AUCHITHYAM | Volume-06 | Issue-09 | August 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
7. బండారి భక్తులు: సంస్కృతిప్రసరణ
డా. గడ్డం వెంకన్న
అసోసియేట్ ప్రొఫెసర్, జానపద విజ్ఞాన అధ్యయన శాఖ,
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం,
హన్మకొండ, హన్మకొండ జిల్లా, తెలంగాణ.
సెల్: +91 9441305070, Email: gaddamvenkannatu@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.07.2025 ఎంపిక (D.O.A): 28.07.2025 ప్రచురణ (D.O.P): 01.08.2025
వ్యాససంగ్రహం:
తెలంగాణ జానపదకళారూపాలలో బండారి భక్తుల కళారూపం ఒకటి. ఈ కులాలను ఆశ్రయించి కథలు చెప్పే కళాకారులను జానపద వృత్తి కళాకారులు అంటారు. అలాంటి ఆశ్రిత లేదా జానపద వృత్తి కళాకారులే బండారు భక్తులు. వీరు పెరుక కులం వారికి ఆశ్రితులుగా ఉండి వారి కులపురాణమైన స్కాందపురాణాన్ని కథాగాన శైలిలో ప్రదర్శించి వారిచ్చే ప్రతిఫలం పొందుతారు. బండారు భక్తులు ప్రతీ రెండు లేదా మూడు ఏండ్లకు ఒకసారి పెరికలు నివసించే గ్రామాలకు వెళ్లి స్కాంద పురాణాన్ని కథాగానం రూపంలో నాలుగు లేదా ఐదు రోజులు ప్రదర్శిస్తారు. కథలో బండారు భక్తుల చరిత్రతో పాటు, పెరికల ఆవిర్భావ చరిత్ర, కులపురాణం ఉంటుంది. బండారుభక్తులు కళాప్రదర్శన కంటే ఎక్కువగా పెరుక వారు నిర్వహించే పూజాక్రతువులు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. బండారు భక్తుల గురించి ఇప్పటి వరకు సమగ్ర అధ్యయనం జరుగలేదు. వీరి గురించిన పూర్తి సమాచారం ఎక్కడా భద్రపరుచలేదు. ఒక్కరు ఇద్దరు పరిశోధకులు పెరికల గురించి వెలువరించిన గ్రంథాలలో వీరి గురించి ప్రస్థావించడం జరిగింది. ఈ వ్యాసం విషయ సేకరణపై ఆధారపడి రాయడం జరిగింది.కొంత సమాచారం పెరికలపై వెలువడిన గ్రంధాలనుంచి సేకరించడం జరిగింది.అదేవిధంగా ఈ వ్యాసం పూర్తిగా భవిష్యత్ పరిశోధకులను దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది. ప్రస్తుతం బండారు భక్తుల కళారూపం అంతరించిపోయే దశలో ఉన్నది. కాబట్టి ఈ బండారు భక్తుల కళారూపాన్ని అసాంతం డాక్యుమెంట్ చేసి భద్రపరుచవలసిన ఆవశ్యకత ప్రభుత్వంపైన, ధాతృకులమైన పెరిక వారిపైన ఎంతైనా ఉన్నదని చెప్పడమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్యం.
Keywords: బండారు భక్తుడు, వృత్తిగాయకులు, కొండెక్కడం, బెల్లప్పాలు, సిరా, ఘటం కుండ, పంచాక్షరీ ముగ్గు, కోతపూజ, మడిబట్ట, పట్టెనామాలు.
1. ప్రవేశిక
తెలంగాణ సంస్కృతిలో జానపద కళారూపాలకు విశిష్ట స్థానం ఉంది. ఈ కళారూపాలు భిన్నమైన కళా ప్రదర్శనలతో రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాల గొప్పతనాన్ని, ఆయా కులాల మౌఖిక చరిత్రలను, కుల పురాణాలను, ఇంద్రజాల విద్యల వంటి పలు రకాల ప్రదర్శనలిస్తూ సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నవి.
జానపద కళారూపాలను ప్రదర్శించే కళాకారులు కొందరు తమకు వంశపారంపర్యంగా మౌఖికంగా సంక్రమించిన కళనే వృత్తిగా ఎంచుకొని ప్రదర్శించే కళాకారులను వృత్తి గాయకులని అంటారు. వీరు ప్రదర్శించే కళారూపం ఏదైనా ఒక కులానికి ప్రత్యేకంగా చెందినదై ఉంటుంది. అలాగే వీరు ఆ కులానికి హక్కుగా ప్రదర్శించే కట్టడిని కూడా కలిగి ఉంటారు. ఆ కులానికి ఎలా హక్కుదారులుగా అయ్యారో అనే విషయమై తెలుసుకునేందుకు వారి దగ్గర రాగి శాసనం గాని, తాళపత్ర ప్రతులు గాని ఆధారాలుగా ఉంటాయి. వీరు తమ ప్రదర్శన ప్రక్రియ ద్వారా ఆ కులానికి చెందిన కుల పురాణాన్ని లేదా గోత్రాలను కీర్తిస్తూ జీవనం సాగిస్తారు. వీరు ప్రదర్శించే ప్రదర్శనాంశం ప్రధాన కులానికి సంబంధించిన వంశ చరిత్ర, ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి. అదేవిధంగా ఇలా వారి సాంస్కృతిక జీవితానికి సంబంధించిన అనేక అంశాలు కూడా దాగి ఉంటాయి. ఈ క్రమంలోనే పెరిక కులాన్ని ఆశ్రయించి వారి కుల పురాణాన్ని కథాగానం చేసేందుకు జానపద వృత్తి గాయకులుగా పేరొందిన బండారు భక్తులు ఉన్నారు. వీరు తమకు వంశపారపర్యంగా సంక్రమించిన వృత్తిని చేపడుతూ పెరిక కులానికి సంబంధించిన కుల పురాణాన్ని కథాగానం చేయడమే గాక, వారి గోత్రనామాలను స్తుతిస్తూ, వివిధ పూజాది కార్యక్రమాల్లో పూజారులుగా వ్యవహరిస్తారు.
తెలంగాణలో బండారి భక్తులు కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్లా, సిద్దిపేట జిల్లాలలో ఉన్నారు. జనాభా పరంగా అధికంగా ఉన్నా, కథలు ప్రదర్శించే లేదా పూజలు నిర్వహించే బండారు భక్తుల సంఖ్య మాత్రం చాలా తక్కువ. అందుకే ఈ కళారూపం అంతరించి పోయే దశలో ఉంది అని చెప్పవచ్చు.
‘‘బండారి భక్తులకు తరతరాలుగా కట్టడి గ్రామాలు హక్కుగా సంక్రమిస్తాయి. ఈ కట్టడి గ్రామాలు తాలూకాల వారిగా ఉంటాయి. తాలూకాలు ఎన్ని ఉంటే ఆ తాలూకాల వారీగా ఫలానా తాలూకా, ఫలానా బృందానికి సంబంధించినదిగా నిర్ణయించుకుంటారు. దాని ప్రకారం కళాకారులు ఆయా తాలూకాల పరిధిలో గల గ్రామాలలో నివసిస్తున్న పెరికవారిని కలుస్తారు. వారి అనుమతితో పెరిక పురాణాన్ని ప్రదర్శించి వారి దగ్గర ప్రతిఫలం పొందుతారు. ఒక్కొక్క కట్టడి గ్రామానికి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి వెళ్తారు. ప్రస్తుతం కట్టడి గ్రామాలకు ఎవరు కూడా వెళ్ళటం లేదు. కాని ఒకరిద్దరు కళాకారులు మాత్రం ఇప్పటికీ తమ కట్టడి గ్రామాలకు వెళ్లి ప్రదర్శనలు ఇవ్వకున్నా ప్రతిఫలం తీసుకొని వస్తున్నారు’’.1
2. బండారి భక్తులు - వివరణ
బండారు అంటే పసుపు. రాతి మీద పసుపుకొమ్ము రాచి పూసికొనెడి పసుపు అని అంటారు. కోశాధ్యక్షుడు అని సూర్య రాయాంధ్ర నిఘంటువులోను శబ్ద రత్నాకరం నిఘంటువులోను పేర్కొనబడిరది. బండారము అంటే బొక్కసము, బొక్కసానికి అధికారి అని, భాండాగారము అని కనిపిస్తున్నది. దీనిని బట్టి బండారు అంటే పసుపు అనే అర్థమే స్ఫురిస్తుంది. పెరిక పురాణం కథాలో ‘‘గిరిరాజు వంశం నిర్వీర్యం కాకుండా పరశురాముని బారి నుండి రక్షించడానికి వారికి బండారు పెట్టి పరశురాముని భక్తులుగా చేసిన కురుల సోమశెట్టి సంతతికి చెందిన వారు కాబట్టి వీరికి బండారి భక్తులుగా పేరు వచ్చిందని అంటారు’’.2
3. బండారి భక్తులు – చరిత్ర
సృష్టిలో ఏ జీవరాశి లేనపుడు సర్వేశ్వరుడు వెండికొండ మీద తపస్సు చేస్తున్నాడు. అతని ‘కురులు’ ఎన్నో వయోజనాల దూరం పెరిగిపోతాయి. ఈ సమయంలో పంచభూతాలు ఏకమై సర్వేశ్వరుని కురుల్లో చేరగా జీవోత్పత్తి జరుగుతుంది. అపుడు కురుల నుండి ఒక బాలుడు జన్మిస్తాడు. వెంటనే సర్వేశ్వరుడు తన కురులను చూడగా దానిలో నుండి బాలుని ఏడుపు వినిపిస్తుంది. నాకు ఈ సృష్టిలో ఒకరు తోడుగా జన్మించారని భావిస్తాడు. కురులలో జన్మించాడు కాబట్టి ఆ బాలునికి కురుల సోమశెట్టి అని పేరు పెట్టి అక్కడే కైలాసాన్ని నిర్మించుకుంటాడు. ఆ తర్వాత సర్వేశ్వరుడు కురుల సోమశెట్టికి కైలాసాన్ని అప్పజెప్పి, ఢమరుకం వాయిస్తూ కాపాడమని చెప్పి తపస్సు చేయడానికి వెండికొండకు వెళతాడు. ఒకరోజు సర్వేశ్వరుడు తపస్సు చేస్తుండగా ‘ఓం’ కార శబ్దం వినిపిస్తుంటుంది. ఇదే సమయంలో మళ్లీ పంచభూతాలు ఏకమై సర్వేశ్వరుని చెవిలోకి చేరగానే జీవోత్పత్తి జరుగుతుంది, దాని నుండి దివ్యతేజస్సుతో గిరిరాజు అనే బాలుడు జన్మిస్తాడు. సర్వేశ్వరుడు ఇతన్ని రారాజును చేయాలని తన మాయ చేత ‘పురగిరి’ అనే రాజ్యాన్ని నిర్మించి దానికి రారాజును చేస్తాడు. ఆ తరువాత మొదటగా జన్మించిన కురులసోమశెట్టిని అతనికి కులగురువుగా చేసి గురువు చెప్పినట్టు వినమని చెప్పి దీవిస్తాడు. పురగిరి రాజ్యాన్ని పాలించిన రాజు కావటంతో గిరిరాజుకు పురగిరి క్షత్రియుడనే పేరు కూడా ఉంది.
గిరిరాజు రాజ్యాన్ని సమర్ధవంతంగా పరిపాలిస్తుండగా, ఇతర రాజ్యాల రాజులు కూడా స్వయంగా వారి వారి రాజ్యాలను పురగిరిలో కలుపుతూ సామంతులుగా ఉంటారు. ఈ కారణం చేత గిరిరాజు రారాజుగా వెలుగొందుతూ కీర్తి గడిస్తాడు. ఇది ఇట్లా ఉండగా, పరశురాముడు క్షత్రియుల మీద కోపంతో వారి తలలను ఖండిస్తుంటాడు. ఈ విషయం తెల్సుకున్న గిరిరాజు పరశురామునితో యుద్ధం చేసి గెలువలేనని, తన వంశం నశించి పోతుందని ఎలాగైనా కాపాడవల్సిందని తమ గురువైన కురుల సోమశెట్టిని అడుగుతాడు. సాక్షాత్తు భగవంతుని స్వరూపమైన పరశురాముని జయించుట కష్టమే అంటాడు. పరశురాముడు యుద్ధం చేసినపుడు పుట్టనెక్కినవాన్ని, పూరిగడిసినవాన్ని, పండబడ్డవాన్ని, పారిపోయినవాన్ని, శణార్థి అనేవాన్ని క్షమిస్తాడని, వారికి ఏ హాని కలిగించడని గిరిరాజుకు చెపుతాడు. ఆ తర్వాత కురుల సోమశెట్టి ఉపాయం ఆలోచించి నీకు బండారు పెట్టి పరశురామునికి భక్తునిగా చేస్తే అతని చేత రక్షింపబడతావని అంటాడు.
ఆ తర్వాత జనుముతో పెఱిక గోనె మూటలను చేయించి వజ్రాల వ్యాపారం చేయడానికి గిరిరాజును రాజ్యం నుండి పంపిస్తాడు. పరశురాముడు పురగిరి పట్టణానికి దండెత్తి రాగానే కురుల సోమశెట్టి శణార్థి అని దండం పెట్టి నేను ఈ రాజ్యానికి గురువునని, మా రాజు ప్రజల అవసరాల నిమిత్తం వజ్రాల వ్యాపారానికి వెళ్లాడని చెప్తాడు. పరశురాముడు రాజు వ్యాపారం చేయడం ఏంటని, ప్రజలను సుభిక్షంగా చూసుకుంటూనే, వారి అవసరాల నిమిత్తం వ్యాపారం చేస్తున్న రాజు గొప్పవాడని, పైగా నా భక్తుడే కావటంతో అతనిని మెచ్చుకొని అతనితో యుద్ధం చేయనని చెప్పి వెళ్తాడు. ఈ రకంగా గిరిరాజును అతని వంశాన్ని బండారు పెట్టి భక్తున్ని చేయటంతో వారి వంశం నిర్వీర్యం కాకుండా రక్షించిన వాడయ్యాడు కురుల సోమశెట్టి. గిరిరాజును ఎప్పుడైతే భక్తునిగా చేసినాడో అప్పటి నుండే వారి గురువైన కురుల సోమశెట్టి ‘బండారు భక్తునిగా కొలువబడ్డాడు.
‘‘కలియుగంలో కూడా పెఱిక కులానికి గురువులుగా ఉంటూ, వారి వంశ చరిత్రను కీర్తిస్తూ, ఎవరైనా కులంలో తప్పు చేస్తే తప్పు పెట్టాల్సిన బాధ్యత మీదేనని, మళ్ళీ తిరిగి వారికి కులమియ్యాలని ఆ సర్వేశ్వరుడు గిరిరాజు రూపంలో పలుకుతాడు’’.3
4. బండారి భక్తులు - ప్రదర్శన విధానం
బండారు భక్తులు వృత్తిరిత్యా ప్రధానంగా కుల గురువులుగా పేరొందినా, ప్రవృత్తిరిత్యా జానపద వృత్తిగాయకులుగా, ఆశ్రితకుల కళాకారులుగా పేరొందారు. పెరికల వంశ చరిత్రను మొదట్లో పురాణ ప్రవచనంగా లేదా పురాణ పఠనంగా ప్రదర్శించేవారు. ప్రస్తుతం కథాగాన రూపంలో మాత్రమే ప్రదర్శిస్తున్నారు. వీరు చెప్పే పురాణాన్ని పెఱిక పురాణమని, స్కాంధపురాణమని, మలహరు విజయం అని పిలుస్తారు. ఈ పురాణాన్ని అయిదు రోజులు ప్రదర్శిస్తారు. పురాణంలో కథాంశం కృతాయుగం మొదలుకొని కలియుగం వరకు కొనసాగుతుంది. మొదటి రెండు రోజులు కృతయుగంలో కథ మొదలయ్యి గిరిరాజు పుట్టడం, అతను ఎక్కడెక్కడ పెరిగింది, ఏయే రాజ్యాలను జయించింది, రేణుకాదేవి చరిత్ర, పరశురాముని కథ ఉంటుంది. మిగతా మూడు రోజులు మలహరుని విజయం చెప్తారు. ఇందులో పెఱిక కుల ఆవిర్భావం, పెఱికలలో రకాలు, వీరు చేసే పనులు వ్యాపారం వివరాలు,ఇతర జాతుల ప్రస్తావన మొదలైన అంశాలుంటాయి. దీంతో పాటుగా కుశలవ చరిత్ర, నలచక్రవర్తి, హరిశ్చంద్ర, బాలనాగమ్మ, నలదమయంతి వంటి హరికథలను కూడా చెప్తారు. ఈ హరికథల ప్రదర్శన అనేది కేవలం ఆయా గ్రామాలకు వెళ్లినపుడు పెరిక కులస్థులు చెప్పమంటేనే చెపుతారు.
4.1. వేదిక నిర్మాణం
బండారు భక్తుల కళాకారులు ప్రదర్శన కోసం ప్రత్యేకంగా వేదికను నిర్మిస్తారు. కుల పెద్దల ఆదేశానుసారం వారు ఎక్కడ వేయమంటే అక్కడ వేదికను వేయడం జరుగుతుంది. దాదాపుగా కుల పెద్ద ఇంటి ఆవరణలో గాని లేదా పెరిక వారిలో ఎవరిదైనా ఇంటి స్థలం పెద్దగా ఉంటే అక్కడ గాని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఎవరి ఇంటి దగ్గర అయితే కథ చెప్తారో ఆ ఇంటి వారు ఆ రోజు పెరిక వారందరికీ భోజనాలు పెట్టాల్సి ఉంటుంది. పురాణాన్ని తమ ఇంటి దగ్గర చెప్పించుకోవాలనే కోరిక ప్రతి వారిలో ఉండటం చేత ఈ రకంగా నియమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా వేదిక మీద అలికి, పసుపు కుంకుమలతో ముగ్గు పెట్టి అలంకరిస్తారు. ముగ్గు మీద తూర్పుముఖంగా పీట వేసి, ఆ పీట మీద మలహరి విగ్రహాన్ని ప్రతిష్టించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి,కొబ్బరికాయ కొట్టి కథను ప్రారంభిస్తారు. ప్రేక్షకులు కూడా భక్తితో కొబ్బరికాయలు సమర్పిస్తారు.
4.2. ప్రదర్శకులు
ప్రదర్శనలో కళాకారులు ఐదుగురు ఉంటారు. వీరిలో ఒకరు ప్రధాన కథకుడు. మిగతా నలుగురు వంతకులుగా లేదా సహాయకులుగా ఉంటారు. వీరు పట్టు వస్త్రాలు ధరించి నుదటన పట్టె నామాలు, పెట్టుకొని భుజం మీద తువ్వాల, నడుముకు మడిబట్ట, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు.
4.3. వాద్య పరికరాలు
బండారు భక్తుల కథాగానప్రదర్శనలో వాద్యాలు ప్రధాన భూమికను పోషిస్తాయి. వాద్యాలు వాయించడం వలన కథకులు తమ హావభావాల ద్వారా కథను రక్తి కట్టిస్తూ ప్రేక్షకుల్ని రంజింపచేయడానికి ఉపయోగపడతాయి. వీరు కథకు అనుగుణంగా తంబూర, చిరుతలు, మద్దెల, హర్మోనియం, తాళాలు, గజ్జెలు ఉపయోగిస్తారు.
ప్రధానకథకుడు తాంబుర్ర లేదా చిరుతలు పట్టుకొని కథగానం చేస్తుంటాడు. మిగతా వారు వంతపాడుతూ వాద్యసహకారం అందిస్తారు. దీనిలో ఒకరు మద్దెల, మరొకరు హార్మోనియం, ఇంకొకరు తాళాలు వాయిస్తారు.
4.4. పెరిక పురాణం - కథాప్రదర్శన
కథా ప్రదర్శనలో మంచి రోజు చూసి ప్రారంభిస్తారు. వేసవి కాలంలో లేదా పనులు లేని సమయంలో కథలు చెపుతారు. సాధారణంగా పగటి పూటనే చెపుతారు. రోజు మూడు నుండి ఐదు గంటలు కథ చెబుతారు. కథా ప్రారంభంలో గణపతి ప్రార్ధన చేస్తారు. వచ్చిన వారందరికి కుంకుమ బొట్టు పెడతారు. కులపెద్ద అనుమతితో కథను ప్రారంభిస్తాడు. ఆ తరువాత కథను ఐదు రోజులు ప్రదర్శిస్తారు. కథ చెప్పినన్ని రోజులు వీరు పెరికల ఇళ్ళ వద్దనే భోజనం చేస్తారు.
ఈ సందర్భంగా బండారు భక్తులు కథ చెబుతున్నన్ని రోజులు పెరిక వారి ఇంటింటికి వెళ్లి భోజనం చేయడం వీరి ఆచారం. అయితే ఇంటింటికి వెళ్లి బండారు భక్తులు వంట చేసి ఆ కుటుంబానికి భోజనం పెట్టడమే కాక మలహరుని పూజ కూడా చేస్తారు. ఐతే ఒక్కొక్కసారి పూజ చేయడం ఆలస్యమవుతుందని, ఒకే వాడలో ఒకరోజు మలహరి పూజ చేసి, అక్కడే కథ చెప్తామని ఒప్పందం కుదుర్చుకుంటారు.దీని ద్వారా కళాకారులకు సమయం మిగులు జరుగుతుందని, ఆ ఉద్దేశంతో ఆ రకంగా మాట్లాడుకుంటారు. దానికి పెరిక కుల పెద్దలు అంగీకరిస్తే దానినే అనుసరిస్తారు.
మలహరి పూజలో భాగంగా ఇంట్లో ఉదయం బియ్యపు పిండి, పసుపు కుంకుమతో ముగ్గు వేస్తారు. దానిమీద పీఠను తూర్పు ముఖంగా వేసి, దానిమీద తెల్లని వస్త్రాన్ని పరిచి పీట మీద మలహరి విగ్రహాన్ని అంటే శివుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూలు, పత్రి,పండ్లు సమర్పించి కొబ్బరికాయ కొట్టి ఆ స్వామిని వేడుకొని నైవేద్యం సమర్పిస్తారు. ఆ తరువాత వండిన వంటలను కుటుంబంతో కలిసి బండారు భక్తులు భోజనం చేస్తారు. ఈ రకంగా ప్రతి ఇంటిలో బండారు భక్తులు ఆ గ్రామంలో ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజులు వారి ఇంట్లో పూజ చేసి తినడం ఆచారంగా కనిపిస్తుంది.
5. బండారు భక్తులు - పూజాకార్యక్రమాలు
బండారి భక్తులు కేవలం జానపద వృత్తి కళాకారులు మాత్రమే కాదు. పెరిక వారికి గురువులుగా, పూజారులుగా కూడా సేవలు అందిస్తారు. పెరిక వారికి పూజారులుగా వ్యవహరిస్తూ శక్తిదేవత మరియు శివుడికి చెందిన పూజలను నిర్వహిస్తారు. వీరు చేసే పూజలలో అఖండపూజ, శుక్రవారం పూజ, పాలపూజ ప్రధానమైన పూజలుగా పేర్కొనవచ్చు.
5.1. అఖండపూజ - విధానం
ఈ పూజను అఖండ జ్యోతి పూజ అని కూడా పిలుస్తారు. శైవారాధకులైన పెరిక కులం వారే కాకుండా కొందరు రెడ్డి కులం వారు కూడా ఇప్పటికీ ఆచారంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం గాని మూడు సంవత్సరాలకు ఒకసారి గాని, ఆషాడ, శ్రావణం, కార్తీక మాసంలో జరుపుకుంటారు. అఖండ పూజ రాత్రి పూట ప్రారంభిస్తారు. పూజ గదిలో ఇంటి యజమానురాలు తూర్పు ముఖంగా అలికిన తర్వాత పూజారి బియ్యపు పిండి, పసుపు కుంకుమతో ‘షోలాక్షరి’ ముగ్గు వేస్తాడు. దాని మీద పీఠ వేసి పసుపుకుంకుమతో అలంకరించి అడ్డడుసోడు వడ్లు పోస్తాడు. తెల్లని వస్త్రం పరిచి బియ్యం, అయిదు రకాల పండ్లు, కుడక, రవిక, కనుము పూలు, పత్రులు ముఖ్యంగా మారెడు పత్తిని ఉంచి శివుడి విగ్రహాన్ని ఆ పీఠం మీద నిలుపుతాడు.
ఆ తర్వాత కిలోన్నర గోధుమ పిండితో మాణిక్యం చేసి, దానిలో నెయ్యి పోసి వెలిగిస్తారు. దీనిని అఖండ జ్యోతి అంటారు. రాత్రి అంతా శివున్ని కొలుస్తూ దీపం కొండెక్కకుండా నిష్టగా కాపాడుతారు. తెల్లవార్లు భక్తి పాటలు పాడి ఉదయం మూడు గంటల ప్రాంతంలో స్నానం చేసి లింగమూర్తిని చేసి, నైవేద్యం వండి, పూజ చేస్తారు. అఖండ జ్యోతిని తీసుకొని భక్తి పాటలు పాడుతూ హనుమాన్ల గుడికి వెళ్తారు. అక్కడ హనుమాన్ దేవునికి ప్రదక్షిణ చేసి, కొబ్బరికాయ కొట్టినట్లయితే పూజ ముగిస్తుంది. అఖండ జ్యోతిని చేసిన గోధుమపిండిలో బెల్లం వేసి బెల్లప్పాలు చేస్తారు. దేవున్ని ఎత్తిన తరువాత అక్కడ ముగ్గు వేస్తాడు. దేవుని ముందు అప్పాలు సమర్పించి నీళ్లు ఆరపోసి మొక్కుకుంటారు. బెల్లప్పాలను తుంపి ఫలహారంగా అందరికీ పంచుతారు’’.
5.2. శుక్రవారం పూజ - విధానం
పెరిక వారు ప్రత్యేకంగా శుక్రవారం దేవత లేదా శుక్రవారం అమ్మవారి పూజలు చేస్తారు. ఈ పూజను కొందరు ‘కోత పూజ’ అని కూడా అంటారు. కారణం ఈ పూజ రోజు కొందరు ఆర్థిక స్థోమతను బట్టి మేక లేదా కోడిని కోసి పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం దేవత జన్మించినప్పుడు పెరికల గురువైన బండారు భక్తుల పాటతోనే ఆ దేవతను మెప్పిస్తాడు. అందుకే అప్పటి నుండి బండారు భక్తులు పూజారులుగా శుక్రవారం దేవతను కొలువడం ఆరంభించారు.
ఈ శుక్రవారం పూజను పెరికలు చేయడానికి ఒక కథ ఉన్నది. ‘‘ఒకరోజు ఒక పెరిక కులస్థుడు వ్యవసాయం చేస్తుండగా ఆ ప్రక్కనే మహర్షులు యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడికి అతను వెళ్ళి ప్రసాదం పెట్టమని అడిగాడు. దానికి వారు తిరస్కరిస్తారు. అందుకు అతను గంగానది తీరం పోయి నలభై ఒక రోజులు తపస్సు చేస్తాడు. శంకరుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమని అంటాడు. మీరు మా కులం వారిచే పూజలందుకొని మమ్ములను బాగా చూసుకోవాలని వేడుకుంటాడు. దానికి శంకరుడు నేను మీ చేత పూజలందుకుంటానని వరమిచ్చాడు. ఆ ప్రకారంగా అతను శంకరునికి గడ్క, బూరెలు నైవేద్యంగా పెడ్తాడు. ఆ విధంగా శంకరుడు పెరికలచే పూజలందుకుంటూ వారికి తగిన వరాలు ఇచ్చేవాడు. ఇలా కొన్ని నెలలు, సంవత్సరాలు గడిచి పోయిన తర్వాత పార్వతి అమ్మవారికి కోపం వచ్చింది. పెరికలు వ్యవసాయం చేస్తూ సాయంత్రం ఇంటికి వచ్చి శివున్ని ఆరాధించేవారు. పార్వతీదేవి కోరిక మేరకు ఒకరోజు శంకరుడు సతీసమేతంగా సాయంత్రం భూలోకానికి వస్తుండగా దారిలో గొర్రెలు, కోళ్ళు, మేకలు పార్వతీ అమ్మవారికి కదిలే పుష్పాల్లాగా కనిపిస్తాయి. భూలోకం రాగానే పార్వతి అమ్మవారు ఆదిశక్తిగా మారి వాటన్నింటిని ఆరగిస్తుంది.
ఇందుకు చింతించిన పెరికలు మళ్ళీ శివుడితో మొరపెట్టుకుంటారు. ఆ మొరను ఆలకించి, శంకరుడు సంపద కోసం తపస్సు చేస్తాడు. శంకరుని తపస్సు వల్ల లక్ష్మీ అమ్మవారు భూలోకం వస్తుంది. ఇలా వచ్చిన అమ్మవారు రెండు రకాల పూజలు అందుకుంటానంటుంది. అప్పటి నుండి పెరికలు కొందరు పాలపూజలో లక్ష్మీ అమ్మవారిగా, మరికొందరు శక్తిపూజ అమ్మవారిగా కొలుస్తుంటారు.
మొట్టమొదటగా శుక్రవారం నాడు ఈ అమ్మవారిని పెరికలే పూజించినారు కాబట్టి ఈ దేవతకు శుక్రవారం దేవత అని పేరు వచ్చింది. కాలానుక్రమంగా మిగతా కులాల వారు కూడా శుక్రవారం దేవతను ఆరాధిస్తున్నారు’’.4
ఈ పూజను సంవత్సరానికి గాని మూడు సంవత్సరాలకు గాని చేసుకుంటారు. పూజకు రెండు కనుములు అంటే రెండు రైక బట్టలు, తెల్ల తువ్వాల, కొబ్బరికాయలు, కుడుకలు, పోకలు, ఖర్జూరాలు, ఊదిపండు, పండ్లు శ్రీగంధం, గుగ్గిలం, మైసాక్షి, ఉపయోగిస్తారు.
పూజారి పూజలో భాగంగా పూజ గదిలో మొదట అలికి బియ్యం పిండి పసుపు కుంకుమతో అష్టాక్షరీ ముగ్గు వేస్తాడు. దాని మీద పీఠ వేసి పసుపుకుంకుమ బొట్లు పెట్టి ఆదిశక్తి అమ్మవారి ప్రతిరూపాన్ని నిలిపి పూలు పండ్లు విభూది సమర్పిస్తారు. ‘ఘటంకుండ’ (కల్లు కుండ) పూదిచ్చి, అమ్మవారి ముందు ఉంచుతారు. ఆ తరువాత మేకపిల్లను జడత పట్టిచ్చి కోస్తారు. తర్వాత లింగమయ్యను గోధుమ పిండితో చేసి బొట్లు పెట్టి అమ్మవారి దగ్గర నిలుపుతారు. భక్తి పాటలు పాడి కొలుస్తారు. పూజా అనంతరం లింగం ఆకారంలో చేసిన గోధుమ పిండిని అక్కడికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పెడతారు. ఈ వండిన అన్నం కూరను దేవుని ముందు పెట్టి మొక్కుతారు.
5.3 పాలపూజ - విధానం
బండారు భక్తులు శుక్రవారం పూజలో భాగంగా పాలపూజ కూడా చేస్తారు. ఇది సాయంత్రం మొదలయ్యి రాత్రి పన్నెండు గంటల వరకు పూర్తవుతుంది. ఈ పూజకు ఇంట్లో దేవుని మూలన అలికి బియ్యం పసుపు కుంకుమలతో పంచాక్షరీ ముగ్గు వేస్తాడు. దానిమీద పీటను వేసి తెల్లని గుడ్డను పరిచి వడ్లుగాని, బియ్యంగాని పోస్తారు. దానిపై శక్తి అమ్మవారిని ప్రతిష్టించి గోధుమ పిండితో లింగం ఆకారంలో లింగమయ్యను చేసి, పీట మీద ప్రతిష్టించి పసుపుకుంకుమతో అలంకరిస్తారు. అమ్మవారికి ప్రత్యేకంగా బక్షాలు చేసి సమర్పించి మొక్కుకుంటారు. దంపతులు పంచామృతాలతో లింగంనకు అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి భక్తి పాటలు పాడతారు. తీర్థ ప్రసాదాలు, ‘సిరా’ గాని ‘పరమాన్నం’ గాని నైవేద్యంగా దేవతలకు సమర్పించి పూజ ముగిస్తారు.
6. ఉపసంహారం
- వాస్తవానికి భండారు భక్తులు జానపద వృత్తి గాయకులు. పూర్వకాలంలో వారు తమ కట్టడి గల గ్రామాలకు వెళ్లి పెరిక కులం వారికి సంబధించిన కుల పురాణాన్ని ప్రదర్శించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.
- కరీంనగర్, వరంగల్ జిల్లాలో వీరి ఉనికి ఉన్నందున ఆయా ప్రాంతాలలో ఉన్న పెరికలకు మాత్రమే బండారు భక్తుల గురించి అవగాహన ఉన్నది. మిగతా జిల్లాలో ఈ తరం యువతకు వీరు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే బండారు భక్తుల కళారూపం అంతరించి పోయే స్థితిలో ఉన్నది.
- ఇప్పుడు మిగిలి ఉన్న ఒకరిద్దరు కళాకారులు కూడా కథల ప్రదర్శనకు ఇష్టపడుటలేదు. కేవలం వారు గురువు స్థానానికే పరిమితమై పెరికలు జరుపుకునే పూజాదికాలు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
- కాబట్టి ఇప్పటికైన బండారు భక్తులు ప్రదర్శించే స్కాందపురాణం లేదా పెరిక పురాణం డాక్యుమెంట్ చేసి భద్రపరచాల్సిన ఆవశ్యకత ఉన్నది.
- ఈ దిశలో తెలుగు విశ్వవిద్యాలయం లేదా రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ముందడుగు వేస్తుందని ఆశిద్దాం.
7. సూచికలు
- పుల్లూరి ఈశ్వరయ్య, వయస్సు 55, బండారి భక్తులు, ధర్మపురి గ్రామం & మండలం, జగిత్యాల జిల్లా-ఇంటర్వ్యూ
- పుల్లూరి శంకరయ్య, వయస్సు 76, బండారి భక్తులు, వెంకట్రావుపేట గ్రామం, లక్షెట్టిపేట మండలం, మంచిర్యాల జిల్లా-ఇంటర్వ్యూ
- నగునూరి రామస్వామి, వయస్సు 70, బండారి భక్తులు, మోదల గ్రామం, లక్షెట్టిపేట మండలం, మంచిర్యాల జిల్లా-ఇంటర్వ్యూ
- పుల్లూరి శంకరయ్య, వయస్సు 76, బండారి భక్తులు, వెంకట్రావుపేట గ్రామం, లక్షెట్టిపేట మండలం, మంచిర్యాల జిల్లా-ఇంటర్వ్యూ
8. ఉపయుక్తగ్రంథసూచి
- ఈశ్వరదత్తు, కందుకూరి. శాసన శబ్దకోశం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాద్, 1967
- ప్రేమలత రావి, తెలుగు జానపద సాహిత్యం - పురాణగాధలు, తిలక్‌నగర్, హైదరాబాద్, 1983
- మధుకర్, కానుగంటి, చరిత్ర వాహినిలో పెరిక కులం. వాసిరెడ్డి పబ్లికేషన్స్, 2013
- రాజేశ్వరరావు, చింతల, ఆంధ్రప్రదేశ్ పెరిక వారి సాంఘిక సాంస్కృతిక జీవన సమీక్ష - పద్మజ్యోతి పబ్లికేషన్స్, 1986
- వెంకటేశ్వర్లు, నరిశెట్టి. పురగిరి క్షత్రియ (పెరిక) కులచరిత్ర - నరిశెట్టి పబ్లికేషన్స్ - 1998
- సీతారామానుజాచార్యులు, బహుజనపల్లి. శబ్ధ రత్నాకరం – స్కూల్ బుక్ అండ్ లిటరేచర్ సొసైటీ, మద్రాసు, 1947
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

