AUCHITHYAM | Volume-06 | Issue-09 | August 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
2. ‘తేర్’ నగరం: చారిత్రక అవలోకనం
చంద్రకాంత్ మునేశ్వర్
సహాయాచార్యులు, చరిత్రశాఖ,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎల్లారెడ్డి,
కామారెడ్డి జిల్లా, తెలంగాణా.
సెల్: +91 9989538243, Email: departmentofhistorygasc@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.07.2025 ఎంపిక (D.O.A): 28.07.2025 ప్రచురణ (D.O.P): 01.08.2025
వ్యాససంగ్రహం:
భారతదేశచరిత్ర ఆది నుండి మహోన్నత కీర్తికలిగి ఉంది. ప్రాచీన ప్రపంచనాగరికతలు విలసిల్లిన కాలంలోనే ప్రపంచ నాగరికతలకు సమంతర కాలంలోనే మన భారత ఉపఖండంలో మూల భారతీయ నాగరికత సింధు నదిలోయ నాగరికత విలసిల్లినది. భారతదేశంలో ప్రాచీన నాగరికతకు సంభందించిన అనేక చారిత్రక ఆనవాళ్లను మనం భారత ఉపఖండం అంతట చూడవచ్చు. ప్రస్తుత వ్యాసం ‘తేర్’నగరం:ఒక చారిత్రక అవలోకణం అనే అంశం పైన కేంద్రికరించబడింది. తేర్ నగరం భారతదేశ ప్రాచీన చరిత్రకు, ప్రాచీన భారత అంతర్జాతీయ వర్తక వాణిజ్య ప్రగతికి శ్రేయస్సుకు చిహ్నం ముఖ్యంగా శాతవాహనుల కాలం నాటి పరిశ్రమలు, విదేశీ వర్తక వాణిజ్య పరంగా ప్రాచీన భారతదేశం ఎంత వరకు అభివృద్ధి చెందిందో ఈ తేర్ (తగరనగరి), సువర్ణ నగరం మనకు తెలియచేస్తుంది. నేటి మహారాష్ట్ర రాష్ట్రలోని ఉస్మానాబాద్ (ధారశివ్) నుండి కేవలం 32 కిలోమీటర్ల దూరంలో ఈశాన్య దిక్కున ఉన్న తేర్ శాతవాహన కాలంలో 'తగరనగరి'గా ప్రసిద్ధి చెందింది. తేర్ నాటి శాతావాహనుల కాలం నాటి, నేటి మహారాష్ట్రలోని అతి పురాతననగరం. నేడు ఒక గ్రామం తేర్ణ నది ఒడ్డున ఉంది. ప్రస్తుత పరిశోధన వ్యాసం తేర్‌లో జరిగిన తవ్వకాలు, అక్కడ లభించిన వివిధ రకాల పురావస్తు అవశేషాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. పురాతన కాలంలో తేర్ వాణిజ్య కేంద్రంగా ఎలా ఉద్భవించింది? దీని గురించి ఈ వ్యాసంలో చర్చించబడింది. తేర్ లో ఉన్న నిర్మానాలు, పురావాస్తు సేకరణలు, బౌద్ధ స్థూపాలు, జైన మరియు వైదిక ఆలయాల గురించి వివరణాత్మక సమాచారం ఇవ్వబడింది. తేర్ నగరం లోని అద్భుతమైన ఆలయ శిల్పా సంపద కల్గిన త్రివిక్రమ ఆలయం, సంత్ కవి శ్రీ గోరా ఖుంభార్ సమాధి ఆలయం, నీళకంఠేశ్వర/కాళేశ్వర్ ఆలయం, ఉత్తరేశ్వర్ ఆలయాలు ఉన్నాయి వాటి గురించి ఇక్కడి శిల్పకళా ఖండాలా గురించి వాటి కాలం గురించి, పురావస్తు సంగ్రహాలయం, తేర్ పర్యాటకం, పురాతన వారసత్వ సంపదను కాపాడడం, పర్యాటక దృష్టితో ప్రస్తుత వ్యాసంలో చర్చించబడింది. తేర్ నగరి పైన అనేక పరిశోధనలు జరిగాయి, నా ఈ పరిశోదన పత్రము యొక్క ముఖ్య ఉద్యేశం ‘తేర్ చారిత్రక ప్రాముఖ్యత’ గురించి చారిత్రక కోణంలో విషయాలు తెలియ పరచడము. తేర్ వారసత్వ సంపద ప్రాముఖ్యత ను వివరించడము. నా ఈ పరిశోధన రచన విధానము పరిశోధన పద్ధతి ప్రాథమిక ఆధారాలు మరియు ద్వితీయ ఆధారాలను ప్రామానికంగా తీసుకొని పరిశోధన పత్రం సమర్పిస్తాను.అందుబాటులో ఉన్న అనేక రచనలనలను సేకరిస్తాను. చారిత్రక రచనలు, పురావస్తు నివేదికలు,ప్రముఖ చరిత్రకారుల రచనలు, పురావస్తు అధికారుల నివేదికలు, పరిశోధన గ్రంధాలు, రాజ్యభిలేఖ పరిశోధన ఆలయాలలో దొరుకు సమాచారం, ప్రభుత్వ రికార్డులు, ప్రముఖ దినపత్రికలలో అచ్చు అయిన సమాచారము, క్షేత్రపర్యటన ద్వారా, స్వయంగా కావలసిన విషయాలు స్థానికుల నుండి సేకరించిన ప్రాథమిక సమాచారంను ఆధారముగా చేసుకొని పరిశోధన సాగిస్తాను. నా ఈ పరిశోధన తేర్‌ను (తగర నగరి) గురించి అధ్యయనం చేస్తున్న తోటి పరిశోధకులకు మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాను.
Keywords: తగరనగరి,తేర్, కొండాపూర్, ప్రతిష్ఠనం, బరుకచ్చా, సువర్ణ నగరి,శంఖపూసలు, వాణిజ్యనగరం,శాసనాలు, చెక్కశిల్పం, బౌద్ధ చైత్యగృహం, జైనఆలయం, తెలియాడే ఇటుకలు, పురావస్తు తవ్వకాలు
1. ప్రవేశిక
భారత ఉపఖండ ప్రాచీన చరిత్ర ఉత్కృష్టమైనది ప్రఖ్యాతులు కలిగిన గొప్ప వారసత్వం కలిగి ఉంది. మౌర్య సామ్రాజ్య పతనానంతరం దక్షిణ భారత దేశంలో శాతవాహనులు పాలించిన కాలంలో నేటి మహారాష్ట్రలో ఒక అద్భుతమైన నాగరికత ఉద్భవించింది. శాతవాహనుల కాలంలో చారిత్రక వారసత్వం కలిగిన “తేర్ నగరం” గురించి చారిత్రక విదేశీ యత్రికుల, పురాతన గ్రంథాలలో “తగర నగరి”గా “సువర్ణ నగరి” గా ఒక అభివృద్ధి చెందిన ప్రాచీన అంతర్జాతీయ పారిశ్రామిక, వర్తక, వాణిజ్య నగరముగా గుర్తింపు పొందినది. పూర్వ కాలం నుండి మౌర్యుల సామ్రాజ్య పతనానంతరం దక్షిణ భారత దేశంను సాతవాహనులు, వాకటాకులు, చాలుక్యులు, రాష్ట్రకూటులు, యాదవుల, బహమని సుల్తాన్లు, మొఘల్ పాలకులు మరియు మరాఠా, అసఫ్ జాహి (నిజాం) పాలకుల కాలంలో కూడ తేర్ ఒక చారిత్రక వారసత్వ సంపద కలిగి ఉన్న నగరముగా పేరు ప్రఖ్యతులు పొందినది. శాతవాహనుల కాలంలో ‘తగర నగరి’ తేర్ నుండి విదేశాలకు అంతర్జాతీయ వార్తక వాణిజ్యం జరిగింది. ప్రాచీన భారతదేశంలోని అభివృద్ధి చెందిన పారిశ్రామిక నగరం మహారాష్ట్ర రాష్ట్రం ఉస్మానాబాద్ (ధారాశివ్) జిల్లాలోని 'తేర్'. ఉస్మానాబాద్ నుండి కేవలం 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేర్ ( తగర నగరి) శాతవాహనుల కాలంలో 'తగర నగరి'గా ప్రసిద్ధి చెందింది. తగరి అపబ్రంశ భాష పదం నేడు తేర్ గా మారింది. మహారాష్ట్రలో అతి ప్రాచీన పురాతన నగరం. నేడు ఒక గ్రామం ఈ గ్రామం తేర్ణ నది ఒడ్డున ఉన్నది.
ఈ నగరం క్రీ.పూ. 200 నాటి నుండి ఉన్నదని సమకాలీన సాహిత్య, పురావస్తు రికార్డులు, పాశ్చాత్య యాత్రికుల, చరిత్రకారుల రచనల వృత్తాంతాల ప్రకారం లభించిన సమాచారం ఆధారంగ చేసుకొని తేర్ నగరం గురించి వివిధ చారిత్రక, పురావస్తు అంశాలు వెలుగులోకి రావడం ప్రారంభించడంతో ఆసక్తి ఉన్న చరిత్ర, పురావస్తు శాఖ పరిశోధకులు కొత్త కొత్త సమాచారాన్ని వెలుగు లోకి తేవడానికి తేర్ లోని చరిత్రక, పురావస్తుకు సంబంధం ఉన్న కొత్త అంశాలను వెలికి తీసే ఉద్యేశంతో పరిశోధన ఆవిష్కరణల పై దృష్టి పెట్టడం ప్రారంభించారు. తేర్ లోని పురావస్తు దిబ్బలను సందర్శించిన మొదటి వ్యక్తి తేర్ యొక్క చరిత్రను పురావస్తు శాస్త్రంను ఆధారంగా చేసుకొని వెలుగులోకి తెచ్చిన గౌరవం బ్రిటిష్ పరిశోధకుడు హెన్రీ కజిన్స్‌కు దక్కాలి. కజిన్స్ 1901లో తేర్‌ను సందర్శించారు మరియు తేర్ లోని మట్టి దిబ్బలను అధ్యయనం చేసిన తర్వాత 1902-1903 ‘బ్రిటిష్ ఇండియన్ ఆర్కియాలజికల్ ఇయర్’బుక్‌లో ఒక వివరణాత్మక వ్యాసం రాశారు ఇది పరిశోధకులకు ఆసక్తిని ఇచ్చింది తేర్ చరిత్రను ఇంకా పరిశోదించి కొత్త విషయాలను వెలుగులోకి తేవడానికి పరిశోధన ఆవిష్కరణవైపు కొత్త పరిశోధకులను ఆకర్షించింది. ఇందులో బ్రిటిష్ అధికారి ఫిల్ట్ పాల్గొనడం కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించాలి. ఎందుకంటే తన పరిశోధనల ఆధారంగా అతను తన అభిప్రాయాన్ని మార్చుకుని పురాతన ‘తగర’ నగరం నేటి తేర్ అని అది ఒక ప్రాచీన అంతర్జాతీయ పారిశ్రామిక, వర్తక, వాణిజ్య కేంద్రం అని తన పరిశోధనల ద్వారా ప్రకటించాడు.

తేర్ పురావస్తు సైట్ మ్యాప్

తేర్ లో పురావస్తు తవ్వకాలలో దొరిన గాజు, నాణేలు

సబ్బు రాయి( Lime Stone) పుష్ప హారం
తేర్ చరిత్రను వెలుగులోకి తేవడానికి రెండవ ప్రయత్నం 1929-1930లో నిజాం ప్రభుత్వ పురావస్తు శాఖ అధికారి గులాం యాజ్దాని, ప్రొఫెసర్ హెచ్. కే. షేర్వాని ద్వారా జరిగింది. ఆ సమయంలో తేర్ లోని త్రివిక్రమ ఆలయ రక్షణ కోసం కొన్ని చర్యలు తీసుకున్నారు. అలాగే తేర్ లోని పురాతన పురావస్తూ వస్తువులను అధ్యయనం చేయడం కోసం హైదరాబాద్ కు పంపారు. దీని తరువాత 1958 లో డి. యన్. చాపేకర్ మరియు బెనర్జీ మొదటిసారి తేర్ లోని తెల్లటి మట్టి దిబ్బలపైన పురావస్తూ తవ్వకాలు మొదలు పెట్టారు. వారు తేర్ లో అతి ప్రాచీన పురాతన శాతవాహన స్థావరాన్ని కనుగొన్నారు. వారి తవ్వకాలు పరిమితం అయినప్పటికీ వారు శాతవాహన నాణేలు, శాతవాహన గృహాలు, మురుగునీటి వ్యవస్థ, చేదబావులు, బంక మట్టి పాత్రలు, చైనా మట్టి పింగాణి(కయోలిన్) తో చేసిన అద్భుతమైన శిల్పాలు, రోమన్ అవశేషాలు, పూసలు, గవ్వలు మొదలైన వాటిని పెద్ద ఎత్తున కనుగొన్నారు మరియు వారు తమ పరిశోధన ఫలితాలను 1969 లో తమ నివేదికను ప్రచురించారు. దీని తరువాత 1965-66 లో మరియు 1967-68 లో డాక్టర్ మోరేశ్వర్ దీక్షిత్ తేర్లో పెద్ద ఎత్తున పురావస్తూ తవ్వకాలు చేపట్టారు. శాతవాహనుల వారసత్వ సంపదను వెలుగులోకి తెచ్చే విషయమై పురాతన కాలం నాటి సర్వతోముఖ అభివృద్ధిని వెలుగులోకి తేవాలి అనే దృక్కోణం నుండి ఈ తవ్వకాలు ప్రారంభించారు.
ఈ పురావస్తు తవ్వకాలు అసాధారణమైన ఎంతో చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. దీని తరువాత 1975లో పూణేలోని దక్కన్ కళాశాలకు చెందిన డాక్టర్ శాంతారంగ్ బాలచంద్ర దేవ్ జరిపిన తవ్వకాలలో శాతవాహనుల కాలనీ ప్రదేశం కనుగొనబడింది. దానితో పాటు ఈ కాలనీ ప్రదేశం చుట్టూ ఉన్న చెక్క గోడ కనుగొనబడింది ఈ పరిశోధన సఫలం చెంది అనేక అంశాలతో కూడిన చరిత్రక అంశాలు, విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాటి విదేశీ యత్రికుల రచనలు నాటి శాతవాహన యుగ విశేషాలు, దేశీయా, అంతర్జాతీయ వర్తక వాణిజ్యంకు సంభందించిన అనేక విషయాల తెలుపుతూ తన నివేదికను ప్రచురించారు. ఈ నివేదిక సాక్షాధారాల మూలంగా అనేక విషయాలు అవగతం అయ్యాయి. విదేశీ రచయితలు ఐన మెఘస్థనిస్ మౌర్య కాలలో దక్షిణ భారత దేశ అనేక విషయాలు తన గ్రంథం ‘ఇండికా’ లో వివరించారు తర్వాత ప్లినీ, టోలోమి రచనలు దేశ కాల పరిస్థితులు, అంతర్జాతీయ వర్తక వాణిజ్య సంభందాల గురించి వాస్తవిక సమాచారం ఇచ్చాయి. చరిత్రకారులు,పురావస్తు అధికారులు కొత్త ఆవిష్కరణలను ‘తేర్’వద్ద వెలుగులోకి తేవడంతో విదేశీ రచనలకు బలం చేకూర్చే అనేక విషయాలు తెలియవచ్చాయి.
ఇందులో ఒకటైన ‘తేర్’ ‘తగర’ నగరి కోట గోడతో కనుగొనబడటం ద్వారా వాస్తవికత రుజువు అయ్యింది. ప్లీని ‘నేచరల్ హిస్టరీ’ రచనలో శాతవాహనులు ఒక పెద్ద సామ్రాజ్య నిర్మాతలు అని ఆ సామ్రాజ్యంలో ముప్పై కోట గోడల నగరాలు ఉన్నాయని చెప్పారు. అదేవిదంగా ‘తగర్’నగరి అనే పట్టణం నుండి విదేశీ వర్తకం అంతర్జాతీయ వాణిజ్యం జరిగేది అని ‘తగర’ నగరి అంతర్జాతీయ వర్తక కేంద్రం అని తెలిపారు. వాటిలో ఒకటైన ‘తగర’ నగరి కోట గోడతో కనుగొనబడడం ద్వారా వాస్తవికత రుజువు అయ్యింది. ఈమధ్య ఇక్కడ నిరంతరం పురావస్తు తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పురాతన నగరం గురించి నాటి దక్కన్ లోని భాదామి చాలుక్య రాజ్య సందర్శనకు ఆ కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ తన రచన సి. యు. కి రచనలో కూడా కనిపిస్తుంది. ఈ నగరం అంటే ‘తగర నగరి’ ఉచ్చ స్థితిలో, వైభవంగా ఉంది అని అభివృద్ధిలో ముందుంది అని తేర్ అభివృద్ధికి తేర్ నగర ప్రజల శ్రమ, ఉన్నత ప్రమానాలతో కూడిన ప్రజల జీవనవిధానం, నగర శ్రేయస్సు కు ప్రజల తోడ్పాటు అమూల్యమైనది అని అభివృద్ధిలో శిఖరాగ్రాన్ని చేరుకుంది అని ఇక్కడ బౌద్ధ చైత్య గృహం ఉంది ఇక్కడి ప్రజలు బౌద్ధ మత విశ్వాసకులు అని రాశారు. బౌద్ధ ఆరాధ్య కేంద్రం తో పాటు వైదిక మత విశ్వాసకులకు కూడ పవిత్ర నగరం. అంతర్జాతీయ వర్తక వాణిజ్యం ‘తగర నగరి’ నుండి జరగడం మూలాంగా శాతవాహనుల ఆర్థిక రాజధానిగా పిలిచేవారు. ఈ మధ్య 2014-15 సంవత్సరంలో డా., మాయ.జె. పాటిల్ గారు ఇక్కడ పురావస్తూ తవ్వకాలు చేశారు వీరి పర్యవేక్షణలో ఇక్కడ లభించిన గాజు వస్తువులు, బంక మట్టి బొమ్మలు, పెంకులు, దంతపు అలంకరణ వస్తువులు, పూసలు, మేడలో వేసుకొను హారాలు, ఏనుగు దంతంపై గీసిన బొమ్మలు, రోమ్ రాజ్య నాణాలు వివిధ వస్తువులను పరిశీలన చేసారు పరిశోధన చేసి నాటి శాతవాహనుల అంతర్జాతీయ వర్తకం రోమ్ తో విరివిగా జరిగింది అని దొరికిన నాణేలను ఆధారంగా చేసుకొని చెప్పారు. చరిత్ర కాలగతిలో కాలక్రమంలో శుష్క వాతావరణం మరియు కరువు కాటకాల కారణంగా ఈ ‘తగర నగరి’ వాణిజ్య నగరి పురాతనమైన వ్యాపార కేంద్రం, సంస్కృతి నిలయం క్రమంగా క్షీణించింది.
2. పురాతన అవశేషాలు
తేర్ గ్రామానికి 2 (రెండు) వేల సంవత్సరాల కాలం నాటి పురాతన వారసత్వం కలిగిన చరిత్ర ఉంది. తేర్‌లో జరిపిన తవ్వకాలల్లో అనేక పురాతన వస్తువులు, పురావస్తు, చారిత్రక అవశేషాలు కనుగొనబడ్డాయి. మ్యూజియం కొత్త భవన నిర్మాణ పునాది తవ్వకము జరుగుతున్నప్పుడు అతి పురాతన ఇటుకలతో నిర్మించిన బావి అదేవిదంగా తేర్ణ నది పైన ఆనకట్ట అవశేషాలు కనుగొనబడ్డాయి. ఇది ఆ కాలపు పరిపూర్ణమైన అభివృద్ధి చెందిన నాగరికతకు, నాటి మనిషి మేధాస్సుకు, శాస్త్ర విజ్ఞాన అభివృద్ధికి, విజ్ఞానవంతమైన నాగరికత అభివృద్ధికి, అభివృద్ధి చెందిన ప్రజల బుద్దికుశలతకు మేధస్సు పరిజ్ఞానంకు నిదర్శనం, నిర్మాణాలకు ఇటుకలను వాడడంతో అర్థమతుంది. నాటి నిర్మానాలు కాల్చిన ఇటుకలను వాడి నిర్మించబడినవని పురావస్తు ఆనవాళ్లు తెలుపుతున్నాయి.
పరిశోధన అధ్యయనాల మూలంగా పరిపూర్ణ పరిశోధనల ద్వారా మాత్రమే నాటి అనేక విషయాలు పురావస్తూ అవశేషాలను ఆధారంగా చేసుకొని, పరిశోదించడం ద్వారా స్పష్టంగా అవగతం అవుతున్నాయి. పురావస్తూ సంగ్రహాలయ నిర్మాణం పునాది తవ్వకాల సమయంలో కుమ్మరి పెంకులు, నాటి మానవులు వాడిన వస్తువులు,ఇసుర్రాయి, రోలు, అలంకరణ వస్తువులు, అవశేషాలు, శంఖం, పూసలు మొదలైన వస్తువులు కనుగొనబడ్డాయి. అవి శాతవాహన కాలం నాటివని ప్రాథమికంగా అంచనా వేయబడింది. ఈ పురావస్తూ గ్రామం శాతవాహన యుగ కాలం నాటి పురాతన నాగరికత అవశేషాలకు ప్రసిద్ధి చెందింది. శాతవాహన కాలం నాటి ఇటుకలతో నిర్మించిన ఇళ్ళు, మురుగునీటి వ్యవస్థ, శాతవాహన రాజుల నాణేలు, అనేక మట్టి విగ్రహాలు (టెర్రకోట), పూసలు, విగ్రహాలు, పురుషులు, స్త్రీలకు సంభందించినవి అలంకరణ ఆనవాళ్లు అద్భుతమైన నాటి కళా పరిపూర్ణతకు, కళా నైపుణ్యతకు నిదర్శనంగా ఉన్న అలంకరణ చిత్రాలు, రంగురంగుల రాతి, మానవ చిత్రాలు, ప్రకృతి చిత్రాలు, గాజు పూసలు, సీల్స్, అద్భుతమైన చెక్కడాలతో కూడి ఉన్న స్థూపాల స్తంభాలు, స్తూపాల పైన చెక్కిన అద్భూత కళా ఖండాలు, ఏనుగు దంతాలపై గీసిన చిత్రాలు, రోమన్ నాణేలు, గాజు వస్తువులు, కర్ర పైన కార్వింగ్ పనితనము, లజ్జ గౌరీ, నీటి పైన తేలి యాడే ఇటుక టెర్రకోట పనితనం టెక్నాలజీ వాడకం నాటి కళాకారుల శాస్త్ర విజ్ఞన అభివృద్ధికి అద్భూ త సృష్టికి నైపుణ్యతకు నిదర్శనం అనేక ఇతర వస్తువులు మరియు అవశేషాలు మునుపటి నుండి నేటి వరకు జరిపిన పురావస్తు త్రవ్వకాల్లో కనుగొనబడ్డాయి.

టెర్రకోట లజ్జ గౌరీ సీల్స్
3. తేర్- పురాతన వాణిజ్య కేంద్రం
శాతవాహన కాలంలో తేర్ ఒక ప్రసిద్ధ అంతర్జాతీయ వాణిజ్య నగరంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ‘తేర్’ ‘తగర నగరి’ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు అదేవిదంగా వివిధ దేశాలతో అంతర్జాతీయ వ్యాపారం జరిగేది ముఖ్యంగా రోమ్ వంటి సామ్రాజ్యాలతో వార్తక,వాణిజ్యం తేర్ నుండి విరివిగా జరిగింది. రోమ్ నుండి భారతదేశానికి బంగారం, ద్రాక్ష మధుపాణం వివిధ వస్తువులు దిగుమతి చేయబడ్డాయి, అదేవిదంగా భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాలు, నూలు రకరకాల వస్తువులు ఎగుమతి చేయబడ్డాయి. తేర్ వద్ద తవ్వకాలలో 6 అంగుళాల పొడవు ఉన్న మట్టిబొమ్మ లేదా స్త్రీ విగ్రహం కనుగొనబడింది. ఇటలీలోని పురాతన పాంపీ గ్రామంలో ఇలాంటి బొమ్మ కనుగొనబడింది ఇది పురాతన ‘తగర’ ‘తేర్’ నగరం ద్వారా గ్రీకు-రోమన్ రాజ్యంలతో వర్తక, వాణిజ్యం జరిగింది అని ఇది ఇరు దేశాల మధ్య వర్తక, వ్యాపార అభివృద్ధికి సూచిక అని తెలిపే ఆధారం. చాలా మంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం తేర్ రోమ్‌తో వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. శాతవాహన కాలంలో చక్కటి మస్లిన్, పట్టు వస్త్రం, గోమెదికం (ఓనిక్స్), ఏనుగు దంతాలు మొదలైన విలువైన వస్తువులను బడోచ్ గుజరాత్ ద్వారా విదేశాలకు ఎగుమతి చేశారు. ఆ సమయంలో బడోచ్‌ను బరుకాచ్చ అని పిలిచేవారు. శాతవాహన కాలంలో ఈ తేర్ నగరం తెలంగాణా లోని మెదక్ కొందరుపూర్ గుజరాత్ లోని జున్నార్ మహారాష్ట్ర లోని పైఠాన్ (ప్రతిష్ఠాన్) నగరాలతో అనుసంధానించబడింది. ఇది శాతవాహన కాలంలో మాత్రమే కాకుండా అంతకు ముందు మౌర్య కాలంలో కూడా ప్రసిద్ధి చెందిన వ్యాపార అనుసంధాన మార్గం. మౌర్యుల కాలంలో ప్రబలంగా ఉన్న నల్లని మెరిసే మట్టి పాత్రలను ఆ ఆ ప్రదేశాలలో కనుగొనడం మూలంగా పురావస్తూ ఆధారాలను ఆధారంగా చేసుకొని పరిశోధకులు స్పష్టంగా తెలిపారు. 'పెరి ప్లస్ ఆఫ్ ది ఎరిత్రేయన్ సీ' అనే పుస్తకాన్ని రాసిన అనామక గ్రీకు రచయిత క్రీ.శ. మొదటి శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించాడు. దక్షిణ భారతదేశ వాణిజ్యం, సముద్ర మార్గాలు మరియు ఓడరేవుల గురించి ఆయన వివరణాత్మక సమాచారాన్ని అందించారు. ఆయన ‘తగర’ నగరము గురించి అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంమని కూడా పేర్కొన్నారు. తేర్ శాతవాహనుల ఆర్థిక రాజధాని అని స్పష్టంగా రాశాడు. టోలోమి తన ‘జియోగ్రఫీ’ రచన లో కూడ అనేక వ్యాపార వాణిజ్య సంభంద విషయాలు తెలిపారు. పురావస్తూ పరిశోధనల ఫలితాలు కూడ ఈ విషయాన్ని రుజువు చేసాయి. అనేక పురావస్తు ఆనవాళ్లు కూడ దీనికి బలం చేకూర్చే విదంగా రుజువులు అందించాయి.

సాతవాహన నాణేము, రోమన్ నాణెం
4. తేర్ పురావస్తు సంగ్రహాలయము

తేర్ పురావస్తు సంగ్రహాలయం

టెర్రకోట బొమ్మలు
తేర్ లో ఉన్న శ్రీ రామలింగప్ప ఖండప్ప లామతురే పురావస్తూ మ్యూజియం సందర్శించదగినది. ఈ మ్యూజియంలో పురాతన శాతవాహన జీవనశైలికి సాక్ష్యమిచ్చే అనేక కళాఖండాలు ఉన్నాయి. ఇందులో పురాతన కాలం నాటి వివిధ లోహాలతో చేసిన పురాతన నాణేలు, విదేశీ నాణేలు ఉన్నాయి.

ఏనుగు దంతం పై చెక్కిన స్త్రీ మూర్తి
ఈ మ్యూజియంలో శాతవాహన కాలం నాటి వివిధ వస్తువులు కుండలు, రాతి విగ్రహాలు, జంతువుల చిత్రాలు, పథకాలు, రాతి శాసనాలు, రాగి ఫలక శాసనాలు, ఇత్తడి రేకు శాసనాలు, వెండి రేకు శాసనాలు, తామ్రా పత్ర శాసనాలు,గాడిద తలలు, ఏనుగు దంతాల చెక్కడాలు, శంఖు, ముత్యాలు, మట్టి గాజులు, పురాతన దంతపు విగ్రహాలు, లజ్జ గౌరీ విగ్రహాలు, రాశిచక్ర గుర్తులు, నీటిలో తేలియాడే ఇటుకలు, కార్తీకేయ విగ్రహాలు, వివిధ గృహ ఉపకారణాలు మరియు కవచంతో ఉన్న ఏనుగు విగ్రహాలు, బంక మట్టి బొమ్మలు, (చీని) పింగాణి మట్టి వస్తువులు, బౌద్ధ విగ్రహాలు అవశేషాలు, జైన విగ్రహాలు అవశేషాలు, కార్ర ఆస్తువులు, టెర్రకోట ముద్రలు మొదలగునవి ఈ మ్యూజియంలో చూడవచ్చు.

మ్యూజియలో శంకులు
ఈ మ్యూజియంలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆరవ-ఏడవ శతాబ్దపు ఉత్తరేశ్వర్ ఆలయం యొక్క చెక్క ఛత్రం. ఆలయం యొక్క గర్భగుడి ఛత్రం చాలా సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరక అక్కడే ఆలయం దగ్గర బురదలో పడి ఉంది దానిని శ్రీ రామలింగప్ప ఖండప్ప లామతురే గారు సేకరించి పురావస్తు శాఖ వారికి అప్పగించారు. పురావస్తు శాఖ వారు గర్భ గుడి ఛత్రం పై పరిశోధన చేసి మ్యూజియంలో భద్రంగా ప్రజల సందర్శనార్థం ఉంచింది. విదేశీ ప్రయాణికులు, యాత్రికులు తన తేర్ గ్రామానికి వచ్చి ఇక్కడి నుండి పాత వస్తువులను తీసుకెళ్లడం చూసి యువ వయస్సులో ఉన్న రామలింగప్పకు ఆసక్తి కలిగి వీటిపై పరిశోధన చేసే ఉధ్యేశంతో పరిష్కారం కనుగొన పురావస్తు వస్తువుల విలువను గురించి తెలుసుకొగోరి తమ గ్రామ ప్రధానోపాధ్యాయుడిని పురావస్తు వస్తువుల గురించి ఆసక్తిగా అడిగినప్పుడు ప్రధానోపాధ్యాయుడు రామలింగప్పకు గ్రామ చరిత్ర మరియు తన దగ్గర ఉన్న వస్తువుల చారిత్రక ప్రాముఖ్యత గురించి వివరంగా చెప్పాడు. ఆ తర్వాత రామలింగప్ప పురావస్తూవుకు సంబందించిన వస్తువులను సేకరించడం ప్రారంభించాడు. క్రమం క్రమంగా గ్రామస్తులు కూడ తమకు దొరికిన వస్తువులను రామలింగ్గప్ప గారికి ఇవ్వడం ప్రారంభించారు. ఈ విధంగా రామలింగప్ప సేకరణ పెరిగింది. అతను తన జీవితాంతం సేకరించిన పురావస్తువులను అన్నింటిని క్రీస్తు శకం 1972లో ప్రభుత్వానికి అప్పగించాడు. వీటన్నిటిని భద్రపరచడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి వీటి భద్రత ప్రదర్శన కొరకు మహారాష్ట్ర పురావస్తూ శాఖ వారి పర్యవేక్షణలో ప్రభుత్వం రామలింగప్ప గారి సేవలను గుర్థిస్తూ ఆయన గౌరవార్థం ఆయన పేరుతో తేర్ లో మ్యూజియం నిర్మించినది. శ్రీ రామలింగప్ప ఖండప్ప లమాతురే మ్యూజియం నిర్మించి పురావస్తువులను ఇందులో భద్రపరచి పురావస్తూ శాఖ వారి ఆదీనంలో పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతతో మ్యూజియంను చరిత్ర, పురావాస్తు విద్యార్థులకు, పరిశోధకులకు, చరిత్రకారులకు, యాత్రికులకు, ఔత్సహిక సందర్శకులకు ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచింది.

రుబ్బు రాయి
5. తేర్ నగరి - బౌద్ధ స్థూప, చైత్య గృహ నిర్మాణం
తేర్ సమీపంలోని మస్కే అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో లభించిన బౌద్ధ స్థూపం యొక్క అవశేషాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ చైత్యగృహం (Apsidal) అర్ధగోలాకారపు వృత్తాకారంలో ఉంటుంది వంపుతిరిగిన కోస వైపున ఒక స్థూపం ఉంది. ఇక్కడి చైత్యగృహం 9 మీటర్ల పొడవు మరియు 5.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. కాల్చిన ఇటుకలతో నిర్మించబడింది. చైత్యగృహం ప్రవేశ ద్వారం చెక్కతో నిర్మించబడి ఉంటుంది మరియు వెనుక సెమీ-స్తంభం దగ్గర ఉన్న స్థూపం యొక్క వ్యాసం 1.25 మీటర్లు. పురావస్తూ తవ్వకంలో లభించిన ఇటుక స్థూపం మరింత ముఖ్యమైనది. ఈ పురావస్తూ తవ్వకాన్ని 1968లో పురావస్తు శాఖ డైరెక్టర్ మాధవ్ గోపాల్ దీక్షిత్ అనే పురావస్తు శాఖ అధికారి నిర్వహించారు. ఈ స్థూపం యొక్క నిర్మాణ ప్రణాళిక అర్ద గోలకారపు వృత్తాకార చక్రంలా కనిపిస్తుంది. స్థూపం యొక్క వ్యాసం 26 మీటర్లు. నేడు మొత్తం స్థూపం మిగిలి లేదు కింద 29 ఇటుక స్థూపాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్థూపం లోపలి భాగం భాగాలుగా విభజించబడి ఉంది అవి ఇటుక ముక్కలు మరియు మట్టితో నింపబడి ఉన్నాయి. స్థూపం చుట్టూ 5.30 మీటర్ల వెడల్పు గల ప్రదక్షిణ ప్రథం (మార్గం) ఉంది. అమరావతి వద్ద ఉన్న స్థూపం వలె, నాలుగు ప్రధాన దిశలలో నాలుగు స్తంబాలు ఉన్నాయి, వాటిపై ఆయక స్తంభం ఉంది, స్థూపం యొక్క ఉపరితలం షహబాది గ్రానైట్ (శాబాద్)రాళ్లతో తయారు చేయబడింది. తేర్ వద్ద ఉన్న స్థూపం యొక్క పీఠం లేదా వేదికపై ఉన్న రాతి శిల్పాలు అమరావతిలోని ప్రసిద్ధ శాతవాహన ప్రదేశాలలో కనిపించే శిల్ప శైలిని గుర్తుకు తెస్తాయి. సందర్శకుడికి అమరావతి స్థూపం వలే చూడ ముచ్చటగా ఉంటుంది. ఇక్కడి స్థూపం యొక్క అన్ని లక్షణాలు దక్షిణాది స్థూప నిర్మాణంతో సారూప్యతను కలిగి ఉంటుంది. శాతవాహనుల యొక్క వాస్తు కళ అమరావతి వాస్తు కళను కల్గి ఉన్నది. ఇటుకలతో స్థూపాలను నిర్మించే పద్ధతి ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిచెంది తరువాత కాలంలో తూర్పుకు వ్యాపించింది. తేర్ వద్ద ఉన్న స్థూపాలు మరియు రాతి చైత్య గృహ ఆశ్రమాల నిర్మాణంలో ఇటుకలు మరియు కలపను ఉపయోగించినట్లు ఇక్కడ పురావస్తు అవశేషాలు బయటపడటం ద్వారా తెలియవాస్తున్నది. నాటి శాతవాహన కళాకారుల నైపుణ్యతకు నూతన వాస్తుకళ తృష్ణకు నిదర్శనంగా ఉన్న అనేక బౌద్ధ వారసత్వ వాస్తు కళా ఖండాలు ఇక్కడ అనేకం చూడవచ్చును.

బౌద్ధ చైత్యము
తేర్ నాడు బౌద్ధమతానికి కేంద్రంగా ఉన్నదని ఇక్కడ కనుగొనబడిన బౌద్ధ అవశేశాలా ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. బౌద్ధమతం ఇక్కడ దృఢంగా స్థిరపడింది. నాటి ఇక్కడి ప్రజలు బౌద్ధ మతాన్ని ఆచరించారు అని తెలుసు కోవచ్చును. తేర్లో నిర్మించబడిన అనేక బౌద్ధ స్థూపాలు, చైత్యాలు తేర్ పరిసర ప్రాంతం అంతటా వ్యాపించి ఉన్నాయి. శాతవాహన కాలం నాటి బౌద్ధ స్థూపాలు మరియు చైత్యాలు ఇక్కడ కనుగొనబడినందున ప్రాచీన కాలంలో తేర్ నగరం నాడు బౌద్ధమతానికి పట్టుకొమ్మ అని బౌద్ధ మత కేంద్రంమని తేర్ ఖ్యాతి కలిగిన బౌద్ధ వారసత్వ సంపద ఉన్న ముఖ్య ప్రాంతమని ప్రపంచ ప్రఖ్యత బౌద్ధ మత ప్రదేశాలలో ఒకటి అని అర్థం చేసుకోవచ్చును.

టెర్రకోట భోదిసత్వ
6. తేర్ లోని అద్భుతమైన దేవాలయాలు, శిల్పాలు
తేర్లో నాటి పురాతన ఆలయ శిల్పాలు, నాటి అత్భూత శిల్ప సంపదకు నిలయమైన వస్తువులు తేర్ వారసత్వ సంపదకు సాక్షి భుతమైన అనేక వాస్తు, శిల్ప, చిత్ర పురావస్తూ కళా ఖండాలను చరిత్ర కారులు, పురావస్తూ శాఖ వారు స్థానికుల సహాయ సాకారాలతో ఇక్కడ కనుగొనడం జరిగింది. ఇక్కడ లభించిన వివిధ శిల్పాలను వాటి లక్షణాలను ఆధారంగా చేసుకొని తేర్ ఇక్కడ అన్ని మతాలకు చెందిన ప్రజలు నివశించారు అని తెలిపే విషయాన్ని ఇక్కడ లభించిన కళాఖండాలు విశదపరుస్తూ తెలుపుతున్నాయి. ఈ తేర్ నగరంలో ఇక్కడ పురావస్తూ తవ్వకాలములంగా ఇక్కడ దేవాలయాలు, గుహలు మరియు స్థూపాలను కనుగొనడం చూడవచ్చు. పురాతన కాలం నాటి అనేక దేవాలయాలు ఇప్పటికీ తేర్ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్నాయి. తేర్ లో కొన్ని అద్భుతమైన ఆలయ శిల్పాలు నేటికీ కనిపిస్తాయి. అవి:
1). త్రివిక్రమ ఆలయం
తేర్ లో ఉన్న త్రివిక్రమ ఆలయం విశేషామైనది చాలా గొప్పది. త్రివిక్రమ అనేది శ్రీ మహా విష్ణువు యొక్క ఒక రూపం. ఈ త్రివిక్రమ ఆలయాన్ని హైదరబాద్ రాజ్య పురావస్తు శాఖ అదికారి గులాం యజ్దని, హెచ్.కె.షెర్వాణి గారు పరిశోదించారు, మూడు విక్రమాలు అంటే మూడు విజయాలు అని అర్థం వైదిక పురాణాలను (మైథిలికల్) బట్టి అంటే శ్రీవిక్రముడు (శ్రీ మహావిష్ణు) భూమిపై మూడుసార్లు దాడి చేసి గెలుచుకొన్నాడు అని తెలిపే పురాణ వృతాంతం రుగ్వేదంలో ఉన్న కథను ఆధారంగా చేసుకొని తెలుసుకోవచ్చు, ఈ అంశంకు సంభందించిన పురాణ కథ శ్రీ విష్ణువు గురించి ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. శ్రీ మహా విష్ణువు మూడుసార్లు భూమిపై దాడి చేసినందున అతన్ని త్రివిక్రమ అని పిలుస్తారు. భారతదేశంలో త్రివిక్రముడి యొక్క అనేక పురాతన అద్భుతమైన విగ్రహాలు దేశం అంతట ఉన్నాయి.
కాల్చిన ఇటుకలతో నిర్మించిన, పురాతన శిల్పకళకు సాక్ష్యంగా తేర్ లోని త్రివిక్రమ ఆలయం నిదర్శనంగా ఉంది. ఈ ఆలయం విశిష్ట మైనది ఆలయ నిర్మాణం కౌశల్యం, పని నేర్పరితనం నాటి కళాకారుల తృష్ణకు తార్కాణం, ఆలయ ఆకారం ఏనుగు వెనుక భాగంలా ఉంది. ఆలయం రెండు వైపులా వాలుగా ఉండే పైకప్పు ఉంటుంది.ఈ ఆలయం మొదట బౌద్ధ ఆలయమని పురావస్తు నివేదకల ద్వారా తెలుస్తున్నది. ఈ ఆలయం ముందు బౌద్ధ చైత్యగృహం లాంటి చైత్యగవక్ష ఉంది. ఈ ఆలయం గుప్త శైలిలో నిర్మించబడినది ఈ ఆలయం చైత్యగృహంలా కనిపిస్తుంది. తరవాత ఈ ఆలయమును వైదిక ఆలయంగా మార్చాబడినది అని పురావస్తు పరిశోధన నివేదికలు తెలిపాయి. గర్భగుడిలో శ్రీ మహావిష్ణువు విగ్రహం ప్రతిష్టింపబడినది. ఈ ఆలయం క్రీ.శ. 4వ శతాబ్దంలో నిర్మించబడింది అని తెలిపే రాతి శాసన ఆధారం ఆలయ ఆవరణలో లభించింది.

త్రివిక్రమ ఆలయం

త్రివిక్రమ ఆలయ వాస్తు
2). ఉత్తరేశ్వర ఆలయం
ఈ ఆలయం కూడా త్రివిక్రమ ఆలయం లాగా కాల్చిన పెద్ద ఇటుకలతో నిర్మించబడింది. ఈ ఆలయం 7వ శతాబ్దపు అద్భూత నిర్మాణ శైలికి ఉదాహరణ. దీని నాభి చతురస్రంగా ఉంటుంది మరియు ఆలయ శిఖరం దక్షిణ భారత వాస్తు శైలి అని ఆలయ నిర్మాణమును బట్టి తెలుసుకోవచ్చు ఆలయం నాలుగు వైపులా కుంచించుకుపోయింది. ఆలయం, ఆలయ ఆవరణలో ఉన్న భవనం పూర్తిగా ఇటుకలతో అద్భుత కళా నైపుణ్యం కలిగిన అలంకరణ ఇటుకలను ఉపయోగించి నిర్మించారు. నాటి ఇటుకల తయారీ విధానం అభివృద్ధి చెందిన శాస్త్ర విజ్ఞాన ప్రగతికి నిదర్శనం నిర్మాణ కళా నైపుణ్యం కలిగి అద్భుత కళలతో ఆలయం నిర్మించబడింది. ఇటుకల పై తీగలు, పువ్వులు, లతలు చెక్కబడి ఉన్నాయి. చెక్క తలుపుపై అద్భుతమైన వడ్రంగి చెక్కడం పని కార్వింగ్ చూడముచ్చటగా ఉంటుంది. చెక్క తలుపుపై పౌరాణిక దేవుళ్ళు, దేవతలు చెక్కబడ్డవి. వడ్రంగి చెక్కడం నాటి కళా ప్రగతికి, నైపుణ్యతకు నిలువెత్తు నిదర్శనం ఈ ఆలయం పైకప్పుపై కూడ వైదిక దేవుళ్ళు, దేవతల యొక్క అద్భుత శిల్పాలు మరియు పైకప్పు క్రింద స్వేచ్ఛా హంస నమూనా ఉంది. ఈ ఆలయం యొక్క అసలు నిర్మాణంలో ఎటువంటి రాయిని ఉపయోగించలేదని డాక్టర్ ఎ. వి. నాయక్ మరియు డాక్టర్ మధుకర్ కేశవ్‌రావు ధవళికర్ చెబుతున్నారు. తలుపులు మరియు దూలాలు కర్ర చెక్కతో తయారు చేయబడ్డాయి. ఈ ఆలయం యొక్క చెక్క చట్రం 12 లేదా 13 శతాబ్దా కాలంలో చెక్కబడి ఆభరణాలతో అలంకరించబడింది అని ఇది చాళుక్య కాలం నాటి చెక్క శిల్పానికి అద్భుతమైన ఉదాహరణగా పరిగణించబడుతుంది అని వివరించారు.

ఉత్తరేశ్వర ఆలయం
3). నీలకంటేశ్వర /కాళేశ్వర ఆలయం
నీలకంటేశ్వర /కాళేశ్వర ఆలయం తేర్ణ నది ఒడ్డున నీటిలో తెలియాడు ఇటుకలతో నిర్మించబడిన టెర్రకోట నిర్మాణం. ఇటుకల తయారిలో కొత్త సాంకేతికత అభివృద్ధి చెందినది అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. 6వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం ఇప్పటికీ మంచి స్థితిలో ఉంది. ఈ ఆలయం యొక్క శిఖరం, నాటి ద్రావిడ శైలిలో ఉన్నాయి. మనం దీనిని చూసినప్పుడు మనకు ఎల్లోరా లోని గృష్నేశ్వర ఆలయం గుర్తుకు వస్తుంది. ఆలయంలోని చెక్క పనితనము కార్వింగ్ పొగడక మానము.గర్భ గుడిలో నీళకంఠేశ్వరుడు ప్రతిష్టింపబడి పూజలు అందుకొంటున్నాడు. స్థానికులు భక్తుల సౌకర్యార్థం ఇక్కడ సత్రము నిర్మించారు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

నీలకంఠేశ్వర ఆలయం
4). సంత్ కవి శ్రీ గోరా కుంభార్ సమాధి ఆలయం
సంత్ శ్రీ గోరా కుంభార్ 1267లో తేర్‌లో జన్మించారు. ఆయన సంత్ జ్ఞానేశ్వర్, సంత్ నామ్‌దేవ్ కు సమకాలీనుడు. ఆయన వార్కారి శాఖకు చెందిన గొప్ప కవి, కళాకారుడు ఆయన పండరిపూర్ విఠలేషుడి గొప్ప భక్తుడు. ఆయన అనేక అభంగాలను మరాఠి భాషాలో రచించారు. పండరిపూర్ విఠలేషుడిని కీర్తిస్తూ మరాఠి భాషలో దాదాపు 43 అభంగాలు రచించారు. ఒక కుండను తయారు చేయడానికి, మట్టిని పిసికి, దానిని మృదువుగా చేయడానికి కాళ్లతో తొక్కలి కానీ ఈయన విఠలేశున్ని మదిలో తెలుస్తు మట్టిలో నృత్యం చేస్తు శ్రీ విఠల్ పేరును జపిస్తూ ఆనందంలో మునిగిపోయే వాడు. ఇది గోరా కాకా దినచర్య. ఆయన కుండలు తయారు చేస్తూ ఒక రోజు తన కన్నా పిల్లవాడిని మట్టిలో నృత్యంలో మైమరచిపోయి నలిపిన కథ విఠలేశుడి మహిమతో తిరిగి తన పిల్లవాడు దక్కడం అనే కథ ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంత ప్రజలకు శ్రీ గోరాపై అమితమైన విశ్వాసం ఉంటుంది. ఆయన సమాధి తేర్ణ నది ఒడ్డున నిర్మించబడి ఉంది.

సంత్ గోర కుంభర్ ఆలయం
5). జైన ఆలయం
తేర్ లో చారిత్రక ప్రసిద్ధ పురాతన ఒక జైన ఆలయము కూడ ఉంది. ఇది 12వ శతాబ్దమునకు చెందిన జైన కేంద్రమని తెలుస్తుంది. ఇక్కడ జైనము వర్దిల్లినట్లుగా కూడా పురావస్తు తవ్వకాల ద్వారా తెలుస్తుంది.తవ్వాకాలలో జైన తీర్థంకుల విగ్రహాలు బయల్పడ్డాయి. ఇక్కడి పురావస్తు తవ్వకాలలో ప్రధానంగా బయల్పడినటువంటి జైన విగ్రహము వర్తమాన మహావీరునిధి అని చరిత్ర, పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించారు.ఈ జైన మహావీరుని శిల్పము (గ్రానైట్) నల్ల రాతిని ఆధారంగా చేసుకొని చెక్కినారు. ఆలయంలో వర్తమాన మహావీరుడు, ఆదినాథుడు, పార్శ్వనాథుడి పురాతన విగ్రహాలు చూడవచ్చు. నాటి ఇక్కడి ప్రజలు జైన మతాన్ని కూడ ఆదరించినట్లుగా ఈ ఆనవాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు. ఆలయం ఎదురుగా ఒక చెరువు ఉండేదని పురావస్తు ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఈ దేవాలయ నిర్మాణం కొరకు ఇటుకులను వాడడం జరిగింది ఇక్కడ వాడిన ఇటుకల ప్రత్యేకత ఇటుకలు నీటి పైన తేలియాడే లక్షనం కలిగి ఉన్నాయి. ఇప్పుడు కూడ జైనులు ప్రతి సంవత్సరం మాఘా మాసంలో ఈ ఆలయoను దర్శించుకొంటారు. ఆలయ పరిసర ప్రాంగణం లో తామ్ర పత్ర శాసనాలు లభించాయి.

తేర్ జైన తీర్థంకర మహావీర్
6). పురాతన ఆనకట్ట
తేర్ పట్టణానికి సమీపంలో శాతవాహన కాలం
నాటి
పురాతన శిథిల ఆనాకట్ట (చెరువు) కనుగొనబడింది. నాటి నీటిపారుదల మరియు మంచినీటి వాడకం కొరకు ప్రజల
అవసరార్తం నిర్మించినట్లుగా తెలుస్తుంది. నీటిని కాలువల ద్వారా వ్యవసాయానికి పంట పొలాలకు
మళ్ళించినట్లు,
ప్రజల త్రాగు నీటి అవసరం కోసం వాడినట్లు పురావస్తు నివేదికలు తెలిపాయి. ఈ చెరువు నీటి ద్వారా
వ్యవసాయం అభివృద్ధి చెందిందని నీటిపారుదల వ్యవస్థను నాడు విరిగేవిగా ఉపయోగించారని దీని ద్వారా
స్పష్టమౌతున్నది. ఇది నాటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు.
నీటిపారుదల
నిర్వహణ కోసం ప్రత్యేక ఉద్యోగ బృందం ఉన్నట్లుగా ఇక్కడ దొరికిన శాసనాలను బట్టి తెలుస్తుంది. ఇది గత
ఇంజనీరింగ్ సాంకేతిక నైపుణ్యతకు నిదర్శనం.
7). తేర్ నేడు ఒక పర్యాటక స్థలము
నేడు తేర్ ఒక ప్రధాన పర్యాటక స్థలము చారిత్రక, పురావస్తు వారసత్వ సంపదకు నిలయము. తేర్ మ్యూజియం, బౌద్ధ చైత్య గృహం, త్రివిక్రమ ఆలయం, కాలేశ్వర ఆలయం, సంత్ గోరోభ ఖుంభార్ సమాధి, మ్యూజియంలో అనేక చారిత్రక, పురావస్తు అవశేషాలు, శిల్పాలు చిత్రాలు, నాణాలు, నాటి మానవుడు వాడిన వస్తువులు, చెక్క వస్తువులు, నగిశీ వస్తువులు,గాజు వస్తువులు, చైనా పింగాని వస్తువులు, కుండలు, ఇసుర్రాయి, తెలియాడే ఇటుకలు, పెద్ద మట్టికుండలు, పూసలు, రాత ప్రతులు, రాతి శాసనాలు, రాగి, వెండి, ఇత్తడి ఫలక శాసనాలు, లజ్జ గౌరీ సీల్స్, బౌద్ధ, జైన, వైదిక దేవుళ్ళ విగ్రహాలు మొదలగునవి చూడవచ్చును. తేర్ ను అన్ని కాలాలలో సందర్శించవచ్చు. ఉస్మానాబాద్ లో బస చేయడానికి అనేక హోటల్స్ అందుబాటు ధరలలో ఉన్నాయి. ఇక్కడ మంచి భోజనం దొరుకుతుంది. ఉస్మానాబాద్(ధారశివ్) నుండి తేర్ కు రోడ్డు సౌకర్యం ఉంది. ఉస్మానాబాద్ కు రైలు సౌకర్యం కూడ ఉంది. ఇక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా బస్సు,కార్లు అందుబాటులో ఉంటాయి.
7. ఉపసంహారం
- తేర్లో 10 పురావస్తు రక్షిత కొండలు (మట్టి దిబ్బ)లు తెల్ల మట్టి దిబ్బలు ఉన్నాయి వాటి కింద చారిత్రక సంపద నీగూడంగా నిక్షిప్తమై ఉంది. ఇక్కడ పురావస్తు తవ్వకాల మూలంగా అనేక పురావస్తు అవశేషాలు కనుగొనబడ్డాయి. ఇంకా చాలా మట్టి దిబ్బల పై పురావస్తు తవ్వకాలు తవ్వబడలేదు పరిశోధనకు నోచుకోనబడలేదు.
- ప్రజలు నిర్మాణాల కొరకు, వ్యవసాయం చేయడానికి మట్టిదిబ్బలను చదును చేసే అవకాశం ఉంది, ఇటుక బట్టీల కోసం ఇక్కడి మట్టిని ఉపయోగించినందున మూడు మట్టి దిబ్బలు నాశనమయ్యాయి.
- తేర్లో మట్టి దిబ్బల నాశనం చరిత్ర, పురావస్తు శాఖ వారి నిర్లక్ష్యం వారసత్వ సంపదకు విఘాతం. పురావస్తు వారసత్వ సంపదను కాపాడుకోవడం లో నిర్లక్ష్యం వల్ల పురావస్తు వస్తువులు నాశనం అయ్యే అవకాశం కూడ ఉంది.
- నేడు ఇక్కడ మన పూర్వికులకు సంబందించిన అనేక ఆనావాళ్లు ఇక్కడ పరిశోదించబడకుండా మిగిలి ఉన్నాయి. వారసత్వ సంపదకు నిలయమైన ఇక్కడి మట్టి దిబ్బలకు చరిత్ర కారులు, పురావస్తు పరిశోధకులు ఇక్కడ మట్టిదిబ్బలకు పేర్లు పెట్టారు, ఇక్కడ ఇంకా పరిశోదనకు నోచుకోబడని అనేక మట్టి కొండలు(దిబ్బలు) (Archeological Sites) మిగిలి ఉన్నాయి.
- కోట్, బైరాగ్, కైకాడి, ములాని, మహర్, రేణుక, ఆన్, చాహుత్రే. వీటిలో రేణుక, కోట్ మరియు బైరాగ్ మట్టి దిబ్బలను పురావస్తు శాఖ వారు (Excavations,Exploration) పురావస్తు తవ్వకాలు జరిపారు పరిశోదన చేశారు. ఇతర ప్రదేశాలలో పురావస్తు శాఖ వారు పురావస్తు తవ్వకాలు జరిపి పరిశోధన చేసి చరిత్రను వెలికితీయాలి అని కోరుకుంటున్నాను.
- తేర్లో గతంలో జరిగిన పురావస్తు తవ్వకాలు పరిశోధనలు అన్ని పురావస్తు శాఖ ఆదినంలో పురావస్తు అధికారులైన బ్రిటిష్ పురావస్తు అధికారి కజిన్స్, నిజాం హైదరాబాద్ రాజ్య పురావస్తు అధికారి గులాం యాజ్దని, హెచ్. కే. షేర్వాని, మోరేశ్వర్ దీక్షిత్, మధుకర్‌రావు దల్వి, ఎ.వి. నాయక్, శాంతరంగ్ బాలచంద్ర దేవ్ మరియు మాయా. జె. పాటిల్ వంటి వారు నిష్ణాతులైన నిపుణుల పర్యవేక్షణలో స్థానిక ప్రజల సహకారం తో జరిగాయి.
- ఇక్కడి పురావస్తు ప్రదేశాలకు రక్షణ కరువై నిర్లక్ష్యంకు గురి అయ్యాయి. మనుషుల అవసరాల కారణంగా నేడు ఇక్కడ ఉన్న పురావస్తు ప్రదేశం మట్టి కొండల పరిస్థితి కనుమరుగయ్యే అవసశం ఉంది. మట్టి దిబ్బలను స్థానిక ప్రజలు చదును చేసి వ్యవసాయం కొరకు మట్టి దిబ్బలను చదును చేస్తున్నారు. ఇటుకల నిర్మాణం కొరకు మట్టి దిబ్బలను తోడేసి వాడుకొంటున్నారు.
- చరిత్ర ఔత్సహికులు, ప్రభుత్వ అధికారులు, తేర్లో ఉన్న స్థానిక ప్రజలు ఈ పురావస్తు ప్రదేశాలను రక్షించి మరియు మట్టి తవ్వకాలను నిరోధించే తగు చర్యలు తీసుకోవడం అత్యవసరం. మన చరిత్ర, వారసత్వ సంపదను కాపాడగలిగినవారమౌతాము అదేవిదంగా రాబోవు తరానికి వారసత్వ సంపదను అందించిన వారలము అవుతాము.
- తేర్ ను పర్యాటక ప్రదేశంగా ఇంకా అభివృద్ధి చేసి తీర్చిదిద్దగలిగితే మంచి ఆదాయంను సమాకూర్చే అవకాశం ఉంది. స్థానికులకు పర్యాటకము వల్ల ఉపాధి లభించడమే కాకుండా జీవన ప్రమాణం మెరుగు అవుతుంది.
8. సూచికలు
- The Peri Plus of the Erythraean Sea.
- Pliny Natural History.H.Rackham.
- A Preliminary Report of Excavations at Ter (Tagar).,2014-15., Maya. J. Patil.
- Commemoration Volume. Ed,.Ghulam Yaz dhani., H. K. Sherwani.
- Ter Excavations Report. Sahapurkar Patil.
- దోన్ హాజర్ వర్ష పూర్విచ మహారాష్ట్ర
హోత
జాగరుక్.మరాఠి. డైలీ,దైనిక్ లోక్ సత్త
9. ఉపయుక్తగ్రంథసూచి
- అమిత్ సామంత్, దైనిక్ లోక్ సత్తా, మరాఠీ న్యూస్ పేపర్,. దోన్ హజార్ వర్షాపుర్విచ మహారాష్ట్ర హోత జాగరుక్. (23 నవంబర్ 2016)
- అరుణ్ చంద్ర.ఎస్.పాఠక్., మహారాష్ట్ర రాజ్య గజిటీర్,. ఇతిహాస్ ప్రాచీన్ కాల్ (1) ముంబై దర్షిని విభాగ్ సంస్కృతి కార్య విభాగ్ మహారాష్ట్ర గవర్నమెంట్-2002.
- దేవ్ బి. బి.డి. తేర్ గ్రంథ్
- దైనిక్ సకాళ్. మరాఠీ న్యూస్ పేపర్., తేర్ మద్యే సాపడ్లే ప్రాచీన్ విహిరిచే అవశేష్. (4 జనవరి 2020)
- మురళీధర్ సులభ,. సువర్ణ నగరి తేర్,. ఆన్ పబ్లిస్డ్ ఎంఫీల్ డిసెర్టెషన్,. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మారాట్వాడ యూనివర్సిటీ, ఔరంగబాద్.
- మోర్వాంచికర్ ఆర్. యస్. శాతవాహన్ కాలీన్ మహారాష్ట్ర,. ప్రతిమా ప్రకాశం, పూణే -1993
- వాసుదేవ్ విష్ణు మీరాశి,. శాతవాహన్ కాలీన్ అని పశ్చిమ క్షేత్ర యాంచ ఇతిహాస్ అని కోరివ్ లేని,. మహారాష్ట్ర రాజ్య సాహిత్య సంస్కృతి మండల్. ముంబై-1979.
- శంకర్ హరి జోషి,. మహారాష్ట్ర తీల్ లేని, డైమండ్ పబ్లికేషన్ ముంబై- 2008
- Bhaishali Ghosh,. Recovering Local Agency and Technology in the Trans-Roman Deccani Trade.
- Dawood Dalvi,. Cave Shrines of Maharashtra, Granth Lee Prakashan, Mumbai- 2004
- Field Visit. 2015-2023
- Ghulam Yazdhani,. Commemoration volume Ed. By prof: H. K. Sherwani., Hyderabad “Trivikram Temple at Ter”.
- Journal Article, Department Of Archeology Bulletin of the Deccan College Post Graduate and Research Institute Pune, Vol, 30. Souvenir (1971) pp. 86-105.(20 Pages) Maharashtra. 2014-2015. New approach to the ivory and bone artifacts from Tagar (Ter).
- Maya. J. Patil,. Reminiscences of Tagar (Ter)
- Maya.J. Patil,. A Preliminary Report of Excavations at Tagar (Ter) District Osmanabad,
- Sahapurkar Patil Ter Excavations Report.
- The Hindu, Daily,. Satavahana Site to be Re-Excavated,. Published January 31,2015.
- Wilfred H. Schoff,. ‘The Peri Plus of the Erythraen Sea'
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

