AUCHITHYAM | Volume-06 | Issue-9 | August 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
1. నారాయణపేట జిల్లా సంకీర్తనాసాహిత్యసంపద: అధ్యయనం
మ్యాడం అభిలాష్
తెలుగు ఛానల్ ఇంచార్జ్ & కంటెంట్ రైటర్
TAL రేడియో, Touch A Life foundation
మదీనాగూడ, హైదరాబాదు.
సెల్: +91 8142576346, Email: abhilashmyadam04@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 22.07.2025 ఎంపిక (D.O.A): 31.07.2025 ప్రచురణ (D.O.P): 01.08.2025
వ్యాససంగ్రహం:
ఈ వ్యాసంలో నారాయణపేట జిల్లా సంకీర్తన సాహిత్యం – భక్తి భావన, ప్రాంతీయత, కవిత్వ విశిష్టత అనే అంశాలను పరిశీలించడం జరిగింది. నారాయణపేట ప్రాంతంలో సంకీర్తనల రూపంలో అభివృద్ధి చెందిన భక్తిసాహిత్యం, స్థానికజీవనశైలి, సామాజిక చైతన్యాన్ని కలగలిపిన కళారూపంగా ఎదిగిన విధానాన్ని ఈ పరిశోధన వ్యాసం తెలుపుతుంది. భక్తి సాహిత్యంలో ఈ ప్రాంతానికి సంబధించిన కవులు, వారి రచనల నైపుణ్యం, ప్రజల భాషావాడకంలో వాటి ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేయడమే ఈ వ్యాసం ప్రధాన లక్ష్యం. ఈ రంగంలో ఇప్పటివరకు కొన్ని సంకీర్తనల సంపుటులు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ, అవి వ్యాప్తి పరంగా పరిమితంగా ఉండడం, విమర్శనాత్మక అధ్యయనాలు అరుదుగా ఉండడం వల్ల ఈ పరిశోధన అవసరం ఏర్పడింది. సాయన్న, వెంకటదాసు, భాస్కరరాయలు, మిడిదొడ్డి ఎల్లయ్య, కిష్టన్న వంటి నారాయణపేట ప్రాంత సంకీర్తనకారుల కృషిపై సుసంపన్నమైన అవగాహన కల్పించేందుకు ఈ వ్యాసం దోహదపడుతుంది. సమాచార సేకరణ కోసం ప్రాథమిక ఆధారాలుగా స్థానిక గ్రంథాలయాల్లో లభ్యమయ్యే పుస్తకాలు, సంకీర్తనల సంకలనాలు, మానవ వనరులు (పాటకులు, గాయకులు, వేదికల నిర్వాహకులు) వంటి వాటిని ఉపయోగించాను. ద్వితీయ ఆధారాలుగా పత్రికావ్యాసాలు, సమీక్ష గ్రంథాలు, ప్రాంతీయ భక్తిప్రచార మాసపత్రికలు ఉపయోగించాను. పరిశోధన పద్ధతిగా సాహిత్య విమర్శా ధోరణిని అనుసరించగా, వ్యాసాన్ని ప్రధానంగా ఐదు భాగాలుగా విభజించాను: 1) సంకీర్తన పరిచయం, 2) అచల సిద్ధాంత పరిచయం, 3) నారాయణపేట సంకీర్తనల ప్రత్యేకత, 4) స్థానిక భాష, శైలి, సంగీతం 5) లభించిన రచనల ఆధారంగా విశ్లేషణ. ఈ వ్యాసం నారాయణపేట సంకీర్తన సాహిత్యం యొక్క ప్రత్యేకతను ఆవిష్కరించి, భవిష్యత్ పరిశోధనలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ పరిశోధన కోసం నిర్వహించిన క్షేత్రపర్యటనలో భాగంగా నారాయణపేట, మక్తల్, లోకపల్లి సంస్థానం, ఔదుంబరేశ్వర ఆలయం వంటి ప్రదేశాలను సందర్శించాను. అక్కడి కళాకారులు, పండితులతో ఇంటర్వ్యూలు నిర్వహించి విలువైన సమాచారం సేకరించాను. ఈ అధ్యయనం ప్రాంతీయ భక్తి సాహిత్య విభాగంలో ఓ విలువైన మైలురాయిగా మారుతుందని భావిస్తున్నాను.
Keywords: సంకీర్తన సాహిత్యం, భక్తిసాహిత్యం, ప్రాంతీయత, నారాయణపేట, సంకీర్తనకారులు, విమర్శా పద్ధతి, శాస్త్రీయ విశ్లేషణ
1. ప్రవేశిక
"శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద
సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ
నివేదనం" (సంపూర్ణ వ్యాస భాగవతం, సప్తమ స్కంధం, 5వ అధ్యాయం, ప్రహ్లాద చరిత్ర, 23వ
శ్లోకం.)
భాగవత పురాణంలో ప్రస్తావించిన ఈ శ్లోకం నవవిధ భక్తిమార్గాలను సూచిస్తుంది. వీటిలో ‘కీర్తనం’ అనే భక్తి మార్గం ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. అలా తెలుగు భక్తి సాహిత్యంలో సంకీర్తనలకు విశిష్ట స్థానం లభించింది. ఆయా భక్తులు తమ భక్తి భావాన్ని వెలిబుచ్చడం కోసం సంగీతాన్ని ఆధారం చేసుకుని రచించిన సంకీర్తనలు సామూహిక ఆధ్యాత్మిక జీవితాలను ప్రతిబింబిస్తాయి. ఇటువంటి సంకీర్తనలే లోకోపయోగ ధర్మబోధనలకు మూలబలంగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో, నారాయణపేట ప్రాంతంలో అభివృద్ధి చెందిన సంకీర్తన సాహిత్యాన్ని ప్రత్యేకంగా పరిశీలన చేసి అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. భౌగోళికంగా తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న నారాయణపేట, తెలుగు–కన్నడ భాషా సంస్కృతుల కలయికగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలోని భక్తి సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలు, స్థానిక భాషా పదాలు వంటివి అన్నీ కలిసి ఈ సంకీర్తన సాహిత్యాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి.
ఇప్పటివరకు నారాయణపేట ప్రాంత సాహిత్యంపై సాధారణ చరిత్రాత్మక ప్రస్తావనలు మాత్రమే ఉన్నప్పటికీ, అక్కడి సంకీర్తనలపై ప్రత్యేక పరిశోధన మాత్రం ఎవరూ చేయలేదు. ఈ నేపథ్యంలో, నారాయణపేట సంకీర్తన సాహిత్యాన్ని భక్తి వాంగ్మయ పరిణామంలో భాగంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో సంకీర్తన సాహిత్యం రచించిన వారిలో అధికంగా అచల సిద్ధాంతాన్ని అనుసరించిన గురువులు కనిపిస్తారు. వీరి రచనలు లోతైన తాత్వికతను, జీవనవేదనలను ప్రతిబింబిస్తాయి. ఈ అచల సిద్ధాంత ప్రభావిత గురువుల రచనల్లో కనిపించే తాత్విక నిర్మాణం, భక్తి భావన, మౌలిక జీవన నైతికత వంటి అంశాలు అక్కడి ప్రజలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి.
ఈ వ్యాసం ద్వారా, సంకీర్తన సాహిత్యంలో నారాయణపేట ప్రత్యేకత ఏమిటి? ఆ ప్రాంతీయ భక్తి భావాల ప్రభావం ఏ మేరకు ఈ సంకీర్తనల రూపాన్ని నిర్ణయించింది? స్థానిక భాష, పదవిన్యాసాలు, సంగీత ప్రామాణికత ఎలా ఉన్నాయి? అనే ప్రశ్నలకు శాస్త్రీయంగా సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేయబడింది. ఈ ప్రాంత సంకీర్తనల మూలాలను, వాటి సాంస్కృతిక విలువలను, భక్తి చరిత్రలో వాటి స్థానాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించడమే ఈ వ్యాస ముఖ్య లక్ష్యం. ఇది కేవలం సాహిత్య విశ్లేషణ మాత్రమే కాదు, అక్కడి ఆధ్యాత్మికచరిత్ర, సామాజికమార్పు, సాంస్కృతికసంక్రమణలను పరిశీలించేందుకు మార్గం చూపే వేదిక. ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ప్రత్యేకంగా విమర్శనాత్మక దృష్టితో అచల సిద్ధాంతాన్ని పాటించే గురువుల రచనల్ని, వారి సిద్ధాంతాల్ని, ప్రజల మీది ప్రభావాల్ని విశ్లేషించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.
నారాయణపేట సంకీర్తనసాహిత్యంపై ఇప్పటివరకు గణనీయమైన పరిశోధనలు జరగకపోవడమే ఈ నా ప్రస్తుత అధ్యయనానికి ప్రధాన ప్రేరణ. ఈ అంశం భవిష్యత్తులో M.Phil. లేదా Ph.D. స్థాయిలో విస్తృత అధ్యయనానికి అనుకూలమైన విభాగంగా నిలవగలదని భావిస్తున్నాను. ప్రాచీనసంప్రదాయ సాహిత్యపరంపరలను, ప్రాంతీయభక్తి ఉద్యమాల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ఇది విశేషంగా దోహదపడగలదు. అలాంటి భవిష్యత్తు పరిశోధనలకు ఈ వ్యాసం ఒక చిన్న నాంది వాక్యంగా మారుతుందని భావిస్తున్నాను.
2. సంకీర్తన నిర్వచనం
భక్తితోకూడిన సంగీతాన్ని రాగంతో ఆలపిస్తూ పరమాత్ముని తత్త్వాన్ని సజీవంగా అనుభవించడమే సంకీర్తన. (అవతార్ శివానంద భగవాన్. భక్తి సంకీర్తనము. పుట 122.) ఇది కేవలం ఒక కళారూపం కాదు, మనస్సును శుద్ధపరిచే ఒక సాధనం, లోక క్షేమాన్ని కోరే దివ్యమైన మార్గం. ‘ప్రశంసించడం’ అనే అర్థం కలిగిన ‘కీర్తన’ అనే పదానికి ‘సం’ అనే ఉపసర్గ చేరడం ద్వారా 'సంకీర్తన' అనే పదం ఏర్పడింది. దీని అర్థం సామూహికంగా అందరూ కలిసి భగవంతుడిని కీర్తించడం (వెంకటేశ్వరరావు, పొత్తూరి. పారమార్థిక పదకోశం. 2010). భారతీయ భక్తి ఉద్యమాలలో భక్తులు సమూహంగా కీర్తన చేసి, గానంతో దైవచింతనలో లీనమయ్యే పద్ధతికి ఇది ఒక రూపంగా మారింది.
సంకీర్తనల పరంపర ప్రాచీన భారతదేశంలో చాలా
విస్తృతంగా అభివృద్ధి చెందింది. ఇది భజన, హరిదాసుల కీర్తనలు, కోలాట కీర్తనలు, నామస్మరణా కీర్తనలు వంటి
అనేక రూపాలలో దర్శనమిస్తుంది. ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క సామాజిక సంఘానికి భిన్నమైన రచనలూ,
పదవిన్యాసాలూ ఉండగా, ప్రతి సంకీర్తనలోనూ భక్తి భావం మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ సాహిత్య సంపద అనేక
విధాలుగా భక్తుని అంతరంగాన్ని వెలికి తీసే సాధనగా నిలుస్తోంది. దైవాన్ని మనసారా స్మరించడంలో, సామూహికంగా
గానం చేయడంలో సంకీర్తనలకు విలక్షణమైన స్థానం ఉంది.
3.
అచలసిద్ధాంతంలో భక్తిసాహిత్యం
అచలసిద్ధాంతం ఒక నిర్వికారమైన, స్థిరమైన, మార్పురాహిత్య స్వరూపంగా ఉండే పరమాత్మను కీర్తించడం అనే తాత్విక భావనను కలిగి ఉంటుంది. ఇది ముఖ్యంగా అద్వైత వేదాంతం, శైవ సిద్ధాంతం వంటి వాటిల్లో కనిపించే భావన. భగవంతుడు తాను ఏ రూపంలోనూ కనిపించకుండా రూపానికి అతీతంగా ఉండడమే ఈ సిద్ధాంతం మౌలికలక్షణం. (దయానంద పొన్నాల రాజయోగి. శివరామ దీక్షితయ్యమను బృహద్వాసిష్ఠం. పుట 1,2) ఈ స్థిరమైన తత్త్వాన్ని పొందేందుకు, అందరి చేతా పలికించేందుకు భక్తులు రచించిన కీర్తనలు, పదాలన్నీ ఒక దివ్యమైన క్రమాన్ని అనుసరిస్తాయి.
భక్తకవులు తమ రచనల్లో ‘అచలుడు’,
‘నిత్యుడు’, ‘నిర్వికారి’, ‘నిర్గుణుడు’, ‘శాశ్వతుడు’
అనే పదాలతో పరమాత్ముని స్వరూపాన్ని వర్ణిస్తారు. వ్యక్తిగత జీవితానికి అతీతంగా, భక్తి తత్త్వాన్ని
తెలియజేసే ప్రయత్నాలు ఈ రచనల్లో కనబడతాయి. గానం చేసే భక్తుడు తననుతాను భగవంతునికి సమర్పించుకుంటూ,
దైవంలో ఐక్యతను కోరుకోవడాన్ని ఈ రచనల్లో మనం గమనించవచ్చు. అలాగని, ఈ రచనలన్నీ తాత్వికమైన మేధస్సుతో
నిండి ఉంటాయని కూడా చెప్పడానికి వీలులేదు. వాటిలో అనుభవం, మానవత, సంగీతం, వేదాంతం ఇలా అన్నీ కలగలిసి
ఉంటాయి. అచల సిద్ధాంతం అనే భావన ఈ భక్తి రచనల్లో ఇలా ఒక ఆధారంగా కనిపిస్తుంది.
4.
నారాయణపేట సంకీర్తనల ప్రత్యేకత
నారాయణపేట ప్రాంత సంకీర్తనలలో ఒక విశిష్టతగా గుర్తించదగిన అంశం భాషాశైలిలో కనిపించే తెలుగు–కన్నడల కలయిక. ఈ ప్రాంతం భౌగోళికంగా తెలంగాణా–కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నందున, ఇక్కడి భాషా వాడుకలో ఈ రెండు భాషల ప్రభావం సహజంగా మిళితమైంది. (నర్సప్ప తాటి, ‘నారాయణపేట మిశ్రమ సంస్కృతి' పరిశోధనా వ్యాసం 2024) నారాయణపేట సంకీర్తనలలో తెలుగు భాష ఆధార భాషగా ఉండగా, అనేక పదాలు, అభివ్యక్తులు కన్నడంలో నుంచి తీసుకున్నవిగా స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, "బెళగు", "కల్లు", "బేగ", "స్వామిగళు", "దేవగి" వంటి పదాలు ఈ సంకీర్తనల్లో తరచుగా కనిపిస్తాయి. ఇవి ఎంతో ఆప్యాయతతో భక్తి భావాన్ని మరింత నూతనంగా, ప్రాంతీయంగా అనుభూతి చెందేలా చేస్తాయి. ఇక రాగాలు, తాళాల వినియోగంలోనూ కన్నడ భక్తి పద్ధతుల ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా హరిదాససంప్రదాయానికి దగ్గరగా ఉండే భక్తి గీతాల స్వరప్రయోగం ఈ ప్రాంత సంకీర్తనల్లో కూడా ప్రతిఫలిస్తుంది. ఈ భాషా మిశ్రమత నారాయణపేట సంకీర్తనలకు ఒక ప్రత్యేకమైన స్థానికతను, సామాజిక చైతన్యాన్ని, మానవీయతను కలిగించింది.
ఈ భక్తిగీతాలు వినే వారిలో కూడా ఒక
ప్రత్యేకమైన భావోద్వేగాన్ని రేకెత్తిస్తాయి. భాషల కలయిక వల్ల పాఠకుడికి లేదా శ్రోతకు ప్రాంతీయత
స్పష్టంగా తెలిసివస్తుంది. ఇక్కడి ప్రజల సంస్కృతిలో ఆవిష్కృతమైన భక్తి భావాలు, వారి మాటలలోనూ, పాటలలోనూ
పరస్పర సారూప్యతను కలిగి ఉంటాయి. భాషా మిశ్రమత వల్ల సంకీర్తనల్లో వినూత్నత పెరగడంతో పాటు, అన్ని వర్గాల
ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి. కొన్ని పదాలు కన్నడలో ఉండి కూడా స్థానికులకు సర్వసాధారణంగా
మారిపోవడం వల్ల, ఆ సంకీర్తనలు ప్రజల వాడుకభాషలో సాధారణంగానే చొచ్చుకుపోయాయి. ఇలా నారాయణపేట సంకీర్తనలు
ప్రాంతీయ భాషా లక్షణాలను ఆవిష్కరించడమే కాక, సాంస్కృతిక సమన్వయానికి నిలువెత్తు నిదర్శనంగా
నిలిచాయి.
5. స్థానిక భాష, శైలి, సంగీత విధానం
నారాయణపేట సంకీర్తనల్లో కనిపించే స్థానిక భాష,
శైలి, సంగీత విధానం ఇక్కడి భక్తిగీతాలకు ప్రత్యేకతను అందించే ప్రధానాంశాలు. స్థానికంగా మాట్లాడే
తెలుగులో కన్నడ పదాల మేళవింపు ద్వారా విశిష్టమైన భాషా మాధుర్యం ఏర్పడింది. (నర్సప్ప తాటి,
‘నారాయణపేట మిశ్రమ సంస్కృతి' పరిశోధనా వ్యాసం 2024) ఈ భాష సామాన్యులు కూడా సులభంగా అర్థం
చేసుకునేలా, భక్తి భావాన్ని అనుభూతి పొందేలా ఉంటుంది. పదశైలి పరంగా చూస్తే, చిన్నచిన్న వాక్యాలు,
ఆవేశపూరితమైన నినాదాలు, పునరుక్తులు వాడటం వల్ల సంకీర్తనల్లో ఓ రకమైన శక్తి, ఉత్తేజం
కనిపిస్తుంది. ఈ సంకీర్తనలు దాదాపుగా జానపదశైలిలో ఉండి, సంగీతశాస్త్ర ప్రమాణాలను అనుసరించకపోయినా, ప్రజల
మనసులను హత్తుకునే సామర్థ్యాన్ని మాత్రం కలిగి ఉంటాయి. డోలు, తాళము, హార్మోనియం వంటి వాయిద్యాలను
ప్రధానంగా వాడుతారు. తక్కువ సాధనాలతో ఎక్కువ భావప్రకటన సాధించే ఈ విధానం, నారాయణపేట ప్రాంత భక్తి
గీతాలకు ప్రాణం పోసింది. స్థానికుల జీవనశైలి, సంస్కృతి, భాషా వాడుక ఇలా అన్నింటినీ ప్రతిబింబించేలా ఈ
సంకీర్తనలు సాగుతాయి.
6. లభించిన రచనల ఆధారంగా విశ్లేషణ
నారాయణపేట ప్రాంతంలోని భక్తి కవిత్వ
సంప్రదాయాన్ని విశ్లేషించాలంటే, అనేక సామాజిక, భాషా, సంగీతపరమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఈ
ప్రాంతంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన కవులు తమ భక్తి భావాలను వ్యక్తీకరించడంలో ప్రత్యేకమైన శైలిని
అవలంబించారు. అంతేగాక, స్థానికుల మధ్య అనునిత్యం వినిపించే సంకీర్తనలతో కూడిన జీవన విధానం భక్తి
సాహిత్యానికి ప్రాణంగా నిలిచింది. ఇటువంటి సంపదను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలంటే చాలా విస్తృతమైన
పరిశోధన అవసరం. ప్రస్తుత అధ్యయనంలో మాత్రం, అందుబాటులో ఉన్న నలుగురు కవుల — మిడిదొడ్డి ఎల్లయ్య,
కడదాసు వెంకటదాసు, చండ్రుక సాయన్న, మ్యాడం కిష్టన్న— రచనల ఆధారంగా ఈ ప్రాంత భక్తి సాహిత్య
స్వరూపాన్ని విశ్లేషించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. వీరి రచనలు ఇప్పుడు లభ్యమవుతున్న భక్తి సంప్రదాయ
అధ్యయనానికి ఒక మానదండంగా మారుతున్నాయని భావించవచ్చు.
6.1
అచలతత్వాన్ని అక్షరాల్లో అల్లిన గొప్ప భక్తకవి - మిడిదొడ్డి ఎల్లయ్య
నారాయణపేట జిల్లా వింజమూరు ప్రాంతానికి చెందిన మిడిదొడ్డి ఎల్లయ్య (జ. 1918) అచల సిద్ధాంతాన్ని పాటిస్తున్న గొప్ప గురువుగా మాత్రమే కాకుండా, భక్తి సాహిత్యంలో తనదైన శైలిని సృష్టించిన కవిగా గుర్తించదగిన వ్యక్తి. తన తండ్రి హనుమద్దాసే ఇతనికి గురువు కావడం, అలాగే వింజమూరు గురుభక్త మండలి కీర్తనలలో ఎల్లయ్య రచనలు కూడా చేర్చి ప్రచురించబడడం, ఈయన రచనలకు కలిగిన ప్రాధాన్యతను సూచిస్తాయి. వంద సంవత్సరాలకు పైగా ఆయుర్దాయం కలిగి ఉండి, తత్వప్రచారంలో క్రియాశీలకంగా ఉండటం ఆయన సాధనాపరమైన స్థితిని తెలియజేస్తుంది.
ఆయన రచనలు భక్తిరసభరితమైనవిగా, గ్రామీణ జీవితపు నాడిని స్పృశించేవిగా ఉంటాయి. ఎన్నో నానుడులు, సామెతలు, భాషా రీతులు ఆయన కీర్తనల్లో ప్రత్యక్షమవుతాయి. అంతేకాక, ఆయన రచనలు స్థానిక భాషా మాండలికానికి జీవం పోసినవిగా నిలుస్తాయి. ఎల్లయ్య రచించిన "గురుడేదైవంబని యనరా, గురుకరుణను నీవు కనుగొనరా..." అనే సంకీర్తన ఆ ప్రాంతంలో విశేష ప్రాచుర్యం పొందింది.
(మోహన రాగం, ఆది తాళం) (ప్రముఖ అచల సిద్ధాంత అనుకర్త సామలి శ్రీనివాస్, నారాయణపేట నుండి సేకరణ)
“గురుడేదైవంబని యనరా గురుకరుణను నీవు
కనుగొనరా
గురునిగొలచిన గురికుదిరించును గురుతుగ నీకు గోప్యము
దెలుసును ||గురు||
అందుయిందు శోధించకురా నీ
అంతరంగమున వెదుకుమురా
పొందుగా షట్‌చక్రంబుల మీద
పసందుగనిల్చిన పరమహంసను ||గురు|| .........” (1)
ఇలా సాగే ఈయన కీర్తనల్లో ఆయన వ్యక్తపరిచిన
గురుభక్తి భావం, భాషలో తేటతెల్లతనం, హృద్యత – అన్నీ కలసి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి. ఈ
కీర్తన ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, ప్రతి దేవాలయంలో అందరూ కలిసి పాడుకునేటంతగా మారింది. భావ గంభీరత,
ధిక్కార స్వరం వంటివి ఆయన రచనల్లో ప్రత్యేకంగా నిలిచాయి. మిడిదొడ్డి ఎల్లయ్య సంకీర్తనలు ఆచార
వ్యవహారాలతో కలసి మానవత్వాన్ని నిండుగా ప్రతిబింబించాయి. సామాన్యుడి హృదయానికి హత్తుకునేలా ఉండే ఈ రచనలు
ఇప్పటికీ ఆ ప్రాంతంలో భక్తి భావాన్ని రేకెత్తిస్తూనే ఉన్నాయి.
6.2
భక్తి సాహిత్యంలో ఒక జీవన స్రవంతి - కడుదాసు వెంకటదాసు
నారాయణపేటజిల్లా భక్తిసాహిత్యంలో కడదాసు వెంకటదాసును ఒక శాశ్వతమైన కాంతి చుక్కగా అభివర్ణించవచ్చు. నారాయణపేట జిల్లా మరికల్ ప్రాంతానికి చెందిన ఈయన, "కళారవి", "మేటికవి" అనే బిరుదులు సంపాదించుకున్నారు. పాశ్చాత్య సంస్కృతి ముసురుతున్న ఈ యుగంలో, స్థానిక భక్తి కళారూపాలైన యక్షగానం, హరికథ, భజన, కీర్తనలను పరిరక్షించడమే కాకుండా, తాను జీవించిన సమాజానికి ఆ కళల్లో భాగస్వామ్యం కలిగించడమే ఆయన ధ్యేయంగా భావించారు. చిన్ననాటి నుంచే ఎల్హేరి రాఘవాచార్యుల వద్ద శిక్షణ పొందిన వెంకటదాసు, 18వ ఏట నుంచే యక్షగాన నాటకాలను ప్రతి ఊరు తిరిగి యువతకు నేర్పిస్తూ, శిష్యుల చేత శతాధిక ప్రదర్శనలు చేయించారు. భజనార్చన ఆయన నిత్యచర్యగా మారిపోయింది. ప్రసిద్ధులైన మన్నెంకొండ హనుమద్దాసు వంటి కీర్తనకారుల గీతాలను ఆయన గానం చేస్తూ, తానూ అనేక సంకీర్తనలు రచించారు.
వారి రచనలలో "హరిహరభజన కీర్తనలు" అనే సంపుటి విశేషంగా ప్రాచుర్యం పొందింది. హరుడిని లింగం రూపంలో, హరిని నామం రూపంలో ఆరాధించే 'హరిహర అద్వైతం'ను ప్రాతిపదికగా తీసుకొని, ఆత్మతత్త్వాన్ని, గురుతత్త్వాన్ని, భక్తిపరంగా ఓర్పుతో వర్ణించడం ఆయన కీర్తనల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు, "కడప రాయుడవనగ నీవే కదా" వంటి గీతాల్లోని భావభక్తి, నమ్మకపు నిబద్ధత ఆంతర్యాన్ని పలకరించగల గాఢతను కలిగి ఉంటాయి. ఆయన గీతాలలోని భాష అచ్ఛమైన తెలుగు మరియు ప్రాచుర్యం పొందిన ప్రాంతీయ పదాలతో కలగలిసి ఉంటుంది.
వెంకటదాసు రచించిన యక్షగానాలు, హరికథలు, బుర్రకథలు, ఉయ్యాలపాటలు ఇప్పటికీ పలుచోట్ల వినిపిస్తుండటం ఆయన సాధన ఫలితమే. భాషాశైలిలో పాండిత్యం కన్నా అనుభూతికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ, సమాజంలోని అవిద్యావంతులకే కళల ద్వారా జ్ఞానాన్ని చేరవేసే ప్రయత్నం చేశారు. పోతన "సత్కవుల్ హాలికులైననేమి" అన్నట్లు, వ్యవసాయమే ఆధారంగా చేసుకొని రచన చేస్తూ కళామతల్లి సేవకు జీవితాన్నే అంకితమిచ్చారు. ఈయన రాసిన కొన్ని సంకీర్తనలను పరిశీలిద్దాం.
(భైరవి రాగం, రూపక తాళం) (ప్రముఖ అచల సిద్ధాంత అనుకర్త సామలి శ్రీనివాస్, నారాయణపేట గారి నుండి సేకరణ)
“జయజగదీశ్వరీ అంబభవానీ, జయము నొసంగవె అభవుని
రాణీ
చెయ్యన నీదయ జూడుము జననీ, ప్రియముతోడ
నేనమ్మికొలచెదను
భయమునుబాపుము భార్గవివేగమె,
నగయముగానునామదినితలంచెద ॥ జయ ||
శుంభనిశుంభాదైత్యవినాశని,
అంభుజనేత్రరోఆదరించుమిక సంబరముననిను
సాగిలి మ్రొక్కెద,
కంబుకంధరి కఠినము తలచకు ॥ జయ ||”..... (2)
అనే కీర్తనలో అంబాభవాని మాతను ఉదాత్తంగా వర్ణిస్తూ, తన ఆత్మనివేదనను ఆలాపనగా మలిచారు. "చెయ్యన నీ దయ జూడుము జననీ, ప్రియముతోడ నేనమ్మి కొలచెదను" వంటి పదాలు, ఒక వైపు భక్తుని నిస్సహాయతను వ్యక్తం చేస్తూనే, భగవత్కరుణపై అతని గాఢమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. ఆయన పదచిత్రణలలో తేజస్సు, తాత్వికత, భయపరిత్యాగం, మరియు దివ్యమైన ఆశ్రయభావం స్పష్టంగా కనిపిస్తాయి.
"శుంభనిశుంభాదైత్యవినాశని, అంభుజనేత్ర ఆదరించుమిక" వంటి పదాలు ఆయన శైలి గొప్పతనాన్ని చాటుతున్నాయి. సంస్కృత, ప్రాకృత పదజాలం మేళవించి, స్థానికతను నిక్షిప్తం చేస్తూ ఆయన్ని భక్తి-సాహిత్యంలో ప్రత్యేకంగా నిలిపాయి. భక్తితో కూడిన ప్రశ్నలశైలి ("కడపరాయుడవనగ నీవె కదా?") వల్ల భక్తుని ఆత్మసమర్పణ భావం సజీవంగా ఆవిష్కృతమవుతుంది.
(మోహన రాగం, ఆది తాళం) (ప్రముఖ అచల సిద్ధాంత అనుకర్త సామలి శ్రీనివాస్, నారాయణపేట గారి నుండి సేకరణ)
“కడప రాయుడవనగ నీవె కదా, నను బ్రోచుటకు నీ
కింతయైనను కరుణ రాదు కదా !
తడయకను నీనామ మంత్రము, మనమునను
స్మరియించుచుండెద
జడుడనని యికతూలనాడకు, కడుముదంబున
ఏలుకొనవే
కామితార్ధములొసగు దేవుడవు, అమితంబుగా నిను గొలచు
చుందుము భక్తులెల్లరము
సమయమిదె నామదిలో కోర్కెలు- తీర్చవే ఓ
స్వామి మ్రొక్కెద
కమల దళలోచనుడ నామది సంభ్రమంబు నొందగాను మాటి
మాటికి తలచుచుండెదను .....” (3)
అని సాగే మరొక సంకీర్తనలో "కమలదళలోచనుడ నామది సంభ్రమంబు నొందగాను మాటిమాటికి తలచుచుండెదను" అనే వాక్యాలు ఆయన అనుభూతిని మాత్రమే కాక, ఆయన భక్తి నిష్ఠకు అద్దం పడతాయి. వీటి ద్వారా ఆయన కవిత్వం భక్తి సాధనకు ఒక మార్గంగా మారింది. నిత్య జీవితంలోని కష్టాలనూ, అనిశ్చితినీ భగవద్భక్తితో ఎలా అధిగమించవచ్చో ఈ కీర్తనల ద్వారా ఆయన చూపించారు. వెంకటదాసు రచనల్లో గల వినయం, నిగర్వత, భగవత్‌నిష్ట మనకు తెలుగు భక్తిసాహిత్యంలో ప్రత్యేక ధోరణిని గుర్తు చేస్తుంది.
ఈ సంకీర్తనల్లోని భాష తేటతెలుగుతో పాటు,
కీర్తనలు ఆలాపనకు అనుకూలంగా ఉన్నాయి. ఇది వారి సంగీత అనుభవాన్ని సూచిస్తుంది. వారి రచనల్లోని పదముల
గాంభీర్యం, శ్రావ్యత భక్తులకు శాంతిని, భావకవులకు సంతృప్తిని కలిగిస్తాయి. కడుదాసు వెంకటదాసు కేవలం
రచయిత మాత్రమే కాక, సజీవ భక్తి ఉద్యమానికి మారుపేరుగా చెప్పవచ్చు. ఈ విధంగా, కడుదాసు వెంకటదాసు గారు
నారాయణపేట ప్రాంతీయ భక్తి సాహిత్యంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిత్వాన్ని సంపాదించారు. ఆయన రచనలు, జీవిత
విధానం — భక్తి కళల పరిరక్షణకు జీవించిన ఒక ఉద్యమంగా భావించవచ్చు. ఆయన రచనలు, ఆశయాలు ఇంకా
విశ్లేషణకు, పరిశోధనకు అపార అవకాశం కలిగినవి.
6.3 నారాయణపేట ప్రాంతలోని తత్త్వశాస్త్రపు దార్శనికుడు -చండ్రుక సాయన్న
నారాయణపేట ప్రాంతంలోని తత్త్వబోధకుల్లో తనదైన స్థానం ఏర్పరచుకున్న మరొక వ్యక్తి, అచల సిద్ధాంత గురు పరంపరలో విశిష్ట స్థానాన్ని పొందిన గురువు చండ్రుక సాయన్న. ఈయన వాస్తవానికి కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిట్కల్ మండలంలో ఉన్న చండ్రుక గ్రామానికి చెందినవారు. నారాయణపేట జిల్లాకి చేరువగా ఉన్న ఈ గ్రామం, భౌగోళికంగా కర్ణాటకలో ఉన్నా, భాషా సాంస్కృతికంగా తెలంగాణ రాష్ట్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈయన రచించిన ముఖ్య గ్రంథం “పరిపూర్ణ బోధామృతసారము”. ఈ గ్రంథంలో ఆయన తత్త్వశాస్త్రాన్ని సులభంగా, అందరికి అర్థం అయ్యే విధంగా వివరించారు. ఇది సంస్కృత గ్రంథాలను, ఉపనిషత్తుల భావనలను, సద్గురుల అనుభవాలను భాషాత్మకంగా మలచిన గ్రంథం. ఇందులో తత్త్వజ్ఞానం, బ్రహ్మము, మాయ, మోక్షము, సాధన, గురు తత్వం వంటి కీలక అంశాలను ఆద్యంతంగా చర్చించారు. ఈ గ్రంథాన్ని "అచల గురు గీతా మందిరం" వారు ప్రచురించారు. ఈ సంస్థ ఆయన తత్త్వబోధనలను, ఆధ్యాత్మిక దృష్టిని పరిరక్షిస్తూ ప్రచురణ చేసినందుకు పాఠకలోకానికి అందుబాటులోకి వచ్చింది.
సాయన్న రచనలు తెలుగులో ఉన్నా, ఆ భాషాశైలి సాధారణమయిన తెలంగాణా ప్రాంతపు ప్రజల భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆయన భాషలో నారాయణపేట ప్రాంత ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆయన భక్తజనాల్లో ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే అంశంగా నిలుస్తుంది. ఆయన వాక్యనిర్మాణం సాంప్రదాయ భక్తి భావనలతో మిళితమై ఉంటుంది. లోతైన తత్త్వబోధనలను కూడా సామాన్యులకు అర్థమయ్యేలా అందించడమే ఆయన రచనల ప్రత్యేకత.
సాయన్న ఆధ్యాత్మిక సంప్రదాయం పూర్తిగా గురు
తత్వంపై ఆధారపడినది. ఆయన గ్రంథాల్లో గురువు యొక్క పాత్రను అత్యున్నతంగా ప్రతిపాదించారు. ఆయన తత్వంలో
గురువు ద్వారా బ్రహ్మజ్ఞానం పొంది, పరిపూర్ణత సాధించవచ్చన్న సందేశం నిగూఢంగా ఉంది. ఆయన పేరుతో
గుముడవెల్లి భారలింగ ప్రభువు, మోముల కృష్ణమాచార్యులు, కస్సా సిద్ధాచల స్వాములు వంటి తత్త్వబోధకులు సైతం
గుర్తించబడ్డారు, అందువల్ల ఆయన ఆధ్యాత్మిక సాంప్రదాయం మరింత విస్తృతమైంది.
ఈయన
రచించిన కొన్ని సంకీర్తనలను గమనించినట్లైయితే…
(హిందోళ రాగం, ఆది తాళం) (ప్రముఖ అచల సిద్ధాంత అనుకర్త సామలి శ్రీనివాస్, నారాయణపేట గారి నుండి సేకరణ)
“వినవే మానస నాదుమాట | నీవు। వినకున్న
నడిచేవు సరిగాని బాట ।
తనువు ధనములన్ని | స్థిరము గావని నమ్మి
వినయాము తోడుత | విధేయుడు వై యుండ
॥వినవే॥
ధరలోన పుట్టినందులకు | నీవు |
గురువరునిచరణాములను అందుకొరకూ
మరువాక నాల్గు విధముల |
శుష్రుషలు జేయ | తరుగులేని మరుగు|యెరిగించు సద్గురుడు ॥వినవే
||
చెప్పితె వినవాని యనుచు। నిన్ను।
అప్పగ జేసెనుమాట వినుమానుచూ।
తిప్పలున్నది చాల | తప్పాక
వినకుంటే
ఇప్పుడె గురుని జే | రప్పాడి దడుగావె ॥
వినవె।|
ఓం నమః శివాయయనుమా| నీవూ| ఉత్తమ
కాంతీ స్వరూపంబు గనుమా |
ఓం నమ శివాయ యనె | వననార్ధమును యెరిగి
| ఓంకార నాదంబు | ఒనరూగ వినవే ॥ వినవే
||
ఇలలో చండ్రూక పురమునందూ | నీవు।
మేల్కొందు వనినేను విందూ ।
నాల్గుసాధనమూల | వాలయంబుగ దెల్పి |
మెలుగొల్పెను మనసా। యిల వీరదాసుకును ॥”..... (4)
అనే సంకీర్తనలో మొదటి నుంచీ చివరి వరకు గురువు ప్రాధాన్యం స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఆయన "వినవే మానస నాదుమాట | నీవు వినకున్న నడిచేవు సరిగాని బాట" అంటూ మనసుకు హితవు చెబుతున్నాడు. ఈ పద్యంలో మనం గురుని మాట వినడం, అనుసరించడం వల్లే నిజమైన మార్గం కనిపిస్తుంది అనే సందేశాన్ని చూడొచ్చు. సాయన్న నమ్మకం ప్రకారం, గురువు చుట్టూ తిరిగే జీవితం అనేది శ్రమ, సంపద, శరీరమూ క్షణికమైనవని గుర్తు చేస్తూ, ఆత్మను బోధించగల గురువును శరణు కోరడం ద్వారానే శాశ్వత మోక్షానికి మార్గం కలుగుతుందని ప్రబోధిస్తాడు. ఒకవైపు ఆయన "ఓం నమః శివాయ" అనే మంత్రమునకు మాధుర్యం జోడిస్తూ, ఓంకార నాదాన్ని గురువు ద్వారా అనుభవించమంటాడు. ఈ పంథాలో ఆధ్యాత్మిక సాధన నాలుగు విధాలుగా – శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఆచరణ – అని చెబుతూ, సాధన పద్ధతులు ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తాడు. సాధారణ ప్రజల భాషలో, సులభమైన ప్రతీతి కలిగే పదాల్లో, లోతైన జ్ఞానాన్ని అందించగలగడం ఆయన ప్రత్యేకత. "చెప్పితె వినవాని యనుచు నిన్ను అప్పగ జేసెనుమాట వినుమానుచూ" అనే వాక్యం ద్వారా సాయన్న గురువు మాటకు శిష్యుడు పూర్తిగా లొంగిపోవాలి అనే తత్వాన్ని బలంగా ప్రకటిస్తున్నాడు.
(మధ్యమావతి రాగం, ఆది తాళం) (ప్రముఖ అచలసిద్ధాంత అనుకర్త సామలి శ్రీనివాస్, నారాయణపేట నుండి సేకరణ)
“హరినామ స్మరణం | గురునామస్మరణం | హరిగురు
భక్తులకు అమితానందం | హరిగురు భక్తులకు అతి మధురపానం
|
హరిగురువునకు బేదం ఇంతైన లేదని | నిరతంబు స్మరియించ
నిర్మలానందం॥
హరిగురువు వేరాని అనుకొనక మనసా| నిరతంబు సేవించ
జన్మ పావనము॥
హరియే నరుడైన శ్రీరాముండు సైతం | గురు పరబ్రహ్మమని
కీర్తించే మనసా॥......” (5)
అనే మరొక సంకీర్తనలో హరి (భగవంతుడు) మరియు గురువు (ఆధ్యాత్మిక గురువు) మధ్య ఉన్న భేదాన్ని తొలగిస్తూ, భక్తుడికి ఈ ద్వయం ఒక్కటే అని బోధించే తాత్విక సందేశం వెలువడుతుంది. "హరినామ స్మరణం | గురునామస్మరణం | హరిగురు భక్తులకు అమితానందం" అనే పంక్తుల్లో భక్తికి ప్రాథమికంగా రెండు మార్గాలు సూచిస్తున్నాడు కవి – భగవంతుని నామస్మరణ మరియు గురునామస్మరణ. ఈ రెండు మార్గాలూ భక్తునికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పారు. ఇందులో నామస్మరణ ద్వారా హృదయం శుద్ధి చెందుతుంది, గురునామం ద్వారా జ్ఞానప్రాప్తి జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు.
"హరిగురువునకు బేదం ఇంతైన లేదని | నిరతంబు స్మరియించ నిర్మలానందం" అనే పంక్తుల్లో హరి (భగవంతుడు) మరియు గురువు వేరువేరు కాదని చెప్పి, ఈ భేదభావన లేకుండా ఎవరైతే నిరంతరం వీరి స్మరణ చేస్తారో వారు నిర్మలానందాన్ని పొందుతారు అని అంటున్నారు. అంటే, మనసులో ఉన్న ద్వంద్వ భావన తొలగించి గురువునే పరబ్రహ్మంగా భావించినప్పుడు భక్తికి కలిగే శుద్ధానందాన్నే కవి "నిర్మలానందం"గా పేర్కొన్నాడు.
"హరిగురువు వేరాని అనుకొనక మనసా| నిరతంబు సేవించ జన్మ పావనము" అనే పాదంలో, హరి మరియు గురువును వేర్వేరుగా చూడకూడదని ఆదేశిస్తున్నారు. వీరిని ఏకత్వంతో సేవించినపుడే మన జన్మ పావనమవుతుంది. అంటే, ఆధ్యాత్మిక మార్గంలో గురువు మార్గదర్శి మాత్రమే కాదు, అతను బ్రహ్మస్వరూపుడే అని భావించే స్థాయికి భక్తుడు చేరినపుడే అతని జీవితం సార్థకమవుతుందని ఉపదేశిస్తున్నారు.
"హరియే నరుడైన శ్రీరాముండు సైతం | గురు పరబ్రహ్మమని కీర్తించే మనసా" అనే పంక్తిలో, హరి నరరూపంలో శ్రీరాముడిగా అవతరించాడనీ, శ్రీరాముడు కూడా తాను పరబ్రహ్మ స్వరూపం అయినా గురువుని ధరి చేరి జ్ఞానాన్ని పొందాడు అని తెలుపుతున్నాడు. అంటే, శ్రీరాముడు వసిష్ఠుని నుండి బ్రహ్మజ్ఞానం పొందాడు. ఇక్కడ భగవంతుడు కూడా గురువును ఆశ్రయించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు, అంటే గురువు స్థానం ఎంత ఉన్నతమైందో ఈ కీర్తనలో స్పష్టంగా తెలుపుతున్నారు.
ఈ విధంగా చండ్రుక సాయన్న గారు రచించిన రచనల్లో
ఆయన ఆలోచనలు, తత్త్వబోధనలు విశాలమైనవి. కర్ణాటక ప్రాంతంలో నివసించి కూడా తెలుగు భాషలో రచనలు చేసి,
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలలో సులభంగా వ్యాప్తి చేశారు. “పరిపూర్ణ బోధామృతసారము” వంటి రచనల
ద్వారా తెలుగు తత్త్వశాస్త్ర పాఠకులకు ఒక మార్గదర్శకునిగా నిలిచిన చండ్రుక సాయన్న గారు, మన సంస్కృతిలో
అజరామరమైన తత్వవేత్తగా నిలిచిపోయారు.
6.4 ఆధ్యాత్మిక శోభకు ప్రతీకలు - మ్యాడం కిష్టన్న
సంకీర్తనలు
నారాయణపేట భక్తి సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న మరో వ్యక్తి మ్యాడం కిష్టన్న. ఈయన 1943లో నారాయణపేట సమీపంలోని జాజాపురం గ్రామంలో జన్మించారు. ఈయన కూడా అచల సిద్ధాంతాన్ని పాటించిన వారిలో ఒకరు. ఈయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ, ఆయన జీవిత లక్ష్యం భగవంతుడి సేవే కావాలనే స్పష్టత చిన్ననాటి నుంచే కనిపిస్తుంది. తల్లిదండ్రులైన మ్యాడం ఇట్టమ్మ, లక్ష్మణ్ణలు భక్తి భావాన్ని, సదాచారాన్ని బోధించారు. ఈ సంస్కారాలతో పెరిగిన కిష్టన్న గారు ఆధ్యాత్మికత వైపు మరింత ఆకర్షితులయ్యారు. ఈయన రచించిన ‘ఆత్మబోధ’ అనే సంకీర్తనల గ్రంథం ఆ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి పొందింది.
ఆయన జీవితాన్ని మరింత ప్రభావితపరిచిన ఆయన గురువులు నీలి హన్మయార్యులు. ఇతను కిష్టన్నకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించారు. కిష్టన్న తన గురువు నుండి శ్రీహరి భక్తిసారాన్ని గ్రహించి, తన జీవితాన్ని సంకీర్తనలతో నింపుకుంటూ సాగించారు. ఆయన రచించిన సంకీర్తనలు భక్తిమార్గాన పయనిస్తున్న వారికి మార్గదర్శకంగా నిలిచాయి. వాటిలోని భావగర్భితమైన పదాలు, హృదయాన్ని తాకే తాత్వికత, భగవంతుడిపై నిబద్ధతను చాటే తీరం ఆయన రచనా శైలికి ప్రత్యేకతనిచ్చాయి.
కిష్టన్న రచించిన వివిధ ఆధ్యాత్మిక వ్యాసాలు
ఆయన అంతర్లీనమైన ఆచారనిష్ఠను, సంస్కార ప్రబోధనలను
ప్రతిబింబిస్తాయి. ఆయన సంకీర్తనల్లో కేవలం భగవంతుని వైభవ గానమే కాకుండా, నిత్యజీవితంలో భక్తి ఎలా
వికసించాలన్న విషయాలను సుస్పష్టంగా వ్యక్తీకరించారు. ఈ రచనలు నేడు కూడా పల్లెల్లో భజన సమయాల్లో,
ఉత్సవాల్లో వినిపిస్తూ, శ్రద్ధతో పఠించబడుతూ ఉంటాయి. ఆయన జీవితంలో వ్యక్తిగతంగా కూడా ఎంతో నిబద్ధత
కనిపిస్తుంది. మొదట మ్యాడం గోవిందమ్మను వివాహం చేసుకున్న కిష్టన్న అనంతరం మ్యాడం వసంతమ్మను ధర్మపత్నిగా
స్వీకరించారు. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ధర్మపత్ని సమేతంగా కొనసాగింది.
ఈయన
రచనల్లో కొన్నింటిని పరిశీలిస్తే…
(శుద్ధధన్యాసి రాగం, ఆదితాళం) (కృతికర్త కుమారుడు మ్యాడం ఆనంద్, నారాయణపేట నుండి సేకరణ)
“సాధుసేవా
చేయవలెనన్నా
సత్పురుషుడావై సాధు సంగము విడువ
వద్దన్నా
సాధుసేవా చేయవలెనూ- కామ
క్రోధములిడువవలెను
మరువకుండగ రామ మంత్రము-మదిలో ఎప్పుడు
దలచవలెను IIసాదుII
దేహమే
దేవాలయంబన్న
ఈ దేహమందున దేవుడున్నడు
ఎరుగరోరన్న
ఆరు చక్రంబూలు దాటి - ఏడో చక్రము ఎక్కి
చూచితే
అష్టదళ పద్మమంబునందున - అంది సుఖ ఆనంద పడరా
IIసాదుII”......(6)
"సాధుసేవా చేయవలెనన్నా..." అనే మొదటి పాదంలో కిష్టన్న మానవుడి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రాముఖ్యతతో వివరించారు. సాధువులను సేవించడమే ముక్తికి మార్గమని స్పష్టంగా చెబుతారు. ‘సాధుసంగము విడువ వద్దన్నా’ అని చెప్పడంలో, తాత్విక దృక్పథాన్ని పొందాలంటే సద్గురువులు, సత్సంగతియే ప్రధానమని బోధిస్తున్నారు. ఈ క్షణికమైన మానవ జీవితం లో కామం, క్రోధం వంటి ఆరాటాలను వదలకుండా సాధన సాధ్యమవుతుందా? అని ఆలోచింపజేస్తారు. భగవన్నామాన్ని మరవకూడదని, “రామ మంత్రము మదిలో ఎప్పుడు దలచవలెను” అని స్పష్టంగా చెప్పడంలో నిత్యధ్యాన ప్రాముఖ్యత ఉద్ఘాటించబడుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక పరమైన ఉపదేశంగా కాకుండా, మానసిక శాంతి కోసం ప్రామాణిక మార్గంగా నిలుస్తుంది.
"దేహమే దేవాలయంబన్న..." అనే పాదంలో కిష్టన్న
స్వీయశరీరాన్ని ఆధ్యాత్మిక అన్వేషణకు పుణ్యక్షేత్రముగా భావిస్తున్నారు. ఇది తాత్వికంగా అత్యంత లోతైన
భావన. శరీరం దేవాలయమైతే, మనలోనే దేవుడు ఉండి ఉంటాడు. కానీ అతన్ని చూడాలంటే లోపలికి ప్రయాణించాలి –
అంటే మానసిక శుద్ధి, చిత్తశుద్ధి అవసరం అని తెలియజేస్తున్నాడు. "ఆరు చక్రంబూలు దాటి ఏడో చక్రము ఎక్కి
జూచితే" అనే మాటల ద్వారా యోగశాస్త్రం ప్రకారం శరీరంలోని శక్తి కేంద్రాల గురించి చెబుతున్నారు. ఇది
కుండలిని శక్తిని సూచిస్తుంది. ఏడవ చక్రం అయిన సహస్రార చక్రం (అష్టదళ పద్మం) గురించి వివరిస్తూ, అక్కడ
తత్వ జ్ఞానాన్ని, పరమానందాన్ని పొందవచ్చని చెబుతారు.
"అవని జాజాపురము
చూడన్నా
సరసూడె హనుమద్దాసుగురుని వేడి
మ్రెక్కన్నా
నమ్మి కొలిచెను కృష్ణయాక్యుడు - సేవచేసి
తెలిపెచూడరా
మళ్లిజన్మము రానేరాదని - కృష్ణయాక్యుడు తెలిపే
చూడరా" అంటూ … (7)
ఈ కీర్తన చివరి చరణంలో కిష్టన్న తన ఆధ్యాత్మిక సాధన ఫలితాన్ని స్పష్టంగా తెలుపుతున్నాడు. శరీరాన్ని దేవాలయంగా భావించి, అంతర్గతంగా తత్త్వజ్ఞానాన్ని అన్వేషించినవాడిగా, ఆయన జీవిత మార్గదర్శిగా హనుమద్దాసుగురువుని ఆశ్రయించాడు. “సరసూడె హనుమద్దాసుగురుని వేడి మ్రెక్కన్నా” అనే వాక్యంలో గురుభక్తి, సాధన, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన చూపిన మార్గాన్ని నమ్మి, సేవచేసిన కిష్టన్న "మళ్లి జన్మము రానేరాదని" అనడం ద్వారా మోక్షసిద్ధిని ప్రకటిస్తున్నాడు.
ఇక్కడ ‘జాజాపురము’ అన్నది ఆయన
నివసించిన గ్రామ నామాన్ని సూచిస్తుంది. తాను అనుసరించిన గురుమార్గం, యోగశాస్త్రం, మరియు సేవాచక్రం
ద్వారా కిష్టన్న పరమాత్మ తత్త్వాన్ని గ్రహించి, జీవన్ముక్తుడయ్యాడని ఈ చరణం చెబుతోంది. అటువంటి గాథలను
మనం నేడు శ్రద్ధతో అర్థం చేసుకోవాలంటే, తన శరీరాన్ని దేవాలయంగా భావించిన కిష్టన్న జీవితం, హనుమద్దాసు
గురువు ఆశ్రమం, సేవారూపమైన భక్తి మరియు తత్త్వదృష్టిలను పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ
కలసి ఒక సాధకుని సాహసయాత్రను పూర్తిచేస్తాయి – ఒక జన్మను తృప్తిగా ముగించే దివ్య మార్గంగా
నిలుస్తాయి.
(కాంభోజి రాగం, ఆదితాళం) (కృతికర్త కుమారుడు మ్యాడం ఆనంద్, నారాయణపేట నుండి సేకరణ)
“చిన్నగున్నది
చూడరా
సూక్ష్మాపుదారి గన్నా వారికి
జాడారా
చిన్నగున్నది స్థూలసూక్ష్మా - కారణంబుల కర్తయైనది
వన్నెచిన్నెలు గాక ఎప్పుడు - కోటి సూర్యప్రకాశ మైనది
IIచిన్నాII
హరిహరాదుల తల్లి
రా
యోచించి జూడ ఓంకారరూపంబూరా
వాసనంబూలన్నిరోసి - వాసిగాగురి జేరెవారికి
పండు వెన్నెల
చిన్నగున్నది - అంది ఆనందంబు పడరా IIచిన్నాII” .....(8)
"చిన్నగున్నది చూడరా" అనే పల్లవితో ప్రారంభమయ్యే ఈ కీర్తనలో కిష్టన్న పరమాత్ముడు భౌతికంగా పెద్దగా ఉండకపోయినా, ఆయన తత్త్వం ఆయన రూపం, శక్తి అనంతమయినదిగా ఉంటుంది అని చాటుతున్నారు. "చిన్నగున్నది స్థూల సూక్ష్మ కారణంబుల కర్తయినది" అనే వాక్యంలో, పరబ్రహ్మాన్ని మూడు స్థాయిలు (స్థూల, సూక్ష్మ, కారణ) అధిగమించిన సృష్టికర్తగా వర్ణించారు. దీనివల్ల మన దృష్టికి చిన్నగా అనిపించే ఆ పరమశక్తిని సృష్టి, స్థితి, లయలను నిర్వహించగలిగే మహాశక్తిగా అర్థం చేసుకోవచ్చు.
"వన్నెచిన్నెలు గాక ఎప్పుడు – కోటి సూర్య ప్రకాశమైనది" అన్నప్పటికీ, ఆ పరబ్రహ్మానికి శారీరక గుణాలు లేవు. కానీ, అంతటా ప్రకాశించే వెలుగు - కోటి సూర్యుల వెలుగు అంతటి మహిమ ఉంది. ఈ సున్నితమైన దర్శనాన్ని పొందడం కొరకు "సూక్ష్మాపుదారి గన్నా వారికి జాడారా" అంటూ, ఈ మార్గం సంక్లిష్టమైనదిగా – కానీ గురుపరీక్ష, సాధన, సాధకుడి సంయమనం ద్వారా సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. ఆ తర్వాతి చరణంలో – "హరిహరాదుల తల్లి రా" అన్న వాక్యంతో, బ్రహ్మ, విష్ణు, శివుడులకు తల్లిగా సేవ చేసిన పరాశక్తిని గురించి వర్ణించారు. ఆ పరాశక్తి "ఓంకారరూపం"గా ఉండి, సాధకుడు తాను చేయవలసిన గమ్యాన్ని చేరతాడని తాత్త్వికంగా చెప్తున్నారు.
చివరగా, "పండు వెన్నెల చిన్నగున్నది - అంది ఆనందంబు పడరా" అన్న పాదంలో — పరబ్రహ్మం మనకు తేలికగా కనబడదనీ, కానీ అది అనుభవంలో మాత్రం ఎంతో మధురంగా, శాంతిదాయకంగా, మౌనానందంగా తానే దిగి వచ్చి అందిస్తుందని భావవ్యక్తీకరణ చేశారు. పండు వెన్నెల అనేది ఇక్కడ కేవలం రూపానికి కాదు, అనుభూతికి ప్రతీకగా చెప్పవచ్చు. ఇలా ఈయన తన సంకీర్తనల్లో పొందుపర్చిన తాత్విక భావనలు, బోధనలు ఆయన శైలిలో భాషా సౌందర్యాన్ని మరింత ప్రభావితం చేస్తున్నాయి. ఈయన రచనలపై కూడా మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది.
7. ఉపసంహారం
- ఇలా నారాయణపేట ప్రాంతానికి చెందిన సంకీర్తనకారుల రచనలు — ఎల్లయ్య, వెంకటదాసు, సాయన్న, కిష్టన్న, — స్థానిక భక్తికావ్య సంపదలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. ఇటువంటి కవులు, రచయితలు ఎందరో ఈ ప్రాంతంలో ఉన్నారు. వారి రచనలలో తత్త్వచింతన, భాషాప్రయోగం, స్థానిక సంస్కృతి పరిమళాలు సమగ్రంగా వెల్లివిరుస్తాయి.
- భక్తి పరంగా మాత్రమే కాక, సామాజిక అభిప్రాయాలకూ దోహదపడే అంశాలుగా ఈ కీర్తనలు నిలుస్తాయి. అయితే వీటి మీద సరైన పాఠ్యపరిశీలన, మూలగ్రంథ ప్రమాణాలు, గానపద్ధతులపై విస్తృత పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది.
- ప్రత్యేకంగా, వీరి రచనలలోని స్థానిక భాషా పద ప్రయోగాలు, గ్రామీణ ఆచార వ్యవస్థల ప్రతిబింబం, అంతర్గత తత్వ ఆవిష్కరణ, తదితర అంశాలపై భవిష్యత్తులో మరింత లోతైన అధ్యయనాలు జరగాలి.
- ఈ రచనలను సంగీతసాహిత్య కోణంలో, భక్తి ఉద్యమాల పరంపరలో, లేదా ప్రాంతీయ సమాజ నిర్మాణ చరిత్రలో అధ్యయనం చేయడమేగాక, నూతన శోధకులకు వీటిని డిజిటలైజ్ చేసి అందుబాటులోకి తేవడం, గానసంప్రదాయాలతో అనుసంధానించడం వంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది.
- కాబట్టి నారాయణపేట సంకీర్తనా సాహిత్యంపై మరింత పరిశోధన చేసినపుడు మాత్రమే... అది తెలుగు సాహిత్యంలోని భక్తి సంప్రదాయానికి, ప్రాంతీయ సాంస్కృతిక అధ్యయనాలకు నూతన దారులు చూపగలదు.
8. సూచికలు
- వింజమూరు గురుభక్త మండలి కీర్తనలు, మిడిదొడ్డి ఎల్లయ్య రచనలు, పుట. 25
- 2. హరిహర భజన కీర్తనలు, కడదాసు వెంకటదాసు, పుట. 4
- హరిహర భజన కీర్తనలు, కడదాసు వెంకటదాసు, పుట. 14
- పరిపూర్ణ బోధామృతసారము, మంత సాయనాచల స్వామి, పుట.195
- పరిపూర్ణ బోధామృతసారము, మంత సాయనాచల స్వామి, పుట. 99
- ఆత్మబోధ, మ్యాడం కిష్టన్న, పుట. 28
- ఆత్మబోధ, మ్యాడం కిష్టన్న, పుట. 29
- ఆత్మబోధ, మ్యాడం కిష్టన్న, పుట. 32
9. ఉపయుక్తగ్రంథసూచి
- ఎల్లయ్య, మిడిదొడ్డి. (2002). వింజమూరు గురుభక్త మండలి కీర్తనలు, నారాయణపేట
- కిష్టన్న, మ్యాడం. (2025). ఆత్మబోధ. స్వీయ ప్రచురణ, నారాయణపేట
- కుర్మన్న, జి. (2024). లోకాయపల్లి సంస్థాన చరిత్ర పరిశోధనా వ్యాసం, నారాయణపేట జిల్లా సమగ్ర స్వరూపం. తెలంగాణ సారస్వత పరిషత్తు, హైదరాబాదు
- చిన తిరుమలాచార్య, తాళ్ళపాక. (1989). సంకీర్తన లక్షణము. మొదటి సంపుటం. ఇన్టిస్టూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, మద్రాసు
- దయానంద, పొన్నాల రాజయోగి. (1990) శివరామ దీక్షితయ్యమను బృహద్వాసిష్ఠం. పొన్నాల రాజయోగి అచల గురుపీఠము, సికింద్రాబాదు.
- నర్సప్ప, తాటి. (2024). నారాయణపేట మిశ్రమ సంస్కృతి పరిశోధనా వ్యాసం, నారాయణపేట జిల్లా సమగ్ర స్వరూపం. తెలంగాణ సారస్వత పరిషత్తు, హైదరాబాదు
- బాలస్వామి, కె. (2024). జిల్లా సాహితీ మూర్తులు పరిశోధనావ్యాసం, నారాయణపేట జిల్లా సమగ్రస్వరూపం. తెలంగాణ సారస్వత పరిషత్తు, హైదరాబాదు
- రవికిరణ్. (2024). నారాయణపేట జిల్లా మాండలికాలు పరిశోధనావ్యాసం, నారాయణపేట జిల్లా సమగ్రస్వరూపం. తెలంగాణ సారస్వత పరిషత్తు, హైదరాబాదు
- వెంకటదాసు, కడుదాసు. (2005). పార్వతీశ్వర శతకము. స్వీయ ప్రచురణ, నారాయణపేట
- పైదే. హరిహర భజన కీర్తనలు. (2001). పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణలు, హైదరాబాదు
- వెంకటేశ్వరరావు, పొత్తూరి.(2015). పారమార్థిక పదకోశం. ఎమెస్కో ప్రచురణలు, హైదరాబాద్
- శివానంద భగవాన్, అవతార్. (1980). భక్తి సంకీర్తనము. యోగ వేదాంత అరణ్య విద్యా పరిషత్తు, శివానంద నగరము
- సాంబశివరావు, ఊలపల్లి. (2013). శ్రీమద్భాగవతం వ్యాస మహర్షి విరచితం, ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ వారి ప్రచురణలు
- సాయన్న, మంత. (2020). పరిపూర్ణ బోధామృతసారము. అచల గురు గీతామందిరము ప్రచురణలు, చండ్రుక
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

