AUCHITHYAM | Volume-5 | Issue-2 | February 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
10. ఆధునిక తెలుగు కవిత్వం: మానవతాదృక్పథం
(కాకరపర్తి భావనారాయణ కళాశాల (స్వయంప్రతిపత్తి), విజయవాడ వారికి సమర్పించిన మైనర్ రిసెర్చ్ ప్రాజెక్టు సారాంశం)
డా. జె. వి. చలపతిరావు
సహాయక ఆచార్యులు, తెలుగు విభాగము,
కాకరపర్తి భావనారాయణ కళాశాల (స్వయంప్రతిపత్తి),
విజయవాడ, ఎన్.టి.ఆర్.జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9849556162, Email: jvchalapathi25@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
తెలుగు భాషలో వివిధ రకాల ధోరణులతో కవిత్వం వెలువడుతుంది. వాటికి వివిధ వాదాలు, ఉద్యమాలు అనేపేర్లు పెట్టినా, వాటిలో ప్రధానంగా మానవీయ విలువలే కేంద్రంగా కొనసాగడం ఒక విశేషం. వాటిని ఈ వ్యాసంలో వివరించడమే ఈ వ్యాస లక్ష్యం. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కవిత్వం మారుతున్నట్లనిపించినా, మరుగున పడుతున్న మానవీయ విలువలను వివిధ ధోరణులతో, వివిధ రూపాలతో ఏ విధంగా అభివ్యక్తం చేస్తున్నారో విశ్లేషించడమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తే తొలిదశలో కొన్ని వందల సంవత్సరాలపాటు పద్య కవిత్వం అప్రతిహతంగా కొనసాగింది. పద్యంలో కొనసాగడమే కాకుండా తమ కవిత్వానికి వస్తువుగా మానవాతీతశక్తులను ముఖ్యంగా దైవాన్ని, రాజవంశాలను కేంద్రంగా చేసుకొని రచనలు కొనసాగించారు.భావకవిత్వం వచ్చేవరకు ఇంచుమించు ఇదే ధోరణికొనసాగింది. తర్వాత అభ్యుదయ, విప్లవ, దిగంబర, స్త్రీవాద, దళితవాద, మైనారిటీ, ప్రాంతీయ, ప్రపంచీకరణ వాదాలతో కవిత్వం వచ్చింది. సంప్రదాయకవిత్వంలో కావ్యాలు, మహాకావ్యాలు, ప్రబంధాలుగా వచ్చిన రూపపరమైన పరిణామాలు ఆధునిక కవిత్వంలో వచనంలోకి మారాయి. సాహిత్యాన్ని ఆదరించేవాళ్లు, దాన్ని రాసేవాళ్ళు, చదివే పాఠకులు మారడంతో తెలుగు కవిత్వపరిణామాల్లో అనేకమైన మార్పులు సంభవించాయి. దానివల్ల ఛందోబందోబస్తులను తెంపుకొని వచనంవైపు కవిత్వం నడవడం ప్రారంభించింది. కవిత్వాన్ని ప్రజాస్వామ్యీకరించే ప్రయత్నంగా కొనసాగింది. అంతటితో ఆగిపోకుండా రుబాయిలు, గజల్స్, మినీకవిత్వం, హైకూ, నానీలు మొదలుగా అనేక మినీకవిత్వ రూపాల్లో కవిత్వం రావడం కనిపిస్తుంది. ఈ పరిణామాలన్నీ సంప్రదాయసాహితీవేత్తలకు కొంత అసహనాన్ని కలిగించినా, ఆధునిక కాలంలో ఎక్కువ సమయం కేటాయించలేని పరిస్థితులు అనివార్యం కావడం, పత్రికలు, సామాజిక మాధ్యమాల రావడంతో కవిత్వంలో రూపపరమైన విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇన్ని మార్పులు వచ్చినా వాటన్నింటికీ కేంద్రంగా మానవత్వమే కేంద్రం కావడం గమనార్హం. ఈ విషయాల్ని ఈ వ్యాసంలో గుణాత్మక పరిశోధన (Qualitative Research Method) పద్థతిలో వివరించే ప్రయత్నం చేస్తాను. దీనికోసం కవులు రాసిన కవిత సంపుటులు, కవితాసంకలనాలు, పరిశోధకుల అభిప్రాయాలు, విమర్శకులు మూల్యాంకనలను సందర్భోచితంగా విశ్లేషణకు ఉపయోగించుకుంటూ విశ్లేషణాత్మక పద్ధతితో ఈ వ్యాసాన్ని వివరిస్తాను.
Keywords: తెలుగుకవిత్వం, సంప్రదాయకవిత్వం, మానవతావాదం, ఆధునికకవిత్వం, హైకూ, నానీ
1. ఉపోద్ఘాతం:
ఆధునిక తెలుగు సాహిత్యంలో, అదీ ముఖ్యంగా తెలుగు కవిత్వంలో వచ్చిన మానవతావాద ధోరణులను ఈ వ్యాసంలో వివరించాలనుకుంటున్నాను. దీనికి ముందు తెలుగు భాష, సాహిత్యాల స్థితి గతులను, తెలుగు సాహిత్యపరిణామాలను వివరించడం ద్వారా ఆధునిక సాహిత్యంలో మానవతా వాదాన్ని మరింత స్పష్టంగా గుర్తించవచ్చు. అందువల్ల స్థాలీపులాకన్యాయంగా తెలుగు భాష, సాహిత్య వికాసాన్ని వివరిస్తాను. తర్వాత ఆధునిక కవిత్వం, ధోరణులు,వాటిలో మానవతావాదాన్ని ఒక క్రమపద్ధతిలో విశ్లేషిస్తాను.
భారతీయ భాషల్లో తెలుగు భాష ఒకటి. అజంతమైన తెలుగు భాష ఇతర భాషలను తనలో కలుపుకోగలదు. ఎటువంటి భావాన్నయినా శక్తివంతంగా వ్యక్తీకరించగలుగుతుంది. సంస్కృతం నుండే అన్ని భాషలు జన్మించాయనే వాదన ఒకటి ఉంది.
“జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్య సంపద
మెచ్చుటాడు బిడ్డ మేలుగాదె” (క్రీడా-37 )
అలాగే, మూలద్రావిడ భాషలనుండే తెలుగు భాష వచ్చిందనే వాదన కూడా ఉంది. కాల్డ్వెల్ దీన్ని ప్రతిపాదించారు. వాదనలెలా ఉన్నా తెలుగు భాషలో ఎంతో విలువైన కవిత్వం వచ్చింది. ఎన్నో విలువైన రచనలు వచ్చాయి. వాటన్నింటిలోను సమకాలీన సమాజాన్ని ప్రతిఫలించడం ఒక విశేషం. అదే పద్ధతిలో తెలుగు కవిత్వం కూడా నాటి నుండి నేటి వరకు కొన్ని పరిధులు, పరిమితులు ఉన్నప్పటికీ మానవత్వం కేంద్రంగానే కొనసాగిందని చెప్పవచ్చు.
నన్నయ కాలంలో మొదలైన తెలుగు లిఖితసాహిత్యం పురాణేతిహాసాల రూపంలో ప్రారంభమైంది. ఆంధ్రమహాభారతంలో కథ అంతా పాండవులు-కౌరవులు పాత్రలుగా ఉన్నా, అది ధర్మానికి, అధర్మానికీ మధ్య జరిగిన యుద్ధంగానే పరిగణించాలి. అయితే, ఈ సాహిత్యం అంతా దైవసంబంధంగాను, విధిని అనుసరించి జరగవలసిన జీవనంగాను కనిపిస్తుంది. అందుకే ఆంధ్రమహాభారతాన్ని ఆధ్యాత్మికశాస్త్రంగాను, పురాణంగాను, మహా కావ్యంగాను, కావ్యశాస్త్రంగాను రకరకాలుగా అభివర్ణించారు. ఆ తర్వాత వచ్చిన శివకవుల ధ్యేయం శైవ మత ప్రచారమే అయినప్పటికీ, అన్ని వర్ణాలవారినీ కలుపుకొనే ప్రయత్నం కనిపిస్తుంది. కానీ, మత వైషమ్యాలు పెరగడం, దానిఫలితంగా హరిహరాధ్వైతంతో తిక్కన మహాభారతాన్ని రాశారు. ఆ తర్వాత మరలా వైష్ణవ మతం ప్రాచుర్యంలోకి రావడాన్ని ఎఱ్ఱనగారి మహాభారతాన్ని పూర్తి చేయడం, నృసింహపురాణం రావడం వంటివన్నీ తెలియజేస్తున్నాయి. శ్రీనాథుని కాలంలో మరలా శైవసాహిత్యం విస్తృతమయినా, 12 వశతాబ్ది నాటి శివకవుల స్థాయిలో మత ప్రచారం జరగలేదు. శ్రీనాథుని కాలం తర్వాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రబంధాలు తెలుగు సాహిత్యాన్ని స్వర్ణయుగంగా చేశాయి. ఆ కాలంలో భారతీయ కుటుంబజీవనవిధానంలో వస్తున్న మార్పుల్ని, దాంపత్య జీవనంలోని గొప్పతనాని మనుచరిత్ర కావ్యం ఎంతో ఉదాత్తంగా తెలియజేసింది. అప్పుడప్పుడే తెలుగు ప్రాంతాల్లో కనిపిస్తున్న మహహ్మదీయలు, పాశ్చాత్యభావాల ప్రభావం ప్రబంధ యుగంలో కనిపించడం ప్రారంభమైంది. అయినప్పటికీ అష్టాదశ వర్ణనలతో కొనసాగిని ప్రబంధ ప్రక్రియ కవుల్ని ఎంతగానో ఆకర్శించింది. అందువల్లనే ప్రబంధ యుగానంతరం వచ్చిన సాహిత్యం పిల్లప్రబంధాలుగా పుట్టుకొచ్చాయని సాహిత్య చరిత్రకారులు వివరించారు. అందుకే దాన్ని దక్షిణాంధ్రయుగమనీ, క్షీణప్రబంధయుగమనీ వ్యాఖ్యానించారు. దీని తర్వాత భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ తమ అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకుంది. పాశ్చాత్య సాహిత్య ప్రభావం తెలుగులో ప్రవేశించింది. ఇక్కడి నుండే ఆధునికత ప్రారంభమైంది. ఆధునికతను, ఆధునిక సాహిత్యాన్ని రెండురకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి. వస్తుతత్వంతోను, రెండవది కాలాన్ని అనుసరించి రెండు రకాలుగా మన సాహితీ వేత్తలు వివరించారు. ఇక్కడ నుండే మానవతావాదం అనే ఒకవాదానికి స్పష్టత రావడం మొదలైంది. నిజానికి నన్నయ నుండి నేటివరకు ఏదొక రూపంలో కవులు మానవతావాదాన్ని వర్ణిస్తూనే ఉన్నారు. కానీ, సాహిత్య చరిత్రకారులు నిర్ణయించిన ఆధునిక యుగం నుండే మానవతావాదాన్ని గుర్తిస్తున్నారు. దీనికి మానవుడినే కేంద్రంగా తీసుకుంటారు. ఈ కాలంలో వివిధ వాదాలు, వివిధ ధోరణుల రూపంలో మానవతావాదమెలా కనిపిస్తుందో ఈ వ్యాసంలో వివరిస్తాను. మానవతావాదాన్ని అర్థం చేసుకోవాలంటే మానవత్వం, మానవతావాదాలను అవగాహన చేసుకోవాలి.
2. మానవతావాదం:
మొట్టమొదటిసారిగా OXFORD చెందిన ఎఫ్.సి.యస్. షిల్లర్ (F.C.S. SCHILLER 1750 - 1850) మానవతావాదం (Humanism) అనే పదాన్ని సమకూర్చారు. షిల్లర్ పత్రిపాదించిన వ్యావహారికవాద (Pragmatism) రూపాంతరమే మానవతావాదంగా భావింపబడింది. మానవుడే అన్నిటికి ప్రమాణమనే (Homomensura) ప్రసిద్ధోక్తిని ఆలంబనగా చేసుకొని దీన్ని మానవతావాదంగా హైదరాబాదు విశ్వవిద్యాలయానికి ఆచార్య జి. అరుణకుమారి సమర్పించిన తన సిద్ధాంత గ్రంథం (అరుణకుమారి, జి. ఆధునిక తెలుగు కవిత్వంలో మానవతావాద ధోరణులు, అముద్రిత సిద్థాంత గ్రంథం 1985:2) లో పేర్కొన్నారు.
మానవుడే కేంద్రమనే మానవతావాదం మానవుని లక్ష్యాలను నెరవేర్చాలని ఆశిస్తుంది. మానవతావాదం వ్యావహారిక వాద రూపంలో కేవలవాదాన్ని అనుభవపూర్వవాదాన్ని (Apriorism) తిరస్కరిస్తుంది. మానవతావాదానికి క్రింది లక్షణాలు ఉంటాయని ఆచార్య జి. అరుణకుమారి చెప్పారు. (ఆధునిక తెలుగు కవిత్వంలో మానవతావాద ధోరణులు, అముద్రిత సిద్థాంత గ్రంథం 1985:7)
3. మానవతావాద లక్షణాలు:
- మానవుడే అన్నింటికి ప్రమాణం.
- మానవుని సుఖశాంతులు ఈ ప్రపంచంలోనే ఇమిడి ఉన్నాయి.
- మానవ శ్రేయస్సే అందరి అభిమతం.
- జీవకోటిలో అత్యుత్తమ జీవి మానవుడు.
- మానవ ప్రేమే మానవ ఆదర్శం.
- ఇతర విలువలకంటే మానవ విలువలే మిన్న.
- వసుధైక కుటుంబ నిర్మాణమే మానవవాంఛితం.
- మానవతావాదం సాంప్రదాయకమతసిద్ధాంతాలకు అతిప్రాకృతికదృగ్విషయాలకు విరుద్ధమయినది.
- మానవతావాదం పరిణామ సూత్రంగా అన్ని అవరోధాల్ని అధిగమిస్తుంది.
- మానవ పరిపూర్ణత, సమైక్యతలు మానవత్వసిద్ధికి దోహదాలు.
మానవతావాదానికి సంబంధించి ప్రముఖకవి, విమర్శకులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఈవిధంగా తెలియజేశారు.
‘‘మానవతావాద దృక్పథం', పరతత్వం, ప్రభుతత్వం స్థానంలో మానవ త్వానికి మకుటం పెట్టిన అంశం. మానవ మేధ, మానవ కృషి, మానవ స్వేచ్ఛ సౌహార్ధం, సౌభ్రాత్రం.- ఇవే ఈ మానవ సమాజం సుందరమూ అర్థవంతము కావడానికి ప్రధానమంటుందీ దృక్పథం. మన దేశంలో రాజా రామమోహనరాయలు ఈ ధోరణికి ప్రాతినిధ్యం వహిస్తే-, ఆంధ్ర దేశంలో వీరేశ లింగం నాయక్వం వహించారు. కవుల్లో భారతీయపీఠంమీద ప్రతినిధిగా రవీంద్రనాథ్ టాగోర్ ఆధిష్ఠిస్తే, ఆంధ్రలో దేవులపల్లి కృష్ణశాస్త్రి తన కవితాగానం చేశారు. రేపటి మనిషి కోసం, రేపటి ఉజ్జ్వల ప్రతిభా వికాసంకోసం;- మనిషి మనిషి తనాన్ని కోల్పోరాదనీ, సాటిమనిషి ఉనికిని మరచిపోరాదనీ, చేయీచేయీ కలిపి, అవి ఏరూపంలో వున్నా మలిపేసి - ఒకే ఒక్క మానవ సంఘం ఒకే ఒక మానవాత్మగా మనగలగాలనీ మానవతావాద సారాంశం’’. (ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, అభ్యుదయ సాహిత్యానంతరధోరణులు,1987: 145).
ఆధునిక తెలుగు కవిత్వంలో వివిధ ధోరణులుగా కనిపించేవన్నీ మానవతావాదంలో భాగాంగానే చూడాలని మానవతావాదంపై పరిశోధన చేసిన ఆచార్య జి.అరుణకుమారిగారి అభిప్రాయం. అందువల్లనే ఆమె 1.భావ కవులు, 2. తెలంగాణ పోరాట కవులు, 3. అభ్యుదయ కవులు, 4.దిగంబర కవులు, 5.పైగంబర కవులు, 6.తిరుగబడు కవులు, 7. విప్లవ కవులు, 8.చేతనావర్త కవులు, 9.అనుభూతి కవుల కవిత్వాన్ని అంతటినీ మానవతావాద కవిత్వంలో భాగంగానే తన సిద్ధాంత గ్రంథంలో సమన్వయించారు. ఈ సైద్దాంతిక నేపథ్యంతో ఆధునిక కవిత్వంలో ప్రతిఫలిస్తున్న మానవతావాద కవిత్వాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
4. కవిత్వ ప్రధాన లక్షణం మనిషి భావోద్వేగాల్ని గుర్తించడం:
కవిత్వం యొక్క ప్రధానలక్ష్యం మనిషిని మనిషిగా మార్చటం. కవిత్వం అనుభూతి చెంది రాసే విధానం ఒకటి అయితే, అనుభూతి కలిగించడం కోసం రాసే విధం మరొకటి, చైతన్యం కోసం, విప్లవం కోసం, ఆధ్యాత్మికత కోసం, రక్షణ కోసం ఇలా కాలాన్ని వాహకంగా చేసుకొని కవిత్వం నూతన విధానంలో జన్మిస్తూనే ఉంటుంది. కవిత్వంలో వృధా అంటూ ఉండదు. కానీ ఆ కాలానికి తగినది కాకపోతే ఆ కవిత గుర్తింపు పొందదు. అంత మాత్రంచేత కవిత, కవిత్వకర్త తక్కువ వారు అన్న మాటను మనం అనకూడదు. ఇవన్నీ తెలుగులో వివిధ ధోరణులుగా కనిపిస్తాయి.
5. ఆధునిక తెలుగు కవిత్వ ఆవిర్భావ వికాసాలు :
తెలుగులో సుమారు 1850 నుండి నేటి వరకు ఉన్న కవిత్వాన్ని ఆధునిక కవిత్వంగా భావిస్తుంటారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావులతో తెలుగులో ఆధునిక కవిత్వం ప్రారంభమైంది. ఆధునిక కవిత్వంలో మూడు ముఖ్య ధోరణులు కనిపిస్తాయి. మొదటిది భావకవిత్వం. రెండవది అభ్యుదయ కవిత్వం. మూడవది సాంప్రదాయ కవితా పునరుజ్జీవనం. ప్రాచీన కాలం నుండి నేటివరకు తెలుగు కవిత్వం వివిధ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. ఆధునిక కాలంలో కవిత్వం వాస్తవానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ సాగింది. శ్రమ మూలాలను మరచిన జాతికి, శ్రమ సౌందర్యం తెలపటం కోసం కవిత్వం అత్యాధునిక పోకడను అలవర్చుకుంది. ఏ రంగంలో అన్యాయం జరిగితే ఆ రంగంలో కవిత్వం కాస్త కోపంగానే ముందుకు వచ్చింది. కమ్మటి కవిత్వం 19వ దశకంలో ఈ దేశాన్ని ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా ఆధునికతను, ఆధునిక సాహిత్యాన్ని మన సాహితీవేత్తలు అర్థం చేసుకున్న విధానాన్ని వివరించుకోవాలి.
‘‘సాహిత్యంలో ఆధునికతను రెండు విధాలుగా నిర్వచించవచ్చు. మొదటిది సమకాలీనతనే ఆధునికతగా నిర్వచించటం. ఈ దృష్టిలో సమకాలంలో వచ్చిన ఏ సాహిత్యమైనా-సాంప్రదాయికంగాని, నవీనంగాని - ఆధునికం అవుతుంది. రెండవది మారిన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు పునాదిగా ఏర్పడిన కొత్త దృక్పథాలను, స్వరూపాన్ని సంతరించుకోవటమే ఆధునికత అని నిర్వచించటం. ఈ విధమైన సాహిత్యానికి అంతకు ముందులేని ప్రత్యేక లక్షణాలు, కొత్తవిలువలు ఉంటాయి. ఇక్కడ ఆధునికత అనేది కాలాన్ని సూచించేదికాదు. అది ఒక తత్త్వం. ఒక తత్త్వంగా ఆధునికతలో రెండు భిన్నధోరణులు కనిపిస్తాయి. సామాజిక ప్రయోజనం, హేతుబద్ధమైన శాస్త్రీయదృష్టి, వాస్తవికతలపైన ఆధారపడిన సాహిత్య దృక్పథాలు తాత్త్విక భూమికగా కలిగిన ఆధునికత ఒకటి. అభ్యుదయవాద, విప్లవవాద, వాస్తవికతా వాదాలు, కొంతవరకు హేతువాదం ఈ కోవలోకి వస్తాయి. పైన చెప్పిన విలువలు లేకుండా వ్యక్తివాద, అరాచకవాదాలు తాత్వికభూమికగా కనిపించే ఆధునికత రెండవది.’’ అని ప్రసిద్ధ విమర్శకులు కె.కె.రంగనాథాచార్యులు (తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, 1982: vii) వివరించారు.
దీని ప్రకారం చూసినా అంతకు ముందులేని ప్రత్యేక లక్షణాలైన వాస్తవికత, హేతువాదం, మానవతావాదం అనేవి తెలుగు కవిత్వంలో విస్తృతంగా కనిపించడం మొదలయ్యాయి. తెలుగులో వచన కవిత్వం రావడానికి ముందు భాషలో ఎన్నో సంస్కరణలు జరిగాయి. సాహిత్యాన్ని పండిత వర్గం నుండి సామాన్య వర్గం వరకు చేర్చే ప్రయత్నంలోతొలుత ఛందస్సుని సరళీకరించి, తర్వాత వచనకవిత్వాన్నే రాశారు. దాన్ని శిష్ట వ్యావహరికం, వ్యావహారిక భాషగా పిలిచారు.
6. మానవతావాద మాధ్యమంగా శిష్టవ్యావహారికం:
ఛందస్సు, అలంకారాలు, కఠిన పద ప్రయోగాలను వదలి సామాన్యుడి భాషలో అంటే వచనంలో రాయవలసి వచ్చింది. పద్యనాటకాలు గద్య నాటకాలుగా మారాయి. ఇక్కడ తెలుగు వారికి ప్రత్యేకమైన మరో సమస్య ఎదురైంది. పండితులు గ్రాంథిక భాషలో రాసేవారు. అది అందరికీ అర్ధం కాదు. వ్యావహారిక భాషలో రాస్తే, సంస్కృతాన్ని గౌరవించే మనః స్థితిలో ఉన్న మన విద్యాధికులకు నచ్చదు. కాబట్టి మధ్యే మార్గంగా శిష్టవ్యావహారికమనే తెలుగు రూపాంతరాన్ని తయారు చేసుకున్నాం, గ్రామీణులు కాకుండా కాస్త చదువుకున్నవారు వాడే భాషను ప్రామాణికంగా చేసుకున్నాం. అందరికీ ఆమోద యోగ్యంగా ఉండడానికి, ఆంధ్ర, తెలంగాణా మాండలికాలే కాకుండా జిల్లాకొక తీరుగా ఉన్న తెలుగుకు ఓ ప్రామాణికత ఏర్పరచుకున్నాం. ఈ వ్యావహారిక భాషా వాదాన్ని ముందుకు తెచ్చి తెలుగులో మార్పుకు ముఖ్య కారకులు గిడుగు రామమూర్తి పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారు. గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు ఈ సులభమైన తెలుగును తమ కవిత్వంలో ఉపయోగించారు. పత్రికలు, సినిమాలు ఇటువంటి తెలుగునే వాడడంద్వారా దీనికి మరింత ప్రచారం లభించింది.
వచన కవిత్వం ఒక స్థాయిలో మొత్తం సాహిత్యాన్ని శాసించింది. కలిమిలేముల మధ్య పుట్టిన కవిత్వం కుటుంబాలకు ఒక హెచ్చరిక అయింది. సామాజిక ఇతివృత్తంలో నవలలా వచనం స్వైరవిహారం చేసింది. నిడివి తగ్గి, హైకులా నానిలా మారి నూతన జవసత్వాలను అందుకుంది. వన్నెలాది అయిన ప్రబంధ కవితకు మంగళంపాడి నవవన్నెల లతలా మన సమాజ వృక్షాన్ని ఆధునిక కవిత్వలత అల్లుకుంది. ఒక ఒరవడి సృష్టించడం కవిత్వం యొక్క సహజ లక్షణం. ఒక సందర్భాన్ని అనుసరించి పుట్టడం కవిత్వం యొక్క జన్మ కారణం.
7. ఆధునిక కవిత్వంలో మానవతావాదం :
భావకత్వానికి సామాజిక దృక్పథాన్ని జోడించి, మానవత్వాన్ని కేంద్రంగా చేసుకొని గురజాడ వేంకట అప్పారావుగారు ‘మనిషి’ (1912)అనే గేయాన్ని వర్ణించారు. ఆ గేయాన్నే ఆధునిక కవిత్వంలో మొట్టమొదటి మానవతావాద కవితగా అభివర్ణించవచ్చు. దానిలో మానవుడికి మహోన్నతమైన స్థానాన్నిచ్చాడు కవి.
‘‘మనిషి చేసిన రాయి రప్పకి
మహిమ కలదని సాగి మొక్కుతు
మనుషులంటే రాయి రప్పల
కన్న కనిష్టం
గాను చూస్తా వేల, బేలా?
దేవుఁ డెకడో దాగెనంటూ
కొండ కోనల వెతుకులాడే
వేలా?’’
అని ప్రశ్నించి మనుషులు కనిపించే మనుష్యుల్ని ప్రేమించడం కంటే కనిపించని వాళ్లను పూజిస్తున్నారనే ప్రతిపాదనలో మానవతావాదం స్పష్టంగా కనిపిస్తుంది. అంతటితో ఆగిపోకుండా నిజంగా మనిషిని మనిషి ప్రేమించగలిగితే మనిషిలోనే దేవుడు కనబడతాడంటూ ఇలా వర్ణించాడు కవి.
‘‘కన్ను తెరిచిన కానబడడో?
మనిషి మాత్రుడి యందు లేడో?
యెరిగి కోరిన కరిగి యీడో
ముక్తి ?’’
(గురజాడ – మనిషి, గురుజాడలు మహాకవి గురజాడ అప్పారావు సమగ్రరచనలు, పుట: 76)
దీనిలో గురజాడ అప్పారావు మానవాతీతశక్తుల కంటే మనిషిలోని గొప్పతనాన్ని గుర్తించాలన్నారు. అంతేకాదు "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" అంటూ తెలుగు జాతిని జాగృతం చేస్తూ, గురజాడ జానపదులు వాడే మాత్రా ఛందస్సును ఉపయోగించి "ముత్యాల సరాలు" రాసారు. కులాలు, మతాలకి అతీతంగా "ఎంచి చూడ రెండే కులములు, మంచి అన్నది మాల అయిన మాలనేనౌదున్" అన్న మహోన్నత మానవతా వాది గురజాడ.
బ్రిటీషువారిఏలుబడిలో భారత దేశంలో స్వాతంత్య్ర భావాలు పెల్లుబుకుతున్న వేళ, బెంగాలీ భాషలో రవీంద్రునిలాంటి కవుల ప్రభావం దేశమంతా వ్యాపిస్తున్న వేళ, గాంధీ నాయకత్వంలో దేశమంతా ఒక్కటై స్వాతంత్య్ర గీతిక పాడే వేళ, తెలుగులోనూ ఆ భావ కవితలు బలంగా నిలిచాయి.
"యేదేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని" అన్నారు రాయప్రోలు. రోమాంచం కలిగించే కృష్ణ శాస్త్రి "జయ జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి" , శంకరంబాడి రాసిన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" కలకాలం నిలిచి ఉండే కవనాలు. దైవభక్తి కూడా కాల్పనికోద్యమంలో భాగంగా కొనసాగించారు తిరుపతి వెంకట కవులు. వీరి "పాండవోద్యోగవిజయాలు" అత్యంత ప్రజాదరణ పొందినవి. “చెల్లియో చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచిరందరున్" విని ఆనందించని వారుండరేమో. పౌరాణిక రచనలోనూ శిష్టవ్యవహారిక భాషను వాడడం కన్పిస్తుందిక్కడ.
పద్యం మీద తిరుగుబాటు చేయటం కోసం వచన కవిత్వం 18వ శతాబ్దంలోనే పుట్టింది. అది చిన్నగా హద్దులు దాటుతూ 19వ శతాబ్దం చివరి నాటికి మర్రివృక్షంలా ఎదిగింది. నేడు వచనం తప్ప పద్యం ఎక్కువగా వినపడని కాలంలా నడుస్తుంది. దీనితోపాటు వచనంలో కూడా విభిన్న రకాల రూపపరమైనప్రక్రియలు వచ్చాయి. వైనం లేని కవితలు ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ప్రతి మనిషీ, కవే అన్నట్లు కనిపిస్తుంది. ప్రతి వ్యక్తీ, రచయితే అన్నట్లుగా రాజ్యమేలుతుంది.
అసలు సాహిత్యం పుట్టిందే సమాజానికి హితం చెప్పటం కోసం. సాహిత్యాన్ని ఒక సాధనంగా చేసుకొని సమాజాన్ని ఒక దారిలో పెట్టడానికి మన కవులు ఎంతో శ్రమించారు. సమాజం వ్యక్తులతో నడిచే ఒక వ్యవస్థ. ఈ వ్యక్తికి కొన్ని విలువలు ఉండాలని మన కవులు ఏకరువు పెట్టారు. ఆ పరంపరలో భాగంగా కవిత్వపు అలలు సామాజిక విలువల తీరం చేరాయి.
8. ఆధునిక కవుల అంతర్మథనం:
ఇరవయ్యో శతాబ్దంలో చాలా మార్పు వచ్చింది కవిత్వంలో. ఇదివరకటి కవులుబాహ్య దృష్టిలో ప్రకృతి అందాన్ని, ప్రేమను, సంఘటనలను వర్ణించేవారు. కాని ఆధునిక కవులు అంతర్ముఖులు. కనిపించేదాన్ని వెనుక ఉండేదాన్ని గురించి ఆలోచిస్తారు. వారి కవిత్వంలో అంతర్మథనం ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. పరిసరాలను చూసి మనసారా ఆనందించడం కాకుండా ఆలోచన, మానసిక విశ్లేషణ ఎక్కువగా ఉంటాయి. కొంత అసంతృప్తి, అన్నిటిమీద అపనమ్మకం, నిరాశావాదం, అభద్రతా భావం, ప్రపంచీకరణ ప్రభావంతో ప్రాంతీయ తత్వాన్ని తగ్గించుకోవడం, ఆదర్శ ప్రాయంగా, నైతికంగా ఉండాలనే కోరిక పెద్దగా లేకపోవడం, పురాణేతిహాసాలను, చరిత్రను తమ సిద్ధాంతాల కనుగుణంగా మార్చి రాయడం (రామాయణ విషవృక్షం లాంటివి) ఆధునిక కవిత్వంలో ముఖ్య విషయాలు. ఆంగ్ల సాహిత్యంలో సామీప్యాన్ని పెంచుకొన్న గుంటూరు శేషేంద్ర శర్మ అత్యంత ఆధునికుడని చెప్పాల్సి ఉంటుంది. తెలుగు కవిత్వాన్ని ప్రపంచపటంపై నిలిపిన గొప్ప కవి, విమర్శకులు శేషేంద్ర శర్మ. "నా దేశం నా ప్రజలు" ఆయన ప్రముఖ రచన. ఆధునిక మానవ జీవితంలోని క్లిష్టతను వివరించే ఈయన కవిత్వం చాల నర్మగర్భంగా ఉంటుంది. ఏదీ పైకి కనువించినట్లుగా ఉండదు. లోతైన గంభీర భావనలు, నేరుగా కాకుండా సంకేతాలు, ప్రతీకలు ఉపయోగించి వ్యక్తీకరించడం ఆయన ప్రత్యేకత. పోలికలు కూడా సాంప్రదాయిక రీతిలో కాకుండా అపూర్వంగా ఉంటాయి. ఆత్మగత కవిత్వం అర్థం చేసుకోవడం కొంత కష్టమయినా కష్టానికి తగిన రసాస్వాదన చేస్తాడు పాఠకుడు. విప్లవ కవిత్వాన్ని పక్కకు నెట్టి పూర్వపు కవితా ధోరణిని పునరుజ్జీవింప జేసిన తిలక్, విశ్వనాథ, శేషేంద్రలాంటి వారిలో నియోక్లాసికల్ కవుల లక్షణాలు కనిపిస్తాయి. మరొకరి రచన ఆధారంగా వ్యంగ్యాన్ని, హాస్యాన్ని జోడించి రాసేది పేరడి. ఇది ఒక కవితా ధోరణి. వెంకటగిరి రాజ కుటుంబానికి చెందిన సాయిక్రిష్ణ యాచేంద్ర "గేయధార" ఒక సాటిలేని వినూత్న ప్రక్రియ. ఆశు కవిత్వం, అవధానం, గేయ రచన, సంగీతం కూర్చడం, రాగ తాళాలతో పాడడం అన్ని కలగలిపిన ఈ గేయధార ఒక అపూర్వ సమ్మేళనం. వీటన్నింటినీ ఈ వ్యాసంలో వివరించడం కష్టం. అందువల్ల ముఖ్యమైన కొంతమంది కవుల కవితలను విశ్లేషించుకుందాం.
9. తిలక్ కవిత్వంలో మానవతావాదం:
తెలుగు కవిత్వంలో వచన కవిత్వం ఒక ఒరవడిని సృష్టించింది. ఈ ప్రక్రియలో తిలక్, శ్రీశ్రీ వంటి కవులు ఎంతో గొప్పగా పేరు పొందారు. అందులో తిలక్ రాసిన కవితలు ఎంతో మంది ఆలోచనా విధానాలు మార్చి వేశాయి. మానవతావాదాన్ని పతాకస్థాయిలో నిలిపాయి. నా కవిత్వం (1941) పేరుతో రాసిన కవితలో-
‘‘నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.’’ అని తన కవిత్వంలో పీడించేవారి పక్షాన ఉండదనడంలో మానవత్వానికి అత్యంత ముఖ్యమైన ప్రేమను కురిపించే లక్షణాన్ని స్ఫురింపజేస్తూ...
“గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.
అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల దగద్ధగ రవాలు’’ అని అన్నాడు కవి.
‘అగాధ బాధా పాథః పతంగాలూ’ అనడం ద్వారా తాను పేదల పక్షాన కవిత్వం రాస్తున్నట్లు స్పష్టంగా చెప్తున్నాడు కవి. అంతే కాదు. తన కవిత్వ లక్ష్యాలుగా కింది మూడు పంక్తుల్లో ఇలా వివరించాడు.
‘‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’’
(అమృతం కురిసిన రాత్రి, నాకవిత్వం, పుట: 1)
వీటితో పాటు అమృతం కురిసిన రాత్రి కవితాసంపుటిలో అనేక కవితల్లో మానవతావాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్తగీతం పేరుతో రాసిన కవితలో ఈ మానవతావాదం మరింతస్పష్టంగా కనిపిస్తుంది.
"నేను చూశాను నిజంగా- ఆకలితో అల్లాడి
మర్రిచెట్టు క్రింద మరణించిన ముసలివాణ్ణి-
నేను చూశాను నిజంగా- నీరంధ్ర వర్షాన
వంతెన క్రింద నిండు చూలాలు
ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని!
నేను చూశాను నిజంగా-
తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ
మోచేతులతో కన్నులు తుడుచుకుంటూ
మురికి కాల్వ పక్కనే నిద్రించిన మూడేళ్ళ పసిబాలుణ్ణి
నేను చూశాను నిజంగా, మూర్తిభవత్ దైన్యాన్ని, హైన్యాన్ని....
నాకు శాంతి కలగదింక నేస్తం నిగర్వినైనాను.
ఈ ఆర్తి ఏ సౌదాంతరాలకు పయనించగలదు?
ఏ భగవంతునికి నివేదించకోగలదు??..’’ అంటూ కొనసాగే కవిత్వమంతా మానవతావాదాన్ని ప్రతిబింబించేదే.
శ్రీశ్రీ రాసిన కవితలు ఏకంగా విప్లవాలనే సృష్టించాయి. తిలక్ కవితల్లో: దేవరకొండ బాల గంగాధర తిలక్ "అమృతం కురిసిన రాత్రి" అనే కవితా సంపుటిని వెలువరించారు. ఆ కవితల్లో మానవత్వం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. తిలక్ తన రచనలో మధ్యతరగతి ప్రజల గురించి రాస్తూ..
"చిన్నమ్మా
వీళ్ళందరు తోకలు తెగిన ఎలుకలు
కలుగుల్లోంచి బయటికి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
ఆకలి అవసరం తీరని కష్టాలు,
గడులు వాచకాలలోని నీతులను వల్లిస్తారు" అని అంటారు.
నిజమే కదా మధ్యతరగతి ప్రజలు అంతత్వరగా వాళ్ళున్న వలయం నుంచి బయటపడలేరు. ఆకలి అవసరం వాళ్ళని నానా ఇబ్బందులకు గురిచేస్తుంది. మన దేశంలో ఇలా అల్లాడే మధ్యతరగతి ప్రజలే ఎక్కువ. స్వేచ్చ కోసం తిలక్ రాసిన కవితలు అత్యంత సుందరంగా ఉంటాయి. “సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నానునేడు అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు. చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి." అంటూ నూతన సమాజ నిర్మాణం కోసం తన కలాన్ని కదిపాడు. మన జాతికి గొడ్డలి పెట్టు కుల,వర్ణ, వర్గ విభేదాలే అని గట్టిగా నమ్మిన వ్యక్తి తిలక్.
అందుకే తన కవిత్వంలో సహజ ప్రకృతిని వర్ణిస్తూ మనం మర్చిపోయిన మానవత్వ విలువలను మరలా మనకి గుర్తు చేస్తాడు. అసలు తిలక్ రచన చేపట్టినదే సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి అన్నది అక్షర సత్యం. అంతేకాదు మధ్యతరగతి ప్రజల సమస్యలను వివరిస్తూ…
"అక్కయ్యకు రెండో కానుపు/తమ్ముడికి మోకాలి వాపు/చింతపండు ధర హెచ్చింది./చిన్నాన్నకు మతి భ్రమించింది /లేచిన మరుక్షణం ఎన్నో ప్రశ్నలు/ గోరుచుట్టలా సలిపే లక్షల సమస్యలు" అంటూ
అనేక సమస్యలను తన అమృతంకురిసిన రాత్రి కవితాసంపుటిలో వర్ణించారు. మానవుల సహజమైన వ్యాధుల్ని వర్ణిస్తున్నట్లు అనిపించినా, మధ్యతరగతి కుటుంబాల్లో నిత్యం ఇలాంటిస్థితి జరగడం వెనుక ఆర్థిక భారం, దానివల్ల వచ్చే అనర్థాలు తెలియాలంటే సమాజంలో ఉండే ఆర్థిక వ్యత్సాసాల్ని అర్థం చేసుకోవాలి. ఇలా ఆర్థిక వ్యత్సాసాలు రావడం వెనుక నలిగిపోయే మానవత్వాన్ని గుర్తించాలి.
10. శ్రీశ్రీ రచనల్లో మానవతావాదం :
శ్రీశ్రీ కవిత్వంలో మానవత్వాన్ని మేల్కొల్పే కవితలు ఉన్నాయి. మహాప్రస్థానం వచనకావ్యంలో "భిక్షువర్షీయసి" అనే కవితలో ఆకలితో అలమటిస్తున్న ముసలి అవ్వను వర్ణించే విధానం కన్నీరు తెప్పిస్తుంది.
‘‘దారిపక్క, చెట్టుకింద,/ఆరిన కుంపటి విధాన/కూర్చున్నది ముసల్దొకతె/మూలుగుతూ, ముసురుతున్న/ ఈగలతో వేగలేక./ముగ్గుబుట్టవంటి తలా,/ముడుతలు తేరిన దేహం,/కాంతిలేని గాజుకళ్లు/తన కన్నా శవం నయం.’’
అనడం ద్వారా ఒక దయనీయమై దృశ్యాన్ని వర్ణిస్తాడు కవి. భిక్షగాళ్లలో మానవత్వాన్ని చూసి కవిత్వం రాయడం ఎంతో అరుదైన విషయం. ఈ కవిత చదివిన వారు తాము భిక్షం వేయకపోయినా వాళ్ళను అసహ్యించుకోరు. కవి పాఠకుల్లో సహృదయతను పెంపొందిస్తాడు. అదే శ్రీశ్రీ కూడా చేస్తున్నాడు.
కలిమి లేముల గురించి శ్రీశ్రీ రాసిన కవితలు కోకొల్లలు, నిద్రపోతున్న యువ జనానికి షాక్ ఇచ్చే విధంగా ఉంటాయి శ్రీశ్రీ వాక్యాలు. "మనదీ ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె" అంటూ తన మహాప్రస్థానంలో మనం మరిచిపోతున్న మన విలువలను తట్టిలేపుతున్నాడు కవి. తలకు మాలిన పనులు చేయకుండా సంఘానికి పనికి వచ్చే పనులు చేసి గుర్తింపు పొందమని హెచ్చరించాడు. ప్రతిజ్ఞ’ గేయంలో శ్రీశ్రీ శ్రామికవర్గం కోణం నుండి మానవతావాదాన్ని వర్ణిస్తాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల జీవితాల్ని వర్ణించే కవితగా చెప్పుకోవచ్చు.
‘‘పొలాలనన్నీ/హలాలదున్నీ,/ ఇలాతలంలో హేమం పిండగ-/జగానికంతా సౌఖ్యం నిండగ-/ విరామమెరుగక పరిశ్రమించే/, బలం ధరిత్రికి బలికావించే/,కర్షక వీరుల కాయం నిండా/ కాలువకట్టేఘర్మజలానికి /, ఘర్మజలానికి/ధర్మజలానికి,/ ఘర్మజలానికి ఖరీదు లేదోయ్!’’
ఇలా విశ్లేషించుకుంటూ పోతే ఇంచుమించు ప్రతి ఆధునిక కవిలోను మానవతావాద ధోరణితో రాసిన కవిత్వం కనిపిస్తుంది. వచన కవిత్వంతో పాటు ఆధునిక కవిత్వంలో రూపపరమైన ప్రయోగాలు ఎన్నో వస్తున్నాయి. వాటిలో హైకూ, నానీలలో ప్రతిఫలించే మానవతావాదాన్ని ఇక్కడ స్థాలీపులాకన్యాయంగా ప్రస్తావిస్తాను.
11. హైకూలలో మానవతావాదం :
తెలుగు సాహిత్యంలో ప్రవేశించిన జపనీస్ ప్రక్రియ హైకూ. మూడు పాదాలు కల రచన. మొదటి పాదంలో ఐదు. రెండవ పాదంలో ఏడు మూడవ పాదంలో ఐదు చొప్పున అక్షరాలు ఉంటాయి. సరళీకృతం అయిన తెలుగు పదజాలం ఈ హైకూల సొంతం. అయితే హైకూ విలక్షణమై భావ జాలాన్ని కలిగి ఉంటుంది. చిన్న వాక్యాలలో అతి పెద్ద భావాలను ఇమడ్చడం ఇందులోని ప్రత్యేకత. హైకూలు సమాజాన్ని ఒక నూతన కోణంలో ఆలోచించేలా చేశాయి. బి.వి.వి ప్రసాద్ అను హైకూ రచయిత సమాజాన్ని దృష్టి లో ఉంచుకొని రచన చేయడంలో సిద్ధ హస్తులు. ఆయన రచనల్లో సరికొత్త ఒరవడి ఉంటుంది. ప్రసాద్ కవిత్వంలో వచ్చిన మార్పులు ఏమిటో, వాటి స్వరూప స్వభావాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కవిత చూడండి:
“ఎప్పుడూ విసుక్కునే కొడుకు/తల్లి పాదాలు తాకి దీవించమన్నప్పుడు/ ఆమె కళ్ళల్లో ఎన్నడూ చూడని కన్నీరెందుకొస్తుంది?/ గాయపరిచాను క్షమించమన్నపుడు/ అప్పటివరకు వెలవెలబోతున్న భార్య కనుల వెంట చాలా ఖర్చవుతుందేమో వద్దులే నాన్న అని పిల్లలన్నపుడు/ వారి లేత దయాపూర్ణ హృదయాలు తలచి అతని కన్ను లెందుకు చెమ్మగిలుతాయి./... అణగారిన మంచినెవరైనా గుర్తించిన ప్రతిసారీ,/ఆపలేని ధారలెందుకు కొస్తాయి./లేదనుకున్న మంచితనం ఎదురైన ప్రతిసారీ,/ఎవరినెవరైనా మంచితనంతో గెలుస్తూ గెలిపించిన ప్రతిసారీ/ మన కళ్ళెందుకు చెమరుస్తాయి./మన కంఠాలెందుకు రుద్దమౌతాయి" (‘హృదయం ప్రవేశించినపుడు' - ఆకాశం, 2011).
ఇలా సాగుతుంది యీ కవిత. సాధారణ మానవసంబంధాలలో దాగివున్న సౌందర్యాన్ని, దయని, కరుణని, దైవత్వాన్ని పునఃప్రతిష్ట చేసే కవిత్వం ఇది. అయితే ఇక్కడ వచ్చిన మార్పు గురించి స్పష్టంగా వివరించాలి.
12. నానీలు – మానవతావాదం:
తెలుగులో ఎన్.గోపి గారిచే సృష్టించబడిన ప్రక్రియ నానీలు. నానీలు అంటే అర్థం నావి నీవి కాదు మనవి అని అర్థం. ఈ నానీలు నూతన యువకవుల రచనలో పోటీ గుర్రాలు గా ముందుకు వచ్చాయి. ఈ నానీలు రాయడం చాలా మంది నేర్చుకొని నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. నానీలకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడు గా ఉన్న డా. తలతోటి పృథ్వీ రాజ్ రాసిన నానీలను చూడండి.
"సామాజిక కవిత్వం ప్రారంభించాను.
కలం
అక్షరాల కొలిమైంది భార్యంటే నేటి అర్థం.
భర్తలో సగం కాదు
సుఖాల్లో శూన్యం
కష్టాల్లో పూర్ణం‘‘
ఇలా చిన్న పదాలలో భార్యాభర్తల సంబందాన్ని సాహిత్యం లక్ష్యాన్ని వివరించడం చాలా చక్కటి విధానం. అందుకే హైకూలు నానీలు తెలుగు సాహిత్యంలో రేసు గుర్రాలు లాగా దూసుకుపోతున్నాయి. సాహిత్యం ఏదైనా దాని బహిరవయవం అందంగానూ అంతరవయవం సౌమ్యంగానూ ఉంటే అది అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా
చేరగలుగుతుంది.
ఇలాగే సహజ సుందరంగా అనేక విషయాలను ఎన్. గోపి కవిత్వీకరించారు.
కుండముక్కలైందా
కుమిలిపోకు
మట్టి మరోరూపం కోసం సిద్ధమౌతుంది.
బూడిదై
ఏటిపాలైన ప్రేమ
చెరుకుగడలోంచి
నోటిలో నిండింది..! నీటిలో మంచుముక్క బడాయిగా తేలింది.
ఎంతసేపు గర్వం నీరౌటానికి. తిడదామని వెళ్ళాను, 'కొ'ట్టు అన్నాడు.
గెలిచింది
అతడా..? నేనా..??
ఇలా ప్రేమ గర్వం జీవితం వంటి విషయాలు కవిత్వానికి వస్తువులు. కవి తాను అనుకున్న భావాన్ని ఎంతో చక్కగా పదాల మెరుపులతో విరుపుల లో భావాన్ని రక్తి కట్టించగలడు. కవిత్వం ఒక వ్యసనం అని పెద్దలు అంటూ ఉంటారు. కొంతమంది కవులను చూస్తే ఆ మాట నిజమేనేమో అని అనిపిస్తుంది. జీవితం అనే చదరంగంలో గెలుపోటములు సహజసిద్ధమైన అంశాలు. ఓడినంత మాత్రాన నిరుత్సాహం పడాల్సిన అవసరం లేదు. తప్పక విజయం సాధిస్తామని దృఢంగా నమ్మి మళ్ళీ ఆటను మొదలు పెట్టాలి. లేదంటే గెలిచిన వాడికి మనం దాస్యం చేయక తప్పదు. ఇలాంటి మాటలు కవిత్వానికి విందు భోజనం లాంటిది.
13. ముగింపు:
వాసిలో మన తెలుగు సాహిత్యం ఎంతో గొప్పది. సమాజంలో మానవ జీవితము ధర్మబద్ధము కావాలని, అందరి మేలు కోరుతూ మానవత్వంతో మసలుకొన్నప్పుడు సుఖశాంతులు వర్ధిల్లి అభ్యుదము సిద్ధిస్తుంది. మన తెలుగు భాషా సాహిత్యకారులైన కవులందరు ఒకే గొంతులో ఇదే సందేశమందించారు. నాటినుండి నేటివరకు నిరంతర పరిణామశీలంగా సాగుతున్న తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తే పూలదండలో దారంలా మానవతా విలువలను కవులు ముక్తకంఠంతో ప్రబోధించిన విషయం స్పష్టమౌతున్నది. మానవత్వం లేని జీవితం వాసనలేని పూవులా, మాధుర్యం లేని ఫలంలా, శ్రావ్యతలేని గానంలా, ఏకాగ్రత లేని ధ్యానంలా, గమ్యం లేని ప్రయాణంలా, లక్ష్యం లేని సాధనలా, చిత్తశుద్ది లేని పూజలా, సందేశం లేని సాహిత్యంలా నిరర్థకం అవుతుంది
14. ఉపయుక్తగ్రంథసూచి:
- అప్పారావు, గురజాడ. (2012). గురుజాడలు – మహాకవి గురజాడ అప్పారావు సమగ్రరచనలు. పి.గోపాలకృష్ణ (సం.పా.), హైదరాబాదు: ఎమెస్కో ప్రచురణలు.
- అరుణకుమారి, జి. ఆధునిక తెలుగు కవిత్వంలో మానవతావాద ధోరణులు. హైదరాబాదు విశ్వవిద్యాలయం, అముద్రిత సిద్థాంత గ్రంథం 1985.
- ఆరుద్ర. ( పు.ము. 1989-1991). సమగ్ర ఆంధ్ర సాహిత్యం. విజయవాడ: ప్రజాశక్తి బుక్ హౌస్. (తొ.ము. 1965-1968).
- జగన్నాథం, పేర్వారం.(సం.పా.).(1987). అభ్యుదయ సాహిత్యానంతరధోరణులు. వరంగల్లు.: సాహితీ బంధు బృందం.
- నారాయణ రెడ్డి, సి. (1967). ఆధునికాంధ్ర కవిత్వము: సంప్రదాయములు-ప్రయోగములు. సికింద్రాబాద్: ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్.
- నారాయణరావు, వెల్చేరు. (1987). తెలుగులో కవితావిప్లవాల స్వరూపం. హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ట్రస్ట్.
- బాలగంగాధరతిలక్. దేవరగొండ (2004 పదకొండవ ముద్రణ). అమృతం కురిసిన రాత్రి. హైదరాబాద్: విశాలాంధ్ర బుక్ హౌస్.
- మంజులత, ఆవుల. (సం.పా.). (2016). తెలుగులో కవిత్వోద్యమాలు. హైదరాబాద్: తెలుగు అకాడమీ.
- రంగనాథాచార్యులు, కె.కె. (సం.పా.). (1982). తెలుగు సాహిత్యంలో విభిన్నధోరణులు. ఆంధ్ర సారస్వత పరిషత్తు: హైదరాబాద్.
- రామమోహన్ రాయ్, కడియాల. (1982). తెలుగు కవితావికాసం (1947-1980). హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.
- శ్రీశ్రీ. (1948). మహాప్రస్థానం. (కూర్పు). చలసాని ప్రసాద్. విశాఖపట్టణం: విప్లవ రచయితల సంఘం.
- సంజీవరావు, తూమాటి. (సం.పా.). (2017). తెలుగు సాహిత్యంలో దేశభక్తి. చెన్నై: తెలుగు భాషా వికాస పరిషత్.
- సత్యనారాయణ, ఎస్వీ. (2005). తెలుగులో ఉద్యమగీతాలు. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం.
- సుబ్రహ్మణ్యం, .జి.వి.(1983). ఆంధ్రసాహిత్య విమర్శ-ఆంగ్ల ప్రభావం. సికింద్రాబాద్: యువభారతి.
- సుబ్రహ్మణ్యం, .జి.వి.(1991). సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. హైదరాబాద్: తెలుగు అకాడమి.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

