headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed

27. జ్ఞానానందకవి "గోల్కొండ" కావ్యం: వస్తువైవిధ్యం - వర్ణనలు

డా. తలారి వాసు

సహాయాచార్యులు, తెలుగుశాఖ,
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం
రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9949294254, Email: vasutalari@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగులో చారిత్రకకావ్యాలు ఎంతో విశిష్టమైనవి. జ్ఞానానందకవి విరచిత "గోల్కొండకావ్యం" ఈ కోవలో గణింపదగ్గది. నవాబుల కాలం నాటి చారిత్రక, రాజకీయ, సాహిత్యపరిస్థితులను పరిచయంచేసి, గోల్కొండ కావ్యంలోని పద్యకవిత్వాన్ని ఈ పరిశోధన విశ్లేషిస్తుంది. ఈ కావ్యంలో వస్తువైవిధ్యాన్ని సోదాహరణంగా ఈ వ్యాసం చర్చిస్తుంది. వస్తువైవిధ్యంతో పాటు కావ్యానికే వన్నెతెచ్చిన వివిధవర్ణనలు, వాటి ప్రత్యేకతలను తగినవిధంగా అనుశీలించడం ఈ వ్యాసపరిధి. మూలగ్రంథం, వివిధ చరిత్ర, సాహిత్యచరిత్రలు, వ్యాసాలు ఈ పరిశోధనకు ఆకరగ్రంథాలు.

Keywords: గోల్కొండ, చారిత్రకకావ్యాలు, వర్ణనలు, వస్తువైవిధ్యం, తలారి వాసు

1. ఉపోద్ఘాతం:

దక్షిణ భారతంలో ముసల్మానుల ప్రధాన కేంద్రాలలో గోల్కొండ కోట ముఖ్యమైనదిగా చరిత్రలో నిలిచింది. ఇక్కడ తెలుగు మంత్రులు తమ రాజనీతిని కనపరిచి రాజచక్రాన్ని తిప్పారు. తెలుగు కవుల గానాలతో, సంగీతంతో రాతి గోడలు సైతం పులకించాయి. రామదాసు లాంటి భక్తాగ్రేసరుని పాదస్పర్శతో పునీతమయింది.

2. గోల్కొండ నవాబులు:

గోల్కొండ ఎప్పుడు నిర్మాణమైందో  కచ్చితమైన ఆధారాలు లేవు. మొదటిగా ఒక తెలుగు రాజు చిన్న మట్టి కోటను నిర్మించాడని చెబుతారు. 1364లో ఓరుగల్లును కన్నమనాయుడు పాలిస్తున్న రోజుల్లో గోల్కొండ ప్రాంతం బహమనీ సుల్తానుల వశమైంది. బహమనీ రాజ్యపు సుబేదారుడైన కులీ కుతుబ్ షాహి ఇక్కడ స్వతంత్రం ప్రకటించుకుని పరిపాలన చేశాడు.ఆ వంశంలోనే ఐదవవాడైన మహమ్మద్ కులీ కుతుబ్ షాహి తన ప్రియురాలైన భాగమతి (భాగ్యమతి) పేరు మీద భాగ్యనగరం నిర్మించాడని ఒక కథ వాడుకలో ఉంది. తర్వాత కాలంలో మొగలు చక్రవర్తి ప్రతినిధిగా వచ్చిన నిజాముల్ ముల్క్ పరిపాలన కిందికి కోట వచ్చింది. ఇలా ఈ చరిత్రను పరిశీలిస్తే గోల్కొండ గర్భంలో దాదాపు 600 సంవత్సరాల పైన చరిత్ర దాగి ఉంది.

ఈ కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. చరిత్ర గర్భంలో కీర్తి, అపకీర్తి రెండు దాగి ఉన్నాయి. వైభవము ఉంది. పతనము ఉంది. తెలుగు భాషకు సాహిత్యానికి సేవలందించిన కుతుబ్షాహీల కీర్తి ఉంది. ఔరంగజేబుతో కలసి దూరాలోచన చేసిన మీర్ జుమ్లా అపకీర్తి ఉంది. సర్వమత సహిష్ణుతకు పేరుగాంచిన నవరసాలకు కితాబైనా నవాబు తానిషా మతపునిషా తగలని ఔన్నత్యముంది. ఆంధ్రుల కీర్తి పతాకను నిలిపిన అక్కన్న, మాదన్నల మాన్యత నిలచి వెలిగింది. కరుణాపయోనిధి అయిన దాశరధిని కీర్తించి, శతకాన్ని రచించి రామనామ తారక మంత్రంతో సంకీర్తనల నాలపించి రాముని దాసునిగా ధన్యుడైన కంచర్ల గోపన్న భక్తి తరంగాల నాదముంది.

ఎంత గొప్ప కళాఖండమైన, కోట అయినా కాలపురుషుని చేతిలో ఓటమి చవిచూడక తప్పదు. వేలమంది భారతీయుల సుఖ సంతోషాలను నేలరాసి ప్రజల్ని పశువులుగా భావించిన నవాబులు నిత్యం గానా బజానాలతో విలాస జీవితాన్ని గడిపారు. ప్రజలు త్రాగునీటికి కరువై జీవిస్తుంటే ప్రభువులు భోగ కాంతలు పన్నీరులో జలకాలాడారు. ఇదే నేలపై మరో ప్రక్క విజయనగర రాజులు స్వతంత్ర రాజ్యాలు స్థాపించి పరిపాలన సాగించి అక్కడ ప్రజల అవసరాలను తీర్చారు. పంట నీటికై చెరువుల త్రవ్వకానికి ధనం తక్కువైతే రాణుల ఆభరణాలు కరిగించిన చరిత్ర అక్కడ ఉంటే నవాబుల పాలనలో ప్రజల రక్తం పిండి ఉంపుడుగత్తెల పాదాలకి పారాణి దిద్దిన చరిత్ర ఇక్కడ ఉంది. ఈ భూమి తమదని మన మహారాజులు భావించారు. నవాబులు ఇది మనకు భోగ భూమి మాత్రమే అని భావించారు.

ఏదేమైనా స్థల, జల, గిరి, దుర్గాలు వాటి చుట్టూ కొట్టుకున్న వీరగాథలు భారతీయ సంస్కృతి చరిత్రలో వాటి ప్రాధాన్యం విశేషమైంది. కోటలు గుట్టలు కావు. అవి భారతీయ సామాజిక జీవన చరిత్రకు నిధులు. వాటి ఔన్నత్య పతనాలే భారతీయ భావనల ఔన్నత్యపతనాలు కాబట్టి వాటి చరిత్ర మన జాతి చరిత్ర అయింది. ఏ కారణంగా నైనా స్వదేశీ రాజుల మధ్య పోరాటాలు సంభవిస్తే కోట పడిపోవడం ఓటమికి గుర్తుగా కూడా భావించబడింది. కోటను జయించటానికి, కోటను పరిరక్షించడానికి ప్రాణాలు ధార పోసిన ధీరులెందరో కనిపిస్తారు. సామాన్య ప్రజలకు ఈ విషయాలతో పెద్దగా సంబంధం లేదు. వాళ్లు వారి నిత్య నైమిత్తికాది  కార్యక్రమాల్లో ఉండేవారు. కోట వశమవడం మరో పాలకుడు రావటం సాధారణ విషయంగా ఉండేది. స్వదేశీయుల పరస్పర కలహాల సందర్భంలో కూడా మన సాహితి,సాంస్కృతిక వికాసాలకు ఆటంకం కలుగక పోవడానికి కారణం ఇదే. కానీ విదేశీ రాజులు ఎప్పుడైతే ఈ కోటలని పట్టుకోవడం మొదలెట్టారో అప్పటినుండి భారతీయ భాష,సాహిత్య, సాంస్కృతిక ధార్మిక అభ్యుదయానికి అడుగడుగునా అవరోధాలు ఏర్పడ్డాయి. ప్రజా జీవనం స్తంభించి వికాసం మందగించింది. కోటల మధ్య సంఘర్షణ ఉన్నా వికాసం ఆగని పూర్వస్థితిని, వికాసం పూర్తిగా ఆగిపోయి తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి విదేశీయులతో నిరంతరం సంఘర్షించిన  మధ్యయుగాల చరిత్రని నేపథ్యంగా తీసుకొని మనకు ఎన్నో రచనలు వచ్చాయి. ఈ నేపథ్యంతో కవిత్వం, కథలు, నవలలు, వ్యాసాలు  అనేకం సాహిత్య చరిత్రలో కనిపిస్తాయి.ఆంధ్ర ప్రశస్తి,ఆంధ్ర పౌరుషం, దక్షారామ దర్శనం, హంపీ క్షేత్రం వంటి కావ్యాలు గత వైభవ స్మరణం కావించినవే.

3. జ్ఞానానందకవి పద్యకావ్యం

మహోజ్వలమై, మహోన్నతమై, మహనీయమై, కమనీయమై లోకంలో దగద్ధగాయమాన కాంతులతో మిరుమిట్లు గొలిపిన గోల్కొండ పురాతన వైభవ రాశికి ఉదాహృతంగా జీర్ణమై, చూర్ణమై నిలిచి నేటికీ శిథిల రూపాలతో నిలచిన గోల్కొండ కోట కవిలోక విభూషణుడైన సురగాల తిమోతీ జ్ఞానానందకవి (ఎస్టీ. జ్ఞానానందకవి) కనుకొనలలో ఆశ్రు కణాలను నింపింది. కవి హృదయంలో వేదనాభారజ్వాల మాలికలు నాలుకలు చాపాయి. కవి కలం బిగించిన వీణతీగ అయింది. దానిని మీటిన స్వరం గోల్కొండ పద్య కావ్యమైంది. ఆ కావ్యం తెలుగు సరస్వతి మధుర మంజుల మంజీర శింజినీ రవాలుగా ప్రతిధ్వనించింది. తెలుగు పద్య కావ్య సంప్రదాయ సాహిత్యంలో ముప్పది పైబడిన కావ్యాలు రచించిన ఆ మహాకవి సాహిత్య యశస్సును కీర్తించి, చర్చించి, విశ్లేషించి శ్లాఘించటానికి సాహితీ "శరజ్యోత్స్న" ఆకాంక్ష  ఆలంబనమై అనేక సాహితీ వేదికలపై ఆయనకు సాహితీ నీరాజనాన్ని అందించింది.

4. వస్తు వైవిధ్యం

"గోల్కొండ" చారిత్రాత్మకమైన ఖండకావ్యం.ఖండకావ్యంలో విషయ వైవిధ్యం ఉండటం పరిపాటి. ఈ కావ్యంలో అవతరణం, మీర్ జుమ్లా, అక్కన్న మాదన్నలు, తనీషా, రామదాసు అనే ఐదు శీర్షికలున్నాయి. శీర్షికల్లో వస్తు వైవిధ్యం ఉన్నా కథా సూత్రం మాత్రం గోల్కొండ నగరం.ఐదు ఖండికలు గోల్కొండ కోటలో పాగా వేసిన విషయాలు. కాలభేదం కనిపిస్తుంది. ఇది ఒక విశిష్టమైన పద్ధతి. గోల్కొండ సామ్రాజ్యం అవతరించిన వృత్తాంతంతో మొదలై దానికి సంబంధించిన పదోన్నతులు, దాని వికాసానికి, వినాశనానికి కారకులైన వ్యక్తుల స్వరూప స్వభావాలను వివరించింది. గోల్కొండ కావ్యంలో పద్యాలు చదువుతున్నప్పుడు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారి దక్షారామ దర్శనం, కొడాలి వెంకట సుబ్బారావు గారి హంపి క్షేత్రం గుర్తుకొస్తాయి. ఎందుకంటే అవి చారిత్రక పద్య కావ్యాలు. దక్షారామ వైభవాన్ని తెలియపరచి, ఇప్పుడు అక్కడ ఆ వైభవాలు ఏమీ కానరావంటారు  ఇంద్రగంటివారు. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని విశ్లేషించి ఆ వైభవాన్ని నిలబెట్టుకోలేని తెలుగువారి దైన్యాన్ని తెలియజేశారు కొడాలి. ఇందులో కూడా గోల్కొండ పురావైభవాన్ని, దానితోపాటు పతనాన్ని విన్నవించారు జ్ఞానానందకవిగారు. మొదటి ఖండిక "అవతరణం" కుతుబ్షాహీ సుల్తానుల చరిత్ర.

తెలుగున్ గొల్లలుగాచరిత్రములు సందీపించి విశ్వంభరా

స్థలమున్ గీరితి నాచికొన్నయది నీ సామ్రాజ్యభానూదయో

జ్వల రేఖారుచిరాంశువుల్ కుతుబుషా సమ్రాట్టులౌదార్యపున్

జలువన్ గల్గినవంచుజాటెడిని దచ్ఛైథిల్య దివ్యాకృతుల్. (గోల్కొండ కావ్యం)

-- ఇటువంటి పద్యాలు గోల్కొండ సామ్రాజ్యం పొందిన అభ్యుదయ పరాకాష్ఠను సూచిస్తాయి. కుతుబ్షా భాగ్యనగరాన్ని నిర్మించిన వృత్తాంతం రసవంతమై పాఠకులను ఆనంద పరవశ్యంలో ముంచెత్తుతుంది. గోల్కొండ సుల్తానుల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన విషయం వారు చూపించిన అపారమైన సహనం.

 ఇవియ హైందవ జాతీయత వివరించు

దివ్య ధర్మాలయమ్ములు దేవళములు

జీర్ణమై, శిధిలమయి మసీదులయ్యె

సెప్ప నౌరంగజేబ్ కంటి సెగలవలన (గోల్కొండ కావ్యం)

ఈ పద్యం హిందువులు పొందిన సుఖ సౌకర్యాలకు ఉదాహరణ. ఆ వైభవం ఔరంగాజేబు క్రూరత్వానికి బలికావడంతో అవతరణం కండిక పూర్తవుతుంది.

ఔరంగజేబు రాకకు మీర్ జుమ్లా కారకుడు. మీర్ జుమ్లా విదేశీయుడైన ఒక వ్యాపారి. తన పరివారంతో గోల్కొండ చేరి బుద్ధి కుశలత వలన,చాకచక్యం వలన అపారమైన ధనాన్ని, పలుకుబడిని ఆర్జించి అబ్దుల్లా కుతుబ్ షా కొలువులో ముఖ్యమంత్రిత్వ పదవిని అధిష్టించాడు. ఇతని ఏకైక పుత్రుడు మహమ్మద్ అమీన్. అతడు తప్ప తాగి సుల్తాన్ సింహాసనం మీద పడి దొర్లుచూ ఆ సింహాసనాన్ని అగౌరవపరిచినందుకు సుల్తాన్ కారాగారంలో బంధించాడు. ఆ కారణాన్ని పురస్కరించుకొని మొగలాయి గవర్నర్గా ఉన్న ఔరంగజేబుతో సమాలోచించి గోల్కొండపై దండయాత్ర సాగించటానికి పురికొల్పాడు. గోల్కొండ చరిత్రలో అతనిది ఒక కృతఘ్నతా ఘట్టం.మాయని మచ్చ. కవి అతని కృతఘ్నతను అనేక విధాలుగా విశ్లేషించారు.చివరికి  "కృతఘ్న మూర్తీ! నీ అడుగులు పడ్డచోట తృణమైనను మొల్వదు వాస్తవమ్ముగన్" అని అతని నీచత్వాన్ని, స్వామి ద్రోహాన్ని నిందించారు.

క్రమమొప్పారగ గోలకొండను చరిత్ర స్వర్ణ కుడ్యాలపై

నమరున్ మాయని మచ్చయౌచు భవదీయంబైన నామము,దే

శమునాశస్థితిగోరుత్వాదృశులకున్ జన్మమ్ము వ్యర్థమ్మునౌ

జుమి! కామందుని పొట్టగొట్టితివి మీర్జుమ్లా!విచారంబగున్. (గోల్కొండ కావ్యం)

మీర్ జుమ్లా నైతిక పతనానికి కవి విచారించారు. ఈ ఖండికలో మీర్  జుమ్లా వంచన,కృతఘ్నతలను వివరించారు.

5. వర్ణనలు

మూడవ ఖండిక "తానీషా". తానీషా అంటే మంచిరాజని అర్థం. అతని సహృదయత ప్రశంసనీయమైంది. గోల్కొండ నవాబుల్లో అత్యధిక ప్రజాభిమానాన్ని పొందిన వాడు తానీషా.సరళ హృదయుడని,భోగి అని పేరుగాంచాడు.విదేశీయుడైన తెలుగువారిలో తెలుగువానిగా బ్రతికాడు. అతని సుగుణ గుణాలన్నీ ఈ పద్యంలో వర్ణించారు కవి.

పూజగొన్నాడు రాముండు  నిశ్చింతగా ప్రతిలేనిదైన భద్రాచలాన

కాన్కగొన్నాడు ముఖ్యభరముల స్వామి సరసభూములను కృష్ణా తటాన

నేర్చుకొన్నాడు మన్నీడబ్దుల రజాకు తలలేని విశ్వాసబలగుణమ్ము

అందుకొన్నాడు శుభాభినందనలు ఛత్రపతి శివాజి మరాటరాజు

కలుపుగోలుతనము నలరించి గోల్కొండ

వెలయు మూడు కాలముల యశస్సు

నార్జవమ్ము సలుపనాత్మలో తలపోసి

తివి నిజమ్ము ధన్యుడవు భృశమ్ము. (గోల్కొండ కావ్యం)

అటువంటి ప్రభువుకి "పున్నీఖాన్" ద్రోహాన్ని తలపెట్టి ఔరంగజేబు సేనలకు గోల్కొండ కోటతలుపులు తెరచినపుడు "అబ్దుల్ రజాక్ లారి" అనే రాజభక్తి పరాయణుడు చూపించిన ధైర్య సాహసాలు సాటిలేనివి. ఆ ధైర్యసాహసాలు, ప్రభుభక్తి శత్రువైన ఔరంగజేబునకే ఆశ్చర్యాన్ని కలిగించాయి. పరాజయానంతరం గోల్కొండకు కలిగిన దైన్యాన్ని కవి విశదంగా, ఆర్ద్రంగా వర్ణించారు.

ఏనాడీ గోలకొండకోట మొగలాయి సైన్య గంభీర గం

గా నిర్ఘోషము వీనులంబడియెనో కాంతాజన శ్రేణి సు

ల్తాను రాణులునూపిరిన్ విడువగా త్యాగమ్ముతో నాతటా

కానన్ బడ్డ చరిత్ర దుస్థితి వినన్ కన్నీరు రాదాప్రభూ! (గోల్కొండ కావ్యం)

ఇటువంటి పద్యాలు కరుణ రసభరితమైన అంతఃపుర స్త్రీల త్యాగాలు మనసును కదిలించి దుఃఖాన్ని కలిగిస్తాయి. కోటను నాశనం చేసిన సందర్భాలలోని పద్యాలు ఆ శిథిల దృశ్యాల్ని కనులకు కట్టిస్తాయి.తానీషా సహజంగా భోగపరాయణుడైనా చివరికి సాహసించి శౌర్యాన్ని ప్రదర్శించాడు.విధి బలీయమైనది కాబట్టి తానీషా బందీకృతుడు కావలసి వచ్చింది. జ్ఞానానందకవి గారికి తానీషాపై అభిమానం ఎక్కువ. ఆ అభిమానం ఈ ఖండికలోని ప్రతిపద్యంలో కనిపిస్తుంది.ఆరాజు సహనం, ఔదార్యం, కళాపిపాస అతనిని తెలుగు ప్రజలు అభిమానించేలా చేసింది.తానీషాను "సాహితీ బాంధవా!" అని సంబోధిస్తూ కవి ఔరంగజేబుకు బందీ అయిన సందర్భాన్ని తలచుకుంటూ వేదనను వ్యక్తం చేశారు.

నాల్గవ ఖండికలో ధీవిశారధులు, సౌభ్రాత్ర సేవధులైన అక్కన్న మాదన్నల స్వరూప స్వభావాల్ని చిత్రించారు. రాజ్య పరిపాలనా పద్ధతుల్ని బాగా చదువుకుని తెలుగువారి కీర్తి పతాక నిల్పిన మంత్రి పుంగవులు అక్కన్న మాదన్నలు ఒకరు మంత్రి, రెండవ వారు సేనాధీశుడు. ఇద్దరూ కలసి గోల్కొండ రాజ్యానికి చేసిన సేవ చరిత్రలో శాశ్వతమైంది. అక్కన్న మాదన్నలది పింగళి వంశం. దానిని సంభావిస్తూ కవి పింగళి సూరనను స్మరణకు తెచ్చుకున్నారు. 

మును మీవంగడమందె పుట్టెను కళాపూర్ణోదయ గ్రంథక

ర్త నితాంత ప్రతిభా సమున్నతుడు మేధాశాలి కొంగ్రొత్త త్రో

వను దివ్యాంధ్ర సరస్వతిన్ గొలిచి విద్వచ్లాఘ్యుడయ్యెన్ యశో

ధని మాపింగళి సూరనార్యుడు జగద్వంద్యుండు కాకుండునే! (గోల్కొండ కావ్యం)

అక్కన్న మాదన్నలు ధీరత్వానికి చిరునామా. వారి యశస్సు అన్ని సామ్రాజ్యాలకు చేరింది. వారి రాజ్య రక్షణ పరాయణత విశేషమైంది. వారిద్దరూ ఛత్రపతి శివాజీకి, అబుల్ హాసన్ తానీషాకీ పరిచయాన్ని కలిగించి మొగలాయి సమ్రాట్టుకు కూడా భయాన్ని పుట్టించారు.కేవలం రాజకీయ విషయాలలోనే కాకుండా కళలు, ఇతర విషయాలలో కూడా వారికి అభినివేశం ఉందనటానికి ఈ సీస పద్యమే ఉదాహరణం.

నిలిపించిరిట శాత్రవులగుండె ఝల్లన నాలమ్ము సేయు గుర్రాల దండు

కొలిపించిరిట నవ్వులొలయ ఖజానాలు నిండార దండి పసిండి రాశి

మలపించిరిట రాతి పలకలన్ సరిలేని విశ్వమోహనమైన విగ్రహములు

ఝలిపించిరిట భుజాబలము బాహాటింప నిశిత హేతిచ్చటాన్విత బలమ్ము

 శుద్ధరాజకీయ శూరత్వమునుగాక

వెనుక ముందు జరుగు వివిధ గతులు

సూక్ష్మ దృష్టిబరపి చూపించిరిట మహా

మంత్రులార! తెలుగు మాన్యులార!    (గోల్కొండ కావ్యం)

ఈ పద్యం ఆదర్శమూర్తులైన అక్కన్నమాదన్నల మూర్తిమత్వాన్ని, గుణగణాల్ని పాఠకులకు సాక్షాత్కరింపజేస్తుంది.

ఐదవ ఖండిక భక్త శిఖామణియైన  రామదాసుకు సంబంధించింది.కంచర్ల గోపన్న కబీర్ ప్రియశిష్యుడై రామధ్యాన తత్పరుడైన తర్వాత రామదాసు అయ్యాడు. రామనామ స్మరణయే అతని ధ్యాస. రామ భజన మహోత్సాహంతో అతని కుమారుడు గంజికుంటలో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. రామదాసుభార్య విషయం తెలుసుకొని స్పృహ కోల్పోయింది. తిరిగి కుమారుడు బ్రతకడం రామదాసు శ్రీరాముని భక్త పాలన తత్పరత్వానికి తార్కాణం. రామదాసు రాకతోనే పంచవటికి విలువ పెరిగి భద్రాచలం క్షేత్రంగా ఆవిర్భవించటానికి కారణమైందని అంటారు కవి.

సీ. మాధుర్య పావనాంభ:పూర పుణ్య గోదావరీ స్పృశిత స్థలమ్ము

జానకీ రామ లక్ష్మణ పాద కంజాత ధూళి దూసరమైన దొడ్డనేల

ద్రుమ వల్లరీకుడుంగములెల్ల లావెక్కి చిమ్మచీకటి వెదజిమ్ము చోటు

ధర్మ మార్గాలంబ దమ్మక్క మనసిచ్చి రామునిగనిన భూమి

పూజనములు మరియు భాజనమ్ములులేక

పేదవడిన రామ విగ్రహమ్ము

కలుగు పంచవటికి విలువు హెచ్చెను నీదు

రాక వలన భక్త రామదాస! (గోల్కొండ కావ్యం)

అంటారు. ఈ ఐదు ఖండికల్లో గోల్కొండ రాజ్య విశేషాలు పొందుపరిచారు. చారిత్రక సన్నివేశాల్ని పద్యాల్లో రసప్లావితం చేశారు.

6. ముగింపు:

  • కవులను సమాదరించే వదాన్య శేఖరులైన గుంటూరు నివాసి శ్రీ ఏకా ఆంజనేయులు గారి హార్దిక, ఆర్థిక సహకారంతో కవి ఈ కావ్యాన్ని ప్రచురించారు. రవీంద్రుని భావ ప్రతిబింబమైన డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారికి కృతజ్ఞతలు అందించారు.
  • కావ్య సమీక్ష సందర్భంలో ఆచార్య ఎస్వీ జోగారావు గారి ప్రశంస ప్రస్తావించతగింది."జ్ఞానానందకవి గారి రచన చక్కని ప్రాచీన ఫక్కీని, నాణ్యమైన నవ్యతను పునికిపుచ్చుకున్నట్టిది.
  • తెలుగుదన ముట్టిపడుచున్నది. పద్యరచనలో కవిది పరిణత హస్తము. పలుమరు మధుర కావ్య స్వరములనలతి శ్రావ్యముగానాలకించి వాసికెక్కిన వాణి జ్ఞానానందకవి గారిది.
  • "కవిగారి పద్యములందలి ధార అవిచ్ఛిన్నమై సెలయేటి వలె జాలువారుచున్నదని" అంటారు దివాకర్ల వెంకటావధానిగారు. ధారా శుద్ధిగల రసవత్తర పద్యాలతో వెలుగొందుచున్న ఖండకావ్యం "గోల్కొండ".
  • ఆధునిక పద్య ప్రపంచంలో జ్ఞానానందకవి గారిది విశేషమైన స్థానం. వారి కావ్య ప్రపంచాన్ని పునరాలోచన చేయటం ద్వారా ఒక తరానికి చెందిన భాషను, సంప్రదాయాన్ని, విశేషాల్ని, ఆత్మీయతను అందుకుంటూ కవితో సంభాషణను పొందినట్లుగా భావించటం సహృదయతే అవుతుంది.

7. ఆధార గ్రంథాలు

  1. ఎస్టీ జ్ఞానానందకవి గోల్కొండ కావ్యం. 1986
  2. ఆంధ్రుల చరిత్ర సంస్కృతి, ఖండవల్లి లక్ష్మీరంజనం, బాలేందుశేఖరం. ఆంధ్రసారస్వత పరిషత్ 1982
  3. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సురవరం ప్రతాపరెడ్డి ప్రచురణ ఆంధ్ర సారస్వత పరిషత్ 1990
  4. తెలుగు భాష నాడు – నేడు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ 2006

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]