AUCHITHYAM | Volume-5 | Issue-8 | July 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
3. బాలవ్యాకరణ సమీపకాలిక వ్యాకరణాల్లో సమాసపరిచ్ఛేదం: తులనాత్మక విశ్లేషణ

డా. దొడ్డి ప్రవీణ
తెలుగు అధ్యాపకురాలు,
ఎస్.వి.ఎల్.ఎన్.ఎస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
భీమునిపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9290441535, Email: praveenaphdtelugu@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
పందొమ్మిదవశతాబ్దoలో ప్రతిభావంతులుగా పేరెన్నికగన్న ఆంధ్ర పండితులలో మొట్టమొదట పేర్కో దగిన వ్యక్తి శ్రీమాన్ పరవస్తు చిన్నయసూరి. సుమారు వందసంవత్సరాల నుండి పఠన పాఠనాదులలో బహుళప్రచారoపొందిన బాలవ్యాకరణ, నీతిచంద్రికల ద్వారా ఆ మహనీయుని పేరు తెలియని అక్షరాస్యులాంధ్రదేశoలో ఉండరు. ఆంధ్రసాహితీలోకంలోని వ్యాకరణాలలో గొప్పదైన బాలవ్యాకరణానికి, సమీపకాలిక వ్యాకరణాలలోని సమాస పరిచ్ఛేద విశ్లేషణ ఏ విధంగా ఉన్నాయో నిర్మాణాత్మకపరిశోధనాపద్ధతిలో పరిశీలించడం ఈవ్యాసం ప్రధానోద్దేశం. పరిశోధనకు ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము, తెనుఁగు వ్యాకరణము, లఘువ్యాకరణము, బాలవ్యాకరణము, ఆంధ్రవ్యాకరణ సంగ్రహము, సంగ్రహ వ్యాకరణము, ఆశుబోధలక్షణ సంగ్రహము, ప్రౌఢ వ్యాకరణము, ఆంధ్రచంద్రిక, ఆంధ్రభాషాసుబోధిని, ఆంధ్రభాషానుశాసనము అనే వ్యాకరణగ్రంథాలు ఆధారం. వీటిలో సమాసపరిచ్ఛేదాలలో తత్పురుష, కర్మధారాయ, ద్విగు, ద్వంద్వ, బహువ్రీహి, ఉపమాన సమాసాదులను ఏవిధంగా విభజన చేశారో వివరించి, తులనాత్మకంగా ఈ వ్యాసం చర్చిస్తుంది.
Keywords: బాలవ్యాకరణము, ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము, తెనుఁగు వ్యాకరణము, లఘు వ్యాకరణము, ఆంధ్రవ్యాకరణసంగ్రహము, సంగ్రహవ్యాకరణము, ఆశుబోధలక్షణసంగ్రహము, ప్రౌఢవ్యాకరణము, ఆంధ్రచంద్రిక, పురుషోత్తమకవీయము, ఆంధ్రభాషాసుబోధిని, ఆంధ్రభాషానుశాసనము, సమాస పరిచ్ఛేదం, తులనాత్మక శ్లేషణ.
1. ఉపోద్ఘాతం:
‘‘సమ్’’ పూర్వక ‘‘అస్’’ ధాతువుకు ‘‘ఘఞ్’’ ప్రత్యయం చేర్చడం వలన సమాసపదం సిద్ధిస్తుంది. ‘‘సమాసనం సమాసః’’ సమసించేది సమాసం. అనేక పదాలకేకీభావ రూపమైన సంశ్లేషం. ఇటువంటి సంశ్లేషలో వివిదార్థాలలో చేరే విభక్తులు లోపిస్తాయి. సమాసమేర్పడడానికి ప్రాథమికంగా కావలసినది శబ్దాలు, పరస్పరం కలవాడానికి సమర్థాశ్రితాలు (సామర్థ్యంతో కూడినవి) కావాలి. సంధిలో పదాలు కలుసుకుంటాయి గాని అందులో అర్థ భేదం లేదు. శబ్దాలు మారుతాయి. ఇక్కడ అర్థ భేదం ప్రధానం. ఒక పదం వ్యాకరణ శాస్త్రానుసారం మరొక పదం తో సంబంధం ఉన్నా అటువంటి పదంతో సమాసం చేయరాదు. అటువంటి పదం ‘‘అసమర్థ పదమంటారు.’’ దీనికే ‘‘సాపేక్షకత్వమని’’ 1పరిభాష (సాపేక్ష మసమర్థoభవతీతి).
ఒకే భావం వాక్యంగా గాని, సమాసంగా గాని రచించవచ్చు. సమాసంలో ఏకార్థీబావం ముఖ్యం. వాక్యంలో విభక్తి లోపాలుండవు. పరస్పరాకాంక్ష గల పదాల మధ్య విశేషణాలు చేరవచ్చు. పదాలు ఒకే క్రమంలో ఉండాలనే నిర్బంధం లేదు. సమాసంలో ఇలా ఉండదు. ఏక స్వరాధికముంటుంది. సమాసం అఖండం. విగ్రహ వాక్యం కృతకం.
2. సమాస విశ్లేషణ:
‘‘మొదలి పదము విభక్తులఁబుచ్చి మీఁది పదముల తోడ సమ్యక్సంసక్తంబులగుటంజేసి సమాసంబులయ్యె’’2
అని ఆంధ్రభాషా భూషణంలో తెలుగు వ్యాకరణ వాఙ్మయంలోనే తొలిసారిగా కేతన సమాసమేర్పడే రీతిని తెలిపారు. విభక్తి లోపాలచే సమాసమేర్పడుతుందని ఆయనభావం. ఈయన తత్పురుషాదిసంజ్ఞలను స్వీకరించకుండా(1) పూర్వపదార్థప్రధానము (అవ్యయీ భావసమాసము) (2) ఉత్తరపదార్థ ప్రధానము (తత్పరుష) (3) అన్యపదార్థ ప్రధానము (బహువ్రీహి) (4) ఉభయ పదార్థ ప్రధానము (ద్వంద్వ) అనే నాలుగు విధాలుగా విభాగాలను పేర్కొన్నారు.
ఆంధ్రశబ్ద చింతామణిలో ప్రథమాచార్యుడు-
‘‘కేవల వికృతి పదైర్య స్సమాసకం తంబ్రువన్తి వాక్యజ్ఞాః
సంస్కృతవైకృతశబ్దైర్మిశ్రసమాసస్స ఏవ విజ్ఞేయః’’ (హలన్త 18)
అని ఆంధ్రభాషలోని సమాసాలను మూడుగా విభజించారు. అవి
1) సమాసకాలు -కేవలం తెలుగు పదాల చేత ఏర్పడేవి. ఉదా: వెన్నెలతోట, పేరామని చిగురు.
2) మిశ్రసమాసకాలు - సంస్కృత, వైకృతశబ్దాలు కూడినవి. ఉదా: సర్వైశ్వర్య లక్ష్మినెలవు.
3) సమాసాలు- ఈ విభాగాన్ని చింతామణికారుడు ప్రత్యేకంగా నిరూపించక పోయినా పైరెండూ కానివిగా వ్యవహరించవచ్చు. ఇవి కేవల సంస్కృత శబ్దాలతో ఉన్నవి. ప్రథమాచార్యుడు ‘‘సమాసకములు’’ అని అల్పార్థసూచకంగా ‘‘కప్’’ సంజ్ఞనేర్పరచారు. ఈయన ‘‘స్వస్వవిభక్తి వికారైర్బహవశ్చ యథాతథా సమస్యన్తే’’ (ఆం.శ.చిం. హలన్త 19) అని తెలిపారు. అనగా తెలుగు సంస్కృతాలు, సంస్కృతం తెలుగు కలసిన (మిశ్రసమాసకాలు) తమతమ విభక్తి వికారాలతో కలసి సమసిస్తాయని తెలిపారు. ఉదా: అత్తింటి సౌభాగ్యలక్ష్మి సొంపు. ఈయన
‘‘ద్విగుకర్మధారయౌతత్పురుషద్వన్వౌ బహువ్రీహిః
అన్యేచ కేచి దుపమానోత్తరపదలోప రూపకాఖ్యాద్యాః’’ (ఆం.శం.చిం.హలన్త 16)
తెలుగులో ద్విగు, కర్మధారయ, తత్పురుష, ద్వంద్వ, బహువ్రీహి, ఉపమాన, ఉత్తరపద లోపం, రూపకం మరికొన్ని సమాసాలు చూడదగినవని తెలిపారు. ఇందులో ఈయన అవ్యయీభావ సమాసాన్ని తెలుపలేదు.
వివిధ వ్యాకరణాలు - సమాసవర్గీకరణ:
పుదూరి సీతారామశాస్త్రి కారకపరిచ్ఛేదంలో సమాస ప్రకరణాన్ని వివరించారు. ఈయన ‘‘అనేక పదములు కలసి యొకపదముగా నౌట సమాసంబు’’ (ప్ర.వ్యా. పుట. 51) అని నిర్వచించి ద్విగు, కర్మధారయ, తత్పురుష, ద్వంద్వ, బహువ్రీహి, ఉపమాన, ఉత్తరపద లోప, రూపక సమాసాలను ఆంధ్రశబ్ద చింతామణిని అనుసరించి తెలిపి, మతుప్సమసాన్ని అదనంగా తొమ్మిదో సమాసంగా తెలిపారు.
రావిపాటి గురుమూర్తిశాస్త్రి ‘‘అనేక నామంబులు గూడియేకపదంబైన సమాసమనఁబడును.’’ (తె. వ్యా. పుట. 88) అని నిర్వచించి ద్విగు, కర్మధారయ, తత్పురుష, ద్వంద్వ, బహువ్రీహి, ఉపమిత, రూపక, ఉత్తరపద లోప సమాసాలనే ఎనిమిందింటినీ తెలిపారు. ఉపమితంటే ఉపమానం. అయితే ‘‘ఈ సమాసంబులన్నియు సమాసకంబులు, మిశ్రసమాసకంబులనియు రెండేసి విధంబులు’’ అని తెలిపారు. ఈయన సమాసాలన్ని పూర్వ పదార్థ ప్రధానం, ఉత్తర పదార్థ ప్రధానం, ఉభయపదార్థ ప్రధానం, అన్యపదార్థ ప్రధానం అని సగ్రహంగా నాలుగు విధాలుగా వర్గీకరించారు.
వేదం వేంకటరమణశాస్త్రి ‘‘తత్పురుష ద్వంద్వ బహువ్రీహిలని సమాసంబు లెల్లం ద్రివిధంబులు. అనేక పదంబు లేక పదంబగుట సమాసంబు’’ (ల.వ్యా.పుట 41) అని తెలిపారు. ఈయన పూర్వ వ్యాకర్తలలాగ ఎనిమిది లేక తొమ్మిది భేదాలను చూపలేదు. కర్మధారయాన్ని తత్పురుష భేదంగానూ, ద్విగువును కర్మధారయ భేదంగా చూపారు. ఈ విషయంలో చిన్నయ సూరికి మార్గదర్శకులయ్యారు.
చిన్నయసూరి బాలవ్యాకరణానికి ముందు సూత్రాంధ్రవ్యాకరణంలో సమాస పరిచ్ఛేదాన్ని వివరించారు. చింతామణిని అనుసరించి ‘‘త్రివిధా సాంస్కృతి కాచ్ఛిక మిశ్రభేదాత్’’ అని సమాసాలను మూడుగా వర్గీకరించారు. ‘‘సాంస్కృతికో ద్వివిధస్సిద్ధస్సాధ్యశ్చేతి’’ (కథం ఒంటిగాఁడు) అని సాంస్కృత సమాసాలను రెండురకాలుగా వర్గీకరించారు. బాలవ్యాకరణంలో ‘‘సమర్థంబులగు పదంబు లేక పదంబగుట సమాసంబు’’ (సమాస 1) అని నిర్వచించి సూత్రవృత్తిలో "పృథగ్భూతంబులగు నర్థంబుల కేకార్థీభావంబు సామర్థ్యంబు. పృథక్ప్ర సిద్ధార్థంబులగు పదంబుల కేకార్థంబునందు వృత్తి సామర్థ్యము’’ అని వివరించారు.
అనగా సామర్థ్యంతో కూడిన పదాలు ఒకే పదంగా ఏర్పడి అది సమాస మనబడుతుంది. అన్ని పదాలు సమసించడానికర్హంకావు. అనగా ఒకే అర్థాన్ని పొందడానికి శక్తిమంతాలు కావు. ఆచ్ఛిక పదాలన్నీ అన్ని ఆచ్ఛిక పదాలతోనూ సమసింపవు. సూరి పేర్కొన్న వృత్తిలో తొలి నిర్వచనం ఏకార్థీభావ సామర్థ్యం, మలిది వ్యపేక్షాభావ సామర్థ్యం.
సూరి ‘‘సాంస్కృతిక కాచ్ఛిక మిశ్రభేదంబుచే సమాసంబు త్రివిధంబు’’ (సమాస. 2) అని తెలిపి సూత్రవృత్తిలో ‘‘సాంస్కృతికంబు సిద్ధంబని, సాధ్యంబని ద్వివిధంబు,’’ అని వర్గీకరించారు. కేవల సంస్కృత శబ్దాల సమాసం సిద్ధమని, సంస్కృత సమాలతో సమాసం సాధ్యమని, మిగిలిన తెలుగు సమాసం ఆచ్ఛికమని, సంస్కృత ఆచ్ఛికాలు కలసింది మిశ్రమని వర్గీకరించి వివరించారు. సూరి లఘువ్యాకర్తననుసరించి ‘‘తత్పురుష, బహువ్రీహి, ద్వంద్వంబులని సమాసంబు లెల్లం ద్రివిధంబులయియుండు.’’ అవి ‘‘ప్రాయికంబుగ నుత్తరాన్యోభయ పదార్థ ప్రధానంబు లయియుండు’’ (సమాస 3, వృత్తి) అని తెలిపారు. చింతామణి కర్త ఎనిమిది విధాలసమాసాలను పేర్కొంటే సూరి మూడిరటినే పేర్కొన్నారు. మిగిలిన వాటిని అవాంతర భేదాలుగా చూపారు.
పాపినేని అబ్బాయినాయుడు ‘‘సమాసంబున ననేక నామంబులుగూడి యొక పదంబగుట’’ (ఆ.వ్యా.సం.పుట 69) అని నిర్వచించి చింతామణిని అనుసరించి ద్విగువు, కర్మధారయ, తత్పురుష, ద్వంద్వ, బహువ్రీహి, ఉపమిత, రూపక, ఉత్తరపదలోప అనే ఎనిమిది సమాస విభాగాలుగా చూపారు. ఈయన ప్రత్యేకంగా లుక్సమాస, అలుక్సమాస, అవ్యయీభావ సమాసాలను కూడా సమర్థవంతంగా తెలిపారు.
కందుకూరి వీరేశలింగం ‘‘పెక్కు పదములు కూడియొక్క పద మగునది సమాసంబనఁబడును’’ (సంగ్రహవ్యాకరణం. పుట. 81) అని నిర్వచించి తత్పురుష, ద్వంద్వ, బహువ్రీహిలతోపాటు అవ్యయీభావాన్ని చేర్చి సమాసాలను నాలుగు విధాలుగా వర్గీకరించారు.
టి. ఆంజనేయశాస్త్రి ‘‘సమాసమనగా వేరువేరు అర్థములుగల అనేక పదములుకలసి మరియొక వస్తువును బోధించునది.’’ (ఆశుబోధలక్షణ సంగ్రహం. పుట 64) అని నిర్వచించి విశేష్యం, విశేషణం, సర్వనామం ఇవి ప్రత్యేకంగా మరొక శబ్దంతో కలసి ప్రయోగించవచ్చని, అలా కలసినప్పుడు సమాసమవుతుందన్నారు. ఈయన చిన్నయ సూరిని అనుసరించి తత్పురుష, ద్వంద్వ, బహువ్రీహి అని సమాసాలను వర్గీకరించి వివరించారు.
కేతవరపు వేంకటశాస్త్రి ‘‘వేఱువేఱు ధన్ ములుగల పదమలొకటి యైయొక్క యధ మును జెప్పునది సమాసమునఁబడును’’ (ఆం.చం.సమాస.1) అని నిర్వచించి కందుకూరిని అనుసరించి సమాసాలను అవ్యయీభావ, తత్పురుష, బహువ్రీహి ద్వంద్వ సమాసాలుగా వర్గీకరించారు.
నాదెళ్ల పురుషోత్తమ కవి, పురుషోత్తమ కవీయంలో ‘‘వర్ణ సంఘాతంబు పదంబు వ్యస్తంబని సమస్తంబని పదంబు ద్వివిధంబు. సమస్తంబు సమాసపదంబు’’ (పుట 54) అని నిర్వచించి చిన్నయసూరిని అనుసరించి తత్పురుష, బహువ్రీహి, ద్వంద్వ అనే మూడు రకాలుగా సమాసాలను వర్గీకరించారు.
ఈ. భాష్యకాచార్యులు ఆంధ్రభాషా సుబోధిని (పుట 59)లో ‘‘రెండు పదము లొక్కటిగాఁజేర్చుట సమాసమగును’’ అని నిర్వచించారు. ఇంకా రెండు పదము లొక్కటిగాఁజేరినపుడు వాని విభక్తి యెచ్చట లోపించునో అచ్చటి పదముల చేరికకు సమాసమని పేరు’’ అని తెలిపారు. ఈయన సమాస సామాన్య వృక్షాన్ని ఈ విధంగా తెల్పారు.
3. సమాససామాన్యవృక్షము: (సమాససామాన్యవృక్షము)
పై చిత్రంలో విధంగా సమాసాలను వర్గీకరించి సామాన్య సమాసాలను పూర్వవ్యాకర్తల ననుసరించి అవ్యయీభావ, తత్పురుష, ద్వంద్వ, బహువ్రీహి అని నాలుగు భేదాలను తెలిపారు. విద్యార్థుల అవగాహనకు ఈ సమాస వృక్షం ఉపయోగపడుతుంది.
నేలటూరి పార్థసారధి అయ్యంగారు పూర్వవ్యాకర్తల ననుసరించే ‘‘స్వతంత్రమగు నర్థముంగల కొన్ని పదము లొకటిగాఁజేరి యొకయర్థముం గలిగించుట సమాసము నాబడు’’ (ఆం.వ్యా.స.పుట 41) అని తెలిపి తత్పురుష, బహువ్రీహి, ద్వంద్వ అని సమాసాలను వర్గీకరించారు.
ప్రౌఢవ్యాకర్త కేతనాదుల నిర్వచనాలను పురుస్కరించుకొని ‘‘సంయోగ దశయందుఁగలిగెడు విభక్తి లోపాత్మక పద స్వరూప సంగ్రహము’’ (ప్రౌ.వ్యా.సమాస 1) అని సమాసాన్ని నిర్వచించారు. ప్రత్యయాత్మక భాషలపట్ల అనువర్తించేటట్లుగా ఈ నిర్వచనం సంయోగాత్మక భాషలపట్ల అనువర్తించదు.
మల్లాది సూర్యనారాయణశాస్త్రి ‘‘సమర్థములైన పదము లేకపదమగుట సమాసమ’’ని తెలిపి, ‘‘సాంస్కృతికము, తత్సమము, ఆచ్ఛికము, మిశ్రము’’ (ఆ.భాశా.పుట 201) అని నాలుగు విధాల వర్గీకరణ చేశారు.
తెలుగు మొదలైన భాషలు సంయోగాత్మకాలు. విభక్తి రహితాలు. అందువలన విభక్తి లోపించే విధాన సూచనతో పనిలేదు. మంచినీరు, తలనొప్పి వంటివి రెండు పదాలు కలసి ఒకే పదమవుతుంది. ఈ భాషలు సామాన్య స్వభావం గలవి. అందువలనే ఇందులో సమాసపరిచ్ఛేదం పరిమితంగానే ఉన్నది.
4. బాలవ్యాకరణ సమీపకాలిక వ్యాకరణాలు - సమాసపరిచ్ఛేద పరిశీలన:
4.1 తత్పురుష సమాసం:
ఉత్తరపదార్థ ప్రధానం తత్పురుష. చింతామణికారుడు ‘‘ద్విగు కర్మధారయౌ తత్పురుషద్వన్ద్వౌ బహువ్రీహిః’’ (హలన్త 16) అని తత్పురుష సమాసాన్ని కర్మధారయ తరువాత తెల్పారు. ఈయన ‘‘షష్ఠీ భవేద్ద్వితీయా తుల్యా తత్పురుష సంస్థితా నామ్నామ్’’ (హలన్త 13) అని తెలిపారు. అనగా నామాలకు తత్పురుష సమాసంలోగల షష్ఠి - ద్వితీయతో సమానం.
వికృతి వివేకంలో ‘‘సమాసయుగ్భవేరాద్య ఆత్మాదిగవిభక్తిగః’’ (హలన్త 14) అని తెలిపారు. విభక్తియుతమైన తన, నీ మొదలైన శబ్దాలు సంస్కృత శబ్దాలతో కలసి మిశ్రతత్పురుష సమాసాలేర్పడతాయని ఈయన ఉద్దేశం.
పుదూరి సీతారామశాస్త్రి ప్రశ్నోత్తరాంధ్రవ్యాకరణం (పుట.52)లో తత్పురుష సమాసానికి ఉదాహరణగా మల్లెపువ్వు, మామిడిచిగురు, నెలతక్కువవాడు, దొంగపలుకు, మాటనేర్పరిలను చూపారు. ఈయన తత్పురుషకు నిర్వచనాన్ని గాని, భేదాలను గాని చూపలేదు.
ఉదాహరణలలో షష్ఠీతత్పురుష, తృతీయాతత్పురుష, సప్తమీ తత్పురుషలను తెలిపారు. ఈయన తత్పురుషకు ఇచ్చిన ఉదాహరణలలో దొంగపలుకు ఒక విధంగా దొంగయొక్క పలుకు. షష్ఠీతత్పురుష అయినా, ఒక్కొక్క సమయాల్లో దొంగపలుకు - దొంగదైనపలుకు (అబద్దపుమాట) అని విశేషణ పూర్వపద కర్మధారయ కూడా కావచ్చు.
రావిపాటి గురుమూర్తిశాస్త్రి ‘‘పూర్వోత్తరపదంబులు భిన్నార్థకంబులై పరస్పరాన్వితంబు లగునపుడు తత్పురుష సమాసంబు’’ (తె.వ్యా.పుట 89). అని నిర్వచించి మల్లెపువ్వు, మామిడి చిగురు, నెల తక్కువవాడు, దొంగయలుక వంటి ఉదాహరణలను తెల్పారు.
లక్ష్య నిరూపణలో కొంత పుదూరి సీతారామశాస్త్రి ఉదాహరణలు కన్పిస్తున్నాయి. ఈయన కూడా తత్పురుష భేదాలను వివరించలేదు.
వేదం వేంకట రమణశాస్త్రి లఘువ్యాకరణం (పుట 42)లో తత్పురుషను కర్మధారయ, వ్యధికరణ తత్పురుషలుగా స్థూలంగా విభజించి, ద్వితీయాది విభక్తులకు ప్రథమాంతాలతోడి సమాసం వ్యధికరణతత్పురుషగా తెలిపి ద్వితీయా (బుడుతనెలదాల్పు), తృతీయా (నెలతక్కువవాడు), పంచమీ (దొంగభయము), షష్ఠీ (మల్లెపువ్వు), సప్తమీ (మాటనేర్పరి) తత్పురుషలను ఉదాహరణలతో చూపారు.
అయితే ఈయన ఈ విభాగంలోనే చేరే చతుర్థీ తత్పురుష, నఞ్ తత్పురుషలను వివరించలేదు. కాని ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణం, గురుమూర్తి శాస్త్రి తెనుఁగు వ్యాకరణాలకంటే పరిణితి కనిపిస్తుంది.
చిన్నయ సూరి తత్పురుషను వ్యధికరణం, సమానాధికరణమని విభజించి ‘‘ద్వితీయాదులకు మీఁది పదంబుతోడ సమాసంబు వ్యధికరణంబు’’ (సమాస:3 వృత్తి) అని తెలిపి నెలతాల్పు (ద్వితీయా), నెలతక్కువవాఁడు (తృతీయా), దేవరమేలు (చతుర్థీ), దొంగభయము (పంచమీ), రాముని బాణము (షష్ఠీ), మాట నేర్పరి (సప్తమీ) లను ఉదాహరణలుగా చూపారు. ఈయన ద్వితీయా తత్పురుషాది సమాసనామాలు తెల్పకపోయినా వాటి ఉదాహరణలను వరుసగా తెల్పారు. ఈ విషయంలో ఈయన అహోబలపతిని అనుసరించారు.
ఈయన చింతామణికారుడు తెలిపిన ‘‘యుష్మదస్మదాత్మభ్యః ద్వితివర్ణకః’’3 ను బాలవ్యాకరణంలో ‘‘యుష్మదస్మదాత్మార్థకంబులకుత్తరపదంబు పరంబగు నపుడు దుగాగమంబు విభాషనగు’’ (బా.వ్యా.: సమాస 11) అని తెలిపి నీదు కరుణ, నీ కరుణ వంటి ఉదాహరణలు చూపారు. ఈయన చూపిన లక్ష్యాలు ఏకవచనంలోనే చూపారు. బహువచనంలో కూడా ఈ ఆగమం వస్తుంది. ఇక్కడ ‘‘దు’’ అనేది ‘‘అదు’’ అనే చారిత్రక శబ్దానికి పరిశిష్టరూపం. ఇతర ద్రావిడ భాషలలో ఇది ఇప్పటికి వాడుకలో ఉంది.
పాపినేని అబ్బాయినాయుడు తత్పురుష అనగా ఉత్తరపదార్థ ప్రధానంగా గలది అని నిర్వచించి ద్వితీయాది తత్పురుషలను స్పష్టంగా ఉదాహరణలతో వివరించారు. ఈయన ‘‘ద్వితీయా - కృష్ణశ్రితుఁడు, తృతీయ - మాసపూర్వుఁడు, చతుర్థీ - దేవరమేలు, పంచమీ - చోరభయము, షష్ఠీ - లక్ష్మీవల్లభుఁడు, సప్తమీ - మాటనేర్పరి, నఞ్ - అన్యాయము, అబ్రాహ్మణుఁడు’’ (ఆం.వ్యా.సం.పుట 70) అని వివరించారు. చిన్నయసూరి, పుదూరివారు, గురుమూర్తి శాస్త్రి నఞ్‌తత్పురుషను తెలుపకపోయినా ఈయన నఞ్‌తత్పురుషను వివరించారు. అయితే నిర్వచనాన్నిస్తే ఇంకా సంపూర్ణత సిద్ధించేది.
కందుకూరి పూర్వ వ్యాకర్తలననుసరించి తత్పురుషను వ్యధికరణ, సమానాధికరణాలుగా వర్గీకరించి వ్యధికరణాన్ని ద్వితీయా, తృతీయా, చతుర్థీ, పంచమీ, షష్ఠీ, సప్తమీ, నఞ్ తత్పురుషలు ఏడుగా వర్గీకరించి వివరించారు. కొత్తదనం లేదు.
టి. ఆంజనేయశాస్త్రి వేరువిభక్తులనందుండే పదాలు కలిస్తే వ్యధికరణమన్నారు. దీనినే సామాన్యంగా తత్పురుషగా వాడుతారని తెలిపారు. ‘‘ద్వితీయాన్తము పై పదముతో గలసిన ద్వితీయా తత్పురుష మనబడును’’ (ఆం.ల.సం.పుట 65) అని ప్రత్యేకంగా చూపి సప్త విభక్తులకూ ఉదాహరణలు తెలిపి వాటి మొదటి పదంలో వచ్చే విభక్తులనుబట్టి ఆ పేర్లు కలుగుతాయని, తెలిపారు. ఈ విషయం అందరికీ తెలిసినదే అయినా పూర్వ వ్యాకర్తలు తెలుపలేదు. ఈయన విద్యార్థుల సౌలభ్యం కోసం తెలపడం ప్రశంసనీయం. చిన్నయ సూరిని అనుసరించి సమాసంలో మొదటనుండే ‘‘నీ, నా, తన’’ శబ్దాల చివర ‘‘దు’’ గాగమం వికల్పంగా వస్తుందని చూపారు. నఞ్ తత్పురుషను తెలుపలేదు. అన్ని విషయాలనూ సవివరంగా వివరించిన ఈయన నఞ్ తత్పురుష చెప్తే బాగుడేది.
కేతవరపు వేంకటశాస్త్రి ఆంధ్రచంద్రిక (పుట 49)లో తత్పురుషను టి. ఆంజనేయశాస్త్రిని అనుసరించి ‘‘నెలను + దాల్పు – నెలదాల్పు = చంద్రుని ధరించిన వాడనియర్థము. మొదటి పదముద్వితీయా విభక్తితోఁగూడియున్నది. కానయిది, ద్వితీయాతత్పురుషము. ఇట్లే తక్కినవి గ్రహించునది,’’ అని వివరించారు. అయితే ఈయన పూర్వ వ్యాకర్తలకు భిన్నంగా నెల + చే + తక్కువవాఁడు. అంటూ ‘‘+’’ గుర్తులను వాడారు. ‘‘+’’ గుర్తు సాధారణంగా సంధులకు వాడడం పరిపాటి. ఈయన నఞ్ తత్పురుషను వివరించలేదు.
బులుసు పాపయ్యశాస్త్రి, నేలటూరి పార్థసారధి పూర్వవ్యాకర్తలనే అనుసరించారు.
ఈ. భాష్యకాచార్యులు ఆంధ్రభాషాసుబోధిని (పుట 64,65)లో పూర్వ వ్యాకర్తలకు భిన్నంగా ప్రాది సమాసం, ఉపపద సమాసాలను కూడా చేర్చి మొత్తం తొమ్మిది తత్పురుష సమాసాలుగా తెలిపారు. ప్రాదులనగా ‘‘ప్ర’’ మొదలైన ఉపసర్గలు ఆదిగా గలవి. ఈయన ఉపసర్గ గణాన్ని ‘‘ప్ర, పరా, అప, సమ్, అను, అవ, నిన్, విర్, దున్, దుర్, వి-ఆఙ్, ని, అధి, అపి, అతి, సు, ఉద్, అభి, ప్రతి, పరి, ఉప’’లుగా తెలిపి వీటిని ప్రాదులన్నారు. ఉదా: ప్రాచార్యుడు ఉప పదసమాసం కొన్ని క్రియాజన్య విశేష్యాలకు సంబంధించి ఉంటుందని తెలిపి కుంభకారుడు, నమస్కారము, సోమయాజి, జలజము మొదలైనవి ఉదాహరణలుగా చూపారు. ఇది ఈయన ప్రత్యేకతగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ కుంభకారుడు - ‘‘కుండను చేయువాడు’’ అనేది ద్వితీయాతత్పురుష సమాసంగా కూడా చెప్పవచ్చు. ఈయన నఞ్ తత్పురుషకు కూడా చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు. సంస్కృతంలో నిషేదార్థంలో ‘న’ వస్తుందని, ఈ నకార పర్యాయం అకారం, ఇది నిషేదార్థంలో వస్తుందని తెలిపారు. ఈయన తత్పురుష సమాసానికి కూలంకష వివరణ ఇచ్చారు.
నాదెళ్ల పురుషోత్తమ కవి, పురుషోత్తమ కవీయం (పుట 55) పూర్వవ్యాకర్తలకు భిన్నంగా తత్పురుషను శుద్ధతత్పురుష, నఞ్ తత్పురుష, సంకర తత్పురుష అని మూడు రకాలుగా విభజించారు. శుద్ధ తత్పురుష అనగా ప్రథమ మొదలుగా ఏడు విధాలుగా ఉంటాయని తెలిపారు. పూర్వ వ్యాకర్తలు ద్వితీయాతత్పురుషనుండి సప్తమీ వరకు చెబుతే ఈయన ప్రథమను కూడా చేర్చారు. ప్రథమాతత్పురుషకు క్రీగన్ను, మీగాలు అనే ఉదాహరణ చూపారు.
ఈయన సుబంత సాహిత్య నిమిత్తం లేనిది సంకరతత్పురుషగా గుర్తించి, వేదవిదుఁడు, కుంభకారుడు వంటివి తెలిపారు. ఈ. భాష్యకాచార్యుడు ఉపపద సమాసంగా చెప్పినది. ఈయన సంకరతత్పురుషగా వివరించారు. ఈ విధంగా భిన్నత్వాన్ని చూపారు.
కో. వేంకట కృష్ణమాచార్యులు ఈ భాష్యకాచార్యుని అనుసరించి ప్రాదిసమాసాన్ని ఉపపదసమాసాన్ని తెలిపారు. ఈయన నఞ్ తత్పురుషని తెలిపి - ‘‘లేని’’ అని అర్థం వచ్చే బహువ్రీహి సమాసాలను నఞ్ బహువ్రీహిలంటారని ప్రత్యేకంగా చూపారు. ఈయన కూడా తత్పురుషలను ప్రథమానుండి సప్తమీ వరకు చెప్పారు. ప్రథమాతత్పురుష సమాసానికి అగ్రహస్తము, అర్థరాజ్యము, మీఁగాలు వంటి వాటిని తెలిపారు. మిగిలినవాటి విషయంలో పూర్వవ్యాకర్తలనే అనుసరించారు.
మల్లాది సూర్యనారాయణశాస్త్రి ప్రథమా తత్పురుషను తత్పురుష సమాసాలలో చేర్చలేదు. నఞ్ తత్పురుషను తెలిపారు.
ఈవిధంగా ఒక్కొక్క వ్యాకర్త తత్పురుషలను వివరించారు. తత్పురుషను వ్యధికరణం, సమానాధికరణంగా పూర్వవ్యాకర్తలు తెలిపినా వ్యధికరణమే తత్పురుష సమాసంగా ఎక్కువ వాడుక కలిగింది.
4.2 కర్మధారయ సమాసం:
పాణిని ‘‘తత్పురుషః సమానాధికరణః కర్మధారయః’’4 అని తెలిపారు. అనగా సమానాధికరణంగల తత్పురుష సమాసానికే కర్మధారయమని పేరు. సమానాధికరణం అనగా ఒకే ఆధారం కలదని అర్థం. అనగా రెండుగాని అంతకంటే ఎక్కువైన ధర్మాలుగాని ఒకవస్తువును ఆధారంగా చేసికొని ఉండటం కర్మధారయ సమాసంలో ఉంటుంది. ఈ కర్మధారయం విశేషణ విశేష్యభావం ఉన్నచోటనే ఉంటుంది.
ఆంధ్రశబ్ద చింతామణిలో-
‘‘ద్విగు కర్మధారయౌ తత్పురుషద్వన్ద్వౌ బహువ్రీహిః
అన్యే చ కేచి దుపమానోత్తర పదలోపరూపకాఖ్యాద్యాః’’ (హలన్త 16)
అని కర్మధారయసమాసాన్ని ద్విగు సమాసానికి తరువాత తెలిపారు. ప్రథమాచార్యుడు ‘‘సంస్కృత పదేన పరిమిత మాన్ధ్రపదం కర్మధారయో భవతి’’ (హలన్త 19) అని పరిమితమైన ఆంధ్రపదం సంస్కృత పదంతో కూడి కర్మధారయ మవుతుందని తెలుగులోని మిశ్రసమాసాన్ని తెలిపారు.
ద్వితీయాచార్యుడు మాత్రం ‘‘వివిధ వ్యాకరణాలు - సమాసవర్గీకరణ:’’ (వి.వి.హలన్త 24) అని ఆరువర్ణాలకు లోనైన తెలుగు పదం కర్మధారయ సమాసంలో సంస్కృత పదంతో సమసించుతుందని తెలియజేశారు. ఈయన
‘‘స్యాత్కర్మధారయా భాసః కర్తృత్వేకారకాశ్రితే
క్వచిత్సమాసాంత గస్యశబ్దస్స్యా దావపిస్థితి’’ (వి.వి.హలన్త 17) అని ‘‘కర్మధారయాభాస’’ మనే ఒక భేదాన్ని కల్పించారు. కర్మధారయంలాగే కనిపిస్తుందని శబ్దార్థం.
కర్మధారయ సమాసం ఒక్కొక్కప్పుడు మధ్యమ పదలోపం కల్గుతుంది. అటువంటి
దానిని మధ్యమ పదలోపి కర్మధారయమంటారు. ఒక్కొక్క సమయాల్లో ‘‘మత్’’ ప్రత్యయం లోపింపజేసి మధ్యమ పదలోపి సమాసాన్ని చెప్పారు. ఉదా: గంధద్విపము - (గంధవాంశ్చ అసౌద్విపః).
ప్రథమాచార్యుడు ‘‘అన్యేచ కేచిదుపనూనోత్తర పదలోపరూప కాఖ్యాద్యాః’’ (ఆం.శ.చిం.హలన్త 16) అని తెలిపారు. అంటే వీటిని ఈయన ఉత్తరపదలోపి సమాసాలన్నారు. పూర్వ పదానికుండే ఉత్తరపదం (అనగా మధ్యపదం) లోపించడం వలన దీనినుత్తర పదలోపి సమాసమంటారు.
ద్వితీయాచార్యుడు,
‘‘స్యాదుత్తరస్యలోపే పి ద్వితీయా నియతామతా
అన్యత్రాపి తదిష్ణస్స్యాత్ ప్రయోగస్తత్రకారణమ్’’ (వి.వి.హలన్త 20) అని తెలిపారు.
ఉత్తరపదలోపం కల్గుతుండగా పూర్వపదం సాధారణంగా ద్వితీయావిభక్తిలో ఉంటుంది. అని తెలిపారు. ఇంకా ‘‘ఉత్వమిత్వం తథైవాత్వం సమాసేమతుబర్థకమ్’’ (వి.వి.హలన్త 21) అని ద్వితీయాచార్యుడు తెలిపారు. అనగా అ, ఇ, ఉ, లు మతుబర్థద్యోతకాలు అని అర్థం. కాని అ, ఉ లకు అటువంటి అర్థమున్నట్లు కనిపించదు.
పుదూరి సీతారమశాస్త్రి ద్వితీయాచార్యుని అనుసరించి ‘‘ఆరక్షరముల వరకు తెనుఁగు పదము కర్మధారయమునందు గలియును.’’ (ప్ర.వ్యా.పుట 53) అని తెలిపి వేఁడి మయూఖంబులు, వాఁడి బాణంబులు వంటి ఉదాహరణలు చూపారు. ఈయన జవ్వాది శెట్టి, చునుబాల రామక్క, వంటలరంగమ్మ ఇవి ఉత్తర పదలోప సమాసాలని తెలిపారేగాని, నిర్వచించలేదు.
రావిపాటి గురుమూర్తిశాస్త్రి ‘‘పూర్వోత్తర పదంబులొక యర్థమును జెప్పునపుడు కర్మధారయసమాసంబు’’ (తె.వ్యా.పుట 89) అని నిర్వచించి నల్లకలువ, తెల్లదమ్మి వంటివి తెలిపారు. ఈయన వికృతి వివేకాన్ని అనుసరించి కర్మధారయ సమాసంలో ఆరువర్ణాలకు మించని తెలుగుపదం సంస్కృత పదంతో సమసిస్తుందని తెలిపారు. అయితే ఈయన కూడా విశేషణం ఉత్తరపదంగా ఉండే సమాసాలను గుర్తించలేదు. ఈయన ‘‘ఉత్తరపదమునకు లోపము వచ్చెనేని ఉత్తరపదలోపి సమాసంబు’’ అని నిర్వచించి వంట బ్రాహ్మణుడు - వంట చేయు - బ్రాహ్మణుడు అని ఉదాహరణలు చూపారు.
వేదం వేంకటరమణశాస్త్రి ‘‘తుల్యంబులగు విభక్తులు కలది సమాస విభక్తికంబు, ఇదియే కర్మధారయంబు.’’ అని విలక్షణంగా నిర్వచించారు. విశేషణమైన ప్రథమాంతపదానికి విశేష్యమైన ప్రథమాంత పదంతోడి సమాసం కర్మధారయ సమాసంగా వివరించి, వాడియమ్ములు, వేఁడికిరణములు మొదలైనవి తెలిపారు. నిర్వచనా విధానంలో కొంత భిన్నత్వాన్ని చూపారు.
చిన్నయసూరి బాలవ్యాకరణంలో కర్మధారయ సమాసమేర్పడే విధానాన్ని తెలిపారు. ‘‘కర్మధారయంబు త్రిక, స్త్రీసమ, ముగంత, ధాతుజ విశేషణ పూర్వపదంబయియుండు" (సమాస 5) అని వివరించారు. కర్మధారయ సమాసమేర్పడాలన్నా పూర్వపదం సూత్రంలో తెల్పిన నాల్గింటిలోనూ ఏదైనా కావాలిగాని తదన్యం కారాదు. ఇదే శబ్దమైత్రి. ఈ నియమం చేత బల్లిదుడుమల్లుఁడు, కావలుఁడు రావణుఁడు వంటివాటికి సమాసం లేదని తెలిపారు. ఈయన విశేషణ పూర్వపద కర్మధారయాన్నే వివరించారు. కాని విశేషణ ఉత్తరపద, విశేషణ ఉభయపద కర్మధారయాలను వివరించలేదు. ‘‘విశేషణంబునకు విశేష్యంబుతోడ సమాసంబు సమానాధికరణంబు నాఁబడు. ఇదియె కర్మధారయంబు నాఁబడు: సరసపువచనము, తెల్ల గుఱ్ఱము.’’ (సమాస 3 వృత్తి) వంటి ఉదాహరణలతో ఈయన నిరూపించారు. మధ్యమపదలోపి సమాసాన్ని ఈయన వివరించలేదు. తెలుగులో కర్మధారయ సమాసం ఏవిధంగా ఏర్పడుతుందో మొదటిసారిగా నిర్దేశించిన ఘనత చిన్నయసూరిదే.
పాపినేని అబ్బాయినాయుడు ఆంధ్రవ్యాకరణ సంగ్రహం (పుట. 70) కర్మధారయ సమాసాన్ని నాలుగు విధాలుగా వర్గీకరించి లక్ష్యాలతో చూపారు. అవి:
1) విశేషణ పూర్వపద కర్మధారయం - తెల్లగుడ్డ.
2) విశేష్యపూర్వపద కర్మధారయం - వైయాకరణఖసూచి.
3) విశేషణోభయపద కర్మధారయం - స్నాతానలిప్తుఁడు, శీతోష్ణం.
4) సంభావనాపూర్వపదకర్మధారయం- ముఖపద్మం. అని వర్గీకరించి వివరించారు.
కందుకూరి వీరేశలింగం సంఖ్యావాచకంకాని విశేషణానికి విశేష్యంతోడ సమాసం కర్మధారయమని వివరించి వీటిని నాలుగు భాగాలుగా వర్గీకరించారు. ఈయన విశేషణ ఉత్తర పద, ఉభయపద కర్మధారయాలను తెలుపలేదు. కాని కర్మధారయను. ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తరపద, అవధారణ పూర్వపద/రూపక సమాసం, మధ్యమ పదలోపి సమాసమని నాలుగు రకాలగా విభజించారు. ఈయన మధ్యమ పదలోపి సమాసానికి ఛాయా ద్రమము,
జవ్వాజి సెట్టిలను ఉదాహరణలుగా చూపారు.
టి. ఆంజనేయశాస్త్రి ‘‘విశేషణ విశేష్యములకు సమాసము కర్మధారయ మనబడును’’ (ఆ.ల.సం.పుట 66) అని నిర్వచించారు. కాని ఈ నిర్వచనం అంత సమర్థనీయంకాదు. అసంపూర్తి నిర్వచనం ఈయన కర్మధారయాన్ని విశేషణ పూర్వపద (నల్లయావు), విశేషణోత్తరపద (రాజశ్రేష్ఠుడు), విశేషణోభయపద (శీతోష్ణము), ఉపమానపూర్వపద (జుంటిమోవి), ఉపమానుత్తరపద (ముఖచంద్రుడు) అని ఐదు భాగాలుగా వర్గీకరించి వివరించారు. కర్మధారయంలో గుణవాచకాలైన తెల్ల, తియ్య మొ॥ వాటికి వికల్పంగా ‘ని’ ఆగమమవుతుందని తెలిపారు. అయితే ఈయన మధ్యమ పదలోప సమాసాన్ని వివరించలేదు.
కేతవరపు వేంకటశాస్త్రి కర్మధారయ సమాసాన్ని తెలిపారుగాని అందులోని భేదాలను వివరించలేదు.
నేలటూరి పార్థసారధి అయ్యంగారు దేశ్యవిశేషణాలు సంస్కృత విశేష్యాలతో చేరి కర్మధారయమేర్పడుతుందని, ఇటువంటి సమాసాలు తరచుగా ఆరువర్ణాలకు మించక ఉంటాయని
ద్వితీయాచార్యుని అనుసరించి తెలిపి వాఁడి మయూఖములు, వేడి పయోధారలు వంటి ఉదాహరణలు చూపారు. సంస్కృత విశేషణాలు దేశ్యపదాలతో సమాసాలు కావని. ‘‘అనేక గుఱ్ఱములు’’, ‘‘అమితకంపు’’ వంటివి తప్పులని ఈయన తెలిపారు. ఈ కర్మధారయ సమాసంలోని విభాగాలను వివరించలేదు.
నాదెళ్ల పురుషోత్తమకవి మాత్రం ‘‘త్రిక - స్త్రీ సమ - ముగంత - ధాతుజన్త - విశేషణ పూర్వపదంబు, విశేషణోభయ పదంబు - విశేష్యపూర్వపదంబు, ఉపమానోత్తరపదంబు, ఉపమాన పూర్వపదంబు - సంభావనా పూర్వపదంబు/రూపకంబు - లుప్త మధ్యమ పదంబని కర్మధారయంబష్ట విధంబులు’’ (పురుషోత్తమ కవీయం పుట 56) అని పూర్వ వ్యాకర్తలందరూ తెలిపిన విషయాలను సమాహారంగా తెలిపారు.
ఆ-ఈ-ఏ అనే సర్వనామాలు త్రికాలని, నల్ల-పెద్ద వంటివి స్త్రీ సమాలని, అందము, సరసము మొదలైనవి ముగంతాలని, వచ్చుచున్న - వచ్చెడు వంటివి ధాతుజ విశేషణాలని తెలిపి వాటిరూప సాధనను చిన్నయ సూరిననుసరించి తెలిపారు.
ఈ. భాష్యకాచార్యులు సమానాధికరణాన్ని రంగయ్య, గోవింద, కాశీపతుల సంభాషణా రూపంలో సవివరంగా వివరించారు. ‘‘రెండు పదములను సమానమైన యాధారమును (ఒకే యాధారము) పొంది యుండుట. ఇదియును కర్మధారయము, ద్విగువు. అని రెండు విధములగుచున్నది.’’ (ఆం.భా.సు. పుట.72). అని తెలిపి కర్మధారయాన్ని విశేషణ పూర్వపద, విశేషణోభయపద, ఉపమాన పూర్వపద, ఉపమానోత్తర పద, సంభావనాపూర్వపద, అవధారణ పూర్వపద, భిన్నపూర్వపద, భిన్నోత్తర పద, లుప్త మధ్యమ పద, త్రిక పూర్వమని పదకుండు విధాలుగా పూర్వవ్యాకర్తలకు భిన్నంగా చూపారు. ఈయన విశేషణ పూర్వపదంలో కొన్ని నామాది సంజ్ఞావాచకాలైనప్పుడు పూర్వపదంలోని అకారానికి ఇకారం, ఒక్కొక్క సమయాలలో న, ప, మ, య అనే వర్ణాలు ఆదేశంగాను వస్తాయని తెలిపి ఉదాహరణగా ‘‘రామిశెట్టి’’ చూపారు. ఇక్కడ రామ అనే దానిలో మకారంలోని అకారం ఇకారంగా మారింది.
మధ్యనుండే పదం లోపించడం లుప్తపద మధ్యమ సమాసమని తెలిపి గాజుల సెట్టి, శివబ్రాహ్మణుడు వంటి ఉదాహరణలు చూపారు. కర్మధారయ సమాసంలో వేరొకభాగంగా త్రికపూర్వక సమాసమని ప్రత్యేకంగా తెలిపి లక్ష్యాలతో నిరూపించారు. పూర్వవ్యాకర్తలు త్రికపూర్వక సమాసాన్ని ప్రత్యేకంగా చూపలేదు.
ప్రౌఢవ్యాకర్త చిన్నయసూరి తెలుపని విశేష్యపూర్వపద కర్మధారయాన్ని ‘‘తమ్ముఁగుఱ్ఱలు, చిలుక మొకరి యిత్యాదులు విశేష్య పూర్వపద కర్మధారయంబులు’’ (ప్రౌ.వ్యా.సమాస 16) అని తెలిపారు. ‘‘తమ్ముఁగుఱ్ఱలు’’లో తమ్ముఁడు డుమంతం కాబట్టి బాలవ్యాకరణం వివరించదు. వికృతి వివేకాన్ని ఆధారంగా చేసుకొని బిరుదాది ఉత్తరపదాలతోకూడిన మనుష్య నామాలను కర్మధారయాలుగా పరిగణిస్తూ ‘‘కొన్నియెడల నిచ్చోననా పామాయాగమంబులగు’’ (ప్రౌ.వ్యా.సమాస 4) అని తెలిపారు. కర్మధారయ సమాసంలో బిరుదు మొదలైనవి ఉత్తరపదాలుగా ఉంటే, పరపదానికి అన, అప, అమ, అయ అనేవి ఆగమాలుగా వస్తాయని వివరించారు. ఈయన క్రొంబలుకలు, ముంగోపము, వింజామరము, నెమ్మనము వంటి మిశ్రకర్మధారయాలను (సమాస 7) సప్రయోగాలుగా చూపారు. ‘‘చదువునట్లు, పోయినయట్లు’’ అనే రీతిలో ధాతుజవిశేషణాలు, తథార్థకావ్యయంతో సమసించి కర్మధారయమవ్వడం ఈయన తెలిపారు.
‘‘ఒకానొకచో గుణవాచక ధాతుజ విశేషణంబు లవయవ విశేష్య పూర్వకంబులై యవయవితో సమసించెడి’’ (ప్రౌ.వ్యా.సమాస 15) అని గుణవాచకాలు, ధాతుజవిశేషణాలు, అవయవ విశేష్య పూర్వకాలై అవయవితో సమసించడం నిరూపించారు. ఇవి కొన్ని అవ్యవహితాలుగా ప్రయుక్తమవ్వడం మొదలైన అనేక విశేషాంశాలను తన పరిశీలనా ఫలితంగా నిరూపిస్తూ ‘‘కొన్నియెడల విశేషణోభయపదంబులు త్రిక క్రియాజన్య విశేషణ ఘటితంబులు సందర్భయోగ్య పదవ్యవహితంబులగు ’’ (ప్రౌ.వ్యా.సమాస 18) అని తెలిపారు. ఈయన మధ్యమ పదలోపిసమాసాన్ని వివరించలేదు.
కో. వేంకటకృష్ణమాచార్యులు త్రిక క్రియాజన్య విశేషణ ఘటితాలైన కొన్ని విశేషణోభయపదాలు సందర్భయోగ్య పదవ్యవహితాలవుతాయని తెలిపారు. ఈయన ‘‘ఒకచో ధాతుజగుణవాచక విశేషణములవయవ విశేష్యపూర్వకంబులయి యవయవితో సమసించును’’ (స.మ.వ్యా.పుట 94) అని తెలిపి తనువు మీన్పొలవల్చు జాలరిదాన. అని లక్ష్యాన్ని చూపారు. జాలరిది అవయవి, వల్చుధాతుజ విశేషణం, తనువు అవయవం. విశేష్యం పూర్వంగా ఉన్నది. మీన్పొలవల్చు - తనువుగల జాలరిదాన, అని అర్థం.
మల్లాది సూర్యనారాయణశాస్త్రి ఆంధ్రభాషానుశాసనం (పుట 209) లో కర్మధారయ సమాసాన్ని సమానాధికరణం, వ్యధికరణమని వర్గీకరించి వివరించారు. ఈయన గుణవాచకమైన కమ్మ శబ్దానికి కొన్ని పరుషాది శబ్దాలు పరమైనప్పుడు నకారం ఆగమంగా వస్తుందని తెలిపారు. ఈయన మధ్యమ పద లోపి సమాసాన్ని అనేక లక్ష్యాలతో విశేషంగా తెలిపారు. సమాసంలోని పూర్వపదంలోని బహువచన‘‘లు’’ వర్ణకఉకారం అకారమవుతుందని గాజులసెట్టి వంటి ఉదాహరణలరూపసాధన చేశారు.
కర్మధారయ సమాసాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విభజించారు. కొంతమంది ఎనిమిది, కొంతమంది పది, కొంతమంది ఆరుగా విభాగించగా, ఈ భాష్యకాచార్యులు పదకుండు విభాగాలను కర్మధారయ సమాసంలో చూపారు. చిన్నయసూరి, ప్రౌఢవ్యాకర్తలు మధ్యమ పదలోప సమాసాన్ని తెలపక పోవడం విచార్యం.
4.3 ద్విగుసమాసం:
‘‘సంఖ్యాపూర్వో ద్విగుః’’5 ‘‘ద్విగురేకవచనమ్’’6 అని పాణినీయం, ద్విగుసమాసం తత్పురుషలోని భేదం.
ఆంధ్రశబ్ద చింతామణిలో ‘‘ద్విగు కర్మధారయౌ’’-(హలన్త 16) అని ఈ ద్విగు సంజ్ఞ మొదటిసారిగా కనిపిస్తుంది. కాని ఇందులో లక్షణం వివరించలేదు. ద్వితీయాచార్యుడు,
‘‘ద్విగోరమిశ్రతాయాంతు ప్రాయ ఏకత్వ మిష్యతే
మిశ్రతాయాం బహుత్వం స్యా దన్యత్రాపి క్వచిద్భవేత్’’ (వి.వి.హలన్త 16) అని తెలిపారు. అనగా ఆచ్ఛికమైన ద్విగు సమాసం తఱచుగా ఏకవచనంలో ఉంటుంది. సాంస్కృతిక ద్విగువు ఒకానొకచో ఏకవచనంలో ఉంటుందని విశేషించి తెలిపారు.
పుదూరి సీతారామశాస్త్రి ప్రశ్నోత్తరాంధ్రవ్యాకరణం (పుట 52)లో ద్విగు సమాసాలెన్ని? అనే ప్రశ్నకు సమాధానంగా (1)ఏకవచనాంత ద్విగువు (2) బహువచనాంత ద్విగువని రెండు రకాలుగా తెలిపి, ఉదాహరణలుగా ఏకవచనాంత ద్విగువులకు ఇరుదెస, ఇరువంక, ముచ్చిచ్చు వంటివి: బహువచనాంత ద్విగువులకు ముజ్జగంబులు, ముల్లోకంబులు వంటివి తెలిపారు.ఈ విషయంలో చింతామణికారుని అనుసరించలేదు. పుదూరిసీతారామశాస్త్రి ‘‘ద్విగువు మొదలగునవి కర్మధారయ విశేషంబులు’’ అని తెలిపి ముచ్చిచ్చు వంటి ఉదాహరణలే చూపారు గాని లక్షణాన్ని వివరించలేదు
రావిపాటి గురుమూరిత శాస్త్రి పాణిని అనుసరించి సంఖ్యావాచక శబ్దం పూర్వ పదంగా ఉండేది ద్విగు సమాసం అని తెలిపి ఇరుగడ, ఇరువంక, ముల్లోకంబులు వంటి ఉదాహరణలు చూపారు.
చిన్నయసూరి ‘‘ద్విగువున కేకవచనంబు ప్రాయికంబుగానగు, మిశ్రంబునకుఁగాదు’’ అని వికృతివివేకంలోని
‘‘ద్విగోరమిశ్రతాయాంతు ప్రాయ ఏకత్వ మిష్యతే
మిశ్రతాయాం బహుత్వం స్యాదన్యత్రాపి క్వచిద్భవేత్’’ (వి.వి.హలన్త 16) అనే సూత్రాన్ననుసరించి తెలిపారు. మిశ్రద్విగువేకవచనాంతం కాదని సూరి పేరొన్నానల్దిక్కు, ముల్లోకము వంటివి లేకపోలేదు. అందువలనే వికృతి వివేకకర్త ‘‘అన్యత్రాపి క్వచిద్భవేత్ ’’అని సవరించుకున్నారు.
కందుకూరి వీరేశలింగం సమానాధికరణంలో సంఖ్యావాచకం పూర్వపదంగా కలదని తెలిపారు. మిశ్రమ ద్విగువుని తెల్పలేదు. కేతవరపు వేంకటశాస్త్రి సమాస ప్రకరణంలో ద్విగు సమాసాన్ని ప్రస్తావించలేదు.
టి.ఆంజనేయ శాస్త్రి, ఈ భాష్యకాచార్యులు, నేలటూరి పార్థసారధి అయ్యంగారు పూర్వవ్యాకర్తలననుసరించి తెలిపారు. కొత్తదనంలేదు.
నాదెండ్ల పురుషోత్తమకవి ‘‘ద్విగువని కర్మధారయంబని సమానాధికరణంబు ద్వివిధంబు’’ (పురుషోత్తమ కవీయం పుట 56) అని తెలిపి సంఖ్యాపూర్వ పదం ద్విగువని తెలిపి ఏకవద్భావి, అనేక వద్భావి అని ద్విగువును రెండు విధాలుగా తెలిపారు.
ప్రౌఢవ్యాకర్త ‘‘ఒక్కచో ద్విగువు మిశ్రం బేక వచనాంతంగున’’ని (ప్రౌ.వ్యా.సమాస 20) తెలిపి నల్దిక్కు, ముల్లోకము అనీ, మహదర్థ ఘటితమైన ద్విగువు కనిపించదని తెలిపారు.
మల్లాది సూర్యనారాయణశాస్త్రి ‘‘అకారాంతములైన సాంస్కృతిక సమాహార ద్విగువుల తుదియచ్చునకు ఈకారము వచ్చును. అది తెలుఁగున హ్రస్వమగును’’ (ఆ.భా.శా.పుట 209) అని తెలిపి త్రిలోకి, పంచవటి వంటి సాంస్కృతిక ద్విగువులను తెల్పారు. సాంస్కృతిక సమాహార ద్విగువులేక వచనాలని, ఆచ్ఛిక ద్విగువులు బహుళంగా ఏకవచనాలని, మిశ్రమ ద్విగువులు కూడా బహుళంగా ఏకవచనాలని తెలిపి నిరూపించారు.
కో. వేంకటకృష్ణమాచార్యులు సరళమహా వ్యాకరణం (పుట 95) లో ‘‘సంఖ్యాపూర్వ పదకర్మ ధారయము ద్విగువు’’ అని నిర్వచించి ‘‘ద్విగువు - తద్ధి తార్థోత్తర పద సమాహార ద్విగువులని త్రివిధము.’’ అని వివరించారు. వీటిని
(1) తద్ధితార్థ ద్విగువు: తద్ధిత ప్రత్యయాలు చేర్చడానికి చేసిన ద్విగువు.
ఉదా: షాణ్మాతురుఁడు, ద్వైమాతురుఁడు మొ॥
(2) ఉత్తర పద ద్విగువు: ఉత్తర పదం పరంగా ఉండగా వచ్చే ద్విగువు.
ఉదా: పంచగవధనుడు.
(3) సమాహార ద్విగువు: సమాహార మని యర్థమిందులో వస్తుంది.
ఉదా: త్రిలోకి, శతగ్రంధి, మొ॥ అని విశేషంగా వివరించారు.
సూరి ‘‘ద్విగువునకేకవచనంబు ప్రాయికంబుగానగు మిశ్రంబునకుఁగాదని’ తెలిపినా, మిశ్రద్విగు వేకవచనాంతం కాదని సూరి పేర్కొన్నా ‘‘నల్దిక్కు’’ ‘‘ముల్లోకము’’ వంటివి లేకపోలేదు. అందుచేతనే వికృతి వివేక కర్త ‘‘అన్య త్రాపి క్వచిద్భవేత్త’’ని సవరించుకున్నారు.
4.4 ద్వంద్వ సమాసం:
ఉభయపదార్థ ప్రధానం ద్వంద్వ (సమాసం). పాణిని ‘‘చార్థేద్వన్ద్వః’’7 అన్నారు. ఆంధ్రశబ్ద చింతామణిలో ‘‘తత్పురుషద్వన్ద్వౌ బహువ్రీహిః’’8 అని తత్పురుష తరువాత ద్వంద్వాన్ని తెలిపారు. ప్రథమాచార్యుడు ద్వంద్వసమాసంలోని ఋకారానికి కొన్ని చోట్ల రేఫ వస్తుందని తెలుపుతూ ‘‘ఉర్ద్వం ద్వేరః క్వచిత్’’ (ఆం.శ.చిం.అజన్త 16) అన్నారు. ఉదా: మాత్రపితలు, పిత్రపుత్రులు. అయితే ద్వితీయాచార్యుడు ‘‘అనఙ్ స్యాద్రుతో ద్వంద్వే రేఫ శ్శౌరి కవేర్మతః’’9 అని తెలిపారు. అనగా సంస్కృతోక్తమైన ఆనఙ్ ఆదేశం వచ్చేటప్పుడే ఈ రేఫ కల్గుతుందని, శౌరికవి అభిప్రాయంగా తెలిపారు. ఇంకా ద్వంద్వకు సంబంధించి విశేషాంశాలను తెలిపారు. అవి ‘‘ద్వంద్వే తుస్త్రీవ దిష్టస్స్యాద్భవే ద్రూపం మునాపిచ’’ (వి.వి.అజన్త85) అనగా వర్ణాలకు సంబంధించిన ద్వంద్వ సమాసంలో స్త్రీ నపుంసక రూపాలు రెండూ వస్తాయని (చజలు, చజములు) తెలిపారు.
పుదూరి సీతారామశాస్త్రి తల్లిదండ్రులు, అన్నదమ్ములు వంటి ఉదాహరణలు ద్వంద్వ సమాసానికి ఇచ్చారు కాని, నిర్వచనాన్ని ఇవ్వలేదు. ఈయన ప్రథమాచార్యుని అనుసరించి ‘‘మాత్రపితృభావము అనునిది మొదలగు ద్వంద్వ సమాసములందు పూర్వ పదాంతమునందున్న ఋకారమునకు వచ్చును.’’ (ప.వ్యా.పుట 52) అని తెల్పారు. ద్వితీయాచార్యుని అభిప్రాయాలను స్పృశించలేదు.
రావిపాటి గురుమూర్తి శాస్త్రి ‘‘పూర్వోత్తరపదంబులు భిన్నార్థకంబులై పరస్పరాన్వయమ్ము లేని వయ్యెనేని ద్వంద్వసమాసంబు’’ అని నిర్వచించి ఉదాహరణలు చూపారు. ద్వంద్వ సమాస భేదాలను తెల్పలేదు.
వేదం వేంకటరమణశాస్త్రి ‘‘విశేష్యంబులగు ప్రథమాంతపదముల సమాసము ద్వంద్వంబగు’’ (ల.వ్యా.పుట 42) అని విశేష్యాలు అవి ప్రథమాంత పదాలే ద్వంద్వలో ఉంటాయని నిర్ధారించారు.
చిన్నయ సూరి లఘువ్యాకర్త తెలిపిన నిర్వచనాన్ని ఖండించారు. విశేష్యాలైన ప్రథమాంతపదాలంటే ‘‘మగడుబిడ్డలు’’ అనే సమాసమేర్పడడానికి అవకాశం ఉంది. అందు వలన చిన్నయసూరి ద్వంద్వ సమాసమునందు పూర్వ పదం తప్పక స్త్రీ సమమై ఉండాలని, ఉత్తర పదం ఆచ్ఛిక శబ్దమై ఉన్నా చాలన్న అభిప్రాయంతో ‘‘ఆచ్ఛిక శబ్దంబుతోడ స్త్రీ సమంబు ప్రాయికంబుగా ద్వంద్వంబగు’’ (బా.వ్యా.సమాస 7) అని తెలిపారు. ద్వంద్వ సమాస నిర్మాణమిందులో నిరూపించారు. ఈ సూత్ర రచనలో పాణి నీయ నియమం పాటించబడింది . ‘‘ప్రథమానిర్ధిష్టం సమాస ఉపసర్జనమ్’’ (పా. 1-4-43) అనగా సమాస విధాయక శాస్త్రంలో ప్రథమాంతరంగా ఉచ్చరింపబడేది. ఉపసంజ్ఞ కలిగింది అవుతుంది. ఈ నియమాన్ని బట్టి ‘‘స్త్రీ సమంబు’’ ఉపసర్జన సంజ్ఞకలదై, పూర్వమందు ప్రయోగించబడుతుంది. అందువలన పూర్వపదం స్త్రీసమం, ఉత్తర పదం ఆచ్ఛికం అవుతుంది. ఈయన మిశ్రద్వంద్వ సమాసాదులను ప్రస్తావించలేదు.
పాపినేని అబ్బాయినాయుడు ‘‘ద్వంద్వంబననుభయ పదార్థంబు ప్రధానంబుగాఁగలది’’ (ఆం.వ్యా.సం.పుట 71) అని నిర్వచించి, ద్వంద్వాన్ని రెండు విధాలుగా తెలిపారు. 1) ఇతరేతర యోగద్వంద్వం, 2) సమాహార ద్వంద్వం. అని తెలిపి ఇది మరల ద్విపదమని, బహుపదమని రెండు విధాలుగా వింగడిరచారు. అనగా మొత్తం నాలుగు.
1) ద్విపదేతరేతర యోగ ద్వంద్వం ఉదా: రామలక్ష్మణులు.
2) బహుపదేతరేతర యోగ ద్వంద్వం ఉదా: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు.
3) ద్విపద సమాహార ద్వంద్వం. ఉదా: పాణిపాదము.
4) బహుపద సమాహార ద్వంద్వం. ఉదా: రధగజతురగము.
ఈ విధంగా ఈయన విశేషంగా వివరించారు.
కందుకూరి వీరేశలింగం, టి.ఆంజనేయశాస్త్రి, నేలటూరి పార్థసారధి, కేతవరపు వేంకట శాస్త్రి కేవలం నిర్వచనాన్నిచ్చి ఉదాహరణలు చూపారు.
ఈ.భాష్యకాచార్యులు ఆంధ్రభాషా సుబోధిని (పుట 74)లో ‘‘పదములు రెండుగాని యంతకు మించునవికాని సముచ్చయార్థము కలవై సమసించుట ద్వంద్వము’’ అని భిన్నంగా నిర్వచించి ఇవి ఉభయ పదార్థ ప్రధానమని తెలిపారు. ఈయన 1) ఇతరేతర యోగ ద్వంద్వం. 2) సమాహార ద్వంద్వం. 3)ఏకశేష ద్వంద్వమని తెలిపారు.
పాపినేని అబ్బాయినాయుడు ఇతరేతరద్వంద్వం, సమాహార ద్వంద్వాలనే తెలిపితే ఈయన అదనంగా ఏకశేష ద్వంద్వాన్ని వివరించారు. అబ్బాయినాయుడు వాటికి ఉదాహరణలే చూపగా ఈయన సమగ్ర నిర్వచనాలతో నిరూపించారు. ‘‘ప్రత్యేకాన్వయము గల్గినచో నితరేతరయోగ ద్వంద్వము’’ (రామలక్ష్మణులు), సమాహార ద్వంద్వం - ‘‘చెదిరిన వస్తువులు ఒక దిక్కునఁ గూర్చుట - సమాహారము’’ అని తెలిపి వేరువేరు పదాల చేరిక అని కాలుసేయివంటి ఉదాహరణలిచ్చారు. ఏక శేషద్వంద్వం - ‘‘ఒకే విధములగు ననేక పదములొక్కటిగా సమసించిన నందొక్క శబ్దము మాత్రమే నిలిచి యుండుట. ఇది బహువచనాంతముగనే యుండును.’’ అని తెలిపి ఏక శేషద్వంద్వాన్ని సరూపైక శేషం, విరూపైక శేషంగా తిరిగి వర్గీకరించారు.
ఈయన ద్వంద్వంలో 1) ఋకారాంత పదాలకు రేఫంగాని, దీర్ఘంగాని విభాషగా వస్తుందని, 2) మహద్వాచక ద్వంద్వంలో పూర్వపదం చివర ఉండే అచ్చుకు దీర్ఘం ఒక్కొక్క సమయాల్లో కనిపిస్తుందని (తల్లీదండ్రులు), 3) కొన్ని సమయాల్లో పూర్వపద ‘ము’ వర్ణకం - ట వర్ణం లోపిస్తాయని, (అందచందాలు, ఔట కామి ఔగాములు), 4) జడవాచకాలైన ద్వంద్వాలు ఏక వచనాంతాలవుతాయని (కూరగాయ, కూరగాయలు), తెలిపారు.
ఈయన ద్వంద్వ విషయంలో ఆంధ్రశబ్ద చింతామణి, వికృతి వివేకం, బాల వ్యాకరణం, ఇతర వ్యాకరణాల సారాంశాన్ని తన వ్యాకరణంలో ఇమిడ్చినట్టు రూపసాధన చేశారు.
ప్రౌఢవ్యాకర్త ‘‘కొన్ని యెడల మహద్ద్వంద్వంబునం బూర్వపదాంత్య స్వరంబునకు దీర్ఘంబునుంజూపట్టెడు’’ (ప్రౌ.వ్యా.సమాస 28) అని తెలిపారు. బాల వ్యాకర్త ద్వంద్వ సమాసంలో పూర్వపదం స్త్రీవాచకంగానూ, రెండవపదం ఆచ్ఛికంగాను ఉండాలన్నారు. కాని కొన్ని చోట్ల మహద్వాచక శబ్దం పూర్వపదంగా ఉందని ప్రౌఢవ్యాకర్త తెలిపారు. ‘‘అన్నాదమ్ములు’’ లోని ‘‘అన్న’’ మహద్వాచకం. ప్రౌఢవ్యాకర్త ‘‘ఒకానొకచోద్వంద్వంబునం బూర్వపదంబు క్లీబసమంబగు, అగుచో ‘‘నా, ము’’ వర్ణకంబునకు లోపంబగు’’ (ప్రౌ.వ్యా.సమాస 29) అని తెలిపి అందచందములు, వంటి ఉదాహరణలిచ్చారు. కాని అద్దం దువ్వెన, పొలము పుట్ర వంటి వాటిలో ‘ము’ వర్ణలోపంరాదు.
ఈయన ‘‘ద్వంద్వంబ ప్రాణివాచక కృదంత శబ్ద ఘటితం బేకవచనాంతంబునగు’’ (ప్రౌ.వ్యా.సమాస 30) అని తెలిపారు. బాలవ్యాకర్త ద్వంద్వ సమాసంలో పూర్వపదం స్త్రీ సమంగాను, రెండవ పదం ఆచ్ఛిక పదంగాను ఉంటుందన్నారు. కాని కొన్నిచోట్ల అప్రాణివాచకాలు అంటే కూడుగుడ్డ, కూరగాయ మొదలైనవాటిలోను, కృదంతమైన ‘‘తాఁకుదగులు’’ అనే దానిలోను ఏకవచనాంతాలుగా (సమాస 32) చెప్పారు. కాని బాల వ్యాకర్త ద్వంద్వంలో అన్నీ బహువచనంగానే చెప్పారు. ఇంకా ద్వంద్వంలో పూర్వపద అంత్య అవయవానికి లోపం వస్తుందని పుట్టు క్రుంకుగట్లు (పుట్టగట్టు క్రుంకుగట్ల) వంటి రూపాలతో విశేషంగా వివరించారు.
కో. వేంకట కృష్ణమాచార్యులు సరళమహావ్యాకరణం (పుట 71, 72)లో పూర్వ వ్యాకర్తలు చెప్పిన విషయాలనన్నింటిని ఇముడ్చుకొని విశేషవివరణ చేశారు. ‘‘అనేక శబ్దాల సముచ్చయార్థమున సమసించిన ద్వంద్వ సమాసము’’ అని సూత్రించి 1) ఇతరేతయోగ ద్వంద్వం, 2) సమాహారద్వంద్వం, 3) ఏకశేష సమాసమని వర్గీకరించి, మరళా ఏకశేషసరూపైక శేషం, ఏకశేష విరూపైక శేషమని వర్గీకరించారు. మరళ
(అ) ‘‘పరినిష్ఠిత విభక్తి తోడను ద్వంద్వము కలదు.’’ అని తెలిపి సూనుల పుత్రుల కంటె
అని తెల్పారు. ఇక్కడ సూనుల కంటెను పుత్రుల కంటెను అని అర్థం. ఇంకా
(ఆ) ‘‘ద్వంద్వాంత్య పదము ప్రత్యేకముగ నన్వయించును’’ అని తెలిపి కుజనసజ్జనుల మైత్రి అని ఉదహరించారు. ఇక్కడ కుజనమైత్రి సజ్జన మైత్రి అని అభిప్రాయం. ఈయన మిశ్రద్వంద్వను తెలిపి - అవసరమ క్కఱలు అని ఉదాహరణ చూపారు. ఇంకా బాల ప్రౌఢవ్యాకరణాలలో తెలిసిన పూర్వపద అంత్య స్వరానికి దీర్ఘం, భావద్వంద్వంలో పూర్వ పదాంత వర్ణానికి లోపం, పూర్వపదాంత్య ము వర్ణక లోపం, ఋకారానికి రేఫ విభాషగా రావడాన్ని తెల్పారు. ఈయన విద్యార్థుల సౌలభ్యం కోసం చివర ప్రశ్నలను కూడా ఇచ్చారు. ద్వంద్వంగురించి పూర్వ వ్యాకరణాల సారాన్ని విశేషంగా వివరించారు.
4.5 బహువ్రీహి సమాసం:
‘‘అన్యపదార్థ ప్రధానం బహువ్రీహి’’. విశేషణ, విశేష్యాల సమ్మేళనం చేతనే ఈ సమాసమేర్పడుతుంది. ప్రథమాచార్యుడు,
‘‘ద్వగు కర్మథారయౌ తత్పురుష ద్వన్ద్వౌ బహువ్రీహిః’’10 అని బహువ్రీహి సమాసాన్ని తెలిపారేగాని వివరించలేదు. ద్వితీయాచార్యుడు ‘‘స్యాదాభాష బహువ్రీహిః ప్రథమాది ప్రయోగతః’’11 అని ‘‘అభాస బహువ్రీహి సమాసాన్ని’’ కొత్తగా పేర్కొన్నారు.
ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణంలో బహువ్రీహికి ఉదాహరణలుగా అలరు విల్తుడు, కిమ్మ విల్తుఁడు, ముక్కంటి వంటివాటిని తెలిపారేగాని నిర్వచించలేదు.
రావిపాటి గురుమూర్తి శాస్త్రి ‘‘సమాసంబునందున్న పదంబులు ఆశబ్దార్థముల గలదానిఁజెప్పిన నేని బహువ్రీహి సమాసంబు’’ (తె.వ్యా.పుట 89) అని తెలిపి ముక్కంటి - తమ్మికంటి వంటి ఉదాహరణలిచ్చారు. ఈయన ప్రకారం పీతాంబరుడు అన్నప్పుడు ఎర్రని వస్త్రం ధరించిన వారందరూ పీతాంబరులే.
వేదం వేంకటరమణశాస్త్రి లఘువ్యాకరణం (పుట 42)లో ‘‘అన్యపదార్థబోధకంబగు ప్రథమాంతము గల సమాసము బహువ్రీహియగు’’ అని నిర్వచించారు. దీనికి ముక్కంటి, చలివెలుగు వంటి ఉదాహరణలిచ్చారు. అయితే ఇందులో బహువ్రీహి సమాసం ఏవిధంగా ఏర్పడుతుందో స్పష్టపరచలేదు. ఈ లోటు తీరుస్తూ చిన్నయసూరి ‘‘స్త్రీ సమఘటితంబయొకానొకండు బహువ్రీహి చూపట్టెడు’’ (బాల వ్యాకరణము .సమాస 6) అని తెలిపారు. ఈయన ముక్కంటి, వేగంటి, చలివెలుగు, వేవెలుగు, మోటబరి వంటి ఉదాహరణలు తెలిపారు. చిన్నయసూరి వివరించిన ఐదు ఉదాహరణలు ప్రక్రియానుసారంగా సాధించవచ్చు. అయితే పూర్వవ్యాకర్తలు, ఈయన తెలిపిన ‘‘చలివెలుఁగు’’ వంటివి కర్మధారయ సమాసాలనిపిస్తాయి. కాని చల్లని వెలుఁగు కలవాడు - చంద్రుడు అంటే మాత్రం బహువ్రీహి అవుతుంది.
పాపినేని అబ్బాయినాయుడు ‘‘బహువ్రీహియన నన్య పదార్థప్రధానంబుగాఁగలది’’ (ఆం.వ్యా.సం.పుట.71), అని నిర్వచించి ఈయన 1) ద్విపదబహువ్రీహి - ముక్కంటి, 2) బహుపదబహువ్రీహి - దివ్యసుందర విగ్రహుఁడు, 3) సంఖ్యోత్తర బహువ్రీహి - ఉదదశలు, 4) సంభ్యోభయ బహువ్రీహి - పండ్రెండార్లు, 5) సహపూర్వ బహువ్రీహి - సపుత్రుఁడు, 6) వ్యతిహార బహువ్రీహి - శిస్త్రాస్త్రి, 7) దిగంతరాళ బహువ్రీహి - దక్షిణ పూర్వము. అని సప్తవిధ బహువ్రీహి సమాసాలను విశేషంగా పేర్కొన్నారు.
కందుకూరి వీరేశలింగం ఇతరపదార్థం ప్రధానంగా కలది బహువ్రీహి అని తెలిపి, శీతకిరణుఁడు, చలివెలుఁగ’’లను ఉదాహరణగా చూపారు. బహువ్రీహి సమాస విభజన చేయలేదు.
టి. ఆంజనేయశాస్త్రి ఆంధ్రలక్షణ సంగ్రహం (పుట 67) లో రెండు పదాల అర్థం ముఖ్యంకాక సమాసమంతా మరొక వస్తువును భోదిస్తే అది బహువ్రీహి అని తెలిపి, ముక్కంటి, నలువ, సీతాజాని, పూవుబోడి వంటి ఉదాహరణలిచ్చారు. ఈయన ఉదాహరణలివ్వడంలో భిన్నత్వం చూపారు. సీతాజాని పూర్వవ్యాకర్తలు చూపలేదు. పూవుబోడి అన్నారేగాని ఇందులో అరసున్న ఎందుచేతనో చేర్చలేదు. సీత జాయగాగలవాడు సీతాజాని, పూవు వంటి మేను కలది పూవు బోడి, కన్ను - ‘‘కంటి’’, ‘‘వాయి-వ’’ అయినట్లు బహువ్రీహి చివర విలక్షణ ప్రత్యయాలు కనబడతాయని ఈయన గుర్తించారు.
నాదెళ్ల పురుషోత్తమకవి బహువ్రీహిని ద్విపద, బహుపద, నియత ద్విపదలని మూడు రకాలుగా వర్గీకరించారు. తిరిగి ద్విపద బహువ్రీహి, బహు పదబహువ్రీహి ద్వితీయా, తృతీయా, చతుర్థీ, పంచమీ, షష్ఠి, సప్తములని షడ్విధాలుగా వర్గీకరించారు. అనగా మొత్తం నియత బహు వ్రీహితో 13 విధాల బహు వ్రీహులను వివరించారు. వీటిని ఉదాహరణలతో విశేషంగా నిరూపించారు. ‘‘బహువ్రీహిని స్త్రీ వాచ్యంబగుచో నుసమాసంబు మీఁదియేను నకుంబోడియగును. అలరుబోడి, మెఱుఁగుబోడి - తలిరుబోడి’’ అని చిన్నయ సూరిని అనుసరించి తెలిపారు. బహువ్రీహిలో సిద్ధ సాంస్కృతికాలు, ఆచ్ఛికాలు మాత్రమే కనిపిస్తాయని తెలిపి, కరకంఠుఁడు మొదలైన మిశ్రమాలు గ్రామ్యాలని తెలియజేశారు.
నేలటూరి పార్థసారధి అయ్యంగారు, కేతవరపు వేంకటశాస్త్రి పూర్వ వ్యాకర్తల ననుసరించి నిర్వచించారు, కాని మిగిలిన అంశాలను స్పృశించలేదు.
ఈ భాష్యకాచార్యులు ఆంధ్రభాషా సుబోధిని (పుటలు 77, 78)లో అన్య పదార్థ ప్రధానమైనది బహువ్రీహి అని తెలిపి, (1) ద్విపద బహువ్రీహి, (2) బహుపద బహువ్రీహి, (3) వ్యధికరణ బాహువ్రీహి, (4) వికార బహువ్రీహి, (5) అభాస బహువ్రీహి, (6) వికల్ప బహువ్రీహి, (7) సామీప్య బహువ్రీహి, (8) దిగంతరాళ బహువ్రీహి, (9) వ్యతీహార లక్షణ బహువ్రీహి, (10) సమసంబంధ బహువ్రీహి, (11) ఉపమాన పూర్వపద బహువ్రీహి, (12) విశేష్యపూర్వ బహువ్రీహి,(13) నఞ్ బహువ్రీహి, (14) ప్రాది బహువ్రీహి అని పద్నాలుగు రకాల బహువ్రీహులనువివరించారు.
ద్విపద బహువ్రీహిని తిరిగి ద్వితీయా, తృతీయా, చతుర్థీ, పంచమీ, షష్ఠీ, సప్తమీ, క్రియా విశేషణ బహువ్రీహులని ఏడు రకాలుగా వర్గీకరించి ఉదాహరణలతో అనన్య సామాన్యంగా నిరూపించారు.
ప్రౌఢవ్యాకర్త ‘‘కఱకంఠుఁడు బహువ్రీహి’’ (ప్రౌ .వ్యా.సమాస 27) అని తెలిపారు.అహోబలపతి మిశ్రబహు వ్రీహి అనడాన్ని విభేదించారు. గరకంఠ సమాస భవనమని తెలియజేశారు. బాలవ్యాకర్త దీనిని ‘‘ఆర్య వ్యవహారంబుల దృష్టంబుగ్రాహ్యంబు’’ అనే సూత్రంలో కరకంఠుఁడు మిశ్రమంగా తెలిపారు. దీనిని ఖండిస్తూ ప్రౌఢవ్యాకర్త ‘‘గరకంఠ’’ అనే సంస్కృతం నుండి పుట్టింది కాబట్టి ‘‘కఱకంఠ’’ తద్భవమని తెలిపారు. కావున దీనిని బహువ్రీహి సమాసంగా చూపడం సమర్థనీయం.
కో. వేంకట కృష్ణమాచార్యులు సరళమహావ్యాకరణం (పుట 98,99)లో మొత్తం పదిరకాల బహు వ్రీహులను తెలిపారు. అవి 1)సమానాధికరణ, 2)వ్యధికరణ, 3)నఞ్, 4)సహపూర్వ పద, 5) సంఖ్యోభయ పద, 6) ద్విగు, 7) దిగంతరాళ, 8) వ్యతిహార లక్షణ, 9) ప్రాది, 10) ఉపమాన బహు వ్రీహులని తెలిపి పదాల సంఖ్యను బట్టి ద్విపద బహుపద బహువ్రీహులుగా తెలిపారు. సమానాధికరణ బహువ్రీహిని పూర్వ వ్యాకర్తలను బట్టి ద్వితీయా నుండి సప్తమీ బహువ్రీహి అని, క్రియా విశేషణ బహువ్రీహి అని తెలిపారు. ఇంకా వ్యధికరణ బహువ్రీహిని కూడా పంచమీ, షష్ఠీ, సప్తమీ వ్యధికరణ బహు వ్రీహులుగా చూపారు. ఈయన స్త్రీ సమఘటితమైన ఒకానొక బహువ్రీహి తెలుగులో ఉంటుందని ముక్కంటి, చలివెల్గులను తెల్పారు. అలాగే బహువ్రీహిలో సమాసాంత కార్యాలను చూపారు. ఉదా: ముక్కంటి - ఇక్కడ టింట్యాదేశం. బహువ్రీహి స్త్రీ వాచ్యమైనప్పుడు ఉపమానానికి ‘‘నుగాగమం, మేనుకుఁబోడియు నగును’’ అని పూర్వ వ్యాకర్తలననుసరించి నిర్దేశించారు. ఈయన పూర్వ వ్యాకర్తలందరూ తెలిపిన విషయాలను సమాహారంగా వివరించడం ప్రశంసనీయం.
మల్లాది సూర్యనారాయణకూడా ఈ విధంగానే వర్గీకరించారు. ఈ విధంగా ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా వివరించారు.
కాని తెలుగులో బహువ్రీహి సమాసాలకంటే కర్మధారయ సమాసాలే అధికం. అందువలనే
పూర్వవ్యాకర్తలు దీనిని అంతగా వివరించలేదు.
4.6 ఉపమాన సమాసాదులు:
ఉపమాన సమాసాదులు ఉపమాన ఉపయేయాలతో ఏర్పడేవి. దీనిని ఉపమాన పూర్వపద కర్మధారయ, ఉపమాన ఉత్తరపద కర్మధారయ, రూపక సమాసాలుగా వర్గీకరించవచ్చు. రూపక సమాసాన్నే ‘‘అవధారణ సమాసంగా’’ వ్యవహరిస్తారు. దీని విగ్రహవాక్యంలో అవధారణముండుట వలన దీనిని అవధారణ సమాసంగా వ్యవహరిస్తారు. సాదృశ్యాన్ని చెప్పే సమాసం ఉపమాన సమాసం. ఇది ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తరపద సమాసాలుగా వర్గీకరించవచ్చు.
ఆంధ్రశబ్ద చింతామణిలో ‘‘అనేకకేచిదుపమానోత్తరపదలోపరూపకాఖ్యాద్యాః’’12 అని ఉపమాన సమాసాదులన తెల్పారుగాని వాటి లక్షణాలను చూపలేదు. దీనికి బాలసరస్వతి ‘‘మెఱుఁగుఁబోఁడి’’13 ‘‘మచ్చెకంటి’’ వంటివి ఉపమానాలకు మోవిపండు, కేలుదమ్మి మొదలైనవి రూపకాలకు ఉదాహరణలుగా చూపారు. వికృతి వివేకంలో
‘‘ఉపమానాను వాదేతు విధి రన్యస్య సమ్మతః
విశేషణ వివక్షాయాం పునరుక్తిః క్వచిద్ధితా’’ (వి.వి.హలన్త 19) అని తెలిపారు. అనగా ఒకే సమాసంలో రెండు ఉపమానాలుండవచ్చని, విశేషణ వివక్షలో పునరుక్తి కొన్ని సమాయాల్లో హితమవుతుందని ఈయన అభిప్రాయం.
పుదూరి సీతారామశాస్త్రి ఉపమాన సమాసానికి పండుమోవి, చిగురుమోవి అని, రూపక సమాసానికి కేలుఁదమ్మి, మోముఁదామర వంటి ఉదాహరణలు ఇచ్చారేగాని నిర్వచించలేదు.
రావిపాటి గురుమూర్తిశాస్త్రి తెనుఁగు వ్యాకరణం (పుట 90)లో ‘‘సాదృశ్యమును జెప్పు సమాసంబు ఉపమితి సమాసంబు’’ అని తెలిపి, ఇది ఉపమానోత్తరపద ఉపమాన పూర్వపదాలుగా విభజించి ఉదాహరణలతో నిరూపించారు. ఈయన ‘‘ఒక వస్తువును మఱియొక వస్తువును గాఁజెప్పునది రూపక సమాసంబు’’ అని నిర్వచించి కేలుదమ్మి మోముదామర వంటి ఉదాహరణలు ఇచ్చారు. కాని ఈయన ఇచ్చిన నిర్వచనం అంత సమర్థనీయంగా లేదు.
చిన్నయసూరి ‘‘చిగురుఁగేలు, జుంటిమోవి, యిత్యాదులయిన యుపమాన పూర్వపద కర్మధారయంబులు గ్రాహ్యంబులు. ముఖపద్మము చరణ కమలములు: ఇట్టి యుపమానోత్తర పదంబులు గలవుగాని, విపరీతంబులు సిద్ధంబులు లేవని యెఱుంగునది.’’ (బా.వ్యా.సమాస 3) అని తెల్పారు. ఈయన చిగురుఁగేలు, జుంటిమోవి వంటివి ‘‘సంస్కృత లక్షణంబు దొడరని సమాసంబులని,’’ ఇవి తెలుగు నుడి కారంలో విలక్షణంగా ఏర్పడ్డాయని సూరి అభిమతం. అందువలనే ఈ ఉపమాన పూర్వపద కర్మధారయాలు సిద్ధ సమాసాలలో ఉండవని తెలిపారు.
పాపినేని అబ్బాయి నాయుడు ఉపమానాన్ని ఉపమితి సమాసంగా తెలిపి, ఉపమితి అనగా సాదృశ్యాన్ని చెప్పేదని తెలిపి ఉపమానోత్తర పద, ఉపమాన పూర్వపదాలుగా వర్గీకరించారు. ఉదాహరణలను కూడా పూర్వ వ్యాకర్తలననుసరించే తెల్పారు. రూపకమనగా అవధారణ పూర్వపదమని తెలిపి మోవిపండు యశోధనము అని ఉదాహరణలను తెల్పారు. అయితే సమర్థవంతమైన నిర్వచనాన్ని ఇవ్వలేదు.
కందుకూరి వీరేశలింగం 1) ఉపమానం పూర్వ పదంగా గలది ఉపమాన పూర్వపద సమాసమని - చంద్ర సుందరము. 2) ఉపమానముత్తర పదంగా గలది ఉపమానోత్తర పద సమాసమని - నిశాకాంత - రేవెలది అని చక్కని వివరణ (సం.వ్యా.పుట 83) చేశారు.
నేలటూరి పార్థసారధి అయ్యంగారు ముఖపద్మము, అధరబింబము, వంటి ఉపమాన ఉత్తర పదకర్మధారయ సమాసాన్ని మాత్రమే వివరించారు. ఉపమాన పూర్వపదను వివరించలేదు.
ఈ భాష్యకాచార్యులు ఉపమాన పూర్వపద (సరసిజనయన) ను మాత్రమే తెల్పారు గాని ఉపమాన ఉత్తర పదను తెల్పలేదు. మల్లాది సూర్యనారాయణశాస్త్రి ఆంధ్రభాషానుశాసనం (పుట 205)లో ఉపమాన వాచకం చివర ఉన్నా అది ఉపమాన పూర్వపదమని, ఉపమాన పదం సాధారణ ధర్మవాచక పదంతో సమసించిన, అది ఉపమాన పూర్వపద కర్మ ధారయమని తెల్పారు. ఉపమేయవాచకాన్ని ప్రయోగించిన అది ఉపమాన ఉత్తరపదమే అవుతుందని తెలిపి ఉదాహరణగా ముఖపద్మము అని తెల్పారు. పద్మముఖ మనినంత మాత్రాన అది
ఉపమాన పూర్వపదం మాత్రం కాదని తెలిపారు. ఉపమానవాచకానికి, ఉపమేయ వాచకానికి సమాసం చేసిన ఉపమాన వాచకం రెండవ పదమవుతుంది. ఉమానవాచకానికి సాధారణ ధర్మవాచకానికి సమాసం చేసిన, ఉపమాన వాచకం మొదటి పదమవుతుందని తెలిపారు. ఈయన పరిశీలనా దృష్టి ప్రశంసనీయం.
పై పరిశీలననుబట్టి సామాన్య ధర్మవాచకం ఉత్తరపదంగా గల కర్మధారయ సమాసం తెలుగులో మృగ్యం. తెలుగులో ఉపమానోపమేయాలతోనే ఇటువంటి సమాసాలు ఏర్పడతాయి. ఇవి పూర్వంగా ఉన్నా స్త్రీ సమంగాని, అమహత్తుగాని ఉండవచ్చు.
5. ముగింపు:
తత్పురుష సమాస విషయం లో నఞ్ తత్పురుషను చిన్నయ సూరిగాని ఆయనకు పూర్వులుగాని తెలుగులో వచ్చిన వ్యాకరణాలలో తెలుపలేదు. కాని పాపినేని అబ్బాయినాయుడు, ఆయన తరువాతి వ్యాకరణకారులు తెలిపారు. ఈ భాష్యకాచార్యులు ప్రతేకంగా ప్రాది సమాసం, ఉపపద సమాసాలను తత్పురుషలో చేర్చారు. తరువాత నాదెళ్ళ పురుషోత్తమకవి కూడా పూర్వవ్యాకర్తలకు భిన్నంగా శుద్ధ తత్పురుష, నఞ్ తత్పురుష, సంకర తత్పురుషలుగా తెల్పారు. ఈయన ప్రథమాతత్పురుషను కూడా తత్పురుషలలో చేర్చారు.
కర్మధారాయ సమాస విషయం లో కర్మధారయ సమాసాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విభజించారు. కొంతమంది ఎనిమిది, కొంతమంది పది, కొంతమంది ఆరుగా విభాగించగా, ఈ భాష్యకాచార్యులు పదకుండు విభాగాలను కర్మధారయ సమాసంలో చూపారు. చిన్నయసూరి, ప్రౌఢవ్యాకర్తలు మధ్యమ పదలోప సమాసాన్ని తెలపక పోవడం విచార్యం.
ద్విగు సమాస గురించిసూరి ‘‘ద్విగువునకేకవచనంబు ప్రాయికంబుగానగు మిశ్రంబునకుఁగాదని’ తెలిపినా, మిశ్రద్విగు వేకవచనాంతం కాదని సూరి పేర్కొన్నా ‘‘నల్దిక్కు’’ ‘‘ముల్లోకము’’ వంటివి లేకపోలేదు. అందుచేతనే వికృతి వివేక కర్త ‘‘అన్య త్రాపి క్వచిద్భవేత్త’’ని సవరించుకున్నారు. అయితే ఇటువంటి ప్రయోగాలను వికృతివివేకాన్ని కాక ప్రౌఢవ్యాకరణాన్ని స్మరిస్తే బాగుంటుంది. ‘‘కూడా చీర’’ మొదలైనవి ద్వంద్వంలో ఏకవచనం చెప్పారు. అదే ఉక్తమైంది. కాలుసేయి అనే చోట సంస్కృతాను సారంగానే ఏకవచనం సిద్ధింస్తుండగా, అన్య త్రాపి అని ఏకవచనం చెప్పడం కూరగాయే త్యాదులకని అహోబలుని అభిప్రాయం.’’ 14 ఇదే సమర్థనీయం.
ద్వంద్వ సమాసం గురించి నాదెళ్ల పురుషోత్తమకవి, మల్లాది సూర్య నారాయణశాస్త్రి కూడా సుబోధినీ వ్యాకర్తలాగే సమగ్ర వివరణ చేశారు. ద్వంద్వ సమాస నిర్మాణం ఏవిధంగా జరుగుతుందో చిన్నయసూరివివరిస్తే పాపినేని అబ్బాయినాయుడు ద్వంద్వను స్థూలంగా రెండు, సూక్ష్మంగా నాలుగు విధాలుగా విభాగించారు. అబ్బాయి నాయుడు తెలిపిన విభాగాలకు ఈ భాష్యకాచార్యులు ఏకశేష ద్వంద్వను జోడిరచారు. బాలవ్యాకరణానికి పూరణగా ప్రౌఢవ్యాకర్త కొన్ని విషయాలను చెప్పగా తరువాతి వ్యాకర్తలు అన్ని అంశాలను తమ వ్యాకరణంలో ఇముడ్చుకొని విశేషంగా వివరించారు.
బహువ్రీహి సమాసం గురించిచిన్నయసూరికి పూర్వ వ్యాకర్తలు బహు వ్రీహికి అంత ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించలేదు. వారు సమగ్రవివరణ చేయలేదు. పాపినేని అబ్బాయినాయుడు మాత్రం బహువ్రీహిని ఏడు విధాలుగా విభజించి విశేషంగా వివరణ చేశారు. అలాగే నాదెళ్ల పురుషోత్తమకవి పదమూడు విధాలుగా బహువ్రీహిని వర్గీకరిస్తే ఈ భాష్యకాచార్యులు పద్నాలుగు బహువ్రీహులను తెల్పారు. కో. వేంకట కృష్ణమాచార్యులుకూడా పదిరకాల బహువ్రీహులను తెలిపి వ్యధికరణ బహువ్రీహిని కూడా పంచమీ, షష్ఠీ, సప్తమీలుగా వర్గీకరించారు.
కాని తెలుగులో బహువ్రీహి సమాసాలకంటే కర్మధారయ సమాసాలే అధికం. అందువలనే పూర్వవ్యాకర్తలు దీనిని అంతగా వివరించలేదు.
ఉపమానసమసాదుల విషయంలో అరుదుగా ఏర్పడే మహద్వాచకాలైన సమాసాలలో ఈ రీతిగా ఉపమానం పూర్వమందుండడానికి వీలు కనిపించదు. ఉదా: వాడు మగపులి అంటారేగాని పులిమగడు అనరు.
6. పాదసూచికలు:
- మహాభాష్యం 2-1-1.
- మూల ఘటిక కేతన ఆంధ్రభాషా భూషణము: 109.
- ఆంధ్రశబ్ద చింతామణి హలన్త: 10.
- పాణినీయం: 1-2-42.
- పాణినీయం: 2-1-72.
- పాణినీయం: 2-4-1.
- పాణినీయం, 2-2-29.
- ఆంధ్రశబ్ద చింతామణి హలన్త 16.
- వికృతి వివేకము, అజన్త 47.
- ఆంధ్రశబ్దచింతామణి, హలన్త - 16.
- అహోబలపండితీయం పుట 436.
- ఆంధ్ర శబ్ద చింతామణి, హలన్త 16.
- బాల సరస్వతీయం పుట 41.
- అంబడిపూడి నాగభూషణం. బాలవ్యాకరణ వికాస వివేచనము. పుట. 303
7. ఉపయుక్తగ్రంథసూచి:
- అధర్వణాచార్యుడు, “వికృతి వివేకము” (అధర్వణ కారికావళి), కవిజనమండన సహితము, వావిళ్లప్రతి, 1955.
- అబ్బాయినాయుడు, పాపినేని. ఆంధ్రవ్యాకరణసంగ్రహము, ఆర్.బి.ఎన్. ముద్రాక్షరశాల, 1868.
- ఆంజనేయశాస్త్రి, టి. ఆశుబోధ లక్షణసంగ్రహము. బాలాత్రిపురసుందరీ ప్రెస్, గుంటూరు 1884
- కేతన, మూలఘటిక. ఆంధ్రభాషాభూషణం. వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు: 1911
- గురుమూర్తిశాస్త్రి, రావిపాటి. తెనుఁగు వ్యాకరణము , వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు: 1951.
- చిన్నయసూరి, పరవస్తు. బాలవ్యాకరణము, స్టూడెంట్స్ ఫ్రెండ్స్ పుబ్లిషర్స్, నరసరావు పేట, 1911
- జోగిసోమయాజి, గంటి. (పరి.) వాక్యపదీయం. తెలుగు అకాడమి, హైదరాబాద్, 1974
- నన్నయ. ఆంధ్రశబ్దచింతామణి. వావిళ్ల రామస్వామిశాస్త్రులు & సన్స్ పబ్లిషర్స్, మద్రాసు,1937
- ప్రవీణ, దొడ్డి. సిద్ధాంతగ్రంధము. ‘బాలవ్యాకరణానికి సమీప కాలిక వ్యాకరణాల పరిశీలన“, PND పుబ్లిషర్స్, 2015
- భాష్యకాచార్యులు, ఈ. ఆంధ్ర భాషా సుబోధిని, ఆర్య భారతీ ప్రెస్, చెన్నపురి, 1927.
- వరాహనరసింహము, ఈశ్వర. (అను.) శ్రీ యాస్కముని ప్రణీత నిరుక్తము. హైదరాబాద్, 2014.
- వీరేశలింగం, కందుకూరి. సంగ్రహవ్యాకరణము, సరస్వతీ పవర్ ప్రెస్, రాజమండ్రి, 1951.
- వెంకటరమణ శాస్త్రి దువ్వూరి, ”రమణీయం” , ఆంధ్ర యూనివర్సిటీ ప్రెస్సూ , వాల్తేరు 1964
- వేంకటశాస్త్రి. కేతవరపు. ఆంధ్రచంద్రిక. ముద్రణాదిక వివరాల పుట అలభ్యం
- సూర్యనారాయణశాస్త్రి, మల్లాది. ఆంధ్రభాషానుశాసనం. సరస్వతీపవర్ ప్రెస్, రాజమహేంద్రవరము, 1926
- సీతారామశాస్త్రి, పూదూరి. ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము, వావిళ్ల రామస్వాము శాస్త్రులు అండ్ సునస్ పుబ్లిషర్స్, మద్రాసు,1951.
- సీతారమాచార్యులు, బహుజనపల్లి. ప్రౌఢవ్యాకరణము (ప్రౌఢవ్యాకరణ ఘంటాపథము), విశాలాంధ్ర పబ్లిషర్, విశాఖపట్నం, 1999
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.