AUCHITHYAM | Volume-06 | Issue-02 | February 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed
7. ఓరుగల్లు స్థల, క్షేత్ర నామాలు: ఐతిహ్యాలు
డా. బానోత్ స్వామి
పోస్ట్ డాక్టోరల్ ఫెల్లో , తెలుగు విభాగం
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్
వరంగల్, తెలంగాణ
సెల్: +91 9603082128, Email: banothswamy128@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 23.12.2024 ఎంపిక (D.O.A): 28.01.2025 ప్రచురణ (D.O.P): 01.02.2025
వ్యాససంగ్రహం:
తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాముఖ్యతను చరిత్రను సంతరించుకున్న ప్రాంతం ఓరుగల్లు. కాకతీయుల రాజధాని కేంద్రంగా కాకతీయులు ఇక్ష్వాకులు, శాతవాహనులు, బహుమతి సుల్తానులో మొదలగు రాజు అంశాలు ఓరుగల్లు ప్రాంతాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని రాజ్యపాలన చేయడం జరిగింది. ఈ క్రమంలో ఓరుగల్లు ప్రాంతానికి స్థల క్షేత్ర నామాలు చారిత్రక ఐతిహాలు ఎన్నో చరిత్రలో దాగి ఉన్నాయి. కాకతీయులు నిర్మించిన చారిత్రక కట్టడాల్లో అనేక కోటలు సరస్సులు దేవాలయాలు రాతి ద్వారాలు అనేక రాజకీయ చిహ్నాలు ఆనాటి కాలంలో నిర్మించబడినాయి. అని చెప్పడానికి అనేక చారిత్రక, సాహిత్య ఆధారాలను మనం గమనించవచ్చు. అందులో భాగంగానే ఓరుగల్లు స్థల క్షేత్ర నామాల ఐతిహాలు అనే అంశం మీద పరిశోధన చేయదలుచుకున్నాను. ఎంచుకున్న పరిశోధన పత్ర సమర్పణలో భాగంగా ఓరుగల్లు చారిత్రక విషయాల గురించి, వివిధ క్షేత్ర నామాల గురించి గతంలో అనేక సాహిత్య రచనలు జరిగాయి. ముఖ్యంగా కాకతీయ కళా సమితి, ఓరుగల్లు రచనలు -1998. అనే వ్యాస సంపుటినే ముద్రించడం జరిగింది. కాకతీయశాసన సాహిత్యము, పుచ్చ వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి అనే రచయిత 1986లో సంకలనాన్ని ముద్రించడం జరిగింది. మరియు కాకతీయుల వైభవము - సాహిత్యము - శిల్పము - కళలు ఆచార్య హరి శివకుమార్ ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు అకాడమీ డిసెంబర్ 2012 న ప్రత్యేక సంచికను ముద్రించడం జరిగింది. వీటితోపాటు వరంగల్ జిల్లా జాతరలు ఉత్సవాలు పండుగలు అనే అంశం మీద డాక్టర్ చిర్రా రాజు పరిశోధన చేయడం జరిగింది. తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర ముదిగొండ సుజాతరెడ్డి తెలంగాణ సరస్వతి 2015 లో కాకతీయుల గురించి ప్రస్తావించడం జరిగింది. ఇవి పూర్వ పరిశోధనలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం చారిత్రక విషయాలను అనుసరించి నేడు మరికొన్ని విషయాలను క్షేత్ర పర్యటన ద్వారా గమనించిన విషయాలను చారిత్రక అంశాలను విశ్లేషిస్తూ పరిశోధన వ్యాస సంగ్రహాన్ని సమర్పిస్తాను. ఈ పరిశోధన వ్యాసరచనలో కొన్ని విషయాలను ప్రథమ ద్వితీయ ఆకారాలైన పుస్తక రూపంలో సేకరించడం జరిగింది. వాటికి సంభందించిన పూర్తి విషయాలను తెలియజేస్తున్నా ఆధార గ్రంధాలలో పాద సూచికలలో పరిపూర్ణంగా తెలియజేస్తాను. ఎంచుకున్న పరిశోధన పద్ధతి విశ్లేషణాత్మక పద్ధతి ద్వారా వ్యాసాన్ని తెలియపరిచాను. ఎందుకంటే చారిత్రక విషయాలను విశ్లేషణ చేయడం ద్వారా సమగ్రమైన సమాచార ఫలితం వస్తుందని అభిప్రాయం. కావున ఈ పరిశోధన అంశాన్ని విశ్లేషణాత్మక పద్ధతి ద్వారా పరిశోధన చేయుచున్నాను. ఓరుగల్లు స్థల, క్షేత్ర నామాలకు వివిధ ప్రాంతాలకు వివిధ చారిత్రక నేపథ్యం ఆయా కాలాలతో ముడిపడి ఉంది. 13వ 14వ శతాబ్దంలో కాకతీయులు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలన చేసిన క్రమాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్ద కాలంలో ఓరుగల్లు ప్రాంతంలో గుర్తించబడిన కొన్ని స్థలక్షేత్ర నామాలను పరిశోధన పరిమితులకు లోబడి ఎంచుకోవడం జరిగింది. విస్తారమైన చరిత్ర కలిగిన అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ కేవలం ఓరుగల్లు స్థలాక్షేత్ర నామాలు అనే అంశం మీద నేను పరిమితులకు లోబడి ఆనాటి కాలంలో జరిగిన చారిత్రక విషయాలు అంశాలను పరిశోధన ఫలితాలలో వెల్లడించాను.
Keywords: ఏకశిలానగరం, పేరిణి, పాండవుల గుట్టలు, సప్తస్వరాలు, కాకతి, స్వయంబు ఆలయం, త్రికూట, ఖుష్ మహల్, నాభి, యోనేస్కో
1. ఓరుగల్లు ప్రశస్తి:
వత అసమాన వైభవోపేతమై అద్వితీయ ప్రతిభాసమానమై, కాకతీయుల పౌరుష ప్రాధానాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిల్చిన వారి రాజధానీ నగరము ఓరుగల్లు. అనాటి రాజకీయాలకు, వాణిజ్య వ్యాపారాలకు, విద్యావైదుష్యాలకు కేంద్రంగా, కళలకు కాణాచిగా, పోలాటాలకు పురిటిగడ్డగా, ఉద్యమాలకు ఊపిరిగా, భాషా సాహిత్యాలకు భాగ్యరేఖగా భాసమానమై, దాదాపు మున్నూరు సంవత్సరాలు మనదేశంలో తిరుగులేని రాజధానిగా వర్ధిల్లినది వరంగల్లు నగరము.
శాసనాలు, సాహిత్యము, సనదులలో ఆంధ్ర నగరంగాను, త్రికూట నగరంగాను (నేలవీడు, మట్టెవాడ, ఏకశిలానగరం) ప్రశస్తి నొందినదీ ఓరుగల్లు, ఆంధ్ర దేశాన్నేలిన కాకతి రాజన్యుల ప్రశంస, వారు ధరించిన విజయ బిరుదప్రశస్తులు, కాకతి రాజ్య భారదౌరేయులుగా అజరామరమైన కీర్తి నార్జించిన కాకతి సేనానుల ప్రశంస మొదలైన అంశాలను పరిశీలిస్తే పోరాటాలకు పుట్టినిలై ఆంధ్ర సంస్కృతికి ఆలవాలమై విజయ కేతనముల నెగురవేసి, దశదిశల తన కీర్తిచంద్రికలతో వెలిగిపోయిన ఈ ఓరుగల్లుకు చరిత్రలో ఎంతటి ఉన్నత స్థానమున్నదో మనకు అవగతమౌతుంది. అలనాటి విద్యానాథుడు మొదలు మొన్న మొన్నటి శేషాద్రి రమణ కవుల వరకు గల వేలకొలది కవి పండితులను వేవిధాల ఆకర్షించిన ఈ ఓరుగల్లు వివిధ రంగాల్లో వారి వారి ప్రశంసలకు వస్తువయింది.ఆంధ్ర దేశమునంతటిని ఒక గొడుగు కిందికి తెచ్చి వైభవోపేతంగా పాలించిన కాకతీయుల రాజధాని ఓరుగల్లు “ఆంధ్రనగరి”గా కీర్తించబడింది.
ఓరుగల్లు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని ఒక నగరం. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం. 2014 జనవరి న మహా నగరంగా మారింది. వరంగల్ కి మరోపేరు ఓరుగల్లు. ఇది 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 8,30,281 జనాభాతో తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరంగా ఉంది. ఈ నగరం 406 కి.మీ2 (157 చ. మై.) విస్తీర్ణంలో ఉంది. 1163లో స్థాపించబడిన కాకతీయ సామ్రాజ్యానికి ఓరుగల్లు రాజధానిగా ఉండేది. కాకతీయులు నిర్మించిన స్మారక కట్టడాల్లో కోటలు, సరస్సులు, దేవాలయాలు, రాతి ద్వారాలు ప్రస్తుతం నగరం ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మారడానికి దోహదపడ్డాయి. ఓరుగల్లులో కాకతీయులు నిర్మించిన కాకతీయ కళా తోరణం అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చిహ్నంలో చేర్చబడింది. తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా కూడాఓరుగల్లు కు స్థానం కలిపించబడింది. ఓరుగల్లు కాకతీయ రాజవంశీకుల పురాతన రాజధాని. దీనిని బేతా రాజు I, ప్రోలా రాజు I, బేతా రాజు II, ప్రోలా రాజు II, రుద్రదేవ, మహాదేవ, గణపతిదేవ, ప్రతాపురుద్ర, రాణి రుద్రమ దేవి వంటి వారు పరిపాలించారు. బేతా రాజు I కాకతీయ రాజవంశం స్థాపకుడు, 30 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తరువాత అతని కుమారుడు ప్రోలా రాజు I తన రాజధానిని హనుమాకొండకు మార్చాడు.
గణపతి దేవా పాలనలో రాజధాని హన్మకొండ నుండి వరంగల్‌కు మార్చబడింది. ఆకట్టుకునే కోట, నాలుగు భారీ రాతి ద్వారాలు, శివుడికి అంకితం చేసిన స్వయంభూ ఆలయం, రామప్ప సరస్సు సమీపంలో ఉన్న రామప్ప ఆలయం వంటి అనేక స్మారక చిహ్నాలను కాకతీయులు వదిలేసారు. కాకతీయులు సాంస్కృతిక, పరిపాలనా వ్యత్యాసాన్ని మార్కో పోలో పేర్కొన్నారు. (మార్కో పోలో (Marco Polo) (1254 సెప్టెంబరు 15 – 1324 జనవరి 9 లేదా జూన్ 1325) ఒక వర్తకుడు, యాత్రికుడు ప్రతాపరుద్ర II ఓటమి తరువాత, ముసునూరి నాయకులు 72 నాయక అధిపతులను ఏకం చేసి, ఢిల్లీ సుల్తానుల నుండి వరంగల్ ను స్వాధీనం చేసుకుని యాభై సంవత్సరాలు పాలించారు.
“నీరాజయంత్యంధ్రపురీ రమణ్యః
ప్రదీపజాలై ర్వరధీర భద్రకమ్” (ప్రతాపరుద్ర యశోభూషణం)
అని విద్యానాథుడు తన ప్రతాపరుద్ర యశోభూషణంలో ఓరుగల్లును ఆంధ్రపురి (ఆంధ్రనగరి)గా ప్రస్తుతించాడు. కాకతి రాజన్యుల తెల్లని కీర్తికాంతుల చేతనే కైలాస పర్వతా లేర్పడినాయని ఉత్ప్రేక్షించాడు విద్యానాథుడు.
“యైర్దేశ స్త్రిభిరేష యాతి మహతీం / ఖ్యాతం త్రిలింగాఖ్యయా యేషాం
కాకతి రాజకీర్తి విభవైః / కైలాస శైలాః కృతా? తే దేవాః
ప్రసరత్ప్రసాద మధురా శ్రీశైల / కాళేశ్వర ద్రాక్షారామ నివాసినః
ప్రతిదినం త్వచ్ఛేయనే జాగ్రతు” (వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వము.పూ.సం.14)
దీని వల్ల మణినా వారు పోరేన మణి అన్నట్లు కాకతీయుల వలన ఓరుగల్లు, ఓరుగల్లు వల్లన కాకతీయులు చరిత్రలో అవినాభావ సంబంధము కలిగి వెలిగిపోయారని తెలుస్తున్నది. కాకతీయుల రాజధానియైన ఆనాటి ఓరుగల్లు విద్యా కేంద్రంగా వర్ధిల్లిందని క్రింది శ్లోకాల వలన తెలుస్తున్నది.
కీరాః పఠంతి పటవో వటుభి సమేతాః - (రుద్రదేవుని వేయిస్తంభాల గుడి శాసనము హనుమకొండ)
ఓరుగల్లు అనుమకొండ నగరాల్లోని విప్రపండితులు తమ శిష్యులచేత కంఠస్థం చేయిస్తున్న శ్లోకాలను విని విని చిలుకలు కూడా విద్యార్థులతో సమానంగా శ్లోకాలను వల్లిస్తున్నాయట.
లక్ష్మీ నివాస గృహమిత్యబిఖిలా నరేంద్రాః
శౌర్యాతిభూమిఖనిరి త్వరివీర వర్గాః
విద్యావిహార పదవీతి చ లబ్ధవర్ణా:
శ్రీకాకతీంద్ర నగరీ మనిశం స్తువంతి
విద్యానాథుడు కాకతీయులు సంస్కృతమునే గాక, మాతృభాష తెలుగునూ అభిమానించి, దాని నెంతగానో అభివృద్ధి పరిచారు. వారి శాసనాలు చాలా వరకు సంస్కృతంలో నున్నా, అక్కడక్కడ తెలుగు కనిపిస్తున్నది. సంస్కృతాంధ్ర కవుల నెందరినో పోషించిన కాకతి రాజన్యులు ఇక్కడ కావ్యసంపద వెల్లివిరిసేందుకు కారకులు అయ్యారు. ఓరుగల్లు సాహితీ సౌరభాలను దిగ్దిగంతాల పరిమళింపజేశారు.
దండిపోకనల సఖంద సరణి
పోషించితివి రామవిభుని కరణి ఖాస్తు
కనీశ్వరామోద ఫణితి
ఉత్సహించితి యజ్వ సత్సాహసంబున
సుభయభాషాప్రౌఢి నుచితసభల
జ రంగనాథ రామాయణ రమ్యకావ్య
సారమున బెంచితివి నుడికార మౌర
మమ్ము ధన్యుల జేసి నీ స్మరణ నేడు
రమ్ము తల్లిరొ కాకతి రాజ్యలక్ష్మి (రమణ మూర్తి . కా.సం.పుట164)
కాకతి రాజ్యలక్ష్మి సాహితీసౌరభాలు గుబాళించిన తీరు పైకవి ప్రశంసల్లో మనకు ఆస్వాదమానమౌతుంది. ఓరుగల్లు కోట ఆనాటి స్థలదుర్గాల్లో అతివిశాలమైనది. విదేశీ యాత్రికులు, మహమ్మదీయ చరిత్రకారులే గాక, చండయాత్ర చేసిన ఉలూగఖాన్ లాంటి శత్రువీరులు కూడా దీని పటిష్టతను ప్రస్తుతించకుండా ఉండలేకపోయారు. నాటి నుండి నేటి వరకు కవులెందరో ఈ నగరాన్ని కీర్తించారు.
సీ॥ సప్తపాతాళ విప్లవ మహాప్రస్థాన
ఘంటాపథంబైన గగనవరిఘ
తారకామండల స్తబకావతంసమై
కనుచూపుగొనని ప్రాకారరేఖ
పుంజీభవించిన భువనగోళముభంగి
సంకులాంగణమైన వంకదారి
మెరుగు రెక్కలతోడి మేరుశైలము బోలు
పెను పైడితలుపుల పెద్దగవని
అని క్రీడాభిరామము వర్ణించిన ఓరుగల్లు కోట ప్రవేశద్వార మిది. కవిత్వం కాబట్టి ఇందులోని అతిశయోక్తుల నవతల పెట్టినా, మట్టికోటచుట్టూ, రాతికోట చుట్టూ ఉండే గగనవరిఖలు (అగడ్తలు) ఎత్తయిన కోటబురుజులు, వంకదారులు, పెద్దపెద్ద గమనులు నేటికీ మనం చూడవచ్చును. కాకతీయుల మొదటి రాజధాని అనుమకొండ, కాకతి ప్రోలరాజు కాలంలో రాజధానికి సరుకులు తెస్తున్న ఒక బండి ఒకచోట భూమిలో కూరుకొని పోయింది. ఎంత ప్రయత్నించినా రాలేడట. అది రాత్రి కావడంతో బండ్లవాళ్ళు రాత్రంతా అక్కడే కాపలా ఉన్నారు. తెల్లవారి ఆయన బుధలన చూచేటప్పటికి కూరుకుపోయిన బండి చక్రనేమి సువర్ణమును మైందట. ఆ విషయాన్ని ప్రోలరాజుకు తెలిపారు. పురోహిత అమాత్యులతో అక్కడకు వెళ్ళిచూడగా భూమిలో పరుసవేది అయిన శంభులింగం కనిపించిందట. శంభుడు లింగాకృతి నొందిన అచ్చోటనే ఒరగల్లు (పరుసవేది శిల) కోటకు పునాదులు పడ్డాయి. ఆ తర్వాత మూడుశతాబ్దాల కాలం వరంగల్లన్న యావదాంధ్ర దేశానికి రాజధానియై విలసిల్లింది. అక్కడ స్వయంభూ దేవాలయం వెలసింది. ఆ దేవాలయం కేంద్రంగా చుట్టూ ఓరుగల్లు కోట నిర్మింపబడింది. రాజధానిగా తన కీర్తిప్రభలను వెలార్చింది.
మమతతో శ్రీమల్లికార్జున దేవు
సిమించినే భర్తశేఖరుండు
ఎప్పుపట్టి మహామహం చెంచిచూడ
వాని కొనియాడ జెల్లునె వసుధలోన (చాగంటి భాస్కరలింగం కా.సం. పుట140)
కాకతి రుద్రుని తర్వాత, ఓరుగల్లు సామ్రాజ్య కీర్తిచంద్రిక లను దశదిశలా ప్రసరింపజేసినవాడు, పాండ్యుల పారద్రోలి కటకం నుంచి కంచి వరకు ఓరుగల్లు జయపతాకల నెగురవేసిన వాడు గణపతిదేవ చక్రవర్తి. అతడు మహావీరుడు విజేతయేగాక గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా. రుద్రమదేవి తండ్రికి తగిన తనయ. ఆదర్శ భారత నారీ శిరోమణి నాటికీ నేటికీ, ఏనాటికీ మహిళాలోకంలో మణిదీపంగా వెలిగి మహాసామ్రాజ్ఞి రుద్రమదేవి. అవిశ్రాంత పోరాటబాట పట్టిన రుద్రమదేవికి పోరుగల్లుగా ఈ ఓరుగల్లు పురిటిగడ్డ అయింది. పోరుగల్లుకు ఓరుగల్లు సార్ధక నామధేయమై చరిత్రలో చిరస్థాయిగా నిల్చిపోయింది. కైలాసంలో అర్ధనారీశ్వరుడైన శివుడు ఓరుగల్లులో కాకతి వంశమున రుద్రమదేవి రూపంలో సంపూర్ణ స్త్రీ రూపమునే ధరించి ఉన్నాడట.
యోరు రజితాచలే స్థితిమగా దర్భాంగినారిః
పురా సో.. యం సంప్రతి కాకతీశ్వరకులే సర్వాంగనారీ స్థితః (ప్రతాపరుద్రీయము-కా.సం. 296)
గారవించితి కనీంభముల దాన
ధార చెక్కుల జిడ్డువేరు నట్లు
ప్రజల పాలించితివి రామరాజ్యముపడు
సాటియగు చెప్పుకోదగ్గ శాంతి గూర్చి
సలిపితివి నిశ్చలము బ్రహ్మచర్య దీక్ష
రుచిర సద్గుణ నికురంబ రుద్రమాంబ - డా॥ పాటిబండ మాధవశర్మ (కా.సం. పుట188)
భూపచయ పట్టభద్రుడు ప్రతాపరుద్రుడు. కాకతీయ చక్రవర్తులలో చివరివాడు. ఇతని కాలంలో ఓరుగల్లు సకల కళాశోభితమై భాషా సాహిత్యసంపన్నమై, సర్వప్రజాజీవన సుభిక్షమై విలసిల్లినది. అంతటి ఆంధ్ర సమ్రాట్టు కీర్తి ప్రతిష్ఠల నెందరో కవి కుమారులు కీర్తించి గానం చేశారు.
సీ॥ గిరిరాజకన్యతో సరివచ్చు ముప్పాంబి
కడుపార నెవ్వాని గన్నతల్లి
అమరావతికి సాటియనవచ్చు ఓరుగల్
లాలసంబుగ నెవ్వ డేలు పురము
సురనది కెనవచ్చు ధర కాకిగా గంగ
యెవ్వాని పానార్హ శుద్ధజలము
శివుని జోడనవచ్చు.. (చాగంటి భాస్కరలింగం; కా. సం-పుట-140)
2. బమ్మెర పోతన:
బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు. నేటి జనగామ జిల్లా లో ని బమ్మెర గ్రామంలో లక్కమాంబ, కేసన దంపతులకు జన్మించాడు. అతని అన్న తిప్పన. ఇతను బమ్మెర వంశానికి చెందివాడు, శైవ కుటుంబం. ఇతని గురువు ఇవటూరి “సోమనాథుడు”. అతను ఆఱువేల నియోగులు, కౌండిన్యస గోత్రులు. తెలంగాణాపై మహమ్మదీయ దండయాత్రలు ప్రారంభ మైన దశలోనే ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు అనేక మంది రాయలసీమ ప్రాంతాలకు కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు తరలిపోయారు. బహమనీల కాలంలో ఈ వలసలు మరింత ఉధృతమయ్యాయి. కడప జిల్లా లోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి ఆలయసమంలో “బమ్మెర గడ్డ” అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో కల చెరువు క్రింద “పోతన మడి” ఉంది. అభినవ పోతన బిరుదాంకితులు వానమామలై వరదాచార్యులు పోతన జన్మస్థలం బమ్మెర అయినప్పటికీ ఒంటిమిట్టలోనే తన భాగవతాన్ని రచించాడని అభిప్రాయపడ్డాడు. కాని అతని భాగవత రచనను రాచకొండలో ప్రారంభించి ఒంటిమిట్టలో పూర్తి చేసాడు. పాల్కురికి సోమనాథుడు (1160 - 1240) శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన “శివకవి త్రయం” అనబడే ముగ్గురు ముఖ్య కవులలో ఇతనొకడు. తక్కిన ఇద్దరు మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు.
3. పాల్కురికి సోమనాథుడు:
తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. వీరశైవం వ్యాప్తికి కృషి చేశాడు. వీరశైవ సంప్రదాయంలో సోమనాథుడు శివుని ప్రమధ గణాలలో “భృంగి” అవతారం. అప్పటి ఇతర శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాథుడు వారి ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు. సోమనాథుడు వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే వైష్ణవ దంపతులకు జన్మించాడు. వీరు ఉత్తమరాజు వారను, కౌండిన్యస గోత్రము కలిగిన నియోగులు. అనేక శాస్త్రములు చదివిన మీదట వీరశైవం లోకి ప్రవేశించి దీక్ష ధరించెను. సోమనాథుడు గురువు కట్టకూరి పోతిదేవర వద్ద వీరశైవ/శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు.
4. కొలనుపాక జైనమందిరం:
ఈ జైనమందిరం తెలంగాణలోని ప్రముఖ జైన క్షేత్రం. ఇది వరంగల్ - హైదరాబాదు రహదారిలో హైదరాబాదుకు 65 కి.మీ, ఆలేరుకు సుమారు 6 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ ఆలయం 2వేల ఏళ్ళ నాటిది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం కోటద్వారాన్ని తలపిస్తుంది. అక్కణ్ణుంచి రెండు నల్లని ఏనుగులు లోపలికి ఆహ్వానిస్తున్నట్లుంటాయి. ఆలయ నిర్మాణానికి ఢోల్‌పూర్ రాయిని రాజస్థాన్ నుంచి తెప్పించారు. బయటకు వచ్చేందుకు కుడిపక్కా ఎడమపక్కా రెండు ద్వారాలున్నాయి. లోపలంతా భారీ గోపురం. ప్రతి స్తంభంలోనూ సూక్ష్మచిత్రకళ అబ్బుర పరుస్తుంది. ఇందులో ఆదినాథుడు, మహావీరుడు, నేమినాథుడు లాంటి జైనదేవుళ్ళ బొమ్మలే ప్రధాన ఆకర్షణ. ఆలయం లోనికి అడుగుపెట్టగానే ఎడమవైపునుంచి తీర్థంకరుల బొమ్మలు కనిపిస్తాయి. ఇందులో బంగారం, పాలరాయి, నల్లరాతితో చేసినవి ఉన్నాయి. లోపల నేలంతా పాలరాయే. ఇందులో నలుగురు తీర్థంకరుల బొమ్మలతో ఏర్పాటు చేసిన పెద్ద బొమ్మ ఉంది. దీనికి జైనుల పండుగ దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
భగవాన్ మహావీర్ విగ్రహం మూల విరాట్టుకు కుడివైపున గల గర్భగుడిలో 1.5 మీ. ఎత్తైన మహావీరుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం కుంభకంతో కూడిన సిద్దాసనం, అర్ధ పద్మాసనంలో ప్రశాంతమైన యోగముద్రలో ఉంది. వేళ్ళు పొడువుగా ఉన్నాయి. నవ్వు ముఖం, పాల భాగం విశాలంగా ఉండి చుబుకం మనోహరంగా ఉంది. వజ్ర విశేషజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇది ఫిరోజా రాతితో నిర్మించబడింది. ఇలాంటి అత్యధ్బుతమైన ప్రతిమ భారతదేశంలో మరెక్కడా లేదు. అర్ధ పద్మాసన సిద్దాసనంలో ఉండి ముఖ ముద్ర గాంభీర్యంగా ఉన్నది, కాంతి మండలం గుండ్రంగా ఉన్నది, లలాటం మీద చంద్రుడు, చుబుకం మీద సూర్యుడు, నాభి పై ఆకారం, అరచేతి మీద శంఖం, చక్రం ఉన్నాయి. ఇది భరత చక్రవర్తి నెలకొల్పిన అతి ప్రాచీనమైన విగ్రహం.
5. పాండవుల గుట్టలు భూపాలపల్లి:
ఎత్తైన బండరాళ్ళ మధ్య లోతైన అగాధాలతో లోయలు, అడుగడుగునా అబ్బురపరిచేవిధంగా పడిగెలెత్తి నిల్చున్న కొండవాళ్ళు. ఆ కొండగోడలపై అపురూపమైన ప్రాచీన రాతిచిత్రాలు. హిమాలయాలు, దక్కన్ పీఠభూమి కంటే కూడా పురాతనమైనవి. పాండవులగుట్టల్లో ‘ఎదురుపాండవులు, గొంతెమ్మగుహ, పంచపాండవులు, పోతిరాజు చెలిమె, మేకలబండ, ముంగీసబండ, తుపాకులగుండు, యానాదుల గుహ’లు చూడాల్సిన ప్రదేశాలు. వాటిలో ఎదురుపాండవులు దానికి కుడిపక్కన వెనకవైపు గుహలు, గొంతెమ్మగుహ, పంచపాండవుల దొనెల్లో అద్భుతమైన శిలాశ్రయచిత్రాలున్నాయి. ప్రాక్ యుగం నుండి చారిత్రకయుగం దాకా వేయబడిన రాతిచిత్రాలెన్నో అప్పటి జీవనశైలీ వైవిధ్యాల్ని కనువిందు చేస్తున్నాయి. కొన్నిచోట్ల పాతబొమ్మల మీదనే కొత్తబొమ్మలు వేసిన జాడలగుపిస్తున్నాయి. ఆరుచోట్ల వున్న చిత్రిత శిలాశ్రయాల్లో అన్నిబొమ్మలు ముదురు ఎరుపురంగుతో చిత్రించబడ్డవే. మందమైన గీతలతో చదునైన పూతలతో గీయబడిన ఈ బొమ్మల్లో శాకాహార, మాంసాహార జీవులు, మనుషుల బొమ్మలు వున్నాయి. పంచపాండవుల గుహలో రంగులలో పంచపాండవులు, కుంతి, ద్రౌపది, ద్రుపదుడు, పాండవుల పెండ్లి, శేషశాయి, గణేశుడు, శివలింగం, ఆంజనేయుడు, బ్రహ్మ, సరస్వతుల చిత్రాలున్నయి.
ఈ బొమ్మలన్నింటిలో ‘ఎదురు పాండవుల’నే కొండచరియలో వేసివున్న రాతిచిత్రాలు అతి పురాతనమైనవి, అపూర్వమైనవి. ఈ చిత్రాలొకచోట 6 అడుగుల కంటె ఎత్తుగా వున్నాయి. ఈ చిత్రాలు వేసిన తీరు, శైలి, మొరటుదనం, వాటిలోని జంతు జీవజాలం అన్నింటిని పరిశీలించి కాలానుశీలన చేస్తే ఇవి మనదేశంలోని మధ్యప్రదేశ్ ‘బింబేట్కా’ గుహల్లోని రాతిచిత్రాల కన్నా ప్రాచీనమైనవని తెలుస్తుంది. World Heritage వారు చెప్తున్నవిధంగా బింబేట్కా చిత్రాలు 30 వేల యేళ్ళనాటివైతే మనపాండవుల గుట్టబొమ్మల్లో అశ్వికులు, యుద్ధ సన్నివేశాలు, ఆయుధాలు, వివిధ వాహనాలు, అలంకరణలు వంటి ఆధునికరూపాలేవీ లేవు కనుక ఇవి వాటికన్నా ప్రాచీనకాలానికి చెందినవని రుజువవుతున్నది.
12,13వ శతాబ్ద కాలం ఒక్క పంచపాండవుల గుహల్లలో మాత్రమే వర్ణచిత్రాలున్నాయి. (అవి 12, 13 శతాబ్దాల నాటివిగా పురాతనశాఖ వారు అనుమానిస్తున్నారు.) భారతదేశంలో దాదాపు 2,500 చిత్రిత శిలాశ్రయాలున్న 400ల స్థావరాలు 100 శిలాచిత్రలేఖన మండలాల్లో కన్పిస్తున్నాయి. తెలుగునాట 28 చోట్ల, తెలంగాణాలో 14 తావుల్లో ఈ రాతిచిత్రాలున్నాయి. పాండవుల గుట్టల్లోని చిత్రాలు అంత్యప్రాచీన శిలాయుగం నుండి మధ్యశిలాయుగంవరకు తర్వాత చారిత్రకయుగంలో చిత్రించబడినవి. పాండవులగుట్టలో రాళ్ళను చూస్తే ‘కొలరాడో’ గుర్తొస్తుంది. రాతిచిత్రాలను చూస్తే పాండవుల గుట్ట తెలంగాణాలోని ‘చిత్రిత శిలాశ్రయాల విశ్వవిద్యాలయం’ అనిపిస్తుంది. ప్రాక్ యుగం నుండి చారిత్రయుగం దాకా మానవజీవన పరిణామాన్ని ఒకేచోట నిలుపుకున్న గుహాచిత్రాల సమూహమిది. ఈ గుట్టలమీది రాతిచిత్రాలను తొలిసారి గుర్తించింది, పురావస్తువారికి రిపోర్టు చేసింది చారిత్రకపరిశోధకులు, రచయిత డా.ఈమని శివనాగిరెడ్డిగారు.
6. శాసనాలు:
గుహ బయట వీరుల యుద్ధసన్నివేశం చిత్రించబడివుంది. రంగు, గీతలను బట్టి ఈ బొమ్మ చారిత్రకయుగం నాటిదనిపిస్తున్నది. గుహలో ఒక రాతిగో మీద బూడిదవన్నె రంగుతో రాసిన లిపి ఉంది. అట్లాంటి రాతలే ఎరుపురంగులో పంచపాండవుల గుహలో కూడా ఉన్నాయి. లిపిని బట్టి 6,7 శతాబ్దాలనాటివని తోస్తున్నది ఆ రాతలు.
“పాండవుల గుట్టల్లో మరొక చారిత్రకయుగ విశేషముంది. గొంతెమ్మగుహ తూర్పున బండరాయి అంచున ఒక ‘లఘుశాసనం’ ఉంది. అది ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ శాసనం. ఈ శాసనం గురించి పురావస్తుశాఖ వారు వివరించి రాయలేదు. కాని, ఇదే పేరుతో గల ఇట్లాంటి లఘు శాసనాలు తెలుగునాట 11చోట్ల, మహారాష్ట్రలో ఒకచోట లభించాయి. సున్నా గుర్తు బౌద్ధుల శూన్యవాదాన్ని సూచించే చిహ్నం అని పరిశోధకులు రాంభట్ల కృష్ణమూర్తి ‘ వేల్పుల కథ’లో రాసారు”1.( కాకతీయ శాసన సాహిత్యము, పుచ్చావాసుదేవ పరబ్రంహ శాస్త్రి,పు. సం.37)
7. తెలంగాణ కుంభమేళా/ సమ్మక్క సారక్క జాతర:
సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా. ములుగు కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నా సమ్మక్క-సారక్కలను దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై జరుపుకునే వారు, ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చెత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. (వరంగల్ జిల్లా జాతరలు పండుగలు, డా: చిర్ర రాజు పు. సం47)
8. ఖిలావరంగల్:
ఖిలా వరంగల్, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, ఖిలా వరంగల్ మండలానికి చెందిన గ్రామం. ఇది వరంగల్ దుర్గం/వరంగల్ కోట/ముసునూరి కమ్మ నాయక రాజుల కోటగా కాకతీయుల కోటగా పిలువబడే చారిత్రాత్మక ప్రదేశం. ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి.
“ఓరుగల్లు కోట నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరంలో ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేసారు. ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్పకళా సంపదకు నిలయం. కాకతీయ కీర్తితోరణాలు, స్వయంభూశివాలయం, ఏకశిల గుట్ట, గుండుచెరువు, ఖుష్ మహల్ తదితర దర్శనీయ ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. చరిత్ర ప్రకారం ఈ కోటకు మూడు ప్రాకారాలు ఉన్నాయి, ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికి కూడా చూడవచ్చు.”2. (తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర, ముదిగంటి సుజాతారెడ్డి, పు.సం.42)
శిలాతోరణ స్తంభాలు వరంగల్ కోటలో నాలుగు తోరణాలు సమానదూరాలలో విస్తరించి ఉంటాయి. ఈ తోరణాల మధ్య అప్పటి శిల్పకళాఖండాలు దర్శనమిస్తాయి.
9. స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం:
ఓరుగల్లు కోటలోని మహత్తర కట్టడాలలో స్వయంభూదేవాలయం ఒకటి. సా.శ. 1162లో గణపతి దేవ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించారు. భూభాగం నుంచి పుష్పాకారం, పైకప్పు నక్షత్ర ఆకారం పోలినట్లు రాతితో నిర్మించబడింది ఈ ఆలయం. గర్భగుడిలోని శివలింగం ఇతర దేవాలయాల్లోని శివలింగాల కన్న భిన్నంగా ఉంటుంది. ఖండములై పడివున్న చతుర్ముఖలింగము ఈ ఆలయములో మూలవిరాట్. ఇది భూమికి అతితక్కువ ఎత్తులో ఉండి పాణమట్టం గుడ్రంగా ఉంటుంది.
10. ఖుష్ మహల్:
ఈ కట్టడం తోరణాలకు అతి దగ్గరనే ఉంది. ముసునూరి కమ్మ నాయక రాజులు సా.శ. 1340 ప్రాంతంలో ఈ సౌధాన్ని కట్టించారు. ఈ దర్బారు పొడవు సుమారు 90 అడుగులుండగా, వెడల్పు-ఎత్తులు వరుసగా 45, 30 అడుగులుంటాయి. దర్బారు పైకప్పును కొనదేలిన ఆర్చిలు మోస్తున్నట్లుగా ఉన్నాయి, ఆర్చిల మధ్యన కర్ర దూలాలున్నాయి. పెద్ద పెద్ద ప్రమాణాల్లో కనిపిస్తున్న ఈ ఆర్చీలు కేవలం అందాన్ని అతిశయింపజేయడానికే. ఆర్చీల ముందు దర్వాజా లాంటి ఆర్చి, దానిపైన అందమైన అల్లికలతో కూడిన కిటికీలు దర్బార్ శోభను మరింత పెంచాయి.దర్బారులోకి ప్రవేశించే ప్రాంగణం మరింత అందమైంది. నిజానికిది రెండంతస్తుల్లో ఉంది. ఈ కింద, పైనున్న గదులు రాచ కుటుంబీకులకు చల్లని, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు వీలుగా నిర్మించబడ్డాయి.ఈ మహల్ గోడలు చాలా వెడల్పుండి బలిష్టమైనవి. అవి సుమారు 77 డిగ్రీల వాలుతో ఉండి వేలాడుతున్నట్లుగా కన్పిస్తాయి. ఎత్తైన ఈ భవనం పై భాగానికి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. కీర్తి తోరణాల మధ్య దొరికిన స్వయంభు దేవాలయ శిథిల శిల్పాలను సైతం ప్రస్తుతం ఈ ఖుష్ మహల్‌లో భద్రపరిచారు. దర్బారు మధ్యలో అందమైన నీటి కుండం ఉంది. ఇది ఆనాడు రాచవర్గ ప్రజలకు ఎంత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేదో! కాబట్టే, ఈ మహల్‌కు ‘ఖుష్ మహల్’ అని పేరొచ్చింది.
11. భద్రకాళీ దేవాలయం:
ఆలయ ప్రాంగణంలో గోశాల భద్రకాళీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రం, వరంగల్లులో ఉంది. ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుండి 1.5 కి.మీ.దూరంలోభద్రకాళీచెరువుతీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది. శ్రీ భద్రకాళీదేవీ విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండువుగా అలరారుతూ, భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. అమ్మవారు ప్రేతాసనాసీనయై ఉంది. ఆమె 8 చేతులతో - కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, ఛురిక, జపమాల, డమరుకం: ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలం, ఛిన్నమస్తకం, పానపాత్రలు ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉంది.
స్థలపురాణం: “ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోర్కెలను తీరుస్తూ ఉండినట్లూ “ప్రతాపరుద్ర చరిత్రం” “సిద్ధేశ్వర చరిత్రం” గ్రంథాలలో కనిపిస్తుంది. ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువగా ఏనుగుమీద ఎక్కి ఏకశిలానగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువుకూటానికి వచ్చానని చెప్పాడట. అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరచి పంపివేశారు. దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు, ఆ విద్వాంసులను కారుమాటలతోనైన జయించాలనే ఉద్దేశంతో “ఈ వేళ కృష్ణచతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా?” అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే, ఔనంటే సుదర్శనమిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది. కాదంటేనే అతనిని ఓడించినట్లవుతుంది అని నిర్ణయించి, “రేపు పౌర్ణమి” అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండింది. ఆ సంకట స్థితినుంచి తమను రక్షించుకోటానికి ఆ విద్వాంసులలో ప్రధానుదైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళీదేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట”3. (తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర, ముదిగంటి సుజాతారెడ్డి. పు.సం. 14), సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై “నీ మాట నే నిలుపుతా” నని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి, సుదర్శనమిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట. ఇది కేవలం దైవీశక్తి కాని, మానవశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. కనుక ప్రతాపరుద్రుని కాలంనాటికే భద్రకాళీ దేవాలయం ప్రసిద్దమై ఉండినట్లు సృష్టమవుతుంది.
ఆలయ నిర్మాణ విశేషాలు: 625 లోనే నిర్మించిపబడిందని స్థానికుల కథనం. వేంగీ చాళుక్యులపైన విజయం సాధించటానికి, పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించినట్లు చెబుతారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండశిలమీద చెక్కబడి ఉండటమే. ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కటం చాళుక్య సంప్రదాయంలో కనిపిస్తుంది. రెండవది ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూలస్తంభాలు చతురస్త్రాకారంలో ఉన్నాయి. కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది. ఆ కారణాల వల్ల ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మింపబడిందని కొందరి ఊహ. అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానము, ఆ స్తంభాలను నిలబెట్టిన విధానం, విశాలమైన ముఖద్వారం అన్నీ కాకతీయుల కాలంలో నిర్మింపబడిందేనని అనిపస్తుంది.
12. వేయి స్తంభాల గుడి:
వెయ్యి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం.ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైయున్న నందీశ్వని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యణ మంటపానికి, ప్రధానాలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తుంది. ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏక పీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడినికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వార పాలకులుగా ఉన్నట్లుగా నిలచిన గజ శిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరున్ని అర్చించి భక్తులు రుద్రేశ్వరున్ని దర్శిస్తారు.
ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణమంటపం, ప్రధానాలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి. నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పుణాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. ఆనాటి రహస్య సైనిక కార్య కలాపాలకొరకై ఓరుగల్లు కోట, ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా, రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగింది. 2014లో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో కల్యాణ మంటపం క్రింద ఒక బావి వెలువడింది .
13. రామప్ప దేవాలయం:
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం దీని ప్రత్యేకత. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు.
నిర్మాణం: ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఇది విష్ణువు దశావతారాలలో ఒకరైన రాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉంది. గర్భాలయంలో ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము ఉంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్తంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిల్ప కళాసౌందర్యము చూడతగినది. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది.
ప్రపంచ వారసత్వ హోదా:
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి భారతదేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. ఎనిమిది శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది. అవి ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం, నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికీ రంగును కోల్పోకపోవడం. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. జులై 25, 2021 న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది.
14. మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం:
ములుగు పట్టణం మంగపేట మండలం మల్లూర్ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. జిల్లా కేంద్రానికి 135 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీర ప్రాంతంలో ఏటూరునాగారం - భద్రాచలం ప్రధాన రహదారిని అనుకొని ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. హిమాలయాల్లో మాదిరిగానే ఈ హేమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు. పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రం పై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
స్థలపురాణం: ఆరవ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతారు. ఈ క్షేత్రమంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇక్కడి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూగా వెలిశాడట. శాతవాహన శక ప్రభువు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు సాక్షాత్కరించి గుహ అంతర్భాగంలో ఉన్నానని సెలవిచ్చినారట. మహారాజు 76 వేల సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలోకి గుచ్చుకుంది. ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతున్నది. ఈ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. దీన్నే నాభి చందనంగా పిలుస్తున్నారు. స్వామివారికి ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అను ఇద్దరు భార్యలు ఉన్నారు. నవనారసింహులు క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా హేమాచల నృసింహస్వామిని చెపుతారు. స్వామివారి మూర్తి మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది. స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసిన మెత్తగా మానవ శరీరం లాగా అనిపిస్తుందట. స్వామివారి ఛాతి మీద రోమాలు దర్శనమిస్తాయి. స్వామివారి బొడ్డు భాగంలోనూ చిన్న రంధ్రం ఉంటుంది. దీనినుంచి ఓ ద్రవం విడుదలవుతూ ఉంటుంది. దీనిని అదుపుచేయడానికి స్వామివారి ఆ రంధ్ర భాగంలో మంచి గంధాన్నుంచుతారు. పూర్వకాలంలో ఈ మూర్తి వెలికితీసే క్రమంలో స్వామివారి మూర్తిమీద రంధ్రం పడిందట. ఆనాటినుంచి ఆ రంధ్రంనుంచి ఓ ద్రవం కారుతుందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి.
15. పేరిణి నృత్యం:
“పేరిణి నృత్యం లేదా పేరిణి శివతాండవం తెలుగు వారి ఒక ప్రాచీన నృత్యం. దీన్నే “యోధుల నృత్యం” అని కూడా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు పరమ శివుడి ముందు ఈ నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు. ఓరుగల్లును దాదాపు రెండు శతాబ్దాల పాటు పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా పరిఢవిల్లింది. ఈ నృత్యం మనిషిని ఉత్తేజపరుస్తుందనీ శివుడికి నివేదనగానూ పరిగణిస్తారు”4.(కాకతీయ వైభవము: సాహిత్యము-శిల్పము-కళలు, పు.సం.27)
ఈ కళకు సంబంధించిన ఆధారాలు ఓరుగల్లుకు సమీపంలో ఉన్న రామప్ప దేవాలయంలో గల శిల్పకళలో గమనించవచ్చు. లయబద్ధంగా సాగే డప్పుల మోత దీనికి సంగీతం. ఈ కళాకారులు నాట్యం చేస్తూ ఆ పరమశివుణ్ణే తమ దేహంలోకి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు. కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపుగా కనుమరుగైపోయింది. మళ్ళీ ఆంధ్ర నాట్య పితామహులుగా పిలవబడే ఆచార్య నటరాజ రామకృష్ణ కృషితో మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
పేరిణి తాండవం రెండు విధాలు. ఒకటి పురుషుల చేతా, రెండవది స్త్రీల చేతా చేయబడుతుంది. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియచేస్తూ ప్రదర్శించే నర్తనమే పేరిణి శివ తాండవం. ఇది వీరులు చేసిన వీర నాట్యం. ఈ నృత్య భంగిమలు రామప్ప దేవాలయంలోని శిల్పంలో కనబడుతాయి. సంగీతానికి సప్తస్వరాలు ప్రాణం. అలాగే మృదంగానికీ త, ది, తో, ణం, ఆధారమైనట్లు, నృత్యం ఎన్ని విధాలుగా రూపొందినా దానికి ప్రధాన స్థానాలు ఎనిమిది మాత్రమే. ఇటివంటి మూల సూత్ర స్థానాలు రామప్ప శిల్పంలో రూపొందించ బడ్డాయి. ఉమా వైజయంతీమల కాకతీయుల కాలంలో ఆరాధనా నృత్యాలు బహుళ ప్రచారంలో వుండేవి.
16. ముగింపు:
- ప్రస్తుతం భారత ప్రభుత్వం హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన పథకానికి ఎంపిక చేసిన దేశంలోని పదకొండు నగరాల్లో వరంగల్ ఒకటి. వ
- రంగల్ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద పట్టణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అవకాశాలను మెరుగుపరచడానికి అదనపు పెట్టుబడులకు అర్హత సాధించే ఫాస్ట్ ట్రాక్ పోటీలో స్మార్ట్ సిటీగా ఎంపిక చేయబడింది.
- UNESCO తన గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ (GNLC)లో వరంగల్‌ను చేర్చింది, ఇది స్థానిక స్థాయిలో అందరికీ జీవితకాల అభ్యాసాన్ని నిజం చేయడానికి నగరం యొక్క అత్యుత్తమ ప్రయత్నాలకు గుర్తింపుగా ఉంది. మూడు పట్టణ నగరాలు కాజీపేట , హన్మకొండ మరియు వరంగల్లు కలిసి వరంగల్ ట్రై-సిటీ అని పిలుస్తారు. మూడు నగరాలు జాతీయ రహదారి 163 (హైదరాబాద్ - భువనగిరి - వరంగల్ - భూపాలపట్నం) ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి.
- ప్రధాన స్టేషన్లు కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్. 1163 మరియు 1323 మధ్య 160 సంవత్సరాల కాకతీయ పాలనలో, వరంగల్‌ను ఓరుగల్లు, ఏకశిల నగరం లేదా ఓమటికొండ వంటి వివిధ పేర్లతో ప్రస్తావించారు. ఇవన్నీ వరంగల్ కోటలో ఉన్న భారీ గ్రానైట్ బండను సూచిస్తూ ‘ఒకే రాయి’ అని అర్థం.
- కాకతీయ రాజవంశం 1323 CEలో ఢిల్లీ సుల్తానేట్ చేతిలో ఓడిపోయినప్పుడు, పాలకుడు జునా ఖాన్ , ఘియాత్ అల్-దిన్ తుగ్లక్ యొక్క యువరాజు, నగరాన్ని జయించి దానికి సుల్తాన్‌పూర్ అని పేరు పెట్టారు. తరువాత ముసునూరి నాయకులు 1336 లో వరంగల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు మరియు దానికి మళ్లీ ఓరుగల్లు అని పేరు పెట్టినప్పటి నుండి వరంగల్ నగరంగా పరిడవిల్లుతుంది.
17. సూచికలు:
- కాకతీయ శాసన సాహిత్యము, పుచ్చావాసుదేవ పరబ్రంహ శాస్త్రి,పు. సం.37
- వరంగల్ జిల్లా జాతరలు పండుగలు, డా. చిర్ర రాజు పు. సం.53
- తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర, ముదిగంటి సుజాతారెడ్డి, పు.సం. 42
- తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర, ముదిగంటి సుజాతారెడ్డి. పు.సం. 14
- కాకతీయ వైభవము: సాహిత్యము-శిల్పము-కళలు, పు.సం.27
18. ఉపయుక్తగ్రంథసూచి:
- అయిలయ్య, బన్న. తెలంగాణ సాహిత్యసంస్థలు–సేవ, నాలుగోవ ప్రపంచతెలుగు మహాసభలు, తెలుగు అకాడమి, డిసెంబర్, 2012.
- ఓరుగల్లు విజ్ఞాన సర్వస్వం, వ్యాస సంపుటి, 2012.
- కాకతీయ కళాసమితి, ఓరుగల్లు రచనలు-1998.
- కృష్ణకుమారి, నాయిని. తెలుగు జానపదవిజ్ఞానం సమాజం సంస్కృతి సాహిత్యం,
- పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2011.
- కోటి రెడ్డి, ఎ.వి. ఆంధ్రదేశచరిత్ర – సంస్కృతి, కృష్ణారెడ్డి పబ్లికేషన్, హైదరాబాద్,1997.
- గిరిజామనోహర్ బాబు. కథకు శతమానం, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్.
- ప్రతాపరెడ్డి, సురవరం. ఆంధ్రుల సాంఘిక చరిత్ర. పల్లవి పబ్లికేషన్స్, హైదరాబాద్, 2015
- వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి, పుచ్చా. కాకతీయ శాసన సాహిత్యము, సంకలన కర్త, 1986.
- వెంకటేశ్వర్లు, పంతంగి. తెలంగాణ తెలుగుకథ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, 2011
- సుజాతారెడ్డి, ముదిగంటి, తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర, లంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్, డిసెంబర్ 2015.
- హరి, శివ కుమార్. కాకతీయ వైభవము: సాహిత్యము-శిల్పము-కళలు, నాలుగోవ ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు అకాడమి, డిసెంబర్, 2012.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

