AUCHITHYAM | Volume-5 | Issue-10 | September 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
7. తెలంగాణాలో వివిధ ఉద్యమాలు: నాటకాలు
డా. తత్త్వాది ప్రమోద కుమార్
సహ ఆచార్యులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మహిళలు), జగిత్యాల,
జగిత్యాల జిల్లా, తెలంగాణ.
సెల్: +91 9441024607, Email: thatwadi@gmail.com
Download
PDF
సమర్పణ (D.O.S): 20.08.2024 ఎంపిక (D.O.A): 26.08.2024 ప్రచురణ (D.O.P): 01.09.2024
వ్యాససంగ్రహం:
వివిధ ఉద్యమాల నేపథ్యంలో వెలువడిన తెలంగాణ ప్రాంత నాటక సాహిత్యాన్ని పరిచయం చేయడమే పరిశోధనా వ్యాస ఉద్దేశం. తెలంగాణ నాటక సాహిత్యం గూర్చి శ్రీమతి కామేశ్వరి, చక్రధర స్వామి మొదలైన పరిశోధకులు కాకతీయవిశ్వవిద్యాలయంలో పరిశోధన చేసినారు. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, తెలంగాణ సారస్వతపరిషత్ మొదలైన సంస్థలు, పరిశోధకులు వెలువరించిన తెలంగాణ సాహిత్యచరిత్ర గ్రంథాలు, పత్రికావ్యాసాలు పరిశోధనా వ్యాసానికి ఆకరాలు. వివిధ ఉద్యమాల అంశాల ఆధారంగా అభ్యుదయ నాటకాలు, జాతీయోద్యమ నాటకాలు, విప్లవ నాటకాలు, సామాజిక/రాజకీయ వ్యంగ్యనాటకాలు అనే శీర్షికలతో వ్యాసాన్ని విభజించినాను. తెలంగాణ లోని వివిధ ఉద్యమాల నేపథ్యంలో వెలువడిన నాటక సాహిత్యాన్ని తెలియ చేయాలనే భావనతో ఈ పరిశోధన వ్యాసాన్ని పరిమితి చేసుకున్నాను. కావున నాటకాల వస్తువు మరియు రంగ ప్రదర్శనల గూర్చి సంక్షిప్తం గా మాత్రమే వివరించ గలిగాను. ఈ వ్యాస పరిశోధనల కారణంగా భవిష్యత్తులో వస్తు పరంగా, రంగస్థలం పరంగా, ప్రయోగాత్మకంగా వెలువడిన నాటకాలు మరియు ప్రజల్లో ఆ నాటకాలు చూపిన ప్రభావాన్ని గూర్చి విశ్లేషించే అవకాశం ఉంటుంది
Keywords: నాటకసాహిత్యం, తెలంగాణ ప్రాంతం, ప్రజాకళారూపాలు, అభ్యుదయం, చైతన్యం, జాతీయ ఉద్యమం, విప్లవదృక్పథం, రాజకీయ వ్యంగ్యం
1. ఉపోద్ఘాతం:
తెలుగు నాటక రంగం పై, నాటక సాహిత్యం పై వెలువడిన వ్యాసాలు, పరిశోధనలు తదితర గ్రంథాలను పరిశీలించినప్పుడు తెలంగాణ ప్రాంత నాటక సాహిత్యం అరుంధతీ నక్షత్రం వలె మినుకు మినుకుమంటూ మసక మసకగా కనిపిస్తుంది. ఇది అసమగ్రం, సత్యదూరం అంటూ ఇక్కడ కూడా జ్వాజ్వల్యమానంగా వెలుగులీనిన నాటక సాహిత్యం వెలువడిందని, డాక్టర్ కే శ్రీనివాస్, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి వంటి పరిశోధకులు తేల్చి చెప్పినారు. ఈ నేలలో జరిగిన వివిధ ఉద్యమాలు, ఇక్కడ ప్రజల్లోని సామాజిక చైతన్య స్పృహ తదితర అంశాలతో విస్తృతమైన నాటక సాహిత్యాన్ని ఇక్కడి రచయితలు సృష్టించినారు. ఈ సందర్భంగా తెలంగాణ నాటక సాహిత్య పూర్వాపరాలను పరిశీలించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.
2. భూమిక:
ప్రాచీన కాలం నుండి సంస్కృత వాఙ్మయంలో నాటక సాహిత్యం విశేషమైన ప్రశస్తిని పొందింది. ఆ స్థాయిలో తెలుగులో నాటకాలు వెలువడలేదు. శ్రవ్య కావ్యాలకు ఉన్నటువంటి గౌరవాదరాలు నాటక సాహిత్యానికి లేకపోవడమే కారణం. కానీ తెలుగు నేలలో ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రజా సమూహాలలో ప్రదర్శనా కళలు, నాటకాలు ప్రచారంలో ఉన్నాయని చెప్పడానికి వివిధ ఆధారాలు కనిపిస్తున్నాయి. పాల్కురికి సోమన బసవపురాణం1, పండితారాధ్య చరిత్ర2, వినుకొండ వల్లభ రాయుని క్రీడాభిరామం3, విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణం మొదలైన గ్రంథాలు ప్రదర్శనా కళల గూర్చి, వాటి స్వరూప స్వభావాలు గూర్చి, వాటి లక్షణాదులను గూర్చి వివరిస్తున్నాయి. ప్రతాపరుద్రుడు విద్యానాథుడు గంగాధరుడు విశ్వనాథుడు త్రిపురాంతకుడు సర్వజ్ఞ సింగమ భూపాలుడు మొదలైన తెలుగు వారు సంస్కృత భాషలో నాటకాలను రచించిన వారే. ప్రాచీన కాలంలో తెలుగు నాటకాల యందు రాజాదరణ కానీ శిష్ట జనాదరణ కానీ ఉండేది కాదు. అందువల్ల సంస్కృత వాఙ్మయం లోని సుప్రసిద్ధ నాటకాలు తెలుగులో శ్రవ్య కావ్యాలుగా వచ్చాయే కానీ దృశ్య కావ్యాలుగా వెలువడకపోవడం గమనార్హం.
3. నాందీ:
తెలంగాణ నేలలో మార్గ నాటకానికి మార్గ నాటక సంప్రదాయానికి ఆదరణ లేకపోయినా దేశీయమైన నాటక ప్రదర్శనలు ప్రజల జీవన సంస్కృతిలో భాగంగా నిలిచినాయి. వీధి నాటకాలు యక్షగానాలు చిందు భాగవతాలు మొదలైన ప్రజా కళారూపాలు తెలంగాణలో ఎక్కువగా ఉండేవి. నిజాం రాజ్యంలో అంతర్భాగంగాను పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నాటక సమాజాల ప్రభావంతో ఇక్కడి విద్యావంతులు నాటక సాహిత్యం వైపు మరియు నాటక ప్రదర్శనల వైపు తమ దృష్టిని మరలించినారు. 20వ శతాబ్దం ప్రారంభంలో తెలంగాణలో వందల కొలది వీధి నాటక రచనలు వెలువడినాయి. ఆ కాలంలోని తెలంగాణ నాటక ప్రదర్శనల్లో స్త్రీలు కూడా పాల్గొన్నారని పి ఎస్ ఆర్ అప్పారావు ప్రథమాంద్ర నాటక కర్తలు పుస్తకంలో పేర్కొన్నారు. గోలకొండ కవుల సంచికలోని కవుల పరిచయాలను పరిశీలిస్తే 42 మంది కవులు సుమారు 50 వరకు నాటక రచనలు చేసినారు. ఆ నాటకాలు ప్రదర్శనా యోగ్యమై ప్రదర్శితం అయ్యాయో లేదో తెలియదు కానీ నాటక రచనల పట్ల ఆనాటి కవులు విద్యావంతులు ఆసక్తులై ఉన్నారని గమనించవచ్చు. మొత్తానికి ఆధునిక నాటక ప్రదర్శనలో ప్రయోగాలు 20వ శతాబ్ది ప్రారంభంలోనే జరిగినట్టు గమనించ గలుగుతాము.
4. పూర్వరంగం:
తెలుగు నాటక రంగ చరిత్రలో సుప్రసిద్ధులైన ధర్మవరం రామకృష్ణమాచార్యులు హైదరాబాదులో నాటకాలను ప్రదర్శించినారు. హైదరాబాదు కోర్టులో న్యాయవాది అయిన ధర్మవరం గోపాలాచార్యులు స్వయానా ధర్మవరం రామకృష్ణామాచార్యుల వారి సోదరుడు. 1905 వ సంవత్సర ప్రాంతంలో "కృష్ణ విలాసినీ సభ" అనే పేరుతో నాటక సమాజాన్ని ఏర్పరిచి ప్రదర్శనలు ఇచ్చేవారు. గోపాలాచార్యుల కోరికపై 1905 లో రామకృష్ణమాచార్యులు బళ్లారి రాఘవతో కలిసి ప్రదర్శనలు ఇచ్చినారు ఈ ప్రదర్శనలో భాగంగా ధర్మవరం వారు 1910 లో హైదరాబాదు వచ్చినప్పుడు గద్వాల సంస్థానాధిపతి రాజా సీతారాం భూపాల్-2 ధర్మవరం వారిని "ఆంధ్ర నాటక పితామహుడు" అనే బిరుదుతో పాటు రత్న స్థగిత పతకంతో సత్కరించినాడు4. ఈ సంఘటన తెలంగాణ ప్రాంత వాసులు నాటక కళల పట్ల చూపే గౌరవ మర్యాదలను నిరూపిస్తున్నాయి. ఇది గమనార్హమైన విషయం. ఆ రోజుల్లోనే కొందరు ఔత్సాహికులైన నటులు "ఫ్రెండ్స్ యూనియన్" అనే పేరుతో ఒక నాటక సమాజాన్ని, సరోజినీ నాయుడు మేనల్లుడు అయిన ఇనుగంటి వారు "హైదరాబాద్ అమెచ్యూర్" అనే నాటక సంస్థను, మోహనరంగ పిళ్లై అనే నటుడు "వాణీ విలాస సభ" అనే నాటక సమాజాన్ని హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో ఏర్పరిచి నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఈ సంస్థల వారు ఇంగ్లీష్ నాటకాలను కూడా ప్రదర్శించేవారు. ఈ రోజుల్లో జంట నగరాల్లోని "కృష్ణ మనోల్లాసిని సభ", "సరస్వతీ సభ" మొదలైన సంస్థలు నాటక రంగ ప్రదర్శనలో ప్రశస్తి పొందినాయి. ఆది హిందూ సమాజ స్థాపకుడు దళిత ఉద్యమ నాయకుడైన మాదారి వేంకట భాగ్యరెడ్డి వర్మ 1915లో సంఘసంస్కరణ నాటక మండలి అనే సమాజాన్ని ఏర్పరచినాడు. సాంఘిక దురాచారాలను వర్ణ విచక్షణను నిరసిస్తూ వ్యంగ్య ప్రధానమైన మూడు నాటకాలను రచించినారు. చైతన్య భావజాలంతో కూడిన నాటకాలను ఈ సమాజం ద్వారా ప్రదర్శించేవారు.
తొలి తరం తెలంగాణ నాటక రంగ చరిత్రలో విశేష కీర్తిని పొందిన నాటక కర్త చందాల కేశవదాసు నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ కు చెందిన వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటనా వైదుష్యం తెలిసిన వీరు రచించిన "శ్రీకృష్ణతులాభారం", "రాధాకృష్ణ", "కనకతార" మొదలైన నాటకాలు తెలుగువారి ఆదరాభిమానాలను చూరగొనినాయి. శ్రీకృష్ణతులాభారం నాటకం లో వీరు రచించిన "భలే మంచి చౌక బేరము" అనే పాట మరియు తెలుగు నేలలో నాటక సమాజాల వారు నాటక ప్రదర్శన ఆరంభంలో ఆలపించే "పరాబ్రహ్మ పరమేశ్వర" అనే ప్రార్థనా గీతం వీరి కలం నుండి వెలువడిందే. తెలుగు సినిమా రంగంలో తొలి పాటల రచయితగా కేశవదాసు గుర్తింపు పొందుట విశేషం.
5. నాటకాల నేపథ్యాలు:
తెలంగాణలో వైవిద్య భరితమైన నాటక రచనలు విస్తృతంగా వచ్చినాయి పౌరాణిక నాటకాలతో పాటు అభ్యుదయ భావాల పరంపర చైతన్య స్పృహ సామాజిక బాధ్యత జాతీయ దృక్పథం మొదలైన అంశాలతో కూడిన నాటకాలు విస్తృతంగా వెలువడినాయి. "ఉద్యమావసరాల కోసం నాటక రంగాన్ని వినియోగించుకోవడం కూడా తెలంగాణలో 1920 లోపే మొదలయింది."5
6. అభ్యుదయ చైతన్య నేపథ్యం:
నిజాం పరిపాలనా కాలంలో అధికారుల చేతుల్లో బలహీన ప్రజా బాహుళ్యం వేదనలకు గురైంది. బలహీనుల వేదనలను తుడిచివేయాలని అభ్యుదయ వాదుల ఆలోచనయే 'సంఘం'గా అవతరించింది. సంఘం సాయుధ పోరాట దళాలను ఏర్పరిచింది. నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ సంఘం తెలంగాణ సాయుధ పోరాటం విజయం సాధించే సాధించే వరకు విశ్రమించలేదు. ఈ నేపథ్యంలో అభ్యుదయ భావాలతో కూడిన సాంఘిక నాటకాలు ప్రజా చైతన్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించినాయి.
1922లో పలనాటి సీమలో జన్మించిన తిరునగరి రామాంజనేయులు నల్లగొండ జిల్లా చిలుకూరు గ్రామానికి ఇల్లరికం అల్లుడుగా వచ్చినారు. ప్రజలను చైతన్య కార్యోన్ముఖులుగా మలచడానికి తిరునగరి ఇతర సాహిత్య ప్రక్రియలతో పాటు నాటకాలను సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు. సమకాలీన తెలంగాణ సమాజంలో వేళ్ళూనుకు పోయిన వెట్టిచాకిరికి వ్యతిరేకంగా "వెట్టి చాకిరి" అనే పేరుతో వీధి నాటకాన్ని రచించి ప్రదర్శించినారు. దేశంలో వెలువడిన తొలి ఆధునిక వీధి నాటిక ఇదే అని నాటక పరిశోధకులు పేర్కొన్నారు.6 గ్రామాల్లో పోరాట యోధులు సంచరిస్తున్నప్పుడు మహిళలు వారిని గౌరవించే సందర్భాలను గమనించిన తిరునగరి "వీర కుంకుమ" నాటికను రచించినారు. నాటి తెలంగాణ రాజకీయ సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని "తెలంగాణ నాటకం" అనే పేరుతో నాటకాన్ని రచించి ప్రదర్శించినారు.
వరంగల్లుకు చెందిన పొట్లపల్లి రామారావు కథలు కవిత్వంతో పాటు నాటికలను కూడా రచించారు నిజాం ప్రభుత్వ పాలనా విధానాల నిండగడుతూ సామాన్య ప్రజల దుర్భరమైన బతుకు వెతకలను ఆవిష్కరిస్తూ "పగ", "సరబరాహి", "న్యాయం" అనే నాటికలను రచించినారు. 1945 ప్రాంతంలో వెలువడిన ఈనాటికల్లో దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లు, వెట్టిచాకిరి మొదలైన అంశాలు కనిపిస్తాయి. సంఘం నాయకత్వంలో బాధిత ప్రజలందరూ ఒక్కటి కావడం, భూస్వామ్య విధానాలను ప్రశ్నిస్తూ తిరుగుబాటు చేయడం "పగ" నాటికలోని ఇతివృత్తం. పేద రైతు పేరమ్మ బర్రెను ఊరి దొర దౌర్జన్యంగా తన దొడ్లు కట్టించేయడం బర్రె తాళ్ళను తెంపుకొని పేరమ్మ దగ్గరకు చేరడం "సరబరాహి" నాటకంలోని కథావస్తువు. దౌర్జన్యాలు చేస్తే తిరుగుబాటు వల్ల భంగపాటు జరుగుతుందనే నగ్న సత్యాన్ని ప్రతీకాత్మకంగా ఈ నాటికలో ఆవిష్కరించినారు.
బి.వి. శ్యామరాజు అనే నాటక రచయిత తాను రచించిన కీచక వధ నాటకంలో ద్రౌపది పాత్రను తెలుగు భాషా సంస్కృతులకు ప్రతీకగా, కీచుకుని పాత్రను నిజాం రాజు మనస్తత్వానికి ప్రతీకాత్మకంగాతీర్చిదిద్దినాడు.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఇతివృత్తంగా స్వీకరించి తెలంగాణేతరులు కూడా నాటకాలను రచించినారు. 1947లో సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రచించిన "మాభూమి" నాటకం అత్యంతప్రజాదరణ పొందింది. ఈ నాటకం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిలువుటద్దం అని చెప్పవచ్చు. "పాత్రల సంభాషణ దీర్ఘము కాక, కథాగమనానికి తోడ్పడుట, పద్యాలు లేకపోవుట, పాటలు నలుగురు కలిసి పాడేటట్లుగా ఉండుట, భాష అందరికీ తెలిసేటట్లు ఉండుట 'మాభూమి' నాటకంలోని మంచి గుణాలుగా గొర్రెపాటి వెంకటసుబ్బయ్య అభ్యుదయ (1947) పత్రికలో తెలియపరిచారు.7 సామాన్య జనానికి అర్థమయ్యే రీతిలో సంభాషణలు, పాటలు ఉండడమే ప్రజల్లో ఉవ్వెత్తున చైతన్యాన్ని కలిగించడానికి కారణమయ్యింది. వాసిరెడ్డి, సుంకరలు విడివిడిగా "పోతుగడ్డ", "గెరిల్లా" అనే నాటిక, నాటకాలను రచించినారు. ఆనాటి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆనాటి నాటకాల్లో ప్రతిబింబించినారు.
7. జాతీయ ఉద్యమనేపథ్యం:
తెలంగాణలో ఆంగ్లయ ప్రభుత్వం లేదు. నిజాం సర్కారు పాలనలో ఉంది. ఈ కారణంగా ఇక్కడ భారత జాతీయోద్యమ సంఘటనలు లేవు. కాని పొరుగు తెలుగు నేలలో జరుగుతున్న జాతీయోద్యమానికి సంఘీభావంగా ఇక్కడి రచయితలు జాతీయోద్యమ సాహిత్యాన్ని సృష్టించినారు.
తొలి తరంలోని సాంఘిక ప్రయోజనాలతో పాటు దేశభక్తి భావాలతో కూడిన నాటక రచనలు వెలవడడం ఈ నేల యొక్క జాగృత చైతన్య స్వభావాన్ని తెలుపుతుంది. ఇనగుర్తి గ్రామానికి చెందిన వొద్దిరాజు సోదరులు బహుముఖ ప్రతిభావంతులు. వీరు జాతీయ భావ ప్రపూరితంగా "రాణా ప్రతాప సింహ చరిత్ర" అనే చారిత్రక నాటకాన్ని రచించినారు.
తెలంగాణలో స్థిరపడిన ధూపాటి వెంకట రమణాచార్యులు పౌరాణిక నాటకాలతో పాటు "పాదుకాపట్టాభిషేకము" అనే చారిత్రక నాటకాన్ని రచించినారు. ఛత్రపతి శివాజీ అతని గురువు సమర్ధ రామదాసు కు చెందిన జీవిత సంఘటనల ఆధారంగా జాతీయ భావాలను వ్యక్తీకరిస్తూ ఈ నాటకాన్ని రచించినారు.
వరంగల్ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన మోతుకూరి మధుసూదన్ రావు సంస్కరణ భావాలతో గాంధేయవాద జీవితాన్ని గడిపిన వ్యక్తి కథను "సార్థకం జీవి"అనే నాటకంలో చిత్రించినారు. పొట్లపల్లి రామారావు కూడా గాంధేయ వాద స్ఫూర్తితో జాతీయ నాయకుల పై అభిమానాన్ని ప్రదర్శిస్తూ "పాద ధూళి" అనే నాటికను వెలువరించినారు. నల్లగొండ జిల్లాకు చెందిన గవ్వా జానకిరామిరెడ్డి "దేశ బంధు" అనే పేరుతో మూడు అంకాల నాటకాన్ని రచించినారు.
భద్రాచలం ప్రాంతంలోని దుమ్ముగూడెం గ్రామానికి చెందిన సోమరాజు రామానుజరావు "తిలక్ రాయబారం", "స్వరాజ్యరథం", "ప్రచండ బొబ్బిలి" అనే నాటకాలను రచించినారు. ఐదు అంకాల "స్వరాజ్యరథం" అనే నాటకంలో ఒక్కో అంకానికి ఒక్కో పేరును నిర్ణయించినారు. నాటకంలోని పాత్రలు భారత స్వాతంత్ర సమరయోధులైన దేశభక్తులతో పాటు పౌరాణిక పాత్రలు కూడా ఉన్నాయి. సమకాలీన వ్యక్తులను నాటక పాత్రలుగా తీర్చిదిద్ది సమకాలీన సామాజికాంశాలను వస్తువుగా స్వీకరించి నాటక రచన చేసిన సోమరాజు రామానుజరావు నాటకాలు బహుళ ప్రజాదరణను పొందినాయి.
8. జాతీయాభిమాననేపథ్యం:
తెలంగాణ భారత దేశంలో అంతర్భాగంగా విలీనమైన తర్వాత ఇక్కడ రచయితలు జాతీయాభిమాన దృక్పథంతో పుంఖానుపుంఖాలుగా రచనలు వెలువరించినారు. నాటకాలు కూడా ఎక్కువగానే వెలువడినాయి. జాతీయవాద భావజాలంలో భాగంగా చారిత్రిక పురుషులను, జాతీయ నాయకులను, చారిత్రక ప్రదేశాలను వస్తువుగా స్వీకరించి నాటకాలను వెలవరించినారు.
నా తెలంగాణ కోటి రత్నాలవీణ అని నినదించి తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని ఘనంగా కొనియాడిన మహాకవి దాశరథి కూడా నాటికలు రచించినారు రుద్రమదేవి పాలన సాహస వీర పరాక్రమాల ఆధారంగా "ఏకశిల" నాటకాన్ని విశ్వశాంతి కోసం బుద్ధ భగవానుడు అనుభవించిన ఆవేదనను మూలంగా చేసుకొని "మహాబోధి" నాటకాన్ని రచించినారు. జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన డాక్టర్ సి.నారాయణరెడ్డి గేయ నాటికలే కాకుండా వచన నాటికలు కూడా రచించినాడు. కాకతీయ చక్రవర్తులు నిర్మించిన రామప్ప దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ఇతివృత్తంతో ముఖ్యంగా నాగిని విగ్రహాన్ని ఆధారంగా చేసుకుని "రామప్ప" అనే రస రమ్యమైన నాటికను రచించినాడు. జాతీయ స్థాయిలో ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ నాటికకు జాతీయస్థాయి ఉత్తమ నాటికగా బహుమతి లభించింది.
చైనా యుద్ధ సమయంలో ధర్మపురికి చెందిన విశ్వనాథ శాస్త్రి "జయం మనదే" అనే నాటకాన్ని రచించి ప్రదర్శించినారు.8 కోవెల సంపత్ కుమారాచార్యులు "అమరశిల్పి" అనే పేరుతో చారిత్రక నాటకాన్ని రచించినారు. కాకతీయుల కళా ప్రియత్వాన్ని శిల్పుల శిల్పకళా చాతర్యాన్ని శిల్పకళా వైభవాన్ని ఈ నాటకంలో ప్రస్ఫుటింపజేసినారు. వరంగల్ ప్రాంతంలోని అడ్లూరి అయోధ్య రామయ్య "రుద్రమదేవి" అనే చారిత్రక నాటకాన్ని రచించినారు. కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింప జేసి మహా వైభవాన్ని పెంపొందింపజేసిన రుద్రమదేవి యొక్క శౌర్య పరాక్రమాదులను తెలుపుతూ స్త్రీ అబలగా కాకుండా సబలగా నిలబడాలని, అదేవిధంగా నిత్యజీవితంలోనూ ధైర్యంగా వ్యవహరించాలని స్త్రీ అభ్యుదయాన్ని కాంక్షిస్తూ ఈ నాటకాన్ని రచించినారు. గాంధీ మార్గమే శరణ్యం అంటూ వడ్డేపల్లి కృష్ణ "శాంతి సందేశం" నాటికను రచించినారు.
9. విప్లవ దృక్పథ నేపథ్యం:
విప్లవ భావాలకు అనుగుణంగా, ప్రజా చైతన్య స్ఫూర్తిగా ఈ తెలంగాణ ప్రాంతంలో నాటకాలు వచ్చినాయి. సమకాలీన సామాజికాంశాలను వస్తువుగా చేసుకుని పాతిక పైగా నాటకాలను రచించి ప్రదర్శించి ప్రదాదరణ పొందిన రచయిత కోదాటి లక్ష్మీనరసింహారావు. ఈయన స్వగ్రామంలో గ్రామ వెలుగు నాట్యమండలి స్థాపించి ప్రజల్లో నాటకాభివృద్ధి పెరగడానికి దోహదపడినారు. ఉద్యమ నేపథ్యంలో కోదాటి రచించిన "భారతి" నాటకం నాటక రంగంలో పెను సంచలనాన్ని కలిగించింది. నల్లగొండకు చెందిన చెరబండరాజు విప్లవ భావజాలంతో "గంజినీళ్లు", "గ్రామాలు మేల్కొంటున్నాయి" అనే నాటకాలను, "టెంపరరీ లేబర్", "పల్లె పిలుస్తోంది", "వెన్నెల్లో మంటలు", "సంఘర్షణ" అనే నాటికలను రచించినారు. ఉద్యమ నేపథ్యంలో అల్లం రాజయ్య "నాగేటి చాళ్లల్లో" అనే నాటికను రచించినారు. ఈయనే తుమ్మేటి రఘోత్తమ రెడ్డి తో కలిసి "బొగ్గు పొరల్లో" అనే నాటికను రచించినారు. ఈ సమయంలో "ప్రజానాట్యమండలి" మరియు "అరుణోదయ నాట్యమండలి" అనే పేరుతో విప్లవకారులు కళాకారులతో కలిసి వివిధ ప్రదర్శనలు ఇచ్చి ప్రజల్లో విప్లవ భావజాల చైతన్యాన్ని కలిగించినారు. ఆ సందర్భంలో పలువురు అజ్ఞాత రచయితలు విప్లవ భావాలతో నాటకాలను ప్రదర్శించినారు.
10. సామాజిక స్పృహ/రాజకీయ వ్యంగ్య నేపథ్యం:
సమాజాభివృద్ధికి తోడ్పడాల్సిన రాజకీయాలు స్వార్థపరం కావడంతో సమాజవికాసం కుంటుపడింది. ఈ వ్యవస్థను వ్యంగ్యంగా విమర్శిస్తూ విస్తృతమైన నాటక రచనలు వెలువడినాయి. పివి రమణ "చలిచీమలు", వనం మధుసూదన్ "అమ్మమ్మో గాంధీ బ్రతికాడు", "భారతి కళ్ళు తెరిచింది", శశిమోహన్ "కోహినూర్", "ఫర్ సేల్" మొదలైన నాటకాలు విస్తృత ప్రదర్శనతో ప్రజలను అలరించినాయి. ఈ విధమైన ఇతివృత్తాలతో తనికెళ్ల భరణి "నాలుగో కోతి" నాటకం, "గొయ్యి", "గార్డభాండం", "భేకం బాక", "కొక్కరోకో", "చల్ చల్ గుర్రం", "గోగ్రహణం", "జంబూద్వీపం" మొదలైన నాటికలను రచించినాడు. రాజకీయ వ్యవస్థను ఎండగట్టే విధంగా రచించిన "గార్దభాండం" మొదలైన నాటికలు అత్యంత ప్రజాదరణ పొందినాయి. ప్రయోగ వైవిధ్య భరితంగా నాటకాలు రచించిన వారిలో తనికెళ్ల భరణితో పాటు ఏ ఆర్ కృష్ణ, ఎస్ కే ఆంజనేయులు ప్రసిద్ధి చెందినారు.
11. ముగింపు:
తెలంగాణ తెలుగు నాటక సాహిత్యాన్ని పరిశీలిస్తే విస్తృతమైన నాటకాలు వెలువడినాయని ఇక్కడ ప్రదర్శనలకు ప్రజాదరణ ఉండేదని తెలుస్తుంది. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ప్రజలను చైతన్యపరిచి ప్రజా ఉద్యమాలను ముందుకు నడిపించడంలో నాటక రంగ పాత్ర మరువలేనిది. సాంఘిక నాటకాల ప్రదర్శనలు పెరిగిన సమయంలో నాటక సాహిత్యంలో ప్రదర్శనలో కొత్త కొత్త ప్రయోగాలు కొత్త కొత్త ధోరణలు ఏర్పడినాయి. సమకాలీన సామాజికాంశాలను రాజకీయాంశాలను సున్నితమైన హాస్య వ్యంగ్య ధోరణిలో ప్రదర్శించినారు. హైదరాబాదులోని నాటక సమాజాలు రంగస్థల నిర్వహణాపరంగా కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టినాయి. ఏ ఆర్ కృష్ణ, ఎస్ కే ఆంజనేయులు, తనికెళ్ల భరణి మొదలైన వారి ప్రయోగాల వల్ల నాటక రంగంలో కొత్త ఒరవడి ఏర్పడింది. హైదరాబాదులోనే కాకుండా జిల్లా స్థాయిలో తాలూకా ప్రాంతాలలో వివిధ రకాల నాటక సమాజాలు ఏర్పడినాయి. ఆయా నాటక సమాజాలు ప్రదర్శించిన నాటకాలు కేవలం చైతన్య వినోదాల కోసమే కాని వ్యాపార పర మైనవి కావు. తెలంగాణలో వృత్తి నాటక సమాజాలు లేవు. ఇక్కడి కళాకారులు వ్యాపార దృక్పథం తో కాంట్రాక్టు పద్ధతిలో నాటకాలను ప్రదర్శించలేదు. నటులు నాటక సమాజాల వారు ఉత్సవాలు, జాతరలు పాఠశాల, కళాశాల వార్షికోత్సవాల సందర్భంగా నాటకాలను ప్రదర్శించుట సర్వసాధారణం.
అతి భారీ పెట్టుబడులతో వ్యాపార దృక్పథం తో నిర్మిస్తున్న సినిమాలు టీవీ ధారావాహిక ల కారణంగా ఈ రోజులలో సాంకేతికంగా వెనుకబడినటువంటి నాటక కళా ప్రదర్శనలు మెల్లమెల్లగా తెరమరుగైపోవడం శోచనీయమైన విషయం. కేవలం నాటక పోటీలలో మాత్రమే నాటకాలు ప్రదర్శితం అవుతున్నాయి. ఔత్సాహికంగా ప్రదర్శించడానికి ఎవరు ఆసక్తి చూపలేకపోతున్నారు. ఇది నాటక కళారంగానికి మంచి పరిణామం కాదు. భవిష్యత్తులో మళ్లీ నాటక ప్రదర్శనలు పుంజుకుంటాయని, తద్వారా ఉత్తమ నాటక సాహిత్యం వెలువడుతుందని, నాటక సాహిత్య ప్రభావంతో ప్రజలు సద్భావనా చైతన్య ప్రపూరితులవుతారని ఆశిద్దాం.
12. పాదసూచికలు:
- "..... నటుగాక సాంగ భాషాంగ క్రియాంగ
పటు నాటకంబుల నటించువారు" (బసవ పురాణము, సోమనాథుడు పాల్కురికి, పుట. 124) - "ప్రమథ పురాతన పటు చరిత్రములఁ
గ్ర మ మొంద బహు నాటకములాడువారు" - పండితారాధ్య చరిత్ర, సోమనాథుడు పాల్కురికి, పుట. 256 - "....వెండియు భవు బహువిధ చరిత్రములు
ఖండగతిని నాటకంబులాడుచును" - పండితారాధ్య చరిత్ర, సోమనాథుడు పాల్కురికి, పుట. 258 - "లెస్సగాక కిరాట ఈ లేమ చరిత
మాడుదురు నాటకంబుగ నవని లోన" - క్రీడాభిరామము, వల్లభ రాయుడు వినుకొండ, పుట 58 - కాలరేఖ, శేషేంద్ర శర్మ గుంటూరు, పుట. 125
- తెలంగాణ సాహిత్య వికాసం, శ్రీనివాస్ కే, పుట. 226
- నాటక విజ్ఞాన సర్వస్వం, రమణ పివి, పుట. 522
- తెలుగు నాటక సాహిత్య విమర్శ పరిణామం, కిషన్ ప్రసాద్ గంగు, పుట. 105
- శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి ధర్మపురి, అశీతి మహోత్సవ సంచిక, నరసయ్య సంగనభట్ల, పుట. 69
13. ఉపయుక్తగ్రంథసూచి:
- కామేశ్వరి బి ఎస్, (అక్టోబర్ 2001),తెలంగాణ పోరాట నాటకాలు నాటికలు, వరంగల్,
- కిషన్ ప్రసాద్ గంగు, (ఫిబ్రవరి 2000), తెలుగు నాటక సాహిత్య విమర్శ పరిణామం, రమ్య పబ్లికేషన్స్, వరంగల్,
- చక్రధర స్వామి తిరుణహరి, (2009), తెలంగాణ నాటక వికాసం, వరంగల్
- “తెలుగు నాటకం – వెలుగునీడలు”, ఆదివారం దినపత్రిక, 15 ఏప్రిల్ 2001
- నరసయ్య సంగనభట్ల, (ఏప్రిల్ 2017), శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి ధర్మపురి అశీతి మహోత్సవ సంచిక, శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి ప్రచురణలు, ధర్మపురి
- ప్రతాపరెడ్డి సురవరం, (1934),గోలకొండ కవుల సంచిక, గోల్కొండ ముద్రణాలయం, హైదరాబాద్
- రమణ పివి, (2008), నాటక విజ్ఞాన సర్వస్వం ఎనిమిదవ సంపుటం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్
- లక్ష్మీనారాయణ పెనుగొండ, (జూన్ 2011), రూపిక నాటక రంగ విశేష సంచిక, అరవింద ఆర్ట్స్, తాడేపల్లి
- వల్లభ రాయుడు వినుకొండ, (1960), క్రీడాభిరామం, అజంతా ప్రింటర్స్, సికింద్రాబాద్
- శేషేంద్ర శర్మ గుంటూరు, (1990), కాల రేఖ, తెలుగు అకాడమీ, హైదరాబాద్
- శ్రీనివాస్ కే, (డిసెంబర్ 2015), తెలంగాణ సాహిత్య వికాసం ఆధునికత వైపు సొంత అడుగులు తెలంగాణ ప్రచురణలు హైదరాబాద్
- సుబ్బరామిరెడ్డి గండవరం, (సెప్టెంబర్ 1991), ఆధునిక తెలుగు నాటకం, ప్రవీణ్ ప్రచురణలు, సికింద్రాబాద్
- సోమనాథుడు పాల్కురికి, (మార్చి 1990), పండితారాధ్య చరిత్ర, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్
- సోమనాథుడు పాల్కురికి, తిరుపతి (2013), బసవ పురాణము, శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి వాఙ్మయ పీఠం మరియు తిరుమల తిరుపతి దేవస్థానములు
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

