headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-5 | Issue-6 | May 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

8. తపతీసంవరణోపాఖ్యానం: పూర్వప్రబంధాల ప్రభావం

బట్టు విజయ్ కుమార్

పరిశోధక విద్యార్థి,
కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్,
హైదరాబాద్, రాజన్న సిరిసిల్లా, తెలంగాణ.
సెల్: +91 9505520097, Email: battuvijay95@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

కుతుబ్‌షాహీలు ఉర్దూ, పారశీకభాషలను మాతృభాషగా కలవారు. తెలుగు మాధుర్యానికి ఆకర్షించబడ్డారు. కొన్ని ఫర్మానాలను తెలుగులోనూ జారీచేసిన ఘనత వీరికే దక్కుతుందని చెప్పవచ్చు. పరమత సహనం కలిగి ఉన్నారు. తెలుగు కావ్యాలలో వస్తువుగా నిలిచారు. అంకితం పుచ్చుకున్నారు. కుతుబ్‌షాహీల ఆస్థానంలో తెలుగు కవులను పోషించడం. కొత్తకొత్త ప్రక్రియలు అప్పుడే పుట్టుకురావడం. 16వ శతాబ్దంతోని ప్రబంధాల ప్రభావం ఉందనేది ఊహా ప్రతిపాదన. తపతీసంవరణోపాఖ్యానమనే ప్రబంధంపై ఏఏ ప్రబంధాల ప్రభావం ఉందో తెలపడమే ఈ వ్యాస లక్ష్యం. ఈ వ్యాసంలో తపతీసంవరణోపాఖ్యానం ప్రబంధాన్ని పూర్వం ప్రబంధాలతో తులనాత్మకంగా పరిశీలించే పద్ధతి పాటించాను.పూర్వం ప్రబంధాలతో పోల్చి చెప్పడమే ఈ వ్యాస లక్ష్యం.

Keywords: సాహిత్యం, పద్యాలు, కవులు, ప్రభావం,ప్రబంధం, కొత్త ప్రక్రియలు.

1. పరిచయం:

తెలుగుసాహిత్యం నన్నయ నుంచి కుతుబ్‌షాహీలదాకా చక్కని ఆదరణకు నోచుకుంది. 11వ శతాబ్దం నుంచి శాఖోపశాఖలుగా పెరుగుతూ, అనేక కావ్య ఫలాలను అందించింది.  పరదేశీ రాజులైన తెలుగుపై మక్కువ పెంచుకున్నారు. అనేక రచనలు రావడానికి కారణమయ్యారు.
కుతుబ్‌షాహీలు మధ్య ఆసియాలోని దక్షిణ ఇరాన్‌లోని ‘హందం’ రాజ్యాధిపతులు. వీరు  ‘కారాకునీల్‌’ తెగకు చెందినవారు. మధ్య ఆసియాలో రాజకీయ ప్రాబల్యం కోసం క్రీ.శ. 1463కి ముందే వీరు మరో తెగ ‘ఆకునేవ్‌’తో పోరాడారు. ఆసియాలోని తబ్రీజ్‌, హందం నగరాలను పాలించి శత్రువులచేత పరాజితులైన కులీవంశస్తులు జీవనోపాధి కోసం క్రీ.శ. 15వ శతాబ్దం చివర్లో భారతదేశానికి వలసవచ్చారు. ఓటమిపాలైన కులీ-కుతుబ్‌-ఉల్‌-ముల్క్‌ ఇతని తండ్రి, అతని పినతండ్రి అల్లాకులీతో కలిసి వచ్చారు. గోల్కొండను రాజ్యస్థాపకుడైన సుల్తాన్‌ కులీకి ఆరుగురు కుమారులు. ఇందులో చెప్పుకోదగ్గవాడు ‘ఇబ్రహీం కులీ’.

2. ఇబ్రహీం కులీకుతుబ్‌షా (క్రీ.శ.1550 - 1580):

తెలంగాణ చరిత్రలో ఇబ్రహీంకుతుబ్‌షా పాలన చాలా విషయాల్లో అద్వితీయమైంది.  ఇబ్రహీం క్రీ.శ.1530 మే 29న జన్మించాడు. ఇబ్రహీం కుతుబ్‌షా అన్న అయినా జంషీద్‌ రాజ్యకాంక్షతో తండ్రిని చంపించాడు. సింహాసనాన్ని అధిష్టించాడు. అతనికి భయపడి ఇబ్రహీం విజయనగరం పారిపోయినప్పుడు వయసు సుమారు పద్నాలుగు సంవత్సరాలు.

ఇబ్రహీం తిరిగి క్రీ.శ.1550 జూలై 27న గోల్కొండలో కాలు పెట్టాడు. అళియరామరాయల మద్దతుతో గోల్కొండ చేరి, శత్రువులను ఓడించి సింహాసనాన్ని అధిష్టించాడు. ప్రముఖ చరిత్రకారుడు హరున్‌ఖాన్‌ షేర్వాని తన ప్రసిద్ధ రచన ‘‘హిస్టరీ - ఆప్‌ - కుతుబ్‌షాహి డైనాస్టీ’’లో ఇబ్రహీం పరిపాలనా కాలాన్ని ‘ది కింగ్‌డం ఎట్‌ ఇట్స్‌ హైట్‌’ తెలుపుతుంది. అతడు సింహాసనంపై అభిషిక్తుడయ్యాడు. తండ్రి నుండి అతనికి సంక్రమించిన రాజ్యం చాలా పెద్దది కోహిర్‌ నుండి మచిలీపట్నం వరకు విస్తరించి ఉన్నది. గోల్కొండను పరిపాలించిన కుతుబ్‌షాహీ సుల్తానుల్లో ఇబ్రహీం కులీ కుతుబ్‌షా ముఖ్యుడు. ఇబ్రహీం కుతుబ్‌షా మరణించడానికి ముందే మహమ్మద్‌ కులీ కుతుబ్‌షాను తన వారసుడిగా ప్రకటించాడని చరిత్రకారుల అభిప్రాయం. గోల్కొండ సింహాసనం అధిష్టించేనాటికి యువకుడైన మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా రాజ్య నిర్వహణ వ్యవహారాల్లోనూ, సైన్యాలను నడపడంలోనూ మంచి శిక్షణ, అనుభవం పొందాడు. తండ్రి ఇబ్రహీంలాగే గొప్ప సాహిత్యాభిమాని. దక్కనీ, ఉర్దూ భాషల్లో దిట్ట. తెలుగుభాషలో కూడా మంచి పాండిత్యం కలవాడని చరిత్రకారులు పేర్కొన్నారు. (కుతుబ్‌షషాహీలు; కాకాని చక్రపాణి, పుట:77)

3. తెలుగు సాహిత్యం:

విజయనగరంలో తెలుగుసాహిత్యంపై మక్కువ ఏర్పడింది. అక్కడే తెలుగు, సంస్కృతం నేర్చుకొన్నాడు. కవులను పోషించడం కూడా అక్కడి సాంప్రదాయాన్నే అనుసరించాడు. ఇతని ఆస్థానంలో తెలుగు, సంస్కృతం, ఉర్దూకవులు తబయా, జుహరీ, నుస్రతీ మొదలగువారు ఉండేవారు. అద్దంకి గంగాధరుడు (తపతీసంవరణోపాఖ్యానం), పొన్నగంటి తెలగన్న (యయాతి చరిత్ర), కందుకూరి రుద్రకవి (సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం, జనార్దనాష్టకం), సారంగు తమ్మయ్య (వైజయంతి విలాసం), మరింగంటి సింగరాచార్యులు (దశరథరాజనందన చరిత్ర, సీతాకల్యాణం) కనిపిస్తారు.

ఈ కాలంలో కుతుబ్‌షాహీలు పాలిస్తున్నప్పుడు వచ్చిన రచనలు మాత్రం ఇతిహాసాలకు సంబంధించినవి. ఆదికావ్యమైన రామాయణం కథతో వచ్చిన కావ్యాలు- ‘సుగ్రీవ విజయం', 'దశరథ రాజనందన చరిత్ర', 'సీతకల్యాణం'. ఆంధ్రమహాభారతం కథతో వచ్చిన కావ్యాలు- తపతీ సంవరణోపాఖ్యానం', 'యయాతి చరిత్ర'.

గోల్కొండ సుల్తానులు పరిపాలన సాగిస్తున్నప్పుడు తెలుగుకవుల రచనలపై సహజంగా ఉర్దూ, పారశీక భాషల ప్రభావం ఉంటుందని అభిప్రాయపడే అవకాశం ఉంది. కానీ ఈ కాలంలోనే తొలి అచ్చ తెలుగు కావ్యం రావడం. తెలుగుకవుల రచనల్లో ఉర్దూ పారశీక పదప్రయోగాలు ఎక్కువగా లేకపోవడంవంటి అంశాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కవులు కావ్య రచనలో కొత్త కొత్త మార్గాలపై దృష్టి సారించడం ఇందుకు నిదర్శనం కావచ్చు. ‘‘యయాతి చరిత్ర’’, ‘‘దశరథరాజనందన చరిత్ర’’, ‘‘సుగ్రీవ విజయం’’ మొదలగు కావ్యాలు కనిపిస్తాయి. ఈ యుగంలో వచ్చిన కావ్యాలను పరిశీలిస్తే అవి ప్రబంధ లక్షణాలను కలిగి ఉన్నాయి.

4. ప్రబంధ లక్షణాలు:

తెలుగు సాహిత్యంలో ప్రబంధ శబ్దం నన్నెచోడుని కాలం నుంచి ప్రచారంలోకి వచ్చింది. ప్రకృష్టమైన బంధం కలిగినది ప్రబంధమని అర్థం. రచనా సంవిధానంలోనూ, కథాగమనంలోను శ్రేష్ఠమైన కూర్పు, బిగువు కలిగి ఉండడం. ప్రబంధాల ప్రధాన లక్షణాలు అష్టాదశ వర్ణనలు, వస్త్వేకత, శృంగారరస ప్రధానం, ఏకనాయకాశ్రయం మొదలగునవి.

5. తపతీ సంవరణోపాఖ్యానంపై ప్రబంధాల ప్రభావం:

కుతుబ్‌షాహీలకాలంలోని తెలుగు సాహిత్యంపై ప్రబంధయుగ ప్రభావం కనిపిస్తుంది. ‘వైజయంతీ విలాసం’పై ‘ఆమూక్తమాల్యద’, ‘నిరంకుశోపాఖ్యానం’పై ‘పాండురంగ మహాత్మ్యం’, ‘తపతీసంవరణోపాఖ్యానం’పై ‘పారిజాతాపహరణం’, ‘వసుచరిత్ర’, ‘నలోపాఖ్యానం’ల ప్రభావం కనిపిస్తుంది.

తపతీసంవరణోపాఖ్యానం కుతుబ్‌షాహీల కాలంలో వచ్చిన అత్యుత్తమ రచన. దీనిని రాసినది అద్దంకి గంగాధర కవి. ఈ కావ్యంలోనే ఇబ్రహీంకుతుబ్‌షాహీని ‘‘ఇభరాముడు’’ అని పేర్కొన్నాడు. ఇభరాముడు (ఇబ్రహీం కులీకుతుబ్‌షా) ఒకనాడు సభలో కొలువైన ఉన్న సమయంలో గంగాధరునితో ఇలా అన్నాడు-

ఉ॥ పెక్కుకృతుల్‌ చమత్కృతులు బెంపుగనందితి గాని నీదు స
మ్యక్కృ తి కన్యపై గల మమత్వము వర్తిలదందు లెక్కకుం
బెక్కువగాగ గోపికలు మించివసించిన నేమి రాధపై
మక్కువ యెక్కువై మిగుల మన్నన సేయడె శౌరి వేడుకన్‌ (తపతీ, 1-18)

తే.గీ. అట్లు గావున భారతాఖ్యానమందు
గలుగు తాపత్య చరితంబు ఘనత నరసి
వివిధ శృంగార మహిమల విస్తరించి
కబ్బమొనరింపు నాపేర గవివరేణ్య  (తపతీ, 1-19)

కర్పూరపు తాంబూలం పెట్టి కావ్యం రాయమని ప్రోత్సహించాడు. ఈ తపతీసంవరణం తప్ప ఇభరాముడికి అంకితం చేయబడినట్టు మరో రచనలేదు. అతడు ‘‘పెంపుగ నందితి’’ అన్న పెక్కుకృతులు చమత్కృతులు కేవలం చాటుపద్యాలే కావచ్చు. ఆ చాటుపద్యాలు లెక్కకు ఎక్కువగా గోపికల వంటివి. గంగాధరుని కృతి రాధవంటిది. మహాభారతంలో సుధాధారలవంటి పుణ్యకథలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలోని తపతీసంవరణుల వృత్తాంతం లలితమైన పుణ్యకథ. దానిని వివిధ శృంగార మహిమలతో విస్తరించి ఒక మహాకావ్యంగా నిర్మించుమని గంగాధర కవిని కోరాడు. తపతీ సంవరణుల శృంగార గాథకు, తనకు భాగీరథీకి మధ్య నడచిన ప్రేమగాథకు ఏదో కొంత సంబంధం ఉన్నందుకే ఈ విధంగా అడిగాడు. భారతంలో మూల కథను తీసుకుని శృంగార ప్రబంధంగా నిర్మించుమని అడిగాడు.

5.1 తపతీసంవరణోపాఖ్యానంపై పారిజాతాపహరణ ప్రబంధ ప్రభావం:

ఈ ‘‘తపతీ సంవరణోపాఖ్యానం’’ అనే రచనను నిశితంగా గమనిస్తే కొన్ని విషయాలు గమనంలోకి వస్తాయి. ఇబ్రహీం కుతుబ్‌షా విజయనగరంలో ఉండి, అక్కడి సాహిత్యానికి, కవితా వస్తువులకు అలవాటుపడి ఉంటాడు. అందుకే తన ఆస్థానంలో ఉన్న కవులను ఆ వస్తువులనే తీసుకుని రచనలు చేయమని ప్రోత్సహించమని అదేశించి ఉంటాడు. అందుకే ఈ యుగంలోనూ ప్రబంధాలు వచ్చాయి. అందులో అష్టాదశ వర్ణనలు కూడా వర్ణించబడ్డాయి.

‘పారిజాతపహరణం’ విరచించింది నంది తిమ్మన్న. శ్రీకృష్ణదేవరాయల భార్య తిరుమలదేవికి అరణంగా విజయనగరానికి వచ్చిన కవి. ఈ ‘పారిజాతాపహరణం’ ప్రబంధం రాయడానికి ఒక ఐతిహ్యం ఉంది. శ్రీకృష్ణదేవరాయల వారికి తిరుమలదేవి పాదం తాకుతుంది. దానితో రాయలవారు కోపంతో తిరుమలదేవితో మాట్లాడడం మానేస్తాడు. నందితిమ్మన ఈ గొడవను మరిచిపోవడానికి స్వయంగా శ్రీకృష్ణుడంతటివాడే తన్నించుకున్నారు మానవ మాత్రులం మనమెంత అని చెప్పడానికి ఈ ప్రబంధం రాశాడు. ఆ కావ్యాన్ని రాయల వారికే అంకితం ఇచ్చి వారిరువురు కలవడానికి కారణమయ్యాడు. ఈ ప్రబంధంలో కృష్ణుడు నాయకుడు, సత్యభామ నాయిక. పారిజాతమనే పువ్వు కోసం సత్యభామ అలిగినట్లు, సత్యభామ కోసం స్వర్గంనుంచి పారిజాత వృక్షాన్నే తెచ్చినట్లు ఈ ప్రబంధం చెబుతుంది.

ఈ కోవలోనే ‘తపతీసంవరణోపాఖ్యానం’ రచించబడింది. ఈ కావ్యంలో ప్రబంధ లక్షణాలు ఉన్నాయి. ఈ ప్రబంధంలో నాయకుడు సంవరణుడు, నాయిక తపతి. ఈమె సూర్యుని కూతురు. తపతిని పొందడానికి సంవరణుడు చేసిన ప్రయత్నం, తపస్సు కనిపిస్తుంది. ఈ ప్రబంధంలో ఇబ్రహీం కుతుబ్‌షా, భాగీరథీల ప్రేమకు గుర్తుగా ఈ కావ్యం రచించినట్లు తెలుస్తుంది. ఈ ప్రబంధాన్ని ఇబ్రహీం కుతుబ్‌షా అంకితం పుచ్చుకున్నాడు. తెలుగు కావ్యానికి అంకితం తీసుకున్న రాజులలో మొదటివాడు కుతుబ్‌షాహీలే.

ప్రథమాశ్వాసాంతంలో ఒక కళావతి ఇభరాముడికి ప్రియురాలైనట్లు సూచించాడు. ఆమెనే భాగీరథియై ఉండవచ్చు. ఇబ్రహీం కుతుబ్‌షా భాగీరథి అనే హిందూ యువతిని పెండ్లాడి గోలకొండకు ఆమె పేరు పెట్టినాడని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. గులామ్‌ హుస్సేన్‌ఖాన్‌ జోహర్‌ అనే చరిత్రకారుడు రచించిన ‘‘మహ్ నామా’’ అనే ఫారసీ గ్రంథంలో ఇబ్రహీం భార్య భాగీరథి అని, ఆమెకు జన్మించినవాడు మహ్మమద్‌ కులీకుతుబ్‌షా అని రాయబడిందిని డా॥ బిరుదురాజుగారు రాశారు (కుతుబ్షాహీ సుల్తానులు - ఆంధ్ర సంస్కృతి. పుట 75).

పారిజాతాపహరణంలో అలకమాన్పడానికి, కోపం తగ్గించడానికి పారిజాత పూవ్వుకోసం వెళ్ళి పారిజాత చెట్టునే కృష్ణుడు, సత్యభామ పెకలించి రావడం, సంవరణుడు తపతి ప్రేమను పొందడానికి సూర్యుని కోసం దీక్షతో, నిష్ఠతో, తపస్సు చేసి దేవలోకంలో ఉన్న తపతి ప్రేమను పొందడం కనిపిస్తుంది. హిందు వనిత అయినా భాగీరథి ప్రేమను పొందడానికి ఇబ్రహీం కులీకుతుబ్‌షా ఎంతటి కష్టాన్ని ఎదుర్కొన్నాడో ఈ ప్రబంధం ద్వారా తెలుసుకోవచ్చు.

5.2 తపతీసంవరణోపాఖ్యానంపై వసుచరిత్ర ప్రభావం:

ప్రబంధయుగంలో ‘సంగీతసాహిత్యకళానిధి’ అని పిలవబడినవారు రామరాజభూషనుడు. ఇతని రచనలు ‘వసుచరిత్ర’, ‘హరిశ్చంద్రనలోపాఖ్యానం’, ‘కావ్యాలంకారసంగ్రహం’. వసుచరిత్ర ప్రబంధంలో శ్లేషను మధురంగా ఉపయోగించాడు. ఈ వసుచరిత్ర మహాభారతంలోని ఉపరిచర వసువు కథ. ఈ వసుచరిత్రను అనుకరణగా అనేక పిల్లవసుచరిత్రలు వెలువడ్డాయి. ఇందులో నాయకుడు వసురాజు, నాయిక గిరిక.

కోలాహలుడు అనే పర్వతం, శుక్తిమతి అనే నది ప్రేమలో పడతారు. వీరికి పుట్టిన కూతురు గిరిక. వసురాజు వేటకు వస్తాడు. అడవిలో గిరికను చూసి మనసుపడి గాంధర్వ వివాహం చేసుకుంటాడు ఇది కథ.

ఇదే మాదిరి తపతీసంవరణోపాఖ్యానంలో కూడా సంవరణుడు వేటకు వెళ్తాడు. అక్కడ తపతిని చూసి తనను తాను మరచిపోతాడు.

తే.గీ. తళుకు జూపుల జిఱునవ్వు దొలకరింప
దొలుకరి మెఱుంగుదీగల దొలచు నిట్టి
వనితను వరించినంగదా తనకు నపుడు
సంవరణనామధేయంబు సఫలమగుట  (తపతీ, 4-57)

తళుకు చూపులతో చిరునవ్వు విసిరినది. ఈ మెరుపులను విసిరిన వనితను పొందకుంటే తన పేరుకు అర్థం లేదని అనుకున్నాడు. తపతిని చూసి మనసులో గట్టిగా కోరుకున్నాడు. ఇలాంటి వనితను పొందితే కదా తన పేరు సార్థకమని తలచాడు. ఇంతకు ముందు చిలుక వర్ణించిన తపతి అందచందాలు అతని మనసులో గట్టిగా నాటుకున్నాయి. కనులమందు ఉన్న వనిత అతన్ని అతిగా ఆకర్షిస్తుంది. మనసులో ఉన్న తపతిని ఈ వనితను చూసి పోల్చుకున్నాడు. చిలుక వర్ణించిన వనిత ఈమెనే అయితే బాగుంటుంది కదా అనుకున్నాడు. అంతలోనే తన మనసు ఉవ్విళ్ళూరింది-

సీ. కనుసన్నగావించి కలికి రమ్మందునో
రాకున్న సిగ్గుచే రట్టుగాదె?
నెలత దగ్గరనేగి నిలిచి వీక్షింతునో
వడి నదృశ్యంబైన వగపుగాదె?
యతివ నీపేరెవ్వరని విమర్శింతునో
మరుమాటయీకున్న బరుసగాదె?
పడతికి నా విన్నపము చెప్పి చూతునో
వినకున్న గార్యంబు వెగటుగాదె? (తపతీ,4-64)

ఆమెను చూసి చూడగానే తన మనసులో ఏవేవో ఆలోచనలు మొలిచాయి. కనుసైగతో తన దగ్గరికి రమ్మని చెబితే సిగ్గుపడి రాకుంటే ఏలా? ఆమె దగ్గరికి వెళ్ళి చూస్తే తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోతే ఎలా? కాబట్టి దూరం నుంచి చూచిన ఎక్కువగా చూడవచ్చు. ఆమె పేరేమని అడిగితే మాట్లాడకుంటే ఎలా? కాబట్టి మాట్లాడకుండా చూపులతో మాట్లాడుతాను. మనసులోని మాట చెప్పి చూస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ వినకుంటే మొదటికే మోసం వస్తుంది కదా అని తనకుతానే ఒకసారి ప్రశ్న, జవాబుగా ఎదురుకాసాగాడు. భరతుడు చెప్పినట్టు ‘‘విభావానుభావ వ్యభిచారీ సంయోగాద్రస నిష్పత్తిః’’ విభావాలు, అనుభవాలు, వ్యభిచారీ భావాల సంయోగం వల్ల ఉద్భవించేదే రసం. సాత్విక భావాలు కూడా ఉద్భవించాయి. ఇవన్నీ సంవరణుడి మనసులో ఒక్కొక్కటిగా జన్మించాయి.

నేటికాలంలో కూడా యువ ప్రేమికులకు ఈ విధమైన మదనావస్థలు ఉంటాయి. విరహవేదనకు గురికావడం. నేటి సమాజానికి కూడా ఈ ప్రబంధాన్ని అన్వయించి చూడవచ్చు.

వసుచరిత్రలో వసురాజు వేటకు వెళ్ళి గిరికను చూసి మనసు పడినట్లు సంవరణుడు కూడా వేటకు వెళ్ళి తపతిపై మనసు పడ్డాడు. గిరిక తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్పినట్టే తపతి తండ్రి చాటు పిల్లని తన తండ్రిని ఒప్పిస్తే వివాహం చేసుకుంటానని చెబుతుంది. గిరికను చెలికత్తెలు ఆటపట్టిస్తారు. విరహవేదన తగ్గించడానికి ఎన్నో ఉపచర్యలు చేస్తారు. తపతికి సైతం చెలికత్తెలు ఉపచర్యలు చేస్తారు.

ఇది భట్టుమూర్తి వసుచరిత్రంలో అనుసరణం. అందువలన అద్దంకి గంగాధరకవి తపతీసంవరణోపాఖ్యానం పిల్లవసుచరిత్ర అని వ్యవహారంలో ఏర్పడింది.

5.3 తపతీసంవరణోపాఖ్యానంపై నలోపాఖ్యాన ప్రభావం:

రామరాజభూషనుడు రచించిన రెండవ కావ్యం ‘‘హరిచంద్రనలోపాఖ్యానం’’. ఇందులో సత్యహరిచంద్ర, నలదమయంతి కథలు ఉంటాయి. నలదమయంతి కథ వరకు చూసినట్లయితే ఇందులో హంస రాయబారం ఉంటుంది. ఈ హంస నలుని రూపురేఖలను దమయంతికి చెప్పడం. దమయంతి అందచందాలను నలునికి వినిపించడం చేస్తుంది. చివరికి నలదమయంతులను కలుపుతుంది.

దీని మాదిరిగానే ఈ ‘తపతీసంవరణోపాఖ్యానం’లో చిలుక రాయబారం ఉంటుంది. ఇది తపతి, సంవరణులను కలుపుతుంది. ఈ చిలుక తపతికి సరైన వరుడిని వెదకడానికి దివి నుంచి భువికి వస్తుంది. సంవరణుడిని చూసి తపతికి తగినవాడని అనుకుంటుంది. సంవరణుడి భుజంపై వాలుతుంది. తపతి గుణగణాలను ఒక్కొక్కటిగా చెబుతుంది. తపతిపై మనసు లగ్నం అయ్యేట్టు చేస్తుంది. ఈ చిలుక పలుకులు విని సంవరణుడికి ఇంకా వినాలనే ఆశ కలుగుతుంది.

కం. చిలుకల పలుకులు రసములు
      చిలుకును భువి నెట్టివారి చెవులకు జవులై
      చిలుకల కొలికి ప్రసంగము
      చిలుక ప్రశంసించెనేని జెప్పగనేలా (తపతీ.2-51)

రాజు గంభీరుడు, మనస్సెంత చలించిన వెంటనే బయటపడలేదు. చిలుక తపతి సౌందర్యాన్ని ఒక్కొక్కటి చెబుతూ రాజు హృదయంపై చిన్నగా ముద్రవేస్తుంది. ఆ చిలుక మాటలు వింటూ ఉంటే చెవులకు ఇంకా వినాలనే కోరికను కలిగిస్తుంది. చెప్పిన అందగత్తెను, సౌందర్యవతిని పొందాలనే ఆశ పెరిగింది. పంచ వర్ణాలున్న ఆ చిలుకను చూసి, అమృత మధురాక్షరములైన పలుకులు విని రాజు దానిని చాలా ప్రశంసించాడు.

కం. వినుకలి కనుకలి లోపల
       వినుకలియే మిగుల మదనవేదన జేయున్‌
      వినుకలి వలపుల గాదా
      ననువుగ మఱి మరులుకొనిరి నలదమయంతుల్‌ (తపతీ,3-41)

ఈ కల్పన వల్ల తపతిసంవరణుల ప్రణయానికి దారితీసింది. ఒకరి సౌందర్యాది గుణాన్ని ఒకరికి వర్ణించి చెప్పి చిలుక తపతీ సంవరణులకు పరస్పరం వలపు పుట్టించింది. ఆ వర్ణన వల్ల అడవిలో కలిసి ఒకరికొకరు గుర్తుపట్టగలిగారు.

వినుకలి ప్రేమను వివాహమాడిన ప్రబంధ కథ అయింది. అందుకు చిలుక రాయబారం గంగాధరకవి స్వతంత్రకల్పనం. ఇది నలోపాఖ్యానంలోని హంస రాయబారానికి అనుకరణం. కనుకలిప్రేమ కంటె, వినుకలి ప్రేమ విశిష్టమని కవి అభిప్రాయం.

ఇది నలోపాఖ్యానప్రభావమునకు ప్రబలనిదర్శనం. ప్రబంధవిస్తృతి వర్ణనా మూలం.

కం. వచ్చిన పచ్చని పులుగున్‌
      మచ్చిక మీఱంగ జూచి మణిబంధముపై
      నచ్చుగ నిడి ముద్దాడుచు
      నచ్చంచలనేత్ర పలికె నాదరమొప్పన్‌ (తపతీ, 3-21)

ఆ తపతి భూమిపై వెళ్ళి వచ్చిన చిలుకను ప్రేమగా మణికట్టుపై తీసుకుని ముద్దాడింది. అక్కడి విషయాలను తెలుసుకుంది. చిలుక ఆ భూమిపై గల విషయాలను, సంవరణుడి గుణగణాల గురించి తెలుపుతుంది.

అప్పుడు తపతిసంవరణుడి గురించి విని,

తే.గీ. అతని రూపంబు గనుగొన్న యబ్జముఖులు
కడక నీతని వరియించు కన్య ధన్య
యనుచు దమలోనవరియింప నవ్విభునకు
సంవరణ నామధేయంబు సఫలమయ్యె  (తపతీ, 3-27)

చిలుక వల్ల విన్న రూపురేఖలను అడవిలో కనిపించిన సంవరణుడిలో చూసుకుంది. అతన్ని రూపాన్ని చూడగానే మనసులో ప్రేమించిన సంవరణుడే అయితే వరించి జీవితం ధన్యం చేసుకోవాలని అనుకుంది.

6. ముగింపు:

ఈ విధంగా కుతుబ్‌షాహీల యుగాన్ని నిశితంగా పరిశీలించినట్లయితే ప్రబంధయుగ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రబంధాలలో తీసుకున్న అష్టాదశ వర్ణనలు కనిపిస్తున్నాయి. అద్దంకి గంగాధర కవి ఈ పూర్వ రచనలు చదివి తనలో కలిగిన భావాన్ని, ఇబ్రహీం కుతుబ్‌షా కోరిన విధంగా భారతంలోని చిన్న కథను తీసుకుని రాశాడు. ఈ రచనపై అనేక రచనల ప్రభావం కనబడుతుంది. అందుకే దీనిని “పిల్ల వసుచరిత్ర” అని పిలిచారు.

ఇందులో పారిజాతాపహరణంలో తీసుకున్న అంశాన్ని తీసుకుని, ఇబ్రహీం, భాగీరథిని కలిపినట్టు కనిపిస్తుంది. వసుచరిత్రలోని అంశం తీసుకుని తొలి చూపులో ప్రేమ పుట్టిన విధానం. గుణగణాలను పోల్చుకోవడం కనిపిస్తుంది. హరిచంద్రనలోపాఖ్యానంలో ఇద్దరినీ కలపడానికి సహాయ పడిన హంసలా ఇక్కడ చిలుక కూడా ప్రధాన పాత్ర పోషించింది.

తెలుగు సాహిత్యం అన్ని వస్తువులలో ఇమిడిపోతుంది. ఏ కవిత వస్తువును చూసిన ఆయా కాలాలతో పాటు భూత, భవిష్యత్తును కూడా చూడవచ్చు.

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అనంతకుమారశర్మ, మేడవరపు. (1989), దోమకొండ సంస్థాన కవులు-వారి రచనలు, హితసాహితి, కామారెడ్డి.
  2. ఆరుద్ర, (1990), సమగ్రాంధ్ర సాహిత్యం (సంపుటి 6), ప్రజాశక్తి బుక్‌ హౌస్‌, విజయవాడ. 
  3. ప్రభాకరశాస్త్రి, వేటూరి. (2013), చాటుపద్యమణిమంజరి, శ్రీ వేటూరి ప్రభాకంశాస్త్రి
  4. వాఙ్మయ పీఠం, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
  5. లక్ష్మీకాంతం, పింగళి. (1974), ఆంధ్ర సాహిత్య చరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌.
  6. లలిత, జి. (1983), ప్రసంగా వ్యాసాలు, ఆంధ్ర సారస్వత పరిషత్‌, హైదరాబాద్‌.
  7. వీరేశలింగం, కందుకూరి. (1917), ఆంధ్ర కవుల చరిత్రము, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌. 
  8. శాస్త్రి, బి.ఎన్‌. (1989), గోలకొండ చరిత్ర - సంస్కృతి శాసనములు, మూసీ పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌.
  9. శ్రీరామమూర్తి, కొర్లపాటి. (1994), తెలుగు సాహిత్య చరిత్ర, రమణశ్రీ ప్రచురణ, విశాఖపట్టణము.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]