headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-5 | May 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

15. జైమిని భారతం: తండ్రిపాత్రల విశ్లేషణ

డా. రాంభట్ల వేంకటరాయ శర్మ

తెలుగు పరిశోధకులు, జ్యోతిష్కులు
ప్రధానసలహాదారు, ఔచిత్యమ్- పరిశోధనమాసపత్రిక
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 7989110805, Email: rvr87sarma@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

జైమిని భారతంలోని కథ రెండు సంవత్సరాల్లో జరిగిన వృత్తాంతం. వ్యాసుడి ప్రబోధం వల్ల ధర్మరాజు, భీమాదులు అశ్వాన్ని సాధించిన తరువాత పదకొండు నెలలకు వచ్చే చైత్ర పౌర్ణమినాడు సవనదీక్ష పట్టాడు. అశ్వయాత్ర ఒక సంవత్సరం జరిగింది. ఇలా రెండేళ్ల కథ ఇందులో రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి మూడాశ్వాసాలు మొదటి సంవత్సరం జరిగిన వృత్తాంతం. మిగిలిన 5 ఆశ్వాసాల కథ రెండవయేటి వృత్తాంతం. మొదటి సంవత్సర వృత్తాంతం వ్యాస భారతంలో కనిపించదు. భీమాదులు యౌవనాశ్వుణ్ణి గెలిచి, సవనాశ్వాన్ని తెచ్చినట్లు జైమిని భారతంలోని కల్పన. జైమిని భారతంలో మూడవ ఆశ్వాసం నుండి ఉపాఖ్యానాలు ప్రారంభమౌతున్నాయి. మూడవ ఆశ్వాసంలో మరుత్తుడు చేసిన అశ్వమేధ యాగ వృత్తాంతాన్ని వ్యాసుడు ధర్మరాజుకు తెలియజేస్తాడు. అయితే, తండ్రి పాత్రలు నాలుగో ఆశ్వాసం నుండీ ఉన్నాయి. ముందుగా చెప్పినట్లుగానే, మొదటి మూడాశ్వాసాలలో అశ్వమేధ యాగానికి సిద్ధపడటం వరకూ ఉంది. నాల్గవ ఆశ్వాసం నుండి, యజ్ఞాశ్వ విహారం, అర్జునుడు, ఒక్కో రాజ్యంలో యుద్ధంచేసి, సంవత్సర కాలం పాటు యాత్ర చేయడాన్ని వర్ణించారు. యాగాశ్వం వెంట అర్జునుడు వెళ్ళడం నుండి తండ్రిపాత్రలు కథలో ప్రారంభమౌతున్నాయి. జైమిని భారతంలో 11తండ్రిపాత్రలున్నాయి. కథానుగతంగా జైమినిభారతపాత్రచిత్రణలను ఈ వ్యాసం చర్చిస్తుంది. శ్రీనాథయుగ- సాహిత్యం- తండ్రిపాత్రలపరిశీలన అనే శీర్షికన ఆంధ్రవిశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంతగ్రంథం ఈ వ్యాసానికి భూమిక

Keywords: జైమిని, భారతం, తండ్రిపాత్ర, అశ్వమేధయాగం, పినవీరన.

1. ఉపోద్ఘాతం:

జైమిని భారతాన్ని పినవీరన సాళువ నరసింహరాయలకు (1485-93) అంకితం చేశాడు. భారత అశ్వమేధపర్వకథే, జైమిని భారతంలో ఉంది. దీన్ని సంస్కృతం నుండి తెనిగించాడు. జైమిని భారతం 8 ఆశ్వాసాల ప్రబంధం. అందులో అద్భుతమైన వృత్తాంతాలెన్నో ఉన్నాయి. సంస్కృత జైమిని భారతంలో 5179 శ్లోకాలు, 68 అధ్యాయాలున్నాయి. దీన్ని పినవీరన 1479 గద్య పద్యాలలో 8 ఆశ్వాసాలలో అనువదించాడు. ధర్మరాజు అశ్వమేధయాగం చేయాలనుకోవడం, భీమార్జునులు యాగాశ్వాన్ని సంరక్షించడం ఇందులోని ప్రధాన కథ. ఉపాఖ్యానాలలో శ్రీకృష్ణుడి మాహాత్మ్యాన్ని కవి పేర్కొన్నాడు.   కుశలవోపాఖ్యానం, చంద్రహాస చరిత్ర, ప్రమీలార్జునీయం, బభ్రువాహనుడి చరిత్ర, ఉద్దాలకుడి చరిత్ర, మొదలైన మహా భారతంలో లేని ఉపాఖ్యానాలిందులో కనిపిస్తాయి. జైమిని భారతంలో యౌవనాశ్వుడి యజ్ఞాశ్వాన్ని తీసుకురావడానికి భీమసేనుడు నాయకత్వం వహిస్తాడు. కర్ణుడి సుతుడైన వృషకేతుడు, ఘటోత్కచుడి కొడుకు మేఘ వర్ణుడు సహాయకులుగా దండయాత్ర సాగిస్తారు. ఇందులో వృషకేతుడి పాత్రను పినవీరన అద్భుతంగా చిత్రించాడు. జైమిని భారతం యుద్ధమయం. కుశలవులు చేసిన యుద్ధం జైమిని భారతంలోని మిగిలిన యుద్ధాలు, వ్యాస భారతంలోని అన్ని యుద్ధాల కంటే అగ్రగణ్యమైంది. ప్రతిక్షణం ఉత్కంఠ భరితం. శత్రుఘ్నుడు లవుని, కుశుడు శత్రుఘ్నుని మూర్ఛిల్లేలా చేయడం, లక్ష్మణుణ్ణి లవకుశులు నిహతున్ని చేయడం, రాముణ్ణి మూర్ఛిల్లేలా చేయడం గొప్పఅంశాలు. శ్రీరాముడు తండ్రిగా చూపిన ఆదరాభిమానాలు ఇందులో ముఖ్యమైనవి.

2.1 నీలధ్వజుడు:

చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు, ధర్మరాజు యజ్ఞదీక్షితుడై గుర్రాన్ని పూజించి, మధ్యాహ్న వేళ ప్రయాణభేరి మ్రోగిస్తాడు. శ్రీ కృష్ణుడి అనుమతితో అర్జునుణ్ణి యజ్ఞాశ్వరక్షకుడిగా యుధిష్ఠిరుడు నియోగిస్తాడు. పార్ధుడు, ప్రద్యుమ్న వృషకేతుల తోడుతో యౌవనాశ్వుడు, అనుసాళ్వుడు సైన్యంతో వెంటరాగా రథాన్నెక్కి సవనాశ్వాన్ని అనుసరిస్తాడు. యాగాశ్వం నానా దేశాలు తిరిగి ‘మాహిష్మతీ’ నగరంలోకి ప్రవేశిస్తుంది. మాహిష్మతీ నగరాన్ని పాలించే నీలధ్వజుడి కొడుకు ‘ప్రవీరుడు’. ఆ నగరంలో సతీసమేతంగా విహారానికి వచ్చి, భార్య ప్రేరణనతో సవనాశ్వాన్ని పట్టుకుంటాడు. దాని నుదుట మీద రాసి ఉన్న పత్రాన్ని చదువుతాడు.

          ఉ॥      ‘‘దుర్జయ రాజ మండల విధుంతద మూర్తి యుధిష్ఠిరక్రతూ

                  త్సర్జితమైన యీ హయవతంసము త్రిమ్మర నంగరక్షగా

                  నర్జునుడేగుదెంచె నిటలాక్షుని గెల్చిన జోదు విక్రమో

                  పార్జిత లీల బట్టుడు రయంబున శూరులు ధాత్రి గల్గినన్‌’’   (జై. భా. 4వ ఆశ్వా. 7వ పద్యం)

ఇది చదివిన ప్రవీరుడు, అర్జునుణ్ణి జయించాలని ఉత్సాహించి భార్యను, తనతో వచ్చిన వాళ్ళను అంత:పురానికి పంపించి, రథంమీద, యుద్ధానికి సిద్ధమవుతాడు. ముందు వృషకేతుడు, ఆ రాకుమారుడితో యుద్ధం చేసి బలహీనుడవుతాడు. ఆపై అనుసాల్వుడు విజృంభించి, అతణ్ణి బాణపరంపరంలో బంధిస్తాడు. అంతలో, కొడుకుకు ఆసరాగా, నీలధ్వజుడు, మూడు అక్షౌహిణీల సైన్యంతో, యుద్ధరంగంలో నిలిచి, శత్రువీరులను ఓడిరచి, పార్థుణ్ణి సమీపిస్తాడు. నీలధ్వజుడు అర్జునుడి మీద పావకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అగ్ని దేవుడు నీలధ్వజుడికి అల్లుడవ్వడంతో అర్జునుడి సైన్యాన్ని కాల్చడానికి వస్తాడు. పార్ధుడి వారుణాస్త్రం వమ్మయింది. నీలధ్వజుడు, యాగాశ్వాన్ని బంధించి తీసుకువెళ్ళిపోతాడు. అర్జునుడు అగ్ని భట్టారకుడ్ని స్తుతించి, నారాయణాస్త్రాన్ని సంధిస్తాడు. అంతటితో అగ్నిదేవుడు ప్రసన్నుడై, అర్జునుడి ముందు, బ్రాహ్మణ వేషంలో వచ్చి విష్ణు ప్రభావాన్ని పేర్కొని, సైన్యాన్ని బ్రతికించి, మైత్రి ప్రకటిస్తాడు. అగ్నిదేవుడు నీలధ్వజుడికి, గుర్రాన్ని విడిచిపెట్టమని హితవు చెప్తాడు. కానీ, నీలధ్వజుడి భార్య ‘జ్వాల’ - ‘వీరులకు యుద్ధం చేయడమే ధర్మం’  అని చెప్పి, తన భర్తను యుద్ధానికి పురికొల్పుతుంది. నీలధ్వజార్జునులకు ద్వంద్వయుద్ధం జరుగుతుంది. అందులో నీలధ్వజుడి సైన్యాన్ని, సంతతిని కోల్పోతాడు. అతడూ ఓడిపోయి, రథం మీదనే మూర్ఛపోయి, నగరానికి చేరుకుంటాడు. భార్యను చూసి, ‘స్త్రీ బుద్ధి, ప్రళయాంతకం’ అనే సూక్తిని స్మరించి, విచారించి, వినయ సమన్వితుడై, సవనాశ్వాన్ని అర్జునుడికి సమర్పించి, అతని వెంట ఒక యేడు అశ్వరక్షావ్రతంతో రాడానికి సమ్మతించి వెళ్తాడు.

జ్వాలాదేవి అర్జునుడి మీద పగబట్టి, కాశీకి వెళ్ళి, ఆ రాజైన ఉల్ముకుణ్ణి, అర్జునుణ్ణి చంపమని ప్రేరేపిస్తుంది. అందుకతడు అంగీకరించి, తగిన సమయం వచ్చినప్పుడు ఆ ప్రతిజ్ఞను నెరవేరుస్తానని చెప్తే, ఆమె కోపగించుకుంటుంది.

గంగానది దాటివెళ్తూ, ఆ నదీమతల్లిని ‘అపుత్రక’ కాబట్టి అస్పృశ్య అని నిందిస్తుంది. అర్జునుడిపై కోపంతో, గంగకు లేనిపోని మాటలు చెప్తూ ‘భీష్ముడి మరణానికి కారణమైన అర్జునుడి మీద గంగకు కోపాన్ని తెప్పిస్తుంది. గంగ ‘‘ఆరునెలల్లోగా అర్జునుడి తల భూమ్మీద పడుగాగ’’ అని శపించి వెళ్ళిపోతుంది. జ్వాల - చితిమీద పడి శరీరాన్ని విడిచి, మృత్యు స్వరూపమైన శరాకృతిగా మారి అర్జునుణ్ణి చంపే సమయంకోసం అన్వేషిస్తూ ఉంటుంది.

భార్యమాటల్ని విని రోషంతో ముందువెనుకలు ఆలోచించకుండా, ఎదుటి వాళ్ళ బలాన్ని అంచనా వెయ్యకుండా చేతులారా కొడుకుల్ని దూరం చేసుకున్న పాత్రగా నీలధ్వజుడు కనిపిస్తాడు.

2.2 హంసధ్వజుడు:

యాగాశ్వాన్ని బంధించి, యుద్ధంలో తన ఇద్దరి కొడుకులను పోగొట్టుకున్న తండ్రి హంసధ్వజుడు. యాగాశ్వం వింధ్య పర్వత ప్రాంతాన్ని దాటి, చంపకాపురాన్ని సమీపిస్తుంది. ఆ నగరాన్ని పాలించే హంసధ్వజమహారాజు గుర్రాన్ని పట్టి ధనంజయుణ్ణి ఎదిరించి, తత్కారణంగా శ్రీకృష్ణుణ్ణి దర్శించి తరించాలని నిశ్చయించుకుంటాడు. శంఖలిఖితులనే పురోహితులను రాజ్య రక్షణకు, ధర్మాధికార నిర్వహణనకు నియోగించి, సేనలను పిలిపించి, యుద్ధ యాత్ర సాగిస్తాడు. యుద్ధంలో పాల్గొనడంలో ఆలస్యం చేసిన వీరుల్ని మరుగుతున్న నూనెలోకి తోసేయమని ఆజ్ఞాపిస్తాడు.

హంసధ్వజుడికి, సుధన్వుడనే కొడుకున్నాడు. అతడు విష్ణుభక్తుడు. తండ్రి ఆనతిని,  తల్లి ఆశీస్సులను, చెల్లెలి మన్ననలను అందుకుని భార్య ప్రభావతి దగ్గరకు వెళ్తాడు. ఆమె ఋతు ధర్మాన్ని నిర్వహించి, యుద్ధానికి వెళ్ళమని భర్తను కోరుతుంది. సుధన్వుడు, దానికిప్పుడు సమయం కాదని, రాజాజ్ఞకు విరుద్ధమని చెప్పినా వినకుండా, భర్త సమాగమనాన్ని కోరుకుంది. సుధన్వుడు భార్య కోర్కెను తీర్చి వెళ్ళేసరికి ఆలస్యమయ్యింది. మహారాజు అతని ఆలస్యానికి కోపించి, శంఖలిఖితులకు అప్పగించమని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞను అనుసరించి, సుధన్వుణ్ణి సలసల కాగుతున్న నూనెలో నిలబెట్టారు. విష్ణు భక్తి మహిమ చేత సుధన్వుడు బాధపడకుండా నిలబడి ఉంటాడు. పురోహితులు అతడి విష్ణు భక్తి మహిమను తెలుసుకుని, అంతటి భక్తుడికి ఆపద కలిగించిన పాపం పోగొట్టుకోడానికి, వాళ్ళు కూడా ఆ తైలభాండంలోకి ప్రవేశిస్తారు. విష్ణుభక్తి మహిమ వల్ల వాళ్ళు ముగ్గురూ  దేవతల మెప్పును పొందుతారు. ఆ వృత్తాంతం తెలుసుకుని హంసధ్వజుడు, కొడుకు విష్ణుభక్తికి మెచ్చుకొని కౌగిలించుకొని, అతడిని సేనానాయకుడిగా  నియోగిస్తాడు.

సుధన్వుడు అర్జునుడి సైన్యంమీద దండెత్తుత్తాడు. వృషకేతుణ్ణి, ప్రద్యుమ్నుణ్ణి, కృతవర్మని, అనుసాల్వుణ్ణి, సాత్యకిని, మూర్ఛపోయేట్లు చేస్తాడు. అర్జునుడు  సుధన్వుడితో తలపడగా, అర్జునుడి సారధి గతిస్తాడు. పార్ధుడు మనస్సులో కృష్ణుణ్ణి స్మరించి, కృష్ణ సారధ్యంలో అర్జునుడు వేసిన బాణం వల్ల సుధన్వుడి తల మొండెం నుండి వేరై, హరినామ స్మరణ చేస్తూ కృష్ణుడి పాదాల దగ్గర పడుతుంది. కృష్ణుడా శిరస్సును, హంస ధ్వజుడి ముందు పడేస్తే, పుత్ర శోకంతో బాధపడి, కొంతసేపటికి తేరుకొని, కొడుకు తలను తిరిగి గోవిందుడి పాదాల చెంతకే చేరుస్తాడు హంసధ్వజుడు.

హంసధ్వజుడికి ‘సురథుడు’ అనే మరొక కొడుకున్నాడు. అతడు తండ్రిని ఓదార్చి, యుద్ధానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు సురథుడి సంరంభం చూసి, అతడు మూర్తీభవించిన సత్త్వమని, అతన్ని ఎదుర్కోనడం అప్పటికి అర్జునుడికి అసాధ్యమని భావించి, ప్రద్యుమ్నుడు మొదలైనవాళ్ళను ముందు నిలిపి, పార్థుడి రథాన్ని అయిదు యోజనాల దూరం వెనుకకు తీసుకువెళ్ళిపోతాడు. సురథుడు శత్రు సైన్యాన్ని చెండాడి, నరనారాయణులను సమీపించి, అన్నను చంపించినందుకు గోవిందుణ్ని అధిక్షేపించి, అర్జునుడితో యుద్ధం చేస్తాచివరకు ధనుంజయుడు, సురథుడి కంఠాన్ని బాణంతో ఖండిస్తాడు. సురథుడి ఉత్తమ గుణాలను శ్రీకృష్ణుడు స్తుతించి, గరుత్మంతుడిని స్మరించి అతణ్ణి ఆ శిరస్సును ప్రయాగ సంగమక్షేత్రంలో పడేటట్లు చూడమని ఆజ్ఞాపిస్తాడు. హంసధ్వజుడితో శ్రీకృష్ణార్జునులు స్నేహం చేసుకుంటారు. హంసధ్వజుడు వెంట రాగా యాగాశ్వం వెంట అర్జునుడు వెళ్తాడు. వాసుదేవుడు హస్తినాపురానికి వెళ్ళిపోతాడు.

యుద్ధంలో ఇద్దరు కొడుకులను పోగొట్టున్నాక, అర్జునుడితో స్నేహంచేసిన తండ్రి పాత్ర హంసధ్వజుడిది. అయితే కొడుకులిద్దరూ మహాయోధులే కాకుండా కృష్ణుడే మెచ్చుకునేటంతటి విష్ణుభక్తులు కూడా.

2.3 అర్జునుడు:

కొడుకు చేతిలో యుద్ధంలో మృతి చెంది, కొడుకు వల్లే తిరిగి పునర్జీవీతుడైన తండ్రి అర్జునుడు. యాగాశ్వం ఒక్కో రాజ్యంలోకి ప్రవేశిస్తే, దాన్ని బంధించిన రాజులతో అర్జునుడు యుద్ధం చేస్తూ, అప్పటి వరకూ ఓటమన్నదే తెలియకుండా విజయాలతో ముందుకు సాగిపోతుంటాడు. ఓడిపోయిన రాజులందరూ యాగాశ్వం వెనుక, రక్షకులుగా బయలుదేరి వస్తుంటారు. అర్జునుడు స్త్రీ మండలంలో ప్రమీలతో యుద్ధం చేసి, ఆ తర్వాత ఆమె కోర్కెను మన్నించి, అక్కడి నుండి వృక్షదేశం వెళ్ళి, అక్కడ బకాసురుడి కొడుకైన భీషణుడనే రాక్షసుణ్ణి చంపి యాగాశ్వాన్ని విడిపిస్తాడు.

యజ్ఞాశ్వం మణిపురంలోకి ప్రవేశిస్తుంది. ఈ పురమెవరిది? దీనికి రాజు ఎవరని అర్జునుడు, హంసధ్వజుణ్ణి అడుగుతాడు. ‘భవదీయ కుమారుడు, బాలభాను సమానతేజుడైన బభ్రువాహనడు పరిపాలిస్తున్న పట్టణంబిది’ అని సమాధానమిస్తాడు.

కం॥     ‘‘సుత జనక బాంధవంబున..వశముగా దెవ్వరికిన్‌’’       (జై.భా. 5వ ఆశ్వా. 152వ పద్యం)

‘నువ్వు తండ్రివని, తను కుమారుడని తెలుసుకుని అతను ఊరుకుంటే సరి. అలా కాకుండా, ఎదిరించి, గుర్రాన్ని పట్టి, ఉంచాడా, ఎటువంటి వాళ్ళకైనా ఇతన్ని ఎదిరించడం సాధ్యం కాదు.’’ అని చెబుతుండగా, బభ్రువాహనుడి సేనాపతి ‘సుబుద్ధి’ వచ్చి, ఆ గుర్రాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు. ఈలోగా రాత్రి అవుతుంది. ‘సుబుద్ధి’ తను తీసుకుని వెళ్ళిన గుర్రాన్ని కానుకగా రాజుముందు నిలబెడతాడు. దాని నొసటన రాసిన పద్యాన్ని చదివి, ‘మా పెదతండ్రి ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తూ, విడిచిన గుర్రమిది. నానా దేశాలు తిరిగి, మా నాన్న గారైన అర్జునుడు రక్షకుడుగా వస్తుంటే, మన దగ్గరకు వచ్చిందీ గుర్రం.’’ అని బభ్రువాహనుడు విషయాన్ని తెలుసుకుంటాడు.

‘‘ముక్కంటితో పోరాడి గెలిచిన వాడు, ఇంద్రుడి అర్ధాసనం ఎక్కిన మహా మహుడు. కాలకేయాది దానవుల్ని మట్టుబెట్టిన త్రైలోక్యమల్లుడు, చిత్రాంగదా నాయకుడైన అర్జునుడు ఇక్కడకు రావడం నా భాగ్యం. ఉదయాన్నే మా నాన్నగారి దగ్గరకు వెళ్ళాలి. కానుకలను సిద్ధం చేయమని’’ బభ్రువాహనుడు తన మంత్రులను ఆజ్ఞాపిస్తాడు.

మరుసటి రోజు ఉదయాన్నే విలువైన రత్నాంబరాలు, కానుకలుగా తీసుకుని, మంత్రి పురోహిత సామంత దండనాయకులు వెంటరాగా, యజ్ఞాశ్వాన్ని పట్టుకుని, అర్జునుడి దగ్గరకు వెళ్ళి, కొత్త ముత్యాలను పాదాలమీద పోసి, సాష్టాంగ పడి నమస్కరిస్తాడు. నిన్న పొరబాటున మావాడు గుర్రాన్ని పట్టుకుని వచ్చాడు. నా ఈ అపరాధాన్ని మన్నించండి. ‘‘పిల్లలు తెలియక చేసిన తప్పుల్ని తండ్రి సహించడం ఉచితమే కదా’’ అని పాదాలకు నమస్కరిస్తాడు.

గంగ శాపం కారణంగా, అర్జునుడికి అంతకంతకు కోపం పెరిగిపోయింది.  కోపావేశంలో, పాదాల దగ్గరున్న, బభ్రువాహనుడి, కిరీటం ఎగిరిపడేటట్లుగా గట్టిగా ఒక్క తన్ను తంతాడు. అక్కడున్న రాజులందరూ హాహాకారాలు చేస్తారు. బభ్రువాహనుడు మాత్రం ముఖంలో ఎలాంటి కవళికలు లేకుండా, వినయంగా చేతులు కట్టుకుని ఉంటాడు. అక్కడున్న వాళ్లు అర్జునుణ్ణి కోపం తగ్గించుకొమ్మని హితవు చెప్తారు. సాత్యకి, కొడుకుమీద కృప చూపమన్నాడు. కర్ణుడి కొడుకైన వృషకేతుడు ఇంత కోపం ఏమిటన్నాడు. హంసధ్వజుడు, ఇంత గర్వం ఏమిటన్నాడు. నీలధ్వజుడు ఇకనైనా మన్నించమన్నాడు. ప్రద్యుమ్నుడుదు, అనవసరపు గొడవలెందుకన్నాడు. కృతవర్మ ఇది అపకీర్తి అన్నాడు. అనుసాల్వుడు అయుక్తం అన్నాడు. యౌవనాశ్వుడు ఇలాంటి పనులు, నీవంటి వాళ్ళకు తగవన్నాడు. మిగిలిన రాజులందరూ చాలా రకాలుగా చెప్పి చూశారు.

అయితే, అర్జునుడిలో కోపం అంతకంతకు పెరిగిపోతోంది. కళ్ళు ఎర్రబడ్డాయి. ‘‘ఓరి పిరికి పందా! ముందుగా గుర్రాన్ని పట్టి బంధించి, ఇప్పుడు నన్ను, నా వెంట ఉన్న సైన్యాన్ని చూసి, ప్రాణభయంతో యుద్ధం చేయలేక, ఇలా కాళ్ళ మీదపడ్డావు. సుక్షత్రియుడినైన నాకే పుట్టావా? వైశ్యుడికి చిత్రాంగద నిన్ను కన్నాదా? ‘నాకు ఎదురుగా కనబడకు, పో’’ అని దుర్భాషలాడతాడు. ఆ మాటలకు బభ్రువాహనుడు, ‘నన్నే మన్నా పడతాను. పరమ పతివ్రత చిత్రాంగదను, సభలో, ఇందరి మధ్యలో అవమానించావు. ఇంత వరకూ నా వినయాన్నే చూశారు. ఇక చాలు. ఇప్పుడిక నా క్షాత్రాన్ని చూపిస్తాను. నాతో యుద్ధం చేస్తే, నేను క్షత్రియ కుమారుడినో, వైశ్య కుమారుడినో మీకే తెలుస్తుంది’ అని చెప్పి, తెచ్చిన కానుకలను, గుర్రాన్ని వెనక్కు పంపించి, సుబుద్ధిని సైన్యాన్ని సిద్ధం చేయమంటాడు.

 ‘‘ఏడుకోట్ల రథాలు, అర్బుద సంఖ్య (వెయ్యికోట్లు ఒకటి పక్కన పది సున్నాలు కలిగిన సంఖ్య) భద్ర గజాలను, తెల్లని గుర్రాలు రెండు అర్బుదాలు, కర్కశుడై, బాహుబల ధురీణులు అయిన వీరభటులు మూడు అర్చుదాలు బభ్రువాహనుడి సైన్యంలో ఉన్నారు.’’

యుద్ధానికి సర్వం సిద్ధమైంది. బభ్రువాహనుడు బాహాబాహి పోరు ప్రారంభిస్తాడు. రథాన్ని ముందుకుపోనిచ్చి, అర్జునుడితో ‘‘తండ్రివి కాబట్టి నమస్కరించడానికి వచ్చిన నన్ను, ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడావు. నా పరాక్రమం చూడటానికి ఈ విధంగా మాట్లాడావేమో? ఇక సందేహించక, విల్లందుకో... మీరు గురువులు కాబట్టి ముందుగా నా మీద బాణాలను ప్రయోగించండి’’ అని అంటుండగా, అనుసాల్వుడు, బభ్రువాహనుడితో యుద్ధం చేస్తాడు. బభ్రువాహనుడి పరాక్రమానికి అనుసాల్వుడు తట్టుకోలేకపోతున్న సమయంలో, ప్రద్యుమ్నుడు, బభ్రువాహనుణ్ణి ఎదిరిస్తాడు. అంతలో గాండీవ ధనుష్టంకారం వినపడుతుంది.

బభ్రువాహనుడు పార్థుణ్ణి ఢీకొంటాడు. యుద్ధం ఘోరమవుతుంది. కొడుకు తన తండ్రి రథాన్ని కూల్చాడు. నరుడు మరొక కథమెక్కి కొడుకు రథాన్ని కూల్చి అతన్ని మూర్ఛపోయేలా చేస్తాడు. అంతలో ‘సువేగుడు’ అర్జునుడితో యుద్ధం చేసి అతణ్ణి మూర్ఛపోయేలా చేస్తాడు. తర్వాత అర్జునుడికి చెడుశకునాలు కనిపిస్తాయి. వాటిని వృషకేతుడితో వివరించి చెప్తాడు. వంశాంకురంగా వృషకేతుడు మిగలాలని, అర్జునుడు భావించి, అతణ్ణి హస్తినాపురానికి తిరిగి వెళ్లిపొమ్మని కోరుతాడు. కానీ వీరుడైన వృషకేతుడు వీరధర్మాలను పేర్కొని, బభ్రువాహనుడి మీదకు లంఘిస్తాడు. వాళ్లిద్దరికీ అయిదురోజులు అద్భుతమైన యుద్ధం జరిగింది. చివరినాడు, బభ్రు వాహనుడు, వృషకేతుడి తలను, బాణంతో తుంచేస్తాడు. అతడి తల హరినామ స్మరణ చేస్తూ అర్జునుడి పాదాల మీద పడుతుంది. ధనుంజయుడు అతని మృతికి దు:ఖించి, మూర్ఛపోయి, తేరుకొని చాలా రకాలుగా పలవరిస్తుండగా, అది చూసి బభ్రువాహనుడు ఇలా అంటాడు - తే.గీ॥    ‘‘వైశ్యజుడ గాన సంగ్రామవనధిలోని/ వీరకోటీర మణులకు విలువ గంటి

గర్ణసూనుని శిర మనర్ఘంబు దీని/ భవున కర్పించి పడయుము పాశుపతము’’ (జై. భా. 7వ ఆశ్వా. 37వ పద్యం)

ఆ మాటలు విని అర్జునుడు కోపోదగ్ధుడై, వృషకేతుడి శిరస్సును రథం మీద కుదురుగా పెట్టి, బభ్రువాహనుడి మీదకు లంఘించి, బలలాను కూల్చి, బాధపెడతాడు. బభ్రువాహనుడు మండిపడి, పార్థుడి సూత, హయ, కేతనాలను కూల్చి, ఉగ్రమైన బాణాలతో తండ్రిని బాధపెడతాడు. గంగాశాపంవల్ల దివ్యాస్త్రాలు స్ఫురించక అర్జునుడు తూలిపోతున్నాడు. ఆస్థితిని గమనించి, బభ్రువాహనుడిలా –

శా॥ ‘‘మా తల్లిన్‌ వనితామతల్లిని సభామధ్యంబునం దొల్లి య/ ప్రీతుల్‌ పల్కిన పాతకంబునకు జేరెం గాల మీవ్వేళ ని న్నాతంకంబున బెట్టుచున్న పితృ పుత్రాశల్‌ విసర్జించి నీ/ సూతుం గృష్ణు దలంచు కొమ్మనగ నచ్చో బుట్టె నుత్పాతముల్‌’’ (జై. భా. 7వ ఆశ్వా. 47వ పద్యం) బభ్రువాహనుడి దగ్గర బాణాకృతిలో ఉన్న ‘జ్వాల’ అర్జునుడి మృత్యువు. అతడు ఆ బాణాన్ని  క్రీడి మీదకు సంధిస్తాడు. కార్తీకశుద్ధ ఏకాదశి, ఆదివారం, ఉత్తరా నక్షత్రం నాడు, సూర్యస్తమయ సమయంలో, ఆ అస్త్రం ఆ మహావీరుడి శిరస్సును తుంచింది.  బభ్రువాహనుడు విజయోత్సాహంతో రాజధానికి తిరిగి వెళ్తాడు. అర్జునుడి మరణ వార్త విని చిత్రాంగద, ఉలూచి శోక సాగరంలో మునిగిపోతారు. బభ్రువాహనుడు తల్లులను దర్శించి, విజయోత్సవ వేళ రోదనలకు కారణం ఏమిటని అడిగాడు. చిత్రాంగద, కొడుకుతో ‘కుమారా! చెట్టునుంచి పుట్టిన అగ్ని ఆ చెట్టునే కాల్చే విధంగా, నువ్వు నరుడికి పుట్టి అతడినే చంపావు’ మమ్మల్ని ఆ మహాత్ముడున్న చోటికి తీసుకువెళ్ళు. అని అంటుంది. వెంటనే ఉలూచి - ‘‘పుత్రా! తెలిసి తెలిసి పితృహత్య చేసి విజయోత్సవంగా వస్తున్నావా? అని నిష్ఠురంగా మాట్లాడుతుంది. బభ్రువాహనుడు వెలవెలబోయి, తల్లుల్ని తండ్రి పడున్న చోటికి తీసుకువెళ్తాడు. వాళ్లు, అర్జునుడి తలను, వృషకేతుడి తలను చూసి భోరున విలపిస్తారు. బభ్రువాహనుడిని చూసి, ‘పుత్రా! అశ్వమేధ యాగానికి హస్తినకు వెళ్ళి బంధుమిత్రుల్ని, భర్తను కలుసుకుందామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా ఆశలన్నింటినీ నట్టేట ముంచావు. తండ్రిని చంపినట్లుగానే, తల్లులను కూడా చంపి పరశురాముడి కంటే ఘనకీర్తిని పొందు, లేదా, మా భర్తతో సహగమనం చేయడానికి చితిని పేర్చు’ అని చిత్రాంగద అంటుంది. బభ్రువాహనుడు మాతృ శోకానికి బాధపడి, తన తండ్రి సభలో, మాతృ దూషణ చేయడం వల్లే ఇలా చేశానని చెప్పి, తన అవివేకాన్ని నిందించుకుంటాడు.

ఉలూచి, చిత్రాంగదను చూసి, తన తండ్రి శేషుడి దగ్గర ఉన్న ‘మృతసంజీవనీ రత్నాన్ని’ పుండరీకుడితో తెప్పించి, ఆ ప్రభావంతో అర్జునుణ్ణి బ్రతికించుకొందామని అనుకుంటుంది. బభ్రువాహనుడు, చిత్రాంగద సంతోషంగా అంగీకరిస్తారు. పుండరీకుడు పాతాళానికి వెళ్ళి, శేషుడికి ఉలూచి సందేశాన్ని వినిపించి, గుర్తుగా పంపించిన తాళిబొట్టును అందించి, మృత సంజీవనిని అర్ధిస్తాడు. శేషడు అంగీకరించినా, అతని కుటిల మంత్రి ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు. చేసేది లేక, అర్జునుణ్ణి ఎలాగైనా శ్రీకృష్ణుడు రక్షించుకుంటాడు. మృత సంజీవనిని ఇవ్వడానికి నాగకులం అంగీకరించడం లేదని చెప్పి పుండరీకుడ్ని పంపించేస్తాడు శేషుడు. పుండరీకుడి ద్వారా ఈ వార్త విన్న బభ్రువాహనుడు, కోపంతో పాతాళం మీదకు దండెత్తి పాముల్ని హింసించి సంజీవ మణిని తీసుకువస్తాడు. ధృతరాష్ట్రుడు, తన కొడుకులచేత, అర్జునుడి తలను అపహరింపచేస్తాడు. బభ్రువాహనుడు కలత చెందుతాడు.

అక్కడ హస్తినాపురంలో కుంతికి పీడకల వస్తుంది. అర్జునుడు, నూనెబావిలో మునిగి, ఒంటికి గోమయాన్ని రాసుకుని, రక్తమాల్యాలను పులుముకొని, దక్షిణ దిశకు గాడిద వాహనమెక్కి వెళ్లినట్లుగా ఆమె కలలో కనిపించింది. ఆ కలను ధర్మరాజు కృష్ణులతో చెప్పి, పాండవ మధ్యముడికి ఏదో కీడు వాటిల్లిందని, రక్షించమని గోవిందుణ్ణి వేడుకొంది. వెంటనే శ్రీకృష్ణుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని, గరుత్మంతుణ్ణి పిలిపించి, కుంతీ యశోద, భీముడితో అర్జునుడున్న చోటికి వెళ్తారు. పార్థుడి మృతికి దు:ఖించి ప్రద్యుమ్నుని ద్వారా బభ్రువాహనుదులను తెలుసుకుని, పార్థుడి శిరస్సు గురించి ఇలా ప్రతిజ్ఞ చేస్తాడు.

మ॥     వినుడీ నాదు ప్రతిజ్ఞ యే నఖిల పృధ్విన్‌ బ్రహ్మ చర్య వ్రతం/ బున బెంపొందితినేని కవ్వడి శిరంబున్‌ వచ్చు దచ్చోరకుల్‌/ పునుకల్‌ వ్రయ్యలు వ్రాసి చత్తు రన నాలో గ్రీడి మస్తంబు చ/ య్యన వచ్చెన్‌ విగతాసులైరి ధృతరాష్ట్రాపత్యముల్‌ కానలోన్‌’’ (జై. భా. 7వ ఆశ్వా. 124వ పద్యం)

అర్జునుడి తలను మొండానికి చేర్చి, గుండెల మీద సంజీవమణి కృష్ణుడుంచుతాడు. అలాగే వృషకేతుణ్ణి కూడా బ్రతికిస్తాడు. బంధువులందరూ కలిసి సంతోషంగా ఉంటారు. పితృవధా పాతకానికి బాధపడుతున్న బభ్రువాహనుణ్ణి భీముడు ఓదారుస్తాడు. వాళ్ళందరూ కలిసి మణిపురంలో అయిదు రోజులుంటారు. ఆ తర్వాత భీముడితో పాటు బంధువులందరూ హస్తినా పురానికి వెళ్లిపోతారు. శ్రీకృష్ణుడు, బభ్రువాహనుడు, అర్జునుడితో యాగాశ్వ రక్షణోద్యోగంతో ముందుకు నడుస్తారు. ఈ బభ్రువాహన వృత్తాంతం మూలంలో 683 శ్లోకాల్లో ఉంటే, పినవీరన 185 గద్య పద్యాల్లో అనువదించాడు. గంగ శాపం వల్ల పెరిగన కోపంతో అర్జునుడు అదుపు తప్పి కొడుకును అనరాని మాటలు అంటాడు. యుద్ధానికి ప్రేరేపించి తన నాశనాన్ని తానే కోరితెచ్చుకుంటాడు. ఎంతమంది ఎన్ని విధాలా చెప్పినా పట్టించుకోని తండ్రిగా పంతంతో కొడుకుతోనే భయంకరయుద్ధాన్ని చేసి ప్రాణాలు కోల్పోయిన తండ్రిగా ఈ కావ్యంలో అర్జునుడు కనిపిస్తాడు.

2.4 శ్రీరాముడు:

జైమిని భారతం, ఆరోఆశ్వాసమంతా కుశలవోపాఖ్యానమే. బభ్రువాహనుడు, అర్జునుల యుద్ధాన్ని,  శ్రీరాముడితో కుశుడుచేసిన యుద్ధంగా  జైమిని పోల్చాడు. 273 పద్య,గద్యాలలో రాసిన ఈ ‘లవకుశోపాఖ్యానం’ సంపూర్ణ కావ్యలక్షణాలు, ఫలశ్రుతితో విరాజిల్లుతోంది. కం॥ ‘‘వెలయగ నీ కథ విను ధ/ న్యులు తక్కిన కథలు వినగ నొల్లరు మదిగా/ కులరొదలు విన రుచించునె/ కలకంఠ ధ్వనులు విన్న కర్ణంబులకున్‌’’ (జై. భా. 6వ ఆశ్వా. 270వ పద్యం).

తిక్కన పది ఆశ్వాసాల ‘నిర్వచనోత్తరరామాయణ’ కథలోని కొన్ని ఘట్టాలు జైమిని భారతంలో కనిపిస్తాయి. శ్రీరాముడు తండ్రి మాట విని, పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి, రావణ కుంభకర్ణ, మేఘనాథుల్ని చంపి, సీతను తిరిగి స్వీకరిస్తాడు. సౌమిత్రి, విభీషణ, సుగ్రీవ, జాంబవంతాది యోధులు కొలుస్తుండగా అయోధ్యా నగరానికివచ్చి, రాజ్యాభిషేకం తర్వాత ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలిస్తాడు. తొమ్మిది వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాక, ‘సంతానం’ కోసం ఆలోచన కలుగుతుంది. ఆ సందర్భంలో -

మ॥‘‘ప్రతిభం దొమ్మిది వేల్‌ శరత్తులు నుతింపన్‌ ధాత్రి బాలించి ము/ ప్పు తుదం జక్క దనంబు చాలమికి ‘నాపుత్రస్యలోకోస్తి’ యన్‌/ స్మృతి నూహించి పితౄణముక్తి గనలేమిన్‌ రామభద్రుండు, సం/తతమున్‌ సంతతి గోరి డెందమున సంతాపంబునం బొందగన్‌’’ (జై. భా. 6వ ఆశ్వా. 11వ పద్యం)

‘‘నా పుత్రస్య లోకోస్తి’’ అనే స్మృతి వాక్యాన్ని గుర్తు చేసుకుని, పితృఋణం నుండి ముక్తి కల్గించే సంతానం పొందాలని రాముడు సంకల్పించుకుంటాడు. కొన్నాళ్లకు, సీతాదేవికి, తొలిచూలు లక్షణాలు కనిపిస్తాయి. ‘‘నాలుగు మాసాల తర్వాత, లక్ష్మణుడి చేత సీతను గంగానది ఒడ్డున విడిచిపెట్టించినట్లుగా, తెల్లవారుజామున రాముడు కలగంటాడు. కులగురువైన వసిష్ఠుడికి ‘భావి కార్యంబు గాకమానదు’ అని చెప్పి జనకుణ్ణి రప్పిస్తాడు.  జనక మహారాజు వచ్చి, సీతాదేవికి - అయిదో నెలలో, శుద్ధ సప్తమి నాడు, దంపతులకు తారాబలం సరిపోయాయని, ధనుర్లగ్నంలో సీమంత పుంసవనాలు జరిపిస్తారు. జనకమహారాజు యథోచితంగా దానధర్మాలు చేసి, తన రాజ్యాన్ని  కూడా రాముడికి అప్పగించి తపస్సు చేసుకోడానికి వెళ్ళిపోతాడు. కొన్నాళ్లకు ‘‘గంగాతీరంలో తపస్వులను చూడాలనుందని సీతాదేవి రాముడితో ఏకాంతంలో చెప్తుంది. సరే! అలాగే కానిమ్మంటాడు. పౌర వృత్తాంతాలు తెలియజేయడానికి చారులు  ‘‘అల రాఘవుండనే, దనుజ గ్రహీతసీత దనదారని క్రమ్మతెచ్చి యేలగన్‌’’ అన్న ఆరోపణల్ని విని, లక్ష్మణుణ్ణి పిలిచి ‘సీతను అడవిలో విడిచిపెట్టు... లేదంటే ఈ కత్తితో నా తలను ఖండిరచు.  లక్ష్మణుడు అలాగే చేస్తాడు. ఎంతగానో దు:ఖిస్తున్న సీతనోదార్చి, వాల్మీకిముని తన ఆశ్రమానికి తీసుకు వెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాడు. తొమ్మిది నెలలు నిండుతాయి.

కం॥     ‘‘మిహిరుని గూడక పుణ్య .. కుమారుద్వయమున్‌’’  (జై. భా. 6వఆశ్వా. 86వ పద్యం)

శుభగ్రహాలు అయిదు, సూర్యుడు చేరకుండా, ఉచ్ఛస్థానాలైన కేంద్రస్థానాల్లో ఉన్న శుభలగ్నంలో సీతాదేవి ఇద్దరు కొడుకుల్ని ప్రసవిస్తుంది. అప్పుడు దిక్కులు ప్రసన్నమై, పుష్ప వృష్టి కురిసింది. వాల్మీకి, వచ్చి వాళ్ళను చూసి ‘జాతకర్మ’ను నిర్వర్తించి ‘కుశలవులు’ అని నామకరణం చేసి, పెంచి పెద్దచేసి, విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. ఉపనయనాన్ని చేయించి, నాలుగువేదాలు, షడంగాలు, నానాపురాణాలు ఆగమాలతో పాటు ధనుర్వేదం నేర్పి, దివ్యాస్త్ర సంధానాలు, ఆకర్షణ, ఉపసంహారణలను, తెలియజేస్తాడు. సంగీత శాస్త్రాన్ని సవివరంగా తెలిసుకుని, వీనుల విందుగా రామాయణాన్ని గానం చేస్తుంటారు. కొడుకుల్ని చూసి బాధను మరిచిపోయి సీతాదేవి ఆశ్రమంలో శాంతంగా ఉంటుంది.

రావణుణ్ణి చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్యాదోషం పోగొట్టుకోడానికి శ్రీరాముడు అయోధ్య నగరంలో ‘అశ్వమేధయాగం’ కోసం మునుల అనుమతితో ‘బంగారు సీతమ్మ విగ్రహాన్ని’ చేయిస్తాడు. యాగాశ్వం నుదిటిమీద ఇలా రాయిస్తాడు-

కం॥     మిత్ర కులాగ్రణి దివిజ .. సాహసు లున్నన్‌  (జై.భా-6వ.ఆ-107వ పద్యం)

అని రాసిన బంగారు పట్టాన్ని ‘యజ్ఞాశ్వం’ నుదుటన కట్టి, దాని వెంట మూడు అక్షౌహిణీల సైన్యంతో శత్రుఘ్నుని పంపిస్తాడు. దేశాలన్నీ దాటి వెళ్తుంటే కొంతమంది రాజులు ఎదురొచ్చి, ఆ పత్రికను చూసి చేతులు జోడిరచి విడిచిపెట్టేవారు. అలా వాల్మీకి ఆశ్రమానికి దగ్గరలోని అడవిలోకి ప్రవేశిస్తుందా అశ్వం. ఆ సమయానికి వాల్మీకి ముని వరుణ పురంలో యాగం చేయించడానికి వెళ్తారు. ఒక చోట గడ్డిమేస్తున్న గుర్రాన్ని, బ్రహ్మచారులు లవుడికి చూపిస్తారు. దాని నుదుటి మీద ఉన్న పత్రాన్ని చదివి...

 కం॥     ‘‘అని చదివి లవుడు రాఘవ .. గడపట ననుచున్‌”  (జై. భా. 6వ ఆశ్వా.115వ పద్యం)

అంటూ ఆ గుర్రాన్ని అరటి చెట్టుకు కట్టి, వచ్చిన సైన్యాన్ని చెల్లాచెదురు చేసి, శత్రుఘ్నడితో కాసేపు యుద్ధం చేస్తాడు.

పినతండ్రితో, రోషభీషణాకారుడై యుద్ధం చేస్తున్న లవుడితో - ‘వత్సా! ఇది అమోఘమైన బాణం. ఇప్పటికైనా యుద్ధం చాలించు. నీ మీద అంత: కరణంతో చెబుతున్నాను’ అని శత్రుఘ్నుడంటాడు. అయినా వెనక్కి తగ్గకుండా యుద్ధం చేస్తాడు. శత్రుఘ్నుడు వేసిన అస్త్రధాటికి లవుడు మూర్ఛపోయి నేల మీద పడిపోయాడు. వక్ష స్థలంలో బాణం తగిలిన చోట నుండి రక్తం ధారాపాతంగా కారుతుండటంతో శౌర్య నిధానుడైన శత్రుఘ్నడు, ఒళ్ళోకి ఎత్తుకుని, రాముడికి ప్రతిబింబంగా ఉన్నాడనుకుని, అన్నకు చూపించాలని రథంలో ఎక్కించుకుని, అశ్వాన్ని విడిపించుకుని వెళ్ళిపోతాడు.

లవుడు ఇంకా రాలేదని ఎదురు చూస్తున్న సీతాదేవికి ముని కుమారులు విషయాన్ని చెప్తారు. బాధ పడుతున్న తల్లిని విషయమడిగి, కుశుడు ఓదార్చి -శత్రువుల్ని జయించి, తమ్ముణ్ణి తీసుకువస్తానని తల్లి దీవెనలతో బయలుదేరతాడు. శత్రుఘ్నుణ్ణి, సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఘోరమైన యుద్ధంలో సైన్యం కకావికలమౌతుంది. చివరకు శత్రుఘ్నుడు మూర్ఛపోయి పడిపోతాడు. అయోధ్య నగరంలో రాముడికి విషయం తెలుస్తుంది.

యాగదీక్షితుణ్ణైన నేను కదలకూడదు కాబట్టి, అశ్వాన్ని పట్టిన వాళ్ళను గెలిచి, శత్రుఘ్నణ్ణి తీసుకురా’ అని లక్ష్మణుణ్ణి పంపుతాడు రాముడు. వీరావేశంతో బీభత్సంగా లవకుశులిద్దరూ లక్ష్మణుడితో ఘోరమైన యుద్ధం చేస్తారు. చివరకు కుశుడికి వాల్మీకి ముని ఇచ్చిన అయిదు బాణాలను, లక్ష్మణుడి మీదకు ప్రయోగించగానే రక్తసిక్తమైన శరీరంతో, సౌమిత్రి నేలమీద కూలిపోతాడు. సైన్యానంతటినీ చెల్లాచెదురుగా కొట్టి, కుశుడు విజయానందంతో లవుడి దగ్గరకు వచ్చి గుర్రాన్ని ఆశ్రమం దగ్గరకు తీసుకువెళ్తాడు.

లక్ష్మణుడి మూర్ఛవార్త విని, అన్నను ఓదార్చి భరతుడు యుద్ధానికి బయలుదేరిన భరతుడు కూడా మూర్ఛపోయాడు.  సుగ్రీవ విభీషణులతో, చతురంగ బలాలతో శ్రీరాముడే కదన రంగానికి వచ్చి, ఆ పిల్లలను చూసి-

‘‘మీకు జాతకర్మ నామకరణాలు ఎవ్వరు చేయించారు? ధనుర్వేదం ఎక్కడ అభ్యసించారు? యుద్ధ కౌశలం ఎవరు నేర్పారు? మీ తల్లిదండ్రులెవ్వరు? తెలియజేయండి’ అని అంటాడు.

తే.గీ॥    ‘‘పోరి కెదిరించి మా పుట్టు పూర్వములను… తగవుగాదని కుశుండు’’        (జై.భా-6వ-223వ పద్యం)

‘‘యుద్ధానికి వచ్చి, మా పుట్టుపూర్వాలు ఎందుకు అడుగుతారా? మీ తేటమాటలకు లోబడి హయాన్ని ఇచ్చే వాళ్లం కాము. అయినా మీ అంత వారు అడిగితే చెప్పకుండా ఉండటం మంచి పద్ధతి కాదు.’’ అని వాళ్ళిద్దరూ రాముడికి సొంతవిషయాఇ్న చెప్తారు.

‘‘మాకు జాతకర్మ చేసింది... దివ్యాస్త్రాల్ని నేర్పించిందీ... వాల్మీకి ముని. అంతేకాదు రామాయణాన్ని కూడా వారే నేర్పించారు. మా తల్లి సీతాదేవి. ఈ అడవుల్లోనే మమ్మల్ని ప్రసవించిందని’’ వాళ్ళిద్దరూ చెప్తారు. ‘సీత’ పేరు వినపడగానే, రఘురాముడు రథం మీదనే ఒరిగి ముహూర్త మాత్రంలో తేరుకుంటాడు. ‘‘సుగ్రీవుడితో, వీళ్లెవ్వరో కనుక్కోమని చెప్పగా, వీళ్లు మీ కొడుకులుకాకపోతే ఇంతటి ధైర్యసాహసాలు కలుగుతాయా?’’ అన్నంతలో నీలుడు ఒక కొండను పెకలించి వాళ్ల మీదకు విసురుతాడు. దాన్ని వాళ్లు పిండిపిండి చేసేస్తారు. తమ్ముళ్ల స్థితిని, సైన్యం పరిస్థితిని స్వయంగా చూసిన రాముడు, దివ్యాస్త్రాలను ప్రయోగిస్తాడు. కవలలు వాటినన్నింటిని నాలుగేసి తునకలు చేస్తారు. ‘యుద్ధం చేయడంలో వాళ్లు నాతో సమానం’ అని గ్రహించి రాముడు నిశ్చలంగా ఉంటే కుశుడు శరపరంపరతో, రాముణ్ణి కూడా మూర్ఛపోయేలా చేస్తాడు. లవుడు, లాఘవంగా రథం మీదకు వెళ్ళి, కిరీట కుండలాలను, విలువైన ఆభరణాలను తీసుకుని నలుగురు అన్నదమ్ములను ఒకచోటుకే చేరుస్తాడు. జాంబవంత, హనుమంతులను రథానికి కట్టి, సీతమ్మ దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్తారు. ఇంతలో వాల్మీకిముని అక్కడకు వచ్చి, శ్రీరాముడితో సహా అందరికీ తెలివి తెప్పించి జరిగిన వృత్తాంతాన్ని లవకుశుల ద్వారా విని శ్రీరాముడికి వాళ్లను అప్పగిస్తాడు. కం॥          ‘‘కమలాప్త కులీనుడు దన... యధ్వరాశ్వముతోడన్‌. ’’  (జై.భా-6-ఆ-260వ పద్యం) రాముడు కుశలవును పిలిపించుకొని, పుత్రగాత్ర పరిష్వంగసుఖాన్ని పొంది, వాళ్లతో రామాయణ గానం చేయించుకొని, బంధుమిత్ర సుతసమేతుడై వాల్మీకి మహర్షి వెంటరాగా యాగాశ్వాన్ని తీసుకుని అయోధ్యకు వెళ్ళిపోతాడు. యుద్ధ వీరంతో, పినతండ్రులను ఓడిరచి, యుద్ధంలో తనకు సమానమైన మేటి వీరులుగా రాముడే గుర్తించిన పిల్లలు లవకుశలు. అశ్వమేధయాగమే ఈ తండ్రీ కొడుకులను కలిపింది.

2.5 ఆదిశేషుడు:

యుద్ధంలో అర్జునుడి తల తెగ్గొట్టిన బభ్రువాహనుడి కథలో ఏడో ఆశ్వాసంలో ఆదిశేషుడి పాత్ర కనిపిస్తుంది. అర్జుననిర్యాణానికి దు:ఖిస్తున్న చిత్రాంగదను ఉలూచి ఊరడిరచి, మా నాన్న దగ్గరున్న మృతసంజీవనిమణిని తెప్పించి భర్తను బ్రతికిస్తానని అంటుంది. ఉలూచి తండ్రి నాగులకు రాజైన ఆది శేషుడు. ఉలూచి నాగకన్య. ఆపత్కాలంలో ఉలూచి చెప్పిన మాటలు అందరికీ ధైర్యాన్నిస్తాయి.

పుండరీకుడు బయలుదేరి వెళ్ళి పాతాళలోకంలో శేషుఢకి ఉలూచి తన గుర్తుగా పంపిన ఇచ్చిన ‘బంగారపు తాళిబొట్టును’ చూపించి, విషయాన్నంతా వివరిస్తాడు. ‘‘తనకు పతిదానం చేయమని నీ కూతురు ‘ఉలూచి’ వేడుకుంది. ఈ భూమండలాన్ని పడగల మీద మోస్తూ, సమస్త జీవకోటికి పరమ సుఖాన్ని అందిస్తున్నావు. శివుడి వింటికి నారిగా మారి, త్రిపురాసుడి మీద విజయం సాధించి, దేవతలను కాపాడిన పన్నగ నాయకా!  నువ్వు చేసే పనులన్నీ పరోపకారాలే. కాబట్టి నీ నగరంలో మహా నాగుల రక్షణలో ఉన్న సంజీవనమణిని దయతో ఇస్తే పార్థుడు బ్రతుకుతాడు’ అని -కం॥    ఆ పుండరీకుడను... విని కరుణ దళుకొత్తన్‌. (జై.భా. 7వ ఆశ్వా. 78వ పద్యం) గంగా నది శాప కారణంగా, కొడుకు చేతిలో మరణించడం అర్జునుడు మరణించాడని పుండరీకుడు చెప్తాడు. దయార్ద్ర హృదయుడైన శేషుడు మృతసంజీవన మణిని, అమృత భాండాన్ని ఇద్దామని నిశ్చయించుకుంటాడు. ధృతరాష్ట్రుడనే నాగరాజును పిలిచి ‘సంపాదించిన వస్తువులలో దాత అయిన పురుషుడుకు ఇవ్వకూడని వస్తువు లేదు అన్నాడు. అది విని - ‘‘దేవా! నాదొక విన్నపం. మనుషులు అసత్యవాదులు, కృతఘ్నలు. వాళ్ల దగ్గర ఏక్రియలు ఫలించవు. నాగలోకానికి, నాగకులానంతటికి జీవన కారణాలైన ఈ వస్తువులను ఇచ్చేస్తే, మనకు, నీటి పాములకు తేడా ఏమిటి? గరుడుకు ప్రతిరోజూ తరుముతుంటాడు.’’ అని ధృతరాష్ట్రుడు శేషుడితో అంటాడు. శేషుడు శ్రీకృష్ణుడి లీలావిన్యాసాలను చెప్తూ -‘‘కృష్ణుడు బ్రహ్మసృష్టికి ప్రతిసృష్టి చేశాడు. కేశవుడికి అసాధ్యమైంది ఏది? అతడు తలచుకుంటే గడ్డిపరిక కూడా వజ్రాయుధం అవుతుంది. శ్రీమన్నారాయణుడి కరుణ లేకపోతే,  మహా మేరు పర్వతం అయినా తృణ ప్రాయమే. ఆయన కృపా కటాక్షాల వలనే మనమందరం బ్రతికున్నాం’’ అని బదులిస్తాడు.  ఏది ఏమైనా సరే... శేషుణ్ణి ఆ మణిని ఇవ్వకుండా చెయ్యాలని - ‘‘శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి బ్రతికించుకోగలడు. అలాంటప్పుడు, ఈ సంజీవనమణి, అమృతకలశం ఎందుకు? అనవసరంగా ఇవ్వడం వలన నాగకులానికి ఆపద కలుగటమే గానీ ప్రయోజనం లేదు’’ అని ధృతరాష్ట్రుడు పుండరీకుడితో ‘‘మా నాగకులం వారు సంజీవని మణిని, సుధాపాత్రను ఇవ్వరు. శ్రీహరి తన కృపతో అర్జునుణ్ణి బ్రతికించగలడు’’ అని శేషుడంటాడు. ఆ మాటల్ని తిరిగి వచ్చి, బభ్రువాహన, చిత్రాంగద, ఉలూచులతో ‘శేషుడు సంజీవన రత్నాన్నివ్వకుండా, లోభంతో మాట్లాడాడని చెప్తాడు.

 ఆ మాటలకు బభ్రువాహనుడు కోపంతో పాతాళ లోకం మీద యుద్ధానికి వెళ్తాడు.  శేషుడు  తేరుకుని ‘ధృతరాష్ట్రుడి’ దుర్నీతిని ఆచరించడం వలన నాగ కులానికి ఇంతటి ఆపద వచ్చింది. ఇప్పుడిక ఏం చేస్తామని అనుకుని వాసుకి, కర్కోటక, తక్షక, ధృతరాష్ట్రాది పాములను యుద్ధానికి సిద్ధమవ్వమన్నాడు. అయిదు యోజనాల విస్తీర్ణం గల బ్రభువాహనుడి సేన మీద నాగులు దాడి చేసి, కాటు వేయడానికి సిద్ధపడుతుండగా, మయూరాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అందులోంచి నెమళ్లు వచ్చి పాములను చంపేస్తాయి. వెంటనే మధువర్ష బాణాన్ని ప్రయోగిస్తాడు. తేనె వానగా కురిసింది. కం॥  ‘‘నిలువక పిపీలికాస్త్రం/ బలుక .. దొలిచె శరీరాస్థులెల్ల దొఱటలువాఱన్‌’’ (జై. భా. 7వ ఆశ్వా. 101వ పద్యం) ఎంతో తెలివిగా ఆ వెంటనే పిపీలికాస్త్రం వేస్తాడు. అందులోంచి చీమలు పుట్టుకొచ్చి, పాముల శరీరాలను తొలిచి తినేస్తాయి. ఇక్కడ సుమతీ శతకంలోని -‘బలవంతమైన సర్పము, చలి చీమల చేత చిక్కి చావదె సుమతి!’ అనే పద్యం గుర్తుకువస్తుంది. ఇలా జరుగుతుందని ఊహించని శేషుడు, ‘ధృతరాష్ట్రా! నీ వల్ల ఇంతటి ఆపద సంభవించింది. ఇప్పుడు నీ తెలివి ఎక్కడికి పోయింది?’ అని నిరసించి, ఆ క్షణంలోనే బభ్రువాహనుడికి, దివ్యమైన కవచంతో బాటు మరిన్ని కానుకలను ఇచ్చి, బంగారు పెట్టెలో పెట్టి సంజీవన మణిని, అమృత కలశాన్ని ఇచ్చి, అతన్ని తీసుకుని మణిపురానికి వెళ్తాడు. ఆదిశేషుడు కూతురి భర్తను బ్రతికించాలని ముందు అనుకుని, మృత సంజీవన మణిని ఇద్దామనుకుంటాడు. కానీ మంత్రి మాటలకు ప్రాధాన్యమిచ్చి, కూతురి పసుపు కుంకుమల గురించి పట్టించుకోని తండ్రి పాత్రగా శేషుడి అవివేకం ఇందులో కనిపిస్తుంది. చివరకు యుద్ధం వరకు తెచ్చుకున్నాడు. అయినా విజయాన్ని సాధించలేక ఓడిపోతాడు.

చెడు ఉపదేశాలవల్ల పూర్తిగా సైన్యాన్ని కోల్పోయిన పాత్రగా ఆదిశేషుణ్ణి పినవీరభద్రుడు ఈ కావ్యంలో చిత్రించాడు.

2.6 ధృతరాష్ట్రుడు:

ధృతరాష్ట్రుడు ఆదిశేషుడి దగ్గర మంత్రి. సంజీవనమణిని, అమృత కలశాన్ని పుండరీకుడికి ఇవ్వకుండా, శేషుడి బుద్ధిని మరల్చిన వాడు. ఆ కారణంగా బభ్రువాహనుడు నాగలోకం మీదకు దండెత్తి యుద్ధానికి వచ్చినప్పుడు, ధృతరాష్ట్రుడి మాటల వల్లనే, ఇంత దూరం తెచ్చుకున్నానని శేషుడు నిండు సభలో అవమానిస్తాడు. అప్పుడు బాధపడి, ఇంటికివెళ్లి తన కొడుకులను ‘దుర్బుద్ధి’, ‘దుస్వభావులు’ పిలిచి, బభ్రువాహనుడి వలన కలిగిన పరాభవాన్ని చెప్పి ‘‘నేను  ధృతరాష్ట్రుడనే పేరున్నవాణ్ణి కాబట్టి పాండవులకు మనకు మొదటి నుండి ఎడతెగని శత్రుత్వం ఉందని చెప్పి అర్జునుడు బ్రతకకుండా ఉండేందుకు ఉపాయాన్ని ఆలోచించండి’’ అని దురుపదేశం చేస్తాడు.

వాళ్లిద్దరూ కాసేపు ఆలోచించి, అర్జునుడి ‘తలను’ దాచేస్తాం. కిరీటిని బ్రతికించడానికి సంజీవనమణి, శేషుడు, శ్రీకృష్ణుడు కూడా ఏమి చెయ్యలేరు. అప్పుడు  ఆ యగాశ్వాన్ని ఎవ్వరైనా బంధిస్తారు. ధర్మరాజు యజ్ఞం పూర్తి చెయ్యలేడు. అంతటితో నీ పగ తీరుతుంది కాబట్టి అర్జునుడి ‘శిరస్సును’ మేము పట్టుకువెళ్లిపోతాం. నువ్వు కుంగిపోకు’’ అంటారు. ఆనందంతో ‘అలాగే చేయండని’ కొడుకులను పంపించి, తనకేమీ తెలియనట్లు, శేషుడి వెనకాతలే, మణిపురానికి వెళ్తాడు.ఆ క్షణంలోనే ధృతరాష్ట్రుడి కొడుకులు మాయారూపాల్లో వచ్చి అర్జునుడి ‘తలను’ అపహరించి, దాల్భ్య వనంలో దాచుతారు. ఉలూచి, చిత్రాంగదలు భర్త ‘తల’ కనబడకపోయే సరికి, అంతా వెతికించి, బాధపడతారు. బభ్రువాహనుడు ‘మృత సంజీవన మణి’తో అక్కడకు వచ్చి ‘తండ్రి శిరస్సు’ కనిపించకపోయేసరికి, సొమ్ముసిల్లి పడిపోతాడు.ఆ రాత్రి హస్తినాపురంలో ‘కుంతీదేవి’కి దుస్స్వప్నాలు వస్తాయి. దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్న కృష్ణుడు అందరితో కలిసి గరుత్మంతుడి మీద మణిపురానికి చేరుకుంటారు. ‘‘నేను త్రిలోక ఖ్యాతిని పొందిన నైష్ఠిక బ్రహ్మ చర్య వ్రతాన్ని పెంపొందించినవాడినైతే, సత్యాన్ని తప్పని వాడినైతే అర్జునుడి శిరస్సు వచ్చుగాక! ఆ చోరుల తలలు పగిలిపోవునుగాక!’’ అని కృష్ణుడు అనగానే అర్జునుడి ‘తల’ వస్తుంది. ధృతరాష్ట్రుడి కొడుకులు - తలలు పగిలిపడిపోయారు.

ఈ కావ్యంలో నాగలోకవాసి అయిన ధృతరాష్ట్రుడు ఎంతో దుర్నీతితో ఉంటాడు.  చెడ్డ ఉపదేశాలను చేసే మనస్తత్వం ఇతడిది. పరాభవదు:ఖాన్ని సహించలేక కొడుకుల్ని ఉసిగిలిపిన కిరాతకుడు. పాండవుల వంశం మీద పగతో రగిలిపోయి, అందివచ్చిన కొడుకులిద్దరినీ కోల్పోయిన నీచమైన తండ్రి పాత్రగా ధృతరాష్ట్రుణ్ణి ఈ కావ్యంలో పినవీరన చిత్రించాడు.

2.7 మయూరధ్వజుడు:

‘రత్నపురి’కి రాజు ‘మయూరధ్వజుడు’. ఇతని కొడుకు సుచిత్రుడు. సుచిత్రుడికే ‘తామ్రధ్వజుడని’ పేరు కూడా ఉంది. మణిపురంలో బభ్రువాహనుడి ఆతిథ్యం తర్వాత, మిగిలిన వాళ్లను భీమసేనుడితో హస్తినాపురానికి పంపించి, కృష్ణుడు కూడా అర్జునుడితోనే వస్తానంటాడు. ‘యజ్ఞాశ్వం’ నానా దేశాలు తిరిగి రత్నపురంలోకి ప్రవేశించే సమయానికి, మయూరధ్వజుడు కూడా అశ్వమేధయాగం ప్రారంభించడానికి గుర్రాన్ని సిద్ధం చేసి, దానికి రక్షణగా, తన కొడుకైన తామ్రధ్వజుణ్ణి పంపిస్తాడు. ఆ రెండు గుర్రాలు ఎదురుపడి, ఒకదానితో మరొకటి కయ్యానికి కాలు దువ్వి, గట్టిగా శకిలిస్తాయి. కొంతసేపటికి మయూర ధ్వజుడి గుర్రం, పాండవుల గుర్రానికి లోబడుతుంది.

తామ్రధ్వజుడు కోపంతో ‘‘సేనాధిపతీ, ఆ గుర్రం ఎవరిది’’ అని అడుగుతాడు. ఆ గుర్రాన్ని పట్టుకొని దాని నుదుటి మీద రాసున్న పద్యం చదివి, ‘ధర్మరాజు’ గుర్రమిదని, తామ్రధ్వజుడికి చెప్పాడు. మన రాజైన మయూరధ్వజుడు ఏడు అశ్వమేధ యాగాలు చేశాడు. ఇది ఎనిమిదవది. అని, సేనాధిపతి వైపు తిరిగి, ‘‘పాండవ సైన్యంలో వృషకేతుడు, అర్జునుడు తప్పించి, చేవగల వాళ్లు లేరని’’ నిన్నరాత్రి నారదుడు చెప్పాడు. ఇవాళ్టికి నరనారాయణులతో యుద్ధం మనకు సిద్ధిస్తోంది’’ అని తామ్రధ్వజుడు అంటాడు.

ఆ మాటలకు ‘‘పాండవ సైన్యంలో బభ్రువాహనుడనే శూరుడు ఒక్కడే ఉన్నాడని’’ అర్ధచంద్ర వ్యూహాన్ని పన్ని తామ్రధ్వజుడు యుద్ధానికి సిద్ధపడతాడు. ప్రద్యుమ్నుడు గృధ్రవ్యూహంలో యుద్ధ రంగంలోకి దూకుతాడు. అందులో అనిరుద్ధుడు, అనుసాళ్వుడు, హంసధ్వజుడు, సాత్యకి, కృతవర్మ, బభ్రువాహనుడు, సత్యభామ కొడుకైన చిత్రభాను చారుచిత్రులూ, అర్జునుడు, కృష్ణుడు, వృషకేతుడు, యౌవనాశ్వుడు, మేఘవర్ణుడు మొదలైన వాళ్ళున్నారు.   యుద్ధం విరోచితంగా ఘారాతి ఘోరంగా జరుగుతుంది. తామ్రకేతుడు, దివ్యాస్త్రాలతో ఒక్కొక్కరినీ మూర్ఛపోయేలా చేస్తాడు. చివరకు, చక్రాన్ని ప్రయోగిద్దామని, చక్రాన్ని చేత్తో పట్టుకున్న కృష్ణుడిని కూడా ఓడిరచి చక్రాన్ని తీసుకుని, కృష్ణార్జులను మూర్ఛపోయేలా చేసి, రెండు యాగాశ్వాల్ని తీసుకుని తామ్రధ్వజుడు తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాడు.

మయూరధ్వజుడితో, అతని సేనాధిపతి - ‘నీ కొడుకు కృష్ణార్జునులను గెలిచి, యాగాశ్వాన్ని పట్టుకొని తెచ్చాడు’ అని అంటాడు. ఆ మాటలకు, కోపంతో ఎర్రబడిన కళ్లతో కొడుకుని చూసి, ‘నువ్వు కృష్ణార్జులను తీసుకురాకుండా, గుర్రాన్ని మాత్రమే తెచ్చావు. ఇంత కన్నా అమాయకత్వం ఉంటుందా! యజ్ఞ మయుడు, యజ్ఞకర్త, భోక్త, ఫలప్రదాత అయిన వాసుదేవుడు లేని జన్మెందుకు? ఎవ్వరినుద్దేశించి యాగాన్ని చేయగలం!’ అని భార్యతో అంటాడు.

మూర్ఛ నుండి తేరుకున్న అర్జునుడు - ‘‘ఇంత వరకు యుద్ధం చేసిన యోధుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని ఎటువెళ్లాడో నాకు చెప్పు. అతణ్ణి యుద్ధంలో గెలిచి, అశ్వాన్ని తీసుకువస్తాను’ అని కృష్ణుడితో అంటాడు. తావ్రుధ్వజుడు మనల్ని మూర్ఛపోయేలా చేసి, గుర్రాన్ని తీసుకుని రత్నపురానికి వెళ్ళి, తన తండ్రికిచ్చాడు. ఇంక మనము కాదు కదా, త్రిమూర్తులు ఒక్కటై వచ్చినా గెలవలేరు. మయూరధ్వజుడు నా భక్తాగ్రగణ్యుడు. దానం చేయడంలో గొప్పవాడు. అతడి సాహస ఔదార్యాలను చూడాలని ఉంటే నాతో రా’’ అని తీసుకువెళ్లి, సైన్యాన్ని రత్నపుర సరిహద్దుల్లోనే ఉంచి, వృద్ధబ్రాహ్మణ రూపంలో కృష్ణుడు, అతడి శిష్యుడైన బ్రహ్మచారి రూపంలో అర్జునుడూ ఇద్దరూ రత్నపురానికి వెళ్తారు.

సతీసమేతంగా ఉన్న మయూరధ్వజుణ్ణి చూస్తూ ఆ కపట బ్రాహ్మణులిద్దరూ, ‘రాజోత్తమా! భద్రమస్తు’ అని ఆశీర్వదిస్తారు. ఆ రాజు, వాళ్లకు నమస్కరించి, ఓ బ్రాహ్మణోత్తమా! నేను వందనం చేయడానికన్నా ముందే మీరాశీర్వాదం చేయడం, శపించడమే గాని, దీవించడం కాదు. ఎక్కడెక్కడికి వెళ్తూ ఇక్కడకు వచ్చారు? నావల్ల మీకు కాగల కార్యం ఏమిటో దయతో చెప్పండి’ అని వినయంగా అడుగుతాడు.

‘రాజశ్రేష్ఠా! మేం కార్యార్థులమై వచ్చాం కాబట్టి, ముందుగా ఆశీర్వాదం చేయడం, తర్వాత నువ్వు నమస్కారం చేయడం అపరాధం కాదు’ అన్న మాటలకు ‘అభ్యాగత స్వయంవిష్ణు:’ అంటారు కాబట్టి నువ్వు సాక్షాత్తు జనార్దనుడిలా అనిపిస్తున్నావు. సంకోచించకుండా ఏం కావాలో అడుగు. దేహవంచన, మనోవంచన, ద్రవ్య వంచన లేకుండా ఆనందంగా ఇస్తాను’’ అని మయూరధ్వజుడు అంటాడు. ‘‘రాజా! ధర్మపురంలో నివాసం ఉంటాను. కృష్ణశర్మ నాపేరు. ఇతడు నాకు శిష్యుడు. ఇతనితో కూడా, నేను నా కొడుకుని తీసుకుని, నీ పురోహితుడైన సుశీలుడి ఇంట్లో కన్య ఉందని విని, నా కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికని వస్తున్నాం. అతి భయంకరమైన కారడవిలో, బాగా ఆకలితోనూ, కోపంతోనూ ఉన్న ఒక సింహం నా కొడుకు మీద పడి, వాడి గొంతును పట్టుకొంది. దాన్నుంచి విడిపించడం మా తరం కాలేదు. వేరే ఉపాయం తోచక ‘‘అటవ్యాం నారసింహశ్చ’’ అన్నట్లు అడవిలో నరసింహుడే రక్షకుడు కాబట్టి, ‘‘శ్రీ నృసింహ... శ్రీనృసింహ...’’ అని నూట ఎనిమిది సార్లు జపించాను.

ఆ నరసింహుడు ప్రత్యక్షమైనా నా కొడుకును కాపాడలేదు. ఈ విధంగా ఆ సింహం  చిక్కిన నా కొడుకును గోళ్లతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ, మనిషి భాషలో నన్నుద్దేశించి ఇలా అంది. ‘‘ఓ బ్రాహ్మణుడా! నాకు చిక్కిన ఏ జంతువునైనా, ఆ యముడు కూడా విడిపించలేడు. అలాంటిది నువ్వెంతటి వాడివి? నా కన్నా బలవంతుడు లేడు. నువ్వు, నీ శిష్యుడు ఇంటికి వెళ్లిపోండి’’ అని చెప్పగా నేను బాధతో నా కొడుకును వదిలివెళ్ళలేక, ‘పుత్ర హీనులకు ఊర్థ్వగతి లేదు’ అని సూక్తి కదా! నన్ను, నా శరీరాన్ని తీసుకుని, నా కొడుకుని వదిలిపెట్టమని’’ అడిగాను.

అప్పుడా సింహం, ‘దుష్టజంతువులైన మేము, అల్పాయుష్కుల జోలికే గాని నీలాంటి దీర్ఘాయుష్కల జోలికి రాము. కొడుకు గురించి నువ్వు ఇంతలా బాధ పడాల్సిన పని లేదని వెళ్లిపొమ్మంది.’’ నాకు నీ వల్ల కావలసిన ప్రయోజనం ఒకటి కూడా లేదు. ‘మయూర ధ్వజుని ద్వారా కావలసిన కార్యం ఉంది’ అని చెప్పి, నువ్వు దానికి అంగీకరిస్తే ఆ కార్యమేమిటో చెబుతాను’ అని మాయా బ్రాహ్మణుడు అన్నాడు.

అందుకా రాజు, ‘‘ఆ సింహం సాక్షాత్తు నరసింహదేవుడే. నేను ఇవ్వదలచిన పదార్ధాలను అన్నింటిని, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు కావలసిన దాన్ని అడుగు. ‘నా మాట వృధా కాదు’ అని అన్నాడు. ఓ రాజా! ‘దుర్బలస్య బలం రాజా’ అనే వచనముంది. కాబట్టి మా వంటి దీనార్థులకు, మీ వంటి దాతలను వేడుకోవడంలో సంశయించే పని లేదు. ఆ సింహం, నీ దేహంలో సగం ఇస్తే నా కొడుకుని విడిచిపెడతానని చెప్పింది. ‘బహుజన సంరక్షకులైన మహారాజుల శరీరాన్ని కోసి ఇమ్మనడం మా వంటి విప్రులకు ఉచితమా. అని అన్న నన్ను చూసి, ఆ రాజు సామాన్యుడు కాదు. దీన జనరక్షకుడు, ఆత్మవిద్యావిశారుదుడు, ఉత్తమోత్తముడు, ఉదారుడు. అలాంటి మయూరధ్వజుణ్ణి అడగాల్సిన కార్యానికి సంశయించాల్సిన పని లేదు. అది అలా ఉంచితే, నీ కొడుక్కి బదులుగా నీ శరీరాన్ని ఇస్తానన్నావు కదా! ముసలి తనంతో వడలి, తపస్సు వలన శోషించి, ఉపవాసాలతో కృశించి బలహీన పడిన నీ శరీరం నాకెందుకు? ఆ రాజు శరీరం సకల రసాలతో తృప్తి పొంది సర్వ సుఖాలను చవిచూసిన, వెన్న ముద్దలాగా నా నోటికి ఇంపుగా ఉంటుంది. ’’ అని సింహం చెప్పింది. అందుకని నీ దగ్గరకు వచ్చామని ఆ మాయాబ్రాహ్మణులు రాజుతో చెప్తారు. అంతేకాకుండా ‘‘నా కొడుకుని బ్రతికించు. నీ వల్ల కాదంటే  వేరే దారి చూసుకుంటాం’’ అంటారు.

మయూరధ్వజుడా మాటలు విని, ‘‘నీ కొడుక్కి బదులుగా నా శరీరాన్ని సింహానికివ్వడానికి ఒప్పుకుంటున్నాను.’’ అని మంత్రి పురోహిత బంధుమిత్రులను చూసి, ‘‘రాజులకు యుద్ధంలో గాని, గోబ్రాహ్మణుల గురించి గాని శరీరాన్ని త్యాగం చేయడం తగిన ధర్మం. శిబి, జీమూత వాహనులు, పరోపకారార్థం తమ శరీరాలను త్యజించి స్వర్గ సుఖాలను పొందారు. అలాగే, నేనీ విప్రుడికి నా శరీరాన్ని ఇచ్చి కృతకృత్యున్ని ఔతాను. దీనికి, విఘాతంగా మాట్లాడకు’’ అని కొడుకైన తామ్రకేతుడికి రాజ్యాభిషేకం చేసి, నర్మదానదిలో స్నానం చేసి, దాన ధర్మాలు చేసి, ఆ మాయా బ్రాహ్మణులను పిలిచి- ‘మదీయార్ధ దేహ దానేన హరి: ప్రీతో భవతి’20 అని ధారపోశాడు. యజ్ఞవేదికలో దర్భాసనం మీద కూర్చుని, మొగలి రేకులాంటి రంపాన్ని తలమీదపెట్టి కోసుకోవడానికి సిద్ధపడుతుండగా, పరమసాధ్వి అయిన అతని భార్య ‘కుముద్వతి’ ఇదంతా తెలుసుకుని, వెంటనే అక్కడికి వెళ్లి-

కం॥     ‘నీ యర్థ శరీరము కా ..  పలికె నధిపుని తోడన్‌’ (జై. భా. 7వ ఆశ్వా. 222వ పద్యం)

‘‘పురుషుడిలో సగభాగం భార్య’’ అని వేదవచనం. కాబట్టి, నా శరీరాన్ని బ్రాహ్మణ కార్యానికి కోసిస్తాను. ఆగండి.’’ అన్న మాటలకు, ఆ కపట భూసురుడు, రాజుతో, ‘పురుషుడి ఎడమ భాగం స్త్రీ భాగం. కాబట్టి మయూరకేతనుడి ఎడమ భాగం తీసుకు రావద్దు’ అని సింహం చెప్పింది. అలాంటప్పుడు నీ భార్య శరీరాన్ని ఒప్పుకుంటుందా!’’ అనగానే, ఆ మహారాజు కొడుకైన తామ్రకేతుడు, వాళ్లకు నమస్కరించి, ‘యోవైపితా సపుత్ర’, అంటే తన ఆత్మే కొడుకుగా పుడుతుందని వేదవచనం. కాబట్టి మా తండ్రి శరీరానికి ప్రతిగా నా శరీరాన్ని ఇచ్చి నేను ఋణత్రయం నుండి విముక్తుడౌతాను. తండ్రి చేసిన ప్రతినను చెల్లించి, శ్రీరామభద్రుడు, భీష్ముడిలా కీర్తిని పొందుతానన్నాడు.’’ అందుకా మాయా విప్రుడు, రాజకుమారా! సింహం చెప్పిన మాటలు విను.

‘ఆ రాజు శరీరాన్ని, ఆయన భార్య, కొడుకూ కలిసి కోసి ఇవ్వగా, అందులో కుడి భాగాన్ని తీసుకు రమ్మని నన్ను పంపించింది. కాబట్టి అలాగే చెయ్యాలి. అనగానే, ఆ రాజు నవ్వుతున్న వదనంతో, తన చేతిలోని రంపాన్ని వాళ్లకు అందించి, అతను చెప్పినట్లే చెయ్యండి’ అని అంటాడు. కుముద్వతి, తామ్రధ్వజుడు, రెండు పక్కలా నిలబడి, కర్కశమైన రంపాన్ని మయూర ధ్వజుడి తలమీదపెట్టి, ‘శ్రీమన్నారాయణా! హరిహరీ!’ అని కోస్తుంటే, ధారాపాతంగా రక్తం కారిపోతుండటం చూసి ప్రజలందరూ హాహాకారాలు చేస్తారు. దేవతలు ప్రశంసిస్తారు. అప్పుడు అతని ఎడమ కంటి నుండి నీళ్లు కారుతున్నాయి. అది గమనించిన ఆ మాయా బ్రాహ్మణుడు, ఆ రాజుమీద కోపం ప్రదర్శించి, చేతిలోని వేణుదండాన్ని క్రిందకు విసరికొట్టి, లేచి ఇటు అటు గంతులు వేసి, ‘అపుత్రత వలన ఊర్ధ్వ లోకాలు లేకపోయినా పోనియ్యి. ఏడుస్తూ ఇచ్చిన దానాన్ని నేను స్వీకరించలేను’ అని శిష్యుడి చెయ్యిపట్టుకుని జరజర ఈడ్చుకొని వెళ్ళిపోతుంటే, ఆ రాజు భార్య, తన భర్త తలను గట్టిగా పట్టుకుని ‘అయ్యో! నీ శరీరాన్ని వ్యర్థంగా కోయించి, తాను తీసుకోకుండా, ఆ బ్రాహ్మణుడు లేని నేరాన్ని చూపించి, అలిగి వెళ్ళిపోతున్నాడు. ఇక ఎలా? అంటే, ఆ మహారాజు, ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి, మహాత్మా! నువ్వేమిటి కోపం తెచ్చుకొని వెళ్లిపోతావు. నీవంటి వారికి సహాయం చెయ్యడానికి, ఈ శరీరంలోని కుడి భాగం ఉపయోగపడుతోంది. ఎడమ భాగం, తాను ఉపయోగపడటం లేదని, ఉపయోగపడలేకపోతున్నానని అని కంటి భాష్పాలను రాలుస్తోంది. నా మీద దయతో నీ భాగాన్ని తీసుకునిపోండి’ అంటాడు.

అర్జునుడితో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై కౌగిలించుకొని, ‘‘రాజకుల చంద్రుడా! నీ ధైర్యస్థైర్య సాహసాలకు మెచ్చాను. నీ కొడుకు, సతీమణి కొలుస్తుండగా, ఈ రెండు యజ్ఞాశ్వాలను ఉంచి యాగాన్ని నువ్వేచెయ్యి. నేనే దగ్గరుండి చేయిస్తాను. నీ కొడుకు మా ఇద్దర్నీ, తానొక్కడే యుద్ధంలో జయించాడు. నువ్వు శరీరానిచ్చి నన్నే జయించావు.’’ అని అంటాడు. ఇక ఇక్కడి నుండి ఇద్దరి గుర్రాలు కలిసి యాత్రచేస్తాయి. ‘పరోపకారం గురించి, తన శరీరంలో సగభాగాన్ని, కొడుకు చేతుల మీదుగా కోసి ఇచ్చిన తండ్రి మయూరధ్వజుడు. ‘‘పరోపకారాయ ఫలంతి వృక్షా: పరోపకారాయ దుహంతి గావ: / పరోపకారాయ వహంతి నద్య: పరోపకారార్ధ మిదం శరీరం!’’

‘చెట్లు పళ్ళను, ఆవులు పాలని, నదులు నీటిని ఇతరులకే వినియోగిస్తాయి కానీ అవి అనుభవించవు కదా! అలాగే మానవులు కూడా పరోపకారం కలిగి ఉండాలి’ అని సుభాషితం. మయూరధ్వజుడు మరొకరి కొడుకుని రక్షించడానికి, తన శరీరాన్నే దానం చేయడానికి వెనుకాడని ధైర్యస్థైర్యాలను ప్రదర్శించాడు. తండ్రిగా కొడుకుని వీరుడిగా తీర్చిదిద్దడమే కాకుండా దానగుణంలో ఆదర్శంగా నిల్చిన ఉదాత్తపాత్రగా పినవీరన ఈ పాత్రను చిత్రించాడు.

2.8 వీరవర్మ:

‘సారస్వత పురానికి’ రాజు ‘వీరవర్మ’. మయూరధ్వజ, ధర్మరాజుల యజ్ఞాశ్వాలు, రెండూ కలిసి, సారస్వత పురంలోకి ప్రవేశించిన వార్త విని వీరవర్మ వాటిని బంధిస్తాడు.  అర్జునుడితో వచ్చిన యోధులందరూ వీరవర్మ సైన్యంతో ఘోరమైన యుద్ధాన్ని చేస్తారు. అందులో వీరవర్మ కొడుకులు కువలుడు, సులతుడనే వాళ్లు దివ్య రథాలనెక్కి యుద్ధం చేస్తున్నారు. ఓడిపోతున్న సమయంలో వీరవర్మ అల్లుడు ‘యముడు’, రంగప్రవేశం చేసి, లెక్కకు మించినట్లుగా సైన్యాన్ని పుట్టించి, అర్జునుడి మీదకు పంపుతాడు. అప్పుడు కిరీటి, కృష్ణుడితో, ‘వీడెవ్వడో అజేయ పరాక్రమంతో, యముడి లాగా, మన సైన్యానంతా నాశనం చేస్తున్నాడు. చూస్తుంటే వీడిని మనిషి ‘అనకూడదేమో’ అంటాడు. ఆ మాటలకు కృష్ణుడు ‘ఈ వీరవర్మ కూతురు ‘మాలిని’ భర్త - యముడు. మామగారి గురించి మనతో ఎదిరించి పోరాడుతున్నాడు. ఆ కన్య యముణ్ణి పెళ్ళి చేసుకున్న విధానం వినమని చెప్పాడు. వీరవర్మ కూతురు మాలిని లోకైక సుందరి. యుక్త వయస్సు వచ్చాక, అమ్మాయితో, వీరవర్మ, ‘తల్లీ! నువ్వు ఎవరిని పెళ్లాడతావు? ఎవరినైనా ఇష్టపడితే చెబితే, నీ ఇష్టప్రకారమే పెళ్లి చేస్తాను’ అని అంటాడు. మాలిని తండ్రితో - ‘‘భూమ్మీద పుట్టిన మనుషులకు చావు తప్పదు. వాళ్లకు నన్నిచ్చి పెళ్లి చేస్తే, కొన్నాళ్ల తర్వాత, యమలోకానికి వెళ్లి, యముని శాసనంతో పాప పుణ్య ఫలాలను అనుభవించి, అనేక జన్మలను ఎత్తడం కంటే, యముణ్ణి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండటం మేలు. అందుకు సరైన ఉపాయాన్ని ఆలోచించు’ అని చెప్పి, ‘మాలిని’ నానాటికి వైవస్వతుడి మీద మోహాన్ని పెంచుకుంది. ఆరాజు యమస్తోత్రాన్ని చేస్తూ, చాలాకాలం యముడికోసం తపస్సు చేసాడు. ఆ కన్య కూడా వ్రత నియమాలనాచరిస్తూ, సూర్యనందనుణ్ణి ఆరాధించింది. ఈ వృత్తాంతాన్నంతా నారదుడు తెలుసుకుని యముడి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు.

కం॥  ‘‘చిత్రపురి వీరవర్ముని ...  లలన యని మఱియున్‌’’  (జై. భా. 8వ ఆశ్వా. 13వ పద్యం)

‘‘చిత్రపురంలో వీరవర్మ పుత్రిక మాలిని బహుతపశ్శాలిని. నీకు భార్య అవడానికి, నిన్నేవలచి, వ్రత నియమాలతో నిన్నే ఆరాధిస్తోంది’’ అని చెప్పి, ఆమె అందాలను యముడికి వివరించి చెప్తాడు నారదుడు. ‘‘అందానికి మించి, నియమంతో జపతపాలను చేస్తోంది. ఆ కన్యను పెళ్లి చేసుకుంటే, నీకు సమానమైనవాడు ఎవ్వరూ ఉండరు’ అన్న మాటలకు, యముడు, ‘నువ్వు ముందుగా వెళ్లి, ఆ రాకుమారితో నారాక గురించి తెలియజేయి, నేను వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు భూలోకానికి వస్తాను’ అని అన్నాడు. నారదుడు వెళ్లి, ఆ విషయాన్ని వీరవర్మకు చెప్పగానే, ఆనందపడి పెళ్లికి తగిన ప్రయత్నాలు చేసుకున్నాడు.

ఆ తర్వాత యముడు తన సేనాధిపతి రాజయక్ష్ముణ్ణి పిలిచి, మనం చిత్రపురికి వెళ్లాలి, నువ్వు సైన్యంతో సహా బయలుదేరమని చెప్తే వ్యాధుల్లో ప్రధానుడైన రాజయక్ష్మ, పుణ్యకర్మలే తప్ప చెడు ఏ మాత్రం లేని ఆ దేశంలో మాలాంటి వ్యాధులు ప్రవేశించలేవని  యముడి సైన్యమంతా ఒక్కొక్కరూ చెప్తారు. చివరకు ‘మనుష్యాకారంలో, చిత్రపురికి యముడితో కలిసి వెళ్తారు. వీరవర్మ, తనకూతురు మాలినిని యముడికిచ్చి పెళ్లి చేశాడు. యముడు సంతోషించి, ఏదైనా వరం కోరుకోమంటే, ‘‘నా అవసాన సమయంలో, దేవకీ నందనుడి పాదారవిందాలను దర్శించే భాగ్యాలను కలిగేటట్టుగా వరం ఇమ్మన్నాడు’’ ‘‘సరే, అంత వరకూ నేను, నీతోనే ఉంటానని ప్రతినగా యముడు, మామగారితో కలిసి మనతో యుద్ధం చేయడానికి వచ్చాడు’’అని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు.

వీరవర్మ కూతురి విచిత్రమైన కోరికను అపహాస్యం చెయ్యకుండా, ఆలోచించి ఆమె భవిష్యత్తు కోసం తానుకూడా కఠిన నియమాలతో తపస్సుచేశాడు. కూతురు మనసిచ్చిన యముడినే పట్టుదలతో అల్లుణ్ణి చేసుకుని, ఫలితంగా  విష్ణుపాదసేవాభాగ్యాన్ని వరంగా పొందిన గొప్ప భక్తుడి పాత్రగా వీరవర్మను పినవీరన చిత్రించాడు.

2.9 పుళిందుడు:

చంద్రహాసుడి పెంపుడు తండ్రి ‘పుళిందుడు’. చంద్రహాసుడి కథను నారదుడు అర్జునుడికి చెబుతాడు. ‘‘కేరళారాజుకు చాలాకాలంవరకు కొడుకులు లేకపోతే, వ్రతాలు, దానాలు, జపాలు చేయించిన చాలా కాలానికి హరిభక్తుల ప్రసాదం వలన ఒక కొడుకు పుడతాడు. సౌభాగ్య లక్షణ సంపన్నుడైన ఆ శిశువు తండ్రి గండ నక్షత్రమైన ‘మూలా  నక్షత్రం’లో పుట్టాడు. కొన్ని రోజులకు ఆరాజు శత్రురాజుల చేతిలో మరణిస్తాడు. తల్లి అతనితో అగ్ని ప్రవేశం చేస్తుంది. రాజ్యం శత్రురాజుల వశమౌతుంది. తల్లిదండ్రులకు, రాజ్యానికి దూరమైన ఆ పిల్లవాడిని కొంతమంది దాదులు కౌంతలపురానికి తీసుకువచ్చి పెంచుకుంటారు. రెండు మూడేళ్లలో ఆ దాదులు కూడా గతిస్తారు. అలా అనాథబాలుణ్ణి ఒక్కొక్కరు పెంచుతుండగా  అయిదేళ్ల వాడడౌతాడు. ఒకరోజు ఆటలాడుకుంటూ, ‘దుష్టబుద్ధి’ అనే మంత్రి ఇంటికి వెళితే, అక్కడున్న దైవజ్ఞులైన మహామునులు ‘వీడు భూమండలాన్ని ఏలగల’డంటారు. ఆ మాటలు విన్న దుష్టబుద్ధి ‘ఋషుల వాక్యాలు తప్పవు’ అని ఈర్ఘ్యా ద్వేషాలతో  కొంతమంది మనుషులను పిలిచి ‘ఈ పిల్లవాడిని అడవిలోకి తీసుకువెళ్ళి చంపేయండి’ అని పంపుతాడు. చిన్ని పాపడ్ని చంపకుండా, పాదంలోని చిటికెన వ్రేలుని కోసుకుని వెళ్లి ‘దుష్టబుద్ధి’కి చూపిస్తారు.

వేలు తెగిపోవడంతో ఏడుస్తూ, హరినామస్మరణ చేస్తూ బాలుడు ఆ అడవిలో తిరుగుతుంటాడు.  వేట కోసం అక్కడికి వచ్చిన రాజైన పుళిందుడుకి బాలుడు కనిపిస్తాడు. శ్రీహరిని తలుచుకుంటున్న ఆ బాలుడి దగ్గరకు వెళ్ళి బుజ్జగించి, ‘నేను అపుత్రకుడిని కాబట్టి శ్రీహరే నాకు ఈ బాలుణ్ణి ఇచ్చాడు. ఇన్నాళ్లకు నాకు కొడుకు కలిగాడు’’ అని  ఇలా దశవిధ పుత్రుల గురించి గుర్తుచేసుకుంటాడు.

కం॥     ‘‘కుండుడు కానీనుడు కృత.. కట్లగుటన్‌.’’ (జై. భా. 8వ ఆశ్వా. 46వ పద్యం)

‘‘కుండుడు, కన్యకా పుత్రుడు, గోళకుడు, అంగీకృతుడు, కన్యాదాన కాలంలో మొదటి పుత్రుడు, తన కొడుకని నిశ్చయించబడినవాడు, క్రయలబ్ధుడు (డబ్బిచ్చి కొనుకున్నవాడు), తల్లిదండ్రుల చేత ధారాపూర్వకంగా ఇవ్వబడిన వాడు, ఏదైనా ఒక ఆపద వల్ల తనకు తానే చేరినవాడు, దేవరన్యాయం వల్ల పుట్టిన వాడు తనకు, తన ధర్మపత్ని ద్వారా పుట్టినవాడు - కొడుకులుగా పేర్కొనవచ్చు. అందులో వీడు తనకు తానుగా చేరాడు కాబట్టి, ‘స్వయం ప్రాప్తుండౌతాడు’ అని, కొడుకుగా అంగీకరించి, తన చందనావతీపురానికి తీసుకువెళ్తాడు.

బంధు మిత్రులకు చూపించి, అంత:పురానికి వెళ్లి, దైవజ్ఞుల అనుమతితో శుభ లగ్నంలో, తన పట్టపురాణి ‘మేధావినీదేవి’తో ‘యశోదా కుమారుడి దయవలన నీకు కుమారుడు కలిగాడు. ఇదిగో తీసుకో’ అని చేతికి అందిస్తాడు. బిడ్డని కౌగిలించుకుని, ఆపాదమస్తకం నిమిరి, ఎడమ కాలికి చిటికెన వ్రేలు లేకపోవడం చూసి, బాధపడి నువ్వు కృపతో ఇచ్చిన ఈ కుమారుడికి అంగవైకల్యం రావచ్చునా? అని శ్రీహరిని, మనస్సులోనే వేడుకోగానే, ఆమె పాతివ్రత్యమహిమ వల్ల చిటికెనవేలు మొలిచింది. ఆనందంగా  పుళిందుడు ఆ బాలుడికి చంద్రహాసుడని నామకరణం చేస్తాడు.

శుక్లపక్ష విదియ చంద్రుడిలా దినదినాభివృద్ధి చెందుతున్నాడు. రాజ్యం సుభిక్షంగా ఉంది. సకల విద్యలను అభ్యసించాడు. పుళిందుడు యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు. చంద్రహాసుడు, ధరణీ చక్రాన్ని అవక్రపరాక్రమంతో ఇంద్రుడిలా పరిపాలిస్తూ విష్ణుభక్తిని కూడా ప్రకటిస్తూ, పదహారేళ్ల నూనూగు మీసాల ప్రాయంలో, తండ్రి దగ్గర అనుమతి పొంది, చుట్టు పక్కలున్న రాజ్యాలన్నీ గెలిచి, బంగారాన్ని, రత్నాలను తన భుజబలంతో సంపాదించి, తెచ్చి తండ్రి ముందట రాసులుగా పోస్తాడు. ఆ ధనకనకవస్తురాశుల వల్ల బొక్కసం నిండిపోతుంది. బంధుమిత్రులు, మంత్రులు కొడుకు శౌర్యాన్ని, సంస్కారాన్ని పొగుడుతుంటే, కొడుకుని చూసి - ‘‘మనం కుంతలాధీశ్వరున్ని కొలిచిన వాళ్లం. అక్కడ మనకు కావలసిన వాళ్లు, అతని మంత్రి దుష్ట బుద్ధి, పురోహితుడయిన కాలవుడు.  కాబట్టి టంకాలను పదివేలు, అయిదువేలు, రెండువేల వేరువేరుగా ఆ ముగ్గురికి మూటలు కట్టి ముద్రవేయించి పంపించమని’’ చెప్తాడు. చంద్రహాసుడు అలాగే అని ఒంటెల మీద పంపిస్తాడు.

చంద్రహాసుడిచ్చిన పత్రికనిచ్చి ‘‘ఎప్పుడూ మీకందిస్తున్న కప్పంకన్నా పదింతలు ఎక్కువ తెచ్చాము. తీసుకుని రాజుకిమ్మని, మంత్రికి అప్పగించి, తక్కిన మూడు ముడుపుల్ని ఒక బంగారు పళ్ళెంలో ఉంచి పురోహితుడైన కాలవుడికి ఇస్తారు.’’ ఆ వృత్తాంతాన్నంతా ‘దుష్టబుద్ధి’ విని ‘మన పుళిందుడికి ఇంతటి సంపద కలగడానికి కారణం ఏమిటి?’ అని అసూయతో కుంతలరాజు దగ్గరకు వెళ్ళి, చంద్రహాసుడి గురించి తెలియజేసి, అతని తండ్రి పుళిందుడిని పట్టి బంధించడానికి అనుమతి తీసుకుని ఆరు యోజనాల దూరాన్ని ఒక్క రోజులోనే ప్రయాణించి చందనావతీపురం చేరుకుంటాడు.

ఒకప్పుడు మృగాలకు నెలవైన ఆ అడవిలోని నగరం అమరావతిని తలదన్నేటట్లుగా, సంపదలతో తులతూగుతూ ఉంటుంది. పుళిందుడు కొడుకుతో సహా ఎదురొచ్చి స్వాగతం పలికి విడిదికి తీసుకువెళ్తాడు. దుష్టబుద్ధి కపటంతో చంద్రహాసుణ్ణి చూసి ‘‘పుళిందకా! పున్నమి చంద్రుడిలాంటి నీ కొడుకు, సౌభాగ్యలక్ష్మీ సమేతుడై వైభవంతో ఉన్నాడు. ఇతడు నీకెలా కలిగాడు’’ అని అడిగాడు. జరిగినదంతా చెప్పాడు పుళిందుడు.  ‘‘నాటికి అయిదేళ్లవాడు. కన్న కొడుకు కంటే మిన్నగా పెంచుకున్నాను.’’  అని వివరంగా చెప్తాడు. దుష్టబుద్ధి వెంటనే చంద్రహాసుణ్ణి కుంతలపురం పంపించి, పుళిందుణ్ణి అతని భార్యను బంధిస్తాడు.

ఈ కథలో - అడవిలో దొరికిన బిడ్డని ఎంతో ప్రేమతో పెంచి, రాజ్యానికి రాజుగా అభిషేకించి, తను కట్టాల్సిన కప్పం కట్టినందుకు పీకల మీదకు తెచ్చుకున్నాడు పుళిందుడు. చంద్రహాసుడు పెంచిన తండ్రినే సర్వస్వమనుకుని, తన భుజబలంతో చుట్టూ ఉన్న రాజ్యాలను జయించి, పుళిందుడి రాజ్యాన్ని పెంచి, వైభవోపేతం చేశాడు. దుష్టబుద్ధిని మిత్రుడిగా నమ్మి, బంధీఅయ్యాడు. చంద్రహాసుడు తర్వాత విడిపించాడు. భక్తి, వీరత్వం, అమాయకత్వం కలగలిపిన పాత్రగా పుళిందుణ్ణి పినవీరభద్రుడు తీర్చిదిద్దాడు.

2.10 దుష్టబుద్ధి:

కుంతలదేశానికి మంత్రి ‘దుష్ట బుద్ధి’ పేరుకు తగినట్లుగా అంతా దుష్టబుద్ధే ఇతనిది. తల్లిదండ్రులకు దూరమై, ఆడుకోవడానికి తన ఇంటికి వచ్చిన అయిదేళ్ళ పసిపాపడిని చంపించబోయిన దుష్టబుద్ధి. ఆ బాలుడే పుళిందుడి దగ్గర పెరిగి పెద్దవాడై, వైభవోపేతంగా ఉండటం చూసి, అసూయతో పన్నాగం పన్ని చంద్రహాసుణ్ణి ఎలా అయినా చంపించడానికి అనుక్షణం, ఎత్తులు వేసి, చివరకు తన కొడుకును, చంపించుకున్న ‘దుష్టబుద్ధి’.

చంద్రహాసుణ్ణి కుంతలపురం పంపించి, దుష్టబుద్ధి తన కొడుకైన ‘మదనుడి’తో విషం పెట్టించి చంపిద్దామని ఆలోచిస్తాడు. కొడుకు పేరన ‘దుష్టబుద్ధి’ స్వదస్తూరితో ఒక పత్రిక రాసి ముద్రవేసి, చంద్రహాసుడి చేతికిచ్చి, ‘ఈ పత్రికను తీసుకుని నువ్వు ఒక్కడివే కౌంతలానికి వెళ్ళి నా కొడుక్కి ఇవ్వు. అక్కడ నీకు సకల శుభాలు కలుగుతాయి’ అని అంటాడు. చంద్రహాసుడు ఆ పత్రిక తీసుకుని గుర్రం మీద, ఆ నగరానికి కొంత సమీపం వరకు ప్రయాణిస్తాడు. బడలిక తీర్చుకోడానకి, ఒక కొలనుకు దగ్గరగా చెట్టుక్రింద నిద్రపోతాడు. అప్పుడక్కడకు రాజకుమార్తె ‘చంపకమాలిని’, దుష్టబుద్ధి కూతురైన ‘విషయ’, మన్మథ పూజకు అటువైపు వస్తారు.

ఆ చెట్టు కింద, నిద్రలోపోతున్న చంద్రహాసుణ్ణి మంత్రి కూతురు చూసి, అతడి దగ్గరున్న పత్రికను చూసి, తండ్రి చేతి రాతగా గుర్తించి మొత్తం అంతా చదివి, తండ్రి దుర్బుద్ధికి బాధపడిరది. ‘సుకుమారుడైన ఈ రాజకుమారుడికి ‘విషమొసంగి’ అని రాశాడు.

కం॥     విషమాస్త్ర సమానునకు .. వేడుకతోడన్‌  (జై. భా. 8వ ఆశ్వా. 77వ పద్యం)

‘విషము నొసంగి’ అనే వాక్యం మధ్యలో ‘యకారం’ రాసి ఎప్పటిలా ముద్రవేసి పత్రికను ఎక్కడ తీసింది అక్కడే పెట్టేసి, అతణ్ణి విడవలేక విడవలేక విడిచిపెట్టి, ఇంటికి వెళ్లిపోతుంది. నిద్ర నుండి మేల్కొని, ఆ నగరానికి వెళ్ళి, తన రాకను మంత్రి కుమారుడికి తెలియజేస్తాడు. మదనుడు వచ్చి స్వాగతించి, తన మందిరానికి తీసుకువెళ్ళాక, దుష్టబుద్ధి ఇచ్చిన పత్రికను, మదనుడికి ఇస్తాడు. అందులో ‘విషయ’ను నొసంగమని ఉన్నది చదివి, ఆనందించి, నా సహోదరికి తగిన వరుడు దొరికాడు’ అని, జ్యోతిష్కులను పిలిపించి, ఆ రాత్రి శుభలగ్నం ఉందని తెలుసుకుని, వాళ్లిద్దరికీ, వైభవోపేతంగా పెళ్లి జరిపిస్తాడు.

‘ఈపాటికే చంద్రహాసుడు కుంతలపురానికి చేరి, నా కొడుకు చేతిలో విషం త్రాగి మరణించి ఉంటాడు. నా ఆలోచన నెరవేరింది. మునుల వాక్యాలు అబద్ధాలు అయ్యాయని’’ దుష్టబుద్ధి ఆనందిస్తాడు. పుళిందుణ్ణి బంధించి మూడో రోజున బంగారు పల్లకీలో కుంతలపురం చేరుకున్నాడు. మామిడి తోరణాలతో పెళ్లి కళతో ఉన్న రాజవీథుల్ని చూసి, చంద్రహాసుడికి, ‘విషయ’కు పెళ్లి చేశారని తెలుసుకుని, కోపంతో ఇంటికి వెళ్లి, ‘‘నేనేం రాశాను, నువ్వేం చేశావు?’’ అంటూ పళ్లు పటపటా కొరుకుతూ కొడుకును పిలిచి ‘‘ఓరీ! దురాత్మకా! నేటి వరకూ నా ఆనతి దాట లేదు. ఇప్పుడు ఇలా చేశావేంటి? అనగానే ‘మదనుడు’ చేతులు కట్టుకుని, తండ్రి స్వదస్తూరితో ఉన్న పత్రికను చూపించాడు. అది చూసి దుష్టబుద్ధి ఆశ్చర్యపోతుండగా ‘‘తండ్రీ! మీ ఆనతి ప్రకారమే, ప్రాణపదమైన ముద్దుల చెల్లెలినిచ్చి పెళ్లి చేశాను. ఇతనికి ఎప్పుడైనా, ఎదురువస్తే, ప్రాణాలనైనా విడిచిపెట్టడానికి సిద్ధం’ అని ప్రతిన చేశాను’’ అని మాట్లాడుతున్న కొడుకును నమ్మడు. ఇంతలో కూతురు, అల్లుడు వచ్చి దండం పెడతారు. ‘చిన్న లేడి కూనలను, చూసిన పెద్ద పులి లాగా’ మనస్సులో ‘హుమ్ముని’, నాగవల్లి చేయించి, ఆ రాత్రి నిద్రపట్టక, మరునాటి వేకువ జామున... ‘‘కూతురు, కొడుకు నా కులాన్ని చెరిచారు. ఇక మీదట చంద్రహాసుడు, హెచ్చరిక పడితే ప్రమాదం వస్తుందని’ ఆలోచించి, ఎలాగైనా చంద్రహాసుణ్ణి చంపి, మునులవాక్యాలు సిద్ధంచకుండా చేస్తానని నిశ్చయించుకుంటాడు.

బ్రహ్మఘ్నడు, గోఘ్నుడు, శిశుఘ్నుడు, గురుఘ్నుడు, మాతృఘ్నుడు, పితృఘ్నుడు, మిత్రఘ్నుడు, యజ్ఞఘ్నుడు, బంధుఘ్నుడు, స్త్రీఘ్నుడు, అని పేర్లున్న పదిమంది కోండెగాళ్ళను పిలిపించి, ‘‘నాడు మీరు చేసిన నేరాన్ని మన్నించాను. ఇప్పటికైనా నేను చెప్పింది చెయ్యండి. సంధ్యా సమయంలో  నగరానికి బయటన అడవికి దగ్గరలో ఉన్న కరాళకాళిక కోవెలలో మీరు దాగి ఉండండి. ఆ సమయంలో ఒంటరిగా కాళికను పూజించడానికి ఎవడొస్తాడో, వాణ్ణి పట్టుకుని రెండు ముక్కలుగా నరికేయ్యండి’ ముందు వెనుకలు చూడకండి. ఇలా చేస్తే నా రాజ్యంలో సగభాగం ఇస్తాను. నా కొడుకు మదనుడికి చెప్పాల్సిన పనిలేదు.’’ అని అంటాడు. ఆ పదిమంది, మద్యపానం చేసి, క్రొత్త కత్తులను పట్టుకొని కాళికాలయానికి వెళ్లి దాక్కొని ఉన్నారు. ఆ సమయంలో ‘దుష్టబుద్ధి’ చంద్రహాసుణ్ణి రప్పించి, ‘‘అల్లుడా! మా కులధర్మం చెబుతాను. మా ఇంట పెళ్లైన అల్లుడు సంధ్యారాగ సమయంలో, నగర సమీపంలో చండికా ఆలయానికి వెళ్లి పూజ చేసి రావాలి. ఇది తరతరాలుగా వస్తున్న కులాచారం. నువ్వు కూడా అలాగే చెయ్యాలని’’ చంద్రహాసుణ్ణి ఒప్పిస్తాడు.

అదే సమయానికి అవసానదశలో ఉన్న కుంతలదేశరాజు తన మంత్రి కొడుకు మదనుణ్ణి పిలిపించి - ‘‘మీ అల్లుడయిన చంద్రహాసుణ్ణి ఇప్పుడే పిలిపించు. నా కూతురు చంపకమాలినిని ఇచ్చి పెళ్లి చేస్తాను’’ అంటాడు. సంధ్యారాగ సమయానికి, చండికా పూజకు, పూజాద్రవ్యాలను తీసుకుని, ఒంటరిగా వెళ్తున్న మరిదిని చూసి మదనుడు, -‘‘రాజకుమారా! కుంతలాధిపతి నిన్నిప్పుడే తీసుకురమ్మన్నాడు’ అనగానే, మామగారు చెప్పిన శాంభవీ పూజకు వెళ్తున్నాను’ పూజ అయిపోయాక వస్తాను’ అని అంటాడు. ‘‘నీకు బదులుగా నేను చేసి వస్తాను. నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళు’’ అని మదనుడు, అతని చేతిలోని పూజా ద్రవ్యాలను తీసుకుని, తన గుర్రాన్ని అతనికిచ్చి పంపిస్తాడు. చంద్రహాసుడికి చంపకమాలినినిచ్చి పెళ్లి చేసి, తన సింహాసంపై కూర్చోబెట్టి, సమస్త రాజ్యాన్ని అతనికి ఇచ్చి, తపోవనానికి ఆ రాజు వెళ్లిపోతాడు.

అప్పుడు ఆ మంత్రి కుమారుడు, ఒంటరిగా, కాళికా గుడికి వెళ్లగానే, గొడ్డలతో సిద్ధంగా ఉన్న మనుషులు, అతడి మీదపడి రెండు ముక్కలుగా నరికి పడేస్తారు. ఇక్కడ చంద్రహాసుడు, చంపకమాలిని పెళ్లి చేసుకుని కుంతల రాజ్య సింహాసనం అధిరోహించి, రాజభోగాలను పొంది, ఏనుగు నెక్కి, మంత్రి ఇంటికి వెళ్తాడు. అంతకు ముందే చారులచేత జరిగిన వృత్తాంతాన్ని దుష్టబుద్ధి వింటాడు. మదనుడు తనకు బదులుగా కాళికాలయానికి వెళ్ళడం, తను రాజు సముఖానికి వెళ్ళడం వరకూ చంద్రహాసుడంతా చెప్తాడు. ఆ మంత్రి నిప్పులు త్రొక్కినట్లుగా అదిరిపడి, కోపాన్ని, అల్లుడికి కనపడనీయకుండా, బయటకు వెళ్లే పని ఉందని చెప్పి, వడివడిగా కాళికాలయానికి వెళ్ళి, అక్కడ, ‘తల’ నరికివేయగా పడి ఉన్న కొడుకును చూసి బాధపడి, ‘శ్రీ మహా విష్ణుభక్తుడికి ద్రోహం చేయదలచిన పాపాత్ముల ప్రయత్నం ఫలిస్తుందా?’ అని ఆ దేవి బలిపీఠాన్ని గట్టిగా కొట్టుకుని తలకు బలంగా తగలడంతో ప్రాణాలు విడుస్తాడు.

వేకువ జామున, చండికకు పూజ చేయడానికి వచ్చిన అర్చకుడు, కోవెల వాకిట్లో పడి ఉన్న మంత్రిని, అతని కొడుకుని చూసి, ఎలా మరణించారో! ఏం దుర్నిమత్తమో? అని చంద్రహాసుడికి తెలియజేస్తాడు. అతడు కాలి నడకన, కాళికాలయానికి వెళ్లి, అక్కడ పడున్న వాళ్లిదర్నీ చూసి, తీవ్రంగా బాధపడి, వాళ్లన్ని బతికించకపోతే, అపకీర్తి తప్పదని, అనుకుని, ఆ రుద్రాణి సన్నిధిలో హోమకుండం ఏర్పాటు చేసి, తన శరీరం నుండి మాంసాన్ని ముక్కలుగా కోసి నేతిలో ముంచి, హోమగుండంలో వేస్తూ, చివరకు, ‘దేవీ! నువ్వు శ్రీ విష్ణుదేవుని చిచ్చక్తివి, కాబట్టి నీకు ప్రియంగా నా శిరస్సును పూర్ణాహుతి చేస్తాను’ అని కత్తిని తీస్తాడు. ‘వీరప్రతాపా! నీ సాహసానికి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో’’ అని దేవి  ప్రసన్నమౌతుంది.

‘మంత్రిని, అతడి కొడుకుని బతికించి, నాకు నారాయణ చరణారవిందాల దృఢ భక్తిని ఇవ్వమని ప్రార్థిస్తాడు.’’ అది నెరవేర్చి భద్రకాళి - ‘బలపరాక్రమ సమున్నతులైన ఇద్దరు కొడుకులు నీకు పుడతారు అని వరమిస్తుంది. అప్పుడా చంద్రహాసుడు మంత్రిని, అతడి కొడుకును తీసుకుని నగరానికి వెళ్లి, తల్లిదండ్రులైన మేధావిని, పుళిందుణ్ణి విడిపించి వినయంతో మొక్కి, ఇష్టమైన వాటిని వాళ్లకిచ్చి, చంపకమాలినితో, విషయతోనూ పద్మాక్షుడు మకరధ్వజుడు అనే ఇద్దరు కొడుకుల్ని కంటాడు. ఈర్ష్యాద్వేషాల్ని ఒంటినిండా నింపుకున్న కుటిలమైన పాత్ర దుష్టబుద్ధిది. పేరుకి తగినవాడు. ఐదేళ్ళ బాలుడనికూడా చూడకుండా, అతడి ఎదుగుదలని తట్టుకోలేక మునులు పలికిన శుభవాక్యాలను ఎలాగైనా వమ్ము చెయ్యాలని శతవిధాలా ప్రయత్నిస్తాడు. చివరకు తన కొడుకుని, తన ప్రాణాల్ని కూడా పోగొట్టుకున్నాడు. చిన్నయసూరి నీతిచంద్రికలో చెప్పినట్లు ‘ఈర్ష్యాళువు ఎప్పటికీ దు:ఖంతోనే జీవిస్తాడు.’ అలాంటి దుర్గుణం మనసు నిండా పెట్టుకున్న దుష్టబుద్ధి పతనాన్ని పినవీరన అడుగడుగునా ఆసక్తికరమైన కథాసంవిధానంతో చిత్రించాడు.

2.11 చంద్రహాసుడు:

‘ధర్మరాజు’ యాగాశ్వం కుంతలపురంలోకి ప్రవేశిస్తుంది. అర్జునుడు, చంద్రహాసుణ్ణి తోటి రాజుల దగ్గర అతడి చరిత్రను చెప్పి పొగుడుతాడు. చంద్రహాసుడి కొడుకులైన మకరధ్వజ పద్మాక్షులు, యాగాశ్వాలను తీసుకుని వెళ్లి, తండ్రి ముందు పెడతారు.

చంద్రహాసుడు చూసి, ‘‘కుమారులారా! ఇవి ధర్మరాజు యాగాశ్వాసాలు. వీటిని సంరక్షించడానికి కిరీటి వస్తున్నాడు. మీరు పదిహేను రోజులు ఈ రెండు గుర్రాలను రక్షిస్తుండండి. ఈలోపు వాళ్ళు రాకపోతే యాగానికి ఇబ్బంది కలుగకుండా, మనమే పంపిద్దాం’ అని చెప్తాడు. వెంటనే అర్జునుడి సైన్యం కోలాహలం వినపడుతుంది. చంద్రహాసుడు కొడుకుల్ని యుద్ధానికి సిద్ధమవమంటాడు. వాళ్లు అర్ధచంద్రవ్యూహాన్ని మోహరిస్తారు. శ్రీకృష్ణుడు అర్జునుడితో, ‘ఇతడు చంద్రహాసనుడనే మహారాజు. పరమ వైష్ణువుడు, నాకు నిజమైన భక్తుడు’ అని చెప్తాడు. అర్జునుడు యుద్ధాన్ని విరమించి, చంద్రహాసుణ్ణి కౌగిలించుకుంటాడు. చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు పడినప్పటికీ చంద్రహాసుడు మునులు ఆశీర్వదించినట్లే కుంతలదేశానికి రాజయ్యి, రాణీలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ధర్మబద్ధంగా జీవిస్తూ తన ఇద్దరు కొడుకుల్ని కూడా తన లాగానే నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. పరమవిష్ణుభక్తితో అశ్వమేథయాగానికి అనుకూలంగా ప్రవర్తిస్తాడు. శ్రీకృష్ణుడి మనస్సును కూడా గెలుచుకుని అర్జునిడితో మైత్రిని సంపాదిస్తాడు. ధైర్యం, ఓర్పు, భక్తి, పాలనాదక్షత మొదలైన సుగుణాలరాశిగా చంద్రహాసుణ్ణి పినవీరన ఈ కావ్యంలో తీర్చిదిద్దాడు. ఈ విధంగా శ్రీనాథయుగంలో వచ్చిన భారత కథాసంబంధమైన ‘జైమిని భారతం’ పినవీరభద్రుడు పేర్కొన్న తండ్రి పాత్రలను కథాక్రమాన్ని అనుసరిస్తూ పరిచయం చేసి విశ్లేషించాను. వీరత్వం, భక్తి, దుష్టస్వభావం, దానగుణం మొదలైన వైవిధ్యమైన లక్షణాలున్న తండ్రిపాత్రల్ని  వర్తమాన సమాజం ప్రతిబింబించేలా ఈ కావ్యంలో పినవీరన తీర్చిదిద్దాడు.

3. ఉపయుక్తగ్రంథసూచి:

  1. నాగయ్య. జి. తెలుగుసాహిత్యసమీక్ష 1,2 భాగాలు, నవ్యపరిశోధక ప్రచురణలు
  2. పినవీరన, పిల్లలమఱ్ఱి. జైమినీభారతము. వావిళ్లవారి ప్రచురణ. చెన్నపురి. 1958.
  3. వీరేశలింగము, ముదిగొండ. జైమిని భారతము సంశోధనాత్మకపరిశీలనము. ముదిగొండ జ్ఞానప్రసూన, వరంగల్, 1983.
  4. సుబ్రహ్మణ్యం, జి.వి. పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి. మాధవీబుక్ సెంటర్, హైదరాబాద్, 1973.
  5. వెంకటకృష్ణప్పనాయకుడు, సముఖము. జైమిని భారతము వచనం. ఆంధ్రసాహిత్యపరషత్తు. కాకినాడ.1923.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]