పరిచయం:

సంస్కృత రూపక వాఙ్మయంలో కనిష్ఠికాదిష్ఠితుడైన కాళిదాసు పై భాసుడి ప్రభావం ఉందని విమర్శకుల భావన. మన తెలుగు సాహిత్యంలో కూడా 19వ శతాబ్దంలో పుట్టిన చాలామంది కవులు కాళిదాసాది కవులను అనుసరించి రచనలు చేసినవారున్నారు. కాళిదాసు ఉపమా విన్యాసాలను అనుసరించారు కాబట్టే పానుగంటి వారికి అభినవ కాళిదాసు అనే బిరుదు వచ్చిందంటారు. సరిగ్గా అలాగే ఆ కాలంలోని వారే అయిన శ్రీ దాసు శ్రీరాములు గారికి అభినవ భాసుడనే బిరుదు ఉంది. వీరి నాటకాలను గమనిస్తే భాసుని నాటక నిర్మాణ చాతురిని ఎక్కువగా అనుసరించినట్లు మనకు కనబడుతుంది.

కవి జీవిత విశేషాలు – రచనా విశేషాలు:

శ్రీ దాసు శ్రీరాములు గారు 8.4.1846లో కూరాడలో జన్మించారు. తల్లిదండ్రులు కామాంబ, కన్నయమంత్రి. వీరు విద్వత్కవులు. శతావధాని. బహుగ్రంథకర్త. ఇంగ్లీషు, పారశీకం, సంస్కృత భాషల్లో గొప్పపండితులు. మొదట ఉపాధ్యాయులుగా ఉండి తర్వాత న్యాయవాదవృత్తిని చేపట్టారు. సంఘసంస్కారానికి సుతరామూ ఒప్పుకోని ఛాందసులున్న కాలంలో, స్త్రీవిద్యకు ప్రోత్సాహమిచ్చి తన కుమార్తెకు సాధారణ విద్యతో పాటు సంగీతాన్ని కూడా చెప్పించే సాహసం చేసారు వీరు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. బాల్యంలోనే జుత్తు తీయించడం, ముసుగు వేయించడంవంటి చర్యలకు వ్యతిరేకులు. సంఘసంస్కరణతో పాటు సంప్రదాయ పరిరక్షణదృష్ట్యా కూడా రచనలు చేశారు. జ్యోతిశ్శాస్త్రంలో వీరు నిష్ణాతులు. వీరి ధారణశక్తి గొప్పది. కల్పవల్లి పత్రికను నడిపి సంఘసంస్కరణకు కృషి చేశారు. 11వ ఏట సత్రాజితీ విలాసం అనే యక్షగానాన్ని, 12వ ఏట సోమలింగేశ్వర శతకాన్ని రాశారు. వీరు రాసిన అభినవ గద్య ప్రబంధం పెద్దకథ. ధర్మశాస్త్రాలన్నింటినీ లోతుగా పరిశీలించి తర్కశాస్త్ర పరిజ్ఞానంతో వైశ్య ధర్మదీపికను రాశారు. ఇది పండితుల ప్రశంసలనూ అందుకుంది. ఇందులో వైశ్యుల ధర్మాలను చర్చించి ఇప్పటి వైశ్యులు ద్విజులే అనీ, వేదోక్త కర్మలను అర్హులనీ సిద్ధాంతీకరించారు. తెలుగునాట ప్రచురంలో ఉన్న దేవీభాగవతాలలో వీరిది ప్రశస్తమైనది. ఇప్పటికీ దీనిని పారాయణ గ్రంథంగా చదువుకునేవారు ఉన్నారు.

తెలుగు నాడు పద్యకావ్యం కూడా వీరి విరచితమే. దీనివల్ల దాసు శ్రీరాములుగారికి అభినవ శ్రీనాథ అనే బిరుదు వచ్చింది. ఇందులో నియోగి, వైదీకి మొదలైన శాఖల బ్రాహ్మణులు మాట్లాడుకునే వ్యావహారిక భాషను గ్రంథస్థం చేశారు. వీరి సంస్కృత నాటకానువాదాలు పండిత పామరజనరంజకంగా ఉన్నాయి. మయూరుని సూర్యశతకాన్ని మూలంలోని ప్రౌఢిమ తగ్గకుండా, సొంపులకు భంగం రాని రీతిలో తెలుగులో అనువదించారు. చక్కట్లదండ అచ్చతెలుగులో ఉన్న నీతిమాలిక. ఆటవెలది రచనలో ప్రాస పాటించడం, అనుప్రాసలలో చమత్కారాలు చూపడం వీరి రచనలో సర్వసాధారణం. గద్యరచనలో ప్రబంధరీతులను ప్రవేశపెట్టిన కవి వీరు. డా. వెలగపూడి వైదేహిగారు వీరి రచనల మీద పరిశోధన చేశారు.

కురంగ గౌరీశంకరనాటకం - కవిగారి విలాసం:

శ్రీ దాసు శ్రీరాములుగారు రచించిన స్వతంత్ర రూపకం కురంగ గౌరీశంకర నాటకం. కురంగం కారణంగా గౌరీ, శంకరుల వివాహం జరగడం ఇందులో వస్తువు అవడంవల్ల దీనికీ పేరు పెట్టి ఉంటారు. సార్థక నామధేయమే ఇది అనిపిస్తుంది. నాలుగంకాల పరిమితి ఉన్న నాటిక ఇది. ఆకృతిలో ఈ నాటిక చిన్నది అయినా అపూర్వ కల్పనలకు ఇది నిలయం. భాస మహాకవే తెలుగు భాషపై మమకారంతో ఇలా దాసు శ్రీరాములుగా జన్మించారేమో అనిపిస్తుంది. ఈ నాటికలో వస్తువు పార్వతీ పరమేశ్వరుల పరణయగాధ. ఇది పురాణ ప్రసిద్ధం. కాళిదాసాది మహాకవుల చేత సంస్కృతంలో కావ్యంగా తీర్చిదిద్దబడింది. నన్నెచోడాదులు తెలుగు కావ్యాలుగా రచించి, దీనికి వస్తుగౌరవాన్ని కలిగించారు. పూర్వకవుల కుమారసంభవాన్ని, తారకాసుర సంహారాన్ని కూడా గ్రహిస్తే శ్రీదాసువారు పార్వతి పరిణయం వరకే వస్తువుగా గ్రహించి నాటికను మంగళాంతంగా మార్చారు. ఈ నాటికలో కల్పనలు దాసు శ్రీరాములుగారి ప్రతిభకు ప్రమాణాలై, ప్రశంసా పాత్రాలవుతున్నాయి.

దక్షాధ్వర ధ్వంసం తరువాత శివుడు మందరగిరి శిఖరంపై ఒక వటవృక్షం కింద యోగ సమాధిలో ఉన్నాడు. పార్వతి బదరికాశ్రమం దగ్గర ఒక పర్ణశాలను నిర్మించుకుని శివధ్యానంలో నిమగ్నమై ఉన్న పార్వతి అటుగా వచ్చిన దుర్వాస మహర్షిని గమనించదు. అప్పుడు ఆ ముని కోపంతో ఆమె ఎవరినైతే ధ్యానిస్తోందో అతని స్థానం ఆమెకు పొడగొట్టదని శపించాడు. ఈ విషయం పార్వతి చెలికత్తెలైన బాల, సుందరిలకు తెలిసి ఆ మహర్షిని శాపవిమోచనం చెప్పమని అడుగుతారు. ఆ ముని గౌరిచేత పెంచబడిన లేడిపిల్ల ఒకటి శివుని సమీపానికి చేరితే శాపం తీరిపోతుందని చెప్తాడు. ఆ శాపవిమోచన క్షణంకోసం చెలికత్తెలు ఎదురుచూస్తుంటారు. ఇంతలో ఒకరోజు పార్వతి ఒకలేడి పిల్లను చూడడం దానిని తాను పెంచికోవాలనుకోవడం, చెలికత్తెలు కిరాతునితో దెబ్బలాడి ఆ లేడిని తేవడం జరుగుతాయి. తారకాసుర సంహారం కోసం శివపార్వతుల యోగం జరగాలనే ఉద్దేశ్యంతో కాముడు ఒక బ్రాహ్మణ బాలుని వేషంలో వచ్చి ఆలేడిని అపహరించి దానిని శివుని వెనుక దాచి ఉంచుతారు. ఆ లేడిని వెతుకుతూ వెళ్ళిన పార్వతికి శివుడు కనిపించడం, వారి సయోధ్యకోసం ఎదురు చూస్తున్న మన్మథుడు బాణాలు ప్రయోగించడం, కోపంతో శివుడు మూడవ కన్ను తెరవడం, మన్మథుడు భస్మమైపోవడం, రతీదేవి విలపించడం, ఆమెకు మాత్రమే మన్మథుడు కనిపించేటట్టు శివుడు వరాలీయడం, శివపార్వతుల కల్యాణం జరగడం ఇలా చకచకా సాగిపోతుంది కథ ఇందులో.

ప్రాచీన కావ్యాల అనుసరణ:

కుమార సంభవాది కావ్యల్లో కనిపించే కథను గ్రహించి దానిని విచిత్ర కల్పనలు జోడించి విశిష్టంగా రచించారు. ఆ కల్పనలు 1. కురంగ వృత్తాంతం. 2. దుర్వాసశాపం. శివపార్వతుల వివాహం జరగడానికి బ్రహ్మాదులు కంకణం కట్టుకున్నారు. అందుకు బ్రహ్మ ప్రేరకుడు, విష్ణువు సుత్రధారుడు. బ్రహ్మ కిరాతుడుగా, కురంగ రూపాన్ని ధరించిన విష్ణువు పార్వతిని శివుని దగ్గరకు చేర్చాడు. మదనుడిని నియోగించింది ఇంద్రుడు. ఈవిధంగా దేవతలే దేవదేవుని వివాహానికి కారకులయ్యారు. ఈ నాటికలో పార్వతి దివ్యజ్ఞానం ఉన్న వధువు. ఆమెకు దుర్వాసుడి శాపంవల్ల దివ్యదృష్టి కుంఠితమైంది. కురంగం శివుని దగ్గరకు చేరడంతో ఆమెకు దివ్యదృష్టి తిరిగివచ్చింది. ఇలా కథాగతికి, ఫలసిద్ధికి కురంగం కారణం అవడంవల్ల కురంగ కల్పనం ప్రధానమవుతుంది. చేసిన కల్పనలకు సమగ్ర సార్థక్యాన్ని కలిగించడంవల్ల కవి ప్రతిభ ప్రశంసనీయం.

కురంగ గౌరీశంకర నాటిక – కాళిదాసు శాకుంతలం:

శ్రీదాసు వారి కల్పనలకు కాళిదాసు శాకుంతలం ప్రేరణ ఇచ్చిందన్నది స్పష్టం. శాకుంతలంలో హరిణాన్ని వెంటాడుతూ దుష్యంతుడు వచ్చినట్లు ఉంటే, లేడిపిల్లను వెంటాడుతూ వచ్చిన కిరాతుడుని వారించి బాల, సుందరులు ఆ మృగాన్ని రక్షించినట్లు మార్చారు. శాకుంతలంలో దుర్వాసుడి శాపం ఎటువంటి ప్రయోజనాన్ని సాధించిందో, ఇక్కడ కూడా అదే ప్రయోజనాన్ని సాధించింది. భేదం ఏమిటంటే అక్కడ మరపు నాయకుడికి, ఇక్కడ దివ్యదృష్టి నశించడం  నాయికకు. అక్కడ అభిజ్ఞానమైన ముద్దుటుంగరం జ్ఞాపకహేతువు. ఇక్కడ హరిణం జ్ఞాపకం. ఈ విధంగా కథాప్రవృత్తి అనుగుణంగా కథాగతిని మార్చి పోషకాలుగా అత్యంత సహజంగా అనుసంధించుకోవడంలో కవి తన ప్రతిభావిశేషాల్ని ప్రకటించారు.

ప్రసిద్ధమైన ఈ కథలే ప్రయోజనాన్ని  దృష్టిలో ఉంచుకొని కవి మరికొన్ని మార్పులను కూడా చేశాడు. ప్రసిద్ధ కథలో మదన దహనానంతరం పార్వతి తపస్సుకు ఉపక్రమించినట్లు ఉంటే, ఈ నాటికలో చిన్ని చందురుకైన వెన్నెలల్పచరింపఁ జదలాకాసము ముట్టి వెడలగ్రక్కు వంటి అచ్చతెలుగు పదాల పోహళింపు కూడా ఈ నాటికలో కనిపిస్తుంది.

పూర్వకవుల అనుసరణ:

          మెడద్రిప్పి వెనువెన్క మిఱ్ఱి చూచుచు నక్కు చంగున మైసాచి సరగముడుచు

          చెవులు నిక్కఁగ ముట్టె చెమటట్టఁగ మీపఁది కెగసి యందందఁ గాలిచ్చి నిలుచు

          నుల వాలకించి దిక్కులు సూచి పలుమాఱు భ్రమయుఁబ్రక్కలఁబాఱు నెమరుఁగ్రక్కు

దొట్రుపాటునఁదూలిదోఁకమడంచి యాయాసాన దీర్ఘనిశ్వాసమిచ్చి

దవ్వు దవ్వుల మనశాల దారివట్టి......

అంటూ (ప్ర.అం 1ప) చేసిన లేడివర్ణన కాళిదాసు గ్రీవాభంగాభిరామం శ్లోకాన్ని గుర్తుకు తెస్తుంది.

శ్రీ దాసు శ్రీరాములుగారి రచనా వైశిష్ట్యం:

ఏ కట్టడి యెంత పట్టు పట్టినను ఆ చిట్టిపొట్టి లేఁడిని పట్టితెచ్చి నీకట్టెదుటం బెట్టమా అనే సుందరి మాటల్లో ఒకే అక్షరాన్ని (ట్ట) ఆవృత్తం చేసి వృత్యనుప్రాసాలంకారాన్ని ప్రయోగించాడు. కలగంటి కలగంటి కలలో మోలుగంటి కడకు మేలుకొంటినే అంటుంది గౌరి. ఇందులో అక్షరావృత్తి (బిందుపూర్వక టకారం) వల్ల పద్యపాదంలో చక్కని తూగు కనిపిస్తుంది. యముడు ఇంద్రునితో తన దుఃస్థితిని గురించి చెప్పుకునే సందర్భంలో అభివ్యక్తిని  వెచ్చాలకొట్టు శనైశ్చరుడు నన్ను పూర్ణకటాక్షములతో చూచుచున్నాడు. అని అనడం చక్కని ధ్వన్యాత్మక అభివ్యక్తికి నిదర్శనం. ఇశ్, అబ్బా వంటి ధ్వన్యనుకరణ శబ్దాలనుకూడా అక్షరబద్ధం చేయడం అభినందనీయం. పద్యనిర్మాణంలో కూడా శ్రీరాములు గారి శైలి అమోఘం. ఒక చిన్న ఉదాహరణ. ఒక చిన్న ఉదాహరణ –

సిగనొక పూదండఁజేరి చుట్టెదమన్న మొగినంతరిక్షంబు ముట్టరాదు

          కరముల నొకదండఁగదియం జుట్టెదమన్న నురగ ఫూత్కారంబు లొరయ రాదు

          గళమున నొకదండ వెలయఁజుట్టెదమన్న హాలాహలద్యుతు లంటరాదు

          కటిసీమ నొక దండ ఘటియింతమా యన్న వ్యాఘ్రచర్మము చూడ్కిఁబట్టరాదు

          అలవి గానట్టి యీదేవునొలసి కొలువ అబలనైనట్టి నాదు సామర్థ్యమెంత

          చెంగటను దవ్వులనె నిల్చి చెండ్లనైన నెత్తి విసరుచు శివుని పూజింతు మమ్మ

ఈ పద్యంలో ప్రతిపాదం చివర ప్రయోగించిన వ్యతిరేకార్థక క్రియాపదాలు శ్రీరాములు గారి పద్యనిర్మాణ కౌశలాన్ని వ్యక్తం చేస్తాయి. మన్మథుడు బ్రహ్మచారి వేషంలో వచ్చి తన పరిచయాన్ని చెప్పుకునేటప్పుడు మా కాపురము వైకుంఠ పురము, మాయింటిపేరు పాలవెల్లి వారు, మా తండ్రి పేరు నారాయణశర్మ, మా తల్లి పేరు లక్ష్మమ్మ, నాపేరు కామన్న, మేము ఇద్దరం అన్నదమ్ములం. మా అన్న పేరు బ్రహ్మన్న అంటూ తన గురించి నిజాల్ని చెప్పడాన్ని ధ్వనిగర్భితంగా, ఔచితీపూర్వకంగా కనిపిస్తాయి.

ఈ నాటికలో నాయకుడు శివుడు. నాయిక పార్వతి. పార్వతి పాత్ర ఈ నాటికలో ముద్దరాలు. పతిని పొందడానికి తపస్సు చేసిన ధీరురాలు. కురంగాన్ని రక్షించిన దయామయురాలు. శివుని రూపాన్ని ఎంత వలచిందో శివతత్త్వాన్ని అంత గ్రహించిన వివేకవతి. ఈ నాటిక శివ పార్వతుల వివాహంతో ముగియడం ఒక విశేషం. పెళ్ళైతే కుమారస్వామి పుట్టడం, అతడు తారకాసురుని వధించడం జరుగుతాయని ప్రబంధధ్వని. శివపార్వతుల వివాహకథలో శాంతగుణ ముద్రితమైన ఆధ్యాత్మిక శృంగారం ఉండడం ప్రసిద్ధ కథా ప్రవృత్తి. దాసు వారు అటువంటి ఉదాత్త రసస్థితికి తక్కువదైన భక్తిభావ ముద్రితమైన శృంగారాన్ని ఇందులో పోషించారు. ఈ నాటికను దాసువారు రసికజన మనోరంజనంగా రచించారని చెప్పవచ్చును.

ఈ నాటికలో స్త్రీ విద్యావశ్యకత (పే.57), అధికవ్యయం లేని అక్షత వివాహాచారాలను ( పే. 54) చెప్పడం సమకాలీన సమాజానికి సంస్కరణ దృష్టితో ప్రబోధించడం. సాంబశివుని కథలో సాంఘిక విషయాలను నిపుణంగా అనుసంధించడం వీరి సామర్థ్యం. నాటికా రచన సరళ మధురం. నిర్మాణం సలక్షణం. పద్యాలు, పాటలు పాత్రోచితాలు. కథ పాతదైనా కల్పనల చేత కొత్తగా ఉంది. అభినవభాసుడని శ్రీదాసు వారిని ఈ నాటిక చదివిన వారందరు అనుకుంటారు.

భాషా విశేషాలు:

ఇక ఈ నాటికలోని భాషను కనుక గమనిస్తే, బుద్ధి క్మానుసారిణి కాలస్య కుటిలాగతిః వంటి అనుకరణ వాక్యాలూ ఆవగింజలో బద్ధయు లేక, కాలఁగ్రుచ్చుకొన్న కంటకంబును బోలె వంటి సామెతలూ ఉండడం తెలుగుదనానికి గుర్తు. మాండలిక పదాలను కూడా పాత్రోచితంగా ప్రయోగించడం దాసు వారి ప్రత్యేకత అని చెప్పాలి. కిరాతుని మాటలే ఇందుకు నిదర్శనం. అవి లాగి యేస్కుంటే, కిసుక్కున గూలబడ్తావు, సూస్తావుంటే, మాగాడుగా వుండాదిలే. దెహబ్బా, బోతావోశో, పొదకట్టు, దగ్గెర బడ్డాది, యాస్తుండా, యీకోల్తో, కుల్తావులే యాళ్లే, మాబెదిరిత్తుండారు, వోలబ్బా, ఆడోండ్లు  గదా, ఒక యేతేతు నానూడు, మీఅబ్బ సిగ దరగ, విసిత్తరమైపోయింది గందా, నోటికాడ కూడు సిద్ధాన్నం ఊళ్ళాకు పొయ్యారు, కళ్ళకు కనబడితే వంటివి. అలాగే ముక్కూ మన్ను గాకుండా యీడుస్తాన్ను సూడు వంటి జాతీయాలు కూడా ఉన్నాయి.

ఉపయుక్త గ్రంథాలు:

1. తెలుగు సాహిత్య చరిత్ర – జి. నాగయ్య

2. తెలుగు సాహిత్య చరిత్ర – ద్వా.నా.శాస్త్రి

3. తెలుగు సాహిత్యంలో చర్చనీయాంశాలు – ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యశాస్త్రి

4. కురంగ గౌరీ శంకర విలాసం – శ్రీ దాసు శ్రీరాములు.

5. శ్రీ దాసు శ్రీరాములు రచనలు - సమగ్ర పరిశీలన – వెలగపూడి వైదేహి పరిశోధన గ్రంథం