headerbanner
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. ✽ గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM | Volume-5 | Issue-9 | August 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

7. కర్నూలు జిల్లా కథా సాహిత్యం(2000-2010): ప్రాంతీయజన జీవనం

కె. వెంకటస్వామి

పరిశోధక విద్యార్థి, తెలుగు అధ్యయనశాఖ,
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9052961440, Email: swamy.ma82@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

కర్నూలు జిల్లా కథాసాహిత్యంలో వచ్చిన కథావస్తువు ప్రాంతీయస్పృహను, ప్రాంతీయ- దృక్పథాన్ని, సామాజిక జీవనాన్ని వ్యక్త పరుస్తూ సమకాలీన ధోరణులతో వచ్చిన రచనలను విశ్లేషణాత్మక పద్దతిలో పరిశోధించడం. కర్నూలు కథా రచయితల కథల్లో ప్రాంతీయ జన జీవన చిత్రణ ఇతివృత్తాలు కల్గినవిగా గుర్తించుట. ఈ వ్యాసాంశం కేవలం ఒక దశాబ్ద కాలం(2000-2010)కు మాత్రమే పరిమితం. ఈ దశాబ్ద కాలంలో వచ్చిన కథా సంపుటిలు, కథాసంకలనాలలో ఉండే ప్రాంతీయ జన జీవితాలను వ్యక్తపరచడమే ముఖ్య ఉద్దేశ్యం. ‘కర్నూలు జిల్లా కథ-పరిశీలన’ అనే అంశంపై పరిశోధన చేశారు.ఈ పరిశోధన కేవలం హరికిషన్ 2005లో ప్రచురించిన సంకలనానికి మాత్రమే పరిమితం.ఈ సిద్దాంతం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి 2011లో సమర్పించారు.మరొకటి ‘కర్నూలు జిల్లా కథలు-పరిశీలన’ అనే అంశంపై పరిశోధన చేశారు.ఈ పరిశోధన కేవలం రాయలసీమ రచయితల ప్రచురణలకు మాత్రమే పరిమితం.ఈ సిద్దాంతం అంధ్రవిశ్వవిద్యాలయం నుండి 2019లో సమర్పించారు.మరొకటి ‘కర్నూలు జిల్లా కథా సాహిత్యం-బహుజన జీవిత చిత్రణ’ అనే అంశంపై పరిశోధన చేశారు.ఈ సిద్దాంతం అంధ్రవిశ్వవిద్యాలయం నుండి 2022లో పూర్వ పరిశోధనలు జరిగాయి.

Keywords: కర్నూలు జిల్లా, ప్రాంతీయత, ప్రాంతీయ స్పృహ, సామాజికత, ప్రాంతీయ జన జీవనం, సామాజిక చైతన్యం, ప్రాంతీయ కక్షలు, ప్రాంతీయ వివక్ష, రైతు జీవిత చిత్రణ.

1. ఉపోద్ఘాతం:

రాయలసీమలో ఒక భాగం కర్నూలు ప్రాంతం.ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో రాయలసీమ రచయితలు నూతన పోకడలతో రాయలసీమ కథా సాహిత్యాన్ని సృజింపజేస్తుంటే కర్నూలు జిల్లా నుండి యువ కథకులుగా పేర్లును సుస్థిరం చేసుకున్న వారిలో జి.వెంకటకృష్ణ, జి. ఉమామహేశ్వర రావు, ఎం.హరికిషన్, ఇనాయతుల్లా, వంటి రచయితలు నూతన ఉత్సాహంలో కర్నూలు కథా స్వరూపాన్ని ఉరుకులెత్తించారు, కె.ఎన్.ఎస్.రాజు, శ్రీనివాసమూర్తి రాప్తాడు గోపాల కృష్ణ, కాశీభట్ల వేణు గోపాల్ వంటి కథకులు కర్నూలు కథా సాహిత్యానికి బలమైన పునాదులు నిర్మించారు. అవగాహన (ఆధునిక సాహిత్య వ్యాసాలు:తుమ్మల రామక్రిష్ణ:పుట:15). వీరితో పాటు రచయిత్రులు సైతం కథా సాహిత్యానికి సేవలు చేసి అనేక కథలను వెలువరించారు. 1990కి ముందు, ఆ తరువాత అని కర్నూలు జిల్లా, కథా సాహిత్యాన్ని విభజించి పరిశీలించినట్లయితే 1972లో కర్నూలు జిల్లా కథా రచయితల సహకార ప్రచురణ సంఘం ఏర్పడి కొత్త రచయితలకు ప్రోత్సాహం కల్పించింది. ఈ సమయంలో 1972 లో ‘వైకుంఠ వాకిలి’ కర్నూలు జిల్లా తొలి కథా సంకలనం వెలువడితే, 1978లో ‘తుంగభద్ర తరంగాలు’ 1989లో ‘ఐంద్రావతి కథలు’ వచ్చాయి. 1990 నుండి 2000 వరకు, 2001 నుండి 2010 వరకు వచ్చిన సంపుటిలు కర్నూలు జిల్లా కథా సాహిత్యంలో వచ్చిన కథా సంకలనాలు ఎంత వరకు ప్రాంతీయతకు,రాయలసీమ సాహిత్యాన్ని ఎంత ప్రభావితం చేసిందో స్పష్టమవుతుంది. (తెలుగు కథ ప్రాంతీయ అస్తిత్వం:వెల్దండి శ్రీధర్:పుట:248) 

2. కర్నూలు కథా సాహిత్యం(2000-2010):

కర్నూలు జిల్లా కథా సాహిత్యానికి తొలి మెట్టు ‘కర్నూలు జిల్లా కథా రచయితల సహాకార ప్రచురణ సంఘం’ అయితే సాహిత్య అభివృద్ధికి సూచిక మాత్రం 1990 తరువాత ఏర్పడిన ‘కథాసమయం’ అనే చెప్పవచ్చు. కథా సమయం సంస్థ స్థాపించిన తరువాత కర్నూలు కథా సాహిత్యం పూర్తిగా ప్రాంతీయ జీవిత చిత్రణే ప్రధానాంశంగా మార్చుకుంది. ప్రాంతీయ జీవితాలను, భాషను కథల్లో పొందపరుస్తూ, సమకాలీన అంశాలను అవగాహన చేసుకుంటూ, విశ్లేషించుకుంటూ, చర్చించుకుంటూ, వస్తువులోనూ, కథా శైలీలోనూ  ఇతర ప్రాంతాల కథలకు దీటుగా రచనలు రాస్తూ, కర్నూలు జిల్లా యొక్క కథా సాహిత్యం ప్రాంతీయ జన జీవన చిత్రణ దిశగా పరిణామం చెందింది. ఈ దశాబ్దంలో కర్నూలు జిల్లా కథా రచయితలు ‘కథా సమయం’ అనే కథా సంకలనాన్ని 2001లో ప్రచురించారు.ఈ సంకలనానికి ‘కథా సమయం’ మిత్రులుగా శిష్టుకృష్ణమూర్తి, కె.ఎన్.ఎస్.రాజు, ఎస్.డి.వి.అజీజ్ లు క్రియాశీలకంగా ఉంటూ అనేక రచనలు చేశారు(కర్నూలు కథా సాహిత్యం ప్రాంతీయ జీవన చిత్రణ:ఎం.హరికిషన్:పుట:251). వీరితో పాటు శ్రీనివాసమూర్తి, రాప్తాడు గోపాల కృష్ణ,తుమ్మల రామకృష్ణ,చంద్రశేఖర్ వంటి రచయితలు కూడా ప్రాంతీయ దృక్పథంతో కూడిన రచనలు అందించడానికి విశేషంగా కృషి చేసిన వారే.2003లో ‘హంద్రీకథలు’ అనే మరొక సంకలనం ఇక్కడి ప్రాంతీయ జీవితాన్ని, సమకాలిన సమస్యలను బలంగా చిత్రిస్తూ కథా సాహిత్యంలో కర్నూలు స్థానాన్ని బలంగా ముందుకు తీసుకుని వచ్చిన వారిలో జి. వెంకటకృష్ణ, జి. ఉమామహేశ్వర రావు, ఎం.హరికిషన్, ఇనాయతుల్లా, కె.సుభాషిణిలు కర్నూలు జిల్లా ప్రాంతం యొక్క బాణిని కథలో ఎలుగెత్తి చాటినారు. వీరితో పాటు ప్రాంతీయ విప్లవ ధోరణి, సామాజిక చైతన్యం కథావస్తువులుగా తీసుకొచ్చినవారు నాగప్పగారి సుందరాజ్, పినాకపాణి, డా.వి.పోతన వంటి వారు మాండలికతకు స్థానాన్ని కల్పించి రచనలు చేశారు. అవగాహన(ఆధునిక సాహిత్య వ్యాసాలు:తుమ్మల రామక్రిష్ణ :పుట:25)

3. కర్నూలు కథా సాహిత్య పరిణామం(2000-2010):

కర్నూలు జిల్లా కథకులు సాంప్రదాయ సాహిత్య వస్తువుకే పరిమితం కాకుండా ఆధునిక ధోరణులతో ఉండే కథావస్తువు.ప్రాంతీయ స్పృహ, ప్రాంతీయ జీవనం, ప్రాంతీయ దృక్పథం, ప్రాంతీయ అస్తిత్వంలో కూడిన రచనలను ప్రచురించారు. 2001లో కథాసమయం మిత్రుల సంకలనం ‘కథాసమయం’ లో పద్నాలుగు కథలు ప్రచురించారు. ‘కాశీభట్ల వేణుగోపాల్ కథలు’(2001), ఇది మొత్తం పదిహేను కథలున్న సంపుటి, ‘అతడు బయలు దేరాడు’(2000)లో వచ్చిన రాప్తాడు గోపాల కృష్ణ సంపుట ఇందులో 12 కథలు, కె.ఎన్.ఎస్.రాజుకథలు(2001)లో కె.ఎన్.ఎస్.రాజు సంపాదకీయంలో వచ్చిన కర్నూలు ప్రాంతీయ సమస్యలు, సామాజిక స్పృహతో కూడిన 13 కథల సంపుటి,హంద్రీ కథలు(2003)లో ప్రచురించబడింది.శాపగ్రస్తులు (2005)లో, కర్నూలు జిల్లా రైతుల యదార్థ జీవితాలను చిత్రస్తూ వచ్చిన 11కథల సంకలనం.జి.వెంకటకృష్ణ సంపాదకీయంలో వచ్చిన ‘గరుడస్తంభం’(2005)లో వచ్చిన 15 కథల సంపుటి పూర్తి స్థాయిలో కర్నూలు ప్రాంతీయ జన జీవనానికి ఈ కథలు అద్దం పడతాయి. విప్లవ రచయితల సంఘం వారి వర్క్ షాపు కథల సంపుటిగా వెలువడిన ‘కథలపంట’(2008)లో 18 కథలతో వచ్చిన సంకలనం,ఎం.హరికిషన్ సంపాదకీయంలో కర్నూలు కథా సాహిత్యానికి బైటి ప్రపంచంతో సంబంధాలను కల్పించిన కథాసంకలనం ‘కర్నూలుకథ’(2009)లో మొత్తం 63 కథలతో ప్రచురించ బడిన సంకలనం. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత(2022) రంగనాథ రామచంద్రరావు గారి సంపుటి ‘దింపుడు కళ్ళం’ (2009)లో మొత్తం 14 కథలతో వచ్చిన సంపుటి, సాహిత్య చరిత్రలో ఎన్నటికీ గుర్తుండే కర్నూలు ప్రాంతీయ కథల సంకలనం 2009 వరద గాయాల చిహ్నం ‘ఉగ్రతుంగభద్ర’(2010)లో మొత్తం 13 కథలతో వెలువడిన కథా సంకలనం, ఆ తరువాత ‘చిలుకలు వాలిన చెట్టు’(2010)లో జి. వెంకటకృష్ణ కథా సంపుటి. మొత్తం 13 కథల సంపుటిగా కర్నూలు కథాసాహిత్యానికి ఒక దశాబ్దపు (2000-2010) కాలంలో పరిణామం చెందినది. ఈ కథల్లో కర్నూలు ప్రాంతం యొక్క ఆత్మగౌరవ పోరాటానికి స్పూర్తిగా,సామాన్య మానవునా జీవితాలు ఫ్యాక్షన్లో ఎలా చిద్రమవుతున్నాయో, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన, ప్రాంతీయ సమకాలీన  సమస్యల చిత్రణ, రైతులు పడుతున్న భాదలు, కరువు పరిస్థితులు ఊహించని ప్రకృతి పరిణామాల సమస్యలు, వలసలు, వివిధ వృత్తుల వారి యొక్క సామాజిక చిత్రణలు వంటివి కర్నూలు జిల్లా ప్రాంతీయ దృక్పథానికి, ప్రాంతీయ వైఖరికి నిదర్శనాలుగా రాయలసీమ కథాసాహిత్యంలో కర్నూలు కథా సాహిత్యానికి స్థిరమైన స్థానం కల్పించాయనేది స్పష్టంగా కనబడుతుంది.(రాయలసీమ కథ బహుజన అస్తిత్వం:కె.శ్రీదేవి:పుట :77)

4. ప్రాంతీయ జీవనం:

కర్నూలు కథా సమయం సంస్థ స్థాపించిన తరువాత కొత్త రచయితలు రూపొందడానికి, వారికి కావలసిన దృక్పథాన్ని అందించడానికి మొదటి వరుసలో నిలబడిన రచయితలు చంద్రశేఖర్, శ్రీనివాస మూర్తి, రాప్తాడు గోపాలకృష్ణలు అనే చెప్పవచ్చు. 1990కి ముందున్న కథా సాహిత్య సంప్రదాన్ని కాకుండా కర్నూలు జిల్లా ప్రాంతీయంగా, నిర్థిష్టమైన ప్రదేశంలో, స్థానికంగా ఉండే. ప్రజాజీవితాన్ని, భాషను, యాసను, కథల్లో పొందపరిచి, నూతన సామాజిక సమకాలీన జీవన ఆశయాలను అవగాహన చేసుకుని, వస్తువును విశ్లేషించుకొని, స్థానీయులతో చర్చించుకొని కథావస్తువులోనూ, శైలిలోనూ కర్నూలు జిల్లా కథా సాహిత్యంలో ప్రాంతీయ జీవన చిత్రణకు రూపాన్ని కల్పించారు. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, కడంవంక గ్రామానికి చెందిన బ్రాహ్మణ కుటుంబ జీవితాన్ని కథలో శ్రీనివాసమూర్తి చిత్రించిన తీరు గ్రామాల్లో అతిపత్య పోరు, రాజకీయాలు ఎంత జీవన మనోవేదనకు గురిచేస్తాయనే వాస్తవాన్ని రామనాథం స్వామి తన మిత్రుడైన సోమేశ్వర ఆచారి విన్నపానికి సమాధానంగా వచ్చినమాటల్లో 

“వొచ్చి కర్నూల్లో పౌరోహిత్యం చెయ్యమంటారు. దానికి పదిమంది కాడ చేతుల జాపి అడుక్కునే గుణముండాల లౌక్యంగా బతికే నేర్పుండాలి. అదొక లేకి బతుకు, నేను రైతుని నాచాతగాదు అందులో నేను ఇమడలేను. ఆరొచ్చులోకి అందరి లెక్క నన్ను దిగమంటావా నువ్వుకూడ”-1 

అని చెప్పిన సమాధానంతో రచయిత యొక్క ఆలోచనలు ప్రాంతీయ జీవనం మీద ఎంత బలంగా నాటుకొని పోయాయనేది తెలుస్తుంది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారి చాలా మంది కర్నూలు ప్రాంతంలో అక్కడక్కడ రైతులుగా పొలం దున్నిన వారే అయినప్పటికీ,ఈ ప్రాంతాల్లో అనుకోలేని పరిస్థితులు కావచ్చు లేదా రాజకీయాలు కావచ్చు,లేదా ఆదిపత్య వర్గాల వారి పెత్తందరితనం కావచ్చు. వీటిలో చిక్కుకొని కొత్త పంతాలో జీవించడానికి వీలుపడదని వాటి వలల్లో చిక్కుకొని బైటికి రాలేని అతని అసహాయతలోంచి బయలు పడిన అక్రనందనలు కర్నూలు జిల్లా ప్రాంతీయ జీవనానికి అద్దం పట్టేలా ‘దేవుని మాన్యం’ కథలో శ్రీనివాసమూర్తి అద్భుతంగా కథను చిత్రించాడు. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మానవ నాగరికత వేల ఏళ్ళపాటు కొన్ని కోట్ల చేతులు శ్రమచేసి సాధించిన అపూర్వ నైపుణ్యం వ్యవసాయం.ఇప్పుడది వూర్లో యింక మూలకు పడబోతున్నది. ప్రాణాలు కోల్పోన కొంత మంది, హత్యలు చేసి యిప్పుడిప్పుడే వూర్లకు రాలేక కొంతమంది భయంతో వూర్లిడిచి కొంత మంది సేద్యానికి దూరమై చేలుబీడుపడుతున్నాయి అనే వాస్తవాన్ని వ్యక్తపరిచాడు రచయిత.(కథాసమయం:కథల సంకలనం:దేవుని మాన్యం: శ్రీనివాసమూర్తి: పుట:97)

5. సామాజిక చైతన్యం:

కర్నూలు జిల్లా ప్రాంతీయ జన జీవన పరిస్థితులపై బాగా పట్టున్న రచయిత కావడం పలన తన రచనల్లో సామాజికాంశాన్ని బలంగా చిత్రించి కర్నూలు జిల్లా కథా సాహిత్యనికి ప్రాంతీయతా బావాన్ని కల్పించిన కథకుడు. ఈయన రాసిన ప్రతి కథలో ప్రాంతీయ వాణి, శైలీ తప్పకుండా కనిపిస్తుంది. హోళగుంద మండలం, దేవరగట్టు కథలో ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయంతో పాటు ఆలూరు గ్రామీణ మాండలిక యాస స్పష్టంగా ప్రాంతీయతకు అద్దం పడుతుంది. ‘రాజుకీయ దేవుడు’ కథలో పల్లెల్లో వెనుకబడిన కులాలకు, దళితులకు మధ్య జరుగుతున్న ఆధిపత్య ఘర్షణలు ఎలా ఉంటాయో, గ్రామీణ ప్రాంతంలో పండించిన పంటలకు గిట్టు బాటు ధర లేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ధీనపరిస్థితులను ‘రెండు ఆత్మలవ్యథ’ కథలో చిత్రిస్తే, కర్నూలు ప్రాంత ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఊర్లకు, ఊర్లను త్యాగం చేసి వెళ్ళి పోయిన ప్రజలు మనస్సులో పాత ఊరిపట్ల ఉండే మమకారాన్ని ‘మూడు దృశ్యాలు’ కథలో చిత్రించిన తీరును బట్టే కథకుడు ప్రాంతీయ లోతును ఎంత వరకు అంచనా వేశాడనేది అర్థమవుతుంది. ప్రజాస్వామిక రాజ్యంలో వ్యక్తిగత స్వేచ్చ, హక్కులు అనే అందరికి సమానం, అందరూ అంగీకరించాల్సిందే. కానీ అగ్రకుల అభిజాత్యంకు ఇది మింగుడు పడదన్న వాస్తవాన్ని ‘వేపకాయంత నిజం’ కథలో రచయిత తేటతెల్లం చేశాడు. రాజకీయంగా బి.సి. సామాజిక వర్గానికి చెందిన యాదవులు ఎదుగుతున్న తీరు, బలపడుతున్న నిస్తేజాన్ని 

“సార్ నేను చేసిం దేమీ లేదు నేనొక బీసీ ననే నిజం కనుక్కోవడమే నేను చేసిన తప్పా! యీ స్టేషన్లో ఉన్న యీ గ్రామ సెక్రటరీ, యీ కానిస్టేబుల్, మీరు మన మందరమూ బీసీలమే మీరు బీసీలుగా ఆలోచించకుండా ఉండుంటే యీ అంబేద్కర్ ఫోటోను పెట్టుకునే ఉండే వాళ్ళు కాదు. ఈ చిరుతపులి పిల్లను మేము చంపలేదు. చంపినట్టు మీ దగ్గర సాక్ష్యాలూ లేవు. చంపిన చిరుతను చంపినట్లు ఒక బీసీ మీదకేసు పెట్టాలనుకుంటే పెట్టండి. న్యాయం, సామాజిక న్యాయం కూడా ఆలోచించండి. అంతే నేను చెప్పేది”-2 

అని మద్దయ్య యాదవ్ పాత్ర చేత ఒక సామాజిక చైతన్యం కల్గిన యువకుడి మాటతీరును, సామాజికంగా ఎవరు ఎవరిని అణగ తొక్కుతున్నారు, అనే నిజాన్ని చెప్పించాడు జి.వెంకటకృష్ణ. కర్నూలు జిల్లాలోని చాలా గ్రామాల్లో నేటి కూడా రాజకీయ అధికారాన్ని చెలాయించడం, కులాల గుత్తాదిపత్యాన్ని కల్గి ఉన్న అగ్ర కులాల స్వభావాన్ని బహిర్గతం చేయడం వెనుక వెంకటకృష్ణ గ్రామీణ స్థాయి బీసీ కులాలు, అగ్రకులాల స్వభావం తెలిసిన వాడు. ప్రత్యక్షంగా తనే స్వయంగా వాస్తవాలను గుర్తించిన రచయిత కావడం చేత ఈ కథలో పూర్తి స్థాయి ప్రాంతీయ అస్తిత్వం కనబరచాడని తెలుస్తుంది. (చిలుకలు వాలిన చెట్టు కథలు:వేపకాయంత నిజం:జి.వెంకటకృష్ణ:పుట :75)

6. ప్రాంతీయ కక్షలు:

గ్రామీణ ప్రాంతంలో పుట్టిన కథకుడు, విద్యాభ్యాసం చాలా వరకు గ్రామీణ వాతావరణంతో పూర్తి చేయడం వలన ప్రతికథలో పల్లె జీవితాలు కనిపిస్తాయి. ఇనాయతుల్లా రాసిన కథల సంపుటిని విమర్శకులు సైతం పల్లె పరిమళాలు అనే కితాబును ఇచ్చారు. కథల్లో ప్రాంతీయంగా మాట్లాడే మాండలిక పదాల్ని, భాషను కచ్చితంగా వాడుకున్న రచయిత. ముస్లిం కుటుంబ నేపథ్యం నుండి వచ్చాడు కాబట్టి ముస్లింల మనోవేదనల్ని ‘గూడు’, ‘పురుడు’ వంటి కథల్లో సమర్థవంగా వ్యక్తపరిచాడు. గ్రామీణ ప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవల్లో జన జీవనాన్ని పిప్పి పీల్చేన విధానాన్ని ‘వలస’ కథలో చెబితే, ఫ్యాక్షన్ ఊబిలో చిక్కుకొని రాజకీయ అనుచరులుగా మారి చట్టం దృష్టిలో జీవితాలను బలిచేసుకున్న నిరుపేద కుటుంబాల జీవితాన్ని ‘నిచ్చెన’ కథలో చిత్రించిన విధానం ఇనాయతుల్లా కథల్లో ప్రాంతీయ ధోరణి స్పష్టంగా కనబడుతుంది.కథా సంపుటిలో ‘నిచ్చెన’ కథ ప్రాంతీయ రాజకీయాల్లో నాయకులు ప్రజలను ఎలా పావులాగా వాడుకొని తమ రాజకీయ ప్రస్తానాన్ని కొనసాగించారనేది కర్నూలు జిల్లా, కొలిమిగుండ్ల సమీపాన ఉండే చెన్నంపల్లి రాజకీయాన్ని రచయితే కళ్ళకు కట్టినట్లుగా చిత్రించాడు. శంకర్రరెడ్డి ఎం.పి.టి.సి ఎలక్షనల్లో తన తమ్ముడిని గెలిపించుకోవడం కోసం ప్రతిపక్షం నాయకుడు బలిజ సిద్ధారెడ్డికి పోటిపడి, ఎలాగైనా సరే సిద్ధారెడ్డిని ఊరు విడిపించాలనే ఆలోచనతో శారీరక పుష్టిబలం కలిగిన ఆరేకంటి కృష్ణుడిని తన దగ్గర ఉంచుకొని, అదను చూసి కిష్టిగాడి చేత బలిజ సిద్ధారెడ్డిని హత్య చేయించాడు, ఎన్నికల్లో సంజామల ఎస్.ఐ.పైన దాడి చేయించాడు. వీటితో ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఫ్యాక్షన్ ఎక్కువ కావడంతో పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగడంతో శంకర్రరెడ్డి మెల్లగా తప్పకొని, తన అనుచరుడ్ని ఇరికించాడు. కిష్టగాడ్ని అటు శంకర్రరెడ్డి, ఇటు గ్రామస్థులు ఎవ్వరూ పనులకు పిలవక పోవడంతో భార్య రత్తాలుతో కలసి అత్తారిల్లు ఆస్పరికి చేరి జీవనం కొనసాగిస్తున్న తరుణంలో పోలీసు ఎన్ కౌంటర్ లో కిష్టగాడ్ని కాల్చి చంపడం జరగడంతో ఆ వార్త టి.వి.లో వస్తున్న దృశ్యంలో

“కూలి సేస్కొనిబల్కెతోట్లం సారూ ....పిల్లగాడు అనాదై పోయినాడు. గద సారూ....అందరూ పెరుపెద దొంగోట్ల బతికిపోయినారు. మాసిన్న పానాన్ని తోసేసి నారు గదా సామి. ఇదేమి నాయమో మీరే చెప్పండి సారూ”-3 

అంటూ రత్తాలు ఏడుస్తున్న దృశ్యాలు టి.వి.లో కనబడటం, చూస్తున్నవారికి కంట తడి పెంటించడానికి కూడా కారణం... స్వార్ధపూరిత రాజకీయాల కోసం,పదవుల కోసం సామాన్యులను నిచ్చెనగా మార్చుకొని పైకి ఎదుగుతున్నారనే వాస్తవాన్ని తెలిపిన రచయిత సామాజిక దూర దృష్టికి అద్దం పడుతుంది.(నిచ్చెన కథలు: ఇనాయతుల్లా:పుట:18)

7. ప్రాంతీయ వివక్ష :- 

ప్రపంచీకరణ నేపథ్యంతో ఆధునిక సమాజంలో ప్రాంతీయంగా జీవనం గడిపే ప్రజల భాష, సంస్కృతి ఎలా ఆధిపత్యం భావజాలం చేతిలో గాయపడుతున్నాయనే విషయాన్ని స్పష్టంగా వ్యక్తీకరించినది రచయిత్రి. నాగరికతతో మార్పులు రావడం, సాంకేతికమైన పరిజ్ఞానం సమాజంలోకి ప్రవేశించడంతో ఎక్కడో కనుచూపు మేరలో ఉండాల్సిన నగర జీవిత సంస్కృతి, సంప్రదాయాలు పల్లెలోకి ప్రవేశింది. విద్యారంగంలో కూడా ప్రాంతీయ సమాజాన్ని ముంచేసి, గాయపర్చింది. రచయిత్రి కలం నుండి ఈ దశాబ్దంలో వెలువడిన రచనల్లో ‘గంగమ్మతల్లి సాక్షిగా’ కథలో వెనుకబడిన కులాల పిల్లలు చదువుల్లో ఎలా వెనుకుబడి పోతున్నారని తెలియజేస్తే ‘గాయాలు’ కథలో ప్రాంతీయ భాషను సంస్కృతిని, ఇతర ప్రాంతాల వారి ఆధిపత్యం చేత తక్కువ చేసి చూడటం, ‘మర్మమెల్ల గ్రహించితి తల్లీ’ మరియు ‘పాఠం తప్పిపోయింది’ వంటి కథల్లో ఆడపిల్లపై విద్యావ్యవస్థల్లో, పాఠ్యపుస్తక రూపకల్పనలో చూపుతున్న వివక్ష చూపిస్తున్నారనే ధోరణిలో రచయిత్రి రచనలు చేశారు. గాయాలు అనే కథలో ఆంధ్ర ప్రాంతం నుండి నాన్ లోకల్ కేటగిరిలో గెజిటెడ్ ర్యాంక్ ఉద్యోగంలో వచ్చిన నరేష్ కర్నూలులో పోస్టింగ్ ఇస్తే ఉద్యోగ విధుల్లో క్యాంపు డ్యూటీలో భాగంగా గూడూరు మండలం, శింగవరానికి వెళ్ళిన అతను 

“ఇక్కడ తిండి ఏం తిండి అండి బాబు! ఏ వూరెళ్లినా అదేంటి .... ఉగ్గాని, బజ్జి తప్ప వేరే టిఫిన్ మాటే వుండదండి. నోట్లో పెట్టుకుంటే చాలు నాలుక భగ్గుమంటుంది. ఇక పప్పు సంగతి ఏం చెప్పమంటారండి? అందులో పచ్చిమిర్చి తప్ప యింకేమీ కనిపించదండి. దాన్నే లొట్టలేసుకుంటూ తింటారండి ఇక్కడ జనాలు. ఏం మనుషులో ఎమో! ఎలా తినగలుగు తున్నారో ఏమో? ఇక్కడ మనుషులకు యివి తప్ప వేరే టిఫిన్స్, పులుసు, కూరలు వండుకోవడం రావాండి మేడంగారు?”-4

   అని పలికిన మాటలకు కర్నూలు జిల్లా ప్రాంతీయ వాసులకు గొంతు తడారిపోయేలా చేసిందని చెప్పటానికి రచయిత్రి అనుభవంలో ఒక ప్రాంతం వారు ఇంకొక్క ప్రాంతం వారి ఆహార భేజేష్యాలలో వివక్షత చూపుతున్నారనేది ప్రాంతీయతా వివక్షతకు నిదర్శనంగా కథకులు సందేశాన్ని ఇచ్చారు. ప్రాంతీయ వివక్షత కేవలం ఆహారంపైనే కాకుండా మాట్లాడే భాష, మన ప్రాంతీయ పరిస్థితులపై చిత్రించే సినిమాలు, భౌగోళిక పరమైన స్వరూప,స్వభావాలను వారి ప్రాంతాలతో పోల్చి తక్కువ చేసి చెప్పడం వంటివి కర్నూలు జిల్లా ప్రాంతీయ వివక్షతకు నేటికీ మరచిపోలేని, మరువనివి, అన్ని కంటికి కనిపించే నిజాలే.(అమూల్య (కథలు): గాయాలు కథ: డా.కె. సుభాషిణి పుట : 119)

8. సామాజిక చైతన్యం:

రాయలసీమ చారిత్రక, సామాజిక, సాంస్కృతిక రాజకీయ భూమికలను లోతుగా అధ్యయనం చేసిన రచయిత పినాక పాణి. స్థానికంగా ఉండే ప్రజల సమస్యలకు, ప్రధాన కారణం తరతరాలుగా ఎందుకు కొనసాగుతుంది అని తెలిసిన రచయిత కావడం వల్ల స్థానిక పోరాటాలను ప్రాంతీయ ప్రజల్లో సృజింప జేయడాని సామాజిక చైతన్యంలో భాగంగా విప్లవోద్యమ సాహిత్యాన్ని రచించాడు. ఈయన రాసిన కథల్లో వెనుకబడిన కులాలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, దళితులు ఆగ్రవర్ణాల మధ్య ఎలా బలవుతున్నారనే వాస్తవికతను బయరు పెట్టిన రచయిత. దళితలు చైతన్యం కోసం ‘విత్తనాలు’, ‘కొత్తదారి’ వంటి కథల్లో ప్రాంతీయ దృక్పథం కనిపిస్తే. ‘ప్యాపిలి వచ్చింది’ కథలో బీసీలు ఆగ్రవర్ణాల మధ్య బలైపోయిన దళితుల జీవితాన్ని చిత్రించాడు. కర్నూలు జిల్లా ఈరాపురం, మాదిగ పాలెం మధ్య జరిగిన తగాదలో అగ్రకులాల వాళ్ళు మాదిగ కులానికి చెందిన వారిపై వివక్షతలు ఎలా చూపిస్తున్నారనటానికి ‘కొత్తదారి’ కథలో మాదిగ పాలెంలోని గుడిసేళ్ళు తగులబడి పోతుంటే గుడిసెళ్ళను నీటితో ఆర్పడానికి శివాలయం బావిలో నీళ్ళు నింపుతున్న రాములున్ని గోవిందరెడ్డి కోడుకు బాబులరెడ్డి ముందు కొచ్చి “ఒరేయ్ ! మాదిగనా కొడుకుల్లారా! మీకు కండ్లల్ల కొవ్వు పట్టిందిరా? లేకపోతే ఊళ్ళో బాయికి, అందునా గుడి బాయిలోకి దిగతరా. ముందు పైకి రాండ్రా మీ తల్లుల” అని కుల దూషణలో వివక్ష చూపితే దానికి తిరిగి సమాధానంగా మారుతున్న యువతలో చైతన్యం వచ్చిందనే దానికి విదర్శనంగా రాములు కూడా-

 “ఓరేయ్! రెడ్డొడా! మేం నీల్లకొచ్చినం. నువ్వు గమ్మునుండకుంటె నీరక్తం నింపకపోతం. కాలిపోతున్న కొంపల్లేసి మసిజేసిపారేస్తం...”-5 

అని మాటకు మాటు సమాధానం చెప్పే చైతన్యం వచ్చిందని పాణి ఒక వైపు వివక్షత, మరోవైపు చైతన్య దోరణిలో మార్పును వ్యక్తపరిచాడు. కర్నూలు జిల్లా రైతుల బతుకులు మరీ విచిత్రంగా ఉంటాయన డానికి ప్రతిరూపంగా పాణిని ‘విత్తనం’ కథలో వ్యక్తీకరించాడు. రైతులు ఒకప్పుడు పాలంలో పండించిన పంటల నుండే విత్తనాలను తీసి, మిగిలినవి వాటిని మాత్రమే అమ్మకానికి పంచేవారు. కానీ మారుతున్న కాలక్రమలో రైతులే విత్తనాలను అధిక ధర చెల్లించి కొనే పరిస్థితు వచ్చాయనడానికి బసప్ప అనే రైతు జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా చిత్రించాడు 

“సేద్యం చేసేటోనికి తనేం పండించేది తనకే తెలీని కాలం.... పరాయి దేశాలకు ఎత్తి పంపించాలనే పోటీ కొద్ది నానాక పంటలన్ని వచ్చినయ్. మనుషులు, గొడ్లు డొక్క లెండి సచ్చేరోజులు... ఈడి పంట ఈడున్న కడుపులకు సాల్డంలేదు గానీ యింకేడికి పంపిస్తరు? ఆకలిమీద యాపారం మొదలయింది....”-6 

అని బసప్ప పాత్ర చేత పాణిని రైతులపట్ల జరుగుతున్న మోసాన్ని, తెలియచేశాడు.(కర్నూలు కథ(కథల సంకలనం): కొత్తదారి కథ: పినాక పాణి: పుట: 312)

9. ప్రాంతీయ సామాజికస్పృహ:

కర్నూలు జిల్లా రచయితల సంఘం ఏర్పడిన తరువాత రచయితల సంఘం అధ్యక్షు సామాజిక జీవనం మెరుగుపడాలంటే సామాజిక పోరాటం జరగాలి. సామాజిక పోరాటం జరగాలంటే ప్రాంతీయ సమస్యలు బహిర్గతం చేయాలని సంకల్పించి రచనలు చేశారు. ముఠా కక్షలతో గ్రామాలు, పట్టణాలు దద్దరిల్లిపోయి, సాధారణ వ్యక్తి ప్రజాసేవకోసం ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితులు ఫ్యాక్షనిస్టులే రావణుని సైన్యంలా రాజికీయాల్లో అవతారమెత్తడం, ప్రజాసేవకులు సేవకు బదులుగా ‘ప్రజాశావ’ చేస్తున్నారని. రాజకీయ, ప్రకృతి వాతావరణంలో కాలుష్యం, వ్యవసాయదారుల దారుణ పరిస్థితులను, మానవ సంబంధాలు, వంటి వాటిలో మనిషిని మనిషే నమ్మలేని స్థితిలో దిగజారి పోతున్న సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే దృక్పథం ప్రాంతీయ సమస్యలనే కథా వస్తువులుగా తీసుకొని రచనలు చేసిన రచయిత కె.ఎన్.ఎస్.రాజు, కర్నూలు జిల్లా నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఎలా మోసపోయిందనడాని ‘ప్రాజెక్టు1960’ కథ వ్యక్తీకరిస్తే ‘సూరీగాడు’ కథల్లో రాజకీయ పాలకులు ప్రజల ప్రాణాలను కాపాడాల్సింది పోయి, వారి ప్రాణాలతో చెలగాట మాడటంను తెలియజేశాడు. పుట్టిన నేలపై సేవచేయాల్సింది కాకుండా సంపాదన కోసం పరాయి పంచునకు చేరిన ఉద్యోగి లక్షణాన్ని ‘తపన’ కథలో వ్యక్తపరచడం, దళితులపై చూపిస్తు వివక్షతకు ‘కట్టడి’ కథ, ప్యాక్షన్ కు బలైపోయిన జీవితాలు ‘కరువు సీమ’ కథల్లో వస్తువు శైలి పూర్తిగా ప్రాంతాయి దృక్పథంతోనే చిత్రించారు. కర్నూలు జిల్లా నల్లమల అడవులోని మునిమడుగుల ఏరుపై వడ్లరామాపురం గ్రామం సమీపంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం 1960లో పునాది రాళ్ళు వస్తే నాలుగేళ్ళలో పూర్తి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు నలభై ఏళ్ళు పట్టడానికి కారణం పాలకుల నిర్లక్ష్యం పీకల్లోతుగా అనిపిస్తుందనడానికి 

“ఏం ప్రాజెక్టో ఏమో? అదెప్పుడు పూర్తి గాలో? ఇంత వరకు పనే మొదలు పెట్టాల్యా! ఈ ఊర్లో నాకేదని సేయడానికి తోచు బడికావడంల్యా, సున్నిపెంటలో మా మామున్నాడు. 'ఆ ఊర్లో నీవేం బత్కుతావురా? “ఏదో ఒక పని నేను సూస్తా రారా అని అన్నాడు. నేను కూడా ఊర్నుంచి ఎల్లి పాదామనుకునే సెను తీసుకో సిన్నాయనా!!”-7 

అని లొట్టిగాడు పలికిన మాటల్లోనే ప్రాజెక్టుల నిర్మాణంలో కర్నూలు పై చూపి వివక్షతను రచయిత బయలు పెట్టాడు. గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేసినందుకు గానూ ఆగ్రవర్ణాల వారు ఆదిపత్యం తీరును మారెవ్ప తన కొడుకు సూరిగాడిని కాపాడుకోవడంలో “మీరల్లా ఎల్లి వాడెక్కడున్నాడో కనుక్కొని ఊరికి రాకుండా ఎక్కడైనా ఎల్లిపొమ్మని సెప్పిరాండ్రా, నా ముసలిపానం పోయినా పరవాలేదు”-8 అని మారెప్ప అందరి కాళ్ళు గడ్డం పట్టుకుని అడుక్కుంటున్న తీరుతో రచయిత ప్రాంతీయ సామాజిక స్పృహను బయట పెట్టాడు.(కె. ఎమ్.ఎస్. రాజు కథలు : ప్రాజెక్టు 1960 : కె.ఎమ్.ఎస్. రాజు: పుట:40)

10. రైతు జీవితచిత్రణ:- 

కర్నూలు జిల్లా కథా సాహిత్యానికి 2009లో ఎనలేని గుర్తింపు తెచ్చిన రచయిత హరికిషన్, కర్నూలు జిల్లా కథా సాహిత్యంలో కథకులే లేరు అనే విమర్శను తుడిచేసిన కథకుడు, కర్నూలు కథ అనే సంకలాన్ని ప్రచురించి కథా సాహిత్యంలోకి 62 మంది కథకులను పరిచయం చేశాడు. విభజన వాదులు ప్రాంతీయ వివక్షతలను చూపిస్తున్న తరుణంలో ప్రత్యేక రాయలసీమ అవసరాన్ని గుర్తిస్తూ ‘కొత్తకల’ లాంటి ప్రాంతీయ అసమానతల నేపథ్యంలో కథను రాశారు, దీనితో పాటు ‘హిందూ ముస్లిం భామ్, బాయ్’ ‘ఒక మైనారిటీ కాలేజీ’ వంటి కథలు ప్రాంతీయ అసమానతలు నేపథ్యంలో రాసినవే, ‘బతుకు యుద్ధం’, ‘పచ్చికరువు’, ‘రాజమ్మ’ కథల్లో కర్నూలు జిల్లా ప్రాంతీయ జీవన చిత్రణకు జీవం పోశారు. ఇందులో ముఖ్యంగా ‘పచ్చికరువు’ కథ ఉమ్మడి కర్నూలు జిల్లా, ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో తుడిచెర్ల, మిడుతూరు, పగిడ్యాల ప్రాంతంలోని రైతు జీవిత చిత్రణకు అద్దం పట్టేలా చిత్రించాడు. చంద్రయ్య అనే రైతు పొగాకు పంట వేదామంటే వర్షాలు రాకపోవడంతో ట్యాంకర్ల సహాయంతో అప్పు చేసి నారవేస్తే పదిహేను రోజులైనా వర్షం రాలేదు. గ్రామంలోని రైతులందురూ, మొక్కులు, భజనలు, కొన్ని పూజలు, సంప్రదాయాల్లో కప్పల పెళ్ళిళు, ఏటికి కాలినడకన వెళ్ళి గంగ నీళ్లు తేవడం, శివలింగాన్ని 101 బిందెల నీళ్ళు పోయడం అన్నీ చేసినా వర్షాలు పడక పోవడం, మరలా పదిరోజుల తరువాత ఎట్టకేలకు ఒక వర్షం కురవడంతో చంద్రయ్య పోగాకు చేను ఏపుగా పెరిగి కళకళాడింది. మళ్ళీ తిరిగి చిత్తకార్తీ తరువాత ఒక్క వాన వస్తే చాలు ఆ తరువాత చలిపడుతుంది వర్షం రాకపోయినా పంట చేతికొస్తుంది, కూతురి వివాహం అయిపోతుందని ఆశపడ్డ చంద్రయ్యకు అనుకున్నట్టుగానే మేఘాలు కమ్ముకున్నా, వర్షం చినుకుతో మొదలై, అది జడివానగా రాత్రంతా కురిసింది. ఉదయాన్నే ఆగిపోయింది. మరుసటి రోజుకు చంద్రయ్య పోలానికి వెళ్ళి పంటను చూస్తే కళ్ళలో ఆనందం మెరిసింది, చెరువులన్నీ నిండి పోయాయి కాబట్టి ఇక కరువు తప్పినట్టే అనుకున్నారు జనం,చంద్రయ్యలు. కానీ నాలుగు రోజులకే మళ్ళీ వానమొదలయింది. భూమి తడారకుండానే వానలు మీద వానలు కురిసాయి. ఇదే సమయంలో 

“అగ్నికి ఆజ్యం తోడైనట్లు అల్పపీడనాలు, ఋతుపవనాలు ఒకదానితో ఒక కలసి పోయాయి. ఆకాశంలో సూర్యుడు కనపడ్డం మానేశాడు. వాగులూ, వంకలూ పరుగులెత్త సాగెయి చెరువులకు గండ్లు పడసాగాయి. పోలాలు నీళ్ళతో నిండిపోసాగాయి. ఎక్కడ చూసినా మిద్దెలు కూలిన వార్తలే, పంట పోలాలు మునిగిపోయిన కబుర్లే ‘వట్టి కరువు పోయి పచ్చికరువు వచ్చేటట్లుంది’.”-9 

అని రైతులు, ప్రజలు మాట్లాడుకోవడంను రచయిత ప్రాంతీయంగా సంభవించే ప్రకృతి వైపరిత్యము, రైతుల మొక్క కష్టాల కడగండ్లను, ఇతర ప్రాంతలతో పోల్చితే భిన్నంగా ఉండుట గుర్తించి ‘పచ్చికరువు’ కథను రాసిన అనుభవజ్ఞుడుగా రచయిత తీరు కనిపిస్తుంది.(కర్నూలు కథ:కథల సంకలనం: పచ్చికరువు: డా.ఎం. హరికిషన్: పుట:415)

11. ప్రాంతీయ దళిత సాహిత్యం:

కర్నూలుకు, కర్నాటకకు సరిహద్దుల్లో ఉన్న ఆదోనిలోని మొలగవల్లి ప్రాంత మాండలికాన్ని, దళితుల జీవన విధానాన్ని అత్యంత ప్రతిభావంతంగా చిత్రించిన రచయిత నాగప్పగారి సుందర్రాజు. ‘నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద’, ‘జారే సావు’ లాంటి ఆణిముత్యాల వంటి కథలతో ‘మాదిగోడు’ కథా సంపుటి ప్రచురించారు. ఈ సంకలనంలో మొత్తం కథలన్ని కూడా పూర్తిగా తెలుగు,కన్నడ భాషలు కలగలిపిన పదాలతో ఉండే భాషను ప్రతి కథలో రాయడం ఒక్క నాగప్పగారి సుందర్రాజుకే చెల్లింది.ఈ సంకలనంలో ఉన్న కథలన్నీ కూడ గ్రామీణ నేపథ్యంలో నుండే కథా వస్తువును తీసుకొని చిత్రించాడు. దళితుల కుటుంబాలలో ఉండే బసివిని సంప్రదాయాన్ని,ఆ సాంప్రదాయం ఎలా నిర్వహిస్తారనే సంస్కృతిని చిత్రించిన తీరులో మాండలిక పదాల్ని జొప్పించి రాయడంతో ప్రాంతీయ రచనా శైలీకి అద్దం పడుతుంది. (తెలుగు కథ ప్రాంతీయ అస్తిత్వం: శ్రీధర్. వెల్దండి:పుట:272)

12. ముగింపు:

రాయలసీమ కథ సాహిత్యంలో కర్నూలు కథకి స్థానం లేదని విమర్శకులు భావించినందుకు కర్నూలు కథకులు తమ రచనా శైలీని మార్చుకొని కొత్త కోణంలో రచనలు చేసి,కొత్త రచయితలకు అవకాశం కల్పించడం వల్లే ఈ దశాబ్దానికి ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్నందు వల్ల క్రింది ప్రయోజనాలను పొందవచ్చు.

  • కర్నూలు జిల్లా కథా సాహిత్యంలో తొలి కథగా 1972లో ‘వైకుంఠ వాకిలి’ గా పరిచయం కావడం.
  • రాయలసీమ కథా సాహిత్యంలో వెలువడిన ‘సీమకథలు’లో స్థానం లభించకపోవడంతో కర్నూలు కథా రచయిత రచనా శైలీలో మార్పులు రావడం.
  • కర్నూలు కథా సాహిత్యంలో 1990కి ముందు వచ్చిన కథా సంకలనాలు, కథా సంపుటాలు గురించి తెలుసుకోవడం.
  • 1990 తరువాత కర్నూలు కథా సాహిత్యంలో వెలువడిన రచనలు, కథాసమయం సంస్థ, దాని యొక్క ఉద్దేశాలు పరిచయం కావడం.
  • 2000-2010 ఒక దశాబ్ద కాలంలో వచ్చిన కథా రచనలు, రాయలసీమ సాహిత్యంలో చూపిన ప్రాంతీయ లక్షణాలు.
  • ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో కర్నూలు కథా సాహిత్యం యొక్క పరిణామం, కర్నూలు కథాసమయం సంస్థ నూతన రచయిత ప్రోత్సాహించి తీరు వ్యక్తమవుట.
  • ప్రాంతీయ దృక్పథంతో ప్రాంతీయ స్పృహతో రాసిన రచనలో ప్రజా జీవన చిత్రణ, రచయిత ఉద్దేశాలు స్పష్టనుగుట.
  • రాయలసీమ కథా సాహిత్యంలో కర్నూలు కథా సాహిత్యానికి కావల్సిన కథావస్తువు, రచనాశైలీ స్థానం ఆశించిన స్థాయిలో వచ్చిందని తెలుసుకొనుట.

13. పాదసూచికలు:

  1. కథాసమయం (కథల సంకలనం): దేవుని మాన్యం: శ్రీనివాసమూర్తి: పుట:97
  2. చిలుకలు వాలిన చెట్టు (కథలు): వేపకాయంత నిజం: జి. వెంకటకృష్ణ పుట :75
  3. నిచ్చెన (కథలు): నిచ్చెన కథ: ఇనాయతుల్లా:పుట:18
  4. అమూల్య (కథలు): గాయాలు కథ: డా.కె. సుభాషిణి పుట : 119
  5. కర్నూలు కథ(కథల సంకలనం): కొత్తదారి కథ: పినాక పాణి: పుట: 312
  6. ఆహ్వానం(పత్రిక) జూన్ 1994: విత్తనం కథ: పినాక పాణి: పుట:31అ
  7. కె. ఎమ్.ఎస్. రాజు కథలు : ప్రాజెక్టు 1960 : కె.ఎమ్.ఎస్. రాజు: పుట:40
  8. కె. ఎమ్.ఎస్. రాజు కథలు : సూరిగాడు : కె. ఎన్. ఎస్. రాజు : పుట:23
  9. కర్నూలు కథ(కథల సంకలనం): పచ్చికరువు: డా.ఎం. హరికిషన్: పుట:415

14. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఇనాయతుల్లా. యస్.యం.డి.  నిచ్చెన (కథలు )   అఖిల్ ప్రింటర్స్   హైదరాబాదు,2012
  2. కథాసమయం మిత్రులు కథాసమయం(కథల సంకలనం)కథాసమయం మిత్రులు.కర్నూలు,  2001 
  3. చంద్రశేఖర్రెడ్డి,రాచపాళెం. మన నవలలు మన కథానికలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 2013
  4. నారాయణ స్వామి బండి, రాయలసీమ సమాజం సాహిత్యం. పర్ స్పెక్టివ్స్, హైదరాబాద్, 2019
  5. రాజు.కె.ఎన్.ఎస్.ఉగ్రతుంగభద్ర (కథల సంకలనం) కర్నూలు జల్లా రచయితల సహకార ప్రచురణ సంఘం 2010
  6. వెంకటకృష్ణ. జి. చిలుకలు వాలిన చెట్టు (కథలు ) స్ఫూర్తి ప్రచురణలు కర్నూలు,2010
  7. వెంకటరమణ.జి.,నాగరాజు.ఎం., అవగాహన (ఆధునిక సాహిత్య వ్యాసాలు) తుమ్మలరామక్రిష్ణ   చంద్రకళ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2016
  8. శ్రీధర్.వెల్దండి.,తెలుగు కథ ప్రాంతీయ అస్తిత్వం.తెలుగు అధ్యయన శాఖ, సిల్వర్ జూబ్లీకళాశాల(స్వ) కర్నూలు, 2015
  9. శ్రీదేవి.కె., సీమకథ అస్థిత్వం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 2016
  10. శ్రీదేవి.కె., కథ విమర్శ,విశ్లేషణ ప్రజశక్తి బుక్ హౌస్, విజయవాడ, 2017
  11. సుభాషిణి.కె., అమూల్య(కథల), స్ఫూర్తి ప్రచురణలు, కర్నూలు, 2015
  12. హరికిషన్.ఎం. కర్నూలు కథ . దీప్తి ప్రచురణలు , విజయవాడ, 2020

View all

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

(A Portal for the Latest Information on Telugu Research)


AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal