AUCHITHYAM | Volume-5 | Issue-11 | October 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
3. 'వెంగమాంబ' రచనలు: జాతీయాలు - మాండలికాలు
డా. పి. లోకేశ్వరి
అసోసియేట్ ఫెలో,
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు,
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8500625641, Email: durgamlokeswari.1983@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.09.2024 ఎంపిక (D.O.A): 28.09.2024 ప్రచురణ (D.O.P): 01.10.2024
వ్యాససంగ్రహం:
తరిగొండ వెంగమాంబ రచించిన 18 రచనలలో వున్న మాండలిక పదాలు, జాతీయాలు పరిశీలించడం. వెంగమాంబ రచనలలో భక్తి పై ఎక్కువ పరిశోధనలు జరిగాయి కానీ భాషపై పరిశోధన ఆశించినంతగా జరగలేదు. వెంగమాంబ రచనలలో రాయలసీమ లోని చిత్తూరు జిల్లా మాండలిక పదాలు ఎక్కువగా వున్నాయి వాటిని . జాతీయాలను గుర్తించడం ముఖ్య ఉద్దేశం తెలుగు భాషలోవున్న మాధుర్యం అంతా భాషాభేదం , కవి వాడిన శైలిలో మనకు తెలుస్తుంది. అటువంటి వాడి వేడి పదాలను గుర్తించి ఒక చోట చేర్చే ప్రయత్నం. వెంగమాంబ రచనలను ఆకరాలుగా చేసుకుని వ్యాసాన్ని పూర్తిచేశాను.
Keywords: రచయిత పరిచయం, మాతశ్రీ తరిగొండ వెంగమాంబ రచనలలో జాతీయాలు, మాండలికాలు.
1. ఉపోద్ఘాతం:
ప్రతి భాషలోను జాతీయాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ భాషా వ్యవహర్త అయినా ఆ భాష లోని జాతీయాలను ఒంట బట్టించుకొని సమయానుకూలంగా ప్రయోగించినపుడే ఆ భాషలో రాణిస్తాడు. అలాగే ఒకే భాషకు ప్రజల వ్యవహారంలో పదాలలో వాటిని పలికే విధానంలోనూ, ప్రత్యయాలలోనూ, పదాల అర్థాలలోనూ భేదాలు ఉన్నప్పుడు ఆ భాషలో రకాలు ఉంటాయి. ఒకే భాషకు ఉన్న ఇటువంటి రకాలని మాండలికాలు అంటారు'. ఇటువంటి మాండలికాలను, జాతీయాలను 18 వ శతాబ్దానికి చెందిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనలలో పొందు పరిచిన వాటిని గుర్తించి ఒకచోట చేర్చే ప్రయత్నం.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అనేక సాహిత్య ప్రక్రియలలో రచనలను చేసారు. దాదాపు అన్నిరచనలు భక్తి, వేదాంతం, తత్త్వ విషయాలకు సంబందించినవే కావడం విశేషం. ఇప్పటివరకు తన రచనలపై అనేక పరిశోధనలు జరిగినా, వెంగమాంబ రచించిన సంకీర్తనలు , 18 రచనలలో భాషపై ఇప్పటికీ ఒక పరిశోధన మాత్రమే జరిగింది. వ్యాసానికి సంబందించి సమాచారం కోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచనలను క్షుణ్ణంగా పరిశీలించాను. మరికొన్ని మాండలిక పదకోశాలు,జాతీయాల పదకోసంను సేకరించుకున్నాను.
2. కవయిత్రి పరిచయం:
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ క్రీ.శ1730లో తరిగొండ అనే గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుండి అపారమైన భక్తి కలిగింది. యుక్తవయసులో పెళ్లి జరిగినా తన భర్త ఆదేవదేవుడే అని స్వచ్ఛగా చెప్పుకుంది. భర్త మరణించినా ముత్తైదు చిహ్నాలు తీయకుండా చివరివరకూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ విష్ణుపారిజాతం , రమాపరిణయము, చెంచునాటకము, శ్రీవేంకటేశ్వరకృష్ణమంజరి. శ్రీరుక్మిణీనాటకము, గోపికానాటకము, శ్రీభాగవతము, శ్రీవేంకటాచలమహాత్మ్యము మొ || రచనలు చేసింది. చివరికి తిరుమలలో క్రీ. శ.1817 లో పరమపదం పొందింది.
3. జాతీయాలు:
ఆంగ్లంలో Idiom కు తెలుగు సమానార్థకం జాతీయం జాతీయానికి చమత్కారం, నుడిగట్టు, పలుకుబడి, భాషీయం అనే పర్యాయ పదాలున్నాయి.
"Idiom can be defined as a number of words which when taken together, has different meaning from the individual meaning of each word” English Idioms Jennefer seidi MC Mordine (page: 2)
పదబంధ పారిజాతం అనే గ్రంధంలో జాతీయాలను ఇలా నిర్వచించారు . సామాన్యంగా విడివిడిగా పోడిమాటలుగా ఉన్నవే అపూర్వ సమ్మేళనంతో ఆమాటలకు విడివిడిగా దేనికీ లేని ఏదో ఒక అపూర్వ భావవ్యక్తీకరణకు మూలమైన విశిష్ట పదబంధాలుగా భాషలో నిలిచిపోతున్నాయి.
ప్రతి భాషలోనూ జాతీయాలకు ప్రత్యేక స్ధానం ఉంది. ఏ భాషా వ్యవహర్త అయినా ఆభాషలోని జాతీయాలను వంటబట్టించుకోని సమయానుకూలంగా ప్రయోగించినప్పుడే ఆభాషలో రాణిస్తారు.
జాతీయాల లక్షణాలను ఆచార్య మూలె విజయలక్ష్మి గారు 1.సాదృశ్యపూరకం 2. అనుభవాలమూలం 3. ఆలంకారిక చమత్కృతి 4.సాంప్రదాయికత 5.సారవంతం` అని సంక్షిప్తతగా తెలిపారు (జాతీయాల కోశం).
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచనలన్నింటిలో గల జాతీయాలను నా పరిశోధనా పరిది మేరకు పోందుపరిచాను.
3.1 మాతృశ్రీ తరిగొండ వెంగమాంబరచనలలో జాతీయాలు:
అడవిగాచిన వెన్నెల - వ్యర్థం
"ప్రాణ విభునిపై మొహాము, అడవీకిఁగాచిన వెన్నెలాయె! శివనాటకం . 116
కాకవికలై పోవు - తారుమారు
“శుకపిక బంభరస్తమంబులపుడె కకవికలై పోయెఁ – శివనాటకం 118
కన్నులఎర్ర చేసి- కోపం ప్రదర్శించడం
“కనుబొమలు ముడివెట్టుచు కన్నులెఱ్ఱ జేసి" శ్రీ. వెం.మా 270
నంగనాచి - అమాయకంగా నటించే వ్యక్తి
"నీవెంత వంగనాచివే - శివనాటకం. 217
పోకిళ్ల మారి- తిట్టుపదం
"మహిమా నాకూ లేదనుచూ నేఁడు పోకిళ్లామారి!" శివనాటకం , 217
మూడుకాళ్ళ ముసలి - వృద్ధురాలు
"మూడుకాళ్ళ ముసలిదాని తోడ గూడి మెపుడు పైది మేడలోన” వి. పా.83
బడబానలము –అగ్ని
“మీ తాత శాపయుక్తుండు బడబానలము చేత బద్ధుడైయుండు” వి.పా.67
కయ్యమునకు కాలు దువ్వు - గోడవకు రావటం
“నీశుఁడుండగ, వృష, భేంద్రా సురుండు కదిసి కయ్యమునకుఁ గాలుద్రవ్వుచును” -భా.ద్వి. 8
బయలు మాటలు-అపద్దాలు మాటలు
“బయలు మాటలు నమ్మి మీ బాలకులను జంపుటకు మీరు నన్నుపింపవలడు” -జలక్రీడావిలాసము. 35
ఉడ్డు కూర్చు- చిన్నపిల్లలకు చేయునది
“ఉర కూర్చుకునీ నమ్మా, చిన్న బిడ్డదు” --జలక్రీడావిలాసము. 36
మూరెడునోరు - గయ్యాళి
“యిట్ల ముచ్చులకుండేదైతేనే – మూరెడునోరే” – చెం. నా 74
పురికొల్పు - రెచ్చగొట్టు, ప్రోత్సాహించు
“బలంబులను పురికొల్పుచును వచ్చి భూరి శౌర్యమున” – శివనాటకం . 202
కడముట్టు- చంపు
“పదియేండ్లు కడముట్టద్రపముగా వింపుచును” - వా.రా. 153
కఱకటి కొట్టు -బాధించు
“యతి భీషణాకురడై వారిఁజేరి కఱకఱి గొట్టింపఁగా వారు మోహపరవశు”వా. రా. 71
కొంగు బంగారం- ఇష్టం
“నా కొంగు బంగారమైన నంద కుమారునీ, మాశ్ర కామినీమణి” - భక్తిగీతసుధ . 20
తేటతెల్లంగా - స్పష్టంగా
“నేను మీకుఁ దేలిపెదఁ గడు తేట తెల్లంబుగాను” - భా(ద్వి) 82
కుప్పిగంతులు- ఎగరడం
“మీ వ్రేతలందఱు c జాఁ గుప్పి గంతులు వేయుటగా దీరణంబు” భా(ద్వి)49
కలహనికి కాలు దువ్వు
“చెలగుచు నిను శిక్షించెదననుచును కలహంబునకే కాలుద్రవ్వుచును” -వి. పా. 122.
అఱుగని సొమ్ము-ఇతరుల ధనం
“రత్నపోర మనువంద నెవ్వరి కఱుగ సొమ్ము” శివనాటకం - 8
తలకట్టు-గొప్పది
"గాన విద్య కెల్ల తలకట్టు నాదమూ” - బా.నా. (పుట - 5)
తులతూగు- సమానం
"వారితో సరిగాఁదూల దూఁగ వలము" శ్రీ. వెం.మా 4-ప: 91
నాల్కలుకోయు-కోపం
"కాలానల జ్వాల కరణ దీపించి నాలుకల్ గ్రోయు" - వి.పా. 125
శ్రీరామరక్ష- కాపాడటం
"తీర్థంబు పుడిసిళ్ల వట్టి శ్రీరామ రక్ష యని శిరంబునకు జుట్టి చల్లిరంత"వెం. మా 20
సిగపట్ల బేరము-గొడవ
“వీరు జాడఁ బట్టుకొని పెనగొని సిగపట్ల బేరంబుగాను వారు వీరును"-జలక్రీడావిలాసము
కుచోద్యం – పక్షపాతం
"కుత్సితమైన కుచోద్యం" --జలక్రీడావిలాసము. 92
రెండు కన్నులు-అధికం
“నా రెండు కన్నులు మీరు” శివనాటకము 224
పగటు పల్కులు-ఆపద్దాలు
"జగడుమనకు వచ్చి పగటు పల్కులు మీరు పలిక్కితే" --జలక్రీడావిలాసము. 94
బిఱ్ఱ బిగించు - గర్వించు
"బిఱ్ఱ బిగించుకొని, మెఱ్ఱగా వుండే యీ పెద్ద భూతము' శివనాటకము . 229
వెంగమాంబ తెలుగు భాష పచ్చదనం, పటుత్వం పలుకులో తీపి ఉట్టి పడేటట్లు రాయలసీమ వాసులనోళ్లల్లో నానే అనేక పలుకుబళ్లనుపదాల్లో అలవోకగా అమరించి ఆ చంద్రతారార్కం వెలుగొందే వాఙ్మయాన్ని వెలువరించింది.
4. మాండలికం:
మానవుడు సంఘజీవి. భాషకు సంఘానికి అవినాభావ సంబంధముంది. సంఘం భిన్న వివస్తత్వాలు భిన్న ఆచారాలు, భిన్నమత వ్యవస్థల కూడలి. సామాజిక కట్టు బాట్లతో వ్యక్తులు గీత మండలాల్లో జీవిస్తారు. మండల సంబంధమైంది మాండలికం. నిర్ణీత మండలంలో స్థానిక విశిష్టతలతో వ్యవహృతమౌతున్న ప్రధాన భాషా భేదమే మాండలిక భాష, దీన్ని డయెలెక్ట్ (Dialect) అనీ మాండలిక విజ్ఞాన శాస్త్రాన్ని Dialectology అని అంటారు.
"మండలమనగా, గుంపు లేక రాశి ఒక జాతి జనులను గాని, ఒక సంఘం యొక్క విభాగాన్ని గాని మండలం అందురు. అట్టి మండలమును కలిగినది మాండలికం అట్టి భాషా విశేషమునే మాండలిక భాష అంటారు”. తెలుగు దిన పత్రికలో శీర్షికలు-మాండలిక భాషా పరిశీలన -డా ॥ యలమర్తి ప్రశాంతి (పుట : 2)
"ఉచ్ఛారణలో, వాడే పదాల్లో జాతీయాల్లో, వ్యాకరణరూపాల్లో వ్యవహార వైవిధ్యం కన్పిస్తుంది. ఈ వైవిధ్యాన్నే మాండలికం అంటారు.” తెలుగు దిన పత్రికలో శీర్షికలు-మాండలిక భాషా పరిశీలన-డా ॥ యలమర్తి ప్రశాంతి (పుట :3)
4.1 వెంగమాంబ రచనలలో మాండలిక పదాలు:
తరిగొండ వెంగమాంబ రాయలసీమలో భాగమైన ఒకప్పటి కడపజిల్లా,నేడు చిత్తూరు జిల్లాకు చెందిన తరిగొండలో జన్మించింది , తిరుమలలో నివశించి శ్రీ వేంకటేశ్వర స్వామిపై రచనలు ,సంకీర్తనలతో పూజించడం వల్ల తరిగొండ వెంగమాంబ రచనలలో భాష రాయలసీమ మాండలికం ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా తమిళపదాలు, హిందుస్థానీపదాలు తరిగొండ వెంగమాంబ రచనలలో అనేక చోట్ల ప్రయోగించింది. రాయలసీమ మాండలిక పదాల భాషే తరిగొండ వెంగమాంబ రచనలలో ఎక్కువ వుంది.
1.వివాహసమయంలో వాడిన మాండలిక పదాలు:
బడిబ్రాలు - ఒడిబియ్యం
పెండ్లి అయిన తరవాత, కొన్నిఏండ్లపాటు ప్రతిసంవత్సరం, తల్లి ఆడబిడ్డకు చీరలు, బియ్యం , పండ్లు మొదలగునవి ఒడిలో పోసి అత్తవారింటికి పంపే ఆచారం నేటికీ మహబూబ్ నగర్లో వుంది. రాయలసీమలో వివాహ తంతు మొదలైయేటప్పుడు పెళ్లి కుమార్తె కొంగులో కొన్ని బియ్యం పొసి ఒడిబియ్యం కడుతారు.
"భార్య చేతఁగడు వేడ్క ముత్యాల మొడి బ్రాలు గట్టించి" భ.సు . 41
సేస - తలంబ్రాలు
“చిత్తంబుల్ ముదమొంద సేసలిదరా శ్రీస్వామి శీర్షంబునన్” శ్రీ. వె.మా.349
తొడుకొనివచ్చి - తీసుకొచ్చి
పెళ్ళికూతురిని తీసుకొచ్చిన సందర్భంలో వెంగమాంబ ఈ పదంను వాడారు.
"నన్ను మెచ్చి, తోడుకొనివచ్చి తగ పెండ్లియాడె” -విష్ణు పారిజాతము 14
చలువ చీరలు-
"చలువ చీరల సాను దేశములనింది బఱచినటువలె" –శ్రీ వేంకటాచలమాహాత్మ్యము 344.
2. కొలత/కాలంకు సంభందించి కొన్ని మాండలికపదాలు :
వెంగమాంబ రచనలలో కాలం/కొలతకు సంబందించిన మాండలిక పదాలు
చారేడు / మూరేడు-కొలత పరికరం
చారెడు అంటే మన రెండు అరచేతులను కలిపినంత , చేతి కొనభాగం నుండి ముం జేతివరకు "స్వామీ మూరెడు ముక్కు, చారెడెసి లెక్కలు గలిగి" శివనాటకము 229
దండిగా - ఎక్కువగా
“దండిగ వెలిగే నిండు జ్యోతి నీలో గానరా! -భక్తిగీతసుధ 60
బటువు - తగినంత
"బాగా వాము వస్త వేంపాలి బటువు నల్లేరు గెణుపులు" -జలక్రీడావిలాసము. 57
పుడిసెడు - పురిసెడు
రెండుచేతులతో కుదియ పట్టినంతలో సగభాగం. ఇది అనంతపురంకు చెందిన మాండలిక పదం
"లోకంబులలో పుడిసెడు నీళ్లు లేకుండా మాయఁజేసేను” - శివ నాటకము 242
ఈడు – సమాన వయస్సు కలవారు
తెలంగాణలో వయసు అనే అర్థంలో వాడు తున్నారు. రాయలసీమలో తన ఈడు పిల్లలు అని , భార్య భర్తల జంటను ఈడుజోడు అని అంటారు.
"తన యీడు గోపకన్యలతో నిట్లనుచున్నాడు" -జలక్రీడావిలాసము. 71
ముంత - ఒక కొలత పాత్ర
ముంత అనే పదం చిత్తూరు జిల్లాలో వాడుకలో వుండేపదం. పడి,అద్ద కంటే పేద్దది ముంత. దీన్ని ఇనుప రేకుతో తయారు చేస్తారు. నెల్లూరులో మట్టి చెంబు అనే అర్థంలో వాడుతారు. వరంగల్లు ప్రాంతంలో కంచు చెంబు అనే అర్థంలో వాడుతున్నారు. చెంబు అనేది ఇక్కడ లోహ బేధం కూడా వుంది. వెంగమాంబ చిత్తూరు జిల్లాలో వాడుకలోవున్న ముంత అనే పదాన్ని వాడింది.
“చెప్పెద ముంతెడు ముత్తెము తిప్పుడు దెప్పించు” శ్రీ వేంకటాచలమాహాత్మ్యము- 300
ప్రొద్దుబోయే - సాయంకాలం
"పూని నన్నూఁ బిల్వుకూరా, ప్రొద్దుబోయే !” శివ నాటకము 40
ప్రొద్దుఁగుంకి-సాయంత్ర సమయం
“ప్రొద్దుఁగుంకిన పదమూడు గడియలకు ముహుర్తంబుగా వలయు”వెం. మా.357
సరిప్రొద్దు- అర్ధరాత్రి
రాయలసీమలో నడిరేయి అనికూడ అంటారు “పురుషులే భయములు విడిచి చరియింప వెఱతురీ సరిప్రొద్దు వేళ" భా.ప్ర. 186
యీయాల - ఈరోజు
ఈనాడు, ఈ ప్రొద్దు, ఈరోజు,ఈ దినం అని వాడుకలో వున్న పదాలు . యీయాల - ఈరోజు అనే అర్థంలో మదనపల్లి ప్రాంతంలో ఎక్కువగా నేటికీ వాడుతున్నారు. ఈరోజు అనే అర్థంలో వెంగమాంబగారు తన రచనలో వాడారు.
"యీయాల తరిగొండ నరహరినిఁ జేరి పండు వెన్నెల" -భక్తిగీతసుధ 60.
3. దూషణకు సంభందించి కొన్ని మాండలికపదాలు :
వెంగమాంబ సాహిత్యంలో అనేక సంవాదాలలో దూషణకు సంబంధించిన పదాలను వాడారు. అందులో మాండలిక పదాలు
గయ్యాళి –కఠినంగా మాట్లాడునది
“నీ కుమార్తె అయిన గంగాభవాని చూడ గయ్యాళిగా వున్నది” – శివనాటకము 241
రట్టు –నింద
“రట్టేలా చేసేవే దుర్గి” – శివనాటకం 40
వడిసుళ్లమారి
“మీదువ్వ వడిసుళ్లమారి వెరపింపుచుండు”- విష్ణు పారిజాతము . 67
రచ్చ - గొడవ
“విజృంభించి ఇరవుగానే రచ్చ కెక్కి యుండుదును" - విష్ణు పారిజాతము 75
కూటాకాళి-తిట్టుపదం
"ఓసీ! కూటాకాళీ వెట్లయీడకు వస్తివి! శివ నాటకము. 223
సోడ్ల - మెట్టికాయ (తలపై కొట్టడం)
విశాఖ పట్టణ మాండలిక పదం సోడ్డు ఏకవచనం, సోడ్లు బహువచన రూపంగా వాడుతున్నారు. మాండలికపదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
“ఓసి! గ్రుడ్లు ద్రిప్పేనీ మీఁదనె సోడ్ల వేతునే” శివ నాటకము. 218
పంగించడం –దూషించడం
రాయలసీమ మాండలికపదం. పంగించడంఅనే పదం నేటికీ ప్రచారంలో వున్నపదం .రచయిత్రి కూడా పంగించడం అంటే దూషించడం అనే అర్థంలో వాడింది. సమాజంలో వాడుకలో వున్న పదాలతో అందంగా రచనలు చేయడం కవయిత్రి ప్రత్యేకత .
“అప్పుడూ నను వేడేనంటేనే పంగించనటరా" - విష్ణు పారిజాతము 94
నంగ - అమాయకునివలె నటించడం
తిట్టు పదం ,నంగా నాచిలా ఎంత అమాయకంగా వుందో అని దూషిస్తారు. అమాయకునివలె నటించువాడు.అనంతపురం మాండలిక పదం- (మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970)
"కొంగా పిల్లల దెచ్చి పొంగుంచు పెట్టితే
నంగావలె మెక్కి దొంగ మూల్గులు మూల్గే" - విష్ణు పారిజాతము 83
కుట్టు - కుళ్లు, ఈర్ష్య
కుట్టు అనే పదానికి పగ; ద్వేషము అని నెల్లూరులోనూ ; తెలంగాణప్రాంత మాండలికం లోనూ వుంది - (మాండలికపదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970) రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఈ మాండలిక పదాన్ని వాడుతున్నారు మాండలిక పదకోశం (తె.అ.) 1985. కళింగ ప్రాంతంలో పొయ్యిలో బూడిద అనే అర్థంలో వాడుతున్నారు. కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం) 2006 . కొన్నిప్రాంతాల్లో జంతువులు కుట్టడం లేదా బట్టలుకుట్టడం అని సందర్బానికి తగినట్లు వాడుకలో వుంది.
“యిట్లు కుట్టు మాటలాడ నీవెవలెవే? - శివనాటకము 221
పోకళ్లు (పోకడలు)= పోకిరీ
పోకళ్ళు వెంగమాంబ గారు అపద్దాలు అనే అర్థంలో వాడిండి ,నేడు ఈ పదం తిట్టు పదంగా వాడుతున్నారు. రాయలసీమలో పోకిరీ అనే అర్థంలో వాడుతున్నారు. వర్ణ మార్పు ప్రధాన కారణం.
"పొకళ్లు నేర్వకూరా" -జలక్రీడావిలాసము. 100
దొబ్బి – తోయడం
చిత్తూరు జిల్లాలో దొబ్బు అనే పదం ఒకరిని ఒకరు తోయడం అనే అర్థంలో వాడుతారు. కడప జిల్లాలో ఇంటిలో కసువు దొబ్బడంఅంటే చెత్తా చెదారం తోయడం అనే అర్థంలో వాడుతారు.
“వాని ద్రొబ్బి క్రిందకును పట్టి” –భాగవతం .(ద్వి)138
4. ఆభరణాలకు సంబందించి మాండలికపదాలు:
రాయలసీమలో సొమ్ములు అనేవి అలంకారానికి సంభందించిన వస్తువులు . కానీ కళింగాంధ్రలో సొమ్ములు అంటే ఆవులు అనే అర్థంలో వాడుతారు. వెంగమాంబ సొమ్ములు అంటే ఆభరణాలు అని రాయలసీమ మాండలికంలో వాడింది.
సొమ్ములు - ఆభరణాలు
"కట్టిన బొట్టు ముక్కరమాత్ర ముంచి మన్ని సొమ్ములు దీసి మావలవేసి” విష్ణు పారిజాతము 30
బన్నసరము – ఒక రకమైన ఆభరణం
అదేవిధంగా బన్నసరము అనేది కంఠంకు ధరించే ఒకరకమైన ఆభరణం . ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో అనేక రకాలైన ఆభరణాలు అందుబాటులో వున్నాయి. అనేక రకాలైన మణులతో తయారుచేసిన మణిహారము. “ముత్యాలహార మిత్తునీలువే నా బన్నసరము ముందూగ జేతికిత్తునటవే”-విష్ణు పారిజాతము 49
మద్దికాయలు - చెవి కమ్మలలో ఒక రకం
వెంగమాంబ తన సాహిత్యంలో ఎక్కువ ఆటవిక ప్రాంత ప్రజల భాషను వాదిండి. ఆటవిక ప్రాంతంలో లభించే పూలపేర్లు కాయల పేర్లతో ఆభరణాలు వున్నట్లు వెంగమాంబ గారి సాహిత్యంలో పరిశీలించవచ్చు .
“నాకందనికి కెంపుల మద్దికాయలిచ్చేవా?” శివ నాటకము 148
అడ్డిగ - ఆభరణం
పూర్వం కంఠంకు ధరించే ఒకరకమైన ఆభరణం. స్త్రీలు ధరించే కంఠహారం, మెడలో ధరించే నగ, రాళ్ళఅడ్డిగ [దక్షిణాంధ్రం, నెల్లూరు; రాయలసీమ; తెలంగాణం] జిగిని గొలుసు అని చిత్తూరు మాండలిక పదం – మాండలిక పదకోశం (తె.అ.) 1985
"మీకు సరిలేని అడ్డిగెలబణ్నా సరములిచ్చే మన్నించమో! కొమ్మలార” విష్ణు పారిజాతము10
పల్లెరుపూలు - చెవికమ్మలు
పల్లెరుపూలు అనేవి ఒక ముళ్ల చెట్టుకి పూసేపువ్వులు . లేత పసుపు వర్ణంలో వుంటాయి. పల్లెరుపూలు లాంటి ఆభరణాలు .
"పంజులకమ్మలుఁ -బల్లేరుపూలు సిస్తుమిఱుగ” బాలకృష్ణ నాటకము 30
మురుగులు - గాజులు
అనంతపురం ప్రాంతంలో చెవిపోగులను మురుగులు అంటారు.చేతికి వేసుకునే కడియాలు అని నెల్లూరు మాండలికంలో వాడుతారు. "కెంపుల బుగడా లిత్తునో? పగడపు మురుగూ లిత్తునో- శివ నాటకము 73
చేతి చాకట్టు-చేతికి అలంకరించుకునే ఒక ఆభరణం
“చేతి చాకటులైన కొవే, అల్ల చిన్న కృష్ణుని దోడితేవే
చేతి చాకటు లొల్లలేవే అల్ల, చిన్న కృష్ణుని దేనుపోవే" విష్ణు పారిజాతము . 49
పంజులకమ్మలు - రత్నంతో చేసిన కమ్మలు (స్త్రీలు ధరించేవి)
“ఘనములై చిక్కిళ్ళ పంజులకమ్మలందము" విష్ణు పారిజాతము . 72
బాలపొళ్ళములు-పిల్లలకు దిష్టికి వేసే వస్తువు, కాళ్ళకు ధరించే ఆభరణం
"దీనిని అందెలు మొదలయిన బాల | పొళుములియ్యవే"విష్ణు పారిజాతము 79
ముక్కర - ముక్కెర
"మొనసి పెదవిన నాణి ముత్తెపు ముక్కరరుడై వెలగగా" - విష్ణు పారిజాతము 72
బుగడలు –అలంకరణ వస్తువు ( కమ్మలు,)
మహిళలు చెవికి దరించే ఒక రకమైన కమ్మలు, లేదా దుద్దులు అంటారు .
“పుంజముక్తంబుతా బుగడలు " బా.నా. 48
సరిపెణ- ఆభరణం
పుగోరుపెట్టి తయారుచేసిన హారం. ఇది ఒక కంఠాభరణం
“పులిగోరు సరిపెణ లిచ్చేవా? మఱి పొందగు ఱవిక లిచ్చేవా? శివ నాటకము .148
5. వెంగమాంబ రచనల్లో ఆహారంకు సంబందించిన మాండలిక పదాలు:
18 వ శతాబ్దంలో ఆహారానికి సంబందించి మదనపల్లి చుట్టుప్రక్కలప్రాంతాలల్లో వాడిన పదాలను వెంగమాంబ తన రచనలో వాడారు. అందులో వంటకు వాడే వస్తువుల మాండలిక పదాలు కూడా వున్నాయి.
ఆకిలి-ఆకలి
రాయలసీమలో ఆకిలి అంటే ఆకలి అనే అర్థంలో వాడుతారు. తెలంగాణలో ‘వాకిలి ఇంటిముందు స్థలం’ అనే అర్థంలో వాడుతారు. మాండలిక పదకోశం (తె.అ.) 1985
“కడుపులోన నాకీలౌతుండాది" -జలక్రీడావిలాసము. 109
అంబిలి - అంబలి
వర్ణ వ్యత్యయం వల్ల అంబలి లో ‘ఇ’ కారం లోపించి అంబలి గా రూపాంతరం చెందింది. రాత్రి చేసిన అన్నంలో మరుసటిరోజు ఉదయం
"కమ్మగా నంబీలి గాశే కొడండ్లాతో”-జలక్రీడావిలాసము. 109
వెదురుబియ్యం-వెదురులో నుండి వచ్చేబియ్యం
పూర్వం వరి పండేదికాదు,అప్పుడు వెదురునుండి వచ్చే బియ్యంను తినేవారు. అదికూడా పండగకు,పబ్బాలకు మాత్రమే
“బహు మాంసములు కూడబెట్టి అదిగాక వెదురుబియ్యము తేనే,పెరుగు”- చెంచు నాటకము15
గెణుసుగడ్డ - చిలగడదుంప
నేటికీ చిలగడదుంపను గెణుసుగడ్డ అనే రూపమే చిత్తూరు జిల్లాలో వుంది.గెనిసెగడ్డ అని అనంతపురంలో వాడుకలో వుంది.
"గెణుసు గడ్డాలు తెచ్చిచ్చే నోయి! చెంచునాయుడా!” చెంచు నాటకము . 31
చద్ది - రాత్రి మిగిలిన అన్నం
రాయలసీమలో రాత్రి మిగిలిన అన్నంను చద్ది అంటారు . కళింగాంధ్రం లో ‘పులిహోర, చిత్రాన్నం’అంటారు. మాండలిక పదకోశం (తె.అ.) 1985
"చద్ది కుండలలోని సార మందరికిచ్చు" - విష్ణు పారిజాతము . 99
పరమాన్నం –ఒక రకం వంటకం
శ్రీనివాసుని వివాహా సందర్బంలో విందుభోజనాలలో పరమాన్నం ఒకటి. పాలు, బియ్యం, నెయ్యి, బెల్లం మొదలైన కలిపి చేసే వంటకం. ఇది రాయలసీమ మాండలిక పదం . ‘పులగం-కళింగ మాండలికం, పాషం, పరమాన్నం-తెలంగాణ మాండలికం,పరమాన్నం-రాయలసీమ మాండలికం’- ( ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.)) 2004
“సదానందకర పరమాన్న పాత్ర గురుతరంబైన- " వెం. మా 341
గెంజి - గంజి
గెంజి వర్ణ మార్పు జరిగి గంజి గా మారింది. రాయలసీమలో అన్నం వార్చిన నీటిని గంజి అంటారు. వ్యవహారంలో నేటికీ గెంజి అనే పదం చిత్తూరు జిల్లాలో వాడుకలో వుంది. తెలంగాణలో
గెంజి అంటే ధాన్యాలు లభించు ప్రదేశం లేదా మార్కెట్ యార్డు అంటారు.
“శ్రీ వేంకటేశ్వరుడి గుడిలో నైనా గెంజి వంటకంపెట్టవే!" చెంచు నాటకము 38
చిత్రాన్నం - పులిహోర
రాయలసీమలో నిమ్మకాయ రసంతో చేసే అన్నంను పులుసన్నం, చిత్రాన్నం అంటారు. తెలంగాణలో పులిహోర,పులిగొర అని, కళింగ ప్రాంతంలో - నిమ్మకాయ అన్నం అంటారు. -ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004
“గురుతంబైన చిత్రాన్నపాత్ర శాకములనేర్పఱచి సేయఁ"శ్రీ వెం .మా. 341
కొయింగూర / కొయిగూర
నేటికీ కొన్నిప్రాంతాల్లో ఈ ఆకుకూరలు లభిస్తాయి. రచయిత్రి అనేక చోట్ల వీటి ప్రస్తావన తెచ్చారు .కొయ్యతోటకూర -కళింగ మాండలికం, కోడిజుట్టుకూర-తెలంగాణ మాండలికం, కోయిగూరాకు - రాయలసీమ మాండలికం
"కోయిగూర, గొంగూర చింత కాయలు, ముల్లంగెడ్లు" విష్ణు పారిజాతము 26
చక్రవర్తి ఆకు –ఒక రకం ఆకుకూర
చిత్తూరు జిల్లా లో ఈ ఆకుకూర నేటికీ కొన్నిప్రాంతాలల్లో లబిస్తుంది.
“గోఘృతమును, పొళ్లకాయలు, పొన్నగంటి, చక్రవర్తి కూరలును"వెం. మా.156
యెరగడ్లు / తెల్లగడ్లు - ఎర్రగడ్డలు / వెల్లులి
ఎర్రగడ్డ అనే పదం రాయలసీమలోనూ, ఉల్లి గడ్డ అని తెలంగాణ లోనూ ,కలింగాంధ్ర లొ నీరుల్లి అని, కోస్తా ప్రాంతంలో ఉల్లిపాయ అని అంటారు.
"మొరగడ్లు తెల్లగడ్లు పెరికినో రొరే” – విష్ణు పారిజాతము .
గిండ్లు - పాత్రలు
గిండ్లు రూపాంతరం చెంది గిన్నెలు అయ్యింది. వంటకువాడే వంటపాత్రలు గిండ్లు. చిత్తూరు జిల్లాలో అన్నం తినే కంచంను కూడా గిన్నె అంటాము.
“మొఱుఁగు బంగరు గిండ్లు - మొలత కాంతి"శివ నాటకము 88
కవ్వం –మజ్జిగ చిలికే వస్తువు
పెరుగు నుండి వెన్నను వేరుచేయడానికి కవ్వంను వాడుతారు.దీన్ని కొయ్యితో తయారు చేస్తారు.
“కవ్వంబులు పట్టుక మునుపే గిరగిర కవ్వములలు ములు" భక్తిగీతసుధ 82
రోకండ్లు- రోకలి
ముందు వడ్లును దంచి ఆ బియ్యంను వంట చేసేవారు. దంచడానికి రోకలి, రోలు అవసరం. 18 శతాబ్దం నాటి అలవాట్లను వెంగమాంబ గారి సాహిత్యం ద్వారా నేటి తరానికి అందించిన సంపద గా భావించాలి.
"లోకములో వడ్లు దంచే రోకండ్లు కొన మొదలు వొక్క దిట్టముగా"శివ నాటకము.231
6.వృత్తికి సంభందించిన మాండలికపదాలు :
వ్యవసాయం,పశువుల పెంపకం ప్రధానమైన వృత్తి అయినప్పటికీ ఆటవీకప్రాంతంలో చెంచులు మొ// వారు వేటాడటం వారి కులవృత్తిగా వుండేదని వెంగమాంబ సాహిత్యం ద్వారా తెలుస్తుంది .
పిడి – కొడవలిపట్టుకోవడానికి చక్కతో తయారు చేసినది. కత్తిని చేతిలోపట్టుకున్నప్పుడు వెదురు లేదా చెక్కతో చేసిన పిడిని పట్టుకుంటాము. ‘తెలంగాణలో -తరం,కళింగ ప్రాంతంలో కుంచె అని నెల్లూరు ప్రాంతంలో తమలపాకు కట్టను పిడి అంటారు’- . ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004
"కొండడొకటి మొలను జుట్టి కొడవలి పిడెను. చాతబట్టి" భక్తిగీతసుధ 41
ఊటబావి –నీళ్లూరే బావి
ఏరోజుకు ఆరోజు నీళ్ళు ఆబావిలో వూరుతాయి అందుకే వాటిని ఊటబావి అంటారు.
“నిండు కొలంకులూటబావులు, మంచి యుద్యాన వనము" శివ నాటకము 1
పసువులు /దొడ్డి - పెంపుడు జంతువులు వుండే స్థలం
“పదరుచు దొడ్డిలో పసుల నన్నిటిని” -జలక్రీడావిలాసము. 68
పెరలు - రేడి (తేన వుండే రేడి)
తేనీగలు తేనె పెట్టే లో తేనేపేడుతుంది. ఆ పెట్టెను తేనేపెరలు అంటారు. చిత్తూరు,కడప ప్రాంతంలో వాడుతారు.ఆడవినుండే తేనె ఎక్కువగా లభిస్తుంది.
“పేటుల గెబ్రాకి పెరలు దింపుచును తేటులకై వడిఁదేనె ద్రావుడు” భాగవతము (.ప్ర)137
కసువు – గడ్డి
కసువు చిమ్మడం, చెత్త చెదారం అనే అర్థంలో కడప జిల్లాలో వాడుతారు. చిత్తూరు జిల్లాలో కసువు అంటే పశువులు తినే మేత,గడ్డి అనే వాడుకలో వుంది.ఒకే పదం వేరు వేరు అర్థాల్లో వాడుకలో వుంది . వెంగమాంబ గడ్డి అనే అర్థంలో వాడింది .
"వసుధ కిచ్చుచు నుండి వైపుతా నెడలఁగసువులు చిగిరించె" భాగవతము (.ప్ర)-141
కాపులు-వ్యవసాయం చేసేవారు
"కాపులు దున్ని చల్లిన ధాన్యముల్" భాగవతము (.ప్ర) 141
పైరు - పంట
"పైరులపై దొలి పసులార్భటింప" - -జలక్రీడావిలాసము 68
చాలు - వరుసగా
పొలంలో విత్తనాలను చాలుగా వేస్తారు. (line )క్రమపద్దతిలో చక్కగా అనే అర్థంలో వ్యవసాయం చేసేటప్పుడు వాడుతారు.వెంగమాంబకూడ వృత్తి సంబందమైన పదంగానే వాడింది.
"చల్లిన ధాన్యముల్ చాలుగా మొలిచె" - భాగవతము .ప్ర- 141
వంక - పల్లం
నీరు వాగులో పల్లం వైపు ప్రవహిస్తుంది. దాన్ని వంక అని రాయలసీమ మాండలికంలో అంటారు. ప్రాంతీయ మాండలిక పదకోశంలో పాయ అని కళింగమాండలికంలో, వొర్రె అని తెలంగాణ మాండలికంలో అంటారు.
"జీవన వాంఛ రెట్టింపఁ దలకోన వంకలోఁ దా డాఁగి" - బాల కృష్ణ నాటకము .3
కోన - కొండ మూలల్లో నీరు ప్రవహించు చోటు,అడవి
అడవి అనే అర్థంలో కూడావాడుతారు . కొండ మూలలో నీరు ప్రవహించే తావు అని రాయసీమ మాండలిక పదము. కొన్ని ప్రాంతాల్లో గోసమూహము అనే అర్థంలో వాడుకలో వుంది.
"నే నొక్క వేంకటేశ్వరుని గొనకొని చూతు మా కోనలోపలను". చెంచు నాటకము 19
మఱవలు - చెరువు అలుగు,
చెరువు నిండినతర్వాత వచ్చిన నీరు పల్లంవైపు పొంగుతుంది . దాన్ని మఱవ అంటారు . నెల్లూరు ప్రాంతంలో వయస్సు చెల్లినవారికి నరములు నుండి కాళ్లకు దిగు నీటిచారలను మరవలు అంటారు.
"చెఱువులు - మఱవలు పారే " భా.ప్ర. 141
గద్దె / ఎరుక –సోదె
తెలంగాణలో తెలివి,తెలిసివుండటంను ఎరుక అంటారు. సోదె చెప్పడం లేదా గద్దె లేదా ఎరుక అనే
నిజమునెరగదగ్గ వారికెల్ల నెరుక జెప్పేవారము" - విష్ణు పారిజాతము 49
"అంగనలారా గద్దెడగరే మనుచు” విష్ణు పారిజాతము 71
బుట్టి - బుట్ట
సోదె చెప్పేవారు బుట్టను సంకలో పెట్టుకుని సోదె చెప్పతానమ్మా సోదె అంటూ అరుస్తారు .
"కొరవంజి వేషంబు దాల్చి చెలగు బంగరు బుట్టి శిరముపై బెట్టి" -విష్ణు పారిజాతము 71 సుట్టాకుదుళ్లు-వస్తువులు పడిపోకుండా క్రింద పెట్టేది (stand)
వీటిని తీగలతో తయారుచేసేవారు. కాలాంతరంలో వీటిని లోహంతో తయారు చేస్తున్నారు. ఆటవిక ప్రాంతాలో నివసించేవారు నేటికీ వీటిని వృత్తిగా వాడుతున్నారు.
“సుట్టాకుదుళ్లావంటివి పట్టుగ సేతులఁ బెట్టుకవచ్చె” శివ నాటకము151
తిరిపెము-బిక్షం
"దేశమూలు తిరిగి తిరిగి - తిరిపెమెత్తుచు" –బాల కృష్ణ నాటకము. 3
7. వెంగమాంబ రచనల్లో జంతువులు -పక్షులకు సంబందించిన మాండలిక పదాలు:
వెలుముగొడ్డు - ఎలుగుబంటి
“వెలుముగొడ్డు గన్న కూతురిని నిన్నెట్లు తెచ్చె కృష్ణుడిందువదన” - విష్ణు పారిజాతము13
మెకము -ఏదుబంది
రాయలసీమలో మెకము అంటే ఏదుబంది,లేదా ముళ్ళ పంది అనే అర్థంలో వాడుతారు. నిఘంటు అర్థంలో జింక అని వుంది (బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు1903)
"జల్లి మెల్ల - మెకమూలఁ దెచ్చిచ్చేగాని" - చెంచు నాటకము . 15
చిఱుతగండ్లు-చిరుతపులులు
చెంచులు అడవిలో వేటాడే జంతువులను చెప్పుతూ చిఱుతగండ్లును చెంచిత చెప్పింది.
"చిఱుతగండ్ల నదిమి పట్టే - చెంచువార మోలాలా" చెంచు నాటకము. 8
కౌజు - కముజ, కవుజుపిట్ట
కౌజు పక్షి జాతికి చెందిన ఆడవి పూరిపిట్ట తెలంగాణ ,కళింగ ప్రాంతంలో కంజు అని, రాయలసీమలో కముజు పిట్ట అనివ్యవహారంలో వుంది.( మాండలిక పదకోశం-1985)
"కక్కెర్లఁగౌఁజులఁగొర్కోళ్లఁ” శివ నాటకము . 149
“కక్కెర్లు - చిన్న మచ్చలు కలిగిన కోడిపుంజు” శివ నాటకము 149
కార్కొళ్లు - అడవి కోళ్లు
"కక్కెర్లఁగౌఁజులఁగొర్కోళ్లఁ” శివ నాటకము149
పంది కొక్కులు- ఎలుకలు
పెద్ద ఎలుకలను పందికొక్కులు అని అంటారు. ఇది నేటి రాయసీమలో వాడుకలో వున్న పదం.
"పంది కొక్కులఁ, గొర్కోళ్ల" శివ నాటకము 149
పిక్కిలి గువ్వలు - పిచ్చుకలు
పికిలి యొక్క రూపాంతరం పిక్కిలి,నేడు వ్యవహారంలో పిగిలి పిట్ట అంటారు. కొన్నిప్రాంతాల్లో తోక పిగిలి పిట్ట అనికూడా అంటారు.
"పిక్కిలిగువ్వలన్ - పిడికిటఁబట్టి" శివ నాటకము 149
8. ఇతర వ్యవహారంలో వున్న మాండలికపదాలు:
అనేక సందర్భాలలో అనేక రకాలైన మాండలిక పదాలు సమాజంలో వాడే పదాలు వున్నాయి.
పరిసిపోవు - సమసిపోవు
సమస్య పరిసిపోతుంది కొన్నాలకు అర్థంలో నేటి రాయలసీమ వ్యవహారంలో వున్నపదం "శకునముల్ఁ ద్రిప్పుఁ దలచి మరల వచ్చితి వందుచేఁ బరిచి పోయె" శివ నాటకము 200
కడప- గడప (దాల బంధం)
‘క’ స్థానంలో ‘గ’కారం రావడంవల్ల వర్ణవ్యత్యయం జరిగి గడపగా మారింది.
"వాటంపు వజ్రాల వాకిండ్లు, మంచి తేటైన కడపలు, దివ్యాలయములు". చెంచు నాటకము 10
వాకిండ్లు-ఇల్లు
వాకిలి అని కొన్నిప్రాంతాలల్లో వాడుకలో వుంది .
“వాటంపు వజ్రాల వాకిండ్లు మంచి తేటైన కడపలు” - శివనాటకము 10.
ముడుపు - చెల్లించాల్సిన ధనం
మెక్కుబడిని ముడుపు అని అంటారు. కోరిక తీరినతర్వాత స్వామికి ముడుపు చెల్లిస్తారు.
“తెలివితో ముడుపులిటు అందర కన్న మలయ కెపు డోసగే” - భక్తిగీతసుధ .98
గంజరము - ఆవు మూత్రం
ఆవు మూత్రంను ‘ గంధరం’ అని చిత్తూరు ప్రాంతంలో నేటి వాడుకలో వుంది.
"మొనసి గంజరము నిమ్ముగ జల్లరమ్మా” - -జలక్రీడావిలాసము. 62
మొట్టే - మొత్తు
"సింగములా నెత్తి మొట్టే - చెంచువార మోలాలా" చెంచు నాటకము . 8
తప్పెట - డప్పు
"వలనొప్పఁదప్పెట్లు వాయించు కొనుచు బొలుపొంద" – చెంచు నాటకము . 16
పిలిసి -పిలచి
ఇక్కడ ‘లి’స్థానంలో ‘ల’ చేరడం ,సి స్థానంలో చి వచ్చిన వర్ణమార్పుల వల్ల ఏర్పడిన మాండలిక పదం .
" పిలిసి పిలిసి లేని పోని కలగమాడేవా సింగా కలగమాడేవా "విష్ణు పారిజాతము 82 "
యింగీతం –జ్ఞానం
తెలివి అనే అర్థంలో వాడుతున్నాం. ఇది రాయలసీమ మాండలి పదం .
“యింగీతమొరుగాక సంగతి జేసినన్నెంగీలి పరచిన దొంగావు" విష్ణు పారిజాతము(o)83
నుల్కతాడు –కొబ్బరిపీచుతో చేసిన తాడు.
దీనితోనే కొందరు మంచం అల్లేవారు దానినే నులకమంచం అంటారు "నుల్కతాళ్ల మట్టుగా నల్గిన మంచంబుమీద" విష్ణు పారిజాతము . 35
ఉట్లు –తాడుతో అల్లి వేలాడదీసేది
“వారివుట్లా కెక్కితివటరా కృష్ణా”-జలక్రీడావిలాసము. 82
దొప్పు చెవులు - ఆకుతో కుట్టిన దొన్నెలాంటి చెవులు
పెద్ద చెవుల వాడు చెంచునాయుడు అని వెంగమాంబ రచించారు.
"దొప్ప చెవులువాడు, గూని పోయిన వాడు" – చెంచు నాటకము .3
చూలాలు – గర్భిణీ స్త్రీ
రాయలసీమలో గర్భిణీ స్త్రీలను నిండు చూలాలు అంటారు. జంతువాచకంలో ఆవుసూటిది అనికూడా అంటారు.
"నీ కామినీ మణి - మెనిమిదో చూలు నీకు మృత్యువు" - భాగవతము . ప్ర - 11
కద్దు - కలదు
"సద్బులు జెప్పునూనె నమ్మా కద్దునీ మీద నెనరు” భక్తిగీతసుధ 21
చిత్తు -అల్లరి
“నిన్ను చూచిన వారున్నారా చిత్తు లక్షణము లక్షించి కన్నారా? సత్త సత్తులను విచారించినారా" భక్తిగీతసుధ. 62
మొఱపరాళ్ళు - గులకరాళ్లు
"నొకవేళ మొఱపరాళ్లుండు నెల్లెడల" - వారా. 112
పదరు –చలించు
“నిన్ను నీ రసముఁజేసెదమని పదరు చున్నారు” ముక్తి కాంతా విలాసము . 44
పిసుకు - కలపడం, కుదించడం
"కరముసాచి ముత్యములనుఁబిసికి మూడు రాసులు చేసి" శ్రీ వెంకటాచల మాహాత్మ్యము .300
యీడ-ఇక్కడ
యీడ అంటే ఇక్కడే అనే అర్థంలో నేటి రాయలసీమ వ్యవహారంలో వున్నపదం.
"ఓసీ! కూటాకాళీ వెట్లయీడకు వస్తివి! శివ నాటకము. 223
రూక - రెండు అణాలు
“పిడికెడు రూకలు - బిడ్డచే నీకు ఎడమ కొప్పెరలోన వేయింతు నేను” చెంచు నాటకము 42
దేవమ్మలు - స్త్రీ దేవతలు
చిన్నపిల్లలు మాట్లాడే భాషను వెంగమాంబ రచనలో చూడవచ్చు . శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు స్త్రీ దేవతలను దేవమ్మలు అని సంబోధించాడు.
"దెమ్మాలకెల్లానూ మొదటి దెమ్మా నని, నాకు వెన్న కొమ్మాని పెట్టక”-జలక్రీడావిలాసము. 59
యీడు
"తనయీడు గోపకన్యలతో నిట్లనుచున్నాడు- -జలక్రీడావిలాసము. 71
తోడు - ఓట్టు పెట్టడం
నీతోడు అనేపదం నీపై ఒట్టు పేట్టు తున్నా అని అర్థంలో వాడింది వెంగమాంబ.
“ద్రుంపకు తరిగొండ నృకేసరి తోడే" -జలక్రీడావిలాసము. 32
వురికే - పరిగెత్తు, తీసుకొని వెళ్లు
ఉరికె ,ఉరికెండు అనేది తెలంగాణ మాండలిక పదం. కొన్నిప్రాంతాల్లో రాయలసీమలోనూ వాడుకలో వుంది.
“కొడుకునెత్తుకొని అడవికి వురికే చెంచునాయకీ! చెంచు నాటకము34
కల్లు-అపద్ధాలు
“ధరకాట భరకాటు కల్లు తబ్బిబ్బుగా కూడ నిజము" - విష్ణు పారిజాతము 74
కరకుబీగములు-గట్టితాళాలు,పదునైన తాళాలు
"వాకిండ్లాకు కరుకు బీగమూలు వేసి కావిళ్లుందామే" -జలక్రీడావిలాసము. 102
కోడి కొడి -కొద్ది కొద్ది
ఇక్కడ వర్ణ వ్యత్యయం జరిగి ‘డి’ స్థానంలో ‘ద్ది’ వచ్చిన రూపం. కోచం కొంచం అనే అర్థంలో రచయిత్రి వాడారు.
"కొడి కొడిగా నిందు కొన్ని జెప్పితిమి" --జలక్రీడావిలాసము. 105
తొంటి - తొలుత, మొదట
“తొంటి మా పెద్దలున్నట్టి దొడ్డ కొండ" – శ్రీ వెంకటాచలమాహాత్మ్యము . 300
దండిగా - ఎక్కువగా
‘దండిగ వెలిగే నిండు జ్యోతి నీలో గానరా! - భక్తిగీతసుధ 60
యిస్తివి - ఇచ్చావు
ఇచ్చు-ఇతి-వి కడపజిల్లాలో ‘వు ’ చిత్తూరు జిల్లాలో ‘వి’ వస్తుంది
"చిన్ని కొడుకు నెట్లూ యిస్తివోయి? చెంచునాయకా!చెంచు నాటకము 34
పద్దు - పంతం
“మేటి పద్దురా మేము బ్రదికేవు పాయము” -జలక్రీడావిలాసము. 168
గవి - చీకటిగుహ
గాలి వెలుతురు చొరబడని ప్రాంతాన్ని గవి అంటారు. ఇది రాయల సీమ ప్రాంతంలో వాడుతారు. అనంతపురంలో గయి అని కూడ వాడుతారు.
‘పెద్ద, కొండగవిలో తపమ జేయుచుండవచ్చునే’ - -జలక్రీడావిలాసము. 169
బొంత-పాత వస్త్రాలతో కుట్టినది
పాత చీరలతో కుట్టినటువంటి మెత్తటి పరుపు లాంటిది.
“మసిబట్టఁ గప్పుకొని పది మాసికల బొంతపెనఁ గప్పుకొని గుదియచే”" –బాల కృష్ణ నాటకము . 2
తట్టు - వైపు
తట్టు అంటే నెల్లూరు ,కర్నూలు ప్రాంతంలో చిన్నపల్లలకు వచ్చే అంటువ్యాధి. తట్టు అంటే రాయలసీమలో కొట్టడం అనే అర్థంలో వాడుతారు.కళింగ ప్రాంతంలో తట్టు అంటే వైపు అనే అర్థంలో వాడుతున్నారు. కవయిత్రి కూడా వైపు అనే అర్థంలో కళింగ ప్రాంత మాండలిక పదాన్ని వాడింది.
" కొందరు నా తట్టు - గుంపుగా రండు - (భాగవతము .ప్ర 138)
అగపడు-కనపడు
‘అగపడు అంటే కనపడు’ అని కోస్తా ప్రాంతంలో వాడుకలో వున్న మాండలిక పదం (ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004)
"మృత్యు దేవత కగపడని యసమానుఁడే బ్రహ్మయగు" - వాసిష్ట రామాయణము 36
తెలంగాణ భాషకు సంబంధించి మాండలిక పదాలు వెంగమాంబ సాహిత్యంలో చాలా తక్కువ, ఎందుకంటే వెంగమాంబ పుట్టినప్పటినుండి చివరివరకూ చిత్తూరు జిల్లాలో జీవించడంవల్ల తన సాహిత్యంలో ఉత్తరమండలంకు చెందిన మాండలిక పదం ఒక్కటే గుర్తించగలిగాను.
లొళ్ళి - శబ్దం
"పుల్ల మీసముఁదీడు కుంట - లొళ్ళి సద్దులు జెప్పుకుంటు" - భక్తి గీత సుధ.41
9. ముగింపు:
- మన భాషలోని మాధుర్యాన్ని నుడికారాల రూపంలో వెంగమాంబ అందించిన పలుకుబళ్లను రాబోయే తరాలకు అందించాలి.
- ప్రపంచీకరణ మాయాజాలంలో కొట్టుకుపోతున్న మనకు మన ప్రాచీనుల అలవాట్లు, సమాజంలో వారి భాషా విధానాన్ని చక్కగా వెంగమాంబ తన రచనల్లో మనకు అందించిన అపూర్వ సంపద.
- అటువంటి సంపదను కొలత పరికారాలకు, దూషణకు, ఆభరణాలకు, ఆహారంకు సంబందించి, వృత్తిపరమైన, పక్షులు, జంతుజాలంకు సంబందించిన మాండలిక పదాలను,ఇతర వ్యవహారికంలో వున్న అనేక మాండలిక పదాలను ఈ వ్యాసంలో సమకూర్చాను.
10. ఉపయుక్తగ్రంథసూచి:
- దక్షిణామూర్తి, పి. భాషా : ఆధునిక దృక్పథం, నీల్ కమల్ పబ్లికేషన్స్ (pvt ), 2014
- నాగయ్య, జి. (సంపా.) మాండలిక వృత్తి పదకోశం, తెలుగు విశ్వవిద్యాలయం,1991
- ప్రశాంతి, వై. తెలుగు దిన పత్రికలో శీర్షికలు-మాండలిక భాషా పరిశీలన (సిద్దాంత గ్రంధం), 1998
- ముత్యం, కె. (సంపా.) తెలంగాణ భాషా- తెలుగు భాషా, నవోదయ బుక్ హౌస్, 2016
- లోకేశ్వరి, పి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచనలు-సవిమర్శనాత్మక పరిశీలన -గురు ప్రింటర్స్, 2018
- విజయలక్ష్మి, యం. తెలుగు మాండలిక పదకోశం చిత్తూరు జిల్లా , -యమ్బి యమ్మార్ ప్రచురణలు, 2019
- విజయలక్ష్మి, యం. తెలుగు మాండలిక పదకోశం కడప జిల్లా , యమ్బి యమ్మార్ ప్రచురణలు, 2016
- విజయలక్ష్మి, యం. తెలుగు జాతీయాలు పర్యాయ పద కోశం యమ్బి యమ్మార్ ప్రచురణలు, 2008
- విజయలక్ష్మి, యం. సిరిమల్లెలు (వ్యాస సంకలనం) - యమ్బి యమ్మార్ ప్రచురణలు-2017
- సిమ్మన్న, వి. తెలుగు సాహిత్య చరిత్ర, విశాలాంద్ర పబ్లికేషింగ్ హౌస్, 2000
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

