ఉపోద్ఘాతం:

"ఒక కాలమున ఒక రాజ వంశమునకో, ఒక జాతికో సంబంధించిన చారిత్రక అంశము కలది ఇతిహాసము"1. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. 'ఇతి హా ఆస' అంటే ఇది ఇలా జరిగింది' అని అర్థం. ఇది ఒకప్పుడు చరిత్రకు పర్యాయ పదంగా వాడారు.

ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడింది ఇతిహాసం. "ధర్మార్థ కామ మోక్షాణా ముపదేశ సమన్వితం - పూర్వావృత్త కథాయక్త మితిహాసం ప్రచక్షతే". 24 వేల శ్లోకాల వాల్మీకి రామాయణం సంస్కృతంలో తొలి కావ్యమైనా, తెలుగులో మాత్రం కావ్యేతిహాసం గానే గుర్తింపు పొందింది. ప్రాఙ్నన్నయ యుగంతో ప్రారంభమైన తెలుగు సాహిత్యం యుగ విభజనలో శ్రీనాథ యుగం( క్రీ.శ. 1350- 1500) ఆరవది. దీనికి కావ్య యుగమని పేరు. ఈ యుగం తెలుగు సాహిత్యంలో ప్రత్యేకతను సంతరించుకుంది. భారతీయ సంస్కృతికి మూల స్తంభాల్లో ఒకటైన భాగవతం ఈ యుగంలోనే వచ్చింది. ప్రక్రియా వైవిధ్యంతో క్షేత్ర మాహాత్మ్యాలు, కథా కావ్యాలు, వీరరస కావ్యాలు, పురాణాలు, ద్విపద కావ్యాలు, శాస్త్ర, లక్షణ గ్రంథాలు వంటివి ఈ యుగంలో వెలుగు చూశాయి

శ్రీనాథయుగంలో రామకథలో కొంత భాగం కొన్ని కావ్యాలలో ఉంటే, రామాయణ ఇతివృత్తంతో లభిస్తున్న కావ్యాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఈ పరిశోధన పత్రంలో పరిచయం చేస్తాను.

కావ్య యుగం - రామాయణ సంబంధ కావ్యాలు:

శ్రీనాథుడు రామాయణము పాట రాశాడనీ కానీ అది అలా అలభ్య గ్రంథమని బూదాటి వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు"2. ఈ రామాయణ పాట గురించి ఇతర వివరాలు ఏవీ అందుబాటులో లేవు.

ఇదే యుగంలోని విశిష్టకవి, సంకీర్తనాచార్యుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ద్విపద రామాయణం వ్రాసారని ప్రతీతి. కానీ అది కూడా అలభ్యం3. అన్నమయ్య జీవిత చరిత్రను సమగ్రంగా ద్విపదలో రాసిన అతని మనుమడు చిన్నన్న. “ప్రవిమల ద్విపద ప్రబంధ రూపమున నవముగా" రామాయణాన్ని అన్నమయ్య రాశాడని చెప్పారు4.

అంతేకాకుండా అన్నమయ్య వాల్మీకి రామాయణాన్ని సంకీర్తనాత్మకంగా తెలుగులో రచించాడట. ఇది ద్విపద రామాయణాల కంటే భిన్నమైంది. ఈ రెండు రచనలు ప్రస్తుతం అలభ్యాలు5. కావ్య యుగంలో రామ కథ భాగవతంలోనూ, పద్మ పురాణోత్తరఖండంలోనూ, జైమినీ భారతంలోనూ ప్రస్తావించబడగా, రామాయణ ఇతివృత్తంతో వాసిష్ఠ రామాయణం, మైరావణ చరిత్ర అనే కావ్యాలు వచ్చాయి

శ్రీమద్భాగవతం - రామ కథ:

పోతన సభక్తికంగా, వినయంగా, మధురంగా భాగవతాన్ని ఆంద్రీకరించాడు. తెలుగు వారి పుణ్య పేటిక బమ్మెరపోతన అనిపించుకున్నాడు.

కం. పలికెడిది భాగవతమట

పలికించు విభుండు రామభద్రుండట నే

బలికిన భవహరమగునట

పలికెద వేరొండు గాథ బలుకగనేలా? (ఆ.మ.భా. 1వ స్కం. 18 వ పద్యం )

పలికేది పరమ పవిత్రమైన భాగవతం. పలికించే ప్రభువు కరుణాసముద్రుడైన రామభద్రుడు. పలికినందువల్ల భవబంధాలు పరిహారమవుతాయి. అలాంటప్పుడు మరోకథ పలకడం దేనికి? భాగవత మే పలకడం నా అదృష్టం. అని పోతన భాగవతాన్ని భక్తితో తెలుగులోకి అనువాదం చేశాడు. కథా గతంగా భాగవతంలో రామకథ నవమ స్కంధంలో వచ్చినా, పోతన రామ భక్తిని, విష్ణు భక్తిగా అడుగడుగునా తొణికిసలాడుతునే ఉంటుంది. భాగవతం తొమ్మిదవ స్కంధంలో 105 పద్యగద్యాలలో శ్రీ రామ చరిత్రను వర్ణించాడు పోతన. రావణ సంహారం తర్వాత, పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకోగా అందంగా అలంకరించిన అయోధ్యను వర్ణించే పద్యం ఇదిగో

సీ. వీధులు సక్క గావించి తోయంబులు

సల్లి రంభాస్తంభ చయము నిలిపి

పట్టు చీరలు చుట్టి బహు తోరణములు

గలువడంబులు మేలు కట్లుగట్టి

వేదిక లలికించి వివిధ రత్నంబుల

మ్రుగ్గులు పలుచందములుగ బెట్టి

కలయ గోడల రామ కథలెల్ల వ్రాయించి

ప్రాసాదముల దేవభవనములను

తే.గీ. గోపురంబుల బంగారు కుండలెత్తి

యెల్ల వాకిండ్ల గానుక లేర్పరించి

జనుల గైసేసి తూర్యఘోషములతోడ

నెదురు నడతెంచి రా రాఘవేంద్రు కడకు (భా.9వ స్కం. 321వ పద్యం )

అంతకుముందే ఆ పట్టణంలో పౌరులు వీధులను శుభ్రం చేసి, నీళ్లు చల్లి, అరటి స్తంభాలను నిలిపి, పట్టు వస్త్రాలను చుట్టారు. చాలా తోరణాలను, కలువపూదండలను, చాందినిలను కట్టారు అరుగులను అలికించి, వివిధ రత్నాలతో పలురకాల ముగ్గులు పెట్టారు. గోడల మీద రామకథను రాయించారు. భవనాల మీద, దేవాలయాల మీద, గోపురాల మీద బంగారు కలశాలు ఎత్తించారు. వాకిళ్ళలో కానుకలను అమర్చి పెట్టారు. ఈ విధంగా అయోధ్యా నగర పౌరులు మంగళ వాయిద్యాలతో ఆ రామచంద్రుడికి ఎదురు వెళ్లారు.

ఉ. నల్లని వాడు, పద్మనయనంబులవాడు, మహాశుగంబులున్

విల్లును దాల్చు వాడు, గడు విప్పగు వక్షమువాడు, మేలు పై

జల్లెడువాడు, నిక్కిన భుజంబులవాడు, యశంబు దిక్కులం

జల్లెడువాడునైన రఘుసత్తముడీవుత మాకభీష్టముల్ (భా. 9.స్కం. 361 వ పద్యం )

నల్లనివాడు, పద్మాలవంటి కన్నులు గలవాడు, గొప్ప విల్లును బాణాలను ధరించినవాడు, విశాలమైన రొమ్ము కలవాడు, మేలు చేకూర్చే వాడు, ఎగు భుజాలు కలవాడు, అన్ని దిక్కులా కీర్తిని వెదజల్లే వాడయిన రఘుతిలకుడు మా కోరికలను తీర్చుగాక! అని పోతన రామకథాంతంలో ప్రార్థించాడు.

పద్మపురాణం ఉత్తరఖండం - రామ కథ:

మడికి సింగన పద్మపురాణం ఉత్తర ఖండాన్ని క్రీ.శ. 1420లో రచించినట్లు చెప్పుకున్నాడు. తాను రచించిన పద్మపురాణం ఉత్తరఖండం, ద్విపద భాగవతము దశమ స్కంధం వెలిగందల కందనామాత్యుడికి అంకితమిచ్చాడు. ప్రశస్తమైన పద్మపురాణం ఉత్తరఖండంలో చివరి 64 అధ్యాయాలను మాత్రమే గ్రహించి 11 ఆశ్వాసాల కావ్యంగా దీనిని తెనిగించాడు. ఆశ్వాసాంత గద్యలో విషయసూచిక ఉంది. పద్మ పురాణ కథలు వశిష్టుడు దిలీపుడికి చెప్పినట్లుగా ఉంది. ఇందులో రామాయణ, భాగవత కథలు ఎక్కువగా ఉన్నాయి.

పద్మపురాణం ఉత్తరఖండంలో ఎనిమిదవ ఆశ్వాసంలో శ్రీరామ అవతార కథ ఉంది. సింగన చేసిన స్త్రీ వర్ణనలో ఔచిత్యం, భావుకత తొణికిసలాడుతాయి.

చం. పసిడి సలాక పూ విలుతు బాణము సోగ సుధారసంబుపై

మిసిమి దలంప వెన్నెలల మీగడ జేసిన బొమ్మ కందులో

నుసిమిన చంద్రలేఖ బెళుకొందని కారు మెరుంగుతీగ యా

శశిముఖి రాముదేవి సడి సన్నది యొప్పున రాక్షసేశ్వరా! (ప. పు. ఉ. ఖం. 8వ ఆ, 168 వ పద్యం )

శూర్పణఖ ముక్కు చెవులు, రాముడే కోసినట్లుగా పద్మపురాణం ఉత్తరఖండంలో వర్ణించబడింది. తదనంతరయుగంలో అయ్యలరాజు రామభద్ర కవి రచించిన రామాభ్యుదయంలో ఇదే ఉంది.

జైమినీ భారతం - రామ కథ:

పిల్లలమర్రి పినవీరభద్రుడు రచించిన జైమిని భారతాన్ని సాళువ నరసింహరాయలకు (క్రీ.శ. 1485- 93) అంకితమిచ్చాడు. భారత అశ్వమేధపర్వం కథే జైమినీ భారతంలో వర్ణించబడింది. దీన్ని పినవీరన సంస్కృతం నుండి తెనిగించాడు. జైమినీ భారతం ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధం.

జైమిని భారతంలో కుశలవోపాఖ్యానంలో రామకథ ఉంది. జైమిని భారతం యుద్ధమయం కుశలవులు చేసిన యుద్ధం ఈ కావ్యంలోని మిగిలిన యుద్ధాలు, వ్యాసభారతంలోని అన్ని యుద్ధాల కంటే అగ్రగణ్యమైనది. ప్రతిక్షణం ఉత్కంఠభరితం. శత్రుఘ్నుడు లవున్ని, కుశుడు శత్రుఘ్నుణ్ణి మూర్చిల్లెలా చెయ్యటం, లవ కుశలు లక్ష్మణుని నిహతున్ని చేయడం, రాముణ్ణి మూర్చిల్లెలా చెయ్యటం గొప్ప అంశాలు. శ్రీరాముడు తండ్రిగా చూపిన ఆదరాభిమానాలు ఇందులో ముఖ్యమైనవి. ఇందులో ఆరవ ఆశ్వాసం అంతా కుశలవోపాఖ్యానమే. బబ్రువాహనుడు అర్జునుల యుద్ధాన్ని, శ్రీరాముడితో కుశుడు చేసిన యుద్ధంగా జైమినీ పోల్చాడు. 273 పద్య గద్యాలలో రాసిన ఈ లవకుశోపాఖ్యానం సంపూర్ణ కావ్యలక్షణాలు, ఫలశ్రుతితో విరాజిల్లుతోంది.

లవకుశలు నిర్బంధించిన యాగాశ్వాన్ని విడిపించడానికి వెళ్లి, లక్ష్మణ భరత శత్రుఘ్నులు మూర్చపోయిన తర్వాత శ్రీరాముడు కదనరంగానికి వచ్చి ఆ పిల్లలను చూసి - "మీకు జాతకర్మ నామకరణాలు ఎవరు చేయించారు? ధనుర్వేదం ఎక్కడ అభ్యసించారు? యుద్ధకౌశలం ఎవరు నేర్పారు? మీ తల్లిదండ్రులు ఎవరు? తెలియజేయమని" అడుగుతాడు

తే.గీ. పోరికెదిరించి మా పుట్టు పూర్వములను

దెలియ బని యేమి మీకు నీ తేటలకును

హయము విడుతుమె యైన మీ యంత వార

లడుగ జెప్పమి తగవుగాదని కుశుండు(జై .భా, 6వ ఆ, 223 పద్యం )

యుద్ధానికి వచ్చి మా పుట్టు పూర్వాలు ఎందుకు అడుగుతారు? మీ తేట మాటలకు లోబడి గుర్రాన్ని ఇచ్చేవాళ్లం కాదు. అయినా మీ అంతటి వారు అడిగితే చెప్పకుండా ఉండటం మంచి పద్ధతి కాదు, అని వాళ్ళిద్దరూ రాముడికి సొంత విషయాన్ని చెప్తారు.

పైన పేర్కొన్న మూడు కావ్యాలలో కథలో భాగంగా రామకథను ప్రస్తావిస్తే, రామాయణంలోని కథలో కొంత భాగాన్ని కావ్యంగా మలచిన వారిద్దరున్నారు. వాసిష్ఠ రామాయణం, మైరావణ చరిత్ర అనే కావ్యాలు రామాయణ కథా ఘట్టాలకు సంబంధించినవి.

వాసిష్ఠ రామాయణం:

శ్రీనాథయుగంలో రామాయణానికి సంబంధించిన కావ్యాల్లో మొదటిది వాసిష్ఠ రామాయణం. దీన్ని మడికి సింగన రాశాడు. 'పద్మపురాణం ఉత్తరఖండం,' 'భాగవతం దశమస్కంధం (ద్విపద)'. తెలుగులో మొట్టమొదటి సంకలన కావ్యమైన సకలనీతి సమ్మతం' సింగన ఇతర రచనలు.

వాసిష్ఠ రామాయణానికి "యోగవాసిష్టం" అనే నామాంతరం ఉంది. వేదాంత ప్రబోధకమైన ఈ ప్రబంధంలో ఐదాశ్వాసాలున్నాయి. దాదాపు 1200 పద్యాలున్నాయి. ఇది అహోబిల నరసింహ స్వామికి అంకితం. సంస్కృతంలోని జ్ఞానవాసిష్టానికి సంగ్రహ రూపమైన ఆంధ్రీకరణ ఈ గ్రంథం. పదహారేళ్లకే సంసారం అంటే విరక్తి కలిగిన శ్రీరాముడికి, విశ్వామిత్రుడు కోరిన విధంగా, వశిష్టుడు జ్ఞానబోధ చేయడం ఇందులో కథాంశం. వైరాగ్యం, ముముక్షువు, ఉత్పత్తి, స్థితి, ఉపశమనం, నిర్వాణం అనే ఆరు ప్రకరణాలు ఇందులో ఉన్నాయి. జటిలమైన ఆధ్యాత్మిక విషయాలను సుకుమారమైన కవిత్వంతో, సుబోధకంగా సింగన ఈ కావ్యంలో చెప్పారు

కం. తన బుద్ధి వికల్పనమున

జనియించు జగంబు! దాని సంక్షయమున నా

శన మొందును సంసారం

బని మదిగను మిదియె నిశ్చితార్థము పుత్రా!(వా. రా. 1 ఆ. 139వ పద్యం )

శుక మహర్షి వేదవ్యాసుని కొడుకు. మహాజ్ఞాని. లోక గతి ఆత్మతత్వం తెలిసినవాడు. అయినా ఆత్మజ్ఞానం గురించి సందేహం వచ్చి తన తండ్రి వ్యాసుణ్ణి అడిగిన సందర్భంలోనిదీ పద్యం. మడికి సింగన రచించిన ఈ వాశిష్ఠ రామాయణంలో మొత్తం 39 ఆఖ్యానాలున్నాయి. ఇందులో అంతా జ్ఞానోపదేశమే.

మైరావణ చరిత్ర:

కావ్యయుగంలో రామాయణ కథా సంబంధ కావ్యాలలో లభిస్తున్న వాటిలో రెండవది మైరావణ చరిత్ర. దీనికి కర్త మాడయ కవి. ఇందులో 3 ఆశ్వాసాలు ఉన్నాయి. మాడయ కవి దీన్ని అబ్బయ్య గారి గోపమంత్రికి అంకితం చేశాడు. ఇతడు “దేవేంద్ర విజయం" అనే ద్విపద కావ్యాన్ని రాసి ఎర్రన మంత్రికి అంకితం చేశాడని తెలుస్తోంది. కానీ ఆ గ్రంథం ఇప్పుడు అలభ్యం

మైరావణుడు రావణుడి మేనమామ. మహా మాయావి. పాతాళలంకకు పాలకుడు. ఇతడికో చెల్లెలు ఉండేది. ఆమె కుమారుడు జన్మించగానే పాతాళలంకకు రాజవుతాడని జ్యోతిష్కులు చెప్పారు. అదివిన్న మైరావణుడు చెల్లిని, మేనల్లుడిని కారాగారంలో గొలుసులతో బంధింపజేస్తాడు. రామాయణంలో మైరావణుడు రామ, రావణ యుద్ధ సమయంలో మాత్రమే కనిపిస్తాడు. మైరావణ చరిత్ర కావ్యం అయోధ్యా నగర వర్ణన తో ప్రారంభమౌతుంది. రావణ సంహారం తరువాత హనుమంతుడు మైరావణుడితో యుద్ధం చేసి రామ లక్ష్మణుల్ని ఎలా తీసుకు వచ్చాడో ఈ కావ్యంలో మూడు శ్వాసాలు మాయ కవి చెప్పాడు. వీరరసంతో తొణికిసలాడే ఈ కావ్యంలో యుద్ధాలు సహజవర్ణాలతో అలరారుతున్నాయి.

రామలక్ష్మణులను తీసుకురావడానికి పాతాళ లంకకు వెళ్ళిన హనుమంతుడికి 'మత్స్యవల్లభుడు అనే కొడుకు ఉన్నాడని తెలుసుకున్న తరువాత-

తే.గీ తండ్రి బిడ్డలు తమలోన తగవు తప్పి

కలహ మెక్కించ గారాదు గాన నాకు

బుత్ర నిను జూచి మోహంబు పుట్టదొడగె

నలిగి పోరాట జిత్తంబు గొలుపదింక(మై.చ, 2 ఆ. 102వ పద్యం )

తనతో సమానబలం కలిగిన కొడుకును చూసి మనమిద్దరం యుద్ధం చేసుకోకూడదని ఆంజనేయుడు చెప్పిన సందర్భంలోదీ పద్యం. ఇలా ఆసాంతం సాగిందీ రచన.

ముగింపు:

రామకథను స్పృశించని తెలుగు కవుల ఉండరంటే అతిశయోక్తి కాదు. కాలానుగుణంగా మనకు ఆ యా రచనలు అందకపోయి ఉండవచ్చు లేక గ్రంథస్థం కాకుండా ఎన్నో చాటువులుగానే చేజారిపోయి ఉండవచ్చు. వాల్మీకి రామాయణం, భవభూతి ఉత్తర రామ చరిత్రాదుల ప్రభావం తెలుగులో కావ్యయుగంలోనూ మిగిలిన యుగాల సాహిత్యంలోనూ స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. అందుకు మచ్చుతునకలే ప్రస్తుతం నేను చర్చించిన పద్యరాజాలు. మరింత పరిశోధించి ఇతర కావ్యాలలోనూ రామకథా మాధుర్యాన్ని, కవితా వైశిష్టాన్ని, వర్ణన చాతుర్యాన్ని, పాత్రౌన్నత్యాన్ని వెలికి తీయవచ్చు.

పాద సూచికలు:

1. పింగళి లక్ష్మీకాంతం, నా రేడియో ప్రసంగాలు

2. బూదాటి వెంకటేశ్వర్లు, తెలుగు సాహిత్య ప్రక్రియలు - ధోరణులు, పుట. 43

3. జి.నాగయ్య, తెలుగు సాహిత్య సమీక్ష, మొదటి భాగం, పుట. 576

4. తాళ్ళపాక చిన్నన్న, అన్నమయ్య చరిత్ర (ద్విపద), పుట. 45

5. జి. నాగయ్య, తెలుగు సాహిత్య సమీక్ష, మొదటి భాగం పుట. 576

.

ఉపయుక్త గ్రంథ సూచి:

1. నా రేడియో ప్రసంగాలు - పింగళి లక్ష్మీకాంతం

2. తెలుగు సాహిత్య ప్రక్రియలు ధోరణులు - బూదాటి వెంకటేశ్వర్లు

3. అన్నమయ్య చరిత్ర (ద్విపద) - తాళ్ళపాక చిన్నన్న

4. తెలుగు సాహిత్య సమీక్ష - మొదటి భాగం - జి నాగయ్య

5. పోతన భాగవతం - మూడవ సంపుటం, టిటిడి ప్రచురణ

6. పద్మపురాణం ఉత్తరఖండం - ద్వితీయ భాగం - మడికి సింగన

7. జైమిని భారతం - పిల్లలమర్రి పినవీరభద్రుడు

8. వాసిష్ఠ రామాయణము - మడికి సింగన

9. మైరావణ చరిత్ర - మాడయ కవి.