headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-6 | May 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

9. శృంగారశాకుంతలం: సామాజికాంశాలు

డా. కె. డి. డి. మృణాళిని

పరిశోధకులు, విమర్శకులు,
పాత మల్కాజిగిరి, మేడ్చల్-500047
మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ.
సెల్: +91 7993892706, Email: kdd.mrunalini@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

హితేన సహితం సాహిత్యం అనగా సమాజానికి హితాన్ని కూర్చునది సాహిత్యం అని అర్థం. అట్టి సాహిత్యంలో సమాజం అంతర్భాగం. అదేవిధంగా సమాజంలో అంతర్భాగాలైన అంశాలే సాహిత్యంలో కూడా కనిపిస్తాయి. దీనిని బట్టి సాహిత్యం సమాజం బింబ ప్రతిబింబాలని అర్థమవుతుంది. ఈ మౌలిక సూత్రాన్ని బట్టి కవి కృత కావ్యప్రబంధాదులలో ఆ నాటి సమాజం ప్రతిబింబిస్తుందని అర్థమవుతుంది. దీనిని బట్టి ఒక కావ్యాన్ని గాని ప్రబంధాన్ని గాని అధ్యయనం చేసి ఆనాటి సమాజాన్ని, సంస్కృతిని అంచనావేయవచ్చు. తెలంగాణ ప్రాంతాన్ని అనేక రాజవంశాలు పరిపాలించాయి. ప్రజాశ్రేయస్సుని, సమాజ సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాలనసాగించి సాహిత్యం, కళలు, శాసనాలు, నిర్మాణాలు మొదలైన వాటికి పెద్దపీట వేసిన రెడ్డిరాజులు ప్రముఖంగా చెప్పుకోదగినవారు. వారిలో కాకతిసామ్రాజ్యం వర్ధిల్లిన కాలంలో వారి సామంత మాండలికులుగా, మహాసామంతాధిపులుగా ఉన్న రేచర్లరెడ్డి వంశీయులు అతి బల సంపన్నులు. రేచర్లరెడ్లు మనుమ కులజులు, పిల్లలమఱ్ఱి గ్రామాన్ని వంశనామంగా గ్రహించి పిల్లలమఱ్ఱి రెడ్లుగా కూడా ప్రసిద్ధిచెందారు. అనేక ప్రజాహిత కార్యాలు చేసిన వీరి కాలంలో గ్రంథస్థ సాహిత్యం అంతగా కనిపించదు. వెలుగులోకి వచ్చిన ఆ కొద్దిపాటి లిఖిత సాహిత్యం రేచర్లరెడ్డి వంశీయుల చరిత్ర, నాటి తెలంగాణ సామాజిక, భౌగోళిక, ఆర్ధిక, రాజకీయాది స్థితిగతులకు అద్దంపడతాయి. ఈ నేపథ్యంలో పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడిచే విరచితమైన శృంగారశాకుంతలం కావ్యం ఆధారంగా నాటి సామాజికాంశాలను వెలికితీసే చిరుప్రయత్నమే ఈ వ్యాసం లక్ష్యం. చారిత్రక, సామాజిక విశ్లేషణాత్మక పద్ధతులు ఆలంబనగా కూర్చే నా వ్యాసానికి పినవీరభద్రుని శృంగారశాకుంతలం మొదలైనవి ఆకరాలు.

Keywords: పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు, శృంగార శాకుంతలం, సామాజికాంశాలు, పురిటాలుతగవు, తోలుబొమ్మలాట, స్వప్న సిద్ధాంతం, శకునాలు, అతిథిసత్కారాలు

1. ఉపోద్ఘాతం :

'వాణినారాణి' అని సగర్వంగా చెప్పుకున్న కవి పిల్లలమఱ్ఱి పినవీరన. క్రీ.శ. పదిహేనవ శతాబ్ది ఉత్తరార్థంలోనివాడుగా చెప్పుకునే వీరన రాత్రికిరాత్రే ఒక మహాకావ్యాన్ని పూర్తిచేసాడని, వాస్తవానికి సరస్వతీదేవే ఈ గ్రంథం వ్రాసిందని అనుశ్రుతంగా చెప్పుకునేవారు. ఈ కవి భారతీదేవిని ఎన్నడూ ఇల్లాలుగా భావించలేదని, పరదేవతగా, తననుపాలించే ఏలికసానిగా పూజించేవాడని ఈయన వ్రాసిన గ్రంథాల్లోని పద్యాలవల్ల తెలుస్తుంది. పిల్లలమరఱ్ఱివంశం శారదాపీఠం. అందుకేనేమో శారదాదేవి పినవీరన కావ్యంలో ఎక్కడైనా లోపం కనిపిస్తే తానే స్వయంగా సవరణ చేసేదని ఒక ఐతిహ్యం ఉంది. ఇతని వంశంలో తాత, తండ్రి, సోదరులు కూడా "భువనభాసురకృతినిర్మాతలు"గా చెప్పబడ్డారు. శారీరక శాస్త్రరీత్యానో లేక ఏ ప్రత్యేక పరిస్థితుల వల్లనో పుడుతున్నప్పుడే పినవీరన జుట్టుజడలు కట్టిఉండటంతో లోకులు ఇతన్ని వీరభద్రునిఅవతారంగా భావించారు. పినవీరన చిన్నవయసులోనే అఖిలశాస్త్రాలూ అభ్యసించాడు. శాకుంతల రచనకు ముందే 1) అవతారదర్పణం 2) నారదీయం 3) మాఘమాహాత్మ్యం 4) మానసోల్లాససారం అనే గ్రంథాలను రచించినట్లు శృంగార శాకుంతలం వలన తెలుస్తోంది. నేటికీ ఇవి అలభ్యాలు, ఈయన రచించిన కావ్యాల్లో మనకు లభించినవి రెండు మాత్రమే అందులో మొదటిది శృంగార శాకుంతలం, రెండవది జైమిని భారతం.

2. శృంగార శాకుంతలం :

నాలుగుఆశ్వాసాలతో ప్రబంధాలకు పట్టుగొమ్మగానిలిచినకావ్యం శృంగారశాకుంతలం. శ్రీనాథునికి ఇంచుమించు సమకాలికుడైన వీరన శ్రీనాథయుగ లక్షణాలతో ప్రభావితుడైనవాడే. శృంగారశాకుంతలం శ్రీనాథయుగ లక్షణాలకు నిర్దిష్టమైన ఉదాహరణ. ఈ యుగ కావ్య విభజనలో పురాణ కథలను ప్రబంధాలుగా మలచిన వాటిలో ప్రసిద్ధమైనవి రెండు. మొదటిది యుగకర్త అయిన శ్రీనాథుని శృంగార వైషధం కాగా రెండవది పినవీరన శృంగార శాకుంతలం, శ్రీనాథ నైపధం హరనైషధానికి అనువాదం కానీ పినవీరన శాకుంతలం అనువాదం కాదు. ఈ కావ్యగద్యలో శాకుంతలం శృంగార కావ్యమని చెప్పడాన్ని బట్టి వీరన కాలానికి ఇంకా కావ్య ప్రబంధ పదాలు రెండూ సమానార్థకాలుగా వాడబడుతున్నాయని తెలుస్తుంది.

వివిధ రంగుల పూలను ఒక దండకు గుచ్చినట్లు, తేనెటీగలు వివిధ పూలనుండి కొద్దికొద్దిగా తేనె తెచ్చి సమకూర్చినట్లు మహాభారత కథలను మనస్సులో ఉంచుకున్న వీరన తన రచనా నైపుణ్యానికి,కాళిదాసుని నాటక క్రమాన్ని కొంతచేర్చి శాకుంతల రచనకు పూనుకున్నాడు. ఇది ఆకాలానికి ఒక కొత్త ఒరవడి. 'శృంగారం' అంగిగా, మిగిలిన అష్టరసాలు అంగాలుగా కావ్యరచన చేస్తే ఆ ప్రబంధం పదహారువన్నె బంగారంలా ప్రకాశిస్తుంది. అందుకే ప్రసిద్ధం, శృంగారపతి అయిన శకుంతలాఖ్యానాన్ని ప్రబంధంగా చేస్తానని తేల్చిచెప్పాడు. దీన్నిబట్టి అష్టరసాల్లో శృంగారం మిన్న అని ఆ రోజుల్లో భావించేవారని తెలుస్తోంది. ఇలా నూతన మార్గలో శృంగారనైషధం చేత ప్రభావితమై, స్వతంత్రంగా రూపొందిన ప్రబంధం శాకుంతలం.

పినవీరన కావ్యాలను రచించే కాలానికి నెల్లూరి దగ్గర సోమరాజుపల్లెలో చిల్లర వెన్నయమంత్రి మంచి వైభవంలో ఉన్నాడు. ఆ గ్రామానికి అధికారి అయిన ఇతడు పినవీరభద్రుని కీర్తి విని పిలిపించాడు. శ్రీమహాభారతంలోని శకుంతలోపాఖ్యానం మిశ్రమ బంధంగా చేసి తనకు అంకితమివ్వమన్నాడు. కాళిదాసు శాకుంతలం చాలా ప్రసిద్ధమై ఉండటం వల్ల దాన్నెవ్వరూ అనువదించలేడు. నాటకాల్ని నాటకంగా అనువదించే ఆచారం మన ప్రబంధకవులకు లేకపోవటం వల్ల కాళిదాసు కావ్యాలన్నిటినీ శ్రవ్యకావ్యాలుగానే అనువదించాల్సి వచ్చింది. అది శృంగార శాకుంతలంగా రూపుదాల్చింది.

3. పూర్వ పరిశోధనలు :

పరిశోధనలు ప్రధానంగా రెండు రకాలని తెలుస్తుంది. అందులో మొదటివి పట్టాల గురించి విశ్వవిద్యాలయాల పరిధిలో జరిగే పరిశోధనలు. రెండవది వ్యక్తిగతంగా జరిగే పరిశోధనలు. 

3.1 పిల్లలమఱ్ఱి పిలవీరభద్రుని రచనలపై జరిగిన మొదటి రకం పరిశోధనల జాబితా:

  1. పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి కావ్యానుశీలన, టి. ముద్దప్ప (పరిశోధకులు), ఎస్. రఘునాథ శర్మ (పర్యవేక్షకులు), 1985, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
  2. శృంగార శాకుంతలం - నామరూప విజ్ఞానం, ఎన్. ఎలిజబెత్ (పరిశోధకులు), కుమారి-సి.మనోజ (పర్యవేక్షకులు), 1996, మద్రాసు విశ్వవిద్యాలయం.
  3. రెడ్డి రాజుల సాహిత్యసేవ, కె. సత్యనారాయణ రెడ్డి (పరిశోధకులు), జి.వై.ప్రభావతీ దేవి (పర్యవేక్షకులు), 1996, నాగార్జున విశ్వవిద్యాలయం.

పై గ్రంథాలలో శృంగార శాకుంతలం - నామరూప విజ్ఞానం, రెడ్డి రాజుల సాహిత్యసేవ అనే గ్రంథాలు నేటికీ నాకు అలభ్యాలు. అయినప్పటికీ ఆ గ్రంథ నామాలను బట్టి ఇరు గ్రంథాలలో కూడా శృంగార శాకుంతలములోని సామాజికాంశాలను గూర్చిన విపులమైన వివరణ ఉండే ఆస్కారము తక్కువ. ఇక టి. ముద్దప్ప గారి పరిశోధన గ్రంథమైన పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి కావ్యానుశీలన అనేది ప్రధానంగా శృంగార శాకుంతలం, జైమిని భారతం అనే రెండు గ్రంథాలపైన వెలువడిన పరిశోధనాత్మక గ్రంథము. ఇందులో ఎనిమిది ఇందులో ఎనిమిది విభాగాలున్నాయి. అందున కావ్య కౌశలము, ప్రతిభాపాండిత్యము అనే ఆరవ అధ్యాయములో పినవీరన కృతులలో కనబడే వ్యాధులు, స్వప్నములు, శకునములు, భోజనాదికములు అనే సామాజికాంశాలు మాత్రమే సూచనామాత్రంగా వివరించబడ్డాయి.

3.2 రెండవ రకం పరిశోధనల జాబితా

  1. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సురవరం ప్రతాపరెడ్డి, 1949
  2. పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి (శృంగార శాకుంతలము, జైమిని భారతము ఒక సమీక్ష), డాక్టర్ జి.వి. సుబ్రహ్మణ్యం, 1973

తెలుగు సాహిత్యానికి మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెచ్చి పెట్టిన ఉత్తమోత్తమ పరిశోధనాత్మక గ్రంథము ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఇది సూరవరం ప్రతాపరెడ్డి గారి పరిశోధనా పటిమకు నిలువుటద్దం. అయితే వీరు ఆంధ్రుల సాంఘిక చరిత్ర నిర్మాణానికి పిన వీరభద్రుని రచనలను గ్రహించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. పినవీరభద్రకవి శాకుంతలం మొట్టమొదటిసారిగా 1909లో కాకినాడ సరస్వతీ ముద్రాక్షరశాలలో శ్రీ కొత్తపల్లి సూర్యారావు గారిచేత ముద్రించబడింది. ఇక 1872లోనే బహుజనపల్లి సీతారామచార్యులచేత పరిష్కరించబడిన పినవీరభద్రుని జైమిని భారతం, వంగీవరపు రామకృష్ణమాచార్యుల చేత ప్రకటించబడింది. ఆ తరువాత ఎందరెందరో ఈ గ్రంథాన్ని ముద్రించారు.  దీనిని బట్టి 1949లో ప్రకటించబడిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర నిర్మాణానికి ముందే పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి రచనలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ ఈ గ్రంథాలను సురవరం తన సాంఘిక చరిత్ర నిర్మాణానికి ఎంచుకొనలేదు. ఈ గ్రంథ నిర్మాణంలో నన్నయపెద్దనాదుల రచనలే కాక కొరవి గోపరాజు, సారంగు తమ్మయ్య, గౌరన, కదరీపతి వంటి కవుల రచనలను కూడా సురవరం స్వీకరించాడు. కానీ పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి రచనలు మాత్రం ఎంచుకోలేదు. ఒకవేళ మఱ్రిమాత్రంబె పిల్లలమఱ్ఱి పేరని అనుకున్నాడా! అంటే పేరువలెగాదు శారదాపీఠకంబు అని నాటికి సురవరం దృష్టికి వచ్చి ఉండదు. ఇలా అప్పుడప్పుడే పరిష్కరించబడి వెలుగులోకి వస్తున్న గ్రంథాలను, విమర్శకుల దృష్టిపడక కావ్య సౌందర్యం బయటపడని నాచన సోమన, దుగ్గన వంటి కవి పుంగవుల కృతులను సైతం సురవరం తన పరిశోధనకు వినియోగించలేదు. ఈ అంశంపై (ఆంధ్రుల సాంఘికచరిత్ర నిర్మాణం, రచనా ప్రణాళికపై) ప్రత్యేకంగా పరిశోధించవలసిన అవసరం ఉన్నది.

ఇక 1973లో శృంగార శాకుంతలాన్ని, జైమిని భారతాన్ని సమీక్షిస్తూ పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి పేరిట అత్యుత్తమ పరిశోధన గ్రంథాన్ని అందించినది డాక్టర్ జి.వి. సుబ్రహ్మణ్యం గారు. ఇందులో శృంగార శాకుంతలములోని సామాజికాంశాలను ప్రత్యేకంగా స్పృశించలేదు.

నేటికి నాకు లభించిన పై పూర్వ పరిశోధనలన్నింటినీ పరిశీలిస్తే పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని రచనలలో సామాజికాంశాల పైన ప్రత్యేకమైన పరిశోధన జరగలేదని తెలుస్తుంది. అందునా ప్రత్యేకించి శృంగార శాకుంతలములోని సామాజికాంశాలపై నేటికి పరిశోధన జరగలేదని అర్థం అవుతుంది. అందువల్ల నేను వ్రాసే ఈ వ్యాసం పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని రచనలపై వచ్చిన పరిశోధనలకు సమగ్రతను కలిగిస్తుందని, పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని రచనలలో సామాజికాంశాలు అనే పరిశోధన వైపు భావిపరిశోధకులను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నాను.

4. సామాజికాంశాలు :

సాహిత్యం సమాజానికి అద్దంపడుతుంది. ఏకాలంలో ఉదయించిన సాహిత్యమైనా ఆనాటి జనజీవన చిత్రణ చేయకమానదు. లోకవృత్త పరిశీలనను కావ్యంలో ప్రతిఫలింపచేయాలన్న నియమం ఉండనే ఉంది. సమకాలీనత ప్రతిఫలించకుండా ఏ కావ్యాన్నీ కవి రాయడు. పూర్తిగా అలౌకికంగా, వాస్తవికతకు దూరంగా కావ్యాన్ని రాసినా అది లోకంలో కలకాలం నిలవదు.

"కావ్యే యశస్సే అర్థకృతేవ్యవహారవిధే-----" అని మమ్మటుడు అన్నాడు. లోకజ్ఞుడైన మహాకవి నిర్మించిన ప్రబంధం వల్ల పఠితకు వ్యవహారజ్ఞానం కలగాలి. వ్యవహారం అంటే లోకంతీరు. ఈ దృష్టితో చూస్తే ఒక జాతి యొక్క సాంఘిక, సాంస్కృతిక, చరిత్ర నిర్మాణానికి ఆ సాహిత్యం అత్యుత్తమమైన సాధనమని స్పష్టమవుతుంది. కావ్యంలో కవి స్వీకరించిన అంశాలు భూతకాలికమైనా, సమకాలీనమైనా అందులో చిత్రించే సన్నివేశాలు, పాత్రలు గుణశీలాదులు వాటి ప్రవృత్తులు, ఆచారవ్యవహారాదులన్నీ కవి లోకం నుండే గ్రహిస్తాడు. కావ్య నిర్మాణ ప్రక్రియలో భాగంగా పాత్రరసపోషణాలకు అంగములుగా అవసరమైనంత వరకు సంప్రదాయాలు, వస్త్రాలంకరణ, ఆహారవిహారాదికమైన సామాజికప్రవృత్తిని కవులు కావ్యాలలో చిత్రిస్తారు. ఇలా తన కాలంలో ఉండే ఆచారవ్యవహారాలను కావ్యంలో తెలియచేయటంలో పినవీరన చాలా గడుసరి.  ఇతడు శకుంతల రచనా కాలానికి నెల్లూరులో ఉన్నట్లు చరిత్రకారులు ఊహిస్తున్నా తన పూర్వీకులు తెలంగాణవారు కావటంతో తెలంగాణ ప్రాంతపు ఆచారాలు, వ్యవహారాలు,భాషా సొబగులు, పలుకుబడులు పదబంధాలు వంటివి ఎన్నో శాకుంతలంలో మనంగమనించవచ్చు.

4.1 దిష్టి:

భారతీయ సంప్రదాయంలో “దిష్టి తీయటం" అనేది అనాదిగా 'వస్తున్న ప్రక్రియ. 'దృష్టి' అనే పదం వికృతిరూపమే "దిష్టి" అంటే నలుగురి చూపు కేంద్రీకృతమై ఉండటం. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసినప్పుడు, శుభాశుభ కార్యాలప్పుడు, ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. 'నరదృష్టికి బండరాళ్ళైన పగులుతాయని’నానుడి. ఈ దిష్టి తీసే ప్రక్రియ ప్రాంతాలను బట్టి వేరువేరుగా ఉంటుంది. కొబ్బరికాయలు, ఎర్రనీళ్ళు, ఉప్పు, ఎండుమిరపకాయలు, ఎర్ర అన్నం, బొగ్గులు, నిమ్మకాయలు ఇలా రకరకాల వస్తువులలో వారివారి వారసత్వపు ఆచారాలకు అనుగుణంగా దిష్టితీస్తారు. వ్యక్తి లేదా వస్తువు చుట్టూ సవ్య, అపసవ్య దిశలలో వస్తువులలో ఎదో ఒకదాన్ని తిప్పి దూరంగా పడేస్తారు. పినవీరన కాలానికి కూడా ఈ దిష్టి తీసే ప్రక్రియ ఉన్నట్లు మనకు తెలుస్తుంది.

"చరణముల లేత చిగురు మోజాలు దొడిగి"---(3-41)

అనే పద్యంలో శకుంతల విరహవేదనావశయై, ఉష్ణశరీరంతో ఉన్నప్పుడు ఆమె చెలులు పొగడలు, బొడ్డు మల్లెలు, పొన్నవిరులను, దిష్టితీసి నాలుగు దిక్కులకు విసిరేసారు అని కవి వర్ణించాడు. వీరు ఆశ్రమవాసులు కావటం వల్ల వారి ప్రదేశానికి అనుగుణంగా లభించే వస్తువులతో దిష్టితీసినట్లు భావించవచ్చు. వస్తువుఏదైన'దిష్టి' అనే ప్రక్రియ ఆ కాలంలో వ్యవహారంలో ఉన్నట్లు దీన్నిబట్టి మనకు తెలుస్తుంది.

4.2 అల్లుళ్ళు-అలకలు:

"జామాతాదశమగ్రహం"అనిఉక్తి.అల్లుడు నవగ్రహాలతోపాటు పదవగ్రహం లాంటివాడు. అంటే అతడ్ని మనం అనుక్షణం కనిపెట్టుకుని,పరిణామాలను ఎదుర్కోవటానికి సంసిద్ధం కావాలని అర్థమేమో!? కొందరు దీనికిమినహాయింపే అయినా ఇప్పటికీ ఇటువంటి వారిని మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. వీరన కాలానికి ఈ ఉక్తి బాగా చెల్లుబాటులో ఉండేదేమో! అంపకాల సన్నివేశంలో కణ్వుడు పూర్తిగా తెలుగువాడయ్యాడు.

"నేరము లెన్నిగల్గిన గణించుట నేరము లల్లువారిపై"---(4-73)

అనే పద్యాన్నిబట్టి అత్తవారిపై నేరములను ఎత్తిచూపి, వారిని అవమానించే అల్లుళ్ళుఆ కాలంలో కూడా ఉండేవారని తెలుస్తోంది. కన్యనిచ్చిన వారు వరునిదృష్టిలో గౌరవహీనులుగా  కన్పించేవారు కాబోలు! పిల్లలమర్రి వారింట్లోనో, ఊళ్ళోనో, అల్లుళ్ళు ఎంత అల్లరి పెట్టారోగాని పినవీరనపైపద్యంలో దాన్ని గ్రహించాడు.

4.3 తోలుబొమ్మలాట:

జానపదుల కళలలో ఈ తోలుబొమ్మలాట ఒకటి. ఉత్సవాలు, జాతరలప్పుడు, పౌరాణిక, సామాజిక, చారిత్రక అంశాలతో వినోదాత్మకంగా విజ్ఞానాన్నిపంచే కళాప్రక్రియ తోలుబొమ్మలాట 15వ శతాబ్దం ఉత్తరార్థంలో ప్రజల్లో ఈ కళ బాగా ప్రాచుర్యంలో ఉన్నట్లు శాకుంతల కావ్యాన్ని బట్టి తెలుస్తోంది.

క్రవ్యాదుం బరిమార్చి యెంతయును నుగ్రంపశ్యుడై నిల్చి"---(3-125)

అనే పద్యంలో ఆటగాడు తెరబొమ్మలచేత గొండ్లి ఆడించే వినోదం ఆనాడు ఉన్నట్లు స్పష్టమౌతుంది..

4.4 వేట, యుద్ధం:

దుష్యంతుడు మృగవినోది అయి వేటకు వెళ్ళే ఘట్టాన్నిపినవీరన చాలా విపులంగా వర్ణించాడు.దుష్యంతుడు వాడిన వలలు, వేటాడటంలో గలభేదాలు, పద్ధతులు, వేటగాళ్ళు సమకూర్చుకునే వివిధ సామగ్రి, వారి వెంట బయల్దేరిన చిత్రవిచిత్రమైన పేర్లుగల జాగిలాలు, సాళువములు, మచ్చిక జంతువులు వీటన్నింటిని ఎంతో సహజంగా వర్ణించాడు.శాకుంతల కాలం నాటి రాజులు వేటకు వెళ్ళే సందర్భాలలో కాకతీయులకు యుద్ధాలలో విజయం సాధించడంలోనాటిరెడ్డిరాజులు కీలకపాత్ర పోషించారు. వారి వద్ద సైన్యాధ్యక్షులుగా, దండనాథులుగా ఉండటం, పిల్లలమట్టిని ఏలిన నామిరెడ్డి అసాధారణ ప్రజ్ఞావంతుడు కావడం వంటి విషయాలు వినడం ద్వారానో లేదా పినవీరనకు రాజులతో వేటకు వెళ్ళటం, యుద్ధాలు చూడటం ఇష్టమేమో! అందుకే-

యనగ యఱియు చెక్కుతోయముల వేళ్ళు--- (1-108) 

అనే పద్యంలో వేటకుక్కల పేర్ల దగ్గర నుంచి చెప్పాడు.

అంతేకాదు  పినవీరన చాలా యుద్ధాలను కళ్ళారా చూశాడు. అందుకే శృంగార శాకుంతలంలో 41 గద్య పద్యాలతో యుద్ధ వర్ణన చేశాడు. తర్వాత 46 పాదాల రగడలో రాజధాని నుండి కదిలిన మూలబలాలను వర్ణించాడు. ఇది దుష్యంతుని సైన్యంకాదు. నాటి సామ్రాజ్యాధిపతుల మూలబలం.

4.5 పురిటాలి తగవు:

తగవు అనే పదాన్ని ఈనాడు మనం 'కలహం', 'గొడవ' అనే అర్థంలోనూ, సాంప్రదాయికంగా అయితే "ధర్మం", "ఉచితం" అనే అర్థాల్లోనూప్రయోగిస్తున్నాము.కానీ తమిళంలో "తగవు" అంటే సంప్రదాయానుసారంగా వారు తీర్చవలసిన కానుకలుఅని అర్థం. అంటే రాజు నుండి కవులు తీసుకునే కానుకలను "తగవరిందవరిసె” అంటారు. శబ్దరత్నాకరంలో ఈ పదం "పెండ్లికుమారునకు తల్లిదండ్రులిచ్చే కానుక" అనే అర్థంలో వాడబడింది. ఇది కూడా ఒక సంప్రదాయాన్ని అనుసరించి, ఒక మర్యాదకు కట్టుబడి ఇచ్చే కానుకే, ఈ అర్థాన్ని అనుకరించే పినవీరన "తగవు" అనే పదాన్ని వాడాడు.

వృద్ధసింహమునకు విహరింప దొండంబు---(2-45)

అనే పద్యంలో కణ్వాశ్రమంలో పులిపురుడు పోసుకుంటే, లేడి "పురిటాలితగవు" తీసుకుని పులి దగ్గరకు వెళ్ళిందట. దీన్నిబట్టి కొత్తగా పురుడు పోసుకున్న వాళ్ళింటికి పేరంటాళ్ళు "పురిటాలి తగవు" తీసుకెళ్ళే ఆచారం నాడు ఉన్నట్లు తెలుస్తోంది. కణ్వాశ్రమంలో పులిపురుడు పోసుకుంటేనే పండగ చేసిన వీరన ఇక శకుంతల నీళ్ళాడితే ఊరుకుంటాడా?

కొలనుగుడిపిరి దినముల కొలది యెఱిగి------(4-62)

అంటూ శకుంతల పురుడును ఎంతో సందడిగా వర్ణించాడు. ఒంటినిండా పెద్ద ముత్తైదువలు ఇంగుదీశైలం పూసి, తలంటి, వెల్లుల్లి పొగ ఇచ్చి 21వ రోజు తగిన విధంగా ఏ ఒక్క క్రియను వదలకుండా పూర్తిచేసారట! అంటే ఆ కాలంలో ఈ విధిని ఎంత చక్కగా పండుగలా నిర్వహించారో అర్థంచేసుకోవచ్చు.

4.6 క్రూరమృగాల పెంపకం:

దుష్యంతుణ్ణి కణ్వుడి శిష్యులు అతిథి సత్కారం స్వీకరించటానికి ఆశ్రమానికి ఆహ్వానించినపుడు ఒక పులి ఆశ్రమంలోకి ప్రవేశించింది. దాంతో కణ్వశిష్యులు భయభ్రాంతులకు గురయ్యారు. దుష్యంతుడు దానిని దగ్గరకు తీసుకుని మచ్చిక చేయడం చూసి వారు ఆశ్చర్యపోయారు.

ఆ విప్రవరుని యార్తియు నిర్ణయ శార్దూల విస్ఫూరియుం గనుంగొని--(2-155) తనకు శకుంతలా వదన దర్శన యాత్రకు విఘ్న మాచరిం--(2-163)

అనే పద్యాలను బట్టి అది రాజుగారి వేటకై మచ్చిక చేయబడిన పెంపుడు పులి అని తెలుస్తోంది. అంటే రాజులు ఆనాడుక్రూరమృగాలను పెంపుడు జంతువులుగా పెంచేవారని, వాటిని తీసుకొని వేటకు వెళ్ళేవారని స్పష్టంగా తెలుస్తుంది.

4.7 ప్రజాహిత కార్యాలు:

నాడు తెలంగాణను పరిపాలించిన రెడ్డిరాజులు తదనంతర ప్రభువులు ప్రజలక్షేమాన్ని కాంక్షించి అనేక తటాకాలు,అన్నదాన సత్రాలు, దేవాలయాలు, దానధర్మాలు వంటి కార్యాలెన్నోచేసేవారు.

సప్తసంతానవతి జేసే జలధినేమి--(1-59)

అంటూ శాకుంతల కృతి భర్త అయిన వెన్నయామాత్యుని గురించి చెప్పిన పై పద్యంలో ఆనాడు ప్రభువులు ప్రజాకార్యాలకు ఎంతపెద్ద పీట వేసారో తెలుస్తోంది.

4.8 సోమవార వ్రతం - మతవిధానం:

రేచల్లరెడ్డిరాజులకాలంలో, వారి సంస్థానంలోని పినవీరన పూర్వులు, శాకుంతల కృతిభర్త వెన్నయమంత్రి, ఆఖరికి పినవీరన వీరంతా శైవమతావలంబకులే. ఆనాడు శైవమతం బాగా ప్రచారంలో ఉండేది. రెడ్డి రాజులు అనేక శైవాలయాలను నిర్మించారు. ఆ కాలంలో శైవమత గురువుల ప్రాబల్యం అధికంగా ఉండేది. పినవీరన తన కావ్యాలలో తానే చెప్పుకొన్నట్లు శివభజనాసక్తుడని ‘’ఆసుకవిచేతశివభజ…’’(1-19) అనే పద్యంవల్లతెలుస్తుంది.అంతేకాదు పరమేశ్వరుని అవతారమే పినవీరన అని నాటి జనులు కూడా భావించినట్టు జైమిని భారత పీఠిక ద్వారా తెలుస్తుంది. ఇక కృతి స్వీకర్త సంగతి వేరే చెప్పనక్కర్లేదు. వెన్నయ మంత్రి

"ప్రసాదపు పంచవర్ణమునసాలగ్రీవు పూజింపగా” అని చెప్తూ-

'విడువక సోమవారములు వెన్నన సేయగ వత్సలత్వమే’  -------(1-61)

అంటూ అతని శివభక్తి తత్పరతను వర్ణించాడు. దీన్ని బట్టి ఆనాడు పురుషులు (రాజులు) కూడా వ్రతదీక్షలు, ఉపవాసాలు ఆచరించేవారనీ! అందునా శివుడికి సంబంధించిన సోమవారాలు నిష్ఠగా పాటించేవారని తెలుస్తోంది.

4.9 రాజనీతి:

పినవీరనకు లోకజ్ఞానం చాలా ఎక్కువ. ఇతని పూర్వీకులు అమాత్యులుగా పని చేసినట్లు చరిత్ర చెప్పుతోంది. అందుకే ఎంత శృంగారం వైపు మొగ్గినా, పినవీరన సహజంగా రాజనీతివేత్త. శృంగార శాకుంతలంలోభరతునికి పట్టంకట్టాక నారదుని చేత సుదీర్ఘంగా (చతుర్ధాశ్వాసం 160-179) రాజనీతులు చెప్పించాడు. ఇవన్నీ ఆ కాలంలో అమలులో ఉన్న చట్టాలుగా భావించవచ్చు.

4.10 పన్నువిధానం:

దుష్యంతుడు వేటకు వెళ్ళిన సమయంలో మార్గమధ్యంలో సేదతీరినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే గోపాలకులు రాజును అతిథ్యం స్వీకరించమని అడిగారు. సందేహిస్తున్న రాజుతో మాండవ్యుడు "రాజా! వీరి మాటకాదనకు. వీరికి పెరుగులు, చల్లలు, వెన్న, చిత్ర ధాన్యములు ఎక్కువగా లభిస్తుంటాయి. ఒకపూట భోజనం పెట్టినంత మాత్రాన వీరు సష్టపోయేది ఏమీ లేదు! అదీకాక వీరు రాజధనాన్ని అనుభవిస్తూనే కప్పం కట్టడం లేదు. వీరి విందు తీసుకోవడానికి అంగీకరించండి” - అని అంటాడు.

ఒట్టమి చేసి వీరలకు నుత్తర మీకు నృపాల పెర్వులుం ---(1-125)

కానిక కప్పము వెట్టరు---- (1-126)

ఈ మాటల్ని బట్టి ఆ కాలంలో ప్రజల నుండి రాజులు పన్నులు వసూలు చేసేవారని, అయితే పట్టణానికి దూరంగా నివసించేవారు పన్నులు కట్టవలసిన అవసరం లేదని తెలుస్తుంది.

4.11 స్వప్నసిద్ధాంతం:

భారతీయ తత్త్వాన్వేషణలో మనసు, ఆ మనసు నడిపించే అంతరాత్మ, ఆ అంతరాత్మలోని చైతన్యంఅనేవినిత్యాసత్యాలు. ఈ మూడింటికి భౌతిక ఆలవాలమైనది శరీరం. అటువంటి భౌతిక శరీరంలో ఉన్న జీవుడు "జాగ్బద్ స్వప్న సుషుప్తి" అనే త్రివధావస్థలను అనుభవిస్తుంటాడు. జాగృదవస్థలో ప్రాపంచిక విషయాలను మనోబుద్ధి ఇంద్రియాల ద్వారా స్పష్టంగా గ్రహించి అనుభవిస్తాడు. స్వప్నావస్థలో సూక్ష్మ శరీరంలోని మనోబుద్ధులు స్వప్న ప్రపంచాన్ని జీవుడికి కలిగింపజేస్తాయి. ఇందులో జాగ్రదావస్థలో అనుభవించిన అనుభవాలు కూడా చోటు చేసుకుంటాయి. సుషుప్త్యవస్థలో అంత:కరణం కూడా పనిచేయదు. కారణం శరీరంలో సుషుప్త్యవస్థలో జీవుడు విశ్రాంతి పొంది నిజమైన అనుభూతిని అనుభవిస్తాడు. ఇలా మానవుడు స్వప్నావస్థలో తన అనుభవాలతో పాటు భవిష్యత్ దర్శనం చేసే కొన్ని సూచనలను పొందే అవకాశం ఉంది. దాన్నే స్వప్న సిద్ధాంతం అంటారు.

పాయసముం గలలో భూ----- (1-129)

పై పద్యంలో పాయసం తిన్నట్లు కలలు వస్తే అది నరులకు శ్రేయస్కరం అని స్వప్నాధ్యాయంలో విజ్ఞులు చెప్పినట్లు మాండవ్యుడు దుష్యంతునితో అన్నాడు. దీన్ని బట్టి శాకుంతలం కాలం నాటికి ఇలాంటి మనో అధ్యయన సిద్ధాంతాలు ప్రచారంలో ఉండేవని తెలుస్తోంది.

4.12 జూదం:

వీరన దుష్యంతుడి రాజ్యాన్ని, అక్కడి ప్రజలను వర్ణిస్తూ-

 “చిత్రంబులుబ్బి గబ్బితనంబున విత్తంబులొడ్డి నెత్తంబులాడి యోడినధనంబు-------“ (1-86)

అనేవచనంలో ఒళ్ళు పై తెలియక వ్యసనాలకు లోనై జూదం ఆడి డబ్బులు కోల్పోయి. ఆ డబ్బులు గురించి తిరిగి కొట్లాడి రచ్చచేసే జనాలు, ఆ గొడవకు నిలయమైన కొట్టాలు ఆనాడు ఉండేవని తెలుస్తోంది. "తమ్ముడు తమ్ముడే! పేకాట పేకాటే" అన్న నానుడి ఈ సందర్భంగా జ్ఞప్తికి తెస్తోంది.

4.13 సున్నపు పూత:

దుష్యంత రాజ్యాన్ని వర్ణించిన వీరన అక్కడి దుర్భేద్యమైన పట్టణాలను, నిర్మాణాలను, రాజభవనాలు, ఎత్తైన ప్రాకారాలను చాలా విపులంగా వర్ణించాడు. రెడ్డి రాజులు, తరువాత వారైన విజయనగర రాజులకాలంలో కూడా ఇటువంటి కట్టడాలను మనం చూడొచ్చు. ఈ క్రమంలో-

"దాళువాలించు సన్నసన్నంబుల చేత లేత వెన్నెలల నెమ్మించు గ్రామ్మించులుం గల మేడలను---“  (1-86)

అన్న వాక్యాన్ని బట్టి నాడు మేడలకు సున్నపు పూతను వేసేవారని తెలుస్తుంది.

4.14 రాజదర్శనం - కానుకలు:

శ్లో౹౹ "అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీవృద్ధ బాలకాన్,

 రిక్త హస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుమ్."

భావం: యజ్ఞయాగాదులు జరిగే స్థలాలకు వెళ్ళినప్పుడు, పర్యటన ముగించుకొని తన ఇంటికి వెళ్ళినపుడు, యాత్రాస్థలాలైన క్షేత్రాలకు వెళ్ళినపుడు, గర్భిణి స్త్రీలను, వృద్ధులను, పిల్లలను చూడటానికి వెళ్ళినపుడు, అలాగే రాజదర్శనం, దైవదర్శనం, గురుదర్శనం కోసం వెళ్ళేటపుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు అనేది మన సాంప్రదాయం.

దుష్యంతుడు నిండు సభలో కొలువై ఉండగాపుళిందవల్లభులు కానుకలు తెచ్చి రాజుకు సమర్పించి వారి సమస్యను కమ్మబిల్లుల పిల్లలు, కారుకోళ్ళు---(1-98) పద్యంలో చెప్పాడు. అంతేకాదు అడవిలో రాజును ఆతిథ్యానికి పిలవడానికి వచ్చిన గోపాలకులు కూడా-

అతండును, నృపాలకా నుశాదేజుల నేగనీక వాగెలు--- (1-122)

అంటూ కానుకలు సమర్పిస్తారు.అంటే ఆనాడు ఏదైనా సహాయంకోరి పెద్దలను ఆశ్రయించవలసి వస్తే చిరుకానుకలు సమర్పించి వారి సమస్యలు విన్నవించేవారని తెలుస్తుంది.

4.15 వినాయకుని పూజ:

దుష్యంతుడు క్రూరమృగాలను వేటాడటం మొదలుపెట్టాక మాండవ్యుడు ఆ వేట మృగాలను చూసి భయపడి రాజుతో "భూనాథ! మనం బయలుదేరినప్పుడు విఘ్నపతిని పూజింపలేదు. మీకు మృగబాధ కలగకుండ ప్రజలకి భయం కలగకుండ ఉండేటట్లు నేను ఆ గొల్లపల్లెలో గజముఖుడ్ని పూజిస్తాను" అని చెప్పాడు. అంటే ఆనాడు వేటకు వెళ్లేముందు లేదా ఏదైనా పనిని ప్రారంభించే ముందు విఘ్నాలు కలగకుండా వినాయకుడ్ని పూజించే సాంప్రదాయం లోకవ్యవహారంలో ఉంది.

గజముఖునినేని బ్రార్థింతు వ్రజములోన--- (2-9)

4.16 లోహాలు: రెడ్డిరాజుల కాలంలో ఇత్తడి, కంచు, రాగి లోహాలతో కూడిన వస్తుసముదాయాన్ని సామాజిక ప్రజలు నిత్యజీవితంలో ఉపయోగించేవారు.

"బిందెలు కరములగొని యర విందాస్యలు -- (2-58)

అనే పద్యంలో శకుంతల తన చెలికత్తెలతో కలసి బిందెలతో నీళ్ళు తెచ్చి మొక్కలకు పోస్తున్నట్లు వర్ణించబడింది. నిజానికి ఆశ్రమాలలో మట్టిపాత్రల వాడకం పరిపాటి, కానీ వీరన ఇక్కడ బిందెలతో అని ప్రత్యేకించి చెప్పడంలో లోహపు వస్తువు నాడు వాడుకలో ఉన్నట్లు గ్రహించవచ్చు.

4.17 రాజు ఆయుధాలు వదిలివెళ్ళుట:

దేవాలయాలు, ఆశ్రమాలు, పవిత్రస్థలాల దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆర్థిక స్థితిగతులను పక్కకు పెట్టి, ఎంత గొప్పవారైనా సాధారణ వ్యక్తిగా ప్రవర్తించటం గౌరవప్రదం. కణ్వాశ్రమ ప్రవేశానికి రథమెక్కి వెళ్ళటం ఉచితం కాదని, దుష్యంతుడు రథసారధులను, ధనుర్బాణాలను మాలినీనది తీరాన వదిలేసి "వినీతవేషుడై" తపోవనంలోకి ప్రవేశించాడు.

"సంయమీంద్రులు నరేంద్ర నీవిచటికి వచ్చుట తమదివ్యా -" (2-47)

దీన్నిబట్టి ఎంతవారు కానీ ముని ఆశ్రమాలు, పవిత్ర స్థలాలోకి ప్రవేశించే ముందు నియమ నిబంధనలను పాటించేవారని అర్ధమవుతోంది.

4.18 శకునాలు:

భారతీయ సంప్రదాయాలలో శాస్త్రాలకు ఎంత ప్రాముఖ్యతో, శకునాలకూ అంతే ప్రాధాన్యత ఉంది. వేదశాస్త్రాలతో పాటు శకునాలకు కూడా శాస్త్రాలను రూపొందించారు. ఇవి నేటికాలంలో మూఢనమ్మకాలుగా భావిస్తున్నారు. మనిషి చుట్టూ ఉండే ప్రదేశం, పరిస్థితులు వ్యక్తిలోని శక్తికి, సానుకూల దృక్పథానికి కారణమవుతాయి. దీని ద్వారా వ్యక్తి చుట్టూ జరిగే సంఘటనలకి- వ్యక్తికి కార్యకారణ సంబంధంఏర్పడుతుంది. వాస్తవిక దృక్పథంలోంచి వచ్చిందే శకునశాస్త్రం. వీటికనుగుణంగా భూతకాల నిర్ధారణ, వర్తమాన నిర్ణయం, భవిష్యత్తు దర్శనం చేసే అలవాటు ప్రజలలో ఉంటుంది. అటువంటి శకునాలకు సంబంధించిన జ్ఞానం,వ్యవహారం నాడు అధికంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

మాండవ్యుడు శకునశాస్త్ర పారంగతుడు. దుష్యంతుడ్ని గోపాలకులు భోజనానికి ఆహ్వానించినపుడు,రాజు వేటకు బయలుదేరే సమయంలో కనిపించిన శుభశకునాలను నిరూపించి, అవి పెండ్లి అయ్యే సూచనలను తెలుపుతున్నాయని చెప్తాడు. అంతేకాదుభోజనానికి ఆహ్వానించడం, తాంబూల, గంధపుష్పాదులు స్వీకరించమనడం (1-130) కార్యసిద్ధికి మూలకారణాలని వివరిస్తాడు. మానవుడు తన గమ్యస్థానానికి ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు అది చేరేదాక శాకునిక శాస్త్రంలో చెప్పబడినట్లు ఎదురయ్యే శకునాలను అనుసరించి వాటి ఫలితాలను గమనించుకోవాలి అని అంటాడు. రాజు వేటకు బయలుదేరే సమయంలో భవనం బయట కాకి, వృషభం రంకెవేయటం, దక్షిణంలో పూర్ణ జలకుంభం (1-132) ఇలా అనేక శకునాలన్నీ వివాహం జరగటాన్ని సూచిస్తున్నాయి. ఇలాంటి శకునశాస్త్ర విషయాలను పినవీరస ఈ కావ్యంలో ప్రస్తావించాడు. దుష్యంతుడు కణ్వాశ్రమంలో ప్రవేశించగానే కుడిభుజం అదురుతుంది. ఇది 'మనోజ్ఞమూర్తియగు యుగ్మలి కౌగిలి" కి సూచన అని భావిస్తాడు. దానికి తపోవనంలో ఆస్కారం లేకపోవడంతో భవిష్యత్తు భగవంతుడికే ఎరుక అని ముందుకుసాగుతాడు.

వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే అప్పట్లో ఇటువంటి నమ్మకాలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అవసరం ఉన్నప్పుడల్లా శాస్త్ర వ్యుత్పత్తి ప్రకటిస్తూనే భావికథా సూచన చేశాడు.

4.19 అతిథి సత్కారం:

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అని ఆర్యోక్తి. భారతీయ సనాతన సంప్రదాయంలో అతిథి సత్కారానికి ఉన్న విలువను ఈ ఉక్తి దృఢపరుస్తుంది. అతిథిని సాక్షాత్తు భగవంతుడికి రూపంగా భావించటం మన సంస్కృతిలో ఒక భాగం. ఈ విషయంలో శాకుంతల కాలంనాటి ప్రజలు ఏ మాత్రం తీసిపోరు. తమ ప్రాంతానికి వచ్చిన దుష్యంతుడ్ని గోపాలకులు విందుకు ఆహ్వానించటం (1-122) కణ్వుడు లేనందున అతిథి మర్యాదలకు లోటులేకుండా శకుంతలను నియమించడం (2-97), నారదుడికి దుష్యంతుడు అతిథి సత్కారాలు చేయటం (4-139) ఇవన్నీ నాడు సమాజంలో అతిథి మర్యాదలకి ప్రాధాన్యతనుతెలియపరుస్తున్నాయి. అయితే ఆతిథ్యానికి పిలిచే ముందు వ్యక్తికి కానుకలు సమర్పించటం (1-125) అనాడు మనం గమనించాల్సిన అంశం.

4.20 స్త్రీలు:

శారీరక నిర్మాణరరీత్యా, సాంఘిక స్థితిగతులను అనుసరించి సమాజంలో స్త్రీలకు కొన్ని కట్టుబాట్లు, నిబంధనలు పెట్టబడ్డాయి. ప్రాచీన సాహిత్యం అనగానే స్త్రీలను అంగాంగ వర్ణన చేశారు. శృంగార భావచిత్రణ చేసారు అన్న అపవాదు చాలా వరకు పాఠకులలో వేళ్ళూనుకొని ఉంది. కానీ ఆ వర్ణన వెనక అనేక శాస్త్రీయ మనోభావ చిత్రణ, భావికథా సూచనాంశాలు అంతర్గతంగా దాగి ఉంటాయి. తన కావ్యానికి శాకుంతలం అని పేరు పెట్టడంలోనే వీరన స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యత అర్థమవుతుంది. ఇక పేరులోనే ఉన్న విలువ కావ్యంలో ఎందుకు తగ్గుతుంది.

శాకుంతలంలో కణ్వుడు, శకుంతలకు పతివ్రతాధర్మాలను ఉపదేశించిన ఘట్టం విపులంగా (4-74-82) చిత్రించబడింది. ఈ కులస్త్రీ ధర్మాలన్నీ శాకుంతలకాలం నాటికి ప్రచారంలో ఉన్నాయని చెప్పటానికి సాక్ష్యాలు. ఈ పదాలని గమనిస్తే స్త్రీని ప్రత్యక్ష దైవం అని ప్రచారం చేయటంలో పురుషులకు ఎక్కడలేని శ్రద్ధ ఉన్నట్లు తెలుస్తుంది. పెళ్ళైన ఆడవాళ్ళు పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదని భావించిన కణ్వుడు కొందరు వృద్ధ స్త్రీలను, శిష్యులను, అనసూయ ప్రియంవదలనుశకుంతల వెంట పంపాడు. పెళ్ళికాని యువతులను వెంటపంపడం అనౌచిత్యమని  నాయని కృష్ణకుమారి గారి అభిప్రాయం. అయితే ఈ యువతులే దుష్యంతుడు శకుంతలను అంగీకరించలేని స్థితిలో ఆగ్రహించి (4-122-128) ఎదురుతిరిగారు.

అంటే ఆ కాలానికి శకుంతల వంటి అమాయక స్త్రీలేకాదు, అన్యాయం జరిగితే రాజుకు సైతం ఎదురుతిరిగి నిలదీయగలిగే ధైర్యవంతులు, ప్రతిభాశీలులైన యువతులున్నట్లు గ్రహించవచ్చు. ఇక వీరందరిని రాజ్యసభలో కాకుండ సముచితంగా వారిని అంతఃపుర ప్రదేశంలో కలవటం (4-100) ఆనాడు సభాస్థలంలో స్త్రీలు ప్రవేశించకూడదనే నిబంధన తెల్పుతుంది. పతివ్రతాధర్మాలు చెప్పడంలో ఇల్లాలు బాగుండాలనేఉద్దేశ్యంప్రకటితమవుతోంది.. ఈ నియమాలన్నీ స్త్రీలను నిరాశపరిచేవి కావు.కాలానుగుణంగా భార్యభర్తల మధ్య అన్యోన్యత పెంచేవి. అప్పుడే కుటుంబం దానిద్వారా సమాజం బాగుంటుందని అర్థంచేసుకోవాలి.

5.21 చతుర్విధ ఆశ్రమాలు:

భారతీయ సనాతన జీవనయానంలో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలనే చతుర్విధ ఆశ్రమాలు ప్రధాన భూమికను పోషిస్తాయి. శాకుంతలంలో జితేంద్రియుడైన ముని శకుంతలతో "నీవు సుఖంగా నీభర్తతో ఉండు. నేను నిశ్చింతగా తీర్థక్షేత్రాలకు వెళ్తాను అనటం, ఈ పద్యంలో కనిపిస్తుంది.

వనిత యనసూయమును బ్రియంవదము నీకు ------(4-17)

శాపవిముక్తుడైన దుష్యంతుడు "ముసలివాడైనాను, ఇక రాజ్యంపాలించలేను. నా పుత్రుడికి రాజ్య భారం అప్పగించి వనానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను".

పెద్దవాడనైతి బృథివిభారం బింక ---- (4-151)

అని చెప్పటంలో ఆ కాలంలో చతుర్విధ ఆశ్రమాలు విధిగా పాటించడం  ఉండేదని తెలుసుకోవచ్చు.

పై అంశాలతో పాటు అమితమైన ధనం గల వైశ్యులు, ఏ వస్తువుకూ లోటు లేనంత వాణిజ్యం (4-85), రాజులకు బహు భార్యత్వం (4-88),  భోజన ప్రియత్వం (1-135), పుణ్యాహవచనం (4-63), జాతకం పై నమ్మకం (4-60) పాపిట మంగళకర చిహ్నంగా సింధూరం ధరించటం (4-78), ఆభరణాలు, అలంకరణ, వస్త్రధారణ (4-141) నేటికీ సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇక పురుషులానాడు జడలు వేసుకునేవారని, తిలకం కూడా పెట్టుకునేవారని (1 -113) మొదలైన అనేకసామాజికాంశాలు నాడు జనబాహుళ్యంలో నిత్యవ్యవహారంలో ఉండేవి.

6. ముగింపు

  • సాహిత్యం లోకానికి ప్రతిబింబం. కావ్యేతివృత్తం లోకవృత్తానికి అనుకరణే. కవి సేకరించిన అంశాలు భూతకాలికమైన, సమకాలికమైన అందులో చిత్రించే సన్నివేశాలు, పాత్రల గుణశీలాదులు, వాటి ప్రవృత్తులు ఆచారవ్యవహారాదులన్నీ కవి లోకం నుండే గ్రహిస్తాడు. రస ప్రధానమైన ప్రబంధాలను నిర్మించిన కవులు ప్రధానంగా కాకపోయినా పాత్ర రసపోషణాదులకు అంగములుగా అవసరమైనంత వరకు సామాజిక ప్రవృత్తిని తమ కావ్యాలలో ప్రతిబింబించారు. సాంఘిక చరిత్ర ప్రజల చరిత్ర. సమాజంలో నివసిస్తున్న మానవుడు, సాహిత్యాన్ని వివరించే కవులు సంఘంలోని వారే కాబట్టి సంఘానికి హితాన్ని బోధించేదే సాహిత్యం. అందువల్ల సంఘం-సాహిత్యం అవినాభావసంబంధం కలిగి ఉంటాయి. ఆకారణంగా కవులు తమ కళ్ళ ఎదుట జరిగే సంఘవృత్తాంతాలను తమ కావ్యాలలో వర్ణించటం వారికి నియమితమైంది. తమ అనుభవాలకు రాని విషయాలను కల్పనలతో తెలపడం పరిపాటి అయింది. పినవీరన కూడా ఆకోవలోకి చెందినవాడే.
  • ఎంతో వైవిధ్యంతో రచనలు చేసి తన సమకాలిన జీవితాన్ని చక్కగా తన కావ్యంలో ప్రతిఫలింప చేసిన పినవీరన కవిత్వాన్ని అంచనావేస్తూ, "ఈ కవికి ప్రపంచానుభవ జ్ఞానం తక్కువ, గ్రంథపఠన జ్ఞానం ఎక్కువ" అని కొందరు (టేకుమళ్ళ అచ్చుతారావు) విజ్ఞులు విమర్శించారు.
  • సామాజిక అంశాలే కాదు, నేడు వాడుకలో లేని మారుమూల పదాలు భాషా సొగసులు, నుడికారపు మెరుపులు, సామెతలు కూడా, పినవీరన కావ్యాలలో దండిగా చోటు చేసుకున్నాయి. తగవు, తంగేటి జున్ను, సుద్ది, ఉద్దెర, ఓమనగాయలు, టంకము వంటి పదబంధాలెన్నో, కుప్పలుతెప్పలుగా వీరన రచనల్లో పలకరిస్తాయి. వీరన పదప్రయోగ సందర్భాలను పరిశీలిస్తే తమిళార్థంలో ఎక్కువగా గ్రహించబడ్డాయి అని తెలుస్తుంది.
  • ఏది ఏమైనా ఈ తీయని తెలుగు పలుకుబడి తర్వాతి తరం కవులకు మార్గదర్శి అయిందనడం నిర్వివాదాంశం. పిల్లలమఱ్ఱిపినవీరభద్రుడు అమేయపాండిత్యంతో మృదుమధుర కవితాశక్తితో, తెలుగు సాహితీలతకు, అసమాన సౌరభాలను వెదజల్లే జంట పూలను పూయించారు. ఆ జంటపూవుల అమృత సౌరభం ఈనాటికీ మనందరినీ తన్మయులను చేస్తూనే ఉంది.

7. ఉపయుక్తగ్రంథసూచి

  1. కృష్ణకుమారి, నాయని, శృంగార శాకుంతలము, ఆంధ్రప్రదేశ్ సాహిత్య సాహిత్య అకాడమీ, హైదరాబాద్, 1967.
  2. దుర్గయ్య, పల్లా, ప్రబంధ వాఙ్మయ వికాసము, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2012.
  3. ప్రతాపరెడ్డి, సురవరం, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2013.
  4. ప్రభాకరశాస్త్రి వేటూరి, ప్రబంధరత్నావళి, శ్రీ ప్రభాకర పరిశోధక మండలి, హైదరాబాద్, 1976.
  5. ముద్దప్ప, ఇరిగేపల్లి, పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి, కావ్యానుశీలనం, లలితా ప్రచురణములు, అనంతపురము, 1987
  6. రాము, ఎం.కె, తెలుగు ప్రబంధాలు (వ్యాససంపుటి), రసమయి, హైదరాబాద్, 2005.
  7. సిమ్మన్న, వెలమల, తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, దళిత సాహిత్య పీఠం, విశాఖపట్నం, 2009. 
  8. సుబ్రహ్మణ్యం, జి.వి, పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి, మాధవీ బుక్ సెంటర్, హైదరాబాదు, 1973

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]