headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-11 | October 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

14. దేవులపల్లి కృష్ణమూర్తి: తెలుగు సామెతల పుట్ట

(ఔచిత్యమ్ - పరిశోధనవ్యాసరచన పోటీలు-2023లో బహుమతి పొందిన పరిశోధన వ్యాసం)

జాగర్ల మహేందర్

పరిశోధకులు, తెలుగుశాఖ,
ఉస్మానియా విశ్వవిద్యాలయం,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 8008252967, Email: jmrhcu143@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం

ఈ పరిశోధనా వ్యాసం  20వ శతాబ్దపు ప్రముఖ తెలంగాణ పల్లె రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి రచనలలో సామెతల  వినియోగాన్ని విశ్లేషిస్తుంది. ఊహాత్మక చిత్రణల నుంచి వాస్తవికతకు మళ్ళిన సాహిత్య ధోరణిలో కృష్ణమూర్తి కృషి, ఆయన అక్షరసేద్యంలో గ్రామీణ జీవనం, శ్రమజీవుల బతుకుచిత్రం ఎలా ప్రతిబింబించాయో శీర్షిక "తెలుగు సామెతల పుట్ట" సమర్థిస్తుంది. సామెతల పుట్టుపూర్వోత్తరాలపై విలియం కార్, సి.పి. బ్రౌన్ వంటి పూర్వ పరిశోధకుల కృషి, సంపత్ రాఘవాచారి, చిలుకూరి నారాయణరావు, బిరుదురాజు రామరాజు వంటి విద్వాంసులు వాటిని నిర్వచించిన తీరు వివరంగా చర్చించారు. ఈ అధ్యయనానికి ప్రాథమిక ఆధారాలు దేవులపల్లి కృష్ణమూర్తి కథలగూడు, తారుమారు, యక్షగానం కథలు, ఊరువాడ బ్రతుకు, బయటి గుడిసెలు, మూడుముక్కలాట నవలలు, మా యాత్ర అనే గ్రంథాలు. ఇందులో తొంభైకి పైగా సామెతలను సేకరించారు. ద్వితీయ ఆధారాలుగా సామెతలు, జానపదసాహిత్యంపై వివిధ గ్రంథాలు విశ్లేషణకు ఉపయోగించారు. ఈ పరిశోధన దేవులపల్లి రచనలలో సామెతల వినియోగం, వాటి వర్గీకరణ (కుటుంబ, వ్యవసాయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాలు), భాషా స్వరూపంలో సంభవించిన మార్పులను విశ్లేషిస్తుంది. ముఖ్యంగా పదాది, పదమధ్య, పదాంత స్థానాలలో అచ్చు, హల్లు మార్పులను గుర్తించారు. తెలుగు సామెతలు ఇతర ప్రాంతాలలోని తెలుగు ప్రజల వ్యవహారంలో (తమిళనాడు ఉదాహరణలతో సహా) వాక్యనిర్మాణం, పదాలు, అర్థాలలో ఎలా వ్యత్యాసం చెందాయో పరిశీలించారు. ఈ పరిశోధన దేవులపల్లి కృష్ణమూర్తి సాహిత్యానికి, జానపద భాషాధ్యయనానికి విలువైన అంతర్దృష్టులను అందిస్తూ, గ్రామీణ ప్రజాజీవితం సామెతల ద్వారా ఎలా జీవం పోసుకుందో వెల్లడిస్తుంది. క్షేత్ర స్థాయి పరిశీలనలు నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఇతర ప్రాంతాల సామెతల మార్పులపై చేసిన విశ్లేషణ ఆ దిశగా చేసిన అధ్యయనానికి నిదర్శనం. భవిష్యత్ పరిశోధనలకు ఇది ఒక ప్రేరణగా నిలుస్తుంది.

Keywords: దేవులపల్లి కృష్ణమూర్తి, సామెతలు, తెలుగు సాహిత్యం, జానపద సాహిత్యం, భాషా విశ్లేషణ, మాండలికం, తెలంగాణ

1. పరిచయం

20వ శతాబ్దం ముందు వరకు సాహిత్యంలో రచయితలు కొంతవరకు అసలైన ప్రజా జీవితాన్ని విడిచిపెట్టి, ఊహాత్మక మానవ సంబంధాలను చిత్రించారు. అది అలానే కొనసాగింది. ఇప్పటి రచయితలు మాత్రం దీనికి భిన్నంగా సామాజిక, జీవిత వాస్తవికత అంశాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి రచనలు చేస్తున్నారు. అలాంటివారిలో దేవులపల్లి కృష్ణమూర్తి ఒకరు. పెద్ద నరసింహ, రాములమ్మల చివరి నాలుగో సంతానం దేవులపల్లి కృష్ణమూర్తి. సూర్యాపేట జిల్లా, అనంతారం గ్రామంలో 1940 జులై 14న ఆయన పుట్టారు. వృత్తిరీత్యా రెవిన్యూ డిపార్ట్మెంట్లో తహసిల్దార్ అయినా, ప్రవృత్తిగా తెలుగు సాహిత్యంలో అక్షర సేద్యం చేశారు. ఆయన దృష్టి సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం వైపు మళ్ళింది. ఇవే ఆయనను తెలుగు సాహితీ లోకానికి పరిచయం చేశాయి. ఆయన రచనలలో సామెతలు, జాతీయాలు, మాండలిక పద సంపద సమృద్ధిగా ఉన్నాయి. తన రచనలలో గ్రామీణ ప్రజల జీవన వాస్తవిక చిత్రాన్ని దర్శింపజేయడం ఆయన ప్రత్యేకత. ఆయన అచ్చమైన తెలంగాణ పల్లె రచయిత. తానే వస్తువుగా, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పాత్రలుగా చేసుకుని, వాస్తవిక ఇతివృత్తాన్ని సృష్టించడంలో ఆయన ఒక కొత్త దృక్పథాన్ని అనుసరించారు. సమాజ జీవనాన్ని ప్రతిబింబిస్తూ, శ్రమజీవుల ఉత్పత్తి సంబంధాలు, ఈ దేశ సామాజిక సంబంధాలు ఇతివృత్తాలుగా పల్లె ప్రజల జీవన చిత్రాన్ని ఆయన రచనలలో ఆవిష్కరించారు.

2. సామెతల చరిత్ర

తెలుగులో 1869లో సామెతలను మొట్టమొదటిసారి సేకరించినవారు విలియం కార్. ఆయన ఎంతో శ్రమించి మనకు అందించారు. వీటిని హౌస్ ఓల్డ్ వర్డ్స్, పీపుల్స్ వర్డ్స్ గా పేర్కొన్నారు. ఆ తర్వాతి కాలంలో సి.పి. బ్రౌన్ కృషిచేసి చాలా సామెతలను సేకరించి తెలుగు ప్రజలకు అందించారు. వాటిని ప్రజలు నిత్యజీవితంలో వినియోగిస్తూనే ఉన్నారు. సామెతలను సృష్టించిన కర్తలను తెలపడం కష్టతరమైన పని. పూర్వం నుండి ప్రజల అనుభవంలో ఏ సమయంలో, ఏ అజ్ఞాత వ్యక్తి ఉచ్చరించిన భావము సామెత కావచ్చు. తెలుగు భాష, సాహిత్యంలో విలీనమైన సామెతల గురించి పలువురు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సంపత్ రాఘవాచారి "సామెత అనగా జన వ్యవహారక్షుణ్ణమైన ఉక్తి" అని తెలిపారు.

లక్షలాదిగా ఉండే సామెతల్లో ఒక లక్ష సామెతలు సేకరించడానికి పూనుకొని వేల సామెతలను సేకరించి చిలుకూరి నారాయణరావు ప్రచురించారు. ఆయన ఇలా అన్నారు:

"సామెత అనగా సామ్యం అసాధు రూపం. సామ్యం అంటే పోలిక. ఒక వస్తువును వేరొక వస్తువుతో పోల్చి చెప్పేదే సామెత."

దీని ద్వారా సామెత అనేది సామ్యతకు మారు రూపమని తెలుస్తుంది. రామరాజు బిరుదురాజు "సామెత జీవిత అనుభవం సూత్రప్రాయ నగ్న స్వరూపం" అని భావించారు. ఇలా చాలా మంది వారి అభిప్రాయాలు వెలువరించారు.

3. సామెతలు పుట్టుక

తెలుగు భాషలో, జానపద సాహిత్యంలో ఒక భాగమైన సామెతలను ప్రతి మనిషి తన జీవనంలో, ఏదో ఒక సందర్భంలో ఉపయోగించడం జరుగుతుంది. అలా ప్రజలలో ప్రాచుర్యం పొంది ఒకరి నుంచి మరొకరికి ప్రచారం జరిగి జన వ్యవహారంలో సామెతలుగా రూపొందినవి. డా. సుందరం ఆర్వీయస్ ఇలా అన్నారు:

"ఆదిమానవుడు తన సుఖదుఃఖాలను వ్యక్తపరచడానికి, అనుభవాలు ఎదుటివారికి తెలియజేయడానికి గీతాలను, కథలను, సామెతలను ఉపయోగించాడు. ప్రతిభాశక్తి, కల్పనాసక్తి ఉన్న అతి ప్రాచీన మానవుడే వాటిని సృష్టించాడు అనడంలో సందేహం లేదు."

దీని ద్వారా సామెతలు పుట్టుపూర్వోత్తరాలు అతి ప్రాచీనమైనవి అని తెలుస్తుంది. మన ప్రాచీన మత గ్రంథాలలో కూడా ఎన్నో సామెతలున్నాయి. సామెతలను సృష్టించింది అజ్ఞాత వ్యక్తులే అనే భావన ఉంది.

4. ప్రజల వాడుకలో సామెతలు

ఒక వ్యక్తి తన భావాన్ని తెలియజేయడానికి వాక్య రూపంలో సామెతలను ఉపయోగిస్తాడు. సమాజంలో సామెత అంటే పోలిక అని స్థూలంగా ప్రజలు భావిస్తారు. అందుకే దీనిని ఇతర భాషల్లో ఆంగ్లంలో Proverb, సంస్కృతంలో లోకోక్తి, ద్రావిడ భాషలైన కన్నడలో గాదె, నాణ్ణుడి, సామితె, తమిళంలో పళమొలి, మలయాళంలో పళచొల్లు అనే పేరుతో పిలుస్తారు. తెలుగులో సుద్దులు, జనశ్రుతులు, నానుడి, జనవాదము సామెతకు సమానార్థకాలుగా వాడుతున్నారు.

5. దేవులపల్లి కృష్ణమూర్తి రచనలలో సామెతలు

కృష్ణమూర్తి రచించిన కథలగూడు, తారుమారు, యక్షగానం అనే కథలు, ఊరువాడ బ్రతుకు, బయటి గుడిసెలు, మూడుముక్కలాట అనే నవలలు, మా యాత్ర అనే రచనల్లో తొంభైకి పైగా సామెతలను ప్రయోగించారు. ప్రజలు ఉచ్చరించిన విధంగానే వారి రచనలలో పొందుపరిచారు. ఇందులో కుటుంబ జీవనం, వ్యవసాయం, మోటు, సరస, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన సామెతలు ఉన్నాయి. వీటిని భాషాపరంగా చూస్తే చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

  1. అవిటి వానికి అబ్బింది విద్య (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 21)
  2. అంగట్లో అన్ని వున్నాయిగాని అల్లునినోట్లో శని (కృష్ణమూర్తి, మాయాత్ర 5)
  3. అయ్యో అంటే ఆరు నెలల పాపం (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 118)
  4. అటిటు మంచం మోసేటాల్లకు తెల్లారిపాయే (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 136)
  5. అయ్యోరి పెళ్లికి జుట్టు కాణించి అరువే (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 139)
  6. ఆకలి బాధ అన్ని పనులు చేయిస్తది (కృష్ణమూర్తి, కథలగూడు 80)
  7. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే బాబతు (కృష్ణమూర్తి, తారుమారు 90)
  8. ఆడది చెడి అందలమెక్కి మొగోడు చెడి మొద్దులుకొట్టే (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 128)
  9. ఇండ్లు కాలి వాళ్లేడుస్తుంటే మీ గొలేందండి (కృష్ణమూర్తి, కథలగూడు 70)
  10. ఉగ్గం తప్పితే మగ్గం (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 18)
  11. ఉల్లి మల్లి కాదు ఉంచుకున్నది పెళ్ళాం కాదు (కృష్ణమూర్తి, తారుమారు 16)
  12. ఉత్తుత్తి పుట్నాలు మూడు కుప్పలు పెట్టినట్లు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 31)
  13. ఊరినిండా అప్పులు తలనిండా బొప్పలు (కృష్ణమూర్తి, తారుమారు 118)
  14. ఎక్కినోందే గుర్రం ఏలినొందే రాజ్యం (కృష్ణమూర్తి, కథలగూడు 82)
  15. ఎంత ప్రాప్తం ఉంటే అంత (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 62)
  16. ఎంగిలికెగ్గులేదు తాగుబోతుకు సిగ్గులేదు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 111)
  17. ఎగిరెటోనికి సిగ్గులేకుండా చూసేటోనికి సిగ్గుండాలి (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 101)
  18. ఒంటె పెదాలకు నక్కెదురు చూసినట్లు (కృష్ణమూర్తి, యక్షగానం 98)
  19. ఒక్క దమ్ము తాగుతనని లొట్టికి బొట్టు పెట్టిటోళ్ళు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 26)
  20. కడుపు కట్టుకొని కూడ బెట్టిండు (కృష్ణమూర్తి, తారుమారు 18)
  21. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డదనీ (కృష్ణమూర్తి, కథలగూడు 61)
  22. కట్టే ఇరగదు పాము చావదు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 50)
  23. కోడిగుడ్డంత కొవ్వు ఉంచుకొని పోవాలనేది (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 34)
  24. కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్లు (కృష్ణమూర్తి, యక్షగానం 90)
  25. కాయబట్టి తెల్లధోతి కరక్కాయ రంగుగా (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 47)
  26. కూటి కోసం కోటి విద్యలు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 82)
  27. కూటి కొరకు కోటి వేషాలు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 88)
  28. గజం మిధ్య పలాయనం మిధ్య లాగయింది (కృష్ణమూర్తి, యక్షగానం 98)
  29. గాచారం తప్పి గడీలకు పోతే ఆచారం తప్పక అణగబెట్టిండ్రట (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 108)
  30. గాలికి పోయే పేలపు పిండి కృష్ణార్పణం (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 100)
  31. గుడ్డి కొంగకు కొర్ర మట్ట దొరికినట్లు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 24)
  32. చర్ల బర్రె కొమ్ములు చూసి బేరమాడినట్లు (కృష్ణమూర్తి, యక్షగానం 110)
  33. చాలిచాలని సంసారం చచ్చేదాకా దుఃఖం (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 11)
  34. చీర వూడిందాక సిగముగోద్దమ్మో (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 19)
  35. టైం వస్తే గుర్రం కూడా ఎగురుద్ది (కృష్ణమూర్తి, యక్షగానం 46)
  36. తప్పుదారిన పోతే కడుపోస్తది (కృష్ణమూర్తి, కథలగూడు 80)
  37. తీగ లాగితే డొంక బయటపడ్డది (కృష్ణమూర్తి, తారుమారు 27)
  38. తినకుండా రుచి దిగకుండా లోతు (కృష్ణమూర్తి, తారుమారు 67)
  39. తెలిసి తెలిసి బొందలబడ్డట్టు (కృష్ణమూర్తి, యక్షగానం 138)
  40. తీటలేసి తీర్థం పోయినట్లు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 49)
  41. తీరకుంట చేస్తే చాలకుంటాయే (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 12)
  42. తీయటి మాటలకు తీర్థం పోతే వాడు గుల్లే వీడు గుల్లే (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 50)
  43. తల్లికి దంచ దొరికితే బిడ్డకు బుక్క దొరుకుతుంది (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 50)
  44. తిండి పుష్టి ఉండటం వలన కండపుష్టి (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 83)
  45. దగ్గరకు రానిస్తే వచ్చి నెత్తిన కుర్చుంటరు (కృష్ణమూర్తి, తారుమారు 92)
  46. దరిద్రం నెత్తిన కూర్చుంటే ఎవడేం చేస్తడు (కృష్ణమూర్తి, కథలగూడు 92)
  47. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు (కృష్ణమూర్తి, కథలగూడు 30)
  48. ధైర్యం దండిది చెయ్యి మొండిది (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 49)
  49. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు (కృష్ణమూర్తి, యక్షగానం 15)
  50. దొంగలకు సద్దులు మోస్తుండురా (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 39)
  51. దొరలయవుసం బడుగులపాడు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 42)
  52. నావికాడ చల్లబడితే నవాబు కాడ జవాబు ఇయ్యొచ్చు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 19)
  53. నోటికాడికి వచ్చిన బువ్వ చేజారిపోయింది. (కృష్ణమూర్తి, కథలగూడు 7)
  54. నెత్తిన రూపాయి పెట్టి పాట పాడితే పావులాకు కుడా ఎవరూ పాడారు (కృష్ణమూర్తి, తారుమారు 67)
  55. పగటి ముచ్చట్లు పనిచేటు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 22)
  56. పనిలేని మనిషి ఏదో పనిలో పడ్డట్టు (కృష్ణమూర్తి, కథలగూడు 112)
  57. పట్టిందల్లా బంగారం ముట్టిందల్లా ముత్యమైంది (కృష్ణమూర్తి, తారుమారు 37)
  58. పెళ్లయిన ఇంట్లో ఆరు నెలలు కరువు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 35)
  59. పేరు పెరుమాళ్లది ఆరగింపు అయ్యవార్లది (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 16)
  60. పుర్రెకో బుద్ధి జివ్వకో రుచి (కృష్ణమూర్తి, తారుమారు 18)
  61. పుస్తక జ్ఞానమే తప్ప లోకజ్ఞానం లేకపాయే (కృష్ణమూర్తి, యక్షగానం 128)
  62. పుబ్బలో పుట్టెడలుకుతే అడ్డెడైతయన్నట్టు వుండే (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 59)
  63. పొట్టకు బట్టకు దెంవులట (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 11)
  64. పొద్దుమాపు తానం ఒంటిపూట భోజనం (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 35)
  65. పోచమ్మ కూడబెడితే మైసమ్మ మాయం చేసినట్లు (కృష్ణమూర్తి, మాయాత్ర 37)
  66. ఫలహారమల్లో అంటే నాకింత నాకింత (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 23)
  67. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు (కృష్ణమూర్తి, తారుమారు 13)
  68. బొత్తిగా లంజేగాదు తెల్లారంది ఇంటికిరాదు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 33)
  69. మాటలతోనే కోటలు కడుతున్నావ్ (కృష్ణమూర్తి, యక్షగానం 122)
  70. ముడితేనే పాయేరా ముసలోని పానం (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 35)
  71. మింగమెతుకు లేదు మీసాలకు సంపెంగనూనె (కృష్ణమూర్తి, తారుమారు 121)
  72. మొక్కై వంగంది మానై వంగుద్దా (కృష్ణమూర్తి, యక్షగానం 117)
  73. రాత్రి ముచ్చట్లు నిద్రచేటు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 22)
  74. రాములోరి పెళ్లికి ఊరంతా పండుగే (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 23)
  75. రోషానికి పోయి రోలు మెడకు కట్టుకున్నట్లు అయింది (కృష్ణమూర్తి, తారుమారు 70)
  76. లంజ సస్తెంది మంచం విరిగితెంది (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 49)
  77. లంజను నమ్ముకుంటే వల్లుగుల్లాయే (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 73)
  78. లేనివాడు లేక ఏడిస్తే ఉన్నోడు తినలేక ఏడ్చిండట (కృష్ణమూర్తి, తారుమారు 18)
  79. వచ్చిందే దక్కిందని బుక్కిండ్రు (కృష్ణమూర్తి, యక్షగానం 92)
  80. వండిన కుండాగదు వంగిన పొద్దుగదు (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 36)
  81. వండని కూడు వడకని బట్ట (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 47)
  82. విఘ్నేశ్వరుడి పెళ్లికి వేయి విగ్నాలనట్లు (కృష్ణమూర్తి, తారుమారు 42)
  83. వురికురికి పసులకాస్తే పొద్దుగూకద (కృష్ణమూర్తి, యక్షగానం 113)
  84. వెన్న తిన్నవాడు వెళ్లిపోగా చల్ల తాగిన వాడిని చావబాదిండ్రు (కృష్ణమూర్తి, తారుమారు 27)
  85. వెంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చినట్లు అయింది (కృష్ణమూర్తి, తారుమారు 27)
  86. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు (కృష్ణమూర్తి, తారుమారు 118)
  87. శునుకం చెప్పే బల్లికుడితి తొట్టెలో పడ్డట్లు (కృష్ణమూర్తి, తారుమారు 22)
  88. సన్నాసులు సన్నాసులు రాసుకుంటే బూడిదే (కృష్ణమూర్తి, ఊరు వాడ బ్రతుకు 104)
  89. హంసను చూసి కాకి కులికి కులికి నడిచిందట (కృష్ణమూర్తి, తారుమారు 68)
  90. హళ్లికి హళ్లి పూజకు పూజ (కృష్ణమూర్తి, యక్షగానం 98)

6. భాషా స్వరూపం

దేవులపల్లి కృష్ణమూర్తి రచనలలో ఉపయోగించిన సామెతలలోని భాషా స్వరూప మార్పులను ఈ విభాగంలో చర్చిస్తారు. ప్రధానంగా పదాది, పదమధ్య, పదాంతంలో జరిగిన అచ్చు, హల్లు మార్పులను ఇక్కడ పేర్కొనడం జరిగింది. 

6.1. పదాది అచ్చులలో మార్పు

  • ఏ > అ గా మార్పు చెందుట: ‘చర్ల బర్రెకొమ్ములు’ (చేర్ల – చర్ల)
  • ఒ > అ గా మార్పు చెందుట: ‘నమ్ముకుంటే వల్లుగుల్లాయే’ (ఒల్లు – వల్లు)
  • ఎ > ఆ గా మార్పు చెందుట: ‘యాడికుందిలేమ్మా’ (ఎడి – యాడి)

6.2. పదమధ్య అచ్చులలో మార్పు

  • ఆ > ఓ గా మార్పు చెందుట: ‘చూసేటోనికి’ (టోని - వాని – చూసేటోనికి)

6.3. పదాది హల్లు మార్పు

  • గ > క గా మార్పు చెందుట: మానిన గాయాన్ని కెలికినట్లు
  • ప > బ గా మార్పు చెందుట: కడుపు కట్టుకొని కూడబెట్టిండు
  • తెలిసి తెలిసి బొందలబడ్డట్టు
  • స్నా > త గా మార్పు చెందుట: పొద్దుమాపు తానం ఒంటిపూట భోజనం
  • చ > స గా మార్పు చెందుట: లంజ సస్తేంది మంచం విరిగితేంది

6.4. పదమధ్య హల్లు మార్పు

  • క > గ గా మార్పు చెందుట: దిక్కులేని చావు చచ్చేగదా
  • బొత్తిగా లంజేగాదు తెల్లారంది ఇంటికి రాదు
  • ప > బ గా మార్పు చెందుట: నాబికాడ చల్లబడితే నవాబుకాడ జవాబు ఇయ్యొచ్చు
  • గాచారం తప్పి గడీలకు పోతే ఆచారం తప్పక అణగబెట్టిండ్రట
  • పోచమ్మ కూడబెడితే మైసమ్మ మాయం చేసినట్లు
  • డ > న గా మార్పు చెందుట: అంగట్లో అన్ని వున్నాయిగాని అల్లునినోట్లో శని

6.5. పదాంత హల్లు మార్పు

  • ణ > న గా మార్పు చెందుట: ముడితేనే పాయేరా ముసలోని పానం
  • ల > డ గా మార్పు చెందుట: దొరలయవుసం బడుగులపాడు

6.6. పదాది హల్లు అచ్చుగా మార్పు

  • వ > ఇ గా మార్పు చెందుట: కట్టే ఇరగదు పాము చావదు

7. ఇతర ప్రాంతాలలో తెలుగు సామెతల మార్పు

తెలుగు ప్రజలు ఇతర ప్రాంతాలలో నివసిస్తూ వారి మాతృభాషా మూలాలు, సంస్కృతి, సంప్రదాయాలు కోల్పోకుండా వారి జీవనంలో అన్నిటిని పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే సామెతలను ఉపయోగిస్తున్నారు. వారి ఉపయోగంలో చాలా పదాలు భాషా మార్పులకు గురికావడం జరుగుతుంది. తమిళనాడులో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఉపయోగించే తెలుగు సామెతలను ఈ కింది పట్టికలో చూడవచ్చు.

తెలుగు ప్రాంతం

ఇతర ప్రాంతం

మార్పు

మింగమెతుకు లేదు మీసాలకు సంపెంగనూనె

ఆలూలే సూలులే మీసాలకి సంపెంగనూనె

అర్థంలో భేదం

కట్టే ఇరగదు పాము చావదు

పాము సాయికూడదు కట్టే యిరకూడదు

పదాల మార్పు

లేనివాడు లేక ఏడిస్తే ఉన్నోడు తినలేక ఏడ్చిండట

ఆవోడు ఆవుకు ఏడిస్తే మావోడు కొవ్వుకి ఎడ్చినంటా

అర్థంలో భేదం

అంగట్లో అన్ని వున్నాయిగాని అల్లునినోట్లో శని

అంగడి మిద కన్ను అత్తకూతురి మింద చూపు

అర్థంలో భేదం

ఎగిరెటోనికి సిగ్గులేకుండా చూసేటోనికి సిగ్గుండాలి

చెప్పే వాడికి బుద్ధి లేకుంటేను వినేవాడికి బుద్ధుండాల

అర్థంలో భేదం

తప్పుదారిన పోతే కడుపోస్తది

ఆ పొద్దు కడుపు పుట్టింది ఈ పొద్దు ఇల్లుపట్టేల్డా

అర్థంలో భేదం

ఊరినిండా అప్పులు తలనిండా బొప్పలు

అప్పు చేసి పప్పు కూడు తిను

పదాల మార్పు

రాములోరి పెళ్లికి ఊరంతా పండుగే

దేవుని పెళ్ళికి అందరూ చుట్టాలే

వాక్య నిర్మాణంలో మార్పు

కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డదనీ

కడుపు చిన్నది కండ్లు పెద్దవి

అర్థంలో భేదం

పేరు పెరుమాళ్లది ఆరగింపు అయ్యవార్లది

దేవుడోచ్చిన సంబురముల దేవునికి తినేది మరిచిరంట

వాక్య నిర్మాణంలో మార్పు

లంజను నమ్ముకుంటే వల్లుగుల్లాయే

దొంగ పెండ్లాము ఎబుడుముండే

పదాల మార్పు

ఏడ్చే దాని మొగుడోస్తే నా మొగుడోస్తడు

లంజకి ఎబుడు మిండగాళ్ళ సింత

పదాల మార్పు

రెండు ప్రాంతాల సామెతలు పరిశీలిస్తే, వాక్య నిర్మాణం, పద మార్పు, అర్థం పరంగా వ్యత్యాసం కనబడుతుంది.

ఉపసంహారం

తెలుగు సాహిత్యంలో సామెతల ప్రస్తావన, సాహిత్యకారులు చేసిన కృషి, తెలుగు రచయితలు సామెతను నిర్వచించి, వారు తెల్పిన అభిప్రాయాలను తెలియజేశాను. సామెతల ఆవిర్భావంలో సామెతలు పుట్టుకను, దాని ప్రాచీనతను ఆధారాలతో నిర్వచించడం జరిగింది. జన వ్యవహారంలో సామెతలలో భారతీయ భాషలలో సామెతలను ఎలా వాడుతున్నారో తెలియజేస్తూ వాటి లక్షణాలను తెలపడం జరిగింది. దేవులపల్లి కృష్ణమూర్తి ప్రయోగించిన సామెతలలో దేవులపల్లి కృష్ణమూర్తి రచించిన తెలుగు సాహిత్య ప్రక్రియలలో తాను ప్రయోగించిన సామెతలను అకారాది క్రమంలో పేర్కొనడం జరిగింది. భాష స్వరూపంలో తన రచనల్లో ఉపయోగించిన సామెతల్లోని భాష స్వరూప మార్పులను చర్చించడం జరిగింది. ప్రధానంగా పదాది, పదమధ్య, పదాంతంలో జరిగిన అచ్చు, హల్లు మార్పులను పేర్కొన్నాను. తెలుగు సామెతలు ఇతర ప్రాంత ప్రజల వ్యవహరంలో మార్పులలో ప్రధానంగా తమిళనాడులో నివసిస్తున్న తెలుగు ప్రజల జనవ్యవహారంలో ఉన్న సామెతలను పేర్కొంటూ తెలుగు, తమిళనాడు ప్రాంతాల భేదాలను గమనించడం జరిగింది.

  • ఈ పరిశోధన దేవులపల్లి కృష్ణమూర్తి రచనలలో సామెతల వినియోగాన్ని విశ్లేషించింది;
  • సామెతలు పుట్టుక, ప్రాచీనత, వాటి నిర్వచనాలు చర్చించబడ్డాయి;
  • కృష్ణమూర్తి సాహిత్య ప్రక్రియల నుండి తొంభైకి పైగా సామెతలను సంకలనం చేసింది;
  • సామెతల భాషాస్వరూపంలోని మార్పులను (అచ్చు, హల్లు మార్పులు) వివరించింది;
  • తమిళనాడులోని తెలుగు ప్రజలు ఉపయోగించే సామెతలలో గల భాషా భేదాలను, అర్థ వ్యత్యాసాలను పట్టిక రూపంలో ప్రదర్శించింది.

ఉపయుక్త గ్రంథసూచి

  1. కృష్ణమూర్తి, దేవులపల్లి. (2009). ఊరు వాడ బ్రతుకు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్.
  2. పైదే. (2012). కథలగూడు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్.
  3. పైదే. (2012). మాయాత్ర. హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్.
  4. పైదే. (2013). బయటి గుడిసెలు. డికె ప్రచురణలు, హైదరాబాద్.
  5. పైదే. (2014). తారుమారు. డికె ప్రచురణలు, హైదరాబాద్.
  6. పైదే. (2016). యక్షగానం. డికె ప్రచురణలు, హైదరాబాద్.
  7. పైదే. (2017). మూడుముక్కలాట. డికె ప్రచురణలు, హైదరాబాద్.
  8. వసంత్, అంగరం. (2017). హోసూరు కతలు సామెతల సప్పరము. హిమలయ గ్రాఫిక్స్, హైదరాబాద్.
  9. వెంకటేశ్వరరావు, మైథిలి. (2011). సంపూర్ణ తెలుగు సామెతలు. జెపి పబ్లికేషన్స్, విజయవాడ.
  10. సత్యనారాయణ, గాజుల. (2012). సామెతలు పొడుపుకథలు. విజయవాడ.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]