AUCHITHYAM | Volume-04 | Issue-10 | September 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
10. చేబోలు చిన్మయ బ్రహ్మకవి ‘సంధ్యాగౌతమి’: కవితాపరామర్శ
డా. దొంతరాజు లక్ష్మీ నరసమ్మ
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమండ్రి,
తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9493570591. Email: drlakshminarasamma@gmail.com
Download PDF
1. కవి పరిచయం:
ఆంధ్ర సాహితీ ప్రపంచంలో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొని భక్తి సాహిత్యంలో ఆంధ్రజాతిని తరింపజేసిన కవి చిన్మయ బ్రహ్మకవి. నిరంతరం కుసుమ హరనాథ నామస్మరణతో జీవితాన్ని ధన్యం చేసుకొన్న పరమభక్తుడు. వీరు ఆధునిక కాలంలో జన్మించి ప్రాచీన సంప్రదాయ పద్ధతుల్లో బహుగ్రంథాలు రచించిన ఆదర్శకవి.
ఈ కవి విశ్వబ్రాహ్మణ కులస్థులు, ఆదిత్య బ్రహ్మర్షి గోత్రం, కాత్యాయన సూత్రం, బంధమోక్ష సాత్విక శాఖ. వీరి పూర్వీకులు మొదట ‘అనకాపల్లి’ తాలూక ‘నడిపూడి’ గ్రామంలో ఉండేవారు. వీరి ముత్తాత అచ్చయాచార్యులు 1850 ప్రాంతంలో అనకాపల్లి వచ్చి స్థిరపడ్డారు. వీరికి గంగయాచార్యులు, గడ్డియాచార్యులు, అచ్చయాచార్యులు, వీరేశలింగం, రామమూర్తి అనే ఐదుగురు కుమారులు, ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. సన్యాసాంబ, గంగాచార్యులకు వీరమ్మ, సత్యనారాయణాచార్యులు, తాతాచార్యులు, సూర్యనారాయణ, సీతమ్మ చిట్టెమ్మ అనేవారు జన్మించారు. స్వర్ణ శిల్పులు, కళా సాహిత్యాభిలాషులు, వేదాంతులు, కవితాప్రియులు అయిన సత్యనారాయణచార్యులకు వెంకుపాలెం గ్రామానికి చెందిన గుణవతి, వినయవతి అయిన నారాయణాంబ అనే దంపతులకు జన్మించినవారే చిన్మయ బ్రహ్మకవి.
చిన్నతనం నుండి సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తిని కలిగి ఉండే ఈయన జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యుడు ‘‘ఈ పిల్లవాడు పుట్టిన తరువాత రెండు వంశాల వారికి అభివృద్ధి కల్గునని, పండితుడు, ప్రతిజ్ఞావంతుడు, కీర్తిమంతుడు కాగలడని’’ చెప్పారట. కవిగారికి విద్యార్ధిగా ఉన్నప్పుడే రాజమండ్రిలో ఉద్యోగం చేయాలని కోరికగా ఉండేది. నిరంతరం కుసుమ హరనాధున్ని వేడుకునేవారు. శ్రీహరనాధుని జన్మదినము రోజునే (జూలై 1వ తేదీ) 1.7.1958లో గోదావరి ఒడ్డునే కల రాజమండ్రి మున్సిపల్ హైస్కూలులో సెకండరీ గ్రేడు తెలుగు పండితునిగా చేరారు. 33 సంవత్సరాలు ఉపాధ్యాయవృత్తిలో కొనసాగి, తోటి ఉపాధ్యాయమన్ననలు, పురప్రముఖుల ప్రశంసలూ పొందుతూ, నీతులు, వ్యాకరణం, సాహిత్య అంశాల్ని బోధిస్తూ ఆత్మీయతతో విద్యార్ధులను చూచుకొంటూ 1988లో అగష్టు 30న పదవీ విరమణ చేసారు. చిన్మయ బ్రహ్మకవి ఆర్ధికలాభాన్ని ఆశించకుండా భక్తిభావ విలసితమైన కావ్యరచననే ఊపిరిగా భావించి తన కావ్యాలను భగవంతునికే అంకితం చేసిన భాగవతోత్తముడు చిన్మయుడు.
డా॥ యల్. నరసింహం ఈ కవిని గురించి- ‘‘కవిత్వ రచనయే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బ్రతుకు ఉత్తమకవి. భగవద్భక్తి భావనయే ప్రాణకళగా జీవించు చిన్మయా నందుడు, చిన్మయ బ్రహ్మకవి’’ అన్నారు.
డా॥ పొన్నా లీలావతి ఈ కవి కార్యరచనాకృషిని వివరిస్తూ- ‘‘ఈ జగన్నాటకంలో సకల సంశోభితమైన రాజమహేంద్రవర రంగస్థలంపై ప్రవేశించి, తన కావ్యాలు పూర్తిచేసి పారబ్దకర్మలు అనుభవించి నిష్క్రమించిన అభినవ పోతన పాత్రధారుడు డాక్టరు చేబోలు చిన్మయ బ్రహ్మకవి. ఈ విద్వత్కవి రాజు తన మనస్సు, మేధస్సులను, భక్తి ప్రపత్తును, నియమనిష్ఠలను, మానవతా మమకారాలను, నీతి నిజాయితీలను, అక్షరాలలో అక్షయం చేసాడు’’ అని తన అభిప్రాయాన్ని వివరించారు.
ఎస్.టి. జ్ఞానానంద కవి- “తెలుగు కవిగా ప్రపంచంలో మూడు దశాబ్దాలుగా తమదైన ఒక మహోన్నత శైలి విన్యాసాన్ని సంతరించుకున్న మహామనీషి, కవి మూర్ధన్వులు, బహుగ్రంథకర్త’ బహుళసన్మానవిరాజితులు వీరు’’ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
చిన్మయ బ్రహ్మకవి సారస్వత సేవలకు తగినవిధంగా అనేక సన్మానాలు, బిరుదులు పొంది మహామనిషిగా ఖ్యాతి చెందారు.
- అనకాపల్లి శ్రీరామ మందిరంలో 45 రోజులు భాస్కర రామాయణ పురాణం చెప్పారు. చివరి రోజున భక్తబృందం కొంత ధనం, కొత్త బట్టలు ఇచ్చారు. అదియే మొదటి చిరు సన్మానం.
- 05.1953 సం॥ రాజమండ్రి స్వర్ణ వర్తక సంఘం సభ జరిగింది. దానికి శ్రీ ముక్కపల్లి అన్నప్పదీక్షితులు అధ్యక్షత వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘంవారు ‘మధురకవి’ బిరుదు యిచ్చి సత్కరించారు.
- సం॥ అనకాపల్లి లింగమూర్తి హాలులో శ్రీపాద కృష్ణమూర్తి అధ్యక్షతన కొమ్మొజు తాతయ్య, కోరుకొండ బ్రహ్మానందం మొదలగు అనకాపల్లి పౌరులు ‘‘సువర్ణ కంకణం, కవితావిభూషణ’’ అను బిరుదునిచ్చారు.
- 1959 రాజమండ్రి బ్రహ్మనంద భవనంలో ‘‘న్యాయవేదాంతశిరోమణి’’ శ్రీ చల్లా గోపాలకృష్ణశాస్త్రిగారి అధ్యక్షతన రాజమండ్రి పౌరులచే ‘మకరకుండల’ సన్మానం జరిగింది.
- 1960 రాజమండ్రి శ్రీరామకృష్ణ మిషన్‌లో 60 రోజులు మహా ఉపన్యాసం చెప్పారు. శ్రీ త్రివిక్రమ రమానంద భారతీస్వామి అధ్యక్షతన స్వర్ణసింహకంకణంతో పాటు ‘‘ఉపన్యాస సుధ’’ బిరుదిచ్చారు.
- 1968 ‘‘రాణ్మహేంద్రవర మార్కండేయ మృత్యుంజయ’’ అనే మకుంటంతో ‘‘శివరంజని’’ కావ్యం రచించారు. కార్తిక పౌర్ణమి సోమవారం మార్కండేయ స్వామికి కావ్యం అంకితం ఇయ్యబడింది. ఈ కావ్య ఆవిష్కరణకు శ్రీమానాప్రగఢ శేషసాయి అధ్యక్షత వహించారు. ‘‘...కళానిధి’’ అని బిరుదిచ్చి సత్కరించారు.
- 1968 అనకాపల్లి శ్రీగౌరి పరమేశ్వరిపై సంస్కృతంలో 29 శ్లోకాలతో సుప్రభాతం రచించారు. శ్రీగౌరి సేవా సంగంవారు ‘‘అభినవ పోతన’’ బిరుదును గ్రంథావిష్కరణ సభలో యిచ్చి ఘనంగా సన్మానించారు.
- 1976లో కబీరు రామదాసు చరిత్రలను ‘రామానంద కావ్యం’ గా రచించారు. డాక్టరు యస్వీ. జోగారావు కావ్య అవిష్కార సభలో అధ్యక్షత వహించారు. ‘భక్తకవి శిఖామణి’ అను బిరుదు ప్రదానం చేయబడింది.
- 1977 సం॥లో ‘దిబెస్టు టీచర్ ఆఫ్ రాజమండ్రి’గా రోటరీ క్లబ్ వారిచే సన్మానింపబడ్డారు.
- 09.1979న రాజమండ్రి నగరవాసులు, స్వర్ణశిల్పులు శ్రీ కడియం బాబూరావు సువర్ణగండ పెండేర సన్మానాన్ని చేయదలచారు. శ్రీగ్రంథి సుబ్రహ్మణం అధ్యక్షతన 8 కాసుల గండపెండేరాన్ని ఆంధ్ర యూనివర్శిటీ వైస్ చాన్సిలర్ శ్రీ ఎం. ఆర్. అప్పారావుగా తన అమృత హస్తాలతో రాజమండ్రి దుర్గాకళ్యాణ మండపంలో ఎడమకాలికి తొడిగా ‘‘కవితా వాచస్పతి’’ అను బిరుదును యిచ్చారు.
2. సంధ్యాగౌతమి సారాంశం
గౌతమి నది ఒక కవికి చెప్పిన పూర్వచరిత్ర. ఇందులో ఇతివృత్తం ఉండదు. ప్రాచీన చరిత్రలను, తన అనుభవాలను రంగరించి గౌతమి చెప్పినట్లుగా కవి తన ఊహలను చిత్రంచిన పద్యకావ్యం ఇది. ఇందులో అధ్యయాలు ‘తరంగాలు’గా విభజించ బడ్డాయి. ఇందులో నాలుగు తరంగాలలోనూ మొత్తం 218 పద్యాలు ఉన్నాయి. ‘‘సాయం ప్రాత సంధ్యా మధ్య కాలంలో గౌతమి కవితో చెప్పిన స్వీయగాధ అగుటచే దీనికి ‘‘సంధ్యాగౌతమి’’ అని పేరు పెట్టారు.
‘‘సంధ్యాగౌతమి’’ అను పేరు గురించి శ్రీవాసిలి వేంకట లక్ష్మీ నరసింహారావు ఈ విధంగా చెప్పారు.
‘‘అవును ఈ కావ్యం ‘సంధ్యాగౌతమి’ పేరులో ఏముందిలే అని కొందరందురు. నన్నడిగినచో పేరులో కూడ పెన్నిథి యున్నదందును. ముఖ్యంగా కవితా ప్రపంచంలో అనంతమగు కాలంలో ఈ యిరువదవ శతాబ్ద మొక సాయం సంధ్య. జరిగిపోయిన కాలమంతయు నొక స్వర్ణయుగము. ఇది సహస్రకిరణ ప్రభలతో వెలుగొందినది. ఆ సూర్యడస్తమించు చున్నాడు. ఈ రాత్రి గడిస్తే కాని సూర్యుడుదయించడు. ఇలాంటి సంధి కాలం గురించే ఈ నిర్వేదం, ఈ విధమైన నిర్వేదంతోనే కవి అనే సాయం సంధ్యలు గౌతమీ తీరాన సంచరించాడు. కడుపు చల్లని తల్లియగు గౌతమి సాక్షాత్కరించి యుగసంధి విశేషాలను కవికి ఉపదేశించెనట. సన్నివేశ సుందరమగు జౌచిత్యమున్నచో విధంగా ఉండును. కవి భావనా ప్రౌడికిది నిదర్శనం’’ అని ఈ సాయం సంధ్యను రాబోవు ప్రాస్సంధ్యకు మధ్య ఉన్న సంధియుగ స్థితిని గౌతమి చెప్పినందుకు ‘సంధ్యాగౌతమి’ అను పేరు సార్ధకమవుతోందని లక్ష్మీనరసింహారావు భావం.
3. రసచర్చ:
ఈ కావ్యం ఒక కథను ఆధారంగా చేసుకొని వ్రాసింది కాదు. అందుచే ఇందులో రసం పోషించు బడలేదు. అక్కడక్కడ అద్భుత రసం కనిపిస్తోంది.
అద్భుత రసం:
గోదావరిమాత కవికి కనిపించిన సందర్భంలో అద్భుతరసం వర్ణింపబడింది.
‘‘నిండు జాబిలి వెన్నెల వెల్లు దశ దిశాం
తరముల నిండిన కరణి దోఁచె
మందార భూజ నిష్యంద మధుర సస్ర
వంతికా వింశదమై వింత గూర్చెఁ
గనుదోయి పండువై కళ్యాణ కరమైన
పసిడి కొండను బోలి పరిఢ విల్లె
నభ్రాపగా శీతలాంబువుల్ నా, శ్వేత
మై విశ్వసుందరమై యొసంగె
మనసు, బుద్దియున్ రెండు నాయనుపమాన
తేజమున మున్గిపోయె, నాదేవి విపుల
రూప సౌందర్యము నుతింపనోపునె? యొక
ప్రాకృతిక మర్త్యఁడది రసాభాస గాక
అని గోదావరిని అద్భుతంగా వర్ణించారు.
4. పూర్వకవుల స్మరణ:
ఆంధ్ర రాజ్య రమకు నభ్యుదయము గూర్ప,
నష్ట దిగ్గజముల నాదరించి,
వారిచేఁ గృతులను వ్రాయించి, కృష్ణరా
యలు దెలుంగుఁగైఁత నిలిపే దిశల
అలసాని కవిరాజు నల్లిక, జిగి బిగి
క్రొందడవులు సమకూర్చు కొనుచు
ముకు తిమ్మనార్యుని ముద్దు పల్కులు ఠీవి
చిత్రాంబరములు రచించు కొనుచు
రామ భూషణల శ్లేష రమణీయ పదజాల
సుర శిరోరత్నాల సొగసు గనుచు
నల తెనాలి కవి నవ్యార్ధ వైభవముల
పసుపుఁ గుంకుమ శోభపాదుకొనుచు
రుద్రకవియు, నయ్యలరాజు, భద్రకరులు
తక్కిన కవీంద్రులిడిన యుదార సుకృతి
పారిజాతాలతో నపూర్వ ప్రభావ
మంది కొన్నది యాంధ్ర కావ్యంబు జాక్షి
శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజ కవులను స్మరించారు. ఇంకా రాజ రాజేంద్రుడు, నన్నయ, తిక్కన, శ్రీనాధ మొదలైన కవులను స్మరించారు.
5. వర్ణనలు:
ఈ కావ్యంలో అక్కడక్కడ చిన్న చిన్న దోషాలు ఉన్నాయి.
- చంద్రోదయ, చంద్రాస్తమయాల మధ్య కారుచీకట్లు ఉదయించినట్లు వర్ణించడం:
‘‘మంది రోజ్జ్వల దీపికా మణుల పొంత
గపటచిత్తుల పోల్కిఁ జీకట్ల జంకె
జీవన సుఖోప భోగతుష్టిని ఘటింపఁ
గను ద్వితీయ యామంబు డాసెను ధరిత్రి’’
అని చంద్రోదయ, చంద్రాస్తమయాల మధ్య చీకట్లు ఉదయించినట్లు వర్ణించారు. అది అనౌచిత్య వర్ణన.
- గంగా గోదావరి పుట్టుకలను మిశ్రీకరించుట:
‘‘కవివత్సా! పరమేష్టి సత్కలస భాగం బందుఁ దొత్త వి
ష్ణువు పాదమ్మునఁ బిమ్మట న్జననమై, శోభన్మహాదేవు సం
స్తవనీ యోన్నత మౌళిపై నిలచి, మర్త్యవ్రాతముంబ్రోవ, శై
లవతంసంబు, హిమాద్రిఁబుట్టితి, శివారాద్యను రూపంబగన్’’
బ్రహ్మదేవుని కలశంలో ముందుగా జన్మించి, తరువాత విషపాదోద్భుతనై, మహేశుని శిరస్సుపై నిలచి, మనుషులను కరుణించటానికి హిమగిరినందు పుట్టాను అని గంగానది పుట్టుక గూర్చి చెప్పారు. ఆ వెంటనే-
‘‘గోహత్యా పాతక బా
ధాహరణము గోరి నన్నుఁ దపమున, విశ్వ
స్నేహార్దుడు ముని గౌతముఁ
డే హితకారిణిగ నవతరింపంగ జేసెన్’’
గౌతముడు తన గోహత్యా పాపనివారణకు, నన్నుఁ జగద్ధితకారిణిగ అవతరింపజేశాడని గంగా, గోదావరి పుట్టుకలను కలిపి చెప్పారు.
6. ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ రచనగా పేర్కొనడం:
‘‘ఘనత సంస్కృత సిద్ధాంత కౌముదిఁగని
యాంధ్రశబ్ధ చింతామణి యనఁదెనుంగు
లక్షణము వ్రాసెఁ దెలుగు బొలాన నుడుల
మోసు లెత్తించె వాగను శాసనుండు’’
అని ఆంధ్రశబ్దచింతామణి నన్నయ వ్రాసినట్లుగా కవి వ్రాసారు. కాని చరిత్ర ఆధారాలు లేవు. ఇలాంటి చిన్న దోషాలు ఈ కావ్యంలో ఉన్నాయి.
7. ఉపయుక్తగ్రంథసూచి:
- అప్పకవి, కాకనూరి. అప్పకవీయము. వావిళ్ల ప్రచురణ, 1966
- స్ఫూర్తిశ్రీ, చంద్రలోక సమున్మేషము. శ్రీ వెంకటేశ్వర ప్రింటర్స్, మద్రాస్, 1983
- అనంతామాత్యుడు. శ్రీరామశర్మ, చిర్రావూరి (వ్యాఖ్యాత). ఛందోదర్పణము. రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి, 1996
- సంపత్కుమారాచార్యులు, కోవెల. తెలుగు ఛందోవికాసము. తెలుగు అకాడమీ, హైదరాబాద్, 1990
- చిన్మయ బ్రహ్మకవి, చేబోలు. సంధ్యాగౌతమి. రాజమండ్రి, 1983
- చిన్మయ బ్రహ్మకవి, చేబోలు. స్వీయ చరిత్ర. రాజమండ్రి, 1983
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

