headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-02 | February 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed

3. జాతీయోద్యమకాలం: రచయిత్రుల సాహిత్యం

ఆచార్య త్రివేణి వంగరి

ప్రొఫెసర్, తెలుగుశాఖ,
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం.
సెల్: +91 9951444803, Email: telugutriveni@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 19.01.2025        ఎంపిక (D.O.A): 28.01.2025        ప్రచురణ (D.O.P): 01.02.2025


వ్యాససంగ్రహం:

స్వాతంత్య్రపుపోరాటంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా భాగం పంచుకున్నారు. దేశంలో అన్ని ప్రాంతాల్లోలాగే మన తెలుగుప్రాంతంలో కూడా ఎందరో వీరనారీమణులు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ సహాయనిరాకరణోద్యమం మొదలుకొని ఎన్నో ఉద్యమాలు ఎంతోమంది స్త్రీలను ఆకర్షించాయి. దువ్వూరి సుబ్బమ్మ, సంగం లక్ష్మీబాయి, కనుపర్తి వరలక్ష్మమ్మ, ఎల్లాప్రగడ సీతాకుమారి, నందగిరి ఇందిరాదేవి, ఆరుట్ల కమలాదేవి మొదలగువారు స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొని తమ రచనల ద్వారా ప్రజలను జాగృత పరిచారు. జాతీయోద్యమ చిత్రీకరణతో పాటుగా స్త్రీ సంస్కరణ, స్త్రీ విద్యావశ్యకత, స్త్రీ స్వాతంత్రం, స్త్రీ సమాజోద్దరణ వంటి తదితర అంశాలతో రచయిత్రులు సాహిత్యాన్ని వెలువరించారు. ఈ నేపథ్యంలో నాటి రచయిత్రుల సాహిత్యకృషిని అవలోకించడం నా వ్యాసపరిశోధన ముఖ్యోద్దేశం. డా. జంధ్యాల కనకదుర్గ 2016లో "స్వతంత్రత నుండి... స్వాతంత్ర్యానికి (తెలుగులో స్త్రీల సాహిత్యం క్రీ. శ. 1900-1927)" అనే పుస్తకాన్ని 2016 లో రచించారు. గోగు శ్యామల "నల్లపొద్దు (దళిత స్త్రీల సాహిత్యం 1921-2002)" అనే పుస్తకానికి సంపాదకత్వం వహించారు. ఈ రెండు పుస్తకాలునా వ్యాసరచనకు ప్రధాన ఆకరాలుగా నిలిచాయి. అదే విధంగా సురవరం ప్రతాపరెడ్డి (సం.) "గోలుకొండ కవుల సంచిక", భార్గవీరావు (సం.) "నూరేళ్ళ పంట", ముదిగంటి సుజాతారెడ్డి (సం.) "తెలంగాణ తొలితరం కథలు", దేవరాజు మహారాజు "స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం" వంటి తదితర గ్రంథాలు కూడా తోడ్పడ్డాయి. "కథా సాహిత్యం, కవితా ఖండికలు, నవలా సాహిత్యం, నాటక సాహిత్యం, ప్రసంగ వ్యాసాలు (ఉపశీర్షికలు)"గా విభజించుకొని నా వ్యాసరచన ప్రణాళికను రూపొందించుకున్నాను. ఈ జాతీయోద్యమకాలంలో రచయిత్రుల సాహిత్యంలో స్వాతంత్ర్యోద్యమ ముఖచిత్రంతో పాటుగా స్త్రీ విద్యావశ్యకత, స్త్రీవ్యక్తి స్వాతంత్ర్యం ప్రధానాంశాలుగా పేర్కొనబడ్డాయి. భారతజాతీయోద్యమాన్ని ముందు నడుపుతూ ఐకమత్యంతో సంఘటితపరిచే శక్తిని అందించారు. స్వాతంత్ర సాధననే తమ గమ్యంగా ఎంచుకొని రచయిత్రులు రచనా వ్యాసంగం చేశారు. నాటి స్త్రీ చైతన్యం, అభ్యుదయం, స్వాతంత్ర్యకాంక్ష, వారి స్ఫూర్తిదాయకమైన జీవనగమననిర్దేశం వంటి అంశాలు ఈ వ్యాసంలో విశ్లేషించాను.

Keywords: జాతీయోద్యమం, గృహలక్ష్మి పత్రిక, సహాయ నిరాకణోద్యమం, ఐకమత్యం, తృణప్రాయం, ఆత్మార్పణ, ఆర్య సమాజం, సమష్టి ప్రాతిపదిక, స్వదేశీ ఉద్యమం, జాతీయ పతాకం, మార్గ నిర్దేశం, స్త్రీ సంస్కరణాభిలాష

1. ఉపోద్ఘాతం:

భారతదేశ ప్రప్రథమ ప్రధాని పండిత జవహర్ లాల్ నెహ్రూ ఒకానొక సందర్భంలో భారత మహిళా లోకాన్ని ప్రశంసిస్తూ “భారత స్వాతంత్య్ర సముపార్జనలో ధైర్య సాహసాలతో, సడలని ఆత్మవిశ్వాసంతో పురుషులతో సమానంగా చేయి భుజాలు కలిపి ఇల్లు వాకిళ్ళని సంసారాలని వదిలి, ఎన్నో త్యాగాలు చేసి, స్వాతంత్ర్య ఫలాలని మనకి అందించారు.” అని  పేర్కొన్నారు. దేశంలో అన్ని ప్రాంతాల్లోలాగే మన తెలుగు ప్రాంతంలో కూడా ఎందరో వీరనారీమణులు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం మొదలుకొని ఎన్నో ఉద్యమాలు ఎంతోమంది స్త్రీలను ఆకర్షించింది. వారిలో దేశభక్తి, సేవానురక్తిని కలిగించాయి. భారతీయ స్త్రీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వారి గృహ సంబంధిత బాధ్యతలను ఏ మాత్రం వదులుకోకుండా స్వాతంత్ర్యపోరాటానికి చేయూతను అందించారు. తరతరాల భారతీయ స్త్రీ మూర్తి వ్యక్తిత్వం, శాంతి సహనాలు, మౌనంగా కష్టాలను భరించడం, తనను తాను ఆత్మార్పణ చేసుకోవడం, ఎన్ని సవాళ్ళనైనా ఎదుర్కోవడం వంటి సహజ గుణాలతో జాతీయోద్యమానికి భారతీయ స్త్రీలు సిద్ధపడ్డారు. విద్యావంతులైన కొంతమంది స్త్రీలు, సంస్కర్తల ఉమ్మడి కృషి, ప్రోత్సాహంతో జాతీయ ఉద్యమంలో ప్రవేశించారు. సభలకు, సమావేశాలకు వెళ్లడమే గాక రాజకీయ సమస్యల మీద జరుగుతున్న ఉపన్యాసాలు, చర్చలలో పాల్గొనడం వల్ల స్త్రీలలో సామాజిక చైతన్యం పెంపొందింది.

 దర్శి అన్నపూర్ణ, డాక్టర్ ముత్తు లక్ష్మీరెడ్డి, తలారి చంద్రమతీ దేవి, టి. ఎన్. సదాలక్ష్మి వంటి స్త్రీలు రాజకీయ రంగ ప్రవేశం చేసి తమ ఉపన్యాసాలు, ప్రసంగాల ద్వారా జాతీయోద్యమాన్ని ఉదృతపరచారు. కందుకూరి రాజ్యలక్ష్మమ్మ, రుక్మిణీ లక్ష్మీపతి, పొణకా కనకమ్మ తదితరులు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధన విషయాలపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. దువ్వూరి సుబ్బమ్మ, సంగం లక్ష్మీబాయి, కనుపర్తి వరలక్ష్మమ్మ, ఎల్లాప్రగడ సీతాకుమారి, నందగిరి ఇందిరాదేవి, ఆరుట్ల కమలాదేవి మొదలగువారు స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొని తమ రచనల ద్వారా ప్రజలను జాగృత పరిచారు. జాతీయోద్యమ చిత్రీకరణతో పాటుగా స్త్రీ సంస్కరణ, స్త్రీ విద్యావశ్యకత, స్త్రీ స్వాతంత్రం, స్త్రీ సమాజోద్దరణ వంటి తదితర అంశాలతో రచయిత్రులు సాహిత్యాన్ని వెలువరించారు. ఇక సాంస్కృతిక రంగాల ద్వారా చాలా మంది తెలుగు స్త్రీలు తమ జాతీయ వాదాన్ని ప్రదర్శించారు. విద్యాలయాలు, ముద్రణాలయాలు, స్త్రీ సమాజాల స్థాపన ద్వారా మహిళలు తమ ఆశలను, ఆశయాలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించారు. ఈ కాలంలోనే తెలుగు జనానా, హిందూ సుందరి, సావిత్రి, వివేకవతి, అనసూయ, గృహలక్ష్మి, భారతి, శారద, తెలుగుతల్లి వంటి పత్రికలు వెలువడ్డాయి. ఇందులో స్త్రీలు అనేక రచనలు చేశారు. ఎంతో ప్రతిభావంతమైన సాహిత్యాన్ని ప్రచురించారు. ఇందులో ఎక్కువ శాతం మాతృభూమి, దేశభక్తి, స్వతంత్ర పోరాటాల్లో స్త్రీల కృషి, స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాలు వంటి అంశాలు ఉన్నాయి. స్వాతంత్ర్యోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న స్త్రీలు, కుటుంబ సభ్యులకు వెన్నంటి ఉండి కదనరంగంలోకి భర్త, కుమారులను పంపిన స్త్రీలు, దేశ నాయకుల అడుగుజాడల్లో నడిచి వారి ఆశయ సిద్ధికి స్ఫూర్తిగా నిలిచిన స్త్రీల కథనాలను రచయిత్రులు తమ రచనలలో ప్రవేశపెట్టారు.

భారతదేశ జాతీయోద్యమం సుదీర్ఘమైంది. 31 ఆగస్ట్ 1920 సహాయ నిరాకరణోద్యమం, 30 మే 1929 యంగ్ ఇండియా ఉద్యమం, 1930 లో ఉప్పుసత్యాగ్రహం, 7 ఏప్రిల్ 1934 లో గాంధీజీ శాసనోలంఘన ఉద్యమ విరమణ, 1935 లో ఇండియా చట్టం అమలు, 1937 లో రాష్ట్ర శాసన సభలకు మొట్టమొదటి సారిగా సార్వత్రిక ఎన్నికలు – కాంగ్రెస్ విజయం, 14 జూలై 1937 లో మద్రాసు రాష్ట్రం ప్రధాని (ముఖ్యమంత్రి) గా సి. రాజగోపాలాచారి ఎన్నిక, 6 ఆగస్ట్ 1942 లో బొంబాయి కాంగ్రెస్ మహాసభ – క్విట్ ఇండియా తీర్మానం, 15 ఆగస్ట్ 1947 లో భారత స్వాతంత్ర్యోదయం, 17 సెప్టెంబర్ 1948 లో తెలంగాణ విమోచనం వంటి ప్రధాన ఘట్టాల వరకు సాగిన పోరాటం ప్రజలందరిని జాగృత పరిచింది. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను, ఐకమత్యాన్ని, జాతీయ భావాలను పెంపొందించింది. ఈ జాతీయోద్యమ కాలంలోనే జరిగిన రెండు ప్రపంచ యుద్ధ పరిణామాలు దేశ ప్రజలను మరింత ప్రభావితం చేశాయి. తద్వారా పీడిత పాలన నుంచి విముక్తి పొందడానికి స్వాతంత్ర్య పోరాటాన్ని ఉదృతం చేశారు. దేశమాత దాస్య శృంఖలాలను ఛేదించడం కోసం బ్రిటిష్ వారికి ఎదురుతిరిగారు. అలుపెరుగని పోరాటం చేసి కారాగార శిక్షలు అనుభవించారు. అనేక మంది భారతీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి ఆత్మార్పణ చేసుకున్నారు. 

జాతీయోద్యమంలో సామాజిక, సాంస్కృతిక, మత, రాజకీయ సంస్థలు ప్రధాన భూమికను నిర్వహించాయి. ఆది ఆంధ్ర ఉద్యమం, ఆది జన దళిత ఉద్యమం, ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర రైతు సంఘం, ఆంధ్ర మహా సభలు, ఆంధ్ర మహిళా సభలు వంటివి ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించాయి. తద్వారా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఆవిర్భవించి ప్రజాపాలనలో ముందడుగు వేశాయి. ముద్రణాలయాలు, పత్రికా రంగం, గ్రంథాలయోద్యమం, సాహిత్య సంస్థలు, సారస్వత పరిషత్ ఏర్పాటు వంటివి సామాజిక పరంగా అభ్యున్నతిని కలిగించాయి. ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, దివ్యజ్ఞాన సమాజం, రామానుజమతం వంటివి సాంస్కృతిక పరమైన సంస్కరణ భావాలను పెంపొందించాయి.

జాతీయోద్యమం కంటే ముందుగానే సంస్కరణోద్యమం రచయిత్రులలో గొప్ప స్ఫూర్తిని కలిగించింది. స్త్రీల జీవితాలలో మార్పును ఆశిస్తూ ఒక సమష్టి ప్రాతిపదిక దృష్టితో సంస్కరణ వాదం ఆరంభమైంది. స్త్రీలలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తులకు, అణగారి ఉన్న ఆలోచనలకు ఒక చక్కటి అవకాశాన్ని అందించింది. స్త్రీల సమస్యలను గుర్తిస్తూ, స్త్రీల అభివృద్ధిని కాంక్షిస్తూ సంస్కరణ వాదం బలోపేతమైంది. కుటుంబం ఒక సామాజిక రంగంగా ఆ క్రమంలో స్త్రీలను సమాజంలో అంతర్భాగంగా, స్త్రీలలో చైతన్య స్థాయిని పెంపొందించడానికి స్త్రీ విద్యావశ్యకతను నిర్ణయించడం జరిగింది. తెలుగు దేశమంతటా విస్తరించి ఉన్న బాల్య వివాహాలు, బాల వితంతువులు, సాంఘికపరమైన కట్టుబాట్లు, కన్యాశుల్కం, అవిద్య మొదలైన అంశాలు స్త్రీల జీవితాలను దుర్భరం చేశాయి. ఈ బాల్య వివాహాల పద్ధతి పల్ల కన్యాశుల్కం ఏర్పడి, దాని వల్ల వైధవ్యం, వ్యభిచారం వంటి అవినీతి చర్యలు, శిశుహత్య వంటి క్రూర చర్యలు ప్రారంభమయ్యాయి. స్త్రీల అభ్యుదయాన్ని కాంక్షిస్తూ అభివృద్ధి పథంలో నడుస్తున్న సంస్కరణ భావాలతో వాస్తవిక జీవితాల్లో కూడా మార్పు తీసుకొని రావాలని రచయిత్రులు తలంచారు. ఆ ఆకాంక్షతోనే ఆచరణలో కార్యరూపాన్ని అనుసరించారు. భారతదేశ చరిత్రలో సంస్కరణోద్యమానికి ప్రముఖ స్థానం ఉంది. తొలి దశలో మత, సాంఘిక, రాజకీయ పరిణామాలు ఏర్పడ్డాయి. సతీసహగమనాన్ని, కన్యాశుల్యాన్ని తీవ్ర సమస్యలుగా భావిస్తూ వ్యతిరేక ఉద్యమాలు బయలుదేరాయి. ఇటువంటి జాతీయోద్యమ ప్రభావంతో రూపుకట్టుకున్న సంస్కరణ భావాలను రచయిత్రులు చాలా స్పష్టంగా వెల్లడించారు.

2. కథాసాహిత్యం:

కనుపర్తి వరలక్ష్మమ్మ “ఐదు మాసాల ఇరువది దినములు” అనే కథను రచించారు. జాతీయోద్యమంలో భాగంగా స్వదేశీ ఉద్యమానికి సంబంధించిన ఇతివృత్తాన్ని కల్పించారు. ఈ కథలో రుక్మిణీ భర్త గోపాలరావు విదేశీ వస్త్ర బహిష్కరణ నేపథ్యంలో జరిగిన పోరాటంలో జైలుకు వెళ్తాడు. ప్రసవానికి వెళ్లి పండంటి బిడ్డతో పుట్టింటినుంచి అత్తింటికి వచ్చిన రుక్మిణీ ఏమాత్రం అధైర్యపడకుండా భర్త ఆశయాలకు తగినట్లు నడుచుకొంటుంది.

“ఏమి? మనదేశపు గుడ్డ మనము కట్టుకొనుటగూడ తప్పేనా? నేడిదైనది. రేపు మీకు గావలసిన ఆహారపదార్థములను మేమే పచనము చేసి పంపెదము గాని మీరు తయారుచేసికొనరాదనినచో మన పొయ్యిలు తవ్వివేసికొనవలసినదేనా? ఎంత అధమపు బ్రతుకు. నా పెనిమిటి నాతో మాట్లాడలేదని యెంతో వేదన పడితిని. కాని కారణము తెలిసికొనలేక పోతిని. నేను, పిల్లవాడు ధరించియున్న విదేశీ వస్త్రములే వారికి అసహ్యకారణమై యుండవలయును. విదేశీ వస్త్రములలో నైసూ, నాజూకూ ఉన్నదనుకొనుచుంటింమి గాని వాటిలో ఇంత పరాధీనత యున్నదని గమనించలేదు. ఛీ! నా పతికి అప్రియములగుటయేకాక శిక్షా హేతువులైన ఈ విదేశ వస్త్రములు నాకేల?” అని యోచించి తక్షణమే రుక్మిణీ తన చీని చీనాంబరములకు సెలవొసంగినది. ఆమె ఇప్పుడు ఖద్దరు వస్త్రధారిణి. ఏ హార్మోనియము వాయిద్యమో, ఫిడేలు వాయిద్యమో వినబడుచుండెడిది రుక్మిణీ మేడ మీది గదిలో మునుపు. ఇప్పుడు ఎల్లవేళల రాట్నపు నినాదము.” (నూరేళ్ళ పంట పుట. 10)

“చట్టసభల్లో మెజార్టీ మీదేగా!” అనే మరొక కథను కనుపర్తి వరలక్ష్మమ్మ రచించారు. పురుషులకు చట్టసభల్లో గల మెజార్టీని ఆమె ఈ కథ ద్వారా ప్రశ్నించారు. ఈ కథ జూలై 1936 గృహలక్ష్మి పత్రికలో ప్రచురించబడింది. స్వాతంత్రోద్యమం ప్రభావం చేత ఉత్తేజం పొంది సంస్కరణ మార్గంలో ఈ కథను నడిపించారు. స్త్రీలు పురుషులపై ఆధారపడకూడదని అన్నారు. స్త్రీలు చదువుకోవడమే గాక ఉద్యోగాలు చేసి తమ కాళ్లమీద తాము నిలబడాలని హితవు పలికారు. స్త్రీ సంపాదన పరురాలు అయితే పరాధీనత పోతుందని అభిప్రాయపడ్డారు. కవులు, రచయితలు స్త్రీలను భోగవస్తువుగా అభివర్ణించకూడదని అన్నారు. “స్త్రీ విడాకుల చట్టం” ఆవశ్యకతను గూర్చి ఈ కథలో ప్రస్తావించారు. (స్వతంత్రత నుండి.. స్వాతంత్రానికి పుట.318)

కనుపర్తి వరలక్ష్మమ్మ రచించిన ఇంకో కథ “ఎప్పటికో జ్ఞానోదయం.” 1940 గృహలక్ష్మి పత్రికలో ప్రచురించారు. భర్తలు తమ భార్యలను పురాణ కాలక్షేపానికి, హరికథలు వినడానికి పంపుతారు కానీ స్త్రీల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న సమావేశాలకు హాజరు కావడానికి ఇష్టపడరని ఆమె సందేహం వ్యక్తం చేశారు. స్త్రీలకు జ్ఞానోదయం కలగాలంటే హరికథల కంటే కూడా స్త్రీ సమాజాలకు వెళ్లాలని ఉద్బోధ చేశారు.  జాతీయోద్యమ ప్రభావంతో స్త్రీలు చైతన్యం కావాలనే నేపథ్యం వరలక్ష్మమ్మ కథల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

“నీలాటి రేవు” అనే కథను కూడా కనుపర్తి వరలక్ష్మమ్మ రచించారు. ఇది 1945 ఆంధ్రజ్యోతి మాస పత్రికలో ప్రచురించబడింది. నాటి యువకులు వివాహ సమయంలో మరింత వరకట్నం కోసం, లాంఛనాల కోసం, కానుకల కోసం కన్యాదాతను పీడిస్తూ ఉంటారని అన్నారు. ఈ కథలో కూడా వివిధ చట్టాల నేపథ్యాన్ని ఈ కథలో వివరించారు.  “హిందూ లా చట్టం” వస్తే వరకట్న సమస్య తీరుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అదేవిధంగా 1945లో రూపొందించబడిన “హిందూ లా చట్టం” పూర్వాపర విషయాల జ్ఞానాన్ని ఈ కథలో తేటపరిచారు. నిర్దేశించిన విషయాన్ని అనుసరించి తదనంతరం అనేక చట్టాల రూపకల్పనకు ఈ కథలోని నేపథ్యం దోహదం చేసిందని భావించవచ్చు. తదనంతరం భారత దేశ న్యాయ చట్టాలలో 1955లో రూపొందించిన “హిందూ మ్యారేజ్ యాక్ట్” 1961లో రూపొందించిన “వరకట్న నిషేధ చట్టం” నాటి స్త్రీ సమాజ పోరాటాల వల్లనే సాధించబడ్డాయనే విషయం ఈ కథ ద్వారా మనకు స్పష్టమవుతుంది. దూరదృష్టి, పోరాట పటిమ, స్ఫూర్తివంతమైన వస్తు నిర్దేశం వంటివి వరలక్ష్మమ్మ అనుసరించిన కథా మార్గంగా పేర్కొనవచ్చు.

జాతీయోద్యమం ఇతివృత్తంతో మైదవోలు పద్మావతి “త్యాగిని” అనే కథను రచించారు. కొడుకును స్వాతంత్ర్యోద్యమంలోకి పంపడం కోసం తాను అడ్డంగా ఉండరాదని భావించి ఆత్మత్యాగం చేసుకున్న ఒక తల్లి కథ. 1931 గృహలక్ష్మి పత్రికలో ప్రచురించబడిన ఈ కథలో రావు అనే వ్యక్తి తాను స్వాతంత్ర్యోద్యమంలోకి వెళ్తే తన తల్లి దిక్కులేనిదవుతుందని అనుకోని ఉద్యమంలోకి వెళ్ళకుండా ఉద్యోగం చేస్తుంటాడు. కాని తల్లి ఈ విషయాన్ని గమనించి “నాయనా! అందరును సత్యాగ్రహ పోరాటమున పాల్గొనుచుండ నీవు ఆడదానివలె ఇంట కూర్చొని యున్నావేమి? ఆ భరత పుత్రుల ఘోష నీ చెవికెక్కలేదా? మహాత్ముని యాజ్ఞయనిన లక్ష్యములేదా? భారతీయుల పాట్లు చూడ ముదుసలినగు నాకు రోష పౌరుషములు పైకుబికి జాలిచేత గుండె నీరగుచున్నదే. నీ మనసేమి పాషాణమా? ఇనుమా? ఏల కరుగదు? నీవును ఒక మనిషివేనా? ఈ దేశమున జనించిన వాడవేనా? అని నిలదీస్తుంది. చివరికి నాయనా! భారతీయుడవనిపించుకొనుము. నీవు సత్యాగ్రహమునందు పాల్గొనకుండుటకు నేనడ్డమని తలచి, నాకన్న దేశమాతయే ముఖ్యమని యెంచి, నే సజీవముగానున్న వెనుకంజ వేయుదువని నేను నా జీవితము తృజించితిని.” (నూరేళ్ళ పంట పుట.18) అని మరణిస్తుంది.

కన్న తల్లి ఆశయాల మేరకు రావు గాంధీజీ స్వరాజ్య సమరంలో పాల్గొని వీరస్వర్గం పొందుతాడు. అదేవిధంగా గుమ్మడిదల దుర్గాబాయి 'నే ధన్యనైతిని', బసవరాజు వెంకట రాజ్యలక్ష్మి 'ఎవరిదదృష్టం', చంద్రకళ 'ప్రేమవేదిక మీద' వంటి కథలు స్వాతంత్రోద్యమ స్వరూపాన్ని తెలుపుతాయి.

“ఒక ముద్దు” అనే కథను తాడి నాగమ్మ 1939 లో గృహలక్ష్మి పత్రికలో ప్రచురించారు. జాతీయోద్యమ చిత్రీకరణ ఈ కథలో కనబడుతుంది. విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఒక యువతిని ప్రధాన పాత్రగా చేసుకొని కథ నడిపించారు. ధైర్య సాహసాలు, తెగువను ప్రదర్శిస్తూ స్వాతంత్ర్య సమరంలో ముందుకు నడుస్తున్న స్త్రీలకు ఎదురైన సమస్యలు ఎలాంటివో, వాటిని ఎలా అధిగమించారో రచయిత్రి కళ్లకు కట్టినట్టు చూపారు. ఒక విదేశీ వస్త్ర విక్రయశాల దగ్గర ప్రచారం సాగిస్తూ ప్రజలను జాగృత పరుస్తున్న ఆ యువతికి ఒక హఠాత్పరిణామం చోటుచేసుకుంది. పరదేశి వస్త్రాల మీద ఉన్న మోజుతో వాటిని కొనడానికి వచ్చిన ఒక ధనిక పురుషుడిని ద్వారం వద్ద నిలువరింపజేసింది. స్వాతంత్ర్యోద్యమ తీరుతెన్నులను, శాంతి సమరం స్వరూపాన్ని, దేశ నాయకుల పిలుపును అతడికి విడమరిచి బోధ చేసింది. స్వదేశీ వస్త్ర ధారణ ఫలితాన్ని ఉపదేశించింది. మదాహంకారాలతో నిండి ఉన్న ఆ వ్యక్తి వెగటుగా ఆ యువతి నుంచి ఒక ముద్దును ఆశిస్తాడు. తన కోరికను నెరవేర్చితే  ఉద్యమంలో ప్రవేశిస్తానని హామీ ఇస్తాడు. అందుకు ఏమి సంకోచించక ఆ యువతి పలికిన మాటలు ఈ కథకు కొసమెరుపుగా నిలుస్తాయి.

“నాకిరువురు అన్నలు కలరు. అనుదినం నన్ను ముద్దిడుకొని ఆశీర్వదించి శాంతి సమరమునకు పంపుచున్నారు. యుగయుగముల నుండియు అనసూయ, సీత, సావిత్రి, పద్మిని, రాణీ సంయుక్త మొదలగు పతివ్రతామణులకు నిలయమైన ఈ భారతమాత పుత్రికనైయుండియు తరతరముల నుండి దాస్యమనుభవించుచు తవ్వి ముక్తికై శాంతి సమర మొనర్చుచున్న భారత సైన్యమునందు వీరవనితనై యుండియు, విదేశీ వస్తువులనెడి హాలాహలమునకు నాహుతి అగుచున్న నీబోటి సోదరుని రక్షింపనొక ముద్దీయలేనా? నీవు నా మూడవ తోబుట్టువు. అహ్ని! రమ్ము రా! ఒకటి కాదు, వలయునన్ని కొనుము.” (నల్లపొద్దు పుట.43) పాశ్చాత్య భావజాలంతో విస్తరిస్తున్న పురుష స్వామ్యాన్ని ధిక్కరించ గల శక్తి యుక్తులను యువతి జాతీయోద్యమ స్ఫూర్తితో సాధించిన విధానం ఈ కథలో కనిపిస్తుంది. 

ఒకనాడు జెనీవా పట్టణంలో అఖిల ప్రపంచ మహిళా సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంలో స్త్రీ జనోద్యమం గురించిన ఉపన్యాసం అక్కడ స్త్రీలను ఎంతో ఉత్తేజ పరిచింది. ఇతర జాతులకు చెందిన స్త్రీలు తమ తమ జాతీయ గీతాలు ఆలాపిస్తూ పతాకాలను ఎగురవేస్తున్నారు. మన భారతీయ స్త్రీలు కూడా జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలనే అభీష్టం మనస్సులో మెండుగా ఉంది. ఉప్పొంగిన దేశభక్తితో “ఖద్దరు చీర కట్టిన ఒక్క భారతీయ లలామ తమ పైట చెంగును చింపి బల్ల పైనెక్కి భారత జాతీయ పతాకంగా ఎగరవేసి జాతీయ గీతం పాడిందట.” (స్వతంత్రత నుండి.. స్వాతంత్ర్యానికి పుట.42) ఇటువంటి చైతన్యవంతమైన, స్ఫూర్తిదాయకమైన సన్నివేశాలు ఎన్నో జాతీయోద్యమంలో దర్శనమవుతాయి. స్త్రీల పోరాటపటిమ, ధైర్యసాహసాలు అడుగడుగునా ప్రత్యక్షమవుతాయి.

పులివర్తి కమలావతీదేవి “పోచమ్మ గండి” అనే కథను 1938 ఆగస్టు వాసవి పత్రికలో ప్రచురించారు. ఈ కథ ఆదివాసీల జీవన సంస్కృతిని ప్రదర్శిస్తుంది. ఇందులో ఆంగ్లేయుల పాలన పట్ల తిరస్కార భావం కనిపిస్తుంది. భద్రాచలం - పోలవరం మధ్య ఒక గండిగా కనబడే కొండ ప్రాంతాన్ని కథా వస్తువుగా తీసుకొని రచించారు. ఒకనాడు ఒక బ్రిటిష్ దొరసాని విమానం నడుపుతూ కొండకు తగులుకొని కింద పడుతుంది. అదివరకు ఎప్పుడూ విమానాన్ని చూడని పోచమ్మ గుడి పూజారి శరభన్న అది ఒక పెద్ద పెనుభూతంగా భావిస్తాడు. ఆ విమానంలో ఉన్న దొరసానిని కూడా భూతంగా భావించి ఆ భూతాన్ని తొలగించడం కోసం పోచమ్మ గుడిలోకి తీసుకొనిపోతాడు. పసుపు, కుంకుమలు రాస్తాడు. ఇదే అదనుగా భావించి ఎన్నో రోజుల నుండి పోచమ్మ గుడి అధికారాన్ని కైవసం చేసుకోవాలని చూసే గంటం దొర, అతని కొడుకు కలిసి ఆ దొరసానికి సాయం చేస్తారు. తర్వాత తమ పథకం ప్రకారం శరభన్నను హంతకుడిగా చూపి బ్రిటీష్ దొరల ఎదుట నిలబెడతారు. ఆగ్రహావేశాలతో ఉన్న బ్రిటిష్ దొరలు శరభన్నను చంపవలసిందిగా ఆర్డర్ వేస్తారు. అవిద్య - అధికారం మధ్య సాగిన పోరు ఈ కథలో మనకు కనిపిస్తుంది. దీనిని మొదటి గిరిజన కథగా స్త్రీల సాహిత్యంలో స్థానం కల్పించారు. (స్వతంత్రత నుండి.. స్వాతంత్ర్యానికి పుట.326)

“మా గృహిణి” అనే కథను వట్టి శేషాంబ గృహలక్ష్మి పత్రికలో 1940లో ప్రచురించారు. స్త్రీల చదువు ప్రాముఖ్యతను తెలిపే కథ. ఇది శిశువు ఆహారం విషయంలో, సద్గుణాలను ప్రేరేపించే విషయంలో, దేశభక్తిని ప్రబోధించే విషయంలో ఈ కథ మంచి మార్గనిర్దేశం చేస్తుంది. గృహిణి అలవరచుకోవలసిన ఉత్తమ గుణాలను ఉపదేశించే కథ ఇది.

ఆచంట సత్యవతమ్మ “ధన్యజీవులు” అనే కథను 1941 గృహలక్ష్మీ పత్రికలో ప్రచురించారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆదర్శ భావాలు గల యువకుడు మాలవారికి వైద్యం చేసే సందర్భం ఈ కథలో కనిపిస్తుంది. దాని ఫలితంగా ఆయన తమ కుటుంబం నుంచి, కులం నుంచి, ఊరి నుంచి బహిష్కరణకు లోనవుతాడు. ఆ తర్వాత ఆ యువకుడు మాలపల్లిలోనే నివాసం ఏర్పరచుకొని జీవనం సాగించాడు. మాలపల్లిలోని పిల్లలకు చదువులు చెబుతూ వారికి ప్రపంచ జ్ఞానాన్ని కలిగించారు. అభ్యుదయ మార్గంలో మాలపల్లి సమాజాన్ని నడిపించడానికి ప్రయత్నం చేశాడు. గాంధీజీ ప్రబోధాలు విని రాట్నం వడకడం, ఖద్దరు ధరించడం, వైద్యం చేయడం వంటి అనేక విషయాలలో మాలపల్లి ప్రజలకు సాయం చేశాడు. బ్రాహ్మణ వ్యక్తితో పాటుగా ఆయన భార్య కూడా మాలపల్లిలోనే జీవనం సాగించింది.

స్వాతంత్రానంతరం వచ్చిన స్త్రీల సాహిత్యంలో కొసమెరుపుగా సంభాషణాత్మక రూపంలో వచ్చిన కథ “కమల కాపురం.” దీనిని ఆర్. జనాబాయి 1948 లో రచించారు. గాంధీజీ పిలుపునందుకుని స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న సంఘటనలు ఈ కథలో చోటు చేసుకున్నాయి. రాట్నం వడికి దారం తీస్తున్న ఒక స్త్రీ దగ్గరకు మరొక స్నేహితురాలు వస్తుంది. తమ పిల్లలను తీసుకొని కాలక్షేపం కోసం వచ్చానని చెబుతుంది. వెంటనే మొదట స్త్రీ తన వద్ద ఉన్న గాంధీ పుస్తకం చదవమని ఆమెకు ఇస్తుంది. తర్వాత వారి సంభాషణలో తాను ఒక చీర కూడా కొనలేని దారిద్ర్యం అనుభవిస్తున్నానని రెండవ స్త్రీ అంటుంది. తీరిక సమయాల్లో ఇంటికి వస్తే రాట్నం ఇచ్చి నూలు వడకడం నేర్పుతానని హామీ ఇస్తుంది. రోజు నూలు దారం తీసి ఖద్దరు వస్త్రాలను తయారు చేయడం నేర్చుకుంటే ఆర్థిక ఇబ్బందులలో భర్తకు ఉపశమనం కలిగించవచ్చు అనే సందేశాన్ని తెలుపుతుంది. మొదటి స్త్రీ చెప్పిన మాటలతో ధైర్యం కూడగట్టుకొని ముందుకు సాగుతుంది. అప్పటినుంచి కుటుంబానికి సరిపడా వస్త్రాలను తయారు చేయడం, కుటుంబంలోని ఆర్థిక వ్యవస్థను పంచుకోవడం వంటి విషయాలలో స్త్రీ స్థానం నిర్ణయం కావడం ఈ కథ లక్ష్యం. స్వాతంత్ర్యానంతరం కూడా రాట్నాన్ని ఖద్దరును వదలక కుటుంబ ఆర్థిక మనుగడకి అనుగుణంగా మలుచుకున్న సందర్భాన్ని ఈ కథ గుర్తు చేస్తుంది. రాట్నం ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచే జ్ఞానాన్ని కలిగించిన కథగా ఇది నిలుస్తుంది. అపురూప వస్తు కథా నేపథ్యాన్ని రాట్నం వస్తు సామాగ్రి చుట్టూ తిప్పడం కథకురాలు చేసిన కథా నైపుణ్యం. నాడు తలసరి కుటుంబ ఆదాయాన్ని దేశపు జాతీయాదాయానికి ఆధారంగా భావిస్తున్న రోజులు అవి. దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విషయంగా స్వతంత్ర భారత స్త్రీలు కోరుకోవడం ఒక ఉత్తమమైన సాధికారితగా నిలబడుతుంది. స్త్రీలు కూడా దేశ ఆర్థిక రంగంలో భాగస్వామ్యం కావడం అనే నేపథ్యం ఈ కథ ద్వారా పాఠకులకు అందుతుంది. ఆర్థిక హక్కులను పొందడం, స్త్రీల వ్యక్తి స్వాతంత్రాలను ఉద్ధరించడం, స్త్రీ సాధికారతకై పోరాడడం వంటి సన్నివేశాలు స్వాతంత్రానంతరం కూడా కొనసాగాయని చెప్పడానికి చక్కని కథా నేపథ్యాన్ని రచయిత్రి ఎన్నుకున్నారు. ఈ కథ స్త్రీల స్వాభిమానాన్ని ఆర్థిక స్వావలంబనను పెంపొందించే ఉత్తమ మార్గాన్ని నిర్దేశిస్తుంది.

3. కవితాఖండికలు:

రూప్ఖానుపేట రత్నమాంబ దేశాయి కవితలు 1913 నుంచే హితబోధిని పత్రికలో ప్రచురించబడ్డాయి. ఆమె అసలు పేరు పెనుగోళ్ల రత్నమాంబ దేశాయి. తొలి తెలంగాణ కవయిత్రిగా రత్నమాంబను పేర్కొంటూ పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్ “సోయి’ పత్రికలో జనవరి – మార్చి, 2006 లో ప్రచురించారు. సమాజం స్త్రీల అభ్యున్నతి పట్ల శ్రద్ధ వహించాలనే ఆశయంతో పద్యాలు రచించారు. పాలకులు స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

తే.గీ. విన్నపంబిది సాధు కవీంద్రులకును / భవ్య మహబూబు బాదుషా పట్టణాది

గా స్వదేశాంధ్ర మండలి జ్ఞానులకును / చిత్తగించి విమర్శన చేయుడన్న

ధర్మ విధులార మ్రొక్కెద తండ్రులార (హితబోధిని పత్రిక డిసెంబర్ 1913)

స్త్రీలకు విద్య ఎంత అవసరమో తన రచనల ద్వారా వివరిస్తూ దార్ల సుందరీబాయి పద్యాలను రచించారు. స్త్రీలు విద్య నేర్వనంత కాలం “దాస్యము నిర్వహించుచు గుహాంతర గబ్బిలముల వలె” ఉంటారని ఆవేదన చెందారు. స్త్రీ పురుషునిలో సగమనే వ్యవహారోక్తి నెరవేరదని ఆమె అసంతృప్తిని వెల్లడించారు. స్త్రీ విద్యను ఆర్జించినట్లయితే అంధకారం, మూఢ విశ్వాసాల వలయం నుంచి బయట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్త్రీ సంస్కరణాభిలాషతో రచించిన పద్యం హితబోధిని పత్రికలో ఫిబ్రవరి 1914 లోనే  ప్రచురించబడింది.

చ. సగము శరీరమండ్రు విదుషీ మణులన్ పురుష వ్రజంబుకై

మగువలు విద్య నేర్చి సగమౌటది యొప్పును గాని లేనిచో

సగము మృగంబు తక్కినదసంగతమై మనుజుండు గావలెన్

మృగముల చేత మానవులు మూఢత సంగతి జేయగావలెన్

(హితబోధిని పత్రిక ఫిబ్రవరి 1914)

స్త్రీ విద్యావశ్యకతను గూర్చి తన పద్యాలలో పులిగోటి ఆనందమాంబ ప్రస్తావించారు. విద్యా జ్ఞానం పొందని స్త్రీలకు లోకమంతా చీకటి మాయమే అవుతుందని ఆమె తెలిపారు. గృహిణి చదువుకున్నట్లయితే ఆ గృహానికంతటికి వెలుగు ప్రసాదిస్తుందని అన్నారు. సంస్కార భావాలతో కూడిన చైతన్య దీప్తిని స్త్రీలు అలవరచుకోవాలని ఆశించారు.

తే.గీ. విద్యయన్నను స్త్రీలకు వెగటు గల్ల / వనితల జ్ఞానులనుచును వాడుకొనుట

యబ్బురంబేమి దీపంబునవల ద్రోయ / నున్న యింటిలో చీకటి యుండకున్నె 

(గోలుకొండ కవుల సంచిక పుట.293)

కనుపర్తి వరలక్ష్మమ్మ నవంబర్ 1936 నుంచి గృహలక్ష్మి పత్రికలో కవితా రచన సాగించారు. చదువు “చెప్పింప తల్లి రో! శ్రద్ధగొనుము” అనే కవిత జాతీయోద్యమ ప్రభావంతో రచించారు. స్త్రీలలో విద్యావశ్యకతను, అభ్యుదయాన్ని ప్రేరేపింపచేసే విధంగా ఈ కవితలో వస్తువు మనకు కనిపిస్తుంది.  

“సీ. గురుతర వ్యవహార గుట్టుమట్టులనైన స్వయముగా నరిసెడి శక్తి లేక

ప్రాణనాథుడు వ్రాయు ప్రణయ లేఖలనైన తనకు జదివెడి యనువులేక

అత్తవారిని అగచాట్లు బెట్టిన తల్లిదండ్రులకు దెల్పుదారి లేక 

చాకలిదెచ్చిన చలువ గుడ్డలనైన పద్దు వేయగ జాలు పటిమ లేక 

ఆ.వె. చదువు రానట్టి యువిద దాముదిమి గనుక / పడయరానట్టి బాధల పడెడు గాన

బాల్యము నుండి కూతుండ్ర బడికి బంపి / చదువు చెప్పింప తల్లి రో! శ్రద్ధ గునుము”

(గృహలక్ష్మి పత్రిక నవంబర్ 1936)

స్త్రీల విద్యా విషయాలలో తల్లిదండ్రులు బాధ్యత వహించవలసిన అవసరం ఉందని తెలిపే విషయం ఈ కవితలో ప్రస్పుటమవుతుంది. సంఘ సంస్కరణం, జాతీయోద్యమం ఫలితంగా ఉన్నతమైన భావాలోచన నాటి సమాజంలో అంకురం తొడిగింది. ఆ నేపథ్యంలోనే స్త్రీలలో వివేకాన్ని, తెలివిని పెంపొందించే విధంగా రచయిత్రులు తమ తమ రచనల్లో విద్యావశ్యకతను ప్రధాన వస్తువుగా చేసుకున్నారు.

అదేవిధంగా “లక్ష్మి” అని మకుటంతో ఒక శతకాన్ని కూడా కనుపర్తి వరలక్ష్మమ్మ రచించారు. మూఢాచారాల నుంచి స్త్రీలను బంధ విముక్తం చేయడానికి అనువైన చైతన్యం ఈ కవితలో ఉంది.

“ఆ. వె. విద్య చూపరాదో! వెరవు చూపగ రాదా! / మరల పెండ్లి చేసి మనుపరాదొ

పతి గతించినంత బాధింపగా నేల? / తెరువు చూపకుండ తెలుపు లక్ష్మి!”

(స్వతంత్రత నుండి.. స్వాతంత్ర్యానికి పుట. 338)

స్త్రీలు విద్యను అభ్యసించడమే గాక, ఇంకా కొంత చైతన్యవంతంతో వితంతువులైన మహిళలు పునర్వివాహాలను చేసుకోవాలనే అభిప్రాయాన్ని ఈ శతకం ద్వారా కల్పించారు. స్త్రీల జీవితాలకు మార్గదర్శిగా నిలిచే అనేక ప్రబోధ సందేశాలు ఇందులో చేశారు.

కాంచనపల్లి కనకమ్మ “స్త్రీ స్వాతంత్రం” అనే పేరుతో కవిత్వం రచించారు. ఆమె కవితలు గృహలక్ష్మి పత్రికలో 1940 నుండి ప్రచురణ రూపంలోకి వచ్చాయి. స్త్రీ పురుషులు సమానమనే భావనను కలిగి ఉండాలని ఆమె ఉపదేశించారు. పురుషులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎంత అవసరమో నేటి స్త్రీలకు కూడా అంతే అవసరమని అన్నారు. పురుషులు సమాజంలో అన్నీ రంగాలలో ముందున్నట్లుగానే స్త్రీలు కూడా తమ చాతుర్యంతో,  శక్తియుక్తులతో ముందడుగు చేయాలని ప్రబోధించారు. 

“కం. స్వాతంత్రంబన నెయ్యది / ఖ్యాతిగ పురుషులను స్త్రీలు కాంక్షింతరు ము

న్నే తెరగు దానికిపుడిది / భూతలమును గలిగె వివరముగ రూపింతున్ 

(గృహలక్ష్మి పత్రిక ఏప్రిల్ 1940)

జాతీయోద్యమ ప్రభావం వల్ల ఎదిగిన వల్లభనేని గంగాదేవి “మహిళా మహత్తు” అనే పేరుతో కవితలు రచించారు. భారత మహిళా సంఘాల ప్రాముఖ్యతను గూర్చి వీటిలో తెలియజేశారు. స్త్రీలలో ఈ సంఘాలు కల్పిస్తున్న మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని గూర్చి ప్రస్తావించారు. ఆమె తన కవిత్వాన్ని 1940 నుంచి గృహలక్ష్మి పత్రికలో ప్రచురించారు.

“దేశీయ సంఘం, ముస్లిం సంఘం, అద్వైత సంఘపు చీలికలా! 

గాంధీయిజం, కమ్యూనిజం, ఏ యిజం స్త్రీ ప్రేమించిన యా కేశబంధమేనా 

హిందూ స్త్రీ సభ, ముస్లిం స్త్రీ లీగ్, కాంగ్రెస్ స్త్రీ సభ మహిళా సంఘములలో లోవే 

చీలిక లేని స్థిరముగనున్న భారత మహిళా సంఘమే మాకాదర్శంబూ!

(గృహలక్ష్మి పత్రిక జూన్ 1940)

విభిన్నమైన సంఘాల కంటే, యిజాల కంటే, సభల కంటే భారత మహిళా సంఘాలు మేలైనవని ఈ కవితలో సూచించారు. స్త్రీలలో సమష్టి చైతన్యానికి నాటి మహిళా సంఘాల ప్రణాళికలు, కార్యక్రమాలు ఎంత తోడ్పాటును అందించాయో అవగాహన కలుగుతుంది.  

జాతీయోద్యమ కాలంలోనే వక్కలంక రమాబాయి స్త్రీ అభ్యుదయ పంథాను అనుసరించారు. ఈ నేపథ్యంతోనే ఆమె “అబలలం కాదు” అనే పేరుతో కవిత్వం రచించారు. స్త్రీ అబల కాదు సబల అని నిరూపించే విషయం ఇందులో ఉంది. విద్య విజ్ఞానంతో పాటుగా సృజనాత్మకత, కళాభిరుచిని స్త్రీలు అలవరచుకోవాలని అన్నారు.  కార్యదక్షత, శక్తి సామర్థ్యాలు స్త్రీలలో అధికమని పేర్కొన్నారు. వాటిని సందర్భానుసారం వినియోగించుకుంటూ ముందుకు అడుగేయాలని ప్రబోధించారు. ఆమె తన కవితలను గృహలక్ష్మి పత్రికలో 1940 నుంచి ప్రచురించారు.

“తే. గీ. అబలలము కాదు తేజమునందినట్టి / గృహిణిలము మేము మగవారి కూర్మి బడయు 

లలిత కళలను వ్యాపింప లాస్య గతిని / కంకణము దాల్చు మమునేలు కన్నతల్లి”

“తే. గీ. బాల్యము నారాయగానున్నది భారతాంబ / కన్య వలె మాతవలె భూమి కష్టపడుచు

దేశ సేవను నిరతంబు దేలువారమమ్ము / భారతమాతరో యక్కజమముగ మమ్ము”

(గృహలక్ష్మి పత్రిక జూన్ 1940)

ఫిలిప్ బి. జ్ఞానరత్నమ్మ (1890-1960) క్రైస్తవ కవి దిగ్గజం రెవరెండ్ బేతాళ జాన్ సతీమణి. 1937 నుంచే జాతీయోద్యమ ప్రభావం చేత అభ్యుదయ నేపథ్యంలో “అరుణోదయ ప్రార్థన, మంగళ గీతం” రచించారు. 1960లో బేతాళ జాన్ మరణానంతరం ఆయన రచించిన కీర్తనలతో పాటు, జీవన విశేషాలతో కూడిన పుస్తకాన్ని వెలువరించారు. ప్రకృతిసిద్దమైన గుణాలను భగవంతుడికి వర్తింపజేస్తూ కవిత్వం వెలువరించడం  ఆమెలో ఉన్న రచన వైదుష్యానికి తార్కాణం. ఆమె రచించిన “భక్తి గేయం” అనే కవితా సంపుటి ఈ నేపథ్యంలోకే వస్తుంది. దేశభక్తి, దైవభక్తి మిళితమైన రచనలు ఆమె కాలం నుంచి జాలువారాయి. 

జాల మంగమ్మ (1909-1974) జాతీయోద్యమ కారులు, సంఘసేవ తత్పరులు జాల రంగస్వామి భార్య. జాతీయోద్యమంలో పాల్గొని అంటరానితనం నిర్మూలన కోసం ఎంతగానో పాటుపడ్డారు. 1923 నుంచే రచనలు చేయడం ప్రారంభించారు. పగలంతా పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా ఉద్యోగం చేస్తూనే సాయంత్రం పూట మాల, మాదిగ పల్లెల్లో రాత్రి పాఠశాల నడిపారు. అక్కడి స్త్రీలను కూడబెట్టుకొని చదువు సంధ్యలు నేర్పించారు. ప్రత్యేక తరగతులను నిర్వహించి స్త్రీలలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయపరమైన చైతన్యాన్ని కలిగించారు. హరిజన మహిళా సంఘం అనే అభ్యుదయ సంఘం స్థాపన చేసి మహిళలలో జ్ఞాన కాంక్షను కలిగించారు.  1935 లో చేతి రాతతోనే “వీర భారతి” అనే పత్రికను నడిపి సంపాదకత్వం వహించి వెలువరించారు. ఈ సందర్భం నాటి గ్రంథాలయోద్యమ స్వరూపాన్ని, పత్రికల ఆవశ్యకతను తెలుపుతుంది.  చేతి రాతతో పత్రికను వెలువరించడం ఆమె నేర్పరితనాన్ని ప్రకటిస్తుంది. స్వాతంత్ర పోరాటంలో హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించడంలో తనదైన పోరాటపటిమను జాల మంగమ్మ చూపించారు. మద్యపాన నిషేధం వంటి సామాజిక ఉద్యమాలను నడిపి సమాజంలో మార్పుకు కారణం అయ్యారు. హరిజనోద్ధరణలో భాగంగా పోరంబోకు భూములను హరిజనులు ఆహార ధాన్యాలు పండించుకొనే విధంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువరింపజేశారు. ఈ చట్టం అనేక పల్లెల్లో అమలు జరిగే విధంగా తగు ప్రయత్నం చేశారు. “దున్నే వారిదే భూమి” అనే సాంఘిక నాటకానికి, “రైతు పిల్ల” అనే తొలి తెలుగు దళిత నవలకు సంపాదకత్వం వహించారు. తొలి దళిత సంపాదకురాలుగా ఈమె పేరు గడించారు. ఈ విషయం జయధీర్ తిరుమలరావు రాసిన ఈ గ్రంథాల సమీక్ష వ్యాసంలో మనకు ప్రస్ఫుటమవుతుంది. సామాజిక, సాహిత్య రంగాలలో చురుకుగా పాల్గొంటూ స్వాతంత్ర్య కాంక్షను ప్రదర్శించారు. స్వేచ్ఛా సమానత్వం పట్ల, దాస్య శృంఖలాలను తొలగించడం పట్ల నిబద్ధతతో పని చేశారు. బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలబడ్డారు. జాతీయోద్యమంలో భాగంగా ఆమె నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు బ్రిటిష్ వారు సహించలేకపోయారు. 1935లో బ్రిటిష్ ప్రభుత్వం జాల రంగస్వామితో సహా జాల మంగమ్మను కూడా తణుకు, నర్సాపురం జైళ్లలో బంధించింది.

సంస్కరణోద్యమాల ఫలితంగా ఎదిగిన మహిళ బోయి ద్రౌపది (1920). తదనంతరం మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. టీచర్ ట్రైనింగ్ కోర్సును నెలకొల్పారు. ప్రభుత్వం నుంచి దళితులకు పారితోషికం ఇప్పించారు. చెట్టుకింద ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల జీవనగాథకు చాలించి బోయి ద్రౌపది “ఆకలితో చెట్టు కింద” అనే కవిత రచించారు. 1942లో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో “లోకమా! యిది పెను భూతమా!” అనే శీర్షికతో కవిత్వం వెలువరించారు. అదేవిధంగా 1943లో “మిణుగురా” అనే శీర్షికతో కవితను రచించారు. ఇది 1969లో ధర్మసాధిని పత్రికలో ప్రచురించబడింది. “పడవ పయనం, చైత్రమాసం, కాలచక్రం, శ్రావణమాసం, కోకిల” వంటి ప్రకృతి వర్ణనలతో కూడి దేశభక్తిని ప్రేరేపింపజేస్తూ అనేక కవితలను ఆమె రచించారు. 1953లో “గోదావరి పరవళ్ళు” అనే పేరుతో కవిత్వం రచించారు. ఆంధ్రప్రభ, ధర్మసాధిని వంటి పత్రికలో దాదాపు 40 కవితల వరకు ఆనాడే ప్రచురింపబడ్డాయి. ధర్మసాధిని అనే పత్రిక నాడు బ్రహ్మ సమాజం ఆధ్వర్యంలో కంభంపాటి రామస్వామి సంపాదకత్వంలో వెలువడేది. మిణుగురా అనే కవిత్వంలో ఒక కవితను పరిశీలిద్దాం.

“ఏ దూర దేశానికే పుణ్యభూమికి / యాత్ర సాగించేవు మిణుగురా! 

పగటిపాలన చేసి పగడాల భానుండు / పడమటి కొనలకు పయనమయ్యే”

(నల్లపొద్దు పుట.56)

భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న పరాయి పాలన అంతమొందాలనే ఆశాభావం ఈ కవితలో కనిపిస్తుంది. పడమటి కొనలకు అంటే ఇంగ్లాండ్ దేశమనే అర్థం వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు తమ పాలన చాలించుకొని వారి దేశానికి పయనం కావాలనే అభీష్టాన్ని ఆమె వ్యక్తపరిచారు.

బ్రహ్మ సమాజపు కవయిత్రి పంతగడ శేషమ్మ (1942). ప్రముఖ హరిజన సేవా సంఘం నాయకుడు కవి పంతగడ బాలకృష్ణను వివాహం చేసుకున్నారు. బ్రహ్మ సమాజం సంస్థలో కార్యకర్తగా పనిచేశారు. పద్య రచన చేసిన తొలి దళిత రచయిత్రిగా పేర్గాంచారు. 1959లో ఏలూరులో ప్రారంభమైన బ్రహ్మ సమాజానికి అధ్యక్షురాలిగా అనేక సంవత్సరాలు పనిచేశారు. సమైక్యత సిద్ధాంతాన్ని నమ్మి అంకిత భావంతో పనిచేస్తున్నాను. జాతీయోద్యమ తదనంతర పరిణామాలను, విశేషాలను రచనా బద్ధం చేశారు.

అంటరానితనం నిర్మూలన పట్ల కృషి చేస్తూ థెరిస్సా దేవదానం అనేక పద్యాలను రచించారు. ఆమె అసలు పేరు వీణావాణి. 1937లో జన్మించారు. దళిత కులంలో పుట్టిన వనితగా మోదుకూరి జాన్సన్ చేత థెరిస్సా అనే పేరుతో పిలిపించుకున్నారు. తల్లిదండ్రులు డానియల్ మరియమ్మలు ఉపాధ్యాయులు. థెరిస్సా భర్త దేవదానం. ఆమె నాట్యం, చిత్రలేఖనం, సంగీతం వంటి లలిత కళలలో ప్రవేశం కలది. దళిత కులంలో పుట్టడం వల్ల కులపరమైన అనేక వేధింపులను ఆమె అనుభవించారు. చిన్ననాటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పెద్దయ్యాక గేయాలు రాశానని ఒక సందర్భంలో ఆమె చెప్పుకున్నారు. 1954లో “తల్లి మా రాణి నువ్వేగా” అని పాట రాసి స్కూల్ మ్యాగజైన్ పత్రికల్లో ప్రచురించారు. 1958లో “ఏసుక్రీస్తు పుట్టుక”, 1959లో “గాంధీ పుట్టుక”, 1964లో “అంబేద్కర్ పుట్టుక” వంటి పేర్లతో బుర్రకథలను రచించి ప్రజల్లో దేశభక్తి బీజాలను నెలకొల్పారు.

4. నవలా సాహిత్యం:

గోలుకొండ కవుల సంచికలో ఒక కవయిత్రిగా పరిచయమైన తెలంగాణ రచయిత్రి కె. సీతా పిరాటమ్మ 1924 లోనే 'శోభావతి' అనే నవల రచించారు. ఒక మహిళ పేరుతో నవలను రచించడం ఇదే మొదలు. ఇక్కడే స్త్రీ స్థానానికి బీజం పడిందని చెప్పవచ్చు. (తెలంగాణ నవలా చరిత్ర పుట.3) ఈ నవల మీద ఆనాడు వచ్చిన అనేక విమర్శలలో స్త్రీని ఒక సంప్రదాయ మూసలో చిత్రీకరింపజేశారన్న విషయం తెలుస్తుంది. కుటుంబపరమైన మూఢవిశ్వాసాల నుండి ఇంకా బయటకు రాని స్త్రీ పాత్ర కనిపిస్తుంది. కాని, కుటుంబ గౌరవాన్ని పెంచే అంశాలను రచయిత్రి పేర్కొన్నారు. 'శోభావతి' ఆనాటికాలపు స్త్రీల మనోగతానికి ప్రతీకగా నిలుస్తుంది. ఉత్తమ గుణాలను సంక్రమింపజేసింది. భర్త, అత్తమామలను భక్తితో కొలవడం, భర్త ఎన్ని కష్టాలు పెట్టినా ఓర్చుకోవడం, స్త్రీని సహన శీలవతిగా నిలబెట్టడం జరిగింది. కుటుంబ ధర్మాన్ని, సాంప్రదాయిక విలువల బాధ్యతను స్త్రీలలో సుస్థిరం చేశారు.

1924 లోనే విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాల “అనురాగ విపాకము” అనే నవలను ప్రచురించారు. మహిళా చైతన్యాన్ని కాంక్షిస్తూ చాట్రాతి లక్ష్మీ నరసమాంబ ఈ నవలను రచించారు. ఆమె ప్రదర్శించిన వస్తు నేపథ్యం, పాత్ర చిత్రణ, కథన శైలి ఆధునిక నవలా స్వరూపానికి చెందినవి.   

గుమ్మడిదల దుర్గాబాయి 'లక్ష్మీ' అనే నవల రచించింది. ఇది కూడా మహిళ పేరుతోనే వెలువరింపబడింది. కాని ఇది స్త్రీలలో విద్యావశ్యకతను తెలుపుతుంది. స్త్రీ స్వయం సమృద్ధి విద్యతోనే లభిస్తుంది ఈ నవల తెలియజేస్తుంది. స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు వృద్ధి పొందడానికి లక్ష్మి పాత్ర స్త్రీలలో నిలిపిన ధైర్యాన్ని ఇందులో అర్థం చేసుకోవచ్చు. 'చైతన్యం' మొదటి మెట్టుగా విద్య నిలుస్తుందని తెలుస్తుంది. ఆలోచనా శక్తి స్వయం సమృద్ధి గల ఆచరణ ధ్యేయం లక్ష్మి పాత్రలో నిక్షిప్తం చేశారు రచయిత్రి. జీవన నిర్మాణంలో స్త్రీ ఏర్పరచుకొన్న సాధనం విద్య, విద్యవల్ల వివేకం కలుగుతుంది. వివేకం వల్ల వితరణ జ్ఞానం కలుగుతుంది. మహిళ తన వివాహం విషయంలో కూడా స్వయం నిర్ణయాధికారం. సాధిస్తుందనే ఆలోచన ఈ నవల ద్వారా కలుగుతుంది. విద్యనే ప్రధానాంశంగా లక్ష్మిని నిలబెట్టడంలో దుర్గాబాయి సఫలీకృతులైనారు, సంప్రదాయ సంస్కృతికి సూచికగా 'లక్ష్మి' నిలుస్తుంది.

“అరవింద” అనే నవలను 1935 లో చిలకపాటి సీతాంబ రచించారు. ఈ నవలలో అరవింద ఒక ఉత్తమమైన పాత్ర. అరవిందతో పాటుగా ఆమె స్నేహితురాలు వాసంతిక కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వీరిద్దరు రాజకీయాల్లో ప్రవేశించడమే గాక తమ శక్తి యుక్తులను, చాతుర్యాన్ని ప్రదర్శించడం వంటివి ఈ నవలలో ప్రత్యక్షమవుతాయి. స్త్రీల ధైర్య సాహసాలను ప్రస్తుత పరిచే విధానం, పరాక్రమవంతమైన జీవన విధానం ఈ నవలలో కనిపిస్తుంది. 

5. నాటకసాహిత్యం:

1920-30వ దశకం నుంచే నాటక రచనా కౌశలం రచయిత్రులలో ఏర్పడింది. స్త్రీ విద్యావశ్యకతను, స్త్రీ పునర్వివాహ ఉద్యమాన్ని, బాల్య వివాహాల నిషేధాన్ని పేర్కొంటూ తమ నాటికల ద్వారా తీవ్రంగా కృషి చేశారు. సంఘ సంస్కర్తల ఆలోచనా విధానాలకు, సంఘ సంస్కరణోద్దేశాలకు అనుగుణంగా స్త్రీ విద్యావ్యాప్తిని ప్రధానాంశంగా ప్రస్తావించారు. గుడిపాటి ఇందుమతి రచించిన “ఉపాధ్యాయిని”, కనపర్తి వరలక్ష్మమ్మ రచించిన “పురిటిగది”, అయ్యదేవర బాలా త్రిపుర సుందరి రచించిన “ఖద్దరు” నాటకాలు ఈ మధ్య కాలంలోనే శారదా పత్రికలో ప్రచురించబడ్డాయి.

శ్రీమతి గంగవరపు సీతాదేవి రచించిన 'ప్రతిక్రియ' నాటికలో జాతీయోద్యమం ద్వారా కలిగిన వస్తు చైతన్యం ప్రదర్శితమవుతుంది. ఇది సెప్టెంబర్ 1933లో గృహలక్ష్మి పత్రికలో ప్రచురించబడింది. నాలుగు పాత్రలు గల ఈ నాటకంలో రంగారావు, మీనాక్షిలు భార్యాభర్తలు. వీరి పిల్లలు శ్రీనివాస రావు, భానుమతి. ఈ నాటకంలో స్త్రీ పురుషుల మధ్య అసమానతలు, తెలివితేటలలో తేడాలు మొదలైన విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మహిళా మండలుల ప్రసక్తి కూడా ఉంది. ఇంటి బాధ్యత, ఇతర సదుపాయాల విషయంలో స్త్రీలు ప్రముఖమైన పాత్ర వహిస్తారనే విషయం తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య సంభాషణలో అన్ని విషయాలలో స్త్రీలు తెలివితేటలు గలవారని; సహనం, సమయస్ఫూర్తి, ప్రేమ వంటి విషయాల్లో స్త్రీలు అత్యధిక సామర్థ్యాలను చూపుతారని నాటక రచయిత్రి తెలియజేశారు.

'మానవ ప్రకృతి' అనే ఏకాంక నాటకాన్ని శ్రీమతి సి.వి. రమణమ్మ డిసెంబర్ 1937లో గృహలక్ష్మి పత్రికలో ప్రచురించారు. ఈ నాటకంలో మూడు రంగాలు ఉన్నాయి. నాటకారంభంలో రావుగారి యిల్లు వర్ణించబడింది. నాటకానికి సంబంధించిన స్థలం, సమయం, సందర్భం మొదలైన అంశాల్లో నాటి నాటక రచయిత్రులు ఎలాంటి మెలకువలు పాటించారో ఈ నాటకారంభాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ నాటకం మొత్తం స్వాతంత్ర్యోద్యమం ద్వారా ఏర్పడిన సంఘసంస్కరణోద్దేశం దృష్ట్యా వస్తు నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తుంది. రావు గారి ఇంట్లో గుమ్మానికి ఎదురుగా ఉన్న గోడకు తగిలించిన రాజా రామమోహన రాయ్, కేశవ చంద్రసేన్, వీరేశలింగం పంతులు ఫోటోలను బట్టి భవిష్యత్ నాటక దర్శనం కనిపిస్తుంది. నాటక రచనా కాలం నాటి జాతీయోద్యమ ప్రభావం సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులన్నింటిని ఈ చిన్న నాటకం తెలియజేస్తుంది. ఆనాడు ఉన్నతోద్యోగుల నెలసరి జీతం 200 రూపాయలు ఉన్నట్లుగా తెలుస్తుంది. నాటక రచయిత్రి శ్రీమతి సి.వి. రమణమ్మ రావుగారి కూతురు మణి నటనలో సంస్కరణాంశాలను ప్రవేశపెట్టారు. రావు, మణిల సంభాషణల్లో నానీ స్వభావ లక్షణాలను వెల్లడించారు.

మణి మాట్లాడుతూ నానీని రావుగారికి పరబ్రహ్మ స్వరూపులుగా పరిచయం చేస్తుంది. ఈ నాటకంలో రచయిత్రి సంస్కరణ వాదాన్నే గాక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. రావు గారు బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను అనుసరించే వారైతే నానీ అద్వైత సిద్ధాంత మార్గాలను అనుసరించే వారుగా రచయిత్రి ప్రతిపాదించారు. వాటి కాలంలో బ్రహ్మ సమాజ ప్రభావం అధికంగా ఉందని, అంతటి ప్రభావంతవు బ్రహ్మమతంలో పరబ్రహ్మ అని మధ్యాంతరహితుడని, ప్రేమమయుడని విశ్వమయుడని మానవులను అల్పులుగా, జీవాత్మ పరమాత్మలకు మధ్య అవాంతరాలు, సుదీర్ఘమైన అవధులు ఉన్నట్లుగా నానీ వాదంలో రచయిత్రి తెలిపారు. అదే విధంగా మణి పాత్రలో విశ్వగర్భుడైన పరమాత్మలోనే ఈ ప్రపంచం అంతా ఉందని, ఈ ప్రపంచంలో పరమాత్ముడు లేడని, ఈ చిన్నదైన ప్రపంచం అసంపూర్ణమైందని సూచించారు. దీని ద్వారా సంపూర్ణత్వాన్ని గ్రహించడానికి ప్రేమ బంధాన్ని అర్థం చేసుకొని, ప్రేమమయుడైన పరమాత్ముడి స్వయం పరిపూర్ణాన్ని సదా జ్ఞాపకం తెచ్చుకోవాలని తెలిపారు. శంకర మతావలంబికులు నిర్గుణోపాసకులని, ఆత్మ పరమాత్మల భేదాన్ని ఛేదిస్తారని. ఆత్మాభివృద్ధికి పాటుపడుతారని, మానవ ప్రకృతికి నిరీశ్వరవాదమే అనువైందని నానీ అంటాడు. ఆ మాటలకు అనుభవం విజ్ఞానం అమితంగా గల మణి ఆత్మ - పరమాత్మలకు భేదం లేనప్పుడు ఈ జ్ఞాన సముపార్జన, ఈ ఛేదనా ప్రయత్నం శుష్కప్రయాస అని వాదిస్తుంది. దీని ద్వారా కుల కల్మషాలు పెంచుకోవడం, అమర్యాద ప్రవర్తనలకు దిగడం, చాలా హేయంగా ఉందని, భగవంతుని విషయంలో యుద్ధం చేయవలసిన పని లేదని అంటుంది. ఈశ్వరుడు అనే తలంపుతో తలలు పగులగొట్టుకోవడం భావ్యం కాదని, అయినా ఒకే దారిలో పోవడం మానవ ప్రకృతికి విరుద్ధమైందని అంటుంది. మన ధర్మం, మన విధి మనం నెరవేర్చాలని, ప్రళయానికి వేరు వేరు దారైతే, ప్రపంచానికి ఒక్కటే దారి అని, మనం చేయవలసింది కేవలం ప్రయత్నమేనని ఉపదేశిస్తుంది. అటు బ్రహ్మసమాజ మతావలంబికుల్లో, ఇటు నిర్గుణోపాసకుల్లో ఉన్న వైషమ్యాన్ని నాటక రచయిత్రి మణి పాత్ర ద్వారా ఖండించారు.

ఆదర్శాల పేరిట, సంస్కరణల పేరిట సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారు తమ విషయానికి వచ్చే సరికి స్వార్థం పూనడం ఈ నాటకంలో కనిపిస్తుంది. రావు గారు తన కూతురును ఇన్స్పెక్టర్ శ్యాంకు ఇచ్చి వివాహం చేయదలిచినప్పుడు, పెళ్లిచూపుల సమయంలో శ్యాం స్త్రీ స్వాతంత్ర్యంపై మాట్లాడిన అసభ్య మాటలకు, స్త్రీ స్వాతంత్ర్యంపై ఆయనకు ఉన్న చులకన భావానికి వ్యతిరేకంగా మణి పాత్రలో రచయిత్రి ఈ క్రింది విధంగా పలికిస్తుంది.

“ఇన్స్పెక్టర్ గారూ, క్షమించండి. మీ తోటి మగవారితో మాట్లాడవలసి వచ్చినందుకు నేనూ చాలా చింతిస్తున్నాను. మీకు స్త్రీ అంటే ఉన్న నీచోద్దేశాన్ని, పటాపంచలు చెయ్యాలనే సంకల్పంతోనే నేనీ నాలుగు ముక్కలు చెప్పాల్సివచ్చింది. మీ ఉద్దేశంలో స్త్రీ అంటే దాసి, బానిస, వంటకత్తె. ఆమె బుద్ధి ప్రళయాంతకం: కాని, యికనైనా తెలుసుకోండి మీరు పురుషుని సౌఖ్యార్థము సృజింపబడిన విలాసవస్తువుగు.., దాస్య పరికరముగ... పరిగణిస్తూ ఉన్న ఆ వస్తువులో ఒక జీవం ఉందని.., అభివృద్ధికాదగ్గ ఆత్మ ఒకటుందని... దీని కారణంగానే స్త్రీ అది భవిష్యజ్జాతి, నిర్మాత్రి, ఉత్తేజ కారిణి... దేవి అవుతూ ఉందని స్త్రీ నడవడి గానీ, ప్రవర్తన గానీ, భావాలు గానీ, జీవితోద్దేశం గానీ తెలుసుకోకుండా వివాహమాడడానికి వచ్చిన మీ మేధస్సును ఏమని కొనియాడాలి!” (గృహలక్ష్మి పత్రిక డిసెంబర్ 1937)

ఈ నాటకం చివరలో రచయిత్రి మణి సంభాషణలో ఈ ప్రపంచంలో జరిగే అనర్థాలన్నింటినీ కారణం విచక్షణా జ్ఞానం లేకపోవడమేనన్న విషయాన్ని తెలియజేశారు. పూర్తిగా వ్యావహారిక శైలిలో వ్రాసిన ఈ నాటకంలో మణి చాలా పరిణతి చెందిన పాత్రగా ప్రయోగింపబడింది. స్వేచ్ఛా సమానత్వాలతో పాటు ఆధ్యాత్మిక, సంస్కరణ భావజాలం వర్ణించబడింది. స్త్రీ స్వేచ్ఛ కాంక్షింపబడింది.

గృహలక్ష్మి పత్రికలో అక్టోబర్ 1930 లో శ్రీమతి మరువూరు వేంకట సుబ్బమ్మ 'మాలసుబ్బి బాఫ్టీజము' అనే నాటికను, ఆగష్టు - సెప్టెంబర్ 1931లో శ్రీమతి నాయిని హనుమాయమ్మ వ్రాసిన ''సుశీల' నాటికను, ఆగష్టు - నవంబర్ 1933 లో శ్రీమతి పోలాప్రెగడ సత్యకళాదేవి 'ఆత్మ సమర్పణ', 'ఏడీ?-ఏమైపోయాడో!!' అనే నాటికలు వ్రాసి ప్రచురించారు. 'ఆత్మ సమర్పణ' నాటికలో రామారావు ఆత్మార్పణం కనిపిస్తుంది. గాంధీజీ ప్రభావంతో జాతీయోద్యమంలో పాల్గొని సంఘసేవా కార్యక్రమాలను చక్కగా నిర్వహించడం, చివరికి ఆయన ఆత్మార్పణంతో కుటుంబమంతా వీధిపాలు కావడం వంటివి ప్రేక్షకులకు గుండెతడిని కలిగిస్తాయి.

దేశి రాజు భారతీదేవి “వరకట్న ప్రహసనం” అనే నాటకాన్ని రచించారు. ఇది జూలై 1941 గృహలక్ష్మి పత్రికలో ప్రచురించబడింది. హాస్య ధోరణిలో సాగిన ఈ కథలో సమాజోద్ధరణ వరకట్న నిషేధానికి అనువైన విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఈ నాటకం జాతీయోద్యమ ప్రభావం చేత రూపొందించబడిందిగా చెప్పవచ్చు. కట్నం ఎక్కువగా తీసుకొని పెళ్లి చేసుకోవాలనుకునే ఒక స్నేహితుడికి ఆ వ్యక్తి ఒక పేద పిల్లతో పైసా కట్నం ఇప్పించకుండా పెళ్లి చేస్తాడు. హాస్య ప్రహసనం ధోరణిలోనే సన్నివేశాలు ఈ కథలో చోటు చేసుకుంటాయి. అంటే ఆ వ్యక్తి పెండ్లి సమయంలో తన స్నేహితుడు భగవంతుడిగా అవతారం ఎత్తి హితబోధ చేస్తాడు. 

భావరాజు రాజ్యాంగ రత్నమ్మ “చర్చ” అనే నాటకాన్ని 1941లో గృహలక్ష్మి పత్రికలో ప్రచురించారు. స్త్రీ పురుషుల మధ్య సాగిన సంభాషణాత్మకమైన చర్చ ఈ నాటకంలో కనిపిస్తుంది. స్త్రీ సాధన స్వావలంబన వంటివి ప్రత్యేకంగా ఈ నాటకంలో ఉపదేశించబడ్డాయి. పురుషులు స్త్రీలలో కోరుకునే స్నేహం, సహనశీలత, దయ, కరుణ వంటివి స్త్రీల దుర్బలత్వానికి కారణమవుతాయని రచయిత్రి ఈ నాటకంలో ఉపదేశించారు. ప్రేమ, త్యాగం వంటివి కూడా స్త్రీలను బానిసలుగా చేస్తున్నాయనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. జాతీయోద్యమ ప్రభావం చేతనే ఈ నాటకం రచించబడినా గాని ఆధునిక విద్యా విధానం స్త్రీలకు ఎంత అవసరమో చర్చనీయంగా సాగిన నాటకం ఇది. స్త్రీ విద్య, స్త్రీ స్వావలంబన, విధవా వివాహాలు, వర్ణాంతర వివాహాలు వంటివి స్త్రీల అభ్యున్నతికి దోహదంగా నిలుస్తాయని ప్రేరణాత్మకమైన ఉపదేశాన్ని ఈ నాటకం అందిస్తుంది, ఆనాటి యుగ ఆదర్శ భావనను స్త్రీలలో నిలపడానికి రచయిత్రి నేర్పిన నైపుణ్యం ఈ నాటకంలో ప్రత్యక్షమవుతుంది.

6. ప్రసంగవ్యాసాలు:

ఉద్యమ నేత టి.ఎన్. సదాలక్ష్మి 1928లో జన్మించారు. బొల్లారం మిడిల్ స్కూల్, కిస్ హై స్కూల్, నిజాం కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. మద్రాస్ క్వీన్ మేరీ కాలేజీలో సైన్స్ విద్యార్థిగా చదువు సాగించారు. కానీ ఆమెలో ప్రజాసేవ చేయాలని కాంక్ష బలంగా కలగడంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1947 నాటి రాజకీయ ఉద్యమాలకు నాటి వాతావరణం ఎంతో తోడ్పాటును అందించింది. స్వాతంత్రోద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం, అంబేద్కర్, భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామిల నాయకత్వంలో దళిత జన చైతన్య ఉద్యమాలు నాడు ముమ్మరంగా సాగుతుండేవి, బొల్లారంలో గాంధీ ప్రసంగం, జీరా కాంపౌండ్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసంగం వంటివి విని రాజకీయాల పట్ల మక్కువను ఏర్పరచుకున్నారు. 1952లో కరీంనగర్ లోని సుల్తానాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి రిజర్వ్డ్ సభ్యులుగా పోటీ చేశారు. ఉత్తర భారత దేశంలో వాల్మీకి సభా ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించినప్పుడు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. 1968-69 మధ్యకాలంలో జై తెలంగాణ ఉద్యమం ఒక గొప్ప ప్రజా ఉద్యమంగా సాగింది. ఆ సందిగ్ధ సమయంలోనే 1952-77 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానాన్ని అధిష్టించిన తన రాజకీయ గురువు బాబు జగ్జీవన్ రావ్ ఆ పార్టీ నుండి బయటకి రావడం, జనతా పార్టీని స్థాపించడం జరిగింది. గురువు బాటలోనే 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన టి.ఎన్. సదాలక్ష్మి ఆ పార్టీ కార్యదర్శి బాధ్యతలను స్వీకరించారు. కౌన్సిల్ మెంబర్ గా, అసెంబ్లీకి పార్టీ చైర్మన్ గా, నేషనల్ కౌన్సిల్ మెంబర్ గా, దేవాదాయ శాఖ మంత్రిగా ఆమె వివిధ బాధ్యతలను నిర్వర్తించారు.

నల్ల పొద్దు దళిత స్త్రీల సాహిత్యం లో టి. ఎన్. సదాలక్ష్మి చెప్పిన అభిప్రాయాలను, చేసిన ఉపన్యాసాలను, ప్రసంగాలను  వ్యాసాల రూపంలో, కరపత్రాల రూపంలో ప్రచురించారు. 2001 లో నిర్ణయ పత్రికలో ప్రచురించబడిన “నా దృక్పథంలో” అనే శీర్షికతో ఉన్న వ్యాసాన్ని నల్లపొద్దు సంకలనంలో స్వీకరించారు.

“సమానత్వం సమానత్వం అంటూ ఉంటే నా చిన్ని బుద్ధికి అదే అందకుండా ఉంది. ఆనకుండా ఉంది. అర్థం కాకుండా ఉంది నాకు. ఒకవేళ పురుషులు పురుషులకి పుట్టినట్టయితే, స్త్రీలు స్త్రీలకు పుట్టినట్టయితే సమానమనడంలో అర్థం ఉంది. అట్లా కాదే... సృష్టే సృష్టిని ఆడవారి చేతిలో పెట్టింది. అంటే సృష్టే సృష్టి అంటే దేవుడనేవాడు ఒకడుండి సృష్టిని సృష్టించి ఆ సృష్టిని ఆడవాళ్లకి పెట్టిందని నా దృక్పథం. కనుక మరి ఆడవారికి జన్మ ఆడదే ఇస్తుంది. మగవారికి జన్మ ఆడదే ఇస్తుంది. మరి శరీరంలో ఉండే రక్త మాంసాలన్నింటిని కరిగించి వారికి జన్మనిచ్చే ఆడది గొప్పదా? జేబులో చేతులు పెట్టుకొని తిరిగే మగవాడు గొప్పవాడా? కనుక నా దృక్పథంలో... నా దృక్పథంలోనే కాదు అది యదార్థం, సత్యం, ఒప్పుకోని తీరాల్సిందే సమాజం ఒకరోజు” (నల్లపొద్దు పుట.78)” 

“స్త్రీలు - హక్కులు” అనే పేరుతో గృహలక్ష్మి పత్రిక 1935లో తుర్లపాటి రాజేశ్వరి గురించి సంపాదకీయం వెలువరిస్తూ-

"స్త్రీ వ్యక్తి స్వాతంత్రానికి ప్రధానమైనవి ఆస్తి హక్కు అని, అదే స్త్రీల యొక్క రాజకీయ సాంఘిక హక్కులను కాపాడుతుందని పత్రిక తెలియజేసి స్త్రీలను ఆలోచింప చేసింది. " (గృహలక్ష్మి పత్రిక జనవరి 1935) అని అన్నారు.

దామెర్ల సీతమ్మ గురించి కూడా “స్త్రీలు – హక్కులు” అనే సంపాదకీయ వ్యాసం 1935 గృహలక్ష్మి పత్రికలోనే ప్రచురించబడింది. ఇందులో-

“దహన సంస్కార సంస్కృతి పురుషుని యొక్క ఆధిపత్యతను నిలపడమే గాక అదే పితృస్వామ్యపు పునాది అని స్త్రీ కూడా దహన సంస్కారం చేయడానికి అర్హురాలని తెలియజేస్తూ తద్వారా స్త్రీ పురుష సమానత్వాన్ని సమాజానికి చాటి చెప్పినట్లుగా భావించవచ్చు. ఆమె విద్యాధికులు కాబట్టి ధైర్యవంతురాలిగా ప్రవర్తించి సాంస్కృతిక సమానత్వాన్ని సాధించగలిగింది.” (గృహలక్ష్మి పత్రిక జనవరి 1935) అని పేర్కొన్నారు.

“భర్తల కర్తవ్యం” అనే అంశంపై చీమకుర్తి సత్యవతి చేసిన ప్రసంగం వ్యాసం 1935 లోనే వాసవి పత్రికలో ప్రచురించబడింది.

“స్త్రీలు విద్యావంతురాలు కావాలి. స్త్రీలు పతివ్రతలనిపించుకోవాలంటూ చేసే ప్రబోధాలలోని బానిసత్వాన్ని తొలగించుకోవాలి.” (వాసవి పత్రిక ఫిబ్రవరి 1935) అంటూ స్త్రీ పురుషుల సమానత్వాన్ని కోరుతూ ఈ వ్యాసంలోని వివిధ దృష్ట్యాంతాలను ప్రస్తావించారు.

స్త్రీల పతివ్రత, ధర్మాచరణ స్త్రీల కర్తవ్యం అనే దాని స్థానంలో అదే పితృస్వామ్య సమాజంలోని పురుషుల ప్రవర్తన వారి కర్తవ్యం అనే బాధ్యత వహించాలని ఈ వ్యాసం గుర్తు చేస్తుంది. స్త్రీ పతివ్రతగా ఉండాలని చెప్పే పురుషాధిపత్య భావజాలాన్ని విమర్శిస్తూ వచ్చిన వ్యాసం ఇది. కుటుంబ నిర్మాణ పునాదుల్లోని అసమానత్వపు పితృస్వామ్య సంస్కృతిని తొలగింపజేయడం కోసం ఈ వ్యాసం ప్రబోధింపబడింది. 

పొణకా కనకమ్మ “స్త్రీల కర్తవ్యం” అని పేరు మీద చేసిన ఉపన్యాసం ఆంధ్రభూమి పత్రికలో 1935లో ప్రచురించబడింది. రాజకీయ వ్యవస్థలో స్త్రీల ప్రాతినిథ్యం వహించే విధంగా స్త్రీలు సమాన స్వతంత్ర జీవన హక్కునే సాధికార హక్కుగా కలిగి ఉంటే స్వాతంత్ర సిద్ధి కలుగుతుందని భావించింది ఈ వ్యాసం. 

కనుపర్తి వరలక్ష్మమ్మ ఆగస్టు 1937 గృహలక్ష్మి పత్రికలో “మనసులో మాటలు”, “కృషితో నాస్తి దుర్భిక్షం”, “స్త్రీలు పత్రికా రచన” అనే పేరుమీద ఉపన్యాసాలు చేశారు. ఇందులో శారద చట్టం, ఓటింగ్ హక్కు, స్త్రీల హక్కు, దేశ్ ముఖ బిల్లు, స్త్రీ పురుష సమాన హక్కు, గ్రంథాలయాలు, పఠన మందిరాలు, వయోజన విద్య, చేతి పనులు వంటి అనేక అంశాల పట్ల ఆమె ప్రస్తావించిన విషయాలు నాటి స్త్రీల అభ్యున్నతికి ఎంతగానో దోహదం చేశాయి. స్త్రీలలో గల కళాభివ్యక్తిని గూర్చి ఉద్బోధించారు.

“స్త్రీల వ్యవస్థ” అనే అంశంపై కె.ఎస్.  రత్నమ్మ డిసెంబర్ 1937 గృహలక్ష్మి పత్రికలో వ్యాసం రచించారు. స్త్రీలకు ఆస్తి హక్కును కల్పింపచేయాలని ప్రతిపాదన చేశారు. పురుషుని యొక్క బహు భార్యత్వాన్ని ఖండించాలనే విషయాన్ని ప్రస్తావించారు. స్త్రీలు విద్యావంతులు కావాలని, రాజకీయాల్లోకి రావాలని ఆమె ఆకాంక్షించారు. స్త్రీలకు విద్య ఎంత అవసరమో నాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణాల నుంచి ఆమె వివరించారు, స్త్రీల రాజకీయ ఆర్థిక హక్కుల పట్ల అవగాహన, చైతన్యం కలిగి ఉండాలని అన్నారు.

గుమ్మడిదల దుర్గాబాయమ్మ “స్త్రీ జాతి దృక్పథం” అనే పేరు మీద వ్యాసాన్ని1939 గృహలక్ష్మి పత్రికలో ప్రచురించారు. ఇందులో స్త్రీల పునరుత్పత్తి శక్తికి ఉన్న విలువను గుర్తిస్తేనే స్త్రీలను సమాజంలో గౌరవంగా ఉన్నతంగా చూడగలరని ఆమె అన్నారు. స్త్రీలు తమంతట తామే అన్ని రంగాల్లో ఎదగాలని ఆమె ఉత్తేజపరిచారు.

పల్లెటూళ్లలో నెలకున్న సాంఘిక దుస్థితిని గూర్చి ఆదిలక్ష్మి వెంకటరత్న సోదరీమణులు వివరించారు. వారి ప్రసంగాలు జూలై 1940 గృహలక్ష్మి పత్రికలో వ్యాసాలుగా ప్రచురించబడ్డాయి. పట్టణాలలో మహిళా సభలు, గ్రంథాలయాల స్థాపింపబడినట్లుగానే పల్లెల్లో కూడా స్త్రీల సంఘాలు, అనాధ స్త్రీల ఉద్ధరణ కోసం సమాజాలు ఏర్పడాలని వారు సూచించారు. 

ఆచంట సత్యవతమ్మ “శారదా చట్టం-యువకుల బాధ్యత” అనే పేరు మీద వ్యాసాలను రచించారు. ఆగస్టు 1940 గృహలక్ష్మి పత్రికల్లో ప్రచురించారు. ఈ వ్యాసాల్లో బాలికలు విద్యావంతులు అయిన తర్వాతనే వివాహం జరిపించాలని తల్లిదండ్రులను కోరారు. స్త్రీల భావి సౌఖ్యం కొరకు, బాలికల అనుకూల దాంపత్యం కోసం “శారదా చట్టం” రూపొందిందని అన్నారు. ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.  ఈమె రచించిన బతుకు తెరువు అనే వ్యాసం 1947 గృహలక్ష్మి పత్రికలో ప్రచురించబడింది. స్త్రీలు బ్రతుకుతెరువు కోసం చేతి పనులు నేర్చుకోవాలని, కుట్లు అల్లికలు, బుట్టలు పల్లెములు వంటివి స్త్రీలు నేర్చుకోవాలని ఆమె తెలిపారు.

“పుష్పచయము” అని పేరుతో 1940 గృహలక్ష్మి పత్రికల్లో వ్యాసాన్ని సిహెచ్. చంద్రమతి ప్రచురించారు. స్త్రీలకు విద్య లేకపోవడం, ధనం లేకపోవడం పెద్ద సమస్యగా పరిణమిల్లిందని నాటి సాంఘిక పరిస్థితులను గూర్చి ఆమె తెలిపారు. స్వరాజ్యాన్ని స్త్రీలే సాధించాలని గృహ పరిపాలనకు, ప్రజా పరిపాలనకు సంసిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. నిర్బంధ విద్యా విధానం, స్త్రీ జాతి క్షేమం కోరి రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంఘ సేవ సంస్కర్తలు నిర్వహిస్తున్న పనులను గూర్చి ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు. స్త్రీల వ్యక్తి స్వాతంత్ర్యాలతో పాటు హిందూ-ముస్లిం ఐక్యత కోసం భారతదేశ ప్రజాస్వామ్య రాజ్యాంగం ఎంతో అవసరమని ఆనాడే ఆమె తెలియజేశారు. 

చండూరు రత్నమ్మ వైశ్య జమీందారిణి. సంఘ సేవ పారాయణి. నవంబర్ 1941 లో గృహలక్ష్మి పత్రికల్లో వ్యాసాన్ని ప్రచురించారు. స్త్రీలు దేశ స్వాతంత్ర దీక్షను వహించాలని అవసరమైతే యుద్ధంలో పాల్గొనే స్థాయికి స్త్రీలు ఎదగాలని ఆమె ప్రోద్బల పరిచారు. స్త్రీలకు సంస్కృత, ఆంధ్ర, హిందీ, ఆంగ్ల భాష ప్రావీణ్యం కలిగి ఉండాలని అన్నారు. సంఘ అభివృద్ధి కోసం స్త్రీ విద్యాలయాలు స్థాపించాలనే ధ్యేయం వారిలో ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.

“మనసులో మాటలు” అనే వ్యాసం 1941 లోనే కనుపర్తి వరలక్ష్మమ్మ రచించి గృహలక్ష్మి పత్రికల్లో ప్రచురించారు. 1937లో ప్రారంభమైన స్త్రీల “వారసత్వపు చట్టం” పట్ల అవగాహన కల్పించారు. శాసనసభలో స్త్రీలకు సంబంధించిన ఏ బిల్లునైనా ఏకాభిప్రాయంతో వ్యతిరేకించే పురుషుల స్వభావాన్ని ఖండించారు.  స్త్రీలను అణగద్రొక్కి వారికి తమతో పాటు సమానమైన ప్రతిపత్తిని కలిగించడానికి ఒప్పుకోరని పురుష స్వామ్యంపైన ఆమె వ్యతిరేకతను ప్రదర్శించారు.

భారతదేశ స్వాతంత్ర ప్రకటన సందర్భాన్ని పురస్కరించుకొని స్త్రీల యొక్క భావి కర్తవ్యాన్ని సూచిస్తూ స్త్రీల సాహిత్యంలో అనేక వ్యాసాలు వెలువడ్డాయి. వల్లభనేని సీతామహాలక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్న ఆ సందర్భంలో ఆగస్టు 1947 ను పురస్కరించుకొని “స్వతంత్ర భారతం” అనే పేరుతో వ్యాసం రచించారు. అంటరానితనం సమస్య తీరాలని, జమీందారి పద్ధతి పోవాలని, హరిజనుల ఆర్థిక స్థితి బాగుపడాలని, విద్యా బోధన హరిజనులకు కలగాలని, రాత్రి పాఠశాలల నడపాలని, అంబేద్కర్ ఆశయాల మేరకు సమష్టి నియోజకవర్గాలు ఏర్పడాలని ఆమె పేర్కొన్నారు.

జాతీయోద్యమ కాలంలో రచయిత్రులు రచించిన రచనల విశేషాలను గూర్చి నేటి పరిశోధకులు పుస్తకాలుగా ప్రచురించారు. నా వ్యాసానికి ప్రధాన ఆధారంగా నిలిచిన గ్రంథాలను ప్రస్తావించడం భావ్యమని ఇక్కడ తెలియజేస్తున్నాను. ఒక గ్రంథం డా. జంధ్యాల కనకదుర్గ “స్వతంత్రత నుండి.. స్వాతంత్ర్యానికి” రచించారు. 1900-1947 మధ్య కాలంలో తెలుగులో స్త్రీలు వెలువరించిన సాహిత్యాన్ని పరిశోధించి ఇందులో పొందుపరిచారు. నాటి కాలపు వంద మంది వరకు రచయిత్రులు రాసిన కథలు, కవిత్వం, నవలలు, నాటకాలు, ఉపన్యాసాలు, వ్యాసాలను చదివి వాటిలోని సారాంశాన్ని తెలియజేశారు. దాదాపు వెయ్యి పుస్తకాలను చదివి ఆ రచనల నేపథ్యాన్ని, కాల ప్రభావాన్ని, చర్చనీయాంశాలను విశ్లేషించారు.

స్త్రీల సాహిత్యాన్ని పరిశోధించే క్రమంలో అనేకమంది రచయిత్రులను, రచనలను నేను గుర్తించినప్పటికీ, వారిలో స్త్రీ వ్యక్తి స్వాతంత్య్రం, దేశ స్వాతంత్య్ర సాధనా ధ్యేయంతో వ్రాసిన రచయిత్రుల రచనలను మాత్రమే స్వీకరించి ఈ పుస్తకంలో పేర్కొనటం జరిగింది. స్త్రీల సాంఘిక, ఆర్థిక, రాజకీయ చైతన్యాన్ని ప్రతిఫలింప చేసినటువంటి లభ్యమైన సాహిత్యాన్ని పరిశీలించి వ్రాయటం జరిగింది.(స్వతంత్రత నుండి.. స్వాతంత్ర్యానికి పుట.XIX) అని తన గ్రంథంలో జె. కనకదుర్గ స్త్రీల సాహిత్య ప్రాముఖ్యతను వెల్లడించారు.

మరొక గ్రంథం “నల్ల పొద్దు” దళిత స్త్రీల సాహిత్యం అనే పేరుతో సంకలనాన్ని గోగుశ్యామల ప్రచురించారు. 1921-2000 మధ్య కాలానికి చెందిన దళిత స్త్రీల రచనల పూర్వాపర విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

"ప్రపంచ చారిత్రము నందు జగన్మాతలైన స్త్రీలు చేసిన మహోత్కృష్ట కార్యములు ఎన్నియో గలవు. తన్ను శోధింపవచ్చిన త్రిమూర్తులను సాధించి బాలురుగా చేసి ఆడింప గలిగినది అనసూయ. క్రమంగా సతీసావిత్రి, సీత, ద్రౌపది, పద్మిని (చిత్తూరు రాజ్యం నాశనమైనా గాని తన గౌరవం దక్కించుకున్నది) ఝాన్సీ లక్ష్మీబాయి, నాయకురాలు నాగమ్మ, జాన్ ఆఫ్ ఆర్క్ కన్య (ఆంగ్ల సైన్యాన్ని దునుమాడింది) మిస్ అమీ జాన్సక్ (విమానం పై భూగోళాన్ని చుట్టి వచ్చింది)" (నల్లపొద్దు పుట.I)

ఇలా అనేక మంది స్త్రీ మూర్తులు చేసిన ఘనకార్యాలను తలుచుకుంటూ స్త్రీలు చైతన్యవంతం కావాలని, పరాయి పాలన నుండి విముక్తిని సాధించి దాని పట్ల ధైర్య సాహసాలను ప్రదర్శించాలనే ఉత్తేజాన్ని కలిగించారు. స్త్రీ శక్తి యుక్తులు, సామర్థ్యాలు ఎంత ఘనమైనవో వర్ణించారు.

ఈ జాతీయోద్యమ కాలంలో రచయిత్రులు రచించిన రచనలలో స్వాతంత్ర్యోద్యమ ముఖ చిత్రంతో పాటుగా స్త్రీ విద్యావశ్యకత, స్త్రీ స్వాతంత్ర్యం ప్రధానాంశంగా పేర్కొనబడింది. కుల మతపరమైన విభేదాలు తొలగిపోవాలని వారు ఆశించారు. దేశభక్తి, దేశసేవ వంటివి ముఖ్య ఉద్దేశాలుగా ప్రస్తావించబడ్డాయి. భారత జాతీయ పతాకం అందించే సందేశాన్ని రచనల రూపంలో వర్ణించారు. అస్పృశ్యత, అంటరానితనం నిర్మూలన కోసం పాటుపడ్డారు. స్త్రీ జనోద్ధరణ లక్ష్యంగా వారి రచనా ప్రస్థానం సాగింది.  పరాయి పాలన నుంచి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కాంక్షించారు. భారత జాతీయోద్యమాన్ని ముందు నడుపుతూ ఐకమత్యంతో సంఘటిత పరిచే శక్తిని అందించారు. స్వాతంత్ర సాధననే తమ గమ్యంగా ఎంచుకొని రచయిత్రులు రచనా వ్యాసంగం చేశారు. నాటి కాలపు స్త్రీల చైతన్యం, అభ్యుదయం, స్వాతంత్ర్య కాంక్ష, వారి స్ఫూర్తిదాయకమైన జీవన గమన నిర్దేశం వంటివి దర్శనమవుతాయి. ఈ విధంగా జాతీయోద్యమంలో రచయిత్రుల పాత్ర రాశిలో కన్నా వాసిలో ఘనమైందిగా భావించవచ్చు.

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కనకదుర్గ, జంధ్యాల, డా. (2016). స్వతంత్రత నుండి... స్వాతంత్ర్యానికి (తెలుగులో స్త్రీల సాహిత్యం క్రీ.శ. 1900-1947). గుంటూరు: జంకదు ప్రచురణలు.
  2. ప్రతాపరెడ్డి, సురవరం, శ్రీ. కీ. శే. (సం). (2002). గోలుకొండ కవుల సంచిక. హైదరాబాద్: విజ్ఞాన సరోవర ప్రచురణలు.
  3. భార్గవీరావు. (సం). (మార్చి 2000). నూరేళ్ళ పంట. రచయిత్రుల కథా సంకలనం, బెంగుళూరు: ప్రిసం బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్.
  4. మహారాజు, దేవరాజు. (2009). స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం. హైదరాబాద్: జీవన ప్రచురణలు.
  5. విద్మహే, కాత్యాయనీ. (డిసెంబర్ 2013). సాహిత్యాకాశంలో సగం. వరంగల్లు: స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ.
  6. శ్యామల, గోగు. (సం). (2002). నల్లపొద్దు (దళిత స్త్రీల సాహిత్యం 1921 – 2002). హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ట్రస్ట్.
  7. శ్రీహరి, రవ్వా, ఆచార్య. (సం). (2016). తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర. హైదరాబాద్: తెలుగు అకాడమీ.
  8. శ్రీనివాస్, సంగిశెట్టి. (డిసెంబర్ 2017). తెలంగాణ నవలా చరిత్ర. హైదరాబాద్: తెలంగాణ ప్రచురణలు.
  9. సుజాతారెడ్డి, ముదిగంటి. (సం). (2002). తెలంగాణ తొలితరం కథలు. హైదరాబాద్: రోహణమ్ పబ్లిషర్స్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]