AUCHITHYAM | Volume-06 | Issue-09 | August 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
10. అవతలి గుడిసె నవల: విద్య విశిష్టత
జి. గిరి ప్రసాద్
పరిశోధకులు, తెలుగు శాఖ,
యోగి వేమన విశ్వవిద్యాలయం,
కడప, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7093733833, Email: ggiriprasad1992@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.07.2025 ఎంపిక (D.O.A): 28.07.2025 ప్రచురణ (D.O.P): 01.08.2025
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్యంలో చదువు, దళితజీవితాల నేపథ్యంతో వచ్చిన కొన్ని ముఖ్యమైన నవలలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి హిందీ సాహిత్యపు దళిత నవల ‘ఛప్పర్’ జయప్రకాశ్ కర్ధమ్ రాశారు. ఈ నవలను వి. కృష్ణ ‘అవతలి గుడిసె’ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఇవేకాక ‘మాలపల్లి’ నవలలో కూడా దళిత జీవితాలలో చదువు ప్రాముఖ్యతను, ఆర్థికపరిస్థితులను, సామాజిక మొదలైన అంశాలను ఉన్నవ లక్ష్మీనారాయణ తెలిపారు. ‘పంచమం’ నవలలో దళితుల ఉద్యమ, నేపథ్యం గూర్చి రచయిత దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. ‘మాకురావు సూర్యోదయాలు, పొలిమేర’. అనే నవలలో నంబూరి పరిపూర్ణ రచించిన దళితస్త్రీల జీవితాలను, వారి సమస్యలు, ఉద్యోగ అనుభవాలను తెలియజేస్తాయి. ఈ నవలలు కేవలం కథాంశాలనే కాకుండా, దళిత సమాజంలో చదువు, సామాజిక న్యాయం, రాజకీయ చైతన్యం వంటి అంశాలు గురించి తెలియజేస్తాయి. అవతలి గుడిసె నవల ద్వారా నాకు చదువు విలువ తెలిసింది. దళితులకు ఎంతగా చదువుకోవాలని ఆశకలిగి ఉన్నా, కొన్ని ప్రాంతాలలో చదువుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. చాల ఇబ్బందులకు గురయ్యారని ఈ నవల ద్వారా తెలుస్తుంది. అందరికీ సమాజంలో సమానత్వాన్ని, గౌరవాన్ని ఇచ్చేది చదువు మాత్రమే. కాబట్టి చదువుకోవడం వల్ల ఈ నవలలో “చందన్” పాత్ర తనకు కావలసిన దారిని వెతుక్కుంటూ వెళ్లి తన విజయాన్ని పొందారు. విద్యావంతుడై చందన్ సాధించిన విషయాలను గురించి ఈ నవలలో విశ్లేషించాను. చందన్ చదువుకోవటంతో అక్కడ చదువు లేని పేద పిల్లలకు ఎంతోమందికి చదువు నేర్పించడం నవలాదర్శం, సందేశంగా ఈ వ్యాసం నిరూపిస్తుంది.
Keywords: చదువు, ఉన్నతవిద్య, కులం, పేదలు, శ్రమ, పట్టుదల, ధనవంతులు, వడ్డీ వ్యాపారం, స్నేహం, మార్పు.
1. ప్రవేశిక
హిందీలో వచ్చిన మొదటి దళిత నవల ఛప్పర్. దీనిని జయప్రకాశ్ కర్దమ్ హిందీలో రచించారు. ఈ నవల మొదటి ముద్రణ జనవరి,1, 2015లో వచ్చింది. రెండవ ముద్రణ నవంబర్, 1,2018 నా వచ్చింది. హిందీలో రచించిన ఈ నవలను తెలుగులో ‘అవతలి గుడిసె’ అనే పేరుతో ప్రొ. వి. కృష్ణ తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని జులై 2021న తెలుగులో ముద్రించారు.ఈ నవలను ఛాయా రిసోర్స్ సెంటర్ వారు ప్రచురించారు. భారతదేశంలోని దళిత సమాజం ఎదుర్కొంటున్న సామాజిక,సాంస్కృతిక, విద్యా సమస్యలపై దృష్టి పెడుతుంది.
జయప్రకాశ్ కర్ధమ్ ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాదు జిల్లా, ఇందర్ గడి (హపుడ్ రోడ్) లో 5, జూలై,1958న జన్మించారు. భారత ప్రభుత్వం ఆధీనంలోని హిందీ శిక్షణా సంస్థలో డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు. తత్వశాస్త్రం,చరిత్ర మరియు హిందీలలో ఎం.ఎ.పట్టాలు పొందారు. హిందీ సాహిత్యంలో డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నారు. ఈయన ఒక ఖండకావ్యం, రెండు కథల సంపుటాలు, మూడు నవలలు, నాలుగు కవిత సంకలనాలు రచించారు.ఇవే కాక పదమూడు విమర్శనా గ్రంథాలు రాశారు.మొత్తం ఇప్పటికీ నలభై పుస్తకాలు ప్రచురించారు. 1999వ సంవత్సరం నుండి ‘దళిత సాహిత్యం’ వార్షిక పత్రికకు సంపాదకత్వం వహించారు. దేశ విదేశాలలోని విద్యాసంస్థలలో వీరి రచనలను పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. కర్ధమ్ రచనల మీద అనేకమంది పరిశోధకులు పరిశోధనలు చేసి డాక్టరేట్ డిగ్రీలు పొందారు. కొన్ని రచనలు భారతీయ, విదేశీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ‘మహా పండిత రాహుల్ సాకృత్యాయన్ అవార్డు’, ‘రామమనోహర్ లోహియా అవార్డు’ లాంటి అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్నారు.
ప్రొ. వి. కృష్ణ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ డీన్ గా, హిందీ విభాగంలో ప్రొ.గా పనిచేస్తున్నారు. దళిత, బహుజన, ఆదివాసి సాహిత్యం పై విశేష కృషి చేశారు. ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’, ‘సెంటర్ ఫర్ దళిత్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్’ లాంటి సంస్థలలో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేకంగా దళిత, ఆదివాసీ సాహిత్యం మీద పరిశోధనల కోసం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ దళిత అండ్ ఆదివాసి స్టడీస్ అండ్ ట్రాన్స్లేషన్ ను స్థాపించారు.
ప్రజా సైన్సు ఉద్యమంలో అనేక సంవత్సరాలు కీలకంగా పనిచేశారు. బెల్జియం బల్గేరియాలో చైర్ ప్రొ.గా సేవలందించారు. అనేక అంతర్జాతీయ సదస్సులలో వివిధ అంశాలపై పత్ర సమర్పణ చేశారు. నారాయణ్ గురు సాహిత్య రత్న, అంబేద్కర్ విశిష్ట సేవా పురస్కారాల వంటి అనేకమైన, ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.
2. నవలావస్తువు
ఈ నవల ద్వారా రచయిత సమాజంలో వెనుకబడిన దళితుల సంఘర్షణను, కష్టాలు, ఆధిపత్య వర్గాల వారు చేస్తున్న దోపిడీ, అణిచివేత, నిమ్నకులాల స్త్రీలపై జరుగుతున్న సామూహిక అత్యాచారాల గురించి యదార్థ వాస్తవిక సత్యాలను చిత్రీకరించారు. ఈ నవలలో ప్రధాన వస్తువు దళితుల చదువు. దళితులు చదువుకోవడానికి ఎలాంటి అవమానాలు పడతారో, ఎంతటి మానసిక సంఘర్షణకు గురవుతారో రచయిత చెప్పారు. ఎన్నో ఆర్థికపరమైన సమస్యలు చుట్టు ముట్టిన దళితులు చదువును కొనసాగించటం ఈ నవల లో కనిపిస్తుంది. ఆదిపత్య కులాల వారు దళితులని కులం పేరుతో అవమానించటం, అవహేళన చేయటం లాంటివి గ్రామాలలో జరిగే సాధారణ విషయాలుగా కనిపిస్తుంది. దళితులు అభివృద్ధివైపు ప్రయాణించటానికి చదువుని ఒక మార్గంగా ఎన్నుకోవడం దానిని మార్గం వెంట ఎన్ని ఒడిదుడుకులు ఉన్న ప్రయాణం చేసి సఫలీకృతం చేసి ఈ నవలలో ప్రధానంగా కనిపించే వస్తువు. గ్రామీణ ప్రాంతాలలో దళిత స్త్రీలు ఎదుర్కొంటున్న అవమానాలు, అత్యాచారాలు ఈ నవల లో రెండవ ప్రధాన వస్తువుగా కనిపిస్తుంది. దీనితోపాటు ఆధిపత్య కులాల వారు దళితుల పట్ల తమ వైఖరిని మార్చుకోవటం దోపిడీకి పాల్పడుతున్న ఆధిపత్య వర్ణనలకు దోచుకోబడుతున్న దళితుల మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడటం ఈ నవల లో కనిపిస్తున్న వస్తువు.
3. ఇతివృత్తం
ఉత్తరప్రదేశ్ లో మాతాపూర్ అనే గ్రామంలోని గంగానది తీరానికి ఎగువన అగ్రవర్ణాల వాళ్లు, దిగువన దళితులు జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ కుటుంబాలలో సుఖ్ఖా రమియాలది ఒక కుటుంబం. వాళ్ళ కుమారుడే చందన్. చందన్ చదువుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉంటాడు. తల్లిదండ్రులు అతనికి సహాయంగా నిలబడతారు.పై చదువుల కోసం సంత్ నగర్ కు వెళ్తాడు.అనారోగ్య సమస్య, ఆర్థికలేమి ఎంతగా చుట్టి ముట్టినా తల్లిదండ్రుల సహకారంతో చదువును కొనసాగిస్తారు. పై చదువుల కోసం చందన్ పట్టణం వెళ్లడం అక్కడ చదువును కొనసాగించడం ఏమాత్రం నచ్చని మాతాపూర్ లోని గ్రామ పెద్ద ఠాకూర్ అనేక కుట్రలు పన్నుతాడు. ఠాగూర్ సుఖ్ఖాతో చందన్ ను చదువు మాన్పించి గ్రామానికి తీసుకువచ్చి ఏదో ఒక పనిలో కుదుర్చమని నచ్చ చెబుతాడు దానికి సుఖ్ఖా అంగీకరించడు. ఠాకూర్ అందుకు అతనిని బెదిరిస్తూ ఇప్పటివరకు ఈ గ్రామము నుండి అటు అగ్రకులాల వారు కాని ఇటు నిమ్న కులస్తులు గాని పై చదువు కోసం పట్టణం పోలేదు.
నీ కొడుకు పోవడం క్షమించరాని నేరం “మాదిగ కులం వాడైన సుఖ్ఖా కొడుకు మన అందరి మొహాలను నలుపు చేయడానికి బయలుదేరాడు. ఒక మాదిగ వాడు అందరికి తల మీద ఉచ్చ పోసాడు తప్పు చేశావు సుఖ్ఖా వశ్చాత్తాపం పడాలి” (పుట-36) అని సుఖ్ఖాని బెదిరిస్తారు. అయినా సరే ఆ బెదిరింపులకు ఏమాత్రం భయపడడు సుఖ్ఖా.
ఏది ఏమైనా తన కొడుకును చదువు మాన్పించకూడదని గట్టిగా నిర్ణయించుకుంటారు. చందన్‌ను వెనక్కి పిలిపించకపోవడం చేత గ్రామ పెద్దలను ఎదిరించినందుకు ఊరి నుండి వెలి వేయబడతాడు. ఈనాటి సమాజంలో కూడా కులం, మతం పేరిట అనేక వెలివేతల సంఘటనలను చూడడం జరుగుతుంది. ఈ నవలలో చందన్ అసమానతలు, కుల, మత భేదాలను నిర్మూలించే కథానాయకుడిగా మనకు కనిపిస్తాడు. చందన్ చదువు కోసం పట్టణానికి వచ్చినప్పుడు హరియా అనే వృద్ధుడు ఇంట్లో ఉంటాడు. హరియా ఎటువంటి అద్దె తీసుకోడు. దానికి తోడు తన సొంత బిడ్డలా చూసుకునేవాడు చందన్ ను.గ్రామాల్లో లాగే పట్టణాలలో కూడా అనేక వివక్షతతో కూడిన పరిస్థితులు చూసి నిరాశ చెందుతాడు. సంత్ నగర్ జే జే కాలనీలో రకరకాల పనులు చేసుకుని జీవనం కొనసాగించే వివిధ నిమ్న జాతులు, శ్రామికులు ఉంటారు. వర్షాకాలం మొదలు అయినప్పటికీ వర్షాలు రాకపోవడంతో ఆ కాలనీలో ఉన్న వారంతా యజ్ఞం చేయాలని యజ్ఞం చేస్తే వర్షం వస్తుందని అనుకుంటారు. యజ్ఞం చేయడం కోసం అందరినీ చందాలు అడుగుతూ చందన్ దగ్గరకు కూడా చందా కోసం వస్తారు. అప్పుడు చందన్ దేవుడి ఉనికి గురించి వాళ్లకు తెలియజేస్తాడు. వాళ్లు వాస్తవికత వైపు ఆలోచించేలా జ్ఞాన పూర్వకంగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేసి సఫలం అవుతాడు.తన స్నేహితుల సహాయంతో చందన్ కాలనీలో చిన్న పాఠశాల ప్రారంభిస్తాడు. వారికి చదువు నేర్పించి అక్షర జ్ఞానం అందించడం మొదలు పెడతాడు.ఇదే సమయంలో కమల అనే ఆవిడ తన కొడుకు (కిల్లర్)ను బడిలో చేర్పించడానికి వస్తుంది. బడిలో చేర్చడం కోసం రిజిస్టర్ లో పేరు రాసుకోవడం కొరకు చందన్ కిల్లర్ తండ్రి పేరు అడుగుతాడు. కమల మౌనంగా కిల్లర్ తండ్రి పేరు చెప్పలేక వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కమల సామూహిక అత్యాచారానికి గురై బిడ్డ (కిల్లర్)ను కన్నా దళిత యువతి. కమల తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని చందన్ చేస్తున్న సామాజిక పోరాటంలో కీలకమైన కర్తవ్యం నిర్వర్తిస్తుంది. గ్రామ పెద్ద ఠాకూరు కూతురే రజిని.చందన్ చిన్నప్పుడు ఒకే తరగతిలో కలిసి చదువుకున్నవారు. రజనీ. చందన్ లు బాల్యా స్నేహితులు. గ్రామంలో ఠాకూరు వ్యవహరించే తీరుపట్ల రజనీ బాధపడేది. కానీ అంతకన్నా ఎక్కువ చందన్ భవిష్యత్తు గురించి ఆలోచించేది. చిన్నప్పటి నుంచి చందన్ పట్ల రజనీ మనసులో ఆత్మీయ భావం ఉండేది. ఠాకూరు గ్రామంలోని ప్రజల సొమ్మును కాజేయటం దళితులని ఇబ్బంది పెట్టడం తనను ధిక్కరించి వారిని గ్రామ బహిష్కరణ చేయడం తండ్రి చేసే దుర్మార్గాలను సహించలేక పోయేది. తండ్రిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని నిమ్న వర్గాల పట్ల అతడి ఆధిపత్య ధోరణిని నిర్మూలించాలని ప్రయత్నం చేస్తుంది.తండ్రికి తెలియజెప్పి అతడిలో సున్నితత్వాన్ని పెంపొందింపజేసి మార్పు తీసుకువస్తుంది. ఠాకూరు కూడా ఇన్నాళ్లు తాను చేసిన దుర్మార్గాలకు పశ్చాత్తాప పడతాడు. అప్పుడు గ్రామం నుంచి వెలివేతకు గురైన చందన్ తల్లితండ్రులను కూడా తిరిగి మాతాపూర్ గ్రామానికి రమ్మని పిలుస్తారు. అప్పుడు చందన్ తల్లిదండ్రులు అయినా సుఖ్ఖా, రమియా స్వగ్రామానికి చేరడంతో ఈ నవల ముగుస్తుంది.
4. ప్రధాన పాత్రలు - స్వభావాలు
1. చందన్ – ప్రధాన పాత్ర దళిత యువకుడు కథానాయకుడు.
2. ఠాకూరు – రజనీ తండ్రి.
3. రజనీ – చందన్ బాల్య స్నేహితురాలు.
4. సుఖ్ఖా, రమియా – చందన్ - తల్లి దండ్రులు.
5. కమల - సామూహిక అత్యాచారంకు గురైన దళిత యువతి.
6. హరియా - చందన్ చదువుకు ఆర్థిక సహాయం చేసిన దళిత వృద్ధుడు.
4.1 చందన్
ఈ నవలలో ప్రధాన కథానాయకుడు చందన్. చందన్ తల్లిదండ్రులు సుఖ్ఖా,రమీయాలు వీరిది దళిత పేద కుటుంబం.ఇక్కడ జరిగే అన్యాయాలు గురించి వివరిస్తూ ప్రజల్లో వారి బాధ్యతను అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. అలాగే చందన్ గ్రామంలో ప్రజలకు తెలియని విషయాల పట్ల అవగాహన కలిగించి తమ హక్కులను తామే పొందే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఎంతో గొప్ప ప్రయత్నం చేసిన వ్యక్తిగా చందన్ మనకు ఇక్కడ కనిపిస్తారు. చందన్ చదువు కోసం పట్టణంకు వెళ్లినపుడు సంత్ నగర్ జే జే కాలనీలో ఉంటారు. రకరకాల పనులు చేసుకుంటూ జీవనం సాగించే వివిధ నిమ్న జాతులు, శ్రామికులు ఉంటారు. వర్షాకాలం వచ్చినప్పటికీ వర్షం రాకపోవడంతో కాలనీలో వాళ్ళు యజ్ఞం చేయాలని యజ్ఞం చేస్తే వర్షం వస్తుందని అందరూ అనుకుంటారు. యజ్ఞం కోసం అందరిని చందాలు అడుగుతూ చందన్ దగ్గరకు కూడా వస్తారు.
అప్పుడు దేవుడి ఉనికి గురించి వాళ్లకు తెలియజేస్తాడు. తన స్నేహితులు సహాయంతో చందన్ కాలనీలో చిన్న పాఠశాల ప్రారంభిస్తాడు. వారికి చదువు నేర్పించి అక్షర జ్ఞానం అందించడం మొదలు పెడతాడు ఇదే సమయంలో కమల అనే ఆవిడ తన కొడుకు (కిల్లర్) ను బడిలో చేర్పించడానికి వస్తుంది. కమలకు జరిగిన అన్యాయం గురించి తెలిసిన వెంటనే ఆ విషయం వినగానే ఆక్రోశంతో సుక్కా చందన్ కళ్ళు ఎర్రబడ్డాయి.కమల విషాద గాథ విన్నాక ఆమె పట్ల చందన్ కు సహానుభూతి కలిగింది. చందన్ సహానుభూతితో కూడిన మాటలతో కమలకు ఊరటతో పాటు ఆమెలో ధైర్యం కూడా పెరిగింది.
‘మీరు ధైర్యంగా ఉండండి కమల గారు. ఈ దుర్మార్గులు ఏదో ఒక రోజు అంతం అవుతారు. నేను మీకు తోడుగా ఉంటాను. మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా నాకు చెప్పండి మీకు పూర్తిగా సహకరిస్తాను’ (పుట-61) అని చందన్ కమలకు చెబుతాడు.
4.2 ఠాకూరు
చదువుకోవడం కోసం చందన్ పట్టణం పోయినప్పుడు మొత్తం గ్రామంలో బ్రాహ్మణులు, ఠాకూర్లు అందరి కళ్లు ఎర్రబడ్డాయి. ఆ గ్రామంలో బాగా డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద హోదా కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు వరకు ఎవరూ కూడా చదువు కోసం పట్టణం వెళ్లలేదు. కానీ ‘మాదిగ కులం వాడైన సుఖ్ఖా కొడుకు మాత్రం చదువు కోసం పట్టణం వెళ్ళాడు. అందరి ముక్కు తెగి పడ్డట్లు అయింది. ఒక మాదిగ వాడు అందరి తల మీద ఉచ్చ పోశాడు’. (పుట-36) అంటూ మెల్ల కన్ను( శ్రీరామ్ శర్మ) పండితుడు ఠాకూరు కు చెబుతాడు. ఇంతలో వాళ్లకు సుఖ్ఖాఎదురవుతాడు. ‘విన్నాను సుఖ్ఖా విన్నాను, నీ కొడుకు చదువుకోవడం కోసం పట్నం పోయాడట కదా’? (పుట-37) ‘అవును పండిత్ గారు మీ ఆశీర్వాదంతో’ (పుట- 38) అని సుఖ్ఖా ఎంతో వినయంగా బదులిచ్చాడు. సుఖ్ఖా నోటి, నుంచి అవును అనే మాట రాగానే మెల్లె కన్ను పండితుడు కోపంతో ఊగిపోయాడు. ‘దాన్ని ఆశీర్వాదమంటావా,పాపం చేశావు, మహా పాపం చేసావు నువ్వు’ (పుట-38) పాపమనే మాట వినగానే సుఖ్ఖా ఉలిక్కిపడ్డాడు. గ్రామంలో పాపం, అధర్మం అనే మాటలతో ఎక్కువగా భయభ్రాంతులకు గురయ్యేది దళితులు, అణగారిన ప్రజలే. అనుకోకుండా అదే సమయంలో ఠాకూరు కూడా అటువైపు వచ్చాడు. ఠాకూరిని చూడగానే మెల్లకన్ను పండితుడికి కోపం వచ్చింది. అది చూసి ఠాకూరు ‘ఎందుకు కోపంగా ఉన్నావు’? (పుట -38) ‘గ్రామంలో ఇంత పాపం పండు తుంటే కోపం రాక మరేం వస్తుంది. బ్రతికుండగా ఈగను మింగలేం ఠాకూరు గారు’ (పుట -38) అని సుఖ్ఖా వైపు చూస్తూ అన్నారు. ‘ఇంతకు ఏమైంది? విషయం చెప్పు’ (పుట-39) అని ఠాకూరు అడిగారు. ‘అవ్వడానికి ఇంకా ఏముంది తండ్రి కొడుకులిద్దరూ అందరి మొహాలను నల్లగా చేశారు’. (పుట-39) అంతే కోపంతో మెల్లె కన్ను పండితులు అన్నాడు.మరింత కోపంతో ‘పశ్చాత్తాపం పడాలి సుఖ్ఖా తప్పు చేశావు’(పుట-38) అంటూ నీ కొడుకును తిరిగి రమ్మను చేసిన తప్పు సరిదిద్దుకో అని చెప్పి వెళ్లిపోయాడు.
4.3 రజనీ
రజనీ, చందన్ లు బాల్య స్నేహితులు. మాతాపూర్ గ్రామంలో ఉండే ఠాకూరు కూతురే రజనీ. ఠాకూరు మోసపూరితమైన పనులు చేస్తూ అక్రమంగా ప్రజల దగ్గర ఉన్న సొమ్మును కాజేసేవాడు. కానీ రజనిలో అలాంటి బుద్ధి లేదు. దుష్ట స్వభావం కలిగి ఉన్న తన తండ్రితో మాట్లాడి అతనిని మంచి దారిలో నడుచుకునే విధంగా తయారు చేస్తుంది. అలాగే అతడు గ్రామంలోని ప్రజలకు సహాయం చేసేటట్లు చేసింది. చందన్ పట్టణం కు, చదువు కోసం వెళ్ళినప్పుడు గ్రామంలో ఉన్న తన తల్లిదండ్రుల బాగోగులను రజనీనే చూసుకునేది. ఒకరోజు తోటి విద్యార్థి చందన్ వేసుకున్న చిరిగిన చొక్కాను చూసి అవహేళన చేశాడు. అప్పుడు రజనీ కొత్త చొక్కా తెచ్చుకోమని చందన్ కు పైసలు ఇవ్వాలనుకుంది. ‘చందన్’ నీ చిరిగిన చొక్కాను చూసి అందరూ హేళన చేస్తున్నారు.
‘తీసుకో ఈ పైసలు రేపటి నుంచి కొత్త చొక్కా వేసుకొని రా’. (పుట- 82) అని అంటుంది. కానీ ఆత్మగౌరవం గల చందన్ రజనీ సహాయాన్ని నిరాకరించాడు. ‘అందుకు కృతజ్ఞతలు. నేను చిరిగిన చొక్కా వేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. నన్ను హేళన చేయడం కూడా ఇది మొదటి సారేం కాదు. ఈ హేళన వల్ల నేనేమి సిగ్గు పడటం లేదు’ (పుట-82) అని అంటాడు.చందన్ ఆత్మవిశ్వాసంతో కూడిన మాటలతో రజనీ ఎంతోగానో ప్రభావితమైంది.
4.4. సుఖ్ఖా - రమియా
సుఖ్ఖా, రమియాలు చందన్ తల్లిదండ్రులు. వీళ్లు పేద దళిత కుటుంబానికి చెందినవారు. కానీ తల దాచుకోవడానికి సుఖ్ఖా దగ్గర చిన్న ఇల్లు మాత్రమే ఉంది. భార్య రమియా తో కలిసి ఆ ఇంట్లోనే ఉండేవాడు. రాత్రి రెండో జాము ముగిసే దశ. గ్రామం మొత్తం గాఢ నిద్రలో మునిగి ఉంది. కానీ సుఖ్ఖా కళ్ళల్లో నిద్ర లేదు. ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. సుఖ్ఖాకు అదేమంత కొత్త విషయం కాదు. చాలా సంవత్సరాలుగా అతను ఉబ్బస వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ ఉబ్బసవ్యాధి అతన్ని ఎంతలా బలహీనంగా మార్చేసిందో రోజు, రోజుకు అది ఎలా ఉగ్రరూపం దాల్చుకుంటూ పోతుందో సుఖ్ఖాకి మాత్రమే తెలుసు. సుఖ్ఖా, రమియా ఇద్దరూ చాలాసేపు అటు,ఇటు తిరుగుతూ ఉన్నారు. నిద్ర ఇద్దరికీ రావడం లేదు. రమియానే మాట్లాడటం ప్రారంభించింది. ‘ఏమయ్యో,వింటున్నావా’? (పుట-8) ‘ఆ… చెప్పు’ సుఖ్ఖా ఊపిరి ఇంకా కుదుట పడలేదు.
సుఖ్ఖా పరిస్థితిని చూడలేక పోయింది రమియా. ‘ ఏం అదృష్టమో, దుఃఖమంతా మనకే ఎందుకు రాశాడు’ (పుట-8) అని తనలో తానే అనుకుని ‘ఇలాగే ఇంకెన్నాళ్లు ఎప్పటిదాకా ఓర్చుకుంటావు? అంటాను’ (పుట-9). ఒక్కసారిగా ఊపిరి బిగబట్టి సుఖ్ఖా అన్నాడు ‘నీ గురించే ఆందోళన.రాత్రి,పగలు చందన్ గురించే ఆలోచనలు. ఏదో రకంగా వారు చదువు పూర్తి చేస్తే చాలు’ (పుట-9) అంటూ సుఖ్ఖా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ రమియా ‘ఇంకెంత చదువుతాడేంటి చందన్’? (పుట-9) ‘తెలియదు…. ఎంతవరకు చదవాలో అంతవరకు చదవనీ.డాక్టర్ చదువు చదువుతానంటున్నాడు’ (పుట-9) అని సుఖ్ఖా బదులిచ్చాడు.
‘ఇంకా చదివి కలెక్టర్ ఏమైనా అవుతాడా. పెద్దవాళ్లు పెద్ద పెద్ద హోదాలలోకి వెళతారు. చిన్న వాళ్ళదేముంది.బతుకు తెరువు కోసం చిన్నా,చితకా ఉద్యోగం దొరకడమే గొప్ప’. (పుట-10) అని రమియా సహజంగా, అమాయకంగా అంది. కానీ, రమియా అలా నిరాశ చెందే మాటలు అనకుండా ఉండాల్సింది అని సుఖ్ఖా కు అనిపించింది. ‘పిచ్చిదానా అలా మాట్లాడకు. ఎవరైనా కడుపులోనే పెద్దపెద్ద హోదాలు కలిగి పుడతారా ఏంటి, అందరూ చదువుకునే కదా పెద్దగవుతారు. ఎవరికి తెలుసు మన చందన్ కూడా రేపు ఏ కలెక్టరో, లేక ఇన్స్పెక్టరో కావచ్చు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు విడిచిపెట్టు. కొంత కష్టమైతే ఏంటి దుఃఖం తర్వాతే కదా సుఖం వస్తుంది. ఎప్పటికైనా మనకు కూడా మంచి రోజులు వస్తాయి’ (పుట-10) అని రమియా కు అర్థమయ్యేటట్లు చెబుతాడు.
4.5 కమల
తన స్నేహితుల సహాయంతో చందన్ సంత్ నగర్ జే.జే. కాలనీలో చిన్న పాఠశాల ప్రారంభిస్తాడు. వారికి చదువు నేర్పించి అక్షర జ్ఞానం అందించడం మొదలు పెడతాడు. ఇదే సమయంలో కమల అనే ఆవిడ తన కొడుకు (కిల్లర్) ను బడిలో చేర్పించడానికి వస్తుంది.రిజిస్టర్లో పేరు రాసుకోవడం కోసం చందన్. కిల్లర్ తండ్రి పేరు అడుగుతాడు. కమల మౌనంగా కిల్లర్ తండ్రి పేరు చెప్పలేక వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కమల సామూహిక అత్యాచారానికి గురై బిడ్డ (కిల్లర్)ను కన్న దళిత యువతి కమల.తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని చందన్ చేస్తున్న సామాజిక పోరాటంలో కీలకమైన కర్తవ్యం నిర్వర్తిస్తుంది.
4.6 హరియా
చందన్ చదువు కోసం పట్టణానికి వచ్చినప్పుడు హరియా ఇంట్లో ఉంటాడు. హరియా ఎటువంటి అద్దె తీసుకోడు. దానికి తోడుగా తన సొంత బిడ్డలా చూసుకునేవాడు. “చూడు బిడ్డా ఇక్కడ నీకు ఎంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం ఉండు. పట్టణంలో ఉన్నన్ని రోజులు నా ఇంట్లోనే ఉండు. ఇక్కడే తిను – తాగు. ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పు. అద్దె గురించి ప్రస్తావన మాత్రం మళ్లీ ఇంకెప్పుడు తీసుకురాకు. ఈ ఇల్లు నీదే, నేను కూడా నీ వాడినే” (పుట-17). హరియా చాలా కష్టజీవి. తన జీవితంలో జరిగిన విషాదాన్ని మర్చిపోలేక నిత్యం మానసికంగా కృంగిపోతూ ఉండేవాడు. అటువంటి జీవితంలోకి చందన్ రావడంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. హరియా కూడా చందన్ చేసే ప్రయత్నానికి అండగా ఉంటూ సామాజిక చైతన్యాన్ని పెంపొందింపజేసే విషయంలో సహాయ పడతాడు. అదేవిధంగా హరియా, చందన్ చదువుకు అయ్యే ఖర్చులో కూడా తన వంతు సహాయం చేస్తాడు. ఎంతో మంచి గుణం కలిగిన వారు అని చెప్పవచ్చును.
5. నవలా విశ్లేషణ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమాన ఉన్న మాతాపూర్ అనే గ్రామంలో ఉండే చందన్ అనే అంటరాని యువకుడి చదువు కోసం చేసిన పోరాటం ఈ నవల. పేదరికం ,అనారోగ్యం, అగ్రకుల,ఆధిపత్యం దాటుకొని తనను తాను విద్యా పరంగా ఉన్నతీకరించుకోవడమే కాకుండా తన లాంటి వారి చదువు కోసం కష్ట నష్టాలతో వచ్చి ధైర్యంగా ముందడుగు వేసిన దళిత యువకుడి కథ ఇది. ఈ నవలలో కుల వివక్ష, అంటరానితనం, ఆర్థిక దోపిడీ, అగ్రకుల దాస్టీకం, దళితుల వెలివేత, దళిత స్త్రీల సామూహిక అత్యాచారం కు అగ్రకుల దాస్టికం వలన కుటుంబాలు విచ్చిన్నం అవ్వటం దళిత ఒంటరి స్త్రీల బిడ్డలకు సామూహిక గౌరవం లేకపోవడం ప్రధానంగా కనిపించే అంశం. వీటితోపాటు బ్రాహ్మణీయ వ్యవస్థ ఇతర ఆధిపత్య కులాల వారిని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎలా ఈ సమాజాన్ని,కుల పరంగా ముక్కలు చేస్తుందో, ఆధిపత్య కులాలకు, అంటరాని కులాలకు మధ్యన ఉన్న ఎలా ఆగడాలుగా మారుస్తుందో ఈ నవలలో కనిపిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చిన చదువుకోవడం ద్వారా మాత్రమే జీవితాలు మారుతాయి అని చందన్ తల్లిదండ్రులు నమ్మకం, హరియా లాంటి పాత్రల సహకారం ఇందులో కనిపిస్తుంది. అట్లాగే ఆధిపత్య వర్ణాలలో పుట్టిన కూడా తమలాంటి ఆధిపత్య వర్ణాల చేతులు బతుకుని భవిష్యత్తుని కోల్పోతున్న దళితుల కోసం నిలబడే రజని లాంటి పాత్రల సహకారం ఈ నవలలో కనబడుతుంది.కమల లాంటి సామూహిక అత్యాచారానికి గురైన దళిత యువతి. అకారణంగా బిడ్డను కన్నపుడు పొందే అవమానాలు ఈ నవలలో కనిపిస్తాయి.
మతం అనేది దాని మనుగడ కోసం ప్రజలను కట్టుబాట్లు, సంప్రదాయాలు పేరిట భయభ్రాంతులను చేసి వాడుకుంటుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి స్కూల్స్ ప్రారంభించండి. వీధి వాడలు ఎంత అధ్వానంగా ఉన్నాయి. నడవడానికి చాలా కష్టంగా ఉంది. అందుకు ముందు వీటి గురించి ఆలోచించి వాటిని రిపేరు చేయించుకోండి. మీకు తోడుగా నేను కూడా మీతో కలిసి సాయం చేస్తాను అంటూ మూఢనమ్మకాల నుండి ప్రజలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు చందన్. గ్రామాలలో జీవనం సాగిస్తున్న ప్రజలకు, దళితులకు అన్యాయం జరగకుండా తన పోరాటం ద్వారా అందరికీ అన్ని హక్కులను పొందేలా,అందరిలో చైతన్యం నింపేలా, అక్కడ ఉన్న ప్రజలకు ధైర్యం వచ్చేలా అన్నింటిలో భయం లేకుండా వారికి కావాల్సిన చోటంత ఎదుర్కొని తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా తయారు చేయడానికి ప్రజలలో మార్పును తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు.
5.1 విద్య సంబంధిత అంశాలు:
తన స్నేహితుల సహాయంతో చందన్ కాలనీలో చిన్న పాఠశాల ప్రారంభిస్తాడు.వారికి చదువు నేర్పించి అక్షర జ్ఞానం అందించడం మొదలుపెడతాడు. ఇదే సమయంలో కమల అనే ఆవిడ తన కొడుకు కిల్లర్ ను బడిలో చేర్పించడానికి వస్తుంది. బడిలో చేర్చడం కోసం రిజిస్టర్ లో పేరు రాసుకోవడం కోసం తండ్రి పేరు అడుగుతాడు చందన్. కమల ఏం మాట్లాడకుండా మౌనంగా వెనక్కి వెళ్ళిపోతుంది. కమల కిల్లర్ తండ్రి పేరు చెప్పలేక పోతుంది. ఎందుకంటే కమల సామూహిక అత్యాచారానికి గురైన దళిత యువతి. మన దేశంలో మరీ ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో నిమ్నజాతి మహిళల మీద ఎక్కువగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కమల తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని, చందన్ చేస్తున్న సామాజిక పోరాటంలో కీలకమైన కర్తవ్యం నిర్వర్తిస్తుంది.
5.2 ఆర్థికాంశాలు
హరియా చందన్ చదువు కోసం సామాజిక పోరాటాల నిమిత్తం ఆత్మ విశ్వాసం, ధైర్యం కలిగించి ఆర్థిక సహాయం అందించి ముందుకు నడిపిస్తాడు. హరియా మద్యపానానికి బానిసై ఉంటారు. తాగి తాగి ఆరోగ్యం కూడా బలహీన పడుతుంది అని చెప్పిన వినేవాడు కాదు. కానీ చందన్ పడుతున్న కష్టం చూసి చందన్ కు ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండకపోవడంతో తాను తాగే మందు డబ్బులతో చందన్ కోసం ఖర్చు పెడతాడు.అప్పటి నుంచి హరియా తాగడం మానేస్తాడు. దీనికి గల కారణం చందన్ జీవితం.
చందన్ ఏ ఉన్నత లక్ష్యం కోసం సామాజిక ఉద్యమం మొదలుపెట్టాడో అనాది కాలంలో చుట్టుపక్కల అన్ని గ్రామాలకు వ్యాప్తి చెందడం జరిగింది. అదేవిధంగా తన స్వగ్రామమైన మాతాపూర్ కు వ్యాపించింది.ఆ గ్రామ పెద్ద ఠాకూరు కూతురు రజనీ తన గ్రామం కుల, మత,వర్గ నిర్మూలన కోసం చందన్ ప్రేరేపించబడి పని చేస్తుంది. రజనీ చందనకు చిన్ననాటి బాల్య స్నేహితురాలు.తన తండ్రి దుష్ట స్వభావం ఆమెలో కనిపించదు. మన స్వార్థం కోసం ఇతరులను బలి చేయడం మంచిది కాదు. అనే స్వభావం కలిగినది రజనీ. పేదరికంలో జీవించాలని ఎవరు కోరుకుంటారు.కాలం మారుతుంది ప్రజలు తమ హక్కులను తెలుసుకొని దోపిడి, బానిసత్వం నుండి బయటకు వచ్చి ఐక్యంగా ఉండాలని చైతన్యవంతులు అవుతున్నారని తెలిపితన తండ్రి లో మార్పు తీసుకువస్తుంది.
5.3 రాజకీయాంశాలు
ఠాకూరు పశ్చాత్తాపం చెంది తాను అప్పటివరకు, అన్యాయంగా సంపాదించిన ప్రతి దానిని తిరిగి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. గ్రామంలో అందరితో సమానంగా జీవితం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటాడు. భారత రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరూ అనుభవించాలని గ్రామం నుండి వెలి వేయబడిన చందన్ తల్లిదండ్రులను తిరిగి వాళ్ళ గ్రామంలోకి రమ్మని కోరుతాడు. మాతాపూర్ చుట్టుపక్కల గ్రామాలలో ఉద్యమం, కుల నిర్మూలన కోసం విస్తృత ప్రచారం కల్పించి, భావజాలాలు కలిగి ఉన్న చైతన్యవంతమైన స్త్రీగా మనం ఇక్కడ రజనీ ని చూడవచ్చు.
6. ఉపసంహారం
- అవతలి గుడిసె నవల దళితులకు విద్య ఎంత అవసరమో చెబుతుంది.
- తరతరాలుగా విద్యకు, అభివృద్ధికి,సంక్షేమానికి దూరంగా ఉన్న దళిత కులాలు ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో చదువును కొనసాగించడం ఇందులో కనిపిస్తుంది.
- సుఖ్ఖా, రమియాలు కొడుకు చందన్ చదువు కోసం ఆ ఊరి పెద్దలను ధిక్కరించటం చందన్ పై చదువులు కొనసాగించడానికి తమ తోడ్పాటును అందించటం.
- అలాగే ఠాకూరు కూతురు రజినీ తన తండ్రి ఠాకూరుకు హితబోధ చేసి అతని దుర్మార్గపు ఆలోచనలను మార్చటం లాంటివి మారుతున్న భారత దేశ సామాజిక పరిస్థితులకు అద్దం పడతాయి.
- ఇందులో ఉన్న ఈ నవలలో దళిత పాత్రల లో పట్టుదల, ధిక్కారం, ఆధిపత్య వర్ణాల వాళ్లను ఎదిరించి నిలబడడం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కనిపిస్తుంది.
- చివరిగా స్వతంత్ర భారతదేశం కలలు గనే సమానత్వ సమాజం కోసం ఈ నవల ప్రయత్నం చేసింది. అందుకు మారాల్సింది ఆధిపత్య వర్గాల వారే అని చెప్పటానికి ఠాకూరు పాత్ర తన అహాన్ని వదులుకొని మారినట్లుగా చూపిస్తుంది.
- కులాల మధ్య, వర్గాల మధ్య అంతరాలు, వివక్ష పోవాలంటే చదువుకున్న యువత ముందుకు వచ్చి ఆ దిశగా అడుగులు వేయాలని రజనీ పాత్ర ద్వారా చెబుతుంది.
- ఏది ఏమైనా రెండు విభిన్న సమూహాల మధ్య భేదాలు తొలగినప్పుడే సమ సమాజం ఏర్పడుతుందని, తద్వారా సంక్షేమం, అభివృద్ధి సాధ్యం అని ఈ నవల చెబుతుంది.
7. ఉపయుక్తగ్రంథసూచి
- కళ్యాణరావు, జి. అంటరాని వసంతం. విప్లవ రచయితల సంఘం, విశాలాంధ్ర పబ్లిక్ హౌస్, 2000.
- కుమార్ రాజా గంజి. “మహనీయులు కాంక్షించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతత్వం సాధించిన అవతలి గుడిసె నవల.” సాహిత్యతరంగిణి తెలుగు పరిశోధనపత్రిక, Dec. 2024.
- చంద్రశేఖరరెడ్డి, రాచపాళెం. మన నవలలు - మన కథానికలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, Apr. 2015.
- పైదే., & కె. లక్ష్మినారాయణ, సంయుక్తసంపాదకులు. 1980 తర్వాత తెలుగు దళిత నవల (వ్యాస సంకలనం). రమా పబ్లికేషన్స్, 2003.
- జయప్రకాశ్ కర్దమ్ (మూ.). కృష్ణ, వి. (అను.) అవతలి గుడిసె (నవల). ఛాయా సాంస్కృతిక సంస్థ, 2021.
- తెలుగునవల నూరు సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1973.
- దేవపుత్ర, చిలుకూరి. పంచమం. హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 1998.
- నంబూరి, పరిపూర్ణ. “మాకు రావు సూర్యోదయాలు.” ఆంధ్రప్రభ వార పత్రిక, 1985.
- రవీందర్, పసునూరి. “అంబేద్కరిజానికి ఆచరణరూపం ‘అవతలి గుడిసె’” సారంగ పత్రిక. 17 జూన్ 2025.
- లక్ష్మీనారాయణ, ఉన్నవ. మాలపల్లి. హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 1922.
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. నవలాశిల్పం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1989.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

