headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-5 | Issue-11 | October 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

6. మధ్యయుగ ఆంధ్రదేశం: దేవాలయాల పాత్ర

డా. బొల్లేపల్లి సుదక్షణ

సహ ఆచార్యులు, చరిత్రశాఖ,
ప్రభుత్వ సిటీ కళాశాల (స్వ),
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9849520572, Email: sudhakshanabollepally@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.09.2024        ఎంపిక (D.O.A): 29.09.2024        ప్రచురణ (D.O.P): 01.10.2024


వ్యాససంగ్రహం:

మధ్యయుగకాలంలో దేవాలయాలు మతపరమైన సంస్థలుగానేకాకుండా, సామాజిక, ఆర్థిక, రాజకీయకార్యకలాపాలకు కేంద్రంగా ముఖ్యపాత్రను పోషించాయి. ఇట్టి పాత్రను పోషించడానికి అవి స్వంత ఆర్థిక సంపదను, దాని నిర్వహణ కోసం స్వంత పరిపాలన యంత్రాంగాన్ని కలిగి ఉన్నాయి. మతపరమైన సంస్థలుగా వీటిని రాజ్యంతోపాటు వివిధ యాజమాన్య సమూహాలు పోషించాయి. ఫలితంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ, సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక రంగాలలో అనేక రకాలుగా మమేకమై సమాజాభివృద్ధికి హితోధికంగా ఉపయోగపడ్డాయి. భూయజమానిగా దేవాలయ భూములసాగుకు దోహదపడటమేగాక వ్యవసాయదారులకు, వర్తకులకు రుణాలనిచ్చాయి. పూజారులు, నాట్యకారులు, సంగీతకారులు, వాస్తుశిల్పులు, దేవాలయ పనులు నిర్వహించే కార్మికులు, దేవదాసీలకు ఉద్యోగితను, జీవన భృతిని కల్పించాయి. రాజకీయ చట్టబద్ధత, ఆర్థిక ఉద్దీపన, సాంస్కృతిక పోషణ, దైవ, మత సంప్రదాయాల రక్షణ, సామాజిక ఐక్యత, సాంఘిక, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే సంస్థగా, విద్యా విజ్ఞాన కేంద్రాలుగా అనేక పాత్రలు నిర్వహించాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక దార్శనికత్వాన్ని నిర్వహిస్తూ, హిందూమత ధార్మిక, సాంప్రదాయ, సంస్కృతులను ముందు తరాలకు పదిలంగా అందించడంలో ముఖ్యపాత్ర నిర్వహించాయి. మధ్యయుగ ఆంధ్రదేశంలో దేవాలయాలు నిర్వహించిన వివిధ కార్యక్రమాలను మరియు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో దేవాలయాల పాత్రను వివరించడం ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దేవాలయాలపై ఏ. సూర్యకుమారి ‘ద టెంపుల్ ఇన్ ఆంధ్రదేశ’ గ్రంథాన్ని, ఎం. కృష్ణకుమారి ‘సోషల్ అండ్ కల్చరల్ లైఫ్ ఇన్ మిడి వియల్ ఆంధ్రదేశ’ గ్రంథాన్ని, అల్లాడి వైదేహి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’, మలయ శ్రీ రచించిన ‘కాకతీయుల కాలం నాటి సామాజిక జీవనం’, మరియు ఆర్. ఆర్. రావు రచించిన ‘ఏన్షియంట్ అండ్ మిడివియల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ మొదలైన గ్రంథాల వివరణను ఇచ్చాయి. ఇవి వ్యాస రచనలో విషయ సేకరణార్థం ద్వితీయ ఆధారాలైన గ్రంథాలను పరిశీలించడం జరిగింది. చారిత్రిక అంశాల సేకరణ పద్ధతిలో రాయబడిన ఈ వ్యాస విభజనలో భాగంగా ఉపోద్ఘాతం, మధ్యయుగ కాలంలో దేవాలయాలు, వాటి నిర్వహణ, ఆర్థిక సంపత్తి, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో దేవాలయాలు పోషించిన పాత్ర ముగింపు మొదలైన అంశాలు పొందుపరచబడ్డాయి. ఈ పరిశోధన వ్యాసం వలన మధ్యయుగ ఆంధ్రదేశంలో దేవాలయాలు ఏ విధమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయో, ఎటువంటి పాత్రను నిర్వహిస్తాయో వెలుగులోనికి తేవడం జరిగింది.

Keywords: దేవాలయాలు, వాస్తు శిల్ప కళాకారులు, దేవదాసీలు, ఆర్థిక ఉద్దీపన, ఆధ్యాత్మిక దార్శనికత, సంస్కృతి, వారసత్వం, ధార్మిక సంప్రదాయాలు, తులా పురుషదానం, కొట్టరవు, సాని మున్నూరు.

1. ఉపోద్ఘాతం:

మధ్యయుగ దక్షిణ భారతదేశంలో దేవాలయాలు బహుముఖ పాత్ర వహించాయి. ఆలయ సంస్కృతి ఆవిర్భావం ప్రారంభ కాలం నుండి భారతీయ ప్రజల జీవితాల్లో ముఖ్యమైనదిగా నిలిచింది. దేవాలయాలు బహుళార్థక సాధక సంస్థలుగా శతాబ్దాలుగా ప్రజల మత, సామాజిక మరియు సాంస్కృతిక జీవితాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఇది ఒక సంక్లిష్టమైన సంస్థ. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలుగానే కాకుండా సమాజంలో వివిధ రంగాలలో, వివిధ వర్ణాల, వివిధ వర్గాల, మతాల వారికి జీవికను కల్పించే యజమానిగా పూజా నిర్వహణ, నైవేద్యాల తయారీ, దేవతాలంకరణ, దీపాలంకరణ, వినోదం, పవిత్ర గ్రంధాల పారాయణం, ధర్మసత్రాలు, మఠాల నిర్వహణ, పాఠశాలలు, వసతిగృహాల నిర్వహణ, దేవాలయ సిబ్బందిని, సందర్శించే యాత్రికులను, భక్తులను చూసుకోవడం, దేవాలయ మరమ్మత్తులు, పునర్నిర్మాణం, దేవాలయ ఆస్తుల పరిరక్షణ, ప్రసాదాల పంపిణీ, ఉత్సవాలు, ఊరేగింపులు, మొదలైన దేవాలయ సంబంధిత పనులతోపాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మత రంగాలలో తనదైన పాత్ర నిర్వహిస్తూ రాజ్య, సామాజిక అభివృద్ధికి హితోధికంగా కృషి చేశాయి.

2. దేవాలయపాలన:

రాజుల, సామంతుల, ప్రభువుల, ఉన్నతోద్యోగుల, ధనవంతుల, భక్తుల విరాళాలు, దానాలతో ఆలయం సుసంపన్నమైంది. భూమి, బంగారం, వెండి, వజ్రాలు, విలువైన నగలు, ధాన్యం, పశువులు మొదలైన ఆస్తులు కలిగిన సంస్థగా అవతరించింది. ఈ సంపదను కాపాడుకోవడానికి రక్షణ అవసరమైంది. దానికోసం దేవాలయ పాలకవర్గం ఏర్పడింది. ఈ పాలక వర్గాన్నిఆలయంలో చేసే సేవల ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. వారు 1. ఆలయ నిర్వహణలో ఉండేవారు (ఆలయ పాలకవర్గం) 2. పూజాది క్రతువులు, అర్చక విధులను నిర్వహించేవారు. ఆరాధన మంత్రాలు మరియు ఇతర మతపరమైన సేవలను నిర్వహించేవారు. 3. ఇతర ఉద్యోగులు. వీరిలో శాశ్వత ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు ఉండేవారు. మహా స్థానాధిపతి, స్థానాధిపతి, కొట్టరువు అను అధికారులు ఆలయ పరిపాలనలో విశేషమైన స్థానాన్ని అతిక్రమించారు. వీరిని ఆలయ ధర్మకర్తల మండలి అనేవారు. స్థానాధిపతి దేవాలయానికి గ్రాంట్లను పొంది వాటిని ఉపయోగితలోనికి తెచ్చే విధిని నిర్వహించేవాడు. వీరితోపాటు కోశాధికారి అకౌంటెంట్లు(గుమస్తాలు) ఉండేవారు. వీరు ఆలయ పరిపాలనను చూసుకునేవారు. ఆలయానికి వచ్చే విరాళాలు, చందాలు, దానాలను స్వీకరించి వాటిని సరిగా ఉపయోగించడం దానికి సంబంధించిన లెక్కలను రాసి ఉంచడం దేవాలయం ఆస్తుల రక్షణ, అప్పులు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మొదలైన పనులను చూసుకునేవారు.

ఇక రెండవ తరగతిలో బ్రాహ్మణ పూజారులు, అర్చకులు, బ్రాహ్మణేతర పూజారులు, పండితులు, పారాయణకారులు ఉండేవారు. అర్చక సేవలు నిర్వహించడానికి బ్రాహ్మణ కులానికి చెందిన వారే కాకుండా బ్రాహ్మణేతరులు కూడా పూజారులుగా నియమించబడేవారు. కొన్ని శైవ దేవాలయాలలో ‘తమ్మల’ కులంవారు, ‘జంగములు’ పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారు.

మూడవ తరగతి ఉద్యోగులలో సంగీతకారులు, నాట్యకారులు, వాయిద్యకారులు, గాయకులు, వాస్తు కళాకారులు, తోటమాలులు, కాపలాదారులు, పుష్పాలు సేకరించేవారు, మాలలు తయారు చేసేవారు, ప్రసాదాలు తయారు చేసేవారు, వింజామరలు వీచేవారు, దేవతా వస్త్రాలు శుభ్రం చేసేవారు, దేవతాలంకరణ చేసేవారు, ఊడ్చేవారు, వంటశాలలో పని చేసేవారు, పాత్రల శుభ్రం చేసేవారు, నీరు తెచ్చేవారు, దీపాలు శుభ్రం చేసేవారు, దీపాలు వెలిగించేవారు, కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, వడ్రంగి, కంసాలి, జ్యోతిష్యులు, పశువులు కాసేవారు, పాలు పితికేవారు, శంఖం ఊదేవారు, రాతిమేస్త్రిలు, వాస్తు శిల్పులు, హస్తకళాకారులు, శిల్పకళాకారులు, సత్రాలలో పని చేసేవారు, వంట చెరుకు సమకూర్చేవారు, కూరగాయలు సేకరించేవారు, దేవాలయాలలో ఉండే రోజువారి వివిధ కార్యక్రమాలు నిర్వహించే ఉద్యోగులు ఉండేవారు.

దేవాలయాలు తమ సేవల కోసం మహిళా సేవకులను కూడా నియమించాయి. వీరిని సానులు లేదా గుడి సానులు అనేవారు. దాక్షారామంలోని భీమేశ్వరాలయంలో 600 మంది సానులు ఉండేవారని క్రీ.శ.1084నాటి దాక్షారామ శాసనం చెప్తుంది. వీరు దేవతల అంగరంగ భోగాల కోసం మరియు ఇతర సేవల కోసం నియమింపబడేవారు. వీరికి సంఘం కూడా ఉండేది. దీనినే సాని మున్నూరు, సానులు మానులు లేదా మున్నూటి సానులు అనేవారు. వీరు తమ సేవల ద్వారా ఆధ్యాత్మికతను, నృత్య ప్రదర్శనల ద్వారా భక్తులలో భక్తి భావజాలాన్ని ప్రచారం చేయడంలో ముఖ్య పాత్ర వహించారు.

3. దేవాలయఖజానా:

దేవాలయ ఖర్చులకు, ఉత్సవాలకు, ఊరేగింపులకు, ఉద్యోగుల జీతాలు మొదలైన ఆర్థిక కార్యకలాపాల కోసం ఆదాయం అవసరమయ్యేది. ఇట్టి ఆదాయం దానాల ద్వారా, విరాళాల ద్వారా, చందాల ద్వారా నగదు, వస్తు రూపంలో వచ్చేవి. రాజులు, రాణులు, సామంతులు, ప్రభువులు, ఉన్నత ఉద్యోగులు, ధనవంతులు, భక్తులు దాన, వస్తురూపేణా దేవాలయాలకు సమర్పించేవారు. ఉదాహరణకు క్రీ.శ.1510 నాటి అమరావతి శాసనం శ్రీకృష్ణదేవరాయలు చేసిన విరాళాలను వివరిస్తుంది.1 ఈ శాసనం ఆయన తన ఇద్దరు రాణులతో అమరేశ్వర ఆలయాన్ని సందర్శించి తులాపురుష దానాన్ని చేసినట్లు చెబుతుంది. ఈ దానంలో స్వచ్ఛమైన మేలిమి బంగారాన్ని వాడుతారు. ఆయన బరువుతో సమానంగా తూచిన ఈ దానంలో సగం బ్రాహ్మణులకు, సగం గురువులకు దానం చేసేవారు. క్రీ.శ. 1345 అమరావతి శాసనం ప్రోలయ వేమారెడ్డి యాత్రికుల సౌకర్యార్థం ఉచిత భోజనం పెట్టే ధర్మసత్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్తుంది. ఈ విధంగా వచ్చిన సంపద దేవాలయానికి చెందేది. దీనినే శ్రీ భాండారం లేదా ఆలయ ఖజానా అనేవారు. ఇది ఆలయం యొక్క ముఖ్యమైన కార్యాలయం. దీనిపైన ‘కొట్టరువు’ అధికారిగా ఉండేవాడు. ఆలయాల ఆదాయ వ్యయాల లెక్కలను నిర్వహించే ఇతర అధికారులు ‘కరణాలు’ మరియు ‘కార్మికరణాలు’ వీరు దేవాలయ సిబ్బందిని నియమించి జీతాలను ఇచ్చేవారు.

4. జీతాలు / వాటాలు:

దేవాలయాలకు ఉద్యోగులు చేసిన సేవలకు సంబంధించి భూమి మరియు వాటాలతోపాటు నగదు రూపంలో క్రమం తప్పకుండా జీతాలు చెల్లించేవారు. 16వ శతాబ్దంలో కర్నూలు జిల్లాకు చెందిన చిన్న అహోబిలం దేవాలయానికి చెందిన బహుమానాది ధర్మశాస్త్రంలో ఆలయం పొందిన గౌరవ దానా లు, వాటా లు ప్రస్తావించబడ్డాయి.2 అహోబిలాన్ని ముస్లింల చేతి నుండి విజయవంతంగా స్వాధీనం చేసుకున్నందుకు మరియు ఆలయాన్ని పునరుద్ధరించినందుకు ఆలయంలోని స్థానం వారైన వెంకటరాజు మరియు తిరుమల రాజుకు ఆలయ ప్రసాదంలో వాటానిచ్చారు.

ఆలయ విధులు నిర్వహణ కోసం భూమి మరియు ఆలయ ప్రసాదాలలో వాటాలతో పాటు నగదు జీతం చెల్లించబడింది. క్రీ.శ.1084 నాటి దాక్షారామంలోని ఆలయంలో ఒక శాసనం ఆలయంలోని వివిధ సేవకులకు అందిస్తున్న నగదు, వస్తురూపంలో ఇస్తున్న జీతాలను వివరిస్తుంది. ఒక్కోసారి సేవకులకు ఆలయం పన్ను మినహాయింపులను ఇచ్చేది. పాలకొల్లులో 13వ శతాబ్దానికి చెందిన ‘పన్నగుడు’ అనే శాసనం మరమ్మత్తు పనులకు హాజరయిన ‘కాసా’ (తాపీ మేస్త్రి)కి పన్ను నుండి మినహాయింపు నిచ్చింది. అంతేగాక కొంత భూమిని, కొంత ధనాన్ని ఇంటి స్థలం కోసం ఇచ్చింది. ఆలయ సేవకులకు దేవాలయం ఒక్కోసారి జీతాలతోపాటు లేదా జీతాలకు బదులుగా భూములు కేటాయించేది. అయితే ఇట్టి భూములపై దేవాలయానికే పూర్తి హక్కు ఉండేది. వారు ఆ భూములను విక్రయించరాదు. తనకా పెట్టరాదు. దానిపై వచ్చే ఆదాయాన్ని అనుభవించడానికి మాత్రమే వారు అర్హులు. విజయనగర శాసనాల ప్రకారం ‘దేవతా ప్రయోజనాలు’ ‘మహారాజ ప్రయోజనాలు’ అవే పన్నులు గ్రామస్తుల నుండి వసూలు చేయబడేవి. ఇవి కేవలం దేవాలయం కోసం వాడబడేవి. దేవాలయ ఉత్సవాలు, పండుగలు జరుపుటకు ఈ ధనం వాడబడేది. మధ్యయుగ దక్షిణ భారతదేశంలోని దేవాలయాలు విరివిగా విరాళాలను పొందాయి. ఇవి భూముల రూపంలో, నగదు రూపంలో, వస్తు రూపంలో, పశువుల రూపంలో, ధాన్యం రూపంలో ఉండేవి.

ఈ విధంగా వచ్చిన విరాళాలను నిర్వాహకుల ఆధ్వర్యంలో ఉంచారు. దానిపై ఆధారపడిన యాజమాన్య హక్కులను దేవాలయం అనుభవించింది. నివాసితులు, గుడి ఉద్యోగులు ఆలయ భూమిని కౌలుకు తీసుకున్న వారు, ఆలయ అధికారులు కూడా దాత నుండి (ఆలయము నుండి) వారి సేవలకు నేరుగా భూమిని స్వీకరించారు. ఆ విధంగా ఆలయం దాని సొంత నియంత్రణలో ఉన్న భూమి నుండి కూడా చాలా ఆదాయాన్ని పొందింది. భూదానాల వల్లనే దేవాలయం పెద్ద భూస్వామిగా మారింది. ఈ ఆదాయాలు ఆలయ రక్షణ కోసం చెల్లించిన బకాయిలు స్థానిక ప్రజలకు అందించడం (రక్ష భోగం), శిస్తు వసూలు చెల్లించని వారిని శిక్షించడం (దండం), మరియు ఇతర మార్గాల ద్వారా దానాలు, విరాళాల ద్వారా ఆలయానికి ఆదాయం, ఆర్థిక బలం చేకూరేది. ఈ బలం సమాజాన్ని సుస్థిరమైన సంస్థగా, మెరుగైన ఉత్పత్తి నిర్వహణకు, అభివృద్ధికి అనువైన విధానాలను వ్యవస్థీకరించడంలో దేవాలయాలు ముఖ్యపాత్ర వహించాయి.

5. దేవాలయాలు పోషించిన ముఖ్యపాత్రలు:

దేవాలయం అనేక విధులను నిర్వహించింది. ఈ విధుల ద్వారా సమాజంలో కీలక పాత్ర పోషించింది. ప్రారంభకాలంలో దేవాలయాలు సాధారణ సంస్థలు. కానీ, మధ్యయుగ కాలం నాటికి అతిపెద్ద దేవాలయాలను నిర్మించడం వలన దేవాలయ నిర్మాణం, నిర్వహణ కోసం అనేకమంది ఉద్యోగులను, కార్మికులను నియమించడం జరిగింది. ఫలితంగా దేవాలయాలు అనేక ఉపాధి అవకాశాలను కల్పించాయి. రోజువారీ దేవాలయ నిర్వహణలో నియమించబడిన ఉద్యోగులకు దేవాలయ శ్రీ భాండారం (దేవాలయ ఖజానా) జీతాలను ఇచ్చేది. ఇది ధన, ధాన్యం,వస్తు, భూముల రూపంలో ఉండేది. ఒక్కోసారి వారి పనిమీద ఆధారపడి ప్రత్యేక మినహాయింపులు కూడా ఇవ్వబడేవి.

దేవాలయం ఆచారం ప్రకారం ప్రతిరోజూ సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమయం మరియు అర్థరాత్రి సమయాలలో నాలుగు వేడుకలు జరిగేవి. 4 ఇవి గర్భగది తలుపులు తెరవడంతో ప్రారంభమై మళ్ళీ మూసేవరకూ కొనసాగేవి. ఇందులో భాగంగా దెవతా మూర్తులకు అభిషేకానికి నీళ్ళు తేవడం, అలంకరణ, పూజాది క్రతువ్లు, నైవేద్యాలు సమర్పించడం, ఉత్సవాల సమయాలలో ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలు, కళ్యాణాలు, ఊరేగింపులు ఉంటాయి. ఈ పనులన్నింటి కోసం పెద్దసంఖ్యలో ఉద్యోగులు నియమింపబడేవారు. వారిలో వివిధ వృత్తులకు, కులాలకు చెందినవారు ఉండేవారు. వారిలో పూజాది క్రతువులు నిర్వహించే బ్రాహ్మణులు, దేవాలయాన్ని, దేవతామూర్తులను అలంకరించేవారు, పూలు సేకరించేవారు, పూల మాలలు కట్టేవారు, తోటమాలి, అభిషేకానికి నీరు తెచ్చేవారు, ప్రసాదాలు తయారు చేసేవారు, పంపిణీ చేసేవారు, పరిమళ గంధాలు తయారు చేసేవారు, వంట చెరుకు తెచ్చేవారు, దీపాల్ని వెలిగించేవారు, చామరం వీచేవారు, ద్వారపాలకులు, ఊడ్చేవారు, వంట పాత్రలు శుభ్రం చేసేవారు, నాట్యకారులు, సంగీతకారులు, వాయిద్యకారులు, మేళగాండ్లు, శంఖం ఊదేవారు, కాపలాదారులు, ధర్మసత్రాలు, మఠాలు చూసుకునేవారు, విద్యా వసతి గృహాల నిర్వహణను చూసుకునేవారు, భక్తుల, యాత్రికుల వసతి చూసుకునేవారు, దేవాలయ మరమ్మత్తులు చేసేవారు, వాస్తు, శిల్పకారులు, కుమ్మరి, కమ్మరి స్వర్ణకారులు, చాకలి, మంగలి, ఆలయ భూముల కోసం కాలువలు, చెరువులు నిర్మించేవారు మొదలైన వారిని నిర్మించేది. (ఉదాహరణకు భీమేశ్వర దేవాలయానికి చెందిన ఒక శాసనం ప్రకారం దొంగలు శివాలయంలోని నందిని ధ్వంసం చేయగా దేవాలయ శ్రీభాండారం నంది విగ్రహ పునర్నిర్మాణానికి నరసింహుడు అనే శిల్పిని నియమించినట్లు తెలుస్తుంది.)5 అదేవిధంగా వివిధ సేవలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఉదాహరణకు క్రీ.శ.1288లో సింహాచలంలో వేయబడిన ఒక శాసనం ప్రకారం గంగాధరాజీయన చేసిన విరాళంతో సింహాచలం నృసింహ దేవుని ముందు ఉభయ ధూపాలు వేసే సమయంలో చామరం వీయడానికి ఉద్యోగులకు ఏర్పాటు చేసింది.6 అదే శాసనంలో శ్రీభాండారం స్వీకరించిన కానుకల ద్వారా దేవతలకు ఫిర్మా లేదా పుణ్య స్నానాల నిర్వహణ కోసం ఆలయ ఉద్యోగులను నియమించింది. అదేవిధంగా క్రీ.శ.1121లో దేవాలయ కానుకలతో కాలువ త్రవ్వబడింది. మరియు విక్రమాదిత్య మంగళ గ్రామంలో క్రీ.శ.1439 నాటి రికార్డు ప్రకారం శ్రీభాండారం నుండి తీసిన ధనం ద్వారా చెరువును తవ్వినట్టు తెలుస్తుంది.7 ఈ విధంగా మధ్యయుగకాలంలో దేవాలయాల సంఖ్య పరిమితంగానే ఉన్నా వాటి అభివృద్ధి మరియు ప్రయోజనాల కోసం అవసరమైన సమయాలలో అనేక పనులను ప్రోత్సహిస్తూ వారి వృత్తి మరియు స్థానికత ఆధారంగా ప్రతి కులాన్ని, ఉప కులాలను మరియు వర్ణాలకు విలక్షణమైన పాత్రలు, విధులు, హోదాలకు అందించి వారి జీవనోపాధికి కారకం అవ్వడమేగాక తద్వారా సమాజాభివృద్ధిలో భాగస్వామి అయింది. ఈ విధంగా మధ్యయుగ కాలంలో దేవాలయాలు జీవనోపాధిని కల్పించే యజమానిగా తద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్రను పోషించాయి.

6. రాజకీయాంశాలలో ముఖ్యపాత్ర:

మధ్యయుగ కాలాలలో దేవాలయాలు అధికారానికి చిహ్నాలుగా మారాయి. రాజ్యాధికారానికి మార్గం సుగమం చేశాయి. రాజులు పరిపాలన చేసే దైవిక హక్కులను బలపరిచాయి. దేవాలయాలు శాశ్వత స్మారక చిహ్నాలుగా భవిష్యత్తు తరాలకు రాజవంశ వారసత్వాన్ని భద్రపరిచాయి. పాలకులు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను మరియు దేవతల రక్షణను కోరుకున్నారు. రాజులు దైవిక శక్తులతో తమను తాము దైవ సంభూతులుగా చెప్పుకున్నారు. కొన్నిసార్లు రాజుల పట్టాభిషేకాలు, రాజ్య ఉత్సవాలు దేవాలయాలలో జరుగుతూ ఉండేవి. దేవాలయానికి, రాజ్యానికి, రాజవంశానికి సన్నిహిత సంబంధం ఉండేది. రాజులు దేవాలయాలకు భారీ విరాళాలు ఇచ్చేవారు. భూములను దానాలుగా ఇచ్చేవారు. దేవాలయం పన్ను నుండి మినహాయింపును పొందింది. రాజ్య వంశ రక్షణలో వారికి దైవ బలం, అనుగ్రహం కల్పించింది. రాజులు తమ కీర్తి ప్రతిష్టలకు, వారసత్వంగా నిర్మించిన అద్భుతమైన దేవాలయాలు రాజకీయంగా గొప్ప దౌత్య సాధనాలుగా నిలిచాయి. ఇరుగుపొరుగు రాజ్యాలతో సంబంధం బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించాయి. అంతేకాకుండా మారుమూల గ్రామాలలో కూడా రాజశాసనాలను ప్రచారం చేయడానికి ప్రజల వద్దకు చేర్చడానికి సాధనాలుగా పనిచేశాయి.

వ్యవసాయ అభివృద్ధిలో దేవాలయాల విరాళాలు, గ్రాంట్లు ద్వారా ఆస్తులను, ధనాన్ని, భూములను కలిగి సంపన్న సంస్థగా ఆవిర్భవించాయి. ఈ సంపదను, భూములను వ్యవసాయ అభివృద్ధి కోసం, నీటి సాగుదల అభివృద్ధి కోసం ఉపయోగించాయి. అడవి భూములు మరియు వ్యర్థ భూములను పునరుద్ధరించి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డాయి. ఈ విధంగా విస్తారమైన భూములు కలిగి దేవాలయం పెద్ద భూస్వామిగా మారింది. ఆలయం వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థలో రైతుల నుండి మిగులును సులభంగా మరియు సమర్థవంతంగా వెలికి తీసేందుకు ఒక ఏజెన్సీగా పనిచేసింది. అంతేగాక గిరిజన ప్రాంతాలలో వ్యవసాయాన్ని విస్తరించడానికి భూస్వామ్య ఆధిపత్యాన్ని ఏకీకృతం చేయడానికి దోహదపడింది. వ్యవసాయదారులు తమ భూముల నీటిపారుదలకు దేవాలయాలపై ఆధారపడ్డారు. దేవాలయాలు కూడా అందుకు అనుగుణంగా ప్రవర్తించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డుల ప్రకారం క్రీ.శ.1459లో తిరుపతి నుండి తిరుమల వరకు దేవాలయ ధనాన్ని ఉపయోగించి ఒక కాలువ నిర్మించడం జరిగింది. అదేవిధంగా క్రీ.శ.1455లో తిరుపతిలోని గోవింద రాజా స్వామి ఆలయానికి ఎదురుగా ఒక నీటి పరివాహకాన్ని (కాలువను) ఏర్పాటు చేశారు.8 వ్యవసాయ అభివృద్ధితోపాటు పూలు, పండ్లు, కూరగాయల తోటల పెంపకం కూడా అభివృద్ధి చేయబడింది. శ్రీకూర్మం ఆలయ శ్రీ భాండారం ఉద్యానవనం ఏర్పాటు చేయడానికి, నిధులను సమకూర్చిందని క్రీ.శ.1269 నాటి ఆలయ శాసనం చెప్తుంది. అదేవిధంగా క్రీ.శ.1335లో సింహాచలం దేవాలయం శాసనం కూడా ఇప్పవనం ఏర్పాటు చేయడానికి ఆలయ శ్రీ భాండారం నుండి నిధులు విడుదల చేసినట్లు చెప్తుంది.

7. వర్తకవాణిజ్యాలలో దేవాలయపాత్ర:

మధ్యయుగంలో ప్రజల సామాజిక, ఆర్థిక కార్యకలాపాలకు దేవాలయం అగ్రగామిగా మారి ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించింది. గ్రామాలు, పట్టణాలలో వర్తకం, వాణిజ్యం అభివృద్ధి చెందడానికి దేవాలయం కేంద్రకంగా మారింది. దేవాలయాల చుట్టుపక్కల వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా పట్టణీకరణ పెరిగింది. గొప్ప గొప్ప పట్టణ స్థావరాలు, గొప్ప గొప్ప దేవాలయాలకు అనుబంధంగా ఏర్పడ్డాయి. తీర్థయాత్ర స్థలాలలో ఉపాధి అందించడం ద్వారా వర్తక వాణిజ్యాలను పెంపొందాయి. ఆలయాలకు వచ్చే తీర్థయాత్రికుల సంఖ్య పెరగడం వలన ఆలయాలకు రవాణా మార్గాలు వేయబడ్డాయి. ఫలితంగా దేవాలయాలు చుట్టూ నగరాలు ఏర్పడ్డాయి. ఈ రవాణా కమ్యూనికేషన్ యొక్క సన్నిహిత నెట్వర్క్ ద్వారా సాంస్కృతిక మరియు రాజకీయ ఏకీకరణకు, వ్యాపారాభివృద్ధికి మార్గం సుగమం అయింది. వ్యాపారస్తులు తమ వస్తువులను అమ్మడానికి దేవాలయం నిజాయితీగల వినియోగదారుడుగా ఉండి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడింది. దేవాలయానికి ఉపయోగపడే వస్తు సామగ్రి స్థానికంగా ఉత్పత్తి చేయడం ద్వారా అనేక వృత్తుల వారు, వర్తకులు ఆర్థికంగా ఎంతో లాభపడ్డారు.

8. పరిశ్రమల అభివృద్ధిలో దేవాలయాల పాత్ర:

మధ్యయుగకాలంలో దేవాలయాల చుట్టూ జనావాసాలు ఏర్పడి కాలక్రమేణా పట్టణాలుగా అభివృద్ధి చెందాయి. దేవాలయ అవసరాల కోసం అనేక పరిశ్రమలు ఏర్పడ్డాయి. వాటిలో విభిన్న వృత్తులు నిర్వహించే వారికి ఆర్థిక ఉద్దీపన లభించింది. ముఖ్యంగా కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, స్వర్ణకారులు మొదలైన హస్తకళాకారుల సంఖ్య పెరిగింది. వారు చేసే వస్తువులకు దేవాలయాలలో మంచి గిరాకీ ఉండేది. ఫలితంగా ఇట్టి హస్త కళాకారులు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందారు. వీరితోబాటు ఇనుప, కాంస్యం, ఇత్తడి, వెండి, బంగారు వస్తువులు చేసే కళాకారులకు బాగా డిమాండ్ ఉండేది. ముఖ్యంగా గంటలు, తలుపులు, ద్వారాలు, దీపపు స్తంభాలు, పూజా సామాగ్రి, లోహ విగ్రహాలు, పళ్లేరాలు మొదలైన దేవాలయంలో అవసరమయ్యే వస్తువులను తయారు చేసే పరిశ్రమలు వెలిశాయి. ఫలితంగా ఎందరో కళాకారులకు ఉద్యోగిత లభించింది. కొన్ని పరిశ్రమలకు దేవాలయం సహాయం కూడా లభించింది. వాటికి దేవాలయం వడ్డీతో కూడిన నిధులను సమకూర్చింది. పై వారితో పాటు రాతి విగ్రహాలు, లోహ శిల్పాలు, చెక్కరధాలు మొదలైనవి చేసే కళాకారులకు ఎంతో ప్రోత్సాహం లభించింది. ఆలయాలు ఇచ్చిన రుణాల వలన దేవాలయ అవసరాల కోసం ఎన్నో పరిశ్రమలు వెలిసి ఫలితంగా వర్తక వాణిజ్యాలు పెరిగి, పట్టణాలు ఏర్పడి అభివృద్ధి జరిగింది.

9. రుణాలు ఇచ్చే సంస్థ (బ్యాంకర్)గా దేవాలయం:

ప్రజల సామాజిక, ఆర్థిక కార్యకలాపాలకు అగ్రగామిగా మారి గ్రామాలు, పట్టణాలు, వర్తకం, వాణిజ్యం అభివృద్ధి చెందడానికి దేవాలయం కేంద్రకంగా మారాయి. ఇవి స్థానిక మరియు ప్రాదేశిక పరిపాలన సంస్థలతో సన్నిహిత సంబంధం కలిగి ఉ న్నాయి. దేవాలయం భూస్వామి మరియు యజమాని. దాని శ్రీ భాండారం (ఖజానా) బ్యాంకుగా వ్యవహరించింది. డిపాజిట్లను స్వీకరించి ప్రతిగా డబ్బును వడ్డీలకు అప్పుగా ఇచ్చింది. ఆర్థిక కార్యకలాపాల వలన వచ్చిన ధనాన్ని సమాజాభివృద్ధికి ఉపయోగించింది. దాతలు, రాజ కుటుంబాలు, వర్తకులు, ఉన్నత ఉద్యోగులు, సామంతులు, దేవాలయాలకు ఇచ్చిన అపారమైన బంగారం, భూములు, పశువులు, డబ్బు లభ్యత కారణంగా మధ్యయుగ కాలంలో దేవాలయాలు బ్యాంకర్ గా అవతారమెత్తి ఆర్థిక విధులు నిర్వహించాయి. రుణదాతలుగా పనిచేశాయి. దేవాలయాలు వడ్డీ ప్రాతిపదికన సొసైటీలకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు రుణాలు ఇచ్చాయి. సాధారణంగా ఆలయానికి వడ్డీ నగదు రూపంలో తిరిగి చెల్లించబడేది. లేదా వడ్డీకి బదులుగా కొన్ని నిర్దేశిత వస్తువులను ఆలయానికి సరఫరా చేయాలనే షరతుపై దేవాలయాలు రుణాలు ఇచ్చాయి. ఆ వడ్డీతో దేవాలయాలు, విరాళాలు ఇచ్చిన ఉద్దేశ్యాన్ని నెరవేర్చేవి. వివిధ అవసరాల కోసం గ్రామ సభలకు రుణాలు ఇవ్వడం ద్వారా ఒక ప్రాంతంలో నిధుల సమీకరణలో దేవాలయాలు ప్రముఖ పాత్ర పోషించాయి. ఆలయ బ్యాంకు ఖాతాదారులలో గ్రామసభలు ప్రధానమైనవి. ఈ విధంగా అప్పుగా తీసుకున్న డబ్బును అందుకున్నట్లు చెప్పబడిన అనేక గ్రామసభలు, బంజరు భూములను సాగులోనికి తీసుకురావడానికి ఉపయోగించబడ్డాయి. వర్షభావ పరిస్థితుల్లో గ్రామసభ సభ్యులు ఆలయ ఖజానాకు దరఖాస్తు చేసుకుంటే ఆలయం ధనం, ధాన్యం, నగల రూపేణా గ్రామ సభలకు ఋణం ఇచ్చి వారి ఇబ్బందులను దూరం చేసేది. అట్లాగే నీటిపారుదల సౌకర్యాలలో మరమ్మతులు చేసేందుకు గ్రామస్తులకు అప్పుడప్పుడు భూములు విక్రయిస్తూ ఉదారంగా డబ్బు అందజేశాయి. వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పెంచడంలో దేవాలయాలు సహాయపడ్డాయి. ఆర్థిక కార్యకలాపాలకే కాక సాంఘిక సంక్షేమానికి రుణాలను ఇచ్చాయి. కూతుర్ల పెళ్లిళ్లు చేసే ఆర్థిక స్థోమతలేని తల్లిదండ్రులకు వారి కుమార్తెలు వివాహాల కోసం బ్యాంకులు అప్పు ఇచ్చాయి. ఈ అప్పు కూడా ఎటువంటి హామీగాని, డిపాజిట్లుగాని, సెక్యూరిటీ గాని అవసరం లేకుండా ఇచ్చేవి. దేవాలయం భూములు సాగు చేస్తున్న వారిని నీటిపారుదల అవసరాల కోసం అప్పులు ఇచ్చేది. దేవాలయాలకు దానంగా ఇచ్చిన పశువులను పశుపోషకులకు ఇచ్చేవి. ఆ విధంగా వారికి ఆలయ సేవతో సంబంధంలో ఉంచగలిగాయి. ఇటువంటి కార్యకలాపాలు ఆర్థిక వనరులకు పంపిణీ చేయడానికి ఉపయోగపడ్డాయి. తద్వారా దేవాలయం సమాజంలో అసమానతలను తొలగించే ప్రయత్నం చేసింది. దేవాలయాలు బ్రాహ్మణేతర గ్రామ సభలకు, చిన్న రైతులకు, కుటీర పరిశ్రమలకు తమ సహాయాన్ని అందించాయి. అనేక సందర్భాల్లో ఆలయాలు అప్పుగా ఇచ్చిన సొమ్ముకు బదులు వారి భూములు స్వాధీనం చేసుకున్నప్పటికీ కరువు కాటక వరదల సమయాల్లో పేదలకు ఆపనహస్తాన్ని అందించాయి.

10. విద్యాకేంద్రంగా దేవాలయం:

దేవాలయాలు విద్య జ్ఞాన కేంద్రాలుగా ఉన్నాయి. జ్ఞానాన్ని పరిరక్షించడానికి మరియు విద్యను వ్యాప్తి చేయడానికి దోహదపడ్డాయి.

విద్యను అందించే బాధ్యతను ఏ సంస్థలు తీసుకోనందువలన ఆలయమే ప్రధాన విద్యాసంస్థగా మారింది. సొంత ప్రాంగణంలో విద్యాసంస్థలు నిర్వహించడానికి తగిన సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇట్టి సంస్థలను ఘటికలు, సాలైలు, గుహాయిలు, మఠాలు అని పిలిచారు. ఈ పాఠశాలలో మత విద్యలు ముఖ్యంగా వేదవిద్య, వ్యాకరణం, ఛందస్సు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవారు. విద్యార్థులకు, గురువులకు, వసతి గృహాలు ఏర్పాటు ఉండేది. విద్యార్థులకు ఉచిత భోజనం, దుస్తులు, పుస్తకాలు, శనివారం స్నానానికి, దీపాలకు నూనె, దీపాలు ఇచ్చేవారు. దాదాపు అన్ని దేవాలయాలు రెసిడెన్షియల్ (నివాస వసతి కలిగిన పాఠశాలలు) పద్ధతిలో, కొన్ని డేస్కాలర్లకు (బయటి విద్యార్థులు) కూడా విద్యనందించాయి. కొన్ని దేవాలయాల్లో మత విద్యతోపాటు గణితం, చరిత్ర, వైద్యం మొదలైనవి నేర్పేవారు. విద్యా విధానం యొక్క ముఖ్య లక్ష్యం మనస్సును జ్ఞానం యొక్క సాధనంగా తీర్చిదిద్దడం. మరియు దాన్ని జ్ఞానంతో నింపడం. ఆ దారిలో నడుస్తూ దేవాలయాలు విద్య, హస్తకళలు, సంగీతం, నాట్యం మొదలైన వాటిని ప్రోత్సహించి ప్రజల ఆర్థిక, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మెరుగుపరుస్తూ వచ్చాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు విద్యతోపాటు ఉచిత వసతి భోజనం సౌకర్యాలు ఏర్పాటు చేశాయి. హిందూ దేవాలయాలతోపాటు బౌద్ధ, జైన మఠాలు కూడా విద్యను అందించాయి. ఆలయ పాఠశాల విద్యార్థులు మతగురువుల నుండి వేద మరియు పౌరాణిక విద్యను నేర్చుకునేవారు. ఈ విద్యార్థులనే విద్య పూర్తయిన తర్వాత గురువులుగా నియమించేవారు. వేములవాడ దేవాలయ రికార్డుల ప్రకారం దేవాలయం మఠాలు ఏర్పాటు చేసి అందులో విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడానికి గురువులను నియమించింది.

11. కళల ప్రోత్సాహక సంస్థగా దేవాలయం:

దేవాలయం కళలు, సైన్స్ యొక్క ప్రోత్సాహక కేంద్రంగా విద్యాసంస్థను ఎంపిక చేసింది. సంగీతం, నాట్యం, వాద్య సంగీతం, వాస్తువు, శిల్పము, చిత్రలేఖనం మొదలైనవి నేర్పించాయి. భక్తి, సాహిత్యం, సంగీతం మరియు నృత్యానికి సహకరించిన అనేకమంది కవులు, స్వరకర్తలు మరియు కళాకారులకు ప్రేరణనిచ్చి ప్రోత్సాహాకాలు కల్పించింది. ఉత్సవాల సమయంలో హరికథలు, బుర్రకథలు, పురాణ గాధల పారాయణాలు, సంగీత, నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేయబడేవి. దేవాలయ సాధారణ దినచర్యలో కూడా ఇవన్నీ భాగంగా ఉండేవి. దేవతలకు జరిపే షోడషోపచారాలలో, నృత్యం, గానం ఉండేవి. మేల్కొలుపు సుప్రభాతాలు, పూజానంతరం మంగళహారతులు, పవళింపు సేవలో గానాలు నిత్యకృత్యంగా ఉండేవి. సంగీతం మరియు నృత్యాలకు అవి నిలయాలుగా ఉండేవి. రాజులులాగే దేవుడు కూడా సంగీతం, నృత్యం, నాటకం మరియు ఇతర లలిత కళలను పోషించాడు. అందుకు నిదర్శనంగా మధ్యయుగ కాలం నాటి దేవాలయాలన్నింటిలో రంగ మండపాలు నిర్మించబడ్డాయి. సంగీత విద్వాంసులకు ఆలయాలకు వచ్చిన దానాల నుండి వేతనాలు మరియు రోజువారి భృత్యాలు ఇవ్వబడేవి. భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు దేవాలయంలో వాడబడే వాయిద్య పరికరాలు గురించి చెప్పాడు. అదేవిధంగా పాల్కురికి సోమనాథుడు ‘బసవపురాణం’లో ఎన్నో వాయిద్య పరికరాలను ప్రస్తావించాడు. వేణువు, మృదంగం, మొదరంగ, కంచు కాహలా, పటాహ శంఖం, ఢక్క, ఢమరుకం, హుడుక్క, ఝఢారి మొదలైనవి. దేవాలయాల్లో ప్రతిరోజు సంగీత వాద్యకారుల, గాయకుల వాద్యాలతో, గాయకుల మేలుకొలుపు పాటలతో తెరవబడి రాత్రి పవళింపు సేవతో మూయబడేది.

నృత్యం:

దేవాలయాలలో పెద్ద సంఖ్యలో నర్తకీమణులు నాట్య గురువులు ఉండేవారు. నృత్యం అభివృద్ధిలో దేవాలయం కీలకపాత్ర పోషించింది. ఈ నర్తకీమణులలో చాలామంది దేవదాసీలు. జాయప నృత్త రత్నావళిలో దేవాలయాలలో చేసే నృత్య రూపకాలను వివరించాడు. ఇతను వివరించిన నృత్యరీతులనే నర్తకీమణులు నేర్చుకొని ప్రదర్శించేవారు. దేవునికి జరిపే షోడషోపచారాలులో నృత్యం ఒకటి. ఈ నృత్యం దేవునికి ఉపచారంతోపాటు భక్తులకు వినోదాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కల్పించింది. ఈ లలిత కళలు వ్యక్తుల ఆర్థిక జీవనానికి ఆలంబనగా నిలిచాయి.

12. సామాజికసంక్షేమసంస్థగా దేవాలయం:

సామాజిక సంస్థగా దేవాలయం సమాజంలో రోజువారి జీవితంలోని అన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. బర్టన్ స్టెయిన్ ప్రకారం దేవాలయాలు మధ్యయుగ మరియు ఆధునిక దక్షిణ భారత సమాజంలో నైతికతను ప్రసాదించాయి. అవి సామాజిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయి. సమాజ, ఆర్థిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదం చేశాయి.9 దేవాలయాలలో జరిగే పూజలు, ఉత్సవాలు, పండుగల ద్వారా ప్రజలు దేవాలయంతో అనుసంధానించబడ్డారు. ఆలయ నిర్మాణం దాని విధులలో, ఉత్సవాలలో పాల్గొనడం సామాజిక జీవనంలో అంతర్భాగమని ప్రజలు భావించేవారు. దేవాలయాలు సంఘ కేంద్రాలుగా (కమ్యూనిటీ హబ్) పనిచేసాయి. వివిధ వర్గాలకు చెందిన ప్రజలలో ఐక్యతను మరియు సాంస్కృతిక భాగస్వామ్య గుర్తింపును పెంపొందించాయి.

సంక్షేమ కార్యక్రమాలు:

దేవాలయాలు ధార్మిక కార్యక్రమాలను చేపట్టాయి. బీదసాధల కోసం సామాజిక సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించాయి. ప్రజలకు జీవనోపాధిని అందించే యజమానిగా, విద్యాసంస్థలను ఏర్పాటు చేసే విద్య కేంద్రంగా, వివిధ వృత్తులను ప్రోత్సహించే వారికి ఆర్థిక ఆలంబన కల్పించాయి. కరువు కాటకాలలో ప్రజలకు ధాన్యాన్ని అందించాయి. సేవా కేంద్రాలుగా ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో ఆసుపత్రులు ఏర్పాటు చేసి పేదసాధలకు ఉచిత వైద్యాన్ని అందించాయి. ఆలయానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన మఠాలు, ధర్మసత్రాలు, వసతి గృహాలు, సాధు సన్యాసులకు నీడ కల్పించాయి. మత గురువులకు ఆశ్రయమిచ్చాయి. కరువు కాటకాల సమయంలో ఆకలితో అలమటించే వారికి దేవాలయ ధాన్యాగారాలు ఆహారాన్ని అందించాయి. అనేక కులాల వారికి వృత్తుల వారికి జీవనోపాధిని కల్పించి సామాజిక అభివృద్ధికి తోడ్పడ్డాయి. దేవాలయాలలో వివాహాలు కూడా జరిగేవి.

13. వినోదాలందించే కేంద్రంగా:

మధ్యయుగాలలో దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా వినోదం పంచే సంస్థలుగా కూడా ఉన్నాయి. దేవాలయ ప్రాంగణంలో విద్యావేత్తలు, వేద పండితుల సమావేశాలు, పురాణ గాధల పారాయణాలు, మేధావుల చర్చలు, హరికథలు, బుర్రకథలు, సంగీత, నాట్య కచేరీలు జరిగేవి. ఒక్కోసారి రాజుల పట్టాభిషేకాలు కూడా జరిగేవి. ఆలయ ఉత్సవాలలో కుస్తీ పోటీలు, కోడి, ఎడ్ల పందాలు జరిగేవి.

సమావేశ స్థలంగా:

మధ్యయుగంలో హిందూ దేవాలయాలు వివిధ జాతుల సంప్రదాయాల, సంస్కృతులకు సమావేశ స్థలంగా ఉండేవి. వివిధ వర్గాల వారికి చర్చ వేదికగా ఉండేవి. ఇతిహాసాలు, పురాణాలు, సంప్రదాయాలు వాటి మూలాలపై ఇక్కడ చర్చలు జరుగుతూ ఉండేవి.

మత సంస్థగా:

దేవాలయాలు మతవిశ్వాసాల సంరక్షకులు, భక్తులపై నియంత్రణను కలిగి ఉన్నాయి. అవి సమాజం యొక్క నైతికతను మరియు ప్రజల మత విశ్వాసాలను కొనసాగించాయి. భక్తి, ఆరాధన ద్వారా ఉద్భవించిన ప్రాంతీయ సాంప్రదాయాలు, వైదిక శాఖలు మరియు వైదికేతర, జానపద, మతపరమైన కార్యకలాపాల మధ్య వైరుధ్యాన్ని తొలగించాయి. ప్రాంతీయ సంప్రదాయాలు, ఆరాధనలు, భాషలను అభివృద్ధి చేయడంలో దేవాలయాలు అద్భుతమైన పాత్రను నిర్వహించాయి. ఇవి భక్తులనేగాక గొప్ప మత గురువులను ఆకర్షించాయి. సుదూర ప్రాంతాల నుండి భక్తులు గురువుల బోధనల కోసం ఇక్కడకు వచ్చేవారు. ఈ గురువులు ప్రజలలో మతంపై గౌరవాన్ని పెంచడంలో ముఖ్యపాత్ర పోషించారు.

కులాలను ఆదరించే సంస్థగా:

దేవాలయాలు నూతనంగా ఏర్పడిన కుల వ్యవస్థను గుర్తించి ఉన్నత, నిమ్న కులాల ఐక్యతకు కృషి చేసాయి. ఈ కాలంలోనే బ్రాహ్మణీయ, వర్ణాశ్రమ భావజాలం సమాజంపై తమ పట్టును పటిష్టం చేసుకుంది. దానికి ఆయుధంగా భక్తి ఉద్యమం పనిచేసింది. దీనికి దేవాలయం సంస్థాగత స్థావరంగా పనిచేసింది. అంతేగాక వివిధ కుల సమూహాల మధ్య సామాజిక సామరస్యాన్ని తీసుకుని రావడానికి వేదికగా కూడా పనిచేసింది. దానితోపాటు భక్తి, ఆరాధన ద్వారా ఉద్భవించిన ప్రాంతీయ సాంప్రదాయాలు వైదిక శాఖలు మరియు వైదికేతర శాఖల మధ్య వైరుధ్యాన్ని తొలగించి, వివిధ కులాల వారిని, వివిధ వృత్తుల వారిని ఆదరించి వారికి జీవనోపాధి కల్పించాయి.

ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం:

రాజకీయ ఆర్థిక లాభాలతోపాటు దేవాలయం ఆధ్యాత్మిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చింది. ప్రజల ఆధ్యాత్మిక జీవన ప్రమాణంలో వారికి మార్గదర్శకత్వం చేసింది. దేవాలయాలు మనిషి యొక్క వివిధ కోరికలను నియంత్రించాయి. మరియు అతనిని ధర్మమార్గం వైపుకు నడిపించాయి. అవి మనిషి యొక్క నైతికతను, ఆధ్యాత్మికతను కొలవడానికి ప్రమాణాలుగా మారాయి. మనిషిలో శ్రద్ధను, భక్తిని, ఆధ్యాత్మిక చింతనను పెంచాయి. దేవాలయాలు తీర్థయాత్ర స్థలాలుగా, మత కేంద్రాలుగానే కాక ప్రజల జీవన స్వచ్ఛత మరియు స్వభావాన్ని ప్రభావితం చేయడంతో పాటు ప్రధాన శక్తివంతమైన సామాజిక, ఆర్థిక సంస్థలుగానే కాకుండా గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నాయి.

నైతిక మార్గదర్శకత్వం:

దేవాలయాలు సమాజం యొక్క నైతికతను మరియు ప్రజల మత విశ్వాసాలను కొనసాగిచాయని కేశవన్ వేలుథాట్ తన ‘ద ఎర్లీ మిడీవియల్ ఇన్ సౌత్ ఇండియా’ గ్రంథంలో చెప్పాడు. మతసంస్థలుగా ప్రజలు నైతికతకు మార్గదర్శకత్వాన్ని వహించాయి. ఈ మార్గదర్శకత్వంలో పురాణాల, ఇతిహాసాల గాథల పారాయణం, దేవాలయంలో గోడలపై పురాణాల, ఇతిహాసాల, శిల్పాలు మరియు చిత్రాల ద్వారా ప్రజలలో నైతిక భావనలు పెంపొందింప చేశాయి.

14. వివాదాల పరిష్కారాలలో దేవాలయ పాత్ర:

దేవాలయాలు సామాజిక వివాదాల పరిష్కారానికి సమావేశ వేదికలుగా పని చేశాయి. వివిధ వర్తక సంఘాల మధ్య వచ్చే వివాదాలు, వివాహం, సామాజిక, ఆస్తి తగాదాల తీర్పులను పరిష్కరించే వేదికలుగా పనిచేసాయి, నాదెండ్ల శిలాశాసనం మరణించిన భార్య యొక్క ఆభరణాల విషయంలో ఆమె తల్లిదండ్రులకు మరియు భర్తకు మధ్య వచ్చిన తగాదాలో దేవాలయం ఆమె నగలు భర్తకే చెందుతాయని తీర్పునిచ్చింది.10

ప్రజలలో ఐక్యత పెంచే కేంద్రంగా:

దేవాలయాలు సామాజిక, జాతీయ ఐక్యతకు ఎంతో దోహదం చేశాయి. దేవాలయంలో జరిగే ఉత్సవాలు, దేవతల కళ్యాణాలు, జాతరలు, పండుగలు, ప్రజలను ఏకం చేసే కార్యక్రమాలుగా ఉన్నాయి. తీర్థయాత్ర స్థలాలుగా ప్రజలను ఆకర్షించాయి.

15. ముగింపు:

దేవాలయాలు మత కేంద్రాలుగానేగాక సామాజిక, రాజకీయ, ఆర్థిక, సంస్కృతిక స్వభావం యొక్క విధులను కలిగి ఉన్నాయి. అంతేగాక అవి బహుముఖ మార్గంలో పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో మానవ సమాజంలో దేవాలయాలు ఎంత ముఖ్యపాత్ర వహించాయంటే దేవాలయాలు లేని ప్రదేశం మానవ నివాసయోగ్యం కాదని భావించబడింది. ముఖ్యంగా గ్రామాలలో దేవాలయాలు నాడీ కేంద్రాలుగా ఉండేవి. అన్ని వర్గాల ప్రజలతో కూడిన సమూహాలను ఆకర్షించాయి. విద్య, వాస్తు కళలను ప్రోత్సహించి ప్రజల ఆర్థిక జీవన విధానాన్ని మెరుగుపరిచాయి. రాజులు మరియు రాజ్యాల వారసత్వం వారు నిర్మించిన దేవాలయ రాళ్లలో చెక్కబడి ఉంది. ఈ నిర్మాణ అద్భుతాలకు అతీతంగా దేవాలయాల పాలన సంస్కృతి మరియు ఆధ్యాత్మిక స్వరూపాలుగా ఉన్నాయి. ఆలయ నిర్మాణం నుండి పొందిన ప్రయోజనాలు కేవలం తాత్కాలికమైనవి కావు. అవి దైవిక, రాజకీయ, సామాజిక మరియు సంస్కృతిక రంగాలలోకి విస్తరించాయి.

సామాజిక ఆర్థిక రంగంలో ఆలయం అందించిన సేవలు భారతదేశం వైవిధ్య స్వభావాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. సాగు మరియు వ్యవసాయ ఉత్పత్తి, ఉద్దీపనగా, యజమానిగా బహుముఖ పాత్రను పోషించాయి. నీటిపారుదల ద్వారా యజమానిగా, ఋణదాతగా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డాయి. మధ్యయుగ కాలంలో అతిపెద్ద దేవాలయాలు నిర్మించడం వలన దేవాలయం నిర్మాణానికి అనేకమంది కార్మికులను, ఉద్యోగులను నియమించడం, ఎందరో కళాకారులు, పూజారులు, వివిధ వృత్తుల వారికి జీవనోపాధి కల్పించడం ద్వారా ప్రజలకు ఉపాధి కల్పించే ప్రధాన వనరుగా మారింది. ఋణదాతగా ఆలయ ఖజానా ద్వారా రుణాలను ఇచ్చి ప్రజల అభివృద్ధికి సహాయపడింది. దేవాలయం సృజించని కోణం లేదు. ఈ విధంగా మధ్యయుగ కాలంలోని దేవాలయాలు జీవన సాఫల్యానికి ఊతం కల్పించేలా ఏర్పడిన స్మారక చిహ్నాలుగా ఉండటమే గాక గొప్ప విశిష్టతను కలిగి ఉన్నాయి. అభివృద్ధితోపాటుగా హిందూ వారసత్వాన్ని సంస్కృతి సంప్రదాయాలను అభివృద్ధి చేసి, ఏకీకృతం చేసే ఏజెంట్లుగా మారాయి.

16. పాదసూచికలు:

  1. పంచరామాస్ ఇన్ మిడీవియల్ ఆంధ్రదేశ. పుట. 138
  2. టెంపుల్స్ ఏజ్ సోషియో ఎకనామిక్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ మిడీవియల్ ఆంధ్ర. పుట.8
  3. పంచారామాస్ ఇన్ మిడీవియల్ ఆంధ్రదేశ. పుట. 140
  4. మల్టీ ఫేస్డ్ రోల్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ మిడీవియల్ సౌత్ ఇండియా. పుట. 87
  5. పంచరామాస్ ఇన్ మిడీవియల్ ఆంధ్రదేశ. పుట. 140
  6. టెంపుల్స్ ఇన్ ఆంధ్రదేశ. పుట. 143
  7. టెంపుల్స్ ఇన్ ఆంధ్రదేశ. పుట. 145
  8. టెంపుల్స్ ఇన్ ఆంధ్రదేశ. పుట. 145
  9. ద ఎకనామిక్ ఫంక్షన్ ఆఫ్ మిడీవియల్ సౌత్ ఇండియన్ టెంపుల్ . పుట.163
  10. టెంపుల్స్ ఏజ్ సోషియో ఎకనామిక్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ మిడీవియల్ ఆంధ్ర. పుట.9

17. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కేశవన్ వేలు థాట్ - ద ఎర్లీ మిడీవియల్ ఇన్ సౌత్ ఇండియా- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్- యూ.కే.- 2010
  2. కృష్ణకుమారి మైనేని- పంచరామస్ ఇన్ మిడీవియల్ ఆంధ్రదేశ- ఆగం కళా పబ్లిషింగ్ హౌస్- ఢిల్లీ- 1988
  3. కృష్ణకుమారి మైనేని- టెంపుల్స్ ఏజ్ సోషియో ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ మిడీవియల్ ఆంధ్ర - డిస్కవరీ పబ్లిషింగ్ హౌస్ -ఢిల్లీ- 1990
  4. బర్టన్ స్టెయిన్ - ద ఎకనామిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ మిడీవియల్ - సౌత్ ఇండియన్ టెంపుల్- ఏ జర్నల్ ఆఫ్ ఏషియన్ స్టడీస్- డ్యూక్ యూనివర్సిటీ ప్రెస్- కరోలినా- 1960
  5. మహాలింగం.టి.వి.- స్టడీస్ ఇన్ ద సౌత్ ఇండియన్ టెంపుల్ కాంప్లెక్స్- కన్నడ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్- ధార్వార్- 1970
  6. మావాలి రాజన్ కె - మల్టీ ఫేస్డ్ రోల్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ మిడీవియల్ సౌత్ ఇండియా- కుముద్ పబ్లికేషన్ -ఢిల్లీ -2019
  7. వాసుదేవన్. సి.ఎస్- టెంపుల్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ - భారతీయ కళా ప్రకాశన్- ఢిల్లీ- 2000
  8. సూర్యకుమారి. ఏ- టెంపుల్స్ ఇన్ ఆంధ్రదేశ - జ్ఞాన్ పబ్లిషింగ్ హౌస్ - ఢిల్లీ- 1988

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]