headerbanner
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. ✽ గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM | Volume-06 | Issue-02 | February 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed

8. రైతాంగం: వ్యవసాయాభివృద్ధి - రాజ్యం

డా. నల్లపనేని విజయలక్ష్మి

తెలుగు అధ్యాపకురాలు,
ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి), గుంటూరు,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9701667350, Email: vijayalakshminallapaneni@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 02.01.2025        ఎంపిక (D.O.A): 28.01.2025        ప్రచురణ (D.O.P): 01.02.2025


వ్యాససంగ్రహం:

‘‘తానూ, తన కుటుంబ సభ్యులు శ్రమిస్తూ, సొంత ఉత్పత్తి-సాధనాలతో వ్యవసాయం చేసే వ్యక్తే రైతు అని నా అభిప్రాయం.’’ అన్నారు ఇర్ఫాన్ హబీబ్. ఎంతో శ్రమ కోర్చి వ్యవసాయం చేసి అందరి ఆకలి తీర్చే రైతు రక్షణ కోసం పని చేయవలసిన రాజ్యం రైతును ప్రధాన ఆదాయ వనరుగానే చూసింది. తమ ఆదాయం కోసమే రాజ్యం వ్యవసాయాభివృద్ధిని ప్రోత్సహించింది. అందుకోసం భూదానాలను ఉపయోగించుకుంది. క్రమంగా పన్నుల భారంతో రైతు అణగారిపోయాడు. మనిషి ఆహారాన్వేషణ నుండి ఆహార ఉత్పత్తి వైపు మళ్ళిన క్రమం, అదనపు ఆహార ఉత్పత్తి క్రమంగా రాజ్య వ్యవస్థ నిర్మాణానికి దోహదపడిన తీరు, రాజ్య వ్యవస్థ/ప్రభుత్వాలు రైతాంగం శ్రమశక్తిని పన్నుల రూపంలో పీల్చి వేసిన క్రమం, సమస్యల నుండి బయటపడడానికి రైతులు చేసిన ఉద్యమాలు, సాధించుకున్న ఫలితాలను ఈ వ్యాసంలో పరిశీలించటం, విశ్లేషించటం జరిగింది. రైతాంగం - వ్యవసాయాభివృద్ధి – రాజ్యం- ఈ మూడింటి మధ్య గల త్రికోణ సంబంధం రైతుల మీద చూపిన ప్రభావాన్ని పరిశీలించి ‘రైతాంగం - వ్యవసాయాభివృద్ధి – రాజ్యం’ అనే శీర్షికతో వివరించే ప్రయత్నం చేశాను. వ్యవసాయాభివృద్ధి-నాగలి పాత్ర, రైతు-నిర్వచనం, రైతాంగం-కౌలు/పన్నులు, మౌర్యుల కాలం-పన్నులు, గుప్తుల కాలం-పన్నులు, పల్లవులు-పన్నులు, చోళులు-పన్నులు, మొగల్ పాదుషాలు-పన్నులు, రైతుల తిరుగుబాట్లు మొదలైన ఉప శీర్షికలతో దీర్ఘవ్యాసాన్ని రూపొందించటం జరిగింది. రొమిలా థాపర్ భారతదేశ చరిత్ర (క్రీ.శ. 1300 వరకు), కె. బాలగోపాల్ ‘ప్రాచీన భారతదేశ చరిత్ర డి.డి. కోశాంబి పరిచయం’, ఇర్ఫాన్ హబీబ్ ‘భారత చరిత్రలో రైతు’, డా. భద్రిరాజు శేషగిరిరావు ‘ఆంధ్రప్రదేశ్ లో రైతు ఉద్యమాలు’ తదితర గ్రంథాలలోని అంశాలను ఈ వ్యాసానికి ఆధారంగా గ్రహించటం జరిగింది. అనూహ్య, అననుకూల వాతావరణ పరిస్థితులతో మాత్రమే కాకుండా రాజ్యం/ప్రభుత్వంతో నిరంతర సంఘర్షణ తప్పని రైతు ప్రస్థానాన్ని పరామర్శించి, అతడికి సమాజం అండగా నిలవవలసిన అవసరాన్ని గుర్తు చేయటం ఈ వ్యాసం యొక్క ప్రధాన ఉద్దేశం.

Keywords: రైతు, నాగలి, వ్యవసాయాభివృద్ధి, కౌలు, పన్నులు, తిరుగుబాట్లు

1. ఉపోద్ఘాతం:

ఆదిమ మానవుడి జీవితాన్ని మలుపు తిప్పిన అంశాలలో ముఖ్యమైనవి రెండు. ఒకటి నిప్పు ఉపయోగాన్ని తెలుసుకొని దానిని తన రక్షణకు, ఆహారాన్ని ఉడికించుకోవటానికి వాడటం. రెండవది వ్యవసాయం చేయటం. ఈ రెండింటికీ ప్రకృతే గురువు కావటం విశేషం.

తొలి దశలో మానవుడు ప్రకృతిలో సహజంగా దొరికే పండ్లు, దుంపలను సేకరించుకోవటం, జంతువులను వేటాడటం ద్వారా ఆహారాన్ని పొందాడు. ఈ దశలో అతడికి ఎక్కువ పనిముట్లు అవసరం కాలేదు. జంతువుల వేటకు, వాటి చర్మం ఒలవటానికి తగిన పరికరాలు, పండ్లు, దుంపలు, జంతు మాంసాన్ని ఉంచుకోవటానికి కుండలు, బుట్టలు ఉంటే సరిపోయింది. ఇది నిల్వ ఉండే ఆహారం కాదు. దాచుకోవటం కుదరదు. ఈ దశలో మానవులు గుంపుగా జీవించారు. దొరికిన ఆహారాన్ని అందరూ పంచుకొని తిన్నారు.

ప్రకృతి పరిశీలన ద్వారా విత్తనాలను మొలకెత్తించి కావలసిన ధాన్యాన్ని, పండ్లను, దుంపలను పండించవచ్చని మనిషి ఎప్పుడైతే గ్రహించాడో అప్పుడు ఆహార ఉత్పత్తికి నడుం కట్టాడు. అయితే అది కూడా తొలిదశలో సమిష్టిగానే సాగింది. పరిమితంగా సాగింది. క్రమంగా నాగలి, గొడ్డలి, పార, కొడవలి వంటి పనిముట్లు తయారు చేసుకోవటం, పశువులను మచ్చిక చేసుకోవటం నేర్చుకున్నాక వ్యవసాయం సులువయింది. ఈ పరిణామం ఎలా జరిగిందో చూద్దాం.

పాతరాతి, మధ్య రాతియుగాలలో మానవుడు ప్రాథమిక స్థాయిలో వ్యవసాయం ప్రారంభించాడు. మొక్కలను పెంచటం, జంతువులను మచ్చిక చేసుకోవటం, మోటుగా ఉన్న మట్టి పాత్రలను తయారు చేసుకోవటం పాత రాతియుగంలో కనిపిస్తుంది. మధ్య రాతియుగం నాటికి కొంత నిపుణతతో కూడిన రాతి పరికరాలు తయారు చేసుకోవటం, విల్లంబుల ఉపయోగాన్ని గ్రహించటం జరిగింది. మెరుగైన పద్ధతుల ద్వారా ఆహారాన్ని సంపాదించే అవకాశం లభించింది. ఈ విధంగా ఆహార సేకరణ చేసిన కొన్ని సమూహాలు తాము సేకరించిన ధాన్యాన్ని వాడి ప్రాథమిక వ్యవసాయం చేశాయి. దీనివల్ల కొంతకాలం పాటు ఒకేచోట ఉండే పధ్ధతి అలవాటయింది.

స్త్రీలే వ్యవసాయ ప్రారంభకులు అనే అభిప్రాయం ఉంది. పురుషులు వేటకు వెళ్ళిన సమయాల్లో ఇళ్ళలో ఉన్న స్త్రీలు వ్యవసాయం మొదలుపెట్టి జీవనవిధానంలో పెను మార్పుకు కారణమైనారన్న వాదనను ప్రముఖ చరిత్రకారులు రొమిలా థాపర్ సమర్థించారు. గృహ నివాసం స్త్రీలకు విత్తనం నాటటానికి, పైర్లు పెంచటానికి అవకాశం కల్పించింది. పైరు పెరిగి ఫలసాయం అందటానికి సమయం పడుతుంది కాబట్టి పోడు వ్యవసాయం చేస్తున్న కాలంలో కూడా పురుషులు వేట, ఆహార సేకరణ వదిలి పెట్టలేదు. నాగలిని ఉపయోగించటం వ్యవసాయంలో పెనుమార్పుకు కారణమైంది. నాగలి వాడకం పురుషుల చేతిలోనే జరిగింది. వ్యవసాయానికి ప్రాధాన్యం పెరగటంతో స్థిర నివాసం సాధ్యమైంది.

తొలిదశలో ఈ వ్యవసాయ కార్యకలాపాన్ని కుటుంబం ఒక విభాగంగా లేదా తెగలో భాగంగా ఉండి చేయటం కనిపిస్తుంది. ఈ వ్యవసాయ సమాజాలు రక్త సంబంధీకుల శ్రమశక్తిపై ఆధారపడి ఉండేవి. అభివృద్ధి చెందిన వ్యవసాయ సమాజాల్లో అదనపు ఆహారోత్పత్తి కోసం శ్రామిక శక్తి అవసరం పెరిగింది. రక్త సంబంధం లేని వారి శ్రమశక్తితో ఆ లోటును భర్తీ చేశారు. ప్రతిఫలం కోరి పని చేసేవారి శ్రమ శక్తిని ఉపయోగించుకోవటం, బందీలుగా పట్టుకున్న వారిని శ్రామికులుగా చేయటం జరిగింది.

మొదట్లో తెగకి భూమిపై ఉమ్మడి యాజమాన్య హక్కు ఉండేది. కాలక్రమంలో తెగల అస్తిత్వం తగ్గిపోయింది. భూమిని ఉపయోగించేవారికి హక్కులు ఏర్పడ్డాయి. భూమి కుటుంబాల మధ్య, చిన్న చిన్న సమూహాల మధ్య విభజించబడింది. వ్యవసాయాధారిత గ్రామీణ సమాజం ఏర్పడింది. ఈ గ్రామీణ సమాజ వ్యవస్థలో వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, మేదరి, నేతపనివారు, చర్మకారులు తదితర వృత్తుల వారు బలపడ్డారు.

2. వ్యవసాయాభివృద్ధి-నాగలి పాత్ర:

మనకు తెలిసినంతవరకు కంచు యుగపు వ్యవసాయ నాగరికతలు ప్రాచీనమైనవి. సింధూ నాగరికత, మొసపటేమియా నాగరికత, ఈజిప్టు నాగరికత -ఈ మూడూ కంచు యుగపు వ్యవసాయ నాగరికతలు. ఈ మూడూ ఎడారుల గుండా ప్రవహించే నదీలోయల్లో ప్రారంభమయ్యాయి.

సింధూ నాగరికత విషయానికి వస్తే సింధూ నదీలోయ ప్రాంతాలలో జరిగిన పురావస్తు తవ్వకాలలో హరప్పా, మొహంజొదారో అనే రెండు ప్రాచీన పట్టణాలు బయటపడ్డాయి. ఈ విధమైన పట్టణ నాగరికత ఆనాడు విలసిల్లింది అంటే ఆహార సేకరణ మాని ఆహారాన్ని ఉత్పత్తి చేసే వ్యవసాయ సమాజం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని ప్రముఖ చరిత్రకారుడు డి.డి.కోశాంబి అభిప్రాయం.

గంగా, గోదావరి నదీ లోయల్లో కాకుండా సింధూ నదీలోయలో ముందుగా ఆహార ఉత్పత్తి (వ్యవసాయం) ప్రారంభమవటానికి ఆనాడు ఉన్న అవసరాన్ని, అనుకూలతను ఆయన విశ్లేషించాడు. సారవంతమైన నేలల్లో అడవులు దట్టంగా ఉంటాయి. సమృద్ధిగా పండ్లు, దుంపలు, జంతువులు లభిస్తాయి. కాబట్టి ఆహార ఉత్పత్తి కోసం కష్టపడనవసరం లేదు. ఎడారి నదీలోయల్లోని చిట్టడవుల్లో, ముళ్ళ పొదల్లో ఆహారం సమృద్ధిగా లభించటం కష్టం. అదే సమయంలో ఆ పొదలను నిప్పు పెట్టి తగలబెట్టటం సులువు. గొడ్డలి అవసరం లేదు. సమీపంలోని నది నుండి కాలువల ద్వారా నీరు అందుతుంది. నదికి వరదలు వచ్చినప్పుడు సారవంతమైన మట్టి మేట వేస్తుంది. అది ప్రవాహంలో కొట్టుకు వచ్చిన మట్టి కాబట్టి వదులుగా ఉంటుంది. బరువైన నాగలి అవసరం లేకుండానే వ్యవసాయం చేయవచ్చు. ఈ కారణాల వల్లనే ఎడారి నదీలోయల్లో తొలి వ్యవసాయ నాగరికతలు ప్రారంభమయ్యాయని కోశాంబి అభిప్రాయపడ్డాడు.

భారతదేశపు మొదటి నగరాల (మొహంజొదారో, హరప్పా)తో పాటే ఈ దేశపు మొదటి రైతాంగ వర్గం ఆవిర్భవించింది అంటాడు మరో చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్. మరి ఈ మొదటి రైతాంగ వర్గానికి నాగలి వాడకం తెలుసా? లేదా? అనే విషయంలో చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.

‘‘నాగలి ఉపయోగం హరప్పా ముందు కాలం నుండి ఉంది. దున్నటం అనే ప్రక్రియకు వాడబడిన ‘లాంగాల’ అనే మాట అనార్య భాష నుండి వచ్చింది. అనార్య భాష నుండి వ్యవసాయ సంబంధమైన పదాలను ఎక్కువగా తీసుకోవటం చేత వ్యవసాయ ప్రక్రియతో పాటు నాగలి ఉపయోగం, అప్పటికే నివాసమున్న సమాజాల్లో చాలా ప్రాచీనం అయిందని తెలుస్తుంది.’’ 1 అంటారు రొమిలా థాపర్.

హరప్పా, మొహంజొదారో అవశేషాల్లో నాగలి చిత్రాలు లేవు. పశువుల బొమ్మలున్నాయిగాని ఒంటరిగానో బండి లాగుతున్నట్లో ఉన్నాయి. నాగలితో భూమి దున్నుతున్న బొమ్మలు లేవు. కాబట్టి వాళ్లకు నాగలి వాడకం తెలియదని, తేలికగా ఉన్న నేలలో ‘ముళ్ళకర్ర’తో వ్యవసాయం చేసి ఉంటారని కోశాంబి అభిప్రాయం. తన అభిప్రాయానికి సమర్థనగా ఆయన సింధూ నాగరికత లిపిలో కనిపించే నాలుగు పండ్లున్న కర్రలాంటి సంకేతాన్ని చూపాడు.

కోశాంబి అభిప్రాయాన్ని తిరస్కరిస్తూ ఆనాటి రైతులకు నాగలి ఉపయోగం తెలుసని ఇర్ఫాన్ హబీబ్ భావించారు. తన అభిప్రాయానికి సమర్థనగా ఆయన ‘‘ఇండియన్ ఆర్కియాలజీ’’ 1968-1969 సంచికలో ప్రచురించబడిన ప్రత్యక్ష ఆధారాలను ప్రస్తావించారు. కాళిభంగన్ దగ్గర ‘‘దుక్కి దున్నిన పొలం’’ చాళ్ళు బయటపడ్డాయి. ఇది హరప్పా నాగరికత పొర కింద ఉంది. కాబట్టి ఇది హరప్పా పూర్వ యుగానికి చెందినది. ఈ నాగరికత భారతదేశపు వాయువ్య మైదానాల నుండి గుజరాత్ వరకు విస్తరించింది. నాగలి లేకపోతే ఈ విస్తరణ సాధ్యమయ్యేది కాదు అంటారాయన.

నాగలికి సంబంధించిన ప్రత్యక్ష ప్రస్తావన మనకు వేదాలలో కనిపిస్తుంది. ఋగ్వేదం నాలుగు, పది మండలాల్లో వామదేవ, బుధస్సౌమ్య సూక్తాల్లో సీర (నాగలి), సీత (నాగటి చాలు) ప్రస్తావనలున్నాయి. అథర్వణ వేదంలో ఆరు లేక ఎనిమిది ఎడ్లను కట్టి వ్యవసాయం చేయటం వర్ణించబడింది.

క్రీస్తుపూర్వం 1000 ప్రాంతంలో మనదేశంలో ప్రవేశించిన ఆర్యులు ఇనుమును పరిచయం చేసినప్పటికీ ఇనుప పరికరాలు విస్తారంగా రైతాంగానికి అందుబాటులోకి రావడానికి కొన్ని శతాబ్దాల సమయం పట్టింది. క్రీస్తుపూర్వం 500 ప్రాంతంలో పాలిష్ చేసిన నల్ల వస్తువుల సంస్కృతి అవశేషాల్లో ఇనుప కర్రులు కనిపించాయి. లిఖితపూర్వక ఆధారాలు మాత్రం క్రీస్తుపూర్వం 200 ప్రాంతంలోనే కనిపిస్తున్నాయి. క్రీస్తుపూర్వం 200 కాలానికి చెందిన మనుస్మృతిలో ఇనుపమొనలు అమర్చిన నాగళ్ళ ప్రస్తావన మొదటిసారి లిఖిత రూపంలో కనిపిస్తుంది. క్రీస్తు శకం 200 కాలానికి చెందిన కుశానులకు చెందిన ముద్రల్లో జోడెడ్లతో నాగలి లాగించే భారతీయ రైతు చిత్రం మొట్టమొదటిసారి దర్శనమిస్తుంది.

ఇనుము వాడకం తెలియకముందు అడవులు పలచగా ఉండే ప్రాంతాలు, నేల తేలికగా ఉండే ప్రాంతాలలో మాత్రమే వ్యవసాయం సాధ్యమైంది. అందువల్ల అధిక భూభాగాన్ని సాగులోకి తీసుకురావడం సాధ్యం కాలేదు. అడవుల్ని నరికి ఆ ప్రాంతాన్ని వ్యవసాయానికి ఉపయోగించుకోవాలన్నా, మెట్ట ప్రాంతాలలో (నేల గట్టిగా ఉండే ప్రాంతాలలో) దున్నాలన్నా ఇనుప పనిముట్ల వల్లనే సాధ్యమైంది. ముఖ్యంగా ఇనుప కర్రుతో కూడిన నాగలి వ్యవసాయాభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషించింది.

3. రైతు-నిర్వచనం:

‘‘తానూ, తన కుటుంబ సభ్యులు శ్రమిస్తూ, సొంత ఉత్పత్తి-సాధనాలతో వ్యవసాయం చేసే వ్యక్తే రైతు అని నా అభిప్రాయం.’’ 2 అన్నారు ఇర్ఫాన్ హబీబ్. 

కూలీలను చాలా ఎక్కువగా ఉపయోగించే వాడు ధనిక రైతు అని,  ప్రధానంగా తన కుటుంబ శ్రమపై ఆధారపడే వాడు మధ్యతరగతి రైతు అని, కుటుంబం మొత్తం శ్రమను వినియోగించడానికి చాలినంత భూమి లేని వాడు పేదరైతు అని మార్క్సిస్టులు రైతాంగాన్ని మూడు వర్గాలుగా విభజించారు. తాను దున్నుకునే భూమికి తానే యజమాని అయిన రైతు; భూమిపై శాశ్వతంగా గానీ దీర్ఘకాలికంగా గానీ- ఏదో ఒక రకమైన యాజమాన్యం కలిగిన రైతు; ఎప్పటి కప్పుడు భూమి కౌలుకు తీసుకొని దున్నుకునే రైతు-అని భూమితో రైతుకు గల సంబంధాన్ని బట్టి మరో విధమైన విభజన కూడా ఉంది. ఈ విభజనలో భూ సంబంధాన్ని బట్టి  ధనిక, పేద భేదాన్ని తెలుసుకోవటం వీలు కాదు. కౌలుదారులలో ఎక్కువ మంది పేదరైతులే. అయినా, వారిలో కొందరు ధనిక రైతులు కూడా ఉంటారు. రైతాంగాన్ని వారి ఆస్తి పాస్తులను బట్టి విభజించడం మూడో పద్ధతి. ఖరీదైన వ్యవసాయ పనిముట్లు, పశువులు, సారవంతమైన భూములు ఇవన్నీ రైతుల ఆస్తిపాస్తులే అవుతాయి.

4. రైతాంగం-కౌలు/పన్నులు:

రైతులు వారి శ్రమ ఫలితం లోని ఆదనపు ఉత్పత్తిని ఏ విధంగా సమాజపరం చేస్తూ వచ్చారో, రైతులు కౌలు చెల్లించే విధానాలు ఎలా ఉంటూ వచ్చాయో తెలుసుకోవటం ద్వారా రైతు ప్రస్థానాన్ని అర్థం చేసుకోవచ్చు.

తొలిదశలో వ్యవసాయ కార్యకలాపాన్ని కుటుంబం ఒక విభాగంగా లేదా తెగలో భాగంగా ఉండి చేసేదని మనకు తెలుసు. ఆ దశలో ఇంకా స్థిర నివాసాలు ఏర్పడలేదు. తెగల మధ్య ఘర్షణలు సర్వసామాన్యంగా ఉండేవి. ప్రతి తెగకు నాయకుడు/రాజు ఉండేవాడు. ఆవాసస్థలాన్ని రక్షించి, సంపదను గెలుచుకునే సామర్థ్యం ఉండటం నాయకుడికి ఉండవలసిన అర్హత. తమకు రక్షణగా ఉన్నందుకు రాజుకు తెగలోని వారు స్వచ్ఛందంగా బహుమతులు ఇచ్చేవారు. దీనిని ‘బలి’ అనేవారు. ఈ దశలో రాజుకు హక్కుగా ఒక క్రమబద్ధమైన పన్ను గాని, భూమి మీద అధికారం గాని లేదు. ఘర్షణలో ఓడిపోయిన తెగ నుండి కొల్లగొట్టిన పశుసంపదను ‘భాగం’ అన్నారు. ఈ భాగంలో అందరికీ నిర్దేశించబడ్డాక ఒక పెద్ద భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. ఒక వస్తువు యొక్క విలువ ‘శుల్కం’ గా పేర్కొనబడింది.

క్రమంగా రాజ్య వ్యవస్థ స్థిరపడింది. గతంలో ఐచ్ఛికంగా ఇవ్వబడ్డ కప్పం, బహుమతులు ఇప్పుడు బలి, భాగ, కర, శుల్కములనబడే పన్నులుగా మార్చబడ్డాయి. ఈ పదాలను గతంలో కూడా వాడినా వాటి అర్థం మారింది. 'బలి' సాగులో నున్న భూవిస్తీర్ణం నుండి వసూలు చేయబడే పన్ను, 'భాగ' ఉత్పత్తిలో ఒక భాగం. మిగిలిన పన్నులు వేరువేరు రకాలవి. అనంతర కాలంలో ప్రవేశపెట్టబడ్డ సంక్లిష్ట భూమి శిస్తు విధానానికి బీజరూపం బింబిసారుడి కాలంలో మొదలైంది. ఇతడు ఆరవ శతాబ్దపు ఉత్తర భాగంలో మగధను పరిపాలించాడు. భూవిస్తీర్ణం, ఉత్పత్తిపై అధికారులు విలువకట్టి, పన్నులను విధించి ఒక నిర్ణీత సమయంలో వసూలు చేసే పద్ధతిని అతడు ప్రారంభించాడు. సాగులో నున్న భూమిని కొలిచేందుకు, పంటను విలువ కట్టేటందుకు ఉద్యోగులు నియమించబడ్డారు. ప్రతి గ్రామం ఒక గ్రామణి లేదా గ్రామ పెద్ద అధీనంలో ఉంచబడింది. అతనే ఆ గ్రామం భూమిశిస్తు వసూలుకు బాధ్యుడు. గ్రామపెద్ద వసూలు చేసిన శిస్తును ఉద్యోగులు కోశాగారంలో చేర్చేవారు.

వైయక్తిక భూయాజమాన్యాలలో తేడాలుండటం చేత భూస్వాములలో వివిధ స్థాయిలు తలెత్తాయి. సంపన్న రైతులను 'గహపతులు' లేదా 'గృహపతులు' అనేవారు. గృహస్థులలో కొందరు భూస్వాములైతే, సామాన్య వ్యవసాయదారులను 'కస్సకులు' లేదా 'కృషకులు' అనేవారు. సంపన్నులు, రక్తసంబంధీకులు కాని శ్రామికులను దాస కర్మకారులుగా వ్యవసాయ సంబంధితమైన పనులలో నియమించుకునేవారు. సామాన్యులకు కుటుంబంలోని మిగిలిన సభ్యులే వ్యవసాయపు పనులలో సహాయపడేవారు. రాజ్యం ఉత్పత్తి నియంత్రణ చర్యలు చేపట్టే పెద్ద వ్యవస్థగా రూపొందనారంభించినపుడు, స్థాయిని తెలిపే తరగతులుగా వర్ణాలను తరచుగా పేర్కొన్నారు. వర్ణ వ్యవస్థను అగ్రవర్ణ దృక్పథంలో వివిధ జాతులనే భావనతో కాక సజాతిగానే భావించారు. సామాజిక హెచ్చుతగ్గుల క్రమంలో చివరగా వ్యవసాయదారులు, వృత్తిపనులవారు శూద్రవర్ణంలో చేర్చబడ్డారు. శూద్రవ్యవసాయదారులపై ఆధారపడటం ఎక్కువ కావటంతో భూమిలేని వ్యవసాయ కూలీల పరిస్థితి సామాజిక హెచ్చుతగ్గుల క్రమంలో మరింతగా దిగజారింది.
మనకు కనిపించే మరొక ముఖ్య ధోరణి భూమిని మెల్లిమెల్లిగా రాజ్యం అధీనంలోనికి తీసుకువచ్చి, బంజరుభూమిపై ఆధిపత్యం రాజ్యానిదే అనటం. బంజరు భూములపై రాజుకు గల విశేషాధికారం వల్ల రాజుకు దానిపై వచ్చే ఆదాయం మీద అధికారం వచ్చింది. సాగులోనున్న భూమిపై 1/6 వంతు పన్నుగా రాజుకు వస్తుంది. ఆరవవంతు ఆదాయపు హక్కుదారుగా రాజును 'షడ్భాగి' అనేవారు. యథార్థంగా చూస్తే పన్ను కొన్ని సందర్భాలలో పేర్కొనబడ్డట్లు 1/6 వంతు కన్న ఎక్కువ వసూలు చేసి ఉండవచ్చు. రాజుకు చెందిన భూములుగా కొంత భాగాన్ని పక్కకు పెట్టే పద్ధతి బంజరు భూములపై రాజు యాజమాన్యం వల్ల వచ్చింది, రాజ్యానికి సంకేతంగా రాజును భావించటం చేత భూయాజమాన్యం రాజుకివ్వబడింది. క్రమంగా రాజుకూ రాజ్యానికీ మధ్య నున్న తేడాలు అస్పష్టమై రాజుకు భూమిపై నున్న హక్కునెవరూ గట్టిగా సవాలు చెయ్యలేదు.

5. మౌర్యుల కాలం-పన్నులు:

మౌర్యుల కాలం నాటికి విశాల భూభాగాలను అదనంగా వ్యవసాయంలోకి తీసుకు రావటం జరిగింది. ఉత్తర భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడింది. భూమి శిస్తు ప్రభుత్వానికి గుర్తించబడ్డ ఆదాయవనరయింది. భూమి శిస్తును క్రమబద్ధంగా నిర్ధారించి వసూలు చేయటం చేత ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని గుర్తించారు. ఒక నిర్ణీతమైన ఆదాయం వస్తుందనే నమ్మకం రాజ్యానికి ఒక ఆర్థిక పరమైన భద్రతనిచ్చే భావాన్ని కలిగించింది. ఆనాటి పరిపాలనా వ్యవస్థ లక్ష్యం, సమర్థవంతంగా భూమి శిస్తును వసూలు చేసి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచటంపై కేంద్రీకృతమైంది. వ్యవసాయ సంబంధం కాని ఇతర ఆర్థిక కార్యకలాపాలను కూడా వారు ప్రోత్సహించారు. గ్రామాల్లో పశువుల మందలు ఉండేవి. వాటి సంఖ్యను నిర్ధారించి, వాటిపై పన్ను విధించారు. అదనపు ఆహార ఉత్పత్తి కారణంగా వ్యాపారాభివృద్ధి జరిగింది. తీర ప్రాంతంలోని వ్యాపార సంస్థలు ప్రభుత్వ నియంత్రణ క్రిందకు వచ్చాయి. ఈ సంస్థల నుండి వివిధ రకాల పన్నులు, సుంకాలు వసూలు చేశారు. ఆ ప్రక్రియ గతంలో వ్యవసాయ ఉత్పత్తిపై విధించిన పన్ను విధింపు ప్రక్రియ నుండి పరిణామం చెందింది.

విశాలమైన బంజరుభూములు, రాజ్య సీతాభూములు ప్రభుత్వ నియంత్రణలో ప్రభుత్వం చేత సాగు చేయబడ్డాయి. ప్రభుత్వ భూములను ప్రభుత్వంచే నియమించబడ్డవారు లేదా కవులుదార్లు సాగుచేసి రాజ్యానికి పన్ను చెల్లించేవారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వమే స్వయంగా శ్రామికులను నియమించి వేతనం చెల్లించి సీతా భూములను సాగుచేయించింది. కొత్త భూభాగాల్లో నియమించబడిన శూద్రులు మొదట్లో పన్ను చెల్లించనక్కర లేదన్నారు. కాని వారు భూమిని సాగుచేయటం మొదలు పెట్టిన తరువాత పన్ను విధించి వసూలు చేశారు. ఆ విధంగా ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకున్నది.

మగధ రాజుల వలెనే మౌర్యులు కూడా సాగులోనున్న భూవిస్తీర్ణం మీద, పంట దిగుబడి పైన పన్నులు విధించారు. బుద్ధుని జన్మస్థలమైన లుంబినిలో జ్ఞాపక చిహ్నంగా అశోకుడు వేయించిన శాసనంలో బలి, భాగ అనే రెండు పన్నులు పేర్కొనబడ్డాయి. అశోకుడు మొదటిదైన బలికి రాయితీ కల్పించి ఉత్పత్తిపై పన్ను వసూలు చేశాడు. పన్ను నిర్ధారణ ప్రాంతానికి ప్రాంతానికి మారింది. దిగుబడిలో 1/6 నుండి 1/4 వంతు వరకు నిర్ణయించారు. సాధారణంగా ఒక వ్యక్తి సాగుచేసిన భూమి మీద, ఆ భూసారం పైన, ఆధారపడి ఈ పన్ను నిర్ణయం చేశారు. ఇతర కార్యకలాపాలపై 'కర' అన్న పన్ను విధించబడింది. మరో రకమైన 'విష్టి' అన్న పన్ను శ్రమ రూపంలో వసూలు చేయబడింది. విష్టి అనేది వైయక్తికమైన పన్ను. ఇది బలవంతంగా వసూలు చేయబడ్డ శ్రమ అయి వుండవచ్చు. చేతి పనులవారు రాజ్యానికి కొంత శ్రమను ఉచితంగా పన్నుగా ఇచ్చారు.

వ్యవసాయం నిమిత్తం నీటి సరఫరాను ప్రభుత్వం చేపట్టినప్పుడు నీటిని క్రమం తప్పకుండా ప్రభుత్వ బాధ్యతగా సరఫరా చేసినప్పుడు ప్రజలు, రైతులు నీటి పన్ను చెల్లించారు. చంద్రగుప్త మౌర్యుని రాష్ట్రపాలకుడు ఒకడు పశ్చిమ ప్రాంతంలోని గిరినార్లోని ఒక నదిపై ఆనకట్టను నిర్మించి ఆ సుదర్శన తటాకాన్ని ఆ ప్రాంతం నీటి సరఫరాకు ఇచ్చాడు. సరిహద్దులలోని ఒక శాసనం ఈ తటాకం స్థానికుల శ్రమతో అధికారుల చొరవతో నిర్మించబడిందని తెలుపుతుంది, ఎక్కడైతే నీటి సరఫరా ప్రభుత్వం కాక, ప్రజలే చేపడతారో బావులు, కాలువలు, చెరువులు, ఎత్తిపోతల ద్వారా ప్రజలే నిర్వహిస్తారో అక్కడ నీటిపై పన్ను తగ్గించబడింది, లేదా మినహాయింపు ఇవ్వబడింది.

మౌర్యుల కాలంలో భూమి సారవంతమైనది కావటం చేత వ్యవసాయదారులు రెండు పంటలు పండించారని, అది సర్వసాధారణమని మెగస్తనీస్ వ్రాతలవల్ల తెలుస్తుంది. భూస్వాములు వ్యవసాయ రంగంలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు, స్వంత భూములుగల రైతులుగా, భూకామందులుగా, భూమిని సాగు చేసి లేదా చేయించి రాజ్యానికి వివిధ రకాల పన్నులు చెల్లించారు. పెద్ద భూకామందులు కౌలుదార్ల వద్ద నుండి విడిగా కౌలు వసూలు చేసారు.

భూమిపై సొంత ఆస్తి హక్కును కాలక్రమంలో అంగీకరించారు. ఎవరైనా తన భూమిని అమ్మదలచుకున్నప్పుడు ముందుగా కొనుగోలు హక్కు రక్తసంబంధీకులకు, అప్పు ఇచ్చినవారికి ఇవ్వవలసి ఉండేదని తెలుస్తుంది.

6. గుప్తుల కాలం-పన్నులు:

మౌర్య రాజ్యవ్యవస్థ ప్రధానంగా అమలులో నున్న ఆర్థిక వ్యవస్థ నుండి శిస్తువసూలు చేయుటలోను, లేదా రైతాంగ వ్యావసాయిక వ్యవస్థ అభివృద్ధికి రాజ్య జోక్యంతో కృషి చేయగా గుప్తరాజ్య వ్యవస్థ, ఇతర సమకాలీనులూ వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థను పునర్నిర్మించటానికి కృషిచేశాయి.

ఈ కృషి జరిగిన విధాన్ని రొమిలా థాపర్ ఇలా వివరించారు.

‘‘మొదట్లో ఇది గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయీకరణ పెరిగేందుకు చోదక శక్తుల్లా పనిచేసే వ్యక్తులకు భూదాన మియ్యటం ద్వారా జరిగింది. కొత్తవారిని తీసుకువచ్చి వ్యవసాయదారులుగా మార్చేముందర అక్కడ ఉన్న ఇతర సమూహాల వారినే వ్యవసాయదారులుగా చేయాలన్న లక్ష్యంతో కృషిచేశారు. రాజరికాన్ని సమర్థిస్తూ చేసే భూదానం యజ్ఞయాగాలకన్న శక్తివంతమైనదిగా గుర్తించటమేకాక దాన్నొక మహాదానంగా భావించారు. ఇది రాజు పెట్టే ఒక పెట్టుబడిగా, సారవంతమైన భూముల్లోనూ, నీరు అందిన బంజరు భూముల్లోనూ వ్యవసాయం పెరిగి అవి జనావాసాలుగా మారుతాయని భావించారు. సరిహద్దులకు అవతలగా, వ్యవసాయానికి దూరంగా ఉన్న భూములు కావాలన్న ఉద్దేశ్యంతో గంగా మైదాన మధ్యప్రాంత భూములుకాక దూరంగా ఉన్న భూములను దానాలుగా ఇచ్చారు. క్రమంగా వ్యవసాయ ఆవాసాల స్థాపన పెరుగుదలకు రాజ్యజోక్యం చొరవ తక్కువగా, భూదానాలు అందుకొన్న వారి చొరవ ఎక్కువగా కన్పిస్తుంది.’’3

మతసంస్థలకు, క్రతుకాండల నిర్వహణలో నిష్ణాతులకూ, అధికారులకూ భూములను దానాలుగా ఇచ్చారు. ఈ విధానం రాజ్యాల యొక్క పన్నుల వసూళ్లను పెంచలేదు. కాని స్థానిక స్థాయిలోను, గ్రామస్థాయిలోను సంవన్న వ్యావసాయిక కేంద్రాల అభివృద్ధికి సహాయపడింది.

భూదానాలివ్వటం అనే ప్రక్రియ కొత్త ప్రాంతాలలో రైతు వ్యవసాయం ద్వారా రాజకీయ ఆర్థిక వ్యవస్థలో క్రమంగా మార్పు తెచ్చింది. సిద్ధాంత రీత్యా బంజరుభూమి రాజ్యానికి చెందుతుంది. పచ్చిక బయళ్లు, అడవీ కూడా వాటిలో భాగాలే, దానమిచ్చిన వారి ఉద్దేశ్యం. దానగ్రహీతలు చెట్లు సరికి శుభ్రంచేసి చదునుచేసి నాగలితో వ్యవసాయం ప్రవేశపెట్టి రాజ్యపు ఆదాయం పెంచటమే. దానమిచ్చినప్పుడు పంటకు అనువైన భూభాగం అంతకు పూర్వం వ్యవసాయ భూమి కాకున్నా దానిలో వ్యవసాయం చేశారు.

దాన గ్రహీతకు ఆదాయం పై హక్కుతో పాటు పరిపాలనా సంబంధమైన, న్యాయ సంబంధమైన హక్కులు కొన్ని ఇవ్వబడ్డాయి. గ్రామాలు, భూములు దానమిచ్చినప్పుడు వానితో పాటు ఆ భూముల్లో పని చేస్తున్న రైతులను కూడా బదలాయించారు. ఈ విధంగా బదిలీ అయిన రైతు తన భూమితో పాటు భూదానం తీసుకున్న వ్యక్తి యొక్క భూమిని తప్పని సరిగా సాగుచేయనక్కరలేదు. రైతు తాను ఇంతకు పూర్వం ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లించేవాడో అంతే సొమ్మును దానగ్రహీతకు ఇవ్వాలి. అయితే, శాసనంలో దాన గ్రహీతకిస్తున్నట్లు పేర్కొన్న ఇతర హక్కులను రైతు అంగీకరించాలి. భూదాన గ్రహీతకిచ్చిన సదుపాయాల్లో ఒకటి ప్రభుత్వాధికారుల, సైనికుల అవసరాలు తీర్చవలసిన పనిలేకపోవటం, కొత్త పన్నులను వృష్టి, కొర్వి వంటి పన్నులను విధించే హక్కులను దాన గ్రహీతకు ఇచ్చారు. కాలక్రమంలో చిన్నచిన్న రైతులు చేసే ఉత్పత్తులతోపాటు పెద్దపెద్ద భూకమతాల యజమానుల వ్యవస్థా రెండూ కొనసాగాయి.

7. పల్లవులు-పన్నులు:

దక్షిణ భారతదేశంలో క్రీ.శ 500-900 మధ్య కాలంలోని ప్రధాన పాలకులు పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులు. పల్లవుల కాలం నాటి రాగి శాసనాల ద్వారా ఆనాటి కౌలు గురించి, పన్ను విధానం గురించి తెలుస్తున్నది. వీరు గ్రామస్థుల నుండి రెండు రకాల పన్నులు వసూలు చేశారు. వ్యవసాయ భూమిపై వచ్చిన మొత్తం ఆదాయంలో 1/6 వ వంతు నుండి 1/10వ వంతు వరకు భూమి శిస్తుగా వసూలు చేసేవారు. మిగిలిన వారి కంటే పల్లవుల కాలంలో భూమి శిస్తు తక్కువగా ఉండటం గమనించవచ్చు. ఈ శిస్తు రాజ ప్రతినిధికి అప్పగించబడేది. రెండవది స్థానిక పన్నులు. ఈ రూపంలో వసూలు అయిన ధనాన్ని స్థానిక అవసరాల కోసం (తటాకాల మరమ్మత్తుల నిర్వహణ, దేవాలయ నిర్వహణ మొదలైనవి) ఖర్చు చేసేవారు.

పల్లవులు అన్ని వృత్తుల వారి నుండి పన్నులు వసూలు చేశారు. రాజుకు ఆదాయం ప్రధానంగా గ్రామాల నుండే వచ్చింది. వాణిజ్య, పట్టణ వ్యవస్థల నుండి వీరు పెద్దగా పన్నులు వసూలు చేయలేదు.

8. చోళులు-పన్నులు:

చోళులు వ్యవసాయ భూమిపై వచ్చిన మొత్తం ఆదాయంలో 1/3 వ వంతు పన్నుగా వసూలు చేశారు. పరిస్థితులను బట్టి పన్ను రాయితీ, తగ్గింపులను వీరు అనుమతించారు. అయినప్పటికీ వీరి కాలంలోని భూమిశిస్తు, స్థానిక పన్నులు వ్యవసాయదారుని శక్తికి మించినవిగా కనిపిస్తాయి. వీరు గనులు, అడవులు, ఉప్పుపై పన్నులు విధించారు. వృత్తి పన్నులు, రుసుములు, సుంకాలు, న్యాయ సంబంధ రుసుములు విధించారు. పన్నులు చెల్లించలేని వారితో పన్నుకు సరితూగే వెట్టి చేయించారు.

9. మొగల్ పాదుషాలు-పన్నులు:

జనం కనీస అవసరాలను సైతం తీర్చలేకపోవడం అనేది మొగల్ సామ్రాజ్య పతనానికి మూల కారణాలలో ఒకటి. పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలలో భారత రైతాంగ పరిస్థితి క్రమంగా దిగజారిపోయింది. రైతు ఎన్నడూ సంతోషకరంగా ఉన్న రోజు లేకపోగా, 18వ శతాబ్దంలో అయితే, అతడి బతుకు దారిద్య్రంతో మరింత దుఃఖభాజనమై అస్తవ్యస్తంగా హీనాతి హీనంగా తయారైంది. అక్బర్ పాదుషా పాలనా కాలం నుంచి భూమిశిస్తు భారం అలా పెరుగుతూనే ఉంది. జాగీర్లు నిర్వహిస్తున్న పాలకుల్ని తరచూ అటూ ఇటూ బదిలీ చేస్తూండటం కూడా రైతు బతుకు దుర్భరం కావడానికి కారణమైంది. తాము ఉన్న ఆ తక్కువ సమయంలోనే రైతుల నుంచి వీలైనంత దండుకునేవారు జాగీర్దార్లు. అమలులో ఉన్న ప్రభుత్వ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి, గొంతెమ్మ కోర్కెలు తీర్చుకుంటూ, రైతుల్ని అతి క్రూరంగా అణగదొక్కేవారు. రైతుల నుంచి భూమి శిస్తు వసూళ్ళ హక్కును వేలం వేసేవారు. వసూలు హక్కును పొందిన కాంట్రాక్టర్, రైతుల నుంచి తన ఇష్టం వచ్చినట్టు తనకు తోచినంత వసూలు చేసుకోవచ్చు. ప్రభుత్వానికి చెల్లించవలసిన సొమ్ము చెల్లించి తక్కువ సొమ్ము తాను తీసుకోవచ్చు. ఈ పద్ధతిని 'ఇజారా' అనే వారు. ఔరంగజేబు మరణానంతరం జాగీర్దార్ల భూములకూ ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యక్ష హక్కుభుక్తంలో ఉన్న 'ఖలీసా' భూములకు కూడా ఈ పద్ధతిని మరింత విస్తరించారు. ఈ పద్ధతివల్ల రెవిన్యూ రైతులు అనే ఓ సరికొత్త వర్గం పుట్టుకు వచ్చింది. రైతుల్ని పీడించి పిండుకునే వీరి వసూళ్ళకు హద్దూ లేదు పద్దూ లేదు! ఇటువంటి పోకడల వల్ల వ్యవసాయ రంగం స్తంభీభూతమైపోయింది. కర్షకుడు మరింత చిక్కిపోయాడు. రైతుల్లో అసంతృప్తి పెరిగి పెరిగి పెల్లుబుకడం మొదలైంది. పన్నుల బాధల నుంచి తప్పించుకోవడానికి రైతులు భూముల్ని వదిలివేసిన సందర్భాలూ ఉన్నాయి. సత్నామీలు, జాట్లు, శిక్కులు ఇంక మరికొన్ని జాతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడిన ఘట్టాలలో కూడా కర్షక జనాగ్రహం వ్యక్తమైంది. సామ్రాజ్యం సుస్థిరతను, బలాన్ని దెబ్బతీసింది. భూమిని నమ్ముకుని నాశనమైపోయిన రైతులు సంచార దోపిడీ ముఠాలుగా, అకృత్యాలకు సాహసించే బృందాలుగా మారిపోయారు. కొందరు జమీందార్లే ఈ ముఠాలకు నాయకత్వం వహించారు. తత్ఫలితంగా దేశంలో శాంతిభద్రతలు భగ్నమై, మొగల్ పాలనా సామర్థ్యం సర్వం పతనమైంది.

బ్రిటీషు వారి కాలంలో రైతుల సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థిరమైన భూమి పన్ను విధానం (Permanent Settlement), జమీందారీ వ్యవస్థ రైతుల దుస్థితికి కారణమయ్యాయి. భూమి సాగుదారుల హక్కులను కాలరాయడం, అధిక పన్నులు, అసమానంగా భూమి పంపిణీ ఇవన్నీ రైతు ఉద్యమాలకు బీజం వేశాయి.

10. రైతుల తిరుగుబాట్లు:

1859 లో బంగాళాలో నీలి ఉద్యమంతో రైతులు బ్రిటీష్ అధికారులకు వ్యతిరేకంగా తిరగబడటం మొదలైంది. 1875లో జరిగిన డెక్కన్ రైతుల తిరుగుబాటు ప్రభుత్వం కొత్త భూకానూనాలను తీసుకురావడానికి దారి తీసింది. 1946-1951 మధ్య జరిగిన తెలంగాణ రైతు ఉద్యమం భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించేందుకు దోహదపడింది. భూసంస్కరణల చట్టం తీసుకురావడానికి ప్రేరణగా నిలిచింది. ఆ తరువాత కూడా పంటల కనీస మద్దతు ధరల కోసం రైతాంగం ఉద్యమిస్తునే ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం తీవ్రంగా ఉద్యమించటంతో ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది.

11. ముగింపు:

  • వ్యవసాయాభివృద్ధి వల్ల స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రజల రక్షణ కోసం రాజ్య వ్యవస్థ అవసరమైంది. రాజ్య వ్యవస్థ తన ఆదాయాన్ని, అధికారాన్ని  మరింతగా పెంచుకోవటం కోసం వ్యవసాయాభివృద్ధికి కృషి చేసింది. 
  • మౌర్యుల కాలం నాటికి మాత్రమే తాము సాగు చేసే భూమికి సంబంధించి స్వంత ఆస్తి హక్కును రైతులు పొందగలిగారు. గుప్తుల కాలంలో భూదానాలు పొందిన వారికి ఉన్న హక్కులు, వెసులుబాట్లు రైతులకు లేకపోవటం గమనించవచ్చు. 
  • ఈ క్రమంలో రైతు కష్టాన్ని కొంతవరకు అర్థం చేసుకొన్న రాజులుగా పల్లవులు మాత్రమే కనిపిస్తారు. చోళులు, మొగల్ పాదుషాలు, బ్రిటీషు వారు ఒకరిని మించి మరొకరుగా రైతుల శ్రమశక్తిని దోచుకున్నారు. 
    రైతు ప్రస్థానాన్ని గమనించినపుడు ఒకప్పుడు రాజ్య వ్యవస్థకు, ఈనాడు దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుముకగా ఉండి కూడా అతడి జీవితం ఆనందంగా సాగలేదని అర్థమౌతుంది. 
  • ఈనాడు సైతం లెక్కకు మిక్కిలి సమస్యలతో అతడు సతమతమౌతున్నాడు. ప్రపంచీకరణ రైతాంగానికి కొత్త సవాళ్ళను కానుక చేసింది. అనూహ్య, అననుకూల వాతావరణ పరిస్థితులు, దళారీలు చేసే మోసాలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పండించిన పంటకు కనీస మద్దతు ధరను పొందలేని నిర్వేదం మూడు పేటల ఉరితాడుగా రైతు మెడకు బిగుసుకుంటున్నది. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు సమాజం అండగా నిలవవలసిన తరుణమిది.

12. సూచికలు:

  1. రొమిలా థాపర్ భారతదేశ చరిత్ర (క్రీ.శ. 1300 వరకు), డా. కామేశ్వరరావు కె.యస్. (అనువాదం), పుట. 152
  2. భారత చరిత్రలో రైతు, ఇర్ఫాన్ హబీబ్, పుట. 1
  3. రొమిలా థాపర్ భారతదేశ చరిత్ర (క్రీ.శ. 1300 వరకు), డా. కామేశ్వరరావు కె.యస్. (అనువాదం), పుట. 357

13. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఇర్ఫాన్ హబీబ్, 1985, భారత చరిత్రలో రైతు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్.
  2. కామేశ్వరరావు కె.యస్. (అనువాదం), 2015, రొమిలా థాపర్ భారతదేశ చరిత్ర (క్రీ.శ. 1300 వరకు), అలకనంద ప్రచురణలు, విజయవాడ.
  3. కృష్ణారావు వై.వి. (సంపాదకుడు),1986, ఆంధ్రప్రదేశ్ లో రైతు ఉద్యమాలు పోరాటాలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
  4. కృష్ణారెడ్డి కె., 2007, సమగ్ర భారత చరిత్ర ప్రాచీన యుగం, ప్రజాశక్తి బుక్ హౌస్, హైదరాబాద్.
  5. పరబ్రహ్మశాస్త్రి పి.వి., 2012, ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర గ్రామీణజీవనం, ఎమెస్కో, హైదరాబాద్.
  6. బాలగోపాల్ కె., 2015, ప్రాచీన భారతదేశ చరిత్ర డి.డి. కోశాంబి పరిచయం, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్.
  7. రాహుల్ సాంకృత్యాయన్, 1990, మానవ సమాజం, ప్రజాశక్తి బుక్ హౌస్, హైదరాబాద్.
  8. రోహిణీప్రసాద్ కొడవటిగంటి, 2009, మానవ పరిణామం, స్వేఛ్చాసాహితి, హైదరాబాద్.
  9. లియో హ్యూబర్ మన్ (అనువాదం-కేశవరెడ్డి కొమ్మారెడ్డి, శివన్నారాయణ లంకిరెడ్డి), 1997, మానవుడు సంపద సమాజం, ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ.
  10. లూయీ హెన్రీ మోర్గన్ (అనువాదం-మహీధర రామమోహనరావు), 1987, పురాతన సమాజం, విజ్ఞాన వికాస సమితి, విజయవాడ.
  11. వెంకటేశ్వరరావు పర్వతనేని, గోపాలకృష్ణశర్మ ఆకెళ్ళ, 1945, భారతీయ కర్షక చరిత్ర (మొదటి భాగము), తెలుగుతోట గ్రంథమండలి, బెజవాడ.
  12. శేషగిరిరావు భద్రిరాజు, 1990, ఆంధ్రప్రదేశ్ లో రైతు ఉద్యమాలు, తెలుగు అకాడమి, హైదరాబాద్.

View all

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

(A Portal for the Latest Information on Telugu Research)


AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal