AUCHITHYAM | Volume-06 | Issue-09 | August 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
9. నందగిరి - కోట్ల నర్సింహులపల్లె దేవాలయాలు : వారసత్త్వ సంపద
డా. తత్త్వాది ప్రమోద కుమార్
అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు విభాగం,
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వ),
జగిత్యాల, తెలంగాణ.
సెల్: +91 9441024607, Email: thatwadi@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.07.2025 ఎంపిక (D.O.A): 31.07.2025 ప్రచురణ (D.O.P): 01.08.2025
వ్యాససంగ్రహం:
చరిత్రలో మరుగున పడిన నందగిరి - కోట్ల నరసింహులపల్లి గ్రామంలో నెలకొన్న ప్రాచీన దేవాలయాల చారిత్రిక విశేషాలను విషయాలను తెలియజేయడమే పరిశోధన యొక్క ఉద్దేశం. ఈ ప్రాంతంలోని దేవాలయాలను గూర్చి భారత పురాతత్వ శాస్త్ర విభాగం వారు సర్వే నిర్వహించి ఒక నివేదికను తయారు చేశారు. పరిశోధకుల వ్యాసాల్లో ఈ గ్రామ దేవాలయాల విషయం ప్రస్తావితమైంది. విషయ సేకరణలో ఇండియన్ ఆర్కియాలజికల్ విభాగం వారి సర్వే రిపోర్టు,ఇంటర్నెట్ మరియు పత్రికలు మొదలైనవి ఆధారాలుగా తోడ్పడ్డాయి. స్థానికంగా ఉన్న దేవాలయాల వారీగా వ్యాసాన్ని విభజించి చారిత్రక విశేషాలను అనుసరించి పరిశీలనాత్మకంగా రాసాను. ఈ దేవాలయం గురించి విపులంగా వివరించే పూర్తిస్థాయి పుస్తకాలు ఆధారాలు అందుబాటులో లేవు. ఘన వారసత్వ సంపద కలిగిన ఈ ప్రాంత దేవాలయాలు వాటి చారిత్రక విశేషాలు, ప్రాధాన్యత నేటి తరానికి రాబోయే తరానికి తెలియాలని తద్వారా దేవాలయం వైభవోపేతమైన స్థానాన్ని పొందుతుందని ఆశిస్తున్నాను. క్షేత్ర పర్యటనలో భాగంగా దేవాలయాల ట్రస్టు సభ్యులను సంప్రదించడమైనది. వారు తెలిపిన విషయాలు కూడా వ్యాస రచనలో సహాయపడ్డాయి.
Keywords: నందగిరి, కోట్ల నరసింహులపల్లి, షోడశ బాహు ఉగ్రనరసింహుడు, నందులు, రాష్ట్రకూటులు, నంది, పురాతత్వ శాస్త్రవేత్తలు,పరిశోధకులు, అన్నపూర్ణ విశ్వనాథాలయాలు
1. ప్రవేశిక
సుప్రసిద్ధ సాహితీవేత్త, కవి, అష్టావధాని గండ్ర లక్ష్మణ రావు గారు “శ్రీలక్ష్మి నారసింహ!” మకుటంతో నందగిరి-కోట్ల నరసింహులపల్లిలో కొలువైన నరసింహుని దేవాలయంతో పాటు చారిత్రక ప్రాధాన్యత కలిగిన విశేషాలతో “శ్రీలక్ష్మినరసింహ” శతకం రచించారు. కోట్ల నరసింహుని గూర్చి పుస్తక రూపంలో వెలువడిన సాహిత్య గ్రంథం బహుశా ఇదే మొదటిది కావచ్చు. పారమర్థిక,తాత్త్విక,సామాజిక అంశాలతో పాటు చారిత్రక విషయాలు ఆ శతకంలో చోటు చేసుకున్నాయి. ఆ శతక పద్యాలకు తోడు చారిత్రక పరిశోధకుల రచనల ఆధారంగా నందగిరి-కోట్ల నరసింహులపల్లి దేవాలయాల విశేషాలను తెలియజేయడంతో పాటు కనుమరుగు అవుతున్న పరిసర ప్రాంత చరిత్రను గూర్చి భవిష్యత్ తరాలలో చైతన్యం కలిగించడమే ఈ వ్యాస రచన ఉద్దేశ్యం.
నంద రాజులెవరో నగరము నిర్మించి యీప్రాంతమునుకొంత
యేలినారొ
కూలిన గోడల గుర్తులు గలవింక మట్టి ప్రాకారమ్ము
మాసిపోయె
గుట్టకొమ్మున రాతి నేటికి కన్పించు చరిత సాక్ష్యమ్ము
వోలె
"నంద” 'గిరి' కలిపి నందగిరి యటంచు గ్రామమిప్పటికిని
కలదు చూడ
ఊరు గుట్టయు కలుపుచు నున్న నిన్ను నందగిరి నరసింహ
యంచంద్రు నిన్ను
కోట్ల నరసింహ పల్లెలో కొలువుదీరు నందగిరి వాస!
శ్రీలక్ష్మి నారసింహ!1
కోట్ల నరసింహుల పల్లెలో కొలువై ఉన్న నరసింహ దేవాలయం తో పాటు గ్రామ చారిత్రిక వైశిష్ట్యం పై శతక పద్యాల ద్వారా ప్రస్ఫుటమవుతుంది. నరసింహులపల్లి, నందగిరి రెండు పొరుగు పొరుగున ఉన్న గ్రామాలు. ఈ రెండింటిని జంట గ్రామాలుగా పిలుస్తారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో కోట్ల నరసింహులపల్లి, జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో నందగిరి గ్రామాలు ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామాలు ప్రస్తుతం రెండు వేర్వేరు జిల్లాలో ఉండటం చిత్రమే. కరీంనగర్ జగిత్యాల్ జిల్లా కేంద్రాలకు ఇది 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇవి నేడు చిన్న పల్లెటూరుగా కనిపించినా ఒకనాడు
రాజవరేణ్యులతో రాచ కార్యాలతో వెలుగులీనిన ప్రదేశమన్న విషయాన్ని చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. ఈ
జంట గ్రామాల చుట్టూ మూడు కక్ష్యలలో మట్టితో కూడిన ప్రాకారాలు ఉండేవి. సమీపంలోని గుట్టపై నరసింహస్వామి
స్వయంమూర్తియై వెలసినాడు. ఆ గుట్ట పైననే శత్రుదుర్భేద్యంగా రాజులు కోట నిర్మించారు. ఆ కోటలో నిలిచిన
గుట్టపై వెలసిన నరసింహున్ని కోటల నరసింహుడిగా, సమీపంలోని పల్లెను కోటల నరసింహుల పల్లెగా పిలిచేవారు. ఆ
కోటల అనే పదమే కార్యక్రమంలో కోట్ల అని రూపాంతరం చెంది కోట్ల నరసింహులపల్లెగా ప్రసిద్ధమైంది.
2. నందగిరి - కోట్ల నర్సింహులపల్లె దేవాలయాలు -
చారిత్రక విశేషాలు
నందరాజవంశీయుల పాలనలో వారి పేరిట ఏర్పడిన గ్రామం కావున నందగిరిగా పేరొందిందని ఒక ఐతిహ్యం. మగధ దేశాన్ని పాలించిన నందరాజులు చంద్రగుప్తుని చేతిలో పరాజయం పాలై ఆ తర్వాత దక్షిణ భారతదేశానికి చేరుకొని చిన్నచిన్న రాజ్యాలు ఏర్పరచుకున్నారు. అందులో ఒకరు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ, తమకు అనుకూలంగా నందగిరి గ్రామాన్ని, సమీపంలోని గుట్టపై కోటను నిర్మించి ఉంటారు. నందులు నివసించిన గిరి కావున దీని నందగిరి అని అన్నారు.2
ఈ నందగిరిని నిర్మించి పాలించిన నందులు మరియు మగధ నందులు ఒక్కరు కాదని, వేర్వేరు రాజ వంశాలకు చెందిన వారని పరిశోధకుల అభిప్రాయం. కాసె సర్వప్ప రచించిన సిద్దేశ్వర చరిత్ర ఆధారంగా కాకతీయుల చరిత్రను రచించిన తొలితరం చారిత్రక పరిశోధకులు చిలుకూరి వీరభద్ర రావు గారు చంద్రవంశపు పాండురాజు సంతతికి చెందిన విజయార్కుడు సోమేంద్రుడు అనేవారు వరుసగా ధర్మపురి, నందగిరి రాజ్యాలను పాలించారని, సోమేంద్రుని కుమారుడు ఉత్తుంగ భుజుడు అని, ఉత్తుంగ భుజునికి సంతానం లేకపోతే అతని సోదరుడు ధర్మపురి పాలకుడైన విష్ణువర్ధనుడి కుమారుడు నందుడు ధర్మపురి నందగిరి రెండు రాజ్యాలను పరిపాలించాడని ఆ నందుని పేరు మీదనే నందగిరి ఏర్పడినదని భావించినట్లు సంగనభట్ల నరసయ్య గారు పేర్కొన్నారు.3
శాతవాహన వంశీయుడైన ఒకటవ శాతకర్ణి ప్రతిష్టానపురం నేటి పైఠాన్ రాజధానిగా విశాలమైన రాజ్యాన్ని పాలించాడు. ధాన్యకటకం (ధరణికోట), కోటిలింగాల (గోదావరి తీరం) లను కూడా రాజధానులుగా నిర్మించాడు. ఈ శాతకర్ణి జైత్ర యాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి చేరుకున్నాడు ఇచ్చటి గుట్ట ప్రకృతి శోభకు ఆకర్షితుడై ఈ గుట్ట మీదనే ఒక గగన మందిరాన్ని నిర్మించాడని, దానితోపాటు కోటను కూడా నిర్మించాడని ఈ గుట్టను ఆనంద గిరిగా పిలిచే వారిని కాలక్రమంలో ఆనందగిరి 'నందగిరి'గా మారిందని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు.4
ఈ గుట్టపై గల నరసింహాలయనిర్మాణ విశేషాలను పరిశీలించిన పురాతత్త్వశాఖ అధికారులు ఈ నరసింహాలయం క్రీస్తు శకం 8వ శతాబ్దానికి ముందుదని నిర్ధారించారు.5 ఈ ప్రాంతాన్ని నందులు పరిపాలించినారని గాని, చిలుకూరి వీరభద్ర రావు పేర్కొన్నట్లుగా విజయార్కుడు, సోమేంద్రుడు, ఉత్తుంగ భుజుడు, నందుడు అనే రాజుల పేర్లతో ఉన్న చరిత్ర కాని, మొదటి శాతకర్ణి ఇక్కడే ఈ నందగిరిలో ఉన్నారని చెప్పడానికి కాని బలమైన ఆధారాలు ఏమీ లేవు. ఈ గ్రామంలో జైన మతానికి సంబంధించిన తీర్థంకరుల విగ్రహం లభించడం, ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు, వేములవాడ చాళుక్యులు, జైన శైవ మతాలను పోషించడం, ఈ గ్రామానికి సమీపంలోనే ఉన్న కుర్క్యాల బొమ్మలమ్మ గుట్ట ను 'వృషభాద్రి' (నందికొండ అనే అర్ధం స్ఫురిస్తుంది)గా పేర్కొనడం మొదలైనవి పరిశీలించినప్పుడు జైనమత ప్రభావం ఇక్కడ పరిసర ప్రాంతాలలో ఉండడంతో జైనుల చిహ్నమైన నందికి గుర్తుగా నందిగిరిగా ఏర్పడి ఉండవచ్చు. ఆ ఊళ్ళో ప్రాచీన కాలంనాటి సుందరమైన నంది విగ్రహం ఉండడం, సమీపంలోనే నంది మేడారం అనే గ్రామం ఉండడం కూడా ఒక ఆధారంగా చెప్పుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పటికీ గుట్టపై కనిపించే ప్రాచీన కాలం నాటి ధాన్యాగారం, ఏనుగుల దర్వాజా, ఆయుధాల కొట్టడి, చెఱసాల, భోగం దాని కుంట (చెఱువు) మొదలైన ఆనవాళ్లు ఈ గ్రామానికి ఉన్నటువంటి చారిత్రిక ప్రాధాన్యాన్ని వివరిస్తున్నాయని చరిత్ర సాహిత్య పరిశోధకులు మరియు ఆలయ ధర్మ కర్తల మండలి సభ్యులు డా. గండ్ర లక్ష్మణ రావు గారు తెలిపారు.

(కోట్ల నరసింహుల పల్లెలోని దేవాలయాలు, గ్రామవిశేషాలను వివరిస్తున్న
ట్రస్ట్ బోర్డు సభ్యులు గండ్ర లక్ష్మణరావు)
ఘన చారిత్రిక వారసత్త్వ సంపద కలిగిన ఈ
గ్రామంలో నిర్మాణమైన దేవాలయాలన్నీ చారిత్రక నేపథ్యం కలిగినవే. నరసింహ స్వామి దేవాలయం తో పాటు
సీతారామాలయం, అన్నపూర్ణ విశ్వనాథాలయాలు, మల్లికార్జునాలయం, వీరభద్రేశ్వరాలయం, సోమనాథేశ్వరాలయం (నాంచారి
గుడి) మొదలైన దేవాలయాలతో ఇది హరిహర క్షేత్రంగా భాసిల్లుతుంది.
2.1 ప్రసన్న లక్ష్మీనృసింహాలయం
సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఒక కిలోమీటర్
పొడవు అర కిలోమీటర్ వెడల్పు కలిగిన గుట్ట మీద మధ్య భాగంలో శ్రీ ప్రసన్న లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం
ఉంది. దేవాలయానికి చేరుకోవడానికి 60 మెట్ల మార్గం ఉంది. గుహలో దేవాలయం నిర్మించినట్లుగా ఉంది. గుహలోపలి
పైకప్పున గల శిలపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి శంఖ చక్రాలతో స్వయం వ్యక్తంగా అవతరించాడని స్థానికుల
విశ్వాసం. ఆలయంలో ప్రసన్న లక్ష్మీనరసింహ స్వామి శిలా విగ్రహం ప్రతిష్టమై ఉంది. మూలవిరాట్టుకు మూడు
ఇత్తడి మకర తోరణాలు ఉన్నాయని, ఇందులో ఒక దానిని శాతవాహనులు, రెండవ దానిని కాకతీయులు, మూడవ దానిని
రామడుగు దేశపాండ్య కల్వకోట కిష్టయ్య గారు చేయించారని చెబుతున్నారు.గర్భగుడితోపాటు 12 రాతి స్తంభాలతో, 10
అడుగుల చతురస్ర ప్రమాణం తో కూడిన ముఖమంటపం ఉంది. లక్ష్మీ సమేత నరసింహ స్వామి విగ్రహం వెనుక వైపు మకర తోరణంలా కనిపించే శిలా తోరణం పై దశావతారాల విగ్రహాలు చెక్కబడి
ఉన్నాయి. (వెల్లుల్ల నరసింహ స్వామి దగ్గర కూడా ఇలాగే కనిపిస్తుంది.)
2.2 సీతారామాలయం
అదే ప్రాంగణంలో నరసింహాలయానికి ఎదురుగా వాయువ్యదిశలో రామాలయం ఉంది. వామాంకస్థిత అయిన సీతాదేవి, రామచంద్రుని తో పాటు శేషుని రూపంలో ఉన్న లక్ష్మణ స్వామి ప్రతిమ ప్రతిష్ఠమై ఉన్నాయి. సీతారాముల విగ్రహాలు ఒకే శిలతో ఉండగా ఏడు పడగలతో కూడిన ఆదిశేషుని విగ్రహం మాత్రం విడి గా ఉంది. అయితే లక్ష్మణస్వామి ప్రతిమ ఆదిశేషుని రూపం లో కనిపిస్తుంది. ఈ రెండు దేవాలయాలకు కలిపి ఒకే ధ్వజస్తంభం ఉండడం విశేషం. పడమర దిశలో 16 స్తంభాల మంటపం ఉంది. బహుశా ఇది స్వామి వారి కళ్యాణం మొదలైన ఉత్సవాలు నిర్వహించే వేదిక కావచ్చు. కొండపై కొలువైన స్వామివారి దేవాలయాన్ని చేరడానికి సుమారు 60 మెట్ల నిర్మాణం ఉంది. మెట్ల దారిలోనే నృసింహస్వామికి అభిముఖంగా ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఈ ఆంజనేయుడు ఇక్కడి క్షేత్ర పాలకుడు. ఆంజనేయ స్వామి విగ్రహ శిల్పకళ లక్షణాలు విజయనగర రాజుల కాలం నాటి వ్యాస రాయలు ఏర్పరిచిన ఆంజనేయ స్వామి విగ్రహ లక్షణాలతో పోలి ఉన్నాయని https://www.indian-heritage.org/temple/devunigutta.html పేర్కొంది.
2.3 అష్టముఖ షోడశ బాహు ఉగ్ర నరసింహుడు
ప్రసన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పైకప్పు పై పరుచుకుని ఉన్న పెద్ద శిలపై 8 ముఖాలతో 16 చేతులతో కూడిన ఉగ్ర నరసింహ రూపం ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత గా చెప్పవచ్చు. ఇది అసాధారణమైన స్వామి రూపం అని పరిశోధకులు పేర్కొన్నారు.6 కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతిని గూర్చి పరిశోధించిన జైశెట్టి రమణయ్య గారు పంచముఖ నరసింహునిగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆలయ నిర్వాహకులు దేవాలయం సమీపంలో ఏర్పరిచిన దేవాలయ ఫలకంపై పంచముఖ నరసింహస్వామి గా పేర్కొన్నారు. స్వామి అష్టముఖుడైనా, పంచముఖుడైనా ప్రస్తుతం ఆ విగ్రహంలో మూడు ముఖాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలినవి శిథిలమైనాయి. 16 చేతులలో శంఖం, చక్రం, ధనుస్సు, గద, పాశం, ఖడ్గం మొదలైన వివిధ రకాల ఆయుధాలతో పాటు హిరణ్యకశిపుని తల కూడా వేలాడుతుంది. వీరాసనంలో కూర్చున్న స్వామి వారి కుడి తొడ మీద ఉన్న హిరణ్యకశిపుడు, ప్రధానమైన రెండు చేతులకు గల వాడి యైన గోళ్ళతో ఆ రాక్షసుడిని ఉదరాన్ని చీల్చి ప్రేగులను మాలగా వేసుకున్నట్లు శిల్పం చెక్కబడి ఉంది. దీనితోపాటు అక్కడే ఉన్న కొన్ని రాతి పలకలపై ఉన్న శిల్పాలు కూడా ప్రహ్లాద చరిత్రను తెలుపుతున్నాయి. అపురూపమైన ఈ శిలా విగ్రహం నాటి శిల్పుల కళా విన్యాసానికి అద్దం పడుతుంది. ఇలాంటి అపురూపమైన విగ్రహాలు భారతదేశంలో అరుదుగా ఉన్నాయని, కాంచీపురం జిల్లా సమీపంలోని సింగరాయ పెరుమాళ్ కోయిల్లో కనిపిస్తుందని పరిశోధకులు తెలిపారు.7
ఈ శిల్పం లో కనిపిస్తున్న ఉగ్ర నరసింహ స్వామి
వారి విగ్రహం లో ప్రత్యేకంగా ముందుకు పొడుచుకొని వచ్చిన కళ్ళు, పైకి లేచి ముడుచుకుపోయిన కనుబొమ్మలు,
బలంగా తెరుచుకొని గర్జించినట్లు కనిపిస్తున్న సింహం నోరు మొదలైన లక్షణాలు ఎల్లోరా గుహలోని దశావతార
(15-20) గుహలు మరియు కాంచీపురం లోని సింగరాయ పెరుమాళ్ కోయిల్ లోని షోడశబాహు దృశ్యం లోని నరసింహమూర్తి
లక్షణాలతో దగ్గరి పోలికలు ఉన్నాయని చారిత్రక పరిశోధకులు తెలిపారు. ఎల్లోరా గుహల లోని దశావతార దేవాలయం
రాష్ట్రకూట చక్రవర్తి దండి దుర్గుని కాలంలో నిర్మించారు. అలాగే సింగరాయ పెరుమాళ్ కోయిల్ ఆలయం దంతి
దుర్గుని అల్లుడైన పల్లవరాజు రెండవ నందివర్మ (730 - 795) కాలంలో నిర్మించారు. ఎల్లోరా గుహలు సింగరాయి
పెరుమాళ్ కోయిల్ దేవాలయ విగ్రహాల లక్షణాలు కోట్ల ఉగ్ర నరసింహ స్వామి విగ్రహం లో కనిపించడం వల్ల ఇవి
రాష్ట్ర కూటుల కాలంలోనే నిర్మితమై ఉంటాయని, ఇవి ఎనిమిదో శతాబ్దం కాలం నాటిదని పురాతత్త్వ శాస్త్రవేత్తలు
నిర్ణయించారు.8 ఈ విగ్రహంతో పాటు గుహలో చెక్కబడిన శంఖచక్రాలు, మంటపాలు,
స్తంభాల నిర్మాణాలు, స్తంభాల పై భాగంలో నిర్మించిన లలితబింబాలు ద్వారా బంధాలపై ఉన్న ఘట నిర్మాణాలు
మొదలైనవన్నీ రాష్ట్రకూటుల కాలంనాటి శిల్పకళ లను తెలుపుతున్నాయని, ఈ ఆధారాల వల్ల కోట్ల నరసింహుల
పల్లెలోని నరసింహాలయం 8వ శతాబ్దం చివరలో లేదా 9వ శతాబ్దం పూర్వభాగంలో నిర్మితమై ఉంటుందని పురాతత్త్వ
శాస్త్రవేత్తలు నిర్ణయించారు.9
2.4 అన్నపూర్ణ విశ్వనాథాలయాలు
నరసింహ స్వామి వారి అభిషేకాదులకి గుట్టపై తూర్పు వైపున ఒక పుష్కరిణి నిర్మించారు. ఆ పుష్కరిణికి ఆనుకొని అన్నపూర్ణ, విశ్వనాథ ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని నిర్మాణ రీతులు అనుసరించి ఇది కూడా రాష్ట్రకూటుల కాలానికే చెందిందని పురాతత్త్వ శాస్త్రవేత్తలు తెలిపారు.10 మొగలాయిల పరిపాలన కాలంలో వారి దండయాత్రల ఫలితంగా ఈ విశ్వనాథాలయంలోని స్పటిక శివలింగం ధ్వంసం అయిందని ప్రజల భావన. 1860 ప్రాంతంలో రామడుగు దేశాయి కల్వకోట కిష్టయ్య గారు శివలింగాన్ని పునఃప్రతిష్ఠించారు. ఇటీవల కాలంలో అనగా 24-6-2010 న కందుకూరి శివానందమూర్తి గారి ఆధ్వర్యంలో ధ్వజస్తంభం, నందీశ్వరుడు, విజయ గణపతి, అష్టబాహు అన్నపూర్ణ విగ్రహాలను ప్రతిష్టించి విశ్వనాథ ఆలయాన్ని పునరుద్ధరించారు. నాటి నుండి నిత్య ధూప దీప నైవేద్యాదులతోపాటు ప్రతి మాస శివరాత్రి రోజున ఈ దేవాలయంలో రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు.
2.5 వీరభద్రేశ్వరాలయం
నరసింహస్వామి కొలువై ఉన్న గుట్టకు ఆనుకొని ఉన్న నందగిరి గ్రామంలో వీరభద్రేశ్వరాలయం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. కాకతీయుల కాలంలో సుప్రసిద్ధమైన ఈ వీరభద్రేశ్వరాలయం 16 స్తంభాల ముఖ మంటపంతో ఉత్తరాభిముఖంగా నిర్మించబడింది. దక్షిణ దిశలో గల గర్భగుడిలో వీరభద్రుడు కొలువై ఉన్నాడు. పడమర దిశలో లింగ రూపంలో రాజేశ్వరుడు ప్రతిష్టింపబడినాడు. ఇక్కడ ఉన్న నంది విగ్రహంలో చాళుక్య కళా రీతులు కనిపిస్తున్నాయని జైశెట్టి రమణయ్య పేర్కొన్నారు.11
2.6 మల్లికార్జున ఆలయం
కాకతీయుల కాలంలో నిర్మాణమైన ఈ శివాలయం యొక్క ముఖమంటపం, అంతరాలయం పూర్తిగా శిథిలమైనాయి. తూర్పుముఖంగా ఉన్న ఈ శివాలయంలో నల్లరాతి తో కూడిన శివలింగం ప్రతిష్టింపబడింది. శివలింగంలో కాకతీయుల శిల్పకళా లక్షణాలు కనిపిస్తున్నాయి. అంతరాలయ ద్వార పాలకులు, వారికి ఇరువైపులా నిలిచిన చామర ధారిణులు ద్వార మంటపాలపై ఉన్న గజలక్ష్మి విగ్రహాలు శోభాయమానంగా కనిపిస్తున్నాయి.
2.7 సోమనాథ దేవాలయం (నాంచారీశ్వరి గుడి)
వీరభద్రుని ఆలయానికి కొద్ది దూరంలో సోమనాథేశ్వర ఆలయం ఉంది. స్థానిక ప్రజలు ఈ దేవాలయాన్ని ఎఱుకల నాంచారి గుడిగా పిలుస్తుంటారు. ఈ ఆలయం ముందు నల్లరాయితో చెక్కిన అద్భుతమైన నంది విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. మువ్వలు, గజ్జెలు, గంటల హారాలతో శోభిస్తున్న ఈ నంది విగ్రహం కాకతీయ శిల్ప వైభవానికి నిదర్శనం. మ్యూజియంలో భద్రపరచదగిన ఈ నంది శిల్పం అపురూపమైనదని చారిత్రిక పరిశోధకులు పేర్కొన్నారు.12
ప్రసన్న లక్ష్మీ నరసింహ ఆలయం, ఉగ్ర నరసింహని విగ్రహం, రామాలయం, అన్నపూర్ణ విశ్వనాథాలయాలు, పుష్కరిణి మొదలైనవి రాష్ట్రకూటుల నిర్మాణం కాలంలో అనగా 8వ శతాబ్దం చెందినవి కాగా, వీరభద్రేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, నాంచారమ్మ గుడి మొదలైన ఆలయాలు కాకతీయుల కాలంనాటివి అనగా 12వ లేదా 13 వ శతాబ్దం కాలం నాటివని చరిత్ర పరిశోధనల వల్ల తెలుస్తుంది. శైవ వైష్ణవాలతో కూడిన ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా విలసిల్లింది.
ఎంత సేవించెనో యెఱుకల నాంచారి ఆపేర శివుగుడిననిరి
జనులు
ఒకబావిలో నీరు నొకవైపు ఉప్పుగా ఒకవైపు తీయగా నుండు
వింత
సవతుల బావిగా జనమంత పిలిచేరుశివునిగుడికి ముందు
చేనులోన
తేలెడు ఇటుకలు బోలెడు పోయెను కాపాడలేకనే కాట
గలిసె
ఇంత పల్లెలో కలవెన్నొ వింతలిచట చరిత వైభవమ్ముగ సాగె
స్వామి యెదుట
కోట్ల నరసింహ పల్లెలో కొలువుదీరు నందగిరి వాస!
శ్రీలక్ష్మి నారసింహ!13
నందగిరిపొలములందెందు చూసిన చారిత్ర సంపద సాక్ష్యమిచ్చు
నరసింహపల్లెలో అరక దున్నినచోట అగుపించె జైనతీర్థంకరుండు
పాతకాలమునాటి పనిముట్లు కత్తులు బీరన్న గుడివద్ద పెక్కులుండె
రాలు రప్పలయందు నేల పొరలయందు అరుదైన మరుగైన
చరితయెంతొ
బౌద్ధ జైన శైవములతో నొద్దికగుచు పూర్వ చారిత్రగాథల
పుట్టవగుచు
కోట్ల నరసింహ పల్లెలో కొలువుదీరు నందగిరి వాస!
శ్రీలక్ష్మి నారసింహ!14
కోట్ల నరసింహలపల్లి నందగిరి గ్రామాలలో నిర్మాణమైన దేవాలయాలు విశేషమైన చారిత్రక వారసత్త్వ సంపదలకు నిలయాలని పై శతక పద్యాలు తెలుపుతున్నాయి. 2017 వ సంవత్సరంలో ఒక రైతు పొలాన్ని దున్నుతుండగా విగ్రహం బయల్పడింది. సప్త ఫణ ఛత్రంతో కూడిన దిగంబర రూపం లో ఉన్న ఆ విగ్రహం జైనతీర్థంకరులలో 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథునిదని పరిశోధకులు నిర్ణయించారు.15
అలాగే 2024 సంవత్సరంలో వ్యవసాయ పనుల సమయంలో మూడు అంగుళాల వరాహ స్వామి విగ్రహం బయల్పడింది. ఈ విగ్రహాన్ని చారిత్రక పరిశోధకులు శ్రీ రామోజు హరగోపాల్ బృందం పరిశీలించింది. ఈ విగ్రహం నాలుగవ శతాబ్దం కాలం నాటిదని చారిత్రక పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి గారు నిర్ణయించారు.16 ఈ దేవాలయాలే కాకుండా ఈ ప్రాంతంలో దాదాపు 60కు పైగా దేవాలయాలు, 60 పైగా కోనేరులు నిర్మాణమై ఉన్నాయని ఇచ్చట భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లోతుగా పరిశోధనలు కొనసాగిస్తే మరిన్ని విగ్రహాలు, దేవాలయాలతో పటు బలమైన ఆధారాలు లభిస్తాయని ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ కల్వకోట సంతోష్ బాబు గారు తెలిపారు.

(కోట్ల నరసింహుల పల్లె గ్రామవిశేషాలను వివరిస్తున్న ట్రస్ట్ బోర్డు సభ్యులు కెవి. సంతోష్ బాబు)
హరి హర క్షేత్రంగా భాసిల్లిన ఈ గుహలయాన్ని ఆదిశంకరులు దర్శించినారని, శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన వేదాంత దేశికులు ఈ దేవాలయాన్ని సందర్శించి ఆళ్వారుల విగ్రహాలను ప్రతిష్టించినారని జనశ్రుతి.17
ఇక్కడి దేవాలయాలు మరియు ఆలయ రహితంగా లభించిన
వర్ధమాన మహావీర, సిద్ధార్థ, బుద్ధ, కార్తవీర్యార్జున మొదలైన విగ్రహాలు శైవ వైష్ణవ జైన మతాలకు
సంబంధించినవి కావడం వల్ల ఈ ప్రాంతంలో జైన శైవ మతాలు వర్ధిల్లినాయని ఈ మూడు మతాలు ఇక్కడ సమన్వయంతో
ఉన్నాయని తెలుస్తుంది.18
3. వెలుగులోకి వచ్చిన ఆలయం
నందరాజుల కాలంలో నిర్మితమైన నృసింహ రామాలయాలు, కోట తదనంతర కాలంలో రాజ పోషణ లేక నిరాదరణ పాలైంది. దట్టమైన అడవి పెరగడంతో ఆలయం మరుగున పడిపోయింది. క్రీ.శ. 1860 ప్రాంతంలో రామడుగు దేశ పాండ్య అయిన కల్వకోట కిష్టయ్య గారికి స్వామివారు సప్నసాక్షాత్కరమై ఆలయ జీర్ణోద్ధరణకు ఆజ్ఞాపించినారని, తదనుగుణంగా కిష్టయ్య గారు ఆలయ పునరుద్ధరణ కావించి ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేశారని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ దేవాలయాన్ని శృంగేరి పీఠాధిపతుల ఆధ్వర్యంలో నిర్వహించుటకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
పరిసర ప్రాంతాల గుట్టల్లో నాణ్యమైన గ్రానైట్ రాయి లభ్యం కావడం వల్ల గుట్టలన్నీ ధ్వంసం అయిపోతున్నాయి. దేవుని గుట్టగా పిలవబడుతున్న ఈ కోట్ల నరసింహులపల్లి గుట్టకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఆలయాల ధర్మకర్తల ప్రతిఘటన, వారి తరపున లెంకల రాజు రెడ్డి, చల్లూరి రమేశ్ సాగర్ న్యాయవాదులు కోర్టు లో చేసిన పోరాట ఫలితంగా గ్రానైట్ కార్యకలాపాలకు తాత్కాలికంగా తెరపడింది. కాని భయాందోళనలు మాత్రం పూర్తి స్థాయిలో తొలగి పోలేదు. గ్రామస్థులు, భక్తులతో పాటు ఈ భయాందోళనలు చారిత్రక పరిశోధకులను కూడా కలవరపెడుతున్నాయి. ఈ కోటను, ఆలయాలను, చారిత్రిక ఆధారాలను కాపాడుకోవడానికి ఆలయ ట్రస్టును ఏర్పరిచి ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ట్రస్ట్ నిర్వాహకులు కల్వకోట కీర్తి కుమార్ గారి విన్నపాలను గుర్తించిన భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయం ఉత్తర్వుల మేరకు 2015 లో ఆగస్టు 24 వ తేదీన దక్షిణ ప్రాంత ఆర్కియాలజీ విభాగం సూపరిండెంట్ డైరెక్టర్ జి. మహేశ్వరి గారి ఆధ్వర్యంలో వారి బృందం మరియు 2017 లో అక్టోబర్ 24వ తేదీన హైదరాబాద్ ఆర్కియాలజీ విభాగం సూపరిండెంట్ డైరెక్టర్ మిలన్ కుమార్ చావ్లా గారి ఆధ్వర్యంలో ఒక బృందం దర్శించి చారిత్రక విషయాలను కొన్నింటిని వెలుగులోకి తీసుకొచ్చారని కల్వకోట కీర్తి కుమార్ గారు వివరించారు. (కీర్తి కుమార్ హైదరాబాద్ లో ఉన్న కారణంగా ఫోన్ ద్వారా వీరితో సంభాషించడమైంది)
పురాతత్త్వ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని పరిశీలించి నప్పుడు ఎలాంటి శాసనాలు దొరకలేదు. ఒకవేళ శాసనాలు దొరికి ఉంటే చరిత్రలో కొత్త వెలుగులు కనిపించేవి. ఈ ప్రాంతానికి చెందిన రెండు మూడు శాసనాల గూర్చి మొదటి తరం చరిత్ర పరిశోధకులు ధూపాటి వెంకటరమణాచార్యులవారు "కరీంనగర్ మండలచరిత్ర" అనే పుస్తకంలో ప్రకటించారు. ఈ పుస్తకాన్ని కరీంనగర్ త్యాగరాజ కళాపరిషత్ వారు ముద్రించారు.19 అవే శాసనాలు సురవరం ప్రతాపరెడ్డి గారి గోల్కొండ పత్రికలో కూడా ప్రకటితమైనాయి.20 కాని ప్రస్తుతం ధూపాటి వారి కరీంనగర్ మండల చరిత్ర మరియు గోల్కొండ పత్రిక ప్రతులు అందుబాటులో లేక పోవడం వల్ల శాసనాలు బయలు పడటం లేదు. రాష్ట్ర ఆర్కియాలజీ విభాగంలో కానీ, 1974లో ప్రచురించిన కరీంనగర్ శాసనాల్లో కానీ ఈ శాసనాలు లేకపోవడం దురదృష్టకరం.21 శాసనాలు సాహిత్యం వంటి ఆధారాలు లేకపోవచ్చు. కాని ఈ కోటలో నిర్మాణమైన ధాన్యాగారం, జైలు, రక్షణ వ్యవస్థ వీటన్నిటినీ పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రాముఖ్యత కలిగిన రాజ్య వ్యవస్థ ఉండేదని అర్థమవుతుంది. ఇక్కడి దేవాలయాలు దొరుకుతున్న శిల్పాలను అనుసరించి నందగిరికోట్ల నరసింహులపల్లి దేవాలయాలు జాతీయ వారసత్వ సంపదలకు నిలయాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
4. ఉపసంహారం
- రాష్ట్ర కూటుల కాలానికి పూర్వమే అనగా క్రీస్తు శకం 8వ శతాబ్దానికి పూర్వం ఈ దేవాలయాన్ని నిర్మించి ఉంటారని ఆర్కియాలజీ విభాగం వారు నిర్ధారించారు.
- ఇక్కడ కనిపించే అష్ట ముఖ షోడశ బాహు నరసింహుని శిలా మూర్తి భారత దేశ శిల్ప కళాసంపదకు దర్పణం. ఇది అరుదైన విగ్రహం. ఇ
- క్కడి రైతులు వ్యవసాయ పనులు చేస్తున్న సందర్భంలో వివిధ విగ్రహాలు బయల్పడడం సాధారణమే. ఇటీవల కాలంలో లభ్యమైన పార్శ్వనాథ, ఆదివరాహమూర్తి విగ్రహాలు మొదలయినవి మరియు నృసింహ,రామాలయాలు, విశ్వనాథాలయం, వీరభద్ర ఆలయం, నాంచారి గుడి మొదలైన వాటి ఆధారంగా ఈ ప్రాంతం వైదిక, బౌద్ధ, జైన మతానుయాయులకు ఆవాస కేంద్రంగా విలసిల్లిందని స్పష్టమవుతున్నది.
- కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు పూనుకొని ఇక్కడ పురాతత్త్వ విభాగం ద్వారా పరిశోధనలు జరిపితే విశేషమైన చరిత్ర సంస్కృతి బయల్పడుతుంది.
- గ్రానైట్, క్వారీ వ్యాపారుల ప్రయత్నాలు, వారి కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ఆగిపోతాయి. తద్వారా భవిష్యత్ తరాల వారికి చారిత్రిక వారసత్త్వసంపద అందించబడుతుంది. పర్యావరణమూ పరిరక్షింపబడుతుంది.
- ఈ నరసింహ దేవాలయం, ఈ నందగిరి కోట్ల నరసింహులపల్లి ప్రాంతాన్ని జాతీయ వారసత్త్వ సంపద నిలయాలుగా గుర్తించవచ్చు.
- ధర్మ కర్తల మండలి సభ్యులు తెలిపే వివరాలు, సామాజిక ప్రచార మాధ్యమాల్లోని సమాచారం మొదలైన ప్రాథమిక మౌలిక వివరాలు మాత్రమే లభించడం వల్ల ఈ వ్యాసానికి పరిమితులు ఏర్పడ్డాయి.
- క్షేత్ర పర్యటనలో చెప్పుకోదగ్గ సాధక బాధకాలు ఏమి లేవు.
- ఈ ఆలయాలకు సంబంధించిన లోతైన బలమైన ఆధారాలు సేకరించడానికి భవిష్యత్ పరిశోధకులు ప్రాచీన శాసనాలు మరియు శాసన వాఙ్మయాన్ని, ప్రాచీన చారిత్రక పరిశోధకుల సాహిత్యాన్ని శ్రమించి పరిశీలించవలసి ఉంటుంది.
ఆలయ పరిసరాలకు సంబంధించిన కొన్ని చిత్రాలు

(దేవుని గుట్టగా పిలువబడే కోట్ల నరసింహుల పల్లె గుట్ట)

(అష్ట ముఖ షోడశ బాహు ఉగ్ర నరసింహ స్వామి)

(పార్శ్వనాథుని విగ్రహం)
5. సూచికలు
- శ్రీలక్ష్మి నారసింహ శతకం, లక్ష్మణరావు, గండ్ర. పద్యం 37
- కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి, రమణయ్య, జైశెట్టి. పు.370, and నందగిరి-కోట్ల నరసింహులపల్లి శ్రీ లక్ష్మీనరసింహ క్షేత్రము చరిత్ర, శాతవాహన కళోత్సవాలు 2002 సదస్సు, వేణుశ్రీ(సేకరణ). పుట 44
- శ్రీ ధర్మపురి క్షేత్ర చరిత్ర, నరసయ్య, సంగనభట్ల. పుట 28 - 29
- అష్టముఖ షోడశ బాహు ఉగ్ర నర్సింహుడు (సంకలనం), నరసింహమూర్తి, కండ్లకుంట. పుట 35
- అష్టముఖ షోడశ బాహు ఉగ్ర నర్సింహుడు (సంకలనం), నరసింహమూర్తి, కండ్లకుంట. పుట 175
- అష్టముఖ షోడశ బాహు ఉగ్ర నర్సింహుడు (సంకలనం), నరసింహమూర్తి, కండ్లకుంట. పుట 160
- అష్టముఖ షోడశ బాహు ఉగ్ర నర్సింహుడు (సంకలనం), నరసింహమూర్తి, కండ్లకుంట. పుట 162.
- అష్టముఖ షోడశ బాహు ఉగ్ర నర్సింహుడు (సంకలనం), నరసింహమూర్తి, కండ్లకుంట. పుట 175
- అష్టముఖ షోడశ బాహు ఉగ్ర నర్సింహుడు (సంకలనం), నరసింహమూర్తి, కండ్లకుంట. పుట 176
- అష్టముఖ షోడశ బాహు ఉగ్ర నర్సింహుడు (సంకలనం), నరసింహమూర్తి, కండ్లకుంట. పుట 162
- కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి, రమణయ్య, జైశెట్టి. పు.107
- కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి, రమణయ్య, జైశెట్టి. పు.370
- శ్రీలక్ష్మి నారసింహ శతకం, లక్ష్మణరావు, గండ్ర. పద్యం 102
- శ్రీలక్ష్మి నారసింహ శతకం, లక్ష్మణరావు, గండ్ర. పద్యం 104
- అష్టముఖ షోడశ బాహు ఉగ్ర నర్సింహుడు (సంకలనం), నరసింహమూర్తి, కండ్లకుంట. పుట 148
- నమస్తే తెలంగాణ, తెలుగు దిన పత్రిక 27-06-2024
- నందగిరి-కోట్ల నరసింహులపల్లి శ్రీ లక్ష్మీనరసింహ క్షేత్రము చరిత్ర, శాతవాహన కళోత్సవాలు 2002
- సదస్సు, వేణుశ్రీ (సేకరణ). పుట 44
- నందగిరి-కోట్ల నరసింహులపల్లి శ్రీ లక్ష్మీనరసింహ క్షేత్రము చరిత్ర, శాతవాహన కళోత్సవాలు 2002
- సదస్సు, వేణుశ్రీ (సేకరణ). పుట 42 https://www.indian-heritage.org/temple/devunigutta.html
- నందగిరి-కోట్ల నరసింహులపల్లి శ్రీ
లక్ష్మీనరసింహ క్షేత్రము చరిత్ర, శాతవాహన కళోత్సవాలు 2002 సదస్సు, వేణుశ్రీ (సేకరణ). పుట
43
https://www.indian-heritage.org/temple/devunigutta.html
6. ఉపయుక్తగ్రంథసూచి
- నరసయ్య, సంగనభట్ల, శ్రీ ధర్మపురి
క్షేత్ర చరిత్ర (2004), ఆనంద వర్ధన ప్రచురణలు ధర్మపురి.
- నరసింహ మూర్తి, కండ్లకుంట. (సం.),
అష్టముఖ షోడశ బాహు ఉగ్ర నర్సింహుడు (2018), శ్రీ లక్ష్మీనరసింహ మరియు శ్రీ అన్నపూర్ణ విశ్వనాథాలయాల
ట్రస్ట్, కరీంనగర్.
- మలయశ్రీ, కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య
చరిత్ర (1997), సత్యార్థి పబ్లికేషన్స్, కరీంనగర్.
- రమణయ్య, జైశెట్టి, కరీంనగర్ జిల్లా
చరిత్ర సంస్కృతి (2014), జైశెట్టి శివసాయి ప్రచురణలు, జగిత్యాల.
- లక్ష్మణరావు, గండ్ర,
శ్రీలక్ష్మినారసింహశతకం (2024), శ్రీలక్ష్మీనరసింహ మరియు శ్రీఅన్నపూర్ణ విశ్వనాథాలయాల ట్రస్ట్, కరీంనగర్.
- లక్ష్మణరావు, గండ్ర, (సంపాదకులు) (2002), శాతవాహన సదస్సు శాతవాహన కళోత్సవాలు కరీంనగర్.
- Keerthi Kumar, Kalvakota, (Comp.), Ashtamukha Shodasha Baahu Ugra Narasimhakotla Narsimhulapalle. (2018), Sree Laxminrisimha and Sri Annapurna Vishwanatha Temples Trust, Karimnagar.
- Rajgopal, M V. (State Editor), Andhra Pradesh District Gazetteers Karimnagar. (1974), Government Printing Press, Kurnool.
- Sumathi, ALN. Sri Prasanna Lakshmi Narasimha Swamy Temple, Hari-Hara Kshethram - Devuni Gutta near Hyderabad, Andhra Pradesh. Indian Heritage.org https://www.indian-heritage.org/temple/devunigutta.html Accessed 15.08.2025.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

