AUCHITHYAM | Volume-06 | Issue-04 | April 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
6. సుగ్రీవవిజయం యక్షగానం: కావ్యసౌందర్యం

వొటారికారి సందీప్
పరిశోధకులు, తెలుగు శాఖ,
మానవీయ శాస్త్రాల విభాగం. హైదరాబాద్ విశ్వ విద్యాలయం,
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
సెల్: +91 9390280093, Email: sandeepkumarv2903@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 13.03.2025 ఎంపిక (D.O.A): 31.03.2025 ప్రచురణ (D.O.P): 01.04.2025
వ్యాససంగ్రహం:
వర్ణించేవాడు 'కవి' అతని పని 'కావ్యం' అని విద్యాధరుడు తెలిపారు. ఆ నేపథ్యంలో కందుకూరి రుద్రకవి (1480-1560)చే ప్రణీతమైన "సుగ్రీవ విజయం" యక్షగానం పరిశీలించి ఫలితంశాలను ఈ పరిశోధన వ్యాసంగా క్రోడీకరిస్తున్నాను. వేటూరి ప్రభాకర శాస్త్రి, ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం విశేషంగా పరిశీలించి ఈ యక్షగానానికి పీఠికా రూపంలో అపూర్వసేవలను సాహితీ లోకానికి అందించారు. కాగా రుద్రకవి ఈ యక్షగానంలో వర్ణించిన తీరుని కావ్య లక్షణాలతో పోల్చి చూసి దేశీ సాహిత్యంలో కావ్య సౌందర్యాన్ని పరిచయం చేయడం, అందుకు గల అవసరాన్ని తెలపడం ఈ వ్యాసపరిమితి. మూలగ్రంథంగా (సాహిత్య అకాడమీ వారి పీఠికా సహిత గ్రంథం), ఆంధ్ర యక్షగానవాఙ్మయచరిత్రము (సిద్ధాంతగ్రంథం), తెలంగాణ యక్షగానం రచన- ప్రయోగం (సిద్ధాంత గ్రంథం), దివాకర్ల వేంకటవధాని సాహిత్య సోపానాలు, ఆనంద కుమారస్వామి రచనలు, ఇతర వ్యాసాలు, గ్రంథాలు, అంతర్జాల వనరులు ఈ వ్యాసరచనకు తోడ్పడ్డాయి. ఆయా అకారాలలో తెలిపిన యక్ష ప్రస్తావన పరిచయం చేస్తూ, ఆలంకారీకుల దృష్టికోణం నుంచి రసం, రీతి, ఆలంకారిక ప్రయోగం, శైలి మొదలైన కావ్యలక్షణాలను ఈ యక్షగానంలో పరిశీలించడమైనది. ఇందులో రుద్రకవి వర్ణనలో పొసగిన కావ్యసౌందర్యాన్ని గుణాత్మకపరిశోధన పద్ధతిలో విశ్లేషించడమైనది. కవిరచన నేర్పు సౌందర్యపరిమళత గురించి సోదాహరణంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం ప్రామాణికంగా నిలుస్తుంది.
Keywords: యక్షగానం, రససిద్ధాంతం, అలంకారీకప్రయోగం, కావ్యసౌందర్యం, వీరరసం, ధర్మవరం, యుద్ధవీరం, ధర్మతత్వం, శైలి, పంచసంధులు.
1. ప్రవేశిక:
క్రీ.శ 1558 కాలంలో కుతుబ్షాహీలు గోల్కొండను కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నప్పుడు రుద్రకవిచే ఈ యక్షగానం విరచితమైనది. రుద్రకవి కుతుబ్షాహీల కాలానికి సమకాలీకులని ఇబ్రహీం కులీ కుతుబ్ షాచే దానం ఇవ్వబడిన రెండు చింతల గ్రామ శాసనం ద్వారా తెలుస్తుంది. ఆ కాలంలో జంషీద్ కులీ కుతుబ్ షా, ఇబ్రహీం కులీ కుతుబ్షా అని ఇద్దరు అన్నదమ్ముల మధ్య సాగిన పోరులో అన్న జంషీద్ కులీ కుతుబ్షా వల్ల రాజ్యం వదలి పారిపోయిన ఇబ్రహీం కులీ కుతుబ్షా గోల్కొండ రాజ్యంపై దాడి చేసి రాజ్యాన్ని సంపాదించుకున్న తీరును, అప్పటి పరిస్థితిని సుగ్రీవునితో పోలుస్తూ ఈ యక్షగానం రాసి ఉండవచ్చునని Sultan's of the South: Arts of India's Deccan courts, (1323-1687) గ్రంథంలో Navina Najat haidar, Marika sardar వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే రుద్రకవిచే ప్రణీతమైన యక్షగానం కందుకూరి జనార్ధన దేవునికి అంకితం ఇవ్వబడింది. అలాగే 'కందుకూరి జనార్ధనా' అనే మకుటంతో 'జనార్ధనాష్టకం', ప్రబంధ గ్రంథంగా 'నిరంకుశోపాఖ్యానం' రాశారు. ఇలా ప్రబంధ గ్రంథం రాయగలిగే పాండిత్యమున్న రుద్రకవి గారు దేశీ సాహిత్యమైన యక్షగానంలో కావ్య లక్షణాలను అలవోకగ ఎలా వినియోగించారో తెలుపుతూ, సుగ్రీవ విజయంలో కావ్య సౌందర్యం పరిచయం చేసి పాఠక లోకానికి అందించడమే ఈ వ్యాస ప్రధాన లక్ష్యం.
“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః” అని ఆర్యోక్తి. అంటే శిశుః(చిన్న పిల్లలైనా), పశుః (పశువులైనా), ఫణిః (నాగులైనా) సంగీతాన్ని ఆస్వాదించగలవు. సంగీతం సమస్తాన్నీ కదిలించగల శక్తి చోదకమని పెద్దల అభిప్రాయం. అంతటి విశిష్టత కలిగినటువంటి సంగీతాన్ని తలుచుకోగానే అతి సామాన్యంగా మదికి తోచేవారు యక్ష, కిన్నెర, గంధర్వులు. గాంధర్వ విద్య దేవలోకంలో వర్తిస్తుందని సంగీతకారుల అభిప్రాయం. ఇక ఇది శాస్త్రీయ సంగీత ధోరణిలో సామాన్య నరుల కందని మ్రాని పండనే భావం పింగళి సూరన తన కళాపూర్ణోదయంలో (సూరన తృతీయాశ్వాసం 4) ఊటంకించారు. కాగా సమూహంగా గానీ, జంటలుగా కానీ ఉండి విజయ, శృంగార గీతాలు పాడేవారే కిన్నరులు. మరి మిగిలిన యక్షుల పని ఏంటనే మీమాంస ఇక్కడ తలెత్తుతుంది కదా. యక్షులు ఈ సంగీతాన్ని మాత్రమే కాకుండా నృత్యాభినయాల్లో కూడా అత్యున్నతంగా ప్రవేశం కలిగి ఉండి పాత్రోచితంగా ప్రదర్శించగల నేర్పు ఉన్నవారు. ఇలా నృత్య, గానాభినయాల సమాహారంగా ఉన్న ఈ దేశీ ప్రక్రియ రూపం అచ్చంగా రూపకాన్ని పోలి ఉన్నట్లే కనబడుతుంది. మరి రూపక ప్రక్రియ యొక్క ఉత్పన్న బీజాలు ఇక్కడి నుండే పడ్డాయా? అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అరిస్టాటిల్ తన పొయేటిక్స్ గ్రంథంలో ప్రస్తావించిన ‘కళ ప్రకృతి అనుకరణం (ART IMITATES NATURE)’ అనే మాటను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జీవితమే ఒక మహా నాటకం అందులో అందరూ పాత్రధారులే అని సులువుగా తప్పించుకోవడానికి వీలు లేదు. సమాజం ఎప్పుడూ గమనశీలమైనది. అది కాలానుసారంగా నూతన పుంతలు తొక్కుతూ ఉంటుంది. అట్లాంటి సమాజంలో మానవుడే కేంద్ర బిందువుగా ఉండి ఈ గమనశీలకమైనటువంటి మార్పులను తన చుట్టూ ఉన్న ప్రకృతిలో గమనించి, అనుకరించి, అవలంబించి ఒకానొక దశలో వికాసమొందుతాడు. అప్పుడే అది పరిపూర్ణ ప్రక్రియగా మారుతుంది. రూపకం కూడా ఇలా పరిణామరీత్యా వచ్చిన మార్పు గానే గ్రహించాలి. అయితే రూపకంలో సంభాషణ ప్రాధాన్యత ఉంటుంది. ఇక యక్షగాన విషయంలో సంభాషణ ప్రాధాన్యం కన్నా నృత్య, గాన, అభినయ సమహారానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇది రూపక లక్షణాలను పోలి ఉన్నప్పటికీ, దేశీ సాహిత్యంలో తనదైన ప్రక్రియగా ఉన్నదని గ్రహించాలి.
2. యక్ష ప్రస్తావన:
“యేన కర్మాణ్యపసో మనీషిణో
యజ్ఞే కృణ్వంతి విదధేషు ధీరాః
యదపూర్వం యక్షమంతః ప్రజానాం
త న్మేమనః శివసంకల్ప మస్తు”1
అని యక్షప్రస్తావన వేద వాఙ్మయం నుండే ఉన్నది. జైమీనీయ బ్రాహ్మణంలో ఇది విచిత్ర వస్తువుగా చెప్పబడింది. అట్లాగే యక్షులు భూతావాహనం చేస్తారని, రోగగ్రహ వేశ శక్తి ఉంటుందని తెలుపబడింది. ఇక బౌద్ధ,జైన, బ్రాహ్మణ సారస్వతాలలో యక్షులను దేవతా గణంగా పేర్కొన్నారు. ప్రత్యేకంగా బౌద్ధ సారస్వతంలో యక్షులు నీతి ప్రవక్తకులుగా, రక్షణ శక్తులుగా, యక్షిణిలు ద్వార పాలకులుగా వర్ణింపబడ్డారు. ఇతిహాస పరంగా చూసినట్లయితే ప్రారంభంలో వీరు సింహళ దేశంలోని వారు. వీరి రాజు కుబేరుడు. బలి చక్రవర్తి సేనాని సుమాలి యక్షులను ఓడించడం చేత ఓడిపోయిన కుబేరుడు దక్షిణ భారతదేశానికి తన అనునూయులతో వలస వచ్చాడని చెప్పబడింది. అయితే,
డా. ఆనంద కుమారస్వామి అభిప్రాయం ప్రకారం (కుమారస్వామి7) వీరు కామరూపులు, దయాళువులు. అట్లాగే మోనియర్ విలియమ్స్ ప్రకారం యక్షులు అప్రాకృత జీవులుగా చెప్పబడ్డారు. E.Thurston తాను రాసిన Casts and Tribes of South India అనే గ్రంథంలో యక్షులను జక్కుల పేరుతో, Jakkula described as an inferior caste of prostitutes, mostly of balija caste, and as wizards and a dancing and theartical caste. At Tenali in Krishna District it was customary for each family to give up one girl for prostitution etc. అని పేర్కొన్నారు. ఈ అభిప్రాయం ప్రకారం యక్షులు నృత్యం చేస్తారని, దానితో పాటు వేశ్యరికం కూడా వాళ్ళకున్న ఒక జీవనోపాధిగా తెలుస్తుంది.
అలాగే ఆంధ్రుల సాంఘిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి గారు వీరు అక్షసీ(oxus) నదీ ప్రాంతం వారో, లేక యూచీ(YUCHI)అనే జాతి వారో, లేక జక్షార్ధన్(JAXARTS) ప్రాంతం వారో అయ్యుండొచ్చనే అభిప్రాయం తెలిపారు.(ఆంధ్రుల సాంఘీక చరిత్ర 195)
3. యక్షశబ్దం :
సంస్కృత యక్షశబ్దానికి ప్రాకృతరూపం ఎక్కలు. తెలుగు తద్భవం జక్కులుగా ప్రయోగింపబడుతుంది. యక్షుడనగా పరమాత్మ. కాబట్టి పరమాత్మని గురించి గానం చేస్తారు కనుకనే వీరి కళను ‘యక్షగానం’ అన్నారు.
జక్కుల పురంధ్రి, కామవల్లి, మహాలక్ష్మీ, కైటభారి వలపు పాడుచున్నది (క్రీడాభిరామం 135). అనే రచనా ప్రయోగంలో ఇది జాతి శబ్దంగా, కర్ణాటక తమిళ ప్రాంతాల్లో మాత్రం ఇది కుల వాచకంగా తెలుపబడిందని గ్రహించాలి.
జక్కు వీడు (జక్కుల జాతి వాడు) జక్కులఱేఁడు (కుబేరుడు) మొదలైన శబ్దాలు కూడా ఇట్లాంటివే. వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారి అభిప్రాయంలో ‘జక్కి’ శబ్ద ప్రయోగంలో జక్కి అంటే గుర్రం అని, అలాగే కట్టుబడిపోవడం అనే అర్థాలున్నాయని తెలిపారు. ఉదాహరణకు జక్కి మోర (అశ్వముఖులు) అంటే కిన్నెరులు, జక్కి ఒడలు (నరముఖం,అశ్వదేహం) అంటే కింపురుషులని (వడ్లమూడి గోపాలకృష్ణయ్య సీతా కళ్యాణం తొలి పలుకు xv) అర్ధం. కాబట్టి బహువచనంలో ఉన్న జక్కుల అనే పదం కన్నా, ఏకవచంలో ఉన్న జక్కి అనే మాటకు విస్తృత వ్యుత్పన్నత ఉన్నదని ఇక్కడ మనకు తెలుస్తుంది. అలాగే యక్ష శబ్దం జక్కిగా మారిందని కూడా స్పష్టమవుతుంది. ఇక ఈ యక్షులకు తెలిసిన విద్యను ‘యక్షిణి’ విద్య అంటారు. అదే కనికట్టు విద్య. ఇదే వీరిని ఇంద్రజాలంలో సిద్ధహస్తులని చేసింది. అయితే ఇంతకు ముందే తెలిపినట్టు యక్షులు కామరూపులు అనేమాటకు వెనుకున్న అర్థం పరమాత్మ గానంలో, వారు ప్రదర్శించే తీరులో, పాత్రోచితంగా ఆయా పాత్రల్లో ఒదిగి పోవడమని, అలాగే జక్కి అంటే కట్టి వేయబడుట అనేమాటకు వారి ప్రదర్శనలో భాగంగా చేసే గాన,నృత్యాభినయాలతో ప్రేక్షకుడి హృదయాన్ని ఆద్యంతం రసోత్కర్ష కలిగించి ప్రదర్శన పట్ల కట్టివేయడమని అర్థం చేసుకోవాలి. (తెలుగు నాటక వికాసం 154)
4. సుగ్రీవ విజయం యక్షగానం :
ఇంతకుముందు తెలిపిన లక్షణాలతో తెలుగు సాహిత్యంలో అనేక యక్షగానాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు లభ్యమైన వాటిలో మొట్టమొదటి యక్షగానంగా నిర్ణయించబడిన సుగ్రీవ విజయమనే యక్షగానం కందుకూరి రుద్రకవిచే ప్రణీతమైనది. అయితే ఇది రామాయణ ఇది వృత్తంతో సాగే రచన. కాగా రామాయణమన్నదే ఒక అద్భుతమైన రస స్రవంతి. ఇందులో ఉన్న కాండాలు ఈ రసస్రవంతిని ముందుకు నడిపించే పాయలు. అట్లాంటి ఒక రసవంతమైన పాయ సీతాన్వేషణలో రాముడు కిష్కిందను చేరి వాలిని సంహరించి, సుగ్రీవునికి పట్టాభిషేకం చేయడం. ఇది కథాపరంగా వాలికి కర్మ ప్రారాబ్ధమని అందరికీ తెలిసిన ఒక ఇతివృత్తమే అయినా, ఇక్కడ కర్మ అనగానే శుష్క వేదాంతం అని పెదవి విరువనక్కర లేదు. దానిని మరోలా అన్వయించుకుంటే సరైన రీతిలో వ్యక్తి ప్రవర్తన లేకపోతే దానికి తగిన మూల్యం చెల్లించాలని అర్థం చేసుకోవచ్చు. దానిని ఇంకాస్త తేలిక మాటల్లో చెప్పాలంటే, CHARACTER IS FATE అనుకోవచ్చు. కాబట్టి ప్రవర్తన దారి తప్పినపుడు ధర్మం ఎలా తన పనిచేస్తుందని చెప్పే నేర్పు కవి ప్రతిభను తెలుపుతుంది. అట్లాగే ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అని విశ్వనాధుడు తన సాహిత్య దర్పణంలో తెలిపినట్టు, కందుకూరి రుద్రకవిచే రచించబడిన సుగ్రీవ విజయమనే యక్షగానం అద్భుతమైనటువంటి రసాలంకార వాక్యాలతో కావ్య పరిమళ గుబాళింపు నిస్తుంది.
5. సౌందర్యాత్మక విలువలు :
సౌందర్యాత్మక విలువలే కావ్యశోభను తెస్తాయి. కావ్యశోభ అంటే కావ్యంలో కనిపించే అందం, విశిష్టత. ఈ అందాన్ని మరింత మెరుగుపరచే ముఖ్యమైన అంశాలే అలంకారాలు. అవి:
శబ్ద సౌందర్యం (శబ్దాలంకారాలు)
అనుప్రాస → శేషః సరూపోఽనుప్రాసః. (కా. సూ, చ.ప్ర, ద్వి.అ 8వ సూ)
నావుడు రామభూనాథుండు చేరఁ గా వచ్చి నిజభుజాగర్వంబు మెఱసి
ఇందులో ‘న’ అక్షరం పదాల ఆరంభంలో లేదా మధ్యలో పునరావృతమైంది.
యమక → పదమనేకార్ధమక్షరం వాఽఽ వృత్తం స్థాననియమే యమకమ్ (కా. సూ, చ.ప్ర, ద్వి.అ 1వ సూ)
తరువు లేడు గాఁడి డగ్గరి గిరి డుల్చి జగతి గాఁడి యురగజగతి గాడి
(గాడి =వేడుక/భద్రత, పక్కన పెట్టడం వంటి అర్థం భేదం గల అక్షర సమూహలను ఉపయోగించడం జరిగింది.)
దృశ్య వర్ణన:
ప్రకృతి, యుద్ధ భంగిమలు, పాత్రల శారీరక లక్షణాలను స్పష్టంగా చిత్రీకరించారు.
ఉదాహరణ:
వాలుఁగన్నులను వడియు బాష్పజలంబు వఱదలై పాఱ నడుగులు తడఁబడ నఱుపేదనడుము
గడగడ వడంక ముక్తామణుల్ రాల పెనఁగొన్నపెన్నెరు ల్పిఱుఁదు పైఁ దూలఁ జనుదెంచి (సు.వి 70ద్వి)
ఈ ఉదాహరణలో యుద్ధ దృశ్యాన్ని, పాత్రల భయాన్ని, భావోద్వేగాన్ని, ప్రకృతి కలయికను అత్యద్భుతంగా వర్ణించింది. ఇది కళ్ళకు కట్టినట్లు భావాన్ని తెచ్చే శక్తి కలిగిన దృశ్య వర్ణనకు ఒక గొప్ప ఉదాహరణ.
భావ ప్రాధాన్యత:
సీతా వియోగంలో రాముని ఆవేశం, సుగ్రీవుని భయభక్తులు వంటి భావనల్లో పద ప్రయోగం కీలకంగా ఉపయోగించి భావగర్భితం చేసారు.
ఉదాహరణ:
”హా సతీమణి! ధర్మచారిణి! హా గుణోన్నత! జనకసుత! నను
బాసిపోయితి వింతలోనే పద్మనయన! (సు.వి 19 త్రిపుట)
ఈ ఉదాహరణలో భావ ప్రాధాన్యత అనేది రాముని ఆవేశం, తపన, వేదన ద్వారా చక్కగా వ్యక్తం అయ్యింది. కవి పద ప్రయోగాన్ని ఎంతో నిబిడంగా వాడుతూ, సాధారణ సంభాషణను భావ గర్భితంగా మలచడం దీని ప్రత్యేకత.
5.1 భారతీయ అలంకార ధోరణి & ధ్వని సిద్ధాంతం:
ధ్వని సిద్ధాంతం:
వాచ్యము వివక్షితముకాని ధ్యనికి-పదము,
వాక్యమును, వ్యంజకమ్ములై వరలు, నట్లె
తదితర,మ్మను రణనాభిధమ్ము, నయిన
ధ్వనికి నయ్యవియేయగు వ్యంజకములు (ఆంధ్ర ధ్వన్యాలోకము ద్వితీయ భాగము 2)
ఈ ప్రపంచంలోని కవిత్వానికి జీవం పోసేది ధ్వని (వ్యంజన) మాత్రమే. కవుల వాణిలోని రహస్య భావం ఈ ధ్వని రూపంలోనే వెలుగొందుతుందని అర్థం.ఈ సిద్ధాంతం ప్రకారం, కవిత్వంలో ప్రాథమికంగా వ్యంజనార్థం ముఖ్యమైనదిగా ఆనంద వర్ధనుడు తన “ధ్వన్యాలోక” గ్రంథంలో వివరించాడు.
ఉదాహరణ : రామవిభుఁ డెక్కుపెట్టి యురగేంద్రనిభ మైన యొకదివ్యశరము తిరమొప్ప సంధించి తెగ నిండఁ దిగిచి వానరాధీవ్వరు వక్షస్థలంబుఁ బూనిక గుఱిసేసి పొంచి యేయుటయు ననలకీలలు గ్రమ్ము నమ్మహాశరము. (సు.వి 61ద్వి)
ఈ పద్యంలో శ్రీరాముడు తన శక్తితో దివ్య బాణాన్ని (మహాశరము) వాలి మీద సంధించగ, అది వాలి వక్షస్థలాన్ని తాకినపుడు, అతను పాతాళానికి పడిపోయాడనే ఘట్టాన్ని వివరిస్తుంది.
ధ్వని సిద్ధాంతం ప్రకారం,
అభిధా (ప్రత్యక్ష అర్థం) : శ్రీరాముడు వాలిని బాణంతో సంధించగా, అతను నేల కూలిపోయాడు.
లక్షణ (సూత్రార్ధం) : రాముని బాణానికి వాలి ప్రతిఘటన చేయలేకపోయాడు, అతని పౌరుషం అర్థరహితం అయ్యింది.
వ్యంజనా (ధ్వని) : అందువల్ల ఈ పద్యంలో రాముని బాణం కేవలం ఆయుధం మాత్రమే కాదు, అది ధర్మబాణం. అలాగే అది కేవలం శారీరక వధ మాత్రమే కాదు, అధర్మంపై ధర్మ విజయం కూడా అని గూఢార్థం తెలుపుతుంది. వాలి తన తప్పులను గ్రహించకముందే శిక్ష అనుభవించాడనే అంశం ధర్మాధర్మ పరిణామాలను ప్రతిబింబిస్తుందని వ్యంగ్యంగానూ తెలుస్తుంది .
5.2 వక్రోక్తి సిద్ధాంతం:
కుంతకుడు తన వక్రోక్తిజీవితంలో వక్రోక్తి సిద్ధాంతాన్ని వివరిస్తూ, కవిత్వానికి ప్రాణంగా భావించి, శబ్దం నుండి కథాపద్ధతి వరకూ వక్రత ఉండాలని పేర్కొన్నాడు. (కా.ప్ర ద్వితీయోల్లసము
93) అట్లాగ వక్రోక్తి సిద్ధాంతంతో పోల్చినపుడు యక్షగానంలోని సంభాషణలు, పాత్రల భావ వ్యక్తీకరణ ప్రత్యేకమైనవిగా తెలుస్తాయి.
ఉదాహరణ : “నతని వృత్తాంత మంతయును వీనుల కింపుగా విని యా కపీంద్రు నాదరంబున నేలి యతని చిత్తంబు భేదమంతయు మాన్పఁ గృప పుట్టి యిటకు ఓ వచ్చినవార; మెవ్వఁడవు? మా మదికి వచ్చియున్నవి నీ ప్రవర్తన ల్గొన్ని దెలియఁజెప్పు” (సు.వి 12ద్వి)
“మెవ్వఁడవు? మా మదికి వచ్చియున్నవి నీ ప్రవర్తన ల్గొన్ని దెలియఁజెప్పు” – ఇక్కడ వక్రోక్తి ఉంది. ఇది సాధారణంగా ప్రశ్న రూపంలో ఉన్నా, దీని వెనుక ఒక ప్రత్యేకమైన సందేహం లేదా వ్యంగ్యార్థం ఉంది. “మీరు ఎవరూ?” అని అడుగుతూనే, “మీ ప్రవర్తనల గురించి చెప్పండి” అని అడగడం ద్వారా, ప్రశ్నకర్త వాస్తవాన్ని మరింత లోతుగా గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది.
5.3 రసనిష్పత్తి సిద్ధాంతం:
భరతముని "నాట్యశాస్త్రం" ప్రకారం, "నహి రాసాదృతే కశ్చిదర్థః ప్రవర్తతే" (నాట్య శాస్త్రం, 6వ అ, 32వ శ్లో) రసం లేనిచో కావ్యార్థం నిలువదు.అయితే,"సుగ్రీవ విజయం" యక్షగానంలో కథానాయకులైన రాముడు, సుగ్రీవుడు, హనుమంతుడు వంటి పాత్రలతో ‘వీర రసాన్ని’ ప్రధానంగా ప్రదర్శించారు.ముఖ్యంగా సుగ్రీవ-వాలి యుద్ధం, రాముని సహాయం వంటి ఘట్టాల్లో ఈ వీర రసం స్పష్టంగా కనిపిస్తుంది.
అంగిరసం:
1. వీర రసం: సుగ్రీవుడు వాలిపై దాడి చేసున్నప్పుడు వర్ణించిన సందర్బంలో వీర రసం కనిపిస్తుంది
ఉదాహరణ:
యత్తఱి సుగ్రీవుఁడచలేంద్ర మొకటి పెకలించుకొనివచ్చి భీకరధ్వనులు ప్రకటించి దేవతాపతిపుత్రు నేయ దానిచేఁ (సు. వి 56ద్వి)
*దండెత్త వచ్చిన సుగ్రీవునిపై వాలి ఉద్దేశ్యాన్ని వీర రసంలోని 'యుద్ధ వీరం'తో వర్ణించారు.
చంపఁజాలక విడిచిపెట్టిన సరకు గొనక, వీఁడొక తెంపుగల మగవానివలెనే తిరిగివచ్చెన్;
వీని నిఁక మఱి ప్రాణములతో విడిచిపెట్టం, జెల్లదు (సు. వి 67ఆ. తా)
అంగ రసాలు:
2. కరుణ రసం (దుఃఖం, శోకం):
తార బాధ, వాలి మరణ దృశ్యాల్లో కరుణ రసం కనిపిస్తుంది.
ఉదాహరణ: ఏమి సేయుదు? శోకవారిధి నెట్లు గడతు? దైవము నేమి యని పలవించి దూఱుదు; నెందుఁజొత్తున్? (సు. వి 70ఆ. తా)
3. శృంగార రసం (విరహ శృంగారం) :
సీతాపహరణ విషయాన్ని రాముడు దుఃఖంతో చెబుతుండగా విరహ శృంగారం స్పష్టమవుతుంది.
ఉదాహరణ: ‘హా సతీమణి! ధర్మచారిని! హా గుణోన్నత! జనకసుత! నను బాసిపోయితి వింతలోనే పద్మనయన!’ (సు. వి 19త్రిపుట)
4. అద్భుత రసం (విస్మయం):
సుగ్రీవుడి శక్తిని పరీక్షించేందుకు రాముడు ఏడు తాళ్లను ఒక్క బాణంతో పడగొట్టడం అద్భుతంగా వర్ణించబడింది.
ఉదాహరణ: యాభూధరము గాఁడి, శేషుని పురము గనుఁగొని శరము గ్రమ్మఱఁ బొదికి వచ్చెన్. (సు. వి 42ఆ. తా)
5. రౌద్ర రసం (కోపం, ప్రతీకారం):
వాలి, సుగ్రీవుల మధ్య జరిగిన ఘర్షణలో రౌద్ర రసం విస్తృతంగా కనిపిస్తుంది.
ఉదాహరణ: ‘నోరి! నాతో నిన్న యుద్ధంబు సేసి పాఱియు నిపు డేల పఱతెంచి తీవ్రు.’ (సు. వి 60ద్వి)
6. హాస్య రసం (వినోదం, సరదా):
దుందుభిని వాలి వధించిన తర్వాత దుందిభి రక్తం ఏరులై పారింది. వాలిని మించిన వారు లేరని సుగ్రీవుడు అన్నప్పుడు రాముడు సమాధాన పూర్వకంగా ముఖంలో చూయించిన హావభావం హాస్యరసంలో కనిపిస్తుంది.
ఉదాహరణ: నె మ్మొగంబునఁ జిగురొత్త నిలిచి పాద
వనరుహాంగుష్ఠమున జిమ్మె దనుజవరునీ. (సు. వి 38జంపె)
7. భయానక రసం (భయం, అసహనం):
వాలి బలాన్ని చూసి సుగ్రీవుడు భయపడే సందర్భంలో భయానక రసం స్పష్టమవుతుంది.
ఉదాహరణ: జాలక భీతు(డై జలజాప్తసుతు(డు
వడిచెడి పారిపోవను గాళ్ళు రాక. (సు. వి 60ద్వి)
8. బీభత్స రసం (హింస, క్రూరత్వం) :
యుద్ధ ఘట్టాల్లో రక్తపాతం, వాలి మరణ దృశ్యాల్లో బీభత్స రసం కనిపిస్తుంది.
ఉదాహరణ: తన్నినప్పుడు దానవునీరక్తంబు వచ్చి, మెండుగ
నిన్నగేంద్రము మీఁదఁ బడి సహింపలేక. (సు. వి 36ఆ. తా)
9. శాంత రసం (శాంతి, తత్వదృష్టి) :
వానాకాలం ముగిసిన తర్వాత లంకపై దండయాత్ర చేయాలని రాముడు చెప్పే సందర్భంలో శాంత రసం కనిపిస్తుంది.
ఉదాహరణ: సుగ్రీవ! నీ వేఁగి యీ నాల్గునెలలును నెలమిఁ గిష్కింధ లో నుండి
వర్షంబు లోఁబడునపుడు సనుదెమ్ము వానర సైన్యంబుతోడ’ (సు. వి 96ద్వి)
అందువల్ల "సుగ్రీవ విజయం" యక్షగానంలో 'వీర రసం' అంగీ రసంగా ఉండగా, కరుణ, శృంగార, అద్భుత, రౌద్ర, భయానక, బీభత్స, హాస్య, శాంత రసాలు అంగ రసాలుగా కథా బలాన్నిపెంచుతున్నాయని చెప్పవచ్చు.
6. కావ్య శైలి:
ఈ యక్షగానం భారతీయకావ్యశైలి ప్రభావంతో మిశ్రశైలిలో రూపుదిద్దుకుంది. ఇందులో పద్యశైలి, గద్యశైలి, నాటకీయత, అలంకార ప్రాధాన్యత, శబ్దసౌందర్యం, ఛందోబద్ధత ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి.( సాహిత్య శిల్ప సమీక్ష 98-105)
పద్యశైలి:
ఉదాహరణ: అరిభయంకరరామ! అమితగుణసంసీమ! కరుణాభిరామ! శ్రీకాకుత్స్థరామ!’ (సు. వి 94జంపె)
గద్యశైలి:
ఉదాహరణ: సీతను వివాహమాడవా. పరశురాము భంగపఱచి భరతునకు రాజ్య మిచ్చి, గురుఁడు పనుప నడవి కేఁగవా (సు. వి 91ఏల)
నాటకీయత:
ఉదాహరణ: అని పలుకు సమయంబున వాలి మూర్ఛందెలిసె; తలవంచి యున్న సుగ్రీవునిం జూచి యే మనుచున్నాఁడు. (సు. వి 77త్రిపుట)
"సుగ్రీవ విజయం" కేవలం యుద్ధం, ప్రతీకారం కథ కాదు.ఇది ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, దుష్టులపైన శిక్ష ఎలా విధించబడుతుంది అనే నాటకీయ సందేశాన్ని ముడిపెట్టింది. అలా"సుగ్రీవ విజయం" యక్షగానం నాటకీయంగా అత్యంత సమతూకంగా ఉంది. కథానిర్మాణం, పాత్రల మాధుర్యం, రససమన్వయం, సంభాషణల బలమైన రచన, నాటకీయ సమయస్ఫూర్తి వంటి అంశాలు దీన్ని నాటకీయంగా సమగ్రరచనగా నిలబెట్టాయి. కాబట్టి, ఈ యక్షగానం ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా ప్రభావం చూపగలిగిన అపురూపసాహితీ నాటక లక్షణాలు కలిగి ఉన్నాదని చెప్పవచ్చు.
6.1 ప్రసాద గుణం (సులభత, స్పష్టత):
ప్రసాదవత్ ప్రసిద్ధార్థ మిన్దోరిన్దవరద్యుతి లక్ష్మ లక్ష్మీం తనోతీతి ప్రతీతిసుభగం వచ (కావ్యాదర్మః ప్రథమ పరిచ్ఛేదః 45శ్లో)
దీనికి అర్ధము ప్రసిద్ధమైనదని. అంటే అనేక అర్థాలు ఇచ్చే పదాలు ప్రయోగించకుండా, కష్టత్యాది దోషములు లేకపోవుట వల్ల చదివిన వెంటనే అర్ధస్పూర్తి కలిగించునదని.
ఉదాహరణ: నన్ను విడిచియు నిలువఁజాలక నాతి! వచ్చితి వడవిఁ దిరుగను (సు. వి 19 త్రిపుట)
6.2 మాధుర్యం (మృదుత్వం, శ్రావ్యత):
మధురం రసవద్వాచి వస్తున్యపి రసస్థితిః యేన మాద్యన్తి ధీమన్తో మధునేవ మధువ్రతా!. (కావ్యాదర్మః ప్రథమ పరిచ్ఛేదః 51శ్లో)
*ఇందులో రసము కలిగియుండుట మాధుర్యమని అర్థం
ఉదాహరణ: జలనమొందెను నాదు హృదయము జలజనయనా!
నన్ను నీ వెడఁబాయ వెన్నడు; నిన్ను నే నెడఁబాయఁజాలను (సు. వి 19త్రిపుట)
6.3 ఓజస్సు (శక్తి, గంభీరత):
ఓజః సమాసభూయస్త్వ మేతద్గద్యస్య జీవితమ్ పద్యే వ్యదాక్షిణాత్యానామిదమేకం పరాయణమ్. ( కావ్యాదర్మః ప్రథమ పరిచ్ఛేదః 80శ్లో)
అధికమగ సమాసముల ప్రయోగముండటం ఓజస్సు లక్షణం.
ఉదాహరణ: ద్రోహివి నినుఁ బట్టి త్రుంపక రోష దాహంబు తీఱదు తపనజ నాకు (సు. వి 30ద్వి)
కొన్నిచోట్ల పద ప్రయోగం సులభంగా, స్పష్టంగా ఉండి, చదివిన వెంటనే అర్థమయ్యేలా ఉండడం అంటే పదాల్లో మృదుత్వం, మాధుర్యం ఉండి, తేలికగా నదీ ప్రవాహంలా వినిపించడం అనీ,మరి కొన్నిచోట్ల అధిక సమాస ప్రయోగంతో, పదబలం ఎక్కువగా ఉండి శక్తివంతమైన భావ ప్రకటన చేయడం లాంటి ఈ లక్షణాలు కావ్యంలో భావోద్వేగాలను బలంగా వ్యక్తపరిచే విధంగా ఉపయోగిస్తాయి.అలా “సుగ్రీవ విజయం” యక్షగానంలో ఇవి సమపాళ్లలో ఉండటం వలన అది గొప్ప కావ్య సౌందర్యాన్ని పొందిందని చెప్పవచ్చు.
7. ఛందస్సు – గేయ ఫణతులు:
సాధారణంగా యక్షగానాల్లో రేకులు, చంద్రికలు, దరువులు వంటి పాటలతో పాటు, మాత్రాగణ బద్ధమైన జాతి, ఉపజాతి పద్యాలుంటాయి. “సుగ్రీవ విజయం” యక్షగానంలో కూడా ద్విపద త్రిపుట, ఆట తాళం, జంపె, అర్ధ చంద్రికలు ,ఏకతళము, ఏలలు,ధవళములు వంటి ఛందో లక్షణాలను కలిగి ఉన్నది.
8. అలంకార ప్రాధాన్యత (శబ్ద & అర్థాలంకారాలు)
(A) శబ్దాలంకారాలు:
•అనుప్రాస: శేషః సరూపోఽనుప్రాసః. (కా. సూ, చ.ప్ర, ద్వి.అ 8వ సూ)
"సరూపమైన" అంటే ఒకే రకమైన అక్షరాలు కలిగి ఉండటం.అనుప్రాసం అనేది ఒక రకమైన అలంకారం, ఇందులో ఒకే అక్షరం లేదా పదం పునరుక్తం (repeat) అవుతూ వస్తుంది, కానీ అదే అర్థంలోనో, వేరే అర్థంలోనో ఉండొచ్చు.
ఉదాహరణ: నావుడు రామభూనాథుండు చేరఁ గా వచ్చి నిజభుజాగర్వంబు మెఱసి (సు.వి 82 ద్వి) (నా, భు అక్షరాల పునరుక్తి)
*అంత్య ప్రాస : పదాంతమున ప్రాసమున్న అంత్యప్రాసాలంకారము.
ఉదాహరణ:
కన్నుల నశ్రులు గ్రమ్మగ వగచున్
ఔరా విధివశ మని తల యూఁచున్
ఏటికి ప్రాణము లిఁక నని తలంచున్
క్రమ్మఱ సొమ్ములు రొమ్మున నొత్తున్
ఏగతి నోరుతు నిఁక నని పలుకున్
బాపురేవిధి యని ఫాలము ముట్టున్. (సు.వి 23 అ. చం)
*యమకం: .పదమనేకార్ధమక్షరం వాఽఽ వృత్తం స్థాననియమే యమకమ్ (కావ్యాలంకార సూత్రాణి చ.ప్ర. 1వ సూ)
ఉదాహరణ:
తరువు లేడు గాఁడి డగ్గరి గిరి డుల్చి
జగతి గాఁడి యురగజగతి గాడి (సు. వి 61ద్వి)
(గాడి = వేడుక/భద్రత, పక్కన పెట్టడం వంటి అర్థం భేదం గల అక్షర సమూహలను ఉపయోగించడం)
ఈ పద్యంలో "గాఁడి" అనే పదం రెండుసార్లు పునరుక్తి అయ్యింది, కానీ వాటి అర్థాలు భిన్నంగా ఉన్నందున ఇది యమక అలంకారానికి మంచి ఉదాహరణ అవుతుంది.
(B) అర్థాలంకారాలు:
ఉపమా అలంకారం:
ఉపమా అలంకారం అనగా ఒక వస్తువుని మరో వస్తువుతో పోల్చి చెప్పడం. ఇది పూర్ణోపమా (పూర్తిగా పోలికతో) మరియు లుప్తోపమా (పోలిక కొంత విస్మరించబడిన)గా ఉంటుంది. ఇందులో ఉపమానము (పోలిక ఇవ్వబడే వస్తువు), ఉపమేయం (పోల్చబడే వస్తువు), ఉపమావాచకం (పోలిక తెలియజేసే పదం – వలె, వంటి, లాగా), సాధర్మ్యం (ఉమ్మడి లక్షణం) అనే ముఖ్య భాగాలు ఉంటాయి. (అలంకార మకరందః 13).
ఈ యక్షగానంలో కూడా ఉపమా అలంకారాన్ని ఉపయోగించారు.
ఉదాహరణ: ఈ మనోహరరూపవైఖరు లిట్టి తేజముఁ గలుగువారికి - భూమి నెటు వలె దుష్టగుణములు వాడమునయ్యా (సు.వి.9 త్రిపుట)
ఇందులో ఉపమానము - భూమి , ఉపమేయం - మనోహరమైన రూపంకలిగినవారు.ఉపమావాచకం - వలె , సాధర్మ్యం - భూమి పై భాగం అందంగా కనిపించినా లోపల చెడుగుణాలు ఉండటం; అదే విధంగా అందమైన రూపం కలిగిన వారు లోపల చెడ్డ మనస్తత్వం కలిగి ఉండటం. ఈ విధంగా, ఉపమా అలంకారం ఉపయోగించి పాత్రల లక్షణాలను ఆవిష్కరించడమే కాక, రచనలో భావ పరిమళాన్ని పెంచారు. “సుగ్రీవవిజయం”లో కూడా భూమిని ఉపమానంగా తీసుకొని, ఒకవ్యక్తి స్వభావాన్ని వివరించడం జరిగింది. కాబట్టి ఇది స్పష్టమైన ఉపమా అలంకారంగా నిలుస్తుంది.
రూపాకాలంకరం :
రూపకాదులయందు ఉపమానోపమేయములకు అభేదము వర్ణించబడును. (అలంకార మకరందః 36)
“సుగ్రీవ విజయం” యక్షగానంలో రూపకాలను పరిశీలించినప్పుడు, ముఖ్యంగా “శోకవారిధి” అనే పదబంధాన్ని మనం గుర్తించవచ్చు. ఇందులో “శోకము” (దుఃఖం) ని “వారిధి” (సముద్రం) గా నేరుగా పేర్కొన్నారు. సాధారణ ఉపమాలలో “వలె”, “లాగా” వంటి పదాలు ఉపయోగించబడతాయి, కానీ రూపకంలో అవి లేకుండా నేరుగా పోలిక చేసారు. ఇక్కడ “శోకము” (దుఃఖం) ని సముద్రంగా ఆరోపించడం రూపక లక్షణం అవుతుంది.
ఉదాహరణ: వినకపోతి; ఏమి సేయుదు? శోకవారిధి నెట్లు గడతు? (సు.వి 70ఆ. తా)
సందేహలంకారం :
కవి సమయమువలన ఏర్పడిన సాదృశ్యమును బట్టి ప్రకృత వర్ణనా విషయమగు వస్తువు దాని యుపమానముకాదగిన వస్తువుగా సందేహించబడెనేని అపుడు (ప్రకృతా ప్రకృత ములు రెండును సందేహ విషయములే యగును.) అట్టిచోట సందేహాలంకారములగును (అలంకార మకరందః 48)
ఉదాహరణ: అయ్యో! మీరెలా రాజసుతులో యతులో తెలియఁగరాదు సందియ మయె?” (సు.వి 11త్రిపుట)
ఇందులో ఎదుటి వ్యక్తి రాజసుతుడా? లేక తపస్వీనా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక్కడి గందరగోళమే సందేహాలంకారం. ఇది ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తించడంలో సహాయపడుతుంది, అలాగే కథలోని పాత్రల అప్రమత్తతను కూడా బహిర్గతం చేస్తుంది.
ఉల్లేఖాలంకారం :
శ్లేషమును బట్టి గాని, ఆర్థము కుదురుటను బట్టి గాని, తమ రుచిని బట్టి గాని ఒకే వ్యక్తిని అనేకులు అనేక విధములుగా ఆనుకొనినట్లు వర్ణించబడెనేని ఆది ఉల్లేఖాలంకార మని తెలియవలెను. (అలంకార మకరందః 52)
ఉదాహరణ: లలితగాత్రుడు శుభచరిత్రుఁడు దళితశత్రుఁడు
సుజనమిత్రుఁడు నలిననేత్రుఁడు కందుకూరి జనార్ధనుండు.
శౌర్యుఁడు మేరు ధైర్యుఁడు ఇందిరార్యుఁడు సాధువర్యుఁడు
పృథులశౌర్యుఁడుమేరుధైర్యుఁడునందితార్యుఁడుకందుకూరిజనార (సు.వి 3త్రిపుట)
ఈ పద్యంలో "కందుకూరి జనార్దనుడు" అనే వ్యక్తికి అనేక విశేషణాలు వరుసగా వర్తింపజేశారు. అతని శరీరలక్షణాలు (లలితగాత్రుడు), నడవడి (శుభచరిత్రుఁడు), శౌర్యం (శౌరుఁడు), కరుణ (సుజనమిత్రుఁడు) మొదలైనవి పేర్కొంటూ, ఒకే వ్యక్తిని అనేక కోణాల్లో వివరించారు.
ఉత్ప్రేక్షాలంకారం :
ప్రకృతమనగా ఉపమేయము. ఈ ఉపమేయమును ఇతర ధర్మసంబంధమును బట్టి ఇతరముగానే సంభావించుట ఉత్రేక్ష యని ఈ ఉత్ప్రేక్షాలంకార లక్షణసారము. (అలంకార మకరందః 58)
ఉత్ప్రేక్ష అంటే ఉపమేయాన్ని ఇతర గుణసంబంధాల ద్వారా మరొక ప్రత్యేక రూపంగా ఊహించడం. ఇది కవి ఊహాశక్తికి పరాకాష్ట. సాధారణ ఉపమాతో పోలిస్తే, ఇందులో ఊహించబడిన వస్తువు సాధారణ గుణాలను దాటి అతిశయంగా వ్యక్తీకరించబడుతుంది.
ఉదాహరణ : అంత నెత్తురు టేఱు లంతటనె వచ్చెన్ రక్కసుని ఘోషములు వెక్కసములాయెన్ (సు.వి 27అ. చం)
ఇందులో యుద్ధ భీకరతను, రక్తపాతం తీవ్రతను ఉత్ప్రేక్షతో చూపించారు. రక్తం విపరీతంగా పొంగిపొర్లడం, భయంకరమైన శబ్దాలు కూడా దిగమింగిపోవడం వంటి భావాలను అతిశయంగా చెప్పడం వలన ఇది ఉత్ప్రేక్షగా నిలుస్తుంది.
అతిశయోక్తి అలంకారం:
ఉపమేయమును చెప్పక ఉపమానమును మాత్రమే చెప్పినపుడు ఆతిశయో క్తి కారమగును. ఇది భేదముండగా వభేదము చెప్పుట ఆభేదముండగా భేదము చెప్పుట సంబంధము లేక పోయినను సంబంధము చెప్పుట సంబంధమున్నను అసంబంధము చెప్పుట అని నాలుగు రకములుగా నుండును.(అలంకార మకరందః 77)
ఉదాహరణ: ఆకళేబర మంతదూరం బరుగఁ జిమ్మన్, వాలికిఁ గాక చెల్లునె యన్యులకు రాఘవనృపాలా! (సు.వి 36ఆ.తా)
ఈ వాక్యంలో వాలి అంతటి బలశాలి, ప్రతిభావంతుడు మరెవరూ లేరని అతిశయోక్తితో చెప్పడం జరిగింది. వాలిని ఏకైక అసాధారణ శక్తివంతుడిగా కీర్తించడం, అతని సమానుడు ఎవరూ లేరని చెప్పడం ఈ అలంకారానికి మంచి ఉదాహరణ.
శ్లేషాలంకారం :
ఒక శబ్దముచేత రెండర్థములు చెప్పించుకొనుట శ్లేషము. ఈ రెండర్థములు విశేషణములు కావచ్చును లేదా విశేష్య లైనా కావచ్చును.(అలంకార మకరందః 101)
ఉదాహరణ: ప్రతిలేని కపిరాజ్యపట్టంబు నినుఁ గట్టి సుతుఁడ! నీవిభవంబు సూడలేనైతి. (సు. వి 80జంపె)
ఈ పద్యంలో (ఒకే పదబంధానికి ప్రతిలేని = ప్రత్యర్థి లేని & అపూర్వమైనది) విభిన్న అర్థాలను ఇచ్చి, వ్యంగ్యభావాన్ని లేదా ద్వంద్వార్థాన్ని సృష్టించడం జరిగింది. పదాల అర్థాల మధ్య ఆటవిక్రియ వల్ల ఇది శ్లేషాలంకారం అవుతుంది.
వ్యాజస్తుతాలంకరం:
స్తుతి రూపమో నిందారూపమో ఆగు ప్రస్తుతము, అట్టి నిందారూపమో స్తుతిరూపమో ఆగు నప్రస్తుతము వలన, అవగతమయిన నది వ్యాజస్తుతియలంకారము. (అలంకార మకరందః 111)
ఉదాహరణ: కరుణాపయోధి రాఘవుఁడు ధర్మాత్ముఁ డనీ నరు లెంచఁగాఁ గాక నమ్ముదునె నిన్ను. (సు. వి 65 జంపె)
ఈ వాక్యంలో శ్రీరాముడి కరుణ, ధర్మాన్ని ప్రశంసిస్తున్నట్లు అనిపిస్తున్నా, వాస్తవానికి ఇది వ్యంగ్యంగా ప్రశ్నిస్తోంది—రాముడు నిజంగా న్యాయబద్ధుడేనా లేక ప్రజలు నమ్మినంత మాత్రాన మాత్రమే అతనికి ఆ గుణాలు వుంటాయా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తోంది.
ఈ అలంకారం ఉపయోగించడం వలన, రచయిత ఒకేసారి ప్రశంస, విమర్శ అనే రెండింటినీ కలిపి చెప్పగలుగుతాడు. ఇది పాఠకులకూ, ప్రేక్షకులకూ లోతైన అర్థాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది
ప్రశ్నాలంకారం:
చమత్కార పూర్ణమగు పరస్పర సంభాషణము ప్రశ్నోత్తర రూపముగా బంధించ బడియున్న నది ప్రశ్నోత్తరికాలంకారము. (అలంకార మకరందః 143)
ఉదాహరణ: మెవ్వఁడవు? మా మదికి వచ్చియున్నవి నీ ప్రవర్తన ల్గొన్ని దెలియఁజెప్పు' (సు. వి 12 ద్వి)
ఇందులో ఒక పాత్ర ప్రశ్న అడుగుతుండగా, అదే సమయంలో మళ్లీ ప్రశ్న ద్వారా సమాధానాన్ని కోరుతుంది. ఇది సాధారణ ప్రశ్న కాదు, దీని వెనుక ఒక విధమైన వక్తృత్వం లేదా వ్యంగ్యం ఉండవచ్చు. సామాన్యంగా చెప్పాలంటే, ఈ అలంకారం వాక్యానికి మరింత జీవం, ఆహ్లాదం తీసుకురావడమే కాకుండా, శైలీ పరంగా ఆసక్తిని పెంచుతుంది.
ఉదాత్తాలంకారము :
సమృద్ధిగలపదార్థముల వర్ణనము ఉదాత్తాలంకారము.(అలంకార మకరందః 149)
ఉదాహరణ: అనిన విని దైర్యగుణావంధ్యం బగు వింధ్యంబు కడకేఁగి తన సత్త్వంబు చూపె నట యెటువలెను (సు.వి 33 ఆ.తా)
సమృద్ధిగల పదార్థముల వర్ణనము ఉదాత్తాలంకారం” అనే నిర్వచనానికి అనుగుణంగా, ఈ అలంకారంలో గొప్ప విలువలు, వీరతనం, గొప్ప వ్యక్తుల ఔన్నత్యాన్ని చెప్పడానికి గంభీరమైన శబ్దాలను ఉపయోగించారు కాబట్టి ఇది ఉదాత్తాలంకారం అవుతుంది.
9. శబ్ద సౌందర్యం (ధ్వని & గానత్మకత)
మన శరీరనికి ఆభరనాలు అందానిచ్చినట్లు కావ్యానికి శబ్ద-అర్థాలంకారాలు అందానిస్తాయి. భామహుని ప్రకారం, శబ్దం (ధ్వని) & అర్థం (భావం) కలిసి కావ్య శరీరాన్ని ఏర్పరుస్తాయి, వీటికి అలంకారాలు అందించడం ద్వారా కావ్య సౌందర్యం పెరుగుతుంది.
ఈ యక్షగానంలో శబ్ద అలంకారాలు (అనుప్రాస, యమకాలు) & ఛందోబద్ధ పదప్రయోగాలు కావ్యాన్ని నాటకీయంగా, శ్రావ్యంగా మార్చాయి.
ఉదాహరణకు, నాటకీయత, సంభాషణల శక్తి, రసాల ప్రదర్శన ఇవన్నీ శబ్దసౌందర్యంతో మరింత ప్రభావవంతంగా మారాయి. వీరరసం, శృంగారరసం, రౌద్రరసం మొదలైన భావనల్ని నాటక లక్ష్యానికి అనుగుణంగా చేయడంలో శబ్ద ప్రయోగం కీలకం.
ప్రాస & మకుటం
ఉదాహరణ:
‘అరిభయంకరరామ! అమితగుణసంసీమ!
కరుణాభిరామ! శ్రీకాకుత్స్థరామ!
రవికులాంబుధిసోమ! రాజకులసుత్రామ!
రవికోటిసమధామ!రామాభిరామా!’ (సు. వి 90ప)
ఇందులో పద్యం చివరన ఉన్న ‘రామాభిరామా’ మకుటంగానూ, ప్రతీ పాదం చివర ‘మ’ అనే అక్షరంతో ప్రాస కూడా ఉంది.
9.1 రీతి:
వామనుడు “రీతిరాత్మ కావ్యస్యః” (కావ్యాలంకార సూత్రాణి ప్రథమాధికరణం 6వ సూ) అని పేర్కొన్నారు. శరీరానికి ఆత్మ ఒకటి ఉన్నట్లు, కావ్యానికి కూడా ఆత్మ ఉంటుందని అర్థం.
ఆ ఆత్మే రీతి. ఈ రీతి ఏంటంటే విశిష్టా పదరచనా రీతిః (కావ్యాలంకార సూత్రాణి ప్రథమాధికరణం 7వ సూ). అంటే విశేషమైన పద రచనే రీతి అని అర్థం. అలా సుగ్రీవ విజయం యక్షగానంలో కూడా రీతి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవి:
a. వైధర్భీ రీతి: సరళత, మాధుర్యం, సహజ భావప్రకటన.
ఉదా: సురలు భూసురులు మెచ్చఁగా - పాపజాతి సుప్పనాతిఁ గోపగించి ముక్కు చెక్కి - యేపునను ఖరుని ద్రుంచవా (సు. వి 91ఏల)
ఈ పద్యంలో మాధుర్యం, సరళత, సహజమైన శైలిలో భావ వ్యక్తీకరణ కనిపిస్తుంది. కోమలమైన శబ్ద ప్రయోగం ఉంది.
b.గౌడీ రీతి: ఘనత, ఓజస్సు, గంభీరత.
ఉదా: శ్రీరామచంద్రుఁ డాశ్రితరక్షకుఁడు మేరు-
ధీరుండు శూరుండు దివ్యాస్త్రవిదుఁడు (సు.వి 15వ జంపె)
ఈ పద్యంలో బలమైన పద ప్రయోగం, ఘనత, ఓజస్సు ఉన్నాయి. శ్రీరాముని మహత్త్వాన్ని గంభీరంగా, శక్తివంతంగా వ్యక్తపరచిన తీరు గౌడీ రీతికి సరిపోతుంది.
c.పాంచాలి రీతి: నాటకీయత, ఉదాత్తత.
ఉదా: అనిన రామచంద్రుండు వాలితో ఏమనుచున్నాడు
ఏల కపివర్య! యీపాలుమాలినమాట లోలి నాడెడు శౌర్యశాలివై యుండి? రోసమున నిజసోదరుని యాలి గైకొన్న దోసకారివి నిన్ను ద్రుంపనే తగవు; పరమధార్మికుఁడైన భరతవిభు పంపునను జరియించుచును దోషకరుఁ జూడఁగలమ? ( సు.వి 67జంపె)
ఈ పద్యంలో ఉదాత్తమైన భావన, నాటకీయత స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంభాషణ రూపంలో ఉద్వేగపూరితమైన భావ వ్యక్తీకరణ ఉండటం దీని ప్రత్యేకత.
కాబట్టి ఈ యక్షగానం మూడు రీతులను సరళత గాంభీర్యత నాటకీయత అనే లక్షణాలతో ప్రదర్శనాయోగ్యమైన కావ్య లక్షణాలను కలిగి ఉందని చెప్పవచ్చు.
9.2 పాకం :
పాక ముదీరితార్ధపరిపాక మనం దగు; నందు గోస్తనీ
పాకము, నారికేళ ఫలపాక మనవి ద్వివిధంబు; గోస్తనీ
పాక మసంవృతార్థ పరిపాకనివేద్యము; నారికేళ పా
కాకలనంబు గూఢనిబిడార్థవిచార్యము వీని లక్ష్యముల్. (కా. సం, ద్వి.ఆ 189-190).
ఇందులో ద్రాక్షాపాకమంటే అసంవృతమైన (అగూఢమైన) రుచి. నారికేళపాకమంటే గూఢమైన అర్థముయొక్క రుచని, ఇఁక నారికేళముయొక్క రుచి అంటే మిక్కిలి దుష్కరమనే విషయాన్ని గ్రహించాలి.
1. ద్రాక్షా పాకం: (స్పష్టమైన అర్థవ్యక్తీకరణ)
ఉదా: నాయ మెఱుఁగక చంపితివి నరనాథ... (సు.వి 63 త్రి)
చక్కటి సామాన్య భాషలో, ఏ అభిప్రాయ గందరగోళం లేకుండా చెప్పబడింది.అట్లాగే, ఈ శైలిలో భావం నేరుగా అర్థమవుతుంది.గనుక ఇది ద్రాక్షాపాకంలో ఉందని చెప్పవచ్చు.
2. కదళీ పాకం: (భావగంభీరతతో కూడిన శైలి).
ఉదా: వాలుఁగన్నులను వడియు బాష్పజలంబు వఱదలై పాఱ నడుగులు తడబడ నఱుపేదనడుము గడగడ వడంక ముక్తామణుల్ రాల పెనఁగొన్నపెన్నెరు ల్పిఱుఁదుపైఁ దూలఁ జనుదెంచి జీవితేశ్వరుమీఁద వ్రాలి. (సు. వి 69ద్వి) .
ఈ పద్యంలోని భావం లోతుగా చెప్పబడింది. కవిత్వంలోని భావన బలమైన అనుభూతిని కలిగించింది, దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది.గనుక ఇది కదళీ పాకంలో ఉందని చెప్పవచ్చు.
3. నారీకేళ పాకం: (అంతరార్థంతో కూడిన పదప్రయోగం).
ఉదా: ధర్మమే జయమనుచుఁ దలపఁనేరని.. (సు. వి 67జంపె)
"ధర్మో రక్షతి రక్షితః" ధర్మాన్ని కాపాడితే అది నిన్ను కాపాడుతుంది. (మనుస్మృతి 8.15) అనే సూక్ష్మ అర్థాన్ని గ్రహించవలసి ఉండటం వలన ఇది నారీకేళ పాకం అవుతుంది.
కాబట్టి “సుగ్రీవ విజయం” యక్షగానం ఈ మూడు రకాల గుణాలను సమతూకంగా కలిగి ఉందని చెప్పవచ్చు.
9.3 వృత్తి :
యక్షగానం ఒక నాటకీయ ప్రదర్శన కావడంతో, ఇందులో వృత్తుల పాత్ర అత్యంత ప్రధానమైనది. "సుగ్రీవ విజయం" యక్షగానాన్ని విశ్లేషించినప్పుడు, కైశికీ, ఆరభటీ, సాత్వతీ వృత్తుల సమతుల్యత స్పష్టంగా కనిపిస్తుంది.
"అత్యర్థ సుకుమారార్థ సందర్భా కైశికీ మతా
అత్యుద్ధతార్థ సందర్భా వృత్తి రారభటీ స్మృతా
ఈష స్మృద్వర్థ సందర్భా భారతీవృత్తి రిష్యతే
ఈషత్రాఢార్థ సందర్భా సాత్త్వతీవృత్తి రిష్యతే" (కా. సం, ద్వితీయాశ్వాసము 183)
అంటే కోమలమైన అర్థమును వర్ణించుట కైశికీవృత్తి; మిక్కిలి అర్థమును వర్ణించుట ఆరభటి; ఈషత్ప్రఢమైన అర్థమును వర్ణించుట భారతీవృత్తి; ఈషత్కోమలమైన అర్థమును వర్ణించుట సాత్వతి అని తాత్పర్యం.
1. కైశికీ వృత్తి - శృంగార మాధుర్యం:
శృంగార రసానుకూలమైన వస్తువు కన్య, దాని వర్ణనము కైశికీ వృత్తి. ఈ వృత్తిని (వైదర్భీ) రీతి తెలుపుతుంది. (కావ్యాలంకార సంగ్రహము ద్వితీయాశ్వాసము 185)
"పలుకుపలుకున నొలుక నమృతము..." (సు.వి 63 త్రిపుట)
ఈ పంక్తి మాధుర్యాన్ని, సంగీతమూ, నృత్యంతో కూడిన నాటకీయతను సూచిస్తుంది. ఇది ప్రధానంగా శృంగార రసాన్ని, సౌందర్యాన్ని మలచటంలో సహాయపడుతుంది.
2. ఆరభటీ వృత్తి—వీరత్వం, ఉత్కంఠ:
ఇది రౌద్రరసానుకూలమైన వస్తువు. దీనిని గౌడీరీతి తెలుపుతుంది. (కా.సం, ద్వితీయాశ్వాసము 185)
"నోరి! నాతో నిన్న యుద్ధంబు సేసి?" (సు. వి 60ద్వి)
ఈ వాక్యం కథలోని ఉద్వేగాన్ని, వీరతను ప్రతిబింబిస్తుంది. యుద్ధ ఘట్టాలకు అవసరమైన ఉత్కంఠను పెంచేలా ఈ వృత్తి నాటకీయతను సమకూరుస్తుంది.
3. సాత్వతీ వృత్తి—ధర్మ, భక్తి, నీతి:
దీనిలో వీర శృంగారానుకూలమైన వస్తువర్ణన ఉంటుంది. పాంచాలి రీతి వ్యక్తం చేస్తుంది. అలాగ సాత్వతీ వృత్తి ధర్మపరమైన సందేశాలను అందించడంలో కీలకంగా ఉంటుంది. (కా .సం, ద్వితీయాశ్వాసము 186)
"ధర్మమే జయమనుచు దలపఁనేరని..." (సు. వి 67జంపె)
ఈ వాక్యం కథలోని నీతిబోధను, ధర్మ పరమైన అంతర్లీన సందేశాన్ని స్పష్టం చేస్తుంది. పాత్రల నడవడికలో నీతి స్పష్టంగా వ్యక్తమవుతుంది.
ఈ మూడు వృత్తుల సమతుల్యత "సుగ్రీవ విజయం" యక్షగానాన్ని సమగ్రంగా మార్చింది. అందువల్ల "సుగ్రీవ విజయం" యక్షగానం నాటకీయత, శ్రావ్యత, నీతి బోధ కలయికతో ఉన్నత స్థాయికి చేరింది. ఇందులో వృత్తుల సమతుల్యత కథను మరింత ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా మార్చిందని చెప్పవచ్చు .
10. పంచసంధుల వినియోగం:
అర్థప్రకృతయఃపంచ పంచావస్థా సమన్వితాః యథాసంఖ్యేన
జాయంతే ముఖాద్యాః పంచసంధయః ముఖప్రతిము భేగర్భః సావమర్శోవ సంహృతిః॥ (దశరూపక సారము 23).
* ముఖసంధి: (బీజము+ఆరంభం)
→ తొలి భాగం, పాత్రల పరిచయం, కథానిర్మాణానికి ఆధారభూతమైన అంశాల అమరిక.
→ పాత్రల పరిచయం, సీతా అపహరణం.
* ప్రతిముఖ సంధి: (బిందువు + ప్రకరి)
→ ప్రధాన సంఘటనలు ఎలా సాగేలా ఉంటాయో నిర్ణయించే దశ. కథలో ఉత్కంఠ మొదలవుతుంది.
→సుగ్రీవ-వాలి యుద్ధానికి సన్నాహం.
* గర్భసంధి: (పతాక+ప్రాప్త్యాశ)
→ కథలో అత్యంత సంక్లిష్టమైన దశ, ప్రధాన సంఘర్షణ, విరోధం.
→ వాలి మరణం, రాముని ధర్మ వివరణ.
* అవిమర్శకసంధి: (ప్రకరి +నియతాప్తి)
→ కథలో ముగింపుకు ,అలాగే ప్రధాన సమస్యకు పరిష్కారం కనుగొనబడే దశ.
→ సుగ్రీవుని విజయప్రాప్తి, వానరసేన ఏర్పాటు.
* నిర్వాహణసంధి: (కార్యము + ఫలాగమము)
→ కథ ముగింపు దశ, పాత్రలు తమ గమ్యాన్ని చేరే ఘట్టం.
→ సుగ్రీవుని పట్టాభిషేకం, రాముని సహాయం.
ఇలా సుగ్రీవ విజయం కథలోని కార్యవస్థలు, అర్థప్రకృతులు, సంధులు అన్నీ కథను సమగ్రంగా నిర్మించేందుకు ఉపయోగపడ్డాయి. ధర్మం న్యాయం, మైత్రి, మౌలిక విలువల్ని ప్రతిబింబించే విధంగా ఈ కథన నిర్మాణ రూపకల్పనలో పంచ సంధుల వినియోగం అద్భుతంగా జరిగిందని చెప్పవచ్చు. సుగ్రీవ విజయం" కథలో పంచ సంధుల సమతుల్య వినియోగం వల్ల కథ సరళంగా నడిచింది. ఉత్కంఠ, భావోద్వేగం, ధర్మ వివేచన, నీతిబోధ అన్నీ కలబోశాయి. అందువల్లే నాటక లక్షణాలను నిబద్ధంగా అనుసరించి, రసభావ సమతుల్యత చూపించింది.
11. ఉపసంహారం:
- జానపదుల సాహిత్యం లేదా ప్రజాసాహిత్యంగా పిలవబడుతున్నటువంటి దేశీసాహిత్యంలో ఉపమాలాంటి సాధారణ పోలికలే తప్ప మిగతా ఆలంకారిక శైలి ఉండదనే సామాన్యుల అభిప్రాయాలను సుగ్రీవ విజయం అనే యక్షగానం పటాపంచలు చేసింది.
- ఇందులోని అలంకారిక వినియోగం దేశీ సాహిత్యంలో అంతర్లీనంగ దాగి ఉండే కావ్య లక్షణ స్థాయిని తెలియజేసింది.
- అట్లాగే సన్నివేశ చిత్రణల్లో ఒక రసం నుండి మరో రసానికి బదిలీ అయ్యేప్పుడు కూడా ఎక్కడా రస సన్నికర్ష జరగకుండా ఎంతో మృదువుగా సాగిపోయే రచనా నేర్పు దేశీ రచనల్లో ఉందని ఈ యక్షగానం తెలిపింది.
- అట్లాగే ధ్వని, వక్రత, శైలీ,రీతి వంటివన్నీ కావ్య లక్షణాలుగా ఈ యక్షగానానికి అదనపు పరిమళాన్ని తెచ్చి పెట్టాయి.
- ఇలా సుగ్రీవ విజయం అనే ఈ యక్షగానంలో వస్తువు, ఛందస్సు, అభివ్యక్తి మొదలైనవన్నీ కూడా కావ్యలక్షణాలను సమోన్నతంగా తెలియజేస్తూ కావ్య గౌరవ గుర్తింపుని ప్రశ్నిస్తాయి.
- అందువల్ల సాహిత్య రచనల్లో ప్రజలకు చేరువగా ఉండే జన భాష యొక్క ఔచిత్యం గుర్తించడం వల్ల దేశీ రచనలు మిగతావాటితో ఏ మాత్రం తీసిపోలేనివని తెలపడమే కాకుండా అవి సాహిత్యంలో అపురూప స్థానాన్ని పొందుతాయి. అలాగే సాహిత్యం సమాజానికి దర్పణం అనే మాట ఋజువు చేస్తాయి.
- కాబట్టి సుగ్రీవ విజయం అనే ఈ యక్షగానానికి సంపూర్ణ కావ్య లక్షణాలు ఉన్నాయని తెలుపుతూ భవిష్యత్తు పరిశోధకులకు దేశీ సాహిత్యంలో ఉన్న మాధుర్యాన్ని కావ్య గౌరవాన్ని వెతకవలసిన అవసరం ఉన్నదని ఈ పరిశోధన వ్యాసం గుర్తు చేస్తుంది.
12. పాదసూచికలు:
- సీతాకళ్యాణం (యక్షగానము) తొలిపలుకు, వడ్లమూడి గోపాలకృష్ణయ్య, పుట.vi.
13. ఉపయుక్తగ్రంథసూచి:
- ఎల్లారెడ్డి, పొద్దుటూరి. తెలంగాణలో యక్షగానం రచన-ప్రయోగం. 1st ed., జాతీయ సాహిత్యపరిషత్, 1994.
- కొండారెడ్డి, చాగం. తెలుగు యక్షగానాలు నిర్మాణ శిల్పం. హైదరాబాద్ విశ్వవిద్యాలయం, 2011. (సిద్ధాంతగ్రంథం)
- జోగారావు,యస్వీ. ఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర. 1st ed., సంస్కృతి పవర్ ప్రెస్, 1996.
- దండి,పుల్లెల శ్రీరామ చంద్రుడు(వ్యా).కావ్యాదర్మః.1st ed, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి,1981.
- ప్రతాపరెడ్డి,సురవరం. ఆంధ్రుల సాంఘిక చరిత్ర.3rd ed., విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2015.
- బాల శ్రీనివాసమూర్తి, గుమ్మనగారి. తెలంగాణ సాహిత్యచరిత్ర (తెలంగాణ వివిధ సాహిత్యప్రక్రియలు). 1st ed., నీల్ కమల్ పబ్లికేషన్స్, 2020.
- మమ్ముట్టుడు,పుల్లెల శ్రీరామ చంద్రుడు(వ్యా).కావ్య ప్రకాశము.2nd ed.,సంస్కృత భాషా ప్రచార సమితి,2009.
- రామకృష్ణ శర్మ గడియారము(కూ).దశరూపక సారము .1st ed.,ఆంధ్ర సారస్వత పరిషత్తు,1960.
- రామరాజ భూషణుడు,సన్నిధానము సూర్య నారాయణ శాస్త్రి(వి).కావ్యాలంకార సంగ్రహం.1స్త్ ఎద్.,ఎమెస్కో బుక్స్,2008
- రాజశేఖరుడు,మరింగంటి శ్రీరంగాచార్య.అలంకార మకరందః.1st ed.,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం,పరిశోధనాలయం,1985.
- రాధాకృష్ణ,మిక్కిలినేని. తెలుగువారి జానపద కళారూపాలు.1st ed., తెలుగు విశ్వవిద్యాలయం, 1992.
- రుద్రకవి,కందుకూరి. సుగ్రీవ విజయము యక్షగానము. 1st ed., తెలంగాణ సాహిత్య అకాడమీ, 2019.
- లక్ష్మీకాంతం,పింగళి. సాహిత్య శిల్ప సమీక్ష.4th ed., విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2002.
- వేంకటావధాని,దివాకర్ల. సాహిత్య సోపానాలు. 10th ed., ఆంధ్ర సారస్వత పరిషత్తు, 2008.
- వేంకటేశ్వర్లు,బూదాటి. తెలుగు సాహిత్య చరిత్ర. 1st ed.,హిమాకర్ పబ్లికేషన్స్, 2010.
- Coomaraswamy,ananda kentish.Yaksas.1st ed., smithsonian institution, 1928.
- Gali hinich, sutherland. The discuss of the demon: the development of the yaksa in Hinduism and Buddhism. Suny Press, 1991
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.