headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-10 | September 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

3. పిపీలికం కథ : సామాజిక చైతన్యం

డా. కంకిపాటి రాజా

చోడవరం గ్రామం,
కొండేపి మండలం,
ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9948075858, Email: kamkipatirajasinger@gmail.com
Download PDF


సమర్పణ (D.O.S): 22.08.2024        ఎంపిక (D.O.A): 30.08.2024        ప్రచురణ (D.O.P): 01.09.2024


వ్యాససంగ్రహం:

రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావిశాస్త్రి) కాలం 30-07-1922-10-11-1993. ఈయన మార్క్సిష్టు భావరచయిత. ఆధునికకథకు దారిదీపాలుగా వెలుగొందుతున్న శ్రీశ్రీ, కారా, బుచ్చిబాబు మున్నగువారిలో రావిశాస్త్రి ఒకరు. 1960లో కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి పొందారు. పిపీలికం కథతోబాటు షోకుపిల్లి, పులిపూజ, విలువలు, మెరుపు మెరిసింది, నీడలు మొదలైన ఎన్నో కథలు, కథాసంపుటులు వెలువరించారు. చివరికి మిగిలేది నవలతో చైతన్యశ్రవంతికి శ్రీకారం చుట్టారు. ఇటీవల రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనాసాగరం (సర్వలభ్య రచనల సంపుటం) పేరుతో మనసు ఫౌండేషన్‌వారు వివిన మూర్తి, ఎం.వి. రాయుడు సంపాదకత్వంలో ఆయన రచనలన్నీ ప్రచురించారు. రావిశాస్త్రి పిపీలికం కథను 1969లో ప్రతీకాత్మక ధోరణిలో రచించారు. ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని, 22-07-2022న సాక్షి దినపత్రిక ఈ కథను ప్రచురించింది. పంచతంత్రం కథల తరువాత ఆధునిక కాలంలో వచ్చిన ప్రతీకాత్మక కథల్లో పిపీలికం చాలా ప్రసిద్ధి చెందింది. ఒక విషయాన్ని చెప్పడానికి వేరొక భావాన్నో, వస్తువునో జంతువునో ఉపయోగించి మాట్లాడడమే ప్రతీకవాదం. ఈకథలోని శ్రమదోపిడీ, మానవ మనుగడ, చైతన్యం, తిరుగుబాటు మొదలైన సామ్యవాద అంశాలను చారిత్రక దృక్కోణంలో విశ్లేషించి, సామాజిక విలువలను వెలికి తీయడం ఈ పత్ర ఉద్దేశం. ఈ వ్యాసాన్ని 1. పిపీలికం కథా సారాంశం, 3. పిపీలికం తాత్త్విక చింతన, 3. విద్యా విలువలు, 5. బలవంతుల దౌర్జన్యం, 6. సామాజిక చైతన్యం, విజయం, 7. ముగింపు అనే ఉపశీర్షికలుగా విభజించి, చర్చించడం జరిగింది. ఈ వ్యాసం ద్వారా 1. రావిశాస్త్రిగారి సామాజిక దృక్పథాన్ని చదువరులు అవగాహన చేసుకుంటారు. 2. సామ్యవాదభావాలను అర్థం చేసుకుంటారు. 3. మనదేశంలో విద్యాపరమైన దోపిడి విధానాన్ని పఠితలు గమనించగలరు. 4. ప్రజలు సామాజికంగా చైతన్యవంతం కావడానికి మార్గాన్వేషణ జరుగుతుంది.

Keywords: పిపీలికం, సామ్యవాదం, దారిదీపాలు, సోహం, చైతన్యం

1. పరిచయం:

రావిశాస్త్రిగా ప్రసిద్ధి చెందిన రాచకొండ విశ్వనాథశాస్త్రి 30-07-1922‌లో జన్మించారు. 10-11-1993‌లో మరణించారు. ఆయన రెండవ ప్రపంచ యుద్ధ సమకాలీన రచయిత.1949 నుండి రచనావ్యాసంగం ప్రారంభించారు. మార్క్సిస్టు భావాలననుసరించారు. ఆధునిక తెలుగు కథా దారిదీపాలుగా చెప్పుకోదగ్గ గురజాడ, శ్రీశ్రీ, కొకు, బుచ్చిబాబు, కారా, చాసో లాంటి ప్రసిద్ధ రచయితల్లో ఈయన ఒకరు.
రావిశాస్త్రి ప్రముఖ కథా రచయిత, నవలాకారుడు. ఆయన 1960లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందారు. పిపీలికం,The Smoking Tiger(పులిపూజ), షోకుపిల్లి, విలువలు, నీడలు, మెరుపు మెరిసింది, ఝరీ అంచు తెల్లచీర నమూనా కథ,ఆరు సారా కథలు, ద్వైతాద్వైతం, మంచి చెడ్డలు, వెన్నెల, బుద్బుదం, వేతనశర్మ కథ, రవ్వ, రొట్టెముక్క మొదలైన ఎన్నో కథలు, కథాసంపుటులు వెలువరించారు. తెలుగు సాహిత్యంలో అల్పజీవి నవలతో చైతన్య స్రవంతి రచనా పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఆయన పూర్తికాని నవలలు-రత్తాలూ రాంబాబు, రాజు మహిషి.

రావిశాస్త్రి రచయిత మాత్రమే కాకుండా మంచి నటుడు కూడా. నిజం, కన్యాశుల్కం నాటకాలలో నటించి, మెప్పించారు. తనకథలను 1967లో ఒక సంపుటిగా ప్రచురించారు. ఇటీవల రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనాసాగరం (సర్వలభ్య రచనల సంపుటం) పేరుతో మనసు ఫౌండేషన్‌వారు శ్రీ వివినమూర్తి, ఎం. వి. రాయుడు సంపాదకత్వంలో ఆయన రచనలన్నీ ప్రచురించారు. రావిశాస్త్రిరచించిన బాకీ కథల్లో ప్రసిద్ధమైన కథ పిపీలికం. ఈ కథను 1969వ సంవత్సరంలో ప్రతీకాత్మక ధోరణిలో ఉత్తమపురుషలో రచించారు. రావిశాస్త్రి శతజయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 24, 2022న ఈ కథను సాక్షి దినపత్రిక ఫండేలో ప్రచురించింది.

2. పరిశోధనాపత్ర ఉద్దేశం:

పంచతంత్రం కథల తరువాత ఆధునిక కాలంలో వచ్చిన ప్రతీకాత్మక కథల్లో పిపీలికం చాలా ప్రసిద్ధి చెందింది. ఒక విషయాన్ని చెప్పడానికిఒక భావానికి బదులుగా వేరొక భావాన్నో, వ్యక్తినో, జంతువునో, పక్షినో, ఏదైనా వస్తువులనో ప్రయోగించి, వాటిద్వారా మాట్లాడడాన్నే ప్రతీకవాదం అంటారు. ఈకథలోని శ్రమదోపిడీ,మానవ మనుగడ, చైతన్యం, తిరుగుబాటు మొదలైన సామ్యవాద అంశాలను చారిత్రక దృక్కోణంలో విశ్లేషించి, సామాజిక విలువలను వెలికి తీయడం ఈ పత్ర ఉద్దేశం.

3. కథాసారాంశం:

కృతయుగంలో గౌతమీ నదికి ఉత్తరంగా శామవనంలో మర్రిచెట్టు కింద చీమలపుట్ట ఉంది. అందులోని ఒక చీమకు తానెవరు? కళ్ళా, కాళ్ళా, తలా, మొండెమా, తిండినా, ఆలోచించే శక్తినా, పుట్టడం, జీవించడం, చావడం, ఎందుకు? చచ్చి ఏమవుతాను?లాంటి ప్రశ్నలతో ఆరోగ్యం పాడై, తల చీమంత చెడింది. సాటి చీమ సలహాతో గోపన్నపాలెంలోని నిగమశర్మ దగ్గరకు వెళ్ళి, గిద్దెడు బియ్యం ఫీజుతో విద్య నేర్చుకుంది. తాను చీమనని తెలుసుకుంది. శామవనంలో తోటి చీమలతో చీమలపండుగ జరుపుకుంది.

కొన్నాళ్ళకి మరిన్ని సందేహాలతో పాతగురువు సలహాతోజన్నాలపల్లె అనే అగ్రహారంలోని చతుర్వేది అనే బ్రాహ్మణుడి దగ్గరకు జ్ఞానభిక్షకోసం పోయింది. మంత్రజల దీక్షతో బ్రాహ్మణ్యంలోకి మారింది. తాను మోయగలిగినంత బంగారం రోజువారీ ఫీజుతో సంవత్సరాలతరబడి శ్రమించింది. ఈ అధ్యయనమంతాసోహం అనే మాటలో ఉందని తెలుసుకుంది.

చీమ సంపాదించిన జ్ఞానంతో బ్రతుకులో తేడా లేకపోయేసరికి నీరసించిపోయింది. ఇంకొక చీమ సలహాతో ఈ సారి మహర్షిని కలిసింది. ‘నాలో భగవంతుడు ఉంటే నేను భిన్నంగా ఎందుకు ఉన్నాను, నాలో ఆయన లేకపోతే సర్వాంతర్యామి కానట్టేకదా, అతడు నాలో ఉంటే పాప ఖర్మల ఫలితం నేనెందుకు అనుభవించాలి, భగవంతుడు కూడా పాపంనుండి తప్పించుకోలేడా’? అని తన గోడును సంస్కృత పదాలతో వెళ్ళబుచ్చింది. ఆ మహర్షి సోహం అంటే యోగం ద్వారా తపస్సు చేసి, మోక్షం పొందమన్నారు. జన్మరాహిత్యం, మోక్షం ఎందుకు అనే చీమ ప్రశ్నకు సమాధానం చెప్పలేక అలాగే మౌనముద్రలో ఉండిపోయారు. కొంతసేపటికి ఆయన సమాధానం చెప్పరని నిశ్చయించుకొని, ఏడుకొండలు దాటి, నెలరోజులకు భానూదయాన తన పుట్ట దగ్గరకు చేరుకుంది.

ఆ పుట్టలోనుంచి పారిపోయి వస్తున్న చీమల ద్వారా పాము ఉన్న విషయాన్ని తెలుసుకుంది. తన వివేకంతోఆ చీమలన్నిటినీ ఆపి, ఆ పుట్టలోకి పోయి,ఇది అన్యాయం కాదా అని పామును గౌరవపూర్వకంగానే అడిగింది. ఆ పాము ద్వారా కష్టజీవులు కష్టపడాలి, సుఖభోగులు సుఖించాలనే నిజాన్ని తెలుసుకొని, ఆ భగవన్యాయాన్ని తన తోటి చీమలతో ఎదిరించింది. ఆ పామును చీమల సహాయంతో కుట్టి నెత్తురు కక్కుకొని చచ్చేలా చేసింది.

4. పిపీలికం (చీమ) తాత్త్విక చింతన:

పిపీలికం కథ బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతి అనే వాక్యానికి అతికినట్లు సరిపోతుంది. ఈ కథలో పిపీలికంమనిషికి ప్రతీక. మనకు నిముషానికి 30000కు పైగా ఆలోచనలు వస్తుంటాయని మేధావులు, తత్త్వవేత్తలు చెప్పారు. వాటిలో చికాకుపెట్టే తాత్త్విక ప్రశ్నలు ఉండవచ్చు. అలాంటి ఆలోచనలతోనేపిపీలికం మిగిలిన చీమల హెచ్చరికలను ఖాతరు చేయలేదు. “‘పని చేయని ప్రాణులు చెడిపోతాయిసుమా!’ అని అవి దాన్ని హెచ్చరించేయిట”. (పిపీలికం. పుట:822) చీమలు శ్రమకు నిదర్శనం. బైబిల్‌లోని సామెతల్లో ‘చీమల దగ్గర కష్టించడం నేర్చుకోవాల’ని ఉంది.‘Empty mind is a devils workshop’ అని ఆంగ్లంలో సామెత ఉంది. ఇవన్నీ శ్రమ ప్రాధాన్యాన్ని తెలుపుతున్నాయి. పిపీలికం నేర్చుకున్న సోహం గురించి వివేకానందుడు “It is to abuses to Evaluated to be the Religion of the Masses.” (వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. 2007:47) అన్నారు. పిపీలికానికి వచ్చిన ఆలోచనలు మంచివే. కానీ వాటివల్ల ప్రస్తుత ప్రయోజనాన్ని విస్మరిస్తే లేనిపోని అనర్థాలు తారసిస్తాయి.

5. విద్యావిలువలు:

ప్రస్తుత సమాజంలో విద్య చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇది కృతయుగం నుండికొనసాగుతోంది. ఆ కాలంలో విద్యార్థులకు బ్రాహ్మణులు విద్య నేర్పిస్తే, సమాజం వారిని పోషించేది.

“గోపన్నపాలెపుగోపకుమారుల్లో కొంతమందికి విద్యాభ్యాసం చేయాలనే వాంఛ కలిగినపుడు ‘ఆలమందలు కాసుకొనేవాళ్లకి ఓనమాలెందుకురా!’ అని వారిని నిగమశర్మ లోగడ నిరుత్సాహపరిచేవాడుట”. (పిపీలికం. పుట:823)

అందువల్ల ఆ ఊళ్ళో గిద్దెడు నూకలు కూడా సంపాదించుకోలేని దుస్థితికి నిగమశర్మ జారిపోయాడు.

పిపీలికంవేదం నేర్చుకోవడానికి చతుర్వేది మంత్రజలంతో బ్రాహ్మణ దీక్ష ఇచ్చాడు.

“మంత్రజలం జల్లి, ఆ చీమని శుద్ధిచేసి దానికి బ్రాహ్మణ్యం ఇప్పించేరట”. (పిపీలికం. పుట:824)

‘క్రీ.పూ. హిందూమతంలోని యజ్ఞయాగాదులు, నియమ నిష్ఠలను తట్టుకోలేక ప్రజలు బౌద్ధ, జైన మతాలను స్వీకరించారు. ఆ మతాలవిస్తరణకు తాళలేక కొందరు పండితులు శుద్ధి విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం హిందూమతంలోనుండి బయటకు వెళ్ళినవారు దీక్ష సాయంతో మరల తిరిగి రావచ్చు. మరికొందరు పండితులు ఆ మతస్థాపకులు కూడా విష్ణు అవతారాలేనని ప్రచారం చేశారు. ఆచార్య నాగార్జునుడులాంటి పండితులు ఒకవిధంగా ఆ మతాల నిర్వీర్యానికి కారకులయ్యారు’. (చూ. ఆర్.ఎస్. శర్మ రాసిన ప్రాచీన భారతదేశ చరిత్ర). అన్నమయ్య లాంటివారు తమ కీర్తనల్లో బుద్ధుడికి వైష్ణవావతారాన్ని ఆపాదించి, రచనలు చేశారు. ఆధునిక కాలంలో దయానంద సరస్వతి ఆర్యసమాజం ద్వారా శుద్ధి విధానాన్ని అధికంగా ప్రచారం చేశారు. అలాగే క్రీ. శ. 712 నుండి ప్రారంభమైన ముస్లింల పాలనలో మతమార్పిళ్ళు ఎక్కువగా జరిగి, ముస్లింలలో అనేక వర్గాలు ఏర్పడ్డాయి. క్రీ. శ. 14వ శతాబ్దం నుండి క్రైస్తవ మత మార్పిళ్ళు అధికమయ్యాయి. ఆ విధంగా మత సంస్కరణలు ఘర్షణలకు దారి తీశాయి. అలాంటి పోకడలను రచయిత ఈ కథలో వ్యతిరేకించారు.

ప్రభుత్వాలు కులమత భేదాలు రూపుమాపడానికి ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా మనుషుల్లో మార్పు రాకపోతే ప్రయోజనం శూన్యం. పిపీలికం ఋషిని దేవభాషలో పిలిచింది.

“ఆ మహానుభావునికి వినయాతి వినయంగా వంగి నమస్కరించి వారిని మృదువుగా, వినయంగా సంస్కృత శబ్దాలతో పిలిచిందిట చీమ.” (పిపీలకం. పుట:824)

ఆ కాలంలో పండితులు నియమించిన ప్రమాణాలను చేరుకున్న వారికి మాత్రమే విద్యాభ్యాసం దొరికేది. పామరులకు చదువు మృగ్యమైంది.

ఈ కథలో ప్రస్తావించిన మరొక అంశం ఆకలి. నిగమశర్మ పాత్రను ఆకలికి తట్టుకోలేక, వృత్తిని వదలలేక మగ్గిపోయిన ఎంతోమంది గురువులకు ప్రతీకగా,బలహీనులైన చీమల్లాంటి మనుషుల కష్టాన్ని తినే పరాహారిగా చిత్రించారు. ఆయన అడిగిన గిద్దెడు నూకలతో ఆకలి తీరదు. కానీ ఏదో ఒక విధంగా ఆకలి తీర్చుకోవాలని తపించారు.

చతుర్వేది అనే బ్రాహ్మణుడు యజ్ఞయాగాదులు చేయడానికి విద్యార్థుల్ని పీల్చి పిప్పి చేసే పాత్రకు ప్రతీకగా చూపారు రావిశాస్త్రి. అందుకోసం విద్యాధనాన్ని వినియోగించుకున్నాడు. వీరికి సరైన విద్య రాకపోయినప్పటికీ సమాజంలో మంచి గురువులుగా చెలామణి కాగలిగారు.

1998వ సంవత్సరంలో ప్రైవేటు బడులు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాపనకు అనుమతి లభించింది. అప్పటినుండి ఆ యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేసి, తక్కువ జీతాలకు నైపుణ్యలేమి కలిగిన అధ్యాపకులను నియమించుకుంటున్నారు. అమర్త్యసేన్ లాంటి మేధావులు విద్య, వైద్యాలను మాత్రమే ఉచితంగా ఇవ్వాలని ప్రతిపాదించారు.

కోరుకున్న సంతృప్తికరమైన జీవనాన్ని పొందటానికి అవసరమైన సామర్థ్యాన్ని (Capability) విద్య, ఆరోగ్యం అందించి వారి స్వేచ్ఛ (Freedom)ను విస్తృతపరుస్తాయి. కాబట్టి ఆదాయంతో పాటు ప్రజలందరికి అవసరమైన మూలాధార విద్య, ఆరోగ్యాన్ని సమకూర్చడమే ప్రభుత్వాల ప్రథమ విధి”. (భారత ఆర్థిక వ్యవస్థ.2018:13)

ఎందుకంటే వైద్యం ఆరోగ్యాన్నిస్తే, విద్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. నేటి సమాజంలో అందుకు భిన్నంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.

ఆధునిక విద్య గురించి కవనశర్మ-

“ఉన్నత విద్యారంగం ఒక మేడిపండు. అది బయటకు తళతళలాడుతుంది. పొట్ట విప్పి చూస్తే పురుగులతో లుకలుకలాడుతుంది”. (వెంకటసుబ్బయ్య, వల్లంపాటి.2007:89) అన్నారు.

ఈ కథలోపిపీలికం గిద్దెడు నూకలు, మోయగలిగినంత బంగారాన్ని సమర్పించి, విద్య నేర్చుకుంది. ‘ప్రతిదినం నాకు ఓ గిద్దెడు నూకలియ్యి. అంతే చాలు! అందుకు సమ్మతిస్తివా, నేన్నీకు చెప్పగలను చదువు’ (పిపీలికం. పుట:823) ‘రేణువు రేణువు చొప్పున ఎంత తేగలిగితే అంతే తే! చాలు!’ (పిపీలికం. పుట:824) ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లల అభిష్టాలను పట్టించుకోకుండా విద్యకోసం సింహభాగం ధనం ఖర్చు చేస్తున్నారు. అందువల్ల విద్యార్థుల్లో విచ్చలవిడితనం, ఒత్తిడి పెరిగి, దేశంలో ఆత్మహత్యలు అధికమవుతున్నాయని ఇండియన్ స్టాటిస్టికల్ సర్వే తన వార్షిక నివేదికలో ప్రచురిస్తోంది.

నేటి సమాజంలో మనిషి బ్రతకడానికి విలువలతో కూడుకున్న విద్య చాలా అవసరం. విద్య చైతన్యాన్ని రగుల్కొల్పేలా ఉండాలి. మంచికోసం పోరాడేధైర్యాన్ని పెంపొందించాలి. జ్ఞానవంతమైన నాయకులను తయారు చేయగలగాలి. అప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమవుతుంది. ఈ కథలోపిపీలికానికి తక్కిన చీమల్ని ఉత్సాహపరచి, వివేకంతో మెలిగేలా చేయడానికి, వారికి సరైన నాయకుడిగా మారడానికి విద్య అవసరమైంది.

రాక్షస కోపానికి చీమ నాయకుడు చిరునవ్వు నవ్వుకొని, పట్టుదలతో పైకివెళ్లి సోదరులందరికీ హితబోధ చేసి, ధైర్యం చెప్పి, వారిని వీరులుగా మార్చి ‘రాక్షాసాకారపు భగవన్న్యాయం’ మీద తిరుగుబాటు చేసేందుకు అందర్నీ కూడగట్టుకొని ముందుకు రంగంలోకి ఉరికేడట.” (పిపీలికం. పుట:825)

6. బలవంతుల దౌర్జన్యం:

చరిత్రలో చెలరేగిన దాడులు యుద్ధాలన్నీ ఇతర రాజ్య సంపద దోపిడీకేనని చరిత్ర గతినిబట్టి తెలుసుకోవచ్చు. ఒకటవ, రెండవ ప్రపంచయుద్ధాలు, ప్రస్తుత కోల్డ్ వార్ ఇందుకు తార్కాణాలు. తమ వ్యాపార, సామ్రాజ్య విస్తృతికోసంబడుగు బలహీనుల కష్టాన్నీవారి సంపదను దోపిడీ చేసి, కొందరు లాభపడుతున్నారు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వాస్కోడగామా అనే పోర్చుగీసు వర్తకుడు తనకు దారి చెప్పలేదని అనేకమంది అరబ్బు హజ్ యాత్రికులను చంపి, వారి బంగారాన్నంతా దోచుకున్నాడు. కాలికట్‌లోని మిరియాల గూడెంలపై దాడిచేసి చాలామొత్తంలో భారతీయ మిరియాల సంపదను తీసుకెళ్ళగలిగాడు. కొందరు అతని చేష్టలకు తాళలేక సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మన దేశంపైకి దండెత్తిన ఘోరీ మొహమ్మద్ నుండి ఆంగ్లేయుల వరకూ ‘మీరు కష్టపడండి, మేమనుభవిస్తాం’ అనే ధోరణిని అనుసరించారు. “కష్టజీవులు కష్టపడాలి. సుఖభోగులు సుఖించాలి. అలా జరుగుతుందనేది ప్రకృతి ధర్మం”. (పిపీలికం. పుట:825)ఈ ధోరణి ప్రపంచ సమాజాలకు గొడ్డలిపెట్టుగా పరిణమిస్తోంది.

పాశ్చాత్య దేశాలు ఇతరుల ఆలోచనలను తమవిగా భావించి, తమబలంతో వారి హక్కులను కాలరాస్తున్నాయి. ఒక దేశంలో సమృద్ధిగా పండే ఆహారంపై వేరే దేశం పేటెంట్ హక్కును సంపాదిస్తుంది.

ఇది మీరు కష్టపడి కట్టుకున్న యిల్లే. బాగానే ఉంది. మీ నిర్మాణ కౌశలానికి ముగ్ధుణ్ణయేను. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. చాలు నీకది. పొండి! మరింక దీని సౌఖ్యం అనుభవించే భాగ్యం అంటారా? అది మాది!అది మా హక్కు.”

(పిపీలికం. పుట:825) 18వ శతాబ్దంలో ఒ.పి.ఎం. అమ్మకాన్ని నిషేధించినందుకు బ్రిటన్ చైనాతో యుద్ధం చేసింది. అమెరికాలాంటి దేశాలు అణ్వస్త్రాలను స్వార్థంతో, వ్యాపార దృష్టితోయుద్ధోన్మాద దేశాలకు అమ్ముతున్నాయి. ఇలాంటి చర్యలు ప్రపంచ వినాశనానికి కారణమవుతున్నాయి. వీటిని తక్షణమే నివారించాలి.

7. సామాజిక చైతన్యం, విజయం:

మానవ జీవితం పోరాటాలమయం. ఆదిమానవులు గుహలు, ఆహారం, వస్త్రాలు, వసతులకోసం సమూహాలుగా మారి వేరొక సమూహాలతో పోరాడారని చరిత్ర గతి చెబుతోంది. ఆధునిక కాలంలోఆంగ్లేయులు వ్యాపారంకోసం సామ్రాజ్యవాద కాంక్షాపరులై మిగిలిన రాజ్యాలను ఆక్రమించుకున్నారు. కానీ భారతీయులు సామాజికంగా చైతన్యవంతులై 200 సం.లకుపైగా పోరాడి, స్వాతంత్ర్యం సంపాదించారు. ఇదే పిపీలికం చేసింది. తోటి చీమలను ఉత్తేజపరచి, తన పుట్టను కాపాడుకోగలిగింది.

‘ఒరే రాక్షసాధముడా! మేం కష్టజీవులమే కావచ్చు నువ్వు సుఖభోగివే కావచ్చు. కాని నువ్వు మా కష్టాన్ని అపహరించి మాకు అన్యాయం చెయ్యడం మేం సహించం! మేం తిరగబడతాం! నువ్వు చెప్పిన న్యాయం భగవన్న్యాయమైనా సరే అది అన్యాయం కాబట్టి దాన్ని మేం మారుస్తాం!”. (పిపీలికం. పుట:825)

ఇక్కడ చీమకు ప్రేరణ కలిగించిన అంశం బలహీనులు కష్టపడుతుంటే, బలవంతులు దాన్ని అనుభవిస్తున్నారు. పైగా అది దైవిక న్యాయం, ప్రకృతి ధర్మమని ప్రజలను మభ్యపెడుతున్నారు. వివేకానందుడు బలహీనత గురించి పదేపదే ఇలా అన్నారు.

“If there is a sin in the world it is weakness; avoid all weakness, weakness is sin, weakness is death.” (Bipin Chandra.1990:191)

శ్రామిక దౌర్జన్యానికి చీమలన్నీ కలిసి సర్పాన్ని చీల్చి చెండాడినట్లే దోపిడీకి గురయ్యే మనుషులు కూడా తమ మానసిక దౌర్బల్యాలన్నింటినీ విడిచిపెట్టి, అలాంటి భగవన్యాయాన్ని ఎదిరించాలి.

మనిషి స్థితిగతులను మార్చేది విప్లవమేనని రావిశాస్త్రి బలంగా నమ్మారు. అందుకు ఆయన అమెరికన్, రష్యన్, ఫ్రెంచి విప్లవాల గతులను ఆధారం చేసుకొన్నారు. ఆధునిక సమాజం శ్రామికులు, పెట్టుబడిదార్లు అనే రెండు వర్గాలుగా విడిపోయింది. పెట్టుబడిదార్లు శ్రామికుల శ్రమఫలితాన్ని యంత్రాల రూపంలో పెట్టుబడి పెట్టారు. శ్రామికులు శ్రమజీవులుగానే మిగిలిపోయారు. వారంతా ఒక్కటై పెట్టుబడిదార్లమీద తిరుగుబాటు చేశారు. ఇదే అంశాన్ని కారల్ మార్క్స్-

ఉత్పత్తిలో అత్యాధునిక మూలధన యంత్రాలను పెట్టుబడిదార్లు ప్రవేశపెట్టడం వల్ల మూలధన సంచయనం ఏర్పడి, మూలధన ఉపాంత ఉత్పాదకత క్షీణించి శ్రామికుల ఉపాంత ఉత్పాదకత పెరుగుతుంది. పెరిగిన ఉపాంత ఉత్పాదకతను మిగులు విలువ (Surplus Value) రూపంలో పెట్టుబడిదార్లు దోపిడి చేసి మూలధన సంచయనాన్ని మరింత పెంచుతారు. తత్ఫలితంగా శ్రామికులు తమ ఉపాధిని కోల్పోయి పారిశ్రామిక నిల్వ సైన్యంగా (Industrial Reserve Army) తయారవుతారు. కొనుగోలు శక్తి తగ్గడం వల్ల అల్పవేతనానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ఈ శ్రామికులు తిరుగుబాటు చేసి పెట్టుబడిదార్ల వ్యవస్థను అంతం చేసి సామ్యవాదాన్ని నెలకొల్పుతారు.” (భారత ఆర్థికవ్యవస్థ. 2018:14)

అని తన కమ్యూనిష్టు మానిఫెస్టో గ్రంథంలో పేర్కొన్నారు. ఆ విధానాన్నిరావిశాస్త్రి వ్యంగ్య ధోరణిలో చెప్పారు. కానీ ఇలాంటి సమాజం శ్రేయోరాజ్యాన్ని స్థాపించలేదు. ఎల్లప్పుడూ ఘర్షణా వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందన్న విషయం గమనార్హం. సమాజం నిరంతర చైతన్యాన్ని కలిగి ఉంటుంది. ఒక కాలంలో సరైన నిర్ణయాలు వేరొక కాలానికి పనికిరావు. కానీ సమాజం ఉన్నంతవరకూ శ్రామిక, దోపిడీ వర్గాల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.

8. ముగింపు:

  • నేటి కాలంలో కమ్యూనిస్టు దేశాలు సామ్యవాద భావాలు తమ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నాయని భావిస్తున్నాయి.
  • అందువల్ల స్వేచ్ఛాయుత మార్కెట్ వ్యవస్థాగత దేశాలుగా మారుతున్నాయి.
  • విదేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్యం జరపడం ద్వారా కమ్యూనిస్టు భావాలకంటే తమ సంపదను వృద్ధి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.
  • అలాంటి దేశాలనుపరివర్తన చెందుతున్న (Transition) దేశాలుగా మేధావులు పరిగణిస్తున్నారు.
  • రావిశాస్త్రిలాంటి రచయితలు అనుసరించిన సామ్యవాద భావాలు నేటి సమాజానికి కొంతవరకూ పనికివస్తాయి.

9. పాదసూచికలు:

  1. పిపీలికం. పుట:822
  2. వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. 2007:47
  3. పిపీలికం. పుట:823
  4. చూ. ఆర్.ఎస్. శర్మ రాసిన ప్రాచీన భారతదేశ చరిత్ర
  5. భారత ఆర్థిక వ్యవస్థ.2018:13

10. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆధునిక ప్రపంచ చరిత్ర. 2005. హైదరాబాదు. తెలుగు అకాడమీ.
  2. బిపిన్ చంద్ర. 2018. ప్రాచీనయుగ భారత చరిత్ర. హైదరాబాదు. నవతెలంగాణా పబ్లిషింగ్ హౌస్.
  3. భారతదేశ ఆర్థిక వ్యవస్థ. 2018. హైదరాబాదు. తెలుగు అకాడమీ ప్రచురణలు.
  4. రాజా, కంకిపాటి. 2015. మంచుబొమ్మ కథల సంపుటి: పరిశీలన. హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖకు సమర్పించిన పరిశోధన వ్యాసం.
  5. రాజారామ్, మధురాంతకం (సంపాదకులు). 2000. తెలుగు కథకులు – కథనరీతులు. సంపుటం -2. విశాలాంధ్ర పబ్లిషర్స్. హైదరాబాదు.
  6. లక్ష్మీకాంత్, ఎం. 2021. భారత రాజకీయ వ్యవస్థ (ఆరవ ముద్రణ). మద్రాసు. మెగ్రా హిల్ ఎడ్యుకేషన్ ప్రైవేటు లిమిటెడ్.
  7. విశ్వనాథ శాస్త్రి, రాచకొండ. 2022. రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనా సాగరం. హైదరాబాదు. కళాజ్యోతి ప్రింటర్స్ 
  8. వెంకట సుబ్బయ్య, వల్లంపాటి. 2007. కథాశిల్పం. హైదరాబాదు. విశాలాంధ్రా పబ్లిషర్స్.
  9. శర్మ, ఆర్. ఎస్. 2018. ప్రాచీన భారతదేశ చరిత్ర. హైదరాబాదు: నవతెలంగాణ పబ్లికేషన్స్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]