AUCHITHYAM | Volume-5 | Issue-9 | August 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
2. ముకుంద రామారావు కథలు: ఇతివృత్తం - నీతి
నారగోని సైదులు
పరిశోధక విద్యార్థి, తెలుగు అధ్యయనశాఖ,
బెంగుళూరు విశ్వవిద్యాలయం,
బెంగుళూరు, కర్ణాటక.
సెల్: +91 9490585645, Email: saidulu645@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
ఆధునిక తెలుగు సాహిత్యంలో కవిగా, అనువాదకులుగా, వ్యాసకర్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు ప్రఖ్యాతలు పొందిన సుప్రసిద్ధ రచయితల్లో యల్లపు ముకుంద రామారావు ఒకరు. వీరు ఎనిమిది కవితా సంపుటాలు, 12 అనువాద గ్రంథాలను వెలువరించి జాతీయ- అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఉద్యోగాలరీత్యా వివిధదేశాల్లో నివాసమున్నారు. ఆ కారణంగా “దేశ దేశాల కప్పల కథలు, నిన్ను నువ్వే చూసుకునే అద్దం” పేర్లతో రెండు కథాసంపుటాలు వెలువరించి కథకులుగా కూడా పేరు ప్రతిష్టలు గడించారు. రామారావు వెలువరించిన రెండు కథాసంపుటాల్లోని ఇతివృత్తాన్ని పరిశీలించటం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. ఈ పరిశోధన వ్యాసాన్ని ‘కథ’ ప్రక్రియపై వెలువడిన పరిశోధన గ్రంథం ‘కథానిక స్వరూపస్వభావాలు’, తెలుగు సాహిత్యచరిత్ర పుస్తకాల్లోని ‘కథ-కథానిక’ అంశాలను క్షుణ్ణంగా చదివి, ఆధునిక కథ పద్ధతులను అనుసరిస్తూ రూపొందించడమైనది. ముకుంద రామారావు రాసిన కథల్లోని సంఘటనలు, సందర్భాలు, పాత్రల ఆధారంగా, పూర్వ పరిశోధనల వివరాలు, విశ్లేషణలు, విమర్శలను ఆకళింపు చేసుకుని పరిశోధన ఫలితాలను వెల్లడించటం ఈ వ్యాసం ప్రధాన అంశం.
Keywords: కథ – కథానిక, ముకుంద రామారావు, కథానిక లక్షణాలు, దేశదేశాల కప్పల కథలు, నిన్ను నువ్వు చూసుకునే అద్దం.
1.ఉపోద్ఘాతం:
ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులోకి ప్రవేశించిన “నవల, కథ, నాటకం, పాట, వచన కవిత, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, వ్యాసం, విమర్శ, అనువాదం” మొదలైన ప్రక్రియలన్నింటిలో ‘కథానిక’ ప్రముఖ స్థానాన్ని అలంకరించింది. ‘కథ’ ఎంత ప్రాచీనమైనదో అంత ఆధునికమైనది. ఆదిమ కాలంలో మౌఖిక సాహిత్యంగా ప్రవర్తిల్లిన ఈ ప్రక్రియ రాను రాను లిఖితమవుతూ, కాలానుగుణంగా నూతన సృష్టికి లోనై, ఈనాడు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. ఇంతటి విశిష్టత కలిగిన కథా ప్రక్రియలో ముకుంద రామారావు వివిధ దేశాల్లో ప్రచారంలో ఉన్న కప్పలను, సూఫీ గురువుల బోధనలను ఇతివృత్తంగా ఎన్నుకొని, నీతి కథలుగా మలిచారు. రామారావు కథల్లోని పాత్రలను, ఇతివృత్త అంశాలను విశ్లేషించే ముందు ‘కథానిక’కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేస్తాను.
2. కథ – కథానిక:
“మానవుని ఊహ ఏనాడు రెక్క విప్పుకుందో ఆనాడే కథ పుట్టింది”1 అన్నారు పోరంకి దక్షిణామూర్తి. మొదట మౌఖికసాహిత్యంగా వెలుగొందిన ఈ ప్రక్రియ ఈనాడు ఒక విశిష్టమైన స్థానాన్ని, ఒక ప్రత్యేకమైన స్వరూపాన్ని సంతరించుకొంది. ‘కథ’ అంటే ‘సంభాషించుట, చెప్పుట’ అని అర్థం. ‘కథ్’ అనే ధాతువు నుంచి కథ పుట్టింది. ఇతివృత్త భేదాన్ని బట్టి సంస్కృతంలో ‘కథా, ఆఖ్యాయికా, ఖండకథా, పరికథా’ వంటి బేధాలున్నట్లు జీవానంత విద్యాసారభట్టాచార్యులు పేర్కొన్నారు (తెలుగు సాహిత్య సమీక్ష, రెండవ సంపుటం. పుట. 829). ఇంగ్లీషులో ‘కథ’ను ‘Short Story’ అని పిలుస్తారు. తెలుగులో ‘చిన్నకథ’ అని వ్యవహరిస్తారు. 1936లో ‘ప్రతిభ’ పత్రికకు రాసిన వ్యాసంలో ప్రముఖ కవి ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి మొట్టమొదటిసారిగా కథకు ‘కథానిక’ అనే పదాన్ని సూచించారు (వెలమల సిమ్మన్న, తెలుగు సాహిత్య చరిత్ర. పుట. 692). అప్పటి నుంచి ఇప్పటిదాకా ‘కథ – కథానిక’ పేర్లతో వ్యవహరింపబడుతుంది.
3. కథానిక – లక్షణాలు:
తెలుగు సాహిత్యంలో వెలువడిన ప్రతి ప్రక్రియకు కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉన్నట్టే, కథానికకు కూడా లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు అగ్నిపురాణంలో ఈ క్రింది శ్లోకంలో పేర్కొనబడ్డాయి.
“భయానకం సుఖతరం గర్భేచ కరుణోరసః
అద్భుతో న్తే సుక్లుప్తార్థ నోదాత్త సా కథానికా” (అగ్నిపురాణం: 337వ అధ్యాయం)
అంటే- కథానిక దీర్ఘంగా సాగిపోకుండ పొందికగా ఉండాలి. దీర్ఘ సమాసాలు, వర్ణనలు అవసరం లేదు. పఠితకు సంభ్రమాశ్చర్యాదులు కలిగించే విచిత్ర సంఘటనలు ఉండాలి. కథా గర్భంలో కరుణరసోత్పాదకమైన సన్నివేశాలు ఉండాలి. చివరగా పాఠకుడు ఊహించని అద్భుతమైన మలుపులు, ముగింపు ఉండాలని అర్థం.
“కథకు ఒక రకమైన ఎత్తుగడ, నడకతీరు, ముగింపు, పరిమిత పాత్రలు, ఆ పాత్రలకు చక్కని పోషణ, వస్తు విన్యాస వైశిష్ట్యం, ఒక జీవిత సత్యాన్ని ప్రతిపాదించుట, అన్నింటికి మించి ఎంచుకున్న వస్తువు నుంచి పాఠకుడికి వినోదమో, విజ్ఞానమో, వికాసమో కలిగించేది కథానిక”2 అన్నారు డా. జి. నాగయ్య.
4. తెలుగు కథానిక ఆవిర్భావం:
క్రీ.శ. 19వ శతాబ్దం నుంచి తెలుగు సాహిత్యంలో పరవస్తు చిన్నయసూరి, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు వంటి ప్రభృతులు సంస్కృతం నుంచి ఎన్నో కథల్ని అనువదించి, తెలుగు పాఠకులకు అందజేసినప్పటికీ ఇతివృత్తంలోను, శైలిలోను ఆధునికతను సంతరించుకున్న మొట్టమొదటి తెలుగు కథ గురజాడ అప్పారావు రాసిన ‘దిద్దుబాటు’. ఈ కథ 1910వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆంధ్రభారతిలో ప్రచురించబడింది. అప్పారావు రాసిన కథలో ‘కథానిక’కు ఉండవలసిన లక్షణాలన్ని పుష్కలంగా ఉన్నాయని, తెలుగు కథా సాహిత్యంలో ‘దిద్దుబాటే’ తొలి కథ అని సాహితీవేత్తలు నిర్ణయించారు. అలా గురజాడ అప్పారావుతో ప్రారంభమైన ‘కథానిక’ దినదినం ప్రవర్థమానమవుతూ విస్తృతంగా విస్తరించింది. దీనికితోడు రాను రాను తెలుగులో పత్రికల సంఖ్య పెరిగిపోవడంతో కథానికల వ్యాప్తి విస్తృతమైంది. దీంతో తెలుగులో కథా రచయితల సంఖ్య కూడా అధికమయింది. నేడు తెలుగులో విభిన్న దృక్పథాలు, ఇతివృత్త అంశాలతో అనేక రకాల కథలు వెలుడుతున్నాయి (తెలుగు సాహిత్య సమీక్ష, రెండవ సంపుటం. పుట. 836).
5. కథానిక - ఇతివృత్తం:
‘కథ’ అనేది వాస్తవాధారిత కల్పిత గాథ. ఇది మానవ ప్రవర్తనకు చాలా దగ్గరగా ఉండే సాహిత్య ప్రక్రియ. కథా రచనకి ఇతివృత్తంతో పాటు ఎత్తుగడ, నడక, భాష, మలుపు, ముగింపు, పాత్రపోషణ, సన్నివేశ కల్పన, వర్ణణ, శీర్షిక, శైలి ప్రధానమైనవి. ఇతివృత్తాన్ని బట్టే కథా శైలి, శిల్పం, భాష నిర్ణయించబడుతాయి. కథకు రూపమే ఇతివృత్తం. రూపం కుదరని కథ వికృతంగా ఉంటుంది. రచయిత కథకు కావాల్సిన ఇతివృత్తాన్ని సృష్టిలోంచి, వాతావరణంలోంచి, ప్రకృతిలోంచి, సమాజంలోంచి, మనిషిలోంచి, చరిత్రలోంచి స్వీకరించి తనదైన దృక్పథంతో తీర్చిదిద్దుతాడు.
“కథ కవి యొక్క సొంత ధనం. అతడు దాని సృష్టికర్త. కథను చదువుతున్నంతసేపు ఆ కవి యొక్క మనోగతంతో పాటు అతని స్వరూప స్వభావాలు, ఆంతరమూర్తి అందులో స్పష్టంగా స్ఫురిస్తాయి. ఒకే ఇతివృత్తాన్ని తీసుకుని ఎందరు ఎన్ని కథలు రాసినా, వాటి అన్నింటిలో ఆయా రచయితల ఆత్మ స్వభావాలు ప్రత్యేకంగా గోచరిస్తాయి."3 అంటారు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం.
6. రచయిత పరిచయం - సాహిత్యకృషి:
యల్లపు ముకుందరామారావు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్‌లో 9 నవంబర్ 1944లో జన్మించారు. ఖరగ్‌పూర్‌లోని ఆంధ్ర పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తెలుగును పాఠ్యాంశంగా చదువుకున్నారు. ఆ తరువాత 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఆంగ్లమాధ్యమంలో విద్యనభ్యసించారు. అనంతరం మధ్యప్రదేశ్లోని సాగర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఖరగ్పూర్ ఐఐటిలో మ్యాథ్స్లో పి.జి. డిప్లొమా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో పి.జి. డిప్లొమా చేశారు. ఉద్యోగ రీత్యా రైల్వేశాఖలో సుదీర్ఘకాలం కంప్యూటర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించి రైల్వే రిజర్వేషన్స్ కంప్యూటర్ నెట్ వర్కింగ్ సాఫ్ట్‌వేర్‌ని రూపొందించడంలో ముఖ్యభూమిక పోషించారు. POET (Passenger Operated Enquiry Terminals) పేరుతో సాఫ్ట్‌వేర్‌ని రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్ (PASSENGER RESERVATION ENQUIRY)ను దక్షిణ మధ్య రైల్వేస్టేషన్లలోని అన్నీ టెర్మినల్స్‌లో ఏర్పాటు చేశారు (రాత్రినదిలో ఒంటరిగా, పుట. (ముందుమాట)).
ముకుంద రామారావు సుదీర్ఘకాలంగా విభిన్న ప్రక్రియల్లో విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రధానంగా కవిత్వం రాస్తున్నప్పటికీ వచన రచనలు చేయడంలోను, అనువాదాల్లోను వీరిది ప్రత్యేక శైలి.కవిగా- ‘వలసపోయిన మందహాసం, మరో మజిలీకి ముందు, ఎవరున్నా లేకున్నా, నాకు తెలియని నేనెవరో, నిశ్శబ్దం నీడల్లో, ఆకాశయానం, రాత్రినదిలో ఒంటరిగా’ అనే ఎనిమిది కవితా సంపుటాలు వెలువరించారు. అనువాదకులుగా- ‘అదే అకాశం, శతాబ్దాల సూఫీ కవిత్వం, 1901 నుండి నోబెల్ కవిత్వం, నోబెల్, అదే గాలి, భరతవర్షం సీతాకాంత మహాపాత్ర, చర్యాపదాలు, అదే నేల, అదే కాంతి, అదే నీరు’ పేర్లతో 12 అనువాద గ్రంథాలను వెలువరించారు. కథకులుగా- దేశదేశాల కప్పల కథలు, నిన్ను నువ్వు చూసుకునే అద్దం పేర్లతో రెండు కథా సంపుటాలతో పాటు వ్యక్తిత్వ వికాసం, అనువాదం – అనుభవాల పేర్లతో మరికొన్ని పుస్తకాలు వెలువరించారు (అదే నీరు, పుట. 635).
తెలుగు సాహిత్యానికి తనవంతుగా విశేషమైన సేవ చేస్తోన్న రామారావు కృషిని గుర్తించి పలు సంస్థలు, విశ్వవిద్యాలయాలు సన్మానాలు, పురస్కారాలు, అవార్డులతో సత్కరించాయి. ఈ ఏడాది జనవరి నెలలో అజో – విభొ - కందాళం ఫౌండేషన్ వారు ‘2024 ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం’తో ముకుంద రామారావును సత్కరించి, వీరి రచనలపై 88మంది లబ్ధప్రతిష్టులు రాసిన విలువైన వ్యాసాలతో 423 పేజీల పుస్తకాన్ని వెలువరించారు (సంచిక, వెబ్ పత్రిక. జూన్ 16, 2024)
7. ముకుందరామారావు కథాసంపుటాల్లోని నీతి కథలు:
ముకుంద రామారావును కథకుడిగా పరిచయం చేసిన తొలి కథాసంపుటి ‘దేశదేశాల కప్పల కథలు’. ఈ సంపుటిలో ఉన్న 27 జానపద కథలు నీతిని బోధించేవే. అమెరికా, ఇటలీ, ఆఫ్రికా, జపాన్ దేశాలకు చెందిన కప్పలను కథలకు పాత్రలుగా ఎంపిక చేసుకొని, చిన్న చిన్న సంఘటనలను నీతి కథలుగా తీర్చిదిద్దిన విధానం రచయిత ప్రతిభను వెల్లడి చేస్తుంది.
7.1. కప్ప - తాబేలు:
‘ఒక కప్ప నూతిలో జీవిస్తూ, ఈ ప్రపంచంలో తనకన్నా అందంగా, ఆనందంగా, గొప్పగా బతికేవాళ్లు ఎవరు లేరనుకొని, నూతిలో నుంచి బయటికొచ్చి సముద్రంలో ఉన్న తాబేలుతో-
“నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎప్పుడైన బయటికి పోవాలంటే నూతి గట్టు మీదకు గెంతుతాను. ఇంటికొచ్చాక నూతి గోడల కన్నాల్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. నా చుట్టూ కావలసినంత ఆహారం దొరుకుతుంది. నా కంటే గొప్పవాళ్లు ఇక్కడ లేరు. ఒకసారి లోపలికి వచ్చి నన్నూ నా ప్రాంతాన్ని చూడొచ్చు కదా” (దేశదేశాల కప్పల కథలు. పుట. 3) అంటుంది.
అప్పుడు ఆ తాబేలు “వేయి మైళ్ల దూరం కూడా దాని వెడల్పు చెప్పలేదు. వేల అడుగుల దూరం కూడా దాని లోతుని చెప్పలేదు. పెద్ద పెద్ద వరదలొచ్చినప్పుడు సముద్ర నీటిమట్టం పెరగదు. అతిపెద్ద కరువులొచ్చినప్పుడు నీటిమట్టం తరగదు. అంచేత ఎక్కువ ఆనందం సముద్రంలో ఉంటుంది” అని చెప్తుంది. అప్పటిదాకా తనకంటే గొప్పవాళ్లు లేరనుకున్నా ఆ కప్ప, బయట గొప్ప గొప్ప ప్రదేశాలున్నాయని తెలుసుకుని గొప్పలు చెప్పటం మానుకుంటుంది’.
ఈ కథ ద్వారా చెప్పబడిన నీతి ఏమిటంటే- ‘పిల్లలు వారికి తెలిసిన లోకమే సరైనది అని పెద్దలతో పలుమార్లు వాదించినపుడు ‘బావిలో కప్పలా ఉండకుండా, బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడు’ అని చెప్తుంటారు. లోకంలో ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న చిన్న సందర్భాన్ని కథగా మలిచి, కప్ప - తాబేలు పాత్రల ద్వారా రచయిత వెల్లడించిన నీతి అద్భుతంగా అనిపిస్తుంది.
7.2. కప్ప పట్టుదల:
“పట్టరాదు, పట్టు పట్టి విడువరాదు
పట్టేనేని బిగియ బట్టవలయు
పట్టు విడుట కన్న పడి చచ్చుటే మేలు
విశ్వదాభిరామ వినురవేమ!” (వేమన శతకము. పుట. 28) అన్నారు ప్రజాకవి వేమన.
‘కప్పలపందెం’ కథ చదివిన తరువాత వేమన రాసిన పై పద్యం గుర్తుకొస్తుంది. ‘ఒక ఊర్లో ఎత్తైన శిఖరం ఉంటుంది. దాన్ని ఎక్కాలని కప్పలు తెగ పోటిపడ్తాయి. ఈ విషయం తెలిసి ఆ ఊర్లోని జనాలంతా శిఖరం వద్దకు చేరుకుంటారు. “కప్పలు శిఖరం ఎక్కటం ఏమిటి. ఎందుకొచ్చిన కష్టం?” (దేశదేశాల కప్పలకథలు. పుట. 4) అని అందరూ జాలిపడతుంటారు. అంతలోనే కప్పలు ఉత్సాహంగా శిఖరం ఎక్కటం మొదలుపెడతాయి. విపరీతమైన ఆయాసం వచ్చి ఒక్కొక్కటిగా పోటి నుంచి తప్పుకుంటాయి. కాని, అందులో ఓ కప్ప మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా శిఖరాన్ని చేరుకుంటుంది.
“అంతమంది గేలిచేస్తున్నా, ‘నువ్వు ఎక్కలేవు’ అంటూ నిరుత్సాహ పరుస్తున్నా, అవేవీ పట్టించుకోకుండా, పట్టిన పట్టు వదలకుండా ఎలా గమ్యం చేరావు?, నీ రహస్యం ఏమిటి?” అని మిగతా కప్పలు ఆ కప్పను గట్టిగా అడుగుతాయి. దానికి ఆ కప్ప “నాకు చెవులు వినపడవు. అదే నా విజయానికి రహస్యం” అని చెప్తుంది’.
ఈ కథ ద్వారా రచయిత వెల్లడించిన నీతిని పరిశీలిస్తే- పెద్దలు గాని, ఉపాధ్యాయులు గాని పిల్లలు ఏదైనా (చదువు, ఉద్యోగం, ఆట) సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు ‘లక్ష్యాన్ని చేరుకునే ముందు ఎన్ని ఇబ్బందులొచ్చినా, విమర్శలొచ్చినా పట్టించుకోకుండా చెవిటివాడిలా పట్టు వదలకుండా గమ్యం చేరుకోవాలి’ అని చెప్తుంటారు. ప్రతి విజయం వెనక ఎంత కఠోర శ్రమ ఉంటుందో, ప్రతి ప్రయత్నం వెనక అంతే ప్రోత్సాహం ఉంటుందనే విషయాన్ని రచయిత నీతి కథగా మలిచారు.
7.3. కప్పలు - దేవుడు:
ఈ కథను చదినపుడు ఈనాటి ప్రభుత్వాల తీరు, రాజకీయ నాయకుల ప్రవర్తన, పాలనా పేరుతో ప్రజల్ని వేధించుకు తింటున్నా విధివిధానాలు పాఠకుడి కళ్లముందు కదిలాడుతున్నట్లు ఉంటుంది. ‘ఒక చోట కప్పలన్నీ కలిసి హాయిగా నివసిస్తుంటాయి. వాటికి కావాల్సినంత తిండి తింటూ, ఎటువంటి ఇబ్బందిలేకుండా ఇష్టానుసారంగా బతుకుతుంటాయి. కొన్ని కప్పలకు అలా జీవించటం నచ్చక “మమ్మల్ని బాగా చూసుకోవటానికి, అదుపులో పెట్టడానికి వెంటనే ఒక రాజు కావాలి” (దేశదేశాల కప్పల కథలు. పుట.6) అని దేవుడ్ని కోరుకుంటాయి. దేవుడు కప్పల కోరికకు నవ్వుకుని, ఓ పెద్ద దుంగలాంటి సోమరి కప్పను రాజుగా నియమిస్తాడు. మొదట్లో ఆ దుంగ (కప్ప)ని చూసి కప్పలు తెగ భయపడతాయి. రాను రాను ఆ సోమరి కప్పమీదకి ఎక్కి ఆడుకోవటం మొదలెడతాయి. కొన్ని రోజులు గడిచాక, రాజు అంటే ఇలా ఉండకూడదంటూ తమకు నిజమైన రాజు కావాలని దేవుడ్ని మరోసారి వేడుకుంటాయి. దేవుడికి కోపమొచ్చి ఒక చండ శాసనుడ్ని రాజుగా నియమిస్తాడు. దాంతో రోజు కప్పల్ని వేధించుకు తినటం, ఇష్టమొచ్చినట్లు హింసిస్తాడు ఆ రాజు. కప్పలు వాటి తప్పు తెలుసుకొని “సుఖంగా ఉన్న జీవితాల్ని కష్టాల్లో పడేసుకున్నామని, క్రూరమైన పాలన కంటే ఏ పాలన లేకపోవడమో నయం” అని కన్నీరుమున్నీరవుతాయి. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.’
‘మానవులు బతకడానికి భగవంతుడు స్వేచ్ఛతో పాటు ఆహారం, నీరు, వసతి ఇచ్చాడు. కాని, ప్రజలు ఆ స్వేచ్ఛను పాలకుల చేతికి అప్పగించి తీవ్రమైన కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.’ ఈ సన్నివేశాన్ని కథగా మలిచి, శతాబ్దాల కాలంగా ‘పరిపాలన’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిస్థితిని, నాయకుల తీరును రచయిత అద్భుతంగా చిత్రీకరించారు.
7.4. మాంత్రిక యువరాజు:
ఈ కథ ఇటలీ జానపద కథ. ‘ఒక తండ్రికి ముగ్గురు కుమార్తెలు ఉంటారు. అందులో మొదటి ఇద్దరు కుమార్తెలు స్వార్థపరులు. మూడవ కుమార్తె అందమైన, తెలివైన అమ్మాయి. అనారోగ్యం రీత్యా తండ్రి ఒక సాధువు దగ్గరికి వెళ్లేందుకు సిద్దమవుతాడు. “తిరిగొచ్చేటప్పుడు ఎవరెవరికీ ఏమేమి తీసుకురావాలి” (దేశదేశాల కప్పల కథలు. పుట. 11) అని ముగ్గురు కుమార్తెల్ని అడుగుతాడు. దానికి మొదటి ఇద్దరు కుమార్తెలు నగలు తెమ్మంటారు. చిన్న కుమార్తె మాత్రం ఒక పువ్వు తెస్తే చాలు అంటుంది.
తండ్రి సాధువు వద్దకెళ్లి నిరాశతో ఇంటికొస్తుండగా దారిలో ఒక అందమైన పూల తోట కనిపిస్తుంది. మూడవ కుమార్తె గుర్తొచ్చి ఒక పువ్వు కోస్తాడు. వెంటనే ఓ బోదురు కప్ప బయటికొచ్చి “నువ్వు చేసిన ఈ తప్పుడు పనికి నీ ప్రాణం ఇవ్వాల్సిందే” అని అంటుంది. దానికి ఆ తండ్రి “నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారంతా నామీదే ఆధారపడి బతుకున్నారు. నేను చేసిన ఈ తప్పును క్షమించు” అని కప్పను వేడుకుంటాడు. ఆ కప్ప “నీ మూడవ కూతురితో నాకు పెళ్లి చెయ్యి లేదంటే ప్రాణం పోతుంది” అని హెచ్చరిస్తుంది.
చివరికి తండ్రిని కాపాడుకోవటం కోసం చిన్న కూతురు బోదురు కప్పను పెళ్లి చేసుకుంటుంది. పడక గదిలోకి వెళ్లిన తరువాత ఆ కప్ప యువరాజుగా మారి, ఆమెతో సంసారం జీవితం గడుపుతుంది. అలా రాత్రి యువరాజుగా, పగలు కప్పలా మారుతుంటుంది. కొన్నాళ్ల తరువాత చెల్లి సంసార జీవితాన్ని గమనించిన ఇద్దరు అక్కలు రహస్యం ఏమిటో చెప్పమని పదే పదే అడుగుతారు. అసలు విషయం తెలిసి ఆశ్యర్యపోతారు. కొన్నాళ్లకు బోదురు కప్పకు జబ్బు పడుతుంది. ఎంతకు జబ్బు నయంకాకపోవడంతో ఏం చేయాలో అర్థంకాక కప్ప ఇచ్చిన ఉంగరాన్నీ తీసి నూతిలోకి విసిరి కొడుతుంది. వెంటనే ఆ బోదురు కప్ప యువరాజుగా మారి, అందర్నీ తన వెంటపెట్టుకొని రాజ్యానికి వెళ్లిపోతుంది.’
ఈ కథ ద్వారా రచయిత చక్కటి నీతిని తెలియజేశారు. ‘స్వార్థం మనుష్యులకు అపకీర్తిని తెచ్చిపెడుతుంది అనేదానికి మొదటి ఇద్దరు అక్కల పాత్రలు ఉదాహరణగా చెప్పబడితే, తండ్రి ప్రాణానికి అపాయం ఉందని తెలిసి, ప్రాణత్యాగానికైనా వెనకాడని పాత్రగా మూడవ కుమార్తె ఆదర్శంగా చిత్రించబడింది.’ అందుకే పెద్దలు- ‘ఎవరైతే తల్లిదండ్రుల కష్టాల్లో పాలుపంచుకునేందుకు ముందడుగు వేస్తారో వాళ్లే నిజమని కూతుళ్లు/కొడుకులు’ అని అంటుంటారు.
7.5. కప్ప - తోక:
‘కప్పకు తోక లేకపోవడంతో కొన్ని జంతువులు వెక్కిరించాయి. దాన్ని భరించలేక తోక కావాలని ఆకాశ దేవుడికి మొరపెట్టుకుంటుంది. ఆకాశ దేవుడు స్పందించి “నువ్వు నివసిస్తున్న నుయ్యి ఎండిపోదు. దీన్ని పరిశుభ్రంగా ఉంచి, దాహంతో వచ్చినవారికి మంచి నీరు అందేలా చూస్తే, నీకు తోక ఇస్తాను” (దేశ దేశాల కప్పల కథలు. పుట. 13) అంటాడు. “నాకు తోక వస్తే మీరు చెప్పినట్టు చేస్తాను” అంటుంది కప్ప. కొన్ని రోజులకు కప్పకు తోక వచ్చాక గర్వంగా, హాయిగా, జీవించటం మొదలెడుతుంది.
అంతలోనే ఆ ప్రాంతంలో విపరీతమైన కరువు వస్తుంది. మంచినీరు దొరక్క జంతువులన్నీ ఒక్కొక్కటిగా చనిపోతుంటాయి. ఆకాశ దేవుడు మిగతా జంతువులకు కప్ప నివసిస్తున్న నుయ్యిలోని నీళ్లు వాడుకోమని చెప్తాడు. కాని ఆ కప్ప “నా నుయ్యిలో నీరు అంతగా లేదు. ఉన్నదంతా బురదే” అంటూ ఒక్కొక్క జంతువుని వెనక్కి పంపించేస్తుంది. అదంతా గమనించిన ఆకాశ దేవుడు కప్ప తొక్కను తీసేసి, దాన్ని నుయ్యి నుంచి వెళ్లగొడతాడు. హీనస్థితి గుర్తుండేలా కప్ప పుట్టినప్పుడు తోకనిచ్చి, పెరుగుతున్నకొద్ది తీసేశాడు.’
ఈ కథ ద్వారా రచయిత ఈనాడు లోకంలో జరుగుతున్న ఓ ముఖ్యమైన సంఘటనను కథగా మలిచి, కప్ప - దేవుడి పాత్రల ద్వారా నీతిని వ్యక్తపరిచారు. ‘లేనిదాని కోసం ఆరాటపడకు - ఉన్నదాన్ని పోగొట్టుకోకు’ అనే విషయాన్ని గుర్తు చేశారు.
8. ముకుంద రామారావు కథా సంపుటాల్లోని సూఫీ కథలు:
రామారావు వెలువరించిన రెండో కథాసంపుటి ‘నిన్ను నువ్వు చూసుకునే అద్దం’. ఈ సంపుటిలో 11 సూఫీ కథలు, 21 జెన్ కథలు, 14 ఇతర కథలు ఉన్నాయి.
సూఫీ అంటే ఏమిటి?. దేవుడ్ని ప్రేమించే మార్గమే సూఫీ. అన్ని బంధాల్నీ వదులుకుని, అన్నింటిలోను దేవుడ్ని ప్రేమిస్తూ, వారి మార్గాన్నే అనుసరించడం సూఫీ. సూఫీ అనే పదం ‘సూఫ్’ అనే అరబ్బీ పదం నుండి ఉద్భవించింది. అరబ్బీలో సూఫ్ అంటే ‘ఉన్ని’ అర్థం. ప్రాచీన కాలంలో ఉన్ని దుస్తులు ధరించేవారిని మార్మిక సూఫీలుగా పిలుచేవారు. సూఫీ తత్వాన్ని అరబ్బీలో ‘తసవ్యుఫ్’ అంటారు. అంటే ఇస్లాం మార్మికత అని అర్థం. మొత్తంగా దేవునికి దగ్గర కావాలని, తనలో తాను లీనం కావాలని నిరంతరం ఆలోచన, అంతర్ దృష్టి, ధ్యానంతో తపించేవాడు సూఫీ. సూఫీ సారాంశాన్ని సామాన్యులకి సైతం అర్థం అయ్యేలా చెప్పేందుకు, సత్య మార్గంలో ఎవరైనా పయనించేందుకు దోహదపడే కథలను రామారావు తెలుగు పాఠకులకు అందించిన కథలే ఈ సూఫీ కథలు.
8.1. పిల్లాడు - సూఫీ గురువు:
‘ఓ పిల్లాడికి అతి చిన్న వయసులోనే మద్దెల వాయించటం వ్యసనమైపోతుంది. దాంతో ఆ పిల్లాడి తల్లిదండ్రులు తీవ్రమైన భయానికి లోనై, ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతుంటారు. ఒక రోజు వీధిగుండా సూఫీ గురువు వెళ్తుంటే అందరూ పిల్లాడి పరిస్థితిని అతనికి వివరిస్తారు. వెంటనే ఆ సూఫీ గురువు పిల్లాడి విద్యను అభినందించి ఒక సుత్తి, ఒక ఉలిని బహుమతిగా ఇచ్చి “ఇంత బాగా శబ్దం చేస్తున్న ఈ మద్దెల లోపల ఎవరున్నారో తెలుసుకో” (నిన్ను నువ్వు చూసుకునే అద్దం. పుట. 6) అని సలహా ఇస్తాడు. అదే రోజు రాత్రి ఆ పిల్లాడు పడుకునేముందు సూఫీ గురువు ఇచ్చిన సుత్తి, ఉలితో ఆ మద్దెలను ఎక్కడికక్కడ పగలగొట్టి, లోపల ఎవరున్నారో చూస్తాడు. చివరికి ఎంత ప్రయత్నించిన మద్దెల మోత రాకపోవడంతో గుక్కపట్టి ఏడుస్తాడు. తల్లిదండ్రులు నచ్చజెప్పి పిల్లాడ్ని నిద్రపుచ్చుతారు.’
8.2. వ్యాకరణ పండితుడు - సూఫీ గురువు:
‘ఒక వ్యాకరణ పండితుడు మరీ లోతులేని బావిలో పడిపోతాడు. బయటికిరాలేక సతమతమవుతుంటాడు. అంతలోనే ఓ సూఫీ గురువు అటువైపు నుంచి వెళ్తూ, పండితుడు బావిలో పడిపోయిన విషయాన్ని గమనించి “సాయం కావాలేంటి” (నిన్ను నువ్వు చూసుకునే అద్దం. పుట. 7) అని మాములుగా అడుతాడు. వెంటనే ఆ పండితుడు “నాకు సాయం చేయాలని అనుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు. కాని, మీరు మాట్లాడిన భాషలో చాలా లోపాలు ఉన్నాయి” అని సూఫీ గురువుకు వివరించబోతాడు. “చాలా మంచి విషయం చెప్పారు. నేను వెళ్లి నా భాషని సరి చేసుకుని వస్తాను” అంటూ ఆ పండితుడ్ని బావిలోనే ఉంచి, అక్కడి నుంచి వెళ్లిపోతాడు.’
9. ముకుంద రామారావు కథలు - విమర్శకుల అభిప్రాయాలు:
ముకుంద రామారావు వెలువరించిన ‘దేశ దేశాల కప్పల కథలు, నిన్ను నువ్వే చూసుకునే అద్దం’ కథా సంపుటాలపై ఇదివరకు పరిశోధన జరగకపోయినప్పటికి, ప్రముఖ తెలుగు కథకులు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు రామారావు కథలపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
“ముకుంద రామారావు రాసిన కథలన్నీ అందరూ ఏదో ఒక సందర్భంలో గమనించినవీ, అనుభవించినవీ. రామారావు కథల్లో మానవునిలో ఉన్న మంచి చెడ్డలు, ఆకాంక్షలు, ఆశలు చిన్న చిన్న విషయాల ద్వారా వ్యక్తమవుతూ ఉంటాయి. ఈ చిన్న సంఘటనలు పాఠకుడి ఆలోచనలో, అభిప్రాయంలో మార్పులు తెచ్చేవిగా ఉంటాయి. ఇంత చక్కని కథలు రాసిన రామారావు కవిత్వ పక్షపాతి. వేలెత్తి చూపించకుండా ఉండడానికి కొన్ని కథలే రాసి, వదిలేశారు. కొన్నాళ్ళు కవిత్వం పక్కన్నపెట్టి, విస్తృతమైన ఆయన జీవితానుభవంలోంచి కథలు రాయమని కోరుతున్నాను” (అజొ-విభొ-కందాళం- 2024, ప్రతిభా వైజయంతి విశేష సంచిక, పుట. 282, 285) అని పేర్కొన్నారు.
10. ముగింపు:
- యల్లపు ముకుంద రామారావు రాసిన కథలు సమాజానికి మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పవచ్చు.
- రామారావు రాసిన రెండు కథా సంపుటాల్లోని నీతి కథలను ప్రాథమిక స్థాయిలో విద్యనభ్యసించే పిల్లలకు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టొచ్చు.
- రామారావు రాసిన సూఫీ, జెన్ కథలను చదవటం వల్ల పిల్లల్లో, పెద్దల్లో మర్యాదతో కూడిన క్రమశిక్షణ అలవడుతుంది.
- కథలకు ముకుంద రామారావు ఎంచుకున్న ఇతివృత్తం విలక్షణంగా అనిపిస్తుంది.
- ముకుంద రామారావు రాసిన కథలన్నీ ఎప్పుడో ఒక సందర్భంలో అందరూ విన్నవే, చదివినవే. అయినా కథకుడుగా వీరి ఎంచుకున్న శైలి, కథను నడిపించిన విధానం కొత్తగా ఉంది.
- ముకుంద రామారావు కథలు మేఘం లాగా మెరుస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు.
- రామారావు రాసినవి వెలువరించినవి రెండు కథా సంపుటాలే అయినా, కథలను ఎంచుకున్న విధానం, జాగరూకత, కథా గమనం అద్భుతంగా ఉంటుంది.
11. పాద సూచికలు:
- కథానిక స్వరూప స్వభావాలు. పుట.1
- తెలుగు సాహిత్య సమీక్ష, రెండవ సంపుటం. పుట. 831
- సాహిత్యశిల్పసమీక్ష. పుట. 2
12. ఉపయుక్తగ్రంథసూచి:
- ఈశ్వరరావు, సెట్టి. (2004). గురజాడ కథానికలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- దక్షిణామూర్తి, పోరంకి. (1988). కథానిక స్వరూప స్వభావాలు (పరిశోధన గ్రంథం), నవోదయ పబ్లిషర్స్, విజయవాడ.
- నాగయ్య, జి. (1983). తెలుగు సాహిత్య సమీక్ష, రెండవ సంపుటం, నవ్య పరిశోధక ప్రచురణలు, తిరుపతి.
- బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, కరణం. (2006). వెలుగు తగ్గిన తెలుగు, జయంతి పబ్లికేషన్స్, హైదరాబాద్.
- ముకుంద రామారావు, యల్లపు. (2017). రాత్రినదిలో ఒంటరిగా, కర్షక్ ఆర్ట్స్ ప్రింటర్స్, హైదరాబాద్.
- ముకుంద రామారావు, యల్లపు. (2023). అదే నీరు, త్రివేత్రి అకాడమి ప్రైవేట్ లిమిటెడ్ ప్రింటర్స్, బెంగుళూరు.
- రంగానాథాచార్యులు, కె.కె. (2008). తొలినాటి తెలుగు కథానికలు, మాడభూషి రంగాచార్య స్మారక సంఘం, హైదరాబాద్.
- రాజారాం, మధురాంతకం. (1998). తొలి నాటి తెలుగు కథలు (1936 - 1945), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
- వీరస్వామి, పల్లేరు. (2021). వేమన శతకము, నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- వెంకట సుబ్బయ్య, వల్లంపాటి. (1996). కథా శిల్పం, విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్, విజయవాడ.
- వేంకటేశ్వర్లు, బూదాటి. 2014. తెలుగు సాహిత్య ప్రక్రియలు – ధోరణులు, హిమకర్ పబ్లికేషన్స్, హైదరాబాద్.
- శాస్త్రి, . ద్వా.నా. (2014). తెలుగు సాహిత్య చరిత్ర, ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్.
- సంచిక, తెలుగు సాహిత్య వేదిక, వెబ్ పత్రిక. (2024). వై. ముకుంద రామారావు ప్రత్యేక ఇంటర్వ్యూ, హైదరాబాద్.
- సిమ్మన్న, వెలమల. (2021). తెలుగు సాహిత్య చరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ.
- సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీపాద. (1992). శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు, మొదటి సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

