AUCHITHYAM | Volume-5 | Issue-9 | August 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
8. తెలంగాణ కవితావస్తువు, కవిత్వీకరణ విధానం: వైవిధ్యం

బి. బాలసుబ్రహ్మణ్యం
పరిశోధక విద్యార్థి , స్కూ. అ. (తెలుగు),
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్,
భువనగిరి, జి. యాదాద్రి భువనగిరి, తెలంగాణ.
సెల్: +91 9490012215, Email: balu.boga@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
కవిత్వానికి వస్తువు మౌలికమయినది. కేవలం వస్తువే కవిత్వం కాలేదు. భాష ఒక సాధనం మాత్రమే. కవితా లక్షణాలను భాష అందించదు. వస్తువు కవిత్వంగా మారేందుకు అనుసరించే కవిత్వీకరణ విధానాలే ప్రాధాన్యత వహిస్తాయి. వస్తువు కవిత్వంగా మారే సందర్భంలో కొన్ని నిర్దిష్ట పద్ధతులను అనుసరిస్తుందని నిరూపించడం ఈ వ్యాస ముఖ్య ఉద్దేశం. ఆధునిక తెలంగాణా కవిత్వాన్ని అవలోకించినపుడు కవిత్వాన్ని అద్దే కవిత్వీకరణ విధానాలు, వస్తువుకు వివిధ రకాలైన భావనల్ని, రసజ్ఞతల్ని కల్పిస్తాయని భావించవచ్చు. ఈ కవిత్వీకరణ విధానాల నిర్ధారణకు వాచక విమర్శ పద్ధతిని అనుసరిస్తూ మార్క్సిస్టు దృక్పథంలో వస్తు తత్వ విమర్శ చేయడం ఇందులో కనిపించే పరిశోధనా పద్ధతి. తెలంగాణ కవిత్వంలో కనిపించే వైవిధ్యాన్ని అంచనా వేయడం, రెండు విధాల్లో సాగే ఈ వైవిధ్యతకు వస్తువులోని ద్రవస్థితే కారణం అని ప్రతిపాదించడం ప్రధాన ధ్యేయం. కవిత్వం ఎలా సిద్ధిస్తుందన్న పరిశీలన ఈ వ్యాస పరిధిలోని అంశం. ఈ వ్యాసానికి తోడ్పడిన పూర్వ పరిశోధనలు విరివిగానే వచ్చాయి. 1991లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన జాతీయ సదస్సు ప్రసంగ పత్రాల సంకలనం ‘హైదరాబాదు - నాలుగు శతాబ్దాల సాహిత్య వికాసం’ అనేది తెలంగాణ మొత్తం సాహిత్యాన్ని గూర్చి జరిగిన పరిశోధనలో మొదటి ప్రయత్నంగా గుర్తించవచ్చు. పూర్తి అస్తిత్వ కోణంలో ‘తెలంగాణ సాహిత్యం - జీవిత చిత్రణం’ జాతీయ సదస్సు సంచిక పేర్కొనదగినది. ‘తెలంగాణ సాహిత్య వికాసం’ ( కె. శ్రీనివాస్) ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వ దశకు సంబంధించిన సాహిత్య పరిశోధక గ్రంథం. వస్తు వైవిధ్యానికి సంబంధించి ‘పద్య కవిత్వం: వస్తు వైవిధ్యం’ (కె.వి.రమణాచారి) అనే పరిశోధక గ్రంథం ప్రాచీన కవిత్వ పరిధిలోనిది. ఆధునిక తెలంగాణ కవిత్వానికి సంబంధించి వస్తు వైవిధ్యం, కవిత్వీకరణ విధానాల గురించి చేసే పరిశోధనకు ‘మత్తడి’, ‘మునుం’, ‘బహువచనం’ ‘జిగర్’, ‘వల్లుబండ’, ‘నిప్పుల వాగు’ వంటి సంకలనాలతో పాటు వివిధ కవితా సంపుటాలు విషయ సేకరణకు ఉపయోగపడ్డాయి.
Keywords: కవిత్వీకరణ విధానం, ధ్వని, ప్రతీక, వచనం, పునరుక్తి, భాష్యం, ప్రాధాన్యీకరణం వైవిధ్య వ్యూహం, ఖండ వ్యూహం, బహుళ వ్యూహం, ద్రవ స్థితి.
1. ఉపోద్ఘాతం:
వస్తువు ప్రాకృతిక లక్షణాన్ని కలిగి ఉంటుంది. సామూహిక అనుభవాల కలయికతో సామాజిక స్వభావాన్ని పొందుతూ మారుతున్న జీవనశైలిని సంగ్రహిస్తూ సమకాలీనత సాధిస్తుంది. వస్తువు విషయగతమైనది. సాహిత్య లక్షణాల పొందికను మిళితం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. కవిత్వీకరణ విధానాల వల్ల వస్తువులో కవితా లక్షణాలు ఆపాదించడం చేత కవిత్వమవుతుంది. ఇందుకు పార్టీ కావాలి గా సర్లే ఏమొత్తయిందా భాష ఒక ఉపకరణంగా పని చేస్తుంది. ‘కవిత్వ భాష అంటూ ఏమీ ఉండదని నోమ్ ఛామ్ స్కీ సిద్ధాంతాన్ని చాలావరకు ఆమోదిస్తున్నారు.’ (జి. లక్ష్మీనరసయ్య, కవిత్వం చర్చనీయాంశాలు, పుట 126) దీని ఆధారంగానే తెలుగులో కవిత్వ నిర్మాణ పద్ధతులకు ఒక కొత్త చూపును అందించే ప్రయత్నం జరిగింది. వీటినే కవిత్వీకరణ విధానాలని అనవచ్చు.
2. కవిత్వీకరణ విధానాలు:
వస్తువు కవిత్వంగా రూపాంతరం చెందడం కోసం రూపాన్ని ఆశ్రయిస్తుంది. రూపాన్ని ఆశ్రయించిన వస్తువు రూపం వల్ల మాత్రమే కవిత్వం కాదు. శిల్పంతో జత కలిసి ప్రత్యేక శైలిని సొంతం చేసుకునే క్రమంలో, వస్తువు రూపంలో ఇమిడే సందర్భంలో సృజనకారుడి ఆంతరంగిక మానసిక మేధో చర్య అవసరమవుతుంది. ఈ చర్యే కవిత్వీకరణ విధానం. ‘దీన్ని కవిత్వ నిర్మాణ పద్ధతిగా విమర్శకులు భావిస్తున్నారు.’ (జి. లక్ష్మీనరసయ్య, కవిత్వ నిర్మాణ పద్ధతులు, పుట 15) వీటి ఆధారంగా కవిత్వీకరణ విధానాలను 14 రకాలుగా విభజించుకోవచ్చు.
2.1 వస్తు భావం: భౌతిక రూపం:
వస్తువుకుండే సహజ గుణానికి, భావానికి భౌతిక రూపాన్నివ్వడం ద్వారా వస్తు భావం పరిసరాల్లోని ఆకారాల్లో, పరికరాల్లో వ్యక్తం కావడం వల్ల కవిత్వమవుతుంది. వస్తు భావానికి తగిన భౌతికాకారం విస్తరిల్లడం వల్ల భావ సాంద్రత పెరిగి వస్తు ఉద్దేశ్యాన్ని సాఫల్యం చేస్తుందని తెలుస్తుంది.
“ఇప్పుడు నను మీటకు / మృత్యు శీతల స్పర్శతో / గడ్డకట్టుకు పోతాను / ఓదార్పు మాటలు చెప్పకు / హృదయం కన్నీటి తటాకమవుతుంది / చూపుల్లో జాలిని రంగరించకు / పిడికెడు బూడిదై రాలిపోతాను / నాలోకి నన్ను ప్రవహించనీ / లోలోపలికి తవ్వుకోనీ!! (గుడిపాటి - క్షత గాత్ర పద్యం - సహజాతం - పుట 60)
ఒకానొక గాయానికి లోనై ఒంటరితనాన్ని తప్ప మరొకరి ఊరడింపు మాటల్ని కూడా సహించలేని మానసిక చిత్త సంఘర్షణలోని వస్తువును కవిత్వీకరించిన విధానం ఇది. పలకరించడం వల్ల మృత్యు శీతల స్పర్శతో గడ్డకట్టుకుపోతానని, పలకరింపు భావం మీటడమనే రూపం కనిపిస్తుంది. ఓదార్పు వాక్యాల వల్ల కన్నీళ్లు తటాకమవుతాయి. జాలి చూపడం వల్ల బూడిదై రాలుతానని అంటూ ఏకాంతంగా అంతర్మథనం చేసుకోనివ్వనటానికి ప్రవహించడం, తొవ్వుకోవడం అనే స్వరూపం ఆపాదితమవుతుంది.
2.2 మానవ గుణారోపణ:
వస్తువులకీ, అమూర్త భావాలకీ, జంతువులకీ, ప్రకృతి విషయాలకీ మానవ స్వభావాన్ని, రూపాన్ని, లక్షణాలని ఆపాదించడం ద్వారా కవిత్వం చెప్పే విధానం. ఇంగ్లీషు కవిత్వంలో personification గా పిలిచే ఈ మాటకి వ్యక్తిత్వారోపణ, మానవ గుణాపాదన అని కూడా వాడుతున్నారు.1
ఈ మానవ గుణారోపణ వాడడంలో కొన్ని లక్ష్యాలున్నాయి. అవి…
- సందర్భానికీ, సంఘటనలకీ, జీవం పోయడానికి.
- భావానికి, మానసిక ధోరణికి.
- ఆలోచనల్నీ, ఆదర్శాలనీ పంచుకోవడానికి.
- ఉద్వేగాల్ని రేకత్తించడానికి.
- దృశ్యమానం చేయడానికి.
- ఇంద్రియ సంవేదనలు కల్పించడానికి.
“పత్తి అంతా తలాపున ఎలిగిన వత్తి / పసుపు…పసుపు కొమ్ములు తెంచింది / తెల్లని పత్తి / పచ్చని పసుపు పగ వట్టినట్టైంది / ముట్టిపోయిన పచ్చి లాగా చి నుకులు వచ్చి పోయినై ఇప్పుడే / జ్ఞాపకాల పడి మీది నుంచి” (మునాసు వెంకట్ - కాలం కాలం జేసింది - వివిధ - ఆంధ్రజ్యోతి దినపత్రిక - తేది. 21-09-2005)
'కాలం కాలం జేసింది'అనే శీర్షికలోనే మానవ గుణారోపణ విధానం తెలుస్తుంది. తెంచడం వల్లా, పగవట్టినట్టవడం వాల్లా, వచ్చిపోవడం వల్లా; పసుపు, పత్తి - పసుపు, చినుకులు వ్యక్తిత్వాన్ని పొందాయి. ఉదహరించిన తొలి పంక్తి మాత్రం ప్రతీకగా నిలిచింది.
2.3 వైరుధ్యమైన పోలిక:
ఏ మాత్రం ఏక సూత్రతలేని రెండు అంశాల మధ్య, వస్తువుల మధ్య పోలిక కుదుర్చడం వల్ల కూడా సారం ఏర్పడుతుంది. రూపకానికీ దీనికీ భేదముంది. అభేద విషయాల్లోని సామాన్య లక్షణం రూపకం. కానీ వైరుధ్య భావాల మధ్య అంతస్సూత్రం ఏదీ లేకుండానే నైపుణ్యంతో అంతర్గతంగా రాజీ కుదుర్చడం ఈ విధానం బాధ్యత. ఇంగ్లీషులో Conceit అని పిలిచే ఈ పద్ధతిని 'అసాధారణ పోలిక',
“దిక్కులన్ని మూసుకున్న డొక్కల / గది గోడలతో / పెనుగులాడి పెనుగులాడి / జననాంగపు గవాక్షాల కవాటాలు / పగులగొట్టి / ప్రసవ వేదనల పెల్లుబికిన / ఆమని పసికందులు నా కవితలు" (బైరెడ్డి కృష్ణారెడ్డి, పురుడు, ఆర్తి I, ఆర్తి సమగ్ర సంకలనం, పుట 4)
పురుడుపోస్తున్నది కవిత్వాన్ని, కవితల్ని అని ఈ కవితా శీర్షిక స్ఫురింపజేస్తుంది. అయితే రతికేళిని, స్ఖలనాన్ని, ప్రసవ సందర్భాన్ని వర్ణించే క్రమంలో రోత భావం పుట్టక పోవడానికి జనించినవి కవితలు కావడమే. డొక్కల గది గోడలు, జననాంగపు గవాక్షాల కవాటాలు, ఆమని పసికందులనే అసంబద్ధ విషయాలు Paradoxగా ఏర్పడడమని గ్రహించాలి.
2.4 భావ సంభాషణం:
చెప్పదలచిన భావాన్ని సంభాషణగా మార్చితే భావ సంభాషణం. ఈ కవిత్వీకరణ విధానం రోజువారి వ్యవహారంలోని నుడికారాలు, యాస, మాట్లాడే తీరు సహజత్వంలోంచి, జీవితంలోంచి పొందుతుంది. ఔచిత్యవంతమైన ఈ సంభాషణా ధోరణి; కథ, నవలా సాహిత్యాల్లోని పాత్రోచిత భాషణంలా సాగుతుంది. ఈ సంభాషణం తగిన గాఢతతో ఆమోదయోగ్యమైన ఉద్వేగాల్ని, తీవ్రతల్ని కలిగిస్తూ పొడి వచనపు వాసనల్ని దూరం చేస్తూ తడిదనాన్ని ఇస్తుంది హృదయానికి.
"నేను అన్నాను- / అరే! చూసావా ఎలా ఆమె / అతని కౌగిట్లో నలిగిపోతుందో / నిన్న నేనే గదా! నా చేతుల్లోనూ ఆమె / అలాగే నలిగిపోయింది' / మిత్రుడు అన్నాడు- / 'రేపు ఆమె నాలోనూ కరిగిపోతుంది' / నేను అన్నాను- / 'ఎంత విచిత్రమైన / అమ్మాయోయ్ ఈమె?!' / నా మిత్రుడు అన్నాడు- / ‘అవును / జీవితమే ఆమె మరి’" (సలంద్ర, నిన్న - నేడు - రేపు, సలంద్ర కవిత - పుట 52)
కవిత ఆసాంతం ఒకే నిర్మాణ విధానానికి ఆధీనమయ్యింది. సహజత్వం చెడని వాచకోక్తులు పుంఖితమవుతున్నాయి. ముక్తసరిగా సాగే మాటల్లోని ముగింపు మాట 'అవును/జీవితమే ఆమె మరి' అనటం విస్తృతమైన గాఢతను పంచింది.
2.5 ధ్వన్యాత్మకం:
పదాల్లోనూ, పాదాల్లోనూ పైకి కనిపించే అర్థానికీ, లోపలి సారానికీ మధ్యనున్న లోతైన భావ అగాధాల్ని కలిపే వంతెన ఉంటుంది. ఉన్నదున్నట్లుగా కాకుండా సృజనకారుడి ఉద్దేశంతో ఏకీభవించే పరిస్థితిని కల్పిస్తుంది. కవిత్వానికి ఉన్నతిని కట్టబెడుతుంది.
“మట్టి గొంతుకలోని మూల్గులు వినిపిస్తే / వినువీథిలో ఊరేగే మబ్బు కన్ను చెమరిస్తుంది / క్షణంలో అది నేలకు దిగొచ్చి / చినుకుల చేతులతో ఓదారుస్తుంది” (డా. సి. నారాయణ రెడ్డి, మట్టీ మనిషీ ఆకాశం, పుట 56)
నింగికి, నేలకు వేసిన బంధాన్ని ధ్వన్యాత్మకం చేస్తుందీ కవిత. మట్టి గొంతుక, మబ్బు కన్ను, చినుకుల చేతులు అనే పద బంధాల్లో ధ్వనించే అర్థం అన్ని పాదాలకూ విస్తరిల్లి కవితాత్మకమయ్యింది. మట్టి గొంతుకలోని మూల్గులు విత్తనాలని ధ్వనిస్తుంది. ఇంకా వర్షాభావాన్ని సంకేతిస్తుంది. 'మబ్బు కన్ను' అనే పద బంధం ధ్వనికి పరాకాష్ఠ. చెమర్చడంలో దయార్ధ్రత ఉంది. ఓదార్పు కోసం నేలకు దిగి రావడంలో ఆప్యాయత ఉంది. మబ్బును కేంద్రీకృతం చేసిన దీంట్లో మానవ గుణారోపణ లక్షణాలూ ఉన్నాయి. ధ్వనిలోని ప్రాధాన్యత వల్ల ఈ విభాగంలో చేరింది.
2.6 నవ్య భాష్యం:
స్థిరపడిన భావాల తాలూకు మూస దృక్పథాల్ని కొత్త చూపుతో నిర్వచించడం. గతానుగతిక ఆలోచనల్లోంచి వేరు పాయల్ని తీసుకొని జీవితానుభవాలను వ్యాఖ్యానించటమే నవ్య భాష్యం. గత ముద్రల్ని చెరిపేసి పాఠకుడిలో కొత్త సంతకాల్ని చేస్తుంది.
"ఇపుడు /అక్షరం / వెలివాడ వాకిట్లో / మంటల్లో కాగుతున్న డప్పు / లేగ దూడ కను కొలుకుల్లో మెరిసిన / సూర్యబింబం / ఇపుడు / అక్షరం అమాయకపు ఆదివాసి / యువతి కాదు / గోరువంకను సాయిధం చేస్తున్న / దండకారణ్యం / అక్షరం ఒరిగిపోతున్న / వీరుడి స్వప్నం" (సి. కాశీం, కాశీం కవిత్వం 1994 - 2014, పుట 34)
అక్షరం దళితవాడల్లోనూ, దండకారణ్యంలోనూ, వీరుడి స్వప్నంలోనూ కాగుతూ, మెరుస్తూ, సాయిధం చేస్తూ, స్వప్నమై నిలుస్తోందనే భాష్యం కొత్త నేపథ్యాన్ని సూచిస్తుంది. చెప్పదలచిన వస్తువుకు రెక్కలందిస్తోంది.
2.7 ఊహాత్మకత:
ఏ ఇంద్రియశక్తి తక్షణ ప్రమేయం లేకుండానే మనసులో నవ్యతాంశాలు, సంచలనాలు, ఆలోచనలు ఉత్పన్నం కావడం లేదా అనుకరించడం ఊహాత్మకత ఈ ఊహాత్మకతలో 1. వాస్తవిక ఊహలు 2. వైజ్ఞానిక ఊహలు 3. పౌరాణిక ఊహలు 4. ప్రాకృతిక ఊహలు 5. మానసిక ఊహలు 6. సైద్ధాంతిక ఊహలు 7. తార్కిక ఊహలు అనే బేధాలుంటాయి. కవిత్వంలో పౌరాణిక, ప్రాకృతిక, మానసిక ఊహలకు ప్రాధాన్యం ఎక్కువ.
“అదంతా మబ్బుల ప్రపంచం / కాలమేఘాల గుహల దూరుతూ / తెలి మబ్బుల తలలు దువ్వుతూ / చుట్టూ మేఘాల అరణ్యాలూ / పర్వతాలూ, సముద్రాలూ / హఠాత్తుగా బుద్ధుడి బోధివృక్షంలా వో పెద్ద మేఘం!” (వి.ఆర్. విద్యార్థి, పునాది, కవితా ఓ కవితా, పుట 113)
శ్రామికుడి చేతులు, శాస్త్రవేత్త తెలివి ఈ రెండూ అంతులేని ఆనందానికి పునాది అని చెప్పడం విషయం. దీనికోసం ప్రాపంచిక జగత్తును ఊహా జగత్తుగా మార్చిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. మబ్బుల గురించిన వివిధ రకాల ఊహలు ఆసక్తిదాయకం.
2.8 వర్ణనాత్మక భావసంకేతం:
జీవితానుభవంలోని సంఘటనని గానీ, దృశ్యాన్ని గానీ వర్ణిస్తూ భావాన్ని సంకేతింప చేయడం. వర్ణన గుప్పిస్తూ అవసరమనుకున్నచోట భావ గర్భిత వాక్యాన్ని జతచేసి కవిత్వీకరించే పద్ధతి.
“వేదాలూ, ఉపనిషత్తులూ, పురాణాలూ, ప్రబంధాలూ / నీ నుదుటిపై అపభ్రంశపు రాతలు రాసి / నీ భవిష్యత్తుపై అంధకారపు కూతలు కూసి / నీ నమ్మకాన్ని చెరిపి / నీ ఆత్మ విశ్వాసాన్ని మంటగలిపి / సహస్రాబ్దాలుగా సకల అవకాశాలకూ దూరంగా / సుఫల సంపదలకూ దూరంగా వెలివేసి / కర్మ సిద్ధాంతాలు వల్లె వేసినంత కాలం / ఈ వ్యవస్థ ప్రశాంతంగా పయనించింది” (ఎస్వీ. సత్యనారాయణ, కార్చిచ్చుపై కన్నీటి గీతం, ఈ తరం కోసం… వచన కవిత; పుట 141)
చుట్టుముట్టిన విశ్వాసాలన్నింటినీ ఏకరవు పెడుతూ చివరికి 'ఈ వ్యవస్థ ప్రశాంతంగా పయనించింది' అనే భావ సంకేతంతో వస్తు నిర్మాణంలో కవిత్వం ప్రవేశించింది. ఈ కొసమెరుపు సంకేతమే లేకపోయినట్లయితే కవిత్వం అద్దుకున్న కళారూపం అయ్యేది కాదు.
2.9 ప్రతీకాత్మకత:
ఒక వస్తువు ద్వారా మరో వస్తువు స్ఫురిస్తే అది ప్రతీక. స్ఫురింపజేసే వస్తువు చెప్పని వస్తువుకు ప్రతీక అవుతుంది. "సింబాలిస్టు వస్తువులో సింబల్ ని చూస్తున్నాడు. కనుక సత్యమే సింబల్ అని వ్యవహరించబడుతోంది. కనుక గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే ఈ సింబాలిజంలో సింబల్స్ మన ఇష్టమొచ్చినట్లు పెట్టుకునేవి కావు; ఏవో వట్టి గుర్తులు కావు. అవి సింబాలిస్టు అనే ఒక ద్రష్ట చూచిన దృశ్యాలు, ఆ ద్రష్టకు సిద్ధించిన దార్శనిక అనుభూతులు"2 అని అంటూ ధ్వని కన్నా సింబాలిజం చాలా గొప్పదంటాడు శేషేంద్ర. ఈ నిర్మాణ నైపుణ్యం తెలిస్తేనే ప్రతీకత్వాన్ని పరిశీలించడం సాధ్యమవుతుంది.
"మొన్న కల / నిన్న పీడకల / ఈనాడు / ఉరి పెట్టుకున్న సత్యం / నా / తెలంగాణా" (అమ్మంగి వేణుగోపాల్, తెలంగాణా, పొక్కిలి, పుట 22 )
తెలంగాణ ఉద్యమంలోని మైలురాళ్లను సంకేతిస్తూ చెప్పడంలో ప్రతీ వాక్యం ప్రతీకను సాధించింది. తెలంగాణ అనేకానేక ఉద్విగ్నతలు కలగా, పీడకలగా, ఉరి పెట్టుకున్న సత్యంగా ప్రతీకాత్మకత పొందింది.
2.10 వచనాత్మకత
వాస్తవిక వస్తు జాలాన్ని అంతే వాస్తవికంగా పూలమాలను కూర్చినట్లు రాయడం, సహజత్వాన్ని కుంచెతో చిత్రించినట్లు సృజించడం, అసంగత అద్దకపు పనులేవీ లేకుండా లయాత్మకంగా, ప్రాసల్ని, ప్రతిమల్ని వాడుతూ శ్రావ్యత సాధించడం వచనాత్మకత.
"అయితే అవి వెలసిపోయ్యేవి. కానీ…జాజు రంగులో మెరిసే అక్షరాలు రాడికల్ వాయిస్ లు, బిగించిన పిడికిళ్లు, అమరవీరులకు జోహార్లు. ఒక కదన రంగంలో నిలబడి కత్లు కోలాటమాడుతున్న నవతరం. చిరు గడ్డాలు…లాల్చీ పైజామాలు, బన్ను, వన్ బై టు చాయ్ లు, ఎగ్గామ్లెట్లు…మల్లయ్య క్యాంటిన్ లో ఎర్రెర్రటి ముచ్చట్లు, మావో, మార్క్స్, ఎంగెల్స్…'రీ ఇన్వెంట్' చేస్తున్నట్టు…కాలం మోదుగ పూల వనంలా ఉండేది. ఇదిగో అదే ఆర్ట్స్ కాలేజీ మెట్లకు పాతిక సంవత్సరాల అనంతరం మొక్కి మాట్లాడుతున్నాను…తెరలు తెరలుగా జ్ఞాపకాలు పొరలినట్టే, పొరలు పొరలుగా పోరాటాలు కెరలినట్టే…సమాజం సంక్షుభితమైనప్పుడల్లా… ఆర్ట్స్ కాలేజీ తన చుట్టూ ఆవరించిన మైదానాలను దాటుకొని రోడ్ల మీదకు ప్రవహిస్తూనే ఉంది" (అల్లం నారాయణ -మొదుగు పూలవనం - వల్లు బండ తెలంగాణ ఉద్యమ కవిత్వం - సంపా. అన్నవరం దేవేందర్ - పుట 50)
పై ఉదాహరణలో భిన్నమైన అక్షరాకృతిలో కనిపిస్తున్న చోటల్లా కవిత్వీకరణ ప్రయత్నంతో వచనాత్మకత విధానాన్ని అనుసరించింది. 'ఎర్రెర్రటి ముచ్చట్లు' అనే భావ ప్రతిమ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. 'ఆర్ట్స్ కాలేజీ రోడ్లమీదకు ప్రవహించడం' అంటే ఉద్యమించే విద్యార్థి లోకాన్ని భావంగా అందిస్తుంది. వస్తు భావం భౌతిక ఘనాత్మకత నుండి ద్రవాత్మక రూపాన్ని ధరించడంలో కవిత్వీకరణ విధానాన్ని మేళవించుకున్న వచనాత్మకత.
2.11 వస్తు స్థానభ్రంశం:
ఆశించిన భావానికి తగిన మానసిక స్థితిని, వాతావరణ స్థాయీభావానన్ని సృష్టించడానికి అందుకు సరిపడే వస్తువుల్ని ఎన్నుకొని భిన్న ప్రదేశాల్తో, భిన్న వస్తువుల్తో జత చేయడం వస్తు స్థానభ్రంశ నిర్మాణ విధాన లక్షణం. వస్తువుల స్వభావాన్ని ‘తారుమారు చేయడంతో కవిత్వం పుడుతుంది.’3
“వర్షపు చినుకుల వరి మొక్కల కొనలపై / తలపాగా పరుచుకుని పచ్చ నాకు సాక్షిగా పాడే నీ పాటనీ / పగుళ్లు బారిన భూశవంపై పడి / విలపించే నీ దుఃఖ తంత్రుల్నీ / ఈ దేశ మరణనాదంగా భావిస్తాం / …………………. / మా అక్షరాలని దున్నే నాగలివి నీవే / మా భావాల్లో కాలుతున్న గుడిసె నీదే / మా నినాదాల్లో తేలే గ్రామాలు నీవే” (నాళేశ్వరం శంకరం, మధ్యవర్తి చేతుల్లో రైతూ, కవి, దూది మేడ; పుట 56)
Misplacement of Things కి సరియైన ఉదాహరణ ఇది. వర్షపు చినుకులపై, వరి మొక్కల కొనలపై తలపాగా పరచుకోవడం, అక్షరాల్లో నాగలి, భావాల్లో గుడిసె, నినాదాల్లో గ్రామాలు వాటి సొంత ప్రదేశాల్ని వదిలి స్థానభ్రంశం చెందడంతో కవిత్వంగా పరిణమించింది. వస్తు స్థానభ్రంశం కవిత్వానికి ఓ సింహాసనం.
2.12 ప్రశ్నార్థకం:
ప్రశ్న జీవిత గమనాన్ని, గమ్యాన్ని, సారాన్ని సంకేతిస్తుంది. వ్యవహారంలో జ్ఞాన సంపాదనకు తొలిమెట్టుగా నిలుస్తుంది. జీవితాన్ని ఒడుచుకోనే కవిత్వంలో సందర్భానుకూల ప్రశ్నలు నిర్మాణాత్మకమవుతాయి.
“కళ్ళలో ప్రశ్న / కరచాలనంలో ప్రశ్న / నీటిలో ప్రశ్న / గాలిలో ప్రశ్న / రహదారిలో ప్రశ్న / ప్రశ్నార్థకమైన దేహంతో / ఇంట్లో అడుగుపెడితే / మరణ శయ్య పై ఉన్న / అవ్వ అడిగింది / బిడ్డా… / ఇస్తరా… లేదా…” (కృష్ణుడు, ప్రశ్న, వివిధ, ఆంధ్రజ్యోతి దినపత్రిక; తేది. 15-02-2010)
ప్రతీ పాదం ప్రశ్నార్థకాన్ని వ్యక్తం చేస్తూ చివరి పాదం స్పష్టమైన, సూటిదైన ప్రశ్నను సంధించింది. మరణశయ్యపై ఉన్న అవ్వ అడిగిన ప్రశ్న అమాయకమైనది, ఆసక్తికరమైనది. ఇంకా చివరి ఆశను నిలబెట్టుకునేదీ, అనుమానించదగినదీ అనేలా కవిత్వీకరించాడు కవి.
2.13 పునరుక్తి భావం:
‘పునరుక్తిని ఛందస్సులోని పది దోషాల్లో ఒకటిగా ఛందో దర్పణం పేర్కొంది.’4 ఆధునిక కవిత్వ విషయంలో మాత్రం భావం, వాక్యం పునరుక్తం కావడం కవిత్వీకరణ విధానం. ఈ పునరుక్తి కవిత్వీకరణలో భాగస్వామి కావడమే కాకుండా భావాన్ని తీవ్రతరం చేస్తుంది. వస్తు విస్తరణలో మద్య మధ్యలో జోక్యం చేసుకుంటూ ఊపునూ వేగాన్నీ అందిస్తుంది.
“నా పాద స్పర్శ ప్రసరించిన నేల / అడవి పొలం జమిలిగా పులకిస్తాయి / నా పాటల రసం ప్రవహించిన చోట / పాలు రక్త మాంసాలై విటమిన్లుగా పలకరిస్తాయి / నేను గొర్రెల్ని కాస్తుంటాను / … … … … … … … / పాములు, తేళ్లు / నా పేరు చెబితే పారిపోతాయి / చెట్ల క్రియలు / మేక పాలు నా దివ్యౌషధాలు / నేనో పల్లె ధన్వంతరిని- / రుతు ధర్మాలు తెలుసు / సృష్టి రహస్యాలు తెలుసు / వాత్సాయనుడు నా లేఖరి / నేను గొర్రెల్ని కాస్తుంటాను” (బెల్లి యాదయ్య, నేను గొర్రెల్ని కాస్తుంటాను, ఈ తరం కోసం… వచన కవిత, పుట 217,220)
వివరణ అక్కర్లేని వస్తువుతో రాసిన దీర్ఘమైన కవిత 'నేను గొర్రెల్ని కాస్తుంటాను' అనే మౌలిక భావం పునరుక్తమవుతున్న ప్రతిసారీ గేర్ మార్చుకున్న వాహనంలా వేగాన్నీ, ఊపునూ అందుకుంటుంది. ఎక్కడైతే పునరుక్తి అవసరమో అక్కడే ఈ నిర్మాణం చేపట్టడం ఔచిత్యం మీద ఆధారపడి ఉంటుంది.
2.14 ప్రాధాన్యీకరణం:
‘కవితా వాక్యాల్లో పద క్రమం మామూలు కన్నా భిన్నంగా ఉండటం’5 ప్రాధాన్యీకరణంగా భావించవచ్చు. పదాల వరుసక్రమం మార్పు వల్ల ప్రతిపాదిత అంశాల్లో తీవ్రత పెరుగుతుంది. వచనత్వపు వాసనల్ని కోల్పోయి కవిత్వపు పరిమళాన్ని అందుకుంటుంది. ఈ నిర్మాణ మర్మజ్ఞత తెలీకుండా వినియోగిస్తే విఫల ప్రయోగమే అవుతుంది. వస్తు భావ ప్రాధాన్యత కోసమే ఉద్దేశించిన ఈ ప్రాధాన్యీకరణం రెండు విధాలు అవి 1. పద ప్రాధాన్యం 2. వాక్య ప్రాధాన్యం.
“చౌరస్తాల నిండా స్థంభించిన సంచారం / ఆ నాలుగు బాటల కాడ గర్జించిన బొండిగలు / ర్యాలీలు ర్యాలీలుగా కదులుతున్న కాళ్లు / ఎక్కెక్కి పడుతున్న కడుపులోని కాంక్ష” (అన్నవరం దేవేందర్, తొవ్వ , పొద్దుపొడుపు, అన్నవరం దేవేందర్ కవిత్వం 1; పుట 398)
పైన గుర్తించిన ముద్ద అక్షర పదాలు ప్రాధాన్యం కోసం పాదాంతాల్లోకి చేరాయి. కవిత్వీకరణలో సహజంగా వస్త్వంశాన్ని ముందుకు నడిపించడంలో ప్రాధాన్యత ఉపకరించింది. పద ప్రాధాన్యతకిది ఉదాహరణ.
“నేను, మా నాన్న ఇద్దరం / ఇన్నాళ్లు గింజల గురించి వీలైనప్పుడల్లా / మాట్లాడుతూనే ఉన్నాం / ఆరు నెలల నుంచి నాతో మాట్లాడడానికి / నాన్న ఇక్కడ లేడు, పొలం దగ్గరా లేడు / వెతుక్కుంటున్నాను. / నా లోపలి అక్షరాలతో మొరపెట్టుకున్నాను" / నా లోపలి నాన్నని అక్షరంగా మలచి నాకివ్వరా! అని” (యాకూబ్ , అక్షరాన్ని నమ్ము, మిర్గం; పుట 186)
వాక్య ప్రాధాన్యాన్ని కవిత ముగింపు వాక్యంలో పొందింది. ఏడవ వరుసలో ఉండాల్సింది కాస్తా చివరి వాక్యంగా మారటంతో ప్రాధాన్యతే కాకుండా కొసమెరుపూ సాధ్యమయ్యింది.
3. వైవిధ్య వ్యూహం:
వివిధత్వాల కూడలి వైవిధ్యం. కవిత్వానికి ఎన్ని ముఖాలో, వైవిధ్యానికి అన్ని రూపాలు. వస్తు రూపాల మధ్య నిర్వహించాల్సిన విశాలమైన, సున్నితమైన ప్రక్రియలో కవిత్వీకరణం ముఖ్యమైనది. వస్తువే కవిత్వం కాదు. వస్తువు అనేక మార్గాల ద్వారా కవిత్వీకరించవచ్చని తెలుసుకున్నాం. వస్త్వంశాన్ని కవిత్వీకరించే విధానాలు పరిమితమైనవి కావు. వాటికి ఇదమిత్థమైన సంఖ్య లేదు. కానీ వైవిధ్యత నిచ్చే కవిత్వీకరణ విధానాల వ్యూహం రెండు మార్గాలుగా సాగుతుంది. ఒకటి: ఖండ వ్యూహం రెండు: బహుళ వ్యూహం.
3.1 ఖండ వ్యూహం:
కవిత్వీకరణ విధానాల్లో ఏదో ఒక్క విధానాన్ని పాటిస్తూ వస్తు భావం కవిత్వం కావడం ఈ వర్గీకరణ కోవకు చెందుతుంది. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం, కవితలోని అంతస్సూత్రం చెడకుండా ఉండడం కోసం, ఒకే రకమైన బిగువును పోషించడం కోసం ఈ విధానం ఉద్దేశిస్తుంది.
“చార్మినారే లేకుంటే / ఇంతకాలం చందమామ / దీపంలా వెలిగేది కాదు / లాడ్ బజార్ కనిపించకపోతే / బారాత్ లా తారలు బారులు తీరి / గుంపులుగా చేరేవి కావు / గుల్జార్ హౌజ్ ను చూడకుంటే / ఇంద్రధనస్సుకి యిన్ని / హోలీ రంగులు తెలిసేవి కాదు / మూసీ నది నగరంలో పారకుంటే / దుమ్ము నిండిన అద్దానికి / వడ్డాణం గుర్తుండేది కాదు / . . . . . . . . . . . . . / గోలకొండను చూడకపోతే / మబ్బులు రెక్కలార్చడానికి / చరిత్ర మెట్లు దొరికేవి కాదు / ఇరానీ హోటళ్ళు లేకపోతే / ఎదురుచూసే మిత్రుడికి / స్నేహం రుచి తెలిసేది కాదు / . . . . . . . . . . . . . / హైదరాబాదు లేకుంటే / మల్లె పందిరిలా అల్లుకున్న / ఆకాశం కూడా వుండేది కాదు” (ఆశారాజు, చిలుకల మేడ, జిగర్; పుట 52 - 54)
ఎత్తుగడ నుంచి ముగింపు దాకా కవిత్వీకరణ విధానం ఒకే తీరుగా నిర్మితమయ్యింది. ఊహాత్మక విధానంలో హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి మీగడలా పేరుకుంది. శిల్పమూ, శైలీ రెండూ కూడా ఒకే తరహాలో కొనసాగాయి. ఊహాత్మకత అంతా కూడా చేదర్థకాన్ని (లేకుంటే, కనిపించకపోతే, చూడకుంటే, పారకుంటే...) పాటించింది.
3.2 బహుళ వ్యూహం:
ఏకోన్ముఖ విధానానికి భిన్నంగా అనేక రూపాల్లో కవిత్వీకరణ విధానం అమలయితే అది బహుళ వ్యూహం. వస్తు అంశాన్ని వివిధ మార్గాల్లో కవిత్వీకరించడానికి ఉద్దేశించిందీ వ్యూహం. భిన్న పార్శ్వాల్ని విభిన్నంగా చూపడానికి, అన్ని కోణాల్లోనూ కవిత్వాన్ని చిత్రిక పట్టడానికి, వైవిధ్యత సాధించడానికి, పరిపూర్ణత్వానికి, లోతునీ సారాన్నీ పెంచడానికి, సహజత్వాన్ని, కళా నిపుణతని ఉన్నతీకరించడానికి ఉపకరిస్తుందీ వ్యూహం. వస్తు వైరుధ్యం తలెత్తకుండా కవిత్వీకరణలో వైవిధ్యం సాధించటం కవి నైపుణ్యానికీ, అనుభవానికీ పరీక్ష.
“ఆకాశం వూగుతోంది / నీ మబ్బు రంగు పిల్లి గడ్డంలా- / మాసిన పైజామా పైకి మడిచి / మమ్మల్ని తరుముతున్నావు నువ్వు / కాలవ్వొడ్డున- / చిరిగిన లాల్చీలోంచి / గాయం లాంటి వొళ్ళు / ఆటల బంతి వెంటాడ్తున్న / వొకానొక వీధి కుక్క / ఆ సాయంత్రాలు ప్రతీసారి నువ్వు / అమ్మ దగ్గరకొచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకునే వాడివి / కాఫిర్లతో కలిసి నేనూ / నిన్ను అల్లరి పెట్టానని-” (అఫ్సర్, ఉష్…మాన్, వలస; పుట 16)
‘ఆకాశం - వూగటం’ → వస్తు భావ భౌతిక రూపం (2.1)
‘ఆకాశం - పిల్లి గడ్డంలా’ → వైరుధ్యమైన పోలిక (2.3)
‘ఆకాశం పిల్లి గడ్డంలా ఊగటం’ → ప్రతీకాత్మకత (2.9)
'ఆకాశం వూగుతోంది / నీ మబ్బు రంగు పిల్లి గడ్డంలా-' → ప్రాధాన్యీకరణం (2.14)
కేవలం రెండు పంక్తుల్లోనే నాలుగు నిర్మాణ పద్ధతులు దాగున్నాయి. గడ్డంలా ఆకాశం ఊగుతుందటంలో ఔచిత్యముంది. 'మబ్బు' రంగుని సూచించడం మబ్బుకు ఆకాశం స్థానీయమని సూచిస్తుంది. ఇంకా కొన్ని చోట్ల ప్రాధాన్యీకరణమనే కవిత్వీకరణ విధానం స్పష్టంగానే తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాల్సివస్తే బహుళ వ్యూహం ఓ సింగిడి.
4. ముగింపు
వస్తు రూపాల మధ్య ఆంతరంగికంగా ఒక ఆలోచనా ప్రక్రియ కుదురుకునేందుకు ప్రయత్నం సాగుతుంది. వస్తువు కవిత్వంగా మారేందుకు ఒక నిర్మాణాత్మక పథకాన్ని అనుసస్తుంది . దీన్నే కవిత్వీకరణ విధానంగా భావించాం. ఈ వ్యాస పరిధిలోని కవిత్వీకరణ విధానాలు మౌలికమైనవి. సృజనకారుడి ఆలోచన, వస్తువును కవిత్వమయం చేయటం కోసం వివిధ మార్గాలను అనుసరిస్తుందని తెలుస్తున్నది. వస్తువుకు భౌతిక రూపాన్నివ్వడం, మానవ స్వభావాన్ని ఆరోపించడం, అసంబద్ధమైన, పరస్పర విరుద్ధమైన పోలికలు కల్పించడం, సంభాషణా రూపాన్నివ్వడం, ధ్వని గర్భితంగా, కొత్తదైన అర్థాన్ని కల్పించడం ద్వారా కవిత్వవుతుంది. ఊహలతోనూ, వర్ణణాత్మకంగానూ, ప్రతీకాత్మక ధోరణిలోనూ, శుద్ధ వచనాన్ని ప్రయోగించడం ద్వారా కవితా స్వభావం అలవడుతుంది. ప్రశ్నించడం, పునరుక్తిని అనుసరించడం, ప్రాధాన్యతను పాటించడం వంటి నిర్మాణ పద్ధతుల ద్వారా కూడా కవితామయం అవుతుంది వస్తువు. ఇలాంటి విధానాలు సాహిత్యంలో స్థిరపడుతూ వస్తుంటాయి. కొత్తవి చేరుతూ వస్తుంటాయి. కవిత్వం ఒకే మూసలో నడవకుండా వైవిధ్యాన్ని అందించేందుకు ఇవి తోడ్పడుతుంటాయి. వీటిని ఇంకా విస్తృతంగానూ పరిశీలించవచ్చు. కానీ వస్తు భావం ఏ విధంగా కవితా నిర్మాణం పొందుతుందో, కవిత్వీకరణ విధానాల్లో వైవిధ్యం ఎలా రూపొందుతుందో స్థూలంగా చూపడానికి స్థిరపడిన విధానాలివని భావించాలి.
వస్తువులోని ద్రవస్థితే కవిత్వీకరణకు సహకరిస్తుందని, వీటి వైవిధ్యం ఖండ వ్యూహం, బహుళ వ్యూహం అనే రెండు వ్యూహాల్లో అమలవుతుందని, వస్తువు కవిత్వంగా మారే మౌలిక విధానాల సరళి ఇదని తెలుస్తుంది.
5. పాదసూచికలు:
- జి. లక్ష్మీ నరసయ్య - కవిత్వం చర్చనీయాంశాలు - పుట 54
- గుంటూరు శేషేంద్ర శర్మ - రక్త రేఖ - శేషేంద్ర సాహిత్యం I - పుట 352
- జి. లక్ష్మీ నరసయ్య - కవిత్వం - చర్చనీయాంశాలు - పుట 107, 108
- చూ. అనంతామాత్యుని ఛందో దర్పణము (ఛందో గ్రంథము) - వ్యాఖ్యాత డా. చిర్రావూరి శ్రీరామ శర్మ - పుట 177,178
- చేకూరి రామారావు - వచన కవిత్వంలో శైలీ భేదాలుండవా? చేరా సర్వ లభ్య రచనలు మొదటి సంపుటం వ్యాసాలు - పుట 1040
6. ఉపయుక్తగ్రంథసూచి:
- గుడిపాటి. పుట్ట బంగారం. పాలపిట్ట బుక్స్, ఏప్రిల్ 2018
- గౌరీశంకర్, జూలూరు. ప్ర. సంపా. తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర, తెలంగాణ సాహిత్య అకాడమి, సెప్టెంబర్ 2022
- చంద్రశేఖర రెడ్డి, డి., సంహిత, మీడియా హౌస్ పబ్లికేషన్స్, జనవరి 2001
- తిరుపతిరావు, బి., బౌమనీయం, జిగ్మంట్ బౌమన్, ఆధునికత నుంచి ద్రవాధునికత దాకా, అనల్ప, 2022
- ప్రతాపరెడ్డి, కాసుల. తెలంగాణ సాహిత్యోద్యమాలు, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, అక్టోబర్ 2022
- ప్రతాపరెడ్డి, కాసుల. ఇరుసు, మట్టి ముద్రణలు, ఆలగడప, జనవరి 2008
- ప్రభాకర్, ఎ.కె., సంపా., బహుళ, పర్స్పెక్టివ్స్, ఏప్రిల్ 2018
- మధుసూదన రావు, త్రిపురనేని. సాహిత్యంలో వస్తు శిల్పాలు, పర్స్పెక్టివ్స్, హైదరాబాద్
- మల్లారెడ్డి, తూర్పు, ప్ర. సంపా., తెలంగాణ సాహిత్యం జీవిత చిత్రణం, తెలుగు శాఖ, శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల, ఉస్మానియా పట్టబద్రుల సంఘం మరియు ఎగ్జిబిషన్స్ సొసైటీ వారి సంయుక్త సంచాలితం, భువనగిరి, జూలై 2007
- రమణాచారి, కె.వి., పద్య కవిత్వం: వస్తు వైవిధ్యం (1991-2000), ఎమెస్కో, సెప్టెంబరు 2009
- లక్ష్మీ నరసయ్య, జి., కవిత్వం చర్చనీయాంశాలు, కవి సంగమం బుక్స్ , హైదరాబాద్, జనవరి 2021
- విజయ్ కుమార్, సల్ల. ఆధునిక తెలంగాణ కవిత్వం జనజీవన చిత్రణ, జనవరి 2018
- శిఖామణి, సంపా., కవి సంధ్య, ద్వైమాసిక పత్రిక, నవంబర్, డిసెంబర్ 2022
- శ్రీహరి రవ్వా, సంపా., తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర, తెలుగు అకాడమి, హైదరాబాద్, 2016
- సంపత్ కుమార్ బెల్లంకొండ, సంపా. తొలినాళ్ళ సోయి, తెలంగాణ సాహిత్య అకాడమి, హైదరాబాద్, డిసెంబర్ 2017
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.