AUCHITHYAM | Volume-06 | Issue-02 | February 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed
5. ‘యశోధరచరితం’ : కల్పితకథ - ప్రధానపాత్రల చిత్రణ
డా. టి.డి. రాజన్న తగ్గి
అసోసియేట్ ప్రొఫెసర్, కన్నడ శాఖ
కర్నాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం,
కడగంచి, కలబురగి, కర్నాటక.
సెల్: +91 8904446344, Email: tdrajannathaggi@cuk.ac.in
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 10.12.2024 ఎంపిక (D.O.A): 28.01.2025 ప్రచురణ (D.O.P): 01.02.2025
వ్యాససంగ్రహం:
ప్రాచీన కన్నడ సాహిత్యంలో అత్యధిక విమర్శలకు, చర్చకు గురైన గ్రంథాలలో ʼయశోధర చరితంʼ అనే కావ్యం ఒకటి. దీన్ని “జన్న” అనే కవి పదమూడవ శతాబ్దంలో రాశాడు. ఈ కావ్యం ముఖ్యంగా అహింసాసిద్ధాంతాన్ని, కర్మసిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. ఇందులో కర్మసిద్ధాంతంతోపాటు నైతిక విలువలు, ప్రేమ, శృంగారం, హింసలాంటివీ కూడా చోటు చేసుకున్నాయి. ఈ కావ్యం గురించి పలువురు విమర్శకులు భిన్నధృక్పథంతో కొన్ని పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు. వీటిలో అమృతమతి, అష్టావక్రుడి మధ్యనున్న అనైతిక ప్రేమసంబంధం గురించే అధికపరిశోధనాత్మక వ్యాసాలు వచ్చాయి. ఈ అనైతిక సంబంధానికి వారిధియైన ‘దూదవి’ అనే పాత్ర అల్లిన ఒక కల్పిత కథను ఆధారంగా తీసుకుని భిన్నదృక్కోణంతోపాటు తార్కికంగా విశ్లేషించడం ఈ వ్యాసలక్ష్యం. ఇంతకు ముందు డా. కరిగౌడ బీచనళ్ళి ʼయశోధర చరితం: అభిజాత పరంపరʼ; కె. శివకుమార్ ʼజన్న: ఒక పరిశీలనʼ అనే పరిశోధనా గ్రంథాలను రాశారు. ఎచ్.ఎల్ పుష్పా ʼఅమృతమతి స్వగతంʼ అనే కవితను రాశారు. ఈ వ్యాసరచనకు ʼయశోధరచరితంʼ కావ్యం, ’అమృతమతి స్వగతంʼ కవిత ఆధారం. వీటిలో ప్రధాన పాత్రలుగా చిత్రింపబడిన అమృతమతి పాత్రను, ఆమె ప్రియసఖి దూదవి పాత్రను భిన్న దృక్పథంతో విశ్లేషించడమైనది. దూదవి పాత్ర పరిచయం, అష్టావక్రుడి గానమాధుర్యం, దూదవి అల్లిన కట్టుకథ, అష్టావక్రుడి కురూప వర్ణన, అల్లిన కథలో కనిపించే అబద్ధం అనే ఉపశీర్షికలతో విభజించుకున్నాను. అమృతమతి ఒక సామ్రాజ్యానికి రాణియైయుండీ కూడా మన విలువలుని ధిక్కరించి, లైంగికాసక్తితో సంప్రదాయవిరుద్ధంగా మారినతీరు, అన్నిటికీ తెగించిన వ్యక్తిత్వం గురించి, ఈ ప్రేమసంబంధాన్ని కుదుర్చడానికి వారిధిగా వచ్చిన తనప్రియసఖి దూదవి పాత్రంలో కనబడే తెలివితేటల గురించి, ఆ తెలివితేటలవల్ల తను అల్లిన అబద్ధాల గురించి, ఆమె సృష్టించిన కథల గురించి, అలా అబద్ధాలు సృష్టించాల్సిన అవసరాల గురించి, ఆ కల్పితకథలు ఎంతవరకు నిజం అనేదాన్ని గురించి తెలియపరచడమే ఈ వ్యాసోద్దేశం. అలాగే చివరి మాటగా డబ్బు, శృంగారం అనేవి ఎంత మనో నిగ్రహం ఉన్నవారినీ కూడా మారుస్తాయి అనేది తెలియపరచడం ముఖ్య ఉద్దేశం
Keywords: అమృతమతి, దూదవి, అష్టావక్రుడు, కురూపం, ప్రేమ, శృంగారం, అబద్ధం, కట్టుకథ
1. ఉపోద్ఘాతం:
కన్నడ సాహిత్యంలో పదమూడవ శతాబ్దంలో ఉన్న ప్రముఖ కవులలో జైనమత కవియైన జన్నడు కూడా ఒకడు. ఇతను రాసిన ʼయశోధర చరితంʼ అనేది జైనమతాన్ని ప్రతిపాదించే ఒక లౌకిక కావ్యం. ప్రాచీన కన్నడ సాహిత్యంలో అత్యధిక చర్చకు గురైన గ్రంథాలలో ఈ యశోధర చరిత్రం కూడా ఒకటి. ఈ కావ్యం పైచూపుకి లౌకిక కావ్యంగా కనిపించినా ఇందులో లౌకిక వస్తు-విషయంతో పాటు జైనమతాశయాలే అధికంగా కనిపిస్తాయి. కాబట్టి ఇదొక జైనమత గ్రంథం అనడానికి ఏ ఆటంకాలూ లేవు.
ఈ కావ్యం గురించి పలువురు పరిశోధకులు, విమర్శకులు ఇందులోని జైనమతం గురించి, కర్మసిద్ధాంతం గురించి, అహింసా ప్రతిపాదన గురించి, ఆ జైనమతం స్త్రీలను వ్యాఖ్యానించిన తీరులను గురించి తమ భిన్న ధృక్పథంతో కొన్ని పరిశోధనాత్మక గ్రంథాలు, విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. ఇలా గ్రంథాలు, వ్యాసాలు, వచ్చినప్పటికీ వీటిలో అమృతమతి మరియు అష్టావక్రుడి మధ్యనున్న అనైతిక సంబంధం గురించే అధిక విమర్శనాత్మక వ్యాసాలు వచ్చినది విశేషం. ఈ అనైతిక సంబంధం గురించే వెలువడిన చర్చలు తప్ప మిగతా మతాశయాల వస్తు విశ్లేషణకు విమర్శకులు ఎందుకు పూనుకోలేదో అర్థం కావటంలేదు. దీనికి కారణం ప్రేమ, కామ, శృంగారం గురించి చర్చించాడినికి చూపించిన ఆసక్తిని జైనమతాశయాల వైపు మళ్ళించడానికి వాళ్ళ వయోభిలాష, మనోభిలాష ఒప్పుకోలేదేమో.
ఈ కావ్యం జైనమతపు ప్రముఖాశయమైన అహింసని తెలియపరచడమే ముఖ్య ఉద్దేశంగా రచింపబడినది. కవి జన్నడు అహింసని మాత్రమే ప్రతిపాదించడానికి ఒక చిన్న సందర్భంగా తీసుకున్న కథే అమృతమతి, అష్టావక్రుడి అనైతిక సంబంధం. యశోధర రాజుకి ప్రియసతియైన అమృతమతి ఆ రాజాస్థానంలో కనిష్ఠ సేవకుడిగా ఉండి, రాత్రిపూట మాత్రమే ఏనుగు కాపలావాడిగా పనిచేస్తున్న ఒక రూప తక్కువ వ్యక్తితో, అతను పాడిన పాటను సాకుగా పెట్టుకుని అనైతిక సంబంధం పెట్టుకుంటుంది. ఈ అనైతిక సంబంధాన చుట్టే అన్నీ విమర్శలు వచ్చినాయే తప్ప జైనమతాశయం విలువల గురించి, అహింస గురించి విమర్శలు అధికంగా రాలేదు.
ఈ లైంగిక సంబంధం గురించి రాసిన విమర్శనాత్మక వ్యాసలలో పురుష వ్యాసకారులు, ʼఅమృతమతిని సంప్రదాయాన్ని ధిక్కరించిన మహిళా అని, లైంగిక వికారి అని, జారస్త్రీ అని, దిగజారిపోయిన కులట అని, పతిత అని…ʼ1 కటువుగా విమర్శిస్తూ చాలా వ్యాసాలు రాశారు. అలాగే స్త్రీవాది దృక్కోణంలో రాసిన మహిళా విమర్శకులు, కవయిత్రులు మాత్రం ʼఅమృతమతి అలా చేయడానికి కారణం యశోధరుడే. అతను అమృతమతిలో వున్న స్త్రీ సహజమైన కోరికలను సక్రమంగా తీర్చిఉండుంటే తను అలా ఎందుకు చేస్తుంది ?ʼ2 అని రాశారు.
ఈ వ్యాసంలో ఈ పైన చెప్పిన రెండు వర్గాలు రాసిన విమర్శలలో ఉన్న సరి తప్పుల గురించి న్యాయనిర్ణయం చేయదలచుకోలేదు. ఇందులో అమృతమతి అనైతిక శృంగారం గురించి, ఆ సంబంధాన్ని కుదుర్చడానికి (ఈ సంబంధం తెంచడానికి) వారిధియైన తన ప్రియసఖి దూదవి పాత్రంలోని తెలివితేటల గురించి, ఆ తెలివితేటలవల్ల తను అల్లిన అబద్ధాల గురించి, సృష్టించిన కథల గుంరిచి, అలా అబద్ధాలు సృష్టించాల్సిన అవసరం గురించి, ఆ కల్పిత కథలు ఎంతవరకు నిజం అనేదాన్ని గురించి తెలియపరచడమే ఈ వ్యాసోద్దేశం.
2. దూదవి పాత్ర పరిచయం:
అమృతమతి అనైతిక సంబంధానికి మధ్యవర్తిగా, రాయబారిగా వచ్చిన పాత్రమే దూదవి. ఈమె అమృతమతికి ఆప్తసఖి, ప్రియమైన పరిచారిక కూడా. ఇది యశోధర చరితంలో ʼమనదన్నళప్ప కెళదిʼ3 (మనస్సుకు చాలా దగ్గిరగా ఉండే స్నేహితురాలు) అనే మాటలోనే కనబడుతుంది. అంతేకాకుండా ఈమె అంతఃపురంలో పని చేసే సేవకురాలు కూడా. ఒక వ్యక్తినుండి మరోవ్యక్తికి సందేశాలను అందించే దూత. అనైతిక సంబంధానికి అనివార్యమైనా పాత్ర కూడా. సామ్రాజ్ఞియైన అమృతమతి ఒక పనికిమాలిన కనిష్ఠ సేవకునితో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి అవకాశం కల్పించే (తప్పించే) ప్రయత్నంలో పనిచేసిన అంతరంగ శుద్ధగల స్వచ్ఛమైన స్త్రీ. తనకు ప్రియమైనవారు తప్పుడు మార్గంలో అడుగుపెడితే వాళ్ళని మందలించి సరిదోవకు తీసుకురాగలిగిన తెలివిగలదాని. ఏది చెడో, ఏది మంచో అని పరిస్థితినిబట్టి ఆలోచించే బుద్ధిమంతురాలు కూడా.
యశోధర మహారాజుకి ప్రియసతియైన అమృతమతి పరపురుషునితో అనైతిక సంబంధం పెట్టుకోవడానికి వారిధిలా, అతనితో శృంగారానికి మధ్యవర్తిలా పనిచేయాల్సి వచ్చినప్పుడు దూదవి తన ప్రియసఖియైన అమృతమతిని ఆ అనైతిక సంబంధం నుంచి తప్పించడానికి సృష్టించిన కథ మాత్రం చాలా చిత్రమైనది.
యశోధర చరితంలో ఈ దూదవి పాత్రం కేవల పన్నెండు కంద పద్యాలలో మాత్రమే వర్ణింపబడింది. అయినా ఆ పన్నెండు పద్యాలలో దూదవి అల్లిన అద్భుత అబద్దాన్ని, దాన్ని అమృతమతి ముందు వర్ణించిన తీరుని పరిశీలిస్తే దూదవిది ఎటువంటి పాత్రమో అర్థమవుతుంది. అలాగే ఆ పాత్ర ప్రాముఖ్యత కూడా తెలుస్తుంది.
అంతఃపురంలో ఒక సేవకురాలుగా పనిచేసే దూదవి ఎందుకు అబద్ధాన్ని అల్లి, కథను సృష్టించాల్సి వచ్చింది. అలా అల్లిన అబాద్దాలేమిటి ? అందులో సత్యమెంత ? అసత్యమంత ? ఈ ప్రశ్నలకు జావాబు కనిపెట్టడం ద్వారా యశోధర చరిత్రాన్ని మరొ కోణంనుంచి పరిచయం చేసుకోగలడం సాధ్యమౌతుంది.
3. అష్టావక్రుడి గానమాధుర్యం:
ఇటు రాజాస్థానంలో ఏనుగు నిగ్రహ దళంలో కనిష్ఠ సేవకుడుగా పనిచేస్తున్న అష్టావక్రుడు వినోదంకోసం, తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడంకోసం, రాత్రి నిద్ర రాకుండా ఉండాలనే ఆశయంతో తనకు తానే పాడుతూ ఉంటాడు. అతనికి తన పాటల ద్వారా ఎవరినైన మెప్పించాలనో, మనస్సు దోచుకోవాలనో ఏ ఉద్దేశమూ లేనే లేదు. కానీ యశోధర మహారాజునితో అంతఃపురంలో గాఢనిద్రలో ఉన్న అమృతమతికి ఆ పాట పరవశురాలయ్యేటట్టు వినిపిస్తుంది.
ఇలా వినిపించిన సుమధుర గానమాధుర్యానికి అమృతమతి మనస్సు కలవర చెందుతుంది.
ʼపాటని విన్న వెంటనే తన మనస్సుని ఆ పాడినవాడికే కానుకగా ఇచ్చేస్తుందిʼ.4
తరువాత అతణ్ణి చూడాలని, అతనితో సంబంధం పెట్టుకోవాలని ఆమెలో కోరిక పుడుతుంది. కాని ఆమె మహారాణి అయినందువలన ఆ సంబంధం ఏర్పర్చుకోవడానికి తన ప్రియసఖియైన దూదవిని రాయబారిగా పంపుతుంది.
ఇక్కడ ఆమె నైతిక వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే, తను ఒక మహారాజుకి సతిగా ఉండీ, ఆ సామ్రాజ్యానికి రాణిగా ఉండీ, మర్యాదస్థ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ అయినా కూడా, ఇలా ఎవరో పాడిన పాటకి, పాడినవాడికి తన మనస్సుని ఇవ్వడం అనేది పతితగా దిగజారిన ఆమె వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. సుమధురంగా వినిపించే పాటను వినడంలో ఏ తప్పూ లేదు. అలాగే విన్న తరువాత ఆ పాటకు అభిమానం చూపించడంలో, పాడినవాణ్ణి అభినందిచడంలో, పాడినవాడికి బహుమతిగా ఏదైనా వస్తువులు, సిరి సంపదలు ఇవ్వడంలో ఏ తప్పూ ఉండదు. కానీ ఇక్కడ పాటలకన్నా పాడినవాడి ధ్వనే ఆమెకి ఇంపుగా వినిపించినట్టుంది. ఇంపుగా వినిపించిన స్వరం అనేది పురుషుని ధ్వని మాత్రమే తప్ప ఇంపుగా ఉండే గాన స్వరం కాదు. ఇలా అమృతమతి తనొక మర్యాదస్థ కుటుంబానికి చెందిన స్త్రీ అయినా సంప్రదాయ విరుద్ధంగా చెడు సంస్కృతిని పురస్కరించిన దానిలా కనిపిస్తుంది.
కారణం అంతఃపురంలో ఆమెను పురుషుల సవ్వడి కూడా తాకనంత దూరంగా మరియు ఏకాంతంగా పెట్టినది ఒక కారణమైతే, యశోధరుడు అమృతమతికి తన సతిధర్మాన్ని సంప్రదాయబద్ధంగా పాటించలేకపోయినది ఇంకో కారణం. అందువలన అమృతమతి ఏ పరుషుడు కనిపించినా, పలుకినా అతడికి మనస్సు (శరీరం) ఇచ్చే రకంగా మారినట్టుగా కనిపిస్తుంది.
అమృతమతి పరపురుషుని వ్యామోహానికి వశవర్తులైన తరువాత అతన్ని చూడడం ఎలా, అతనితో మాట్లాడ్డం ఎలా ? సంబంధం కుదుర్చుకోవడం ఎలా ? అని తనలో తనే తర్కించి తన సేవకురాలైన, ʼప్రియసఖితో తన మనసులో ఉన్న ప్రేమను బయటపెడుతుంది. తరువాత తన కోరికను చెబుతొంది.ʼ5 ఇంతకు ముందే దూదవి గురిచి చెప్పినట్టు ఆమె అమృతమతికి ప్రియసఖి, దూదవి ఒక స్నేహితురాలు మాత్రమే అయిఉంటే ఈ అనైతిక సంబంధం వారిధికి ఒప్పుకునేది కాదేమో. కాని ఆమె సేవకురాలు కూడా. అందువలనే రాణి ఆజ్ఞాపించిన మాటలను వినాల్సిఉంటుంది. ఆదేశాలను పాటించాల్సిఉంటుంది. ఆ నిమిత్తం ఇష్టం లేకపోయినా అమృతమతి చెప్పిన శృంగార సంబంధానికి రాయబారిగా అష్టావక్రుడి వద్దకు వెళుతుంది.
కాని అమృతమతి ఎవరిని ప్రేమించానని చెప్పిందో ఆ వ్యక్తిని చూసిన వెంటనే దూదవి, ʼకళ్ళకు, మనస్సుకు అసహ్యమనిపించి, ఓరి దేవుడో అనే ఉద్గారం తీసి వెంటనే వెనక్కి వచ్చేస్తుందిʼ6 ఇక్కడ ఆమె వెంటనే వెనక్కి తిరిగి అంతఃపురానికి వచ్చిందంటే అతని సౌందర్యం చూడ్డానికి కూడా పనికిరాని విధంగా ఉండొచ్చు. లేక ఇంకేదో కారణం ఉండొచ్చు. అంతఃపురం వైపు ముఖం తిప్పినప్పుడు దూదవి తనలో తానే,
ʼఅమృతమతి రూపమనేది దేవతలూ కూడా
ఈర్ష్యపడెటట్టుండే అతిలోక సౌందర్యం,
అతనో దేనికీ పనికిరానివలే వుండే విరూపం,
అష్ట వక్రాలుండే కురూపి, ఇలాంటివాణ్ణా మహారాణి ప్రేమించిందిʼ7 అని ఆలోచిస్తూ, ఆమే ఒక తీర్మానానికి వచ్చినట్టు తెలుస్తుంది.
అష్టావక్రుడి వద్దనుంచి తిరిగి వచ్చిన వెంటనే ʼఇలాంటి అతిలోక సుందరుణ్ణి ఎలా వెతికి ప్రేమించావు ఓ సఖీమణిʼ8 అని వ్యంగంగా, వెటకారంగా చెబుతుంది. కానీ మోహపరవశంలో మునిగి ఉన్న అమృతమతికి దూదవి చెప్పిన మాటలు నిజమేనని అనిపించి, తన ఆతృతను వ్యక్తపరుస్తూ,
ʼచెప్పు చెప్పు… మన్మధుడివలే వుంటాడా ?
చాలా అందగాడా ? ప్రేమికుడులా వుంటాడా ?
చెప్పూ… నీవు చెప్పకనే నన్ను చంపుతున్నావుʼ9
అని తన భావోద్రేకాన్నీ ఓర్చోకోలేక అడుగుతుంది.
ఇక్కడ అమృతమతికి తను ప్రేమించిన పురుషుడు చాలా అందంగా ఉండాలన్న కోరిక కనిపిస్తుంది. ఏ స్త్రీ కైనా తను ఇష్టపడ్డ వ్యక్తిలో కనిష్ఠతమ అర్హతలైనా ఉండాలని ఎదురు చూసేది తప్పేమీ కాదు. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా జరుగుతుంది. అమృతమతి చాలా తొందరపరుస్తూ చెప్పమని దూదవిని బలవంతం చేస్తే అప్పుడు దూదవి తను చూసిన పురుషుని (కు)రూపాన్ని వర్ణిస్తుంది.
4. దూదవి అల్లిన కట్టుకథ / అష్టావక్రుడి కురూప వర్ణన:
అష్టావక్రుడి వర్ణన ఎలా వున్నదంటే –
ʼఅక్కడక్కడ రోమలూడిన తల, గీతలు గుంతలు పడిన నుదుటి,
చిన్నపాటి కళ్ళు, చినిగిపోయినట్టున్న నోరు, చప్పిడి ముక్కు,
కుంచించికుపోయిన చెవులు, నోటినుండి బయటికొచ్చిన పళ్ళు,
మెడలేని తలకాయ, గూని వీపు, ఉబ్బిన పొట్ట, అణగబారిన పిర్రెలు,
నల్లతోలు, కుళ్ళిపోయిన శవంలా శరీర కంపు, చెతులు, కాళ్ళు, గూని వీఫు,
ఇవన్నీ నడుము విరిగిన గాడిదాన్ని కూడా మించిపోయినట్టున్నాయి.
ముసలి ఎలుగొడ్డుకుండేంత మడతబారిన తోలు, నల్లబడిన ఒళ్ళు…
ఇవన్నీ ఎలావున్నాయంటే మొత్తానికి ఎండిపోయిన వంకరకట్టల్లా అష్టావక్రంగా వికారంగా వుంటాడుʼ10 అని చెబుతుంది.
ఇలా అష్టావక్రుడి (కు)రూపాన్ని వర్ణించిన తీరు మాత్రం ఏ స్త్రీకైనా అసహ్యం పుట్టి తీరాలనే ఉద్దేశంతో అలా వర్ణించిదనవచ్చు. తను వర్ణించిన కురూప సౌందర్యం ఏ పురుషునితో కూడా పోల్చుకోలేనంత దరిద్రంగా ఉండింది.
ఈ వర్ణనలో గమనించవలసినది ఆమె చెప్పిన పది-పదిహేను వికారాల గురించి. ఇది తప్పనిసరిగా ఒక నిర్హేతుకమైన వర్ణన. మనిషి శరీరంలో ఏ ఒక్క అంగమూ సహజంగా లేని విధంగా వర్ణించిన తీరు ఊహకూ మించినది. ఏ మనిషికైనా ఇంతటి వికారమైన రూపం ఉంటుందా ? ఉంటే ఒకటో రెండో వికారాలు ఉండవచ్చునే గానీ శరీరం మొత్తం ఏ ఒక్కటీ సరిగ్గా లేని విధంగా వర్ణించిన కురూపాలను గమనిస్తే అందులో వాస్తవంకన్నా అబద్దాలే ఎక్కువశాతం ఉన్నాయి అనిపిస్తుంది.
5. అల్లిన కథలో కనిపించే అబద్ధం:
ఈ అవలక్షణమైన సౌందర్య వర్ణనాలలో దూదవి సృష్టించిన కల్పిత కథ కనిపిస్తుందే తప్ప వాస్తవం గోచరించదు. ఎందుకంటే అష్టావక్రుడి శరీరం అలా ఉండుంటే అతను అంతఃపురానికి చెందిన ఏనుగు నిగ్రహదళానికి సేవకుడిగా ఉద్యోగంలో ఎలా చేరగలుతాడు. శరీర బలంలో, అవయవారోగ్యంలో ఏ అర్హత లేనివాణ్ణి రాజులు తమవద్ద పనికి ఎందుకు పెట్టుకుంటారు.
కావ్యంలో అష్టావక్రుడు అంతఃపురానికి చెందిన ఏనుగు నిగ్రహదళంలో సేవకుడు అని చెప్పబడినది నిజం. అతడు అలా ఏనుగు నిగ్రహ దళానికి చెందినవాడు కాబట్టి అతనికి శరీరం సహజంగా, సదృఢంగా ఉందని నమ్మాలి. నడవడానికి కూడ వీలులేనట్టు నడుమువిరిగిన గాడిదే మేలు అని దూదవి వర్ణించినట్టు వికారవంతుడు కాదు అని ఒప్పుకోవాలి. అలా వికారాలున్నవాడికి అంతఃపురంలో ఏ ఉద్యోగం కూడా ఇవ్వరు. అయినా దూదవి మాత్రం అమృతమతి ప్రేమించిన వ్యక్తిని చాలా వికారంగా మరియు అవలక్షణంగా వర్ణించింది.
ఇంకో మాట చెప్పాలంటే ఆ తరువాత అమృతమతి అష్టావక్రునితో ప్రేమ కలాపం కొనసాగిస్తున్నప్పుడు ఒక సారి అమృతమతి అనివార్య కారణంవలన కాస్త ఆలస్యంగా అష్టావక్రుడి వద్దకు వెళుతుంది. ఆ ఆలస్యాన్ని ఆసరగా తీసుకొని అష్టావక్రుడు కోపంతో అమృతమతి ముంగురులను పట్టుకొని చితకబాదుతాడు. ఇక్కడ అష్టావంకుడు అమృతమతిని కాలితో తన్ని, అమృతమతి శరీరమంతా వాపుపోయేలా చితకబాదాడంటే అతడు శారీరికంగా సదృఢంగా ఉన్నవాడనే అర్థం.
ఇలా అంతఃపురం ఉద్యోగం, అమృతమతిని చితకబాదడం ఈ రెండూ గమనించిన తరువాత అష్టావక్రుడు వికారుడు అని, అసహజంగా ఉండే మనిషి అని ఒప్పుకోవడానికి ఆస్కారం లేదనందున దూదవి అమృతమతికి చెప్పిందంతా కేవలం కల్పిత కథే.
దూదవి చెప్పింది అబద్ధం అనడానికి ఉండే మరో ఆధారం ఏమిటంటే, అమృతమతి కోరిక మేరకు దూదవి అష్టావంకుణ్ణి చూడ్డానికి వెళ్ళినప్పుడు అతని శరీరం నుండి సహించదగని అసహ్య కంపు కొడుతున్నదీ మరియు అతని కురూపాన్ని చూసి అక్కడ ఉండలేక వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసింది.. ఇవే నిజమైతే, ఆమె అతని శరీరాన్ని అంతగా గమనించడం సాధ్యం కాని పని. ఎందుకంటే ఆమె వర్ణించిన అన్ని వికారాలను సరిగ్గా చూడాలంటే కనీసం పది-పదిహేను నిమిషాలైన పట్టొచ్చు. ఒకవేళ ఆమె అంత సేపూ ఉండి అతని విరూప సౌందర్య వివరాలన్నీ కనుక్కుని వచ్చింది అనడానికి కూడా అక్కడ ఆస్కారం లేదు. ఎందుకంటే ఆమె అక్కడనుంచీ వెంటనే వెనక్కి వచ్చేసింది అనేది ఒక్క కారణమైతె, అష్టావంకుని శరీరం నుండి వస్తున్న అసహ్య కంపు సహించదగనిది అనే వర్ణన ఇంకొక కారణం. ఈ రెండు కారణాలను గమనిస్తే, దూదవి అక్కడే ఉండి అతని శరీర గుణగణాల్నీ, విరూప సౌందర్యం మొత్తాన్ని చూసినట్టయితే ఆమె చెప్పిన అసహ్య కంపు అష్టావక్రుడిలో లేనట్టె. కంపు భరించలేక అక్కడ ఉండకపోయిఉంటే ఆమె చెప్పిన వికార స్వరూపం కల్పితం.
దానికి అనుకూలితమైన ఇంకో సంగతి ఇక్కడే ప్రస్తాపవిస్తే తప్పు కాదు. అమృతమతి అష్టావంకుని ప్రేమ (మోహం)లో పడ్డానికి కారణ అతను సుమధురంగా పాడిన పాట. అతడు అలా సుశ్రావ్యంగా పాడాడంటే అతని గొంతు, నోరు, పళ్ళు, మెడ అన్నీ బాగుండాలి. బాగుంటేనే అలా పాడగలుగుతాడు. కానీ అలా లేనట్టు దూదవి వర్ణించింది. కాని ఇక్కడ అష్టావక్రుడి అతి సుమధుర గానాన్ని అమృతమతి ఆలకించింది, అలానే మనసుని కానుకగా పాడినవాడికి ఇచ్చేసింది. ఇక్కడ సుమధుర స్వరాల గానం విన్నదీ, మనస్సు ఇచ్చినదీ రెండూ నిజం కాబట్టి దూదవి చెప్పిన వికార స్వరూపం అబద్ధం.
ఇంకో విషయమేమిటంటే, ఒక వ్యక్తికి ఒకే సందర్భంలో ఉబ్బిన పొట్ట మరియు గూని వీపు ఉంటుందంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఉబ్బిన పొట్ట ఉంటే గూని వీపు ఉండదు, గూని వీపు ఉంటే పెద్దగా ఉబ్బిన పొట్ట ఉండదు. ఈ రెండింటిలో ఏదొ ఒకటి ఉండొచ్చే తప్ప రెండూ ఉండడానికి అవకాశము లేదు, ఆస్కారమూ లేదు గాబట్టి దూదవి రెండూ ఉన్నాయని వర్ణించిన సంగతులు అబద్ధమైనవి. కాబట్టి అష్టావంకుడి విరూప వర్ణలన్నీ దూదవి కల్పించిన కట్టుకథలే.
మరో సంగతి ఏమిటంటే, ఏ స్త్రీకైనా కాస్తో కూస్తో సౌందర్య ప్రజ్ఞ అనేది ఉండే ఉంటుంది. మహాభారతంలో ద్రౌపది అర్జునుణ్ణి వరించడానికి, కారణం అతని శారీరిక బలం, అవయవారోగ్యం, అతని సాటిలేని అందం. అలాంటప్పుడు ప్రతీ స్త్రీకి తను కోరే వ్యక్తిలో కొన్ని మంచి లక్షణాలు ఉండాలని కోరుకుంటుంది. అలానే అమృతమతి ఒక సామ్రాజ్యానికి రాణిగా ఉండీ కూడా ఏ అర్హతలూ లేనివాణ్ణి ఎలా ప్రేమించగలదు. ʼప్రేమం అనేది గుడ్డిదిʼ అని తేలికగా ఎంత చెప్పినా కూడా ఇంత గుడ్డిది మాత్రం అయిఉండదు.
అమృతమతి కూడా దూదవి మొదటి సారి చెప్పిన ʼఇలాంటి అతిలోక సుందరుణ్ణి ఎలా వెతికి ప్రేమించావుʼ అని వ్యంగ్యంగా చెప్పినప్పుడు ʼచెప్పు చెప్పు ఎలా వున్నాడు, అందగాడా ? మన్మధుడువలే వున్నాడా ?ʼ11 అని ఆతృతతో అడిగిన మాటల్లో కూడా తను ప్రేమించే వ్యక్తి అందగాడిలా ఉంటే బావుణ్ణు అనే స్త్రీ సహజమైన సౌందర్యప్రజ్ఞ కనిపిస్తుంది. ʼఅలా లేదు, చాలా అహస్యకరంగా, వికారంగా ఉన్నాడనిʼ దూదవి చెప్తే తను బాధపడుతుంది. కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటుంది. ఇక్కడ అమృతమతి కోరినది మరియు ఎదురు చూస్తుండేది ఒక అందగాణ్ణి. కానీ అతను తను అనుకున్నంతగా కాకుండా, దానికి వెయ్యి రేట్లు కనిష్ఠ (కు)రూపమున్నవాడని తెలిసిన తరువాత తను తెలివితేటలతోనే తన మాటల ప్లేటును పిరాయిస్తుంది.
ʼకస్తూరి నల్లగా వుందని దాన్ని వదలుకోముగా,
వంకరగా వుంటుందని గంధపు చెక్కను దూరము చేసుకోముగదా,
వంగిందని ఇంద్రధనుస్సుని చూడ్డం మానేస్తమా ఏంటి ?
ఒసేయ్ తెలివి తక్కువదానా, మనం ప్రేమించిన వాళ్ళలో లోపాలుంటేనే క్షేమంʼ12
అని సమర్థిస్తుంది. ఈ సమర్థనలో ఆమెలో ప్రేమకన్నా శృంగారాసక్తే అధికంగా కనిపిస్తుంది. దీనికి మరో సమర్థన ఏమిటంటే అమృతమతియే చెప్పిన,
ʼప్రేమ పుట్టిన చోట రూపం కనిపించదు,
ప్రేమ(సురత)కలాపానికి కారణంతో పనిలేదు.
ఇవాళతనే నాకు ఇంద్రుడు, చంద్రుడు, సర్వస్వం...ʼ13
అన్న ఈ మాటలతో తెలుసుకోవచ్చును. ఈ మాటల్లో అమృతమతికి ప్రేమకన్నా, రూపంకన్నా పురుషుడి సాహచర్యం, అతని సాంగత్యమే ముఖ్యమైనవి అని తెలుస్తుంది.
6. ముగింపు:
- చివరిమాటగా దూదవి ఈ అబద్ధం ఎందుకు చెప్పింది అనేది ఇప్పుడు తెలుసుకోవాల్సిన సందర్భం. ఇంతకు మునుపు చెప్పినట్టు దూదవి అమృతమతికి ప్రియసఖి… తను ప్రాణ స్నేహితురాలు అయిఉండీ కూడా తన సఖి, అమృతమతి అనైతిక కలాపంలో మునిగి ఒక పతితగా దిగజారిపోవడం ఇష్టంలేక, ఈ సంఘంలో ఆమె అవమానపాలవడం తప్పించడానికి, ఆమె మనస్సుని పరపురుషుని వ్యామోహం నుంచి మరల్చడానికీ ఇలా అబద్ధాల కల్పిత కథ సృష్టిస్తుంది. ఈ అబద్ధంవలననైనా అమృతమతి తన కనిష్ఠతమ ఆలోచననుండి తేరుకుని మనస్సును మార్చుకుంటుందేమో అనే చిన్న ఆశతో అలా చెప్పింది. ఇది ఒక ప్రియమైన స్నేహితురాలు చేయాల్సిన పని. ఇది స్నేహంకోసం చేసినది.
- అయినా అంతఃపురంలో దూదవి ప్రియసఖీ మాత్రమే కాకుండా సేవకురాలూ కూడా. కాబట్టి అమృతమతిని మందలించి, ఉపదేశ వాక్యాలు చెప్పేంత స్థాయి తనకు లేనందువలన అమృతమతి ఆజ్ఞాపించినట్టు వింటుంది. ఇక్కడ స్నేహితురాలైన దూదవి కల్పిత కథ చెప్పి అనైతిక సంబంధాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తే, సేవరకురాలైన దూదవి ఆ అనైతిక సంబంధాన్ని కుదురించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆమెను కూడా కొన్ని ప్రలోభనలు అలాంటి పనిలో పూనుకునేటట్టు ఒత్తిడి చేస్తాయి. అవేమిటంటే అమృతమతి పెట్టిన లంచం (ధనం,ఆభరణ సంపదం) అనే ప్రలోభన. ఈ ప్రలోభనకు ఆమె గురికావడానికి ఉండే ఏకైక కారణం ఆమెకున్న బీదతనం, అధిక ఆదాయం లేని చిన్న ఉద్యోగం.
- ఇక్కడ అమృతమతికి పరపురుషునితో సంబంధం అవసరం ఉంది, సేవకురాలైన దూదవికి డబ్బు అవసరం ఉంది. ఈ అవసరాలనేవి (డబ్బు, శృంగారం) మనిషి ఎంతటివాడైనా, ఎంత మనోనిగ్రహం ఉన్నవారినైనా మారుస్తాయి అనేదానికి ఈ అమృతమతి, దూదవి పాత్రలే అత్యంత సశక్త ఉదాహరణ.
7. సూచికలు:
- యశోధర చరితం - అభిజాత పరంపర, పుట 40.
- పైదే, పుట 92, 93
- యశోధర చరితం, కె.వి. రాఘవాచార్, పుట 14
- పైదే, పుట 13
- పైదే, పుట 14
- పైదే, పుట 14
- పైదే, పుట 14
- పైదే, పుట 14
- పైదే, పుట 14
- పైదే, పుట 15
- పైదే, పుట 14
- పైదే, పుట 15
- పైదే, పుట 16
8. ఉపయుక్తగ్రంథసూచి:
- కీర్తినాథ, కుర్తకోటి. (1982). యశోధరచరిత కావ్యతంత్రం. ప్రసారాంగ, బెంగళూరు విశ్వవిద్యాలయ, బెంగళూరు
- గోపాలకృష్ణ భట్, తెక్కుంజ. (1976). యశోధరచరితం. కన్నడ సాహిత్య పరిషత్తు, బెంగళూరు
- పుష్పా, ఎచ్. ఎల్. (2004). అమృతమతి స్వగతం. సి.వి.జి పబ్లికేషన్స్, బెంగళూరు
- బీచనళ్ళి, కరిగౌడ. (2011). యశోధరచరితం. అభిజాత పరంపర, ప్రసారాంగ, కన్నడ విశ్వవిద్యాలయ, హంపి.
- రాఘవాచార్, కె.వి. (1943). యశోధర చరితం. మైసూరు విశ్వవిద్యాలయ గ్రంథమాలా, మైసూరు
- శివకుమార్, కె. వై. (2000). జన్న - ఒక పరిశీలన. చేతన బుక్ హౌస్, మైసూరు
- శ్రీకంఠయ్య, తీ.నం. (1947). కావ్య సమీక్ష. కావ్యాలయ ప్రకాశన, మైసూరు
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

