AUCHITHYAM | Volume-5 | Issue-9 | August 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
10. వికారాబాదుజిల్లా మాండలికం: శబ్దపరిణామం
మరాటి నర్సింహులు
పరిశోధకులు, తెలుగుశాఖ, ఉస్మానియావిశ్వవిద్యాలయం.
తెలుగు సహాయాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శేరిలింగంపల్లి,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9030057994, Email: narasimhamarati@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
భాష పరిణామ శీలం కలది. కాలం గడిచిన కొద్ది వాగ్రూప భాష ఎన్నో మార్పులకు లోను అవుతుంది. ఆ మార్పులు ధ్వనులలో, అర్థాలలో, పదాలలో, వాక్యాలలో కలగవచ్చు. భౌగోళిక దూరాలను బట్టి భాషలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒక ప్రాంతంలోనే చిన్న చిన్న ప్రదేశాల్లో కొద్ది పాటి మార్పులతో వ్యవహారంలో ఉన్న భాషా భేదాలను స్థానిక మాండలికాలు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో 2016లో నూతనంగా ఏర్పడిన 33 జిల్లాలలో వికారాబాదు ఒకటి. వికారాబాదు జిల్లా మాండలికం పైన ఉర్ధూ, కన్నడ, మరాఠీ, తమిళ, ఆంగ్ల భాషల ప్రభావం వలన వాగ్రూప వ్యవహారంలో భాషాధ్వనుల మార్పులు కనిపిస్తున్నాయి. వర్ణసమీకరణ, వర్ణవ్యత్యయ, వర్ణలోప, వర్ణాగమాది ధ్వనిపరిణామం ఆయా భాషల ప్రభావం వలన ఉన్నట్లు, కాలక్రమేణ వ్యవహారంలో స్థిరపడినట్లు తెలుస్తున్నది. వికారాబాద్ జిల్లా భాషా పరిణామాన్ని భాష వైవిధ్యాన్ని క్షేత్రపర్యాటనలో భాషావ్యవహర్తల ద్వారా సేకరించిన పదజాలం ఆధారంగా వివరించడం, విశ్లేషణ చేయడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా ప్రాంతపు భాష మీద పరిశోధన భవిష్యత్తులో సామాజికభాష శాస్త్రపరిశోధనాభివృద్ధికి, జిల్లా మాండలికాల సూక్ష్మాధ్యయనానికి నా ఈ పరిశోధన ఉపయోగపడుతుందని ఆకాంక్షించి ఈ పరిశోధనకు పూనుకున్నాను.
Keywords: ఇక్కడ-ఈడ, కల్సుసులేదు-కల్సుడులే, చెప్పుడులేదు-చెప్పుడులే, సంబంధం- సమ్మందం, సాహిత్యం- సహిత్తం, పండగకి-పండక్కి, చవుడు-సవుడు
1. ఉపోద్ఘాతం:
భాష పరిణామ శీలం కలది. భాష నిరంతరం మార్పులతో చేర్పులతో పరిణామం చెందుతూనే ఉంటుంది. వాగ్రూపంలోని భాషకు నిరంతరం మార్పుల వేగం ఎక్కువ. క్రమంగా వాగ్రూపంలో మారిన భాష లిఖిత రూపంలో మార్పులకు సహజంగా గురి అవుతుంది. భాష ప్రజల సొత్తు నిత్య వ్యవహార సాధనం విద్యవంతులు విద్య గంధం లేని పామరులు సైతం భాషను ఉపయోగిస్తారు. కొందరు సాధారణంగా ఉపయోగిస్తారు, కొందరు తొందరగా భాషను పలుకుతారు. పరస్పర అవగాహన భాషకు ప్రధానం. కావున భాషలో వ్యవహారదోషం లేనంతవరకు తన పనిని తాను చేసుకుంటూనే ఉంటుంది. అయినప్పటికీ ఏ భాష ఎల్లకాలం ఒకే విధంగా ఉండదు . కాలం గడిచిన కొద్ది ఎన్నో మార్పులకు లోను అవుతుంది ఆ మార్పులు ధ్వనులలో, అర్థాలలో, పదాలలో, వాక్యాలలో కలగవచ్చు.
2. పూర్వోక్తంగా మాండలికాల విభాగం:
తెలుగు భాషలో ప్రాంతాల ఆధారంగా నాలుగు ప్రధానమైన భాషా మండలాలున్నాయని ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు వృత్తిపద పరిశోధన ఆధారంగా విభజించారు.1 అవి: పూర్వమండలం – (కళింగదేశం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు, దక్షిణమండలం – (రాయలసీమ) నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, ఉత్తర మండలం – (తెలంగాణా) ఖమ్మం జిల్లాల్లో కోస్తా ఆంధ్రా, మహబూబునగర్ రాయలసీమలను ఆనుకొన్న తాలూకాలు ఆయా భాషామండలాల్లో కలుస్తాయి. మధ్యమండలం – ఉభయగోదావరులు, గుంటూరు కృష్ణాజిల్లాలు.
3. తెలంగాణ మాండలికం - ప్రత్యేకత:
పై విభజనలో తెలంగాణా మండలికం ఇతర ప్రాంత మాండలికాలకన్నా ప్రత్యేకమైనది, ముఖ్యంగా తెలంగాణా ప్రాంతం లో కూడ భిన్న ప్రదేశాలలో భిన్నమైన భాషా రూపాలు కనిపిస్తాయి. ఇటువంటి మార్పుల వల్ల ప్రాంతీయ మాండలిక ప్రభావానికి గురి అయిన స్థానిక మాండలికాలు ఉంటాయని నిర్ధారించవచ్చు. భాషా వ్యవహారములో స్థల భేదం, కుల భేదం, వృత్తి భేదం మొదలగు వాటి వైవిధ్యం మరియు పోలికలు ఉండడం జరుగుతుంది. వాస్తవానికి ఒకానొక వ్యక్తి ఒకానొక కాలంలో మాట్లాడే భాషణావృత్తి సర్వస్వం వైయక్తిక మాండలికం. కొన్ని వైయక్తిక మాండలికాల సమాహరమే "మాండలికం" అవుతుంది. భౌగోళిక దూరాలను బట్టి భాషలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒక ప్రాంతంలోని భాషారూపంలో అనేక సూక్ష్మ భేదాలు, పోలికలు ఎక్కువగా ఉన్నప్పుడు అది ఒక ప్రాంతీయ మండలికంగానే కనిపిస్తుంది . ఒక ప్రాంతంలోనే చిన్న చిన్న ప్రదేశాల్లో కొద్ది పాటి మార్పులతో వ్యవహారంలో ఉన్న భాషా భేదాలను స్థానిక మాండలికాలు అంటారు. ప్రాంతీయ భేదంతో నిమిత్తం లేకుండా కుల, వృత్తి, మత మొదలగు వాటి మీద ఆధారపడి భాషలో విభిన్నంగా కనిపించే రూప విశేషాలను వర్గ మాండలికాలుగా భాషావేత్తలు గుర్తించారు. కాలక్రమంలో ఈ మార్పులు భాషలో సహజంగా కనిపిస్తాయి. వీటిలో ఒకటి గొప్పది, మరొకటి తక్కువది అని చెప్పడం సరికాదు. రవాణా సదుపాయాలు, వర్తక వాణిజ్యాలు, రాకపోకలు, విద్యా, వినోద, వసతులు, ప్రచారసాధనాలు, సంబంధ బాంధవ్యాలు మొదలగు కారణాలవల్ల భాషలో మార్పులు జరుగుతుంటాయి.
ప్రతి భాషకు ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. అదే ఆ భాషకు జీవన లక్షణం. ఏ కారణాలైనా ఆ జీవ లక్షణానికి అనుగుణంగా ప్రవర్తిస్తాయి. కావున కొన్ని విధాలైన మార్పులు, కొన్ని భాషలకు చాలా రకాలుగా కనిపిస్తాయి. ఏ భాషలో అయినా ధ్వనులలో మార్పులకు కారణాలు రెండు రకాలు. అవి అంతరంగ, బహిరంగ కారణాలు. భాష ఉన్నప్పుడు వక్త, శ్రోత ఉండక తప్పదు. వక్త యొక్క ఉచ్చరణం, శ్రోత యొక్క ఆకర్ణం ఈ రెండింటిని ఆశ్రయించి అంతరంగ కారణాలు కనిపిస్తాయి. ముఖ యంత్రంలో గాని, మెదడులో గాని లోపాలు ఉండడం, సౌలభ్యంగా ఉచ్చరించడం, అనుకరణం సరిగ్గా లేకపోవడం, సరిగ్గా గ్రహించకపోవడం, ఉచ్చరణలో వేగం, ఏకాగ్రత లోపించడం, సుకుమారత మొదలగునవి అంతరంగ కారణాలుగా చెప్పవచ్చు. ప్రాంతీయ భేదం, కాల భేదం, సమాజ భేదం, అన్య భాష ప్రభావం మొదలగునవి బహిరంగ కారణాలు.2
భాష చారిత్రకంగా ఎన్నో మార్పులకు లోనవుతుంది.ఆధునికకాలంలో వ్యవహరిస్తున్న భాష మౌఖిక సంప్రదాయంలోనూ లేఖన సంప్రదాయంలోనూ వేరువేరుగా కనిపిస్తుంది. సాధారణంగా ప్రామాణిక లక్షణాలు లేఖన సంప్రదాయంలో ఉంటాయి. మాండలిక లక్షణాలు,ఉచ్చారణ భేదాలు మౌఖిక సంప్రదాయంలో ఉంటాయి. ప్రస్తుతం పరిశీలనకు తీసుకొన్న వికారాబాద్ జిల్లా మాండలికంలో ఆధునికంగా ప్రామాణికత కంటే వేరుగా ఉన్న ఉచ్చారణ భేదాలను పరిశీలించి ఈ కింద ఇవ్వడం జరిగింది. వీటిలో జరిగిన మార్పులను గమనించి వివరించడం జరిగింది.ఆధునిక మాండలిక రూపాలతోపాటు చారిత్రక కాలంలో కనిపించే మాండలిక రూపాలు కూడా ఉదహరిస్తూ ఇక్కడ చర్చించడం జరిగింది. చారిత్రకకాలంలోని మాండలికతకు శాసనప్రయోగాలు ప్రధాన ఆధారం. శాసనప్రయోగాలలో మౌఖికసంప్రదాయం లేఖనసంప్రదాయం కంటే వేరైనదే. చారిత్రకంగా, సామాజికంగా మాండలికంలోని ఉచ్చారణ వైవిధ్యం మౌఖికసంప్రదాయానికి సంబంధించింది. వాడుకలో మార్పు వచ్చిన కొంతకాలం తరవాతనే రాతలో మార్పు వస్తుంది. ఉచ్చారణ మారినా లేఖనం సాంప్రదాయికంగానే కొన్ని శతాబ్దాలుగా సాగవచ్చు.
4. వికారాబాద్ జిల్లా శబ్దపరిణామం- ఉచ్చారణభేదాలు:
వికారాబాద్ జిల్లాకు మాత్రమే సంబంధించిన చారిత్రకకాలంలోని ఉచ్చారణ భేదాలను ప్రత్యేకంగా గమనించవచ్చు.
1) మహా ప్రాణం>అల్పప్రాణంగా ఉచ్చరించటం.
ఉదా॥
కథ>కత
అర్తం>అర్తం
కంఠం>కంటం
ధనం>దనం
ఫలం>పలం
భజన>బజన
భయం>బయం
ఖర్చు>కర్చు
భోజనం>బోజనం
వీధి>వీది
ఘంట>గంట
ఖరం>కరం
2) మూర్ధన్య ణ,ళ లు మాండలికంలో దంతమూలీయ న,ల లుగా కనిపించడం.
ఉదా॥
దుకాణం>దుకానం
బాణం>బానం
కాళ్లు>కాల్లు
నీళ్ళు>నీల్లు
కళ>కల
గుణం>గునం
3) సంయుక్త రూపాలు, అసంయుక్తంగా లేదా సరళీకరణం పొందిన రూపాలుగా కనిపించడం.
ఉదా॥
కాళ్ళు మడుచుట>కాల్మడ్చుట
కాళ్ళు మొక్కుత>కాల్మొక్తా
చేశారు>చేసిన్రు
కాల్చారు>కాల్చిన్రు
పొయ్యి దగ్గర>పొయ్యికాడ
యాది లేదు>యాద్లేదు
ఎక్కువ>ఎక్వ
యాదికి వచ్చింది>యాద్కొచ్చింది
ఇలాంటి మాండలిక ప్రయోగాలు వికారాబాద్ జిల్లాలో సాధారణంగా కనిపిస్తాయి. కాని ఇలాంటి రూపనిర్మాణం ప్రామాణికంలో ఉండదు.
4) వికారాబాద్ జిల్లా మాండలికభాష వ్యవహారంలో వ్యతిరేకక్రియల ప్రయోగంలో ఉర్దూ భాష ప్రధానం బాగ ఉన్నట్లు తెలుస్తున్నది. 'లేదు' అనే వ్యతిరేక క్రియలో 'దు' లోపించడం కనిపిస్తుంది.
ఉదా॥
పిల్వలేదు>పిల్వలే
కల్వలేదు>కల్వలే
అడుగలేదు >అడుగలే
కల్సుడులేదు>కల్సుడులే
కల్పుడులేదప>కల్పుడులే
చెప్పుడులేదు>చెప్పుడులే
తినుడులేదు>తినుడులే
దంచుడు లేదు>దంచుడులే …మొదలగునవి.
* ఈ జిల్లా మాండలిక భాషలో ప్రత్యేకంగా కనిపించేది భూతకాలిక వ్యతిరేక క్రియరూపాలు.3
ఉదా॥
1)రాలేదు>వచ్చిలే
2)చూడలేదు>చూసిలే
3)ఇవ్వలేదు>ఇచ్చిలే …. మొదలగునవి.
(భాషావిషయ దాత చెంచు ఎల్లమ్మగారితో పరిశోధకుడు మరాటి నర్సింహులు,గ్రామం॥ చంద్రకళ్, మండలం॥ దౌల్తాబాదు, జిల్లా॥ వికారాబాదు.)
5) వికారాబాద్ జిల్లా మాండలిక భాష నిర్మాణంలో హిందుస్థానీ పదాలైన ఉర్దూ, అరబ్బీ, పారశీ భాషా పదాలు తెలుగులోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది.
ఉదా॥ (ప్రమాణికతెలుగు-వికారాబాదు తెలుగు-ఉర్ధూ/అరబ్బీ)
1)నడవదు - జాంతనై - నై జాంత
2)బాగా - మస్తు - మస్త్
3)బాడుగ - కిరాయి -కిరాయ్ …మొదలగు రూపాలు కనిపిస్తాయి.
6) ఈ జిల్లాలో 'ష' కారాన్ని 'శ' కారంగా ఉచ్చరించడం, ‘శ’ కారాన్ని 'స' కారంగా ఉచ్చరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది.4
ఉదా॥
శుద్ధి>షుద్ధి
షుద్ధి>సుద్ధి
శాఖ>షాక
శుక్రవారం>సుక్రారం
శని>షని …మొదలగునవి.
(భాషావిషయ దాత కుర్వ చిన్న చంద్రప్ప గారితో పరిశోధకుడు మరాటి నర్సింహులు,గ్రామం॥ కస్తూరుపల్లి, మండలం॥ కోడంగల్, జిల్లా॥ వికారాబాదు.)
7) అలాగే వర్ణసమీకరణం కూడ ఈ జిల్లా భాషలో కనిపిస్తుంది. ఒక మాటలో ఉన్న ధ్వని దాని పరిసర వర్ణ ధ్వనిలాగ మారడాన్ని ‘వర్ణ సమీకరణం’ అంటారు. ఈ మార్పులు పద మధ్యముతో పాటు సంధి లోనూ జరుగుతాయి.
ఉదా॥
1) సంబంధం>సమ్మందం
సాహిత్యం>సాయిత్తం
లగ్నం>లగ్గం
2) మూడు+నూరు>మున్నూరు
పండగ + కి>పండక్కి
చేప + పిల్ల>చేప్పిల్ల
రక్తం + పోటు>రక్తప్పోటు
8) చదువుకోని వాళ్ల భాషావ్యవహారంలో వకారలోపం చాలా సందర్భాలలో కనిపిస్తుంది. ఇది తాలవ్యాచ్చులకు ముందు జరుగుతుంది.
ఉదా॥
1)వెయ్యి>ఎయ్యి
2)వేషం>ఏషం
3)వెతుకు>ఎతుకు
4)వివరంగ>ఇవరంగ ..మొదలగునవి.
9) వీటితో పాటు ఈ జిల్లాలో చదువుకోని వారి భాషావ్యవహారంలో వర్ణాగమం కూడ వస్తుంది. పదాదిన సకారంతో కూడిన సంయుక్తాక్షరాల ముందు ఇకారం చేర్చి పలుకడం కనిపిస్తుంది. ఇవి ఆదానాలలో ప్రధానంగా కనిపిస్తుంది.
ఉదా॥
1)స్టైల్>ఇస్టైల్
2)స్కూల్ >ఇస్కూల్
3)స్టాంపు>ఇస్టాంపు
4)స్టేషన్>ఇస్టేషం ..మొదలగునవి.
ఇది ఉర్దూ భాషాప్రభావం వల్ల పదాదిన ఏర్పడిన మార్పు కావచ్చునని భాషావేత్తలు సిద్ధాంతీకరించారు.
10) తెలుగు వర్ణాలు - మార్పులు:
వర్ణవిభాగంలో వికారాబాద్ జిల్లా భాషా వ్యవహర్తల తెలుగు వర్ణాలలో కనిపించే మార్పులను ఈ కింది విధంగా సూచించవచ్చు.
- శ్వాసీకరణం: కొన్ని నాద వర్ణాలు శ్వాస వర్ణాలుగా మారుతాయి.
ఉదా :
(1) (2) (3) (4)
కేరి గేరి గేరి కేరి
సైటు సైడు సైడు సైడ్
ఎత్తు ఎద్దు ఎద్దు ఎత్తు
ఆపత ఆపద ఆపద ఆపత్తు - నాదీకరణం: కొన్ని శ్వాస వర్ణాలు నాద వర్ణాలుగా మారుతాయి.
ఉదా :
(1) (2) (3) (4)
ఒగటి ఒకటి ఒకటి ఒందు
ఇటిగ ఇటుక ఇటిక ఇట్టిగె
నాలిగె నాలికె నాలుక నాలిగె
ఏర్పాడు ఏర్పాటు ఏర్పాటు ఏర్పాడు - కొన్ని దేశ్యపదాలలో అకారానికి ముందున్న చకారం దంత్యతాలవ్యభేదం కోల్పోయి దాని మీది అకారం-ఎకారంగా ఉచ్చరింపబడుతుంది.
ఉదా :
(1) (2) (3) (4)
చెలి సలి చలి చలి/చళి/సళి
చెదువు సదువు చదువు చదువు
పచ్చె పచ్చ పచ్చ పచ్చ/పచ్చె - కొన్ని పదాలలో దంత్య నకారం మూర్ధన్య ణకారంగా కనిపిస్తుంది.
ఉదా :
(2) (3) (4)
గణి గని గని గణి
పణి పని పని పణి
కణ్ణు కన్ను కన్ను కణ్ణు
మొణ్ణు మొన్ను మన్ను మణ్ణు
వెణ్ణె వెన్న వెన్న బెణ్ణె - పై ఉదాహరణల్లో కన్నడ రూపాల(4)లో మూర్థన్య ణ కారం ఉండడం వలన ద్విభాషా వ్యవహర్త తెలుగు రూపాలు(1) యథాతథంగా కన్నడం నుండి ఎరువు తెచ్చుకొన్న రూపాలుగా భావించే అవకాశం కూడా ఉంది.
- చదువుకున్నవారి, చదువుకోలేనివారి ఉచ్చారణలో తేడాలు కనిపిస్తున్నాయి. అల్పప్రాణ, మహాప్రాణొచ్చారణ;పదాది హ/వ/చకారాలు; శ, ష, స లభేదం;సంయుక్త హల్లులు, మూర్ధన్య దంతమూలీయ భేదం;పదాదిన “గ్” ఆగమంగా రావడం మొ॥ నవి చదువుకున్న వారు స్పష్టంగా పలుకుతారు.చదువులేని వారు మార్పులు చేసి పలుకుతారు.
ఉదా॥
(1) > (2)
భాగవతం>బాగొతం
ధర్మం>దర్మం
హారతి>ఆరతి
చప్పుడు>సప్పుడు
వెండి>ఎండి
కలెక్టర్>కలకటేరు
భాష>బాస
పళ్లెం>పల్లెం
అట్లనే>గట్లనే
11) అలాగే ఒక ధ్వనిపరిణామం పొందిన పదాల పొందిక జిల్లా అంతటా ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ఉదా॥
‘ఉ’కార లోపంతో
1) దెల్పు
2) మెత్కు
3) తల్తురు
4) నిల్తురు
‘ఇ’కార లోపంతో
1) కల్సి
2) ముర్సె
3)నడ్చి
లాంటి పదాలలో అచ్చును లోపించి పలుకుట కనిపిస్తున్నది. ఈ మార్పు వాడుకలో వ్యవహరించడంతో పాటు ఈజిల్లా కవిత్వంలోకూడా “స్వరలోపం” అనే ధ్వనిపరిణామాన్ని గమనించవచ్చు. తెలుగులో సాధారణంగా ‘డ,ల,ట,ర’ మీది ఉత్వానికి అచ్చు లోపించడం కనిపిస్తుంది. ఇది కొన్ని చోట్ల ఇతర హల్లుల మీది ఇతరాచ్చులకు కూడ లోపం జరిగినట్లు తెలుస్తున్నది. ఈ మార్పును ఆంగ్లములో “Syncope” అంటారు.
5. ముగింపు:
వికారాబాద్ జిల్లా ప్రాంతం చాలా కాలం ముస్లింల పరిపాలనలో ఉందికనుక ఇక్కడ తెలుగుభాషమీద ఉర్దూ, అరబ్బీ భాషల ప్రభావం చాలా ఉంది. అలాగే కొన్ని మండలాలు చాలా కాలంపాటు కర్నాటక రాష్ట్రంలో అంతర్భాగం ఉండడం వలన ఈ ప్రాంతభాషలో విశేషమైన వైవిధ్యం కనిపిస్తుంది. ధ్వనులలో పదజాలంలో, వ్యాకరణాది అంశాలలో మార్పులు కనిపిస్తున్నై.
ప్రధానంగా వికారాబాద్ జిల్లాలో విద్యావంతుల భాష ఎంత వరకు ప్రమాణిక భాషకు దగ్గరగా ఉన్నది అనే అంశంతో పాటు ముస్లిం పాలకుల భాష ప్రభావం అనంతరం ఆంగ్ల విద్యావిధానం, ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపనం తర్వాత వ్యవహారిక భాషలో ఎలాంటి మార్పులు జరిగాయి. మొదలగు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లా మాండలిక భాష విలక్షణతను గుర్తించడం జరిగింది.
ఈ జిల్లాలోని భాషలో తేడాలు పదజాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ తేడాలు అనేక రకాలుగా ఉండవచ్చు. ఒక అర్ధాన్ని సూచించటంలో భిన్న ప్రాంతాల్లో భిన్నమైన మాటలు వాడవచ్చు. వికారాబాద్ ప్రాంతంలో చారిత్రక సామాజిక కారణాల వల్ల ఏర్పడ్డ పదాలు ఈ ప్రాంతానికే పరిమితం అయి ఉన్న విషయం గమనించడం జరిగింది. కర్నాటక సరిహద్దు ప్రాంతంలో ప్రజల వాడుకలో కన్నడ భాషా ప్రభావం విశేషంగా కనిపిస్తుంది. క్రీ.శ. 11వ శతాబ్దం వరకు అనగా నన్నయ కాలం వరకు భాషాపరంగా పెద్ద మార్పులు లేవు. అయితే వందల యేండ్లు ముస్లింల పాలనలో ఈ ప్రాంతం ఉండడం మూలాన ఉర్దూ భాష ప్రభావం ఈ వికారాబాద్ జిల్లా భాషపై విశేషంగా కనిపిస్తుంది.ప్రముఖ భాషా సాహిత్య విమర్శకులు కె.కె. రంగనాథాచార్యులు వారు అన్నట్లు "No race is pure, No Language is pure" ఏజాతి స్వచ్ఛమైనది కాదు,ఏ భాష స్వచ్ఛమైనది కాదు. భాషయైన జాతియైన కాలపరిణామంలో మార్పులకు లోనౌతూ ఉంటుంది. రకరకాల జాతులు కలిసి పోతుంటాయి. సంబంధ బాంధవ్యాల ద్వారా, వ్యాపార కార్యక్రమాల ద్వారా భాషా వ్యవహర్తలు కలిసి పోవడం సహజం.ఈ కారణాల వల్ల భాషలో మార్పులు సహజమే.
ఈ విధంగా వికారాబాద్ జిల్లా యొక్క భాషా పరిణామాన్ని భాష వైవిధ్యాన్ని క్షేత్రపర్యటనలో భాషావ్యవహర్తల ద్వారా సేకరించిన పదజాలం ఆధారంగా వివరించడం, విశ్లేషణ చేయడం జరిగింది.వికారాబాద్ జిల్లా ప్రాంతపు భాష మీద పరిశోధన భవిష్యత్తులో సామాజికభాషాశాస్త్ర పరిశోధనాభివృద్ధికి, జిల్లా మాండలికాల సూక్మాధ్యయనానికి ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాను.
6. పాదసూచికలు:
- కృష్ణమూర్తి,భద్రిరాజు,తెలుగుభాష చరిత్ర,పుట.398
- భాస్కరరావు,గొడవర్తి,తెలుగుభాష చరిత్ర,పుట:140
- ఎల్లమ్మ,చెంచు, భాషావిషయ దాత, గ్రామం॥చంద్రకళ్, మండలం॥ దౌల్తాబాద్, జిల్లా॥ వికారాబాదు.
- చిన్న చంద్రప్ప ,కుర్వ, భాషావిషయ దాత, గ్రామం॥కస్తూరుపల్లి, మండలం॥ కోడంగల్, జిల్లా॥ వికారాబాదు.
7. ఉపయుక్తగ్రంథసూచి:
- ఉషా, పన్నాల. (1998). తెలుగు మాండలికాలు-రంగారెడ్డి జిల్లా, తెలుగు అకాడమి, హైదరాబాద్.
- కృష్ణమూర్తి, భద్రిరాజు. (2012), భాష సమాజం సంస్కృతి,నీల్ కమాల్ పబ్లికేషన్,హైదరాబాద్.
- కృష్ణమూర్తి, భద్రిరాజు. తెలుగు భాషాచరిత్ర (1979). ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాద్.
- చెన్నయ్య,దోరవేటి. (2017). మన యాస-మన భాష,అనంత సాహితి, వికారాబాద్ జిల్లా తెలుగు భాషావారోత్సవాల సందర్భంగా వెలువరించిన సాహితీ సంచిక, ఇన్నోవేటరి ఇంప్రెషన్స్, ఖైరతాబాద్, హైదరాబాద్.
- నిత్యానందరావు, వెలుదండ. (2022). ఆచార్య వెలుదండ నిత్యానందరావు సమగ్రసాహిత్యం 3-వాగ్దేవి వరివస్య,ప్రనవం పబ్లికేషన్,హైదరాబాద్.
- పాండయ్య, అప్పం, (2007), మహబూబునగర్ జిల్లా తెలుగు,జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక,హైదరాబాద్.
- పురుషోత్తం, బొడ్డుపల్లి. (1982). భాషాశాస్త్ర పరిచయం,స్టూడెంట్సు ప్రండ్సు,నరసరావు పేట.
- భాస్కరరావు, గొడవర్తి. (1991), తెలుగుభాషా చరిత్ర,ప్రశాంతి పబ్లికేషన్,కాకినాడ.
- శ్రీహరి,రవ్వా. (2015). తెలంగాణ మాండలికాలు కావ్యప్రయోగాలు,ఆంధ్ర సారస్వత పరిషత్తు,హైదరాబాద్.
- సుబ్రహ్మణ్యం, పి.ఎస్. (2000), ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,హైదరాబాద్.
- హనుమంతప్ప, ఎ. (1991), తెలుగు-కన్నడాల ద్విభాషాస్థితి, వాఙ్మయి, అర్ధవార్షిక పరిశోధన పత్రిక,జనవరి-జూన్,తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.