ఉపోద్ఘాతం:

వ్యాఖ్యానం ఒక విశిష్ట సాహితీ ప్రక్రియ. ఒక కళ. కవి తన కావ్యం ద్వారా చెప్పదలుచుకొన్న అంశాలను పాఠకులకు అందేలా తోడ్పడడం వ్యాఖ్యాత కర్తవ్యం. కావ్యంలోని అందచందాలను, చమత్కారాలను, వ్యంగ్య మర్యాదలను, మూర్తిమత్వాన్ని పాఠకులు గ్రహించి ఆనందించేలా చేయడం వ్యాఖ్యాత భుజస్కంధాల మీదున్న కార్యభారం.

“పదచ్ఛేదః పదార్థోక్తిః విగ్రహో వాక్యయోజనా
ఆక్షేపశ్చ సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణం.”

(పదాలవిరుపు, పదాలకు అర్థం, సమాసాలకు విగ్రహవాక్యాలు, తాత్పర్య,(భావ) నిర్ణయం, ఆక్షేపణలకు సమాధానాలు –ఈ ఐదు లక్షణాలు వ్యాఖ్యానాలకు ప్రధానమైనవి.)

సంప్రదాయ పద్ధతిలో అయితే ప్రతి పదార్థ తాత్పర్య వ్యాకరణ ఛందో 2 లంకార వ్యంగ్యార్థాలను, ప్రభావ పరిశీలనలను, పాఠాంతర చర్చలను, రాజనీతి సంగీత జ్యోతిష శాస్త్రాద్యంశాల ప్రస్తావన ఉంటే వాటి వివరణలను, వాటికి సమర్థనలను ప్రదర్శించే దాన్ని వ్యాఖ్యానం అని పిలుస్తున్నాం. ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాక పై అంశాలతో పాటు పాత్రచిత్రణలు, సామాజికాంశాల ప్రతిఫలనం, శిల్పం, కావ్యం మొత్తం ఇచ్చే సందేశం మొదలైన ఏదో ఒకటి రెండు అంశాలకు సీమితమై రాయడం ఎక్కువైంది. వీటిని విమర్శక వ్యాసా లంటున్నాం. అన్యభాషా గ్రంథాలు అర్థం కావని మూల భాషా పదాలకు సమానార్థక ఆంధ్ర పదాలు కూర్చి తెనుగు చేస్తున్నాం. వీటిని అనువాదా లంటున్నాం. వ్యాఖ్యానమైనా, విమర్శ అయినా, అనువాదమైనా చేసే పని ఒక్కటే- అర్థం కాకపోవడం, సందేహాలు రావడం, విపరీతార్థాలు తోచడం మొదలైన దోషాలు తొలగించి రచయిత హృదయాన్ని సమగ్రంగా అందించడమే. అందుకే నాప్రసంగంలో ప్రధానంగా వ్యాఖ్యాన గ్రంథాల్లోంచి, అవసరార్థం విమర్శ గ్రంథాల్లోంచి, అనువాద గ్రంథాల్లోంచి నిదర్శనాలు చూపడానికి యత్నిస్తాను.

రచయిత హృదయాన్ని, అంతర్యాన్ని ఆవిష్కరించడానికి ప్రధానంగా జరగాల్సిన పని అర్థనిర్ణయం. భావగ్రహణం. అర్థనిర్ణయానికి ప్రధాన ఆలంబనం పదమే . కానీ అది ఒక్కటి మాత్రమే సరిపోదు.

వాక్యాత్ప్రకరణాదర్థాదౌచిత్యాద్దేశకాలతః
శబ్దార్థాః ప్రవిభజ్యన్తే న రూపాదేవ కేవలాత్ (వాక్యపదీయం-1-314)

వాక్యంవల్ల, ప్రకరణంవల్ల, అర్థంవల్ల, ఔచిత్యం వల్ల, దేశకాలాల వల్ల, అర్థనిర్ణయం జరుగుతుంది. కానీ కేవలం అక్కడున్న “ పదం ’’(శబ్దం) వల్లనే అర్థనిర్ణయం జరుగదు.

ఈ అర్థ నిర్ణయం, భావగ్రహణంలోనే వ్యాఖ్యాతల, విమర్శకుల, అనువాదకుల శక్తియుక్తులు, ప్రతిభా సామర్య్థాలు, సరసత్వం బయటపడుతాయి. ఒక్కోసారి ఈ అర్థ నిర్ణయం లేదా భావగ్రహణంలో వీరు పప్పులో కాలు వేయవచ్చు. పొరపాట్లు చేయవచ్చు. ఈ పొరపాట్లు మూడు రకాలుగా జరిగే అవకాశం ఉంది.

1.ఉద్దేశపూర్వకం.
2. అవగాహనలోపం.
3. తొందరపాటు లేదా ఏమరు పాటు

1. ఉద్దేశ్యపూర్వకం:

1. సందర్భాన్ని దృష్టిలో పెట్టుకోకుండా విరుద్ధ వ్యాఖ్యలు చేయడం. 2. మంచిచెడ్డలు ముందే నిర్ణయించుకొని తదనుగుణంగా వక్రీకరించడం. 3. అనవసర పాండిత్య ప్రదర్శన చేయడం. 4. అనవసర ప్రస్తావనలు చేయడం. 5. అన్య మతాది అనిష్టాంశాల ప్రస్తావనలను విస్మరించడం, తగ్గించడం, మార్చడం, 6. అసూయ కొద్దో, కోపం కొద్దో, అహంకారం కొద్దో కొత్తది ప్రతిపాదించాలనో సత్యానికి విరుద్ధంగా వ్యవహరించడం లాంటివి ఉద్దేశ్యపూర్వకంగా జరిగే దోషాలు.

వ్యాఖ్యాతృ శిరోమణి వేదం వేంకటరాయ మనీషులు ఒక సభలో ప్రసంగిస్తు “వ్యాఖ్య సేయునపుడు ప్రకరణమును బట్టి అర్థము నిర్ణయింపవలెఁ గాని యేదేనొక తాత్పర్యము మన మనసున నిడుకొని తదనుగుణముగా నానార్థ నిఘంటువుల సాధనమున ఇచ్చ వచ్చిన శబ్దార్థము లాఁగుట పాడి గాదు” అని వ్యాఖ్యాతలకు సూత్రప్రాయమైన లక్షణ నిర్దేశం చేయడంలోని ఆంతర్యం ఇలాంటి దోషాలకు పాల్పడవద్దనే. వేదం వారు ఈ సందర్భంలోనే వక్రీకరించదలుచుకుంటే శుక్లాంబరధరం శ్లోకాన్ని గాడిదపరంగా వ్యాఖ్యానించవచ్చునని అలవోకగా అన్నారు. దాంతో ఒకతను వివరించమని పట్టుపట్టాడు.

శుక్లాంబరధరం = శుభ్రమైన బట్టలు అనగా చలువ గుడ్డలు మోయునది. విష్ణుం = సర్వత్ర వ్యాపించునది. ఒకచోట నిలువక తిరుగుచుండుట గాడిదకు స్వభావము. శశివర్ణం = చంద్రుని వన్నెగలది. గోదావరి ప్రాంతపు గాడిదలు తెల్లనివి గదా! చతుర్భుజం = నాలుగు భుజములు కలది. ప్రసన్న వదనం = సౌమ్యమగు ముఖము గలది. ఇది ఏవార్థకము వదనమేవ = వదనమే ప్రసన్నము. ఏలయన విఘ్నోపశాంతయే = సమస్త విఘ్నములు శమిల్లుకొరకు –గాడిద వల్ల విఘ్నోపశాంతి ఎట్లా అని మొదట అడిగిన వ్యక్తే మళ్లీ ఎదురు ప్రశ్నించాడు. ‘ఓ గాడిదా! ప్రసంగం మధ్యలో ఓండ్ర పెట్టి, మా పనులకు విఘ్నం కలిగించకు’ అని వేదం వారు చెప్పారట.

శ్రీ శ్రీ పొలాలను హలాలతో దున్నమన్నాడు. ఆధునిక వైజ్ఞానిక ప్రగతి ఈ కవి దృష్టిలో లేదు. ట్రాక్టర్లు లాంటి ఎన్నో ఆధునిక పరికరాలు వ్యాప్తిలో కొచ్చినా ఇంకా పాతపడ్డ ‘హలాల’ తోనే దున్నమన్నాడు. రైతు నింకా కష్టాలు పడమనే చెబుతున్నాడు. కనుక శ్రీ శ్రీ రైతు జనాభ్యుదయ వ్యతిరేకి. ‘ఇలాతలంలో’ పంటలు పండించాలట. ఈ కవికి సమతుల ఆహారం గురించి, పంటల గురించి, ఆంధ్రుల ఆహారం గురించి కనీస పరిజ్ఞానంలేదు. ఇలాతలం లోపల దుంపగడ్డలు పండుతాయి. కాని వరి, గోధుమ పండవు. అంటే కవి దుంపగడ్డలు తిని బతకమని ప్రబోధిస్తున్నాడు. ‘హేమం పిండగ’ – పంటలను బంగారంతో పోల్చడం సంప్రదాయ ఫ్యూడల్ సమాజంలోనున్న విషయం. అలాంటి ఉపమానాన్ని మార్క్సిస్టు మేధావి ఎలా తీసుకొంటాడు. ( ఇలా మాటల సందర్భంలో వ్యాఖ్యానించి నన్ను కంగారు పెట్టి సరదా పడిన సాహితీ మిత్రులు అద్భుతమైన పేరడీ కథకులు డా పి.ఎస్. గోపాలకృష్ణ గారిని తలుచుకోవడం ఉద్దేశ పూర్వకమే.)

ఇది వ్యాఖ్యానమే కదండీ! ఈ వ్యాఖ్యానంలో ఎంత ‘తర్కబద్ధత’ గోచరించినా ఆమోదయోగ్యమేనా? ఒక భావాన్ని ముందే నిశ్చయించుకొని దానికనుగుణంగా రకరకాల డొంక తిరుగుడు పద్ధతుల్లో ఆకాశానికెత్తడం లేదా అధః పాతాళానికి తొక్కడం లాంటివి వ్యాఖ్యానాల్లో, నేటి విమర్శల్లోను అప్పుడప్పుడు కనిపిస్తూనే వుంటాయి. వ్యాఖ్యానం పద్యం అర్థం చేసుకోలేని వాళ్ళకోసం. వ్యాఖ్యానం ఒక రకంగా చెప్పాలంటే తెలుగు నుండి తెలుగులోకి అనువదించడం. ఈ సంగతి విస్మరించి వ్యాఖ్యాత స్వీయ పాండిత్య ప్రదర్శన చేసి ఇక్కట్ల పాలు చేస్తాడు, సురభి మాధవరాయల చంద్రికా పరిణయంలో పార్వతిని స్తుతించే దండకం ఉంది. (5 – 31). ఈ దండకం సంస్కృతంలో సాగిందని కాబోలు వ్యాఖ్యాతలు కూడా సంస్కృతంలోనే తమ వివరణను కొనసాగించడం గమనార్హం. వ్యాఖ్యాతల ప్రజ్ఞా పాటవాలను వేనోళ్ళ పొగడడానికి సంస్కృత వ్యాఖ్యాన రచన దోహదం చేయవచ్చు. మరి తెలుగు పద్యమే అర్థం కాక అర్థ తాత్పర్యాల కోసం వ్యాఖ్యానాన్ని పాణిగ్రహణం చేసిన పాఠకవరునికి ఆర్తి తీరేదెలా ? శృంగార నైషధానికి ‘సర్వంకష’ ను సంతరించిన వేదం వారు దమయంతి తండ్రి భీమరాజు సరస్వతిని ప్రార్థించిన సంస్కృత దండకానికి చక్కని తెలుగులో వ్యాఖ్యానం రాసి ఆదర్శమనిపించు కొన్న సంగతి ఇట స్మరణీయమే.

కొందరు అవసరం లేకున్నా ఏదేదో కొండవీటి చాంతాడంతా విషయం రాసేసి పాఠకుని గందరగోళం పాలుచేస్తారు. ఈ వ్యాఖ్యానాలు చదివితే వ్యాఖ్యాతకు ఏమేం తెలుసో మనకు తెలుస్తుంది. తప్ప పద్యంలో ప్రతిపాదితమైనందేమిటో మాత్రం స్పష్టపడక పోవచ్చు. సి.పి.బ్రౌన్ గారు ఈ విషయాన్ని గుర్తించి ఇలా వ్యాఖ్యానించారు. (They were written more to glorify the acumen of the critic and less to aid the learner.) ఆనాటి వరకున్న వ్యాఖ్యానములలో చాలా వరకు వ్యాఖ్యాతలు తమ పాండిత్య ప్రకర్షకై వ్రాసినవే కాని విద్యార్థికి ఉపయోగించునవి కావు. మల్లనార్యుడు రాసిన ‘రామస్తవ రాజం’ లో ఒక పద్యానికి ఎంతకూ అర్థం కుదరకపోతే బ్రౌన్ దొర దాన్ని విడిచి పెట్టమని వ్యాఖ్యాతకు సలహా ఇచ్చాడు. కొంత కాలానికి ఆ వ్యాఖ్యాత ఎంతో శ్రమతో ఒక వింత అర్థం చెపితే బ్రౌన్ దానికీ గ్రంథస్థ విషయానికి సంబంధం లేదని గుర్తించి ప్రశ్నించాడు. అప్పుడు ఆ వ్యాఖ్యాత నవ్వి ఆ సంబంధం లేని సంగతి పాఠకులు గ్రహించాలనే దీన్ని రాశానన్నాడు. ( I read it and observed that it was ingenious, but readers would complain that it had nothing to do with the text. He laughed and said, I shall leave them to find out. ) (కొత్తపల్లి వీరభద్రరావు సి.పి బ్రౌన్, పుట. 134)

మమ్మటుడు కావ్య ప్రకాశంలో వ్యాఖ్యాతలు చేసే అనవసర ప్రస్తావనల మీద ఒక చురక వేశాడు.

తావదుద్ఘాట్యతే తత్ర యావద్యత్రోపయుజ్యతే
నహి రత్నపరీక్షాయాం పాణౌ సాముద్రలక్షణం

ప్రసంగానుప్రసంగేన కుత్ర సంగచ్ఛ తేన కిమ్
మృత్తికాపి కులాలస్య బ్రహ్మవిద్యాం విగాహ్యతే

( ఎక్కడ ఎంత అవసరమో అక్కడ అంతే వివరణం చేస్తాను. రత్న పరీక్షను గూర్చి మాటలాడేటప్పుడు ఆ రత్నం పట్టుకున్న చేతిలోని సాముద్రిక లక్షణాలు వర్ణించడం ప్రారంభింపకూడదు. కదా, ప్రసంగానుప్రసంగం చేత ఏ విషయాన్నైనా ఎక్కడనైనా చొప్పించవచ్చు. ‘కుమ్మరి’ ‘మట్టి’ వంటి విషయాలను గూర్చిన ప్రసంగంలో మట్టి అనగానే పంచమహాభూతాలు, వాటిని సృష్టించిన బ్రహ్మ మొదలగు విషయాలను తీసుకొని వచ్చి బ్రహ్మ విద్యలోకి వెళ్ళి పోవచ్చును గదా!.)

అందుకే మల్లినాథ సూరి “ఇహాన్వయ ముఖేనైవ సర్వం వ్యాఖ్యాయతే మయా నా మూలం లిఖ్యతే కించి న్నాన పేక్షిత ముచ్యతే’’ (అంతా అన్వయముఖంగానే వ్యాఖ్యానిస్తాను. మూలంలో లేనిది అవసరం లేనిది వ్రాయను.) అని చెప్పిన మాటలు సర్వజన సమాదరణీయాలయ్యాయి. ఆ మల్లినాథ సూరికన్నా ముందే కథాసరిత్సాగరకారుడు “యథామూలం తథైవేదం నమనాగప్యతి క్రమః’’ (మూలం ఎట్లా ఉంటే అట్లాగే ఉంటుంది. కొంచెం కూడ అతిక్రమించదు) అని తన అనువాద విధానాన్ని చెప్పాడు. ఈ మాటలు సర్వవ్యాఖ్యాతలకు శిరోధార్యాలని ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు.

భోజ మహారాజు వ్యాఖ్యాతల మనస్తత్వాన్ని అధిక్షేపిస్తూ చెప్పిన ఒక శ్లోకాన్ని ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు ఉద్ధరించి చూపారు.

దుర్బోధం యదతీవ తద్ధి జహతి “స్పష్టార్థ” మిత్యుక్తిభిః
స్పప్టార్థేష్యతి విస్తృతిం విదధతి వ్యర్థైః సమాసాదికైః

అస్థానే2ను పయోగిశ్చ బహుభిర్జల్పైః భ్రమంతన్వతే
శ్రోతృణామితి వస్తు విప్తవ కృతః సర్వే2పి టీకాకృతః

టీకాకారులందరూ అర్థం కాని విషయం ఎక్కడైనా ఉంటే దాని “స్పష్టో2ర్థః” అని వదిలేస్తారు. అర్థం స్పష్టంగానే ఉన్నచోట వ్యర్థమైన సమాసాదులు వాడుతూ చాల విస్తృతంగా రాస్తారు. అవసరం లేకుండానే ఏవేవో వాదాలు ప్రవేశపెట్టి భ్రమ కలిగిస్తారు. ఈ విధంగానే వినేవారికి (చదివే వారికి) అసలు విషయం ఏమిటో అర్థం కాకుండా చేస్తూ ఉంటారు. తనకు అర్థం కాని పదాన్ని వ్యాఖ్యాత వదిలేయక ఏం చేస్తాడు? పాపం! మనం పాఠం చెప్పేటప్పుడు ఏ పదానికైనా సందేహం వచ్చి గైడ్ తీసి చూస్తే సరిగ్గా ఆ పదం ఎడలనే గైడ్ రచయితకు కూడా సందేహం వస్తుంది. అది ఉండదు. ఇది మన అనుభవంలో ఉన్నదే కదా.

మత దురభిమానం కూడా విషయానికి హాని చేసే అంశాల్లో ఒకటి. మన కన్నా ముందు తరాల పండితుల్లో శైవ వైష్ణవ పట్టింపులు చాల ఉండేవి. పరస్పరం తిరస్కరించడం, స్మరించక పోవడం, వక్రీకరించడం ఇలా మతదురభిమానం వల్ల జరిగిన దృష్టాంతాలు అక్కడక్కడా లేకపోలేదు.

నేలటూరి పార్థసారథయ్యంగార్ ఛాందస వైష్ణవుడు. ఆ మహానుభావుడు. నెల్లూరు వెంకటగిరి రాజా ఉన్నత పాఠశాలలో అధ్యాపకుడు. విరాటోద్యోగపర్వాలకు ఆమ్నాయ కళానిధి. పేరుతో వ్యాఖ్యానం రాసి ప్రచురించారు. ఈ స్వాముల వారు శ్రీయన గౌరి నాబరగు... పద్యంలో గౌరి శబ్దానికి అర్థం రాయకుండా వదిలివేశారు. ఆముద్రిత గ్రంథ చింతామణి పత్రికలో శ్రీ పూండ్ల రామకృష్ణయ్య గారు ఈ విషయాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆమ్నాయ కళానిధికి ఆదిలోనే హంసపాదు శీర్షికతో ఒక సమీక్ష రాశారు. ఆ శీర్షిక పండితలోకంలో ప్రసిద్ధి చెందింది.

ఉత్పల సత్యనారాయణాచార్యులు శ్రీకృష్ణశతకానికి ప్రశస్తమైన వ్యాఖ్యానం రాశారు. అందులో శ్రీరుక్మిణీశ! కేశవ! అన్న మొదటిపద్యంలోని మొదటి పదాన్ని వ్యాఖ్యానించినతీరు ఎంత డొంకతిరుగుడుగా, ఎంత వైష్ణవమాయగా ఉంటుందో గమనించండి. ఇంకో ఉదాహరణ చూడండి.

స్కందశ్చ భగవాం దేవ సోమశ్చ బృహస్పతిః
సప్తర్షయో నారదశ్చ తే త్వాం రక్షంతు సర్వతః

(భగవంతుడైన స్కందుడు, చంద్రుడు, బృహస్పతి, సప్తర్షులు నారదుడు నిన్ను అన్ని దిక్కుల నుండి రక్షింతురు గాక.)

అని కౌసల్య శ్రీరాముని అరణ్య వాసానికి పోయే ముందు దీవిస్తుంది. వాల్మీకి రామాయణాన్ని వ్యాఖ్యాన, అనువాద రూపంలో ‘మందరం’గా సంతరించిన వావిలికొలను సుబ్బారావుగారు స్కంద శబ్దాన్ని పరిహరించారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగు వచనంలోకి అనువదించి అశేష జనావళి చేత చదివింప చేసిన శ్రీనివాస శిరోమణి వచన రామాయణంలో సైతం స్కందశబ్దం మృగ్యం కావడానికి మతదురభిమానమే కారణమేమో!

‘బోద్ధారో మత్సర గ్రస్తాః’ అని గదా భర్తృహరి వచనం. మాత్సర్యానికి లోనై తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసే వ్యాఖ్యానాలవల్ల కవి భావం తేటపడదు. ఈ వ్యాఖ్యానాన్ని చదువుకొన్న పాఠకుడు తాను గందరగోళం పాలై మరి కొందరిని గందరగోళం పాలుచేస్తాడు.

విద్వద్వరేణ్యులు వేదాల తిరువేంగళాచార్యులు అరణ్య పర్వశేషం నన్నయ కృతమే తప్ప ఎర్రన కృతం కాదని వాదించారు. ఆ వ్యాసంలో దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి వ్యాసాన్ని ఖండించడం జుగుప్సావహంగా, స్థాయికి తగని విధంగా ఉంటుంది.

ఏను గచుండనువాడ మ
హానియమసమన్వితుఁడ బృహస్పతి సుతుడన్
మానుగ వచ్చితి నీకును
భానునిభా! శిష్య వృత్తిఁ బనిసేయంగన్ (ఆది, 3 – 108)

భానునిభా– అనగా ప్రాతఃకాల పూజ్య పాదుడా! నాకిక్కడ చేయుటకు పని శిష్య వృత్తి. నేనిక్కడ కర్తవ్యము శిష్య వృత్తిగా నేర్పరచుకొని వచ్చితిని –అని కచుడన్నాడట. అంతేకాని శిష్యవృత్తితో పని చేయుటకు వచ్చినాను అనే అర్థం రాదు. ప్రథమాంతార్థం ప్రధానం కదా! అందువల్ల శిష్యవృత్తి ‘పని’ అనియే తేలుతుంది. ‘భానునిభా’– ప్రాతః కాల పూజ్య పాదుడనే అర్థాన్ని అజహల్లక్షణ అర్థాంతర సంక్రమితవాచ్యధ్వనియై వ్యంగ్యం చేస్తుంది’ అని వేదాల వారి వ్యాఖ్యానం. ఇంతటితో ఊరుకోక శిష్యవృత్తిన్ పని సేయంగన్ అని తృతీయా విభక్తిగతమై ఉన్న పాఠాన్ని ‘శిష్యవృత్తి పనిచేయంగన్’ అని ప్రథమా విభక్తిలోకి మార్చి వేశారు. అంటే స్వీయవాదం కోసం పాఠాంతరకూట సృష్టి చేశారన్న మాట. ‘ఈ వ్రాత ఒప్పదగినదేనా?’ కవి రచనను మార్చుట, వికృతార్థం చెప్పుట తప్పు గాదా! తప్పదారినిబడ్డవారికి తోచే భావాలు తప్పులు కాక ఒప్పులగునా?’ అని దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు దండెత్తడం సమర్థనీయం కాదా! ‘భాను నిభా’ అంటే సూర్యసముడా అని మామూలు అర్థం. దీనికి ప్రాతఃకాలపూజ్యపాదుడు అని అర్థం చెప్పడం ఎంత విచిత్రం. ఇది ఆయనకు తెలిసి చేసిన పని కాదంటారా? పైగా ‘భాను నిభా’ సంబోధన, ధ్వని, వ్యంగ్యం, అజహల్లక్షణ, అర్థాంతర సంక్రమిత వాచ్య ధ్వని అని పారిభాషిక పదాలను దట్టించి ఆంధ్ర ధ్వన్యాలోకకారుడు మనలను బెదరగొట్టాలని చూడడం గులకరాళ్ళ డబ్బా మోగించి సంగీతం అని దబాయించడమే కాదూ!

కచ దేవయాని ఘట్టంలో ‘నన్నేలిన దేవయానికి నరేశ్వర! భర్తవు గాన నాకునుం బోలఁగ భర్త వీవ’ (ఆది, 3 – 174) నాకు యజమానియైన దేవయానికి భర్తవు నీవు కనుక నాకు కూడ భర్తవే అని పద్యభావం సులభంగా బోధపడుతుంది. ఇందులో ‘నరేశ్వర!’ అనేది సంబోధన అని కూడ తెలుస్తుంది. దీనికి తిరువేంగళాచార్యుల విపరీత వ్యాఖ్యానం చూడండి ఇక్కడ ‘నరేశ్వర’ అనేది సంబోధన అనుకోవడం పద్యం సరిగా అర్థం కాకనే ‘నరేశ్వర భర్త’ అనేది ఏకపదం. అది రాజువైన మగడవు (భరించువాడవు) అని దాని యర్థం. ఈ పద్యంలో ఇంకను చాల మంచి సారస వుంది. కాని భాషామాత్ర సేవకులకు తెలియరాదు.

యయాతి దేవయానికి ‘రాజైనమగడట’ అంటే రాజు గాని మగడు మరియొకడున్నాడన్న మాటే గదా. ఉన్నాడా?! ఏమో ఆచార్యుల వారే చెప్పవలె. ఇటువంటివేనా సారస్యాలు. సంస్కృత మూలంలో ‘రాజన్’అని సంబోధన గానే ఉంది. నన్నయ గారు ‘నరేశ్వర’ అని సంబోధన గానే రాశారు. ఆదిపర్వానికి వ్యాఖ్యానం రాసిన చదలువాడ సుందర రామశాస్త్రిగారు ‘నరేశ్వర’ను సంబోధనగానే చెప్పారు (ఈ వ్యాఖ్యానాన్ని ఎవరైన సంపాదించి పునర్ముద్రిస్తే లోకానికి పనికివచ్చే పని చేసిన వారవుతారు). అందరికీ సంబోధనగానే కనిపించిన ‘నరేశ్వర’ శబ్దం శ్రీమాన్ తిరువేంగళాచార్యులకళ్ళకు మాత్రం ఇంకో తీరుగా గోచరించడం వికటించిన పాండిత్య ధోరణులకు నిదర్శనమే కదా!

పైగా ఈ వాదాన్ని ఖండిస్తూ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు వ్యాసం వ్రాస్తే ఈ చర్చ వ్యక్తిగతం కాకుండా భారతానికి సంబంధించినదీ, సర్వాంధ్రజనోపయుక్తమైనదీ అన్న సంగతి విస్మరించి ఆచార్యుల వారెలా విరుచుకుపడ్డారో చూడండి.

‘శాస్త్రవేత్తలకు మాత్రమే ప్రవేశింపవీలైన ఈ తెనుగు మహాభారతం వంటి విషయంలోకి భాషా సేవకులు రాబోవడం అనధికారకృత్యం అని ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నాం... నా వంటి వాడి మీదకు ఇట్లా కాలు దువ్వడం మహా ప్రమాదం అని కనువిప్పు కలిగిస్తున్నాం. ఉదాహరణాలు అనుచితాలని సిద్ధాంతపరిచాం. నా వాదం కానీ నా సిద్ధాంతం కానీ నా ‘అంతరంగ సాక్ష్యం’ కానీ వారి బోంట్లకెవరికి గూడా తేరి చూడడానికి శక్యమైంది కాదనీ స్పష్టంగా చెప్తున్నాం. గుండెల్లో ధైర్యం వుంటే మీ వూళ్లో సభ చేయించి నాకు కబురు చేయండి. నేను వస్తాను. లేదా వస్తానంటే నేను సభ యేర్పాటు చేస్తాను. రండి, ధైర్యం వుంటే.. ఇకనెప్పుడు ఇట్టి అపప్రసంగం చేయకండి’.

ఇటువంటి దురహంకారపూరిత లేఖనముల వలన కలిగేది అపకీర్తి మాత్రమే. సాహిత్య స్థాయిని, వ్యక్తిత్వ స్థాయిని పెంచే చర్చలే ప్రయోజనకరాలని వేరుగా చెప్పవలసిన పనిలేదు.

2. అవగాహన లోపం:

ఎంత మహానుభావుడైన, ఎంత పండితుడైన, ఎంత వ్యుత్పన్నశీలుడైన ఒక్కోసారి అర్థ నిర్ణయంలో విఫలుడు కావచ్చు. తాళపత్ర గ్రంథాల్లోంచి ఎత్తి రాసుకోవడంలో పొరపాటు దొర్లి తదనుగుణంగా అర్థ నిర్ణయానికి పూనుకోవచ్చు. అన్వయించ వలసిన దానితో కాక, ఇంకో దానితో అన్వయించడం వల్లనో, భావాన్ని అవగాహన చేసుకోవడంలోనే పొరపడడమో, సంప్రదాయం తెలియక పోవడంవల్లోనో వ్యాఖ్యానాల్లో దోషాలు దొర్లే అవకాశముంటుంది. ఇవి క్రమేపి తెలిసివస్తాయి. మలిముద్రణల్లో సరిచేసుకోవచ్చు.

మూల గ్రంథాన్ని పరంపరగా ఎత్తి రాసుకోవడంలో ఎన్నో అపపాఠాలు, అన్య పాఠాలు చేరడం ఒక వైపు జరిగే అవకాశముంటుంది. వ్యాఖ్యాత అనవగాహన వల్ల పరిపూర్ణ నమ్మకంతో మూల పాఠాన్ని దిద్దేసేఅవకాశముంటుంది. తాపీ ధర్మారావుగారు శృంగార నైషధంలోని ఒక పాఠాంతరాన్ని గూర్చి సముచిత చర్చ చేశారు. శృంగార నైషధంలో నలుడు దమయంతి దగ్గరకు వెళ్లి ఇంద్రాగ్ని యమ వరుణులలో ఎవరినైనా వరించమంటాడు.

అమరపతిన్ వరించెదవొ, హవ్యవహున్ చరణంబు త్రొక్కెదో
శమనుని చెట్టపట్టెదవొ, సాగరవల్లభుఁ బెండ్లియాడెదో–

పాణిగ్రహణానికి శ్రీనాథుడు నలుగురికి నాలుగు రకాల పర్యాయపదాలు ఉపయోగించి రాసినట్లు కూచిమంచి తిమ్మకవిలక్షణసార సంగ్రహంలో ఈ పద్యాన్ని ఉదాహరించడం మూలాన నిర్ధారించుకోవచ్చు. కాని వేదం వారి నైషధ సర్వంకష వ్యాఖ్యానంలో, మరికొన్ని ప్రతుల్లో

అమరపతిన్ వరించెదవొ, హవ్యవహున్ వరణం బొనర్చెదో
శమనుని చెట్టపట్టెదవొ, సాగరవల్లభుఁ బెండ్లియాడెదో

అనే పాఠం మనకు కనిపిస్తుంది. అంటే పెండ్లి యాడడానికి నాలుగో పలుకుబడి దొరకక శ్రీనాథుడు ‘వరించు’ అనే క్రియారూపం ఒక చోటా, వరణము అని దాని కృదంత రూపం రెండో చోట వాడుక చేశాడన్న భావం కనబరిచారన్న తాపీ ధర్మారావుగారి అభిప్రాయం (విజయ విలాసం, పుట.480) సబబే కదా!

వాల్మీకి రామాయణంలో ఋష్యశృంగుడు తనను ఆకర్షించి తీసుకునిపోవడానికి వచ్చిన స్త్రీలను ‘శుభదర్శనాః’అని సంబోధిస్తాడు (బాల 10 – 15). ఇందులో వాల్మీకి వ్యాకరణాన్ని అలంబనగా చేసుకొని ఒక చమత్కారాన్ని నిక్షేపించాడు. ఋష్యశృంగునికి స్త్రీపురుష భేదం తెలియక ‘శుభ దర్శనాః’ అన్నాడు. స్త్రీలనైన పురుషులనైన ప్రథమా విభక్తి బహువచనంలో శుభదర్శనాః అనే అంటారు సంస్కృతంలో, మరి తెలుగువారు ఈ భావాన్ని ఎలా తెలుగులోకి తెచ్చుకోవాలి? శ్రీనివాస శిరోమణి ‘చుక్కలారా!’ అని సంబోధించాడు. దీనితో వచ్చిన వారు స్త్రీలని ఋష్యశృంగుడు గుర్తించినట్లయింది. పుల్లెల శ్రీరామచంద్రుడు ‘శుభదర్శనులారా!’ అని పురుషపరంగా అర్థం చెప్పారు. ఇది ఋష్యశృంగుని పట్ల సముచితమే. ఇలాంటి చిక్కులను వ్యాఖ్యానాలు రాయాలని సాహసించేవారు, రాయించాలని ఆశించేవారు దృష్టిలో పెట్టుకోవాలి.

నా పర్యవేక్షణలో ‘శ్రీనివాస శిరోమణి రామాయణం – అనువాద విధానం’ అనే అంశం మీద ఎం.ఫిల్. కై పరిశోధించిన శ్రీమతి లక్ష్మీసుందరి ఇలాంటి విషయాలను కొన్నింటిని గుర్తించారు. శిరోమణి రెండు శ్లోకాలను అనుచితంగా కలగలిపిన వైనాన్ని ఆమె బయటపెట్టారు. సుందరకాండలో సీతమ్మజాడ దొరకలేదని ఆంజనేయస్వామి బాధపడుతూ సుగ్రీవునకు మొగమెలా చూపెట్టాలని వాపోతున్న సన్నివేశమది. ‘ఇకను నాకు ఇక్కడ ఆ జనకాత్మజ కనబడక పోయేటట్లయితే నేను వానప్రస్థుణ్ణి అయి ఏ చెట్టు కిందనైన కూర్చుని చేతికి అందింది తింటూ కాలక్షేపం చేయడమే కర్తవ్యము. లేదా కందమూల ఫలాలు బహుళముగా దొరికే సముద్ర ప్రాంత ప్రదేశములో చితి పేర్చుకొని అగ్నిహోత్రుడికి ఆహుతి అయిపోవలెను’ (సుందరకాండ, పుట.59) అని శ్రీనివాస శిరోమణి రామాయణంలో ఒక వాక్యం కనిపిస్తుంది. చితి పేర్చుకొని చచ్చిపోదలుచుకున్న వానికి కందమూలాలు బహుళముగా దొరికే ప్రదేశమే కావాలా? అని ప్రశ్న తలెత్తడం సహజం. వెనుకటికెవడో రాత్రి పూట రైలు కిందపడి చనిపోదామని వెళ్తూ టార్చితీసుకొని వెళ్లాడట. టార్చి ఎందుకంటే తోవలో పురుగుపుట్ర కరిస్తే ఎట్లా అని ఎదురు ప్రశ్నించాట్ట అలా ఉంది. ఇంతకూ సంస్కృతంలో ఏముందో చూడండి.

హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలకః
వానప్రస్థో భవిష్యామి హ్యదృష్ట్వా జనకాత్మజమ్
సాగరానూపజే దేశే బహుమూల ఫలోదకే
చితిం కృత్వాం ప్రవేక్ష్యామి సమిద్ధమరణీసుతమ్ (సుందర 13 – 38, 39)

మొదటి మూడు పంక్తులు ఒక భాగం, చివరిపంక్తి ఒక భాగం జనకాత్మజ కనిపించకపోతే కందమూల ఫలాలు బహుళంగా దొరికే సముద్ర ప్రాంతంలో ఏ చెట్టు కిందనయినా కూర్చుని చేతికి అందింది, నోటికి అందింది తింటూ వానప్రస్థుణ్ణి అవుతాను. లేకపోతే చితిని పేర్చుకొని చచ్చిపోతాను. ఇది శ్లోకభావం. చివరి పాదంలోని అంశాన్ని మీది పాదాలతో ముడిపెట్టడంతో ఈ అనర్థం జరిగింది.

ద్రోవది బంధురంబయిన క్రొమ్ముడి గ్రమ్మన నీడ్చి వెండ్రుకల్
దావలచేత బూని ........ (ఉద్యోగ పర్వం పుట 3 -114)

దావ(ప)ల చేయి అంటే ఎడమచేయి అని స్పష్టంగా సూర్యారాయాంధ్ర నిఘంటుకారుడు ఈ పద్యాన్నే ఉదాహరించి అర్థం చెప్పినా, సంస్కృత మూలంలో ఎడమ చేయి అని ఉన్నా, తిక్కన సరిగ్గా రాసినా తిరుపతిదేవస్థానం భారత వ్యాఖ్యాతలు మాత్రం తిక్కన కుడి చేయి అని మార్చారెందుకో అని వ్యాఖ్యానించారు.

కురుక్షేత్ర మహాయుద్ధంలో ఎందరో వీరులు హతమయ్యారు. మరి వారిలో కొందరి పేర్లయినా పునరుక్తమయ్యే అవకాశముంటుందిగదా. నామసామ్యంతో వ్యాఖ్యాతలు పప్పులో కాలువేయవచ్చు.

ద్రోణపర్వంలో శల్యుడు అన్న వీరుని ఉపపాండవులు అందరూ కలిసి సంహరించారు. వ్యాఖ్యాతలు శల్యుడు అని రాసి బ్రాకెట్లుపెట్టి నకుల సహదేవుల మేనమామ అని రాసి కూర్చున్నారు. (ద్రోణ3-257) తి.తి.దే మహాభారతం , ద్రోణపర్వం. పుట 403.

ఈ శల్యుడు వేరే వ్యక్తి అవుతాడే తప్ప నకుల సహదేవుల మేనమామ ఎట్టి పరిస్థితుల్లోను కాడు. ఎందుకంటే ద్రోణ కర్ణులు హతమయ్యాక కౌరవ సేనానిగా శల్యుడు యుద్ధం చేసి చనిపోతాడు. అది శల్యపర్వం కథ. శల్య పర్వంలో చని పోవాల్సిన వ్యక్తిని ద్రోణ పర్వంలోనే వ్యాఖ్యాతలు చంపేస్తే పాఠకుని గతేం కావాలి?.

సంస్కృతంలో ఒక అర్థంలో వాడబడే పదం తెలుగులో దానికి పూర్తి భిన్నమైన రూఢ్యర్థంలో వ్యాప్తిలో ఉండవచ్చు. అటువంటప్పుడు వ్యాఖ్యాతలు అలవాటుగా సంస్కృతంలోని అర్థమే ఇచ్చే అవకాశముంటుంది.

శ్రీనివాస శిరోమణి రామాయణంలో దశరథుడు పుత్రకామేష్టి చేస్తుంటే హోమగుండంలోంచి ‘కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతులతో ఒక భూతము బయలుదేరిం’దట (బాలకాండ, పుట. 34, 35). ‘ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలమ్’ (బాల 16 – 11) అన్న మూల శ్లోకంలోని మహద్భూతం అన్న శబ్దానికి ప్రాజాపత్య పురుషుడు అని వ్రాసి ఉంటే ఎంతో సముచితంగా ఉండేది. తెలుగువారికి భూతం అంటే దయ్యం పిశాచమే కదా! అందుకే ‘సాగరసంగమం’ సినిమాలో పంచభూతాలు అంటే దయ్యాలు భూతాలు అనుకొని నాయిక నాట్యం చేసింది. ‘ఏకోవిష్ణుఃమహద్భూతం’అని విష్ణు సహస్రనామ ఉత్తర పీఠికలో వస్తుంది. ‘విష్ణువొక్కడే పెద్ద దయ్యం’ అంటే ఎట్లారా భగవంతుడా?

3. తొందరపాటు:

వ్యాఖ్యాతల తొందరపాట్ల వల్ల, అనవధానత వల్ల పొరపాట్లుదొర్లే అవకాశముంటుంది. అవి మూడు తీరులనుకొందాం.

1. అభిధార్థాన్ని గ్రహించి లక్షణార్ధాన్నో, సన్నివేశం అందిస్తున్న భావాన్నో గుర్తించకపోవడం.
2. కరెక్టుగా రాస్తున్నా మనుకొని తప్పు రాయడం.
3. పూర్వ వ్యాఖ్యాతల పట్ల విపరీతమైన నమ్మకంతోనో, ఓపిక నశించడంతోనో, పరిశీలించి చూసుకోవడం అనవసరం అని అనుకోవడంతోనో యథాతథంగా దిగుమతి చేసుకోవడం.

ఈ దోషాలన్నీ ముద్రణకు ముందు ఒకసారి వారే చదువుకొన్నా లేక పక్కవాడితో చదివించినా తెలిసిపోతాయి. తమకు తాము చూసుకోవడం కన్నా పక్కవాడు చదవడమే ఎక్కువ ప్రయోజనకరం.

‘అనఘామూల్య మణి ప్రరోహముల...’ అని వసుచరిత్ర (3 – 34) లో ఉన్న పద్యం ప్రసిద్ధమైందే. నిర్దోషమైన– విలువ కట్టడానికే వీలు లేని మణులు అని భావం. ఇక్కడ ‘అమూల్య’ శబ్దానికి ‘విలువ కట్టలేని’అని చెప్పాల్సిన చోట ‘విలువ లేని’ అని వ్యాఖ్యాతలు అభిదార్థం రాయడం మూలాన కవి హృదయం దెబ్బ తిన్నది. ‘విలువలేని’కి, ‘విలువ కట్టలేని’ కి భావంలో హస్తిమశకాంతరం భేదం ఉంటుందని ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. సోమనాథ కవి ‘విద్వజ్జన రంజని’ వ్యాఖ్య తీసి చూడండి. ఆ వ్యాఖ్యలో లేని అనేక నూతనాంశాలు అదనంగా చేర్చి పరిష్కరించి 1926లో ప్రచురించిన శొంఠి భద్రాద్రి రామశాస్త్రులు, శతావధానులు శేషాద్రి రమణ కవుల వసుచరిత్ర వ్యాఖ్యలో ‘విలువలేని’ అనే ఉంటుంది. ఇదే గ్రంథం చతుర్థ ముద్రణకు 1965లో నిడుదవోల వెంకటరావు పీఠిక రాస్తూ ఈ విషయాన్ని గమనించలేదు.

‘నిర్మలామూల్యగుణరత్న నిధి’ అని గిరికను ప్రస్తుతించే మరో పద్యంలోను (6–84) శేషాద్రి రమణ కవులు ఇలాగే రాశారు. నిర్మల = దోషరహితమైన, అమూల్య =విలువలేని, గుణ =కాంత్యాది గుణములతో గూడిన, రత్న =పద్మరాగమణులకు, నిధికిన్ నీకున్= స్థానభూతురాలవైన నీకు అని విలువలేని అభిదార్థంలో రాయడమే కాకుండా నిర్మలమైన అమూల్యమైన గుణములు అనెడి రత్ననిధి గిరిక అని రూపకంగా అర్థం రాసి సుగుణాల రాశి అని భావం చెప్పుకోవలసిన సందర్భంలో తృతీయ విభక్తిలో అర్థం చెప్పారు. ఇది పొసగదు. తంజనగరం తేవప్పెరుమాళ్లయ్యగారు 1920లో ఆనందముద్రణాలయం తరపున ‘అనేక పూర్వ వ్యాఖ్యానములు క్రోడీకరించి వ్రాయబడిన వ్యాఖ్యానము’లో సైతం ఈ రెండు చోట్ల ఇదే తీరుగా ‘విలువలేని’, ‘వెలలేని’ అని అర్థాలు వుండడం గమనిస్తే పూర్వ వ్యాఖ్యాతల మీద విపరీతమైన విశ్వాసంతో సరిచూసుకోకుండా ఎత్తి రాశారనేది స్పష్టం.

ఒక్కోసారి కరెక్ట్ గా రాస్తున్నామనుకొని తప్పుగా రాయడం సంభవిస్తుంది. ఇది మన అనుభవంలో ఉండే విషయమే. అందుకు ఒక నిదర్శనం పేర్కొంటాను. సురభి మాధవరాయలు ‘చంద్రికా పరిణయం’ లోని ఒక పద్య పాదం గమనించండి.

......... నిశ్చలత మేనులఁ గన్నుల సమ్మదాశ్రువు
ల్మచ్చిక లాత్మ నౌదలఁ జలాచల భావము నివ్వటిల్లగన్ (5–36)

వెల్లాల సదాశివ శాస్త్రిగారు ఈ కావ్యానికి ‘శరదాగమ’ వ్యాఖ్య పేరుతో రాసిన వ్యాఖ్యానాన్ని 1904లో ప్రచురించారు. అందులో ఈ పద్యానికి అర్థతాత్పర్యాలు పేర్కొంటూ ‘నిశ్చలత’ పదానికి ‘చాంచల్యం’ అని అర్థం రాసి కూర్చొన్నారు. అట్లాగే ‘చలాచలభావము’నకు చంచలత్వ మొక్కటే అర్థం చెప్పారు. మరి అచలభావంఎక్కిడికి పోయింది? (పుట. 477).

వ్యాఖ్యానిస్తున్నప్పుడు పద్యంలోని పదాలు యథాతథంగా ఉండి తీరాల్సిందే తప్ప పద్యంలో ఒక తీరు, వ్యాఖ్యానంలో ఒక తీరు ఉండడానికి వీలు లేదు. అవసరం అనుకొంటే పద్యంలో మార్చుకోవాలి. ఆ మార్చిన పదాలకనుగుణంగా అర్థం చెప్పుకోవాలి. చంద్రికా పరిణయంలోదే ఈ పాదం చూడండి.

నెమ్మితో గలయదే యీ యూర్వశీ వామ
హోళిమై జాబాలయంతవాని (2 – 41)

వెల్లాల సదాశివ శాస్త్రిగారు ‘ఊర్వశీవామ’ అని పద్యంలో ఇచ్చి వ్యాఖ్యానంలో ‘ఊర్వశినామ’ అని పొరపడి ‘ఊర్వశి యనుపేరుగల ఈ సురాంగన అని వ్యాఖ్యానించారు. (పుట 162) ‘వా(మ)’, ‘నా(మ)’ అక్షరాలు రెండు ఇంచుమించు ఒక తీరుగా ఉండడం ఈ తబ్బిబ్బుకు హేతువు కావచ్చు. ఫ్రూప్ రీడింగ్ చేస్తున్నపుడు న, ప, వ లు చాలా ఇబ్బంది పెడతాయి.

ఒక్కోసారి తొందరపాటు వల్ల దొర్లే దోషాలు చాల తమాషాగ ఉంటాయి. అవి రచయితను నవ్వులపాలు చేస్తాయి. ఎవరూ చెప్పాల్సిన పని ఉండదు. కాస్సేపయ్యాక తానే చూసుకున్నా తనకే నవ్వు వస్తుంది. ఒక ఉదాహరణంచెప్తాను. రత్నం, పుంగవ, శార్దూలం, వృషభం ఇత్యాదులు సమాసంలో శ్రేష్ఠతావాచకంలో వాడతారే తప్ప అభిధార్థంలో కాదన్న సంగతి అందరికీ తెలుసు. శ్రీనివాస శిరోమణి రామాయాణానువాదంలో ‘మునిశార్దూల’ అన్న సమాసాన్ని ‘ పెద్దపులి మాదిరిగా నున్న విశ్వామిత్ర మహర్షి’ అని తెనిగించడం కనిపిస్తుంది. ఆంధ్ర పత్రికలో సీరియల్‌గా వచ్చి 1956లో మొదటిసారి ముద్రితమై 1992లో వచ్చిన 13వ ముద్రణలో కూడ ఈ పాఠమే ఉంటుంది. రచయిత చూసుకోనితనము, చదివి గుర్తించిన పాఠకులు రచయితకు కానీ ముద్రాపకులకు కానీ ఉత్తరం రాసే ఓపిక లేనితనమూ దీనికి కారణమేమో! ‘జగదేకవీరుడు –అతిలోక సుందరి’ అనే సినిమాలోని ఒక పాటలో ‘పురుషుల్లోనా పుంగవా’ అన్న పంక్తి వస్తుంది. ‘పురుష పుంగవుడు’ అన్న సమాసం ఇస్తున్న అర్థం ఈ వ్యస్త ప్రయోగం ఇస్తుందా అనేది నాకు ఎప్పుడూ కలిగే సందేహమే.

పాత్రభూతులెస్స పరికించి యత డడు
గకయు నొకడు చెప్పకయు మునుపుగఁ
బనస పండ్లు దిగిన పరిగ స్వప్నము గన్న
నెఱిగ నొసఁగి వెఱఁగు పఱచుటొప్పు–

గా దానమివ్వాలని ఆముక్త మాల్యద (4–274) లో ఒక పద్యం వస్తుంది. అపాత్రదానం చేయకుండా, గ్రహీత యోగ్యతను గమనించి అతడు నోరు తెరచి అడగకముందే, ఇంకొకరు అతనికి సాయం చేయాల్సిందని తనకు సిఫారసు చేయకముందే దానమివ్వాలని దీని భావం. మరి వేదం వెంకటరాయశాస్త్రి గారు ఆముక్తమాల్యదా సంజీవనిలో ఎలా రాశారో చూడండి. ‘దానమిమ్మని తనకు ఒకరు చెప్పకముందే’ అని రాయాల్సిన చోట ‘చెప్పకయున్= రాజు నీకు సత్కారము చేయుచున్నాడని అతనితో ఎవ్వడును చెప్పక మునుపే అని రాశారు. ఈ మాత్రం ఆ మహానుభావుడికి తెలియదనేంత అజ్ఞానపు పొరలు నా కళ్లకు కమ్ముకోలేదు. ‘ప్రమాదోధీమతామపి’!

అన్న పతితుఁడైన నటుగాక సన్యాసి
యయ్యెనేని తమ్ముఁడాతఁడుండ
దార సంగ్రహంబుఁ జేసి పాపంబు
బొరయఁ డండ్రు బుధులు కురువరేణ్య (శాంతిపర్వం – I-301)

ఈ పద్యానికి తిరుపతిదేనస్థానం వారి మహాభారత శాంతి పర్వ వ్యాఖ్యాతలు ఇలా అర్థం రాశారు.

ధర్మరాజా! అన్న అధర్మ వర్తనుడైనా, సన్యాసం స్వీకరించినా, అతడి భార్యను, అతడు ఉండగానే తమ్ముడు స్వీకరిస్తే పాపం కాదు. అని పండితులు అంటారు. (పుట 122)

ఏ పండితులు చెప్పారట? అన్న భార్యను అతడు ఉన్నప్పుడు స్వీకరించడం తప్పే. అతడు లేనప్పుడు స్వీకరించినా తప్పే ఎట్లాగైనా తప్పు తప్పే. ఇది వ్యాస భాగవానుడు ధర్మరాజుకు చెప్పింది. వ్యాసుడు, ధర్మరాజు ఇద్దరూ మహానుభావులే. రాసిన తిక్కనామాత్యుడు మహానుభావుడే. మరి ఆ పెద్దలు అన్న భార్యను కైవసం చేసుకోవచ్చునని ఎలా చెప్పారు? ఎలా చెప్తారు?

ఏం లేదు. ఆ పద్యం అసలు భావమిది. భారతీయ సమాజంలో సాధారణంగా అన్న పెళ్ళి జరిగాకే తమ్ముడి పెళ్ళి జరుగుతుంది. కాని ఒక్కోసారి సమస్యలు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలి.?
అన్న పనికి మాలినవాడైనప్పుడు, సన్యాసం తీసుకొన్నపుడు. ఆయన బతుకున్నా సరే. అన్న పెళ్ళి కోసం ఆగకుండా తమ్ముడు యథేచ్ఛగా పెళ్ళి చేసుకోవచ్చు. తప్పు కాదని దీని భావం.

అంబరంబున శౌచజలంబు వడుట
చెట్ట శౌచ మల్లల్లన చేత మేలు
వామకరశుద్ధి దొల్తఁ ద్రివారమృత్తి
కా కలనమునఁ దద్దసేయంగ వలయు  (ఆనుశాసనికపర్వం 3-279. తి.తి.దే భారతం,పుట 391)

శౌచజలంబు= శుద్ధి కొరకు వాడిన నీరు, అంబరంబునన్ = ఆకాశంలో పడుట చెడు అని రాశారు.

మలవిసర్జనం చేసినపుడు మట్టితో జాగ్రత్తగా చేతులు కడుక్కోవాలి. ఆ నీళ్ళు చిందరవందరగా పడకూడదు అని సారాంశం. ఇక్కడ అంబరం మీద నీళ్ళు పడకూడదు అంటే బట్టలమీద పడకూడదనే కానీ ఆకాశం మీద పడకూడదనే అర్థం చెల్లదు.

ఈ వ్యాఖ్యాతల ప్రభావం అనంతం. అపరిమితం. గుడ్డిగా మహా విద్వాంసులు ఆ వ్యాఖ్యానాన్ని ఆ పద్యపాఠాల్ని అనుసరించే అవకాశముంటుంది. వ్యాఖ్యానాల ప్రభావం ఎంతటిదో ఒక చిన్న ఉదంతం పేర్కొంటాను.

ద్రమిళ లాట కురువరాట దహళ ఖోట కుంభినీ
రమణ జూట తట కిరీట రత్న పాటల ప్రభా
కమల ఝాట కలిత కూట కనకవాట సంభ్రమ
ద్భ్రమిత ఘోట బెడదకోట పటుకవాట పాటనా

వసుచరిత్ర (5–128) లోని ఈ పద్యం ‘ఉత్సాహం’. కాని జి. చెన్నకేశవరెడ్డి, కోవెల సుప్రసన్నాచార్య, సి. నారాయణరెడ్డి, దివాకర్ల వేంకటావధాని, వజ్జల చిన సీతారామస్వామి లాంటి విద్వాంసులందరూ వారి పుస్తకాల్లో ‘తరళ’మని రాశారు. ఛందస్సు మీద విశేష పరిశ్రమ చేసిన రావూరిదొరసామి శర్మగారు 1970లో ఎమెస్కోవారి వసుచరిత్రకు రాసిన సంపాదకీయంలో ఈ పద్యాన్ని ఉత్సాహమనాలి తప్ప తరళమనకూడదని చెప్పి text లో తరళమనే ఉండడాన్ని గమనించలేదు. ఇంతమంది విద్వాంసులు పొరపడడానికి హేతువు వ్యాఖ్యానం మీద విపరీతమైన నమ్మకంతో ఎత్తిరాసుకోవడమే తప్ప వారికి ఛందస్సు తెలియక కాదు సుమా!

1920లో వచ్చిన తంజ నగరం తెవప్పెరుమాళ్లయ్యగారి వసుచరిత్ర వ్యాఖ్యానంలో (పుట.582) ఈ పద్యాన్ని తరళంగా పేర్కొని “ఈ వృత్తమునకు నభసనజర గణము లుండవలయును. పదునొకండవ యక్షరము యతిస్థానమ’ని చెప్పడం కనిపిస్తుంది. శేషాద్రి రమ కవుల వసుచరిత్ర చతుర్థ ముద్రణకు 1965లో సంపాదకత్వం వహించిన నిడుదవోలు వెంకటరావుగారు కూడా గుర్తించలేదు. అయితే తమాషా ఏమిటంటే తరళం కావాలంటే ‘నభరసజజగ’ ఉండాలి. నభసనజర గణాల పద్యం ఛందోవేత్తలెవరూ పేర్కొనలేదు. సాహిత్యం మొత్తం మీద ఒక్క హంసవింశతిలో ‘నభసనజర’ గణాల పద్యం ఒకటి గోచరిస్తుంది. దాని పేరు కలహంసోత్సాహంఅనిరావూరిదొరసామి శర్మగారు సూచించారు. ఈపద్యంలో మూడు పాదాల్లో ‘నభసనజర’ గణాలున్నాయి. కాని రెండవ పాదంలో ‘రత్న’ శబ్దమున్న చోట మారిపోయిందన్న విషయాన్ని గుర్తించి ఛందస్సును నిర్ణయించాలి.

జె.జె. స్కాలిగేర్ అనే ఒక లాటిన్ విద్వాంసుడు (16, 17 శతాబ్దుల) నిఘంటువుల పరంగా చెప్పిన చలోక్తిని చేకూరి రామారావుగారు ఓ వ్యాసంలో పేర్కొన్నారు. దాన్ని వ్యాఖ్యానాల పరంగా అన్వయించి ముగిస్తాను... The worst criminals should neither be executed nor sentenced to forced labour, but should be condemned to compile dictionaries – ఇక్కడ commentaries అనుకొందాం. because all the tortures are included in this work. ఘోర నేరస్థులను ఉరి తీయకూడదు. లేబర్ క్యాంపులకు పంపకూడదు. వాళ్ల చేత వ్యాఖ్యానాలు రాయించాలి. ఇందులో అన్ని రకాల శిక్షలూ కలిసి వుంటాయి. అటువంటి ఘోర నేరస్థులం మనం కావాలి అని ఆశిస్తూ వ్యాఖ్యానాలు రాయాలని ఉత్సాహపడుతున్న వారికి స్వాగతం చెపుతూ ముగిస్తున్నాను.

ఆధార గ్రంథాలు:

1. సంస్కృత వ్యాఖ్యాన విమర్శ – సంప్రదాయం – ఆచార్య పుల్లెల రామచంద్రుడు.
2. చంద్రికా పరిణయం –వెల్లాల సదాశివ శాస్త్రి వ్యాఖ్య.
3. సి.పి.బ్రౌన్ – కొత్తపల్లి వీరభద్రరావు
4. హాస్యజ్యోతి –శ్రీ రమణ
5. నన్నయ భారతి – బేతవోలు రామబ్రహ్మం(సం)
6. విజయ విలాసం – తాపి ధర్మారావు వ్యాఖ్య
7. శ్రీనివాస శిరోమణి రామాయణం – అనువాద విధానం, శ్రీమతి బి. లక్ష్మి సుందరి – అముద్రిత సిద్ధాంత వ్యాసం.
8. వసుచరిత్ర – తంజనగరం తేవప్పెరుమాళ్లయ్య వ్యాఖ్య
9. వసుచరిత్ర – శొంఠి భద్రాద్రి రామశాస్త్రులు
10. ఆముక్త మాల్యద – వేదంవారి వ్యాఖ్య
11. వేదం వెంకటరాయశాస్త్రి – సంస్మృతి – గుర్రం వెంకటసుబ్బరామయ్య.
12. మహాభారతవ్యాఖ్యానం – తి.తి.దే.ప్రచురణ