headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-04 | April 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

1. ‘నాడోడి బతుకులు’ నవల: సంచారజీవుల వ్యథలు

ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి

ఆచార్యులు, తెలుగుశాఖ
యోగి వేమన విశ్వవిద్యాలయం, వేమనపురం
కడప, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8328296952, Email: eswaryvu@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 18.03.2025        ఎంపిక (D.O.A): 30.03.2025        ప్రచురణ (D.O.P): 01.04.2025


వ్యాససంగ్రహం:

తెలుగుసాహిత్యంలో అస్తిత్వవాద ఉద్యమాలు ప్రారంభం అయ్యాక, వెనుకబడిన వర్గాల వారి జీవితాలను అక్షర రూపంలోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన "నాడోడి బతుకులు" నవల సంచార జాతికి సంబంధించిన యానాది లేదా ఇల్ల జాతి వారి జీవితాన్ని చిత్రించింది. "యానాదుల బతుకు చిత్రం 'నాడోడి బతుకులు' నవల" పేరుతో ఈ నవలలోకి వచ్చిన సామాజిక అంశాలను, బలహీనుల అణచివేతలను, బలవంతులు దోపిడీని, పీడనును ఈ వ్యాసంలో తేల్చి చూపించాను. మూరి శెట్టి గోవింద్ రాసిన ఈ నవలలో యానాదుల జీవన విధానంతో పాటు వారి సాంస్కృతిక పద్ధతులు, ఉపయోగించే భాష, సమాజం వారిపట్ల వ్యవహరిస్తున్న తీరు ఆధునికులు తప్పక అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ నవలపై విస్తృతంగా అధ్యయనం చేసి, రచయిత గోవింద్ గారితో సంప్రదించి స్వయంగా వ్యాసం రాశాను. దీనిపై ఇంతకు ముందు ఎవరూ రాయలేదు.

Keywords: నవలా సాహిత్యం, గిరిజన సంచార జాతులు, నవల, నాడోడి బతుకులు, మూరిశెట్టి గోవింద్

1. ప్రవేశిక:

ఆంధ్ర ప్రదేశ్ లో 34 షెడ్యూల్ తెగలు ఉన్నాయి. ఇందులో అధిక శాతం సంచార జాతులే. అందులో అడవులను నమ్ముకొని, తమదైన విలువలతో బతికే యానాది జాతి ఒకటి. దీనినే చిత్తూరు జిల్లాలో ' ఇల్ల ' అని కూడా అంటారు. వీరు బతుకు తెరువు కోసం నివాసాలను మార్చుకుంటూ ఉంటారు.అంటే స్థిరంగా ఒకచోట ఉండరు. అందుకే వీరిని ' నాడోడి' జాతిగా వర్ణిస్తారు. చిత్తూరు జిల్లా నుండి వి. ఆర్. రాసాని, మూరిశెట్టి గోవింద్., కె.వి. మేఘనాథ్ రెడ్డి తదితరులు సంచార జాతుల బతుకులను గురించి రాస్తున్నారు. మరో సంచార జాతి ఎరుకల జీవితాల గురించి అరుణ రాసిన ఎల్లి, నీలి; శిరంశెట్టి కాంతారావు రాసిన "వాళ్లు గెలవాలి", సలీం రాసిన "లోహముద్ర" మొదలైన నవలలు సంచారజాతుల సమకాలీన జీవన పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. రచయితలు సంచారజాతుల బతుకు చిత్రాలనే గాక వారి సంస్కృతి సంప్రదాయాలను అక్షరీకరిస్తున్నారు. భావితరాల కోసం భాషను, యాసను, మాండలిక సౌందర్యాన్ని, సంపుటీకరిస్తున్నారు.

నాడోడి బతుకులు నవలా రచయిత మూరిశెట్టి గోవింద్. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం ప్రాంతీయుడైన గోవింద్ బహుజనుల జీవితాల గురించి రాస్తున్న రచయిత. సాకిరేవు కథలు, మా ఊరి మంగలి కథలు, కుమ్మరి కథలు, ప్రకృతి వికృతి కథలు, సుదీర్ఘ స్వప్నం నవల ఈయన కలం నుండి వెలువడినవే. స్థానిక పరిస్థితులను చిత్రించడంలోనూ, ప్రజాస్వామ్య పక్ష్యంగా వ్యవహరించడంలోనూ నిక్కచ్చిగా కనిపిస్తాడు. అభ్యుదయ రచయితగా పీడిత వర్గాల పక్షాన నిలబడి, పీడకులను నిలదీయడం, ప్రశ్నించడం మూరిశెట్టి  గోవింద్ రచనల్లో కనిపిస్తుంది. యానాది జాతి కష్ట నష్టాలను అతి చేరువ నుండి దర్శించిన గోవింద్, సమాజం వీరి పట్ల ప్రవర్తిస్తున్న తీరును చూసి నొచ్చుకున్నాడు. రచయిత చెప్పుకున్నట్టు ఇది పరిశోధనాత్మక నవలే. ఈ నవలను రాసే క్రమంలో యానాది కాలనీలను సందర్శించడం వారిలో పెద్దవారైనా పిల్లిగుండ్ల కృష్ణయ్య, పిల్లిగుండ్ల జానకి, పూజారి చిన్నప్ప, మాజీ సర్పంచి వెంకటేశులు, బిళ్ళుదొన వెంకటస్వామి, నరసింహుడు, చెంచయ్య, నాగేశ్వరరావు, అలివేలమ్మ మొదలైన వారిని కలిసి వారి  సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి సాధికారిక సమాచారాన్ని సంపాదించాడు. వారి సాధక బాధకాలను అక్షరాలుగా మార్చి నవలకు జీవం పోశాడు.

2. నవలా వస్తువు: 

నాడోడి బతుకులు నవలలో కథానాయకుడు యంగటేసు. ఇతని జన్మస్థలం చిత్తూరు జిల్లా కార్వేటి నగరానికి తూర్పుగా కట్టమీద ఉండే ఇల్లిండ్లు. ఆ ఊరిలో "లెక్కకు ఇరవై గుడిసెలుదాకా ఉంటాయి. గాని, ఈడెవురూ నిలకడగా ఉండరు, అట్టావుంటే ఆర్నెల్లు ఆపైనుండేది గగనం. పోయేవోళ్ళు పోతావుంటే, కొత్తగా వొచ్చేవోళ్ళు వొస్తావుంటారు. తిప్పుతీగ తొక్కినోళ్ళు మాదిరిగా అడవులు ఊర్లుబట్టుకొని తిరగతా వుండారు". 

1. ఒకరోజు తొలి కోడి కూతకే మేల్కొన్న వెంకటేశానికి నిద్ర పట్టదు. మొన్ననే మర్రిమాకల కండిగలో చింతకాయలు రాలవడానికి పోయి కిందపడి చనిపోయిన పెంచలయ్య గుర్తుకొచ్చాడు. నిన్న రాయుడి బోటు కాడ తేనె తీయబోయి కిందపడి చనిపోయిన ఓబుల అనుమంతు గుర్తుకొచ్చాడు. పాము పడగ నీడలో బతుకుతున్నట్టుగా ఉన్న జీవితాన్ని తలుచుకుంటూ వేదనకు గురవుతాడు. రచయిత మాటల్లో చెప్పాలంటే  "ఒక పూట తిండికి గూడా పామునోట్లో ఏలు పెట్టమంటే పెట్టాల. పూట బత్తానికి గూడా పులిబోన్లో తలకాయ పెట్టమంటే పెట్టాల. పూట గడవాలంటే పేణాలకు వొగదెగాల. మా బతుకులు పడగనీడలో కాపరాలై పొయినాయి. ఆ నీడలో యప్పుడుంటామో యప్పుడు పోతామో మాకే తెల్దు". ఇవే నాడోడి బతుకుల వాస్తవ బతుకులు.

యంగటేసు చింతతోపు యానాది కాలనీలో ఉండే పులిగుండ్ల క్రిష్టయ్య కూతురు అలిమేలును పెళ్ళి చేసుకుంటాడు. ఒకరోజు పులిగుండ్ల క్రిష్టయ్య తన కూతుర్ని చూడటానికొచ్చి, కూతుర్తో "అనకాపల్లి నుంచి అక్కా బావ జాబు రాసినారు. పొయి రెండు రోజులుండి విందు తినేసంట రండి" అంటాడు. 

అంతకు ముందే ఆయన పెద్ద కూతుర్ని పుత్తూరు దగ్గర గూళూరు యానాది కాలనీలోని చెంచయ్య కిచ్చి పెళ్ళి చేసుంటాడు. పెళ్ళైన తరవాత అతనికి రైల్వేలో వాచ్ మెన్ ఉద్యోగం వచ్చి అనకాపల్లికు వెళ్లి, అక్కడ పని చేస్తూ ఉంటాడు. (నాడోడి బతుకులు: పుటలు 15 -19)

2. అలిమేలు వెంకటేశు తిరుపతిలో రైలెక్కి అనకాపల్లి చేరుకుంటారు. అక్కడ వారం రోజులు విందులూ వినోదాలతో గడిచి పోతుంది. ఇంటికి రావాలనుకుంటున్న సమయంలో వాళ్ళ వదిన మారెమ్మ "మరిదీ! నువ్వు ఇంటికి పోయి ఏం చేయాలనుకుంటున్నావు" అని అడుగుతుంది. వెంకటేశు "నేను చిన్నప్పటి నుంచి రంగిశెట్టి అనే రైతు దగ్గర సేద్యానికి ఉండే వాడిని. వాళ్ళు మంచోళ్ళు. ఇప్పుడు పొయినా పెట్టుకుంటారు ఆయన దగ్గరకు పోయి ఇద్దరం సేద్యానికి కుదిరిపోతే నేను సేద్యం పనులు చూసుకుంటాను మీ చెల్లి కడిగీ తోసే పన్లు చూసుకొంటే హాయిగా గడిసి పోతుంది" అని చెబుతాడు.

 ఆమె "ఇంగా ఒకరింటికాడ సేద్యానికి ఉండేదేంది? మరిదీ! పక్కన యానాది తండాలో జాగా తీసిస్తాను. గుడిసె వేసుకొని ఇక్కడ అడివిలో దొరికే కాయలు పండ్లు జీలుగ, కుంకుడు కాయలు, చింతపండు, తేనె తెచ్చుకున్నా లక్షణంగా బతికి పోతారు, మాకు తోడుగా ఉంటారు" అని చెబుతుంది.

వెంకటేశు "లేదు వదినా! నేను మన గడ్డకే పోయి సేద్యానికి కాక పోయినా అక్కడ కూలో నాలో చేసుకుంటాం" అని చెబుతాడు.

ఆమె "నా మాట విను మరిదీ! బాగుపడతావు ఇది మన గడ్డట్టా కరువు గడ్డ కాదు, ఇక్కడ నీళ్ళు పుంజిగా ఉంటాయి. ఇరు గారు పంటలు పండిస్తారు. కూలీ నాలీ దొరకతాది. పైగా మీ అన్నకు రైల్వేలో పెద్ద పెద్దోళ్ళ ఇండ్లలో పన్జేసి, వాళ్ళు బాగా తెలుసు. వాళ్ళతో మాట్లాడి నీకేదన్నా ఉద్యోగం తీసియ్య మంటాను" అని చెబుతుంది. దాంతో అక్కడే గుడిసె వేసుకొని నిలిచిపోతాడు. (నాడోడి బతుకులు: పుటలు 19 -23)

3. ఒకరోజు చెంచయ్య ఒక ముస్లిమ్ వ్యక్తిని పిలుచుకొచ్చి "నీకు పాములు పట్టేది తెలిసుంటే వీరు విశాఖ పట్నంలో పాముల ఎగ్జిబిషన్ పెట్టున్నారు. కోరలు తీయ్యకుండా వారికి పాములు కావాలి. రోజు ఒకటి రెండు పాములు పట్టుకొచ్చి ఇచ్చినా, పాముకు యాబై రూపాయల లెక్కన రోజు యాబై వందా దొరుకుతుంది. నీకు ఉద్యోగం దొరికే దాకా ఈ  పని చేసుకో" అని అడ్వాన్సుగా ఇరవై రూపాయలు తీసిస్తాడు వెంకటేసుకు.

అందరి యానాదుల దగ్గర పాముకాటుకు మందు ఉన్నట్టే , వెంకటేశు కూడా పాముకాటుకు మూలికల మందు తయారు చేసి పెట్టుకుని ఉంటాడు. దాన్ని ఒడిలో పెట్టుకొని, చెట్లూ పుట్టలు గుట్టలూ తిరిగి ఒక పిల్ల పామును పట్టుకొచ్చి ఇస్తాడు. తరువాత ఎడతెరిపి లేని వానల కారణంగా ఇంటి దగ్గరే ఉండి పోతాడు. తెచ్చుకొన్న తిండి గింజలూ అయి పోతాయి. (నాడోడి బతుకులు: పుటలు 23 -28)

4. మళ్ళీ పాములు పట్టడానికి ఆలు మగలూ బయలు దేరి అడవికి వెళతారు. ఒక చోట పాము కనబడుతుంది, కానీ వీరిని చూసి పుట్టలోకి దూరిపోతే, వెంకటేశు కూసిగా చెక్కుకున్న ఒక కట్టెతో తవ్వుతూ ఉంటే అలివేలు మట్టి తీస్తూ వుంటే పాము కాటేస్తుంది.

వెంటనే వెంకటేశు తన పంచలో ఒక పీలిక చించి విషం ఎక్కకుండా కట్టు కట్టి , తన వద్ద ఉన్న మందును మూడు చిటికెలు ఆమె నోటిలో వేసి చప్పరించి మింగ మంటాడు. మింగుతుంది. కాని, విషం ఒళ్ళంతా పాకి పోతుంది. వెంకటేశుకు తెలుసు తన వద్దనున్న మందు మామూలు పాములకైతే సరి పోతుంది. నాగు పాము కరిస్తే ఆసుపత్రికి పోయేదాక మాత్రమే కాపాడు తుందని. ఊహించినట్టే ఆమె తెలివి తప్పి పడి పోతుంది.

అది జన సంచారంలేని ప్రాంతం. ఆ చుట్టుపక్కల ఎక్కడ ఆసుపత్రి ఉందో కూడ వెంకటేశుకు తెలియదు. ఏం చేయాలో తోచకుండా ఏడ్సుకుంటూ ఉంటే, కట్టెలు కొట్టుకుని వస్తున్న యానాదులు వీరికి సహాయం చేస్తారు. వారి సాయంతో ఆసుపత్రికి తీసుకు పోయి భార్యను బ్రతికించుకుంటాడు. అక్కడ డాక్టరుకిచ్చే ఫీజుకు డబ్బులు లేక తను కట్టిన తాళి బొట్టులో ఉన్న కాలు కాసు బంగారు అమ్మి, డాక్టర్ కు ఫీజు ఇచ్చేసి ఇంటి కొచ్చేస్తాడు. తరువాత పాములు పట్ట కూడదని నిశ్చయించుకుంటాడు. అనకాపల్లిలో ఉండగానే అతనికి ఒక కొడుకు కూడా పుడతాడు. పేరు నరసింహుడు.(నాడోడి బతుకులు: పుటలు 34-34)

5. తరువాత వెంకటేశు అక్కడ గిరిజనులు తయారు చేసే విప్పసారాకు అలవాటు పడిపోతాడు. అక్కడి ఎమ్మెల్యే సాయంతో సారాయి కాచి అమ్మే ఏడుకొండలు దగ్గరికెళ్ళి "సారాయి ఉందా" అని అడుగుతాడు. ఏడుకొండలు "లేదు రాత్రికి బట్టి పెడతున్నాను రా!" అని పిలుచుకు పోతాడు. అక్కడ పోలీసులు వొచ్చేది గమనించి "నువ్వు పొయ్యి మంటేస్తూ ఉండు నేను నీళ్ళు ముంచుకొస్తాను" అని వెంటేశును పోలీసులకు తగిలించేస్తాడు. వెంగటేసు అక్కడి నుంచి జైలుకు వెళ్లడం, తర్వాత కొంతకాలానికి కేసు కొట్టేయడం జరిగిపోతాయి.(నాడోడి బతుకులు: పుటలు 15-40)

6. వెంకటేశు అడవుల్లో దొరికే కుంకుడు కాయలు కోసుకొచ్చి అమ్ముకొని బతకాలనుకుంటాడు. తనతోపాటు తాండాలో ఉండే కొంత మందితో కలసి, సేకరించిన అటవీ ఉత్పత్తులను దగ్గరలోని 'వేముల పూడి' సంతకు తీసుకు పోయి అమ్ముకొస్తూ అక్కడ జరిగే మోసాలను స్వయంగా చూస్తాడు. గిరిజనుల ఉత్పత్తులను మోసపూరితంగా కొనుగోలు చేసే సోమ్లా నాయక్ దగ్గర పనిచేసే అప్పలకొండ దగ్గర సింహాద్రి అనే వ్యక్తి మాట విని 300 రూపాయలు అప్పు తీసుకుంటాడు. అప్పు తీర్చడానికి వెంకటేష్ సేకరించిన కుంకుడుకాయ మూటలను కొలుచుకోమని కుమ్మరిస్తాడు.

"వాడు ముందు లాభమని వొక కుంచం కొల్సి పోసుకున్నాడు. మల్ల ఒక టన్నాడు, ఇక్కడొక కుంచం పొయింది. మొత్తం అయిదు దాక కొల్సినాడు. మల్ల ఆరు గదా అనాల. అయిదున్నొకటి అన్నాడు. మల్ల ఆరన్నాడు. ఇక్కడొక కుంచం కాయలు దొబ్బేసినాడు. ఇట్ట ఇరవై కుంచాల కాయలు తెస్తే పది కుంచాలకే వారి పోసుకొనేసినాడు. నా కడుపు దగ్గోత్తరంగా కాలి, యాంది సోమ్లానాయక్ మేవు ఇరవై కుంచాల కాయలు తెస్తే, పది కుంచాలకే వారి పోసుకొంటివి” అన్నాను.

వాడు “ఇక్కడింతే. సిమ్మాద్రి నీకు సెప్పనేదేటి నీ కాయల్లో సెమ్మండాది మాకు గిట్టు బాటు కాదు" అని పక్కకు పొ! అని వారగా నెట్టేసినాడు. దుడ్డడిగితే వొడ్డీకే సరిపొయింద"ని చెప్పేసినాడు. అందరివి కొల్సుకొనే దాక నేను గెవణిస్తానే ఉండాను." అంటాడు. ఇది జరిగిన తర్వాత ఒకరోజు వారుండే తాండాకు అన్నలొస్తే, వారికి చెప్పి శిక్ష పడేటట్టు చేస్తాడు. ఇది తెలిసి వెంకటేశును పోలీసులు తీసుకు పోయి కొట్టి బాధలు పెడతారు. చివరకు ఊరొదిలి పోయేటట్టుగా ఉంటే వదిలిపెడతామని వారు చెప్పడంతో, వెంకటేశు అనకాపల్లి నుంచి తిగిగొచ్చి అత్తగారి తరపున కార్వేటి నగరం దగ్గర్లోని 'బిళ్ళుదొన'లో గంగిరెడ్డి చేనికాడ గుడిసె వేసుకొని కాపురం పెడతాడు. (నాడోడి బతుకులు: పుటలు 40 -46)

7. ఒకరోజు వెంకటేశు అమ్మా నాయన కావలి ఉండే సవటగుంటలోని జగన్నాథ రెడ్డి మామిడి తోట దగ్గరికి బిడ్డను తీసుకొని వెళ్ళి అక్కడ రెండురోజులు ఉండొస్తారు. (నాడోడి బతుకులు: పుటలు 46 -50)

8. వెంకటేశు చెల్లి జానకిని విజయపురం వద్ద సుబ్బిగాడికి ఇచ్చి పెళ్లి చేసి ఉంటారు. వాళ్లు అక్కడ రాజుల ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆమె రాజులున్న గ్రామంలో చెప్పులేసుకుని తిరిగిందని అక్కడినుంచి వెళ్ళగొడతారు. వారు అక్కడి నుంచి రావడంతో వెంకటేశు గంగిరెడ్డి నడిగి గుడిసె ప్రక్కనే ఇంకొక గుడిసె వేసిస్తాడు. (నాడోడి బతుకులు: పుటలు 50 -55)

9. ఒకరోజు తన దాయాది తిరుపాల్ చనిపోవడంతో సిందేపల్లికి పోయి అతనిని 'డుబ్బాంక'ను కొట్టుకుంటూ తీసుకెళ్ళి యానాదులు ఆరాధించే తులశమ్మ గుడివద్ద పూడ్సిపెట్టి  ఇంకొక జన్మంటూ ఉంటే, తిరిగి మన యానాది కులంలోనే పుట్టాలని కోరుకుంటారు. 

తరువాత కర్మక్రియల రోజు రంగం పెట్టిస్తారు. రంగం అంటే పూజారి మీద వారి దేవత తొళిశమ్మ పూని జరిగిన విషయాలను చెప్పడం. వీరి కర్మకాండలకు బ్రాహ్మణులు రారు. కానీ అయ్యవారు మంత్రించి ఇచ్చిన నీళ్ళను చల్లుకొని ' అంటు ' తీర్చుకుంటారు. ఆ రాత్రి రంగం పెట్టగా పూజారి మింద తొళిశమ్మ వాలి ఎలా చనిపోయాడో చెబుతుంది. తిరుపాల్ చనిపోవడానికి ఎలుక బంటో , చిరుతపులో కాదు అని,  మనుషులే కాసుకోనుండి చంపేసినారు అని చెప్తుంది. తిరుపాల్ పక్క ఊర్లో సర్పంచ్ కూతురుతో సంబంధం పెట్టుకొని ఉండడం వల్లనే అతని చంపించినట్టుగా తెలుస్తుంది. (నాడోడి బతుకులు: పుటలు 55 -58)

10. వెంకటేశు వాళ్ళ మామదే లైసెన్సు లేని తుపాకీ ఒకటుంటే తీసుకుని వేటకు పోతూ ఉంటాడు. అక్కడి సర్పంచి ఒకరోజు పిలిపించుకొని నువ్వు వేటాడిన మాంసంలో సగం మాంసం భాగం పెట్టు, లేదంటే నిన్ను పోలీసు వాళ్ళకు పట్టిస్తానని బెదిరిస్తాడు. సరేనని వేటాడిన మాంసంలో సగం భాగం ఇచ్చేస్తాడు.

ఇంకొక రోజు దుప్పిని వేటాడితే, గ్రామ మున్సబు తనకు సగభాగం మాంసం ఇవ్వకపోతే ఫారెస్ట్ ఆఫీసర్లకు పట్టిచ్చేస్తానని బెదిరిస్తాడు. చేసేదిలేక సర్పంచ్ కు సగం, మున్సబుకు సగ భాగం ఇచ్చేస్తాడు. వెంకటేశు అలివేలు ఇక్కడుంటే ఈ సర్పంచి గ్రామ మున్సీపు తమను బతక నియ్యరని, అక్కడినుంచి వెళ్ళి "మర్రిమాకుల కండిగ" లో  గోవిందరెడ్డి పొలం దగ్గర గుడిసె వేసుకుంటాడు. (నాడోడి బతుకులు: పుటలు 58 -69)

11. అక్మడ వరికోతకు పొతే, మడిలో దొరికిన నండ్ర కాయలను అలిమేలు చేతిలో పెట్టి "నువ్వు శుబ్రం చేసి కూర చేస్తూ ఉండు నేనిప్పుడే వొస్తాను" అని వెళ్లి రెండు జగ్గులు కల్లు తెచ్చి ఎంతో ఇష్టంగా తాగి తింటా వుంటాడు. అంతలో గోవిందరెడ్డొచ్చి "అడివి చేన్లకాడ చెనిగి తోటలో మెగాలొచ్చి తినేస్తావుండాయి, కావిలి పోరా!" అనేసి పోతాడు.

కావిలి పోకపోతే ఎక్కడ నా జాగాలో ఉండ వద్దంటాడోనని భార్యను పిలుచుకొని అడిగి చేను కాడికి పోతాడు. అక్కడ తెల్లవారుతుండగా చేల దగ్గరికి వచ్చిన పెద్ద పందిని తుపాకితో కాలుస్తాడు . పందికి దెబ్బ తగులుతుంది. కాని, అది తప్పించుకొని అడివిలోకి పారి పోతుంది. అడివిలో వెతుకుతుంటే ఆ ప్రక్క గ్రామంలో వారంతా ఎదురుపడతారు. వెంకటేశు "మీరంతా ఎక్కడికొచ్చారు" అని అడిగితే, వారు "నువ్వు పందిని కాల్సినావంటనే నీతో పాటు మేము వెతుకుతాము. నీకు సగం మాకు సగం మాసం" అంటారు అందుకు వెంకటేశు ఒప్పుకుంటాడు. 

కొంత దూరం పోయిన తరువాత వారు వెంకటేశును తప్పుదారి మళ్లించి, ఆ ఊర్లో వాళ్ళు పందిని ఎత్తుకుపోతారు. సాయం కాలం ఊర్లోకి పోతే వెంకటేశుకు ఆ విషయం తెలుస్తుంది, తనను తప్పుదారి పట్టించి వారు పందిని తీసుకు పొయినారని.(నాడోడి బతుకులు: పుటలు 69 -75)

12. ఒకరోజు వెంకటేశు అడివిలో తేనె తీయ్యాలని తన చెల్లి జానకిని, బామర్ది సుబ్బిగాణ్ణి తన భార్య అలివేలును పిలుచుకొని అనుమంతు రాయుడి బోటుకు పొతారు. బోటు పైకి మాలకట్టి అలివేలు వెంకటేశు మాల పట్టుకొని బోటుపైనుంటే, జానకి కిందుంటుంది. సుబ్బిగాడు మాల మీద పైకెక్కి జారి పడిపోతాడు. తరువాత వెంకటేశు ఎక్కి తేనె తీసుకొచ్చేస్తాడు. కాని సుబ్బిగాడు శాశ్వతంగా వికలాంగుడై పోతాడు.(నాడోడి బతుకులు: పుటలు 75 -80)

13. ఒకరోజు వెంకటేశు కొంత మందితో కలసి రాత్రి పూట వెంకట్రెడ్డూరు చెరువు కింద ఒడ్లో చాపలు పట్టడానికి వెళ్ళి తెల్లవారే సరికి చాపలు పట్టేస్తారు. అప్పుడు ఆవూరి యువకులు "ఇది మా పంచాయతీ క్రిందకు వస్తుంది. పట్టిన చేపలు వదిలేసి పొండి" అంటారు. వేరేదారి లేక వదిలేసి పోతుంటే, ఆవూరి సర్పంచి చిన్రెడ్డబ్బ ఎదురుపడి పిల్సుకుపొయి "రేయ్! రాత్రంతా వారు కష్టపడి చేపలు పట్టుకుంటే మీరొచ్చి లాక్కుంటే బాగుండదు. తలా వీశ చేపలు తీసుకొని మొత్తం వారికి ఇచ్చేండి" అంటాడు. అప్పుడు వెంకటేశు "మనం వేటాడితే దోసుకున్నోళ్ళనే చూసినాను. ఇప్పుడు సిన్రెడ్డబ్బట్టా మంచి సర్పంచులు కూడా ఉండారు" అంటా వచ్చేస్తాడు.(నాడోడి బతుకులు: పుటలు 80 -87)

14. అక్కడుండగానే ఎలక్షన్స్ వొస్తాయి. అందులో వెంకటేశు ఒక పార్టీకి ఓటేసినాడని ఇంకొక పార్టీవాళ్ళు కేసుపెడతారు. దానికి వెంకటేశు తమ్ముడు కూడా సహకరిస్తాడు. అక్కడి నుంచి ఎలాగో బయటపడిపడి, మర్రిమాకుల కండిగ  సింగపూరిండ్ల దగ్గరొచ్చి చేరతాడు. (నాడోడి బతుకులు: పుటలు 87- 94)

15. అక్కడ అడవిని కాంట్రాక్టు తీసుకున్న లక్షుం రెడ్డి యానాదులు సేకరించిన అటవీ ఉత్పత్తులను తక్కువ ధర తీసుకుంటూ మోసం చేస్తుంటాడు. వెంకటేశు అడివంతా తిరిగి సేకరించిన ముష్టి గింజలను అనుకున్న సమయానికి తెచ్చి ఇవ్వలేదని డబ్బులివ్వకుండా మోసం చేస్తాడు. (నాడోడి బతుకులు: పుటలు 94- 98)

16.  ఈశ్వరయ్య అనే వ్యక్తొచ్చి వెంకటేశును కలిసి 'తనకు వళ్ళంతా పొడలున్నాయి. గండంగి అనే జంతువును చంపి దాని రక్తం పొడలమింద పూసి ఆ మాంసం తింటే బాగవుతుందని' చెబితే, శ్రమకోర్చి తిరుమల అడవుల్లో తిరిగి ఆ జంతువును వేటాడి ఇస్తాడు. తరువాత అతని వళ్ళు బాగై పెళ్ళి చేసుకొని వెంకటేశుకు బట్టలు కూడా పెట్టి పంపుతాడు.ఏపనీ దొరక్క పస్తులుంటాడు.(నాడోడి బతుకులు: పుటలు 98- 106)

17. వెంకటేశు పెద్ద కొడుకు నరసింహుడికి పసి తనంలో భర్తను పోగొట్టుకున్న ఒళ్ళెమ్మను తెచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. వెంకటేశు అత్తామామలు అందుకు ఒప్పుకోరు. తరువాత పిళ్ళారికుప్పంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాట ఇస్తారు. తీరా బొట్టు కట్టే సమయానికి గంజి నీళ్ళ సాగ్యంలో పెళ్ళి కొడుకు ఇష్టమైతే గంజి నీళ్ళు తాగమంటారు. కానీ, ఆ అమ్మాయి తాగదు. ఆ అమ్మాయి నేను వేరొకర్ని ప్రేమించినానని చెబుతుంది. పెద్దలు ఇష్టం లేని పెళ్ళి చేయలేమని, ముందు అనుకున్నట్టే భర్తను పోగొట్టుకున్న ఒళ్ళెమ్మను తీసుకొచ్చి మారు మనువు పేరుతో తెచ్చి పెళ్ళి చేస్తారు. అమ్మాయి మనసు తెలుసుకొని ఆమెకి ఇష్టమైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసే సంప్రదాయం వీరిలో ఉండడం ఈనాటి సమాజానికి ఎంతో ఆదర్శాన్ని బోధిస్తుంది. (నాడోడి బతుకులు: పుటలు 106- 115)

18. ఒకరోజు వెంకటేశు పచ్చికాపల్లం భారతం నాటకానికి వెళ్లి వచ్చి ఆలస్యంగా పడుకుంటాడు. నిద్ర నుంచి లేసే సరికి కాళ్ళ దగ్గర నర్సయ్య కూర్చుని ఉంటాడు. నరసయ్య పేద రైతు. ఆయన ముఖం చూసి "ఏం పనిగా వచ్చారు" అని అడుగుతాడు. నర్సయ్య తన మడిలో ఎలుకలు పట్టాలని చెబుతాడు. వెంకటేశు నేను వచ్చేస్తాను మీరు పోండి పంపేస్తాడు. 

 తరువాత తన తల దగ్గర కూర్చున్న మొగిలయ్య అనే పెద్ద రైతు ముఖం చూసి ఏం పనిగా వచ్చారు? అని అడుగుతాడు. నేనే నీ దగ్గరకు మందొచ్చానని, ముందు నా మడిలోనే ఎలుకలు పట్టాలని పట్టుబట్టతాడు. అందుకు వెంకటేశు "నేను నర్సయ్యకు వస్తానని మాటిచ్చేసినాను. ముందు ఆయన మడిలో పట్టేసి, ఈ రోజే తమరి మడిలో కూడా పట్టేస్తానని" చెబుతాడు. అందుకు మొగిలయ్య కోపంతో ఎప్పుడో వచ్చి పట్టు అని వెళ్ళి పోతాడు.

నర్సయ్య మడిలో ఒక్క ఎలుక కూడా దొరకదు. కాని ఆయన సద్ది పోసి నా మడిలో ఎలుకలు పట్టక పోయినా మడి కోసిన తరువాతొచ్చి పది పళ్ళు గింజలిస్తాను, తీసుకుపొమ్మంటాడు. ఆ తరువాత మొగిలయ్య మడికి పోయి ఇరవై ఎలుకలు పడతాడు. కాని ముందొచ్చి తన మడిలో ఎలుకలు పట్టలేదనే కోపంతో  అన్నం పెట్టడు. పైగా ఈ ఎలుకలు నా మడిలో పట్టినవి కావు అని ఏమీ ఇవ్వకుండానే పంపేస్తాడు. ఇలా అడుగడుగునా బలవంతుల దాష్టీకానికి గురవుతూనే ఉంటాడు. (నాడోడి బతుకులు: పుటలు 115- 122)

19. పసి వయస్సులో భర్తను కోల్పోయిన చెంచమ్మ వెంకటేశు భార్య అలిమేలును "రా చిన్నమ్మా! కొండచుట్టు తిరణాళ్ళకు పోయొస్తామని పిలుస్తుంది. అలివేలు "మీ యన్న చెవల పిల్లిని అంటే కుందేలును పట్టుకొచ్చినాడు చెంచమ్మా కూర చేసి తినేసి పోదాము‌ ఉండు" అంటుంది. చెంచమ్మ "నేను  'ఒక్కపొద్దు ' కౌసు తిన కూడదు. మీరు తినేసి రండని" వెళ్ళి పోతుంది.

వెంకటేశు అలివేలు కూర చేసి తిని నిదానంగా కొండచుట్టు తిరుణాళ్ళకు పోతారు. అక్కడ చెంచమ్మను ఒక రాచ పిలగాడు కొంతమంది పోకిరి పిల్లలు వెంటాడటం గమనించిన వెంకటేశు 'మన చెంచమ్మ మంచిదనుకున్నాను. ఆ రాచ పిలగాడితో ఉండగా ఇప్పటికి నాలుగైదు సార్లు చూశాను. అలాంటి వారితో మనకేం పనుందని" అలిమేలుతో అంటాడు.

అలిమేలు "మన చెంచమ్మ ఎట్టాటిదో నాకు తెలుసు నీకేం తెలుసని మాటాడుతున్నావు. తెలుసుకోకుండా మాటాడకూడదని మొగుడికి బుద్ది చెబుతుంది. వచ్చేస్తారు. మరుసటి రోజు అదే రాచ పిల్లవాడు చెంచమ్మ దగ్గరకు వచ్చి పోతూ వెంకటేశుకు కనబడతాడు.

వెంకటేశు చెంచమ్మ దగ్గరకు పోయి "ఆ రాచ పిల్లవాడు నీ దగ్గరకు ఎందు కొచ్చినాడు"? అని అడుగుతాడు. ఆమె నేనొక రోజు వారికి పైరు నాటడానికి వెళ్ళాను. ఆరోజునుంచి నేనెక్కడుంటే అక్కడికొచ్చి నేను నిన్ను ప్రేమించినాను,పెళ్ళి చేసుకుంటానని వెంటబడుతున్నాడు". అందుకే ఈరోజు నేను యానాది దాన్ని నువ్వు రాచ పిల్లగాడివి, మీకు మాకు కుదరదు. నువ్వు నీ కులాన్ని ఆస్తిపాస్తులు వదులుకొని వొచ్చి మా యానాది కులంలో చేరి, నాతో పాటు నా గుడిసెలో కాపురం ఉండేటట్టుంటే చెప్పు పెళ్ళి చేసుకుంటానని" చెప్పాను. అతను పారిపోయాడు అని చెబుతుంది.

వెంకటేశు "చెంచమ్మా నిన్ను నేను అపార్థం చేసుకున్నాను క్షమించు తల్లి" అని మనస్సులో అనుకుంటూ "మేమెప్పుడూ ఇంతే. మేము మేములా ఉండాలనుకుంటాము. కానీ ఇంకొకర్లా ఉండం"అనుకుంటూ వచ్చేస్తాడు. చెంచమ్మ పాత్ర ద్వారా  యానాదుల నిజాయితీ బయటపడుతుంది.(నాడోడి బతుకులు: పుటలు 122- 129)

20. వెంకటేశు తమ్ముడి కొడుకు సూరిగాడొచ్చి పిల్లలకు పుట్టెంటుకలు తీయాలని చెబుతాడు. వెంకటేశు అబ్బోడా మనిండ్లల్లో పట్టెంటుకలు తీయాలంటే అదో పెద్ద తతగం అయినా నువ్వు మన పద్దతిలోనే తీసుకో. అని పూజారి దగ్గరకు పోయి విషయం చెబుతాడు.

పూజారి చినబ్బ మన డుబ్బాంక మేళగాళ్ళను పిలువు అంటాడు .అందుకు సూరిగాడు పెదయ్యా ఇంకా ఏంది డబ్బాంక?  మంగల మేళం పెట్టుకుందాం. మనకూ విలువగా ఉంటుంది అంటాడు.

అందుకు పూజారి అబ్బోడా మనం "మన స్థలాలు మర్సిపోయినా, పొలాలు మర్సి పోయినా మన మూలాలు మరవ కూడదు.  మన డుబ్బాంకే పెట్టాల" అంటాడు.డుబ్బాంక వాయించుకుంటూ బాగా తాగి తిని వేడుక చేసుకుంటారు. అడ్డుకోబోయిన ఇతరులను ఖాతరు చేయరు.(నాడోడి బతుకులు: పుటలు 129- 134)

21. కరువు కమ్మేస్తుంది. పనులెక్కడా దొరకవు. అప్పుడు పుట్టలో నీళ్ళు పోసి, మూసి  పెడతాడు. మరుసటి రోజు ఈసుళ్ళు లేస్తాయి. ఆకలి తీర్చుకోవడానికి పట్టుకున్న  ఈసుళ్ళను తింటూవుంటే, వెంగటేశు తమ్ముడు బుజ్జిగాడొస్తాడు. వాడికి ఒక పూట తిండి పెట్టలేక పోయినందుకు బాధ పడతాడు. అతనికి కూడా ఈసుళ్ళనే భోజనంగా పెడతాడు. ఆకలి తీర్చుకోవడానికి వారి జీవిత పోరాటం సరిపోతుంది అని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.(నాడోడి బతుకులు: పుటలు 134-138)

22. కరువింకా వదలి పోలేదని ఒకరోజు కొంత మందితో కలిసి ఉత్తరపు అడివికి దేవదారు తెచ్చుకోని తినడానికి వెళతారు. కోసుకొని తిరిగొస్తూ ఉంటే , పారెష్టోళ్ళ పట్టుకొని ఎర్ర చందనం కొట్టినారని కేసు పెడతారు. జైలుకెళ్లి , బెయిలు మీదొచ్చి కోర్టు వాయిదాలుకు తిరుగుతుంటారు.(నాడోడి బతుకులు: పుటలు 138-144)

23. కోర్టు వాయిదాలు మీద వాయిదాలేసి తిప్పుతుంటే, వెంకటేశు చిన్న కొడుకు మన్ను గాడు "నేనిక్కడ ఉండలేను ఇక్కడ మనుష్యులకంటే అడివిలో సింహాలు, పులులే మేలు. వాటికి ఆకిలి తీరితే, మల్ల మన జోలికి రావు. ఇక్కడ మనుషులకు ఎప్పుడు ఆకిలి తీరుతుందో చెప్పలేమంటూ" అదిలాబాద్ అడవులకు వెళ్ళి పోతాడు. వెంకటేశు సింగపూర్ ఇండ్ల కాడ నుండి పచ్చికాపల్లం దగ్గర ఉండే సావిరెడ్డి కండిగకు మకాం మారుస్తాడు.(నాడోడి బతుకులు: పుటలు 144-149)

24. ఒకరోజు వెంకటేశు ఎలుక కలుగులు లోడుకుంటూ ఉంటే, మాజీ సర్పంచ్ కొండారెడ్డి ఉన్నఫణంగా తీసుకుపోయి సర్పంచి పదవిలో పెడతాడు. ఆ పంచాయతీ ఎస్టి సామాజిక వర్గానికి కేటాయించడం వల్ల, ఆ ఊర్లో మరో ఎస్టి అభ్యర్థి లేకపోవడం వల్ల వెంకటేష్ కు ఈ అవకాశం లభిస్తుంది. ఏకగ్రీవంగా సర్పంచి అయినా గాని, వెంకటేష్ కు పూట గడవదు. ఎవరికి పనికి పోయినా పనిలో పెట్టుకోరు. 'సర్పంచిగా ఉన్న నిన్ను మా చేలో పని చేయిస్తే పరువు పోతుంది ' అంటూ పంపేస్తారు. గత్యంతరం లేక తిరుపతికి వెళ్తాడు. అక్కడ రిక్షా తొక్కాలన్నా, హమాలిగా పని చేయాలన్నా కార్మిక సంఘంలో సభ్యుడుగా ఉండాలంటారు. అందువల్ల ఏపనీ దొరక్క పస్తులుంటాడు.

ఆకలికి తట్టుకోలేక అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చొని ఏడ్సుకుంటూ ఉంటే, ఒక వ్యక్తి వచ్చి ఓదార్చి విషయం తెలుసు కుంటాడు. ఆ వ్యక్తి ఒక పాత్రికేయుడు. "అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని ఏడుస్తున్న ఎస్టీ సర్పంచ్ " అనే శీర్షికతో రాసిన వార్త పేపర్లో వస్తుంది. అది చదివి కలెక్టర్ వెంకటేశును పిలిపించి అయిదు ఎకరాల భూమి ఒక ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తాడు..(నాడోడి బతుకులు: పుటలు 150-160)

25. వెంకటేశు చదువు రాదు. ఈయన సర్పంచ్ అయిన కొత్తలో  స్కూలు పక్కన ఉండే జాగాను పూర్వ సర్పంచ్ కొండారెడ్డి తనకు తొంబై తొమ్మిది సంవత్సరాలకు లీజుకు ఇస్తున్నట్టు రాసుకొచ్చిన పత్రాలపై వెంకటేసుతో వేలిముద్ర వేయించుకొని ఉంటాడు. అప్పటికి అందులో ఏముందో వెంకటేష్ కు తెలియదు.  ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఇతర సభ్యులు వెంకటేసు తప్పు చేశాడని నిలదీస్తారు. ఎలాగైనా ఆ స్థలాన్ని తిరిగి స్కూల్ కు ఇప్పించడానికి స్కూలు పిల్లలను తీసుకెళ్ళి ఎమ్మర్వో ఆఫీసు ముందు ధర్నా చేయించి, ఆ జాగా స్కూలు ప్లే గ్రౌండుకు ఇస్తాడు.ఇలా ప్రజోపయోగ కార్యక్రమాలకు మెచ్చి వేంకటేశుని రాష్ట్రపతి పురస్కారానికి ఎంపిక చేస్తారు. సంక్షిప్తంగా ఇదీ నవలా వస్తువు. (నాడోడి బతుకులు: పుటలు 160-167)

3. సంస్కృతి సంప్రదాయాలు: 

సంచార జాతిగా ఉన్న యానాది వారు హిందూ సంప్రదాయాన్ని పాటిస్తున్నట్టు ఉన్నా, వారి నమ్మకాలు, సంప్రదాయాలు, పూజా విధానాలు కొంత భిన్నంగా ఉంటాయి. పెళ్లిళ్లు, చావులు, వస్త్రధారణ మొదలైన అంశాలలో సాంస్కృతిక ప్రత్యేకతలను చూడవచ్చు. 

1. యానాదులు ఎక్కడికి వెళ్లినా భార్య పిల్లలతో కలిసే వెళతారని ఒంటరిగా వెళ్లరని రచయిత నిర్ధారించాడు.

2.యానాది జాతిలో ఎవరైనా చనిపోయినప్పుడు చనిపోయిన వారి శవాన్ని తుళశమ్మ గుడి ప్రాంతంలో పూడ్చేస్తారు. ఇతర సామాజిక వర్గాలు లాగా స్మశానానికి తీసుకెళ్లరు.. శవం దగ్గరికి వెళ్లి "ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ యానాది కులంలోనే పుట్టాల"అని మూడుసార్లు చెప్తారు.

3. యానాదుల కర్మకాండలకు బ్రాహ్మణులు రారు. అయితే బ్రాహ్మణులు మంత్రించి ఇచ్చిన నీళ్లు పసుపు ముద్దను తెచ్చుకొని నీళ్లల్లో కలిపి ఆ నీళ్లనే నెత్తి మీద చల్లుకొనే ఆచారం ఉంది.

4. ఏవైనా క్రతువులు చేయాల్సివస్తే రంగం పెట్టుకునే ఆచారం ఉంది. రంగం అంటే  తుళశమ్మకు పూజ చేయడం, డుబాంక అనే వాద్యంతో ఆడి పాడడం. 

5. మరణించిన వ్యక్తికి సంబంధించిన విషయాలను వారి కులదేవత తుళశమ్మ పూజారిని ఆవహించి, పూజారి నోటి ద్వారా చెప్పడం మరో విశేషం. తిరుపాల్ చనిపోవడానికి క్రూర మృగాలు కారణం కాదని, పక్క ఊరి సర్పంచి కూతురుని ఇష్టపడడమే అందుకు కారణమని ఈ రంగం ద్వారానే తెలుసుకుంటారు.

6. ఒకప్పుడు కన్యాశుల్కం ఉండేది. అది ఇప్పుడు కూడా యానాదుల్లో ఉంది. దాన్ని ఓలి అంటున్నారు. వెంకటేశు పెద్ద కొడుకు నరసింహులు కోసం ఓ అమ్మాయికి 200 రూపాయలు ఓలిగా ఇవ్వడానికి ఒప్పుకుంటారు. 

7. యానాదుల పెళ్లిళ్లకు పురోహితుడు ఉండడు. ముహూర్తాలు ఉండవు. రచయిత మాటల్లో చెప్పాలంటే " ఆదివారం మిట్ట మద్దేనం ఎండలో రోకలి నిలబెట్టి దాని నీడ అట్ట ఇట్ట పడకుండా నిలవన ఎప్పుడు పడుతుందో అప్పుడే ముహూర్తం . అంటే మనం మన నీడ తొక్కాల. అప్పుడు బొట్టు కట్టాల. మా పెళ్లిల్లంతా ఇతనే జరుగుతాయి"..(నాడోడి బతుకులు: పుట:109)

8. పెళ్లిళ్లలో గంజె కావిడి అనే ఒక సంప్రదాయం ఉంది. రెండు కుండలను కావడిలాగా కట్టుకొని, అందులో గంజి నీళ్లు మోసుకొస్తారు ఆ నీళ్లను పెళ్లికూతురును తాగమంటారు. వాటిని తాగితే ఆ అమ్మాయికి సర్దుకుపోయే లక్షణం ఉన్నట్టుగా భావిస్తారు. గొప్పలు చెప్పుకుని పెళ్లిళ్లు చేసుకుని ఇక్కట్లు పడడం  కన్నా, తమ స్థితిగతులను ముందే తెలియజేసి అన్యోన్యంగా బతకడానికి అవసరమైన నమ్మకాన్ని సంపాదించుకోవడమే ఈ సంప్రదాయ ఉద్దేశంగా కనిపిస్తుంది.

9. యానాదులకు తమదైన శైలిలో వైద్య విధానాలు ఉన్నాయి. అందులో మూలికా వైద్యం ముఖ్యమైంది. అది పాము కాటుకు కూడా పనిచేస్తుంది.

10. గండంగి రక్తాన్ని పూసుకుని మాంసాన్ని తింటే తెల్ల మచ్చలు తగ్గిపోతాయని నమ్మకం ఉంది. ఈశ్వరబ్బ పాత్ర ద్వారా ఈ విషయం తెలుస్తుంది. 

11. రకరకాల జంతువులను పక్షులను వేటాడడం ,తినడం వీరి బతుకులో భాగం. అడవే వీరికి సర్వస్వం కాబట్టి, అడివిలో దొరికే చెట్టు చేమను, జంతువులను, పక్షులను బతుకు తెరువు కోసం ఉపయోగించుకుంటారు.

12. శ్రామిక జీవితాన్ని ఇష్టపడే యానాదులు, పెళ్లి విషయంలో  డబ్బున్న వాడైనా సరే ,ఇతర కులాల వారిని పెళ్లి చేసుకోరు. అంతగా ఎవరైనా ఇష్టపడ్డామని చెప్తే వాడిని తమ యానాది కులం లోకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తారు. చెంచమ్మ పాత్ర ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తాడు రచయిత. 

దేదారాకు , ఈసుళ్ళు, దామర గడ్డలు, ఈసేడి గడ్డలు యానాదులకు ప్రత్యామ్నాయ ఆహారం. 

4. రచయిత దృక్పథం: 

రచయిత మూరిసెట్టి గోవింద్ కథను ఉత్తమ పురుషలో చెప్పాడు.

ఇది ఒక ఆత్మకథలాగా సాగుతుంది. యానాదుల జీవితాలపై స్వయంగా పరిశోధించి తెలుసుకున్న విషయాలకు అక్షర రూపం ఇచ్చాడు. పీడితుల పక్షపాతిగా, అభ్యుదయ ఆలోచనా పరుడిగా యానాదుల జీవితాలను హృదయానికి అడ్డుకున్నాడు. వారిపై ఉన్న ప్రేమ మమకారాలు ప్రతి సన్నివేశంలో కనిపిస్తాయి. ఆకలి బాధలను వర్ణించడంలోనూ,  సమస్యలను వెళ్ళబోసుకునే సందర్భంలోనూ రచయిత యానాదులతో తాదాత్మ్యం చెందిన విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. యానాదుల శ్రమను దోచుకునే వారి పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తాడు రచయిత. ఈ నవలా నాయకుడైన వెంకటేష్ ద్వారా సమాజానికి అనేక ప్రశ్నలు సంధిస్తాడు. నిత్యం దోపిడికి గురవుతున్న ఈ వర్గం పడుతున్న ఆవేదనను తన సంభాషణలో జాగ్రత్తగా పొందుపరుస్తాడు.

"మడిషిని పుట్టించిన బెమ్మ దేవుడు రాతి కింద కప్ప ఆకలి తీర్చినాడు కానీ మా ఆకలి తీర్చలేకపోయినాడు" అసమ సమాజాన్ని సృష్టించిన దేవుడిని నిందిస్తాడు.

"ఈ జనాలతో మేం బతకలేం ఈడ మడుసుల కంటే అడవిలో సిమ్మాలు పులులే మేలుగా ఉంది. అక్కడ వాటికి ఆకలి తీర్తే మల్ల మన జోలికి రావు , ఇక్కడోళ్లకు యప్పుడు ఆకలి తీరుతుందో చెప్పలేం. జనమొక పక్క పోలీసోళ్ళొక పక్క మనల్ని బతకనిచ్చేటిగా లేరు" వర్ణ వ్యవస్థతో ఆదాయ వర్గంతో వచ్చిన బలవంతుల దౌర్జన్యాలను ప్రశ్నిస్తాడు.

"పెపంచకంలో యాడ జూసినా యాటే. యలికను పిల్లి, పిల్లిని కుక్క,కుక్కను నక్క, బక్కోడిని బలమైనోడు యాటాడతా ఉండాడు. ఇంగ యాట లేనిండెక్కడ?" ఆటవిక నీతిని ఎత్తి చూపిస్తాడు.

 ఒక సర్పంచ్ కూతుర్ని ఇష్టపడిన కారణంగా యానాది వ్యక్తి అయినా తిరుపాల్ ను చంపేయడం కుల దురహంకారానికి నిదర్శనంగా కనిపిస్తుంది. 

అదే యానాదుల యువతులను ఎవరైనా ప్రేమిస్తే, ఇలాంటి దుర్మార్గాలు చేయరు. వారిని తమ కులంలోకి మారి వివాహం చేసుకోమనే ఒక ఉదాత్త గుణాన్ని ఎత్తి చూపిస్తాడు.

 "ఏంది మీరు చెప్పేది పెండ్లాం చచ్చిపోతే మొగోడు నెల తిరగకముందే పిండి చేసుకోవచ్చు. మొగుడు చచ్చిపోయిన బిడ్డని పెళ్లి చేసుకుంటే తప్పేముండాది" అనే గొప్ప ఆదర్శవంతమైన విలువను మనకు తెలియచెప్తాడు.

 “ఇద్దోరా! అబ్బోడా! నీ దగ్గిరుంది పెడతావు. లేనోడి సంగతెట్ట? మనం మన తలాలు మర్చి పోవచ్చు, పొలాలు మర్చి పోవచ్చు. కాని మనం మన మూలాలు మరవగూడదు. మన డుబ్బాంకే పెట్టాలి" అన్నప్పుడు సంస్కృతిక మూలాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాడు.

5. రచనా విశేషాలు : 

గోవింద్ ఒక భావుకుడు. ఈ నవలలో వర్ణనలు ఆకర్షణీయంగా ఉంటాయి. "కొండలు గుట్టలు రాసి బోసిన బొగ్గుల కుప్పలు మాదిరిగా కనబడతా ఉండాయి ".(నాడోడి బతుకులు: పుట 36)

"ఉత్తీత అరుపులు వింటా ఉంటే, భగవంతుడు దాన్ని అడవికి కావలి పెట్టినాడేమో"(నాడోడి బతుకులు: పుట:37) అనిపించింది. వంటి వాక్యాలు కవితాత్మకంగా ఉంటూ రచయిత భావుక దృష్టిని బయటపెడతాయి. అంతేకాకుండా తను నివసించిన ప్రాంతంలో, పామర జనం మాటల్లో అలవోకగా దొర్లి వచ్చే అనేక సామెతలను కూడా ఈ నవలలో అక్షరీకరించాడు.

  • "బుర్ర లేనోడ్ని ఎద్దుల బేరానికి పంపిస్తే- ఎర్రగా ఉండే ఎద్దును ఎనభైకి, నల్లగా ఉండే ఎద్దును నలభైకి అడిగినాడంట".(నాడోడి బతుకులు: పుట: 26)
  • "గాడిద కేం తెలుసు గందోడి వాసన"(నాడోడి బతుకులు: పుట: 38)
  • "నండ్రకాయ కొవ్వెక్కితే బొక్కలో ఉండదంటారు"(నాడోడి బతుకులు: పుట: 53)
  • "తోక కోసి సున్నం పెట్టినట్టు "(నాడోడి బతుకులు: పుట: 62)
  • "కలిగినోడు గాదె తెర్సే కొద్దికి, లేనోడి ప్రాణం పోయిందంట ".(నాడోడి బతుకులు: పుట: 64)
  • "ముక్కులో ఎంటికి పెరికినట్టు"(నాడోడి బతుకులు: పుట: 65)
  • "కుమ్మెత్తుకొని గూళ్ళూరుకు పోతే, ఏడు కుమ్ములు ఎదురొచ్చినాయంట"(నాడోడి బతుకులు: పుట:65)
  • "పొయిలో చూస్తే పిల్లి నిద్రపోతా వుంది"(నాడోడి బతుకులు: పుట: 66)
  • "సూది పోయిందని సోదికి పోతే, పాత గుట్టంతా రట్టయిందంట" ".(నాడోడి బతుకులు: పుట:93)
  • "యానాదోడు యాడ పొయ్యిలో అగ్గిపెడనీయడు"".(నాడోడి బతుకులు: పుట: 94)
  • "ఊలోళ్ళ సొత్తు ఉక్కళంగా కావాలనే రకం"".(నాడోడి బతుకులు: పుట: 95)
  • "యాదిచ్చినోడు ఎర్రోడు"(వ్యాధి వచ్చినవాడు ఎర్రోడు)".(నాడోడి బతుకులు: పుట: 100)
  • "ఆకిలి రుసెరగదు నిద్ర సోటెరగదు "(నాడోడి బతుకులు: పుట: 104)
  • "నెమలి కంట్లో నీళ్లు కారితే వేటగాడికి ఏం దుఃఖం".(నాడోడి బతుకులు: పుట: 105)
  • "నువ్వే దేవుడంటే నూకలే బత్యం అన్నెట్టు ఉండాది"".(నాడోడి బతుకులు: పుట:117)
  • "తిన్న కుక్క తినేసి పోతే, కన్న కుక్కను కట్టేసి కొట్టే రకం"(నాడోడి బతుకులు: పుట: 141)
  • "భోగం ఈది కొళ్ళబోతే , సన్నాసులంతా ఎగబెట్టుకుని వచ్చినారంట " (నాడోడి బతుకులు: పుట: 67) 
  • "ఎండబోసిన చాపలు కాకులు ఎత్తుకుపోయినట్టు"(నాడోడి బతుకులు: పుట: 74)
  • "మనిషి మంచోడు కాదా చూడాలంటే మాంసం కూర కాడ చూడాలని పెద్దోళ్ళు చెప్పినారంట"(నాడోడి బతుకులు: పుట:75) 
  • "ఇరు పోట్ల మింద ఇల్లు చెడా , వాయు పోట్ల మింద వళ్లు చెడా"(నాడోడి బతుకులు: పుట: 87)
  • "కొండంత రెడ్డొచ్చి కొంగు పట్టుకుంటే ఎట్టా కాదనేది"(నాడోడి బతుకులు: పుట: 153)
  • "మింగను మెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ సమురా ?"(నాడోడి బతుకులు: పుట: 156)
  • "ఉలవలు తినమంటే కులగోత్రాలు అడిగినాడంట" ".(నాడోడి బతుకులు: పుట: 162)

మొదలైన సామెతలు ఈ నవలకు మరింత వన్నె తెచ్చాయి.

6. మాండలికం:

భాషా శాస్త్రజ్ఞుల ప్రకారం భారతదేశంలో మాండాలికాల విస్తృతి చాలా ఎక్కువ వారు చెప్పిందని ప్రకారం ప్రతి 11 కిలోమీటర్లకు యాస మారిపోతుంది. చిత్తూరు జిల్లాకు ఒకవైపు తమిళనాడు మరొకవైపు కర్ణాటక ఉండటం వల్ల ఈ రెండు భాషల ప్రభావం కూడా చిత్తూరు మాండలికంలో కనిపిస్తుంది. వివిధ వృత్తుల వారు ఉపయోగించే భాషలో కూడా వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఉపయోగించే పదజాలంలోనూ, పలికే విధానంలోనూ తేడాలను స్పష్టంగా గమనించవచ్చు. 

  • ఉడ్డ (చేర్చి) = కుప్ప
  • దుడ్లు,దుడ్డు =డబ్బు
  • గమ్మన = ఏమీ మాట్లాడకుండా
  • కూర=మాసం
  • గోపరం =గోపురం.
  • యలబారి= ప్రయాణమయ్యి 
  • యల్తరు= యలుతురు 
  • సీగటి=చీకటి 
  • యడంగా=దూరంగా
  • మింద=మీద
  • సిటపరిస్తా= భయపడుతూ/భయపెడుతూ
  • నెట్టు= మెట్టు (తాప)
  • సవకం, పై గుడ్డ = తువ్వాలు
  • మాతర్లు= మాత్రలు
  • మారు మనువు=రెండో పెళ్లి
  • తెంపేసినోళ్ళు=భర్తలను కోల్పోయిన భార్యలు
  • కీతులు = ఆకులు అల్లిన కొబ్బరి మట్టలు
  • సాంగిం= సంప్రదాయం
  • ఉరువులు= వివిధ రకాల వస్తువులతో కట్టిన మూటలు 
  • తుస్కారం=హీనం,ఎగతాళి 
  • తెపరాయిస్తా= బాధపడతా,
  • యంటవ=ముంగిస
  • బిడ్డి =ఆడ బిడ్డ
  • తుంగపార= చిన్న గునపం
  • ఊదర దుత్త=(ఎలుకలు పట్టడానికి) పొగ పెట్టడానికి వెనుక వైపు రంధ్రం చేసిన మట్టి కడవ
  • కవణం= ఒకసారి తినగలిగే ముద్ద
  • బార్తన= భారత నాటకం
  • సీరు = వండి(కూర సీరు చేసి)
  • గుమాను= అనుమానం
  • ధర్మాన= దయతో
  • తళిగ = ఒడ్డించిన విస్తరి
  • ఈశుళ్ళు= పుట్టలో నుండి లేసే రెక్కల పురుగులు(వీటిని తింటారు)
  • సెబ్బర = హాని,చెడు(తింటే ఒంటికి సెబ్బెర చేస్తాది)
  • తగలకపోవడం=చిక్కుకు పోవడం
  • పూడ్సినాడు=వెళ్లిపోయాడు (చుట్టక పూడ్సినారు=చుట్టుముట్టేశారు)
  • ఈడికి =ఇక్కడికి,; ఆడికి=యక్కడికి
  • తోమ్రంగా= రద్దీగా
  • గోష్ట= బాధ
  • యాష్ట=విసుగు
  • యలబారు=బయలుదేరు 
  • మల్ల=తర్వాత
  • మరివిళ్ళు= పెళ్లయిన కొత్తలో పుట్టింటికి మెట్టింటికి తిరగడాలు. 
  • నూరు,ఇన్నూరు,మున్నూరు,నన్నూరు= వంద,రెండు,మూడు,నాలుగు వందలు
  • పోరు=వేధించడం
  • రంపు= గొడవ
  • ఏరవ = తెరువు
  • వారా= తేడా
  • తమర గట్టె= పంగల కర్ర, రాగల కట్టె 
  • రుతువు= రుచి (మాకు కావాల్సింది నోటికి రుతువు కాదు)
  • బగిసి= బలం, పౌరుషం(బగిసార)
  • పశాకులు= ఔషధ పసరుకు ఉపయోగించే ఆకులు
  • దినుమ్మూ= ప్రతిరోజూ
  • పరంట=పడమర
  • తొలగేసుకొని= దాటి 
  • వర్స= పెట్టి పంపడాలు
  • జోబిడీ= చిన్న గుడిసె
  • సిదుగు= ఆకులు,ముళ్ళు,కంపలు ఉన్న కుప్ప
  • కళిజం= కలశం, గాదె 
  • జివ్వాలు=జంతువులు
  • సమురు=వంటనూనె
  • కుమ్ము=పొత్తుతో ఉండే నిప్పు
  • బొవ్వాణి= డేగిస ....

మొదలైన మాంండలిక పదజాలం "నాడోడి బతుకులు " నవల నిండా ఉంది.

7. ఉపసంహారం: 

  • మూరిశెట్టి గోవింద్ "నాడోడి బతుకులు" పేరుతో రాసిన నవల యానాదుల జీవితాన్ని అనుభవప్రాయంగా గ్రంథస్థం చేసింది.
  • యానాదుల జీవితాల్లో నిత్యం తొంగి చూసే ఆకలి బాధలు, వాటిని తీర్చుకోవడానికి వారు పడే యాతనలు మనసును పిండేస్తాయి.
  • బతుకు తెరువు కోసం యానాదులు పడుతున్న పాట్లు మనల్ని నిద్రపోనియ్యవు. స్వాతంత్ర్య భారతదేశంలో మూలవాసులుగా ఉన్న గిరిజనులకు హక్కులు, స్వేచ్ఛ అనేవి లభించడం సంగతి దేవుడెరుగు. మూడుపూటలా భోజనానికే అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితులు కనిపిస్తాయి. ఆకలి తీర్చుకోవడం కోసం అడవుల వెంట తిరుగుతూ, అధికారుల చేతుల్లో కీలుబొమ్మలవుతూ, తెలియని చట్టాల చేతుల్లో నేరస్తులుగా మిగులుతూ, భూస్వాముల చెప్పు చేతల్లో నలిగిపోతూ ఉండడాన్ని ఈ నవల చాలా ప్రస్ఫుటంగా చిత్రించింది.
  • గిరిజన సమాజంలో ఇపుడు వస్తున్న మార్పు సరిపోదని ఈ నవల గుర్తు చేస్తుంది.
  • సహజమైన మాండలిక యాసతో గోవింద్ రాసిన ఈ నవల సాహిత్య చరిత్రలో యానాదుల బతుకులకు సంబంధించిన ఒక చారిత్రక సాక్ష్యంగా నిలబడుతుందని భావిస్తున్నాను.

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. నానుడి బతుకులు: మూరిశెట్టి గోవింద్, (2024) అభ్యుదయ రచయితల సంఘం, తిరుపతి. 
  2. తెలుగు నవలా వికాసం: కాసుల ప్రతాపరెడ్డి (2017) తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్.
  3. సాహిత్యంలో సమాజం: ఆచార్య ఎన్ ఈశ్వరరెడ్డి ( 2023) అరసం పబ్లికేషన్స్ కడప.
  4. పినాకిని(వ్యాస సంపుటి)డా. పి సి వెంకటేశ్వర్లు(2009)సాయి విజయ పబ్లికేషన్స్, తిరుపతి.
  5. విమర్శ - 2009: డా. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి (2010) చినుకు పబ్లికేషన్స్, గాంధీ నగర్, విజయవాడ. 
  6. తెలుగు నవలా సాహిత్య వికాసము - పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు (1974) వై.ఎన్.ప్రెస్, ఖమ్మం.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]