AUCHITHYAM | Volume-06 | Issue-02 | February 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed
6. జానపదంలో ఆశ్రితకులం: సాధనాశూరుల సంస్కృతి, సాహిత్యం

వెంగళ జ్యోతి
తెలుగు అధ్యాపకురాలు (గెస్ట్ లెక్చరర్)
సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, భద్రాద్రి కొత్తగూడెం,
కరీంనగర్, తెలంగాణ
సెల్: +91 9703643007, Email: vangalajyothi0@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 26.12.2024 ఎంపిక (D.O.A): 28.01.2025 ప్రచురణ (D.O.P): 01.02.2025
వ్యాససంగ్రహం:
జానపద కళలకు కాణాచి తెలంగాణ. తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఆశ్రితకులాలు కూడా ఒకటి. ఆశ్రితుడు అనే పదానికి ఆశ్రయించినవాడు, అవలంభించినవాడు, ఆధారముగా చేసుకొనినవాడు అనే అర్థాలున్నాయి. ఒక సమూహం తమ కళ ద్వారా ఆశ్రయించి జీవించే కులాలని ఆశ్రిత కులాలుగా చెప్పవచ్చు. అటువంటి అంతరించిపోతున్న అశ్రితకులాల్లో ఒకటి సాధనశూరులు. అంతరించిపోతున్న ఆశ్రితకులాలను ప్రోత్సహించడం, వారి ద్వారా వారి కళలను కాపాడుకోవడం, వారి సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయడం. ఈ వ్యాసరచనోద్దేశ్యం. ప్రస్తుత అంశానికి సంబంధించిన విషయ సేకరణలో అధ్యయనం చేసినవి ఆశ్రితకులాలకి సంబంధించిన పుస్తకాలు, దిన పత్రికలలో వచ్చిన సమాచారం, క్షేత్ర పర్యటన ద్వారా సేకరించిన విషయాలు. సాధనశూరులను ప్రత్యక్షంగా కలిసి వివరాలు సేకరించడం. సాధనశూరుల కళలు, ప్రదర్శించే విద్యలు, ఆహారపుటలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలను ప్రత్యక్షంగా పరీశీలించడం వంటివి ఈ వ్యాసరచనలో పాటించిన సమాచారసేకరణ పద్ధతులు. ఆశ్రితకులాలను ఆధారంగా చేసుకొని జీవనం సాగించే కళాకారులకు తగిన ప్రోత్సాహం లభిస్తే వారు తమ కళలను కాపాడుకోవడమే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా వారి విద్యను అందించగలుగుతారు.
Keywords: ఇంద్రజాల విద్య, ఆశ్రితకులం, సాధనాశూరులు, రొమ్ముమీద ఆకు, మిరాశి హక్కులు, పోషక కులం, రాగి శాసనం, తాళపత్ర ప్రతులు, చాతుర్వర్ణ్యం, గొల్లకేతమ్మ, కాళికాదేవి.
1. పరిచయం :
కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించటానికి ఆర్యులు రూపొందించిన ఒక వ్యవస్థ. పురాతన హిందూ గ్రంథాలలో ప్రతిపాదించబడిన వర్ణ వ్యవస్థ సమాజాన్ని నాలుగు తరగతులుగా విభజించింది. అవి.
- బ్రాహ్మణులు - పండితులు, యజ్ఞ పూజారులు
- క్షత్రియులు - పాలకులు, యోధులు
- వైశ్యులు - రైతులు, వ్యాపారులు, చేతివృత్తులవారు
- శూద్రులు - పనివారు, కార్మికులు
భగవద్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ‘‘చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః’’ అని అన్నాడు. మొదట వారి గుణాలనుబట్టి, తర్వాత వారు చేసే పనులనుబట్టి నాలుగు వర్ణాలు (కులాలు) నాచే (భగవంతుడిచే) సృష్టించబడ్డాయి’’ అని అర్థం.
గ్రంథాలలో వర్ణ వర్గీకరణలో ప్రత్యేకమైన అంటరాని వర్గం గురించి ప్రస్తావించ లేదు. వర్ణ వ్యవస్థ సమాజంలో ఎప్పుడూ క్రియాశీలకంగా లేవని పండితులు విశ్వసిస్తున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ వాస్తవీయత కలిగి ఉండటానికి ఆధారాలు లేవు. సమాజం ఆచరణాత్మక విభజన ఎల్లప్పుడూ జనన సమూహాల పరంగా ఉండేది. ఇవి ఏ నిర్దిష్ట సూత్రం మీద ఆధారపడవు. కానీ జాతి మూలాలు, వృత్తులు, భౌగోళిక ప్రాంతాల వరకు మారవచ్చు. ఇలా వృత్తుల ఆధారంగా కులాలు, కులాల్లో ప్రధాన కులాలు, ప్రధాన కులాలని ఆశ్రయించుకొని కొన్ని ఆశ్రితకులాలు ఏర్పడ్డాయి. అలాంటి ఆశ్రితకులాల్లో ఒకటైన పద్మశాలి వారి ఆశ్రితకులం సాధనాశూరులు. వీరు తెలంగాణలోని కరింనగర్ జిల్లా వీణవంక మండలం, చల్లూరు గ్రామంలో ప్రస్తుతం ఉన్న కళాకారుల నాలుగవ తరం వారు వచ్చి స్థిరపడ్డారు. అప్పటినుంచి ఈ గ్రామంలోనే ఉంటూ తమ తమ కట్టడి గ్రామాలకు ప్రదర్శన నిమిత్తం వెళుతూ జీవనం సాగిస్తున్నారు.
వీరు ప్రదర్శించే విద్యలను ఇంద్రజాల విద్యలని, కనికట్టు విద్యలని అంటారు. ప్రదర్శనలో కళాకారులు కంటికి కనిపించే వస్తువును మాయం చేయటం, దాని స్థానంలో మరొక వస్తువును సృష్టించటం, ప్రేక్షకులను ప్రదర్శనలో భాగం చేసి, వారితోనే ఆశ్చర్యంగొలిపే పనులను చేయిస్తూ, మాయలు, మంత్రాలు ఉన్నట్టు భ్రమింపచేయటం వీరి ప్రత్యేకత. ఇలాంటి సాధనాశూరుల గురించి విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
2. సాధనాశూరులు :
తెలంగాణ సంస్కృతిలో భాగమైన జానపద కళారూపాలు ‘ఆశ్రిత జానపద కళారూపాలు’. ఆశ్రితేతర జానపద కళారూపాలుగా విభజించబడి తమకు మౌఖికంగా సంక్రమించిన సంస్కృతిని కాపాడుకుంటూ మనుగడను సాగిస్తున్నాయి.
ఆశ్రితుడు అనే పదానికి ఆశ్రయించినవాడు, అవలంభించినవాడు, ఆశ్రయింపబడినవాడు, ఆధారముగా చేసుకొనినవాడు అనే అర్థాలున్నాయి. ఇక్కడ ఒక గుర్తింపు పొందిన సమూహాన్ని ఒక వ్యక్తియేగాక, ఒక సమూహం తమ కళ ద్వారా ఆశ్రయించి జీవించే కులాలని ఆశ్రితకులాలలని, ఆ కళాకారులని ఆశ్రిత కళాకారులు అని చెప్పవచ్చు.
ఈ కులాల వారు కేవలం ఒకే కులానికి మాత్రమే హక్కుదార్లుగా ఉంటూ వారికి తమ ప్రదర్శన ద్వారా విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తూ వారిచ్చే ప్రతిఫలం మీదనే ఆధారపడి జీవిస్తాయి తప్ప వేరే కులాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయించదు.
క్రీ.శ.1172 ప్రాంతంలోని కాకతీయ ప్రభువైన రుద్రదేవుడు వేయించిన నాగులపాడు శాసనంలో అష్టాదశ ప్రజ (18 కులాలు) పేర్కొనబడ్డాయి. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, తంతువాయి (పద్మశాలి) మొదలైన కులాలు ప్రస్తావించ బడ్డాయి. ఇందులో ప్రస్తావించబడిన కులాలన్నిటికీ ఆశ్రిత కళారూపాలున్నాయి. దీనినిబట్టి ఆ కాలం నాటికంటే ముందు నుండే పోషక కులాలు ఉన్నట్లు స్పష్టమవుతున్నది. అలాగే ఆశ్రితకులాలు లేదా ఆశ్రిత కళారూపాలు కూడా ప్రచారంలో ఉన్నట్లు భావించవచ్చు. ఈ రకంగా ఆశ్రిత జానపద కళారూపాలు కూడా ప్రచారంలో ఉన్నట్లుగా భావించవచ్చు. ఇది గత సంస్కృతి అనుభవాలను, విజ్ఞానాన్ని, వర్తమాన కాలంలో ప్రసరింపజేస్తూ విభిన్న ప్రక్రియల్లో పండితులను, పామరులను అలరిస్తూ వస్తున్నాయి. వీటిలో పటం కథలు, యక్షగానాలు, ఇంద్రజాల ప్రదర్శనలు, కథాగానాలు, బొమ్మలాటలు వంటి విభిన్న ప్రక్రియల్లో ఆశ్రిత కళారూపాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి.
ఆశ్రిత కళారూపాల కళాకారులు పోషక కులం దగ్గర మిరాశి హక్కులు కలిగి ఉంటారు. ఇవి రాగి శాసనం మీదగాని, శాసనాల మీదగాని, తాళపత్ర ప్రతుల మీదగాని వ్రాయబడి ఉంటాయి.
కళాకారులు వీటినే స్థిరాస్థిగా భావించి దాచుకుంటారు. ఈ మిరాశి హక్కు పత్రాలనుగాని, రాగి శాసనాలనుగాని పరిశీలిస్తే అనేక విషయాలు తెలుస్తాయి. వీటిలో ఆశ్రిత కళాకారుల కుటుంబాలను బట్టి ప్రతి కుటుంబానికి ఇన్ని గ్రామాలని ఉంటుంది. ఫలానా గ్రామంలోని పోషక కులం నా మిరాశి హక్కు, హక్కుపత్రంలో ఉంది అంటే ఆ గ్రామాన్ని ఆశ్రయించే హక్కు అతనికే ఉన్నట్లు పోషక కులం, ఆశ్రితకులం కలిసి నిర్ణయించుకున్న శాసనమిది. కాబట్టి దీనిని మార్చడానికి వీలుండదు.
చిత్రం: 1 సాధనాశూరులు
ఈ హక్కు పత్రాలను లేదా రాగి శాసనాలను ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. ఇందులో కట్టడి గ్రామాలు, ఆయా పోషక కులం, ఇంటిపేర్లు, దాతలు ఇచ్చే ధాన్యం, ధనం, గొడ్డు`గోదా, భూమి, ఆభరణాలు, వస్తువులు మొదలైన అన్ని విషయాలు వ్రాయబడి ఉంటాయి. కొన్ని హక్కు పత్రాల్లో అయితే ఆశ్రిత కళాకారుల చరిత్ర వ్రాయబడి కూడా ఉంటుంది. ఈ మిరాశి హక్కులను ఒక ఆశ్రిత కళారూపం మరొక ఆశ్రిత కళారూపానికి అమ్మటంగాని, కొనటంగాని చేయరు. ఏ ఆశ్రిత కళారూపమైతే హక్కుగా కలిగి ఉంటుందో ఆ కులంవాళ్ళు తండ్రి కొడుకులకు, ఒకవేళ కొడుకులు లేకపోతే అల్లుళ్ళకు మిరాశి హక్కులను ఇచ్చుకుంటారు. అమ్మాయికి కట్నం క్రింద కొన్ని గ్రామాలను మిరాశి హక్కులను పంచితే వారి హక్కులను కొత్త శాసనం మీద రాయించి ఇస్తాడు. ఎందుకంటే, కళాకారులు గ్రామానికి వెళ్ళినప్పుడు పోషక కులానికి తప్పనిసరిగా శాసనాన్ని లేదా హక్కు పత్రాన్ని చూపించి అప్పుడు కథల గురించి, ప్రతిఫలం గురించి మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటారు.
ఈవిధంగా జానపదులు తమ వృత్తి మనుగడకు ఉపయోగపడే పలు అంశాలు, ఆశ్రితకులాలు, వారి కళారూపాల ద్వారా నిబిడీకృతమై ఉంది.
3. సాధనాశూరులు-ప్రదర్శన :
సాధనాశూరుల ప్రస్తావన శ్రీహర్షుని రత్నావళి నాటకం, పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక వంటి ప్రాచీన కావ్యాల్లో కనిపిస్తుంది.
సాధనాశూరులు అనే పదానికి సాధన అంటే మల్లవిద్య అని, శూరుడు అనే పదానికి ధైర్యం కలవాడు, బలం కలవాడు, పరాక్రమము కలవాడు అనే అర్థాలు ఉన్నాయి. నిజానికి వీరు ధైర్యం కలవారు. ఎందుకంటే, కులాన్ని రక్షించుకోవటం కోసం ధైర్యంతో సాహసం చేసేవారిని హింసించి రాజును సంహరించటంతో శాధనాశూరులుగా పద్మశాలి వారితో పిలువబడ్డారు.
వీరు సాధనాశూరులుగా ఎట్లా అయ్యారనటానికి ఒక మౌఖిక కథను వినిపిస్తారు. పూర్వం శ్రీకృష్ణ గంధర్వ రాజు పొట్లచెరువు ప్రాంతంలో యాభై రాజ్యాలను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తుంటాడు. ఆ రాజు ఎవరిచేతా మరణం లేకుండా ఉండేందుకు కాళికాదేవిని పూజించగా, ఆమె అందుకు ప్రతిఫలంగా ప్రతిరోజూ ఒక మనిషికి కొత్త బట్ట కట్టించి, అతని తల నరికి దానిపై కూర్చుండి పన్నెండు సంవత్సరాలు పూజ చేయాలని కోరుతుంది. రాజు అందుకు సమ్మతించి, ప్రజలకు చెప్పకుండా రాజ్యంలోని పద్మశాలీలు ప్రతిరోజు బట్టలు ఇవ్వాలని, మిగతా కులాలవారు ఇంటికి ఒకరు చొప్పున ప్రతిరోజు కొలువుకు పంపియ్యాలని చాటింపు వేయించి, ఆ ప్రకారంగా కొన్ని సంవత్సరాలుగా రాజు కాళికాదేవిని పూజిస్తాడు.
ఇట్లా కొన్ని సంవత్సరాల తర్వాత రాజ్యంలో పద్మశాలి కులం తప్ప మిగతా కులాలవారు ఇంటికి ఒకరు చొప్పున రాజు కొలువుకు వెళ్ళటం జరుగుతుంది. రాజు తిరిగి మళ్ళీ ఇంటికి ఒకరిని పంపియ్యమని చాటింపు వేయటంతో మిగతా కులాలవారంతా ఏకమై ఈసారి మేమే కొత్తబట్టలు ఇస్తామని, పద్మశాలి వారిని ఇంటికి ఒకరిని పంపమని కోరతారు. రాజు అందుకు సమ్మతించి ఆ విధంగా చాటింపు వేయించగా, దానికి పద్మశాలీలు వ్యతిరేకించి ముందు మీరు తీసుకెళ్ళన మనుష్యుల్ని ఏం చేస్తున్నారో చెప్పండని నిలదీయగా, వారందరినీ చెరసాలలో బంధిస్తాడు. అయితే, పద్మశాలీలు అయిదు రోజులు చెరసాలలో స్నాన సంధ్యలు లేకుండా ఉన్నామని పూజ చేసుకొని తిరిగి వస్తామని కాపాలాదారుని నమ్మించి బయటకు వస్తారు. పద్మశాలీలు ప్రతిరోజు పూజ చేసుకునే మార్కండేయ గుడిలో ఏకమై రాజు మన వంశాన్ని నిర్వీర్యం చేయటానికి కంకణం కట్టుకున్నాడని, ఎలాగైనా రాజును సంహరించాలని నిర్ణయించుకుంటారు. ఆ రాజు ఉండేది ఉక్కు కోట, మధ్యలో ఒంటి స్తంభం మేడ, ఆ మేడ చుట్టూ ముస్సా నది. కాపలాగా కోటముందు కాళికాదేవి ఉంటుందని, ఆ రాజు అరచేతిలో ఉండే కత్తితోనే చంపితేనే చస్తాడని, అప్పుడే మన వంశం నిలుస్తుందని తీర్మానించుకుంటారు. ఒక బంగారు పళ్ళెంలో కత్తి పెట్టి ఆ రాజును సంహరించటానికి వచ్చేవారు ఆ కత్తిని ముట్టుకోవాలని కోరగా, పద్మశాలీలలోని గంజి, బండారి, ఆడిపు, భీమనపల్లి, వంగరి, చింతకింది ఇంటిపేరుగలవారు ముందుకు వస్తారు. వీరికి పెళ్ళిలో మొదటి బొట్టు అని, అంతేకాకుండా విజయం సాధించినవారికి ప్రతి సంవత్సరం ఆయా గ్రామాలకు పిలిచి ఇంటింటికి రూపాయి పావల, వెయ్యి పదహార్లు ఇవ్వాలని యాభై ఆరు దేశాల పద్మశాలీల ముందర తీర్మానం చేసుకుంటారు.
వీరంత కర్రసాము సాధన చేయటమేగాక, రాజు కోట చుట్టూ భూతాలు, ప్రేతాలు, కాళికాదేవి కాపలా ఉంటుంది కాబట్టి మంత్ర, తంత్ర విద్యలు నేర్చుకోవాలని గొల్లకేతమ్మ దగ్గర ఆ విద్యలన్నింటినీ నేర్చుకుని ఆమె మంత్రదండం కూడా తీసుకొని రాజును సంహరించటానికి బయలుదేరుతారు. ఆమె మంత్రదండంతో ముస్సా నది దాటి కోట చేరుకోగానే కాళికాదేవి వీరిని అడ్డగించి, నన్ను ప్రసన్నం చేసుకోవాలంటే మీరు ముందు మాంసం ముట్టాలని కోరుతుంది. ఆ ప్రకారంగా పద్మశాలీలు కాళికాదేవి చెప్పినట్లుగా నడుచుకొని, ఒంటి స్తంభం మేడ మీద ఉన్న రాజుని సంహరించి, వీరులుగా తిరిగి వస్తారు. పద్మశాలీలు ఒప్పందం చేసుకున్న దాని ప్రకారం వీరిని గౌరవించాలి కాబట్టి, మాములుగా వెళ్ళకుండా సాధన చేసిన విద్యలు గొల్లకేతమ్మ, కాళికాదేవి దగ్గర నేర్చుకన్న మంత్ర, తంత్ర విద్యలను ప్రదర్శించి ప్రతిఫలం పొందటం మొదలుపెట్టారు. ఈవిధంగా పద్మశాలిలలోని కొన్ని కుటుంబాలవారు విద్యలను సాధన చేయటం, వాటిని ప్రదర్శించటం వలన వీరికి సాధనాశూరులు అనే పేరు వచ్చిందంటారు.
4. ప్రదర్శన :
ప్రదర్శనలో కళాకారులు అగ్నిని స్తంభింపచేసి ప్రదర్శించే అంశాలు ప్రత్యేకమైనవి. ఇటువంటి అంశాలలో కాగితం మరియు దారాన్ని కాల్చి మళ్ళీ సృష్టించటం, మనిషి తలపై పొయ్యి పెట్టి పూరీలు చేయటం, అగ్గిలో కాల్చిన పారని చేతితో పట్టుకోవటం ప్రధానమైనవి. ఇందుకోసం ప్రేక్షకులనుండి ఒక వ్యక్తిని పిలిచి, అతని తలపై మట్టితో చేసిన పొయ్యి ఉంచి, దానిమీద మూకుడు పెట్టి పూరీలు కాలుస్తారు. ఈ ప్రదర్శనాంశంతో ప్రేక్షకులకు కలిగే సందేహాలను గురువును అడుగుతూ నేను చేస్తా, నేను చేస్తానని ప్రగల్భాలు పలుకుతూ హాస్యాన్ని పండిస్తూ రక్తి కట్టిస్తాడు హాస్యగాడు.
చిత్రం: 2 సాధనాశూరుల ప్రదర్శన
సాధనాశూరులు నీటిని, అగ్నిని తమ అధీనంలోకి తెచ్చుకుని ప్రదర్శించినట్లుగానే, గాలిని కూడా స్తంభింపచేసి చిలక కట్టటం, చొప్పల పల్లకీలో కూర్చుని ఊరేగటం వంటి అంశాలు ప్రదర్శిస్తారు. ఇందులో చిలుక కట్టుట ప్రదర్శనలో మొదట గురువు ప్రదర్శించే అంశాన్ని ప్రేక్షకులకు వివరించిన తర్వాత బృందంలోని వ్యక్తి ఒకరు వెదురు కర్రను తీసుకు వచ్చు భూమిపై నిలబెట్టి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఒకరు చెక్కతో చేసిన చిలుక బొమ్మను తీసుకు వచ్చి దాని నడుము భాగాన్ని కర్రపై ఉంచి కదలకుండా పట్టుకుంటాడు. అప్పుడు ఒక కావడిబద్దను తీసుకు వచ్చు దానికి రెండువైపులా బరువులు వేసి ఆ కావడిని చిలుక పై భాగంలో ఉంచుతారు. గురువు చిలుకపై మంత్రించిన నీళ్ళు చల్లి, వేదంతో మూడుసార్లు మంత్రించి కర్రపై చిలుకను పట్టుకున్న వ్యక్తిని వదిలి వేయమంటాడు. అప్పుడు ఏ ఆధారం లేకుండా చిలుక ఒక కర్రను ఆధారం చేసుకొని బరువుగల కావడిని మోస్తుంది. ఈ రకంగా గురువు చిలుక ముక్కు మీద, అలాగే చిలుక తోకను మాత్రమే కర్రకు ఆనించి కావడిని మోయించటం ప్రేక్షకులు మంత్రమో, తంత్రమో తెలియక సాధనాశూరుల మాయ అంటూ ఆశ్చర్యానికి లోనవుతారు.
చిత్రం: 3 సాధనాశూరులు
వీరు ప్రదర్శించే విద్యల్లో చొప్పల పల్లకి చాల ప్రత్యేకమైనది. చాలా సున్నితంగా ఉండే చొప్ప బెండ్లలో కూర్చునెలా పల్లకి తయారు చేసుకొని, దాని మీద గురువు కూర్చుని ఉండగా, బృందం సభ్యులు ప్రేక్షకుల మధ్యలో తిప్పుతారు. అలా తిరుగుతున్నప్పుడు హాస్యగాడు తనదైన శైలిలో హాస్యం పండిస్తూ ఉంటాడు. అలాగే ప్రదర్శనలో భాగంగా ఛాతిపై బండను పెట్టుకొని పగలకొట్టించు కోవటం, కరెంటు బుగ్గలను నోట్లో వేసుకొని నమలటం, మాయ బొమ్మకు చేసిన అలంకరణ గుడారంలో కట్టేసిన వ్యక్తికి కనిపించటం వంటి అదృశ్య విద్యలను ప్రదర్శిస్తారు. అంతేకాకుండా, వీరు ప్రదర్శించే విద్యలో అద్భుతంగా చెప్పుకునేది గుడారంలో ఒక స్తంభానికి కట్టేసిన వ్యక్తి మిగతా స్తంభాలకు మారటం జరుగుతుంది.
ఈ అంశాన్ని ప్రదర్శించేటప్పుడు ప్రేక్షకులే వ్యక్తికి బేడీలు వేసి, చేతులకు`కాళ్ళకు కట్లు కట్టి ఆ తర్వాత అతడిని గుడారంలో గుంజకు కూడా విప్పుకోవటానికి వీలు లేకుండా కడతారు. అయినప్పటికీ ఆ వ్యక్తి గుడారంలో ఏ గుంజకు మారమంటే ఆ గుంజకు మారటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇవేకాకుండా, మరొక అద్భుతమైన అంశం గుడారంలోకి వెళ్ళిన వ్యక్తి వికృతరూపంలో బయటకు రావటం, గురువు బృందంలోని సభ్యులు ప్రేక్షకులు చూస్తూ ఉండగానే గుడారంలోకి మాములుగా పంపించి పరదా కప్పేస్తాడు. ఆ తర్వాత తన చేతిలో ఉన్న వేదంచే మంత్రించి కాళికాదేవిని తలచుకొని వేపాకు గుడారంపై చల్లి గుడారం మీద ఉన్న పరదాను తీయమంటాడు. అప్పుడు గుడారంలోకి వెళ్ళిన వ్యక్తి మాయమై ప్రేక్షకుల మధ్యలో వికృతరూపంలో ప్రత్యక్షమై అందర్నీ చెల్లాచెదురు చేస్తూ భయాన్ని కలిగిస్తాడు.
అలాగే మరొక అద్భుత అంశంలో దేవతల విగ్రహాలను సృష్టించటం. గురువు ముందుగా ఒక వ్యక్తిని గుడారంలోకి పంపి గుడారం పరదా కప్పేస్తాడు. ఆ తరువాత గురువు బయట నుండి రాళ్ళను, పసుపు బియ్యాన్ని మంత్రించి గుడారంలోకి పంపగా, రాళ్ళు అన్నీ దేవతల విగ్రహాలుగాను, పసుపు బియ్యం పులిహోరగాను మారుతాయి. ఇవేకాకుండా గాలిలో నిమ్మకాయలు ఎగురవేసి కత్తితో ముక్కలు చేయటం, కడుపు మీద జిల్లేడు ఆకులు వేసుకుని ముక్కలు చేయటం, బండికి కత్తి కట్టి తలతో నెట్టటం, రేకు పళ్ళాలు గాల్లోకి ఎగిరి కొట్టుకోవటం మొదలైన అంశాలను ప్రేక్షకులను అలరిస్తూ హాస్యాన్ని జోడిరచి ప్రదర్శిస్తారు.
ఇవేకాకుండా మరొక అద్భుతమైన ప్రదర్శన - రొమ్ము మీద ఆకు. ఈ ప్రదర్శనలో వ్యక్తి రొమ్ము మీద ఒక ప్రత్యేకమైన ఆకును గురిచూసి కొట్టవలసిందిగా ఒక తుపాకిని ప్రేక్షకులలో ఎవరు ముందుకు వస్తే వారికి ఇచ్చి రొమ్ము మీద ఆకును గురిపెట్టి కొట్టమంటారు. అలా గురిచూచి ఎవరైనా కొట్టినట్లయితే ఆ గుండు రొమ్ము లోపలి భాగానికి పోకుండా, ఆ ఆకును కొట్టుకుని అక్కడే పడిపోతుంది. ఆ ప్రదేశంలో ఏవిధమైన గాయమూ మనకు కనిపించదు. ఇది కనికట్లు ఆకు పసరు ప్రభావమో లేక ఇంద్రజాలమో మనకు తెలియదుగాని, సాధనాశూరులు ఇలాంటి ప్రదర్శనలో నిజంగా సాధనాశూరులే.
ఈ కళారూపంలోని కనికట్టు విద్యలు ప్రదర్శించటానికి కళాకారులు పది నుండి పన్నెండుమంది వరకు ఉంటారు. బృందంలోని ఇతర సభ్యులు ప్రదర్శనలో తప్పు చేస్తే రహస్య భాషా పదాలను ఉపయోగిస్తూ ప్రదర్శనకు అంతరాయం కలుగకుండా ప్రయత్నిస్తారు. వీరు ఉపయోగించే రహస్య భాషా పదాలలో ఉదాహరణకు – పచ్చ-పసుపు, మిల్క్‌పెట్టె-అగ్గిపెట్టె, పాండ్యాలు-నీళ్ళు, మస్కాలు-విగ్రహాలు, పొల్లు-ఇటుక పొడి, దారుకం-దానం, పత్రులు-రాళ్ళు, మొకిరలు-పూరీలు, తెరు-నూనె, సోరౌ-అన్నం, పచ్చ-తాయెత్తు, పొంత-పొయ్యి, మీటకం-సంభావన, తెల్లోడు-సుద్ద మొదలైన పదాలను ఉపయోగిస్తూ ఒకరికొకరు ప్రదర్శనలో సహకరించుకుంటూ ప్రదర్శిస్తారు. ప్రదర్శనలో గురువు తర్వాత ప్రదర్శనను రక్తి కట్టించటంలో, ప్రేక్షకులను ఆనందింప చేయటంలో సిద్ధహస్తుడు హాస్యగాడు. ఇతని వేషధారణ, హావభావాలు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా, ప్రేక్షకులకు కలిగే సందేహాలను తీరుస్తూ, అవసరమైతే గురువుచేత దెబ్బలు తింటూ నటిస్తాడు. ఇతను ప్రదర్శనలో పూర్తి స్వేచ్ఛతో బృందం సభ్యులను, గురువును, అవసరమైతే ప్రేక్షకులను కూడా సమాజంలోని సంఘటనలు గుర్తు చేస్తూ తిటటం లేదా పొగడటం ఇతని నైజం. కళాకారులు ప్రదర్శనాద్యంతం రక్తి కట్టించటంలో రెండు నగారాలను వాయిస్తూ బృందం సభ్యులకు, ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగిస్తాడు. వీరు చేతిలో అథర్వణ వేదం పట్టుకుంటారు. దీనినే మంత్రదండం అని కూడా పిలుస్తారు. దీనితో మాయ, మంత్రాలు ఉన్నట్లుగా భ్రమింపచేస్తారు. కాని, మాయలు, మంత్రాలు లేవని చెట్ల క్రియలు ఉన్నాయి కాబట్టే ఇంద్రజాల విద్యలు చేయగలుగు తున్నామని అంటారు.
5. ముగింపు :
- ఈ కళాకారులు ఆధునిక మెజీషియన్స్‌కి ధీటుగా నేటి కాలంలో కూడా సంప్రదాయ పద్ధతిలో నాటకీయ ఫక్కీలో పద్మశాలిని ఆశ్రయించి ప్రదర్శించినప్పటికీ ఆ గ్రామంలోని ఇతర కులాలన్నింటినీ తమ ప్రదర్శనతో కట్టిపడేసే అలరిస్తారు.
- తరతరాలుగా వీరికి సంక్రమించిన వారసత్వ కళను నేటి ఆధునిక కాలంలో వీరికి తగిన ఆదరణ, అభిమానం అందిస్తే అంతరించి పోతున్న సాధనాశూరూల ఇంద్రజాల విద్యలను, కళా నైపుణ్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించగలుగుతాము.
- ఇలాంటి ఆశ్రిత కళలకు, కళాకారులకు తగినవిధంగా ప్రోత్సాహం లభిస్తే వారి కళలను కాపాడుకోవటమే కాకుండా, వారి కళల ద్వారా ప్రేక్షకులను రంజింపచేయగలుగుతారు. కాబట్టి వీరి కళా నైపుణ్యాన్ని ముందుతరాల వారికి అందించే దిశలో నేను చేస్తున్న చిన్న ప్రయత్నమే ఈ సాధనాశూరుల గురించిన వ్యాసం.
6. ఉపయుక్తగ్రంథ సూచి :
- పద్మారావు, కత్తి. కులం పునాదులు.
- మోహన్ జి.ఎస్., జానపద ఆచారాలు. 1994.
- మోహన్, జి.ఎస్., జానపద విజ్ఞాన అధ్యయనం, ద్రవిడ విశ్వవిద్యాలయం, 2010.
- రాధాకృష్ణ, మిక్కిలినేని. తెలుగువారి జానపద కళారూపాలు. పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం, హైదరాబాద్.
- రామరాజు, బిరుదురాజు. తెలుగు జానపద గేయ సాహిత్యం, తెలుగు అకాడమి, హైదరాబాద్
- సుబ్బాచారి, పులికొండ. జానపద విజ్ఞానం-ఆశ్రిత సాహిత్యం. పరిశోధన గ్రంథం.
- సుబ్బాచారి, పులికొండ. తెలుగులో కుల పురాణాలు - ఆశ్రిత వ్యవస్థ.
- సురేష్, బాసాని. తెలంగాణ జానపద కళా సౌరభాలు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, 2023.
- సురేష్, బాసాని. పద్మశాలి ఆశ్రితకులాల సాహిత్యం-ఒక పరిశీలన.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.