headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-5 | Issue-14 | December 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

2. 'యాజ్ఞసేని ఆత్మకథ' నవల : ద్రౌపది అంతరంగం

డా. టి. డి. రాజన్న తగ్గి

అసోసియేట్‌ ప్రొఫెసర్, కన్నడ శాఖ
కర్నాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం
కడగంచి, కలబురగి, కర్నాటక, 585367
సెల్: +91 8904446344, Email: tdrajannathaggi@cuk.ac.in
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.11.2024        ఎంపిక (D.O.A): 28.11.2024        ప్రచురణ (D.O.P): 01.12.2024


వ్యాససంగ్రహం:

మన పురాణకావ్యాలను విశ్లేషించుకుని పునర్విమర్శ చేసుకోవడం ఈ నాటి తక్షణ అవసరం. ఈ పౌరాణిక పాత్రలను ఆధునికదృక్పథంలో విమర్శించండం, వాటి లోతుపాతులను విమర్శనాత్మకంగా విపులీకరించడం వాటిని పరిశోధనాత్మకంగా పరిశీలించి ఒక్కోపాత్ర గురించి ప్రత్యేకంగా గ్రంథాలు రాయడంలాంటి పనులు చాలామంది చేస్తున్నారు. ఈ దృష్టికోణం నుంచి మన పురాణాలను ఆధారం చేసుకుని ద్రౌపదిపాత్రను ఆధునికదృక్పథంతో కన్నడంలో డా. జయదేవి గాయకవాడ్ రాసిన నవల ‘యాజ్ఞసేని ఆత్మకథ’. ఈ వ్యాసంలో ‘యాజ్ఞసేని’ అనే పేరుతో ద్రౌపది అంతరంగాన్ని ఒక కొత్త కోణంలో చిత్రించిన తీరుని స్త్రీవాదదృక్పథంతో విశ్లేషించే ప్రయత్నంలో ‘యాజ్ఞసేని ఆత్మకథ : ద్రౌపది అంతరంగం’ అనే శీర్షికను రూపొందిచాను. ఈ వ్యాసంలో ద్రౌపది మనోవేదనను, ఈ నాటి స్త్రీవాద దృక్పథంలో ఆనాటి ద్రౌపది పాత్రను విశ్లేషించడం జరిగింది. ఇంతకు ముందు ప్రొ. వి.కె. మణిమాలిని పిఎచ్.డి. పట్టాకోసం మహాభారతకథను ఆధారంగా తీసుకుని ‘ద్రౌపది సమీక్ష’ అనే పరిశోధనాగ్రంథం 1993లో ప్రచురించారు. ఈ వ్యాసంకోసం జయదేవి ‘యాజ్ఞసేని ఆత్మకథ’, మణిమాలిని ‘ద్రౌపది సమీక్ష’ ఈ గ్రంథాలను ఆధారంగా తీసుకున్నాను. భారతంలో ద్రౌపది ఎలా ఒక విధి వంచితురాలయింది. అలా కావడానికి వెనుక పాండవులు, కుంతీదేవి, ఈ పురుషాధిక్య సమాజమూ, ఆ రాజ్యవ్యవస్థ ఎలాకారణాలయ్యాయో, తమ స్వార్థంకోసం, తమ ఆధిక్యతకోసం ఇవి ఆమెను ఒక పావుగా, ఒక భోగవస్తువుగా ఎలా వాడుకున్నాయో స్త్రీ సహజమైన మనోదృష్టిలో విశ్లేషించడం కోసం ఈ వ్యాసాన్ని ద్రౌపది పాత్ర విశ్లేషణ, ద్రౌపదిమనోవేదన, మాతృవేదన, ద్రౌపదిప్రతిరోధం, శ్రీకృష్ణుని పాత్ర గురించి, అనే ఉపశీర్షికలతో విభజించుకున్నాను. స్త్రీ కూడా ఒక మనిషేననీ, ఆమెకూ ఒక మనసుంటుందనీ, ఒక వ్యక్తిత్వం వుంటుందనీ, ఆమెకూ మానవ సహజమైన ఆశలు, ఆరాటాలు, ఆదర్శాలూ వుంటాయనీ గుర్తించని ఈ మగ పెత్తన సమాజం తన ప్రజ్ఞతో వాటిని ఎలా నిర్వీర్యం చేస్తుందో తెలియ జేసే ప్రయత్నం ఈ వ్యాసముఖ్యఉద్దేశం. ఇందులో స్త్రీ అయిన యాజ్ఞసేని తన జీవితాన్ని, తనకు అడుగడునా పురుషుల చేతుల్లో జరిగిన అవమానాలను, అణచివేతను విమర్శనాత్మక రీతిలో ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించడం, ఆ ఆవిష్కరించడంలో రాబోయే కలియుగంలోనైనా స్త్రీలు ఆత్మగౌరవంతో, స్వేచ్ఛగా, పురుషుడితో సమానంగా బతకాలన్న ఆకాంక్షను తెలియపరచడం ముఖ్య ఉద్దేశం.

Keywords: ద్రౌపది, యాజ్ఞసేని, స్త్రీవాదం, దృక్పథం, ఆత్మకథనాత్మక, సంవాదం, వేదన, మనోదృష్టి

1. ఉపోద్ఘాతం:

ఏ సాహిత్యమైనా ఆయా దేశ, కాల, పరిస్థితికనుగుణంగానే పుడుతుంది. ఎంతటి కల్పితమైనప్పటికీ, అందులో ఆ నాటి సాంఘిక పరిస్థితుల్లో వాటికనుగుణమైన భావజాలం వంటి అంశాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి. వాటిని గుర్తించి విశ్లేషిసించుకోవడంలోనె ఉంది ప్రజ్ఞ. కావలిసిందల్లా ఆ నాటి దేశ కాల పరిస్థితుల్ని గమనంలొ వుంచుకుని సద్విమర్శనాత్మకంగా ఆలోచించుకోవడమే.

పాత సాహిత్యమంతా వట్టి ట్రాష్. పాత చింతకాయ పచ్చడి అని, అభూత కల్పనలనీ, ఫ్యూడల్ భావజాలంతో రాయబడిందనీ ఒక్క మాటలొ కొట్టి పారేయడం కూడ అజ్ఞానమే అవుతుంది. మంచి గతమున కొంచమేనోయ్ అని గురజాడ లాంటి సాహిత్య వైతాళికులు అంటే అనవచ్చుగాక ఆ కొంచమైన మంచి సాహిత్యం చారిత్రిక సత్యాలను వెలికి తీసి అందించాల్సిన అవసరం ఎంతయినా వుంది.

ఈ ప్రయత్నం మొదటినుంచీ అడపాదడపా సాగుతూనె వుంది. పౌరాణిక పాత్రలను నవీన దృక్పథంలో విమర్శించండం, వాటిని విమర్శనాత్మకంగా పరిశీలించడం, వాటిని పరిశోధనాత్మకంగా విశ్లేషించి ప్రతి పాత్ర గురించి ప్రత్యేకంగా పుస్తకాలు రాయడంలాంటి పనులు చేస్తున్నారు. ఇలా చేయండం ద్వారా ఆయా పాత్రలకు సంబంధించి ప్రజల్లో ఇప్పటికే పాదుకొని ఉన్న అభిప్రాయాలస్థానే నూతన దృక్పథాన్ని కలుగజేయాలన్నది రచయితల ఉద్దేశం. ఈ తరహ చిత్రాలు, రచనలు ఇప్పటికే దేశంలోని అన్ని భాషల్లోను వెలువడ్డాయి.

తెలుగులో ఆధునిక సాహిత్యానికి ఆధ్యుడైన గురజాడ మొదలు ఈ నాటి ఓల్గా వరకూ కొందరయినా కాస్తూ కూస్తూ ఆలోచిస్తూనే వచ్చారు. త్రిపురనేని రామస్వామి చౌదరి రామాయణ పాత్రలను ఇలాంటి దృక్పథంతో పరిశీలించి, విమర్శించి ఆ పాత్రలను ఆధునీకరించారు. ఈ దృష్టికోణం నుంచి మన పురాణాలను ఆధారం చేసుకుని రచనలు చేసి మెప్పించిన వారిలో చలం, దేవులపల్లి, నార్ల చిరంజీవి, రంగనాయకమ్మ, డి.ఆర్. ఇంద్ర, సౌదా, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ లాంటి వాళ్ళు కొందరున్నారు. ఇందులో రంగనాయకమ్మ రామాయణ విషవృక్షంలో పాత్రలను భిన్న దృక్పథంతో పరిశీలించారు. ఎన్.టి. రామారావు తన్న చిత్రాల్లో రావణ, దుర్యోధనాది పాత్రలను విభిన్నంగా ప్రదర్శించారు. ఇలా పాత్రలను తిరగరాయడం అన్నది వాళ్ళ వాళ్ళ తార్కికతనుబట్టి ఉంటుంది. అలాగే కె. రామలక్ష్మిగారు కూడ ద్రౌపది పాత్రను నూతన దృష్టికోనంలో ఆవిష్కరించారు.

ఇటు కన్నడంలో కూడా ఆదికవి పంప మొదలుకొని ఈ నాటి ఎస్.వి. ప్రభావతి వరకూ పురాణ పాత్రలను భిన్న దృష్టికోణంతో రాసిన రచనలు చాలా వచ్చాయి. ఈ మధ్యకాలంలో భారతం పైన ఆధునిక దృక్పథంతో కన్నడంలో వచ్చిన అద్భుతమైన నవల ఎస్ ఎల్ భైరప్పగారి ʼపర్వʼ. ఆ తర్వాత డాక్టర్ జయదేవి గాయకవాడ్ రాసిన నవల ʼయాజ్ఞసేని ఆత్మకథʼ. అలాగే రామాయణం పైన ఎస్.ఎల్. భైరప్ప రాసిన ʼఉత్తరాకాండʼ ముఖ్యమైనవి. ఈ మూడూ నవలలు పురాణాన్ని భిన్నకోణంలో చిత్రించినవి.

ఇందులో జయదేవి గాయకవాడ రాసిన యాజ్ఞసేని ఆత్మకథ అనే నవలను స్త్రీవాద దృక్కోణంలో విశ్లేషించడం ఈ వ్యాస ప్రధానోద్దేశం.

2.1  ద్రౌపది పాత్ర విశ్లేషణ :

జయదేవి గాయకవాడ ఈ నవలలో ద్రౌపది పాత్రను ఇంతకు ముందు ఎవరూ చిత్రించని విధంగా ʼయాజ్ఞసేని ఆత్మకథʼ పేరుతో ఒక కొత్త కోణంలో చిత్రిస్తూ నవలను రాశారు. ఇది ఈ నాటి స్త్రీవాద దృక్పథంలో ఆ నాటి ద్రౌపది పాత్రను పునఃసృష్టి చేసి చిత్రించిన నవల.

ఈ నవల యాజ్ఞసేని స్వయంవరంతో ప్రారంభమై, ఆమె బిడ్డలైన ఉప పాండవుల చావుతొ ముగుస్తుంది. ప్రధానమైన ఈ రెండు ఘటనల మధ్య ద్రౌపది కేంద్ర బిందువుగా మొత్తం భారత కథ గిర్రున తిరుగుతుంది. ఇందులోని ప్రతి సంఘటనా, మన కళ్ళముందు బొమ్మకట్టి, ఒక దృశ్యరూపకాన్ని చూసినంత అనుభూతిని కలిగిస్తుంది.

పురాణలలో చిత్రించబడిన స్త్రీ పాత్రలలో ద్రౌపది మరియు సీత పాత్రలు చాలా ముఖ్యమైనవి. ఈ రెండు పాత్రల మధ్య చాలా అంతరమున్నట్టే ఈ పాత్రల సృష్టిక్రమంలో కూడా భిన్న దృష్టికోణం కనిపిస్తుంది. సీతా అరణ్యవాసానికి ఎటువంటి ప్రతిరోధలు లేకుండ వెళుతుంది. కానీ ద్రౌపది మాత్రం ప్రతీకారమనే ప్రతిజ్ఞతో అరణ్యవాసానికి వెళుతుంది. ఈ ఇద్దరిలో సీతకన్న ద్రౌపది ఎదురుకొన్న అగ్నిపరీక్షలు అధికం. అదే విధంగా పురాణ స్త్రీ పాత్రలలో అధిక చర్చకు గురియైన పాత్రా ద్రౌపదియే.

ʼఅమెకున్న అగ్నికన్యత్వం, పంచపతిత్వం, బుద్ధిమత్వం, అతిలోక సౌందర్యం… అన్నీ ఇతర పాత్రాలకన్న భిన్నంగా గోచరిస్తాయి. కానీ వాటివల్ల ఆమెకు బాధ తప్ప మరేమీ దొరకలేదు. ఆమె తన జీవితకాలమంతా స్వేచ్ఛకోసం, అస్తిత్వంకోసం, ప్రేమకోసం, తన పిల్లల భవిష్యత్తుకోసం చేసిన పోరాటాలు చెప్పనలవి కానిది. అవి ఆమె పడ్డ అష్టకష్టాలను పరిచయం చేస్తాయిʼ.1

నిజానికి భారతంలో ద్రౌపది ఒక విధి వంచితురాలు. అలా విధి వంచితురాలు కావడానికి వెనుక ఈ పురుషాధిక్య సమాజమూ, ఆ రాజ్య వ్యవస్థ ఎలా కారణాలయ్యాయో, తమ స్వార్థంకోసం, తమ ఆధిక్యతకోసం ఇవి ఆమెను ఒక పావుగా, ఒక భోగవస్తువుగా ఎలా వాడుకున్నాయో స్త్రీ సహజమైన మనోదృష్టిలో చూస్తే తెలుస్తుంది.

ఈ ʼద్రౌపది రాకుమారియైనా, కురువంశపు కోడలైనా, పంచపాండవుల సతియైనా, కృష్ణుడి ప్రియనేస్తమైనా కూడా ఏకాకిగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి ఆమె ఎలాంటి దుర్బర స్థితిలో జీవిస్తుందన్నది ఈ నవల అవగతం చేస్తుంది.ʼ2

స్త్రీ కూడా ఒక మనిషేననీ, ఆమెకూ ఒక మనసుంటుందనీ, ఒక వ్యక్తిత్వం వుంటుందనీ, ఆమెకూ మానవ సహజమైన ఆశలు, ఆరాటాలు, ఆదర్శాలూ వుంటాయనీ గుర్తించని ఈ మగ పెత్తన సమాజం తన ప్రజ్ఞతో వాటిని ఎలా నిర్వీర్యం చేస్తుందో తెలియ జేస్తూ, ఉత్కంఠ భరితంగా చిత్రించిన నవల ఇది. 

2.2 ద్రౌపది మనోవేదన, మాతృవేదన:

ఈ నవల్లొ ద్రౌపదికి ప్రధాన శత్రువులు పాండవులే. కౌరవుల దగ్గిర తాను అవమాన పడ్డానికి కారణం పాండవులే. తాను అయిదు మంది భర్తలను పెళ్ళి చేసుకోవడానికి కారణం ధర్మరాజు మరియు కుంతిదేవి. తనకు ఇష్టలేకపోయినా బలవంతంగా కుంతి అయిదుమందితో పెళ్ళికి ఒప్పిస్తుంది. పాండవులయిదు మందికి ఉమ్మడి ఆలిగా యాజ్ఞసేనిని ఉంచడానికి జరిగిన ప్రయత్నంలో కుంతి ʼఅయిదుగురుని పెళ్ళి చేసుకుని వాళ్ళని ఏకం చేసే శక్తిగా వుండు తల్లి, అలాగే దుర్యోధనుడి శక్తి హరించడాని ఆయుధంగా ఉండు తల్లిʼ3 అని కుంతిదేవి ద్రౌపదిని కోరుతుంది. పాండవుల ఐక్యతకోసం తను ఇష్టపడ్డ అర్జునుడితో పాటు ఇష్టంలేకున్నా మిగిలిన నాలుగు మంది పాండవులతో వయోభేదమున్నా తన అంతరాత్మని చంపుకొని సంసారం చేయాల్సి వచ్చింది. ద్రౌపది పెళ్ళినాటికి ధర్మరాజు ఆమె తండ్రి వయసులోను, సహదేవుడు ఆమె తమ్ముడి వయసులోను ఉన్నారని రచయిత్రి ఈ నవలలో ఒక కొత్త కోణాన్ని చూపారు. ఇక్కడ కుంతికన్న ధర్మరాజు కూడా ద్రౌపదిని వివాహం చేసుకోవడాని ఎక్కువ ముగ్గు చూపిస్తాడు. నవలలో అతను కూడా ద్రౌపది సౌందర్యానికి మోహపరవశుడైనట్టు కనిపిస్తుంది. మరోసందర్భంలో ద్రౌపది దర్మరాజుతో సంసారం చేస్తున్న కాలంలో అర్జునుడు ఆమె దగ్గరికి తెలియక వెళ్ళినట్టు కాక, ద్రౌపదిని బలాత్కరించడానికి వెళ్ళినట్టు చిత్రించినది ఈ నవల భిన్నత్వమనే చెప్పాలి.

అలాగె ఉపపాండవులు మరణించడానికి కారణం శ్రీకృష్ణుడు అనేది నవలలో తెచ్చిన భిన్న కోణాన్ని చూపే మరో ఉదాహరణంగా కనిపిస్తుంది. ఉపపాండవుల మరణానికి పాండవులు ఏ మాత్రం బాధపడలేదని ద్రౌపది పాండవులను నిందిస్తుంది. ʼఅభిమన్యు చనిపోయినప్పుడు అర్జునుడు వచ్చి సుభద్రని కౌగిలించుకుని ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఘటోత్కచుడు చనిపోయినప్పుడు అతని శవం మీద పడి భీముడు భోరుమన్నాడు. కానీ ఇవ్వాళ నా అయిదుగురు కుమారులు శవంగా మారి పడుకున్నా నా భర్తలు ఈ ఘోరానికీ తమకూ ఎటువంటీ సంబంధమూ లేదన్నట్టు తలమీద చేతులు పెట్టుకుని కూర్చున్నారుʼ4 ఎందుకు అని ద్రౌపది ప్రశ్నిస్తూనే తన భర్తల స్వభావం మరియు తన బిడ్డల మీద పాండవులు చూపుతున్న నిర్లక్ష్యాన్ని బయటపెడుతుంది.

ద్రౌపది ఉపపాండవులను వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళె సమయంలో ఆమె పడిన మాతృవేదనను కూడా రచయిత్రి మార్మికంగా చిత్రించారు. ఆమె ఎల్లప్పుడూ తన అయిదుగురు పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. యుద్ధం ముగిసిన తరువాత తన పెద్దకుమారుడు ప్రతివింద్యుడు భవిష్యత్తులో రాజు అవుతాడు, శ్రుతసేనుడు సేనాధిపతి, మిగిలినాళ్ళు ఒక్కో మండలానికి అధికారులవుతారని ఊహించింది. కలలు కనింది. అయితే పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. తన బిడ్డలు అశ్వత్థామునిచే హత్యకు గురయ్యారు. ఆమె కన్న కలంతా నాశమై పోయింది. అందుకు ఆమె కృష్ణుణ్ణి నిలదీస్తూ ʼనువ్వు తలచుకుంటే యుద్ధాన్ని ఆపి ఉండవచ్చును. కాని నీ ఇష్టానుసారం… నన్ను ఆడించావుʼ5  అని యుద్ధానికి కారణమైన కృష్ణుణ్ణి నిందిస్తుంది ద్రౌపది. సభాపర్వంలో దుర్యోధనుడు వస్త్రాపహరణ చేసేటప్పుడు ప్రతీకార మనోభావం పెంచుకున్న ద్రౌపది దుర్యోధుణ్ణి హతమార్చడానికి అక్కడ యుద్ధాన్ని కోరుకుంటుంది. కానీ ఇక్కడ తన కుమారులు శవాలుగా మారినప్పుడు ఎందుకు యుద్ధం జరిగిందని రోధిస్తుంది. దానికి కారణకర్తులైనవాళ్ళను నిలదీస్తుంది. ఇలా నవలంతా పాండవులు మొదలుకొని మిగిలినవాళ్ళు కూడా ద్రౌపదికి ఏ విధంగా అన్యాయం చేశారన్న విషయాన్ని విశ్లేషణాత్మకంగా మరియు విమర్శనాత్మకంగా వివరించారు. ఈ దృక్పథంతో ఇంతకు ముందు ద్రౌపది పాత్రను ఎవరూ తీర్చిదిద్దలేని విధంగా ఒక కొత్త కోణంలో చూపెడుతుంది ఈ నవల.

2.3 ద్రౌపది ప్రతిరోధం:

దుర్మార్గుడైన దుర్యోధనుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న చందాన ప్రవర్తించిన తీరు కూడా అతి సహజమే. ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో ఆమె తన సహాయానికి ఎవర్నీ ఆశించకుండా తనే స్వయంగా దుశ్శాసనున్ని తన్ని, తన శీలాన్ని కాపాడుకుంటుంది. వెంటనే ఇక ఈమెనేమీ చేయలేనున్న పరిస్థితి ఏర్పడినప్పుడు దుర్యోధనుడు, ʼయాజ్ఞసేని! నిన్ను అవమాన పరచాలని మాకు లేదు. అలాగే దాసిగా వుంచుకోవాలనే దుష్టతనం కూడా మాది కాదు. దర్మరాజు జూదంలో తన తమ్ముళ్ళను ఫణంగా పెట్టి ఓడి పోయాడు. తరువాత తన్ను తాను ఓడి పోయాడు. ఆ తరువాత నిన్న ఓడి పోయాడు. నిన్ను…. పందానికి ఫణంగా పెట్టే అధికారం ధర్మరాజుకు వుందో లేదో? నువ్వే చెప్పు?ʼ6 అంటూ పేట్లు పిరాయిస్తాడు. ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే ద్రౌపది ఏ ఒక్కరీ సహాయమూ లేనప్పుడూ తనను తానే స్వయంగా రక్షించుకుంటాననీ నిరూపించుకున్నది.

2.4 కృష్ణుని పాత్ర గురించి చర్చ :

ఈ నవలలో కృష్ణున్ని ఎక్కడా కూడా దేవున్ని చేసి చెప్పలేదు. మానవాతీత శక్తులున్నాయనీ కూడ చిత్రించలేదు. సామాన్య మనిషిలాగే అతనికూ రాగద్వేషాలతో పాటు పురుషులకి ఉండే స్త్రీమోహమూ వుందనే చెప్పినది భిన్నత్వానికి నిదర్శనం. దానికి సభాపర్వంలో వస్త్రాపహరణ ఘట్టమే మంచి ఉదాహరణ. సభాపర్వంలో జూదంలో యాజ్ఞసేనిని ఫణంగా పెట్టి ధర్మరాజు ఓడిపోతే, అన్న ఆజ్ఞతో దుశ్శాసనుడు నిండు సభలో ఆమె చీరను పట్టి లాగినప్పుడు, ఆమె కృష్ణున్ని వేడుకోదు. ఎందుకంటే కృష్ణుడు కూడా ʼస్నానానికి దిగిన గోపికా స్త్రీల చీరలను దొంగలించినవాడు… అందరూ మగాళ్ళు ఒకే రకం… ఇక్కడ నన్ను నేనే రక్షించుకోవాలిʼ7 అనుకొని దుశ్శాసనునికి మతి భ్రమ కలిగేంతటి దెబ్బ తగిలేటట్టు ఒక తన్ను తన్ని తన శీలాన్ని తానే రక్షించుకుంటుంది. ఇక్కడ కృష్ణుని ప్రమేయం ఏమీ కనిపించదు.

2.5 ద్రౌపది మరియు తన బిడ్డల గురించి పాండవుల మనస్తత్వం:

అరణ్యవాసంలో జయద్రథుడు వావి వరసలు కూడ మరచిపోయి యాజ్ఞసేనిపై అత్యాచారానికి పూనుకోవడం, భీమార్జునులు, అతన్ని పట్టుకొని చంపబోతె ధర్మరాజు, ʼచంపవద్దు, ఎలాంటి తప్పు చేసిన మనం శిక్షించకూడదు, రెండు దెబ్బలు తీసి, బుద్ధి చెప్పి పంపేయండిʼఅంటాడు. ఇంతకన్నా ఆడదాని మరో అవమానం ఏమైనా వుందా? ధర్మరాజు తన సతీమణికి అవమానం జరిగినా ఆమె పరంగా కాకుండా తప్పు చేసినవాడికి సపోర్ట్ చేసింది ద్రౌపదికి బాధ కలిగిస్తుంది.

అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తిచేసుకుని పాండవులతో బాటు ఇంద్రప్రస్థానికి చేరుకున్న యాజ్ఞసేని, తన పెద్దకుమారుడైన ప్రతివింద్యుడు రాజువౌతే, తాను రాజమాతనవుతాననీ నిత్యమూ కలలుగనేది. కానీ ఆమె బిడ్డల్ని పాండవులు ఒక ఉంపుడుగత్తె పిల్లల్లాగనే చూస్తున్నారన్న సంగతి ఆమెకు చాలా ఆలస్యంగా తెలుస్తుంది. ఇక్కడ ఆమెకుగానీ, ఆమె బిడ్డలుకుగానీ ఏ విలువలూ, ప్రాశస్త్యాలూ కనిపించవు. పాండవులు ఎన్నడూ ఈమె బిడ్డల్ని కనీసం, అభిమన్యుడితో సమానంగానైనా చూడలేదు. తక్కినవాళ్ళతో సమానంగైనా చూడలేదు. అది తలచుకుంటే ఆమె గుండె చరువై పోయేది. ఇలా ఆమె మరియు ఆమె బిడ్డల పరంగా కడవరకు పాండవుల నిర్లక్ష్యమే కనిపిస్తుంది. అందుకే ద్రౌపది తను మౌనంగా కూర్చోకుండా పాండవులు చేసిన తప్పిదాలన్నిటినీ ఏకరువు పెడుతు నిందిస్తుంది. కురుక్షేత్ర యుద్ధానంతరం, యుద్ధభూమిలో తొడలు విరిగి పడివున్న దుర్యోధనుడికి ఆనందాన్ని కలిగించడానికి అశ్వత్థాముడు ఉప పాండవులైన తన బిడ్డలను చంపినప్పుడూ, ఆ శవాలకు దూరంగా వెళ్ళి, ఏ బాధా లేనట్టుగా, తమకేమీ సంబంధం లేనట్టుగా కూర్చున్న తన భర్తలను చూసిన యాజ్ఞసేని తన అవమానాలనన్నింటినీ ఏకరువుపెట్టి, ʼఒక కన్నీటి చుక్క కూడా కార్చని వీళ్ళు కఠినాత్ములు, వీళ్ళందరూ నా దృష్టిలో ఎప్పుడో చనిపోయారు. ఇప్పుడు కూడా వీళ్ళు ప్రాణాలతో లేరు. నా వరకు వీళ్ళు శవాలై పోయినట్టేʼ9 అంటుంది.

ఈ మాటల్లో కూడ ద్రౌపది పాండవులవలన ఎంత బాధ అనుభవించిందో తెలుస్తుంది. ద్రౌపది బాధతో చెప్పిన మాటలుకు స్పందించే విధంగా శవాలకు తలకొరవి పెట్టడానికి ధర్మరాజు ముందుకొస్తే ఆమె అడ్డుకుంటుంది. ఇక్కడ పాండవులు బాధ పడలేదనేది ఆమె బాధ, బాధ పడనివాళ్ళు కొరవి పెట్టకూడదనేది ఆమె ప్రతిరోధం. రెండూ ఏకకాలంలో కనిపిస్తాయి. అప్పుడు ఆమె అతని చేతిలోని కాగడాను లాక్కొని ʼనా కుమారులకు నేనే దహన సంస్కారం చేస్తాను…. వీక్షించడం మాత్రమే మీ పనిʼ10 అని చితికి నిప్పంటించి, ద్రౌపది తనకు భర్తల అవసరం లేదన్నట్టు తరతరాల సంప్రదాయాన్ని బద్ధలు కొడుతుంది. కడకు ఆ మంటల్ని చూస్తూ, ʼరాబోయే కలియుగానికి, ఈ ద్వాపర యుగపు యాజ్ఞసేని అడుగు పెట్టకూడదన్నట్లుగా ఆమె స్పృహతప్పి పడిపోతుందిʼ11 ద్వాపరయుగానికి చెందిన యాజ్ఞసేని ముందు రాబోయే యుగానిక రాకూడదు అనే మాటల్లో ద్వాపరయుగల్లో స్త్రీ అయిన తను అనుభవించిన కష్టాలు ముందెన్నడూ ఏ స్త్రీ అనుభవించకూడదు అనే అర్థంవుంది.

కడకు ఆమె సాటి ఆడవారు కూడా పావులాగనే వాడుకోవడానికి చూడడం, పదేపదే కించపరచే మాటలతో అవమానించడం జరుగుతుంది. ఉదాహరణకు… అజ్ఞాతవాస సమయంలో సుదేష్ణాదేవి సైరంద్రిగా వున్న యాజ్ఞసేనిని చూసి, ʼనా భర్త నిన్ను చూస్తే మోహపరవశుడు కావచ్చుననే భయమూ వున్నదిʼ అంటుంది. అలాగే కీచకుడు ఆమె పైన కన్నేసినప్పుడూ ʼనా తమ్ముడి మాటలను ఈ రాజ్యంలో ఎవరూ దిక్కరించి నడవకూడదు. తను కోరిన ఏ వస్తువుని కూడా అతను ఇంతవరకూ వదలలేదు. దాన్ని దక్కించుకునే తీరుతాడు. ఊరికే మొండితనం చేయకుʼ అని ఆమెను ఒక వేశ్యలా భావించి తానొక తార్పుడిగత్తెలాగే మాట్లాడుతుంది. ఇక కీచకుడు సరేసరి.

3. ముగింపు:

  1. ఈ నవల ద్రౌపది కళ్ళతో మహాభారత పాత్రలను చూసే ప్రయత్నాన్ని చేస్తుంది. దాంతోపాటు తన భర్తలతో ఆమెకున్న విరోధ సంబంధ విన్యాసాలన్ని తెలుపుతుంది.
  2. ఇందులో ద్రౌపది వ్యక్తిత్వం ఎల్లప్పుడూ ప్రతిఘటించే విధంగా కనిపిస్తుంది. అన్యాయాన్ని అన్యాయమని చెప్పే ధైర్యం కూడా వుంది. అంతేగాకా ఆమెలో అదమ్య బౌద్ధిక చాతుర్యమూ కనిపిస్తుంది.
  3. ఈ నవలలో ద్రౌపది ఒక స్త్రీగా, సతిగా, తల్లిగా, సైరంధ్రిగా ఎల్లప్పుడూ బాధితులుగానే మిగిలిపోయింది.
  4. కుంతి పాండవులు అయిదుగురుని వివాహం చేసుకుని దర్మ రక్షకురాలిగా నిలిచిపో అన్నప్పుడు, ద్రౌపది నైతిక బలాన్ని కోల్పోయిన దర్మాన్ని హేళన చేస్తుంది. 
  5. స్వయంవరంలో అర్జునుడు తప్ప మిగతా వాళ్ళు ఏ అర్హతతో నన్ను పెళ్ళాడతారు అని ప్రశ్నిస్తుంది.
  6. ఈ నవలలో స్త్రీ అయిన యాజ్ఞసేని తన జీవితాన్ని, తనకు అడుగడునా పురుషుల చేతుల్లో జరిగిన అవమానాలను, అణచివేతను తలచుకుంటూ ఆత్మకథనాత్మక రీతిలో ఆమె అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది, ఆ ఆవిష్కరించడంలో రాబోయే కలియుగంలోనైనా స్త్రీలు ఆత్మగౌరవంతో, స్వేచ్ఛగా, పురుషుడితో సమానంగా బతకాలన్న ఆకాంక్షను తెలియపరుస్తుంది.
  7. ముఖ్యంగా ఇందులోని ప్రధాన ఘట్టలలో, నవలను చదివే పాఠకుడు కూడా కథలో లీనమైపోయి, తను కూడా కథా కాలంనాటి వాతావరణంలోకి వెళ్ళి పోయినట్టు అనుభూతి చెందే విధంగా చిత్రించబడింది. ఇందులో ప్రతి పాత్రా, ఆయా మనస్తత్వాలకనుగుణంగా, సహజంగా ప్రవర్తిస్తుంది. ఎక్కడా అతిశయోక్తులు, మానవాతీత అంశాలు కనిపించవు.
  8. నవల చదివిన తర్వాత యాజ్ఞసేని మనసుతో బాటు ఆమె శరీరం, ఆమె శరీరాన్నుంచీ ఉద్బవించిన ఆమె బిడ్డలు సైతం ఎలా తనకు కాకుండా పోయారొ, అందరికీ ఉపయోగపడి చివరికి తను ఏ విధంగా ఏకాకిగా మిగిలిపోయిందో అవగతమై మనసు ఆర్ధ్రమైపోతుంది.
  9. అయితే ఇక్కడ మనం ఒక్కటి ఆలోచించుకోవాల్సిన అవసరం వుంది. ఏమిటంటే ఆ నాటి సీత, యాజ్ఞసేని మొదలుకొని ఈ నాటి ఆధునిక స్త్రీ వరకు, మహిళల జీవితాలలో ఏవైనా మార్పులు వచ్చాయా? అప్పటికంటే ఈకాలంలో స్త్రీలు మెరుగైన జీవితాన్ని ఆత్మగౌరవంతో అనుభవిస్తున్నారా?
  10. ఈ నవలకు సంబంధించిన ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత పురుషులది కాదా ? ఈ ప్రశ్నను తప్పక ఆలోచించాల్సిన అవసరం ఈ సమాజంపైన వుంది.

4. సూచికలు:

  1. ద్రౌపది సమీక్షె, పుట. 2
  2. పైదే. పుట. 5
  3. యాజ్ఞసేని ఆత్మకథ, పుట. 18-19
  4. పైదే. పుట. 102
  5. పైదే. పుట. 101
  6. పైదే. పుట. 51
  7. పైదే. పుట. 50
  8. పైదే. పుట. 60
  9. పైదే. పుట. 102
  10. పైదే. పుట. 102
  11. పైదే. పుట. 103

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. జయదేవి, గాయకవాడ. (2008). కన్నడ మూలం: యాజ్ఞసేని ఆత్మకథ. తెలుగు సేత: రాజన్న తగ్గి, సిద్దలింగేశ్వర ప్రచురణ, కలబురగి
  2. ప్రభావతి, ఎస్.వి. (2022). కన్నడ సాహిత్యంలో ద్రౌపది. శ్రీనివాస పుస్తకప్రచురణసంస్థ, బెంగళూరు
  3. మణిమాలిని, వి.కె. (1996). ద్రౌపది సమీక్షె, , కన్నడ శాఖ, ముంబై విశ్వవిద్యాలయం, ముంబై
  4. మురళీకృష్ణ, కస్తూరి. (2019), సౌశీల్య ద్రౌపది. సాహితి ప్రచురణలు, విజయవాడ 
  5. లక్ష్మీప్రసాద్. యార్లగడ్డ. (2006). ద్రౌపది. లోకనాయక ఫౌండేషన్, విశాఖపట్టణం

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Special Call
Responsive image

Circular
Responsive image

Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]