Goyidi, Srikakulam: Janachetana.
  12. Venkatrao, T. (1981). Savarala jiivana sarali. Vijayawada: Visalandhra Publishing House.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]