AUCHITHYAM | Volume-06 | Issue-04 | April 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
4. మాండలిక భాష: పత్రికలు, ప్రసారమాధ్యమాల ప్రభావం

డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
సహ ఆచార్యులు, అధ్యక్షులు, తెలుగువిభాగం,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి),
సిద్ధిపేట, తెలంగాణ
సెల్: +91 9849470792, Email: sampathkreddymatta@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.03.2025 ఎంపిక (D.O.A): 31.03.2025 ప్రచురణ (D.O.P): 01.04.2025
వ్యాససంగ్రహం:
భాష క్రియాశీలమైంది. భౌగోళిక, రాజకీయ, వ్యాపార, సామాజిక పరిస్థితులు, కాలం, సందర్భం, మొదలైనవి భాషను ప్రభావితపరుస్తాయి. ఈ క్రమంలో స్థానికంగా రూపొందిన మార్పులతో ఏర్పడిన భాషావైవిద్యాన్ని మాండలికం అనిపిలుచుకుంటాం. భాష మాండలికాలసమాహారం. ఒక భాషలోని మాండలికాలన్నింటికీ వేర్వేరు ప్రత్యేకతలుంటాయి. ఇవి భాషకు సహజత్వాన్ని, సజీవత్వాన్ని, అందించే ప్రాణవాయువులు, తెలుగుభాషలోని మాండలికాలపై అధ్యయనం జరిగి దశాబ్దాలకాలం గడిచింది. అప్పట్లో జరిగింది ప్రాథమికస్థాయి పరిశోధనే. ఇంతవరకూ ఆ పరిశోధనల్ని పునః సమీక్షించడం, నిర్ధారించడం, సమకాలీన పరుచుకోవటం జరగలేదు. అప్పటి పరిశోధననుసరించి తెలుగులో అతి పెద్దమాండలికం తెలంగాణా మాండలికం. మిగతావాటితో పోల్చితే ఇది ఎంతో విలక్షణమైంది. కాబట్టి మాండలికభాషపై పత్రికలు- ప్రసారమాధ్యమాల ప్రభావం అనే పరిశోధనాంశాన్ని తెలంగాణా మాండలికానికి మాత్రమే అన్వయించుకుని విశ్లేషణాత్మక పద్ధతిలో ఈ వ్యాసాన్ని కూర్చదలచాను. ఈ వ్యాసం కోసం ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి దినపత్రికల మెయిన్ పేజీలను, కరీంనగర్ జిల్లా ఎడిషన్ పేజీలను 2023 జనవరి నుండి జూన్ వరకు ఆరునెలలు పరిశీలించుట, ఇదే సమయంలో ఈటీవీ తెలంగాణ, టీన్యూస్, సాక్షి టీవీ, ఏబీయెన్ ఆంధ్రజ్యోతి న్యూస్ చానళ్ల వార్తలను గమనించుట జరిగింది.
Keywords: భాష, తెలుగు, తెలంగాణ, ప్రసారమాధ్యమాలు, పత్రికలు, మాండలికాలు
1. ప్రవేశిక:
తెలంగాణా సాహిత్యరంగానికి, పత్రికారంగానికి
ఆంధ్రప్రదేశ్ అవతరణ ఒక విభాజికరేఖ. ఎందుకంటే 1956కు ముందన్న స్థానికపత్రికల్ని, కథా, నవలాసాహిత్యాన్ని
పరిశీలిస్తే తెలంగాణాప్రాంతీయ నుడికారం, నిత్యవ్యవహారంలో ఉన్న అచ్చతెలుగుపదాలు, సహజంగా కలిసిపోయిన ఉర్దూ
పదజాలం ఆనాటి వాక్యనిర్మాణంలో అలవోకగా దొర్లిపోయేది. ఆ కాలంలో వాటికి సాహిత్య, పత్రికాయోగ్యత వుండేది.
ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత పాఠ్యపుస్తకాల్లో, పరిపాలనారంగంలో, ఆకాశవాణి, పత్రికల వంటి
ప్రచురణ-ప్రసారమాధ్యమంలో, సాహిత్యంలో, సినిమారంగంలో దశదిశలా మధ్యాంధ్ర శిష్టవ్యావహారికాన్ని
ప్రామాణికభాషగా ప్రవేశపెట్టడం, విస్తృతంగా ప్రచారం కల్పించడం జరిగింది. దీనితో మిగతా మాండలికాలు, అందునా
రాజకీయ ఏకీకరణ కొరకు మాత్రమే కలుపుకున్న తెలంగాణా ప్రాంతపుభాష, చిన్నచూపుకు ఎగతాళికి గురౌయింది.
బుద్ధునిబోధనల్ని సాహిత్యీకరించిన కరుణశ్రీ (జంధ్యాల) వంటి కవులు తెలంగాణాభాషలోకి తొంగిచూడకుండానే
"తౌరక్యాంధ్రం" అని తీర్పులిచ్చేశారు. ఇక్కడి వేలయేండ్ల అచ్చతెలుగు పదపరిమళం వారిని
చేరలేకపోయింది.
స్థానికపత్రికారంగానికి
జీవనాడిగా నిలిచిన గోలుకొండపత్రిక మూతపడటంతో దశదిశ కరువై చిన్నపత్రికలు కూడా మనుగడ కోల్పోయాయి. విజయవాడ
ఎడిషన్ నుండి పత్రికలు వెలువడి తెలంగాణాకు దిగుమతికావడంతో ఆ పత్రికల్లోభాష మొత్తంతెలుగువారి భాషగా
తాతచెలామణిలోకి వచ్చింది. హైదరాబాద్లో 1975లో ఈనాడు, 1981లో ఆంధ్రపత్రికల ఎడిషన్లు మొదలైనా ఉద్యోగులంతా
ప్రాంతేతరులుకావటంతో తెలంగాణా భాషకు ఆదరణలభించలేదు. ఈనాడు పత్రిక క్రమక్రమంగా తెలంగాణ ప్రధానపట్టణాల్లో
విస్తరించి జిల్లా ఎడిషన్లస్థాయిలో కూడా ప్రామాణికభాషనే వ్యాప్తి చేసింది.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1984లో ఉదయంపత్రిక ప్రారంభమైంది.
పత్రికారంగంలో పోటీ, తెలంగాణాలో అప్పటి రాజకీయసందర్భం, స్థానిక అవసరాలు కారకాలుగా ఉదయంపత్రిక
స్థానికసమస్యలకు తద్వారా భాషకు ప్రాధాన్యత ఇవ్వగలిగింది. ఆనాడు ఉదయంలో చేరిన యువకులు ప్రస్తుతం
తెలుగుపత్రికారంగంలో అగ్రభాగానికి చేరారు. ఉదయం మూతపడ్డ తర్వాత ఆ లోటును వార్తపత్రిక తీర్చింది.
తెలంగాణను అన్నికోణాల్లో ప్రపంచానికి చూపించిన మొదటిపత్రిక వార్త. ఇది జిల్లా ఎడిషన్లలో భాషాపరమైన
స్థానికతకు బీజంవేసింది. ఈ ఒరవడిని అనివార్యంగా మిగతాపత్రికలు అనుసరించాయి. ఇటీవల వచ్చిన సాక్షి, నమస్తే
తెలంగాణా వంటి పెద్దపత్రికలు, జిల్లాస్థాయిలోని స్థానికపత్రికలు మరికొంత మార్పుకు దోహదపడ్డాయి.
స్థానికత్వపు స్పృహతోవచ్చిన నమస్తే తెలంగాణపత్రికతో సహా నేటి మొదటిపత్రికలు ఒక యాభైయేండ్ల సుదీర్ఘకాలపు
ఆదిపత్య భాషాప్రభావం నుండి తేరుకోలేకపోతున్నాయి. ఎడిషన్ ఉద్యోగులు మొదలు మారుమూలగ్రామాల్లోని
కంట్రిబ్యూటర్ల వరకు భాషాపరంగా పరాయికరణకు గురయ్యారు. ఇక ఆకాశవాణితోబుట్టువు దూరదర్శన్, పత్రికల
తోబుట్టువులు వివిధ టివి, వార్తాచానళ్లు తమప్రభావాన్ని తీవ్రంచేశాయి. ఈ రోజున పరిసరాల్లోని భాషకంటే
ప్రసారమాధ్యమాల్లోని భాషే మనిషివ్యక్తీకరణను నియంత్రిస్తున్నది. ఫలితంగా తెలుగుమాండలికాల సహజత్వానికి,
పదసందపకు తీవ్రనష్టం వాటిల్లుతున్నది. ఈ క్రమంలో తెలంగాణాభాషను ప్రభావితపరుస్తున్న అంశాల్ని
క్రిందివిధంగా వర్గీకరించి విశ్లేషించుకోవచ్చు.
2. పద న్యూనతాభావం:
తెలంగాణా మాండలికం భౌగోళికంగా, వ్యవహర్తలపరంగా
అతి పెద్దమాండలికం. రాజకీయ, సరిహద్దుకారణాలవల్ల పరభాషల ప్రభావంతో సంపద్వంతమైన మాండలికం, ద్రావిడమూలాలతో
రూపొందించిన పదాలు, సంస్కృతపదాలు, ఇతరభాషల పదాలు, పుష్కలం. ఈవైవిధ్యం కారణంగానే దీన్ని తెలంగాణాభాషగా
వ్యవహరిస్తున్నాం. తెలంగాణాభాష మరోసుగుణం శిష్ట-శిష్టేతరభేదం లేకపోవడం. బర్రె, గుడ్డెలుగు, పెండ, త్రోవ,
అగ్గి, తంతెలు, పైసలు, కాయగూరలు, ఒక్కపొద్దు, కార్యం, ప్రభోజనం, దవాఖాన, వకీలు మొదలైన పందలపదాల్ని
పదిజిల్లాల నలుమూలల్లో అన్నివర్గాలవాళ్లు అనునిత్యం వాడుతుంటారు. ఇది ప్రజాభాష. కానీ ఈ పదాలు
పత్రికల్లో- ప్రసారమాధ్యమాల్లో కన్పించవు. ఇవి తక్కువస్థాయిపదాలని, యోగ్యతలేనివని మాధ్యమాలు అపోహపడటం,
అరువుపదాలతో వార్తల్ని రూపొదించటంవల్ల ఇవి న్యూనతకు గురయ్యామేతప్ప అర్హతవిషయంలో వీటికి ఏ
లోపమూలేదు.
3. అర్థగౌరవ భావం:
పత్రికల్లో- ప్రసార మాధ్యమాల్లో ఒక పదం ఎంత
ఎక్కువ ప్రచారంపొందితే అంత ఉన్నతీకరించబడుతుంది. ఆ గుర్తింపు దానికి గౌరవస్థానాన్ని కట్టబెడుతుంది.
మీడియా గుర్తింపుకు నోచుకోని పదాలు పాతసామాన్ల వరుసలో చేరి క్రమక్రమంగా ఉనికినికోల్పోతాయి. ఆడబిడ్డ,
ఏరాలు, అమ్మక్క, చిన్ని, కాక, షడ్డకుడు, తాతమ్మ మొదలైన వావివరుసలు, పుంటికూర, పచ్చగూర, పప్పుచారు,
అట్లు, గుడాలు, బెల్లంపన్నం, అప్పాలు వంటి భోజనసంబంధాలు, గొల్ల, పెరక, అవుసుల, వడ్ల, కమ్మరి మొదలగు
వృత్తివాచకాలు స్థానికంగా వ్యాప్తిలో ఉన్న అర్థవంతమైన పదాలు, ఇవి ప్రచారంలేక మాధ్యమాల్లోకి చేరకుండా
కనుమరుగవుతున్నాయి. సంతానాన్ని బిడ్డ, కొడకు, అనికాక అమ్మాయి, అబ్బాయి అని సంకరపదాలతో పిలుచుకుకోవటం
నాజుకుగా మారింది. పురుషవాచకమైన అయ్య స్త్రీలకుతగిలించి అత్తయ్య, అక్కయ్య, అని పిలుచుకోవటం ప్రామాణికం.
కానీ అత్తమ్మ అనటం మొరటు. అట్లాగే కులాల పేర్లను సంస్కృతీ కరించివాడటం మాద్యమాలవల్లనే గౌరవనీయమైంది.
సూతారి, మేర, అవుసుల, వంటి వృత్తులకు అచ్చమైన తెలుగు పేర్లున్నా వాటికి ప్రచారయోగ్యత లేకుండా పోయింది. ఈ
పరిస్థితి ఆయా వృత్తులు, మానవ సంబంధాల్లోని పదసంపదను లుప్తంచేస్తుంది. తద్వారా సాంఘికజీవితం, సంస్కృతి
వివక్షకు గురై వెనుకకు నెట్టివేయబడుతాయి.
4. పరభాషాపదాల పట్ల అవగాహనాలోపలం:
రాజకీయ, పరిపాలనా సంబంధాలవల్ల తెలుగులో ఉర్దూ, హిందుస్తానీపదాలు వేల సంఖ్యలో చేరాయి. మధ్యాంధ్ర మాండలికంలో చేరిన వందల ఉర్దూపదాలు తెలుగు పదాలుగా ప్రచారంలోకి వచ్చాయి. మూలాలు తెలసుకోకుండానే వాటిని ప్రామాణిక పదాలుగా గర్తించారు. ముస్తాబు, బడాయి, కబురు, పుకారు, దర్జా, తనిఖీ, దరఖాస్తు, కసరత్తు, బదిలీ, మద్దతు, మాఫీ, దావా, బినామీ, కబ్జా, ఫిర్యాదు వంటి పదాలెన్నో ప్రతిరోజూ పత్రికా -ప్రసారమాధ్యమాల్లో కన్పిస్తాయి, విన్పిస్తాయి. కానీ తెలంగాణాలో అంతకంటె ఎక్కువ వ్యాప్తిలో ఉన్న వకీలు, అమీను, ఠాణా, పురుసతు, బర్కతు, ఇజ్జత్, దోస్తు, దర్వాజ మొదలైన ఉర్దూ పదాలకు యోగ్యత కరువైంది. దీనికి కారణం పరభాషాపదాలపట్ల సరైన అవగాహనలేకపోవడం, వివక్షాపూరితంగా వ్యవహరించడం. అన్నిప్రాంతాల పదాలపట్ల సమన్యాయం పాటిస్తే స్థానికమైన భాషాసొబగులు కాపాడబడతాయి. ప్రామాణికభాషలో అన్నిప్రాంతాల పదజాలానికి ప్రాతినిధ్యం లభిస్తుంది.
5. స్థానిక పదజాలం పట్ల అధ్యయనం కొరవడటం:
మిగతా మాండలికాలతో పోల్చుకున్నప్పుడు తెలంగాణా
భాషపైనే పరభాషల ప్రభావం ఎక్కువ. అయినా ద్రావిడభాషల మౌళికలక్షణాలు, ప్రాచీనమైన పదసంపద, పదనిర్మాణంలో
శాస్త్రీయమైనమార్పులు, అడుగడుగునా కన్పిస్తాయి. తెలంగాణాభాష పదబంధభాష, ఇక్కడి కృదంతాలు, తద్దితాలు,
జాతీయాలప్రయోగం చాలా విలక్షణమైనది. ద్రావిడభాషల జీవలక్షణమైన చేనుచెలుకలు, గుట్టలుబోర్లు, భూమిజాగలు,
చెట్టుచేమలు, బోల్లుబోకెలు, పెట్టువోతలు, పురుగుబూచి వంటి జంటపదాలు ఇక్కడ కోకొల్లలు, తండ్లాట, లొల్లి,
కిరికిరి, దుబ్బచెలుక, చింతపలుకపండు, దీలె, ఒక్కపొద్దు, బోనం మొదలైన దేశీయపదాలు వందలువేలు. తెలంగాణాలో
బతుకమ్మ పండగకు చాలా ప్రాశస్త్యముంది. అయినా సత్తుపిండి అనేమాటను మాధ్యమాల్లోవాడేందుకు స్థానికులే
సంకోచిస్తారు. స్థానికసంస్కృతికి మాధ్యమాల్లో ప్రవేశంలభిస్తే దానివెనుకున్న సామగ్రికి, ఉప సామగ్రికి
భాషలో స్థానం పదిలపడుతుంది.
ప్రాంతాన్నిబట్టి, వ్యవహర్తల
అభిరుచులనుబట్టి పదాల అర్థాలు మారుతాయి. లేదా భిన్నప్రాంతాల్లో భిన్నఅర్థాలను స్ఫురింపజేస్తాయి.
ఉదాహరణకు మందలించడమంటే పరామర్శ, గొల్లుమనడమంటే ఏడవటం, పేడఅంటే ఒకరకం మిఠాయి. ఇవి ఇతరమాండలికాల్లో
భిన్నమైన అర్థాలనిస్తాయి. అట్లాగే మిగతామాండలికాల్లో యదేచ్చగావాడే కొన్నిపదాలు ఇక్కడ బూతుమాటలు.
వాటికిక్కడ బహిరంగ ప్రయోగయోగ్యత లేదు. తెలంగాణాలో ప్రాచీనరూపాల్లోనే పదాలు వాడకలో ఉన్నాయి. చిలక మూలరూపం
చిలుక, కళ్లు మూలరూపం కండ్లు. మొలుక, చెలుక, ఎలుక, మరుక, పండుగ, ముండ్లు, పెండ్లి ఈ కోవలోవి. ప్రసార-
ప్రచురణ మాధ్యమాల్లో ఈ అసలు రూపాలు కాకుండా నాజూకురూపాలే చోటుచేసుకుంటాయి. మాధ్యమాలు ఈ విషయాలన్నీ
దృష్టిలోవుంచుకుని స్థానికభాషపట్ల పరిశీలన, అధ్యయనం, క్షేత్రస్థాయి పరిచయం పెంచుకున్నట్లయితే భాష యొక్క
ప్రాచీనత, వైవిధ్యం కాపాడబడతాయి.
6. అనువాదంలో అపసవ్వధోరణి:
ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ నేపథ్యంలో ఇంగ్లీషు
దేశభాషలపై పెనుప్రభావం చూపుతున్నది. పాశ్చాత్యదేశాల వస్తుసంస్కృతి నమునాగా మారింది. ఫలితంగా వందల
ఇంగ్లీషు పదాలు నిత్యజీవితంలోకి అనివార్యంగా ప్రవేశిస్తున్నాయి. వీటికి అనువాదాలను సమకూర్చుకునే పనిలో
తెలుగుపత్రికలు దశాబ్దాలుగా సంస్కృతాన్ని ఆశ్రయిస్తున్నాయి. కండ్లముందున్న ఆచ్చికపద సంపదనువదిలి
కృత్రిమఅనువాదాలకు మొగ్గుచూపుతున్నాయి. అంతర్జాలం, చరవాణి, ప్రాంగణ నియామకాలు వంటివి ఇటీవలి అనువాదాలు.
బైక్ను ప్రజాభాషలో బండి అంటారు. నేటికాలంలో బండి అంటే ఎడ్లబండి కాదు బైక్ అనిరూఢి. ఇంతవ్యాప్తిలో
ఉన్న పదాన్నికాదని పత్రికలు ద్విచక్రవాహనం అని కృత్రిమపదాన్ని సృష్టించుకుంటున్నాయి. పారిభాషిక
పదాల్నిరూపొందించుకునేముందు పరిసరాల్నిగమనిస్తే సహజసిద్ధమైన పదాలెన్నోకన్పిస్తాయి. తొలుత కొత్తగా
అన్పించినా నాలుగుసార్లు ప్రయోగిస్తే అవే సాంకేతికపదాలుగా మారిపోతాయి. ఈ కృషితో ప్రజాభాషకు గౌరవం, భాషలో
ఆధునికత ఒకేసారి ఒనగూరుతాయి.
7. ప్రసారమాధ్యమాల సొంత ప్రయోగాలు:
నిత్యజీవితంలోకాకుండా మాధ్యమాల్లోనేకనిపించే
మాటలు ఎన్నో ఉన్నాయి. నిప్పులు చెరగటం, ఎండగట్టడం, గాలికివదిలేయటం, తిలోదకాలివ్వటం, నిమ్మకునీరెత్తటం,
తాడోపేడో తేల్చుకోవటం, బరగీసి నిల్చోవటం, తలతాకట్టుపెట్టడం, కర్రుగాల్చివాతపెట్టడం వంటి ప్రయోగాలు
జనసముహంలోకంటే వార్తాచానళ్లలోనే ఎక్కువసార్లు వింటాం. మధుమేహం, సస్యరక్షణ, వన్యప్రాణి, రసాభాస,
జనసంద్రం, వంటి శుద్ధగ్రాంధికాలు, తెప్పోత్సవం, పాలాభిషేకం, రుణమాఫీ, ఇళ్లస్థలాలు, గర్భసంచి,
కంటివ్యాధి, రిలేదీక్షలు వంటి మిశ్రసమాసాలు మాధ్యమాలు వండి, వడ్డించినపదాలే. పదేపదే ఈమాటలు వినటంవల్ల
అనకరణధోరణి పెరిగి సృజనాత్మకతలోపిస్తుంది. ధీర్ఘకాలంలో మాండలికాలకు ఇది పెద్దచేటు.
8. ఉపసంహారం:
- భాష ప్రవాహిని, కొత్తపదాలు వచ్చిచేరటం సహజం. కొత్త పదకల్పనలు జరుగటం అవసరం. కానీ కొత్త వింతగామారి జాతిజీవధారను, తరతరాల పరంపరను దెబ్బతీయటం కూడనిపని. మాండలికాలు మధురమైనవి. ప్రతిప్రాంతానికి విశిష్టమైన పలుకుబడి ఉంటుంది. అందులోని కమ్మదనాన్ని మిగతాప్రాంతాలవారికి కానుకలుగా అందించాలే కానీ నిర్బంధపు రుద్దుడు మంచిదికాదు.
- పత్రికా- ప్రసారమాధ్యమాలు పదాల ఉన్నతీకరణకు ప్రచార సాధనాలు. ఒక పదం అటుపత్రికలోకన్పించి, ఇటుప్రసారాల్లో విన్పించినప్పుడే దానియోగ్యత నిర్ధారించబడుతుంది. అప్పుడే వ్యవహర్తలు మరింత ఆత్మవిశ్వాసంతో వాడగలుగుతారు. క్రమక్రమంగా అది అన్నిమాండలికాల్లో అంతర్భాగమై ప్రామాణికతను పొందుతుంది.
- భాషకు సహజమైన ప్రామాణికతను స్వచ్చందంగా అందించవలసిన బాధ్యత పత్రికలూ-ప్రసారమాధ్యమాలదే. వివక్షకూ, దురభిమానానికి తావివ్వకుండా మాధ్యమాలు ఈ దిశగా కార్యచరణకు పూనుకొన్నప్పుడే దేశభాషల్లో స్థానికత నిలబడుతుంది.
9. ఉపయుక్తగ్రంథసూచి:
- కృష్ణమూర్తి, భద్రిరాజు . తెలుగు భాషా
చరిత్ర. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2010
- లక్ష్మీనారాయణ శర్మ, కె. తెలుగు
మాండలికాలు అదిలాబాద్ జిల్లా. తెలుగు అకాడమీ , హైదరాబాద్, 1982
- శ్రీహరి, రవ్వా. నల్గొండజిల్లా మాండలిక
పదకోశం. పతాంజలి పబ్లికేషన్ , హైదరాబాద్, 1986
- సుబ్రహ్మణ్యం, పి.యస్. ఆధునిక
భాషాశాస్త్ర సిద్ధాంతాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2004
- సోమయాజి, గంటిజోగి. తెలుగు భాషా వికాసము . త్రివేణి పబ్లిషర్స్, మచిలీపట్నం, 1968
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.