AUCHITHYAM | Volume-5 | Issue-11 | October 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
8. స్వాతంత్ర్యానంతర ఆత్రేయ నాటకాలు: భారతీయత
డా. కె. కరుణశ్రీ
తెలుగు అధ్యాపకులు,
డి. కె. ప్రభుత్వ మహిళా కళాశాల,
నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9441540317, Email: karunasai16@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.08.2024 ఎంపిక (D.O.A): 30.09.2024 ప్రచురణ (D.O.P): 01.10.2024
వ్యాససంగ్రహం:
భారతదేశంలో ఒకనాడు కేవలం హిందూధర్మం మాత్రమే ఉండేది కానీ కాలక్రమంలో అనేక మతాలను కలుపుకొని పోవడంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించాల్సిన అవసరం ఏర్పడింది. భిన్న వర్గాల మధ్యఘర్షణ, భిన్నవర్గాల మధ్య వైరుధ్యం చాలా సహజం. ఈ వైరుధ్యంలో ప్రశాంతంగా మనిషి బ్రతకాలంటే మనిషికున్న మూడు తాపాలు ఉపశమించాలి. మనసులో ఉన్న రకరకాల భయాలు పోవాలి. అసమానతలు నశించాలి. కులమతద్వేషాలు ఉండకూడదు. అహం పనికిరాదు. ధనవ్యామోహం కూడదు. అధికారులు చిన్న ఉద్యోగుల మధ్య అంతరం ఎక్కువగా ఉండకూడదు అప్పుడే లోకంలో శాంతి వెల్లివిరుస్తుంది. అటువంటి శాంతి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తీ అభిమతం. అందుకే స్వాతంత్రోద్యమ కాలంలో ప్రతి దేశభక్తుడు స్వాతంత్ర్యం తర్వాత తమ దేశ పరిస్థితి మారిపోతుందని సంక్షేమం, సర్వ మానవ సౌభ్రాతృత్వం, శాంతి సౌఖ్యాలు భారత మాత ఆస్తులుగా మారిపోతాయని ఆశించి స్వాతంత్రోద్యమంలో ముందుకు దూకారు. అలాంటిది మనసు కవి ఆత్రేయ సంగతి అసలు చెప్పక్కర్లేదు. అందుకే ఆత్రేయ స్వాతంత్రం వచ్చిన తర్వాత తను ఏ మార్పులు అయితే ఆశించాడో ఆ మార్పులు రానందుకు బాధపడుతూ ఆయా అంశాలకు సంబంధించిన వాటిని వస్తువుగా స్వీకరించి నాటకాలుగా రచించారు. తన నాటకాల ద్వారా మానవ జీవితంలో ఉండే అశాంతిని పారద్రోలి శాంతి నింపాలని ప్రయత్నించాడు. సమాజంలో మార్పు తీసుకురావాలని అనుకున్నాడు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా మనం చర్చించవలసిన ఆలోచించాల్సిన అనేక విషయాలు ఆత్రేయ నాటకాల్లో ఉన్నాయి. ఆత్రేయ రాసిన నాటకాలలో మనకు లభిస్తున్నవి మొత్తం పది నాటకాలు. వాటిలో స్వాతంత్రానికి ముందు రాసిన నాటకాలు నాలుగు. స్వాతంత్రోద్యమ కాలానికి అటు ఇటు రాసిన నాటకాలు రెండు. స్వాతంత్ర్యం వచ్చాక రాసిన నాటకాలు నాలుగు. ఈ వ్యాస ఉద్దేశ్యం స్వాతంత్ర్యానంతర ఆత్రేయ నాటకాలను పరిశీలించడం కాబట్టి నేను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆత్రేయ రాసిన ఆరు నాటకాల్ని మాత్రమే తీసుకున్నాను. అవి ఈనాడు (1948), ఎన్జీవో (1948), విశ్వశాంతి (1951), కప్పలు (1953), భయం (1954), మనసు వయసు (1968) నాటకాలు. స్వాతంత్ర్యానంతరం తాను లోకంలో ఏది చూడాలనుకున్నాడో అది లేకపోవడం వల్ల వాటి స్థాపన కోసం ఒక్కో నాటకాన్ని ఒక్కో ప్రయోజనం ఆశించి ఆత్రేయ రాశారని అనిపిస్తుంది. ఈనాడు - మతకలహాలు; ఎన్జీవో - లంచగొండితనం; విశ్వ శాంతి – యుద్ధం, అధికార వ్యామోహం; కప్పలు - ధన వ్యామోహం; భయం - అంతర్గత భయాలు, అనుమానాలు ; మనసు - వయసు - మానసిక దౌర్భల్యం, బలహీనతలు, మానవ సంబంధాలు వీటి గురించి చర్చిస్తాయి. ఈ ఆరు నాటకాల గురించి వాటి ద్వారా ఆత్రేయ ఆశించిన మార్పుల గురించి చర్చించడమే ఈ వ్యాస ముఖ్య ఉద్దేశ్యం. ఆత్రేయ నాటక ప్రస్థానం - డా. పైడిపాల, ఆత్రేయ నాటకాలు, పూర్వపరాలు - డా. పైడిపాల, ఆధునిక తెలుగు నాటకం - డా. గండవరపు సుబ్బరామిరెడ్డి అన్న గ్రంథాలు ఈ వ్యాసానికి ప్రాథమిక ఆకరాలు. మనసు కవి మన సుకవి ఆచార్య ఆత్రేయ - పొన్నం రవిచంద్ర, అడుగంటిన ఆశయాలకు మాటలు నేర్పాడు - డా. పీ. వీ. సుబ్బారావు, మనసు వంతెన కట్టిన ఆచార్య ఆత్రేయ - సారథి మోటమఱ్ఱి అన్న వ్యాసాలు ఈ వ్యాసానికి ద్వితీయ ఆకరాలు. ఈ వ్యాసంలో ఆరు నాటకాలను ఆ నాటకాలలో ఆత్రేయ స్పృశించిన అంశాలను, వాటి మధ్య నాటికి నేటికి ఉన్న వ్యత్యాసాలను నిశితంగా పరిశీలించడం జరిగింది.
Keywords: నాటకం, అభ్యుదయం, భారతీయత, శాంతి. పరమత సహనం, స్వాతంత్ర్యం, సమైక్యత
1. ఉపోద్ఘాతం:
భారతదేశంలో ఒకనాడు కేవలం హిందూ ధర్మం మాత్రమే ఉండేది కానీ కాలక్రమంలో అనేక మతాలను కలుపుకొని పోవడంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించాల్సిన అవసరం ఏర్పడింది. భిన్న వర్గాల మధ్య ఘర్షణ, భిన్న వర్గాల మధ్య వైరుధ్యం చాలా సహజం. ఈ వైరుధ్యంలో ప్రశాంతంగా మనిషి బ్రతకాలంటే మనిషికున్న మూడు తాపాలు ఉపశమించాలి. మనసులో ఉన్న రకరకాల భయాలు పోవాలి. అసమానతలు నశించాలి. కుల మత ద్వేషాలు ఉండకూడదు. అహం పనికిరాదు. ధనవ్యామోహం కూడదు. అధికారులు చిన్న ఉద్యోగుల మధ్య అంతరం ఎక్కువగా ఉండకూడదు అప్పుడే లోకంలో శాంతి వెల్లివిరుస్తుంది. అటువంటి శాంతి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తీ అభిమతం. అందుకే స్వాతంత్రోద్యమ కాలంలో ప్రతి దేశభక్తుడు స్వాతంత్ర్యం తర్వాత తమ దేశ పరిస్థితి మారిపోతుందని సంక్షేమం, సర్వ మానవ సౌభ్రాతృత్వం, శాంతి సౌఖ్యాలు భారత మాత ఆస్తులుగా మారిపోతాయని ఆశించి స్వాతంత్రోద్యమంలో ముందుకు దూకారు. అలాంటిది మనసు కవి ఆత్రేయ సంగతి అసలు చెప్పక్కర్లేదు. అందుకే ఆత్రేయ స్వాతంత్రం వచ్చిన తర్వాత తను ఏ మార్పులు అయితే ఆశించాడో ఆ మార్పులు రానందుకు బాధపడుతూ ఆయా అంశాలకు సంబంధించిన వాటిని వస్తువుగా స్వీకరించి నాటకాలుగా రచించారు. తన నాటకాల ద్వారా మానవ జీవితంలో ఉండే అశాంతిని పారద్రోలి శాంతి నింపాలని ప్రయత్నించాడు. సమాజంలో మార్పు తీసుకురావాలని అనుకున్నాడు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా మనం చర్చించవలసిన ఆలోచించాల్సిన అనేక విషయాలు ఆత్రేయ నాటకాల్లో ఉన్నాయి.
మనిషి జీవన విధానంలో ఉన్నటువంటి అంటే పుట్టుక నుంచి చావు వరకు మధ్యలో మనిషి తన యొక్క తన చుట్టూ ఉన్న వారి యొక్క సుఖశాంతుల కోసం అనుసరిస్తున్న జీవన విధానమే ఆ జాతి యొక్క సంస్కృతి, సంప్రదాయంగా మారుతుంది. భరత జాతి యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని మనం భారతీయత అంటున్నా ఈ భారతీయత అన్న భావన ఇదమిద్ధంగా ఇందులో ఉంది ఇందులో లేదు అని చెప్పలేం. భారతీయత అన్నది సర్వోపగతంగా ఎందెందు వెదకి జూచిన నందందే కలదు అన్నట్టు కనిపిస్తుంది. ఈ భారతీయత అన్న భావన కట్టులో కావచ్చు, బొట్టులో కావచ్చు, ఆహార విధానంలో కావచ్చు, ఆచార వ్యవహారాల్లో కావచ్చు. ఏదైనా మన దైనందిక జీవితంలో మన భౌతిక మానసిక ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడుతూ మనం వేసే ప్రతి అడుగులోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. నాలుగు వేదాలు, శాస్త్రాలు, 18 పురాణాలు, 54 ఉప పురాణాలు, 108 ఉపనిషత్తులు, తెలుగు సంస్కృత కావ్యాలు ఇవన్నీ కూడా మన జాతి జీవ నాడిలో అంతర్గతంగా కొన్ని రకాల విధానాలను మనలో నిక్షిప్తం చేసి ఉంటాయి. అదే భారతీయత, అదే భారతదేశం యొక్క ఆత్మ. ఈ భారతీయత అనేది పుట్టుక నుంచి చావు వరకు భారతీయులందరి ఆచార వ్యవహారాల్లోనూ కనిపిస్తుంది. అటువంటి ఆచార వ్యవహారాలను ఏ సాహిత్యం ఫలిస్తుందో ఆ సాహిత్యంలో భారతీయ ఉంది అని చెప్పవచ్చు.
స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యానికి తర్వాత భారతీయత అన్న దానిలో తేడా ఏమైనా ఉందా అని ఆలోచిస్తే లేదు, ఉండదు అనే సమాధానం చెప్పవచ్చు. స్వాతంత్ర్యానికి పూర్వం స్వాతంత్ర్యానికి తర్వాత భారతీయత అన్న భావనలో తేడా లేదు కానీ వాటి భావనా బలంలో వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ భారతీయత, జాతీయత అన్న భావనలు స్వాతంత్రోద్యమ కాలంలో కొత్తగా పుట్టిన భావనలేం కాదు, కాకపోతే విభిన్న కుల మత విభేదాలు ఉన్న మన దేశంలో స్వాతంత్ర్యం అనే ఒక ప్రయోజనం కోసం అందరినీ ఒక తాటిమీద నిలబెట్టడం కోసం భారతీయత అన్న భావన దేశభక్తిగా మారి బలంగా మనకి స్వాతంత్రోద్యమ కాలంలో కనిపిస్తుంది. ఈ సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా మనిషి ప్రశాంతంగా బ్రతకడానికి నిర్దేశించుకున్నవే. మనిషి శాంతి కోసం చేసే అన్వేషణ నుంచి పుట్టినవే. అలా పుట్టిందే భారతీయత అన్న భావన కూడా. విశ్వ శాంతి అన్నది భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తీ అభిమతం. అదే ఆత్రేయ అభిమతం కూడా. భారతీయులు గడపగలిగే ప్రశాంత జీవనం భారత జాతి సిద్ధాంతం యొక్క ఔన్నత్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ఆత్రేయ తన నాటకాల ద్వారా మానవ జీవితంలో ఉండే అశాంతిని పారద్రోలి శాంతి నింపాలని ప్రయత్నించాడు. నాటకాలు రచించడమే కాకుండా స్వయంగా తాను నాటకాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వారిలో మార్పులు తీసుకురావాలని ప్రయత్నించాడు. ఆత్రేయని అందరూ మనసు కవి అంటారు. నాటక రచయితగా మాత్రం ఆత్రేయని అభ్యుదయ కవి శ్రీశ్రీ తో పోలుస్తారు. నాటక రచయితగా ఆత్రేయ కొనసాగి ఉంటే తెలుగు సాహితీ లోకంలో మరో అభ్యుదయ కవిగా ఆత్రేయ మిగిలిపోయేవారు అని విమర్శకుల అభిప్రాయం
ఆత్రేయ రాసిన నాటకాలు మొత్తం 10. వాటిలో స్వాతంత్రానికి ముందు రాసిన నాటకాలు నాలుగు. స్వాతంత్రోద్యమ కాలానికి అటు ఇటు రాసిన నాటకాలు రెండు. స్వాతంత్ర్యం వచ్చాక రాసిన నాటకాలు నాలుగు. ప్రస్తుతం పరిశోధనకు తీసుకున్న అంశం స్వాతంత్ర్యానంతర సాహిత్యం మీద జరుగుతుంది కాబట్టి ఆత్రేయ రాసిన ఆరు నాటకాల్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. అవి ఈనాడు (1948), ఎన్జీవో (1948), విశ్వశాంతి (1951), కప్పలు (1953), భయం (1954), మనసు వయసు (1968) నాటకాలు.
2. మత సామరస్య సాధనకే ఈనాడు (1947-48):
ఆత్రేయ రచించిన ఈ నాటకం ఆంధ్ర ప్రజా జీవితాన్ని చిత్రీకరించినటువంటి నాటకం. ఆగస్టు 15వ తేదీతో స్వరాజ్యం వచ్చిందని సంబర పడుతున్న భారతీయుల చుట్టూ వెంటనే మత కలహాల చిచ్చు రేగింది. ఆ చిచ్చులో పడి కాలిపోయిన పురుషోత్తం, అక్బర్ అనే రెండు హిందూ ముస్లిం కుటుంబాల కథే ఈ ఈనాడు. స్వాతంత్రం వచ్చిన అర్థరాత్రి మొదలుకొని జరిగినటువంటి కథ ఇది. మత కల్లోలాలు చెలరేగడంతో అంతవరకూ ఎంతో అన్యోన్యంగా అన్నదమ్ముల్లా మెలిగిన రెండు హిందూ ముస్లిం కుటుంబాలు బద్ధ శత్రువుల్లా మారిన వైనం ఈ కథలో కనిపిస్తుంది. భిన్న కుల మతాలు ఉన్న భారత దేశంలో స్వార్థపరులు తమ ప్రయోజనాల కోసం మత కల్లోలాలు సృష్టించారు. మత కల్లోలాలు అన్నవి ఎప్పటికీ మంచివి కావు. దానివల్ల స్నేహమే కాదు ప్రాణాలు సైతం పోతాయి. సర్వనాశనం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా భారతీయులంతా అన్నదమ్ముల్లా మెలగాలి అన్నది అందరి అభిమతం. కానీ స్వాతంత్ర్యం రావడం తోనే పరిస్థితి మారింది. “స్వతంత్ర భారతదేశం నోచుకున్న నోము పండింది. ముది దాస్య బంధాల క్రుంగిపోయిన జాతి కోలుకుని తలయెత్త”1 బోతోంది అంటూ ప్రారంభమైన నాటకం మధ్యలో మతకల్లోలాల సమస్యల్లో పడి నలిగి చివరికి ఈ మతకల్లోలాలు సమసిపోయేటటువంటి రోజు ఒకటి వస్తుంది అన్న ఆశావాదంతో ముగుస్తుంది. అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పరిస్థితి ఎంతో బాగుంటుందని అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారని ఆశించినటువంటి వారికి మత కల్లోలాల రూపంలో శరాఘాతం తగిలింది. ఇలాంటి మతకల్లోలాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు భిన్నంగా భారతదేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. స్వార్థపరులు ఆడుతున్నటు వంటి ఆటల్లో కీలుబొమ్మలు కావొద్దని హెచ్చరిస్తూ ఆత్రేయ రాసినటువంటి నాటకం ఈనాడు.
స్వాతంత్ర్యం రాక ముందు హిందూ ముస్లిం భాయి భాయి అనుకుంటూ అన్నదమ్ముల్లా మెలిగిన సమాజం ఉంది. అది ఆంగ్లేయుల కుట్ర వల్ల సర్వ నాశనం అయిపోతుంది అంటే చూస్తూ ఊరుకోలేక కవి వాటిని రూపుమాపడానికి ఆ మతకల్లోలాల వెనుకనున్న కుట్రను భగ్నం చేయదలచి రాసిన నాటకం ఇది. మత కల్లోలాల వల్ల మనం అహింసా సిద్ధాంతాన్ని మర్చిపోతున్నాం. తద్వారా గాంధీజీని గాంధీ సిద్ధాంతాలను మనం కోల్పోతున్నాం అని చెప్పడానికి ప్రతీకగా నాటకంలో గాంధీ చిత్రపటం తుపాకీ గుండు తగిలి కింద పడిపోతుంది. హిందువులకు ఆశ్రయం ఇచ్చిన ముస్లిం కుటుంబం, ముస్లిం పట్ల సానుభూతి చూపిన హిందూ కుటుంబం రెండు కుటుంబాలూ ఈ నాటకంలో ఆహుతై పోతాయి. మతకల్లోలాల చిచ్చు రేపిన మత విధాన భావనల్ని నాశనం చేయడానికి హిందూ ముస్లింలు మళ్లీ ఐక్యంగా నిలబడడంతో నాటకం ముగుస్తుంది. భారతీయ నాగరికత చేరవలసిన శిఖరం ఇది కాదు. భారతీయ భావన యొక్క శిఖరాగ్రం సర్వమానవ సౌభ్రాతృత్వం, దాన్ని మనం నిలబెట్టుకోవాలని చాటిన నాటకం ఇది. ఈ నాటకంలో కొన్ని సంభాషణలు మనల్ని ఆలోచింపజేస్తాయి.
“ఐక్యతను హర్షించే రోజులు కావివి అది కేవలం ఆదర్శం మాత్రమే ఆ ఆదర్శం అమలు జరిపినప్పుడు అదొక అవమానంగా రెండు జాతులు అసహ్యించుకుంటున్నాయి. ఇది మీరు గమనించాలి.”2
“స్నేహాన్ని ప్రేమను ఐక్యమత్యాన్ని నాశనం చేయడమే నా సంఘం పని. ఒకరినొకరు పొడుచుకొని చావడమే నా సంఘం ఆశ. ఇదే నా రాజకీయాలు? మానవ సంఘం ఇదేనా? మన నాగరికత చేరవలసిన శిఖరం ఇదేనా? మనకు రాజకీయాల్లేవు, మనకి మతాల్లేవు, కులాలవసరం లేదు. మనమంతా ఒక్కటే కులం. కష్టజీవులం. మన రాజకీయాలు తిండి గుడ్డ. మన మతం సమ్మతం”3 అంటూ సాగిన నాటకం ఇది.
ఈ కథలో పురుషోత్తం, అక్బర్ కుటుంబాల మధ్య ఒక డాక్టర్ అనుమానాలు సృష్టిస్తాడు. ఒకే ఇంట్లో రెండు కుటుంబాల మధ్య ఉన్న తలుపు మూసుకుపోతుంది. రెండు మతాల మధ్య విభేదాలు రక్తపాతాన్ని సృష్టిస్తాయి. అక్బర్ హిందూ తల్లికి తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. పురుషోత్తం ఒక ముస్లింకి అండగా నిలబడతాడు. కొంతమంది మత పెద్దలకు ఇది నచ్చకపోవడంతో వారి ద్వేషానికి ఆ రెండు కుటుంబాలూ బలికావడాన్ని ఆత్రేయ ఈనాడు నాటకంలో చిత్రీకరించారు. ఈ నాటకంలో ఆగస్టు 15 న రామ్ నసీమ్ కు బహుమతిగా ఒక గాంధీజీ చిత్రపటాన్ని ఇస్తాడు. ఒక హిందూ మత దురహంకారి విసిరిన దెబ్బకు గోడ మీద ఉన్నటువంటి గాంధీ పటం ముక్కలై పోతుంది. మతకల్లోలాలలో పడి గాంధీ తత్వమైన అహింసా సిద్ధాంతం అంతరించపోబోతోందని ఊహించిన ఆత్రేయ ఈ గొడవల్లో గాంధీజీయే బలవుతాడని అనుకోలేదు. సరిగ్గా ఈ నాటకం నెల్లూరులో ప్రదర్శిస్తున్నప్పుడే గాంధీజీ హత్యకు గురికావడం కావడం ఈ నాటకపు మరో విశేషం. భారతీయ ఔన్నత్యాన్ని, మతసామరస్యాన్ని పాటించమని చెప్పడం ఈ నాటకం ద్వారా ఆత్రేయ సాధించ దలచిన అంతిమ ప్రయోజనం.
3. స్వార్ధాన్ని రూపుమాపడానికే ఎన్జీవో (NGO) నాటకం (1948):
బతుకంటే, లేని వారికి ముఖ్యంగా మధ్యతరగతి మనిషికి విపరీతమైన పరుగు, బాధ అయిపోయింది దీనికి కారణం లోకంలో అత్యాసాపరులు బయలుదేరడం. అధికారం పొందిన వారు తమ స్వార్థం కోసం తమను ప్రశ్నించే వారిని నిర్దాక్షిణ్యంగా అణచి వేయడం. స్వరాజ్యం వచ్చిన తర్వాత మన వాళ్లు లంచగొండితనాన్ని అణచివేస్తున్నారు అని పోలీసు చేత పలికిస్తూ మధ్యతరగతి జీవితాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించిన నాటకం ఎన్జీవో. ఈ నాటకానికి మొదట అద్దె కొంప అని పేరు పెట్టి తర్వాత ఎన్జీవో అని పేరు మార్చారు ఆత్రేయ. కానీ ఈ రెండు పేర్లు కూడా ఈ నాటక సందేశాన్ని వ్యక్తం చేయడానికి చాలవని కానీ తప్పక ఎన్జీవో అన్న పేరు పెడుతున్నానని అన్న ఆత్రేయ మాటల్లో ఎంతో సత్యముంది. ఎన్జీవో నాటకంలో ఆత్రేయ స్వాతంత్ర్యం వచ్చినా బాగుపడని మధ్యతరగతి కుటుంబాల ఈతి బాధలు, చాలీచాలని సంపాదనతో పడుతున్న పట్నవాసపు అగచాట్లు, ప్రెస్టేజ్ తో మధ్యతరగతి వారు పడుతున్న ప్రస్టేషన్, స్వాతంత్ర్యానంతరం మధ్యతరగతి వారు పడుతున్న ఆర్థిక సాంఘిక బాధలు ఈ నాటకంలో యధాతథంగా చిత్రీకరించారు. ఇందులో ఆత్రేయ గోపి పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అసమానతల గురించి అనేక ప్రశ్నలు గుప్పించాడు.
“పదివేలే ఉంటే ఆ పది వేలు ఇనప్పెట్టెలో పెట్టి మీ అబ్బాయికి బదులు యినప్పెట్టెకే ఇచ్చి పెళ్లి చేసేవాళ్లం తెలిసిందా”4 అని ఈనాటకంలో గోపి పెళ్లిళ్ల శాస్తితో అనడంలోనే మనకి మధ్యతరగతి వారి పెళ్లి కష్టాలు, వరకట్న సమస్యలు కళ్ళముందు కదులుతాయి.
“మేడల్లో కులికినా, గుడిసెల్లో కులికినా, కట్టెల్లో ఒకలాగే కాలిపోవాలి! బూడిదలో ఒకటిగా కలిసిపోవాలి. ఉన్న నాలుగు నాళ్లు వుబ్బిపోబోకురా! కన్ను తెలియని రీతి గర్వపడబోకురా!”5 అన్న వేదాంతం పేదవాడికి కాకుండా ధనవంతుడికి అర్థమయ్యేలా చెప్పాలంటారు ఆత్రేయ. సమాజం బాగుపడాలంటే డబ్బున్న వాళ్లని మారిస్తే చాలు అన్న ఆత్రేయ అభిప్రాయం సరైనదే.
“అందరూ అమాంతం మహారాజులై బంగ్లాలో ఉండాలని కోరితే మంత్రులు కాదు బ్రహ్మ దేవుడు మాత్రం ఏం జేస్తాడు? ఆఁ...వూఁ...అంటే ‘స్వతంత్ర భారతదేశంలో కూడా’ అని ఏడవడం... స్వాతంత్ర్యo వచ్చేస్తే ఆ రోజే అందరికీ డబ్బు సంచులు పంచి పెట్తామని చెప్పారా మనవాళ్లు? ఏమిటంటా ఆ వెధవ వాగుడంతా”6 అని నాటకంలో డాక్టర్ అనడంలోనే స్వాతంత్ర్యానంతర పరిస్థితి మనకి అర్థమైపోతుంది.
“ఇప్పటి ఈ విధానాలన్నీ ఇంగ్లీష్ వాడే చేసాడండీ” అని గోపి అంటే “ఇంగ్లీష్ వాళ్ళు చేసి పోతే మన వాళ్ళు వచ్చారు మార్చరాదు”7 అని శర్మ అన్నప్పుడు “మనవాళ్ళు హుఁ..”8 అని గోపి అనడంలోనే స్వాతంత్రానంతరం మన నాయకుల దృష్టంతా దేశాన్ని దోచుకు తినడం తప్ప దేశాన్ని బాగు పరచడంలో లేదని తెలిసిపోతుంది.
అందుకే స్వాతంత్ర్యానంతరం ఉన్నత వర్గంలో స్వార్థం వల్ల తలెత్తిన అధికార వ్యామోహం, లంచగొండితనం వంటి పరిస్థితులను చక్కదిద్దితే తప్ప దేశం బాగుపడదని వ్యంగ్యంగా చిత్రీకరించిన నాటకం ఈ ఎన్జీవో.
4. శాంతికోసమే విశ్వశాంతి నాటకం (1951):
“యుద్ధం ఒక విచిత్రమైన పుండు”9 అంటూ ఆ పుండు రణంలా ఎలా మారుతుందో వివరిస్తారు ఈ నాటకంలో ఆత్రేయ. నాటకమంతా యుద్ధం గురించి, యుద్ధ స్వభావం గురించి, యుద్ధ వినాశనం గురించి చర్చించడంతో నాటకం చదివాక మనం యుద్ధం రాకూడదని ప్రార్థిస్తాం. విశ్వ శాంతిని కాంక్షిస్తాం. అందుకే ఈ నాటకానికి ఆత్రేయ విశ్వశాంతి అని పేరు పెట్టారు.
ఈ నాటకానికి ముందుమాట రాస్తూ శ్రీ శ్రీ “జీవితానికి ప్రాణవాయువువలె మానవజాతి సమిష్టి క్షేమానికి శాంతి అత్యవసరమని గుర్తించగలిగిన వాళ్లంతా తమ యావచ్ఛక్తులతో మొహరిస్తే అసలు యుద్ధం అనేదే లేకపోవచ్చు”10 అంటాడు.
మరి ఇన్ని యుగాల నుంచి మంచితనం మూర్తీభవించిన మానవులు యుద్ధం రాకూడదని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కదా అయినా యుద్ధమనేది వస్తూనే ఉంది. యుద్ధం కూడా తన రూపాన్ని మార్చుకుంటూ మనల్ని ఇంకా హడలెత్తిస్తూ ఉంది. ఇద్దరు మనుషులు ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేసే రోజుల నుంచి మనిషి ఎక్కడో లక్షల మైళ్ల దూరం నుంచి కూడా శత్రువును గురిపెట్ట గల అణు బాంబుల నుంచి బయో వార్ల దాకా ఎదిగిపోయి ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వశాంతి కోసం ఆరాటపడడం, విశ్వశాంతి కోసం పోరాటం చేయడం మనందరి కర్తవ్యం అంటూ ఆత్రేయ రాసినటువంటి నాటకం ఇది.
“మానవుడంటే జానెడు పొట్ట కాదు, మానవుడంటే రూపాయి బిళ్ళ కూడా కాదు”11 వంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి.
భౌతిక వాదం మానవుని దురాశాపూరితుడ్ని చేస్తే, సౌమ్య వాదం దోపిడీ వర్గానికి మంచి శ్రీరామరక్షలా మారింది కాబట్టి ఏ సిద్ధాంతమైనా అతిగా మారితే అనర్థాలే వస్తాయని కవి హెచ్చరిం చాడు.
ఈ విశ్వశాంతి అనే నాటకం ఒక విచిత్రమైన నాటకం. ఈ నాటకంలో ఉండేటటువంటివి పాత్రలు కావు. లోకంలో ఉన్న భిన్న మనస్తత్వాలు గలిగిన మనుషులకు సంకేతాలు. నాటకమంతా ఒక నీతి, ఒక సందేశం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నాటకంలోని మాతృమూర్తి భూదేవి భూమాతకు సంకేతం. ఇక పెద్దోడు సామ్రాజ్యవాదులకు ప్రతినిధి. దోపిడీలకు దురహంకారానికి వారసుడు. చిన్నోడు అనేకానేక కోట్ల మానవజీవన ప్రతిబింబం. పీడనకు తట్టుకోలేక తిరగబడుతున్న విప్లవానికి ప్రతిరూపం. కుమార్తె సమత లోకంలో కరువౌతున్న సమత మమతలకు ప్రతీక. అమరయ్య పేరు లాగానే రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని ఒక కాలూ ఒక చేయీ ఒక కన్ను పోయినా ఇంకా బ్రతికే ఉన్నటువంటి వాడు. యుద్ధం గురించి కళ్ళకు కట్టినట్టు చెప్పగల నేర్పరి. ఊర్లో జనానికి అందరికీ కూడ యుద్ధం వల్ల కలగబోయే అనర్ధాన్ని తెలియజేస్తాడు. ఇలా ఈ నాటకంలో పాత్రలన్నీ ప్రపంచంలోని రకరకాల విషయాలకు సంకేతంగా ఉంటాయి. ఒక కుటుంబాన్ని ప్రతీకగా చేసుకుని మొత్తం ప్రపంచాన్ని అందులో చూపించిన కథ ఇది. ఆది కాలం నుంచి యుద్ధాన్ని చూస్తున్నది భూమి కాబట్టి యుద్ధాన్ని గురించి ఎవరూ భూమాత కన్నా విపులంగా వివరంగా చెప్పలేరు కాబట్టి ఇందులో తల్లి పాత్రకు భూదేవి అని పేరు పెట్టడం జరిగింది. ఈ నాటకంలో ఉన్న గొడవలు చిన్న కొడుక్కి పెద్ద కొడుక్కి మధ్య గొడవలు కాదు.
"రెండు సిద్ధాంతాల మధ్య సంఘర్షణలు. రెండు వర్గాల మధ్య పోరాటం. అది ఇంట్లోనే కాదు మా ఊర్లో, పట్నంలో, దేశంలో, యూరప్లో ప్రపంచమంతా ఉన్న పోరాటం. ఈనాడు రెండు పాయలుగా చీలి పోయింది. ఆ రెండు పాయల్లో మేమూ రెండు చుక్కలం."12 అని చిన్నోడు పాత్ర ద్వారా ఆత్రేయ చెప్పడాన్ని బట్టి ఆ ఇంట్లోనే దేశం ఉంది దేశంలో ఆ ఇల్లు ఉంది అని అర్థమవుతుంది.
“ఆకలి, ఆశ మానవ జీవితాన్ని నడుపుతున్న రెండు శక్తులు. ఈ ముక్కుతాళ్ళకి ఎంతటి వాళ్ళైనా లొంగుతారు.” “రూకలుంటే నూకలొస్తాయనుకున్నాం. పండించే టోలు లేకుంటే తిడేడ నుంచి వస్తది”.13 “మనుషులందరూ ఒక్కటే అది అన్ని దేశాల్లో చూశాను. అందరూ మన లాగే నవ్వుతారు ఏడుస్తారు. మనలాగే తింటారు. అందరికీ సుఖం ఆకలి అన్ని ఒక్కటే. అందరికీ ప్రాణాలంటే తీపి ఉంది. అందరికీ సుఖంగా బ్రతకాలని ఉంది. అందరికీ కావాలి రంగులు తేడా, మాటలు తేడా, ఆచారాలు అలవాట్లు తేడా, అంతే. అందరూ ఈ బతుకును హాయిగా చేసుకోవాలనే ప్రయత్నిస్తున్నారు.”14 అని అంటాడు ఈ నాటకంలో "శాంతి అనేది లోపల నుంచి రావలసిన ఒక మహత్తర యోగబలం. మరి ఆకలి మాత్రం లోపలనుంచే కదూ వచ్చేది."15 వంటి సంభాషణల ద్వారా ఆకలి శాంతి కన్నా బలమైనది అంటారు కవి. ఆకలి మనసులో కాదు కడుపులో ఉంటుంది. పశువు కూడా తిండి కోసం తాపత్రయపడుతుంది. మరి మానవుని గొప్పతనం ఏంటి అని ఒక స్వామీజీ అంటే చిన్నోడు అంటాడు “పశువు కడుపు నిండిన తర్వాతైనా ఇంకో పశువు కడుపు నిండనిస్తుంది. కానీ మానవుడు అది కూడా చేయడం లేదు. ఇంకొకరి ఆకలితో తన కడుపు నింపుకుంటున్నాడు.”16 అన్న నిజాలు దిగజారిపోతున్న మానవ మనస్తత్వానికి ఉదాహరణగా నిలుస్తాయి. స్వాతంత్ర్యానంతరం మనుషుల మనసుల్లో, దేశంలో తలెత్తిన అశాంతిని తొలగించి శాంతిని స్థాపించడానికి ఆత్రేయ చేసిన గట్టి ప్రయత్నమే విశ్వశాంతి నాటకం.
5. ధనవ్యామోహాన్ని తగ్గించడానికే కప్పలు నాటకం (1953):
ఇందులో కథావస్తువు తెలుగు వారందరికీ చిరపరిచితమైన ‘సుమతీ శతకం'లోని తెప్పలుగ చెరువు నిండిన కప్పులు పదివేలు చేరు' అని నాటకానికి రాసిన ముందుమాటలో ఆత్రేయే చెప్పారు. ఇదే జీవితంలో మనం తెలుసుకోవాల్సిన పరమ సత్యమని ఉద్ఘాటించారు. రెండు రంగాలలో ఉన్న ఈ నాటకంలో ఆత్రేయ డబ్బు యొక్క ప్రాధాన్యతను, ఆర్థిక సంబంధాలను పూర్తిగా చూపించారు.. డబ్బు గల వారి ఇంటి చూరు పట్టుకొని వేలాడుతున్న బంధువుల్ని కప్పలతో పోల్చి వ్యంగ్యంగా చిత్రీకరించిన నాటకం ఇది. “ప్రపంచంలో డబ్బు ప్రధానమైంది. అన్నీ ఆలోచించుకొని, నీ ఆనందం ఇదని నువ్వు నిర్ణయించుకున్న రోజు నేను దాన్ని ఏమిటని అడకుండా ఆమోదిస్తాను.”17 అని ఈ నాటకంలో శ్రీపతి తన కూతురు కమలతో డబ్బు చుట్టూ గడ్డ కట్టుకున్న బంధాలేంటో గుర్తించమని హెచ్చరిస్తాడు. వారెవరో కనిపెట్టడం కోసం డబ్బు పోయినట్టు నాటకం ఆడతాడు. దాంతో చెరువులో నీళ్లెండి పోతే కప్పలు మాయమైనట్టు బంధువులనబడే వాళ్ళు వెంటనే పారిపోతారు. సరదాగా వ్యంగ్యంగా నాటకం సాగినట్టున్నా అంతర్లీనంగా ఈ నాటకం మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న కారల్ మార్క్స్ ని గుర్తు చేస్తుంది. ఆ సిద్ధాంతం పూర్తిగా నిజం కాదు అక్కడక్కడా నిజమైన బంధాలు కూడా ఉంటాయి అనడానికి ఉదాహరణగా చలపతి ఈ నాటకంలో మనకి కన్పిస్తాడు.
“నాపళ్ళు వేనూడ గొట్టుకుంటే ఫర్వాలేదు లేదు కానీ ఎదుటివాళ్ళు ఊడగొడితేనే బాధ.”18
“కాలాలు మారి పోయినయి. మనుషుల మీద మమతలు బంధాలు తెగిపోయినయి. మనిషిలో మంచి, చెడూ చూచి లోపలి వ్యక్తిని అభిమానించే శక్తి మనకు లేదిప్పట్లో. పరిస్థితులకు దాసులం. ద్వేషం ఒక దివ్య సందేశం అయిపోయింది.”19
“నా డబ్బుకున్న విలువ నాకు లేక పోయింది. అంతా మోసం, అనుమానం, ఆత్మవంచన”20 వంటి సంభాషణలు ఈ నాటక అంతరంగాన్ని ఆవిష్కరింపజేస్తాయి. “ఇంట నన్న ద్రవ్యము ఎరువు గుట్టను బోలు/ వ్యాప్తిచెందెనేని ఫలితమిచ్చు, పంటలు పండించు/ పారకున్న నీరు పాచి పట్టు” అని జాషువా అన్న విధంగానే ఆత్రేయకూడా ధనం ఒకేచోట కేంద్రీకృతం కావడం మంచిది కాదని భావించాడు. అందుకే దాన్ని తగ్గించాలని భావించి స్వతంత్ర భారత దేశంలో పెరిగిపోతున్న డబ్బు ప్రాధాన్యతను వ్యంగ్యంగా చిత్రీకరించిన నాటకం కప్పలు.
6. అభయ హస్తమే భయం నాటకం (1954)
మనో విశ్లేషణ ప్రధానంగా సాగిన నాటకం భయం. ఈ నాటక ప్రారంభoలో ఆత్రేయ.
“భయం యుగం భయం యుగం/ మహా భయంకర యుగం/ అనుక్షణం మరణ భయం / జీవన సంభరణ భయం / ధనమదాంధ జనచోదిత / రణభయం మరణ భయం........ మనిషికి మనిషన్న భయం / మనసంటే మనకు భయం/ సత్యమన్న చచ్చే భయం/ చచ్చుదాక చావుభయం...... అన్ని యెడల అందరికీ/ అర్థరహిత వ్యర్ధభయం”21
అంటూ లోకంలో పేరుకుపోయి ఉన్న భయాలన్నిటి గురించి చెప్తాడు. అటువంటి అర్థరహిత భయాలనుంచి మనల్ని విముక్తి చేయడానికి ఆత్రేయ ఈ నాటకం రచించారు. మనుషుల్లో ఎన్ని రకాల భయాలు పేరుకుపోయి ఉన్నాయో మనకు తెలియజేయడం కోసం కవి ఈ నాటకంలోని ప్రతి పాత్రలో ఏదో ఒక భయాన్ని చూపిస్తాడు. ప్రతి పాత్ర ఏదో ఒక బ్రతుకు భయంతో సతమతమౌతూ ఉంటుంది.
“ఇంట్లో ఏడవ లేను పిల్లలు చూస్తారని భయం బైట ఏడవలేను. అందరూ నవ్వుతారని భయం!”22 అన్న మేనేజర్ మాటల్లో మనకి మనషి మనసులో భయం ఎంతగా గూడు కట్టుకొని పోయిందో కదా అని అనిపిస్తుంది.
“కుర్రాడిగా ఉన్నావు కనుక చెప్తున్నా. ఇక్కడ కాదు. నువ్వెక్కడికెళ్ళిగా అన్యాయం ఉంది. అన్యాయం లేని అంగుళం లేదు. అలాంటప్పుడు మనం అన్యాయమని అరుచుకోవడం దీనికి చెప్పు. ఏం లాభం. అందుకని అంతా న్యాయమనుకుంటేనే ఆనందం. కనీసం బాధ తప్పుతుంది.”23 అని మేనేజర్ పాత్ర ద్వారా ఆత్రేయ చెప్పడాన్ని బట్టి ఇక అన్యాయం అన్న పదం గురించి మనం మాట్లాడుకోకపోవడం మంచిదనిపిస్తుంది.
అంతవరకు స్వాతంత్ర్యానికి పూర్వం ఆంగ్లేయులు చేసిన చూపిన అన్యాయ మార్గాలన్నీ స్వాతంత్ర్యం తర్వాత భారతీయుల పట్ల భారతీయులే అనుసరిస్తున్నారని అర్ధమౌతుంది. మనిషిలో ఉన్న అన్ని రకాల భయాలు పోయి ధైర్యంతో అడుగు ముందుకేసినప్పుడే మనిషి స్వేచ్ఛగా, స్వచ్ఛంగా బ్రతకగలడని చెప్పిన నాటకం ఇది. ఈ నాటకంలో ఎక్కువ మందిని భయానికి గురిచేసిన ప్రొప్రయిటర్, మేనేజర్ భార్య విసిరిన కత్తి తగలడంతో పడి పోయినట్టుగా ఆత్రేయ ముగిస్తాడు. ఏ రకమైన భయాన్నైనా ధైర్యమనే కత్తితో చీల్చి చెండాడాలని, భయంతో బ్రతుకు భారంగా ఈడ్చడం ఏ కాలంలోనైనా అర్థరహితమని చెప్పిన నాటకం ఇది.
7. ఆధునిక పోకడల అణచివేతకే మనసు – వయసు నాటకం (1968)
ఈ నాటకానికి మరో పేరు తిరుపతి. 1968 లో ప్రతిభ సచిత్ర వారపత్రికలో ధారావాహికంగా “ప్రచురింపబడిన ఈ నాటకానికి మూలం సిడ్నీ హరర్స్ రాసిన 'దేన్యూ వాట్ దే వాంటెడ్' అనే నాటకం.”24 ఆత్రేయ పూర్తిగా రాసిన నాటకాల్లో చివరి నాటకం ఇది. ఆధునిక కాలంలో మారుతున్న మారుతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా స్త్రీ, పురుషుల మానసిక అంతరంగాన్ని, అంతరంగ కల్లోలాన్ని, మంచికి చెడుకి, మనసుకి వయసుకి మధ్య నలిగిపోయే చిత్తవృత్తిని ఆవిష్కరించిన నాటకం ఇది. నేటి సమాజంలో ఎన్నో కుటుంబాలలో స్థిరచిత్తం లేని శివుడు, తిరుపతి, లిల్లీ వంటి పాత్రలు కనిపిస్తూనే ఉన్నాయి. పరిస్థితులకు తలవంచే వ్యక్తులు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటారు. క్షణికోద్వేగాలకు లోనై జీవితాలను అస్తవ్యస్తం చేసుకొని, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నారు. ఆధునిక జీవితంలోని సంక్లిష్టతను, మానసిక దౌర్భల్యాలను సమర్ధవంతంగా చూపించిన నాటకం ఇది. భారతీయ వివాహ వ్యవస్థలో ఉన్న దాంపత్య ధర్మం ఏ విధంగా ఆధునిక సమాజంలో కనుమరుగౌతుందో, ఆధునిక పోకడలు ఏ విధమైన పరిణామాలకు దారి తీస్తున్నాయో చర్చించిన నాటకం ఇది. మనసుకి వయసుకి సంబంధం ఉంటుందని పెళ్లి వంటి బంధాల విషయంలో మనసుకు వయసుకు కూడా తగిన ప్రాధాన్యత నివ్వాలని అలా కాకుండా మనసుని మభ్యపెట్టాలని చూస్తే మనసే మనల్ని మోసం చేస్తుందని చెప్పిన నాటకం ఇది. మనిషికి మానసిక దౌర్భల్యం ఉండడం వల్ల మిగిలేది అశాంతేనని, పోగొట్టుకునేది బంధాలనేనని చెప్పడం కోసం ఆత్రేయ ఈ నాటకం రచించాడు.
8. ఆత్రేయ నాటక లక్ష్యం:
స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఊహించిన మార్పు మాత్రం రాలేదు. భారతీయ సంస్కృతీ సిద్ధాంతాలను మరచి ఆంగ్లేయులు వదిలి వెళ్ళిన వైషమ్యాలను కొనసాగిస్తూ ప్రజలు రోజురోజుకీ పతనమౌతున్నారు. అశాంతి పాలవుతూ బాధ పడుతున్నారు. సమాజంలో ఉన్న యా అశాంతిని, బాధల్ని పోగొట్టి భారతీయుల అభిమతంలో ఉన్న శాంతిని అడుగడుగునా కనిపించేలా చేయాలని ఆశించిన కవి ఆత్రేయ. కానీ లోకంలో తాను ఆశించినట్టుగా శాంతి కనిపించకుండా అశాంతి, అసహనం, మతకల్లోలాలు కన్పించడంతో వాటిని పోగొట్టడం కోసం నాటక ప్రక్రియను ఎంచుకున్న కున్నాడు. తాను లోకంలో ఏది చూడాలనుకున్నాడో వాటి స్థాపన కోసం ఒక్కో నాటకాన్ని ఒక్కో ప్రయోజనం కోసం రాశారు ఆత్రేయ.
ఈనాడు - మతకలహాలు; ఎన్జీవో - లంచగొండితనం; విశ్వ శాంతి – యుద్ధం, అధికార వ్యామోహం; కప్పలు - ధన వ్యామోహం; భయం - అంతర్గత భయాలు, అనుమానాలు; మనసు - వయసు - మానసిక దౌర్భల్యం, బలహీనతలు, మానవ సంబంధాలు వీటి గురించి చర్చిస్తాయి. ఆత్రేయ తన నాటకాలను సామాజిక ప్రయోజనం ఆశించి రచించినటువంటి కవి. కనుకనే నాటకాలను రాసి వదిలేయకుండా స్వయంగా నటించేవాడు. నిశితంగా సమాజాన్ని గమనించి మానవ మనస్తత్వాన్ని చిత్రీకరించిన కవి. కనుకనే వీరు ఈ నాటకాలు రాసి యాభై సంవత్సరాలు గడిచినా ఈ నాటకాలు సమకాలీనతతో మన కళ్ళముందు నిలుస్తాయి. ఆలోచింపజేస్తాయి. కవి ఆశించిన మార్పులు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కాలంలో కూడా రాకపోవడానికి కారణాలేంటా అని మనల్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంటాయి.
9. ముగింపు:
- "వీధిలైట్ల కింద కూర్చుని వెలుగుల్ని చిమ్మిన ఎన్నో నాటకాల్ని సృష్టించిన భావనా సామ్రాజ్య చక్రవర్తి"25 ఆత్రేయ. "ఆత్రేయ పెన్ను సామాజిక రుగ్మతల్ని, దోషాల్ని, దౌష్ట్యాల్ని చీల్చి చెండాడినటువంటి ఖడ్గం. ఖడ్గాన్ని బ్లేడు లాగా మార్చుకుని తన శరీరాన్ని కోసుకొని మనసును పైకి తీసినటువంటి ఒక అద్భుతమైన వైవిధ్యమైన కవి, రచయిత ఆచార్య ఆత్రేయ."26 అందుకే డా. పైడిపాల వారన్నట్టు ఆత్రేయ రచనలను నాటకాలాడం కంటే జీవితాలు, విప్లవాలు, జ్వాలలు అంటే సరిపోతుంది.
- నాటకంలో సంభాషణైనా, సినీ గేయమైనా విలక్షణత ఆయన సొంతం. జన సామాన్యంలో ఉన్న అనేక మాటలను తన రచనల్లోకి ప్రవేశపెట్టి జనాదరణ పొందినటువంటి కవి ఆయన. అలాంటి ఆత్రేయ శత జయంతి సంవత్సరం కూడా పూర్తయింది. కానీ ఆయన ఆశయాలకు, ఆలోచనలకు ఊహించిన మార్పులకు ఇంకా సమాజంలో చోటు రాలేదు.
- స్వాతంత్రానంతరం ఏ సమాజాన్నైతే ఆత్రేయ కలలు కన్నారో దాన్ని భౌతికంగా చూడలేక నాటకాలుగా మలిచారు. అది వాస్తవం కావాలని ఆశించారు.
- స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైనా నాటి నుంచి నేటి వరకు మారని పరిస్థితుల్లో మనం మళ్లీ ఆత్రేయ రాసిన నాటకాల గురించి పునరాలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
10. పాదసూచికలు:
- ఈనాడు – ఆత్రేయ సాహితి మొదటి సంపుటం – పేజీ -227
- ఈనాడు – ఆత్రేయ సాహితి మొదటి సంపుటం – పేజీ -243
- ఈనాడు – ఆత్రేయ సాహితి మొదటి సంపుటం – పేజీ -243
- ఎన్. జి. ఓ. – ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -33
- ఎన్. జి. ఓ. – ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -44
- ఎన్. జి. ఓ. – ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -68
- ఎన్. జి. ఓ. – ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -43
- పైదే
- విశ్వశాంతి - ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ - 84
- విశ్వశాంతి - ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -77
- విశ్వశాంతి - ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -93
- విశ్వశాంతి - ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -92
- విశ్వశాంతి - ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -107
- విశ్వశాంతి - ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -87
- విశ్వశాంతి - ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -93
- పైదే
- విశ్వశాంతి - ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -165
- విశ్వశాంతి - ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -170
- విశ్వశాంతి - ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -175
- పైదే
- విశ్వశాంతి - ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -237
- విశ్వశాంతి - ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -245
- విశ్వశాంతి - ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -253
- విశ్వశాంతి - ఆత్రేయ సాహితి రెండవ సంపుటం – పేజీ -301
- అక్షర యోగి ఆచార్య ఆత్రేయ - పేజీ -1
- అక్షర యోగి ఆచార్య ఆత్రేయ - పేజీ -10
11. ఉపయుక్తగ్రంథసూచి:
- కృష్ణకౌండిన్య, తండు. (సంపా). (2022). అక్షర యోగి ఆచార్య ఆత్రేయ, వందనా పబ్లికేషన్స్, నల్లగొండ.
- జగ్గయ్య, కొంగర. పైడిపాల. (సంపా). (1990). ఆత్రేయ సాహితి, మొదటి సంపుటం, మనస్విని పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్, మద్రాసు.
- జగ్గయ్య కొంగర, పైడిపాల (సంపా). (1990). ఆత్రేయ సాహితి, రెండవ సంపుటం, మనస్విని పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్, మద్రాసు.
- పృధ్వీరాజ్, తలతోటి.(2020) నేనూ – ఆత్రేయ, ఇండియన్ హైకూ క్లబ్ పబ్లికేషన్స్, విశాఖపట్నం.e-బుక్. 28-08-24.
- పైడిపాల. (2015). ఆత్రేయ నాటక ప్రస్థానం, విశాలాంధ్ర పబ్లిషర్స్, హైదరాబాద్.
- రమణ, పి.వి. (1995). సాంఘిక నాటకం - పరిణామ వికాసం, నవయుగ బుక్ హౌస్, హైదరాబాద్.
- రవిచంద్ర, పొన్నం. మనసు కవి మన సుకవి ఆచార్య ఆత్రేయ,నవతెలంగాణ దినపత్రిక, May 08,2022(e-వ్యాసం). 26-08-24.
- సుబ్బారావు, పి. వి. అడుగంటిన ఆశయాలకు మాటలు నేర్పాడు,జాగృతి, వారపత్రిక, 13-19, July 2020. (e-వ్యాసం).
- సారథి, మోటమఱ్ఱి. మనసు వంతెన కట్టిన ఆచార్య ఆత్రేయ, సారంగ పత్రిక, మే-2022 (e-వ్యాసం). 27-08-24.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

