AUCHITHYAM | Volume-5 | Issue-11 | October 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
10. కరోనా శతకం: సామాజిక విశ్లేషణ
గొండికోట ఓబుల కృష్ణ
పరిశోధక విద్యార్థి, తెలుగు అధ్యయనశాఖ,
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 6303924949, Email: obulakrishna437@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.09.2024 ఎంపిక (D.O.A): 27.09.2024 ప్రచురణ (D.O.P): 01.10.2024
వ్యాససంగ్రహం:
ప్రాచీనసాహిత్యంలో అనేక ప్రక్రియలు పురుడు పోసుకున్నాయి. పుట్టిన ప్రతీ ప్రక్రియ కొంతకాలానికి అగాధంలోకి వెళ్ళిపోయాయి. కాని ప్రాచీనంలో సంస్కృత ప్రభావంతో ప్రభవించిన ప్రక్రియ శతకం. నాటి నుండి నేటి వరకు నిరంతరం కొత్త భావాలను జోడిస్తూ ముందుకు సాగుతుంది. ఎందరో కవుల చేత కొత్త కోణాలలో పాఠకుల ఆలోచనల్ని ఉత్తేజపరిచినది శతకం.ప్రతి కవి శతకాన్ని రాయాలని తపన పడుతుంటారు. అదే కోవలోనే ప్రముఖకవి మూల ముల్లికార్జునరెడ్డి కూడా శతకాలను రాశారు. వారు ఎన్నో ప్రక్రియలలో తనదైన ముద్రణతో సాహితీరంగంలో ముందుకు సాగిపోతున్నారు. ఈ వ్యాసమందు మూల మల్లికార్జున రెడ్డి రచించిన కరోనాశతకంలో వివిధవిషయాలు విశ్లేషణ చేస్తూ వివిధ కోణాలలో ఆవిష్కరించబోతున్నాను. ఈ శతకము విభిన్నదృక్కోణాలతో సాగినది. ఇది సమాజంలో జరిగిన విపత్కర సంఘటనను విశ్లేషణచేస్తూ సాగిన శతకము. ఈ శతకమును కవి ఏ విధంగా ఆవిష్కరణ చేశారు. ఏ పంధాలో శతకం సాగింది వంటి ఇత్యాది విషయాలను ఈ వ్యాసంలో చర్చిస్తాను. ఈ శతకము పై నేటి వరకు ఎక్కడ పరిశోధనాత్మక పరిశీలన జరగలేదు. ఈ వ్యాసము కొరకు విషయాలు రచయిత శతకము నుండి స్వీకరించడం జరుగుతుంది. ఉటంకింపుకుల కొరకు శతకసాహిత్యం పుస్తకాలు ఆకారాలుగా స్వీకరిస్తున్నాను. ఈ వ్యాసం వివరణత్మాకంగా పద్ధతిలో ఉంటుంది.
Keywords: రచయిత పరిచయం, విషయ విశ్లేషణ, కవి మనోగతం, కవి చమత్కారాలు, భాషాంశాలు.
1.కవిపరిచయం:
ప్రాచీనానికి ఆధునికానికి వాహికై నాటి జీవనం నుండి నేటి వరకు మనిషి మార్పులను,సమాజ మార్పులను చక్కగా ఆవిష్కరించిన ప్రక్రియ శతకం. శతకమందు ఒకేసారి ఎన్నో భావాలను ఆవిష్కరించ వచ్చును. అందుకే ప్రతి సందర్భంలో కవికి ఆపన్న హస్తమై నిలిచింది. అలానే కరోనా సమయంలో జరిగే స్థితిని కళ్ళకు కట్టినట్టు తక్కువ సమయంలో అధిక సమాచారం అందరికి అందించింది. ఎందరో కవులు తమ భావాలను ఆవిష్కరించిన శతకాన్నే మూల మల్లికార్జున గారు కూడా కరోనా సమయంలో జరిగిన స్థితిను కూలంకుశంగా వర్ణించారు వాటిని అంశాల వారిగా ఇప్పుడు వివరిస్తున్నాను.
మూల మల్లికార్జున రెడ్డి కడప జిల్లా ఖాజీపేట మండలంలో గల తుడుమల దిన్నె గ్రామంలో పెద్దముని రెడ్డి, ఓబులమ్మ పుణ్య దంపతులకు 14- 12 -1961 లో జన్మించారు. వీరి బాల్యమంతా తుడుమలదిన్నెలోనే గడిచింది. ప్రాథమిక విద్యాభ్యాసం జిల్లా పరిషత్ హై స్కూల్ ఖాజీపేటలో, ఉన్నతి విద్య ప్రొద్దుటూరులోని, కళాశాల విద్యను ప్రభుత్వ పురుషుల కళాశాలలో కడపలోను, అన్నమలై విశ్వవిద్యాలయంలోనూ బి.ఇడి పూర్తి చేశారు. శ్రీకృష్ణదేవ దేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు అభ్యసించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో పీహెచ్డీ విద్యను పూర్తిచేశారు.
వీరు తెలుగు శాఖ అధ్యక్షులు, లలిత కళా భాగంలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉద్యోగ బాధ్యత నిర్వహించారు. వీరు అనేక అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు.
వీరు సుభాషితి రత్నావళి,మల్లికార్జున రామాయణం, వ్యాస వైజయంతి, మల్లికార్జున శతకం,లలిత కళా వికాసం, యోగి వేమన పద్యసౌరభం, గోష్టి (సాహిత్య విమర్శ వ్యాసాలు), హాస్యవైభవం, వీరబ్రహ్మం రచనలు సామాజిక స్పృహ, కరోనా శతకం, రాయలసీమ నాటక వికాసం, యమసభ (నాటికల సంపుటి) వంటివి రాశారు. వీరి రచన వికాసం పరిశీలన చేస్తే ఒక్కో కోణంలో ఒక్కో ప్రక్రియ అన్నట్టు అన్ని ప్రక్రియలు సాహిత్య సృజన చేసే అందరి పాఠకులను ఆకట్టుకుంటున్నారు. సామాజిక కోణంలో ప్రత్యేక దృష్టితో ఆవిష్కరించాలనే తపన రచయితకి పరిపాటైన విషయం అన్నట్టు వీరి సాహిత్యం ఉద్బోధిస్తుంది. వీరు రాసిన కరోనా శతకమును ఏ విధంగా ఆవిష్కరించారు వివరణాత్మకంగా విశ్లేషిస్తున్నాను.
2. విషయవిశ్లేషణ:
ఈ శతకమంతా ఆటవెలది చంధస్సులో 115 పద్యాల పద్యమాలిక. ఇందులో ప్రధాన విషయం ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వ్యాధి గురించి దాని పరిణామాలు గురించి వివరించిన శతకం. కరోనా సమయంలో పడిన కష్టాలపై కవులంతా తమ ఆవేదన తమ కలం వెంట ఆవిష్కరించారు. ఆ సమయంలో వెలువడిన సాహిత్యాన్ని కరోనా సాహిత్యముగా పిలువబడింది. కవులు సమాజ స్థితిని ప్రశ్నించడం వారి బాధ్యతగా భావిస్తారు.అలానే మూల మల్లికార్జున రెడ్డి గారు కూడా తనదైన తీరులు పద్య ప్రక్రియను ఆవిష్కరించారు.శతకమంతా మొట్టమొదటి తనకి ఎలాంటి ఆటంకం రాకూడదని వినాయకుని ప్రార్ధించడం అది కూడా శ్రీ గిరి సుతా అంటూ తల్లి చాటు బిడ్డలం మొదలు పెడుతూ వినాయక ప్రార్ధించిన కనిపిస్తుంది.
శ్రీ శబ్దం మొదలుపెట్టడం వెనుక సంస్కృత సాహిత్య అభిమానం. ప్రాచీన కవులైన నన్నయాదులు శ్రీ శబ్దంతో కావ్యం మొదలుపెట్టిన అడుగుజాడల్లో కవి కూడా నడిచారని అర్థమవ్వకనే అర్థమవుతుంది.
శ్రీవాణీగిరిజాశ్చారాయ …. శ్రేయసే 1
శ్రీగిరిసుతా మనోనాథ! శ్రీ గిరీశ
ఆర్తజన రక్షఫాలాక్ష! ఆది బిక్షు
నీవె దేవాధి నేతవు! నిగమ సార
మల్లికార్జునుడు పలికె మనసు విప్పి! (కరోనా శతకం, పుట:1)
శ్రీ సరస్వతీ! భగవతీ! చిద్విభూతి!
చిత్తమున నిన్నునిల్పి నే జెప్పినాను
హృద్యము కరోన శతకము పద్యమందు
మల్లికార్జునుడు పలికె మనసు విప్పి! (పుట:1)
విద్యాధిష్ట అనే దేవత అయిన సరస్వతి దేవుని ప్రార్థిస్తూ తన శతకం సంపూర్ణం అవ్వాలని వేడుకోవడం ప్రస్ఫుటమవుతుంది.
2.1 కరోనా పూర్వాపరాలు:
ఈ శతకమందు కరోనా ఎక్కడ పుట్టింది ఎలా అనేవి తనదైన పంధాలో ఆవిష్కరించారు.
చీన దేశమునందు కరోన పేర
ఉద్భవించిన భూతమై ఉద్ధృతముగ (పుట:1)
చైన దేశము కన్నట్టి చంటిబిడ్డ
నేడు సకల ప్రపంచమున్ పాడుజేసె
స్వార్థమునకు కరోనాయె సాక్ష్యమయ్యె (పుట:9)
చైన పాములు కప్పలు తినడమేమి
జగతి నందరు చేతులు కడుగుటేమి
చిత్రమయ్యెను మీదు చరిత్ర జూడ (పుట:9)
చైనా దేశంలో పుట్టావు అని అంటూ చెబుతూనే వెంటనే తన వలన సమస్తము నాశనమైంది. కవి సరళ ధోరణిలో చెప్పటం కనిపిస్తుంది. చైనాలో పుట్టిన వ్యాధి తన దేశంలో ఎప్పుడు వచ్చినదో దానివల్ల ఋతుక్రమం ఎలా మారిందో చెప్పడం అనగా కవి ఋతుక్రమని నాశనం చేసిన కరోనాపై నింద కనిపిస్తుంది.
శార్వరీ శుభాగమనము సంబరమున
నవ్య వాసంతశోభను నవత దెచ్చు
ననుకొని కరోనరాక నేనరయనైతి (పుట:2)
అలానే కరోనా ఎలా విద్యనుపించింది వ్యాప్తి చెంది నాశనం చేసిందో కొన్ని పద్యాలు విశ్లేషించి తెలిపారు.
ఖండముల దాటివచ్చి యఖండమైన
కాంక్షతో కబళించి కకావికలము జేసి
వేల ప్రాణములను తీసినావు (పుట:3)
దేశ దేశాల జనముల ధిక్కరించి
జిత్తుల కరోన ఒకవైపు జేరి చేసె
సంకుల సమరమొక్కటి జగతియందు (పుట:7)
లోక భీకర శబ్దముల్ లేక మరియు
రణగొణ ధ్వనుల్లేకనే రణము సాగె
వేల జనము కరోనాకు నేలబడిరి
మల్లికార్జునుడు పలికె మనసు విప్పి! (పుట:8)
ఇలా చెప్పటమేనక సమాజ స్థితి అర్థం చేసుకోవడం అప్రమత్తం ఆ సమయంలో అవ్వాలని తనదైన రీతిలో పాఠకుల్ని తెలియచేశారని అర్థమవుతుంది. కరోనా ప్రభావము వలన సమస్తమంతా ఎలాంటి ప్రభావం చవి చూసిందో దానివల్ల ప్రజానీకమంతా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో కళ్ళకు కట్టినట్టు-
మనిషి మనిషికి దూరమై మసలలేక
జీవమేలేని హాసమ్ము చేయలేక
మాయని కురుపై యెడలంత మండజొచ్చె (పుట:8) ఈ పద్యంలో వర్ణించారు.
ఈ వ్యాధి ప్రభావం నుండి తప్పించుకోడానికి ఎలాంటి సూత్రాలు నియమాలు పాటిస్తే బాగుంటుందో ఎలా దీని నుండి కాపాడుకోవాలో స్పష్టంగా తనదైనా రీతిలో కొన్ని పద్యాలు తెలిపారు. ఆ పద్యాలలో ఒకటి
మారు మాటేల మంచిగ మాస్కుదొడుగు
జలుబు దగ్గు ఆయాసము లలముకొన్న
జాగరూకుడ వయ్యుండు జయము నీదె (పుట:5)
కరోనా ప్రభావం వల్ల మనుషులను మనుషులే కాపాడుకోలేక ఇబ్బంది పడుతుంటే అందరిని కాపాడిన వారిని వైద్యులు, రక్షకభటులు కాపాడి బయటపడేసిన వారే గొప్పవారని వారిని కీర్తిస్తూ కవి కృతజ్ఞతలు తెలపడం కనిపిస్తుంది.
దేశమంతట దెరచిరి దేవళములు
వైద్యశాలలు మరియు సభయ మొసంగు
రక్షకభటాలయంబులు! రక్ష మనకు (పుట:4)
ప్రజలందని జాగ్రత్తగా ఉండమని కరోనా సమయంలో ప్రతి ఒక్కరు తమదైన రీతిలో చెప్తూనే ఉన్నారు. అలానే కళాకారులు కూడా వినూత్న రీతుల్లో తెలిపారు. ఈ కవి కూడా కాలా ప్రభావాన్ని చూసి వేడుకుంటూ జనులను జాగ్రత్తగా ఉండమని సమాజం స్థితి చూసి చిద్రమై మనసుతో రాశారన్నట్టు వీరి శతకమంతా చాలా పద్యాలు ప్రత్యక్షమైనాయి. ఉదాహరణకు
దేవునికి చెప్పుకొననైన దిక్కు లేదు
దేవళములన్ని వెలవెలబోవ! నేడు
దేవతలు విహ్వలించిరి దిగులుజెంది (పుట:4)
చెడులో కూడా మంచి ఒక్కోసారి దాగుందని ఈ కష్ట కరోనా కాలంలో కూడా కొంత మంచి జరిగిందని కొన్ని పద్యాల్లో కరోనాని కీర్తించినట్లు పరోక్షంగా తెలిపారు. అందరిని ఒకే తాటిపై నిలబెట్టి ప్రజలను బంధాలను బలం చేసిందని,సర్వనాశనం చేసిందని ఈ శతకంలో రెండు రకాలుగా నిందాస్తులు కనిపిస్తాయి.
అంతరాలన్ని మనమధ్య నంతమయ్యె
ఐకమత్యమున మనుజు లేక మైరి
కాకబెట్టు కరోనాను కాటికంప
మల్లికార్జునుడు పలికె మనసు విప్పి! (పుట:24)
దేశమంతట లాక్డౌను! దిక్కులేక
పంట ధరలేక రైతన్న పతనమయ్యె
చెప్పలేనట్టి బాధతో చప్పబడెను
మల్లికార్జునుడు పలికె మనసు విప్పి! (పుట:24)
చిట్టచివరిగా కరోనని తిప్పి కొట్టి అందరిని కాపాడిన నాయకులు, సేవకులు కీర్తిస్తూ కరోనా శతకాన్ని శుభముతో ముగించడం కనిపిస్తుంది.
భవ్యతరమైన నియమ ప్రవర్తనమున
విశ్వసౌభ్రాత్ర భావంబు విస్తరించ
స్నేహశీలిగ మోడీ ప్రసిద్ధి నొందె
మల్లికార్జునుడు పలికె మనసు విప్పి! (పుట:28)
నిత్య నూతనంబయిన నీ నియతి
జూచి మెచ్చి నచ్చి ప్రజలు తీర్పునిచ్చినారు
నియశము జగన్మోహన నిలుచునన్న
మల్లికార్జునుడు పలికె మనసు విప్పి! (పుట:28)
కరోనా వలన ఏర్పడిన లాభ నష్టాలను, ఇతి బాధలను కవి ప్రజలకు అవగాహనను,భరోసాను కల్పిస్తూ ముందుకు నడిపించడం ఈ శతకంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
3. కవి మనోగతం:
కవి ఏమి చెప్పాలనుకున్న స్పష్టంగా చెబుతూ కరోనా సమస్యలను కవి ఎలా భావించారో తెలియచెప్పారు. వీరి పద్యములలో ప్రజలు ఇక్కట్లు చూసి తల్లడిల్లిపోవడం కనిపించింది.సమాజంలోని మార్పు వచ్చినా స్త్రీకి ఎప్పుడు ఎన్ని జరిగినా ఆమె పనులు మార్పు లేదని కనిపిస్తుంది కవి వాపోవడం కనిపిస్తుంది.
మారె మగవారి పనులన్ని మహిని జూడ
మహిళ జీవితమందెట్టి మార్పు లేదు
పొలతి అభిమానవతి కడు పూజ్యురాలు (పుట:18)
ప్రజలు స్వార్థం నుంచి నిస్వార్థం వైపు అడుగులు వేస్తున్నారు. అది నీ పుణ్యమే అంటూ కరోనాని కీర్తిస్తూ సమాజ మార్పు ఇన్నాళ్లకైనా జరిగిందని చురక వేస్తూ ఈ పద్యం సృజనలో కనిపిస్తుంది.
మొక్కుచుంటిమి దేవుడా!మొట్టమొదట
పక్క ఇంటి బాగుంగోర! నిక్క మనియె
ఔర! ఈ కఠిన మహిమలలవి గావు (పుట:18)
తత్వ విషయాలను కరోనా సమయంలో జరిగిన విషయలాందు ఆపాదిస్తూ చెప్పడం వలన కవి తాత్వికునిలా ఈ పద్యమందు కనిపిస్తారు.
మానవత్వపు విలువలు మంటగలిసె
జగతి యందున సత్యంబు గగనమయ్యె
వింత రోగమున్ వచ్చెను పంతమూని (పుట:19)
మనుషులు మూఢత్వం వైపు కాకుండా విషయాన్నీ గ్రహించి మసులుకోవడమే దేనికైనా నివారణ అంటే సమాజం నిలదీస్తూ మూఢత్వం మందు పడిపోకుండా ఉండమని చెప్పటం కనిపిస్తుంది.
కర్మభూమి వైరస్ బట్ట గట్టదనిరి
యమ నియమములు శాంతి హోమముల గాదు
మంత్ర తంత్రాల తీరునా మనిషి బాధ
మల్లికార్జునుడు పలికె మనసు విప్పి (పుట:20)
ఇలా శతకంలో అడుగడుగున కరోనా ఒడిదుడుకులను ఆవిష్కరణ చేస్తూ మదిలో మాటను జంకు లేకుండా చెప్పటం వీరికి మాత్రమే సొంతమేమో అనిపిస్తుంది.
4. కవి చమత్కారం:
కరోనా స్థితి వివరిస్తూనే తన చమత్కార ప్రతిభను కొన్ని పద్యాలు మిళితం చేశారు. వీరి విషయాన్ని చెప్తున్నా సమజానికి చురుక వేస్తూ చెప్పటము శతకంలో కొన్ని పద్యాలు తారస పడతాయి. ఇంటిలో లేకపోతే చనిపోతామని చెప్పటానికి ఓటరు జాబితాలో ఉండవని చెప్పడంలో చమత్కారం కనిపిస్తుంది
ఓటరుల జాబితా నుండి యూడిపోక
ఉండు నీపేరు నింటిలోనున్న యెడల
లేనిచో చేరు మరణాల లిస్టులోన (పుట:20)
కాల మహిమను తెలిపేందుకు నాయకులు చేసే పనులను చెబుతూ చమత్కరిస్తూ తాత్వికం వైపు వెళ్ళటం కనిపిస్తుంది.
ఎన్నికల బీరు బిర్యానిలిచ్చి మ్రొక్కు
నాయకుడు మోమునకు మాస్కు లీయవచ్చె
భళిర! కాలమహిమ దెల్ప బ్రహ్మ తరమ (పుట:22)
కరోనా సమయంలో మనుషులు పిట్టల రాలిపోతున్నారని తెలుపు తమ చమత్కార కౌసలాన్ని చూపించారు.
పిట్ట హాయిగ స్వేచ్ఛగా చెట్టుపైన
నెగురు చుండగ మానవులిల కరోన
సోకి పిట్టలవలె రాలుచుండి రకట (పుట:23)
విషయమును వివరిస్తూనే సందర్భం దొరికినప్పుడు ప్రతిసారి కవి చమత్కార ప్రతిభను చూపిస్తూనే ఉన్నారు.
5. విశేషాలు:
కవి శతకమందు చాలా సరళ భాషను ఉపయోగించారు. శతకంలోయధేచ్చగా ఆంగ్ల పదాలు కూడా పద్యమందు ట్వంటీ ట్వంటీ (కరోనా శతకం,పుట:29) పద్యంలో అంటూ కొన్ని పద్యాలలో ప్రయోగించటం కనిపిస్తుంది. కాలానుగుణంగా పద్యం ఎలా మార్పు జరుగుతుందో ఈ శతకం తార్కాణముగా నిలిచింది.వీరికి ప్రాచీకవులంటే అమితమైన భక్తి ఉందని కొన్ని పద్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
పోతన రాసిన ఇందు గలఁ డందు లేఁ డని సందేహము వలదు చక్రి సర్వోపగతుం....” 2పద్యం ఆకరంగా తీసుకొని -
ఇంచుగలదందు లేదని డెంద మందు
సందియము వలదు! కరోన శక్తి నీవు
ఎందు వెదకి చూచినను అందందు గలవు (పుట:29) పరిస్థితికనుగుణంగా మార్చి చెప్పడం కనిపిస్తుంది
అలానే దైవ స్తుతితో మొదలుపెట్టి దైవ సుత్తితోనే ముగించిన తీరు ప్రాచీన కావ్యాల తీరుని వీరు ఇంకా కొనసాగిస్తున్నారని వీరి పద్యాలు ద్వారా అర్ధమవుతుంది. అలానే శతకంలోని దండక సాహిత్యం పద్య రూపంలో చేస్తూ ముగింపు చేయడం వీరి శతకంలో కనిపిస్తుంది. ఇలా కొన్ని సందర్భాలు తత్వం, ప్రాచీన దృక్పదాలు శతకమందు విరివిగా కనిపించడం జరుగుతుంది.
6. ముగింపు:
- మూల మల్లికార్జునరెడ్డి రాసిన శతకం సమాజ స్థితిని బోధనలతో సాగిన శతకం. ఇది సమాజహితకరశతకంగా కనిపిస్తుంది.
- వీరు శతకాన్ని సరళమైన మాటల్లో రాయడంవలన పద్యం అంటే కష్టం అనే భావం తొలగించడానికి వీరు చేసిన ప్రయత్నం ముదావహం.
- కవి చాలా విషయాలు చెప్పటంలో వెనకడుగు వేయకుండా సమాజ స్థితిని తెలపడం చూస్తే కవికి కైమోడ్పులు సమర్పించాలనిపిస్తుంది. వీరి కరోనా శతకం పఠనీయ శతకం.
- నాటి కరోనా స్థితి,నాటి మనిషి మానసిక స్థితిని ఆవిష్కరణ చేయడంలో సఫలీకృతులు అయ్యారని చెప్పవచ్చు.
- ఇంకను ఈ శతకంలో ఇంకొన్ని కోణాలలో ఆవిష్కరణ చేస్తూ వ్యాసాలు వెలువడి కవి మనోగతము వివరించవలసిన అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయం.
7. పాదసూచికలు:
- ఆంధ్ర మహాభారతం, తితిదే సంపాదకత్వం, పుట :1
- ఆంధ్ర మహా భాగవతం,వికిపీడీయా,స్కంధం 7-275
8. ఉపయుక్తగ్రంథసూచి:
- గనాధ్యాయి : ఆంధ్ర మహాభాగవతం, జూన్ 28, 2009, Link:
- గోపాలకృష్ణరావు.కె : ఆంధ్ర శతక సాహిత్య వికాసం
- ద్వా.నా. శాస్త్రి : తెలుగు సాహిత్య చరిత్ర, ప్రజా శక్తి బుక్ హౌస్-1998
- నాగయ్య, జి : తెలుగు సాహిత్య సమీక్ష(రెండవ సంపుటి)(తృతీయ ముద్రణ), స్టూడెంట్స్ ఆఫ్ సెట్ ఫ్రింటర్స్, తిరుపతి,2003
- మల్లికార్జన మూల : కరోనా శతకం ,లలిత కళాపీఠం-2020
- మల్లికార్జన మూల : మల్లికార్జునీయం, లలిత కళాపీఠం -2023
- మల్లికార్జున మూల : గోష్టి (సాహిత్య విమర్శ వ్యాసాలు), లలిత కళాపీఠం -2017
- వేంకటరాయశాస్త్రి వేదం :శతక వాజ్మయ సర్వస్వము , ఆంధ్ర సాహిత్య పరిషత్, విశాఖపట్నం-1989
- వేంకటేశ్వర్లు, బూదాటి : తెలుగు సాహిత్య ప్రక్రియలు-ధోరణులు,హిమకర్ పబ్లికేషన్, హైదరాబాదు-2014
- శ్రీరామ మూర్తి కొర్లపాటి: తెలుగు సాహిత్య చరిత్ర , రమణశ్రీ ప్రచురణ,విశాఖపట్నం-1991
- సుబ్రహ్మమణ్యం జి.వి (సంకలన కర్త) : ఆంధ్ర మహాభారతం, తి తి దే,తిరుపతి, ఆగష్టు 2000
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

