AUCHITHYAM | Volume-06 | Issue-04 | April 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
7. చంద్రబోస్ గేయాలు: భక్తి వైశిష్ట్యం

కొప్పిశెట్టి కుశరాజు
పరిశోధకులు, తెలుగుశాఖ,
ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9912806863, Email: rajukoppisetti22@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.03.2025 ఎంపిక (D.O.A): 30.03.2025 ప్రచురణ (D.O.P): 01.04.2025
వ్యాససంగ్రహం:
మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది. మాటలో చెప్పలేని భావానుభూతులను రాగయుక్తమైన పాట ద్వారా చెబితే మనసుకు హత్తుకుంటాయి. సామాన్య జనానికి అందుబాటులో ఉండటమే సినిమాపాట గొప్పతనం. ఆనందోపదేశాలు రెండూ పాట వల్ల ప్రయోజనాలు. తెలుగు సినిమా ప్రపంచంలో ప్రసిద్ధగీతరచయితల్లో కునుకుంట్ల సుభాష్ చంద్రబోస్ ఒకరు. బోస్ రచించిన భక్తిగేయాలు మన మనసుపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతాయి. ఆయన భక్తిపాటలను ఈ వ్యాసంలో విశ్లేషించే ప్రయత్నం చేశాను. అలంకారశాస్త్రంలో చెప్పినట్లు సాహిత్య పరమప్రయోజనం ఆనందం, ఉపదేశం. చంద్రబోస్ తమ పాటల ద్వారా శ్రోతలకు, పాఠకులకు ఆనందం కలిగిస్తూ, మనిషికి ఆధ్యాత్మికచింతన అవసరమని, భక్తి మనసును శుద్ధిపరిచి సన్మార్గంలో నడిపిస్తుందనే ఉపదేశాన్నిచ్చారు. ఈ భక్తిగేయాలను సంబంధిత దైవం ఆధారంగా కొన్ని భాగాలుగా చేసి ఒక స్పష్టమైన వ్యాసం రూపొందించాను. ఇంతకుముందే చంద్రబోస్ గేయాలపై 'చంద్రబోస్ సినీ సాహిత్యం పరిశీలన' అనే అంశంపై మునిపల్లె కృష్ణారెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి లో ఎం.ఫీల్ చేసారు,చంద్రబోస్ గేయాలు ఈ వ్యాసమునకు ప్రధానాధారములు. దైవం పట్ల జనులకు ఉండవలసిన భక్తి, ఆరాధన భావం, ఆధ్యాత్మిక విలువల పట్ల గౌరవం మొదలగు విషయాలను చంద్రబోస్ రాసిన భక్తి గేయాల ద్వారా తెలియజేయడం ఈ వ్యాస ముఖ్యోద్దేశం.
Keywords: చంద్రబోస్, సినీగేయాలు, భక్తి, ఆధ్యాత్మికత, ఆరాధన, ఆర్ద్రత, సాహిత్యం, ఉపదేశం, నమ్మకం
1. ప్రవేశిక:
జీవుడు దేవుడిని చేరుకోవడానికి తోడ్పడే మహోన్నత సాధనం భక్తి. అందుకే "మోక్ష సాధన సామగ్ర్యం భక్తి రేవ గరీయసి" అని పెద్దలంటారు. భక్తి అన్నది "భజ్" అనే ధాతువు నుండి పుట్టినది. భజ్ అంటే భజించడం,అర్పించడం, సేవించడం, ప్రేమించడం అనే అర్థాలు ఉన్నాయి. కర్మ,జ్ఞాన, యోగాలు కంటే భక్తి ఎంతో శ్రేష్ఠమైనది. భక్తి భావంతో వచ్చే ఆధ్యాత్మిక మార్పు చాలా గొప్పది. భక్తి మనిషిని ధర్మ మార్గంలో సన్మార్గంలో నడిపిస్తుంది. సినిమా మాధ్యమం ద్వారా ప్రేక్షకులలో ఎంతో కొంత భక్తిని మేల్కొలిపి తద్వారా సమాజంలో మంచిని పెంపొందించేందుకు ఎందరో సినీకవులు కృషి చేశారు. భక్తి భావనను మదిలో నింపుకొని భక్తి పారవశ్యంతో అద్భుతమైన భక్తి గీతాలు రచించిన కవులు ఉన్నారు,ఇలాంటి మహానుభావులు తెలుగు సినీ లోకంలో ఉండడం మన అదృష్టం. తెలుగు సినిమాలో ఎందరో రచయితలు దైవభక్తి ప్రబోధంతో ఎన్నో సినిమా పాటలు రాశారు,అవి నేటికి చిరస్మరణీయం. ఇప్పటికీ కూడా సినిమాలో పాటలను ఉత్సవాల్లో, పండుగలలో ఆయా దేవుళ్ళకు సంబంధించిన భక్తి గీతాలను దేవాలయల వద్ద మైక్ సెట్ల ద్వారా వినిపిస్తారు.అవి మనిషిలో ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని నింపుతాయి.
సినిమాకి భావుకత అవసరం. ఆ భావుకత కేవలం దృశ్య రూపంలో మాత్రమే కాకుండా పాటల్లో మనకి వినపడుతుంది, కనపడుతుంది. సినీ గీతాలు నవరసాల భావోద్వేగాలకు ప్రతిరూపాలు. కేవలం ప్రణయ భావనలు మాత్రమే కాదు ప్రపంచానికి ఆర్ద్రత, ఆత్మీయత, అనురాగలను అవి ఆవిష్కరిస్తాయి. పాటంటే మనసుకు సంబంధించిన మాటగా మనకి ప్రతిబింబిస్తుంది. పాటలు చిరకాలం నిలవాలంటే అవి అనుభూతికి నిదర్శనంగా ఉండాలి. సినిమా వికాసం నుంచి వేలాది పాటలు రచయితల అంతరంగ స్పందనలుగా జన్మించాయి. కానీ జన హృదయానికి సాన్నిహిత్యంగా చేరినవి పరిమితంగా ఉన్నాయి . అవి ఆపాత మధురాలుగా ఒక తరం నుండి మరొక తరానికి ప్రయాణించాయి. నిజంగా భావన నైవేద్యాలుగా ప్రేమ గీతం, ప్రణయ గీతం, భక్తి గీతం సినిమా దేవాలయం నుండి అక్షర మంత్రపుష్పాలుగా పరిమళించాయి. గేయ రచయిత గేయాన్ని తనకోసం రాసుకోవడం అసాధ్యం . కాబట్టి పాట శ్రోతను బట్టి రూపొందుతుంది .శ్రోత అభిరుచిని బట్టి చలనచిత్ర గేయం వ్యాప్తి చెందడం జరుగుతుంది . సినిమాల్లో దైవభక్తిని ప్రబోధించే సినిమా పాటలు ఎన్నో వచ్చాయి.
సినిమా కవులు రాసిన భక్తి పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.ప్రజల నాలుకపై నిలిచిపోయి,ఆధ్యాత్మిక చింతనను దైవభక్తిని ప్రజల్లో పెంపొందించాయి.
90వ శకంలో సినిమా రంగములో అడుగు పెట్టిన చంద్రబోస్ గారు తన సినీగేయ ప్రయాణంలో ఎన్నో అక్షర అనుభవాలను గేయ సంపదులుగా సమర్పించారు. చంద్రబోస్ గారు వ్యక్తిత్వ వికాసం, ప్రబోధం, ప్రేమ, ప్రణయం, భక్తి మొదలైన భావ గీతాలను అందించారు. భక్తిని చంద్రబోస్ గారు తన రచనల ద్వారా ఒక హృదయ నివేదనగా అక్షరాలలో రంగరించారు. షిరిడి సాయి దివంగతులైన సంఘటనను అక్షర ఆవేదన రూపంలో పాటలో పల్లవించారు. అలాగే అన్నిటికీ ఆదిదేవుడైన గణపతిని తన అక్షర పత్రి ద్వారా సేవించారు.నిజంగా ఇవి అక్షరాలలో దాగిన పుష్పాంజలి వంటివి.నేను ఈ వ్యాసంలో చంద్రబోస్ పాటల్లో పల్లవించిన ఆధ్యాత్మిక పరిమళాలను తెలియజేయాలనుకుంటున్నాను.
2.రచయిత పరిచయం :
తెలుగు సినీగేయ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గొప్ప రచయిత కునుకుంట్ల సుభాష్ చంద్రబోస్. ఈయన తెలంగాణలోని జయశంకర్ జిల్లా,చల్లగరిగ గ్రామంలో 10.05.1972 లో తల్లి మదనమ్మ,తండ్రి నరసయ్యలకు జన్మించడం జరిగింది . ఈయన చదివింది ఇంజనీరింగ్ అయినా సాహిత్యం పై మక్కువ తో బాలసాహిత్యం,పత్రికలు, వివిధ గ్రంథాలను అధ్యయనం చేసి పద సంపదను వృద్ధి చేసుకొని సినీ రంగంలో పాటల రచయితగా స్థిరపడ్డారు. 1995 లో తాజ్ మ హాల్ సినిమాలో "మంచు కొండల్లో చంద్రమా" అనే పాటతో చంద్రబోస్ గారు తన సినీగేయ ప్రస్థానాన్ని ప్రారంభించారు, అప్పటినుండి నేటి వరకు సుమారుగా 850 పైగా చిత్రాల్లో 3000 వేలకు పైగా పాటలు రచించి,"సినీగేయ విశారద" "సాహిత్య చిచ్చరపిడుగు" వంటి బిరుదులను పొందారు. అలాగే ఎన్నో అంతర్జాతీయ జాతీయ అవార్డులను, పురస్కారాలను అందుకోవడం జరిగింది.
3.చంద్రబోస్ గేయాలలో భక్తి పరిమళాలు:
3.1 గణేషునికి అక్షర నీరాజనం :
జై చిరంజీవ సినిమాలో "జై జై గణేశా" అనే పాటలో సాహిత్యాన్ని పరిశీలించినట్లయితే, రచయిత యొక్క ప్రార్థన నివేదన ఆవేదన,భావ సంఘర్షణ మనకు పదాల్లో కనపడుతుంది, చంద్రబోసు గారి భక్తిభావం మనకి అవగతమవుతుంది.
“జై జై గణేషా జై కొడతా గణేషా జయములివ్వు బొజ్జ గణేష..
హాయ్ హాయ్ గణేషా అడిగేస్తా గణేషా అభయమివ్వు బొజ్జ గణేష..
లోకం నలుమూలలా లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఏదో రభసా
పాపం హిమగిరులుగా పెరుగును తెలుసా
చిక్కు విడిపించగ నడిపించగా చెయ్యి తమాషా... " (చంద్రబోస్ గీతాలు, 2005:88)
వినాయక చవితి అనగానే గణపతి విగ్రహాలు, నవరాత్రి ఉత్సవాలు స్ఫురణకు వస్తాయి,దర్శకుని ఆకాంక్షలకు అనుగుణంగా రచయిత గణేషునికి అక్షర పూజ-అభ్యర్థన చేశారు. పై గేయములో భక్తి తత్వానికి వాస్తవికతకు అక్షర వారధులు చంద్రబోస్ గారి పదసంపతులు. చంద్రబోస్ గారు తన పదాల మారేడు పత్రి ద్వారా వినాయకుని అక్షర సేవనం చేశారు.పై పాటలో రచయిత కేవలం భక్తిని మాత్రమే కాకుండా దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు.సమాజంలో జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను కూడా సున్నితంగా విమర్శిస్తూ వాటిని తొలగించాలని దేవునికి విన్నవించడం ఒక గొప్ప విషయం. రచయిత తన సామాజిక బాధ్యతను భక్తి రూపంలో గణపతికి అక్షర నివేదన చేశారు. దేశంలో ఎటు చూసినా పేదరికం ఆకలి తాండవిస్తుందని,కులం మతం ప్రాంతం రాజకీయాల పేరిట రభస జరుగుతుందని ,పాపం హిమాలయాలంత ఎత్తుగా పెరిగిందని ఎలుక వాహనంపై వచ్చి మా బాధలు తొలగించమని రచయిత దేవుడిని ఆర్తితో అక్షరారాధన చేసారు.
"నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా
ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లె మారలేదా
పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్నా
కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా..
ఎందుకు మాకీ హింసవాదం నేర్పర మాకూ సోదర భావం...... "(చంద్రబోస్ గీతాలు, 2005 : 88)
సహజ వైరుధ్యం కలిగిన జంతువులు కూడా ఎలాంటి శత్రుత్వం గొడవలు హింసకి తావు లేకుండా మీ కుటుంబం లో వాహనాలుగా ఉంటూ, సాన్నిహిత్యంతో ఎంతో హాయిగా జీవిస్తున్నాయని, దేవతల వాహనాలను ఆదర్శంగా చెబుతూ వాటిలో ఉండే భిన్నత్వంలో ఏకత్వాన్ని మనుషులకు ఆపాదించారు. ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు మరియు ఒకే దేశంలో ఉంటున్న జనులు స్వ పర బేధాలు చూపుకుంటూ నిత్యం సంఘర్షణలో బ్రతుకుతున్నారని,మాలో ఆ కలతల్ని తొలగించి మమతలను పంచె సోదర భావం పెంపొందించమని గణపతిని రచయిత ప్రార్థించారు.పై చరణాల్లో గణపతి పట్ల భక్తిని ప్రదర్శిస్తూనే తన మనసులో వేదనను సమాజ దుస్థితిని తెలియజేశారు.అలాగే గణేషుడి కుటుంబం నుండి జనాలు నేర్చుకోవాల్సిన ఐక్యమత్యాన్ని ప్రబోధించారు.
"చందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్క వయ్యా
లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా
ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా
మాలో చెడును ముంచాలయ్య
నీలో తెలివే పంచాలయ్యా
ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశా.... "(చంద్రబోస్ గీతాలు, 2005:89)
పై చరణాలను పరిశీలించినట్లయితే..... చిన్న వ్యాపారస్తుల దగ్గర కూలీల దగ్గర చందాలను బలవంతంగా వసూలు చేసి వారి శ్రమను దోచుకునే దాదాలను, దోపిడీదారులను, పెట్టుబడిదారులను తన తొండంతో శిక్షించమని, సమాజంలో అడుగడుగునా లంచాలు మరిగిన రాజకీయ నాయకులను అధికారులను దండించమని భక్తి పూర్వకంగా రచయిత గణేషునికి విన్నవించారు, రోజురోజుకి నింగిని అంటుకుంటున్న నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించమని చమత్కారభరితంగా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ సరుకుల ధరలను తగ్గించాలని వేడుకున్నారు. మాలో ఉన్న చెడును, అరిషట్ వర్గాలను తొలగించి మాకు జ్ఞాన సిరులను అందించమని ఇలాంటి చిన్న చిన్న కోరికలు తీర్చవయ్యా ఇంతకు మించి మేము ఏమి కోరడం లేదని రచయిత తెలియజేశారు. మనిషిలో ఆశావాదాన్ని అక్షరాలలో ప్రయోగించారు. మొత్తంగా మనిషిలో పరివర్తన రావాలని,హింస తగ్గాలని పాట సాక్షిగా రచయిత తన ఆశయాన్ని తెలియజేశారు. కూలి నెంబర్ వన్ చిత్రంలో సిరివెన్నెల గారు ఇలాంటి రచననే అందించారు. ఆ పాట తాలూక భావ ముద్రలు పరోక్షంగా ఈ పాటపై ఉన్నాయని చెప్పవచ్చు ఆ పాటలో సందర్భం గర్వాన్ని అనచడం, ఈ పాటలో సందర్భం మంచిని కోరడం.. ఇద్దరు రచయితలు భక్తి సాధనంగా గణపతి నీడగా జన శ్రేయస్సును కోరడం విశేషం.
3.2 సాయిబాబా అక్షర హారతులు:
షిరిడీసాయి సినిమాలో చంద్రబోస్ గారు రచించిన 'వస్తున్నా బాబా' పాటలో సాహిత్యం మనం గమనిస్తే...
"గాలి ఆగిపోతుందంటే నమ్మాలా
నేలే ఆవిరవుతుందంటే నమ్మాలా
నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా
దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలా.....
అది జరగబోదు అని - జరగనివ్వనని
వస్తున్న బాబా వస్తున్న ఆ మృత్యువురాకని ఆపేయాలని వస్తున్నా
నీ బదులుగా నేనే బలి అవుతానని వస్తున్న....."(చంద్రబోస్ గీతాలు,2012:26)
పై గేయములో భక్తుల వేదన భరితమైన భావనను చాలా అపురూపంగా చంద్రబోసు అక్షరం ద్వారా నివేదించడం జరిగింది. భగవంతుడు ప్రతి యుగంలో అవతార పురుషుని రూపంలో మన వద్ద సంచరించినప్పుడు, వారే దైవంగా వారే మన తోడుగా నీడగా వెలుగుగా భావిస్తాం. మన జీవితమంతా వారినే బలంగా నమ్ముతాం. చంద్రబోస్ గారు ఈ సినిమాలో సాయిబాబా నిష్క్రమణ వచ్చే సమయంలో భక్తుల వేదనను కన్నీటి సిరాలో ముంచి రాసారనిపిస్తుంది. గాలి ఆగిపోవడం నేల ఆవిరవడం నింగికి ఆయువు తీరడం వంటి పంచభూతాలు క్షీణించడం, సృష్టి నుండి నిష్క్రమణ ఉండదని అట్లానే ఆ సృష్టికి అధిపతి అయిన దైవం మరణం కూడా అసాధ్యమని అలాంటి మరణమే వస్తే తన ప్రాణాన్ని బాబా ప్రాణానికి బదులుగా అర్పిస్తానని భక్తుడి వేదనను రచయిత తన కలం ద్వారా అక్షర నివేదన చేశారు. సాయిబాబా మీద ప్రేమతో భక్తితో తానే బలవుతానని, బాబా లేకుండా బ్రతకడం కష్టమని చెప్పడంలో రచయిత తన అక్షర కాంతుల ద్వారా భక్తి దీపాన్ని వెలిగించారు. మరణ జననాలనేవి శాశ్వతసత్యాలు. శ్రీకృష్ణ పరమాత్ముడు, రాముడు సైతం వారి అవతారాలను చాలించారు. సాయి అవతారమైన చివరికి పరమపదించక తప్పదు. అయినా భక్తుడి భావనలు మనకు అతిశయోక్తిగా తోచవు. శివుడు మార్కండేయుడు విషయంలో, సావిత్రి తన భర్త సత్యవంతుని విషయంలో విధిని, కాలధర్మాన్ని ఎదిరించి మృత్యువును జయించి ప్రాణాలు నిలిపారు. సాయి భక్తుడు కూడా సాయికి వస్తున్న మరణాన్ని సైతం ఆపేయాలని కాల ధర్మాన్ని సైతం ధిక్కరించి బాబా ప్రాణాలను కాపాడుకుంటానని, అది జరగని పక్షంలో బాబాప్రాణానికి బదులుగా తానే బలవుతానని సాయిబాబా పైగల భక్తిపారవశ్యాన్ని, భక్తుడి హృదయవేదనను రచయిత తెలియజేసారు.
"బాబా మిమ్మల్ని చూడకుండా
మీ చూపుకు నోచుకోకుండా ఎలా బ్రతకడం బాబా
మా బాధని ఎవరితో చెప్పుకోవాలి " (చంద్రబోస్ గీతాలు, 2012:26)
నిత్యం మీ సేవలో తరిస్తూ, మీ చల్లని చూపులో,మీ నీడలో సాగిపోయే మా జీవన గమనాన్ని ఇకపై ఎలా సాగించాలని, మీరు లేరన్న ఆ విషాదభరితమైన నిజాన్ని మేము ఎలా జీర్ణించుకోగలం అంటూ భక్తుల వేదనను దుఃఖాన్ని బోసు తన అక్షర వాహిని ద్వారా శ్రోతలకు చేర్చి వారిని శోకసముద్రంలో ముంచేశారు. తమకి దిక్కు మొక్కు అన్ని నీవే అని, నీకే ఆపద వస్తే ఇక మా బాధలను, కష్టాలను ఎవరికి చెప్పుకోవాలని దిక్కుతోచని వారి దీన స్థితిని రచయిత తన అక్షరాల రూపములో కన్నులముందుంచారు.
"భక్తులు మీరు- మీ భక్తికి బానిస నేను
సూర్య చంద్రులు చుక్కలు నేనై కనపడుతుంటాను
మిమ్ము కనిపెడుతుంటాను
బాబా నేను- మీ భారం మోస్తుంటాను
పిలిస్తే పలుకుతాను - పిలిస్తే పలుకుతాను"(చంద్రబోస్ గీతాలు, 2012:27)
భక్తి అంటే దేవుడిని పూలతో, దూపదీప నైవేద్యాలతో ఆరాధించడం కాదని,తన మనస్సు అనే పుష్పాన్ని దేవుని కాళ్ళ వద్ద ఉంచి నిత్యం ధ్యానించడమని, ఆర్ద్రతతో దేవుని శరణు కోరుకోవడం అని, అదే నిజమైన భక్తి,అలాంటి భక్తులకు దేవుడు ఎప్పుడు బానిసగా మారిపోతాడని భక్తి యొక్క అంతరార్ధాన్ని చంద్రబోస్ గారు ఈ చరణం లో తెలియజేశారు. ఎన్నడూ మీ నుండి దూరం కానని సూర్యకిరణాల రూపంలో చంద్రకాంతి వెన్నెల రూపంలో మీతోనే నిత్యం ఉంటానని మీ కష్టనష్టాల్లో సుఖదుఃఖాలలో కాచుకుంటానని (కనిపెడుతూ ఉంటానని) మీరు మోసే ఏ భారాన్నైనా బాధ్యతను అయినా మీకు బదులుగా నేను మోస్తానని, మీరు నిశ్చింతగా ఉండండి అని తన భక్తులకు బాబా అభయం ఇవ్వడం వంటి బాబా ప్రతిస్పందనను బోస్ గారు తన పదాల పల్లకి ద్వారా భక్తుల హృదయ లోగిలిలోకి చేర్చారు.
"నిర్మలమైన మనసుతో నిశ్చలమైన భక్తి తో
నా రూపాన్ని తలవండి- మీ లోపల కొలువవుతాను
నా నామాన్ని పలకండి- నీ లోపం తొలగిస్తాను
నా హారతి దర్శించండి - మీ ఆపద ఆపేస్తాను
నా విభూతి ధరించండి - మీ వేదన నాదంటాను
నా జ్యోతులు వెలిగించండి- మీ మనసులు వెలిగిస్తాను "(చంద్రబోస్ గీతాలు, 2012:28)
భక్తిభావనలో ఆధ్యాత్మికతలో ఉండాల్సింది స్వచ్ఛమైన మనస్సే అని, అలాంటి నిర్మలమైన మనసు స్థిరమైన భక్తితో నా రూపాన్ని మీ మనసులో తలవండని, పిలిచిన వెంటనే పలికే దైవమై మీ హృదయాంతరాల్లో కొలువై ఉంటానని, నా నామస్మరణచే మీ మానసిక శారీరక లోపాలను తొలగిస్తానని తెలియజేశారు.సాయి మందిరంలో హారతికి ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది . హారతి దర్శనంచే మీ కష్టాలను ఆపదలను తొలగించి భవసాగరం నుండి రక్షిస్తానని, విభూతి ధరిస్తే మీ కలతలను, కన్నీటిని,వేదనను తొలగిస్తానని, నా ముందు మీరు దీపం వెలిగిస్తే మీ మనసులో అజ్ఞానాన్ని అంధాకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులను వెలిగించి మిమ్మల్ని చరితార్థులుగా మారుస్తానని, నన్ను నమ్మిన భక్తులకు నేనెప్పుడూ అండగా ఉంటానని,నేను జీవ సమాధి అయిన మీ మాటల్లో,పాటల్లో, మనసులో ఎప్పుడు జీవించి ఉంటానని బాబా అందించిన ప్రతిస్పందనకు,చిత్రంలో దృశ్య భావోద్వేగాలకు బోస్ గారు తన అక్షరం ద్వారా జీవం పోశారు.నాగర్జున, శ్రీకాంత్ లాంటి కళాకారులున్న దృశ్యానికి చంద్రబోస్ గారి రచన దిక్సూచిగా మారి మన మనసును స్వర్ణ సాయి మందిరంగా మార్చేసింది.
అలాగే సాయిబాబాకు సంబంధించిన మరొక పాటలోని బోస్ భక్తితత్వాన్ని గమనిస్తే...
"సాయి అంటే తల్లి -బాబా అంటే తండ్రి
తల్లి తండ్రి లేని- పిల్లలమయ్యాము
రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము
నువ్వొస్తావ్వన్నా ఆశతో - బ్రతికొస్తావన్న ఆశతో
జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము
కోటి చుక్కలమయ్యాము- కన్నీటి చుక్కలమయ్యాము "(చంద్రబోస్ గీతాలు, 2012:120)
పై వేదనాభరితమైన భక్తి గేయములో తల్లి అయిన తండ్రి అయిన సాయిబాబానే అని, తల్లిదండ్రి లేని పిల్లలు జీవితం ఎంత దీనంగా, కన్నీటిమయంగా, ఎంతో దుఃఖ భరితంగా సాగుతుందని,వారి జీవితం ఏ విధంగా చితికి పోతుందనే విషయాన్ని మరియు సాయిబాబానే తల్లిదండ్రిగా, భక్తులను సాయి పిల్లలుగా వర్ణించిన తీరు రచయిత భావుకతను తెలియజేస్తుంది . ఇక దేవుని నిష్క్రమణ అనేది మృత్యువుగా తరలివస్తే మనసు బండరాయిగా మారిపోతుంది. కన్నీరు ఇంకిపోతుంది .ప్రతి భక్తుని అంతరంగం విషాదం అలుముకొని అమ్మని కోల్పోయిన చిన్నారుల్లా ,రెక్కలు లేని పక్షి దుర్భర జీవితంగా మన జీవితాలు మారిపోతాయని భక్తుల ఆవేదనను అక్షర రూపంలో చిత్రించారు. మమ్మల్ని నడిపించిన నడక ఇక కనబడదనే భావోద్వేగాన్ని రచయిత వ్యక్తీకరించారు. భక్తుల బాధకి తన కవితా శైలి జోడించి,ప్రకృతిలో విషాద భరితమైన సంఘటనను తన భావంలో జతపరిచారు.
" బోధలు చేసేది ఎవరు- మాలో బాధలు బాపేదెవరు
లీలలు చూపేదెవరు - మాతో గోలీలాడేదెవరు
పాటలు పాడేది ఎవరు -మా పొరపాటులు దిద్దేదెవరు
జీవం పోసే నువ్వే నిర్జీవుడవైనావా
నువ్వు కన్నులు తెరిచే దాకా- మా కంటికి కునుకే రాదు " (చంద్రబోస్ గీతాలు, 2012:120)
అవతార పురుషుడైన సాయి సాన్నిహిత్యం పొందిన వారు ఆయన అలా అచేతనంగా పడి ఉండడం సమాధి స్థితికి వెళ్లడం భరించలేకపోతున్నారు.వారికి గతం ఒక తీయటి జ్ఞాపకం అయినా ఇప్పటి మానసిక స్థితిలో వేదనగా అనిపిస్తుంది. అందుకే సాయి అందించిన లీలలు, ప్రేమలు వారి మనసును బాధగా స్పృశించాయి. సాయి వారితో గడిపిన కాలం మరల రాదు అనే చేదు నిజం వారి గుండెను పిండింది ,సాయి లీలలను రచయిత తన అక్షరాల ద్వారా వారి మనసు గుమ్మంలో చేర్చి ఆర్ద్రతను పండించారు. గురువు దైవం తానై వారి పొరపాట్లను దిద్ది వారిని సన్మార్గములో నడపడం మొదలయినా సాయితో వారికి ఉండే సాన్నిహిత్యాన్ని, సాయి పై వారికుండే భక్తిని బోస్ గారు స్మరణం చేశారు.
"మాకిచ్చిన నీ విభూదినే నీకు కాస్త పూసేమయ్యా
లేవయ్యా సాయి లేవయ్యా
నీ చేతి చిన్న కర్రతో నిన్నే తట్టి లేపామయ్య
ఇన్నాళ్లు నువ్వు అడిగావు మా నుండి భిక్షను
ఇవ్వాళ మేము అడిగాము నీ ప్రాణ భిక్షని
ఇచ్చేవరకు ఆగలేము
పచ్చి మంచినీరైన తాగబోము "(చంద్రబోస్ గీతాలు, 2012:121)
సాయిబాబానే తమ ప్రపంచంగా బ్రతికే భక్తులందరి ప్రార్థనను వీడ్కోలను రచయిత చిన్న పదాల్లో అనంతమైన వారి హృదయ నిరీక్షణను, భక్తి భావాన్ని నిర్మలమైన ఆరాధన తత్వాన్ని ఆవిష్కరించారు. రచయిత సైతం భక్తుడిగా మారినప్పుడు ఇలాంటి భావాలు వస్తాయి. సాయి నిత్య కృత్యాలను ఆయనకే ఆపాదించడం విచిత్రంగా ఉంటుంది. కన్నప్ప ఈశ్వరుడికి కన్ను అర్పించిన ఇలాంటి సంఘటనలు భక్తిలో సహజం.సాయి అనగానే మనకి గుర్తొచ్చేది ఆయన విభూతి. అది ఆయనకే పూయడం, తమ వద్ద భిక్షం తీసుకున్న సాయిని, తన ప్రాణాన్నే వారికి భిక్ష ఇవ్వమని కోరడం వారి నిర్మలమైన భక్తికి నిదర్శనం మరియు ఈ విధమైన ఆరాధన అనేది భక్తికి గల మరొక కోణాన్ని ఆవిష్కరిస్తుంది. దీన్ని రచయిత చాలా ఆర్ద్రతతో తెలియజేశారు. సాయి ఎప్పుడు చేతి కర్ర ధరించేవారు దానితోనే ఆయన్ని సమాధి స్థితి నుండి లేపడం మనకు ఆశ్చర్యంగా అనిపించినా గానీ రచయిత ఈ సన్నివేశాన్ని సంఘటనలను భావ,భక్తి నేత్రాలతో వీక్షించారనిపించింది. నిద్ర హారాలు సమస్త జీవులకు అవసరం.వాటిని సాయి కోసం త్యాగం చేయడం సాయి వచ్చేంత వరకు వాటి జోలికి కూడా పోము అనడం వారి దీక్షనమైన భక్తికి నిదర్శనం. ఈ విధంగా రచయిత భక్తుల వేదనను,ఆర్తిని తనదిగా స్పృశించి భక్తజన అంతరంగంలో తన భక్తి రస జలపాతాలైన అక్షరాలను నడిపించారు.
4. ఉపసంహారం :
- చంద్రబోస్ గారు రచించినటువంటి భక్తి గీతాలు మనం పరిశీలించినప్పుడు ఆయన గేయాల్లో భక్తి నివేదన రూపంలో మనకు దర్శనమిస్తుంది. ఆర్తి ఆయన భక్తి గేయ రచనకు ప్రాణంగా నిలుస్తుంది. దేవుడు పట్ల మనిషికి ఉండాల్సింది భయంతో కూడిన భక్తి కాదని స్నేహపూర్వకమైన భక్తి,దేవుని ఒడిలో కూర్చొని మాట్లాడేంత చనువు ఉండాలని, దైవాన్ని తల్లిగా తండ్రిగా భావించాలనే సందేశాన్ని అందించారు.
- పాటను శ్రోతల హృదయాన్ని కదిలించే శక్తి గా మార్చాలంటే రచయిత ఆ సన్నివేశంలో సంఘటనలో పరకాయ ప్రవేశం చేయాల్సిందే. ఆ సంఘటనలో కలిగే అనుభూతులు - భావాల సంఘర్షణ నుండే శ్రోతలను మెప్పించే గేయాలను రాయగలరు, అలాంటి గేయాలను రాయడములో బోస్ గారిని నైపుణ్యం గల రచయిత గా మనం చెప్పుకోవచ్చు
- నేటి కాలపు సినిమాలలో భక్తి,సంస్కృతి, ఆచార సంప్రదాయలను తెలియజేసే గేయాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయన్నది వాస్తవం, కావున దర్శకులు, రచయితలు సినిమాలో కేవలం ప్రేమ, శృంగార గీతాలనే చూపడం కాకుండా మంచిని పెంచే ప్రబోధాత్మక గేయాలను కూడా ప్రోత్సహించడం అవసరం
ఉపయుక్తగ్రంథసూచి:
- ఆనందచారి, కె., శరత్ చంద్ర తిరునగరి. (సం)(2022). సినీగీతావరణం. హైదరాబాద్ : ప్రగతి ప్రింటర్స్.
- ఆనంద్, చెర్ల. (2001). దేవులపల్లి కృష్ణశాస్త్రి చిత్రగీతాలు- సాహితీవిలువలు(అ.సి.గ్రం). కర్నూలు: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.
- చంద్రబోస్, కునుకుంట్ల.సినీ గీతాల పుస్తకం నుండి సేకరణ (అముద్రితం).
- చక్రవర్తి, జయంతి.(2017 ).వేటూరి పాట.విజయవాడ :రోహిత్ ప్రింటర్స్.
- చంద్రశేఖర్, బూర్ల. (2018).తెలుగు సినిమా పాట ప్రబోధాత్మకత. హైదరాబాద్ : కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్.
- పైడిపాల, (1992). తెలుగు సినిమా పాట.చెన్నై స్నేహ ప్రచురణలు.
- మునస్వామి, త్యాగదుర్గం.(2001) తెలుగు సినిమాల్లో హైందవ భక్తి పాటలు -వైశిష్ట్యం (అ. సి. గ్రం ),
- రామలక్ష్మి.కె (2017). భువనచంద్ర సినీ గేయ సాహిత్యం పరిశీలన (అ.సి. గ్రం ). చెన్నై : మద్రాస్ విశ్వవిద్యాలయం.
- రాధాకృష్ణారెడ్డి, దేవీరెడ్డి.(2010). తెలుగు సినిమాపాటలు-సామాజికస్పృహ (అ. సి. గ్రం ). తిరుపతి:శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
- శింగనమల చిన్న పేరయ్య. (2005).దాశరధి సినీ సాహిత్యం- పరిశీలన (అ.సి.గ్రం).తిరుపతి:శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.