AUCHITHYAM | Volume-5 | Issue-6 | May 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
5. శ్రీ త్యాగరాజ లిఖిత ‘నిందా స్తుతి’ కృతులు : నాట్య శైలిలో భావ-తత్వ విశ్లేషణ
నాగలాపురం హరిప్రియ
నృత్య అధ్యాపకురాలు, సంగీత నృత్య లలిత కళల విభాగము,
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8309082432, Email: honeyharipriya5@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
దాక్షిణాత్య సంగీతాన్ని మనం కర్ణాటక సంగీతం అనే పేరుతో వ్యవహరిస్తాం. ఈ సంగీతానికి ఆ పేరు కేవలం ప్రాంత మూలంగా వచ్చిoది కాదు. కర్ణాటక సంగీతాన్ని ‘కర్ణే అటతిః ఇతి కర్ణాటః’ అంటాము. అంటే మన చెవిలో అందంగా ఆహ్లాదకరంగా ఆడేది అని అర్థం. కనుక భారతీయ సంగీతమే ‘కర్ణాటము’ అని మనం గ్రహించాలి. అటువంటి సంగీతానికి కొత్త వన్నె తెచ్చినవారు కాకర్ల త్యాగరాజ స్వామి వారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రపంచానికి పటిష్ఠమైన పునాది వేసినవారు పురందర దాసులవారు అయితే, దానిపై సుందరమైన నాద-సౌధ నిర్మాణం చేసిన వారు త్యాగరాజులు. వీరికి ముందు ఎందరో గొప్ప వాగ్గేయకారులు ఉన్నప్పటికీ, వీరి యొక్క సంగీత సాంప్రదాయ శైలి ప్రత్యేకంగా అనిపించడానికి కారణం రామునితో వీరికున్న భావ స్వేచ్చ, చనువులు. భక్తి తీవ్రతలో భగవంతున్ని దేవుడని మరిచిపోయి మరీ నిర్మొహమాటంగా సంభాషించిన తీరును మనం ఎన్నో సందర్భాల్లో వీరి కీర్తనలు, కృతుల్లో చూసాం. వాటినే ‘నిందా స్తుతి’ కృతులు అని అంటారు. అలాంటి కొన్ని త్యాగరాజులవారు రాసిన ‘నిందా స్తుతి’ కృతుల్లోని సాహిత్యార్థాన్ని, రామతత్వాన్ని, భావాన్ని అర్థం చేసుకోవడం మరియు భరతముని రాసిన నాట్యశాస్త్రంలోని ‘భావాధ్యాయము’ (7వ అధ్యాయం)లోని నాట్యాంశాల దృష్టికోణంలో విశ్లేషించడం ఈ పరిశోధనా వ్యాసం యొక్క ఉద్దేశం.
Keywords: నింద, స్తుతి, భక్తి, భావం, స్థాయీభావం, సంచారి భావం, సాత్విక భావం, కృతి, రతి.
1. ఉపోద్ఘాతం:
శాస్త్రీయ నృత్యప్రదర్శనా మార్గాల్లో త్యాగరాజ స్వామి కృతి లేని ప్రదర్శన ఉండదు అనడంలో ఆశ్చర్యంలేదు. సాగరతరంగాలను పున్నమి చంద్రుడు ఉవ్వెత్తున పొంగించినట్టు, కర్ణాటక సంగీతమనే రస సాగరంలో తరంగాలను ఉవ్వెత్తున పొంగించిన చంద్రుడు త్యాగరాజ స్వామి. వీరు రాసిన కృతులు, కీర్తనలలో రామ భక్తి భావన విశేషమైంది. భగవద్గీతలో భక్తి గురించి ఎంతో ప్రస్తావన వుంది. అందులో శ్రీకృష్ణుడు-
‘మచ్చిత మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కతయంతశ్చ మామ్నిత్యం తుష్యంతి చ రమంతి చ’ (భ.గీ.10 అ.9 శ్లో) అని బోధించాడు.
అంటే ఎవరైతే నన్ను (పరమాత్ముడిని) మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో నిత్యం ప్రార్ధిస్తారో వారికి అత్యంత ఆనందాన్ని ఇచ్చే బ్రహ్మ జ్ఞానం తప్పక లభిస్తుంది అని. ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందినవారు కనుకే త్యాగారాజులకు ‘త్యాగబ్రహ్మం’ అని పేరు కలిగింది ఏమో!
2. నిందాస్తుతి - అలంకారవైశిష్ట్యం:
‘నిందా స్తుతి’ అంటే భగవంతున్ని విమర్శిస్తూ, నిందిస్తూ చేసే స్తుతి (పొగడ్త/ ప్రార్థన) అని అర్థం. ముఖవిలువలో స్తుతిస్తున్నట్టు ఉన్నా భావములో మాత్రం వ్యంగ్యంగా గుచ్చుతున్నట్టు, దెప్పుతున్నట్టు ఉంటుంది. నింద మరియు స్తుతి అనేవి ఒకదానితో మరొకటి విముఖమైన పదాలు. ఈ కోవకు చెందిన స్తుతుల్లోని అలంకారాలు (phrases of words) ఎంతో చమత్కారంగా కూడా అనిపిస్తాయి. ఒకే వాక్యానికి ఎన్నో అర్థాలను, భావాలను ఒకదానిపై ఒకటి పూత పూసినట్టు అందంగా ఉంటాయి. ఒక భావానికీ మరొక భావానికి మధ్య పూర్తి వ్యతిరేకమైన అర్థాలు కూడా ఉంటాయి. ఈ నిందా స్తుతిని గురించి మొదట ప్రస్తావన ‘విష్ణు ధర్మోత్తర పురాణం’- మూడవ ఖండంలోని 14వ అధ్యాయంలో ఇలా ఉంది:
‘స్తుతి రూపేణ యా నిందాః
నిందా స్తుతిరిహోచ్చ్యతే
నిందా స్తుతిస్థతైవోక్తా
నిందారూపేణ యా స్తుతిః’ (వి.ధ.పు.14అ. శ్లో 13-14. పుట 32)
అంటే నింద రూపంలో స్తుతి ఉంటుంది, అలాగే స్తుతి రూపంలో కూడా నింద ఉంటుంది అని అర్థం. వీటిలోని సౌందర్యాన్ని తెలుసుకోవాలి అంటే కావ్యాలంకార శాస్త్రాలను కూడా తెలుసుకోవడం చాలా అవసరం.
సంస్కృత భాషా లాక్షణీకులు ‘వ్యాజస్తుతి’ నుంచి ఈ నిందా స్తుతి పుట్టింది అని అంటారు. ‘చిరంజీవ భట్టాచార్యుడు’ తాను రాసిన ‘కావ్య విలాసం’లో ‘స్తుతి’ రెండు విధాలుగా వుంటాయి అని వివరించాడు. అవి:
2.1 స్తుతి నింద:
ముఖవిలువలోని అలంకారాల యొక్క ఉద్దేశం స్తుతించడమే అయినప్పటికీ, నిగూఢార్థం అంతా నిందించడమే ఉంటుంది.
2.2 నిందా స్తుతి:
ముఖవిలువలోని అలంకారాల యొక్క ఉద్దేశం నిందించడమే అయినప్పటికీ, నిగూఢార్థం అంతా స్తుతించడమే ఉంటుంది.
కావ్యాలంకారాల్లోని గమ్మత్తులన్నీ త్యాగరాజుల వారు చేసే నిందా స్తుతి కృతుల్లో స్వరరూపాన్ని దాల్చినట్టు స్పష్టంగా కనిపిస్తాయి.
3. శ్రీ త్యాగరాజు పరిచయం:
తమిళనాడులోని తంజావూరు జిల్లాకు చెందిన తిరువారూరు గ్రామంలో త్యాగరాజు గారి జననం జరిగింది. 1767 వ సంవత్సరంలో కాకర్ల రామబ్రహ్మం, సీతమ్మ దంపతులకు వీరు మూడవ సంతానంగా జన్మించారు. తమిళనాడులో పుట్టి పెరిగినా, వీరి రచనలు ఎక్కువ తెలుగు, సంస్కృతంలోనే ఉన్నాయి. వీరి వంశ మూలాలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా, కాకర్ల గ్రామంలో ఉంది. పసి తనం నుంచే తన తల్లి పాడే లాలి పాటల నుండే వీరి మనసులో సంగీత భీజం నాటుకుంది. తన తండ్రి నుండి వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తుల్లోని తత్వసారాన్ని తెలుసుకున్నారు. శొంఠి వెంకటరమణయ్య గారి వద్ద కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు. తన మామ గారైన వీణ కాలహస్తయ్య నుండి వీణా వాద్యాన్ని చిన్నతనం నుంచే నేర్చుకున్నారు.
త్యాగరాజు నాదోపాసకులు. ‘నాదం’ అంటే ‘శబ్దం’ అని అర్థం. ఆ శబ్దానికి మూలo ‘ఓం’కార ప్రణవం. ఆ ప్రణవ ‘నాదo’ నుంచే సంగీతానికి మూలమైన ‘శృతి’ పుట్టింది. ‘శృతి’ నుంచే ‘స్వరం’ పుట్టింది. ఆ ‘స్వరం’ నుంచే ‘రాగ తాళాలు’ పుట్టాయని సంగీత ప్రియులకు తెలిసిన విషయమే. భారతీయ సంస్కృతిలో ఓంకార నాదం ఎంతో విశిష్టమైనది మరియు పవిత్రమైనది.
- యోగ సూత్రంలో పతంజలి ‘తస్య వాచకః ప్రణవః’ అంటాడు. ఈశ్వరుణ్ణి సూచించే శబ్దమే ప్రణవం అని దీని అర్థం.
- తైత్తిరీయోపనిషత్తులో ‘ఓం ఇతి బ్రహ్మః, ఓం ఇతి ఇదం సర్వం’ అని ఉంది. ఓంకార నాదమే దివ్యమైనది, ఓంకార నాదమే సర్వత్రా వ్యాప్తించి ఉన్నది అని అర్థం.
- మాండూక్య ఉపనిషత్తులో నాదాన్ని గురించి ఇలా ఉంది:
‘ఓం ఇతి ఏతత్ అక్షరం- ఇదం సర్వం తస్యోపవ్యాఖ్యానాం |
భూతం భవత్- భవిష్యదితి సర్వం ఓంకార ఏవః |
యథా అన్యత్- త్రికాల-అతీతం తదాభ్యో ఓంకార ఏవ |’ (మ.ఉ. పుట 10)
నాదం శాశ్వతమైనది మరియు నాశనం కానిది. విశ్వమంతా నాదమే ఉన్నది. భూత- వర్తమాన- భవిష్యత్తులనే త్రికాలాల నిండా నాదమే వ్యాప్తించింది అని అర్థం.
- గీతోపదేశంలోని 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ‘అహం ప్రణవః సర్వ వేదేషు’ (భ.గీ.7అ. శ్లో8. పుట:191) అంటాడు. అంటే అన్ని వేదాలలో ఉన్న ప్రణవాన్ని నేనే! నాదాన్ని నేనే! అని అర్థం.నాదానికి ఉన్న మహోన్నతమైన దైవిక శక్తి సామర్థ్యాలను క్షుణ్ణంగా గ్రహించిన వారు కనుకే, త్యాగరాజ స్వామి ఆ ప్రణవ నాదాన్నే భక్తిగా ఉపాసన చేసారు. ఆ భక్తి భావాన్నే సంగీత మాధ్యమంగా మనకు అందించారు.
- త్యాగరాజు గొప్ప వైణికులు కుడా. అందుకే వీరి రచనల్లో ఎన్నో సందర్భాలలో వీణ ప్రస్తావన కనిపిస్తుంది. వీణా నాదంలోని మర్మాలు తెలిసిన వారు కనుకనే-
‘వీణావాదన తత్వజ్ఞః శృతి జాతి విశారదః
తాలజ్ఞా అప్రయాసేనా మోక్షమార్గం నిగచ్చ్యతి’ అని యాజ్ఞవల్క్యుడు చెప్పిన మాటను వీరు నిజం చేసారు.
అంటే వీణావాదన తత్త్వం తెల్సినవాడు నాదయోగాన్ని సులభంగా సాధించి మోక్షమార్గాన్ని పొందుతాడు అని అర్థం. ఇలా వీరు నాదోపాసనకు, వీణా నాదముకు మధ్య గల సంభందాన్ని ఎంతో భావయుక్తంగా తమ కృతులలో రసికులకు స్పష్టంగా తెలియజేశారు. వీరి కృతులలోని సాహిత్యంలో ఎంతో లోక జ్ఞానం నిక్షిప్తమై ఉంటుంది. మనిషి జీవితంలో ప్రతీ వస్తువు అశాశ్వతమే, ఒక్క రామనామం (భగవంతుడు) తప్ప! అనే జీవిత సత్యాన్ని సామాన్య జనులకు అర్థమయ్యే రీతిలో సరళమైన విధంగా వీరు కీర్తనలు రాసారు. వీరు రామున్ని మనసులో భావించిన తీరు అద్భుతo.
- భక్తి స్వచ్ఛమైనది అయితే భగవద్దర్శనం తప్పక జరుగుతుంది అని ఎందరో వాగ్గేయకారుల జీవిత విశేషాలలో మనం చూసాం. మరి తనకు మాత్రం ఎందుకని భగవంతుడైన శ్రీ రామచంద్రుడు దర్శనభాగ్యం ఇవ్వడంలేదు!? అనే భావ ధోరణిలో త్యాగరాజు ఎన్నో నిందా స్తుతి కృతుల్ని రాసారు. అందులో కొన్ని ఈ వ్యాసంలో చూద్దాం.
4. నాట్యశాస్త్రములోని ‘భావా’ధ్యాయము :
భరతముని చెప్పిన రస సూత్రం ప్రకారం రసం లేనిదే భావము లేదు మరియు భావము లేనిదే రసం పుట్టదు. నాట్యశాస్త్రంలో మొత్తం 49 భావాలను చెప్పినాడు. అసలు భావం అంటే ఏమనగా మానవుని మానసిక స్థితిగతులను, మనసులో కలిగే ఉద్వేగాలను వ్యాప్తి చేయగలిగినది అని అర్థం. భావం అంటే వ్యవహార భాషలో మనకు తోచే ఆలోచనలు, వాటి అర్థాలు మరియు అవి పుట్టడానికి అవసరమైన కారకాలు అని అనుకోవచ్చు. ‘భావము’లోని ‘భూ‘ అనే ధాతువుకు ‘కరణం’ (అంటే చేయటం) అని అర్థం. శాస్త్రoలో భావము అనే పదానికి కృతము, వాసితము, భావితము అని సమానార్థాలున్నాయి. నాట్యశాస్త్రంలో భరతముని ‘భావములు’ గురించి 7వ అధ్యాయం (‘భావాధ్యాయము’)లో ఈ విధంగా నిర్వచించాడు.
"వాచిక- ఆంగిక- సాత్వికాభినయోపేతములైన కావ్యార్థములను (అనగా రసములను) భావింపజేయునవికాన ఇవి భావములనబడినవి” (నా.శా. 7అ. పుట 232). అంటే వాచికము, ఆంగికము, మరియు సాత్వికాభినాయల ద్వారా సభికుల హృదయాలలో కదలికలను భావింప చేసేది కనుకే ఇవి భావములైనాయి అని భరతుడు క్లుప్తంగా చెప్పాడు. ఈ నిర్వచనంలో భరతుడు ఆహార్యాభినయాన్ని పరిగణించలేదు అని గుర్తించాలి.
“భావమనగా రసానుకూలమగు చిత్తవృత్తి విశేషము” అని భానుదత్తుడు ‘రసతరంగిణి’ లో పేర్కొన్నాడు. అభినవగుప్తుడు ‘అభినవభారతి’లో త్రివిధాభినయాలకు ‘ముఖరాగమును’ కూడా జోడించినాడు (అ.భా. 1సం. పుట 346) భరతుడు చెప్పినట్టు వాచిక- ఆంగిక- సాత్వికాభినయాలు బాగా చేసి కూడా ముఖములో అర్థములు తగిన రీతిలో పలుకకపోతే భావము పండదు అని అభినవభారతిలో అభిప్రాయపడినాడు.
భావానికి స్వరూపము ‘విభావ- అనుభావాల’ వల్ల కలుగుతుంది. ఇవి మానవుని చుట్టూ వుండే లోకస్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఏదైనా ఒక భావము మనసులో పుట్టడానికి హేతువైన కారకాన్ని ‘విభావము’ అంటాo. ఒక పాత్ర ఆ కారకాన్ని మనసులో అనుభవించేలా సాధ్యపడితే దాన్ని ‘అనుభావము’ అంటాం. భరతముని నాట్యశాస్త్రంలో మూడు విధాలైన భావాల గురించి చెప్పినాడు.
i) స్థ్యాయీ భావాలు (8) ii) సాత్విక భావాలు (8) iii) సంచారి/ వ్యభిచారీ భావాలు (33).
స్థాయీ భావాలు (8) :
ఏ భావములైతే మనసులో స్థిరంగా శాశ్వతంగా ఉంటాయో అవే స్థాయీ భావాలు. అవి: రతి, హాసం, శోకం, క్రోధం, ఉత్సాహం, భయం, జుగుప్స, విస్మయం.
సాత్విక భావాలు (8) :
సమాహితమైన (ఏ ఆలోచన లేని సమాధి స్తితిలో ఉన్న) మనస్సు నుంచి పుట్టే భావాలే సాత్విక భావాలు. అవి: స్వేదము, స్తంభము, రోమాంచం, స్వర భేదం, వేపధువు, వైవర్ణ్యం, అశ్రువు, ప్రళయం.
సంచారి/ వ్యభిచారీ భావాలు (33) :
ఇవి రసాన్ని పండించుటకు సహకరించే భావాలు. వి+ అభి+ చరీ = వ్యభిరాచారీ. అంటే విభావాల వలన పుట్టిన భావాలను రసికులకు అభిముఖముగా చరించేది (తీసుకెళ్ళేది) అని అర్థం. అవి : నిర్వేదము, గ్లాని, శంక, అసూయ, మదం, శ్రమం, ఆలస్యం, దైన్యం, చింత, మొహం, స్మృతి, ధృతి, వ్రీడ, చపలత, హర్షము, ఆవేగం, జడత, గర్వము, విషాదం, ఔత్సుకం, నిద్ర, అపస్మారం, సుప్తం, విబోధం (నిద్రాభంగం, ఆవులింతలుతో ఉన్న ముఖం), అమర్షం (అందరిలో అవమానం), అవహిత్థం (అపజయము, కుటిలత్వం), ఉగ్రత, మతి, వ్యాధి, ఉన్మాదం, మరణం. త్రాసము (భయంకర శబ్దాలు, మేఘాలలో విద్యుత్తు వంటివి వల్ల జనించే భావం), వితర్కం (సందేహము, విమర్శ లాంటివి).
ఈ భావాలు త్యాగరాజుల వారి ‘నిందా స్తుతి’ కృతులలో ఎలా వున్నాయో తత్వపూరితంగా అధ్యయనం చెయ్యడం నర్తకీ- నర్తకులకు ఎంతైనా ఉపయోగకరం మరియు అవసరం.
5. త్యాగరాజ ‘నిందా స్తుతి’ కృతులు:
(i) అడిగి సుఖము:
రాగం : మధ్యమావతి – తాళం : రూపకం
పల్లవి :
అడిగి సుఖములెవ్వ రనుభవించిరిరా? ఆదిమూలమా! రామ! ॥అడిగి॥
అను పల్లవి :
సడలని పాప తిమిరకోటిసూర్య! సార్వభౌమ! సారసాక్ష! సద్గుణ! (ని) ॥న్నడిగి॥
చరణము 1 :
ఆశ్రయించి వరమడిగిన సీత యడవికి బోనాయె
ఆశరహరణ !రక్కసి యిష్టమడగనపుడె ముక్కువోయె ఓ రామ (ని) ॥న్నడిగి॥
చరణము 2 :
వాసిగ నారదమౌని వరమడుగ వనిత రూపుడాయె
ఆశించి దూర్వాసులన్నమడుగ అపుడె మందమాయె! ఓరామ (ని) ॥న్నడిగి॥
చరణము 3 :
సుతుని వేడుక జూడ దేవకియడుగ యశోద జూడనాయె
సతులెల్ల రతి భిక్షమడుగ వారివారి పతుల వీడనాయె! ఓరామ (ని) ॥న్నడిగి॥
చరణము 4 :
నీకే దయబుట్టి బ్రోతువో!! బ్రోవవో!! నీ గుట్టు బయలాయె
సాకేతధామా! శ్రీ త్యాగరాజనుత స్వామి! యేటి మాయ? ఓ రామ (ని) ॥న్నడిగి॥
మధ్యమావతి రాగం, రూపక తాళంలో ఉన్న ఈ నిందా స్తుతి కృతిలో త్యాగరాజ స్వామి శ్రీ రామున్ని వ్యంగ్యంగా ‘నిన్ను అడిగినంత మాత్రాన నువ్వు ఎవరికి ఏ సుఖాలను ఇచ్చావయ్యా!! రామా’ అని ప్రశ్నిస్తున్నారు. కోటి సూర్యులు కలిసినంత వాడివి కదా! సార్వభౌమునివి కదా!!! అయినా నువ్వెవరికోసం ఏమి చేసావులే!!! అనడంలో ‘వ్రీడ’ (చేసిన ప్రతిజ్ఞ నిలుపుకోలేకపోయినట్టు), ‘జడత’, ‘అపస్మారం’ వంటి సంచారి భావాలున్నాయి. ’! సారసాక్ష! సద్గుణ ఆదిమూలమా! రామా!!’ అనడంలో రాముని పై తనకున్న భక్తిలో ‘రతి’ స్థాయీ భావం కనిపిస్తుంది. మొదటి చరణంలో ‘ఆశ్రయించి వరమడిగిన సీత యడవికి బోనాయె’ అనడంలో వివాహమైన తర్వాత వరమడగమని నువ్వంటే సీత నిన్నేమి కోరిందయ్యా?! జీవితాంతము నీ ఆశ్రయము (తోడు) తప్ప? అటువంటి సీతకే నీవలన ఏమి దక్కిందని? అడవుల పాలవ్వడం తప్ప? ఇక నేనెంతలే! అనే అర్థములో మనోధర్మమును అభినయించేందుకు ఆస్కారముంది. ఇందులో ‘శోకము’ స్థాయీ భావం, ‘వైవర్ణ్యము’, ‘అశ్రువు’, ‘ప్రళయము’లు సాత్విక భావాలు మరియు ‘దైన్యము’, ‘చింత’, ‘విషాదం’ ‘అమర్ష’ వంటివి సంచారి భావాలు. తర్వాత ‘రక్కసి యిష్టమడిగినపుడె ముక్కువోయె'! ఓ రామ’ అనడంలో నిన్ను ఇష్టపడిన పాపానికి ఆ సూర్పణఖకు ఏoదక్కింది అయ్యా? పాపం ముక్కు పోయిందాయే!! అని అర్థము. ఇందులో త్యగారజ స్వామి చేసిన చమత్కారంలో ‘హాసము’ స్థాయీ భావంగా ఉంది. ‘ధృతి’, ‘హర్షము’, ‘ఔత్సుకం’ వంటివి సంచారి భావాలు. ‘వేపధువు’, ‘వైవర్ణ్యము’, ‘అశ్రువు’లు సాత్విక భావాలు.
రెండవ చరణంలో ‘వాసిగ నారదమౌని వరమడుగ వనిత రూపుడాయె’ అనడంలో నీ మాయాలో ఎందుకని ఇంతగా అందరూ నీకై పరతపిస్తున్నారో తెలుసుకోవాలని తపించి నారద మహర్షి నిన్ను వరమడిగితే నువ్వేమి చేసావు? అంత గొప్పవాడైన మునిని ఆడదానిగా మార్చేసావు!! నీ చుట్టూ తిరిగేలా ఆకర్షించావు!! అని అర్థము. ‘ఆశించి దూర్వాసులన్నమడుగ అపుడె మందమాయె!! ఓ రామా!’ అనడంలో మహాభారతంలో దూర్వాస మహర్షి పాండవులను కలిసినపుడు ద్రౌపదిని అన్నమడిగితే, నువ్వు అతడికి ఆకలి తీర్చక పోగా ఆకలి నశించి పోయేలా చేసావు! యెంత గొప్ప వాడివయ్యా నీవు! భక్తులు నిన్ను అడిగిన సుఖములకు పూర్తి విరుద్ధమైన ఫలితాలని ఇచ్చావు!! నిన్నడిగి సుఖములెవ్వరు అనుభవించారయ్యా?? రామా! అని భావాన్ని ముఖరాగంలో పలికించాలి. ఈ రెండు సందర్భాలలో ‘విస్మయము’ స్థాయీ భావంగా ఉంది. ‘అవహిత్థం’, ‘ధృతి’, ‘స్మృతి’, ‘హర్షము’ వంటివి సంచారి భావాలు. ‘స్తంభము’, ‘స్వర భేదం’ వంటివి సాత్విక భావాలు.
మూడవ చరణంలో ‘సుతుని వేడుక జూడ దేవకియడుగ యశోద జూడనాయె’ అనడంలో ఓ రామా! నీ కన్న తల్లిగా తన కొడుకు ఆలనా పాలన, ముచ్చట్లు, చిలిపి చేష్టలు చూసి తరించాలని దేవకి నిన్ను అడిగితే నువ్వు ఆ సంతోషాలను యశోదకు వరమిచ్చావు!! అని త్యాగరాజ స్వామి సున్నితంగా రామున్ని నిందిస్తున్నాడు. ‘సతులెల్ల రతి భిక్షమడుగ వారి-వారి పతుల వీడనాయె! ఓ రామా!’ అని అనడంలో పాపం ఆ గోకుల కాంతలు నిన్ను భగవంతునిగా ప్రేమ భిక్ష పెట్టమని అడిగితే, నువ్వు వారికి ఆశించింది ఇవ్వకపోగా, వాళ్ళను నీ చుట్టూ తిరిగేల ఆకర్షించావు, వాళ్ళ భర్తలు వారిని వదిలేసేలా చేసావు! ఎంత లౌక్యముగా చేసిన మోసమో ఇది కదా! రామా? అని భావాన్ని గ్రహించాలి. ఈ రెండు సందర్భాలలో ‘రతి’ స్థాయీ భావంగా ఉంది. ‘అపస్మారo’,‘నిద్ర’, ‘చింత’, ‘స్మృతి’, ‘మోహం’ వంటివి సంచారి భావాలు. ‘అశ్రువు’, ‘రోమాంచం’ వంటివి సాత్విక భావాలు.
నాల్గవ చరణంలో ‘నీకే దయబుట్టి బ్రోతువో!! బ్రోవవో!!’ అనడంలో త్యాగరాజ స్వామి రామునితో ఇక నాకు ఓపిక చాలడం లేదయ్యా! అలిసిపోతున్నా! ఇక నీ ఇష్టం. నీకే నాపై దయ పుట్టి అనుగ్రహిస్తావో? లేక అనుగ్రహించవో? చూడాలి! అని దీనంగా విన్నవించుకుంటూనే ‘నీ గుట్టు బయలాయె’లే అని నిందిస్తున్నాడు. అంటే నువ్వెంత మాత్రం నాపై అనుగ్రహిస్తావో నాకు తెలీదా? ఇప్పటిదాకా నిన్ను అడిగి సుఖములు ఎవ్వరూ అనుభవించలేదని నాకు తెలీదా? నీ దయలేని మనసులోని గుట్టు ఇప్పుడు అందరిలో బయట పడిపోయిందిలే!! అని అంటాడు. ‘సాకేతధామా! శ్రీ త్యాగరాజనుత స్వామి! యేటి మాయ?’ అనడంలో అయ్యా! రామా, ఎందుకయ్యా? నాతో ఇంత మాయ చేస్తున్నావు? ఇంకెంత కాలం ఈ మాయ చేస్తావు? ఇది నీకు తగునా? నాకు నీ దర్శనమివ్వక విగ్రహంలా చూస్తుంటావా? అని ప్రశ్నాభావంతో అంటాడు. ఈ చరణంలో ‘శోకం’ స్థాయీ భావంగా ఉంది. ‘దైన్యం’, ‘శ్రమ’, ‘చింత’, ‘అమర్షం’, వంటివి సంచారి భావాలు. ‘అశ్రువు’, ‘ప్రళయం’ వంటివి సాత్విక భావాలు.
(ii) సాధించెనే !!!
రాగం: ఆరభి తాళం : ఆది
పల్లవి:
సాధించెనే ఓ మనసా!
అను పల్లవి :
బోధించిన సన్మార్గ వచనముల
బొంకు జేసి తా బట్టిన పట్టు (సాధించెనే)
చరణము :
సమయానికి దగు మాటలాడెనే
స్వర సాహిత్యం 1 : దేవకి వసుదేవుల నేగించినటు (సమయానికి)
స్వర సాహిత్యం 2 : రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు (సమయానికి)
స్వర సాహిత్యం 3 : గోపీ జన మనోరథ మొసంగ లేకయే గేలియు జేసెడువాడు (సమయానికి)
స్వర సాహిత్యం 4 : వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసె పరమాత్ముడదియుగాక
యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి (సమయానికి)
స్వర సాహిత్యం 5 : పరమభక్తవత్సలుడు సుగుణ పారావారుం డాజన్మ మనఘుడీ కలి
బాధల దీర్చువాడనుచు నే హృదాంబుజమున జూచుచుండగ (సమయానికి)
స్వర సాహిత్యం 6 : హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేష శయన
పరనారీ సోద రాజవిరాజ తురగ
రాజ రాజనుత నిరామయాపఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తాబ్రోవకను (సమయానికి)
స్వర సాహిత్యం 7 : శ్రీవేంకటేశ స్వప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధర లస న్మకుట
కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు (సమయానికి)
స్వర సాహిత్యం 8 : సద్భక్తులనడత లిట్లనెనే! యమరికగా నాపూజ గొనెనే! యలుగ వద్దనెనే! విముఖులతో జేర బోకు మనెనే!
వెత గలిగిన తాళు కొమ్మనెనే దమశమాది సుఖదాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు చెంతరాకయే (సాధించెనే)!!!
ఆరభి రాగం, ఆది తాళంలో ఉన్న ఈ నిందా స్తుతిలో త్యాగరాజ స్వామి ఆ మహా విష్ణువులోని కృష్ణ తత్వాన్ని ప్రేమగా, చమత్కారంగా నిందిస్తున్నాడు. పల్లవిలో ‘సాధించెనే ఓ మనసా!’ అని తన మనసుకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు. అంటే ఆ విష్ణువు ఎంత మొండి వాడంటే, తాను అనుకున్నదే చేస్తాడు కానీ ఇంకేమి ఆలోచించాడు అని భావం. అను పల్లవిలో ‘బోధించిన సన్మార్గ వచనముల.... బొంకు జేసి, తా.... బట్టిన పట్టు (సాధించెనే!)’ అని అంటాడు. అంటే యుద్ధ భూమిలో అర్జునుడికి ఎంతో గొప్పగా గీతోపదేశం చేసి ఉత్తమమైన మాటలు మాట్లాడినవాడు. కానీ ఇప్పుడు తను చెప్పిన ఉపదేశాలను తనే మీరి, మరిచి ప్రవర్తిస్తూ పట్టిన పట్టు సాధిస్తున్నాడు!! అని అర్థం. ఇందులో ‘వ్రీడ’, ’ధృతి’, ‘స్మృతి’ వంటివి సంచారి భావాలు. చరణంలో ‘సమయానికి తగు మాటలాడెనే’ అంటాడు త్యాగరాజు. ఎప్పటికి అప్పుడు మాట మార్చేసేవాడు ఈ విష్ణువు అని అర్థం. ఎంత లౌక్యము తెలిసిన వాడివయ్యా నువ్వు! అని నిందాభావము. ఇక్కడ ‘హర్షం’ సంచారి భావం.
మొదటి రెండు స్వర సాహిత్యాలలో త్యాగరాజు ‘దేవకి వసుదేవుల నేగించినటు’, ‘సంగీత సాంప్రదాయకుడు’ అని అంటాడు. అంటే నీకు తల్లిదండ్రులైనందుకు ఆ దేవకీ వాసుదేవులనే ఎన్నో కష్టాలపాలు చేసినావు కదయ్యా! నువ్వు సమయానికి తగినట్టు మాటలాడుతావులే! పైగా సంగీత సాంప్రదాయకుడివి కూడా! అని చతురంగా నిందిస్తున్నాడు. ఇందులో ‘నిర్వేదము’, ‘మోహము’, ‘వ్రీడ’, ’అపస్మారము’ వంటివి సంచారి భావాలు. ‘విస్మయం’ స్థాయీ భావం. ‘అశ్రువు’, ‘రోమాంచం’ వంటివి సాత్విక భావాలు. మూడవ స్వర సాహిత్యంలో త్యాగరాజ స్వామి ‘గోపీ జన మనోరథ మొసంగ లేకయే గేలియు జేసెడువాడు’ అంటాడు. అంటే స్వామీ నువ్వు గోపికల మనసులను అర్థము చేసుకోకపోగా, అది సరిపోదన్నట్టు వారిని పైపెచ్చు వెక్కిరించావు కదా! అని అర్థం. ఇందులో స్థాయీభావం ‘హాసం’. ‘గర్వము’, ‘హర్షము’, ‘మోహము’లు సంచారి భావాలు.
నాల్గవ స్వరసాహిత్యంలో ఆ గోకుల స్త్రీలను ఎప్పుడూ నీ వైపే ఆకర్షితులు అయ్యేలా చేస్తావు. వారందరూ నిన్ను మొక్కేలా చేసుకుంటావు. కానీ వారిని మాత్రం అనుగ్రహించవు. నీ పై ప్రేమ పెట్టుకున్న వారిని అనుగ్రహించలేని పరమాత్ముడివయ్యా నువ్వు! అని వ్యంగ్యంగా విష్ణువుని త్యాగరాజు దెప్పుతున్నాడు. ఇందులో ‘రతి’ స్థాయీభావం. ‘దైన్యం’, ‘చింత’, ‘మొహం’ సంచారి భావాలు. పాపం ఆ యశోద నిన్ను తన కొడుకే అనుకొని నీ బుగ్గ పై ముద్దు పెడ్తుంటే, అన్నీ తెలిసి కూడా ఏమి తెలియనట్టు నవ్వుతున్నావా!! హరీ?! నువ్వెంత ఘనుడివో! సమయానికి తగినట్టు మారిపోయే వాడివయ్యా నువ్వు! అనే నిందాభావాన్ని గ్రహించాలి. ఈ సందర్భాలలో ‘విస్మయం’ స్థాయీభావం. ‘రోమాంచం’ సాత్విక భావం. ‘వ్రీడ’, ‘గర్వము’, ‘హర్షము’ సంచారి భావాలు.
ఐదవ స్వరసాహిత్యంలో నీకు భక్తులంటే చాలా ప్రేమ ఉందేమో అనుకున్నా కదయ్యా! ఈ కలి యుగంలోని బాధలన్నీ నువ్వు మాత్రమే తీర్చగలవని నమ్మి నీరాక కోసం నేను ఎదురు చూస్తుంటే... నువ్వు మాత్రం సమయానికి తగు మాటలాడి తప్పించికుంటున్నావు కదా? అని త్యాగరాజు అసహనాన్ని చూపుతున్నారు. ఇందులో ‘శోకం’ స్థాయి భావం. ‘అశ్రువు’, ‘ప్రళయం’ సాత్వికభావాలు. ‘దైన్యం’, ‘చింత’, ‘మొహం’ వ్యభిచారీ భావాలు. ఆరవ స్వరసాహిత్యంలో ఓ!! రామ చంద్రా!!....రఘుకుల నాయకా!...రాజాది రాజా!! అని నేను నిన్ను ఇంతగా ఆర్ద్రతతో వేడుకుంటున్నా కూడా నువ్వు నన్ను బ్రోచలేదే? చలించవా స్వామీ? అని సాహిత్య భావము. ఇందులో కూడా ‘శోకం’ స్థాయి భావం. ‘అశ్రువు’, ‘ప్రళయం’ సాత్వికభావాలు. ‘జడత’, ‘దైన్యం’, ‘చింత’, ‘మొహం’ మొదలైనవి వ్యభిచారీ భావాలు. ఏడవ స్వరసాహిత్యంలో కూడా ఇదే భావనే కనిపిస్తుంది.
చివరి స్వరసాహిత్యంలో ఓ రామా! నువ్వు నాకు సద్భక్తుల లక్షణాలు ఎలా ఉండాలో చేప్పావు. అలా నేను చేసిన పూజలను తీసుకున్నావు. నన్ను అలుగవద్దు అన్నావు. విముఖులతో చేరొద్దన్నావు. బాధ కలిగితే ఓర్చుకోమన్నావు. నీ మాటలన్నీ చూసి నీకు నాపై ప్రేమ కలిగిందేమో అనుకోని నువ్వు సుఖదాయకుడివి అని భ్రమ పడ్డా కదయ్యా!! చివరకి నా చెంత రాకుండానే సమయానికి తగు మాటలాడి నన్ను సాధించితివా? స్వామీ!! అని సాహిత్య భావం. ఇందులో ‘శోకం’ స్థాయీ భావం. ‘స్వర భంగం’, ‘ప్రళయం’, ‘అశ్రువు’లు సాత్వికభావాలు. ‘నిర్వేదం’, ‘దైన్యం’, ‘శ్రమ’, ‘ఆలస్యం’, ‘వ్రీడ’, ‘జడత’ వంటివి వ్యభిచారీ భావాలు.
(iii) ఆడ మోడి గలదా
రాగం : చారుకేశి – తాళం : ఆది
పల్లవి :
ఆడ మోడి గలదా రామయ్య మాట ||ఆడ||
అను పల్లవి :
తోడు నీడ నీవేయనుచును భక్తి కూడిన
పాదము పట్టిన నాతో మాట ||ఆడ||
చరణం:
చదువులన్ని తలిసి శంకరాంశుడై
సదయుడాశుగ సంభవుడు మ్రొక్క
కడలు తమ్ముని బల్కజేసితివి గాకను
త్యాగరాజుదే పాటి మాట (లాడ) /
త్యాగరాజు ఆడిన మాట |ఆడ||
చారుకేశి రాగం, ఆది తాళంలో ఉన్న ఈ నిందా స్తుతి కృతిలో త్యాగరాజు రామున్ని మాటలు ఆడటానికి అంత హెచ్చు ఎందుకయ్యా? నీకు! ఓ రామ? అని ప్రశ్నిస్తున్నాడు. అనుపల్లవిలో నా తోడూ నీడా నువ్వే అని నేను నీ పాదాలనే భక్తితో నమ్మి పట్టుకున్నా కదయ్యా?. అలాంటి నాతో కూడా మాట్లాడటానికి నీకు నీ స్థాయి అడ్డు వస్తోందా?? రామా!! అని సాహిత్య భావం. ఇందులో ‘శోకం’ స్థాయి భావం. ‘ప్రళయం’, ‘అశ్రువు’లు సాత్వికభావాలు. ‘విషాదం’, ‘దైన్యం’, ‘చింత’, ‘జడత’ వంటివి వ్యభిచారీ భావాలు. చరణంలో త్యాగరాజు వాల్మీకి రామాయణంలోని కిష్కింద ఖాండలో రామాంజనేయుల మొదటి పరిచయ ఘట్టాన్ని ‘స్మృతి’కి తెచ్చుకొని ఇలా వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నాడు. ‘చదువులన్ని తెలిసి శంకరాంశుడై సదయుడాశుగ సంభవుడు మ్రొక్క’ అంటాడు. అంటే అన్ని విద్యలలో ఆరితేరినవాడు, శంకరాంశుడైన ఆంజనేయుడు నిన్ను సదయుడు అనుకోని మ్రొక్కినాడు కదా! అయినా మొదట నువ్వు నేరుగా అతడితో మాట్లాడకుండా..... నీ తమ్ముడైన లక్ష్మణుడితో మాట్లాడింప చేసినావు!! అంతటి ఆంజనేయుడికే నీ రాజ హెచ్చులు చూపిన వాడివి నువ్వు. ఇక త్యాగరాజుడైన నా సంగతి చెప్పాల్సిన అవసరం ఏముందిలే? అసలెందుకయ్యా నువ్వు మాట్లాడకుండా ఇంత మొండి చేస్తున్నావు? ఇది నీకు తగదు రామా! అని సాహిత్య భావము. ఇందులో ఆంజనేయునిలో రామునిపై ‘రతి’ స్థాయి భావముంటే, త్యాగరాజు మనసులో ఇప్పుడు ‘శోకం’ స్థాయి భావముంది. ‘చింత’, ‘జడత’, ‘దైన్యం’ వంటివి వ్యభిచారీ భావాలు. ‘అశ్రువు’లు సాత్వికభావం.
(iv) రామ చంద్ర నీ దయ
రాగం : సురటి – తాళం : ఆది
పల్లవి :
రామచంద్ర నీ దయ - రామ ఏల రాదయ ॥రామ॥
అను పల్లవి :
కామకోటి సుందర - కరధృత మందరా
ప్రేమమీర ముందర - బిల్వ రాక యుందురా ॥రామ॥
చరణం 1 :
కాననంబు తాపమో - కైక మీద కోపమో
నేను జేయు పాపమో - నీకు శక్తి లోపమో ॥రామ॥
చరణం 2 :
ఆడదన్న రోసమో - అలనాడు పాసమో
మేడలేని వాసమో - మేము జేయు దోసమో ॥రామ॥
చరణం 3 :
కల్లలైన నేయమా - కంటె నీకు హేయమా
తల్ల డిల్ల న్యాయమా - త్యాగరాజ గేయమా ॥రామ॥
సురటి రాగం ఆది తాళంలో ఉన్న ఈ నిందా స్తుతి కృతిలో త్యాగరాజు రామా!! ఎందుకయ్యా నీకు దయ రాదు? మందర పర్వతాన్ని ఒంటి చేత్తో పైకి లేపిన ఘనుడివి కదా! అసలు ఇంత ప్రేమగా పిలిస్తే ఎవరైనా రాకుండా ఉంటారా?? నీకు మాత్రం దయ రాలేదు. కారణం ఏమి? అని అడుగుతున్నాడు. ఇందులో అసహనంతో కలిసిన ‘రతి’ స్థాయి భావం ఉంది. ‘చింత’, ‘వితర్కం’, ‘వ్రీడ’ వంటివి వ్యభిచారీ భావాలు. ‘అశ్రువు’ సాత్వికభావం.
చరణంలో ‘కాననంబు (అడవిలో) తాపమో!’ లేక ‘కైక మీద కోపమో!’ లేక ‘నీకు శక్తి లోపమో!’ అని వ్యంగ్యంగా అడుగుతున్నాడు. అడవిలో గడిపిన గడ్డు రోజులేమైనా గుర్తొచ్చాయా? రామా! లేక నీ తల్లి కైక పై అలిగి వున్నావా? ఆ కోపం నాపై చూపిస్తున్నావు కదా?! లేక నేనేమైనా తప్పు చేసానా? రామా! నీకు దయ రాక పోవడానికి కారణం ఏమి? అని మెత్తగా ప్రశ్నించి, వ్యంగ్యంగా నీకు శక్తి లోపించిందని నాకు అర్థమైందిలే అని గుచ్చుతాడు. ఇందులో కూడా అసహనంతో కలిసిన ‘రతి’ స్థాయి భావంగా ఉంది. ‘స్మృతి’, ‘విషాదం’, ‘దైన్యం’, ‘చింత’, ‘జడత’ వంటివి వ్యభిచారీ భావాలు. ఇందులో ‘స్థంభం’ సాత్విక భావం.
రెండవ చరణంలో కుడా ఇలాంటి వ్యంగ్య ప్రశ్నే కనిపిస్తుంది. నీ భార్య నిన్ను ఏమైనా అన్నదా? అందుకేనా నాపై ఈ రోషము? రామా!! అని అనడంలో త్యాగరాజు చమత్కారంగా రామున్ని దెప్పుతుoడటం స్పష్టం గా అర్థమౌతుంది. మేడలు లేని రోజులేమైనా గుర్తుకు వచ్చాయా? లేక ఆకలితో ఉన్న రోజులు గుర్తుకు వచ్చాయా? అని అడుగుతున్నాడు. ఇందులో కూడా అసహనంతో కలిసిన ‘రతి’ స్థాయి భావంగా ఉంది. ‘విషాదం’, ‘దైన్యం’, ‘చింత’, ‘జడత’ వంటివి వ్యభిచారీ భావాలు. ఇందులో ‘స్థంభం’ సాత్విక భావం. నిగూఢమైన చమత్కారంలో ‘హాసము’ కూడా ఉంది.
మూడవ చరణంలో ‘కల్లలైన నేయమా కంటె నీకు హేయమా’ అనడంలో నా ప్రేమ / స్నేహం అంతా కల్ల (అబద్దము) అయిపోయిందా రామా? ఒక్కసారైనా నా వంక చూస్తె నీకేమంత తక్కువైపోతుంది? నన్నెందుకు అయ్యా తల్లడిల్లేలా చేస్తున్నావు? అని సాహిత్యార్థం. ‘శోకం’ స్థాయి భావంగా ఉంది. ‘గర్వము’, ‘దైన్యం’, ‘చింత’, ‘జడత’ వంటివి వ్యభిచారీ భావాలు. ఇందులో ‘స్థంభం’, ‘అశ్రువు’ సాత్విక భావాలు.
6. ముగింపు:
- పైన చర్చించిన అన్ని త్యాగరాజ కృతుల్లోని భావాన్ని మనం గమనిస్తే నింద కూడా ఇంత అందంగా, అమోఘంగా ఉంటుందా అన్న భావన కలుగుతుంది.
- మొదటి కృతిలో త్యాగరాజు వాల్మీకి రామాయణంలోని ఘట్టాలను నిందాకోణంలో తీస్కోని తన అసహనాన్ని తెలిపారు. రామాయణంలోని ప్రతీ సందర్భానికి, ఊహకి అందని కొత్త అర్థాన్ని చెప్పి నిందించారు.
- రెండవ కృతిలో వీరు మహా విష్ణువు శ్రీకృష్ణావతారంలో చేసిన చేష్టలలోని అంతరార్థాన్ని వ్యంగ్యదృష్టి భావంతో చెప్పి నిందించారు.
- మూడవ కృతిలో వీరు రామున్ని ప్రశ్నిస్తూ నిందించారు మరియు నిందిస్తూ ప్రశ్నించారు.
- నాల్గవ కృతిలో మొదట ప్రశ్నించి, తర్వాత నిందించి చివరకు ఇలా తల్లడిల్లేలా చెయ్యడం న్యాయమా! రామా!! అని వినయంగా వేడుకుంటాడు.
- నాట్య శైలిలో ప్రతీ కృతిని విశ్లేషించగా అన్నింటిలో చివరకు ‘రతి’ (భక్తి శృంగారం) భావమే కనిపిస్తోంది.
- ఈ వ్యాసంలోని కృతులను విశ్లేషించిన తర్వాత ఈ నిందా స్తుతులకు నాట్యంలో అభినయించడం కొంత కష్ట తరమే అని చెప్పగలం. ఎందుకంటే, సాహిత్యంలో పైకి కనిపించే వాక్యార్థాలతో పాటుగా భావంలో నిగూఢమైన వ్యతిరేకార్ధములను కూడా ముఖరాగంలో పలికించాలి కనుక. పైకి మాట కఠినంగా అనిపించినా, లోన భావమంతా తేనె కుండ అని సభికులకు అర్థమైయ్యేలా ప్రదర్శించాలి కనుక. ఎంతో నాట్య సాధన ఉంటే తప్ప ఇది సాధ్యపడేది కాదు.
7. ఉపయుక్తగ్రంథసూచి:
- జాక్సన్, విలియం, జే, త్యాగరాజ: లైఫ్ అండ్ లిరిక్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 1999.
- పురుషోత్తం, వాడ్రేవు, త్యాగరాజ కీర్తనలు (మొదటి భాగము), తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ, 1981.
- పురుషోత్తం, వాడ్రేవు, త్యాగరాజ కీర్తనలు (రెండవ భాగము), తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ, 1981.
- రాధాకృష్ణన్, ఎస్, రామానుజాచారి, సి, ది స్పిరిచ్యువల్ హెరిటేజ్ అఫ్ త్యాగరాజ, శ్రీ రామకృష్ణ మట్ పబ్లికేషన్స్, 2001.
- శ్రీ రామ అప్పారావు, పోనంగి, నాట్యశాస్త్రము, నాట్యమాలా పబ్లికేషన్స్, 1957.
- స్వామి, విద్యానందగిరి, శ్రీ భగవద్గీత, గీతా పబ్లికేషన్స్, 2023.
- సుధా, ఎమని, త్యాగరాజ : లిరిక్ టు లిబరేషన్ (ఎ స్టొరీ రీ టోల్డ్), మోతీలాల్ బనారసిదాస్ పబ్లికేషన్స్, 2019.
- షా, ప్రియబాలా, విష్ణుధర్మోత్తర పురాణే- తృతీయ ఖండః, గైక్వాడ్ ఓరియంటల్ సిరీస్, 1958.
- Govindan.v, Tyagaraja Kritis - Alphabetical List, Thyagaraja vaibhavam.blogspot.com, 23.04.2024.
- “NINDA STUTI - An endeavour to keep learning.” Youtube, uploaded by Prayathnam, 21.01.2021.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

