AUCHITHYAM | Volume-06 | Issue-04 | April 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
9. పోతన భాగవతం: ఉత్ప్రేక్ష సౌరభాలు

డా. జి. శ్రీనివాసరావు
అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
తారా ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి )
సంగారెడ్డి, తెలంగాణ.
సెల్: +91 9848020646, Email: drsrinivasprofessor@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.03.2025 ఎంపిక (D.O.A): 31.03.2025 ప్రచురణ (D.O.P): 01.04.2025
వ్యాససంగ్రహం:
ఇతివృత్తము కావ్యశరీరమైతే అలంకారము లలంకారములు. పోతనకవి తన భాగవతములో శబ్దార్థాలంకారములను పరమరమణీయముగా ఎలాప్రయోగించాడు? కథాసందర్భానికి ఉత్ప్రేక్షాలంకారము ఎలా సౌందర్యహేతువయ్యిందో తెలుపుతూ పోతన మందార మకరంద మాధుర్య రచనా విధానము అభివ్యక్తీకరించడం ఈ వ్యాస రచన ముఖ్యోద్దేశం. ముందుగా వేసుకున్న ప్రణాళికననుసరించి దండి, మమ్మటుడు, జయదేవుడు, విద్యానాథుడు మొదలగు భారతీయాలంకారికులు ఉత్ప్రేక్షకిచ్చిన నిర్వచనాలు, అందలిరకములు వివరిస్తూ పోతన భాగవతంలో ఉత్ప్రేక్ష సాధించిన కథారామణీయకత తెలుపబడుతుంది. దీనికి లాక్షణిక, విశ్లేషణాత్మక వంటి పరిశోధన పద్ధతులనుసరింపబడుతాయి. పోతన భాగవతంలోని రసము, భక్తి, పాత్రచిత్రణ, భాషా మొదలగు అంశాలపై పలు పరిశోధనలు జరిగాయి. పుంభావ సరస్వతులైన పోతన వంటి కవీశ్వరులు రచనలలోని కవితాత్మను అందిపుచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Keywords: ప్రాచీన తెలుగుసాహిత్యం, అలంకారములు, ఉత్ప్రేక్ష, పోతన శబ్దార్థాలంకార ప్రయోగం, భారతీయ ఆలంకారికుల లాక్షణిక చర్చ.
1. ప్రవేశిక:
ఉపమా, రూపకాలంకారాల తరువాత కవులు ప్రయోగించిన అర్థాలంకారాలలో చెప్పుకోదగినది ఉత్ప్రేక్షాలంకారం. ఈ వ్యాసంలో ఉత్ప్రేక్ష అలంకారం గురించి ప్రాచీన భారతీయాలంకారికులు ఇచ్చిన నిర్వచనాలు వర్గీకరణ వంటి విషయాలను సవివరంగా తెలియజేస్తూ పోతనగారు తన భాగవత భాగంలో ప్రయోగించిన ఉత్ప్రేక్షాలంకారాలను లక్ష్య, లక్షణ సమన్వయం చేయడం జరుగుతుంది. ఉత్ప్రేక్షకు భారతీయాలంకారికులు ఇచ్చిన స్థానము, వ్యుత్పత్తి, నిర్వచనాలు, వర్గీకరణను సాకల్యంగా పరిశీలిద్దాం.
2. నిర్వచనాలు:
- దండి ‘స్వభావసిద్ధముగా ఒక రీతిలో ఉన్న ప్రవృత్తి ఎచ్చట ఉత్ప్రేక్షింప (ఊహింప) బడునో దానిని ఉత్ప్రేక్షాలంకారమంటారు.’ (దండి -147) ఉత్ప్రేక్షలో అప్రకృతమువైపు మొగ్గు చూపుట, లేదా ప్రకృతమును పూర్తిగా కప్పివేయుట ఉంటుందని వీరి అభిప్రాయము.
- జయదేవుడు “వస్తువును బట్టి, హేతువును బట్టి, ఫలమును బట్టి యూహించుటు ఉత్ప్రేక్షాలంకారం”(జయదేవుడు - 54) అని చెప్పాడు.
- విద్యానాథుడు “ఉపమాన ధర్మ సంబంధము వలన ఉపమేయము, ఉపమానము గానే సంభావింపబడిన యెడల ఉత్ప్రేక్షాలంకారము” (విద్యానాథుడు - 447) అని నిర్వచించెను.
- రామరాజభూషణుడు “ఉపమేయమునకు కలిగిన / యుపమాన గుణక్రియాది యోగముచేనా యుపమానమెయని తలచిన / నపుడది యుత్ప్రేక్షయయ్యె...” (రామరాజభూషణుడు -602)
పైన పేర్కొన్న ప్రముఖుల నిర్వచనాలను బట్టి ఉత్ప్రేక్షలక్షణాలను ఈ క్రింది విధంగా క్రోడీకరించవచ్చు.
1. ఉపమేయము, ఉపమానముగా ఊహించబడుతుంది.
2. ఉపమానము లోకప్రసిద్ధమైనది కాకుండా ఉంటుంది. లేదా కేవల కవి కల్పితమై ఉంటుంది.
3. ఉపమేయ ఉపమానములకు గల సామ్యధర్మము కేవలము ఊహాకల్పితము.
4. ఇది వస్తు, హేతు, ఫలముల నాశ్రయించి ఉంటుంది.
3. వర్గీకరణ
ఉత్ప్రేక్ష సాదృశ్యమూలక – అభేద ప్రధానమని, సామ్యధర్మము అధ్యవసాయముగా కలిగినదని మమ్మట రుయ్యక, విద్యానాథ, విద్యాధర, రామరాజభూషణాదులు పేర్కొనిరి. ఉత్ప్రేక్ష వ్యంగ్యమైన సాధర్మము కలదని మమ్మటుడు (మమ్మటుడు - 608) చెప్పాడు.
జయదేవుడు – ఉత్ప్రేక్షను ఆరు రకాలుగా చెప్పెను. అతని వర్గీకరణ క్రింది విధంగా ఉంది. (జయదేవుడు - 54)
1. వస్తూత్ప్రేక్ష. మరల ఇది రెండు రకాలు. 1. ఉక్తవిషయము, 2. అనుక్త విషయము.
2. హేతూత్ప్రేక్ష – ఇది రెండు రకాలు 1. సిద్ధము, 2. అసిద్ధము.
3. ఫలోత్ప్రేక్ష – ఇది రెండు రకాలు – 1.సిద్ధము, 2. అసిద్ధము.
విద్యానాథుడు, విద్యాధరుడు, రుయ్యకుడు మొదలగు వారు చేసిన ఉత్ప్రేక్ష వర్గీకరణ స్థూలంగా ఒకేరకంగా ఉంది.
ఉత్ప్రేక్ష 1. వాచ్యోత్ప్రేక్ష, 2. ప్రతీయమానోత్ప్రేక్ష (లేదా) గమ్యోత్ప్రేక్ష అని రెండు రకాలు.
1. వాచ్యోత్ప్రేక్ష.
‘ఊహను ప్రతిపాదించే నూనము, ధ్రువము, ప్రాయము, అనన్, శంకించు, కాబోలు, ఊహించు, భావించు, అనుమానించు మొదలగు పదములు ప్రయోగింపబడితే అది వాచ్యోత్ప్రేక్ష’ (రామరాజ భూషణుడు - 603)
2. ప్రతీయమానోత్ప్రేక్ష (లేదా) గమ్యోత్ప్రేక్ష.
‘ఊహను ప్రతిపాదించే పదములు వాచ్యంగా లేకుండా ప్రతీయమానమైనచో అది ప్రతీయమానోత్ప్రేక్ష (లేదా) గమ్యోత్ప్రేక్ష’(రామరాజ భూషణుడు - 603)
4. ఉత్ప్రేక్ష – పోతన భాగవతంతో అన్వయం.
ఉత్ప్రేక్షలోని ప్రధాన విభాగాలకు లక్ష్యలక్షణ సమన్వయం చేయబడుతుంది. ఉత్ప్రేక్ష 1. వ్యాచ్యోత్ప్రేక్ష, 2. ప్రతీయమానోత్ప్రేక్ష అని రెండు రకాలు.
4.1 వ్యాచ్యోత్ప్రేక్ష
వ్యాచ్యోత్ప్రేక్షలో – ఊహను తెలిపే ప్రాయము, అనన్, శంకించు మొదలగు పదాలు ప్రయోగింపబడతాయి. వ్యాచ్యోత్ప్రేక్షలో 1. వస్తు (లేదా) స్వరూపోత్ప్రేక్ష 2. హేతూత్ప్రేక్ష, 3. ఫలోత్ప్రేక్ష అనే మూడు ప్రధాన విభాగాలను చెప్పవచ్చు.
4.1.1 వస్తు (లేదా) స్వరూపోత్ప్రేక్ష
స్వరూపోత్ప్రేక్షలో ఉపమేయం ఉపమానంగా ఊహించబడుతుంది.
గగనారణ్య చరాంధకార గజమున్ గాలాహ్వయ వ్యాధుడ
చ్చుగ గట్టం గమకించి మచ్చిడుటకై చూతాంకుర శ్రేణిచే
నొగి గల్పించిన కందుకం బనగ సూర్యుండంత వీక్షింపగా
దగె మంద ప్రభతోడ బశ్చిమ మహాధాత్రీ ధరేంద్రంబునన్ (భాగ. 10. పూర్వ. 1287)
ఆకాశమనే అరణ్యంలో అంధకారమనే ఏనుగుని పట్టణానికి కాలమనే బోయవాడు ఎర్రగా పెట్టిన ఎర్రని లేతమామిడి చిగుర్ల ముద్ద ఏమో అన్నట్టుగా అస్తమిస్తున్న సూర్యుడు ఉన్నాడని ఉత్ప్రేక్షించారు. ఎర్రగా గుండ్రంగా ఉన్న సూర్యబింబాన్ని ఎర్రని లేత మావిచిగుర్ల ముద్దలాగా ఉందనడం స్వరూపోత్ప్రేక్షగా చెప్పవచ్చు. కారణం ఉపమేయమైన సూర్యుడు, ఉపమానమైన చూతాంకుర శ్రేణిగా ఊహింపబడటం. మందప్రభతో ఉన్న సూర్యుడు కృష్ణుని చేతిలో చావబోయే కంసునికి ప్రతీక. ఎండపోయి చల్లని వెన్నెల రాబోతుంది. దుష్టుడైన కంసుని పాలనపోయి శ్రీకృష్ణుని కనుసన్నలలో అందరు ఆనందంగా ఉండే సమయం రాబోతుంది. ఈ సందర్భంలో ఈ పద్యం కథకు రమణీయకతను చేకూర్చుతుంది.
భూమినిండ మింట బూర్ణమై కర్కట
మకర మీనరాశి మహితమైన
హరయశస్సుధాబ్ధి యందుల తుంపురు
లనగ జుక్కలొప్పె నాకసమున (భాగ. 10. పూర్వ 1291)
భూమి, ఆకాశంలో నిండిన కర్కట, మకర, మీనరాశి యుతమైన శివుని యశస్సు అనే సుధాసాగరంలోని తుంపరులేమో అన్నట్టుగా చుక్కలు ప్రకాశించాయనే ఊహ చక్కగా ఉంది. ఉపమలో కన్నా ఉత్ప్రేక్షలో కవి కల్పితం ఎక్కువగా ఉంటుంది. భూమి పైన (నీటిలోను) కర్కట (ఎండ్రకాయ), మకర (మొసలి), మీన (చేప) లు ఉంటాయి. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు గుంపులను అవి మనుషులకు కన్పించే ఆకృతిని బట్టి రాశి మకరరాశి, మీన రాశి అని పిలుస్తుంటాం. రాత్రి చీకటి పడింది. ఆకాశంలో చుక్కలు కనిపించాయి. అయితే ఆ చుక్కలు శివుని యశస్సుధాబ్ధిలోని తుంపరలనడం శివుని ఔన్నత్యానికి, పోతన కల్పనాశక్తికి అద్దం పడుతుంది.
ధరణిని రాజనామమున దా దగు రెండవ చంద్రుడో ! యనన్ (భాగ. 4-646) పృథుచక్రవర్తి పరిపాలనను చెబుతూ సుభిక్షంగా ఉందంటూ అతన్ని రెండవ చంద్రుడేమో అన్నట్లు ఉన్నాడని ఉత్ప్రేక్షిస్తాడు పోతన. చంద్రుడు ఒకడే ఉంటాడు. చంద్రుని లక్షణాలను పృథుచక్రవర్తి లక్షణాలతో అధ్యవసాయం చేస్తూ చెప్పబడింది. కాబట్టి ఇది స్వరూపాత్ప్రేక్ష.
స్వరూప మాలోత్ప్రేక్ష
స్వరూపోత్ప్రేక్ష మాలారూపంలో కూడ ఉంటుంది.
ప్రాచీదిశాంగనా ఫాల తలంబున – దీపించు సింధూర తిలకమనగ
దర్పించి విరహుల ధైర్యవల్లులు ద్రెంప – దర్పకుండెత్తిన దాత్రమనగ
నలిగి కాలకిరాతు డంధకార మృగంబు – ఖండింప మొఱయించు ఖడ్గమనగ
గగన తమాల వృక్షము తూర్పు కొమ్మను – లలితమై మెఱయు పల్లవ మనంగ
దొగలు సంతసిల్ల దొంగలు భీతిల్లి – గడలి మిన్ను ముట్టి కడలు కొనగ
బొడిచె శీతకరుడు భూరి చకోరక – ప్రీతికరుడు జార భీతికరుడు (భాగ. 10. పూర్వ - 1295)
ఉపమేయమైన చంద్రుణ్ణి ఉపమానములైన సింధూర తిలకం, దాత్రం, ఖడ్గం, పల్లవములుగా ఊహించడం జరిగింది. కావున ఇది మాలాస్వరూపోత్ప్రేక్ష. ఈ క్రింది పద్యం కూడా స్వరూప – మాలోత్ప్రేక్షకే ఉదాహరణ.
పౌలోమి తన బాలు పాన్పుపై గనుపట్ట – బన్నిన పవడంపు బంతి యనగ
నాయురర్ధముల వ్యయంబు లొత్తిలి చాటు – కాల జాంఘికు చేతిఘంట యనగ
ఘన జంతు జీవిత కాలరాసులు విధి – కొల్వనెత్తిన హేమకుంభ మనగ
బశ్చిమ దిక్కాంత బరుగగై సేయుచో – ముందర నిడుకొన్న ముకురమనగ
గోపతాపోపశమ దివ్యఘటిక యనగ – బద్మినీ కాంత నోముల ఫలమనంగ
మూడు మూర్తుల సారంపు ముద్ద యనగ – మిహిర మండల ముదయాద్రి మీద నొప్పె (భాగ. 10 పూర్వ 1303)
4.1.2 హేతూత్ప్రేక్ష
హేతువు కాని దానిని హేతువుగా చెప్తే అది హేతూత్ప్రేక్ష.
ఈ హేమంతము రాకకు
శ్రీహరి యొక్కింత వణకి చింతింపంగా
నోహూ వెఱవకు మనుచు
న్నా హరికిని శ్రీ కుచంబు లభయంబిచ్చెన్ (భాగ. 10. పూర్వ 804)
హేమంత ఋతువులోని చలి తీవ్రతను వర్ణిస్తూ – హేమంతము వచ్చినందుకు శ్రీ మహావిష్ణువు వణుకుతూ ఈ చలి తీవ్రతకు బ్రతకడమెలా అని భయపడుతుండగా లక్ష్మీదేవి యొక్క పాలిండ్లు‘ఓహో భయపడకు భయపడకు మేమున్నాము కదా’అని అభయమిచ్చాయట. ఎంత చక్కని ఊహ ఇది హాలుని గాథా సప్తశతిని తలపింప చేసే శృంగార రసగుళిక వంటి పద్యం. మహాభక్తకవీశ్వరుడు, సీతారామ దర్శనం పొందినవాడు అయి ఉండి కూడా శృంగార రసపోషకమైన ఇటువంటి పద్యం వ్రాయటం తెలుగు వారి అదృష్టం. పాలిండ్లు ఎదుటి వారి బాధను తెలుసుకోలేవు. దానికి తగినట్లు స్పందించడం గాని ఎదుటి వారితో మాట్లాడటం గాన చేయలేవు కాని అవి మాట్లాడినట్లుగా ఇక్కడ చెప్పబడింది. హేతువు కానిది హేతువుగా ఊహింపబడింది కావున ఇది హేతూత్ప్రేక్ష.
కళలు గలుగుగాక కమల తోడగు గాక
శివుని మౌళి మీదుజేరుగాక
నన్యునొల్ల దపనుడైన మత్పతి యని
సాధ్విభంగి కమల జాతి మొగిడె (భాగ. 10 పూర్వ 1289)
సూర్యాస్తమయ, చంద్రోదయ సమయాన్ని వర్ణిస్తున్న సందర్భంలో చెప్పిన పద్యం ఇది. ఉదయం సూర్యకిరణాలు తాకగానే వికసించి, సూర్యాస్తమయం కాగానే ముకుళించుకుపోవడం తామర పూవ్వుల సహజలక్షణం. ఈ లక్షణాన్ని ఆధారంగా చేసుకొని భర్తపై తప్ప, ఎన్ని శుభలక్షణాలున్నా పరపురుషునికై మనస్సు పోనివ్వని పతివ్రత యొక్క లక్షణాలతో తామరపూల లక్షణాలని అధ్యవసాయం చేస్తున్నాడిక్కడ కవి.
చంద్రుడికి పదహారు అందమైన కళలు ఉంటే ఉండవచ్చు. అతడు లక్ష్మీదేవికి తోబుట్టువు అయితే కావచ్చుగాక. సాక్షాత్తు పరమశివుని తలపైకెక్కిన ఎక్కుగాక. యౌవనుడు, అందగాడు అయితే అగుగాక మా భర్త అయిన సూర్యున్ని తప్ప ఇతరులను ఇష్టపడము అనుకొని సాయంకాలం వేళ తామర పూలన్నీ ముకుళించుకు పోయాయట. రాత్రి ముకుళించుకు పోవడం తామర పూలకు సహజమే అయినా, హేతువు కాని పై దాన్ని ముకుళించుకుపోవడానికి హేతువుగా చెప్పడం వల్ల ఇది హేతూత్ప్రేక్ష.
4.1.3 ఫలోత్ప్రేక్ష
ఫలము కాని దానిని ఫలముగా ఊహించుట ఫలోత్ప్రేక్ష. శ్రీకృష్టుడు గోపికలు ఒక సరస్సులోనికి దిగి అనేక విధాలుగా సరస సల్లాపాలాడుతూ జలక్రీడలాడు సందర్భంలో
.... సారసంబులకుం గరంబులు సాచుచు మరాళంబుల జోపుచు జెన్ను మిగిలిన చన్నులు యెత్తువత్తుమను నెపంబుల దపంబులు నీట గావించు మాడ్కిని సంచరించు చక్రవాకంబులు దోలుచు....(భాగ. 10. పూర్వ - 1098)
చక్రవకములను స్త్రీ వక్షోజాలతో పోల్చడం కవి సంప్రదాయం. ఇక్కడ చక్రవాక పక్షులు గోపికల పాలిండ్లకన్నా ఎత్తుగా లావుగా కావడానికి నీళ్ళలో తపస్సు చేస్తున్నట్లు ఊహింపబడింది. చక్రవాకములు నీళ్ళల్లో ఉండడం సహజం అవి ఏ ఫలాన్ని పొందడానికి తపస్సు చేయవు కానీ ఇక్కడ గోపికల స్తనముల వలే ఎత్తుగా లావుగా ఉండడానికి తపస్సు చేస్తున్నట్లుగా ఊహింపబడింది. అంటే ఒక ఫలితాన్ని ఆశిస్తూ తపస్సు చేస్తున్నట్లుగా చెప్పబడింది. కాని నిజానికి అవి ఏ ఫలితాన్ని ఆశించడం లేదు. అసలు తపస్సే చేయడం లేదు. కోరని ఫలితాన్ని కోరినట్లుగా ఊహించబడింది కాబట్టి ఇది ఫలోత్ప్రేక్ష.
4.2 గమ్య / ప్రతీయమానోత్ప్రేక్ష
ఊహను సూచించే పదాలు లేని ఉత్ప్రేక్షను గమ్య / ప్రతీయమానోత్ప్రేక్ష అంటారు.
4.2.1 ప్రతీయమాన – స్వరూపోత్ప్రేక్ష
పాలమున్నీటిలోపలిమీది మీగడ – మిసిమి జిడ్డును జేసి మేను వడసి
క్రొక్కారు మెఱుగుల కొనల తళుక్కుల – మేనిచే గల సిగ్గు మెఱగు చేసి
నాడు నాటికి బ్రోది నవకంపు దీగెల – నునుబోద నెయ్యంబు నూలుకొలిపి
క్రొవ్వారు కెందమ్మి కొలువులు బ్రొద్దును – బొలిసిన వలపుల బ్రోదివెట్టి
పసిడి చంపకదామంబు బాగు గూర్చి – వ్రాలు కొన్నెల చెలువున వాడిదీర్చి
జాణతనమును జేతుల జిడ్డు విడిచి – నలువ యీ కొమ్మ నొగి జేసినాడు నేడు (భాగ. 8-266)
పాల సముద్రము నుంచి ఆవిర్భవించిన లక్ష్మీదేవి యొక్క సౌందర్యాన్ని పాల సముద్రంలోని మీగడ నుండి మెరుపు తీగల తళుకుల నుండి, ఎర్రతామర పూలనుండి, బంగారు చంపక పుష్పాలనుండి బ్రహ్మ రూపొందించినట్లుగా చెప్పబడింది. లక్ష్మీదేవి సౌందర్య కారకాన్ని మరో విధంగా చెప్పడం జరిగింది. ఈ పద్యంలో ఈ ఊహను తెలియజేసే పదాలు లేకపోవడం వల్ల. ఇది ప్రతీయమాన – స్వరూపోత్ప్రేక్ష.
4.2.2 ప్రతీయమాన హేతూత్ప్రేక్ష
కోదండ భంగ నిర్గత
నాదము వీనులకు భీషణంబై యాశా
రోదోందరములు నిండుచు
భేదించెన్ భోజవిభుని బింకము నధిపా! (భాగ. 10 పూర్వ - 1283)
కంసుడు ఏర్పాటు చేసిన ధనుస్సును కృష్ణుడు ఎక్కు పెట్టి విరిచెను. ఆ శబ్దం విశ్వమంతా నిండి కంసుడి బింకాన్ని అణచినట్లుగా చెప్పబడింది. దీంట్లో ఊహ ప్రతిపాదించే పదాలు లేవు. కావున ఇది ప్రతీయమాన హేతూత్ప్రేక్ష
5. ఉపసంహారం:
- వేదవ్యాస విరచితమైన శ్రీమద్భాగవత మహాపురాణమును ఆంధ్రీకరించునపుడు కావ్యకథాసందర్భమునకు శోభను ఇనుమడింప జేయుటకు పోతన అనుసరించిన కావ్యలక్షణాలలో అలంకారములు కూడా ప్రధానభూమిక పోషించాయి.
- "వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్ " అని మన ఆలంకారికులు సెలవిచ్చారు. కావున రసాత్మక కావ్య నిర్మాణము చేయుటలో అలంకారములను పోతన ఆయా సందర్భములలో సృష్టించిన తీరు ఔచితీమంతముగా ఉంది.
- పోతన అనంతర కవులకు ఈ విధానము అనుసరణీయ మైనది. "మోక్ష సాధన సామగ్ర్యామ్ భక్తిరేవ గరీయసి" అన్నారు కావున సహృదయ పాఠకుని హృదయములో భక్తి రసానందము కలిగించుటలో పోతన కృతకృత్యులయ్యారు. ఈ భక్తి రసానంద సముత్పన్నమునకు సత్కవీశ్వరులు పోతన అలంకారములను వాడిన విధానము పరమరమణీయము, కమనీయము.
- అలంకారములలో ఉత్ప్రేక్షను వాడిన తీరు ఈ వ్యాసములో వివరింప బడింది. ఆలంకారిక రచన చేయుటలో నేటి కవులకు సహితం పోతన కవి ఆదర్శ ప్రాయులు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
6. ఉపయుక్తగ్రంథసూచి:
- గణపతి శాస్త్రి, చర్ల. 1972. సాహిత్య సౌందర్య దర్శనము. హైదరాబాదు, రచయిత.
- జయదేవుడు. 1994. చంద్రాలోకసమున్మేషము. (వ్యా. స్ఫూర్తిశ్రీ) గుంటూరు వ్యాఖ్యాత (ఆరవ ముద్రణ)
- దండి. 1981 కావ్యాదర్శ:. (వ్యా. పుల్లెల శ్రీరామచంద్రుడు) హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.
- పెద్దయ, విన్నకోట. 1972. కావ్యాలంకార చూడామణి. మదరాసు, వేదము వేంకట రాయశాస్త్రి అండ్ బ్రదర్స్, ఏడవ ముద్రణ (ప్రథమ ముద్రణ, 1892)
- పోతన, బమ్మెర. 1994. శ్రీమహాభాగవతము. (మొదటి, రెండవ సంపుటములు) హైదరాబాదు, తెలుగు విశ్వవిద్యాలయం (ఏడవ ముద్రణ)
- మమ్మటుడు. 1995. కావ్యప్రకాశము (వ్యా. పుల్లెల శ్రీరామచంద్రుడు) హైదరాబాదు, సంస్కృత భాషా ప్రచార సమితి.
- రామరాజభూషణుడు. 1976. కావ్యాలంకార సంగ్రహము (సరసభూపాలీయము). (వ్యా. సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి), మచిలీపట్నం, మద్రాసు, సికింద్రాబాదు. ఎమ్. శేషాచలం అండ్ కంపెనీ, 5 వ ముద్రణ, (ప్రథమ ముద్రణ 1945)
- విద్యాధరుడు. 1974. ఏకావళి. (వ్యా. జమ్ముల మడక మాధవరామశర్మ) గుంటూరు. అభినవ భారతి.
- విద్యానాథుడు. 1972. ఆంధ్ర ప్రతాపరుద్రయశోభూషణము. (ఆంధ్రానువాదము, చెలమచర్ల రంగాచార్యులు) హైదరాబాదు, శ్రీనివాస పబ్లికేషన్స్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.