AUCHITHYAM | Volume-5 | Issue-9 | August 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
4. కర్ణాటకసంగీతంలో ‘అభ్యాసగాన’ వైశిష్ట్యం: ‘గీతం’ బోధన పద్ధతులలో వైవిధ్యం

డా. బి. రాధ
అసోసియేట్ ప్రొఫెసర్, సంగీతశాఖ,
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9177857447, Email: srgpds@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
భారతీయ సంగీతం అధ్యయనం చేసే పద్ధతి గురుపరంపర అనుశృతంగా సాగుతున్న ఒక సత్సంప్రదాయం. పురందరదాసు వంటి మహావాగ్గేయకారులు అభ్యాసగానక్రమాన్ని సంగీతాధ్యయనం చేసే విద్యార్థులకు పాఠ్యప్రణాళికగా అందించారు. ఆ ఒరవడినే తరువాతి కాలంలో వాగ్గేయకారులు, శాస్త్రకారులు, సంగీత అధ్యాపకులు తమదైనశైలిలో విద్యార్థులకు అందించటం విదితమైన విషయమే. మరికొంతమంది ఉపాధ్యాయులు లక్ష్యజ్ఞానమును పెంపొందించడానికి ఆధునికతను జోడించి విద్యార్థులను మరింత ధీటుగా తయారు చేయడానికి పాఠ్యగ్రంథాలను కూడా ప్రచురించారు. సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆధునికయుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవింపు చేసి విద్యార్థులకు నూతనరీతిలో సంగీతం బోధిస్తున్నారు. ఆ కోవకు చెందిన ప్రముఖ విద్వాంసులను నలుగురిని ఎంచుకొని వారు అభ్యాసగానం అనగా ప్రాథమికదశలో సంగీత విద్యార్థికి అందించే పాఠాలను కొంత అధ్యయనం చేసి తద్వారా ఆ విషయాలను విద్యార్థులకు అందించాలనే ధ్యేయమే ఈ వ్యాసం. దీనికిగాను పూర్వసంగీత ప్రచురణలను కూడా సృజించడమైనది. ఈ రకమైన వ్యాసాలు బోధనాంశాల కింద విశ్వవిద్యాలయస్థాయిల్లో పరిశోధనలు కూడా జరిగాయి.
Keywords: అభ్యాసగానం, గీతం, స్వరం, రాగం, తాళం, లయ.
1. ఉపోద్ఘాతం:
ఆధునిక లక్ష్య సంగీత ప్రధానంగా ప్రచురితమైన గ్రంథం ‘సంగీత స్వార్ధ సార సంగ్రహం’. వీణ రామానుజ ఈ గ్రంథాన్ని క్రీ.శ. 1859లో ప్రచురించారు. ఈ పంథాలోనే వచ్చిన గ్రంథాలు ‘సంగీత స్వయంబోధిని’ (టి. ఎం. వెంకటేశ్వర శాస్త్రి – 1892), Oriental Music in European Notation (A.M.C. Modaliar – 1893) మరియు సంగీత సంప్రదాయ ప్రదర్శిని (1904) & ప్రథమాభ్యాస పుస్తకం (1905)1 (సుబ్బరామదీక్షితార్ - ‘ప్రథమాభ్యాస పుస్తకం’ – పేజి నం. 55). అయితే ఆధునిక సంగీత లక్ష్య లక్షణాలను సమన్వయం చేసినవారు శ్రీ సుబ్బరామ దీక్షితులు. 1904 సం.లో రచింపబడిన ఈ గ్రంథం సమకాలీన సంగీతమును గూర్చిన సమగ్ర అవగాహన కల్గిస్తుందని సంగీతజ్ఞుల అభిప్రాయం. ప్రథమాభ్యాస పుస్తకం కూడా అదే దృక్పథంతో లక్ష్యమునకు ప్రాధ్యాన్యతను యిచ్చిన ప్రచురిత గ్రంథం (1905). ఇందులో సంగీత విద్యార్థికి ప్రాథమిక దశలో నేర్వవలసిన అభ్యాసరీతులు తెల్పటంతో పాటు కర్ణాటక సంగీతంలో ప్రాథమిక పాఠాలను మాయామాళవ గౌళ రాగం, ఆదితాళము నందు నిర్దేశించినట్లుగా పేర్కొంది. ఈ గ్రంథం ద్వారా సమకాలీన సంగీత అధ్యయన పద్ధతి, మార్గనిర్దేశం చేసారనటం వాస్తవం. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ పద్ధతికి కట్టుబడి సంగీత అధ్యాపకులు కర్ణాటక సంగీత పరిరక్షణ, పరివ్యాప్తి, సాంప్రదాయంగా కొనసాగించటంలో ఇతోధికంగా సేవలందిస్తున్నారు. అయితే కాలమాన పరిస్థితులను బట్టి మార్పు అవసరం కావున సంగీత అధ్యాపకుల ధోరణి కూడా మారుతుంది. అనివార్యం.
సుమారు 158 ఏళ్ళ క్రితం ప్రచురించిన పై తెల్పిన తెలుగు గ్రంథాలు అప్పటి పరిస్థితులు అనగా గురుకుల పద్ధతిగా బోధన వుండటం, గురు, శిష్యులకు తగినంత సమయం కేటాయించుకోగల్గటం, శిష్యులు సాధన చేయటానికి తగిన సమయం అందుబాటులో వుండేది. ప్రస్తుత కాలంలో సాధారణ విద్యారంగంతో పాటు సంగీతం లేదా యితర కళారంగాలలో నెలకొన్న పోటీని ఎదుర్కొని తమని తాము ఉన్నతంగా తీర్చుకోవాలంటే చాలా సమయం ప్రతి అంశానికి కేటాయించవలసి వుంటుంది. ప్రస్తుతం అంతగా కేటాయించలేని పరిస్థితి నెలకొని వుంది.
ఈ పరిస్థితులలో సంగీత రంగానికి గాను కొంతమంది అధ్యాపకులు నూత్న రీతులను (పరిశోధనాత్మకంగా) విద్యాబోధనలో ప్రవేశపెట్టి విద్యార్థుల గ్రాహ్యస్థితి ఆధారంగా ఏర్పాటుచేసి సఫలీకృతులవుతున్నారు.
ప్రముఖంగా ఈ పరిశోధనావ్యాసంలో స్వరాభ్యాసాలు, రాగలయాభ్యాసాలు ఇత్యాది విషయాలను సంగీత ఉపాధ్యాయులు విద్యార్థికి ఇచ్చే శిక్షణను తరచి పరిశీలించి విశ్లేషణాత్మకమైన పద్ధతిలో చర్చించడమైనది.
బోధనారీతికి అవసరమయ్యే పాఠ్యపుస్తకాలు రూపొందించి, ప్రాథమిక దశ నుండి విద్యార్థికి అవసరమయ్యే పాఠ్యాంశములను బోధిస్తున్న ప్రముఖ సంగీత అధ్యాపకులు, గురువులు సంగీత విద్వాంసులు ఆకెళ్ళ మల్లికార్జునశర్మ మరియు సంగీత విదుషి సీతారాజన్.
సాంప్రదాయగతంగా నేర్చిన విద్యను తమ బోధనా పటిమతో విద్యాబోధన అందించిన వారు సంగీత గురువులు యువటూరి విజయేశ్వరరావు మరియు ఐ.వి.ఎల్. శాస్త్రి.
ఈ నలుగురు గురువులు సంగీతం వృత్తిగా మరియు ప్రవృత్తిగా స్వీకరించారు. యువటూరి విజయేశ్వరరావు, ఆకెళ్ళ మల్లికార్జునశర్మ, సీతారాజన్ ముగ్గురూ సంగీతం వృత్తిగా స్వీకరించగా, ఐ.వి.ఎల్. శాస్త్రి కేంద్ర ప్రభుత్వోద్యోగిగా ఉంటూ సేవాదృక్పథంతో సంగీత బోధన చేయడం ప్రత్యేకత. వీరి బోధన ద్వారా శిష్యులు ఉత్తమ కళాకారులుగా సంగీత బోధకులుగా వివిధ స్థాయిల్లో గుర్తింపు పొందుతూ ఉన్నారు. అందువల్ల ఈ నలుగురిని తీసుకొని వీరి బోధించే అభ్యాసగానం స్వరావళుల నుండి గీతముల వరకు నేర్చుకునే క్రమం పదిమందికి చేరువవుతుందనే ప్రయత్నం.
1.1 ఈ సందర్భంగా ప్రస్తావించదగిన ముఖ్యవిషయాలు.
- (a) స్వరాభ్యాసమును మాయామాళవగౌళ రాగంలోనే బోధించిన వారు యువటూరి మరియు ఐ.వి.ఎల్. శాస్త్రి.
(b) శంకరాభరణం మరియు మోహన, గంభీరనాట వంటి సంపూర్ణ, ఔడవ రాగాల్లో శిష్యులకు బోధిస్తున్నవారు ఆకెళ్ళ మల్లికార్జున శర్మ మరియు శ్రీమతి సీతారాజన్.
- జతి అభ్యాసములు, లయసాధనకు ఉపకరించే మార్గనిర్దేశం చేసినవారు యువటూరి విజయేశ్వరరావు మరియు ఆకెళ్ళ మల్లికార్జునశర్మ.
- (a) సాంప్రదాయ పద్ధతిని అనగా సరళి, జంట, దాటు, అలంకారములు, గీతములు ఇత్యాది అభ్యాసరీతులను పై పేర్కొన్న గురువులతోపాటు అందరూ అనుసరిస్తూనే వున్నారు.
(b) అయితే శ్రీమతి సీతారాజన్ మరియు ఐ.వి.ఎల్. శాస్త్రి కొన్ని నూత్న రీతులను బోధనలో పాఠ్యాంశములుగా ఏర్పాటుచేశారు.
- తాళ విషయకంగా లయ సామర్థ్యం పెంపొందించటానికి మెట్రొనం అవసరం గుర్తించి ఆ విధమైన పద్ధతిలో బోధిస్తున్నవారు ఆకెళ్ళ మల్లికార్జున శర్మ మరియు శ్రీమతి సీతారాజన్.
- ఆకెళ్ళగారు Keyboard కేసియో (Casio) వినియోగం కూడా విద్యార్థికి స్వరస్థాన అవగాహన పెంపొందటానికి ఎంతో ఉపకరిస్తుందని బోధన కావిస్తున్నారు.
2. రాగనిర్దేశం
మొదటగా ప్రాథమికదశలో రాగనిర్దేశంను గమనిస్తే విజయేశ్వరరావు & ఐ.వి.ఎల్. శాస్త్రి మాయామాళవగౌళ రాగం నందు స్వరావళులు జంట, దాటు, అలంకారములు బోధిస్తూ విద్యార్థికి కొంత శృతి అవగాహన, స్వర అవగాహన స్వరస్థానములను గ్రహించిన తరువాత జంట మరియు దాటు అలంకారములు ఇతర రాగములందు అనగా శంకరాభరణం, ఖరహరప్రియ, కల్యాణి, తోడి, భైరవి రాగాల్లో బోధించటం గమనించదగింది. అంతేగాకుండా అకార సాధన ఆవశ్యకతను తెలియజేస్తూ స్వర అభ్యాసములను బోధిస్తున్నారు.
2.1. సంగీత అభ్యాసగానరీతులు:
- సససస – సరిరిగ – సససస – సరిరిగ
సససరి – రిగసస – రిరిగగ – సరిరిగ
ససస – రిరిరిగగ – ససరిరి – గగమమ
- ససరిసరి – సారిసరిగ – రీగరిగగమ
ససరిరిగ – సరిసగ – సరిగ – సరిగమ
ఈ అభ్యాస రీతులను వివిధ కాల ప్రమాణంలలో పాడించడం జరుగుతుంది.
2.2. లయ అభ్యాసములు
ఆకెళ్ళ మల్లికార్జునశర్మ ‘కర్ణాటక సంగీతాభ్యాసములో సూక్ష్మ సులభ పద్ధతులు’ (2007)2 (మల్లికార్జునశర్మ, ఆకెళ్ళ –‘సూక్ష్మసులభ పద్ధతులు’ – పేజి నం. 23) అను గ్రంథంలో స్వర అభ్యాసంను మాయా మాళవగౌళ లేదా శంకరాభరణ రాగంలో బోధిస్తున్నారు. జంటదాటులు కూడా ఇవే రాగంలో బోధిస్తున్నారు. స్వర అలంకారములను పేర్కొంటూ లలిత లేదా హంస వినోదిని రాగంలో బోధిస్తున్నారు.
(ఆకెళ్ళ మల్లికార్జునశర్మ)
ఆవర్తం
1 2 3 4
తకిటత కిటతక టతకిట తకిటత
ధృతం
5 6 7 8 త్రిశ్ర అభ్యాసం
కిటతకి టతకిట తకిటత కిటతకి
1 2 3 4
టతకిత తకిటత కిటతకి టతకిట
త,,ది - ,,త, ,ది,, - లఘువు
త,,ది - ,,త, ,ది,, - ధృతం త్రిశ్ర అభ్యాసం
సా, రీ, గా, మా,
పా, దా, నీ, సా,
త్రిశ్రవిరుపు, ఖండవిరుపు, మిశ్రవిరుపు చతురస్ర గతి మరియు త్రిశ్రగతులలో బోధించటం జరుగుతుంది.
చతురస్రంలో - త్రిశ్ర విరుపు
ఖండ విరుపు
మిశ్ర విరుపు
త్రిశ గతిలో - ఖండ విరుపు
మిశ్ర విరుపు
ఆవర్తాంత ఖండ విరుపులు
సాసస రీరిరి గాగాగ మామామ
పాపాప దాదాద నీనీని సాసాస
2.3. స్వర అలంకారములు
ఉదా. లలిత రాగం ఏక, రూపక, మఠ్య, ధృవ, ఝంపె, అట, త్రిపుట,
4, 6, 10 14, 10 14 7
చతురశ్ర ఏకతాళం నుండి క్రమంగా తాళములను నిర్దేశించారు.
అంటే సంగీత బోధనలో విద్యార్థికి సులభతరంగా అలవడే తాళం నుండి క్లిష్టమైన నడకను కల్గిన తాళాలను పరిచయం చేయటం ఆకెళ్ళ బోధనలో గమనించదగిన అంశం.
* విద్యార్థి దశలో కొన్ని రాగాలను పరిచయం కావించటానికి గాను జంట, దాటు, అలంకారములను ఎంచుకోవటం వెనుక స్వరస్థాన నిర్ణయం సరిగా గ్రహించటానికి అవకాశం ఎక్కువ.
* అదేవిధంగా సులభతర తాళం నుండి క్లిష్టమైన తాళమును బోధించటం వల్ల తాళ నిర్వహణలో విద్యార్థికి అవగాహన పెంపొందించుకోవటం జరుగుతుంది. తాళ నిర్వహణకు మెట్రొనం తప్పనిసరి.
2.4. స్వరాభ్యాసాలు
సీతారాజన్ కొన్ని ప్రత్యేకమైన స్వరాభ్యాసాలను రూపొందించి ‘‘బోధన’’ (2013) 3 (Sita Rajan - ‘Bodhana Carnatic Music – An Introduction’ – Page No. 5) అను పుస్తకం ద్వారా సంగీత విద్యార్థులకు అందించారు. ఈ విధానం ద్వారా రాగ, తాళ నిర్దేశం కొంత ప్రత్యేకతను కల్గి వుంది.
(సీతారాజన్)
వీరు ఔడవరాగాలు మోహన, గంభీరనాట, హిందోళం, రేవగుప్తి, అమృతవర్షిణి, శుద్ధసావేరి, హంసధ్వని వంటి రాగాలను మాత్రమే ఎంచుకున్నారు.
మోహన రాగం ఆరోహణ సరిగపదస – అవరోహణ సదపగరిస స్వరాల మధ్య అంతరం స్పష్టతను కల్గి విద్యార్థి గ్రహించడానికి అనువుగా ఉంటుంది.
- Sustaining Exercises
Ex. సరి – సరిగ – సరిగప – సరిగపద
- 2. Three speed Exercises
Ex. సరిగప – సరిగప | సరిగప సరిగప ||
- జంట వరుసలు – సస – రిరి – గగపప |రిరిగగ పపదద ||
- Datu Varusalu – సరిసగ –రిగరిప | సపగరి – సరిగప ||
- Combination Exercises
సస పప గగ రిరి|సస రిరి| గగపప||
- Range exercises – క్రింది స్థాయి - - తారస్థాయి
1) పదసరి – దసరిగ |సరిగప | రిగపద||
అంటే వీరి బోధనలో కాలపైకాలాలను ఒకే ఆవర్తంలో ముగించడం జరుగుతుంది. ఈ అభ్యాసమునకు Metronome తప్పనిసరి.
2.5. స్వరాభ్యాసాలు
ప్రముఖంగా యువటూరి విజయేశ్వరరావు బోధనా పద్ధతిలో స్వర అభ్యాసాలు, అకార సాధన, ప్రథమ, ద్వితీయ, తృతీయాంకాలాలుగా స్వర అభ్యాసాలు నిర్వహిస్తూ ఉండటం కన్పిస్తుంది.
(యువటూరి విజయేశ్వరరావు)
* ప్రత్యేకంగా విద్యార్థులకు ఆరోహణావరోహణ క్రమంగా సమజాగా, 1 అక్షరం జాగా, 2 అక్షరం జాగా, 3 అక్షరం జాగా, 4 అక్షరం జాగాలుగా త్రికాలంగా అభ్యాసం చేయిస్తారు.
ఈ విధమైన అభ్యాసం వల్ల విద్యార్థికి సమ, అనాగతి గ్రహముల అవగాహన పెంపొందుతుంది.
స్వర స్థానముల అవగాహన పెంపొందుటకై స్వరభ్యాస సాధనలో భాగంగా, అకారంగా పాడి ఆయా స్వర స్థానములను విద్యార్థిని ప్రశ్నించటం ద్వారా వారి గ్రాహ్యస్థితిని అంచనా వేయటం జరుగుతుంది.
3. గీతం – అభ్యాసగానం:
ప్రాథమికంగా పిళ్ళారి గీతాలు, లక్షణ, లక్ష్య గీతాలను నేర్పించటం అందరి బోధనా పద్ధతిలో కన్పిస్తుంది. కొందరు దాదాపు 15 గీతములు బోధిస్తూ ఉండగా, కొందరు 5 మాత్రమే (ఆకెళ్ళ మల్లికార్జునశర్మ) విద్యార్థికి అభ్యాసం చేస్తే స్వరస్థాన అవగాహన, తాళ అవగాహన పెరుగుతుందని అభిప్రాయ పడుతున్నారు. ఈ గీతములను త్రికాలంగా పాడించటం కూడా బోధనలో వున్నదే. (శంకరాభరణం, మోహన, కళ్యాణి, మలహరి, శుద్ధసావేరి)
15 రాగాలు – ఘనరాగాలు, భైరవి, కల్యాణి, శంకరాభరణం, మోహన, సావేరి, ఆనందభైరవి, కాంభోజి వంటి రక్తి, భాషాంగ రాగాలే కాక వక్రరాగాలు, ఔడవ, షాడవ రాగాల్లో బోధించటం సర్వసాధారణం.
గీతాలు బోధించే విధంలో శ్రీమతి సీతారాజన్, ఐ.వి.ఎల్. శాస్త్రి పంథా కొంత విభిన్నంగా ఉంది. దీనికిగాను రెండురాగాల ఉదాహరణలను పేర్కొనడమైనది.
3.1. శ్లోకపఠనం:
* ఐ.వి.ఎల్. శాస్త్రి నేర్పిన ప్రతీ గీతం ముందు ఒక పద్యం లేదా శ్లోకం బోధించటం, సంక్షిప్త ఆలాపన వంటి అభ్యాసాలు కొంత ప్రత్యేకం – స్వల్పంగా గమకం వినియోగం విద్యార్థికి అలవాటు చేయడం మంచిదే.
(ఐ.వి.ఎల్. శాస్త్రి)
ఉదా:- మోహన – వరవీణా – రూపకతాళం
రీగాగాగా రిగాగ గాపగరిగా గపారీరిరిగరిససా
యాకుందేందు - తుషార - హారధవళా - యాశుభ్రవస్త్రాన్వితా
సరిగపపాగపపాప పాపపదాదపగా గపదాదా పాదాసదా
యావీణావరదండ - మండితకరా - యాశ్వేత పద్మాసనా
యాబ్రహ్మచ్యుత శంకరప్రభృతిర్బిర్దేవై సదాపూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహ
రాగసంచారం
గదపా / గపదప దసదపగరీ/ సరిగరిగపగరిసా/
సాసాసా సరీస దాపా / దాసరిగారి / గదపా / గపరీసా/
శుద్ధసావేరి రాగం – త్రిపుట తాళం
ఆనలేకర – ఉన్నిబొల్లతి
దాపదాదాదా - మపదసదప - మపదమామ
హేస్వామినాధ కరుణాకర దీనబంధో
రిసారిపాపాపా - పమపాపప - మపదమామా
పార్వతీశ ముఖపంకజ పద్మబంధో
మపదస - సాససస - సాసస - దాసదాపా
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
మపదరిసదపమా - పమరీరీ - రిసారిదాసా
వల్లీశనాధ మమదేహి కరావలంబం
అంటే మోహనరాగం, శుద్ధసావేరి రాగం పరిచయం కావిస్తూ అందులో శ్లోకం బోధించటం ద్వారా స్వర స్థాన బోధనతో పాటు విద్యార్థిలో ఆశక్తిని పెంచే దిశగా సాహిత్యం పట్ల కూడా పరిచయం కావిస్తూ ఉండటం గమనార్హం.
3.2. నామావళి:
మోహనరాగం, ఆదితాళం,
గాగప – రీసస | దసారి | గా; ||
మూషిక - వాహన గజాన నా
గారిగ - పాపా | దగాప | దా; ||
మోదక - హస్త గజాన నా
సాసస - దాపా | గపాద | సా, ద ||
చామర కర్ణ గజాన న, వి
గరిసస - దాపా | పగారి | సా; ||
ళంబిత సూత్ర గజాన నా
శుద్ధసావేరి రాగం – ఆది తాళం
సాసా సదపమ | పమరీ | సా; ||
శంభోశంకర గౌరీ శ,
దాసరిమా రిమ | పమపద | సా; ||
సాంబసదాశివ గౌరీ శా,
దాసా రిరిరిరి | దాసా | రీ; ||
కుంభోద్భవనుత గౌరీ శా,
రిమరిస దపపమ | పమరీ | సా; ||
గంగా ధరవర గౌరీ శా.
గీతము అనే అభ్యాసగానంలో స్వర సాహిత్య తోడ్పాటు (స్వర + సాహిత్యం - ధాతుమాతులు) ఉండటం వల్ల ఈవిధమైన విద్యాబోధన విద్యార్థికి ఆసక్తిని కల్గించి ఉత్తేజపూర్వకంగా సాగుతుందని సీతారాజన్ అభిప్రాయం ఆమోదయోగ్యమే. సంగీతంతో పాటు భాషాజ్ఞానం, భగవధ్బక్తి కూడా విద్యార్థికి అలవడుతుంది.
4. ముగింపు:
నలుగురు విద్యా గురువులలోని ప్రత్యేకతలు:
- శృతిజ్ఞానం, స్వరస్థాన అవగాహన పెంపొందించటానికి సంగీత గురువులు సంప్రదాయ అభ్యాసరీతులను బోధిస్తూ నూత్న రీతులను కూడా పాఠ్యాంశములుగా రూపొందించటం.
- స్వరస్థాన అవగాహనకు సాంప్రదాయ రాగము నందే కాక యితర రాగాలను పొందుపరచి అందు అభ్యాసములను బోధించటం.
- తాళం నిర్వహణకు సంప్రదాయ పద్ధతికి ప్రాధాన్యమిస్తూనే ఆధునికత మేళవించి మెట్రొనం వాడుకను విద్యార్థులకు బోధించటం.
- సాంప్రదాయతను పాటిస్తూ గీతములు బోధిస్తూ వాటితోపాటు విద్యార్థిలో ఉత్సుకత, ఆసక్తిని పెంచేదిశగా శ్లోకాలు, పద్యాలు, నామావళి వంటి అంశాలను పాఠ్యాంశములుగా బోధించటం.
ఈవిధంగా పేర్కొన్న 4 అంశములను పరిగణనలోకి తీసుకొని శృతి, స్వరస్థాన అవగాహన, ఉచ్ఛారణ, తాళ కాలప్రమాణం, లయనిబద్ధతను పాటిస్తూ గమక వినియోగం స్వల్పంగా బోధిస్తూ భావితరాలను ప్రభావితం చేయటం సంగీత గురువుల బాధ్యత. ఆ దిశగా వారందరూ మార్గదర్శనీయులు.
5. ఉపయుక్త గ్రంథాలు:
- నాదముని పండితులు. (1914). ‘సంగీత స్వరప్రస్తారసాగరం – స్వీయప్రచురణ – చెన్నపట్నం
- పార్థసారథి, ఎన్.సి.హెచ్. & ద్వారకాపార్థసారథి. (1965) ‘గానకళాబోధిని’ – బాలసరస్వతి బుక్ డిపో – చెన్నై (2వ ముద్రణ)
- మల్లికార్జునశర్మ, ఆకెళ్ళ. (2007) ‘సూక్ష్మసులభ పద్ధతులు’ – సాయిసన్నిధి సంగీత పబ్లికేషన్స్ – హైదరాబాదు.
- రాములుశెట్టి. (1911). ‘గాంధర్వకల్పవల్లి’ – స్వీయప్రచురణ – చెన్నపట్నం
- వెంకటస్వామినాయుడు, ఉమ్మిడిశెట్టి (1910) ‘సంగీత విద్యాదర్పణం’ – సి. సేతుమాధవరావు -చెన్నపట్నం
- వెంకయ్య, కొండపల్లి. (1929). ‘సంగీత విద్యాబోధిని’ – స్వీయప్రచురణ – చెన్నపట్నం
- సత్యనారాయణమూర్తి, అరిపిరాల. (1963) ‘సంగీతకళాప్రదర్శిని’ – విజయవాడ.
- సింగరాచార్యులు & చినసింగరాచార్యులు, తచ్చూరు. (1905) ‘గాయక సిద్ధాంజనం’ పార్ట్ & 2 – స్వీయప్రచురణ - చెన్నపట్నం
- సుబ్బరామదీక్షితార్. ‘ప్రథమాభ్యాస పుస్తకం’ – విద్యావిలాసిని ప్రెస్ – ఎట్టయాపురం సంస్థానం.
- Mudaliar, A.C. (1893) ‘Oriental Music in European Notation’ – AVE Maria Press – Puduppet, Chennai.
- Sambamurthy, P. (2005). ‘South Indian Music’ Book – 1 – Indian Music Publishing House – Chennai (18th Edition)
- Sita Rajan. (2013). ‘Bodhana Carnatic Music – An Introduction’ – The Karnatic Music Book Centre – Chennai.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.