
కథ అయినా కవిత్వమైనా తెలంగాణ సాహిత్యం ప్రజా జీవితంతో, సామాజిక ఉద్యమాలతో మమేకమవుతూ తన ప్రత్యేకతను చాటుకుంది. తెలంగాణ కథాసాహిత్యం సామాజిక ఉద్యమాల ప్రభావంతో అభివృద్ధి చెందింది. ఈ విషయాన్ని వివరిస్తూ శ్రీధర్ వెల్దండి ఇలా పేర్కొన్నారు:
“తెలంగాణ కథ మిగిలిన ప్రాంతాలవలె సాధారణ వస్తువును స్వీకరించలేదు. ఆయా సామాజిక ఉద్యమాల ప్రతిస్పందనగా ఇక్కడ కథా సాహిత్యం సృజించబడింది. ఉద్యమ మద్దతు కూడగట్టేందుకు కథాప్రక్రియను సైతం ఆధారం చేసుకున్న చరిత్ర తెలంగాణ నేలది. ఒక ఉద్యమం వెనుక మరో ఉద్యమం తెలంగాణ నేల మీద పుట్టుకొచ్చింది. ఈ ఉద్యమ భావజాల ప్రతిబింబంగా తెలంగాణ కథ సృజించబడ్డది” (శ్రీధర్ వెల్దండి 197).
తెలంగాణ ప్రాంత చరిత్రలో నిజాం పాలన, భూస్వామ్య వ్యవస్థ, దొరల ఆధిపత్యం, వెట్టిచాకిరి, రజాకార్ల దౌర్జన్యాలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటాలు, ముఖ్యంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, సామాజిక చైతన్యానికి దోహదపడ్డాయి. అనంతర కాలంలోనూ కుల వివక్ష, శ్రమ దోపిడీ, పేదరికం, స్త్రీలపై ఆంక్షలు వంటి సమస్యలు వివిధ రూపాల్లో కొనసాగాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రాంతీయ హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధి, స్వీయ పాలన వంటి ఆకాంక్షలకు బలమైన వ్యక్తీకరణగా నిలిచింది.
ఈ చారిత్రక, సామాజిక పరిణామాలు తెలంగాణ కథాసాహిత్యంలో ప్రతిఫలించాయి. రచయితలు గ్రామీణ జీవితం, సామాన్య ప్రజల అనుభవాలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల స్థితిగతులు, సామాజిక అసమానతలు, అణచివేతకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలను కథా వస్తువులుగా స్వీకరించారు. తెలంగాణ ప్రాంతీయ మాండలికం, పల్లె పదజాలం, వృత్తులు, ఆచారాలు, సంప్రదాయాలు కథలకు సహజత్వాన్ని చేకూర్చాయి. ఈ కథలు ఆయా కాలాల ప్రజల జీవన విధానాన్ని, సామాజిక మార్పులను, మానవ సంబంధాలను అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి. ఈ నేపథ్యంలో డా. శారద సదానంద్, డా. అయోధ్యా రెడ్డి ఎం.యం., డా. స్వామి బి.వి.ఎన్. సంపాదకత్వంలో వెలువడిన ‘మూడు తరాల తెలంగాణ కథ’ సంకలనంలోని కొన్ని కథలను ఆధారంగా చేసుకొని తెలంగాణ ప్రజల జీవన విధానం, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక ప్రత్యేకతలు, ప్రజా పోరాటాలు, కుటుంబ సంబంధాలు, స్త్రీ స్వేచ్ఛ, ఆత్మగౌరవం, మానవీయ విలువలు తదితర అంశాలను పరిశీలించడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.
పి.వి. నరసింహారావు రచించిన ‘గొల్ల రామవ్వ’ కథ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలు ఎదుర్కొన్న భయాందోళనలు, పోలీసుల దౌర్జన్యాలు, మహిళల ధైర్యం, మానవత్వం వంటి అంశాలను చిత్రిస్తుంది. ఈ కథలో గొల్ల రామవ్వ తన మనుమరాలు మల్లమ్మతో కలిసి జీవిస్తుంటుంది. ఒక అర్ధరాత్రి బాంబుల పేలుళ్లతో గ్రామమంతా భయాందోళనలకు గురవుతుంది. పోలీసుల నుంచి తప్పించుకుంటూ గాయాలతో వచ్చిన ఒక యువకుడు రామవ్వ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. మొదట అతడిని చూసి భయపడిన రామవ్వ, అతని పరిస్థితిని తెలుసుకున్న తరువాత గాయాలకు చికిత్స చేసి, ఆహారం అందించి ఆదరిస్తుంది. అతడు కాంగ్రెస్ కార్యకర్త అని తెలిసినప్పటికీ వెనుకడుగు వేయదు. పోలీసులు అతడిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు తన మనవరాలి భర్త అని చెప్పి, తన తెలివితేటలతో కాపాడి పంపిస్తుంది. ఈ విధంగా ఒక సాధారణ గ్రామీణ మహిళ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించడం కథలోని ప్రధానాంశం.
“తాను చచ్చినా సరే తల్లిదండ్రులు లేని మల్లికైనా మానభంగం తప్పితే... తానా పిల్లను సాది సంభాళించింది…” (మూడు తరాల తెలంగాణ కథ 46)
అనే వాక్యం రామవ్వలోని మాతృత్వాన్ని, మహిళల రక్షణ పట్ల ఆమెకున్న బాధ్యతను తెలియజేస్తుంది. ఆనాటి సమాజంలో మహిళలు ఎదుర్కొన్న అభద్రతను ఈ సందర్భం ప్రతిబింబిస్తుంది.
“బామనోడవైనా, జంగమోడివైనా, యేకులమోడివైనా సరే - మొదలు పానం దక్కించుకో. అంతకైతే నాలికెమీద బంగారి పుల్లతోటి సురుకు పెడితే పోయిన కులం మల్లత్తదట కాదు?” (మూడు తరాల తెలంగాణ కథ 50)
అనే మాటల్లో కులభేదాలకంటే ప్రాణరక్షణ ముఖ్యమనే మానవతా దృక్పథం కనిపిస్తుంది.
“ఇద్దర్నా? ... కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడుకా! సగం పనే చేసినవు ...!” (మూడు తరాల తెలంగాణ కథ 51)
అనే వాక్యం పోలీసుల దౌర్జన్యాల పట్ల రామవ్వలోని ఆగ్రహాన్ని, ప్రతిఘటనా భావాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే హింసకు ప్రతిహింస సరైన పరిష్కారమా అనే ప్రశ్నను కూడా ఈ సందర్భం ఆలోచింపజేస్తుంది.
“అవ్వా నీవు సామాన్యురాలవు కావు సాక్షాత్ భారతమాతవే.” (మూడు తరాల తెలంగాణ కథ 58)
అనే వాక్యం రామవ్వ ధైర్యం, త్యాగం, దేశభక్తిని తెలియజేస్తుంది.
ఈ నేపథ్యం రచయిత గొల్ల రామవ్వను సామాజిక చైతన్యానికి ప్రతీకగా చిత్రించారు. తెలంగాణ మాండలిక భాష కథకు సహజత్వాన్ని అందించింది. పోలీసుల దౌర్జన్యాలు, మహిళల అభద్రత, కులవివక్ష, ప్రజల ప్రతిఘటనను వాస్తవికంగా చూపించారు. అయితే యువకుడి హింసాత్మక చర్యలకు రామవ్వ మద్దతు ఇవ్వడం చర్చనీయాంశం. అన్యాయాన్ని ఎదిరించడం అవసరమే అయినా, హింస వల్ల కలిగే పరిణామాలను కూడా మనం పరిశీలించాలి. మొత్తంగా ఈ కథ మానవత్వం, ఆత్మగౌరవం, కులసమానత్వం, దేశభక్తి వంటి విలువలను తెలుపుతూ నేటి సమాజానికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
"ఒక నేలబారు పాత్రని ఆకాశమంత ఎత్తుకు విస్తరించి ఉదాత్తతకు ఊపిరిపోసిన అపూర్వమైన పాత్రీకరణ. జాతీయ భావాన్ని జాతి మూలాలకు విస్తరించిన ఒక మహా రచయిత సంధించిన వజ్రాయుధం. రచయిత పి.వి. నరసింహారావుగారిని కథాసాహిత్యంలో దిగ్గజాల సరసన పీట వేయించగల మేటి రచన 'గొల్ల రామవ్వ' కథ" (మారుతీ రావు 789).
అన్న మారుతీ రావు గొల్లపూడి మాటలు అక్షర సత్యాలు.
కాళోజీ నారాయణరావు రచించిన ‘మనమే నయం’ కథ జంతువుల జీవితాలను ఆధారంగా చేసుకొని మానవ సమాజంలోని వైరుధ్యాలను వ్యంగ్యంగా చిత్రిస్తుంది. జంతు సంక్షేమం కోసం ఏర్పడిన సంస్థల పనితీరులోని లోపాలను, పేద ప్రజల దుర్భర జీవితాలను రచయిత ఈ కథలో ఎత్తిచూపారు. జంతువుల పట్ల దయ చూపుతున్నామని చెప్పుకునే మనుషులు తమ రోజువారీ జీవితంలో వాటిని ఎలా కష్టపెడుతున్నారో ఎద్దుల సంభాషణ ద్వారా తెలియజేశారు.
కథలో జంతు సంక్షేమ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ఎడ్లు, ఆవులు, గుర్రాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. సాధారణంగా కొరడా దెబ్బలతో పని చేయించే ఎల్లయ్య తన ఎడ్లను ఆ రోజు అలంకరించి ప్రేమగా చూస్తాడు. సభలో అధికారులు జంతువుల సంక్షేమం గురించి ప్రసంగిస్తారు. అయితే, వాటి రోజువారీ కష్టాలను తొలగించడంలో ఆచరణాత్మక మార్పు కనిపించదు. ఈ పరిస్థితి ద్వారా జంతువుల సంక్షేమం పేరుతో జరిగే కార్యక్రమాల్లోని బూటకాన్ని కాళోజీ వ్యంగ్యంగా ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించకుండా సభలు, ప్రసంగాలకే పరిమితం కావడం వల్ల నిజమైన ప్రయోజనం ఉండదని ఈ చిత్రణ ద్వారా సూచించారు.
తెల్ల ఎద్దు మనుషులు తమ అవసరాల కోసం జంతువులను నిర్బంధించి కష్టపెడుతున్నారని వివరిస్తూ “మనకున్న అన్ని కష్టాలకు మూలకారణం ఈ నిర్బంధజీవనము దానికి కారణం ఈ నరుడు . వీడేమి! మననిద్దరించుట ఏమి!” (మూడు తరాల తెలంగాణ కథ 67)
అంటుంది. ఈ మాట జంతువుల స్వేచ్ఛలేని జీవితాన్ని మాత్రమే కాకుండా, ఇతరుల అవసరాల కోసం నిరంతరం శ్రమించాల్సిన పరిస్థితిని కూడా గుర్తుచేస్తుంది. నేటికీ జంతువులతో వాటి శక్తికి మించి పని చేయించడం, నేటి సమాజంలో కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడం, విశ్రాంతి కల్పించకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. జీవనోపాధి కోసం శ్రమించే ప్రతి జీవికి తగిన గౌరవం, సంరక్షణ అవసరమనే భావన ఈ కథలో అంతర్లీనంగా కనిపిస్తుంది.
అయితే, నల్ల ఎద్దు మనుషుల జీవితాల్లోని పేదరికాన్ని ప్రస్తావిస్తూ “వారిలో చాలా మంది బ్రతుకు మనకన్నా అన్యాయం. అత్యల్ప సంఖ్యాకులైన భాగ్యవంతులు . అందరి కష్టాలకు మూల కారకులు” (మూడు తరాల తెలంగాణ కథ 67)
అని అంటుంది. ఈ మాట కథలోని సామాజిక ఆలోచనకు బలమైన ఆధారం. జంతువుల కష్టాలను గుర్తించే మనుషులు, తమ మధ్య ఉన్న పేదరికాన్ని, ఆకలిని, అసమానతలను కూడా గుర్తించాల్సిన అవసరాన్ని, భాగ్యవంతులైన వారు పేదవారికి సహాయం చేయవలసిన పరిస్థితిలను ఇది తెలియజేస్తుంది. నేటికీ వలస కార్మికులు, రోజువారీ కూలీలు నివాసం, వైద్యం, తాగునీరు వంటి కనీస అవసరాలకు నోచుకోకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సంపద పెరుగుతున్నా, మరోవైపు పేద ప్రజల జీవితాల్లో కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం సమాజంలోని అసమానతలను స్పష్టం చేస్తుంది. అభివృద్ధి అంటే కొంతమంది సుఖంగా జీవించడం మాత్రమే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవితం లభించడం కూడా. చివరగా “ఇంతకూ మనమే నయం!!” (మూడు తరాల తెలంగాణ కథ 68) అనే మాట ద్వారా కథలోని వ్యంగ్యం పరాకాష్ఠకు చేరుతుంది. జంతువులు తమ కష్టాలను మనుషుల జీవితాలతో పోల్చుకొని ఈ నిర్ణయానికి రావడం పాఠకులను ఆలోచింపజేస్తుంది.
ఎంతో అభివృద్ధి సాధించాం అని చెప్పుకుంటున్న ఈ సమాజంలోనే ఆకలి, పేదరికం, శ్రమదోపిడీ కొనసాగడం రచయిత ఎత్తిచూపిన ప్రధాన వైరుధ్యం. నేటికీ సంక్షేమ పథకాలు, చట్టాలు ఉన్నప్పటికీ వాటి ప్రయోజనాలు అర్హులందరికీ అందుతున్నాయా అన్నదే ముఖ్య ప్రశ్న. కేవలం మంచి మాటలు చెప్పడం, కార్యక్రమాలు నిర్వహించడం కాకుండా, బాధితుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి తగిన చర్యలు అవసరం.
రచయిత ‘మనమే నయం’ కథలో జంతువుల సంభాషణల ద్వారా సమాజంలోని అసమానతలను వ్యంగ్యాత్మకంగా ఎత్తిచూపారు. జంతువుల కష్టాలను మాత్రమే కాకుండా, తోటి మనుషుల బాధలను కూడా అర్థం చేసుకొని, ప్రతి జీవి పట్ల దయ, గౌరవం చూపాలని ఈ కథ సూచిస్తుంది. మాటలకు, ఆచరణకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించినప్పుడే ప్రతి జీవికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుందని, అప్పుడే నిజమైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని రచయిత సందేశాత్మకంగా తెలియజేశారు.
బోయ జంగయ్య రచించిన ‘తుపాకులు’ కథ తెలంగాణ గ్రామీణ జీవితాన్ని, ప్రజల పోరాటాలను, రాజకీయ పరిణామాల ప్రభావాన్ని హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది. కథలో బస్సు ప్రయాణం ప్రధాన వేదికగా కనిపించినప్పటికీ, దాని వెనుక తెలంగాణ గ్రామీణ సమాజపు గతం, పేద ప్రజల కష్టాలు, కుటుంబ సంబంధాలు, రాజకీయ నాయకుల స్వార్థం వంటి అనేక అంశాలు అంతర్లీనంగా ఉన్నాయి.
“సర్కారు బస్సు కనుకనే టికెట్ తీసుకోను” (మూడు తరాల తెలంగాణ కథ 111) అనే స్త్రీ మాటల్లో ప్రభుత్వ వ్యవస్థ పట్ల ఆమెకు ఉన్న నిరసన వ్యక్తమవుతుంది. సాధారణ ప్రయాణికులకు వింతగా కనిపించే ఆమె ప్రవర్తన వెనుక చారిత్రక అనుభవాలు, వ్యక్తిగత విషాదం దాగి ఉన్నాయి. గ్రామీణ ప్రజల మాటతీరు, ఆలోచనా విధానం, ఆర్థిక పరిస్థితులు కథలో సహజంగా ప్రతిఫలించాయి. అంతేకాకుండా, బాధితుల మనోవేదనను అర్థం చేసుకోకుండా వారిని పిచ్చివారిగా ముద్రవేసే సమాజపు ధోరణిని రచయిత విమర్శించారు. వ్యక్తి ప్రవర్తన వెనుక ఉన్న సామాజిక, చారిత్రక పరిస్థితులను పరిశీలించాల్సిన అవసరాన్ని ఈ కథ తెలియజేస్తుంది.
“పోరాటమపుడు ఆయుధాలు పట్టుకున్నోల్లు మంట గలిసిండ్రు. స్వరాజ్యం వొచ్చినంక మాయ మాటలు జెప్పి పదవులను పుచ్చుకొని ప్రజా నాయకులం అని బతుకుతుండ్రు” (మూడు తరాల తెలంగాణ కథ 113)
అనే వాక్యాలు ప్రజా ఉద్యమాల వెనుక ఉన్న రాజకీయ స్వార్థాన్ని ప్రశ్నిస్తాయి.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నాగన్నను రజాకార్లు కాల్చిచంపడంతో ఆ తల్లి తన భర్తను కోల్పోతుంది. అనంతరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన ఒక్కగానొక్క కుమారుడిని పోలీసులు కాల్చిచంపడంతో ఆమె జీవితం మరింత విషాదమయమవుతుంది. భర్తను, కొడుకును ఇద్దరినీ కోల్పోయిన ఆమెకు మిగిలింది వారి జ్ఞాపకాలు, తీరని దుఃఖం మాత్రమే. రెండు వేర్వేరు చారిత్రక పోరాటాలు ఒకే కుటుంబాన్ని ఎలా విషాదంలోకి నెట్టాయో రచయిత హృదయవిదారకంగా చిత్రించారు. భర్త మరణించిన తర్వాత కుమారుడే తన జీవితానికి ఆధారంగా భావించిన ఆ తల్లికి అతడిని కూడా కోల్పోవడం తీరని శోకాన్ని మిగిల్చింది. ఆమె ప్రవర్తనను పిచ్చిగా భావించే సమాజం, ఆమె అనుభవించిన చారిత్రక గాయాలను గుర్తించలేకపోతుంది.
“నా ఒక్క కొడుకే కాదు, ఎందరి కొడుకులనో పొట్టనబెట్టుకుండ్రు. మా శోకం ఊకేపోదు, తప్పక తగులుతుంది” (మూడు తరాల తెలంగాణ కథ 118)
అనే మాటల్లో తల్లుల ఆవేదనతోపాటు ప్రభుత్వ అణచివేతపై నిరసన వ్యక్తమవుతుంది. ఈ విధంగా గ్రామీణ ప్రజల త్యాగాలు, కుటుంబాల విచ్ఛిన్నం, మహిళల ఒంటరితనం, ఉద్యమాల ప్రభావం, రాజకీయ నాయకులపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి కథలో ప్రధానంగా కనిపిస్తాయి. ప్రజల త్యాగాలను అధికార సాధనకు ఉపయోగించుకునే నాయకత్వాన్ని, ప్రజల బాధలను పట్టించుకోని పాలనా వ్యవస్థను రచయిత ఈ కథ ద్వారా ఎత్తి చూపారు.
అల్లం రాజయ్య రాసిన ‘చిలుకా నువ్వెటు వెళ్లావు?’ కథ తెలంగాణ గ్రామీణ సమాజంలోని దొరల ఆధిపత్యం, పేదల బానిస బతుకులు, కులవివక్ష, స్త్రీల అణచివేతను తెలియజేస్తుంది. ఈ కథలో ఒక పాలేరు కుటుంబం మూడు తరాలుగా దొర దగ్గర పనిచేస్తుంది. ఒకప్పుడు తీసుకున్న యాభై రూపాయల అప్పు తీర్చలేక ఆ కుటుంబం తరతరాలుగా దొర సేవలోనే బతుకుతుంది. దొర తిట్లను, అవమానాలను భరిస్తూ వచ్చిన పాలేరులో చివరకు తిరుగుబాటు భావం పెరుగుతుంది.
“నీ బాంచెన్ ఇక నా తరంగాదు” (మూడు తరాల తెలంగాణ కథ 297)
అంటూ దొరను ఎదిరించి వెళ్లిపోవడం అతని ఆత్మగౌరవానికి, స్వేచ్ఛా కాంక్షకు గుర్తుగా నిలుస్తుంది. నేటి సమాజంలో వెట్టిచాకిరీ రూపం మారినప్పటికీ, అప్పుల కారణంగా పేదలు చేసే కష్టం, తక్కువ వేతనాలు, కార్మికులపై జరిగే దోపిడీ ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. కులం, ఆర్థిక స్థితి ఆధారంగా కొందరిని తక్కువగా చూడటం కూడా పూర్తిగా తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో పాలేరు తిరుగుబాటు కేవలం ఒక వ్యక్తి నిరసన మాత్రమే కాదు; అన్యాయానికి ఎదురు నిలవాలనే ఆత్మగౌరవానికి ప్రతీకగా కనిపిస్తుంది.
ఈ కథలో దొర కూతురు భారతి జీవితం కూడా ముఖ్యమైనది. సంపద, సౌకర్యాలు ఉన్నా ఆమెకు స్వేచ్ఛ ఉండదు. తండ్రి ఆంక్షలు, కుటుంబ గౌరవం, కట్నం, పెళ్లి విషయంలో దొరతనానికి తగిన సంబంధం కావాలనే ఆలోచనలు ఆమె జీవితాన్ని బంధిస్తాయి. తనకు నచ్చినట్లు జీవించలేక ఆమె మానసికంగా బాధపడుతుంది.
“అన్నీ ఉండి స్వేచ్ఛలేకపోవడం భయంకరమైనది” (మూడు తరాల తెలంగాణ కథ 300)
అనే వాక్యం భారతి పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తుంది. భారతి పరిస్థితి నేటి మహిళల జీవితాలతోనూ సంబంధం కలిగి ఉంది. చదువు, ఉద్యోగం, ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగినప్పటికీ, పెళ్లి విషయంలో కుటుంబ ఒత్తిళ్లు, కట్నం, దుస్తులు, వ్యక్తిగత నిర్ణయాలపై ఆంక్షలు కొన్ని కుటుంబాల్లో కొనసాగుతున్నాయి. మహిళలకు అవకాశాలు కల్పించడమే కాకుండా, తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కూడా గౌరవించాల్సిన అవసరాన్ని ఈ కథ గుర్తుచేస్తుంది.
కథకు పెట్టిన ‘చిలుకా నువ్వెటు వెళ్లావు?’ అనే శీర్షిక అర్థవంతమైనది. పంజరంలో ఉన్న చిలక ఎగిరిపోయినట్లుగా భారతి బంధనాల నుంచి బయటపడుతుంది. పాలేరు కూడా బానిస బతుకు నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నిస్తాడు.
“ఆ శాశ్వత బందిఖానా నుండి బయటపడ్డ తర్వాత భారతి ఎక్కడైనా స్వేచ్ఛగా బ్రతుకుతుంది” (మూడు తరాల తెలంగాణ కథ 305)
అనే ముగింపు ఆమె స్వేచ్ఛా ఆకాంక్షను తెలియజేస్తుంది. ఆమెకు విముక్తి లభించినప్పటికీ, మహిళకు స్వేచ్ఛ లభించాలంటే కుటుంబ బంధనాల నుంచి బయటపడటమే కాకుండా, ఆమె వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించే సమాజం కూడా అవసరమనే విషయాన్ని ఈ కథ ఆలోచింపజేస్తుంది. ఈ విధంగా కథలోని పాలేరు, భారతి పాత్రలు వేర్వేరు సామాజిక స్థితుల్లో ఉన్నప్పటికీ, ఇద్దరూ బంధనాల నుంచి విముక్తిని కోరుకుంటారు. ఒకరు ఆర్థిక, కుల ఆధిపత్యాన్ని ఎదిరిస్తే, మరొకరు కుటుంబ ఆంక్షలను దాటి స్వేచ్ఛను కోరుకుంటారు.
"స్త్రీ జీవితం కేంద్రంగా ప్రత్యేకంగా వచ్చిన కథ ‘చిలుకా! నువ్వెటు వెళ్లావు?’. భూస్వామ్య వర్గపు స్త్రీ జీవితంలోని అశాంతిని అసంతృప్తిని వ్యక్తీకరించింది. పేదల పాలిట పీడకవర్గంగా వున్న పెత్తందారీ వర్గం తనవర్గపు స్త్రీల పట్ల కూడా నిర్దయగా అసమధర్మాన్నే అమలుచేస్తుందని అల్లం రాజయ్య ఈ కథ ద్వారా నిరూపించాడు" (నీళాదేవి 133).
సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ కథ తెలియజేస్తుంది. తెలంగాణ గ్రామీణ జీవితాన్ని సహజంగా చిత్రించిన ఈ కథ నాటి సామాజిక పరిస్థితులను చూపడమే కాకుండా, నేటికీ కొనసాగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తుంది. తెలంగాణ ప్రజల జీవన వాస్తవాలను సాహిత్య రూపంలో అందించిన అల్లం రాజయ్య రచనా ప్రతిభకు ఈ కథ ఒక మంచి ఉదాహరణ.
దాశరథి కృష్ణమాచార్య రచించిన ‘నిప్పుపూలు’ కథలో తెలంగాణ గ్రామీణ జీవితం, భూస్వామ్య వ్యవస్థ, సామాజిక అసమానతలు, మానవ సంబంధాలు ప్రధానంగా ప్రతిఫలించాయి. గ్రామీణ ప్రజల శ్రమతో సంపదను కూడబెట్టుకున్న జాగీర్దార్ల విలాసవంతమైన జీవితానికి, పేద ప్రజల సాధారణ జీవనానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రచయిత మోదుగు పూలు, పైడి తంగేళ్ల ప్రతీకల ద్వారా ఆవిష్కరించారు.
“జాగీర్లు, బంజర్లు. అక్కడ జనం యెన్ని బాధలు పడ్డా లక్షల మొత్తం సలక్షణంగా హైదరాబాదు మహళ్ళకు చేరుకుంటుంది” (మూడు తరాల తెలంగాణ కథ 59)
అనే వాక్యం గ్రామీణ సంపదను పట్టణాల్లోని అధికార వర్గాలు ఎలా అనుభవించాయో తెలియజేస్తుంది. నేటికీ వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే రైతులకు తగిన గిట్టుబాటు ధరలు లభించకపోవడం, మధ్యవర్తులు అధిక లాభాలు పొందడం వంటి పరిస్థితుల్లో ఈ కథలోని ఆర్థిక అసమానతల చిత్రణ సమకాలీన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
“సుఖపడి చావడం వాళ్ళ వంతు. కష్టపడి బ్రతకడం ప్రజల వంతు” (మూడు తరాల తెలంగాణ కథ 61) అనే వాక్యం భూస్వామ్య సమాజంలోని దోపిడీ స్వభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అధికార వర్గాల విలాసవంతమైన జీవితం వెనుక సామాన్య ప్రజల శ్రమ, బాధలు దాగి ఉన్నాయని ఈ కథ వెల్లడిస్తుంది. అయితే, కాలం మారుతున్న కొద్దీ ప్రజల్లో చైతన్యం పెరిగి, తమ హక్కుల కోసం ప్రశ్నించే శక్తి అభివృద్ధి చెందుతుందని కూడా రచయిత సూచించారు. నేటి గ్రామీణ సమాజంలో భూమి హక్కులు, కూలీల వేతనాలు, మహిళల ఆర్థిక స్వావలంబన వంటి అంశాలు ఈ దృక్పథానికి మరింత ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి.
“మాకు ఈ చిన్న గుడిసె చాలు. కలో గంజో తాగుతాం. బతుకుతాం” (మూడు తరాల తెలంగాణ కథ 63) అనే గౌరి మాటల్లో గ్రామీణ జీవితంలోని సంతృప్తి, ఆత్మగౌరవం, మానవీయత వ్యక్తమవుతాయి. బేగం సంపదను వదిలి గౌరి కుటుంబంతో కలిసి జీవించాలనుకోవడం, నిజమైన సంతోషం భవనాల్లో కాకుండా ఆప్యాయత, సమానత్వం, పరస్పర గౌరవంలో ఉంటుందని తెలియజేస్తుంది. ఈ విధంగా గ్రామీణ జీవితాన్ని ఆర్థిక అసమానతలు, సామాజిక మార్పు, మానవ సంబంధాలు, ఆత్మగౌరవంతో అనుసంధానించి చిత్రించడం ఈ కథలోని ప్రధాన విశేషం.